మన ఆరాధనలు స్వీకరించబడాలంటే? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మన ఆరాధనలు స్వీకరించబడాలంటే?
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/YUGJ4R5B-Ps [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఆరాధనలు (ఇబాదత్) అల్లాహ్ వద్ద స్వీకరించబడటానికి అవసరమైన మూడు ప్రాథమిక షరతులను వక్త వివరిస్తున్నారు. అవి: 1) అల్లాహ్ పై ప్రగాఢమైన మరియు స్థిరమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటం, 2) చేసే ప్రతి పుణ్యకార్యంలో చిత్తశుద్ధి (ఇఖ్లాస్) పాటించడం, అంటే కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయడం, ప్రజల మెప్పు లేదా ప్రదర్శన కోసం కాదు, మరియు 3) ప్రతి ఆరాధనను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన పద్ధతి (సున్నత్) ప్రకారమే ఆచరించడం. ఈ మూడు షరతులు లేకుండా చేసే కర్మలు స్వీకరించబడకుండా వృధా అయిపోయే ప్రమాదం ఉందని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేస్తున్నారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ أَمَّا بَعْدُ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్]

అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం ఆరాధనలు స్వీకరింపబడాలంటే ఏమి చేయాలి, కండిషన్లు ఏమిటి తెలుసుకుందాం. మనం అల్లాహ్‌ను ఆరాధిస్తాము, అల్లాహ్ నే ఆరాధిస్తాము. నమాజులు నెలకొల్పుతాము, ముఖ్యంగా ఈ రమదాన్ మాసంలో ఇతర మాసాల కంటే కొంచెం ఎక్కువగానే మనము ఆరాధనలో ఉంటాము. నమాజుల ద్వారా, నఫిల్ నమాజులు, తరావీహ్ నమాజు, దానధర్మాలు, దుఆ, ఖురాన్ పారాయణం, ఇతరులకు సహాయం చేయటం ఈ విధంగా అనేక రకాల ఆరాధనలు చేస్తున్నాము. ఖురాన్ చదువుతున్నాం, నమాజులు పాటిస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఖియాముల్ లైల్ చేస్తున్నాము. కాకపోతే మనము చేసే ఈ కర్మలు, మనము చేసే ఈ ఆరాధన స్వీకరించబడుతుందా? అల్లాహ్ స్వీకరిస్తున్నాడా? అల్లాహ్ ఇష్టపడుతున్నాడా మన ఆరాధనకి? ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి.

నేను చేసే నమాజ్ అల్లాహ్ స్వీకరించాలి అంటే, నా నమాజ్ ఏ విధంగా అయ్యి ఉండాలి? నేను ఉండే ఉపవాసం అల్లాహ్ స్వీకరించాలా అంటే నా ఉపవాసం ఏ విధంగా ఉండాలి? నేను చేసే ఖురాన్ పారాయణం అల్లాహ్ స్వీకరించాలి అంటే, నా ఖురాన్ యొక్క పారాయణం ఏ విధంగా ఉండాలి? నేను చేసే దానం, నేను చేసే ప్రతీ మంచి పని, ప్రతీ పుణ్యం, ప్రతీ సదాచరణ – నేను చేసేది, నేను దుఆ చేస్తున్నాను, నేను ఖురాన్ పారాయణం చేస్తున్నాను, తిలావత్ చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఏడ్చి ఏడ్చి దుఆ చేస్తున్నాను, ఖియాముల్ లైల్ చేస్తున్నాను, ఒకరికి సహాయం చేస్తున్నాను, పేదవారికి అన్నం పెడుతున్నాను, పేదవారికి దుస్తులు దానం చేస్తున్నాను, లేని వారికి ఆదుకుంటున్నాను, అంటే పలు విధాలుగా నేను అల్లాహ్‌ను ఆరాధిస్తున్నాను.

కాకపోతే నా ఈ ఆరాధన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్వీకరించాలా అంటే, దానికి మూడు కండిషన్లు ఉన్నాయి. అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలా, లేకపోతే మన కర్మలు వృధా అయిపోతాయి. మన ఆరాధనలు స్వీకరింపబడాలంటే ముఖ్యమైన మూడు కండిషన్లు మనం తెలుసుకోవాలి, మూడు విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మూడు ఏమిటి? ఒకటి, అల్లాహ్ పై నమ్మకం. రెండవది, ఇఖ్లాస్ (చిత్తశుద్ధి). మూడవది, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధానం. ఈ మూడు విషయాలు ఉంటేనే మన ఆరాధన స్వీకరించబడుతుంది.

  • అల్లాహ్ పైన నమ్మకం. అల్లాహ్ పైన నమ్మకం లేకుండా ఆరాధిస్తే ఆ ఆరాధన స్వీకరించబడదు.
  • చిత్తశుద్ధి ఇఖ్లాస్. చిత్తశుద్ధి లేకుండా ఆరాధిస్తే, ప్రజల మెప్పు కోసం ఆరాధిస్తే, ప్రజలు పొగడాలని పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యకార్యం, ఆ సదాచరణ, ఆ ఆరాధన స్వీకరించబడదు.
  • అలాగే మనం చేసే సదాచరణ, మనం చేసే ఆరాధన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధానం పరంగా లేకపోతే అది రద్దు చేయబడుతుంది, స్వీకరించబడదు.

ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, ఆ విధంగానే మన కర్మలు ఉండాలి.

మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ పైన నమ్మకం. అల్లాహ్ పైన ప్రగాఢ విశ్వాసం. అల్లాహ్ మీద, ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ సుబహాననుహు వతాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు,

“ఇన్నల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాతి కానత్ లహుం జన్నతుల్ ఫిర్దౌసి నుజులా”. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి, విశ్వసించి.. మొదటి కండిషన్ ఏమిటి? విశ్వాసం. విశ్వసించి, విశ్వసించిన తర్వాత అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం తర్వాత సత్కార్యాలు చేసిన వారికి ఫిర్దౌస్ ఉద్యానవనాలు ఉంటాయి అని అన్నాడు.

అలాగే అల్లాహ్ సుబహాననుహు వతాలా సూరతుల్ అసర్ లో తెలియజేశాడు, వల్ అసర్, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, ఇల్లల్లజీన ఆమను వ అమిలుస్ సాలిహాత్. కాలం సాక్షిగా మానవులందరూ నష్టంలో ఉన్నారు, నాలుగు రకాల కోవకి చెందిన నాలుగు గుణాలు ఉండే వ్యక్తులు తప్ప అన్నాడు. అంటే విశ్వసించిన వారు, ఆ తర్వాత సత్కార్యాలు చేసేవారు, పరస్పరం సత్యం గురించి హితబోధ చేసుకునే వారు, సహనం వహించేవారు. అంటే మొదటి విషయం అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. 

ఇదే విషయం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

قُلْ آمَنْتُ بِاللَّهِ ثُمَّ اسْتَقِمْ
[కుల్ ఆమన్తు బిల్లాహి సుమ్మస్తకిమ్]
“నేను అల్లాహ్‌ను విశ్వసించాను” అని పలికి, దానిపై నిలకడగా ఉండు.

మేమందరము అల్లాహ్‌ని విశ్వసించాము అని అంటున్నాము, విశ్వసించాము కూడా. కాకపోతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? సుమ్మస్తకిమ్ (దాని మీద నిలకడగా ఉండు). అంటే, అల్లాహ్‌ను నమ్ముతున్నాము, అల్లాహ్ ఆదేశాల పరంగా జీవితం గడపాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏదైతే చేయమన్నాడో అవి చేయాలి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దేనిని నిషిద్ధం చేశాడో దానికి దూరంగా ఉండాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాలు మనకి బోధించారో, చేయమన్నారో, ఆజ్ఞాపించారో అది మనము చేయాలి, ఆయన్ని అనుసరించాలి, విధేయత చూపాలి. ఏ విషయాల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారో, నిషిద్ధం అన్నారో, అధర్మం అన్నారో వాటిని విడనాడాలి, దూరంగా ఉండాలి. సుమ్మస్తకిమ్ (స్థిరంగా ఉండు). అల్లాహ్‌ని విశ్వసించిన తర్వాత అల్లాహ్ పైన నమ్మకం కలిగిన తర్వాత దానిపై నిలకడగా ఉండాలి. అల్లాహ్‌ని విశ్వసిస్తున్నాం, నమాజ్ చేయటం లేదు. రమదాన్‌లో నమాజ్ చేస్తాము, రమదాన్ తర్వాత నమాజ్ చేయము. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రమదాన్ మాసానికి ప్రభువు అయితే, రమదాన్ తర్వాత మాసాలకి అల్లాహ్ ప్రభువు కాదా?

ఆమన్తు బిల్లాహి (నేను అల్లాహ్‌ను విశ్వసించాను) అని చెప్పి, సుమ్మస్తకిమ్ (దాని మీద నిలకడగా ఉండు). అంటే మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ పైన గట్టి నమ్మకం కలిగి ఉండాలి. మన విశ్వాసాలు, మన ఆచరణలు, మన ఆరాధనలు, మన కర్మలు, మన పుణ్యాలు అల్లాహ్ స్వీకరించాలంటే మొదటి విషయం అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే పాలకుడు, ఆయన మాత్రమే పోషకుడు, ఆయన మాత్రమే సర్వ లోకాలను చూసుకునేవాడు, ఆయన మాత్రమే మన జీవన్మరణాలకు కారకుడు. ఆయన మీద, ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం కలిగి ఉండటం. ఇది మొదటి విషయం.

రెండో విషయం ఇఖ్లాస్, చిత్తశుద్ధి. ఏ మంచి పని చేసినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం చేయాలి, ప్రజల మెప్పు కోసం చేయకూడదు. నన్ను సమాజంలో పొగుడుతారు, నాకు పేరు వస్తుంది, అందరూ నాకు పొగుడుతారు ఈ ఉద్దేశంతో మంచి పని చేయకూడదు. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు, దీనికి రియా అంటారు. రియా గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే,

الرِّيَاءُ الشِّرْكُ الأَصْغَرُ
[అర్-రియా అష్-షిర్కుల్ అస్గర్]
రియా (ప్రదర్శనా బుద్ధి) అనేది చిన్న షిర్క్.

రియా (ప్రదర్శనా బుద్ధితో), నలుగురి మెప్పు కోసం, ప్రజల మెప్పు కోసం ఏదైనా మంచి పని చేస్తే అది షిర్క్ అవుతుంది. చిన్న షిర్క్ అవుతుంది అన్నారు. అంటే ప్రదర్శనా బుద్ధితో సదాచరణ చేస్తే అది సదాచరణ కాదు, అది షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ప్రజల మెప్పు కోసం అల్లాహ్‌ను ఆరాధించకూడదు. చిత్తశుద్ధితో, ఇఖ్లాస్‌తో మనము మంచి పని చేయాలి, ఆరాధించాలి.

మొదటి విషయం, అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం, ఆయన ఏకత్వం పైన నమ్మకం, విశ్వాసం. రెండవది, చిత్తశుద్ధి, ఇఖ్లాస్. మూడో విషయం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన పద్ధతి పరంగానే మన కర్మలు ఉండాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలియజేశాడు:

وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمْ عَنْهُ فَٱنتَهُوا۟
[వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫన్తహూ]
“అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏది ఇస్తారో అది తీసుకోండి, ఆయన దేని నుంచి ఖండిస్తారో దానికి దూరంగా ఉండండి.” (59:7)

అంటే మనము నమాజ్ చేసినా విధానం ప్రవక్త గారి విధానం అయ్యి ఉండాలి, ఉపవాసం ఉండినా విధానం ప్రవక్త గారి విధానం అయ్యి ఉండాలి, ఉపవాసం పాటించినా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం అయ్యి ఉండాలి, ఖియాముల్ లైల్ చేసినా ప్రవక్త గారి విధానం, దుఆ చేసినా ప్రవక్త గారి విధానం, దానధర్మాలు చేసినా ప్రవక్త గారి విధానం, ఖురాన్ పారాయణం చేసినా ప్రవక్త గారి విధానం. ప్రవక్త గారి విధానం లేకపోతే ఆ ఆరాధన రద్దు చేయబడుతుంది. ఈ విషయాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ
[మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్]
ఎవరైతే మా ఈ (ధార్మిక) విషయంలో లేని దాన్ని క్రొత్తగా కల్పిస్తారో, అది త్రోసిపుచ్చబడుతుంది (తిరస్కరించబడుతుంది).

మా ఆదేశాలకు అనుగుణంగా లేని పనులు త్రోసిపుచ్చబడతాయి, రద్దు చేయబడతాయి, క్యాన్సిల్ చేయబడతాయి. అభిమాన సోదరులారా, మనం చేసే ప్రతీ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా ఉండాలి. లేకపోతే అవి స్వీకరించబడవు. దుఆ చేస్తాము, ప్రవక్త గారి విధానం. నమాజ్ పాటిస్తాము, ప్రవక్త గారి విధానం. సహరీ ఆదాబులు, ప్రవక్త గారి విధానం. ఇఫ్తార్ గురించి, ప్రవక్త గారి విధానం. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రవక్త గారి విధానం. ఎటువంటి సంకల్పం ఉండాలి, ప్రవక్త గారి విధానం. నమాజ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రవక్త గారి విధానం. హజ్, ఉమ్రా చేయాలి, ప్రవక్త గారి విధానం. అమ్మానాన్నలను పోషించాలి, వారి మాట వినాలి, ప్రవక్త గారి ఆదేశాల పరంగానే. మనము ఏ పుణ్యం చేసినా, ఏ మంచి పని చేసినా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం పరంగానే ఉండాలి, లేకపోతే మనం చేసే కర్మలు వృధా అయిపోతాయి, స్వీకరించబడవు.

అభిమాన సోదరులారా, చివర్లో ఆ మూడు విషయాలు తెలుసుకుందాము, రిపీట్ చేస్తున్నాను. అల్లాహ్ పై నమ్మకం, చిత్తశుద్ధి (ఇఖ్లాస్), అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం. ఈ మూడు కండిషన్లు ఉంటే మన ఆరాధనలు, నమాజ్, ఉపవాసం, ఖియాముల్ లైల్, దుఆ, జిక్ర్, తిలావత్ ఇవన్నీ స్వీకరించబడతాయి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఈ కండిషన్లతో పాటు ఆరాధనలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన ప్రతీ ఆరాధనలో అల్లాహ్ పై గట్టి నమ్మకాన్ని, ఇఖ్లాస్‌ని, ప్రవక్త గారి సున్నత్ విధానాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మనందరి చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43606

అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి(హఫిజహుల్లాహ్)
https://youtu.be/omW0Jrb-7Xk [5 నిముషాలు]

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రమైన విధేయతను చర్చిస్తుంది. ఒక విశ్వాసి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్పష్టమైన ఆదేశాల కంటే ఇతరుల—కుటుంబం, పండితులు లేదా తనతో సహా—మాటలకు లేదా అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చా అనే కేంద్ర ప్రశ్నను ఇది అన్వేషిస్తుంది. అలాంటి ప్రాధాన్యత అనుమతించబడదని వక్త ఖురాన్ (సూరా అల్-హుజురాత్ 49:1 మరియు సూరా అల్-మాయిదా 5:2) మరియు బుఖారీ, ముస్లింల నుండి ఒక హదీసును ఉటంకిస్తూ దృఢంగా స్థాపించారు. నిజమైన విశ్వాసానికి దైవిక ఆదేశాలకు సంపూర్ణ లొంగుబాటు అవసరమని, మరియు మతపరమైన విషయాలలో ఏదైనా విచలనం, జోడింపు లేదా స్వీయ-ఉత్పన్నమైన తీర్పు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కంటే “ముందుకు వెళ్ళడంగా” పరిగణించబడుతుందని దీని ముఖ్య సారాంశం. పుణ్యం మరియు ధర్మబద్ధమైన పనులలో సహకారం ప్రోత్సహించబడింది, కానీ పాపం మరియు అతిక్రమణ విషయాలలో ఖచ్చితంగా నిషేధించబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా? ఈ ప్రశ్నకి మనము ఈరోజు సమాధానం తెలుసుకుంటున్నాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలపై మనం ఇతరులకు, ఆ ఇతరులు బంధువులు కావచ్చు, అమ్మానాన్న కావచ్చు, పండితులు కావచ్చు, ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?ముమ్మాటికీ లేదు. మనము అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలపై ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వలేము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరతుల్ హుజురాత్, ఆయత్ నంబర్ ఒకటిలో ఇలా సెలవిచ్చాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లహి వ రసూలిహీ వత్తఖుల్లాహ, ఇన్నల్లాహ సమీవున్ అలీమ్)

విశ్వాసులారా, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తము వినేవాడు, సర్వము ఎరిగినవాడు.” (49:1)

అంటే ధార్మిక విషయాలలో తమంతట తాముగా నిర్ణయాలు తీసుకోవటం గానీ, తమ ఆలోచనలకు పెద్ద పీట వేయటం గానీ చేయరాదు. దీనికి బదులు వారు అల్లాహ్ కు, దైవ ప్రవక్తకు విధేయత చూపాలి. తమ తరఫున ధర్మంలో హెచ్చుతగ్గులు చేయటం, సరికొత్త విషయాలను కల్పించటం వంటి పనులన్నీ దైవాన్ని, దైవ ప్రవక్తకు మించిపోవటంగా భావించబడతాయి.

అలాగే, ఖురాన్ మరియు హదీసులతో నిమిత్తం లేకుండా ధార్మిక తీర్పు ఇవ్వకూడదు. అలాగే ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్లామీయ షరీఅతుకు విరుద్ధంగా ఉందని తెలిస్తే, ఇక దాని కోసం ప్రాకులాడకూడదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞలను శిరోధార్యంగా భావించటమే ఒక విశ్వాసికి శోభాయమానం. తద్భిన్నంగా అతను ఇతరుల అభిప్రాయాలను కొలబద్దగా తీసుకుంటే తలవంపు తప్పదు అని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి.

దీనికి సారాంశం బుఖారీ మరియు ముస్లింలోని ఒక హదీస్ ఉంది. దాని అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిధేయతకు, అంటే అల్లాహ్ అవిధేయతకు దారి తీసే ఏ విషయంలోనూ ఎవరికీ విధేయత చూపకూడదు. అయితే మంచి విషయాలలో విధేయత చూపవచ్చు అన్నమాట. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.

ఈ విషయాన్నే ఇంకో విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో సెలవిచ్చాడు,

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَلْعُدْوَانِ
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా, వలా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్)
సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి (5:2)

అంటే అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒకరికొకరుని తోడుపడుతూ ఉండండి, సహాయం చేస్తూ ఉండండి, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండండి, తోడుపడుతూ ఉండండి. పాప కార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రాధాన్యత అల్లాహ్ కి, ప్రాధాన్యత ఆయన ప్రవక్తకి మాత్రమే ఇవ్వాలి.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43614


ఖుర్ఆన్ హక్కులు: ఖుర్ఆన్ పై విశ్వాసం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]

ఖుర్ఆన్ హక్కులు: ఖుర్ఆన్ పై విశ్వాసం 
Rights of the Quran: Belief in the Quran
https://www.youtube.com/watch?v=oJlAj6X5D2I [9 నిముషాలు]
హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 

ఈ ప్రసంగం ఇస్లాంలో పవిత్ర ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వక్త ఖురాన్‌ను ఒక దైవిక గ్రంథంగా మరియు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే కాకుండా, యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథంగా పరిచయం చేస్తున్నారు. ఇది అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటిగా చెప్పబడింది. విశ్వాసులపై ఖురాన్‌కు ఉన్న హక్కులు ఈ ప్రసంగం యొక్క ప్రధాన అంశం, ప్రత్యేకించి మొదటి హక్కు అయిన దానిపై పూర్తి మరియు అచంచలమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటంపై దృష్టి పెడుతుంది. ఈ విశ్వాసం, ఖురాన్ అల్లాహ్ యొక్క కల్తీ లేని వాక్యమని, జిబ్రయీల్ దూత ద్వారా అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేయబడిందని నమ్మడాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, అల్లాహ్ స్వయంగా ఖురాన్‌ను ఎలాంటి మార్పుల నుండి అయినా సంరక్షిస్తానని హామీ ఇచ్చాడని, ఆ వాగ్దానం 1400 సంవత్సరాలకు పైగా నిజమని నిరూపించబడిందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ అ దహు)
أَمَّا بَعْدُ
(అమ్మా బ అద్)

అభిమాన సోదరులారా, కారుణ్య కడలి, రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం ఖుర్ఆన్ హక్కులలోని ఒక హక్కు గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం మౌలిక విశ్వాసాలకి ముఖ్యమైన ఆధారాలలో ఖుర్ఆన్ గ్రంథం ప్రధానమైనది. ఈ గ్రంథం పూర్తిగా దివ్య సందేశం. ఈ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు తన దాసులపై అమితమైన ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించాడు.ఆ వరాలలో, అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనపైన కురిపించిన వరాలలో అత్యంత మహోన్నత వరం దివ్య ఖుర్ఆన్. ఈ గ్రంథం సులభమైనది. స్వార్థపరులు ఎంత ప్రయత్నించినా మార్పులు చేర్పులకు సాధ్యం కాని విధంగా పంపబడిన గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.

మానవులు మరచిపోయిన ధర్మాన్ని పునర్జీవింపజేయడానికే ఖుర్ఆన్ అవతరించింది. ఖుర్ఆన్ గ్రంథం ఏదో ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. దీనిపై అధికార పెత్తనాలు చెలాయించే హక్కు ఏ వర్గానికీ లేదు. ఇది మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఇది మానవులందరికీ మార్గదర్శకం. కనుక ఖుర్ఆన్ గ్రంథాన్ని అనుసరించేవారు తమ నిజ ప్రభువు ఆజ్ఞలను అనుసరిస్తున్నట్లే.ఇది క్లుప్తంగా నేను ఖుర్ఆన్ యొక్క పరిచయం చేశాను

మనపై ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. అవేమిటో మనం తెలుసుకుందాం. కానీ ఖుర్ఆన్ యొక్క హక్కులలో ఈరోజు మనం మొదటి హక్కు, అనగా ఖుర్ఆన్ పై విశ్వాసం గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. మిగతావి తర్వాత తెలుసుకుందాం.

ఖుర్ఆన్ యొక్క మొదటి హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్ పై విశ్వాసం. మనపై ఖుర్ఆన్ కు గల మొదటి హక్కు, దానిని మనం విశ్వసించాలి. మనస్ఫూర్తిగా నమ్మి, అంగీకరించి విశ్వసించాలి. ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఈ గ్రంథం, ఈ ఖుర్ఆన్ గ్రంథం, జిబ్రయీల్ దైవదూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిందని నోటితో అంగీకరించి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు.

وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ
(వ ఇన్నహు ల తన్జీలు రబ్బిల్ ఆలమీన్)
نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ
(నజల బిహిర్ రూహుల్ అమీన్)
عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ
(అలా ఖల్బిక లితకూన మినల్ మున్దిరీన్)
بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ
(బి లిసానిన్ అరబియ్యిమ్ ముబీన్)

నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్‌ – సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.(ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. (అష్-షుఅరా 26:192-195)

దీని సారాంశం ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. జిబ్రయీల్ దైవదూత ద్వారా ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఖుర్ఆన్ వచ్చింది. సర్వ మానవుల కొరకు ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది.

అభిమాన సోదరులారా, అంటే ఈ గ్రంథం ముమ్మాటికీ సర్వలోక ప్రభువైన అల్లాహ్ తరఫున పంపబడిన గ్రంథం. దీన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని వచ్చారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. సర్వ లోకాల, సర్వ మానవుల సన్మార్గం కోసం ఖుర్ఆన్ గ్రంథం అవతరింపబడినది.

ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా సురక్షితంగా ఉందని నమ్మాలి. ఖుర్ఆన్ గ్రంథంలో ఎటువంటి మార్పులు జరగలేదు, జరగవు కూడా. సురక్షితంగా ఉందని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్)
నిశ్చయంగా ఈ హితోపదేశాన్ని (ఖుర్‌ఆన్‌ను) మేమే అవతరింపజేశాము. మరి మేమే దీనిని పరిరక్షిస్తాము. (అల్-హిజ్ర్ 15:9)

మేము ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. కావున దివ్య ఖుర్ఆన్ స్వార్థపరుల కుయుక్తుల నుండి, అలాగే ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నామని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చెప్పిన ఈ వాక్కు, ఈ ఆయత్ సత్యమని గత 1442 సంవత్సరాలుగా రూఢి అవుతూనే ఉంది.

సూరహ్ బఖరాలోనే రెండవ ఆయత్:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
(జాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్ లిల్ ముత్తఖీన్)
ఈ గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. (అల్-బఖర 2:2)

అభిమాన సోదరులారా, సారాంశం ఏమనగా ఖుర్ఆన్ అల్లాహ్ పంపిన గ్రంథం. ఖుర్ఆన్ జిబ్రయీల్ దైవదూత ద్వారా పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన గ్రంథం. ఖుర్ఆన్ సర్వమానవులకు సన్మార్గం చూపటానికి పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. ఇది మానవులందరి ఉమ్మడి సొత్తు. అలాగే ఖుర్ఆన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరించింది. ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులకి, చేర్పులకి తావు లేదు. మార్పులు చేర్పులు జరగలేదు, జరగవు. దానిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు.

కావున, ఖుర్ఆన్ యొక్క హక్కులలో, మనపై ఖుర్ఆన్ కు గల హక్కులలో మొదటి హక్కు ఏమిటి? ఖుర్ఆన్ ను విశ్వసించడం. దానిని మనము విశ్వసించాలి. కేవలం విశ్వసిస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకా విశ్వసించటమే కాకుండా ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు ద అ వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు [వీడియో | టెక్స్ట్]

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు
https://www.youtube.com/watch?v=pcIMF4mR90E [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క విధిరాత (ఖద్ర్) పట్ల అసంతృప్తి మరియు కోపాన్ని ప్రదర్శించడం తౌహీద్ (ఏకేశ్వరోపాసన)కు విరుద్ధమని, అది అవిశ్వాసం (కుఫ్ర్) వైపు నడిపించే ప్రమాదం ఉందని వివరిస్తారు. కష్టాలు మరియు ఆపదలు ఎదురైనప్పుడు, సహనం వహించడం, నాలుకను మరియు అవయవాలను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. అల్లాహ్ తాను ప్రేమించిన వారిని పరీక్షిస్తాడని, గొప్ప బహుమతి గొప్ప పరీక్షతోనే వస్తుందని ఒక హదీసును ఉటంకిస్తారు. విధిరాత పట్ల సంతృప్తిగా ఉన్నవారికి అల్లాహ్ యొక్క ప్రసన్నత లభిస్తుందని, కోపగించుకున్న వారికి ఆయన ఆగ్రహం కలుగుతుందని ఆయన ముగిస్తారు.

అల్లాహ్ రాసిన విధిరాత (ఖద్ర్) పట్ల అయిష్టత, అసహ్యత మరియు కోపం ప్రదర్శించరాదు. అల్లాహ్ రాసినటువంటి ఖద్ర్, ఖదా. దాని పట్ల ఎప్పుడూ కూడా అయిష్టత, అసహ్యత, కోపం ప్రదర్శించరాదు. ఈ పాపంలోనైతే మనలో చాలా మంది పడిపోతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

అల్లాహ్ నిర్ణయించిన దాని ప్రకారం ఏమైనా ఆపదలు వస్తే అయిష్టత, కోపం ప్రదర్శించుట ఇది సంపూర్ణ తౌహీద్‌కు విరుద్ధం. ఒక్కోసారి ఇదే స్థితిలో మనిషి ఏదైనా కుఫ్ర్ మాటలు, అవిశ్వాస పలుకులు పలికితే, లేదా కుఫ్ర్, అవిశ్వాసానికి సంబంధించిన ఏదైనా పని చేస్తే, ఈ చేష్ట అతని తౌహీద్ పునాదులను కదిలించి అతడు కుఫ్ర్‌లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? నాకే అల్లాహ్ ఇట్లా రాయాల్నా? నా మీదనే ఈ ఆపద రాసి రావాల్సి ఉండేనా? అయ్యో నా పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడే నా భర్త చనిపోవాల్నా? ఏంటిది అల్లాహ్ యొక్క ఈ అన్యాయం? ఇలాంటి మాటలు ప్రజలు అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కొన్ని ప్రాంతాల్లోనైతే ఓ అల్లాహ్, నా భర్తే దొరికిండా నీకు తీసుకోవడానికి? ఇంకా ఎవరూ లేకుండినా? ఇట్లాంటి మాటలు కూడా కొందరు అన్నారు. ఇది చాలా పాపం, చాలా పాపం. మనల్ని తౌహీద్ నుండి, ఇస్లాం నుండి వైదొలగడానికి, ఇస్లాం నుండి దూరమైపోవడానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

విధిరాతను అసహ్యించుకోకూడదు. తఖ్దీర్‌ను అయిష్టతతో లేదా ఏదైనా మన ద్వారా ఒక అసహ్యం ఏర్పడింది అన్నట్లుగా మనం ప్రదర్శించకూడదు. అల్లాహు త’ఆలా అందరి తఖ్దీర్ ముందే రాసి పెట్టాడు గనక, అతడు అలీమ్ మరియు హకీమ్. సర్వజ్ఞాని మరియు సర్వ వివేకవంతుడు. అల్లాహు త’ఆలా వివేకవంతుడు గనకనే అదృష్టాన్ని, తఖ్దీర్‌ని రాసిపెట్టాడు.

మనపై ఇహలోక పరంగా మనకు ఏదైనా ఆపద వచ్చింది. రోగ రూపంలో గానీ, లేదా మనకు సంబంధించిన దగ్గరి వారు చనిపోయే రూపంలో గానీ, ఇంకా ఏ రూపంలో ఏ ఆపద వచ్చిపడ్డా, విధిగా పాటించవలసిన విషయాలు ఏమిటంటే:

  1. నెంబర్ ఒకటి, కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా తనకు తాను సహనం వహించాలి.
  2. రెండవ విషయం, కోపం, అయిష్టత వ్యక్తపరచకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అల్లాహ్‌కు ఇష్టం లేని ఏ మాట నాలుక నుండి వెళ్లనివ్వకూడదు.
  3. మూడవది, తన శరీర అవయవాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చెంపలు బాదుకోవడం, దుస్తులు చించుకోవడం, చింపేయడం, వెంట్రుకలు పీక్కోవడం, తలపై దుమ్మెత్తి పోసుకోవడం, ఇంకా ఇలాంటి ఏ పనులు కూడా చేయరాదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజిలోని సహీ హదీస్, 2396. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

عَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ قَالَ: (إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ وَإِنَّ اللهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అనస్ (రజియ ల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు సంతోషంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ సంతృష్టి లభిస్తుంది. ఎవరు అయిష్టత, కోపానికి గురి అవుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతాడు”. (తిర్మిజి/ ఫిస్సబ్రి వల్ బలా/ 2396).

إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلاَءِ
(ఇన్న ఇ’జమల్ జజా’ఇ మ’అ ఇ’జమిల్ బలా’ఇ)
పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది.

గొప్ప పుణ్యం కావాలా? చాలా బ్రహ్మాండమైన పెద్ద సత్ఫలితం కావాలా నీకు? అయితే అంతే పెద్ద పరీక్షలు వస్తాయని కూడా నీవు నమ్ము.

మళ్ళీ తర్వాత ప్రవక్త ఏం చెప్పారో చూడండి:

وَإِنَّ اللَّهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلاَهُمْ
(వ ఇన్నల్లాహ ఇజా అహబ్బ ఖౌమన్ ఇబ్తలాహుమ్)
మరియు నిశ్చయంగా అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో, వారిని పరీక్షకు గురిచేస్తాడు.

ఎల్లవేళలలో ఈ విషయాన్ని మదిలో ఫ్రెష్‌గా నాటుకుని ఉండే భాగ్యం ప్రసాదించు గాక. వేరే ఎల్లవేళలలో ఈ మదిలో ఈ విషయం ఉండదు గనక, ఏ చిన్న ఆపద వచ్చినా గానీ మనం తొందరగా కోపానికి గురవుతాం. ఇది నాకు ఆపద వచ్చిందంటే పళ్ళు కొరకడం, వెంట్రుకలు పీక్కోవడం, బట్టలు చింపుకోవడం, అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

ప్రవక్త ఏమంటున్నారో చూడండి, అల్లాహ్ ఎవరినైనా ప్రేమించాడంటే వారిని పరీక్షకు గురిచేస్తాడు. ఆ పరీక్షలో:

فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ
(ఫమన్ రదియ ఫలహుర్-రిదా, వ మన్ సఖిత ఫలహుస్-సఖత్)
ఎవరైతే సంతోషంగా ఉంటారో, అతనికి (అల్లాహ్ యొక్క) సంతృప్తి లభిస్తుంది, మరియు ఎవరైతే కోపానికి గురవుతాడో, అతనికి (అల్లాహ్ యొక్క) ఆగ్రహం కలుగుతుంది.

ఫలహుర్-రిదా. ఎవరైతే సంతోషంగా మసులుకుంటారో, అతనికి అల్లాహ్ యొక్క సంతృప్తి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. అల్లాహ్ నీ పట్ల సంతృప్తి చెంది ఉండాలి, నిన్ను చూసి సంతోషపడాలి, అంటే ఏం చేయాలి? ఏ పెద్ద కష్టం వచ్చినా గానీ మూడు రకాలు ఏవైతే చూపించబడ్డాయో, ఆ మూడు పద్ధతులను అవలంబించాలి మరియు అన్ని రకాల చెడులకు దూరం ఉండాలి.

కానీ ముసీబత్, కష్టం, ఆపద వచ్చినప్పుడు వమన్ సఖిత ఫలహుస్-సఖత్, ఒకవేళ కోపానికి గురి అయ్యాడంటే అతడు కూడా అల్లాహ్ ఆగ్రహానికి గురైపోతాడు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరినీ క్షమించు గాక. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తఖ్దీర్‌పై సంతోషంగా ఉండి, అల్లాహ్ మనకు అన్ని రకాల మేళ్లు చేసే భాగ్యం ప్రసాదించు గాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41278

తఖ్దీర్ (విధి వ్రాత):
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/

ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]
https://teluguislam.net/2011/03/23/prohibitions-in-sharia-telugu-islam/

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం
[మరణానంతర జీవితం – పార్ట్ 49]
https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.

అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.

ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.

وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ
وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
إقْرَأْ كِتَابَكَ
كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا

మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 3 – [మరణానంతర జీవితం – పార్ట్ 53] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 3
[మరణానంతర జీవితం – పార్ట్ 53] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QVnrPdQraUA
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము.

అయితే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు? దీని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు:

فَأَكُونُ أَنَا وَأُمَّتِي أَوَّلُ مَنْ يُجِيزُ
(ఫ అకూను అనా వ ఉమ్మతీ అవ్వలు మన్ యుజీజ్)
“నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చి పోయారు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం, ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 2 – [మరణానంతర జీవితం – పార్ట్ 52] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 2
[మరణానంతర జీవితం – పార్ట్ 52] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=ADuGX4TjS2o
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد
(అల్-హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్) [సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…]

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక నరకంపై వంతెన.

మహాశయులారా, ఎవరికి ఎంత కాంతి లభిస్తుందో అంతే వేగంగా వారు ఆ వంతెనను దాటగలుగుతారు. ముస్తదరక్ హాకిం లోని హదీథ్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీ అని అన్నారు. ఆ హదీథ్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఎంత కాంతి లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ, ఎవరు ఎంత వేగంగా ఆ వంతెనను దాటుతారో స్పష్టపరిచారు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ప్రళయ దినాన అల్లాహు తఆలా పూర్వీకులను, వెనుకటి వారిని, ప్రజలందరినీ సమీకరిస్తాడు. ఆ పొడవైన హదీథ్ లో కాంతి ఇవ్వబడే విషయాన్ని తెలియపరుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారం కాంతి ఇవ్వడం జరుగుతుంది. నూర్ ఇవ్వడం జరుగుతుంది.

فَمِنْهُمْ مَنْ يُؤْتَى نُورُهُ مِثْلَ الْجَبَلِ
(ఫమిన్‌హుమ్ మన్ యూ’తా నూరుహు మిథ్లల్ జబల్)
[వారిలో కొందరికి పర్వతమంత కాంతి ఇవ్వబడుతుంది.]

కొందరికి కొండంత పరిమాణంలో, కొండ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, కొండంత పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. వారి సత్కార్యాలు మహా గొప్పగా ఉండవచ్చు. మరికొందరికి అంతకంటే మరీ ఎక్కువ పరిమాణంలో కూడా కాంతి లభిస్తుంది. మరికొందరికి వారు ఒక ఖర్జూరపు కర్ర తమ కుడిచేతిలో తీసుకున్నంత పరిమాణంలో లభిస్తుంది. మరికొందరికి అంతకంటే తక్కువ పరిమాణంలో. చివరి వ్యక్తి లేక చివరి రకం వారు, చివరి వర్గం వారు ఎవరికైతే కాంతి అతి తక్కువ పరిమాణంలో ఇవ్వడం జరుగుతుందో అది వారి కాలులోని, వారి పాదములోని బొటనవేలి పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. అది కూడా ఒకసారి వెలుగుతూ ఉంటే ఒకసారి దాని యొక్క కాంతి అనేది నశించిపోతుంది.

ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం [మరణానంతర జీవితం – పార్ట్ 20] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం
https://www.youtube.com/watch?v=75Sw5ptc_50
[మరణానంతర జీవితం – పార్ట్ 20] [21 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద. అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక: ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం.

త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిన జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి.

ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు.

وَوُضِعَ الْكِتَابُ
కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది.

فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ
అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయ కంపితులై వాటిలో ఉన్న, వ్రాయబడిన ఆ విషయాలన్నింటినీ చూసి భయకంపితులై పోతారు.

وَيَقُولُونَ
మరియు అంటారు:

يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ
మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం.

لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً
ఏ చిన్న దానిని గానీ, ఏ పెద్ద దానిని గానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో వ్రాయబడింది.

إِلَّا أَحْصَاهَا
ప్రతీ ఒక్కటి అందులో చేర్చడం జరిగింది.

وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا
వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు.

وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
నీ ప్రభువు ఎవరిపై కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు.

అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా (వసీలాగా) మనం పెట్టుకోవచ్చు? [మరణానంతర జీవితం – పార్ట్ 17] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు?
[మరణానంతర జీవితం – పార్ట్ 17] [25 నిముషాలు]
https://www.youtube.com/watch?v=x27-UYBIOU4
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు.

అయితే మహాశయులారా మన అంశం మరణానంతర జీవితం. మనం సీరియల్ వారీగా పరలోకంలో ఏ ఏ మజిలీలు ఉన్నాయి, ఏ ఏ విషయాలు సంభవిస్తాయి వాటి గురించి వింటూ వస్తున్నాము.అయితే అల్లాహుతాలా తీర్పు గురించి రావడంలో ఏదైతే చాలా ఆలస్యం జరుగుతుందో ఆ దీర్ఘ సమయాన్ని ప్రజలు భరించలేక సిఫారసు గురించి ఏదైతే ప్రవక్తల వద్దకు వెళ్తారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చివరికి వస్తారు. ఆ విషయాలు వింటూ ఉన్నాము కానీ సిఫారసుకు సంబంధించిన విషయం చాలా ముఖ్య విషయం.

ఆ రోజు ఇంకా ఎన్ని రకాల సిఫారసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొందడం చాలా ముఖ్యము గనుక, దానికి సంబంధించిన ఒక భాగం అంటే ఇహలోకంలో సిఫారసుకు సంబంధించిన ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని మనం దూరం చేసుకొని సరైన విశ్వాసాన్ని, సరైన సిఫారసు వివరాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అందుగురించి మనం మనం అసలైన మన అంశాన్ని విడిపోయాము అని ఏమాత్రం భావించకండి. అయితే మహాశయులారా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు అల్లాహ్ తో దుఆ చేసే సందర్భంలో ఎవరినైనా మధ్యవర్తిత్వంగా వసీలాగా పెట్టుకోవడం ఎంతవరకు యోగ్యం.

విశ్వాసులకు వ్యతిరేకంగా కాఫిర్లకు సహాయం చేయటము | ఇస్లాం నుంచి బహిష్కరించే విషయాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం:అబ్దుల్ మాబూద్ జామయీ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి, ఎల్లప్పుడూ ఆయనకు భయపడుతూ ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయతకు పాల్పడమాకండి, ఇంకా గుర్తుంచుకోండి అల్లాహ్ ను విశ్వసించడం లో “విశ్వాసులను స్నేహితులుగా చేసుకోవడం” ఓ ఖచ్చితమైన భాగం, అంటే వాళ్ళను ప్రేమించడం, వాళ్ళను సహకరించడం. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు:

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. (9:71)