597. హజ్రత్ అదీ బిన్ హాతిం (రధి అల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“అతి త్వరలోనే అల్లాహ్ ప్రళయదినాన మీలోని ప్రతివ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు. ఆరోజు అల్లాహ్ కి దాసునికి మధ్య ఎలాంటి అనువాదకుడు ఉండదు. దాసుడు తల పైకెత్తి చూస్తాడు. మొదట తన ముందు ఏదీ కన్పించదు. రెండవసారి మళ్ళీ తలపైకెత్తి చూస్తాడు. అప్పుడతని ముందు ఎటు చూసినా అతనికి స్వాగతం చెబుతూ అగ్నే (భగభగ మండుతూ) కన్పిస్తుంది. అందువల్ల మీలో ఎవరైనా ఖర్జూరపు ముక్కయినా సరే దానం చేసి నరకం నుండి కాపాడుకోగలిగితే కాపాడుకోవాలి.”
హజ్రత్ అదీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారమే మరో సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నరకాన్ని ప్రస్తావిస్తూ “నరకాగ్ని నుండి కాపాడుకోండి” అన్నారు. ఈ మాట చెప్పి ఆయన ముఖం ఓ ప్రక్కకు తిప్పుకున్నారు. (తాను నరకాగ్నిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు) నరకాగ్ని పట్ల భీతి, అసహ్యతలు వెలిబుచ్చారు. ఆ తరువాత తిరిగి ఆయన “నరకాగ్ని నుండి రక్షించుకోండి” అన్నారు. మళ్ళీ నరకాగ్ని పట్ల భీతి, అసహ్యతలు వెలిబుచ్చుతూ ముఖాన్ని ఒక పక్కకు తిప్పుకున్నారు.
ఈ విధంగా ఆయన మూడుసార్లు చేశారు. చివరికి ఆయన నిజంగానే నరకాగ్ని చూస్తున్నారేమోనని మాకు అనుమానం వచ్చింది. ఆ తరువాత ఇలా అన్నారు: “ఓ ఖర్జూరపు ముక్కనయినా సరే దానం చేసి నరకాగ్ని నుండి రక్షించుకోండి. అదీ దొరక్కపోతే ఓ మంచి మాటయినా పలకండి. నోట ఓ మంచిమాట వెలువడటం కూడా దానం (సదఖా) గానే పరిగణించబడుతుంది“.
[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 49 వ అధ్యాయం – మన్నూ ఖిషల్ హిసాబి అజాబ్]
జకాత్ ప్రకరణం – 20 వ అధ్యాయం – దానం నరకానికి అడ్డుగోడగా నిలుస్తుంది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1.
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
You must be logged in to post a comment.