అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం

78. హజ్రత్ అబ్దుల్లా బిన్ మాస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

“సత్యాన్ని విశ్వసించి, తమ విశ్వాసానికి ఎలాంటి అన్యాయం తలపెట్టని వారికే శాంతి లభిస్తుంది; అలాంటి వారే నిజానికి సన్మార్గగాములు” అనే ఖుర్ ఆన్ సూక్తి అవతరించినప్పుడు ముస్లింలు భయపడిపోయి “దైవప్రవక్తా! మాలో ఆత్మలకు అన్యాయం చేసుకోని వారెవరున్నారు?” అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “ఇక్కడ అన్యాయం అంటే మీరు సాధారణంగా భావిస్తున్న అన్యాయం కాదు, ఈ సూక్తిలో అన్యాయం అంటే షిర్క్ (బహుధైవారాధన) అని అర్ధం. (ఖుర్ ఆన్ లో) హజ్రత్ లుఖ్మాన్ (అలైహిస్సలాం) తన కుమారునికి హితభోద చేస్తూ ‘కుమారా! అల్లాహ్ కి ఏ శక్తినీ సాటి కల్పించకు. అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం’ అని పలికిన మాటలు మీకు తెలియవా?”

[సహీహ్ బుఖారీ : 60 వ ప్రకరణం – అంబియా, 41 వ అధ్యాయం – ఖౌలుల్లాహ్ తాలా వలఖద్ ఆతైనా లుఖ్మాన్]

విశ్వాస ప్రకరణం : 53 వ అధ్యాయం – అవిశ్వాసులు తమ అవిశ్వాస జీవితంలో చేసిన సత్కార్యాలకు ఇస్లాం స్వీకరణ తరువాత పుణ్యఫలం లభిస్తుందా?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

“ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు ..

70. హజ్రత్ సాబిత్ బిన్ జహాక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : “

  • ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు తను ప్రమాణం చేసిన విషయం లాంటివాడే అవుతాడు (అంటే ఆ మతానికి చెందిన వ్యక్తిగానే పరిగణించబడతాడు).

  • తన శక్తి పరిధిలో లేని విషయం గురించి మొక్కుబడి చేసుకున్నవాడు అలాంటి మొక్కుబడి నెరవేర్చనవసరం లేదు.
  • ఆత్మహత్య చేసుకున్నవాడు ఇహలోకంలో తనను తాను ఏ వస్తువుతో హతమార్చుకున్నాడో ప్రళయదినాన అతడ్ని అదే వస్తువుతో శిక్షించడం జరుగుతుంది.
  • విశ్వాసిని హత్యచేయడం ఎంత ఘోరమైన పాపమో, అతడ్ని దూషించడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. అలాగే అతనిపై సత్యతిరస్కార (కుఫ్ర్) అపనిందను మోపడం కూడా అంతే (ఘోరమైన) పాపకార్యమవుతుంది. (*)

(*) ఇది ఒక హెచ్చరికగా, మందలింపుగా పేర్కొనబడింది. నవవి (రహ్మలై) గారి ప్రకారం మనిషి హృదయాలలో ఇస్లాం పట్ల నిజమైన విశ్వాసం ఉంటే అతను అవిశ్వాసి కాజాలడు. ఒకవేళ అతని హృదయంలో ఇస్లాం కి బదులు ఇతర ధర్మాల పట్ల ఔన్నత్యభావం ఉంటే అతను తప్పకుండా అవిశ్వాసి అవుతాడు.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 44 వ అధ్యాయం – మాయన్హా మినస్సిబాబివల్లాన్]

విశ్వాస ప్రకరణం – 45 వ అధ్యాయం – ఆత్మహత్య చేసుకున్నవాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లిం కే స్వర్గ ప్రవేశం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్లాహ్ ఎవరినైనా అభిమానిస్తే అతడ్ని తన దాసులకు అభిమాన పాత్రుడిగా చేస్తాడు

1692. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

అల్లాహ్ ఏ దాసుడిని అయినా అభిమానిస్తే జిబ్రయీల్ (అలైహిస్సలాం) ని పిలిచి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని  అభిమానిస్తున్నాడు కనుక నీవు కూడా అతడ్ని అభిమానించు” అని అంటాడు. అందుచేత జిబ్రయీల్ (అలైహిస్సలాం) అతడ్ని అభిమానించడం ప్రారంభిస్తారు. తరువాత ఆయన ఆకాశంలో ఒక ప్రకటన గావిస్తూ “అల్లాహ్ ఫలానా వ్యక్తిని అభిమానిస్తున్నాడు. కనుక మీరంతా అతడ్ని అభిమానించండి” అని అంటారు. దాంతో ఆకాశవాసులంతా (అంటే దైవదూతలందరూ) అతడ్ని అభిమానించడం మొదలెడతారు. చివరికి భూమిపై కూడా అతనికి ప్రజాదరణ లభిస్తుంది.

[సహీహ్ బుఖారీ : 97 వ ప్రకరణం – అత్తౌహీద్, 33 వ అధ్యాయం – కలామిర్రబ్బి మఅ జిబ్రయీల్]

సామాజిక మర్యాదల ప్రకరణం – 48 వ అధ్యాయం – అల్లాహ్ ఎవరినైనా అభిమానిస్తే అతడ్ని తన దాసులకు అభిమాన పాత్రుడిగా చేస్తాడు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్భాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది

1697. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మేమొక జనాజా (శవం) వెంట ‘బఖీ’ శ్మశానవాటికకు వెళ్ళాము.అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా వచ్చి ఓ చోట కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తల వంచుకొని బెత్తంతో నేలను గీకసాగారు. కాస్సేపటికి “మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్భాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది.” అని అన్నారు ఆయన. ఒకతను ఈ మాట విని “దైవప్రవక్తా! అయితే మనం విధివ్రాతని భావించి కర్మలు ఆచరించకుండా ఎందుకు కూర్చోకూడదు. మనలో ఎవరైనా సౌభాగ్యుడై ఉంటే అతను ఎలాగూ సత్కర్మలు ఆచరిస్తాడు, దౌర్భాగ్యుడైతే ఎలాగూ దుష్కర్మలు ఆచరిస్తాడు కదా!” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “కాని వాస్తవం ఏమిటంటే అదృష్టవంతుడికి సత్కార్యాలు చేసే సద్బుద్ధి కలుగుతుంది, దౌర్భాగ్యుడికి దుష్కార్యాలు చేసే దుర్భుద్ది పుడ్తుంది.” అని అన్నారు. ఆ తరువాత ఆయన (దివ్య ఖుర్ఆన్ లోని) ఈ సూక్తులు పఠించారు : “ధనాన్ని దానం చేసి దైవ అవిధేయతకు దూరంగా ఉంటూ, మంచిని (సత్యాన్ని) సమర్ధించే వాడికి మేము సన్మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలుగజేస్తాము. (దీనికి భిన్నంగా) పిసినారితనం వహించి (దైవంపట్ల) నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తూ, మంచిని (సత్యాన్ని) ధిక్కరించే వాడికి మేము కఠిన మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము.” (92 : 5-10)

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయిజ్, 83 వ అధ్యాయం – మౌఇజతిల్ ముహద్దిసి ఇన్దల్ ఖబ్ర్ వఖూవూది అస్ హాబిహీ హౌలహు]

విధివ్రాత ప్రకరణం – 1 వ అధ్యాయం – మాతృగర్భంలో మానవ నిర్మాణ స్థితి, అతని ఉపాధి, వయస్సు, కర్మలు మొదలగునవి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1.
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక

382. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  ఈవిధంగా అన్నారు :-

నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షం! కట్టెలు సమీకరించమని, అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి, నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి (సామూహిక నమాజులో పాల్గొనని) వారి దగ్గరకు వెళ్లి వారి ఇండ్లను తగలబెడదామని నేను (ఎన్నోసార్లు) అనుకున్నాను. నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆశక్తి స్వరూపుని సాక్షం! ఇషా నమాజు చేస్తే ఓ పెద్ద మాంసపు ముక్కగాని లేదా శ్రేష్టమైన రెండు మేక కాళ్ళు గాని లభిస్తాయని తెలిస్తే వారు తప్పకుండా ఇషా నమాజు చేయడానికి (మస్జిదుకు) వచ్చేవారు”.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 29 వ అధ్యాయం – వజూబి సలాతిల్ జమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 42 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్