మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం
[మరణానంతర జీవితం – పార్ట్ 49]
https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.
అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.
ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.
وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ
وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
إقْرَأْ كِتَابَكَ
كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا
మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.
అల్లాహు అక్బర్. ఈ ఆయతును గమనించండి.ఇందులో ఇహలోకంలో రాయబడిన కర్మ పత్రాలు పరలోకంలో తెరవబడతాయి. మనిషి ఒక పుస్తకంలా, తెరువబడి ఉన్న పుస్తకంలా దానిని చూస్తాడు. ప్రతీ మనిషి దానిని చదవగలుగుతాడు.
ఆ అల్లాహ్ ఎంత కరుణామయుడో గమనించండి. ఎవరిపై ఎలాంటి అన్యాయం జరగకూడదు అని నీవే నీ పుస్తకాన్ని చదువు, నీ లెక్క తీసుకోవడానికి నీవే చాలు అని అంటాడు. ఆ అల్లాహ్ తలుచుకుంటే ఏ కర్మ పత్రం వ్రాయకుండా అన్నీ ఆయనకు తెలుసు గనక తన జ్ఞానం ప్రకారం ఎలాంటి అన్యాయం లేకుండా తీర్పు చేయగలడు. కానీ మనిషికి స్వయంగా తృప్తి కలగాలి.
ఉదాహరణకు, అస్తగ్ఫిరుల్లాహ్, ఈ ఉదాహరణ అల్లాహ్ విషయంలో కాదు, మన అల్ప జ్ఞానులకు మరింత స్పష్టంగా బోధపడుటకు. ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు. ఏమంటారు? ఏమయ్యా ఈ దైవదూతలు రాస్తారు అని నాకు నమ్మకం కలగడం లేదు. దైవదూతలు రాయడం ఎందుకు? అల్లాహ్ కు అన్నీ తెలుసు కదా, తన జ్ఞాన ప్రకారం ఆయన లెక్క తీర్పు చేయగలడు కదా. అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్. ఇన్ని ఆయతులు ఖురాన్ లో ఉన్నాయి. వాటన్నిటినీ తిరస్కరించి మనం మన ఊహాగానాలకు ప్రాధాన్యతనిస్తామా అస్తగ్ఫిరుల్లాహ్? మరి అల్లాహు తఆలా ఎందుకు వ్రాయిస్తున్నాడు? ప్రతీ మనిషి వెంట ఇద్దరు దైవదూతలను ఎందుకు పెట్టాడు? ఆ రోజు ప్రళయ దినాన ఆ కర్మ పత్రాన్ని మనిషికి ఇచ్చి స్వయంగా నీవు చదువు, నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు అని ఎందుకు చెబుతున్నాడు?
ఇందులో అతి ముఖ్యమైన ఔచిత్యం ఏమిటంటే మనిషికి నేను చేసిన పాపం దానికి మించి నాకు శిక్ష జరగడం లేదు మరియు నేను చేసిన పుణ్యం దాని యొక్క సత్ఫలితం దొరకడంలో నాకు ఏ రవ్వంత అన్యాయం జరగలేదు అన్నటువంటి మనశ్శాంతి, సంపూర్ణమైన తృప్తి అతనికి కలగాలి అని.
అందుకే మహాశయులారా, ఇక విషయం చాలా స్పష్టంగా ఉంది. ఇమామ్ హసన్ బస్రీ రహ్మతుల్లాహ్ అలైహ్ ఈ సూర బనీ ఇస్రాయిల్ ఆయతును చదివి, ఓ మానవుడా, అల్లాహ్ నీ వెంట ఇద్దరు దైవదూతలను పెట్టి ఒకరిని పుణ్యాలు రాయడానికి కుడి వైపున, మరొకరిని పాపాలు రాయడానికి ఎడమ వైపున నియమించి ఉన్నాడు. ఇక నీవు ఈ రోజు ఏది చేస్తావో దానినే పరలోకంలో పొందుతావు. ఏ కార్యం చేస్తావో, మంచి కార్యం చేస్తే దాని యొక్క మంచి సత్ఫలితం పొందుతావు. ఒకవేళ చెడు కార్యం చేస్తే దుష్ఫలితం పొందుతావు.
ఇంకా మహాశయులారా, ఆ రోజు పరిస్థితి ఎంత గాంభీర్యంగా ఉంటుందంటే,
وَوُضِعَ الْكِتَابُ
ఆ రోజు కర్మ పత్రం ముందుంచబడుతుంది.
فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ
ఆ రోజు నీవు అపరాధులను చూస్తావు. వారు చాలా భయ కంపితులకు గురి అయ్యి ఉంటారు. దేని గురించి?
مِمَّا فِيهِ
ఆ కర్మ పత్రాలలో ఏముందో దాని విషయంలో, వాటిని చూస్తూ వారు భయ కంపితులవుతారు. ఎందుకు మరి? అందులో ఏముంటుంది?
وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ
అయ్యో మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథము.
لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً
ఏ చిన్న విషయం కూడా ఇందులో వదలబెట్టడం జరగలేదు.
وَلَا كَبِيرَةً
మరియు ఏ పెద్ద విషయం కూడా ఇందులో వదలబెట్టడం జరగలేదు.
إِلَّا أَحْصَاهَا
ప్రతీ విషయం అందులో లెక్కబెట్టి ఉంచబడింది. లెక్కబెట్టి వ్రాయబడింది.
وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا
వారు చేసుకున్నదంతా కూడా ఆ కర్మ పత్రంలో వారు పొందుతున్నారు.
وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
మరియు నీ యొక్క ప్రభువు ఎవరిపై కూడా ఏ అన్యాయం చేయడు.
సూర కహఫ్ లోని ఆయతు ఇది. ప్రతీ జుమ్మా రోజు ఈ సూర కహఫ్ చదవాలని మనకు చెప్పడం జరిగింది కదా. మనలో భయం కలగాలి అని, సత్కార్యాల వైపునకు వెళ్ళాలి అని, పాపాల నుండి మనం దూరం ఉండాలి అని సూర కహఫ్ అందులో ఈ ఆయతు ఉంది. ఈ ఆయతులో మనకు తెలిసిన విషయాలు ఏంటి? ప్రతీ మనిషి కర్మ పత్రం ప్రళయ దినాన చూస్తాడు. అతను చేసిన వాటిలో ఏ చిన్న విషయం కూడా వదలకుండా అందులో పొందపరచడం జరుగుతుంది. మరియు మనిషి ఆ రోజు చూసుకొని బాధపడతాడు అన్న విషయం అల్లాహ్ ఈ రోజు మనకు తెలుపుతున్నాడంటే ఎందు గురించి? ఈ రోజే మనలో మనం మార్పు తీసుకురావాలి, మనం మార్పు తెచ్చుకొని సత్కార్యం చేయాలి అని.
మరొక విషయం గమనించారా మీరు?
يَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ
అయ్యో మా పాడుగాను ఇది ఎలాంటి పుస్తకం.
لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً
చిన్న విషయాన్ని వదలలేదు, పెద్ద విషయాన్ని వదలలేదు.
చిన్నది, పెద్దది రెండిటినీ ప్రస్తావిస్తూ ముందు దేన్ని ప్రస్తావిస్తున్నారు ఆ అపరాధులు? చిన్న వాటిని. మరి ఈ రోజుల్లో కూడా ఏం జరుగుతుంది? ఎందుకయ్యా ఈ పాపం చేస్తున్నావు? ప్లీజ్ వదులుకోండి అని అంటే అరే ఇదేమంత పెద్ద పాపమయ్యా చిన్నదే కదా అని మనం అంటూ ఉంటాము.
ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “నీవు చిన్న పాపాలను అల్పమైనవిగా విలువ లేనివిగా భావిస్తూ ఉండడాన్ని వదులుకో”. అంటే చిన్న పాపాలను నువ్వు చిన్నవియే కదా అని భావించకు, చిన్న పాపాలు చేయడం కూడా మానుకో. ప్రళయ దినాన వాటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుంది.
ప్రళయ దినాన మనం చేసుకున్న పాపాలు, పుణ్యాలు వాటిని వ్రాయబడిన ఆ కర్మ పత్రాలు మన ముందు తీసుకురావడం జరిగినప్పుడు మనిషి వాటిని చూసి ఏదైతే భయ కంపితుడు అవుతున్నాడో అప్పుడు మనం కూడా భయ కంపితుల్లో కలవకుండా ఈ రోజే మనలో మనం మార్పు తీసుకురావాలి.
ఇంకా ఆ రోజు ఎవరికి కర్మ పత్రం కుడి చేతిలో ఇవ్వడం జరుగుతుందో వారే అదృష్టవంతులు. మరెవరికి ఎడమ చేతిలో వెనుక నుండి ఇవ్వడం జరుగుతుందో వారే దురదృష్టవంతులు. మనం వేటిలో కలవాలి?
కుడి చేతిలో ఎవరికైతే ఇవ్వడం జరుగుతుందో వారి సంతోషాలకు హద్దు ఉండదు. ఎలా సంతోషిస్తారు, ఎంత గొప్పగా సంతోషిస్తారు? వారు ఎప్పుడైతే కుడి చేతిలో తమ కర్మ పత్రాలను పొందుతారో ఆనందం, సంతోషం, ఉల్లాసంతో ఎలా ముందుకు వస్తారో ఆ విషయాన్ని కూడా అల్లాహు తఆలా సూర హాక్కాలో ప్రస్తావించాడు. ఎలా ఉంటుంది ఆ సంఘటన?
فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ
ఎవరికైతే కుడి చేతిలో వారి కర్మ పత్రం ఇవ్వడం జరుగుతుందో, అతను సంతోషంతో, ఆనందంతో ప్రజల మధ్యలోకి దూసుకుంటూ వెళ్తూ, ఇదిగోండి, “హా ఉముక్రఊ కితాబియా” తీసుకోండి, నా కర్మ పత్రాన్ని మీరు కూడా చూడండి.
إِنِّي ظَنَنتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ
నేను నా లెక్కను నా తీర్పును పొందుతాను. తప్పకుండా అల్లాహ్ వద్ద మనం వెళ్ళవలసి ఉన్నది, అక్కడ మనకు అన్ని విషయాల లెక్క చెప్పుకునేది ఉంది అన్నటువంటి నమ్మకం నాకు ఉండినది. అందుగురించే నేను దాని ప్రకారంగా ఇహలోకంలో సత్కార్యాలు చేస్తూ ఉంటిని.
فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
అందుకు అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాల జీవితంలో ఆనందిస్తూ ఉంటాడు.
فِي جَنَّةٍ عَالِيَةٍ
ఉన్నతమైన స్వర్గాలలో అతడు ఉంటాడు.
قُطُوفُهَا دَانِيَةٌ
దాని యొక్క ఫలాలు అతి సమీపంలో అతనికి ఉంటాయి.
كُلُوا وَاشْرَبُوا هَنِيئًا
మీరు ఎంతో ఆనందంతో తింటూ త్రాగుతూ ఉండండి.
ఇక్కడ గమనించండి. ఎవరికైతే కుడి చేతిలో పత్రం తగిలించిందో అతడు ఎంత ఆనందంతో ప్రజల మధ్యలోకి వెళ్లి ఇదిగోండి నాది చదవండి, ఇదిగోండి నా మార్క్ షీట్ చూడండి, ఇదిగోండి నాకు లభించినటువంటి ఈ సర్టిఫికెట్ చూడండి, కర్మ పత్రం చూడండి అని ఎంత ఆనందంతో చెప్పుకుంటూ ఉంటాడు. మరియు ఆ తర్వాత అతనికి “ఫహువ ఫీ ఈషతిర్రాదియా, ఫీ జన్నతిన్ ఆలియా, కుతూఫుహా దానియా, కులూ వష్రబూ హనీఆ“. నాలుగు రకాల శుభవార్తలు ఈ ఆయతులో తెలపడం ఈ ఆయతుల్లో తెలపడం జరిగింది. ఈ శుభవార్తలు ఎందుకు ఇవ్వడం జరిగింది?
بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
గడిచిన రోజుల్లో ప్రపంచంలో మీరు ఏ సత్కార్యాలు అయితే చేసుకొని వచ్చారో వాటికి ప్రతిఫలంగా ఈ రోజు మీకు ఇలాంటి ఆనందమైన జీవితం లభిస్తుంది.
ఇక ఇంకా మనము ఇలాంటి విషయాలు వింటున్నాము, మనము కూడా అలాంటి ఆనందకరమైన జీవితం ఆ రోజు పొందాలి అంటే తప్పకుండా మన కర్మ పత్రం మన కుడి చేతిలో మనం పొందాలి. మన కుడి చేతిలో కర్మ పత్రం పొందాలి అంటే ఇహలోకంలో అల్లాహ్ ను విశ్వసించాలి, పరలోక దినాన్ని విశ్వసించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విశ్వసించాలి, ఖురాన్ ను విశ్వసించాలి, ఖురాన్ చూపిన మార్గం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడిచి చూపిన మార్గం ఏమిటో ఆ మార్గం మీదే మన జీవితం మనం గడపాలి.
ఇదే విషయాన్ని అల్లాహు తఆలా సూర ఇన్షికాక్ లో కూడా తెలిపాడు. ఒక్కసారి ఆ ఆయతులు కూడా మీరు శ్రద్ధగా వినండి, ఆనందించండి, జీవితంలో త్వరగా మార్పు తెచ్చుకొని సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చేయండి.
فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ
ఎవరికైతే తన కుడి చేతిలో కర్మ పత్రం ఇవ్వబడినదో,
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
అతని యొక్క లెక్క చాలా సులభతరంగా గడిసినట్లే.
وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
మరియు అతను తన ఇంటి వారి వైపునకు, అక్కడ అతని ఇంటి వారు ఎవరెవరైతే ఉంటారో వారి వైపునకు చాలా సంతోషంతో, మస్రూరా, ఆనందంతో వెళ్తాడు.
ఈ విధంగా మహాశయులారా, కుడి చేతిలో పొందిన వారు ఆనందంతో, సంబరాలతో, సంతోషాలతో తమ వారి వైపునకు వెళ్తారు. ఆ తర్వాత వారికి మనసు మెచ్చిన జీవితం ఉంటుంది, భోగ భాగ్యాలు ఉంటాయి, పండ్లు చాలా దగ్గరగా ఉంటాయి, ఉన్నత స్వర్గాల్లో వారికి స్థలము ఉంటుంది. ఇదంతా కూడా గడిసిన జీవితంలో అంటే ఇహలోక జీవితంలో విశ్వాస మార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉన్నందువల్ల.
ఇక రెండో వైపున గమనించండి. ఎవరికైతే కుడి చేతిలో లభించకుండా ఎడమ చేతిలో వెనుక వైపు నుండి లభిస్తుందో వారి పరిస్థితి ఏమవుతుంది?
وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ
ఇక ఎవరికైతే వారి కర్మ పత్రం ఎడమ చేతిలో లభిస్తుందో,
فَيَقُولُ
అతను ఇలా అరుస్తాడు,
يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ
నాకు ఈ కర్మ పత్రం లభించకుంటే ఎంత బాగుండు.
وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
నా లెక్క అనేది ఏమిటో నాకు తెలిసి కూడా ఉండకుంటే ఎంత బాగుండును.
يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ
ఆ చావు, ఎప్పుడైతే నేను చచ్చానో అదే నాకు చివరిదై నా వ్యవహారాలన్నిటినీ అంతం చేసేదై ఉండేది ఉంటే ఈ రోజు నేను చూసుకోకుంటే ఎంత బాగుండేది.
مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ
ఇహలోకంలో ఉన్న ధనం నాకు ఏమీ పనికి రాలేదు.
هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ
నా అధికారం కూడా నా చేత జారిపోయింది. పరలోకం అక్కడ ఇహలోకంలో ఉన్న అధికారాలు చెల్లవు, ఇహలోకంలో ఉన్నటువంటి డబ్బు ధనాలు కూడా ఏమీ చెల్లవు.
ఇదే విషయాన్ని అల్లాహు తఆలా సూర ఇన్షికాక్ లో ఎలా తెలిపాడు?
وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ
ఎవరికైతే వారి కర్మ పత్రాలు వారి వీపు వెనుక నుండి ఇవ్వడం జరిగిందో,
فَسَوْفَ يَدْعُو ثُبُورًا
అతను చావును అరుస్తూ ఉంటాడు. అయ్యో నేను చనిపోతే బాగుండు. కానీ చావు అక్కడ రాదు.
وَيَصْلَىٰ سَعِيرًا
అతను నరకంలో ప్రవేశిస్తాడు.
కుడి చేతిలో పొందిన వారు స్వర్గంలోకి వెళ్లారు. కుడి చేతిలో పొందిన వారు స్వర్గంలోకి వెళ్లారు. ఎడమ చేతిలో పొందే వారు నరకంలోకి వెళ్తారు. ఇతని పరిస్థితి ఏమిటి?
إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
ఇతను ఇహలోకంలో తన ఇంటి వారిలో ఎంతో ఆనందంగా ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఎలాంటి విశ్వాసం లేకుండా, పరలోక నమ్మకం లేకుండా, పరలోకంలో మనం లెక్క తీర్పు ఇవ్వవలసి ఉన్నది అన్నటువంటి భయం లేకుండా ఆనందంతో తన ఇష్టానుసారం జీవితం గడిపాడు.
إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ
మరియు అతని నమ్మకం ఏముండింది? మేము తిరిగి అల్లాహ్ వైపునకు వెళ్ళవలసినది లేదు ఆ నమ్మకం ఉండింది.
ఇక ఇక్కడ మీరు గమనించండి. ఇహలోకంలో విశ్వాసంతో సత్కార్యాలు చేసుకున్న వారు ఉన్నత స్వర్గాల్లో, పండ్లు చాలా దగ్గరగా ఉన్నాయి మరియు అన్ని రకాల భోగ భాగ్యాల జీవితంలో ఆనందిస్తూ ఉన్నారు. ఇటువైపున ఏముంది?
خُذُوهُ فَغُلُّوهُ
ఇతన్ని పట్టుకోండి, ఇతన్ని బంధించండి.
ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
మరియు ఇతనిని నరకంలో పడవేయండి.
ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
డెబ్భై సంకెళ్లలో ఇతని బంధించి నరకంలో పడవేయండి. ఎందుకు?
إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
అతను ఆ గొప్పవాడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు. అల్లాహు అక్బర్. సోదరులారా, అల్లాహ్ ను విశ్వసించండి. అల్లాహ్ పై నమ్మకం గట్టిగా కలిగి ఉండండి.
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు మరియు నిరుపేదలకు వారి అన్నం ఇవ్వాలని కూడా ఒకరిని ప్రోత్సహించేవాడు కాదు. పిసినారితనం. ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టని అటువంటి గుణం గలవాడు నరకంలో ఎలాంటి శిక్షను పొందుతాడో చూడండి. కానీ ఆ రోజు ఆ నరకంలో ఎలాంటి తిండి ఉంటుంది, ఎలాంటి ఆహారం ఉంటుంది?
فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ
ఇక్కడ ఈ రోజు అతనికి ఏ ప్రాణ స్నేహితుడు ఉండడు. అధికారం ఉండింది ఇహలోకంలో, డబ్బు ధనము ఉండింది ఇహలోకంలో. ఎందరో స్నేహితులు వచ్చారు అతని ఆ డబ్బు ధనాన్ని తినడానికి, అతనితో కూర్చున్నారు, అతన్ని పెద్ద నాయకుడిగా భావించారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత, فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ ఇక్కడ ఏ ప్రాణ స్నేహితుడు అతనికి ఉండడు.
وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
మరియు ఆ రోజు అతనికి తినడానికి నరకవాసుల నుండి వచ్చే చీము తప్ప ఇంకా ఏమీ ఉండదు.
لَّا يَأْكُلُهُ إِلَّا الْخَاطِئُونَ
అలాంటి ఆ చీము, అలాంటి ఆ నరకంలోని ఆ తిను త్రాగు పదార్థాలు ఇలాంటి పాపాత్ములకు మాత్రమే.
అల్లాహ్ అన్ని రకాల పాపాల నుండి మనందరినీ దూరం ఉంచుగాక. మహాశయులారా, ఆ పరలోక దినాన కర్మ పత్రాలు ఏవైతే ఇవ్వడం జరుగుతుందో దాని నుండి కూడా మనం భయపడాలి. ఇంతకుముందే మనం హజరత్ ఆయిషా రదియల్లాహు తన్హా గారి యొక్క హదీస్ విని ఉన్నాము. హజరత్ ఆయిషా రదియల్లాహు తన్హా నరకాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉన్నది. ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ప్రవేశించారు. ఎందుకు ఏడుస్తున్నావు ఆయిషా అని అంటే నేను నరకాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తున్నాను, అయితే ఆ రోజు మీరు మీ ఇంటి వారిని గుర్తు చేస్తారా అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయిషా, మూడు సందర్భాలలో ఎవరూ కూడా ఎవరినీ గుర్తించరు. ఆ మూడిట్లో ఒకటి ఏమిటి? కర్మ పత్రాలు, కర్మ పత్రాలు ఇవ్వబడే సందర్భంలో అతనికి తన కర్మ పత్రం కుడి చేతిలో ఇవ్వడం జరుగుతుందా, ఎడమ చేతిలో వెనుక నుండి ఇవ్వడం జరుగుతుందా అది స్పష్టంగా తెలిసి రానంత వరకు ఎవరూ ఎవరితో మాట్లాడరు, ఎవరూ ఎవరిని కూడా గుర్తించరు.
అందుకొరకు సోదరులారా, సోదరీమణులారా, ఈ వాస్తవాలన్నిటినీ కూడా నమ్మక తప్పదు. ఈ రోజుల్లో ఏ రకంగానైనా తిరస్కరించినా, తిరస్కరించిన పరియవసానాన్ని ఆ రోజు అనుభవించవలసి వస్తుంది.
అల్లాహ్ మనందరికీ సన్మార్గంపై ఉంచుగాక, విశ్వాస మార్గంపై ఉంచుగాక, సత్కార్యాలు చేస్తూ అల్లాహ్ కు ఇష్టమైన మార్గంలో జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]