
18వ భాగం: (ఆయతులు 60 – 82) – పూర్తి వృత్తాంతము సంక్షిప్తంగా
[43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
19వ భాగం: (ఆయతులు 60 – 62)
20వ భాగం: (ఆయతులు 63 – 70)
21వ భాగం: (ఆయతులు 71 – 78)
22వ భాగం: (ఆయతులు 79 – 82)
సూరా అల్ కహఫ్ (ఆయతులు 60 – 82)
18:60 وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّىٰ أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا
“ఏళ్ళ తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంతవరకూ నేను నడుస్తూనే ఉంటాను” అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు (జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి).
18:61 فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا
తీరా వారిద్దరు సాగర సంగమానికి చేరుకున్నాక, అక్కడ తమ చేపను మరచి పోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది.
18:62 فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبًا
వారుభయులూ ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన (వెంటనున్న) యువకుణ్ణి ఉద్దేశించి, “మా ఉదయ భోజనం తీసుకురా. నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది” అన్నాడు.
18:63 قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ ۚ وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا
దానికతను, “చూశారా (ఎంత పనయిందో)! మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా షైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది” అని వివరించాడు.
18:64 قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَارْتَدَّا عَلَىٰ آثَارِهِمَا قَصَصًا
“(అరె!) మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా!” అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాదచిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు.
18:65 فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا
అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము.
18:66 قَالَ لَهُ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا
మూసా అతనితో, “మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి, నేను మీ వెంట ఉండవచ్చా?” అని అభ్యర్థించాడు.
18:67 قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
దానికతను, “మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేరు.
18:68 وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِ خُبْرًا
“అయినా మీరు మీ జ్ఞానపరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది?” అన్నాడు.
18:69 قَالَ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ صَابِرًا وَلَا أَعْصِي لَكَ أَمْرًا
“అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను” అని (మూసా) సమాధానమిచ్చాడు.
18:70 قَالَ فَإِنِ اتَّبَعْتَنِي فَلَا تَسْأَلْنِي عَن شَيْءٍ حَتَّىٰ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا
“సరే! నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే (బాగా గుర్తుంచుకోండి!) ఏ విషయం గురించైనాసరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంతవరకూ నన్నేమీ అడగకూడదు” అన్నాడతను.
18:71 فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا
వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరినీ ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు.
18:72 قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
“మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా!?” అని (ఖిజరు) అన్నాడు.
18:73 قَالَ لَا تُؤَاخِذْنِي بِمَا نَسِيتُ وَلَا تُرْهِقْنِي مِنْ أَمْرِي عُسْرًا
“నా మరుపుపై నన్ను పట్టుకోకండి. నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి” అని మూసా విన్నవించుకున్నాడు.
18:74 فَانطَلَقَا حَتَّىٰ إِذَا لَقِيَا غُلَامًا فَقَتَلَهُ قَالَ أَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً بِغَيْرِ نَفْسٍ لَّقَدْ جِئْتَ شَيْئًا نُّكْرًا
ఆ తరువాత వారుభయులూ ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతనా అబ్బాయిని చంపేశాడు. “మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణినీ హతమార్చి ఉండలేదుకదా! నిశ్చయంగా మీరు అత్యంత ఘోరకృత్యానికి పాల్పడ్డారు” అని మూసా చెప్పాడు.
18:75 قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
“నా వెంట ఉంటూ మీరు ఏ మాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా?” అని ఆయన అన్నాడు.
18:76 قَالَ إِن سَأَلْتُكَ عَن شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّي عُذْرًا
“ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనయినా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది” అని మూసా ప్రాధేయపడ్డాడు.
18:77 فَانطَلَقَا حَتَّىٰ إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا فَأَبَوْا أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُ ۖ قَالَ لَوْ شِئْتَ لَاتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا
వారిద్దరూ అక్కణ్ణుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను (యధాతథంగా) నిలబెట్టాడు. “మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా!” అని మూసా అన్నాడు.
18:78 قَالَ هَٰذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا
దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు: “ఇక మీకూ- నాకూ మధ్య చీలిక ఏర్పడినట్లే (మన సావాసం చెల్లిపోయింది). మీరు సహించలేకపోయిన ఆ మూడు విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను (వినండి)….”
18:79 أَمَّا السَّفِينَةُ فَكَانَتْ لِمَسَاكِينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَاءَهُم مَّلِكٌ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًا
“ఆ పడవ సంగతి – అది సముద్రంలో పనిచేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పర చాలనుకున్నాను. ఎందుకంటే, ఇంకాస్త ముందుకుపోతే కనిపించిన ప్రతి (మంచి) పడవనూ బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు.
18:80 وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا
“ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది.
18:81 فَأَرَدْنَا أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكَاةً وَأَقْرَبَ رُحْمًا
“అందుకే వారికి వారి ప్రభువు – అతనికి బదులుగా – అతనికన్నా సౌశీల్యవంతుడైన, దయార్ద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము.
18:82 وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنزٌ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًا
“ఇక గోడ సంగతంటారా, ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాధ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాధలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతట నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగివున్న వాస్తవికత ఇదే!”
సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/
ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran
సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf
You must be logged in to post a comment.