ఖుత్బా అంశము : ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపడం వలన లాభాలు
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి, అవిధేత నుండి జాగ్రత్త వహించండి.
తెలుసుకోండి! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారిపై దరూద్ పంపడం ద్వారా పది ప్రయోజనాలు ఉన్నాయి.
1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపమన్న అల్లాహ్ యొక్క ఆజ్ఞ నెరవేరుతూ ఉంటుంది.
అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33:56)
2. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం ఒక దుఆ లాంటిది. ఇది ఆరాధనలో భాగమే ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ కాబట్టి దీని కొరకు పుణ్యఫలం కూడా ఉంది.
3. మహాప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై ఒకసారి దరూద్ పంపడం వలన అల్లాహ్ తఆలా యొక్క పది కారుణ్యాలు లభిస్తాయి. ప్రవక్త వారు ఇలా తెలియజేశారు: ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తారో అల్లాహ్ వారి పై పదిసార్లు కరుణిస్తాడు. (ముస్లిం)
ప్రతిఫలం అనేది చర్య యొక్క స్వభావం ద్వారా లభిస్తుంది. కనుక ఎవరైతే ప్రవక్త వారిని ప్రశంసిస్తారో అల్లాహ్ దానికి బదులుగా అతడిని ప్రశంసిస్తాడు మరియు అతని స్థానాలను ఉన్నతం చేస్తాడు.
4. దరూద్ పఠించే వ్యక్తి యొక్క పది అంతస్తులు పెరుగుతాయి. అతనికి పది పుణ్యాలు లభిస్తాయి మరియు పది పాపాలు క్షమించబడతాయి.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు“. (నసాయి)
5. దరూద్ పాపాల మన్నింపుకు, దుఃఖవిచారాలను దూరం చేసుకోవటానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కటానికి దోహదపడుతుంది.
హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కధనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను. వాస్తవానికి నేను నా ప్రార్ధన (దుఆ) లో ఎంత సేపు మీపై దరూద్ పఠించాలి?.” అని అడిగాను. అందుకాయన “నికిష్టమయినంత సేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను. “సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచింది” అని అన్నారాయన. నేను “సగం ప్రార్ధన దరూద్ కోసం కేటాయిస్తాను” అన్నాను. దానికాయన “సరే, నీ యిష్టం.కానీ అంతకన్నా ఎక్కువ సేవు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు.నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నాడు. చివరికి నేను “మరయితే నా ప్రార్ధన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మీజీ)
ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) తెలియచేసారు: ఇతను హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ఈయన అల్లాహ్ తో ఒక ప్రత్యేక దుఆ వేడుకునేవారు. కానీ ఎప్పుడైతే ఆయన తన ప్రత్యేక దుఆ దగ్గర దరూద్ పటించడం ప్రారంభించాడో అతని ఇహపరాల ఇబ్బందుల కొరకు అల్లాహ్ సరిపోయాడు. ఆయన దరూద్ పంపినప్పుడల్లా అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలను కురిపించాడు. ఒకవేళ అతను తన సోదరుని కోసం దుఆ చేస్తే దైవదూతలు ఆమీన్ చెప్పడంతో పాటు నీకు కూడా అది లభించుగాక అనేవారు కాబట్టి మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొరకు దుఆ చేయడం ఎంతో ఉత్తమమైనది.
6. మహా ప్రవక్త మొహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం వలన కలిగేటువంటి మరో ప్రయోజనం ఏమిటంటే ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, స్వర్గంలో ఆయనకు ‘ఉన్నత స్థానం’ లభించాలని కోరుకుంటే ప్రళయ దినాన వారికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు లభిస్తుంది.
హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్తుండగా విన్నాను, ఆయన ఈ విధంగా తెలియ చేసారు: “మీరు ఆజాన్ పిలుపు వినగానే దానికి తిరిగి అదే విధంగా సమాధానం చెప్పండి. ఆ తరువాత నాపై దరూద్ పటించండి. ఎవరు అయితే నాపై ఒకసారి దరూద్ పంపుతాడో అల్లాహ్ అతన్ని పది సార్లు కరుణిస్తాడు. నా కొరకు వసీలా’ (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని అల్లాహ్ ను కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను”. (ముస్లిం)
7. దుఆ చేసే వ్యక్తి తన దుఆ కి ముందు దరూద్ పఠించినప్పుడు అతనిలో దుఆ స్వీకరించబడుతుంది అనే ఆశ ఉంటుంది. ఎందుకంటే దరూద్ అతని దుఆ ని అల్లాహ్ అంగీకరించేందుకు తోడ్పడుతుంది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలియజేశారు: “ఆకాశం మరియు భూమి మధ్య దుఆ నిలిపివేయబడుతుంది. మీరు దానిపై ప్రార్థించే వరకు అనగా ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపనంతవరకు దానిలో ఏదీ పైకి వెళ్లదు“. (తిర్మీజీ)
8. మనం పఠించేటువంటి దరూద్ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చేరవేయబడుతుంది, ప్రవక్త గారు ఇలా తెలియజేశారు: “మీ దరూద్ నాకు అందించబడుతుంది“. (అహ్మద్)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై తన ‘దరూద్’ పంపడం కంటే ఒక వ్యక్తికి గొప్ప గౌరవం ఏముంటుంది?
9. ఏదేని సభలో దూరూద్ పటించడం ఆ సభ యొక్క స్వచ్ఛతకు కారణం. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే దూరూద్ పఠించరో అది వారి కొరకు ప్రళయ దినాన దుఃఖ దాయకంగా పరిణమిస్తుంది.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “కొంతమంది ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పంపకపోతే ప్రళయదినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా (తలవంపుగా) పరిణమిస్తుంది. వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించేవారయినా సరే.” (అహ్మద్)
10. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమ పెరుగుదలకు దరూద్ షరీఫ్ కారణం. ఇది విశ్వాసం యొక్క ఒడంబడికలలో ఒకటి, ఇది ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే నెరవేరుతుంది. ఒక వ్యక్తి తన ప్రియమైన వ్యక్తిని ఎంత ఎక్కువగా గుర్తుంచుకుంటాడో, అతని సద్గుణాలు మరియు అతని ప్రేమకు దారితీసే లక్షణాలను పునరుద్ధరించుకుంటాడు. దీనివలన అతని ప్రేమ మరింత పెరుగుతుంది మరియు అతను ప్రేమించే ప్రియమైన వ్యక్తిని కలవాలనే కోరిక పూర్తిగా పెరుగుతుంది.
కానీ ఒక వ్యక్తి తాను ప్రేమించే వ్యక్తిని మర్చిపోయినప్పుడు అతని హృదయంలో నుండి అతని సద్గుణాలన్నీ తొలగిపోతాయి, మరియు అతనిపై ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుంది. ఒక ప్రేమికుడికి తాను ప్రేమించే తన స్నేహితుడిని చూడడం కంటే తన కళ్ళను మరి ఏమి చల్లపరచలేదు.
ఇవి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం వలన కలిగేటువంటి పది ప్రయోజనాలు – వీటిని ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) వారు (జలా అల్ ఆఫ్ హామ్) అనే పుస్తకంలో పొందుపరిచారు.
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఓ ముస్లిం లారా! మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కొరకు దరూద్ పంపడంతోపాటు, వసీల మరియు ఫజీల (ఔన్నత్యం) కొరకు దుఆ కూడా చేయాలి. అనగా ఓ అల్లాహ్! మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ మఖామే మహమూద్ వరకు చేర్చు. దీని ఆధారం జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే అజాన్ పిలుపు వింటారో వారు ఈ దుఆ చదవాలి:
(ఈ సంపూర్ణ పిలుపుకు స్థిరముగా స్థాపించబడు నమాజుకు ప్రభువైన అల్లాహ్! హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి వసీల అనే ఆశ్రయం ప్రసాదించు. మహిమ కలిగిన ఔన్నత్యమును ప్రసాదించు. మరియు నీవు వారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చు) (బుఖారి)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేవాని) ప్రకటన విన్నప్పుడు, అతను అనే పలుకులే మీరూ పలకండి. ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒకసారి దరూద్ పఠించేవారిని అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు ‘వసీలా’ లభించాలని అల్లాహ్ ను ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక (ఉన్నత స్థానం). స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కణ్ణి నేనేనని నా అభిప్రాయం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. (ముస్లిం)
“వసీల” అనగా స్వర్గంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానము. “ఫజీల” అనగా మహిమ కలిగినటువంటి ఔన్నత్యము. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియచేసినటువంటి దాంట్లో మఖామే మహమూద్ లో “మహమూద్” అనగా ఒక ప్రదేశము అక్కడ నిల్చున్న వ్యక్తి ప్రశంసించబడతాడు. “అల్ మఖాం” అనగా లెక్క తీసుకునేటువంటి సందర్భంలో సిఫారసు కొరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిల్చోనేటువంటి ప్రదేశము. దీని ఆధారం అబూరైన కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: “మఖామే మహమూద్ అనగా సిఫారసు“
మరియు హదీస్ యొక్క చివరిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అన్నారు: “అనగా ఆచరణ ద్వారానే ప్రతిఫలం లభిస్తుంది కనుక ఏ వ్యక్తి అయితే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొరకు మఖామే మహమూద్ గురించి అల్లాహ్ ను ప్రార్ధిస్తాడో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు కు అతను అర్హుడు అవుతాడు. మరియు ఆ వ్యక్తి పాపాలు క్షమించబడి, స్థానాలు ఉన్నతం చేయబడే వారిలో చేర్చబడతాడు”.
అల్లాహ్ మనందరికీ మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సిఫారసు పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక! (ఆమీన్)
మరియు ఇది కూడా తెలుసుకోండి, అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.
(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.
ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్ మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.