మరణాంతర జీవితం – పార్ట్ 14: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది – పార్ట్ 01 [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 14 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 14. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:21 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు? ఏ సందర్భంలో? ఎవరికి లభిస్తుంది? అనే విషయాలు ఈనాటి శీర్షికలో మనం తెలుసుకుందాం.

మహాశయులారా! గత కార్యక్రమంలో మనం మహా మైదానంలో దీర్ఘ కాలాన్ని భరించలేక ప్రజలు అల్లాహ్ అతి త్వరలో తీర్పు చేయడానికి, రావడానికి సిఫారసు కోరుతూ ప్రవక్తల వద్దకు వెళ్తే చివరికి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు చేయడానికి ఒప్పుకుంటారు అన్న విషయాల వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసుల విషయం వచ్చింది కనుక సిఫారసుకు సంబంధించిన ఇతర విషయాలు కూడా మనం కొన్ని తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది.

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. “ప్రతి ప్రవక్తకు అల్లాహ్ (తఆలా) ఒక దుఆ చాన్సు ఇచ్చాడు. తప్పకుండా దానిని స్వీకరిస్తాను అని కూడా వారికి శుభవార్త తెలిపాడు. అయితే గత ప్రవక్తలందరూ కూడా ఆ దుఆ ఇహలోకంలోనే చేసుకున్నారు. అది వారికి స్వీకరించబడినది కూడా. అయితే ఇలాంటి దుఆ నాకు ఏదైతే ఇవ్వడం జరిగిందో నేను నా అనుచర సంఘం యొక్క సిఫారసు ప్రళయ దినాన చేయడానికి నేను అక్కడ గురించి దాచి ఉంచాను. ఇహలోకంలో ఆ దుఆ నేను చేసుకోలేదు. ప్రళయ దినాన నా అనుచర సంఘం యొక్క సిఫారసు చేయడానికి నేను దానిని అలాగే భద్రంగా ఉంచాను“. [సహీ బుఖారీ హదీస్ నెంబర్ 6305]

మహాశయులారా! అంతిమ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి జీవితాన్ని చదవండి. ఆయన సర్వమానవాళి కొరకే కాదు, ఈ సర్వ లోకాల వైపునకు కారుణ్యమూర్తిగా ఏదైతే పంపబడ్డారో, ఆయన తన అనుచర సంఘం గురించి ఇహలోకం లోనే కాదు, పరలోకంలో కూడా ఎంతగా చింతిస్తారో, అక్కడ కూడా వారు నరకంలో పోకుండా ఉండడానికి సిఫారసులు చేయడానికి ఎలా సిద్దం అవుతున్నారో, ఆ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఈ రోజు ప్రజలు తెలుసుకోకుండా ఆయనపై బురద జల్లే ప్రయత్నము ఎందరో చేస్తున్నారు. కానీ మనం మన ముఖాన్ని మీదికి చేసి సూర్యుని వైపునకు ఉమ్మివేస్తే సూర్యునికి ఏదైనా నష్టం చేకూరుతుందా?

మహాశయులారా! ఇలాంటి దయామయ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని, ఆయన బాటను అనుసరించి, ఆయన చూపిన విధానాన్ని అనుసరించి మన జీవితం గడిపితే మనమే ధన్యులం అవుతాము. మరో సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “ప్రళయ దినాన ఎవరైతే ఇహలోకంలో విశ్వాసం ఉండి, కొన్ని ఘోర పాపాలకు గురి అయ్యారో వారికి కూడా నా సిఫారసు లభిస్తుంది“. [సునన్ అబూదావూద్ హదీత్ నెంబర్ 4739]

అయితే ఎవరెవరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు లభించవచ్చునో మరికొన్ని హదీసుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెండవ సందర్భం: సహీ ముస్లిం హదీత్ నెంబర్ 333 లో హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “ప్రళయదినాన తీర్పు మరియు ఆ మహా మైదానంలో జరిగే అటువంటి అన్ని మజిలీలు పూర్తి అయిన తర్వాత ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశం జరుగుతుందో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: నేను స్వర్గం ద్వారానికి వస్తాను, స్వర్గము యొక్క ద్వారం తెరవండి అని అక్కడ నేను కోరతాను. అప్పుడు స్వర్గపు దారం పై ఉన్నటువంటి దాని యొక్క రక్షక భటుడు మీరు ఎవరు? అని అడుగుతాడు. నేను అంటాను “ముహమ్మద్”. అప్పుడు అతను అంటాడు – “నీ గురించే అందరికంటే ముందు ఈ ద్వారం తెరవాలి అని నాకు అనుమతించడం జరిగింది. నాకు చెప్పడం ఆదేశించడం జరిగింది. నీకంటే ముందు ఎవరికొరకు కూడా ఈ ద్వారం తెరవకూడదు“.

మరో ఉల్లేఖనంలో ఉంది. “స్వర్గ ప్రవేశానికై సిఫారసు చేసేవారిలో, అందరికంటే తొలిసారిగా నేనే సిఫారసు చేస్తాను”. ఈ విధంగా గొప్ప సిఫారసు కాకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా స్వర్గపు ద్వారం తెరవడానికి కూడా సిఫారసు చేస్తారు. ఆ తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే ముందు ప్రవేశిస్తారు. వారి తర్వాత వారి యొక్క అనుచరులు ప్రవేశిస్తారు.

మూడవ సందర్భం ఎక్కడైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సిఫారసు చేస్తారో వాటిలో ఒకటి వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ గురుంచి. వారి యొక్క పినతండ్రి అబూ తాలిబ్ చివరి ఘడియ వరకు కూడా, ఆయన మరణ వేదనకు గురి అయ్యే వరకు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కి ఆయన తోడు లభించింది. కానీ ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఇస్లాం ధర్మానికి సపోర్ట్ చేశారు. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ని ఆదుకున్నారు. అల్లాహ్ దయ తర్వాత, ఆయన ఉన్నంత కాలం వరకు ఎన్నో సందర్భాలలో మక్కా యొక్క ముష్రికులు ప్రవక్త గారిని హత్య చేద్దాం అన్నటువంటి దురాలోచనకు కూడా వెనకాడలేదు. కానీ అబూతాలిబ్ ని చూసి వారు ధైర్యం చెయ్యలేక పోయేవారు.

అయితే అబూతాలిబ్ చివరి సమయంలో, మరణ వేదనలో ఉన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అప్పుడు కూడా పినతండ్రి వద్దకు వెళ్లి, మీరు తప్పకుండా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ చదవండి. కనీసం ఒక్కసారైనా చదవండి. నేను అల్లాహ్ వద్ద నీ గురించి సిఫారసు చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఆయన శ్వాస వీడేకి ముందు “నేను నా తాత ముత్తాతల ధర్మంపై ఉన్నాను” అని అంటారు. అందువల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చాలా బాధ కలుగుతుంది. అల్లాహ్ (తఆలా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఒక రకమైన ఓదార్పు ఇస్తారు. ఇది కూడా ఒక రకంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఒక గొప్ప విశిష్టత. అదేమిటంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క సిఫారసు వల్ల అబూతాలిబ్ కి నరకంలోని శిక్షలో కొంచెం తగ్గింపు జరుగుతుంది కానీ నరకంలో నుండి మాత్రం బయటికి రాలేరు. ఆ తగ్గింపు ఏదైతే జరుగుతుందో, అది కూడా ఎంత ఘోరంగా ఉందో, ఒక్కసారి ఆ విషయాన్ని గమనించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బంధువుల వారికి సిఫారసు చేసుకొని కాపాడుకున్నారు అన్నమాట కాదు, [అదే హదీస్ లో సహీ బుఖారీ హదీస్ నెంబర్ 1408 మరియు సహీ ముస్లిం 360] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. “నేను సిఫారసు చేసినందుకు అల్లాహ్ (తఆలా) ఆయన్ని నరకంలోని తక్కువ శిక్ష ఉండే అటువంటి భాగంలో ఏదైతే వేశాడో, ఆ శిక్ష ఎలాంటిది? ఆయన చీలమండలాల వరకు నరకం యొక్క అగ్ని చేరుకుంటే, దాని మూలంగా మెదడు ఉడుకుతున్నట్లుగా, వేడెక్కుతున్నట్లుగా ఆయన భరించలేక పోతారు“.

మహాశయులారా! నాలుగో సందర్భం, ప్రవక్త మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా ఒక సిఫారసు యొక్క హక్కు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, అది ఎలాంటి లెక్క, తీర్పు లేకుండా, శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశించడానికి సిఫారసు చేయడం. దాని యొక్క వివరాలు సహీ బుఖారీ హదీత్ నెంబర్ 4343, సహీ ముస్లిం 287. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ రోజున నేను చాలా సేపటి వరకు సజ్దాలో పడి ఉంటాను. అల్లాహ్ (తఆలా) ఓ మహమ్మద్! నీ తల ఎత్తు అని అంటాడు. నేను తల ఎత్తుతాను. అప్పుడు అల్లాహ్ (తఆలా) ఇది మరోసారి నువ్వు అడుగు. నువ్వు అడుగుతున్న విషయం నీకు ఇవ్వబడుతుంది. మరి నీ సిఫారసు చెయ్యి నీ యొక్క సిఫారసు స్వీకరించబడుతుంది. అప్పుడు నేను నా తలెత్తి ఓ అల్లాహ్! ఓ నా ప్రభువా! నా అనుచర సంఘం, నా అనుచర సంఘం, నా అనుచర సంఘం అని నేను అంటాను. అప్పుడు ఓ మహమ్మద్! నీ అనుచర సంఘంలో ఇంత మందిని ఎలాంటి లెక్క తీర్పు, శిక్ష ఏమి లేకుండా స్వర్గపు యొక్క ద్వారాల్లోని కుడి ద్వారం గుండా వారిని ప్రవేశింప చేయి”. అల్లాహు అక్బర్. అల్లాహ్ నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా ప్రవక్త సిఫారసు నోచుకొని ఆ స్వర్గములోని కుడివైపున ఉన్న మొదటి ద్వారం గుండా ప్రవేశించేటువంటి భాగ్యం ప్రసాదించు గాక.

మహాశయులారా! ఎంత గొప్ప విషయం. అయితే అక్కడే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మరో శుభవార్త ఇస్తాడు. అదేమిటంటే ఎలాంటి శిక్ష, తీర్పు లేకుండా ప్రవేశించేవారు వారికి ప్రత్యేకంగా ఈ ద్వారము, కానీ వారు తలచుకుంటే ఏ ద్వారం గుండానైనా వారు ప్రవేశించవచ్చు.”

ఈ విధంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రత్యేకంగా ఈ నాలుగు రకాల సిఫారసులు ఇవ్వబడతాయి.

ఇవే కాకుండా, ఇంకా వేరే ప్రవక్తలకు కూడా అల్లాహ్ (తఆలా) వేరే సందర్భాలలో సిఫారసు చేసేటటువంటి హక్కు ఇస్తాడు మరియు వారికి సిఫారసు విషయంలో ఒక హద్దును కూడా నిర్ణయించడం జరుగుతుంది. వారు సిఫారసు చేస్తారు, అల్లాహ్ వారి సిఫారసును అంగీకరిస్తాడు కూడా. అలాంటి సిఫారసుల్లో ఒకటి ఎవరైతే విశ్వాసం ఉండి, తౌహీద్ ఉండి మరియు నమాజ్ లు చేస్తూ ఉన్నారో, నమాజ్ ను వీడనాడలేదో, కానీ వేరే కొన్ని పాపాల వల్ల వారిని నరకంలో పడవేయడం జరిగిందో, అల్లాహ్ తలుచుకున్నన్ని రోజులు నరకంలో వారికి శిక్షలు పడిన తరువాత అల్లాహ్ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి మరియు కొందరు ప్రవక్తలకు, మరికొందరు పుణ్యాత్ముల కు సిఫారసు హక్కు ఇస్తాడు. వారి సిఫారసు కారణంగా అల్లాహ్ (తఆలా) ఆ నరకవాసులను నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపిస్తాడు. దీనికి సంబంధించిన హదీత్ లు ఎన్నో ఉన్నాయి.

కానీ సహీ ముస్లిం లో హదీత్ నెంబర్ 269, హజ్రత్ అబూ సయీద్ ఖుధ్రి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రళయ దినాన సిఫారసు హక్కు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి లభిస్తుంది. ప్రవక్తలకు లభిస్తుంది. అంతేకాకుండా పుణ్యాత్ములైన విశ్వాసులు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సిఫారసు చేస్తూ ఉంటారు. “ఓ అల్లాహ్! నరకంలో కొంతమంది పడి ఉన్నారు. వారు మాతో ఉపవాసాలు పాటించేవారు. మాతో పాటు వారు నమాజ్ చేసేవారు. మాతో పాటు వారు హజ్ చేసేవారు. కాని వేరే కొన్ని కారణాల వల్ల, వేరే కొన్ని పాపాల వల్ల నరకంలో వచ్చి పడిఉన్నారు. ఓ అల్లాహ్! వారిని కూడా నీవు నీ దయతో బయటికి తీసేయ్యి అల్లాహ్” అని వారు కోరుతారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది – వారు నమాజ్ చేస్తూ ఉండేవారు గనుక వారు చేసే సజ్దాల యొక్క గుర్తు వారి నొసటిపై ఉంటుంది. ఆ నొసటి భాగాన్ని నరకాగ్నిలో ఏమాత్రం నష్టపరచదు. అల్లాహ్ ఆ సందర్భంలో మీరు ఎవరిని వారిలో గుర్తుపట్ట గలుగుతారో వారిని బయటికి తీయండి. అయితే వారు ఎలా గుర్తుపడతారు? నరకంలో కాలిన తరువాత వారు మారిపోతారు కదా? కానీ తౌహీద్ యొక్క శుభం వల్ల, నమాజు సరైన విధంగా పాటిస్తూ ఉన్నందువల్ల వారి ముఖాలను మాత్రం అగ్ని ఏమాత్రం కాల్చదు. వారి యొక్క ఆ ముఖాలను అగ్ని పై నిషేధింపబడినది గనుక అగ్ని ఆ ముఖాలకు ఎలాంటి నష్టం చేకూర్చలేదు గనుక, వారు తమ స్నేహితులను ఈ విధంగా గుర్తుపడతారు“. [సహీ బుఖారీ లోని హదీత్ లో ఉంది]

అంటే ఏం తెలుస్తుంది దీని ద్వారా? కేవలం కలిమా చదువుకుంటే సరిపోదు, ఏ ఒక్క నమాజ్ ను కూడా విడనాడకూడదు. నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది. అల్లాహ్ దయ తర్వాత, నమాజ్ యొక్క శుభాల వల్లనే వారి యొక్క ముఖాలు నరకములో కాలకుండా, నరకం అగ్నిలో ఉన్నా గానీ, నరక గుండంలో ఉన్నాగాని ఎలాంటి మార్పు అనేది వారి ముఖాల్లో రాదు. అల్లాహు అక్బర్.

ఈ విధంగా ప్రవక్తలు, పుణ్యాత్ములు, ఉత్తమ విశ్వాసులు వారందరూ కలిసి అల్లాహ్ తో సిఫారసు చేసి, ఎంతో పెద్ద సంఖ్యను నరకంలో నుండి బయటికి తీపిస్తారు. ఆ తర్వాత అల్లాహ్ అంటాడు – “దైవదూతలు సిఫారసు చేశారు. ప్రవక్తలు సిఫారసు చేశారు. విశ్వాసులు సిఫారసు చేశారు. ఇక మిగిలి ఉన్నది కేవలం ఆ కరుణామయుడైన, అందరికంటే ఎక్కువగా కరుణించే కృపాశీలుడు మాత్రమే మిగిలి ఉన్నాడు.” అప్పుడు అల్లాహ్ (తఆలా) తన పిడికిలిలో నరకంలో నుండి ఒక పెద్ద సంఖ్యను తీస్తాడు బయటికి. వారు వేరే ఇంకా ఏ సత్కార్యాలు చేయలేక ఉంటారు.

ఈ విధంగా మహాశయులారా! అల్లాహ్ (తఆలా) ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సైతం మిగతా విశ్వాసుల్లో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో వారికి సిఫారసు చేయడానికి అధికారం, హక్కు ఇచ్చి ఉంటాడు. మరియు వారి సిఫారసును స్వీకరించి ఎంతోమంది నరకవాసులను నరకం నుండి బయటికి తీస్తాడు. దీనికి సంబంధించిన మరొక హదీత్ మీరు గమనించండి అందులో ఎంత ముఖ్య విషయం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారో దానిపై దృష్టి వహించండి.

ఈ హదీత్ సునన్ తిర్మిదీ లో ఉంది. హదీస్ నెంబర్ 2441. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “నా ప్రభువు వైపు నుండి నా వద్దకు వచ్చే ఒక వ్యక్తి వచ్చాడు మరియు నాకు ఛాయస్ ఎన్నుకోండి అని చెప్పాడు. ఏమిటి? నీ అనుచర సంఘంలోని సగం మందిని స్వర్గం లో చేర్పిస్తానని లేదా నీకు సిఫారసు యొక్క హక్కు కావాలా? అని. అయితే నేను సిఫారసు యొక్క హక్కు లభిస్తే బాగుంటుంది అని దాన్ని ఎన్నుకున్నాను. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. అయితే ఈ నా సిఫారసు ఎవరికి లభిస్తుంది అంటే ఎవరైతే అల్లాహ్ తో పాటు ఎవరిని భాగస్వామిగా చేయకుండా ఉండే స్థితిలో చనిపోతాడో అలాంటి వానికే నా ఈ సిఫారసు ప్రాప్తమవుతుంది“. అల్లాహు అక్బర్.

ఇంతకు ముందు హదీస్ లో సహీ ముస్లిం లో గమనించారు కదా! వారి యొక్క ముఖాలను అగ్ని ఏమాత్రం కాల్చదు, మార్చదు అని. అది నమాజ్ యొక్క శుభం మరియు ఆ విశ్వాసులు అంటారు – “ఈ నరకవాసులు మాతో నమాజ్ చేసే వారు, హజ్ చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు” అంటే ఈ ఇస్లాం యొక్క ఐదు పునాదులు ఏవైతే ఉన్నాయో “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్” యొక్క సత్యమైన సాక్ష్యం నమాజ్ చేయడం, విధి దానం చెల్లించడం, ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. ఇది ఎంత ప్రాముఖ్యత గల విషయమో గమనించండి.

ఈ శీర్షిక ఇంకా సంపూర్ణం కాలేదు. తర్వాత భాగంలో కూడా దీని కొన్ని మిగతా విషయాలు మనం విందాము. అల్లాహ్ (తఆలా) మనందరికీ ప్రవక్త సిఫారసు ప్రాప్తం చేయు గాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: