మరణాంతర జీవితం – పార్ట్ 05 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
పార్ట్ 05. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:07 నిముషాలు]
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలిహందులిల్లాహి వహద వస్సలాతు వస్సలామ్ అలా నబియ్యునా బ’ద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
సోదర సోదరీమణులారా! పరలోకం సత్యం. మరోసారి లేపబడటం అనుమానం, సందేహం లేని విషయం. దీని గురించి ఖురాన్ లో అల్లాహ్ (తఆలా) ఎన్నో రకాలుగా మనకు ఉదాహరణలు ఇచ్చి ఉపమానాల ద్వారా దీని యొక్క వాస్తవికతను తెలియపరిచాడు. ఒక రకమైన నిదర్శన దీని గురించి ఏమిటంటే, సామాన్యంగా మనం మన జీవితంలో చూస్తూ ఉంటాము: ఒక్కసారి ఏదైనా వస్తువు తయారు చేయడం లేదా అనండి, మొదటిసారి ఏదైనా వస్తువు తయారు చేయడంలో మనకి ఏదైనా కష్టం కావచ్చు. కానీ దానినే మరోసారి తయారు చేయడంలో అంత కష్టం ఉండదు. ఇది మన విషయం, నవూదుబిల్లాహ్, మనకు మరియు అల్లాహ్ కు ఎలాంటి పొంతన లేదు. కానీ మన తక్కువ జ్ఞానానికి, మన అల్పబుద్ధులకు కూడా విషయం అర్థం కావడానికి మన యొక్క ఈ ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ ఆకాశాల ముందు, ఇంత పెద్ద భూమి ముందు, ఇంత గొప్ప పర్వతాల ముందు ఐదు అడుగుల మనం మానవులం ఇంత పెద్ద విషయం. అయితే తొలిసారిగా ఒక ఇంద్రియపు బిందువుతో అందమైన ఇంతటి గొప్ప మనిషిని సృష్టించగల ఆ సృష్టికర్త చనిపోయిన తర్వాత మరోసారి సృష్టించడం కష్టమా? ఎంత మాత్రం కష్టం కాదు. ఎంత మాత్రం కష్టం కాదు.
సూర రూమ్ ఆయత్ నెంబర్ 27 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు.
وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ – 30:27
“ఆయనే సృష్టి (ప్రక్రియ)ని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక”
ఆయనే సృష్టిని తొలిసారిగా పుట్టించిన వాడు, ఆయన తప్పకుండా తిరిగి పుట్టించ గలడు. తిరిగి పుట్టించడం అనేది అతనికి ఎంతో సులభతరమైన విషయం.
సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 104 లో ఇలా తెలియపరిచాడు.
كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ – 21:104
“ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము.”
గమనించారా? తొలిసారిగా పుట్టించడం దానికంటే మలిసారి సృష్టించడంలో ఎలాంటి కష్టతరమైన పని కాదు.
ఒక వ్యక్తి ప్రస్తావన సూరయే యాసీన్ లో వచ్చి ఉంది. అతను ఎంతో విర్రవీగుతూ “మా శరీరమంతా మట్టిలో కలిసిపోయిన తరువాత మా ఎముకలు సైతం బూడిద అయిపోయిన తర్వాత ఎలా పుట్టించ గలుగుతాడు, ఎలా తిరిగి లేప గలుగుతాడు?” అన్నటువంటి అడ్డ ప్రశ్నలు వేశాడు. అల్లాహ్ (తఆలా) అతనికి సమాధానం ఇస్తూ “మాకు ఉపమానాలు చూపించి ఎలా లేపుతాడు? అని ప్రశ్నిస్తున్నాడా? తాను తన స్వయంగా సృష్టిని మరిచిపోయాడా?” ఆ తరువాత ఆయత్ నెంబర్ 79 లో అల్లాహ్ ఇలా తెలిపాడు.
قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ – 36:79
(వారికి) సమాధానం ఇవ్వు : “వాటిని తొలిసారి సృష్టించిన వాడే (మలిసారి కూడా) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.”
తొలిసారిగా ఎలా మిమ్మల్ని పుట్టించాడో అలా మలిసారిగా పుట్టించడం తప్పనిసరి. ఇందులో అతనికి ఏ మాత్రం ఇబ్బందికరం ఉండదు. అందుకు సోదరులారా ఇందులో అనుమానపడే విషయం లేదు.
ఇక బుద్ధి పూర్వకమైన మరికొన్ని నిదర్శనాలు మరోరకంగా చూపించాడు. ఒకసారి గమనించండి. ఎండకాలం వచ్చిందంటే బీడు వారిన భూములను మనం చూస్తాం. ఏ మాత్రం అందులో జీవం లేని విషయాన్ని మనం గమనిస్తాము. కానీ అదే నిర్జీవ భూమిలో ఒక్కసారి ఒక వర్షం యొక్క జల్లు పడిందంటే అందులో మళ్ళీ జీవం పోసేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఆ భూమి నుండి పంటలు పండించేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఎలాగైతే నిర్జీవ భూమిలో జీవం పోసి, అక్కడి నుండి పంటలు పండించే శక్తి ఆ సృష్టికర్త కు ఉందో, అలాగే చనిపోయిన మనిషిని, మట్టిలో కలిసిపోయిన శరీరాన్ని, బూడిదగా మారినా ఎముకల్ని సైతం కలిపి మరోసారి జీవింప చేయడం ఏమాత్రం కష్టతరమైన విషయం కాదు.
సూరయే ఫుస్సిలత్ లోని ఆయత్ నెంబర్ 39 గమనించండి.
وَمِنْ آيَاتِهِ أَنَّكَ تَرَى الْأَرْضَ خَاشِعَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ ۚ إِنَّ الَّذِي أَحْيَاهَا لَمُحْيِي الْمَوْتَىٰ ۚ– 41:39
ఆయన యొక్క సూచనలలో ఒక సూచన ఏమిటంటే, నీవు భూమిని ఎండిపోయినదిగా, బీడుబారినదిగా చూస్తావు. ఎప్పుడైతే మేము ఆ భూమిపై వర్షాన్ని కురిపిస్తామో, ఆ తర్వాత పచ్చని పైర్లతో అది ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది. ఆ నిర్జీవ భూమిని ఎవరైతే బ్రతికించాడో ఆ భూమిలో జీవం పోసాడో అతడే మృతులను కూడా మరోసారి లేపుతాడు. వారికి కూడా జీవం ప్రసాదిస్తాడు.
ఇలాంటి ఆయత్ లు ఖురాన్ లో మరి ఎన్నో ఉన్నాయి. మరొక గమనించగల విషయం ఏమిటంటే, ఎండిపోయిన భూమి, చూడడానికి చనిపోయిన భూమి, అందులో నీటి వర్షం, వర్షం యొక్క నీరు పడిన తరువాత ఎలా పచ్చగా అవుతుందో, మొలకలు ఎత్తుతాయో ఇలాంటి ఉదాహరణలే మృతులను లేపబడే విషయంలో కూడా అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు.
సహీ ముస్లింలోని హదీత్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియపరిచారు. “మొదటిసారి ఇస్రాఫీల్ శంఖు ఊదినప్పుడు ఒక వైపునకు మెడలు వాలి పోతాయి. ప్రజలు సొమ్మసిల్లి పోతారు. ఆ తర్వాత ప్రళయం సంభవించి ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ అల్లాహ్ (తఆలా) ఒక వర్షం కురిపిస్తాడు. వెన్నుముక లోని చివరి భాగం ఏది అయితే మిగిలి ఉంటుందో, దాని ద్వారా మరోసారి ఎలాగైతే వర్షం ద్వారా మొలకలు ఎత్తుతాయో అలాగే మనుషులు కూడా పుట్టుకొస్తారు. రెండవ శంఖు ఊదిన తర్వాత అందరూ కూడా అల్లాహ్ ఎదుట హాజరవుతారు”. ఈ ప్రళయ దినాన్ని విశ్వసించడం, ప్రళయ దినాన్ని నమ్మడం మన విశ్వాసంలోని అతి ముఖ్యమైన భాగం. ఇందులో మనం ఏ మాత్రం ఆలస్యం కానీ, ఏ మాత్రం సందేహం గాని, అనుమానం గాని ఉంచుకోకూడదు. దీని వల్ల మనకే నష్టం కలుగుతుంది. ఒకవేళ మనం పరలోక దినాన్ని విశ్వసించామో ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ మరోసారి లేపుతాడు, బ్రతికిస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతామో మనకే ఇందువల్ల మేలు కలుగుతుంది.
మరొక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఎందరో ఎన్నో రకాల అన్యాయాలు చేస్తున్నారు. ఎన్నో రకాల దౌర్జన్యాలు చేస్తున్నారు. వారికీ వారి దౌర్జన్యం వారు చేసే అంతటి పాపాల శిక్ష ఇహ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? లేదు. వారు ఎవరిపైన అయితే దౌర్జన్యం చేస్తున్నారో ఆ బాధితులకు వారి యొక్క న్యాయం లభిస్తుందా? లేదు. అందుగురించి కూడా పరలోక దినం తప్పనిసరి. అక్కడ సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వ మానవుల మధ్య న్యాయం చేకూరుస్తారు. బాధితునికి అతని హక్కు దౌర్జన్యపరుడు నుండి తప్పకుండా ఇప్పిస్తాడు. అంతే కాదు సహీ హదీత్ లో వచ్చి ఉంది ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు: “ఒకవేళ కొమ్ము ఉన్న మేక కొమ్ము లేని మేకను అన్యాయంగా కొట్టిందంటే రెండు మేకల్ని కూడా అల్లాహ్ (తఆలా) ప్రళయ దినాన హాజరు పరుస్తాడు. దౌర్జన్యం చేసిన మేక నుండి దౌర్జన్యానికి గురి అయిన మేకకు న్యాయం ఇప్పించి ఆ తర్వాత వారిని మట్టిగా మార్చేస్తాడు”. చెప్పే విషయం ఏంటంటే జంతువుల మధ్య లో కూడా న్యాయం చేకూర్చ గలిగే ఆ సృష్టికర్త, మానవుల మధ్య తప్పకుండా న్యాయం చేకూర్చ గలుగుతాడు. ఆ న్యాయం, ప్రతిఫల దినం తప్పని సరిగా రావలసి ఉంది. మనం దానిని ఎంత తిరస్కరించినా అది తప్పక వస్తుంది. నిశ్చయంగా ప్రళయ దినం వచ్చి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ దీని విషయంలో మనందరి విశ్వాసంలో మరింత బలం చేకూర్చు గాక.
ప్రళయ దినం రావడం ఆ రోజు మనందరి లెక్క తీసుకోవడం ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ (తఆలా) ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చే మానవులందరినీ కూడా ఒక చోట జమ చేసి, వారిలో ఎవరికీ ఎన్ని సంవత్సరాల జీవితం ప్రసాదించాడో వాటి గురించి తప్పకుండా లెక్క తీసుకుంటాడు.
సూరతుల్ ఘాషియా ఆయత్ నెంబర్ 25, 26 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:
إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ – 88:25
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم – 88:26
“వారందరూ మా వైపునకు తిరిగి రావలసి ఉన్నది. మరి ఆ తర్వాత మేము వారందరి యొక్క లెక్క తప్పకుండా తీసుకొని ఉంటాము.”
లెక్క తీసుకోవడం అనేది అల్లాహ్ (తఆలా) మనకు ఇచ్చిన జీవితంలోని ఒక్కొక్క క్షణానికి ఆరోజు లెక్క తీసుకోవడం అనేది సత్యం. కొన్ని సందర్భాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్ యసీరా” అని దుఆ చేసేవారు. అంటే “ఓ అల్లాహ్! నా యొక్క లెక్క చాలా తేలికగా నీవు తీసుకో. ఎలాంటి ఇబ్బందికి నన్ను గురిచేయకుండా నా లెక్క తీసుకో.” అయితే ఒక సందర్భంలో ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రశ్నించారు: “ప్రవక్తా! చాలా సులభతరమైన లెక్క ఏమిటి” అని? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సమాధానం పలికారు: “తేలికమైన, చాలా సులభతరమైన లెక్క అంటే ఆయేషా అల్లాహ్ దాసుని యొక్క కర్మ పత్రాలను కేవలం అలా చూసి అతన్ని మన్నించి వేయడం“. ఈ హదీత్ ముస్నద్ అహ్మద్ లోనిది సహీ హదీత్.
అయితే సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో మరొక హదీత్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు” “ఎవరి లెక్క తీసుకోబడుతుందో అతడు అయితే శిక్షలో పడినట్లే”. అప్పుడు ఆయేషా (రదియల్లాహు అన్హా) మరోసారి ప్రశ్నించారు: “ప్రవక్తా! అల్లాహ్ (తఆలా) ఖురాన్ లో తెలిపాడు కదా! అతనితో చాలా సులభతరమైన లెక్క తీసుకోవడం జరుగుతుంది అని”. దీనికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఆయిషా! ఇది కేవలం అతని కర్మ పత్రాల్లో చూడడం, దానిని లెక్క తీసుకోవడం అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా లెక్క తీసుకోవడం అంటే ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క కార్యాన్ని పట్టి అడగడం, దాని గురించి మందలించడం. ఇలా ఎవరైతే ఒక్కొక్క విషయాన్ని గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో, అతడు అయితే నాశనం అయినట్లే కదా!” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు చెప్పారు.
అంటే ఈ హదీతుల ద్వారా ఏం బోధపడుతుంది మనకు? లెక్క తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది అని, దానికి మనం ఇక్కడే సిద్దపడాలి అని మరియు అల్లాహ్ తో దుఆ కూడా చేస్తూ ఉండాలి – “ఓ అల్లాహ్ సత్కార్యాలు చేస్తూ జీవితం గడిపే సత్ భాగ్యం నాకు ప్రసాదించు మరియు ప్రళయ దినాన మా యొక్క లెక్క, తీర్పులు అన్నీ కూడా చాలా సులభతరంగా జరగాలి. నీ యొక్క మన్నింపు కు మీ యొక్క క్షమాపణకు, నీ యొక్క కరుణ కటాక్షాలను మేము నోచుకోవాలి” అని దుఆ చేస్తూ ఉండాలి.
ఇప్పటికీ సమాజంలో కొందరు ప్రళయదినం ఎందుకు? ఆ రోజు ఎందుకు లెక్క తీసుకోవడం? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే అల్లాహ్ (తఆలా) ఏ ఉద్దేశంతో మనల్ని ఇహలోకంలోకి పంపాడో అది ఆయన్ను ఆరాధించడం మాత్రమే. ఆయన ఆరాధన పద్ధతులను తెలియపరచడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంధాలను కూడా అవతరింపజేశాడు. ఇక అల్లాహ్ తన బాధ్యత పూర్తి చేసి మానవునికి సన్మార్గం ఎందులో ఉందో తెలియజేసి అతను దానిని అవలంబించాలి, దాని ప్రకారం జీవితం గడపాలి అని ఆదేశించాడు. ఇక ఆ పరలోకం,, ఇహలోకంలో ఎవరు ఎలా జీవించారు? ఆ లెక్క తీసుకోవడానికి, ఎవరు న్యాయం చేశారో, వారి యొక్క న్యాయానికి ప్రతిఫలం ఇవ్వడానికి, ఎవరైతే అన్యాయం చేశారో, దౌర్జన్యం చేశారో వారి యొక్క శిక్ష వారికి ఆ రోజు ఇవ్వడానికి. ఎవరు ప్రవక్తల యొక్క బాటను అనుసరించారు? అల్లాహ్ పంపిన గ్రంధాలని స్వీకరించి వాటి ప్రకారం తమ జీవితం మలుచుకున్నారు? ఇవన్నీ కూడా ఆ రోజు తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది.
సూరతుల్ ఆరాఫ్ లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:
“మేము ప్రవక్తల్ని కూడా ప్రశ్నిస్తాము మరియు ప్రవక్తల్ని ఎవరి వైపునకు పంపామో ఆ జాతి వారిని కూడా ప్రశ్నిస్తాము.”
ఈ లెక్క విషయంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండరు. వారి వారి కర్మల ప్రకారం, వారి వారి విశ్వాసాల ప్రకారం, వారు ఇహలోకంలో అల్లాహ్ ఆజ్ఞలను, అల్లాహ్ ఆదేశాలను పాటించి, వాటి ప్రకారం ఏదైతే జీవితం గడిపారో, వాటి ప్రకారం కొందరి యొక్క లెక్క చాలా కష్టతరంగా ఉంటుంది. మరికొందరికి సులభతరంగా ఉంటుంది. కొందరిపట్ల మన్నింపు వైఖరి అల్లాహ్ వహిస్తాడు. మరి కొందరిని అల్లాహ్ (తఆలా) వారితో ఒక్కొక్క లెక్క తీసుకుంటాడు.
ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీత్ ఆ పొడుగైన హదీతులో చివరి మాట ఏంటంటే – “గత జాతులు నాకు చూపబడటం జరిగింది, నా అనుచర సంఘాన్ని కూడా నేను చూశాను. వారిలో డెబ్బై వేల మంది వారు ఎంత అదృష్టవంతులు అంటే, వారు ఎలాంటి లెక్కలేకుండా, ఎలాంటి శిక్ష లేకుండా స్వర్గంలోనికి వెళ్తారు.” అల్లాహు అక్బర్. అల్లాహ్ (తఆలా) మనందరినీ కూడా ఆ డెబ్బై వేలలో కలపాలి, ఆ డెబ్బై వేలలో జోడించాలి అని మనం దుఆ చేస్తూ ఉండాలి. ఆ ప్రకారంగా మనం ఆచరిస్తూ కూడా ఉండాలి.
ఇన్షా అల్లాహ్, పరలోకానికి సంబంధించిన ఎన్నో మజిలీలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుంటూ పోతూఉన్నాము . మా ఈ కార్యక్రమాలను ఎడతెగకుండా చూస్తూ ఉండండి. అల్లాహ్ (తఆలా) పరలోకం పట్ల మన విశ్వాసాన్ని మరింత బలం చేయుగాక, సత్కార్యాలు చేస్తూ ఉండి, కలిమా “లా ఇలాహ ఇల్లల్లాహ్” చదువుతూ, అదే పుణ్య స్థితిలో అల్లాహ్ మన ప్రాణాలు వీడే అటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!
వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బారకాతుహు.
పూర్తి భాగాలు క్రింద వినండి
- మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
You must be logged in to post a comment.