స్త్రీలకు సంభందించిన మూడు విషయాలు (హైజ్, ఇస్తిహాజా, నిఫాస్) [వీడియో, టెక్స్ట్ ]

స్త్రీలకు సంభందించిన మూడు విషయాలు (హైజ్, ఇస్తిహాజా, నిఫాస్)
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/TUhsPXUH9zw [10 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మహిళలకు సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాల గురించి వివరించబడింది: హైజ్ (రుతుస్రావం), ఇస్తిహాజా (అనారోగ్య రక్తస్రావం), మరియు నిఫాస్ (ప్రసూతి రక్తస్రావం). హైజ్ అనేది ప్రతి నెలా ఆరోగ్యకరమైన స్త్రీ గర్భాశయం నుండి వచ్చే సాధారణ రక్తస్రావం. దాని కాలపరిమితి, వయస్సు, మరియు ఆ సమయంలో పాటించాల్సిన నిషిద్ధాలు (నమాజ్, ఉపవాసం, సంభోగం వంటివి), అనుమతించబడిన పనుల గురించి చర్చించబడింది. ఇస్తిహాజా అనేది అనారోగ్యం కారణంగా నరాల నుండి వచ్చే అసాధారణ రక్తస్రావం, దీనికి హైజ్ నియమాలు వర్తించవు మరియు ఆరాధనలు కొనసాగించాలి. నిఫాస్ అనేది ప్రసవానంతరం వచ్చే రక్తం, దీనికి గరిష్టంగా 40 రోజుల పరిమితి ఉంటుంది మరియు హైజ్‌కు సంబంధించిన నియమాలే వర్తిస్తాయి. ఈ మూడు స్థితుల మధ్య తేడాలను, వాటికి సంబంధించిన ధార్మిక విధులను మరియు మినహాయింపులను స్పష్టంగా తెలియజేయడం ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. దైవభీతిపరులకే శుభపరిణామం. ప్రవక్తలలో శ్రేష్ఠుడైన ఆయనపై, ప్రళయదినం వరకు ఉత్తమరీతిలో వారిని అనుసరించేవారిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం స్త్రీలకి సంబంధించిన మూడు విషయాలు, హైజ్, ఇస్తిహాజా మరియు నిఫాస్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం.

హైజ్ అంటే స్త్రీలకు ప్రతినెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు. హైజ్ రక్తం నలుపు రంగులో, చిక్కగా ఎరుపు రంగు ఆవరించినట్లుగా ఉంటుందని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హైజ్ రక్తం స్త్రీ గర్భాశయం నుండి వెలువడుతుంది. అంటే హైజ్ అనేది గర్భం నుంచి వస్తుంది గనక ఇది ఆరోగ్యానికి చిహ్నం. ఆరోగ్యవంతులకు ఆరోగ్యంగా ఉన్నవారికి ప్రతి నెలా ఇది గర్భం నుండి వచ్చే రక్తం.

ఇస్తిహాజా అంటే నిరంతర రక్తస్రావం. ఈ రక్తపు రంగు, వాసన హైజ్ రక్తానికి భిన్నంగా ఉంటుంది. అంటే స్త్రీకి బహిష్టు కాలం తర్వాత కూడా స్రవిస్తూ ఉండే రక్తాన్ని ఇస్తిహాజా అని అంటారు. ఇస్తిహాజా రక్తం నరాల నుండి వస్తుంది, గర్భం నుండి కాదు.

ఇక మూడవది నిఫాస్. నిఫాస్ అంటే పురిటి రక్తస్రావం. గర్భిణి ప్రసవించినప్పుడు లేక దానికంటే ముందు వెలువడే రక్తాన్ని నిఫాస్ అంటారు.

ఇప్పుడు మనం హైజ్ అంటే ఏమిటి, ఇస్తిహాజా అంటే ఏమిటి, నిఫాస్ అంటే ఏమిటి, వాటి యొక్క నిర్వచనాలు తెలుసుకున్నాం.

హైజ్ సమయం. సాధారణంగా హైజ్ తొమ్మిది సంవత్సరాల వయసు నుండి ప్రారంభమై 50 సంవత్సరాల వరకు అవుతూ ఉంటుంది.

దీని వ్యవధి, అంటే ప్రతి నెలా ఎన్ని రోజులు వస్తుందంటే, అల్పంగా ఒక్క పగలు, ఒక్క రాత్రి అంటే 24 గంటలు అన్నమాట. సాధారణంగా ఐదు లేక ఆరు లేక ఏడు రోజులు. ఇది సాధారణమైన వ్యవధి. అధికంగా 15 రోజులు వస్తుంది. ఒకవేళ ఎవరికైనా 15 రోజుల కంటే ఎక్కువగా వస్తే అది ఇస్తిహాజాగా పరిగణించబడుతుంది. అది ఇస్తిహాజా అయిపోతుంది, హైజ్ అవ్వదు. 15 కంటే ఎక్కువ అయితే అది ఇస్తిహాజా.

నిషిద్ధాలు ఏమిటి? హైజ్ ఆ స్థితిలో, హైజ్ వచ్చే సమయంలో నిషిద్ధాలు ఏమిటి? నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు, తవాఫ్ చేయకూడదు, మస్జిద్ లో ఉండకూడదు, సంభోగం చేయకూడదు, ఖురాన్ ని ముట్టుకోకూడదు. దేనిలోనైనా చుట్టి ఉన్నట్లయితే పట్టుకోవచ్చు. ఈ ఆరు విషయాలు నిషిద్ధం. ఇక ఏడవది కూడా ఉంది, ఒకవేళ భర్త విడాకులు ఇవ్వాలనుకుంటే హైజ్ సమయంలో విడాకులు ఇవ్వటం ధర్మసమ్మతం కాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.

ఇక హైజ్‌కి సంబంధించిన నియమ నిబంధనలు. ఈ హైజ్ అనేది విడాకుల ఇద్దత్ సమయం, గడువు, భర్త చనిపోయిన స్త్రీల ఇద్దత్ సమయం నిర్ధారించబడుతుంది ఈ హైజ్ వలన. ఈ నెలసరి క్రమం వలన. అలాగే దినచర్యలు కొనసాగించాలి. సంభోగం తప్ప ప్రతి పని చేయవచ్చు. సంభోగం తప్ప ప్రతి పని చేయవచ్చు. ముట్టుకోవటం, పట్టుకోవటం, పక్కన కూర్చోవటం, కలిసి పడుకోవటం భర్తతో, ఇవన్నీ చేయవచ్చు. ఇస్లాంలో ఎటువంటి ఇది పట్టింపులు లేవు. ఆ సమయంలో దూరంగా ఉండాలి, పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, తాకకూడదు, హీనంగా చూడాలి, ఇది ఇస్లాం ఖండిస్తుంది. సంభోగం తప్ప అన్ని పనులు చేయవచ్చు. మాట్లాడటం, భర్త అయితే ముద్దు పెట్టుకోవటం, పట్టుకోవటం, కలిసి మెలిసి పడుకోవటం, భోజనం వంట తయారు చేయటం, కలిసి భుజించటం, అన్ని పనులు చేసుకోవటం, ఇవన్నీ చేయవచ్చు. నిషిద్ధాలు ఏమిటి? ఆరాధన నిషిద్ధం. నమాజు, తవాఫ్, ఖురాన్ పట్టుకోవటం,మస్జిద్ లో ఉండటం ఇవి నిషిద్ధాలు. అయితే జికర్ చేయవచ్చు, దుఆ చేయవచ్చు.

ఇవి హైజ్‌కి సంబంధించిన కొన్ని విషయాలు.

ఇక ఇస్తిహాదా ఇది హైజ్ కాదు కదా. హైజ్ గర్భం నుంచి వస్తుంది, ఇస్తిహాజా నరం నుంచి వస్తుంది. అంటే ఇస్తిహాదా ఒక రకంగా అనారోగ్యానికి సంబంధించిన రక్తం. అనారోగ్యం మూలంగా వచ్చే రక్తం ఇస్తిహాజా. అందుకు ఇస్తిహాజా వలన ఎటువంటి నియమాలు లేవు. ఇస్తిహాజాకి సమయం కూడా లేదు. ఏ సమయంలో వస్తుంది, తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. అలాగే ప్రత్యేక వ్యవధి కూడా లేదు. ఎన్ని రోజులు వస్తుంది తెలియదు, ఒక రోజు రావచ్చు, 20 రోజులు రావచ్చు, 10 రోజులు రావచ్చు. దీనికి ఏ కట్టుబాట్లు లేవు. అన్ని ఇస్లామీయ చర్యలకు అనుమతి ఉంది. నమాజ్ చేయాలి, ఉపవాసం కూడా పాటించాలి, సంభోగం కూడా చేసుకోవచ్చు భర్తతో. అన్నీ. ఎందుకంటే ఇస్తిహాదా హైజ్ కాదు. హైజ్‌కే అవి నిషిద్ధాలు. ఆ సమయంలో సంభోగం చేయకూడదు. అప్పుడు నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు. ఇవన్నీ హైజ్‌కి సంబంధించిన విషయాలు, ఆదేశాలు, నియమ నిషిద్ధాలు. ఎందుకంటే హైజ్ గర్భం నుంచి వస్తుంది. కానీ ఇస్తిహాజా నరాల నుంచి వస్తుంది గనుక అది అనారోగ్యం గనుక దీనికి హైజ్‌కి సంబంధం లేదు. నమాజు చేయాలి, ఉపవాసం పాటించాలి, అన్నీ చేయవచ్చు. ఎటువంటి కట్టుబాట్లు ఉండవు. కాకపోతే ప్రతి నమాజ్ కోసం ప్రత్యేకంగా వుజూ చేసుకోవాలి.

ఇక చివరిది నిఫాస్. దీని సమయం బిడ్డ పుట్టినప్పుడు లేదా దానికి ఒకటి, రెండు, మూడు రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే రక్తస్రావాన్ని నిఫాస్ అంటారు.

దీని వ్యవధి ఏమిటి? అధికంగా 40 రోజులు. అంతకంటే ఎక్కువ రోజులు వస్తే అది ఇస్తిహాజా. అల్పంగా వ్యవధి లేదు. ఒక రోజు రావచ్చు, ఒక వారం రావచ్చు, 10-15 రోజుల్లో రావచ్చు ఆ తర్వాత ఆగిపోవచ్చు. అధికంగా 40 రోజులు. ఆ తర్వాత కూడా కంటిన్యూ వస్తే అది ఇస్తిహాజా అవుతుంది. అల్పంగా దానికి వ్యవధి లేదు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు.

నిషిద్ధాలు ఏమిటి? హైజ్‌కి సంబంధించిన నిషిద్ధాలే నిఫాస్‌కి కూడా వర్తిస్తాయి. ఏ నిషిద్ధాలు హైజ్‌లో ఉన్నాయో అంటే నమాజ్ చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు, తవాఫ్ చేయకూడదు, మస్జిద్‌లో ఉండకూడదు, సంభోగం చేయకూడదు, ఖురాన్‌ని ముట్టుకోకూడదు, ఈ నిషిద్ధాలే నిఫాస్‌కి కూడా వర్తిస్తాయి.

నిబంధనలు ఏమిటి? తన దినచర్యలు చేసుకోవాలి, సంభోగం తప్ప అన్నీ చేయవచ్చు.

అభిమాన సోదర సోదరీమణులారా, ఇవి కొన్ని విషయాలు హైజ్, ఇస్తిహాదా మరియు నిఫాస్‌కి సంబంధించిన.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ సున్నత్ విధానంగా, ఇస్లామీయ ఆరాధనలు, ఇస్లామీయ జీవన విధానం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలు, ప్రవచనాలు, ఆయన సున్నత్ విధానాన్ని పాటిస్తూ జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ మరింత జ్ఞానం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42414

ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారిసు చెల్లుతుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 18] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]


ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారిసు చెల్లుతుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 18] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=5Hpmj-eG9oE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. నబీయ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ .అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి అంశం: ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారసు చెల్లుతుంది?

మహాశయులారా ఈ శీర్షిక కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటంటే ఎవరెవరి సిఫారసు ప్రళయ దినాన చెల్లుతుంది అని అల్లాహ్ ఖురాన్ ద్వారా గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా గాని మనకు తెలియజేశారో వాటి పట్ల మన బాధ్యత ఏమిటో అవి కూడా తెలియజేశారు. ఉదాహరణకు ప్రళయ దినాన ఖురాన్ సిఫారసు చేస్తుంది. ఖురాన్ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అని మనకు తెలుసు. అయితే ఖురాన్ ఎవరి పట్ల సిఫారసు చేస్తుంది? ఎవరైతే దానిని ఎల్లవేళల్లో చదువుతూ ఉంటారో, దాని పారాయణం చేస్తూ ఉంటారో, దాని పారాయణంతో పాటు అర్థ భావాలను కూడా అర్థం చేసుకుంటూ వాటిలో యోచిస్తూ ఆచరణలో ఉంచడమే సరిపుచ్చుకోకుండా ఈ ఖురాన్ యొక్క దావత్ ఖురాన్ వైపునకు ఇతరులను కూడా ఆహ్వానిస్తారో మరియు ఏదైనా రోగానికి, అవస్థకు గురి అయినప్పుడు ఖురాన్ ద్వారా స్వస్థత పొందుటకు ఏ ఆయతులు ఏ సందర్భంలో చదవాలో వాటిని పాటిస్తారో, ఈ విధంగా ఖురాన్ చదువుతూ దాని ప్రకారం ఆచరించే వారి పట్ల అది సిఫారసు చేస్తుంది. ఇక ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వారు ఖురాన్ చదవడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపవచ్చు. అలాగే మిగతా విషయాలు కూడా. అందుగురించి ఈ శీర్షికను కూడా వినడం, దీనిని గ్రహించడం చాలా అవసరం. ,

మహాశయులారా! మొట్టమొదటి విషయం ఎవరికైతే ప్రళయ దినాన సిఫారసు చేయడానికి అర్హత కలుగుతుందో వారు మన గౌరవనీయులైన, ప్రియులైన మనందరి ప్రియ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విషయం మనం ఇంతకుముందు భాగంలో కూడా విని ఉన్నాము. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి షఫాఅతె ఉజ్మా ఆ మహా మైదానంలో మకామె మహమూద్ అన్నటువంటి గొప్ప స్థానంలో ప్రశంసనీయబడిన స్థానంలో వారికి ఈ సిఫారసు యొక్క హక్కు లభిస్తుంది. అక్కడ ఆయనకు పోటీ సమానులు ఎవరూ ఉండరు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఒక్క సందర్భంలోనే కాదు వివిధ సందర్భాల్లో సిఫారసు చేసే హక్కు లభిస్తుంది అని కూడా మనం తెలుసుకున్నాము. ఉదాహరణకు నరకంలో పడిపోయిన వారిని వారి తౌహీద్, నమాజ్ ఇలాంటి మంచి కార్యాల వల్ల వారికి బయటికి తీయడం, స్వర్గంలో చేరే ముందు స్వర్గం తెరవబడటానికి సిఫారసు చేయడం. స్వర్గంలో చేరిన వారికి ఎలాంటి శిక్షా మరీ ఎలాంటి లెక్కా తీర్పు లేకుండా స్వర్గంలో పోవడానికి సిఫారసు ఎక్కువ హక్కు. అలాగే స్వర్గంలో చేరిన వారు వారికి ఉన్నత స్థానాలు లభించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడం. ఈ విధంగా ఎన్నో రకాల సిఫారసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారు అని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనం విని ఉన్నాము. అందుగురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకునే అవసరం లేదు అని భావిస్తున్నాను.

సఫర్ నెల [పుస్తకం]

సఫర్ (صفر) మాసం – ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.

ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463) 

సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:

మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.

రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.

ఉపవాసాల నియమాలు | హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) 

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ, إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا, فَلْيَصُمْهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

527. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలో ఎవ్వరూ రమజాన్ కు ముందు ఒకటి లేక రెండు ఉపవాసాలు ఉండకండి. అయితే ఎవరన్నా అంతకు ముందు నుంచి ఉపవాస వ్రతాలు పాటిస్తూ వస్తున్నట్లయితే ఆ రోజు ఉపవాసాన్ని పూర్తిచేసుకోవచ్చు.” (బుఖారీ, ముస్లిం)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَنْ صَامَ اَلْيَوْمَ اَلَّذِي يُشَكُّ فِيهِ فَقَدْ عَصَى أَبَا اَلْقَاسِمِ ‏- صلى الله عليه وسلم ‏-} وَذَكَرَهُ اَلْبُخَارِيُّ تَعْلِيقًا, وَوَصَلَهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ 1‏ .‏

528. హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఎవరయితే సందేహాస్పదమయిన రోజున ఉపవాసం (రోజా) పాటించాడో అతడు అబుల్ ఖాసిం (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అవిధేయత చూపాడు.”

(బుఖారీ దీనిని ‘ముఅల్లఖ్’గా పేర్కొన్నారు. ఐదుగురూ దీనిని ‘మౌసూల్’గా పరిగణించారు. కాగా; ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికంగా ఖరారు చేశారు)

సారాంశం:
ఇస్లామీయ షరియత్ ప్రకారం ఉపవాసాలు మొదలెట్టినా (రమజాన్) నెలవంకను చూసి మొదలెట్టాలి. ఉపవాసాలు విరమించినా (షవ్వాల్) నెలవంకను చూసి మరీ విరమించాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ తేదీన నెలవంక కనిపించకపోతే ఆ మరుసటి రోజు షరియత్ పరంగా సందేహాస్పదమయిన రోజుగా భావించబడుతుంది. ఆ దినాన ఉపవాసం ఉండటం భావ్యం కాదు. ఈ సందర్భంగా ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కలపై ఆధారపడటం కూడా షరియత్ స్ఫూర్తికి విరుద్ధం. ఖగోళ శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు కూడా అనేకసార్లు నిజం కాలేదు.

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا [ قَالَ ]: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا, وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا, فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏ وَلِمُسْلِمٍ: { فَإِنْ أُغْمِيَ عَلَيْكُمْ فَاقْدُرُوا [ لَهُ ] 2‏ .‏ ثَلَاثِينَ } 3‏ .‏ وَلِلْبُخَارِيِّ: { فَأَكْمِلُوا اَلْعِدَّةَ ثَلَاثِينَ } 4‏ .‏

وَلَهُ فِي حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { فَأَكْمِلُوا عِدَّةَ شَعْبَانَ ثَلَاثِينَ } 1‏ .‏

529. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “నెలవంకను చూసిన మీదట మీరు ఉపవాసాలుండండి. (పండుగ కోసం) నెలవంకను చూసిన మీదట ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమయివుంటే లెక్క వేసుకోండి.” (ముత్తఫఖున్ అలైహ్).

‘ముస్లిం’లోని వాక్యం ఇలా వుంది: “ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే 30 రోజుల లెక్క కట్టండి.” బుఖారీలో ఈ విధంగా ఉంది – “మరి 30 రోజాల లెక్కను పూర్తిచేయండి.” బుఖారీలోనే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా వుంది: ‘మరి మీరు షాబాన్ నెలలోని 30 రోజులను గణించండి.’

మొహర్రం మాసం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులు | జాదుల్ ఖతీబ్

మొహర్రం మాసంలో ప్రత్యేకించి జరిగే దౌర్జన్యాలలో ఒకటి ఏమిటంటే – దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యులైన సహాబాల గురించి చెడుగా పలకడం మరియు వారిని తిట్టి పోయడం. వాస్తవానికి ప్రవక్త సహచరులను గూర్చి చెడు పలకడం, వారిని దుర్భాషలాడడం అనేవి పూర్తిగా నిషేధించ బడ్డాయి. 

ప్రవక్త సహచరులను గూర్చి ‘అహ్లె సున్నత్ వల్ జమాత్’ యొక్క విశ్వాసాన్ని గూర్చి వివరిస్తూ ఇమామ్ తహావి (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు: 

మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను ప్రేమిస్తాము మరియు వారిని ప్రేమించడంలో ఏ ఒక్కరి విషయంలో కూడా అతిశయోక్తిని ప్రదర్శించము. అంతేగాక, ఏ ఒక్కరితో విముక్తిని కూడా ప్రకటించుకోము. సహాబాలను ద్వేషించే ప్రతి వ్యక్తినీ, వారిని చెడుగా చిత్రీకరించే ప్రతి ఒక్కరినీ మేము కూడా ద్వేషిస్తాము. మేమైతే సహాబాలను మంచి తలంపుతో స్మరించు కుంటాము. వారిని ప్రేమిచండం ధర్మం, విశ్వాసం మరియు ఎహసాన్లలో ఓ ముఖ్యభాగం అనీ మరియు వారిని ద్వేషించడం, తిరస్కారానికి (కుఫ్ర్), కాపట్యానికి (నిఫాక్) మరియు అవిధేయతలకు చిహ్నమని భావిస్తాము”. (షరహ్ అఖీదా తహావియ : 467 పేజీ) 

దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సహాబాల మహత్యాన్ని గూర్చి వివరించిన తర్వాత – తిరస్కారులకు (అవిశ్వాసులకు) సహాబాల పట్ల అసహ్యం కలుగుతుంది మరియు ఎల్లప్పుడూ వారి గురించి (మనస్సుల్లో) ద్వేషాగ్ని రగులుకొని వుంటుంది అని సెలవిచ్చాడు. 

అంటే సహాబాలను అసహ్యించుకోవటం, వారి పట్ల ద్వేషభావం కలిగి వుండడం తిరస్కారుల ప్రవృత్తి అన్న మాట. ముస్లిములది కాదు. 

దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట వున్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం కరుణామయులుగానూ వుంటారు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్నీ నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖార విందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో వుంది. ఇంజీలులో (కూడా వీరి ఉపమానం వుంది. అది ఒక పంట పొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తర్వాత అది లావు అయ్యింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించ సాగింది. వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని. వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసివున్నాడు.” (ఫతహ్ : 29) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా తన సహచరుల గురించి దుర్భాషలాడడం నుండి గట్టిగా వారించారు. ఆయన ఇలా ఉద్బోధించారు: 

నా సహచరులను దుర్భాషలాడకండి. నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తివంతుని సాక్షి! మీలో ఎవరైనా ఉహద్ పర్వతమంత బంగారం దానం చేసినా సరే అది వీరి (సహచరులు) ఒక ముద్ లేదా అర ముద్ కు కూడా సమానం కాలేదు”. (ముద్ అంటే ఒక రకమైన కొలత) 

(సహీ బుఖారీ: ఫజాయెల్ అసబున్నబీ : 3673, సహీ ముస్లిం : ఫజాయెల్ సహాబా : 254) 

అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు ) ఇలా అంటూ వుండేవారు : 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను గూర్చి చెడుగా అనకండి. ఎందుకంటే – దైవప్రవక్తతో వారు నిలబడ్డ ఒక్క క్షణం అయినా మీ పూర్తి జీవితపు ఆచరణలకన్నా ఉత్తమమైనది

(ఇబ్నెమాజా : ఫజాయెల్ అసహాబున్నబీ : 162, సహీ ఇబ్నెమాజా లిల్ అల్బానీ : 1/132-133) 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటూ వుండేవారు: 

“మీరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను దుర్భాష లాడకండి. ఎందుకంటే దైవప్రవక్త సహచరులలో ఎవరైనా ఒక్క క్షణం ఆయనతో నిలబడితే ఆ ఒక్క క్షణం కూడా మీ 40 సంవత్సరాల ఆచరణల కన్నా ఉత్తమమైనది.”

(ఇబ్నెబత్తా, సహీ అల్బానీ ఫీ తఖీజ్ షరహ్ అఖీదా తహావియా -469 పేజీ) 

అల్లాహ్ మనందరినీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను ప్రేమించే మరియు వారిని గౌరవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! 

ఈ పోస్ట్ మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్ అనే ఖుత్బా నుండి తీసుకోబడింది
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

మొహర్రం నెల మరియు శోక గీతాలాపన | జాదుల్ ఖతీబ్

మీకు తెలిసే వుంటుంది చాలా మంది మొహర్రం నెలలో, దుఃఖ సూచిత దుస్తులు ధరించి శోక గీతాలాపన చేస్తూ, ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతూ ఛాతీని బాదుకోవడం చేస్తూ వుంటారు. మా దృష్టిలో ఇది కూడా నిషేధించబడ్డ దౌర్జన్యపు ఒక రూపమే. ఈ కార్యాలనుద్దేశించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా సెలవిచ్చారు: 

అజ్ఞానకాలం నాటి నాలుగు ఆచరణలను ఈ అనుచర సమాజం విడనాడడానికి సిద్ధంగా ఉండదు. తమ వంశంపై గర్వపడడం, ఇతరుల వంశాన్ని తక్కువగా భావించడం, నక్షత్రాల ద్వారా అదృష్టాన్ని తెలుసుకోవడం (లేదా వాటి ద్వారా వర్షాన్ని అర్థించడం) మరియు శోకగీతాలాపనలు చేయడం.” (సహీ ముస్లిం – అల్ జనాయెజ్ : 936) 

ఇంకా ఈ విధంగా కూడా ఉద్భోదించారు: 

శోక గీతాలాపన చేసే స్త్రీ తన మరణానికి ముందు గనక తౌబా (పశ్చాతాపం) చెందకపోతే, ప్రళయం రోజు తన శరీరంపై గజ్జి, దురద వ్యాపించి వుండగా, గంధకపు వస్త్రాలు ధరించి వున్న స్థితిలో లేపబడుతుంది.” 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – శోక గీతాలాపనలు వగైరా… చేయడం అనేవి అజ్ఞానపు చేష్టలు మరియు ఇస్లాంతో వీటికేమాత్రం సంబంధం లేదు. అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శోకగీతాలాపన … వగైరా… లాంటి పనులు చేసే వ్యక్తితో తనకే మాత్రం సంబంధం లేదని ప్రకటిస్తూ ఇలా పేర్కొన్నారు: 

తన చెంపలను బాదుకొనేవాడు, వస్త్రాలను చింపుకొనేవాడు, అజ్ఞాన కాలపు కార్యాలను గూర్చి ఘనంగా చర్చించేవాడు, కష్ట సమయాల్లో వినాశనాన్ని, మరణాన్ని కోరుకునేవాడు మాలోని వాడు కాడు.” (సహీ బుఖారీ – అల్ జనాయెజ్ : 1294) 

అబూ దర్ద బిన్ అబూ మూసా అష్రీ (రదియల్లాహు అన్హు) కథనం : అబూ మూసా అష్రీ ఓసారి తీవ్ర అనారోగ్యానికి గురై మూర్చపోయినట్లు అయిపోయారు. ఆయన తల ఆయన సతీమణుల్లో ఒకరి ఒడిలో వుంది. (ఈ స్థితిని చూసి) అమె పెద్దగా ఏడ్వడం ఆరంభించింది. కానీ ఆయన మాత్రం ఆమెకు జవాబు ఇవ్వలేకపోయారు. కాసేపటికి, కాస్త కుదుటపడ్డాక, ఆమె నిర్వాకం చూసి ఇలా సెలవిచ్చారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విముక్తి ప్రకటించుకున్న ప్రతి వ్యక్తితో నేను కూడా విముక్తుణ్ణి. నిస్సందేహంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టే, దుఃఖ, విచార ఘడియల్లో తల గొరికించుకునే మరియు వస్త్రాలు చింపుకొనే స్త్రీ నుండి విముక్తిని ప్రకటించుకున్నారు. (సహీ బుఖారీ – అల్ జనాయెజ్: 1296, ముస్లిం : 1167) 

ఈ హదీసుల ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం, ఛాతీని బాదుకోవడం…. లాంటి పనులు పూర్తిగా నిషేధిం చబడ్డాయి. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ పనులను, వీటిలో లిప్తమైవున్న వారిని గూర్చి తనను తాను పూర్తిగా విముక్తుడిగా, ఏ మాత్రం సంబంధం లేని వానిగా ప్రకటించుకున్నారు. కనుక ముస్లిములందరూ ఇలాంటి దుష్కార్యాలను గూర్చి జాగ్రత్తపడాలి. మరియు (ఒకవేళ లిప్తమై వుంటే) వెంటనే వీటిని మనః పూర్వకంగా త్యజించాలి. 

ప్రియ శ్రోతలారా! 

మొహర్రం మాసంలో శోక గీతాలాపన మరియు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం అనేవి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనవడు హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీర మరణం దృష్ట్యా దుఃఖంలో చేస్తూ వుంటారు. 

ఆయన వీరమరణంపై దుఃఖించని, విచారపడని వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? నిశ్చయంగా ప్రతి ముస్లింకు ఈ విషయంలో దుఃఖం కలుగుతుంది. కానీ, ప్రతి దుఃఖ, విచార ఘడియల్లో ఎలాగైతే సహనం పాటించాలో హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణంపై కూడా అదే విధంగా సంయమనం పాటించాలి. అంతేగాని, శోక గీతాలాపన, ఛాతీని బాదుకోవడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం వంటి అజ్ఞానపు చేష్టలు మాత్రం చేయకూడదు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ

భయ ప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురి చేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనఃస్థయిర్యంతో వుండేవారు, కష్టకాలం దాపురించినపుడు ‘మేమంతా అల్లాహ్ కే చెందిన వారము, అల్లాహ్ వైపునకే మరలిపోవలసినవారము’ అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభువు దయాను గ్రహాలు, కారుణ్యం వున్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే.” (బఖర 2 : 155-157) 

సహనం పాటించే వారికి అల్లాహ్ లెక్కలేనంతగా అనుగ్రహిస్తాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించ బడుతుంది.” (జుమర్ 39 : 10) 

హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) ఒక విశిష్టమైన సహాబి (దైవ ప్రవక్త (స) సహచరుడు) అవడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన మహత్యం గురించి చెప్పాలంటే -ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి చిన్న మరియు ప్రియ కూతురైన ఫాతిమా (రదియల్లాహు  అన్హా) పుత్రులు అన్న ఒక్క విషయమే చాలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆయన మరియు హసన్ (రదియల్లాహు అన్హు ) అంటే వల్ల మాలిన ప్రేమాభిమానాలు వుండేవి. 

అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: ఒక సహాబీ (ప్రవక్త సహచరుడు) నాకు తెలియజేసిన విషయమేమిటంటే – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హసన్ మరియు హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లను తన ఛాతీతో హత్తుకొని ఇలా అన్నారు: ఓ అల్లాహ్! వీరిద్దరినీ నేను ప్రేమిస్తు న్నాను. కనుక నీవు కూడా వీరిని ప్రేమించు”

(ముస్నద్ అహ్మద్ – 38వ సంపుటం 211 పేజీ, నెం. 23133 – సహీ పరంపరతో, తిర్మిజి – బరా బిన్ ఆజిబ్ ఉల్లేఖనం -3782, అస్సహీహ అలా ్బనీ : 2789) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి నుండి బయలుదేరి మా వద్దకు విచ్చేశారు. ఆయనతో పాటు హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లు కూడా వున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ఒకర్ని ముద్దాడితే మరోసారి ఇంకొకర్ని ముద్దాడేవారు. ఇదిచూసి ఓ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు: ఓ దైవప్రవక్తా! మీరు వారిని ప్రేమిస్తారా? దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ- ఎవరైతే వీరిని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించినట్లు. ఇక ఎవరైతే వీరి పట్ల ద్వేషం కలిగి ఉంటారో వారు నా పట్ల కూడా ద్వేషం కలిగి వున్నట్లే. 

(అహ్మద్: 15వ సంపుటం, 42వ పేజీ, నెం. 9673 మరియు 13వ సంపుటం, 26వ పేజీ, నెం.: 7876, ఇబ్నెమాజా సంక్షిప్తం : 143, హసన్ -అల్బానీ) 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఇద్దరు మనువళ్ళను ఎంత గాఢంగా ప్రేమించే వారంటే – తన ప్రసంగాన్ని సయితం ఆపి వారిని లేపడానికి మింబర్ దిగి వచ్చి వారిని లేపి, తిరిగి మింబర్ వేదిక) పైకి వెళ్ళి తన ప్రసంగాన్ని పూర్తి చేసేవారు. 

బరీరా (రదియల్లాహు అన్హా)  కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ప్రసంగిస్తున్నారు. ఈ తరుణంలో హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లు అక్కడికి విచ్చేశారు, వారు ఎరుపు రంగు చొక్కాలు ధరించి వున్నారు. వాటిలో వారు మాటిమాటికీ జారుతూ వున్నారు. ఇది గమనించిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మింబర్ నుండి క్రిందికి దిగి ప్రసంగం ఆపేశారు. వారిద్దరినీ లేపి తన ఒడిలో కూర్చోబెట్టు కున్నారు. తదుపరి వారిని తీసుకొని మింబర్ పై  ఎక్కారు. తిరిగి మాట్లాడుతూ – “అల్లాహ్ సత్యం పలికాడు. నిశ్చయంగా మీ సంపద మరియు మీ సంతానం మీకొక పరీక్ష. నేను వారి స్థితిని చూసి ఆగలేకపోయాను.” అని పలికి తదుపరి తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. (అబూ దావూద్ : 1109, నసాయి : 1413, ఇబ్నెమాజా : 3600, సహీ · అల్బానీ) 

అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తో – ఇహ్రాం స్థితిలో ఎవరైనా ఒక ఈగను చంపితే, దాని గురించి ఆదేశం ఏమిటి? అని అడగబడింది. దానికాయన ఇలా జవాబిచ్చారు: ఇరాక్ వాసులు ఈగను గూర్చి ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనవడి హంతకులు! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మనవళ్ళ గురించి ఇలా సెలవిచ్చారు. “వీరిద్దరూ (హసన్, హుస్సేన్లు) ఈ ప్రపంచంలో నా రెండు పుష్పాలు.” (సహీ బుఖారీ : 3753, 5994) 

సునన్ తిర్మిజి లో ఈ హదీసు పదాలు ఇలా వున్నాయి: 

ఇరాక్ వాసుల్లోని ఓ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు  అన్హు)తో -దోమ రక్తం బట్టలపై అంటుకుంటే దాని గురించిన ఆదేశం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికాయన ఇలా బదులిచ్చారు. ఈ వ్యక్తిని చూడండి! ఇతను దోమ రక్తాన్ని గూర్చి ప్రశ్నిస్తున్నాడు: వాస్తవానికి వీరు (ఇరాక్ వాసులు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ప్రాణమైన ప్రియ మనవడిని హత్య చేశారు. నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట ఇలా సెలవిస్తుండగా విన్నాను: “నిశ్చయంగా హసన్, హుస్సేన్లు ఈ లోకంలో నా రెండు పుష్పాలు.” (తిర్మిజి : 377, సహీ -అల్బానీ) 

హుజైఫా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: 

నిశ్చయంగా ఈ దైవదూత (మొదటిసారి) ఈ రాత్రే భూమిపైకి విచ్చేశాడు. గతంలో ఎప్పుడూ తను భూమిపైకి రాలేదు. అతను అల్లాహ్, నన్ను కలవాలని విన్నవించుకోగా, అల్లాహ్ తనకు ఈ శుభవార్తలు నాకిమ్మని చెప్పి పంపించాడు. అవేమిటంటే – ఫాతిమా (రదియల్లాహు అన్హా ) స్వర్గంలో స్త్రీల నాయకురాలిగా వుంటుంది మరియు హసన్, హుస్సేన్లు స్వర్గంలో యువకులకు నాయకులుగా వుంటారు”. (తిర్మిజీ: 3781, సహీ – అల్బానీ) 

అనస్ (రదియల్లాహు  అన్హు) కథనం: హుస్సేన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఎక్కువగా పోలి వుండేవారు. (సహీ బుఖారీ : 3748) 

ప్రియ శ్రోతలారా! 

ఈ హదీసులన్నింటిలోనూ, హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)ల మహత్యం వివరించబడింది. ఈ హదీసులను దృష్టిలో వుంచుకొనే మేము వీరిద్దరిని ప్రేమిస్తాము మరియు వీరిని ప్రేమించడం విశ్వాసంలో అంతర్భాగం అని తలుస్తాము. అంతేగాక, హుస్సేన్ (రజియల్లాహు అన్హు) వీరమరణం ఒక దురదృష్టకరమైన, విచారకరమైన సంఘటన అని స్వీకరిస్తాం. కానీ, మేము దీని కోసం, శోకగీతాలాపన చేయడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, ఛాతీని బాదుకోవడం లాంటి చర్యలు చేయడాన్ని అనుచితంగానూ, నిషేధంగానూ భావిస్తాము. ఎందుకంటే – ఇంతకు ముందు వివరించినట్లు, స్వయంగా మన ప్రియ దైవప్రవక్తే (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలాంటి చర్యలను నిషేధిం చారు. కనుక, ఈ సంఘటనపై కేవలం సహనం పాటించడం మినహా మనకు వేరే మార్గం లేదు. 

గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే- హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణం గూర్చి జిబ్రాయీల్ (అలైహిస్సలాం) ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు సూచించి వున్నారు. 

ఉమ్మె సలమా (రదియల్లాహు  అన్హా) కథనం : ఓసారి జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు విచ్చేశారు. ఆ సమయంలో హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) నా దగ్గర వున్నారు. అకస్మాత్తుగా ఆయన ఏడ్వడం ప్రారంభించారు. నేనాయన్ని వదిలిపెట్టగా, ఆయన తిన్నగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికెళ్ళి కూర్చున్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో : ఓ ముహమ్మద్ ! మీరితన్ని ప్రేమిస్తారా? అని అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘అవునని’ జవాబిచ్చారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) మాట్లాడుతూ : నిశ్చయంగా మీ అనుచర సమాజం అతి త్వరలో ఇతణ్ణి హత్య చేస్తుంది. మీరు కోరుకుంటే అతను హత్య చేయబడే స్థలం యొక్క మట్టిని మీకు చూపిస్తాను. తదుపరి ఆయన దానిని చూపించారు. అదే ‘కర్బలా’ అనే స్థలం. (అబ్రజ అహ్మద్ ఫీ ఫజాయెల్ సహాబా హసన్ పరంపరతో, 2వ సంపుటం, 782 పేజీ, నెం. 1391) 

కనుక మేము, హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణాన్ని అల్లాహ్ యొక్క విధి వ్రాత అని నమ్ముతాము. ఇలాగే హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) తండ్రి అయిన అలీ (రదియల్లాహు అన్హు ) కూడా అల్లాహ్ విధి వ్రాత ప్రకారం వీరమరణం పొందారు. ఆయనైతే హిజ్రీ  శకం 40వ సంవత్సరంలో రమజాన్ 17వ తేదీ నాడు, శుక్రవారం తెల్లవారుఝామున ఫజర్ నమాజు కోసం వెళు తుండగా వీరమరణం పొందారు! 

ఇదే విధంగా, ఆయనకు ముందు, ఉస్మాన్ (రదియల్లాహు  అన్షు) ను కూడా కొంతమంది దుర్మార్గులు కలిసి అతి భయంకరంగా తుదముట్టించారు. ఆయన హి.శ. 36వ సంవత్సరంలో జిల్  హిజ్జ మాసపు, ఖుర్బానీ దినాలలో అమరగతులయ్యారు. ఆయన కన్నా ముందు, ఉమర్ (రదియల్లాహు అన్హు ) కూడా ఫజర్ నమాజులో దివ్య ఖుర్ఆన్ పఠిస్తూ వీరమరణం పొందారు. వీరందరూ నిస్సందేహంగా హుస్సేన్ (రదియల్లాహు అన్హు) కన్నా ఉత్తములు మరియు వీరి వీరమరణ వృత్తాంతాలు కూడా అత్యంత భయంకరంగా, విచారకరంగా వున్నాయి. కానీ ఈ సంఘటనలన్నింటిపై మనం “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్” అని అనడం తప్ప ఇంకేం చేయగలం! 

ఈ పోస్ట్ మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్ అనే ఖుత్బా నుండి తీసుకోబడింది
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

ముఖ్యమైన అంశాలు 

1) మొహర్రం మాసం ప్రాధాన్యత 
2) నాలుగు నిషిద్ధ మాసాలు మరియు వాటి ప్రత్యేక ఆదేశాలు 
3) దుష్కార్యాల ప్రభావాలు 
4) మొహర్రం నెలలో శోక గీతాలాపన (నోహా) మరియు హాహాకారాలు (మాతం) చేయడం
5) హుస్సేన్ (రదియల్లాహు  అన్హు) వీర మరణం 
6) మొహర్రం మాసం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులు 
7) మొహర్రం మాసంలో ఉపవాసం ప్రాధాన్యత 
8) చరిత్రలో ఆషూరా దినం ప్రాధాన్యత 
9) ఆషూరా దినపు ఉపవాసం ప్రాధాన్యత మరియు మహత్యం 

మొదటి ఖుత్బా 

ప్రియమైన శ్రోతలారా! మొహర్రం మాసం ఒక మహోన్నతమైన పవిత్ర మాసం. ఇది హిజ్రీ సంవత్సరపు మొదటి మాసం అవడమే గాక, నిషేధిత నాలుగు మాసాల్లో ఒకటి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ

యథార్థం ఏమిటంటే, ఆకాశాన్నీ భూమినీ అల్లాహ్ సృష్టించినప్పటి నుండీ, మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు. ఇదే సరైన ధర్మం. కనుక ఈ నాలుగు మాసాల్లో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా 9: 36) 

అంటే – భూమ్యాకాశాలు సృష్టించబడినప్పటి నుండి అల్లాహ్ దృష్టిలో సంవత్సరపు మాసాల సంఖ్య పన్నెండు మాత్రమే. అందులో నాలుగు మాసాలు నిషిద్ధ మాసాలు. మరి ఆ నిషిద్ధ మాసాలు ఏవి? దీనికి సంబంధించిన ఒక హదీసు వినండి! 

అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

సంవత్సరం పన్నెండు మాసాలు కలిగి వుంది. వీటిలో నాలుగు నిషిద్దమైనవి. వాటిలో మూడు మాసాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. అవి జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు మొహర్రం మాసాలు కాగా నాల్గవది జమా దిస్సానీ మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే రజబ్ మాసం.” (సహీ బుఖారీ, తఫ్సీర్- బాబ్ సూరహ్ తౌబా) 

మూడు మాసాలేమో ఒకదాని తర్వాత మరొకటి. నాల్గవది ఒంటరిది. దీనిలో దాగివున్న మర్మం ఏమిటి? హాఫిజ్ ఇబ్నె కసీర్ దీనిలోగల మర్మాన్ని గూర్చి ఇలా వివరించారు. 

హజ్ మాసానికి ముందు వచ్చే జిల్ ఖాదా మాసంలో వారు (అప్పటి ప్రజలు) యుద్ధం చేయడాన్ని పరిత్యజించేవారు. తదుపరి జిల్ హిజ్జ మాసంలో హజ్ చేసేవారు. ఆ తర్వాత, ప్రజలు శాంతియుతంగా తమ తమ ప్రదేశాలకు వెళ్ళగలిగేందుకుగాను ఆ తర్వాతి నెల కూడా నిషిద్దం గావించబడింది. తదుపరి, సంవత్సరపు మధ్య కాలంలో ఇంకో నెల నిషిద్ధం గావించబడింది. తద్వారా ప్రజలు ఉమ్రాహ్ మరియు బైతుల్లాహ్ దర్శనానికి శాంతియుతంగా వెళ్ళి రాగలగడానికి“. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 2/468)

ప్రియ శ్రోతలారా! 

షాబాన్ నెల సగభాగం గడిచి పోయిన తరువాత ఉపవాసం ఉండటం నిషేధం

రచయిత: ముహమ్మద్ సాలిహ్ అల్ – మునజ్జిద్
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, రివ్యూ : నజీర్ అహ్మద్

ప్రశ్న: షాబాన్ నెల సగభాగం గడిచిన పోయిన తర్వాత ఉపవాసం పాటించ వచ్చునా? ఎందుకంటే షాబాన్ నెల సగభాగం తర్వాత ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారని విన్నాను.

అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములూ, కృతజ్ఞతలూ అల్లాహ్ కొరకే.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అబూ దావూద్ (3237), అత్తిర్మిథీ (738) మరియు ఇబ్నె మాజాహ్ (1651) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “షాబాన్ నెల సగభాగం గడిచి పోయిన తరువాత ఉపవాసం ఉండవద్దు.” సహీహ్ అత్తిర్మిథీ, 590 లో దీనిని సహీహ్ హదీథుగా అల్బానీ వర్గీకరించినారు.

షాబాన్ నెల సగభాగం తరువాత అంటే షాబాన్ నెల 15వ తేదీ తరువాత ఉపవాసం పాటించటానికి అనుమతి లేదని ఈ హదీథు సూచిస్తున్నది.

అయితే, ఈ రోజులలో ఉపవాసం పాటించటం అనుమతించబడిందని మరికొన్ని హదీథులు సూచిస్తున్నాయి. ఉదాహరణకు:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అల్ బుఖారీ (1914) మరియు ముస్లిం (1082) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “రమదాన్ నెల ప్రారంభానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు ఉపవాసం ఉంటూ, రమదాన్ నెలారంభం కొరకు ఎదురు చూడకండి, అయితే ఎవరైనా వ్యక్తి అలవాటు ప్రకారం ఉపవాసం ఉంటున్నట్లయితే, అతను ఆ రోజులలో కూడా ఉపవాసం కొనసాగించవచ్చు.”

ప్రతి సోమవారం మరియు గురువారం ఉపవాసం పాటించటం, రోజు విడిచి రోజు ఉపవాసం పాటించటం వంటి అలవాట్లున్న వ్యక్తి కొరకు షాబాన్ నెల సగభాగం తరువాత కూడా ఉపవాసం కొనసాగించే అనుమతి ఉందని ఈ హదీథు సూచిస్తున్నది.

అల్ బుఖారీ (1970) మరియు ముస్లిం (1156) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని రోజులు తప్ప, షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు.” ఇది ముస్లిం గ్రంథంలో ఉల్లేఖించబడిన హదీథు.

అన్నవవి ఇలా పలికినారు: వేరే పదాలలో, “ఆయన షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు. ఆయన కొన్ని రోజులను తప్పించి, షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు.” రెండవ పదసమూహం మొదటి దాన్ని వివరిస్తున్నది మరియు ఇక్కడ ‘మొత్తం’ అనే పదం ‘అధికభాగం’ అనే అర్ధాన్ని సూచిస్తున్నది.

ఈ హదీథు ద్వారా తెలుస్తున్న దేమిటంటే షాబాన్ నెల సగభాగం తరువాత కూడా ఉపవాసం పాటించటానికి అనుమతి ఉన్నది. అయితే ఇది ఎవరైతే షాబాన్ నెల మొదటి సగభాగమంతా ఉపవాసం పాటిస్తూ, తరువాత సగభాగంలో కూడా తమ ఉపవాసం కొనసాగించే వారి కొరకు మాత్రమే. ఈ హదీథులన్నింటినీ పరిశీలించిన తరువాత షఫా ఇలా అన్నారు:

క్రమం తప్పకుండా అలవాటుగా ఉపవాసం ఉంటున్న వారికి లేదా షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగిస్తున్నవారికి తప్ప, ఇతరుల కొరకు షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించే అనుమతి లేదు.

మెజారిటీ పండితులు ‘అనుమతి లేదనటమంటే ఇక్కడ నిషేధించబడటం అంటే హరామ్’ అని అభిప్రాయ పడినారు.

అల్ మజ్మూఅ, 6/399-400; ఫతహ్ అల్ బారీ, 4/129

అల్ రుయానీ వంటి మరికొందరు పండితులు ‘అనుమతి లేదనటమంటే ఇక్కడ హరామ్ కాదని, కేవలం అయిష్టమైనదని అంటే మక్రూహ్’ అని అభిప్రాయ పడినారు.

రియాదుస్సాలెహీన్ లో అన్నవావీ ఇలా తెలిపారు:

“షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగించేవారి కొరకు లేదా ప్రతి సోమవారం మరియు గురువారం (లేదా రోజు విడిచి రోజు) ఉపవాసం ఉండే అలవాటు గలవారి కొరకు తప్ప, షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం ఉంటూ, రమదాన్ కోసం ఎదురు చూడటంపై నిషేధం గురించిన అధ్యాయం.”

షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించడాన్ని నిషేధిస్తున్న హదీథు దయీఫ్ అంటే బలహీనమైన హదీథని మెజారిటి పండితులు అభిప్రాయపడినారు. దీని ఆధారంగా షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించటం మక్రూహ్ కాదని వారు తెలిపినారు.

అల్ హాఫిజ్ ఇలా అన్నారు: షాబాన్ నెల రెండో సగభాగంలో ఐచ్ఛిక ఉపవాసాలు కొనసాగించటానికి అనుమతి ఉందని మెజారిటీ పండితులు తెలిపినారు. దీనిని వ్యతిరేకిస్తున్న హదీథును దయీఫ్ అంటే బలహీనమైన హదీథుగా వారు పేర్కొన్నారు. అది మున్కర్ హదీథని అహ్మద్ మరియు ఇబ్నె మయీన్ తెలిపినారు (ఫతహ్ అల్ బారీ). ఆ హదీథును బలహీనమైన హదీథుగా వర్గీకరించిన వారిలో అల్ బైహఖీ మరియు అల్ తహావీ కూడా ఉన్నారు.

ఈ హదీథు గురించిన ఇమాం అహ్మద్ అభిప్రాయాన్ని తన అల్ ముగ్నీ గ్రంథంలో ఇబ్నె ఖుదామహ్ ఇలా తెలిపినారు:

ఈ హదీథు అంత ప్రామాణికమైనది (సహీహ్) కాదు. మేము అబ్దుర్రహ్మాన్ ఇబ్నె మహ్దీను దీని గురించి అడిగినాము. ఆయన దీనిని సహీహ్ హదీథుగా వర్గీకరించలేదు మరియు ఆయన దానిని నాకు ఉల్లేఖించనూ లేదు. ఆయన ఈ హదీథు గురించి చర్చించకుండా దాటవేసినారు. ఇంకా అహ్మద్ ఇలా అన్నారు, ‘అల్ అలా అనే ఆయన నిజాయితీపరుడు. ఈ ఒక్క హదీథు తప్ప ఆయన ఉల్లేఖించిన ఇతర హదీథులేవీ మున్కర్ కోవలోనికి రాలేదు’.

ఇక్కడ అల్ అలా అంటే అల్ అలా ఇబ్నె అబ్దుర్రహ్మాన్, ఆయన దీనిని తన తండ్రి అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించినారు.

ఈ హదీథును దయీఫ్ అంటే బలహీనమైనదిగా వర్గీకరించిన వారికి జవాబిస్తూ, ‘ముస్లిం నియమాలను అనుసరించి ఈ హదీథు సహీహ్ హదీథు’ అని తన తహ్దీబ్ అల్ సునన్ అనే గ్రంథంలో ఇబ్నె అల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలిపినారు. కేవలం అల్ అలా మాత్రమే ఈ హదీథును ఉల్లేఖించినా, అది హదీథు ప్రామాణికతను తగ్గించదు, ఎందుకంటే ఆయన ‘థిక్కాహ్ అంటే హదీథుశాస్త్ర పరిభాషలో నిజాయితీగా హదీథులను ఉల్లేఖించేవాడు’. తన సహీహ్ గ్రంథంలో ముస్లిం ఆయన నుండి ఆయన తండ్రి అయిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు యొక్క అనేక హదీథులను నమోదు చేసినారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి థిక్కాగా గురించబడిన ఒక వ్యక్తి నుండి అనేక సున్నతులు ఉల్లేఖించబడినాయి, సమాజం వాటిని స్వీకరించినది మరియు అనుసరిస్తున్నది కూడా.

ఆ తరువాత ఆయన ఇలా తెలిపినారు:

ఇక ఈ హదీథుకు మరియు షాబాన్ నెలలో ఉపవాసం పాటించవచ్చని తెలుపుతున్న వేరే హదీథులకు మధ్య వైరుధ్యం ఉందని భావిస్తున్న వారితో – వీటి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు (అని అంటున్నాను). ఆ హదీథులు షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగిస్తున్నవారిని లేదా అలవాటుగా ఉపవాసం ఉంటున్న వారిని గురించి తెలుపుతున్నాయి. అయితే, అల్ అలా తెలిపిన హదీథు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా షాబాన్ నెల సగభాగం దాటిన తరువాత ఉపవాసం ప్రారంభించటం పై ఉన్న నిషేధం గురించి తెలుపుతున్నదే గాని, క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటున్న వ్యక్తి గురించి లేదా షాబాన్ నెల మొదటి నుండి ఉపవాసం కొనసాగిస్తున్న వ్యక్తి గురించి కాదు.

షాబాన్ సగభాగం తరువాత ఉపవాసం ఉండకూడదని తెలుపుతున్న హదీథు గురించి షేఖ్ ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ ను ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చినారు:

షేఖ్ నాసిరుద్దీన్ అల్ బానీ తెలిపినట్లుగా ఇది సహీహ్ హదీథు. షాబాన్ నెల మధ్యనుండి ఉపవాసం ప్రారంభించటానికి అనుమతిలేదనేది దీని అర్థం. కానీ ఒకవేళ ఎవరైనా వ్యక్తి షాబాన్ నెలలో అధికభాగం లేదా షాబాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటున్నట్లయితే, అతను సున్నతును అనుసరిస్తున్నట్లే.

[మజ్మూఅ ఫతావా అల్ షేక్ ఇబ్నె బాజ్, 15/385].

రియాదుస్సాలేహీన్ పై వ్యాఖ్యానిస్తూ షేఖ్ ఇబ్నె ఉథైమిన్ ఇలా పలికినారు (3/394):

ఒకవేళ ఈ హదీథ్ సహీహ్ అయినా సరే, కొందరు పండితులు అర్థం చేసుకున్నట్లుగా దీనిలోని నిషేధం హరామ్ తరగతికి చెందినది కాదు, అది కేవలం మక్రూహ్ మాత్రమే. కానీ ఎవరికైతే క్రమం తప్పకుండా ఉపవాసం ఉండే అలవాటు ఉన్నదో, అలాంటి వారు షాబాన్ నెల సగం భాగం తరువాత కూడా తమ ఉపవాసాల్ని కొనసాగించాలి.

ముగింపు మాట:

అలవాటుగా (సోమవారం, గురువారం, రోజు విడిచి రోజు) ఉపవాసం ఉంటున్న వారి విషయంలో లేదా షాబాన్ నెల మొదటి నుండి ఉపవాసం కొనసాగిస్తున్న వారి విషయంలో తప్ప, రెండో సగభాగంలో ఉపవాసాలు ఉండటానికి అనుమతి లేదు, అది మక్రూహ్ లేదా హరామ్. అసలైన విషయం కేవలం అల్లాహ్ కే తెలుసు.

ఈ నిషేధానికి కారణం ఏమిటంటే, నిరంతరాయంగా ఉపవాసం ఉండటం వలన రమదాన్ ఉపవాసాలు ఉండలేనంతగా బలహీనపడిపోయే అవకాశం ఉంది.

ఒకవేళ షాబాన్ నెలారంభం నుండి ఉపవాసాలు ఉంటున్నట్లయితే, మరీ ఎక్కువగా బలహీన పడిపోవచ్చు కదా అని ఎవరైనా అంటే, దానికి జవాబు – షాబాన్ నెలారంభం నుంచి ఉపవాసాలు ఉంటున్న వ్యక్తికి, ఉపవాసం ఉండటం అలవాటై పోయి ఉంటుంది. కాబట్టి అతనికి ఉపవాసం కొనసాగించటం ఏమంత కష్టంగా అనిపించదు.

అల్ ఖారీ ఇలా పలికినారు: ఇక్కడ నిషేధం అంటే అయిష్టమైనది అంటే మక్రూహ్. అది సమాజం కొరకు ఒక అనుగ్రహం. ఎందుకంటే ఆ ఉపవాసాల వలన రమదాన్ నెల విధి ఉపవాసాలు మంచి శక్తితో ఉండలేనంతగా బలహీన పడిపోవచ్చు. కానీ, షాబాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటున్న వారు, ఉపవాసానికి అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి అది వారి కొరకు కష్టంగా ఉండదు.అసలైన విషయం కేవలం అల్లాహ్ కే తెలుసును.

షాబాన్ నెల (The Month of Shaban) – Main page
షాబాన్ నెలకు సంబంధించిన పుస్తకాలు , ఆడియో, వీడియో , ఖుత్బాలు ..అన్నీ
https://teluguislam.net/2023/02/22/the-month-of-shaban/

రమదాన్ లో, నెలసరిలో ఉన్న స్త్రీ ఫజర్ కంటే కొన్ని నిముషాల ముందే పరిశుద్దురాలైతే.. – షేఖ్ ఉసైమీన్

ప్రశ్న-2 : నెలసరిలో ఉన్న స్త్రీ (ఫజర్ కంటే ముందు) పరిశుద్దురాలైంది. ఫజర్ తరువాత స్నానము చేసి నమాజ్ కూడా చేసింది. ఆ రోజు ఉపవాసాన్ని కూడా పూర్తి చేసింది. అయితే ఆమె ఆ రోజు పాటించిన ఉపవాసానికి బదులుగా మరలా ఉపవాసం పాటించాలనే విధి వుందా?’. ఒక సోదరి. 

జవాబు: ‘ఫజర్’ కంటే ఒక్క నిమిషం ముందు నెలసరిలో ఉన్న స్త్రీ పరిశుద్ధురాలైనా తన పరిశుద్ధత గురించి పూర్తిగా నమ్మకం కలిగివుంటే మరింకా అది రమజాన్ మాసమే అయితే ఆమె పై ఆరోజు ఉపవాసాన్ని పాటించడం విధిగా పరిగణించబడుతుంది. కనుక అమె ఆరోజు పాటించే ఉపవాసం శ్రేయస్కరంగానే భావించబడుతుంది. దానికి బదులు (ఖజా) ఉపవాసం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె పరిశుభ్రతలోనే ఉపవాసం (‘సహరి’ చేసింది) పాటించింది. ఆమె ఒకవేళ ‘ఫజర్’ తరువాత స్నానం చేసినా సరే. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. దీనికి ఉదాహరణ ఏమిటంటే పురుషుడు కామక్రియల వల్ల లేదా వీర్యస్ఖలనానికి గురై (‘సహ్రి’ చేసుకుని) ఫజర్ తరువాత స్నానము చేసినా అతని ఉపవాసం శ్రేయస్కరంగానే పరిగణించ బడుతుంది. 

దీనికి సంబంధించిన మరొక విషయయాన్ని ప్రస్తావించ దలచుచున్నాను : అదేమిటంటే, ‘ఆమె ఉపవాసం పూర్తి చేసుకుని ఇఫ్తార్ చేసిన తరువాత, ఇషా కంటే ముందు ఋతుస్రావానికి గురైతే ఆమె ఆ రోజు ఉపవాసం వృధా అయిపోతుందని’ కొందరు స్త్రీలు భావిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరి కాదు. అంతే కాకుండా ఒక వేళ సూర్యాస్తమయం తరువాత ఒక క్షణం తరువాత ఋతస్రావం ప్రారంభమైనా కూడ ఆమె ఉపవాసం పరిపూర్ణమవుతుంది. 

ఈ ఫత్వా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

రమజాన్ లో ఫజర్ తర్వాత స్త్రీ పరిశుద్ధురాలైతే ఏమి తినకుండా ఉపవాసం ఉండాలా? – షేఖ్ ఉసైమీన్

ప్రశ్న-1: ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే (తరువాత) పరిశుద్ధురాలైతే అన్నపానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా ఆ రోజు ఉపవాసం వుండాలా? మరి ఆమె పాటించే ఆ రోజు ఉపవాసాన్ని లెక్కించబడడం జరుగుతుందా? లేక ఆమె దానికి బదులుగా మరలా ఉపవాసం పాటించవలసి వుంటుందా? 

జవాబు : ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే పరిశుద్ధురాలైతే ఆ రోజు అన్న పానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా వుండటం గురించి ఇస్లామీయ ధార్మిక విద్వాంసుల్లో రెండు అభిప్రాయాలు వున్నాయి. 

1-ఆ రోజు ఆమె ఏమి తినకుండా ఆగిపోవాలి. కాని ఆ రోజు ఉపవాసం లెక్కింపబడదు. దానికి బదులు ఉపవాసం ఉండ వలసి ఉంటుంది.

(ఇమాం అహ్మద్-రహిమహుల్లాహ్ వెల్లడించిన ప్రఖ్యాత అభిప్రాయం) 

2-ఆమెకు ఆ రోజు ఏమి తినకుండా ఉండవలసిన అవసరం లేదు. ఆమె ఆ రోజు ఉపవాసం పాటించడం సరికాదు. ఎందుకంటే ఆ రోజు ఉపవాస ప్రారంభ దశలో ఆమె ఋతుకాలం (సమయం ) లోనే వుంది. అలాంటప్పుడు ఉపవాసం పాటించడం సరికాదు. ఉపవాసమే సరికానప్పుడు అన్న పానియాలకు దూరంగా ఉండటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మరియు ఆ ఆ సమయంలో దాని పవిత్రత, గౌరవాన్ని పాటించవలసిన నిబంధన ఆమెపై లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రారంభ దశలో ఆమె ఉపవాసానికి అనర్హురాలు. అంతే కాకుండా ఆ పరిస్థితుల్లో ఆమెపై ఉపవాసం నిషేధించ బడింది. షరీఅత్ ప్రకారం ఉపవాసం గురించి మాకు తెలిసిన విషయం ఏమంటే అల్లాహ్ ఆరాధన సంకల్పంతో ‘ఫజర్’ నుండి సూర్యస్తమయం (మగ్రిబ్) వరకు అన్నపానియాలు, ఇతరాత్రా తినే, త్రాగే వస్తూవుల నుండి ఆగిపోవాలి. 

దీనిలో రెండో అభిప్రాయం మొదటి కంటే ఉత్తమమైనది. ఏదేమైనా ఈ రెండు అభిప్రాయాల వెలుగులో ఆ రోజు ఉపవాసానికి బదులు (ఖజా*) పాటించవలసి వుంటుంది.

[*] ఖజా: ఏదైన నమాజ్ లేక ఉపవాసం లాంటివి వాటి నిర్ణీత సమయం దాటిపోయి నంతరం మరలా దానిని పాటించడాన్ని అంటారు.

ఈ ఫత్వా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్