సఊది అరేబియాలోని జుల్ఫీ జాలియాత్ వారు సమర్పిస్తున్న మరో నూతన వీడియో వీక్షించండి ప్రళయదినాన త్రాసును నెలకొల్పడం సత్యం, ఎవరి పుణ్యపళ్ళాలు బరువుగా ఉంటాయో వారే స్వర్గంలో చేరేవారు.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ప్రళయ దినాన కర్మలు బరువు వేసే త్రాసు స్థాపించబడుతుంది.
త్రాసు గురించి అల్లాహ్ ఖుర్‌ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَاسِبِينَ
“ప్రళయ దినాన కచ్చితంగా తూచేటటువంటి త్రాసులను మేము ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత ఎవరిపై కూడా రవ్వంత అన్యాయం జరగదు. ఎవరైనా ఒక ఆవగింజకు సమానమైన ఆన్యాయం చేసి ఉన్నా దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాము. లెక్క తీసుకొనుటకు మేమే చాలు.” (21,సూరతుల్ అంబియా: 47)
హజ్రత్ ఇమామ్ ఖుర్‌తుబి (రహిమహుల్లాహ్) ఇలా ప్రవచించారు: “లెక్కలు తీసుకున్న తరువాత కర్మలను తూకం వేస్తారు. వారి పుణ్యాల బరువుకు తగ్గట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. అందుకనే లెక్కలు తీసుకున్న తరువాత కర్మలు తూయబడును. తరువాత వాటి ఆధారంగా మానవులకు (అంతస్తుల) ప్రతిఫలం ప్రసాదించడం జరుగుతుంది.” (తజ్‌కిరతుల్ ఖుర్‌తుబి: 309)
హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన త్రాసులో (కర్మలు) తూకం వేయబడును. ఆ త్రాసు భూమ్యాకాశాలను తూకం వేసేటంత విశాలంగా ఉంటుంది“. *
ఓ ప్రభూ! “దీనిలో ఎవరినీ తూకం వేస్తారు?” అని అల్లాహ్ దూతలు ప్రశ్నించారు. దానికి అల్లాహ్: “నా సృష్టిలో నేను తలచుకున్నవారందరినీ” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ దూతలు: “సుబ్ హానక్! మేము నీకు ఎంతగా ఆరాధించాలో అంతగా ఆరాధించ లేదే!” అని అంటారు.(హాకిమ్, అస్ సహీహ: 941)
*గమనిక: కొందరు త్రాసు అనగా “అల్లాహ్ న్యాయాన్ని స్థాపిస్తాడే తప్ప త్రాసు రూపాంతరము ఉండదనీ భావించారు”. అలా భావించడం సరికాదు. నిజమైన విషయం ఏమంటే! అల్లాహ్ సాక్ష్యాత్తు త్రాసును నిలబెట్టుతాడు. ఇలా మనం విశ్వసించడం వల్ల ఖుర్‌ఆన్, హదీసులలో ప్రచురించబడిఉన్న నిజమైన వాక్యాలకు అనుగుణమైన విశ్వాసం అవుతుంది. కనుక విశ్వాసులందరూ ఆ త్రాసును తప్పక విశ్వసించాలి. మరియు ప్రళయ దినాన దానిలో కర్మలు తూయబడుతాయనీ, దానికి రెండు తూకం వేసే పళ్ళెములు ఒక సరిసమానం చేసే ముళ్లు కూడా ఉందనీ విశ్వసించాలి. ఇంకా దానిలో కర్మలు తూకం వేస్తే పైకీ క్రిందికి ఆ పళ్ళెములు వంగుతాయనీ కూడా విన్వసించాలి. ఇదే ‘“అహ్‌లుస్ సున్నత్ వల్ జమాఅత్” విశ్వాసం.
ఎలాంటి కర్మలను త్రాసులో తూకం వేస్తారు?
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“రెండు వాక్యాలు పలకటానికి చాలా తేలికైనవి, కాని అవి త్రాసులో చాలా బరువైనవి, కరుణామయునికి ఎంతో ప్రియమైనవి. అవి, “సుబ్‌హానల్లాహి వబిహమ్‌దిహి, సుబ్‌హానల్లాహిల్ అజీమ్.” (బుఖారీ,ముస్లిం)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన ప్రజలందరి ముందు నా ఉమ్మత్‌కు చెందిన ఒక వ్యక్తిని కేకలు పెట్టి పిలువడం జరుగుతుంది. తరువాత అతని ముందు తొంభైతొమ్మిది (కర్మల) పత్రాలను తెరిచి పరుస్తారు. ప్రతి పత్రం అతను చూడగలిగినంత దూరం వరకూ (పెద్దదిగా) ఉంటుంది.”
తరువాత అల్లాహ్ అతనితో: “దీని (పాపాల పత్రాలు)లో నీవు చేయని (విషయాలు) ఏమైనా ఉన్నాయనీ చెప్పగలవా?” అని ప్రశ్నిస్తాడు.
అతను: “లేదు నా ప్రభూ!” అని అంటాడు.
మరలా అల్లాహ్ అతనితో: “వాటిని జాగ్రత్తగా రాసేవారు (మున్కర్ నకీర్) నీపై (నీ పత్రాలలో) అన్యాయంగా ఏమైనా రాసారా!”’ అని ప్రశ్నిస్తాడు. తరువాత అతనితో: “నీ వద్ద వాటికి (ఆ పాపాల పత్రాలకు) బదులు పుణ్యాలేమైనా ఉన్నాయా?” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు.
అప్పుడు అతను: లోలోన భయపడుతూ “నా వద్ద (పుణ్యాలు) లేవు” అని అంటాడు.
ఆ తరువాత అల్లాహ్ అతనితో: “ఎందుకు లేవు మా వద్ద నీ పుణ్యం ఒకటుంది. ఈ రోజు మేము ఎవరికీ అన్యాయం చెయ్యబోము” అని అల్లాహ్ (షహాదత్) “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్‌హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”’ పత్రాన్ని అతనికి ప్రసాదిస్తాడు. అతను: (దాన్ని చూసి) “ఓ అల్లాహ్ ఈ ఒక్క పత్రం అన్ని (పాపాల) పత్రాలకు సరిసమానమవుతుందా?” అని ఆశ్చర్యపడుతూ అంటాడు.
తరువాత అల్లాహ్: “ఈ రోజు నీకు ఎలాంటి అన్యాయం జరగదు” అని అంటాడు.
తరువాత “(అతని పాపాల) పత్రాలన్ని ఒక పళ్లెంలో వేస్తారు. మరియు ‘షహాదత్ పత్రం’ మరొక పళ్లెంలో వేస్తారు. ఆ (పాపాల) పత్రాలన్ని తేలికైపోతాయి. షహాదత్ పత్రం (అన్ని పత్రాలపై) బరువైపోతుంది. (ఎందుకంటే) అల్లాహ్ పేరు కంటే (ఎక్కువ) ఏదీ బరువు ఉండదు.”’ (తిర్మిజీ హాకిమ్, సహీహ్ ఇబ్నుమాజ: 3469)
హజ్రత్ అబూ దర్దా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజున త్రాసులో తూకం చేసినప్పుడు ఉత్తమ గుణాలకంటే ఎక్కువ బరువు ఏ విషయము ఉండదు.” (ఇబ్నుమాజ, తిర్మిజీ, హాకిమ్)
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజు ఒక లావుగా బలసిన వ్యక్తి వస్తాడు. అయినా అతను (త్రాసులో) దోమ రెక్కకు సమానం కూడా బరువు ఉండడు. తరువాత ఖుర్‌ఆన్ సూక్తిని ఇలా పఠించారు:
فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا
“ప్రళయం రోజున మేము వారిని ఏ మాత్రము బరువుగా నిలబెట్టము.””(18,సూరతుల్ కహఫ్:105) (బుఖారీ)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రది అల్లాహు అన్హు) కథనం; “ఒక రోజు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మిస్వాక్ చెట్టు నుండి మిస్వాక్‌ను తెంపుకొనే టప్పుడు క్రిందకు (నేలపై) పడిపోయేటట్టు గాలి వీచింది. ఆ పరిస్టితిని చూసి ప్రజలు నవ్వినారు. మీరు ఎందుకు నవ్వుతున్నారనీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. దానికి వారందరూ: ఓ అల్లాహ్ ప్రవక్తా! “ఆయన కాళ్ళు సన్నగా ఉన్నందువలన” అని సమాధానమిచ్చారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో, అతని సాక్షిగా! ప్రళయ దినాన త్రాసులో ఆయన కాళ్ళు ఉహద్ కొండకంటే ఎక్కువ బరువు ఉంటాయి.” (అహ్మద్, ఇర్వావుల్ గలీల్:65)
హజ్రత్ అబూ మాలిక్ అల్ అష్‌అరి (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“పరిశుభ్రత విశ్వాసానికి ఒక షరతు. ఆల్ హమ్‌దులిల్లాహ్ (అనే పదాలు) త్రాసులో నిండిపోతాయి. సుబ్‌హానల్లాహి, వల్ హమ్‌దు లిల్లాహి (అనే పదాలు) భూమ్యాకాశాల మధ్యలో ఉన్న (స్థలమంతా) నిండిపోతాయి.” (ముస్లిం)
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“ఎవరైనా అల్లాహ్‌ను విశ్వసిస్తూ, అతని వాగ్దానాన్ని ధృవీకరిస్తూ, తన గుర్రానికి (ధర్మ పోరాటానికై ఎల్లప్పుడు) సిద్ధంగా ఉంచినట్లయితే, ఆ గుర్రానికి అతను మేత పెట్టినందుకు, నీరు త్రాగించినందుకు, (ఆ గుర్రం) పేడ వేసినందుకు, మూత్ర విసర్జన చేసినందుకు బదులుగా, ప్రళయ దినాన ఆ వ్యక్తి కొరకు త్రాసులో పుణ్యాలు బరువు చేయ బడుతాయి.” (బుఖారి)
[ఇది జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్) గారు రాసిన మరణానంతర జీవితం [పుస్తకం] లో నుండి తీసుకోబడింది]
ఇతరములు:
- అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? – షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్
- మరణానంతర జీవితం [పుస్తకం]
- మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
- పరలోకం – Belief in the Hereafter – The Cooperative office for call and guidance, Riyadh, Saudi Arabia







You must be logged in to post a comment.