మరణాంతర జీవితం – పార్ట్ 12: పరలోకంలో మహా మైదానంలో పుణ్యాత్ముల పరిస్థితి [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 12 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 12. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:35 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక విశ్వాసుల్లో మరీ ఉత్తమమైన వారు, పుణ్యాత్ములు, భక్తులు, అల్లాహ్ యొక్క భయభీతి కలిగి తమ జీవితం గడిపి పుణ్యాల్లో, సత్కార్యాల్లో తమ జీవితం గడిపిన వారు. వారి యొక్క స్థానం సమాధుల నుండి లేపబడిన తర్వాత పరలోకంలో, ఆ మహా మైదానంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది?

ఎప్పుడైతే ప్రజలందరూ సమాధులు నుండి లేపబడతారో, ఆకాశాల్లో, భూమిలో ఉన్నవారందరూ కూడా భయకంపితులు అయిపోతారు, సొమ్మసిల్లి పోతారు. వారి యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కానీ విశ్వాసులు, పుణ్యాత్ములు, ఎల్లవేళల్లో సత్కార్యాల్లో జీవితం గడుపుతూ పాపాల నుండి దూరం ఉండే వారు, ఎంతో భయ భక్తితో తన జీవితం గడిపేవారు, వారి గురించి అల్లాహ్ సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 101 నుండి 103 వరకు:

إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا الْحُسْنَىٰ أُولَٰئِكَ عَنْهَا مُبْعَدُونَ لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِي مَا اشْتَهَتْ أَنفُسُهُمْ خَالِدُونَ لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ

అయితే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు.వారు నరకం సవ్వడి అయినా వినరు. తమ మనసు మెచ్చిన సుఖవిలాసాల మధ్య వారు శాశ్వతంగా ఉంటారు. ఆ మహాకలవరం (కూడా) వారిని వ్యాకుల పరచదు.

అల్లాహు అక్బర్!. ఎలాంటి అదృష్టవంతులు వారు గమనించండి. మనం కూడా వారిలో ఒకరు కావడానికి ప్రయత్నం చేయాలి. ఈలోకంలో ఒకేసారి మనకి ఈ అవకాశం దొరుకుతుంది.

సూరత్ జుక్రూఫ్ ఆయత్ 68 మరియు 69 లో వారి గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు –

يَا عِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَا أَنتُمْ تَحْزَنُونَ الَّذِينَ آمَنُوا بِآيَاتِنَا وَكَانُوا مُسْلِمِينَ

ఓ నా దాసులారా! ఈ రోజు మీకెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు. మా ఆయతులను (సూచనలను) విశ్వసించి, విధేయులు (ముస్లింలు)గా ఉన్న వారినుద్దేశించి (ఈ విధంగా అనబడుతుంది:)

ఆయతులు అంటే ఖురాన్ ఆయతులు. అల్లాహ్ పంపిన మహిమలు. ఈ ప్రపంచంలో అల్లాహ్ ఏ సూచనలు అయితే చూపిస్తున్నాడో, వేటి ద్వారానైతే మనము ఆయన ఏకత్వాన్ని గ్రహించి, పరలోకం రానున్నది, ఆయనను ఆరాధించి ఆ పరలోకదిన గాంభీర్యం, వ్యాకులత, అక్కడి యొక్క కఠినాల నుండి మనము రక్షణ పొందగలుగుతామో అని విశ్వసిస్తారో. మరియు వారు ముస్లిములుగా ఇస్లాం ప్రకారంగా జీవించి ప్రాణం పోయేంత వరకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉంటారో వారు ప్రళయ దినాన ఎప్పుడైతే అల్లాహ్ (తఆలా) వారికి అన్ని రకాల సుఖశాంతులు ప్రసాదిస్తాడో స్వయంగా వారి నోట ఇహలోకంలో కూడా అల్లాహ్ (తఆలా) చెప్పించాడు. ఏమని?

సూరతుల్ ఇన్సాన్ మరొక పేరు దానిది సూరతు ద్దహ్ర్. ఆయత్ నెంబర్ పదిలో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు –

76:10  إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا

“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”

“నిశ్చయంగా మేము భయపడతాము. మా ప్రభువుతో చాలా సుదీర్ఘకాలం అయిన, మరి ఎంతో కఠినతరమైన ఆ పరలోక దినం ఏదైతే ఉందో ఆ రోజున మా ప్రభువు మాకు అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించాలి లేదా అంటే ఆ రోజు చాలా కష్టతరమైనది అని మేము మా ప్రభువుతో భయపడుతూ ఉండేవారము”. అలా భయపడుతూ జీవితం గడిపి సత్కార్యాల్లో, ఎళ్లవేళల్లో నిమగ్నులై పాపాలకు దూరం ఉన్నందువల్ల అల్లాహ్ తప్పకుండా అలాంటి వారిని ఆ రోజున ఏ వ్యాకులత, ఏ కఠినతరం ఉంటుందో దాని నుండి వారిని రక్షిస్తాడు.

ఒక హదీస్ లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – షేక్ అల్బానీ (రహిమహుల్లా) సిల్ సిలతుల్ సహీహాలో దానిని హసన్ అని అన్నారు. సహీహాలో హదీత్ నెంబర్ 742. అల్లాహ్ ఇలా అంటున్నాడు – “స్వయంగా అల్లాహ్ (తఆలా) తాను అందరిపై అన్ని రకాల అధికారం కలిగి అందరికీ మానం, అవమానం పాలు చేసే అటువంటి శక్తిసామర్థ్యం గల ఆయన, ఎంతో గాంభీర్యం, ఔన్నత్యం గల ఆయన, తన ప్రమాణం చేస్తూ ఏమంటున్నాడు? నేను నా దాసునికి రెండు రకాల శాంతులు మరియు రెండు రకాల భయాలు కలిపి ఇవ్వను. అంటే ఏంటి? ఎవరైతే ఇహలోకంలో భయపడుతూ, పరలోకం నాటి గురించి భయపడుతూ ఉంటారో వారికి అల్లాహ్ (తఆలా) పరలోకంలో శాంతి, ప్రశాంతత, సుఖం ప్రసాదిస్తాడు. మరి ఎవరైతే ఇహలోకంలో పరలోకానికి సంబంధించిన విషయంలో ఎలాంటి భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవిస్తాడో అలాంటి వ్యక్తి తప్పకుండా ప్రళయదినాన భయకంపితులకు గురి అవుతాడు. ఒకవేళ అతను ఇహలోకంలో ప్రశాంతంగా జీవించాడు. ఎలాంటి భయ కంపితులకు గురికాలేదు. పరలోకం పట్ల రవ్వంత కూడా అతనిలో భయం అనేది కలగలేదు. అలాంటి వ్యక్తిని నేను ప్రళయ దినాన, పరలోకంలో అందరినీ సమీకరించినప్పుడు అతన్ని భయానికి గురి చేస్తాను. ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడి ఉన్నాడు అంటే, ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడుతూ జీవించాడు అంటే నేను ఏ రోజునైతే ప్రజలందరినీ సమీకరిస్తానో ఆ రోజు అతనికి ప్రశాంతత, సుఖము ప్రసాదిస్తాను“.

ఈ విధంగా మనం విశ్వాసాన్ని అవలంబించి, సత్కార్యాలు చేస్తూ పాపాలకు దూరంగా ఉండి మహా గొప్ప పుణ్యాత్ముల్లో కలిసే ప్రయత్నం చేస్తే ఆ పరలోకంలో ఎంతో సుఖం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా ఎన్నో రకాల పుణ్యాలు ఉన్నాయి.

మరియు ఆరోజు ఏ రోజైతే మైదానంలో కేవలం ఒకే ఒక మైలు దూరంలో సూర్యుడు ఉంటాడో దాని వేడితో ప్రజలు తమ యొక్క చెమటలో మునిగిపోతూ ఉంటారో అక్కడ ఏదైనా నీడ ఉంటె కేవలం అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం నీడ ఉంటుంది. దాని కింద దాని యొక్క ఛాయ, నీడ పొందే వారిలో కలిసే అదృష్టవంతులు ఎవరో ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.

ఏడు రకాల వారిని అల్లాహ్ (తఆలా) ఆరోజు ఏ రోజునైతే ఆయన నీడ, ఛాయ తప్ప మరి ఎక్కడ ఏ నీడ లభించదో ఏడు రకాల వారిని తన నీడలో వారికి ఛాయ ప్రసాదిస్తాడు. ఎవరు ఆ ఏడు రకాల వారు?

1. న్యాయ వంతుడు అయిన నాయకుడు. ఇక్కడ ఇమామ్ అంటే ఇంటికి కూడా నాయకుడు. వీధికి కూడా నాయకుడు. కుటుంబానికి నాయకుడు. గల్లి నుండి ఢిల్లీ వరకు, గ్రామం నుండి మొత్తం దేశం వరకు ఏఏ లెవెల్లో ఎవరు నాయకత్వం వహిస్తున్నార్రో ఎవరు తమ నాయకత్వం లో ఉన్నవారి పట్ల న్యాయం వహిస్తారో వారికి కూడా ఆ రోజు నీడ లభిస్తుంది.

2. రెండో రకమైన వారు యువకుడు, ఏ యువకుడు అయితే తన యవ్వనాన్ని తన ప్రభువు యొక్క ఆరాధనలో గడిపాడో!. అల్లాహు అక్బర్ . యువకులారా ఆరాధనా అంటే ఇరవై నాలుగు గంటలు మస్జిద్ లో ఉండటమే కాదు, మన జీవితంలోని ప్రతి క్షణం ఎక్కడ ఉన్నా ఏది చేసినా అక్కడ ఆ సందర్భంలో, ఆ సమయంలో, ఆ స్థితిలో అల్లాహ్ యొక్క ఆదేశం ఏంటి తెలుసుకొని జీవించడమే అల్లాహ్ యొక్క ఆరాధన. ఇలాంటి యువకుడు ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో తన యవ్వనాన్ని గడిపాడో.

3. మూడో వ్యక్తి, అతని మనస్సు మస్జిద్ లో లగ్నమై ఉంటుంది. ఒక నమాజ్ చేసి వచ్చాడు అంటే తన ఇహలోక పనుల్లో, తన యొక్క బాధ్యతల్లో, తన భార్య పిల్లల్లో ఎవరు ఎవరి పట్ల ఏ బాధ్యత నెరవేర్చాలో అన్నిటిలో ఉంటాడు. కానీ నమాజ్ సమయం గుర్తు పెట్టుకొని మరో నమాజ్ వచ్చింది అంటే వెళ్లి సామూహికంగా నమాజ్ పాటించే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ ఉన్నా గాని నమాజ్ సామూహికంగా చేస్తూ ఉండాలి అన్న విషయం అతని మదిలో నుండి బయటికి వెళ్ళదు. అతని హృదయం మస్జిద్ లో లగ్నమై ఉన్నది.

4. నాలుగో రకం వ్యక్తి ఎవరు? ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే అల్లాహ్ గురించి పరస్పరం ప్రేమాభిమానాలు పాటించి కలిస్తే అల్లాహ్ సంతోషానికి, అల్లాహ్ ప్రేమను పొందడానికి కలుస్తారు. వేరే అయిపోయినప్పుడు, విడిపోయినప్పుడు కూడా అల్లాహ్ ప్రేమ పొందే ఉద్దేశంతోనే విడిపోతారు. కలిసినా అల్లాహ్ ప్రేమకు పాత్రులు అవ్వడానికి, విడిపోయినా, అల్లాహ్ యొక్క ప్రేమను పొందడానికి మాత్రమే.

5. ఐదవ రకం. ఐదవ మనిషి ఎలాంటి వాడు? ఒక అందమైన మరియు హోదా, అంతస్తులు గల ఒక స్త్రీ అతన్ని చెడు వైపునకు ఆహ్వానిస్తే అతనంటాడు, నేను కేవలం అల్లాహ్ తో భయపడతాను. ఇలాంటి చెడుకు నేను సమీపించను. అల్లాహు అక్బర్. గమనించారా? అల్లాహ్ యొక్క భయం.

6. ఆరో రకం. ఆరో రకమైన వ్యక్తి అతను దానధర్మాలు చేస్తాడు. కుడి చేయితో ఏదైనా దానం చేశాడు అంటే ఎడమ చెయ్యికి కూడా తెలియకుండా అంత గోప్యంగా, రహస్యంగా కేవలం అల్లాహ్ సంతోషాన్ని పొందడానికి. ప్రజల చూపుగోరు తనానికి కాదు. కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టికి అతను ఖర్చు చేస్తూ ఉంటాడు.

7. ఏడో రకమైన వ్యక్తి. ఒంటరిగా ఉండి అల్లాహ్ ను గుర్తు చేసుకొని, కన్నీరు కార్చేటువంటి మనిషి. అల్లాహ్ ను గుర్తు చేస్తున్నప్పుడు అతని కళ్ల ద్వారా అశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి.

ఈ ఏడు గుణాలు గల ఏడు రకాల మనుషులు ఆ ప్రళయ దినాన సుదీర్ఘ కాలాన్ని గానీ, ఆ కఠినతరమైన ఆ సమస్యలను కానీ ఎదుర్కోకుండా అల్లాహ్ యొక్క నీడలో ఉంటారు”.

సోదర సోదరీమణులారా! మనందరం కూడా విశ్వాస మార్గాన్ని అవలంభించి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటే, ఎంత గొప్ప లాభాన్ని పొందుతాము ఆ పరలోక దినాన. ఈ ఏడుగురే కాకుండా అల్లాహ్ యొక్క ఛాయ, నీడను పొందే అదృష్టవంతుల్లో మరొకరు. సహీ ముస్లిం షరీఫ్ హదీత్ నెంబర్ 3006 లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

ఎవరైతే తన నుండి అప్పు తీసుకున్న వ్యక్తికి మరి కొంత వ్యవధి ఇస్తాడో మరి కొంత సమయం ఇస్తాడో ఎక్కువగా. సరే మంచిది. మరో పదిహేను రోజుల తర్వాత ఇవ్వు. లేదా నీవద్ద పర్వాలేదు మరొక నెల తర్వాత ఇవ్వు. ఈ విధంగా వ్యవధి ఇస్తాడో లేదా ఆ వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి అతని వద్ద ఏమీ లేదు. అప్పు తిరిగి ఇవ్వడానికి అని తెలిసి అతని యొక్క అప్పు మాఫీ చేసేస్తాడు. కేవలం అల్లాహ్ సంతోషానికి ప్రళయ దినాన ఆయన యొక్క నీడ పొందడానికి నేను ఈ రోజు నీ యొక్క అప్పును తిరిగి తీసుకోను. ఇక మాఫీ చేసేస్తున్నాను. నువ్వు ఎలాంటి రంది పడకు అని తృప్తిని ఇస్తాడు. అలాంటి వ్యక్తికి కూడా అల్లాహ్ అతనికి కూడా ప్రళయ దినాన తన ఛాయలో స్థలం ఇస్తాడు“.

ఇంకా ఎవరు పరలోక దినాన ఆ సుదీర్ఘ కాలంలో ఆ కష్టతర సమయాల నుండి, ఆ స్థితిలో నుండి బయట పడతారు. ఎవరైతే విశ్వాస మార్గంలో నడుస్తూ ప్రజల పట్ల కూడా ఎంతో మృదువుగా మెలుగుతారో, వారి యొక్క కష్టాల్లో వారికి తోడుగా ఉండి, వారు ఇబ్బంది లో ఇరుక్కొని ఉన్నారో వాటి నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. సహీ ముస్లిం షరీఫ్ లో ఈ భావం ఉంది. కానీ ఇప్పుడు నేను చదివే హదీత్ సునన్ అబూదావూద్ లోనిది. సునన్ అబూదావూద్ హదీత్ నెంబర్ 4946 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.

ఎవరైతే తన ముస్లిం సోదరుల యొక్క ఇహలోక కష్టాల్లోని ఏదైనా ఒక కష్టం దూరం చేస్తాడో అల్లాహ్ అతని పరలోక కష్టాల్లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తికి గానీ లేదా మరే రకమైన ఇబ్బందులు ఉన్న వ్యక్తికి గాని ఏదైనా సులభతరం కలిగిస్తాడో అల్లాహ్ అతనికి ఇహ, పరలోకాల్లో సులభతరాలు కలుగజేస్తాడు. మరి ఎవరైతే ఒక ముస్లిం లోపాల్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ ఇహలోకంలో, పరలోకంలో అతన్ని కప్పిపుచ్చుతాడు“.

మరొక హదీత్ లో ఉంది. ఆ హదీత్ ను షేక్ అల్బానీ (రహిమహుల్లా) గారు కూడా సహీహాల్లో ప్రస్తావించారు. హదీత్ నెంబర్ 1217. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు.

ఎవరైతే తన యొక్క సోదరునికి సహాయం దూరం నుండి, అతని వెనక ఉండి చేస్తాడో అల్లాహ్ ఇహ, పరలోకాల్లో ఇతనికి సహాయం చేస్తాడు.”

దగ్గర ఉన్నప్పుడు అయితే కనీసం చేయకుంటే ఎలా అని మనసులో వస్తుంది. సహాయం చేస్తాము. కానీ ఇక్కడ ఈ హదీస్ లో దూరం ఉండి అతను చూడకున్నా అతనికి ఎలాంటి సహాయం అవసరం ఉందో మనం చెప్పకుండా అతనికి సహాయం చేసేశాము. అల్లాహ్ అలాంటి వ్యక్తికి ఇహ, పరలోకాల్లో సహాయాలు చేస్తాడు”.

ఇంకా ఎలాంటి సత్కార్యాలు మనకు పనికి వస్తాయి పరలోకంలోని కష్టాలను మనం అనుభవించకుండా సుఖాలు పొందడానికి ఏ సత్కార్యాలు చేయాలి. వినండి మరొక హదీత్.

నిశ్చయంగా న్యాయం చేసేవారు, ఎవరైతే ప్రజల మధ్య ఏదైనా తీర్పు చేస్తున్న సందర్భంలో తీర్పులో న్యాయం చేసేవారు. వారి కుటుంబంలో ఇంటి వారిలో అందరిపట్ల న్యాయం చేసేవారు. మరి ఎవరైతే నాయకులుగా ఉండి, జడ్జీలుగా ఉండి న్యాయవాదిగా ఉండి, ఎక్కడ ఏ బాధ్యత ఉందో తన బాధ్యతలు ఉన్నవారి పట్ల న్యాయం చేస్తారో ఇలాంటి వారు ప్రళయ దినాన కరుణామయుడైన అల్లాహ్ యొక్క కుడి వైపున కాంతి యొక్క మింబర్ ల మీద ఆసీనులై ఉంటారు. అల్లాహ్ యొక్క రెండు చేతులు కూడా కుడియే“.

ఈ విధంగా జీవితంలోని ప్రతి వ్యవహారంలో న్యాయం పాటించడం ఎంత గొప్ప విషయమో గమనించండి.

ఇంకా మహాశయులారా! ఎవరైతే తమ యొక్క కోపాన్ని మింగేస్తారో, శక్తి ఉండి కూడా ఎదుటి వానితో ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమిస్తారో, అలాంటి వారు కూడా ప్రళయ దినాన ప్రజల అందరి ముంగటి నుండి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పిలిచి ఆహ్వానించి, ఇహ లోకంలో నీవు నా తృప్తి కొరకు, నా సంతోషాన్ని పొందడానికి మాత్రమే నీ కోపాన్ని దిగమింగావు. ఈ రోజు నీకు ఇష్టమైన స్వర్గ కన్యలో ఇష్టమున్న వారిని ఎన్నుకోండి అని అంటాడు.

ఇంకా వుదూ చేయడం, నమాజ్ చేయడం. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఎవరైతే ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ పాటిస్తూ ఉంటారో, తప్పకుండ వుదూ చేయాల్సింది. ఎవరైతే వుదూ సంపూర్ణంగా చేస్తారో వారి యొక్క వుదూ అవయవాలు, ప్రళయ దినాన మెరుస్తూ ఉంటాయి. వారిని ఆ రకంగా పిలవడం జరుగుతుంది.

ఇంకా ఇలాంటి ఎన్నో సత్కార్యాలు గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. కానీ ముఖ్యమైన కొన్ని విషయాలు తెలపడం జరిగింది. పరలోక దినాన మనం ఆ కష్టాలనుండి దూరం ఉండాలంటే పరలోకాన్ని విశ్వసించాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించాలి. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గాన్ని అవలంభించి ఇస్లాం ప్రకారంగా జీవించాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: