మరణాంతర జీవితం – పార్ట్ 04 : సమాధుల నుండి లేపబడటం, పునరుత్థాన దినంపై విశ్వాసం (పార్ట్ 01) [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 04 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 04. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:55 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలిహందులిల్లాహి వహద వస్సలాతు వస్సలామ్ అలా నబియ్యునా బ’ద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశం లో స్వాగతం.

ఈనాటి శీర్షిక సమాధుల నుండి లేపబడటం

మహాశయులారా! చావు ఎంత నిజమో, సత్యమో, తిరస్కరించలేని విషయమో అంతే అంత కంటే ఎక్కువ నగ్నసత్యం ఏమిటంటే, మనం చనిపోయి సంవత్సరాలు గడిచినా మరోసారి అల్లాహ్ (తఆలా) తప్పకుండా మనల్ని బ్రతికిస్తాడు మరియు తప్పకుండా మనం రెండవసారి జన్మను ఎత్తి అల్లాహ్ ముందు నిలబడేది ఉన్నది ఇహలోకంలో కాదు. ఇప్పుడు చావు వస్తుంది. మనం చనిపోతున్నాము. మన చావుతోనే మన ప్రళయం మనపై సంభవిస్తుంది.

కానీ ఒక రోజు రానుంది. అప్పుడు అల్లాహ్ తఆలా శంఖు ఊదడానికి నియమింపబడిన దూత ఇస్రాఫీల్ (అలైహిస్సలాం)ను ఆదేశిస్తాడు. ఆయన శంఖును పూరిస్తాడు, శంఖును ఊదుతాడు. అందువల్ల ఈ విశ్వమంతా నశించిపోతుంది. వాటి యొక్క ప్రస్తావన సూరతుల్ తక్వీర్, సూరతుల్ ఇన్ఫితార్, సూరతుల్ ఖారిఅహ్, సూరతుల్ జిల్ జాల్ ఇంకా వేరే సూరాలలో కూడా చాలా స్పష్టంగా ఉంది. అయితే ఆ తరువాత అందరికంటే ముందు హజ్రత్ ఇస్రాఫీల్ (అలైహిస్సలాం)ని అల్లాహ్ (తఆలా) బ్రతికిస్తాడు. ఆయన కూడా చనిపోతారు. ఆ తర్వాత అల్లాహ్ మళ్ళీ ఆయనలో జీవం పోసి ఆయన్ని బ్రతికిస్తాడు. ఆయనకు ఆదేశం ఇస్తాడు – మరోసారి శంఖు ఉదాలని. ఆయన మరోసారి శంఖు ఊదుతాడు. అప్పుడు ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు ఈ విశ్వమంతా నాశనం అయ్యే వరకు ఎందరు మానవులు ఈ లోకంలో వచ్చారో, వారందరూ కూడా అల్లాహ్ ఎదుట హాజరు కావడానికి లేచి వస్తారు. అది ఎలా జరుగుతుంది? దాని కొన్ని వివరాలు మనం ఈ రోజు ఇన్షా అల్లాహ్ తెలుసుకోవడంతో పాటు పునరుత్థాన దినం, పరలోకం, మరోసారి లేపబడటం, ఇవన్నీ ఎలా సత్యమో, ఖురాన్, హదీసుల ఆధారాలతో పాటు బుద్ధిపూర్వకమైన కొన్ని నిదర్శనాలు కూడా ఇన్షా అల్లాహ్ మీకు తెలుపబడతాయి. నమ్మడానికి ఇంతవరకు ఏదైనా సందేహం, అనుమానం ఉన్నా ఇన్షా అల్లాహ్, ఆ అల్లాహ్ దయతో తప్పకుండా వీరు నమ్మి తీరుతారు. మీరు ఈవిషయాలు చాలా శ్రద్దగా వింటారు అని ఆశిస్తున్నాను.

సహీ బుఖారీలో వచ్చిన హదీసు ప్రకారం, మొదటిసారి శంఖు ఊదబడిన తరువాత విశ్వమంతా నాశనం అయిపోతుంది. ఎలాగైతే విత్తనం ద్వారా మళ్ళీ ఒక వర్షం కురిసింది అంటే విత్తనంలో, విత్తనం ఏదైతే మనం భూమిలో నాటుతామో ఒక చిన్న వర్షం కురిసిన తరువాత ఎలా అది మొలక ఎత్తుతుందో, ఆతరువాత ఏ విత్తనం ఉంటుందో, దాని యొక్క చెట్టు బయటికి వస్తుందో, ఆ విధంగా మనిషి ఏ స్థితిలో చనిపోయినా, ఎక్కడ చనిపోయినా వెన్నెముకలోని కింది చివరి భాగంలో ఒక చిన్న ఎముక ముక్కను అల్లాహ్ (తఆలా) అలాగే నశించి పోకుండా కాపాడి ఉంచుతాడు. ఆ రోజు అల్లాహ్ (తఆలా) ఒక వర్షం కురిపిస్తాడు. ఇస్రాఫీల్ (అలైహిస్సలాం) కు రెండోసారి శంఖు ఊదడానికి ఆదేశిస్తాడు. ఈవిధంగా ఆ వెన్నెముక ద్వారా వర్షం కురిసిన తరువాత మొక్కలు ఎలా మొలకెత్తుతాయో ఆ విధంగా ఇస్రాఫీల్ (అలైహిస్సలాం) శంఖు ఊదిన తర్వాత మరోసారి అందరు మానవులు లేచి నిలబడి అల్లాహ్ ఎదుటకు హాజరవుతారు.

దీనికి సంబంధించిన కొన్ని ఆయతులు మనం ఇప్పుడు విందాం శ్రద్ద వహించండి. సూరయే జుమర్ ఆయత్ నెంబర్ 68 లో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు.

وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ ۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخْرَىٰ فَإِذَا هُمْ قِيَامٌ يَنظُرُونَ – 39:68

శంఖు ఊదడం జరుగుతుంది. ఆకాశాల్లో ఉన్నవారు, భూమిలో ఉన్న వారు అందరూ సొమ్మసిల్లి పోతారు. కేవలం అల్లాహ్ తలుచుకున్న వారు తప్ప. మరోసారి శంఖు ఉందడం జరుగుతుంది. అప్పుడు వారందరూ చూసుకుంటూ నిలబడి హాజరవుతారు.

ఈ విధంగా మహాశయులారా! రెండో సారి అల్లాహ్ (తఆలా) నిర్జీవులందరినీ కూడా జీవులుగా చేసి లేపడం అనేది సత్యం. సూరతుల్ మూ’మినూన్ లోని చివరిలో అల్లాహ్ తఆలా ఇలా తెలిపాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ – 23:115

ఏమీ! మేము మిమ్మల్ని వృదాగా పుట్టించామని మీరు అనుకుంటున్నారా? మరియు తిరిగి మా వైపునకు వచ్చేది లేదు అని మీరు భావిస్తున్నారా?

ఇదే సూరతుల్ మూ’మినూన్ లోని ప్రారంభ ఆయతుల్లో:

ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ – 23:15
మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు

ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ – 23:16
మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు.

దశల వారుగా మీరు ఏదైతే పుట్టించ బడ్డారో ఆతరువాత ఇహలోకంలో వచ్చాక బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం కొందరు యవ్వనంలో మరికొందరు బాల్యంలో మరికొందరు వృద్ధాప్యంలో ఈధంగా ఒక రోజు కాకున్నా ఒకరోజు మీరు చనిపోవాల్సిన వున్నది. ఆ తరువాత ప్రళయ దినాన మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

అయితే సోదర సోదరీమణులారా! చనిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాము. సమాధిలో పెట్టబడిన కాలాలు గడిచిన కొద్దీ ఆ శవం మట్టిలో కలిసిపోతుంది. మరికొందరు కాల్చేస్తారు. అయితే ఎలా మరోసారి వారిని పుట్టించడం జరుగుతుంది?, లేపడం జరుగుతుంది? అన్నటువంటి అనుమానం కొందరికి వస్తుంది కదా.! అయితే ఈ కొన్ని ఉదాహరణలు, ఈ కొన్ని సత్యాలు శ్రద్ధగా వినండి. ఇక మీకు ఎలాంటి అనుమానం ఇన్షా అల్లాహ్ ఉండదు. మొట్ట మొదటి విషయం ఎవరైతే మరోసారి లేపబడటం విషయంలో సందేహపడుతున్నారో అల్లాహ్ (తఆలా) దివ్య ఖురాన్ లో మూడు నాలుగు రకాల తాకీదు పదాలతో, లేపబడటం సత్యం. ఇందులో అనుమానం లేదు అని స్వయంగా అల్లాహ్ తన ప్రమాణం చేసి చెప్తున్నాడు.

అవిశ్వాసులు భ్రమపడి ఉన్నారు. వారు మరోసారి లేపబడరు అని. మీరు చెప్పండి. ఎందుకు లేదు? ఒక రకంగా ఇది కూడా తాకీదు పదం. ఇలా కాదు, ఎందుకు కాదు, తప్పకుండా అవుతుంది. నా ప్రభువు సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. ఇది కూడా ఒక రకమైన తాకీదు. మళ్ళీ ఇది కూడా తాకీదు పదం. చివరిలో ఏదైతే ఒత్తు “న్న” ఉన్నదో అది కూడా అరబీ గ్రామర్ ప్రకారంగా తాకీదు పదం. అల్లాహ్ (తఆలా) ఒకే ఆయత్, ఆయత్ లోని చిన్నపాటి భాగంలోనే నాలుగు రకాల తాకీదు పదాలతో “చెప్పండి ఎందుకు లేదు నా ప్రభువు సాక్షిగా మీరు తప్పకుండా మరోసారి లేపబడతారు“. ఈ తాకీదు లతో కూడిన ఈ ఆయత్ కాకుండా ఇంకా వేరే ఎన్నోరకాలుగా అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా స్పష్టపరిచాడు.

గత కాలాల్లో కూడా మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కంటే ముందు గడిచిన ప్రవక్తల కాలాల్లో కూడా ఎందరో అవిశ్వాసులు పునరుత్థాన దినాన్ని, పరలోక దినాన్ని తిరస్కరించే వారు. అయితే అల్లాహ్ వారికి నమ్మకం కలగడానికి ఇలాంటి కొన్ని వాస్తవికతలను వారి కళ్ళముందు వారికి చూపించాడు. అవి ఏమిటి?

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) కాలంలో కొందరు “ఓ మూసా! మేము అల్లాహ్ ను మా కళ్లారా చూసినంత వరకు నిన్నువిశ్వసించము, నమ్మము” అని చెప్పారు. అయితే అల్లాహ్ తన యొక్క నూర్ (కాంతి)లోని చిన్న భాగాన్ని పర్వతంపై ప్రదర్శించాడు. అల్లాహ్ చెప్పాడు – “అది గనక ఒకవేళ భరించగలిగి ఉంటే ఆ తర్వాత విషయం మీరు నన్ను చూసేది“. ఎప్పుడైతే ఆ కాంతి ఆ పర్వతం మీద పడినదో వీరందరూ ఆ విషయాన్ని చూసి అక్కడికక్కడే చనిపోయారు. ఆ విషయాన్ని అల్లాహ్ తఆలా ఇలా తెలిపాడు? ఏ కొంతమందిని మూసా (అలైహిస్సలాం) ఎన్నుకొని తూర్ పర్వతానికి తీసుకెళ్లారో వారికే ఇలాంటి విషయం జరిగింది. పర్వతంపై పడినటువంటి కాంతిని వారు చూడలేకపోయారు. ఆ ప్రకాశవంతమైన కాంతిని భరించలేక పోయారు. అందరు కూడా చనిపోయారు. మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో దుఆ చేశారు. “ఓ అల్లాహ్! వెనుక నా జాతివారు ఏదైతే ఇంతటి గొప్పమాట అన్నారో వీరు నాతో వెంట వచ్చారు. వీరిని గనుక నీవు మరోసారి బ్రతికించి, వారి వరకు పంపకుంటే వారు నన్ను ఎలా నమ్ముతారు?” అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వీరిని ఎవరైతే చనిపోయారో మరోసారి బ్రతికించాడు. అయితే అల్లాహ్ చనిపోయిన వారిని బ్రతికించ గలుగుతాడు అన్నటువంటి వాస్తవికతలను ఇహలోకంలో కూడా చూపించాడు.

ఇలాంటి మరో సంఘటన స్వయంగా ఖురాన్ లో కూడా ఉంది. ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడినటువంటి ఒక గ్రామం నుండి వెళ్తున్నాడు. వెళుతూ వెళుతూ ఈ బస్తీ వాళ్ళు, కొంతకాలం ముందు వారు ఈ బస్తీలో జీవిస్తున్నారు. ఇప్పుడు వీరందరూ చనిపోయారు కదా? ప్రళయదినాన అల్లాహ్ వీరిని ఎలా బ్రతికిస్తాడు? ఈ బస్తీ వాసులను అల్లాహు (తఆలా) మరోసారి ఎలా బతికిస్తాడు? ఎలా వారికి జీవం పోసి లేపుతాడు? అని అతని నోట ఈ మాట వెళ్ళింది. ఆ వ్యక్తి ఏ గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడో, తనవెంట తన యొక్క తినడానికి కావలసిన సామాగ్రి కూడా ఉంది. అయితే ఆ వ్యక్తిని అల్లాహ్ (తఆలా) అక్కడే చంపేశాడు. వంద సంవత్సరాల వరకు ఆ మనిషి చనిపోయి ఉన్నాడు. ఆ తరువాత అల్లాహ్ (తఆలా) అతన్ని బ్రతికించాడు, లేపాడు. అల్లాహ్ అతన్ని అడిగాడు. “నీవు చనిపోయిన తర్వాత ఈ స్థితిలో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నావు?” “ఒక రోజు లేదా ఒక రోజు కంటే కొంచెం తక్కువగా నేను చనిపోయిన స్థితిలో ఉంటిని” అని చెప్పాడు. అల్లాహ్ చెప్పాడు – “కాదు, నీవు పూర్తిగా వంద సంవత్సరాల వరకు ఈ నిర్జీవ అవస్థలో ఉంటివి. చూడు! కావాలంటే నీ గాడిద ఏది? ఏ దానిమీద ఐతే నువ్వు ప్రయాణం చేసుకుంటూ వచ్చావో దాని పరిస్థితి ఏమైంది? ఒక రోజు అయ్యేది ఉంటే, ఒక రోజులో దాని శరీరమంతా మట్టిలో కలసిపోయి కేవలం ఎముకలు మిగిలి ఉంటాయా? ఇప్పుడు చూడు నీ కళ్ళ ముంగట నీ గాడిద యొక్క ఎముకలు కనపడుతున్నాయి కదా! కానీ అల్లాహ్ తన శక్తిని ఇలా చూపిస్తున్నాడో గమనించు. అదే గాడిద యొక్క ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ దాని మీద నీ తినుసామాగ్రి ఏదైతే ఉందో అది కొంచెం కూడా పాడవ్వకుండా, అందులో ఎలాంటి మార్పు రాకుండా అదే నీ యొక్క తిను పదార్థాలను, త్రాగు పదార్థాలను చూడు, అందులో ఎలాంటి మార్పు రాలేదు. నీ గాడిదను, మరి నిన్ను ప్రజల కొరకు కూడా మేము ఒక గుర్తుగా, ఒక సూచనగా, ఒక మహిమగా ఏదైతే చేయదలిచామో ఈ విషయాన్ని నీ కళ్లారా చూడు. కొంతసేపటిలో అల్లాహ్ (తఆలా) అతని గాడిదను కూడా అతని కళ్ళ ముంగటే బ్రతికించాడు. అందులో మాంసం, తోలు అన్ని ఏర్పడి ఒక సంపూర్ణమైన ఒక గాడిద అతని ముందు నిలబడి ఉన్నది. అల్లాహ్ (తఆలా) అన్ని రకాల శక్తి గలవాడు. ఎప్పుడు ఏది చేయదలచిన చేయగలవాడు. స్వయంగా మనం మానవులం. ఒకసారి మనం పుట్టించబడ్డామంటే రెండవ సారి పుట్టించడం ఆయనకు ఏదైనా కష్టమా? ఎంత మాత్రం కాదు.

మూడవ సంఘటన కూడా సూరయే బకరాలోనే ఉంది. అది కూడా మూసా (అలైహిస్సలాం) కాలంలోనే జరిగింది. మూసా (అలైహిస్సలాం) కాలంలో ఒక వ్యక్తి తన పినతండ్రిని, అతని యొక్క ఆస్తికి హక్కుదారుడు కావాలన్న దురాశతో చంపేశాడు. కానీ గుప్తంగా చంపాడు. ఎవరికీ తెలియకుండా హతుని యొక్క బంధువులు మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చి, “మూసా! నీవు అల్లాహ్ తో దుఆ చెయ్యి. మా మనిషిని చంపింది ఎవరో మాకు తెలిసి రావాలి”. అయితే అల్లాహ్ (తఆలా) మూసా (అలైహిస్సలాం)కు ఒక పరిష్కారం తెలియపరిచాడు. ఆ పరిష్కారాన్ని వారు సునాయాసంగా ఆచరించి ఉండేది ఉంటే చాల బాగుండు. కానీ వారు ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి మరింత ఇబ్బందికి పాలయ్యారు. చివరికి అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ప్రకారం “మాంసపు ముక్కను ఆ హతునికి తాకించండి. అతడు బ్రతికి అతన్ని చంపింది ఎవరో తెలియపరుస్తాడు, ఆ తర్వాత మళ్ళీ చనిపోతాడు” అని చెప్పడం జరిగింది. మరియు వాస్తవానికి అలా జరిగింది. సూరయే బకరా లోనే ఈ విషయం అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు.

అయితే మహాశయులారా! చెప్పే విషయం ఏమిటంటే అల్లాహ్ (తఆలా) చనిపోయిన వారిని బ్రతికించగలుగుతాడు అన్న వాస్తవికతలను ఇహలోకంలోనే కొందరి ప్రజలకు చూపించాడు. మరియు వాటిని దివ్య ఖురాన్ గ్రంధంలో సురక్షితంగా ఆ సంఘటనలు పేర్కొనడం జరిగింది. ఇలాంటి మరో సంఘటన కూడా సూరయే బకరాలో ఉంది. కానీ సంఘటనలు ఎన్ని విన్నా, దివ్య ఖురాన్ లాంటి సందేహం లేని సత్యగ్రంథం ద్వారా విన్నా, మన లోపల ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు దూరం చేసుకోనంతవరకు మనకు నమ్మకం కలగదు. అయితే సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వశక్తిమంతుడు గనుక అన్నీ చేయగల శక్తి గలవాడు కనుక వీటిని మనం నమ్మాలి.

అల్లాహ్ చనిపోయిన వారిని బ్రతికించ గలుగుతాడు అన్న విషయానికి మరికొన్ని బుద్ధిపూర్వకమైన ఆధారాలు, నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ వాటిని మనం తరువాయి భాగంలో తెలుసుకోబోతున్నాము.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బారకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: