మన ఆరాధనలు స్వీకరించబడాలంటే?
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/YUGJ4R5B-Ps [12 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఆరాధనలు (ఇబాదత్) అల్లాహ్ వద్ద స్వీకరించబడటానికి అవసరమైన మూడు ప్రాథమిక షరతులను వక్త వివరిస్తున్నారు. అవి: 1) అల్లాహ్ పై ప్రగాఢమైన మరియు స్థిరమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటం, 2) చేసే ప్రతి పుణ్యకార్యంలో చిత్తశుద్ధి (ఇఖ్లాస్) పాటించడం, అంటే కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయడం, ప్రజల మెప్పు లేదా ప్రదర్శన కోసం కాదు, మరియు 3) ప్రతి ఆరాధనను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన పద్ధతి (సున్నత్) ప్రకారమే ఆచరించడం. ఈ మూడు షరతులు లేకుండా చేసే కర్మలు స్వీకరించబడకుండా వృధా అయిపోయే ప్రమాదం ఉందని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేస్తున్నారు.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ أَمَّا بَعْدُ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్]
అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం ఆరాధనలు స్వీకరింపబడాలంటే ఏమి చేయాలి, కండిషన్లు ఏమిటి తెలుసుకుందాం. మనం అల్లాహ్ను ఆరాధిస్తాము, అల్లాహ్ నే ఆరాధిస్తాము. నమాజులు నెలకొల్పుతాము, ముఖ్యంగా ఈ రమదాన్ మాసంలో ఇతర మాసాల కంటే కొంచెం ఎక్కువగానే మనము ఆరాధనలో ఉంటాము. నమాజుల ద్వారా, నఫిల్ నమాజులు, తరావీహ్ నమాజు, దానధర్మాలు, దుఆ, ఖురాన్ పారాయణం, ఇతరులకు సహాయం చేయటం ఈ విధంగా అనేక రకాల ఆరాధనలు చేస్తున్నాము. ఖురాన్ చదువుతున్నాం, నమాజులు పాటిస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఖియాముల్ లైల్ చేస్తున్నాము. కాకపోతే మనము చేసే ఈ కర్మలు, మనము చేసే ఈ ఆరాధన స్వీకరించబడుతుందా? అల్లాహ్ స్వీకరిస్తున్నాడా? అల్లాహ్ ఇష్టపడుతున్నాడా మన ఆరాధనకి? ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి.
నేను చేసే నమాజ్ అల్లాహ్ స్వీకరించాలి అంటే, నా నమాజ్ ఏ విధంగా అయ్యి ఉండాలి? నేను ఉండే ఉపవాసం అల్లాహ్ స్వీకరించాలా అంటే నా ఉపవాసం ఏ విధంగా ఉండాలి? నేను చేసే ఖురాన్ పారాయణం అల్లాహ్ స్వీకరించాలి అంటే, నా ఖురాన్ యొక్క పారాయణం ఏ విధంగా ఉండాలి? నేను చేసే దానం, నేను చేసే ప్రతీ మంచి పని, ప్రతీ పుణ్యం, ప్రతీ సదాచరణ – నేను చేసేది, నేను దుఆ చేస్తున్నాను, నేను ఖురాన్ పారాయణం చేస్తున్నాను, తిలావత్ చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఏడ్చి ఏడ్చి దుఆ చేస్తున్నాను, ఖియాముల్ లైల్ చేస్తున్నాను, ఒకరికి సహాయం చేస్తున్నాను, పేదవారికి అన్నం పెడుతున్నాను, పేదవారికి దుస్తులు దానం చేస్తున్నాను, లేని వారికి ఆదుకుంటున్నాను, అంటే పలు విధాలుగా నేను అల్లాహ్ను ఆరాధిస్తున్నాను.
కాకపోతే నా ఈ ఆరాధన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్వీకరించాలా అంటే, దానికి మూడు కండిషన్లు ఉన్నాయి. అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలా, లేకపోతే మన కర్మలు వృధా అయిపోతాయి. మన ఆరాధనలు స్వీకరింపబడాలంటే ముఖ్యమైన మూడు కండిషన్లు మనం తెలుసుకోవాలి, మూడు విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మూడు ఏమిటి? ఒకటి, అల్లాహ్ పై నమ్మకం. రెండవది, ఇఖ్లాస్ (చిత్తశుద్ధి). మూడవది, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధానం. ఈ మూడు విషయాలు ఉంటేనే మన ఆరాధన స్వీకరించబడుతుంది.
- అల్లాహ్ పైన నమ్మకం. అల్లాహ్ పైన నమ్మకం లేకుండా ఆరాధిస్తే ఆ ఆరాధన స్వీకరించబడదు.
- చిత్తశుద్ధి ఇఖ్లాస్. చిత్తశుద్ధి లేకుండా ఆరాధిస్తే, ప్రజల మెప్పు కోసం ఆరాధిస్తే, ప్రజలు పొగడాలని పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యకార్యం, ఆ సదాచరణ, ఆ ఆరాధన స్వీకరించబడదు.
- అలాగే మనం చేసే సదాచరణ, మనం చేసే ఆరాధన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధానం పరంగా లేకపోతే అది రద్దు చేయబడుతుంది, స్వీకరించబడదు.
ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, ఆ విధంగానే మన కర్మలు ఉండాలి.
1. అల్లాహ్ పై ప్రగాఢ విశ్వాసం (ఈమాన్)
మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ పైన నమ్మకం. అల్లాహ్ పైన ప్రగాఢ విశ్వాసం. అల్లాహ్ మీద, ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ సుబహాననుహు వతాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు,
“ఇన్నల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాతి కానత్ లహుం జన్నతుల్ ఫిర్దౌసి నుజులా”. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి, విశ్వసించి.. మొదటి కండిషన్ ఏమిటి? విశ్వాసం. విశ్వసించి, విశ్వసించిన తర్వాత అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం తర్వాత సత్కార్యాలు చేసిన వారికి ఫిర్దౌస్ ఉద్యానవనాలు ఉంటాయి అని అన్నాడు.
అలాగే అల్లాహ్ సుబహాననుహు వతాలా సూరతుల్ అసర్ లో తెలియజేశాడు, వల్ అసర్, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, ఇల్లల్లజీన ఆమను వ అమిలుస్ సాలిహాత్. కాలం సాక్షిగా మానవులందరూ నష్టంలో ఉన్నారు, నాలుగు రకాల కోవకి చెందిన నాలుగు గుణాలు ఉండే వ్యక్తులు తప్ప అన్నాడు. అంటే విశ్వసించిన వారు, ఆ తర్వాత సత్కార్యాలు చేసేవారు, పరస్పరం సత్యం గురించి హితబోధ చేసుకునే వారు, సహనం వహించేవారు. అంటే మొదటి విషయం అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం.
ఇదే విషయం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:
قُلْ آمَنْتُ بِاللَّهِ ثُمَّ اسْتَقِمْ
[కుల్ ఆమన్తు బిల్లాహి సుమ్మస్తకిమ్]
“నేను అల్లాహ్ను విశ్వసించాను” అని పలికి, దానిపై నిలకడగా ఉండు.
మేమందరము అల్లాహ్ని విశ్వసించాము అని అంటున్నాము, విశ్వసించాము కూడా. కాకపోతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? సుమ్మస్తకిమ్ (దాని మీద నిలకడగా ఉండు). అంటే, అల్లాహ్ను నమ్ముతున్నాము, అల్లాహ్ ఆదేశాల పరంగా జీవితం గడపాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏదైతే చేయమన్నాడో అవి చేయాలి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దేనిని నిషిద్ధం చేశాడో దానికి దూరంగా ఉండాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాలు మనకి బోధించారో, చేయమన్నారో, ఆజ్ఞాపించారో అది మనము చేయాలి, ఆయన్ని అనుసరించాలి, విధేయత చూపాలి. ఏ విషయాల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారో, నిషిద్ధం అన్నారో, అధర్మం అన్నారో వాటిని విడనాడాలి, దూరంగా ఉండాలి. సుమ్మస్తకిమ్ (స్థిరంగా ఉండు). అల్లాహ్ని విశ్వసించిన తర్వాత అల్లాహ్ పైన నమ్మకం కలిగిన తర్వాత దానిపై నిలకడగా ఉండాలి. అల్లాహ్ని విశ్వసిస్తున్నాం, నమాజ్ చేయటం లేదు. రమదాన్లో నమాజ్ చేస్తాము, రమదాన్ తర్వాత నమాజ్ చేయము. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రమదాన్ మాసానికి ప్రభువు అయితే, రమదాన్ తర్వాత మాసాలకి అల్లాహ్ ప్రభువు కాదా?
ఆమన్తు బిల్లాహి (నేను అల్లాహ్ను విశ్వసించాను) అని చెప్పి, సుమ్మస్తకిమ్ (దాని మీద నిలకడగా ఉండు). అంటే మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ పైన గట్టి నమ్మకం కలిగి ఉండాలి. మన విశ్వాసాలు, మన ఆచరణలు, మన ఆరాధనలు, మన కర్మలు, మన పుణ్యాలు అల్లాహ్ స్వీకరించాలంటే మొదటి విషయం అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే పాలకుడు, ఆయన మాత్రమే పోషకుడు, ఆయన మాత్రమే సర్వ లోకాలను చూసుకునేవాడు, ఆయన మాత్రమే మన జీవన్మరణాలకు కారకుడు. ఆయన మీద, ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం కలిగి ఉండటం. ఇది మొదటి విషయం.
2. చిత్తశుద్ధి (ఇఖ్లాస్)
రెండో విషయం ఇఖ్లాస్, చిత్తశుద్ధి. ఏ మంచి పని చేసినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం చేయాలి, ప్రజల మెప్పు కోసం చేయకూడదు. నన్ను సమాజంలో పొగుడుతారు, నాకు పేరు వస్తుంది, అందరూ నాకు పొగుడుతారు ఈ ఉద్దేశంతో మంచి పని చేయకూడదు. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు, దీనికి రియా అంటారు. రియా గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే,
الرِّيَاءُ الشِّرْكُ الأَصْغَرُ
[అర్-రియా అష్-షిర్కుల్ అస్గర్]
రియా (ప్రదర్శనా బుద్ధి) అనేది చిన్న షిర్క్.
రియా (ప్రదర్శనా బుద్ధితో), నలుగురి మెప్పు కోసం, ప్రజల మెప్పు కోసం ఏదైనా మంచి పని చేస్తే అది షిర్క్ అవుతుంది. చిన్న షిర్క్ అవుతుంది అన్నారు. అంటే ప్రదర్శనా బుద్ధితో సదాచరణ చేస్తే అది సదాచరణ కాదు, అది షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ప్రజల మెప్పు కోసం అల్లాహ్ను ఆరాధించకూడదు. చిత్తశుద్ధితో, ఇఖ్లాస్తో మనము మంచి పని చేయాలి, ఆరాధించాలి.
3. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విధానం
మొదటి విషయం, అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం, ఆయన ఏకత్వం పైన నమ్మకం, విశ్వాసం. రెండవది, చిత్తశుద్ధి, ఇఖ్లాస్. మూడో విషయం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన పద్ధతి పరంగానే మన కర్మలు ఉండాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలియజేశాడు:
وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمْ عَنْهُ فَٱنتَهُوا۟
[వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫన్తహూ]
“అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏది ఇస్తారో అది తీసుకోండి, ఆయన దేని నుంచి ఖండిస్తారో దానికి దూరంగా ఉండండి.” (59:7)
అంటే మనము నమాజ్ చేసినా విధానం ప్రవక్త గారి విధానం అయ్యి ఉండాలి, ఉపవాసం ఉండినా విధానం ప్రవక్త గారి విధానం అయ్యి ఉండాలి, ఉపవాసం పాటించినా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం అయ్యి ఉండాలి, ఖియాముల్ లైల్ చేసినా ప్రవక్త గారి విధానం, దుఆ చేసినా ప్రవక్త గారి విధానం, దానధర్మాలు చేసినా ప్రవక్త గారి విధానం, ఖురాన్ పారాయణం చేసినా ప్రవక్త గారి విధానం. ప్రవక్త గారి విధానం లేకపోతే ఆ ఆరాధన రద్దు చేయబడుతుంది. ఈ విషయాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:
مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ
[మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్]
ఎవరైతే మా ఈ (ధార్మిక) విషయంలో లేని దాన్ని క్రొత్తగా కల్పిస్తారో, అది త్రోసిపుచ్చబడుతుంది (తిరస్కరించబడుతుంది).
మా ఆదేశాలకు అనుగుణంగా లేని పనులు త్రోసిపుచ్చబడతాయి, రద్దు చేయబడతాయి, క్యాన్సిల్ చేయబడతాయి. అభిమాన సోదరులారా, మనం చేసే ప్రతీ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా ఉండాలి. లేకపోతే అవి స్వీకరించబడవు. దుఆ చేస్తాము, ప్రవక్త గారి విధానం. నమాజ్ పాటిస్తాము, ప్రవక్త గారి విధానం. సహరీ ఆదాబులు, ప్రవక్త గారి విధానం. ఇఫ్తార్ గురించి, ప్రవక్త గారి విధానం. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రవక్త గారి విధానం. ఎటువంటి సంకల్పం ఉండాలి, ప్రవక్త గారి విధానం. నమాజ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రవక్త గారి విధానం. హజ్, ఉమ్రా చేయాలి, ప్రవక్త గారి విధానం. అమ్మానాన్నలను పోషించాలి, వారి మాట వినాలి, ప్రవక్త గారి ఆదేశాల పరంగానే. మనము ఏ పుణ్యం చేసినా, ఏ మంచి పని చేసినా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం పరంగానే ఉండాలి, లేకపోతే మనం చేసే కర్మలు వృధా అయిపోతాయి, స్వీకరించబడవు.
అభిమాన సోదరులారా, చివర్లో ఆ మూడు విషయాలు తెలుసుకుందాము, రిపీట్ చేస్తున్నాను. అల్లాహ్ పై నమ్మకం, చిత్తశుద్ధి (ఇఖ్లాస్), అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం. ఈ మూడు కండిషన్లు ఉంటే మన ఆరాధనలు, నమాజ్, ఉపవాసం, ఖియాముల్ లైల్, దుఆ, జిక్ర్, తిలావత్ ఇవన్నీ స్వీకరించబడతాయి.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఈ కండిషన్లతో పాటు ఆరాధనలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన ప్రతీ ఆరాధనలో అల్లాహ్ పై గట్టి నమ్మకాన్ని, ఇఖ్లాస్ని, ప్రవక్త గారి సున్నత్ విధానాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మనందరి చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ స్తోత్రాలు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43606