87. తఫ్సీర్ సూర అల్ ఆలా (Tafseer Sura Al A’ala) [వీడియో & టెక్స్ట్]

తఫ్సీర్ సూర అల్ ఆలా (Tafseer Sura Al A’ala) 
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/5shT_PdxwNE [60 నిముషాలు]

ఈ ప్రసంగంలో, సూరహ్ అల్-ఆ`లా యొక్క వివరణ ఇవ్వబడింది. అల్లాహ్ యొక్క పవిత్రతను కీర్తించడం (తస్బీహ్) నాలుగు విధాలుగా ఉంటుందని వివరించబడింది: హృదయంలో, మాటలో, అల్లాహ్ నామాలు మరియు గుణాల విషయంలో, మరియు ఆచరణలో. అల్లాహ్ యే సృష్టికర్త, సృష్టిని తీర్చిదిద్ది, ప్రతిదాని విధిని నిర్ధారించి, మార్గదర్శకత్వం ఇచ్చేవాడని నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక జీవితం తాత్కాలికమని, పచ్చిక బయళ్ళు ఎండిపోయినట్లు మానవ జీవితం కూడా ముగుస్తుందని, కానీ అల్లాహ్ పునరుత్థానం చేస్తాడని గుర్తుచేయబడింది. ఖుర్ఆన్ ను ప్రవక్త (స)కు అల్లాహ్ యే గుర్తుంచుకునేలా చేస్తాడని, దానిని అనుసరించడం సులభతరం చేయబడిందని చెప్పబడింది. అల్లాహ్ కు భయపడేవారే ఉపదేశాన్ని స్వీకరిస్తారని, దౌర్భాగ్యులు దానిని తిరస్కరించి ఘోరమైన నరకాగ్నిలో ప్రవేశిస్తారని హెచ్చరించబడింది. ఆత్మశుద్ధి చేసుకుని, అల్లాహ్ ను స్మరించి, నమాజ్ చేసేవారే సాఫల్యం పొందుతారని. ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితమే శ్రేష్ఠమైనదని, శాశ్వతమైనదని, ఈ సందేశం ఇబ్రాహీం (అ.స) మరియు మూసా (అ.స) గ్రంథాలలో కూడా ఉందని సూరహ్ ముగుస్తుంది. ప్రసంగం తర్వాత, ఇషా నమాజ్ సమయం, ఉదూ లేకుండా ఖుర్ఆన్ పట్టుకోవడం, మరియు షిర్క్ కు సంబంధించిన ఆచారాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.

ప్రియ విద్యార్థులారా, ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ ఆలా యొక్క తఫ్సీర్ ప్రారంభించబోతున్నాము. అయితే ఈ సూరకు సంబంధించి కొన్ని ప్రారంభ విషయాలు నేను ఇంతకుముందు క్లాస్ లో చెప్పి ఉన్నాను.

మొదటి ఆయతు

سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى
(సబ్బిహిస్మ రబ్బికల్ ఆ`లా)
నీ మహోన్నత ప్రభువు నామాన్ని కీర్తించు. (87:1)

సబ్బిహ్’ – పవిత్రతను కొనియాడు, ‘సుబ్ హా నల్లాహ్’ అని పలుకుతూ ఉండు. దీని యొక్క భావం ఇంతకు ముందే నేను చెప్పాను, నాలుగు రకాలుగా ఉండాలి. మనం అల్లాహ్ యొక్క తస్బీహ్ నాలుగు రకాలుగా చేయాలి.

  • (1) ఒకటి, మన మనస్సులో అల్లాహ్ అన్ని రకాల షిర్క్, అన్ని రకాల లోపాలు, అన్ని రకాల దోషాలకు అతీతుడు అని బలంగా నమ్మాలి.
  • (2) మరియు ‘సుబ్ హా నల్లాహ్’ అని నోటితో పలుకుతూ ఉండాలి.
  • (3) మూడవది, అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలు, అల్లాహ్ యొక్క మంచి గుణాలు అవి అల్లాహ్ కు మాత్రమే తగును, అందులో అల్లాహు త’ఆలా ఎలాంటి లోపాలు లేనివాడు అని కూడా స్పష్టంగా నమ్మాలి.
  • (4) ఇంకా, మన ఆచరణ ద్వారా అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి. అంటే, మనం ఏ పని చేయడం ద్వారా మనం అల్లాహ్ కు ఒక దోషాన్ని అంటగట్టిన వారం అవుతామో, అలాంటి పనులు చేయకూడదు. అల్లాహ్ అన్ని రకాల దోషాలకు, లోపాలకు అతీతుడు అని స్పష్టమయ్యే అటువంటి పనులు మనం చేయాలి. అంటే అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటాలి మన యొక్క ఆచరణ ద్వారా కూడా.

    ఒక చిన్న ఉదాహరణ చూడండి , మీకు విషయం అర్ధం అవుతుంది . మనం భారతీయులము గనక 15వ ఆగస్టు, 26 జనవరి ఇలాంటి సందర్భంలో మనం మన దేశ దేశానికి ఏదైతే స్వాతంత్రం లభించినదో, దానిని పురస్కరించుకొని ఒక సంబరం, ఒక సంతోషం వ్యక్తపరుస్తాము. కానీ మన తోటి భారతీయులు కొందరు ఏం చేస్తారు? ఆ సమయంలో అక్కడ నెహ్రూ గారి లేదా గాంధీ గారి యొక్క బొమ్మలు పెట్టి అక్కడ కొబ్బరికాయ కొడతారు. అయితే ఈ సందర్భంలో మనం అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి మన ఆచరణ ద్వారా. అయితే మనం, వారు అక్కడ టెంకాయ కొడుతున్నప్పుడు కేవలం ‘సుబ్ హా నల్లాహ్’ అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే ‘ఓ రండి, మీరు మా జమాత్ యొక్క పెద్ద, మీరు మా యొక్క స్కూల్ కు పెద్ద ఆర్గనైజర్, మీరు పెద్ద హెడ్ మాస్టర్’ ఈ విధంగా ఎవరైనా ఒక ముస్లింని ఆహ్వానించి ముందుకు తీసుకొచ్చి అతని చేతిలో ఓ టెంకాయ ఇచ్చి ‘కొట్టండి’ అని అంటే అక్కడ అతని యొక్క పరీక్ష. అతడు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి ఈ టెంకాయ కొట్టి టెంకాయ సమర్పించినవాడు అవుతున్నాడు. అంటే అతను ‘సుబ్ హా నల్లాహ్’ నోటితో పలుకుతున్నా, ఆచరణతో వ్యతిరేకిస్తున్నాడు అని భావం. ఇప్పుడు అర్థమైందా అందరికీ క్లియర్ గా? మనం అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా మనం ఎలా కొనియాడాలి అన్న విషయం తెలిసింది కదా?

ఇక ‘రబ్బిక’ నీ ప్రభువు అన్నటువంటి పదం ఇక్కడ అల్లాహు త’ఆలా ఉపయోగించాడు. ‘సబ్బిహిల్లా’ అల్లాహ్ యొక్క పవిత్రత కొనియాడు అని అంటే కూడా మాట వస్తుంది. కానీ ‘రబ్బిక’ అనడంలో ఇక్కడ హిక్మత్, ఔచిత్యం అని కొందరు ధర్మవేత్తలు, వ్యాఖ్యానకర్తలు ఏం తెలిపారంటే, ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో ఏ ముష్రికులు అయితే ఉండేవారో చుట్టుపక్కన మొత్తం, వారు మనందరి సృష్టికర్త అయిన నిజమైన ప్రభువు అల్లాహ్ ను రబ్ అని, అల్లాహ్ ను ఖాలిఖ్ పుట్టించేవాడని, అల్లాహ్ ను రాజిఖ్ ఉపాధి ప్రదాత అని నమ్మేవారు. అయినా షిర్క్ చేసేవారు. అయితే ఇలాంటి వారికి మరీ నొక్కి చెప్పడం జరుగుతుంది. మీరు ఏ అల్లాహ్ నైతే ప్రభువు అని నమ్ముతున్నారో, ఆ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడండి. షిర్క్ కు దూరంగా ఉండిపోండి.

‘అల్-ఆలా’ అల్లాహ్ యొక్క పేరు కూడా మరియు ఇందులో అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ ఉన్నతుడు అందుకొరకే ఇక్కడ అనువాదంలో ఉంది ‘సర్వోన్నతుడు’ అయిన. అల్లాహు త’ఆలా తన యొక్క అస్తిత్వం జాత్ కే ఏతిబార్ సే, తన యొక్క ఉత్తమ నామాలు, మంచి గుణాల విషయంలో కూడా సర్వోన్నతుడు. తన యొక్క పనులలో కూడా సర్వోన్నతుడు.

సూరహ్ అల్-ఆ`లా – 2 నుండి 5 ఆయతులు

ఈ మొదటి ఆయతులో రబ్ అంటే ఏంటి, ఆ`లా అంటే ఏంటి, తస్బీహ్ అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే అల్లాహ్ యొక్క, నీ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడు. ఎందుకు పవిత్రతను కొనియాడాలి? మన యొక్క ‘సుబ్ హా నల్లాహ్’ అనడానికి తస్బీహ్ కి అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే ఎందుకు? ఇక్కడ అల్లాహు త’ఆలా ఆయతు నెంబర్ రెండు నుండి ఆయతు నెంబర్ ఐదు వరకు కొన్ని కారణాలు తెలుపుతున్నాడు. శ్రద్ధ వహించండి ఇప్పుడు.

الَّذِي خَلَقَ فَسَوَّىٰ
(అల్లదీ ఖలక ఫసవ్వా)
ఆయనే సృష్టించాడు, మరి ఆపైన తీర్చిదిద్దాడు. (87:2)

وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
(వల్లదీ ఖద్దర ఫహదా)
ఆయనే (కావలసిన వాటిని తగురీతిలో) నిర్ధారించాడు. పిదప మార్గం చూపించాడు. (87:3)

ఆయనే సృష్టించాడు. ‘ఫసవ్వా’ మరి ఆపైన తీర్చిదిద్దాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అంతేకాదు, ఆ అల్లాహు త’ఆలా, ‘వల్లదీ ఖద్దర’ ఆయనే కావలసిన వాటిని తగు రీతిలో నిర్ధారించాడు. ‘తఖ్దీర్’ విధిరాత అని ఏదైతే అంటామో, దాని యొక్క ప్రస్తావన కూడా ఈ ‘ఖద్దర’ అన్న పదంలోనే వచ్చేస్తుంది. ‘ఫహదా’ పిదప మార్గం చూపించాడు.

నాలుగు పదాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఖలక, సవ్వా, ఖద్దర, హదా. ప్రియ విద్యార్థులారా, ఈ నాలుగు పదాల యొక్క అర్థమైతే ఇక్కడ ఉన్నది. ఖలక సృష్టించాడు, సవ్వా తీర్చిదిద్దాడు, ఖద్దర నిర్ధారించాడు, తఖ్దీర్ విధిరాత రాశాడు, హదా మార్గం చూపించాడు. కానీ వ్యాఖ్యానకర్తలు దీని గురించి చెప్పిన విషయాలను గమనిస్తే, అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క గొప్పతనం మన ముందు ఎంత స్పష్టంగా వస్తుందో, మీరు ఒకసారి గమనించాలి ఈ విషయాన్ని.

ఖుర్ఆన్ లో ఇంకా అనేక సందర్భాల్లో వీటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా తెలుపబడ్డాయి. వీటి యొక్క ఈ నాలుగు పదాలు ఇక్కడ ఏవైతే వచ్చి ఉన్నాయో, వాటి యొక్క కొన్ని ఉదాహరణలు ఖుర్ఆన్ లోని వేరే సూరత్ లో. ఇంతకు ముందు మీరు ఉదాహరణకు చదివారు కదా సూరతుల్ ఇన్ఫితార్ లో? ఆయతు నెంబర్ ఏడులో.

يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ
(యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీమ్)
ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది?(82:6)

الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ
(అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్)
(యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా మలిచాడు. (82:7)

فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ
(ఫీ అయి సూరతిమ్ మాషాఅ రక్కబక్)
తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు.(82:8)

గుర్తొచ్చిందా? అక్కడ చూడండి, సూరతుల్ ఇన్ఫితార్ లో మనం చదివి ఉన్నాము. అలాగే మీరు గమనించారంటే, సూరత్ అత్-తీన్ అని అంటాము కదా మనం? అక్కడ, అలాగే సూరత్ అస్-సజ్దాలో కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాలను వివరించాడు.

సంక్షిప్తంగా, సారాంశంగా మనం చెప్పుకోవాలంటే, ఉదాహరణకు ఒక మనిషి విషయమే చూడండి. అల్లాహు త’ఆలా ఇక్కడ పూర్తి సృష్టి విషయం గురించి చెబుతున్నాడు. ఖలక అంటే అల్లాహు త’ఆలా పూర్తి సృష్టిని సృష్టించాడు. సవ్వా, ప్రతీ సృష్టిలో వారికి ఎలాంటి చక్కబాటు, తీర్చిదిద్దడం అవసరమో ఆ రీతిలో తీర్చిదిద్దాడు. ఖద్దర, ప్రతి ఒక్కరి విధిరాత రాసి ఉంచాడు. హదా, ప్రతి ఒక్కరికీ వారికి అవసరమైనది వారికి మార్గం చూపాడు.

కానీ ఈ విషయం కొంచెం వివరంగా ఒక్క మానవుని విషయంలోనే మనం గమనించామంటే, అల్లాహు త’ఆలా మానవుని సృష్టించాడు కదా. చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ కళ్ళు మనకు వెనక వైపున ఉంటే? మన ఈ మూతి, ఫేస్ అనడం లేదు నేను, మౌత్ అని ఏదైతే అంటామో మూతి, ఇందులో నుండి అయితే పళ్ళు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి, ఇది మన ఏదైనా ఒక వైపున ఉండేది ఉంటే? అలా కాకుండా కేవలం మనిషి ఒక తిండి విషయం ఆలోచించండి. మనిషి తినాలి. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ద్వారా మంచి శక్తి లభిస్తుంది, మంచి శక్తి లభిస్తే మంచిగా అల్లాహ్ ను ఆరాధించగలుగుతాడు.

ఉదాహరణకు ఒకటి తీసుకోండి. తినడానికి తన చేతిలో ఒక అన్నం ముద్దనే ఎత్తాడు అనుకోండి. చేతుల ద్వారా ముందు విషయం తెలుస్తుంది. ఆ అన్నం మెత్తగా ఉన్నదా, పాసిపోయినదా, మంచిగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా? బియ్యం ఏవైతే మనం వండామో, అవి మంచిగా ఉడికాయా లేవా అన్న విషయాలు మనకు మన వేళ్ళ ద్వారా తెలుస్తుంది కదా. దానితోపాటు ఏదైనా కూర కలుపుకొని ముద్ద చేసుకొని మనం పైకి ఎత్తుతాము. అందులో ఏదైనా మనకు ఇష్టం లేని మిరపకాయ వచ్చినా కళ్ళతో కనబడుతుంది, పక్కకు తీసేస్తాము. ఒకవేళ అందులో ఏదైనా మనకు ఇష్టం లేని వాసన లాంటిది ఉండేది ఉంటే, ముక్కు కాడికి వచ్చేసరికి పక్కకు జరిపేస్తాము. ముక్కుతో మనం అది పీల్చి చూస్తాము గనక. అంతా కూడా బాగానే ఉంది అని పెదవుల వరకు తెచ్చి ఇలా నోట్లో పెడతాము. అంతలోనే నాలుక నోట్లో ఇలా పెట్టిన వెంటనే నాలుక దాని యొక్క రుచి చెబుతుంది. ఓ ఛీ ఛీ, ఇంత ఎక్కువ ఉప్పు అయిపోయిందా! కదా, నేను ఎలా నా కడుపులో దించాలి? లేదా ఇంకా వేరే ఏదైనా. అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఈ విధంగా మీరు గమనించండి, అల్లాహు త’ఆలా మనకు ఎన్ని రకాల ఈ తీర్చిదిద్దడం అనే విషయంలోనే ఒక కేవలం మన శరీరంలోనే చూసుకుంటే, మళ్ళీ ఆ తర్వాత ఆ అన్నం ముద్ద మన గొంతు కిందికి దిగడానికి గొంతులో ఎలాంటి ప్రక్రియ ఉన్నది? అక్కడి నుండి మళ్ళీ కిందికి ఎప్పుడైతే వస్తుందో, జీర్ణాశయంలో వెళ్ళే వరకు మధ్యలో ఇంకా ఎక్కడెక్కడ మన యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినవి, మన యొక్క లివర్ కార్యానికి సంబంధించినవి, ఈ విధంగా మీరు చూసుకోండి, ప్రతి ఒక్కటి ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మనం ఒక అన్నం ముద్ద లోపటికి వేస్తే, మన శరీరంలోని ఏ లోపలి, బయటి ఏ ఏ అవయవాలు ఏ రీతిలో పనిచేస్తాయి, ఒక పొందికగా, ఒక మంచి రీతిలో? అల్లాహు అక్బర్. నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. అందుకొరకే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఒక చోట ఏమంటున్నాడు? ‘వఫీ అన్ఫుసికుం అఫలా తుబ్సిరూన్’ ఏమిటి మీరు మీ యొక్క స్వయం మీ శరీరంలోనే గమనించరా? అల్లాహ్ యొక్క సృష్టి ప్రక్రియను మీరు గ్రహించండి.

ఖద్దర తఖ్దీర్ విషయం కూడా ఉన్నది, మరియు మనిషికి ఏ ఏ అవసరాలు ఏ రీతిలో నిర్ధారించాడో అల్లాహు త’ఆలా నిర్ధారించాడు. మనం మనుషులము గనుక నేను మనిషి యొక్క ఉదాహరణ ముందుగా చెబుతున్నాను, వేరే ఇంకా సృష్టిరాశుల గురించి చెప్పుకుంటూ వెళ్తే మరి ఈ రెండు ఆయతుల్లోనే ఇంకా గంటల తరబడి సమయం వెళ్ళిపోతుంది.

హదా, ప్రతి ఒక్కరికీ వారి యొక్క హిదాయత్, ఇహలోకంలో వారు ఏ రీతిలో మంచిగా జీవించాలి, పరలోకంలో స్వర్గం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విషయాల యొక్క మార్గదర్శకత్వం కూడా అల్లాహు త’ఆలా చేశాడు. అల్లాహ్ ఈ నాలుగు పనులు చేసిన వాడు కనుక మీరు ఈ అల్లాహ్ యొక్క తస్బీహ్ చేయాలి, ఇంకా వేరే ఎవరి తస్బీహ్ చేయకూడదు. అంతేకాదు,

وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
(వల్లదీ అఖ్రజల్ మర్ఆ`)
మరియు ఆయనే పచ్చిక బయళ్ళను ఉత్పన్నం చేశాడు.

فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
ఆపైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు.

ఎందుకు? మీతో పాటు మీ జంతువులు కూడా, మీరు ఎలాగైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను అనుభవిస్తూ తింటూ త్రాగుతూ హాయిగా ఉన్నారో, మీ సేవకు ఉన్న వేరే జంతువుల కొరకు కూడా అల్లాహు త’ఆలా ఆహారాన్ని పుట్టించాడు. కానీ ఈ పచ్చిక బయళ్ళు మనం ఏవైతే చూస్తామో, స్వయం మన కొరకు ఆహారంగా ఉన్నటువంటి ఈ పంటల విషయం మీరు ఒకసారి చూడండి. బియ్యమైనా, వేరే కూరగాయలైనా, వేరే పప్పు దినుసులైనా, ఇవన్నీ ఏ పచ్చని పైర్ల ద్వారా మనకు లభిస్తాయో, వాటి నుండి మనం ఆ ధాన్యాలు తీసుకున్న వెంటనే, ఆ తర్వాత అది గడ్డిగా అయిపోతుంది కదా? ఆ తర్వాత మళ్ళీ మిగిలినది కూడా నల్లగా అయిపోయి, అక్కడ ఏమైనా ఇంతకుముందు పండిందో లేదో అన్నటువంటి పరిస్థితి ఆ భూమిది అయిపోతుంది.

అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు? ఈ విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు అంటే, ఓ మానవులారా, ఏ రీతిలోనైతే మీరు ఈ పంటలు చూస్తారో, అలాగే మీ యొక్క పరిస్థితి. మీ ఏ నామ నిషాన్, మీ యొక్క ఏ గుర్తు లేకుండా ఉండినది, కానీ మీ తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు. మీరు పెరిగారు, మళ్ళీ చనిపోతారు. చనిపోయిన తర్వాత, ఎలాగైతే ఈ భూమి మొత్తం ఎండిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చినుకులు పడడం ద్వారా ఇక్కడ పచ్చిక బయళ్ళు మనకు కనబడుతున్నాయో, అదే రీతిలో మిమ్మల్ని కూడా అల్లాహు త’ఆలా మరోసారి తప్పకుండా పుట్టిస్తాడు. మరోసారి మిమ్మల్ని అల్లాహ్ పుట్టించడంలో ఎలాంటి సందేహం, ఎలాంటి అనుమానం లేదు. గమనిస్తున్నారా? అందుకొరకే ఈ లాంటి ఈ శక్తి గల అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించాలి. ఆయన యొక్క పవిత్రత మాత్రమే మీరు కొనియాడాలి. మరియు మీరు ఆ అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరినీ ఆరాధించకూడదు. మరియు ఆ అల్లాహ్ తొలిసారి మిమ్మల్ని పుట్టించినట్లుగా, మలిసారి పుట్టించే శక్తి గలవాడు అని కూడా నమ్మాలి.

ఇక ఆ తర్వాత రండి. ఇహలోకంలో పుట్టించి అన్ని రకాల మార్గాలు మీకు సులభం చేసిన ఈ అల్లాహు త’ఆలా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ పుట్టిస్తాడు కదా? అయితే మీ హృదయాలలో విశ్వాసం యొక్క మొలక నాటడానికి, సత్కార్యాల పట్ల పుణ్యం, పుణ్యం యొక్క ప్రేమ కలిగించడానికి, అల్లాహ్ మీ హిదాయత్ కొరకు ఖుర్ఆన్ అవతరింపజేశాడు. అయితే దాని విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాడు అల్లాహు త’ఆలా.

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
(సనుఖ్రిఉక ఫలా తన్సా)
(ఓ ప్రవక్తా!) మేము నిన్ను చదివిస్తాము – మరి నువ్వు దానిని మరువలేవు. (87:6)

إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
(ఇల్లా మాషా అల్లాహ్, ఇన్నహూ యఅ`లముల్ జహ్ర వమా యఖ్ఫా)
అయితే అల్లాహ్ తలచినది మాత్రం (మరువగలవు). ఆయన బహిర్గతమయ్యే దానినీ, గోప్యంగా ఉన్నదానినీ ఎరిగినవాడు. (87:7)

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
(వనుయస్సిరుక లిల్ యుస్రా)
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.(87:8)

ఈ మూడు ఆయతులు గుర్తున్నాయి కదా? శ్రద్ధగా వినండి. ఈ మూడు ఆయతుల యొక్క భావాన్ని, ఈ మూడు ఆయతుల యొక్క అనువాదం, ఈ మూడు ఆయతుల యొక్క సంక్షిప్త వ్యాఖ్యానాన్ని.

ఇందులో స్పష్టమైన మనకు అనువాదంలో కనబడుతున్న రీతిలో మనం చూస్తే, ఎలాంటి అనుమానం లేకుండా ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఏంటి? ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరిస్తున్నప్పుడు, శ్రద్ధ వినండి, అర్థం చేసుకోండి. ఈ మూడు ఆయతుల భావాలు ఏవైతే ఉన్నాయో, అందులో రెండు మాటలు నేను తెలియజేస్తున్నాను కనుక మీరు శ్రద్ధగా వింటే మాట మంచిగా అర్థమవుతుంది. ఆయతు నెంబర్ ఆరు, ఏడు, ఎనిమిది. ఇక్కడ అరబీ ఆయతులకు తెలుగు అనువాదం ఏదైతే ఉందో, దాని ప్రకారంగా బాహ్యమైన అర్థం ఒకటి ఏమిటి?

మేము నిన్ను చదివిస్తాము మరి నువ్వు మరువలేవు. అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. ఆయన బహిర్గతమయ్యే దానిని, గోప్యంగా ఉన్న దానిని ఎరిగిన వాడు. మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.

దీని యొక్క బాహ్యమైన అర్థం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో, నాకు అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ఏదైతే ప్రసాదిస్తున్నాడో, నేను మరువకూడదు, నేను ఎల్లవేళల్లో నేను బ్రతికి ఉన్నంతవరకు నాకు ఈ ఆయతులు కంఠస్థం ఉండడానికి నేను మంచిగా గుర్తు చేసుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట వెంటనే చదువుతూ ఉండేవారు. దీని ప్రస్తావన మనకు ఇక్కడ ఏదైతే సూరతుల్ ఆ`లాలో చూస్తున్నారో, అదే కాకుండా మనకు సూరతుల్ ఖియామాలో కూడా కనబడుతుంది ఈ విషయం. మరియు అలాగే ఖుర్ఆన్ లో మరొకచోట కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని చాలా స్పష్టం చేశాడు, బహుశా సూరతుల్ ఇస్రా అనుకుంటా. అయితే ఓ ప్రవక్తా, ఫలా తాజల్, మీరు తొందర పడకండి. ఈ ఖుర్ఆన్ ను నీవు మరిచిపోకుండా భద్రంగా మీ మనసులో ఉండే విధంగా మేము నీకు సహాయపడతాము. ఆ విషయంలో నిన్ను మీకు మేము మీకు సులభతరం ప్రసాదిస్తాము. కనుక మీరు ఎలాంటి చింత లేకుండా మీకు ఎప్పుడైతే ఈ ఖుర్ఆన్ వహీ చేయడం జరుగుతుందో అప్పుడు కేవలం శ్రద్ధగా వినండి అంతే. తర్వాత దాన్ని కంఠస్థం మీ మనసులో, మీ హృదయంలో చేసే విషయంలో మేమే నీకు తోడు పడతాము. మరి నీవు మెల్లగా చదివినా, బహిరంగంగా చదివినా అంతా కూడా అల్లాహ్ కు చాలా మంచిగా తెలుసు.

అయితే ఇక్కడ ఏడవ ఆయతు ప్రారంభంలో ఏముంది? అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. అంటే ఏమిటి ఇది? అల్లాహ్ తలచినప్పుడు కొన్ని ఆయతులు లేదా వాటి భావాన్ని ఏదైతే రద్దు పరుస్తాడో, దాని ప్రస్తావన సూరతుల్ బఖరాలో కూడా వచ్చి ఉంది. ఆ భావం. అది అల్లాహ్ యొక్క ఇష్టం. మనం ఎందుకు అల్లాహ్ ఇలా చేస్తాడు అని అల్లాహ్ ను అడిగే హక్కు మనకు లేదు. ఉదాహరణకు, సూరతున్నూర్ లో మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది, పెళ్లి అయిన వారు వ్యభిచారానికి పాల్పడితే వారిని రాళ్లు రువ్వి చంపాలి అన్నటువంటి ఆదేశం కూడా ఉండింది. అయితే దానికి సంబంధించిన ఆ ఆయతులు కూడా ఉండినవి. అల్లాహు త’ఆలా ఆదేశాన్ని మిగిలి ఉంచాడు హదీసుల ద్వారా. కానీ ఆ ఆయతులు అల్లాహు త’ఆలా ఖుర్ఆన్ లో నుండి తీసేసాడు. అది అల్లాహ్ ఇష్టం.

ఇక సూర బఖరాలో ఉంది అల్లాహ్ తలచుకున్నప్పుడు ఆయతులలో రద్దు చేస్తాడు అన్నది విషయం, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోనే జరిగిపోయింది, ఆ రద్దు అన్నది ఇప్పుడు జరగదు. చూస్తున్నారా సూర బఖరా ఆయతు నెంబర్ 106.

مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

(ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా? (2:106)

أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ

భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌దేననీ, అల్లాహ్‌ తప్ప మరొకరెవరూ మీ రక్షకులూ, సహాయకులూ కారన్న విషయం నీకు తెలియదా? (2:107)

ఈ విధంగా అల్లాహు త’ఆలా తలచుకున్నప్పుడు రద్దు చేయగలుగుతాడు. అతన్ని ఎవరూ కూడా కాదు అనలేరు. కానీ ఈ ఆయతు యొక్క ఈ భావం, ఈ యొక్క బాహ్య భావమే కాకుండా మరొక భావం ఇందులో ఏముంది?

ఇందులో మరొక భావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకమైన అనుగ్రహం, ఆయన మరిచిపోకుండా ఆయన హృదయంలో ఖుర్ఆన్ ఆయతులు నాటుకుపోయి ఉండే విధంగా అల్లాహు త’ఆలా వారికి సహాయపడతాడు. కానీ మనం ఈ ఆయతులు మరిచిపోకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం, మన వంతు త్యాగం, ప్రయాసం మనం చేస్తూ ఉండాలి. ఒకవేళ ప్రయత్నం మనం చేశాము అంటే, ఆయతు నెంబర్ ఎనిమిది గమనించండి, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.

ఇక్కడ సౌలభ్యం అన్నది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? చిన్నపాటి కష్టం ఏదైనా మనం చేసిన తర్వాతనే సౌలభ్యం అన్నది మనకు ఏర్పడుతుంది కదా. అందుకొరకు ఖుర్ఆన్ యాద్ చేయడంలో కూడా మనం కష్టపడాలి. మన సమయాన్ని, మన నిద్రను, మన యొక్క ప్రయత్నాన్ని అందులో వెచ్చించాలి. అప్పుడు అది మనకు అల్లాహ్ యొక్క దయతో ఎంతో సులభతరం ఏర్పడుతుంది.

మరో రకంగా ఇందులో, నేను ప్రారంభంలోనే చెప్పినట్లు, శరీరపరంగా చూసుకుంటే ఇంకా వేరే రకంగా అల్లాహు త’ఆలా మనల్ని ఎంతో మంచిగా తీర్చిదిద్ది, ఎంతో మంచి రీతిలో పుట్టించిన వాడు, ‘ఫహదా’ అని చదివారు కదా, మూడవ ఆయతు చివరిలో ‘ఫహదా’. ఆ హిదాయత్ అల్లాహ్ ఎలా ఇచ్చాడు? ఖుర్ఆన్ ద్వారా, హదీస్ ద్వారా ఇచ్చాడు. కనుక మనం ఈ ఖుర్ఆన్, హదీస్ ను చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉన్న తర్వాత సరిపోతుందా? లేదు, ఇతరులకు బోధ చేస్తూ ఉండాలి.

فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ
కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే, ఉపదేశిస్తూ ఉండు.” (87:9)

అదే విషయం గమనించండి ఆయతు నెంబర్ తొమ్మిదిలో, కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే ఉపదేశిస్తూ ఉండు. ఈ లాభదాయకం అయితే అని ఏదైతే ఇక్కడ ఉన్నదో, లాభదాయకం లేకుంటే వదిలేయ్ అన్నటువంటి భావం కాదు. ఇక్కడ రెండు భావాలు కనీసం గుర్తుంచుకోండి.

ఒకటి, మీరు ఉపదేశం చేస్తూ ఉండండి, ఒకరికి బోధ చేస్తూ ఉండండి, ఈ బోధ అన్నది ఏదో ఒక రీతిలో లాభదాయకంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి విని అర్థం చేసుకొని ఆచరించకపోయినా, చెప్పేవారికి లాభమే కదా అందులో? చెప్పిన పుణ్యం లభిస్తుంది కదా? అవునా కాదా? మరియు రెండో భావం, ఈ ఎవరికైతే మనం చెప్పామో, విన్న వ్యక్తి, అది ఆ సమయంలో అతనికి లాభదాయకంగా ఏర్పడకపోయినా, ఒకానొక రోజు ‘అరే అవును, ఫలానా సమయంలో వాళ్ళు నాకు చెప్పారు కదా’ అన్నటువంటి ఒక సుబూత్, ఒక రుజువు అతని వద్ద ఉంటుంది. ఏదో ఒక రకంగా. కానీ గమనించండి. ఎవరైనా మనకు ఏదైనా ఉపదేశం చేస్తున్నారు, ఆ ఉపదేశం మనకు లాభదాయకం కావాలి అంటే ఏం ఉండాలి మనలో? ఆయతు నెంబర్ 10 గమనించండి.

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ
(సయజ్జక్కరు మయ్ యఖ్షా)
(అల్లాహ్ పట్ల) భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు. (87:10)

చూస్తున్నారా? అందుకొరకే ఒక వ్యక్తి మనకు చెప్పాడు, ‘ఏంటయ్యా, నీవు కొంచెం నమాజ్ లో వెనక ఉన్నావు. ఏంటయ్యా, ఈ తాగుడు మానుకో. ఏంటయ్యా, ఈ పాపాన్ని వదులుకో.’ ‘అరే పోరా పో, నీది నువ్వు చూసుకో. నాకెందుకు చెబుతున్నావ్?’ ఇలా అనకూడదు. ఈ రోజుల్లో చాలా అలవాటు అయిపోయింది కదా ఎంతో మందికి ఇలా చెప్పడం. ఎందుకు? ఒక వ్యక్తి మనకు ఏదైనా ఉపదేశం చేశాడంటే, మనకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేశాడు అతను. అంతేకాదు, అల్లాహ్ మనపై దయ తలిచాడు. మనకు సన్మార్గం చూపించడంలో ఒకరి యొక్క సహాయం అల్లాహ్ మనకు అందించాడు. ఇక నేను ఇలా అడ్డం తిరిగి, ఇలాంటి తప్పుడు సమాధానం ఇచ్చానంటే, నేను అల్లాహ్ యొక్క భయం నా మనసులో లేనట్లే కదా. అర్థమవుతుందా అవతలేదా? అందుకొరకే సూర బఖరాలో ఒక చోట ఏమున్నది? ఎవరైతే అల్లాహ్ తో భయపడండి.

وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ

“అల్లాహ్‌కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం. (2:206)

అల్లాహ్ తో భయపడండి అని అంటే, అతడు విర్రవీగుతాడు. అహంకారానికి గురి అవుతాడు. నాకు చెప్పే వానివి ఎవనివి నువ్వు? అని ఎదురు తిరుగుతాడు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తి ఎవడు? గమనించండి ఆ తర్వాత ఆయతు నెంబర్ 11.

وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
(వయతజన్నబుహల్ అష్ ఖా)
దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాట వేస్తాడు.” (87:11)

ఆ ఉపదేశాన్ని దౌర్భాగ్యుడు మాత్రమే దాటవేస్తాడు. అల్లాహు అక్బర్. ఏంటమ్మా, నువ్వు ఏదో పనికి బయటికి వెళ్తున్నావు కదమ్మా, కొంచెం పరదా చేసుకుంటూ వెళ్ళమ్మా. అల్లాహ్ ది ఈ ఆదేశం ఇచ్చాడు. ‘ఓ మౌల్సాబ్ మీరు మీ పని చూసుకోండి. మాకు ఇదంతా బోధ చేసే అవసరం లేదు.’ ఇలా ఉండకూడదు. ఎవరైనా ఇలా అడ్డం తిరిగారు, ఉపదేశాన్ని గ్రహించలేదు, ఉపదేశాన్ని స్వీకరించలేదు అంటే, నేను కాదండి చెప్పేది, అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి. అతడు అష్ ఖా, మహా దౌర్భాగ్యుడు అయిపోతాడు. ఇంతకుముందే నేను చెప్పాను కదా మీకు, షఖీ అంటే దౌర్భాగ్యుడు. అష్ ఖా అంటే మహా దౌర్భాగ్యుడు లేదా పెద్ద దౌర్భాగ్యుడు లేదా అత్యంత దౌర్భాగ్యుడు. ఈ విధంగా వస్తుంది భావం.

మనం ఇలాంటి ఏమైనా బోధనలు వింటేనే కదండీ మనకు అల్లాహ్ యొక్క భయం ఇంకింత ఎక్కువగా కలిగేది. మరి ఈ విషయాన్ని మనం తిరస్కరించేసాము అంటే, ఎవరైనా మనకు బోధ చేస్తున్నప్పుడు మనం అతని బోధను ఏమాత్రం గమనించకుండా, అర్థం చేసుకోకుండా ఉండేది ఉంటే, వాస్తవానికి మనకు మనం దౌర్భాగ్యాన్ని కొనుక్కున్న వాళ్ళం అయిపోతాము. ఇక ఇలా ఉపదేశాన్ని తిరస్కరించి, ఖుర్ఆన్, హదీసుల మాటలను మనం అర్థం చేసుకోకుండా, చెప్పిన వానికే అడ్డంగా తిరిగి ప్రవర్తించామంటే, దౌర్భాగ్యులైపోయాము. ఈ దౌర్భాగ్యుని పరిస్థితి ఏమవుతుంది? గమనించండి ఆయతు నెంబర్ 12 లో.

الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ
(అల్లదీ యస్లన్-నారల్ కుబ్రా)
వాడు పెద్ద (ఘోరమైన) అగ్నిలోకి ప్రవేశిస్తాడు. (87:12)

వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ కూడా ఇలాంటి ఈ దౌర్భాగ్యం నుండి కాపాడు గాక. అల్లాహు త’ఆలా నరక ప్రవేశం నుండి కూడా మనల్ని కాపాడు గాక. అయితే ప్రతిరోజు కనీసం మూడుసార్లు దువా చేసుకుంటూ ఉండాలి. ‘ఓ అల్లాహ్ నన్ను స్వర్గంలో ప్రవేశించు, ఓ అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు’ అని కనీసం మూడుసార్లు మనం ఇలా దువా చేసుకుంటూ ఉండాలి. ఆ నరకం ఎలాంటిది? అక్కడ శిక్షలు భరించలేక చనిపోదామని మనిషి కోరుకుంటాడు. కానీ,

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
(సుమ్మ లా యమూతు ఫీహా వలా యహ్యా)
వాడందులో చావనైనా చావడు, బ్రతకనైనా బ్రతకడు. (రెంటికీ మధ్య దుర్భరస్థితిలో ఉంటాడు). (87:13)

వాడు అందులో చావనైనా చావడు. చస్తే ఏమవుతుంది? ఈ కష్టాలన్నిటినీ కూడా చూడకుండా ఉంటాము. కానీ చావు రాదు. వలా యహ్యా, బ్రతకనైనా బ్రతకడు. అంటే ఈ శిక్షలను తప్పించుకొని ఏదైనా మంచి బ్రతుకు కూడా దొరకదు. ఏ స్థితిలో ఉంటాడు? కేవలం అనువాదం చదివి ఎవరికైనా కన్ఫ్యూజ్ కాకూడదు అని బ్రాకెట్లో అక్కడ రాశారు, రెంటికీ మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా ఈ నరక శిక్షల నుండి మనందరినీ కూడా కాపాడు గాక.

ఇక్కడ చూస్తున్నారా, మనిషి నరకంలో శిక్షలను భరించలేక ఏమంటాడు? చూడండి ఇక్కడ. సూర నెంబర్ 25, ఆయతు నెంబర్ 13, 14.

وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)

నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్లు, చేతులు బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు, ద’అవ్ హునాలిక సుబూరా, వారు అక్కడ చావు కోసం అరుస్తారు. మాకు చావు రావాలని కోరుకుంటారు.

لَّا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا
(లా తద్ ఉల్ యవ్మ సుబూరవ్ వాహిదవ్ వద్ ఉ సుబూరన్ కసీరా)
“ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి” (అని వారితో అనబడుతుంది). (25:14)

ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి అని వారితో అనబడుతుంది. అంటే ఏంటి? అనేక చావుల కోసం అరిస్తే చావు వస్తుందనా? కాదు. ఇక్కడ మీరు ఇక ఒర్రుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు మీ మాట వినడం జరగదు. ఇహలోకంలో ఎంతమంది మంచి వాళ్ళు వచ్చి మీకు చెబుతూ ఉంటే మీరు ఇలాగే మా మాటలు తిరస్కరించారు కదా.

అలాగే మనం ఇంతకుముందు కూడా చదివి వచ్చాము సూరతుల్ ఇన్షిఖాఖ్ లో ఈ ఆయతు.

وَيَدْعُو ثُبُورًا
(వ యద్ ఉ సుబూరా)
అతను చావు కోసం కేకలు వేస్తాడు. (84:11)

మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు.

وَيَصْلَىٰ سَعِيرًا
(వ యస్లా సఈరా)
మరి (అతను) మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు. (84:12)

إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
(ఇన్నహూ కాన ఫీ అహ్లిహీ మస్రూరా)
ఈ వ్యక్తి (ఇహలోకంలో) తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. (84:13)

ఈ వ్యక్తి ఇహలోకంలో తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. ఈ రోజుల్లో ముస్లింలకు బాధ కలిగిస్తూ తిరిగి వెళ్లి తమ యొక్క గ్యాంగ్ లో, గ్రూప్ లో, తమ యొక్క ఇంటివారు, తమ యొక్క ఫ్రెండ్స్ వారందరికీ ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ తిరుగుతారు కదా. కానీ ప్రళయ దినాన పరిస్థితి చాలా గాంభీర్యంగా ఉంటుంది.

ఇక రండి అల్లాహు త’ఆలా ఈ కొన్ని విషయాలు తెలిపిన తర్వాత మళ్ళీ ఏ రీతిలో మనకు బోధ చేస్తున్నాడో గమనించండి.

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
(ఖద్ అఫ్లహ మన్ తజక్కా)
పవిత్రుడైనవాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు.(87:14)

కచ్చితంగా సాఫల్యం పొందాడు. ఎవరండి? పవిత్రుడైన వాడు. మన్ తజక్కా. ‘తజక్కాపవిత్రత అంటే ఇక్కడ, మనిషి అన్ని రకాల షిర్క్, బిద్’అత్ ల నుండి. తజక్కా, అన్ని రకాల షిర్క్, బిద్’అత్ లకు దూరంగా ఉండాలి. తజక్కా, తన మనసును పరిశుభ్ర పరచుకోవాలి. ఏ కపటము, జిగత్సు, ఎలాంటి అసూయ లాంటి చెడు గుణాలు లేకుండా ఉండాలి.

وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
(వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా)
అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. నమాజు ఆచరించాడు.(87:15)

అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. ఈ విషయంలో కూడా సర్వసామాన్యంగా మన వద్ద చాలా చాలా బద్ధకం ఉన్నది. ధర్మం తెలిసిన వాళ్లలో కూడా. కూర్చుంటూ, లేస్తూ, ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడం, సుబ్ హా నల్లాహ్, అల్హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, ఏదైనా సందర్భంలో ఎవరితోనైనా కలిసినప్పుడు ఆ ఏదైనా మాట సందర్భంలో ఏదైనా విషయం, ఇలాంటి సందర్భాల్లో అల్హందులిల్లాహ్, సుబ్ హా నల్లాహ్, బారకల్లాహు ఫీక్, అహసనల్లాహు ఇలైక్, ఇలాంటి దువాలు ఇచ్చుకుంటూ మనం ఉండడం, అల్లాహ్ ను గుర్తు చేసుకుంటూ ఉండడం ఎల్లవేళల్లో చాలా ముఖ్య విషయం.

అలాగే నమాజ్ ఆచరించాడు. ఆరాధనల్లో కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది గనక అందుకొరకే ఇక్కడ దాని ప్రస్తావన వచ్చింది. ఈ రెండు ఆయతులు, ఆయతు నెంబర్ 14 మరియు 15 ఏదైతే మీరు చూస్తున్నారో, ఇందులో మరొక భావం కూడా ఉంది అని ధర్మవేత్తలు అంటారు. అదేమిటి?

ఈ ఆయతులలో ఈదుల్ ఫితర్, రమజాన్ ముగింపు, సదఖతుల్ ఫితర్, ఈద్ యొక్క నమాజ్, వీటి ప్రస్తావన ఉన్నది అని. ఏ రీతిలో? ఇదే క్రమంలో. మన్ తజక్కా వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా. రమజాన్ ముగించినది, నెలవంక కనబడినది, ఇప్పుడు మనం పండుగ జరుపుకోవాలి అని తెలిసిన వెంటనే తజక్కా, జకాతుల్ ఫితర్ ఇవ్వాలి, సదఖతుల్ ఫితర్ ఇవ్వాలి, ఫిత్రానా చెల్లించాలి. అప్పటి నుండే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఎప్పటి వరకు? పండుగ స్థలానికి చేరుకునే వరకు. ఆ తర్వాత ఖుత్బా కంటే ముందు నమాజ్ అదా చేయాలి. సూరతుల్ ఆ`లాలోని ఆయతు నెంబర్ 14 మరియు 15లో రమజాన్ ముగింపు, నెలవంక వెంటనే జకాతుల్ ఫితర్ చెల్లించడం మరియు అప్పటి నుండే తక్బీర్ చెప్పుకుంటూ ఉండడం, మరుసటి రోజు తెల్లారిన తర్వాత సూర్యోదయం అయ్యాక 15, 20 నిమిషాల తర్వాత నుండి పండుగ నమాజ్ చేయడం ప్రారంభించడం, వీటి ప్రస్తావన ఉన్నది. మరియు సూరతుల్ కౌసర్ లో

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
(ఫసల్లి లిరబ్బిక వన్ హర్)
కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు. (108:2)

ముందు నమాజ్ చేయాలి, ఆ తర్వాత వచ్చి ఖుర్బానీ చేయాలి అన్నటువంటి ప్రస్తావన అందులో ఈదుల్ అద్హాకు సంబంధించిన ఆదేశం ఉన్నది.

ఈ విధంగా అల్లాహు త’ఆలా మనకు అల్లాహ్ మనపై చేసిన అనుగ్రహాలను గుర్తు చేస్తున్నాడు. శారీరక అనుగ్రహాలే కాకుండా మన ఆధ్యాత్మిక, మన యొక్క ఆత్మీయంగా మనకు కావలసిన హిదాయత్ ఖుర్ఆన్, హదీస్ ద్వారా దొరుకుతుంది, దాని గురించి చెప్పిన తర్వాత ఎవరైతే ఈ ఖుర్ఆన్, హదీస్ బోధనలు తిరస్కరిస్తారో వారికి ఈ చెడ్డ స్థానం ఉన్నదో అది తెలిపిన తర్వాత చెడ్డవారు అని చెప్పాడు కదా అల్లాహు త’ఆలా ఇక్కడ అష్ ఖా, అతడు నరకంలో ప్రవేశిస్తాడు అని. అందుకొరకే వెంటనే అల్లాహు త’ఆలా ఇక్కడ అఫ్లహ. దౌర్భాగ్యుడు నరకంలో వెళ్తాడు. మరి ఆ దౌర్భాగ్యునికి భిన్నంగా, ఆపోజిట్ లో ఉండేవాడు ఎవడు? సౌభాగ్యవంతుడు, సాఫల్యం పొందేవాడు. వారి యొక్క గుణాలు ఏంటి? ఇలా ఉంటాయి.

కానీ ఈ రోజుల్లో అనేకమంది తమకు తాము ముస్లింలు అనుకుంటూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు? 16వ ఆయతులో అల్లాహ్ తెలిపాడు.

بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
(బల్ తు`సిరూనల్ హయాతద్-దున్యా)
కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. (87:16)

కానీ మీరు మాత్రం ప్రాముఖ్యతనిస్తున్నారు ప్రాపంచిక జీవితానికి. ఈ రోజుల్లో ఇలాగే జరుగుతుంది కదా మనలో అనేకమంది. కానీ వాస్తవం ఏమిటి?

وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
(వల్-ఆఖిరతు ఖైరువ్-వ అబ్ ఖా)
వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది.(87:17)

ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ. ఇహలోకం ఎప్పటికీ మిగిలి ఉండేది కాదు. ఎప్పటికీ మిగిలి ఉండేది పరలోకం. ఇహలోకం మంచిది ఎప్పుడు? దానిని నీవు పరలోకం మంచి కొరకు ఉపయోగిస్తున్నప్పుడు. ఇహలోకంలో ఉండి పరలోకం గురించి నీవు ఆలోచించకుంటే, నీ ఇహలోకం కూడా పాడే, పరలోకం కూడా పాడైపోతుంది.

إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ
(ఇన్న హాజా లఫిస్-సుహుఫిల్ ఊలా)
ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి. (87:18)

ఈ బోధనలు, ఈ విషయాలు మునుపటి గ్రంథాలలో ఉన్నాయి. ఎవరి గ్రంథాలు?

صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ
(సుహుఫి ఇబ్రాహీమ వమూసా)
(అంటే) ఇబ్రాహీము, మూసాల గ్రంథాలలో! (87:19)

ఈ విధంగా ఇక్కడి వరకు సూరా సమాప్తమైనది. సోదర మహాశయులారా, ఈ సూరాలో మనకు ఉన్నటువంటి బోధనలు ఎంత చక్కగా అల్లాహు త’ఆలా తెలిపాడో అర్థం చేసుకొని, దాని ప్రకారంగానే మీరు ఆచరించే ప్రయత్నం చేయండి.

మీరు అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి నేను మూడు మాటలు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి మీరందరూ కూడా. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఉన్నవారు, తర్వాత ఆన్లైన్ లో వినేవారు, YouTube లో వినేవారు. మొదటి విషయం, ప్రతీ నమాజ్ కొరకు ఒక ప్రారంభ సమయం, ఒక ముగింపు సమయం అనేది ఉంటుంది. ఇక మీరు ఇషా విషయంలో అడిగారు గనక, ఇషా యొక్క సమయం రాజిహ్ ఖౌల్, ప్రియారిటీ ప్రాధాన్యత లభించినటువంటి మాట ఆధారంగా, దేనికైతే ఎక్కువ హదీసులు ఆధారంగా ఉన్నాయో దాని పరంగా ఇషా ముగింపు సమయం అర్ధరాత్రి. ఇక్కడ అర్ధరాత్రి అంటే సర్వసామాన్యంగా రాత్రి 12 గంటలు మిడ్ నైట్ అని అంటారు అలా కాదు. సూర్యాస్తమయం నుండి ఫజర్ ప్రారంభ సమయం వరకు ఎన్ని గంటలు ఉంటాయో అందులో మీరు సగం చేయాలి. ఇది ఒక మొదటి మాట.

రెండో మాట ఏమిటంటే, కొన్ని హదీసుల ఆధారంగా ఫజర్ వరకు కూడా ఇషా సమయం ఉన్నది అని కొందరి అభిప్రాయం ఉన్నది. కానీ ఇంతకుముందే నేను చెప్పినట్టు మొదటి మాటలో రాజిహ్, ప్రాధాన్యత కలిగిన ప్రియారిటీ ఇవ్వబడిన ఆధారాల ప్రకారంగా, ప్రియారిటీ ఇవ్వబడినటువంటి మాట ఏమిటి? అర్ధరాత్రి మాట ఎక్కువ నిజం.

ఇక మూడో మాట, ప్రత్యేకంగా ఇషాకు సంబంధించి కానివ్వండి లేదా ఏ నమాజ్ అయినా, ఏదైనా ధర్మపరమైన కారణం వల్ల మనం ఏదైనా నమాజ్ దాని ముగింపు సమయానికంటే ముందే చేయలేకపోతే, అయ్యో ఇక సమయం అయిపోయింది కదా అని ఊరుకుండేది కాదు. ఆ నమాజ్ ను తప్పకుండా మనం చేయాలి. ఒకవేళ సమయం అయిపోయినప్పటికీ కూడా ఆ నమాజ్ తప్పకుండా చేయాలి. కానీ, సమయం దాటిన తర్వాత చేసిన నమాజ్ యొక్క పుణ్యం, దాని సమయం దాటక ముందే చేసిన నమాజ్ పుణ్యం మరియు నమాజ్ యొక్క దాని తొలి సమయంలో చేసే నమాజ్ పుణ్యం, ఈ మూడిటిలో తేడాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీతో అందరితో ఒక ప్రశ్న అడుగుతున్నాను, మూడు సమయాలు చెప్పాను నేను. ఒక మనిషి, ఉదాహరణకు ఒక మనిషి ఇషా నమాజ్ దాని తొలి సమయంలో చదివాడు. మరొక మనిషి దాని ఇషా నమాజ్ దాని చివరి సమయంలో చదివాడు. అంటే సమయం దాటక ముందే, ముగింపు కంటే కొంచెం ముందు. మూడో వ్యక్తి సమయం దాటిపోయిన తర్వాత చదివాడు. ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ పుణ్యాలు లభిస్తాయండి?

బారకల్లాహు ఫీ ఇల్మికుం. కరెక్ట్ సమాధానం. మాషాఅల్లాహ్, మాషాఅల్లాహ్. మన ఈ ఆన్లైన్ లో వింటున్న వారు ఏదో బండిపై లేదా బస్సులో లేదా వెహికల్ పై ప్రయాణం చేసుకుంటూ కూడా వింటున్నారు అన్నట్లుగా కనబడుతుంది. జజాకుముల్లాహు ఖైర్ వంట చేసుకుంటూ కూడా, ఇల్లు ఊడ్చుకుంటూ కూడా, బట్టలు ఉతుక్కుంటూ కూడా, మీ పనులు చేసుకుంటూ కూడా మాషాఅల్లాహ్ తబారకల్లాహ్ మీరు ఈ పాఠాలు వింటున్నారు అంటే అల్హందులిల్లాహ్ మంచి విషయం. మీ యొక్క సమయాన్ని ఒక పుణ్య కార్యంలో గడుపుతున్నారు. అయితే ఇషా సమయంకి నమాజ్ కి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించింది కదా?

మీరు అడిగిన దానికి, మీరు ఇంత మాట చెప్పిన దానికి మరొక సలహాగా నేను ఒక మాట చెబుతున్నాను, బహుశా ఇంట్లో ఉండే ప్రతీ స్త్రీకి కానివ్వండి లేదా ఏదైనా నైట్ డ్యూటీ చేసేవారు లేదా కొందరు మధ్యాహ్న డ్యూటీ చేస్తారు, వారి డ్యూటీ అయిపోయేసరికి రాత్రి 11, 12 ఇలా అవుతుంది. అయితే ఆ విషయం ఏంటంటే, ఎవరైనా ఇషా నమాజ్ విషయంలో ప్రత్యేకంగా చాలా అలసిపోవడం వల్ల, చాలా పని ఉండడం వల్ల, చాలా ఇరుకులో చిక్కుకొని ఉన్నారు, ఆ నమాజ్ కొరకు సమయం కలగడం లేదు, అలాంటి వారు ఇషా ప్రాధాన్యత ఇవ్వబడిన సమయం అర్ధరాత్రి అని ఏదైతే తెలుసుకున్నామో, ఆ సమయం దాటక ముందు కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. ఆ తర్వాత దాని యొక్క సున్నత్, విత్ర్, ఇవన్నీ మీరు ఆ తహజ్జుద్ కొరకు లేచినప్పుడు, ఫజర్ కు ముందు లేచినప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు, పాపం ఏమీ లేదు ఇన్షాఅల్లాహ్.

అయితే ఇక్కడ కొందరు ఉలమాలు ఏదైతే పట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు కానీ తెరవకూడదు అని ఏదైతే అన్నారో, తెరవకూడదు అని అంటే అక్కడ భావం, ఆయతులు అరబీలో ఏవైతే రాసి ఉన్నాయో, ఆ ఆయతులు రాసి ఉన్న చోట తమ ఆ చెయ్యి, వేలు పెట్టకుండా ఉంటే మరీ మంచిది అని అంటారు. అది అసలు విషయం. పవిత్రత, పరిశుభ్రంగా లేని సమయంలో ఖురాన్ పట్టుకోకూడదు అని అంటే, ప్రత్యేకంగా ఆయతులు రాసి ఉన్న చోట మన ఆ శరీర భాగం తగలకుండా ఉండడం మంచిది అని అంటారు. కానీ వేరే దాని బైండింగ్ లేదా అది కవర్ లో ఉన్నది, ఆ రీతిలో పట్టుకొని మనం ఎవరికైనా ఇస్తున్నాము, తీసుకుంటున్నాము ఇబ్బంది లేదు అని అంటారు.

నేను మరోసారి చెబుతున్నాను. నేను అక్కడ చెప్పిన ఉదాహరణ ఇచ్చాను నేను, ఏమి ఇచ్చాను? మనం అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా కూడా వ్యక్తపరచాలి. ఆచరణ ద్వారా ఎలా వ్యక్తపరచాలి? ఎన్నో సందర్భాలు ఉండవచ్చు మన జీవితంలో అలాంటివి రావచ్చు. కానీ సర్వసామాన్యంగా అందరికీ తెలుస్తది అని నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. ఏంటి ఉదాహరణ అది? మీరు ఆ జెండా వందనం అని ఏదైతే అంటారో, అది కరెక్ట్ పదం ఏంటో నాకు తెలియదు. సర్వసామాన్యంగా ప్రజలు అంటూ ఉంటారు కానీ, 15th ఆగస్టు లేదా ఇలాంటి సందర్భంలో అక్కడ ఏదైతే జెండా వద్ద మన ఇందిరా గాంధీ లేకుంటే మన గాంధీజీ, నెహ్రూ గారి యొక్క ఫోటోలు ఏదైతే పెడతారో, అక్కడ ఎంతోమంది కొబ్బరికాయ కొడతారు. అయితే మన ముస్లింలలో కొందరు ఏమనుకుంటారు, నేను సుబ్ హా నల్లాహ్ అనుకుంటాను తర్వాత క్షమాపణ కోరుకుంటాను, కానీ ఒక నా టెంకాయ కొట్టేద్దాము. ఇలా టెంకాయ కొట్టడం మన ఆచరణ పరంగా మనం సుబ్ హా నల్లాహ్ కు వ్యతిరేకం చేస్తున్నట్లు. కనుక అలాంటి చోట టెంకాయ కూడా కొట్టకూడదు.

జజాకుముల్లాహు ఖైర, బారకల్లాహు ఫీకుం, కతబల్లాహు అజ్రకుం. అల్లాహు త’ఆలా ఖురాన్ ను మంచిగా అర్థం చేసుకొని, ప్రవక్త హదీసులను చదువుతూ అర్థం చేసుకొని, వాటి ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్, వ ఆఖిరు దావాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44090