మరణాంతర జీవితం – పార్ట్ 15: ప్రళయ దినాన సిఫారసు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి లభిస్తుంది (పార్ట్ 02) & సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి గల కండిషన్స్ [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 15 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 15. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:16 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి అంశం గత భాగం యొక్క తర్వాత విషయం. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాకుండా, ఇంకా వేరే ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు సిఫారసు చేసే హక్కు ఏదైతే లభిస్తుందో, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. దానితో పాటు వారి ఆ సిఫారసును పొందడానికి ఎలాంటి వారు అర్హులవుతారు? అనే విషయం కూడా మనం తెలుసుకుంటున్నాము.

అయితే ఇతర ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సిఫారసు మరే సందర్భంలో వారికి లభిస్తుంది అంటే ఏ ప్రజల గురించి నరకంలో వారు పోవాలన్నటువంటి తీర్పు జరుగుతుందో, కానీ అల్లాహ్ యొక్క దయ తరువాత అల్లాహ్ కొందరు ప్రవక్తలకు, కొందరు విశ్వాసులకు సిఫారసు అధికారం ఇస్తాడు. వారు సిఫారసు చేస్తారు. ఆ తర్వాత అల్లాహు తఆలా వారిని నరకంలో ప్రవేశించకుండా నరకం నుండి తప్పించి స్వర్గంలో చేర్చుతాడు. అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా గొప్ప విషయం.

సహీ ముస్లిం హదీత్ నెంబర్ 1577, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఒక ముస్లిం ఎవరైనా చనిపోయాడు అంటే అతని జనాజా నమాజ్ చేయడానికి నలబై మంది నిలబడ్డారు. ఎలాంటి వారు ఆ నలబై మంది? అల్లాహ్ తో ఎలాంటి షిర్క్ చెయ్యనివారు. అల్లాహ్ తో పాటు ఎలాంటి వేరే భాగస్వాములను నిలబెట్టని వారు. ఏ ముస్లిం జనాజా నమాజ్ లో నలబై మంది ఎలాంటి షిర్క్ చెయ్యనివారు నిలబడతారో అల్లాహ్ వారి సిఫారసును అతని గురించి స్వీకరిస్తాడు“. చూడడానికి హదీస్ ఇంతే ఉంది.

కానీ ఇందులో మనం గ్రహిస్తే, ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఈ నలబై మంది ఎలాంటి వారు ఉండాలి? అల్లాహ్ తో పాటు ఇంకెవరిని కూడా అల్లాహ్ ఆరాధనలో భాగస్వామిగా చేయకూడదు. రెండో విషయం ఏం తెలుస్తుంది మనకు? సిఫారసు చేసేవారు షిర్క్ చేయకూడదు అని అన్నప్పుడు, ఎవరి గురించి సిఫారసు చేయడం జరుగుతుందో, అతను షిర్క్ చేసి ఉంటే వీరి సిఫారసు స్వీకరింప బడుతుందా అతని పట్ల? కాదు, అతను కూడా షిర్క్ చేయకుండా ఉండాలి. జనాజా నమాజ్ దీనిని “ఫర్ద్ యే కిఫాయా” అంటారు. అంటే ముస్లిం సముదాయంలో కొంతమంది చేసినా గాని అందరిపై నుండి పాపం అనేది లేపబడుతుంది. చదివిన వారికి పుణ్యం లభిస్తుంది. చదవని వారికి పాపం కలగదు. కానీ ఎవరూ చేయకుంటే అందరూ పాపాత్ములు అవుతారు. ఇలాంటి విషయాన్ని “ఫర్ద్ యే కిఫాయా” అంటారు. ఇది ఫర్ద్ యే కిఫాయా.

ఇక ఎవరైతే “ఫర్ద్ యే అయీన్” అంటే ఐదు పూటల నమాజ్ లు, ఫర్ద్ యే అయీన్ లో లెక్కించబడతాయి. ఫర్ద్ యే అయీన్ చేయకుండా కేవలం ఫర్ద్ యే కిఫాయా చేస్తే సరిపోతుందా? లేదు, చనిపోయిన ఆ ముసలి వ్యక్తి, అతను నమాజీ అయి ఉండాలి మరియు ఈ నలబై మంది కూడా కేవలం జనాజా లో హాజరైనవారు కాదు. ఐదు పూటల నమాజ్ లు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మహాశయులారా! ఒక సిఫారసు ఈ రకంగా కూడా ఉంటుంది. అల్లాహు తఆలా దీనిని కూడా స్వీకరిస్తాడు. ఈ షరతు, ఈ కండిషన్ లతో పాటు.

మూడో రకమైన సిఫారసు స్వర్గంలో చేరిన వారు స్వర్గంలో వారి యొక్క స్థానాలు ఉన్నతం కావడానికి, వారు ఏ పొజిషన్ లో ఉన్నారో అంతకంటే గొప్ప స్థితికి వారు ఎదగడానికి సిఫారసు. ఇలాంటి ఒక సిఫారసు కూడా ఉంటుంది. అల్లాహు తఆలా మనకు కూడా అలాంటి సిఫారసు ప్రాప్తం చేయు గాక. ఒకవేళ మనం హదీతులు వింటూ, ఈ ధర్మ భోదనలు వింటూ సిఫారసు పొందే వారిలో మనం కలిసే ప్రయత్నం చేయడం కంటే, ఎవరికైతే సిఫారసు చేసే హక్కు లభిస్తుందో, అలాంటి గొప్ప విశ్వాసంలో మనం కలిస్తే ఇంకా ఎంత మంచిగా ఉంటుంది. ఇంకా ఎంత మన అదృష్టం పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి.

ముస్లిం షరీఫ్ లో ఉంది. హదీత్ నెంబర్ 1528. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఎప్పుడైతే అబూ సలమా (రదియల్లాహు తఆలా అన్హు) మరణించారో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని వద్దకు వచ్చారు. అతని గురించి ఇలా దుఆ చేశారు. ఓ అల్లాహ్! అబూ సలమాను క్షమించు, మన్నించు. సన్మార్గం పొందిన వారు ఎవరైతే ఉన్నారో, వారిలో ఇతని యొక్క స్థానం కూడా పెంచి, వారితో కలుపు. ఓ అల్లాహ్! అతని వెనక, అతని తరువాత ఎవరైతే మిగిలి ఉన్నారో, వారికి నీవే బాధ్యునిగా అయిపో. మమ్మల్ని మరియు అతన్ని మన్నించు ఓ సర్వ లోకాల ప్రభువా! ఆయన సమాధిని విశాలపరుచు మరియు అతని కొరకు అతని సమాధిని కాంతితో నింపు“.

గమనించారా! ఈవిధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ సలమా గురించి దువా చేశారు. మనం కూడా విశ్వాసులు మనలో ఎవరైనా చనిపోతే, “ఓ అల్లాహ్! ఇతనిని క్షమించు. ఇతని యొక్క స్థానం పెంచి, సన్మార్గం పొందిన వారిలో ఇతన్ని కలుపు మరియు అతని వెనక, అతని తర్వాత అతను వెనుక ఉన్న వారిలో నీవు వారికి ఒక బాధ్యునిగా అయిపో. అతన్ని మరియు మమ్మల్ని కరుణించు ఓ మా సర్వ లోకాల ప్రభువా! అతని సమాధిని విశాల పరుచు. అతని సమాధిని కాంతితో నింపు“. ఈ విధంగా దువా చేయాలి మనం. ఇది కూడా ఒక సిఫారసు. అల్లాహ్ దయతో స్వీకరించబడుతుంది.

ఈ విధంగా సోదరులారా! సిఫారసు ఏ ఏ సందర్బాలలో జరుగుతుందో, ఏ ఏ సందర్భాలలో సిఫారసు చేసేవారు సిఫారసు చేస్తూ ఉన్నారో, ఎవరి గురించి సిఫారసు చేయబడుతుందో వారిలో మనం కూడా కలవాలి. మన గురించి కూడా ఎవరైనా పుణ్యాత్ములు సిఫారసు చేయాలి, దైవ దూతలు సిఫారసు చెయ్యాలి, ప్రవక్తలు సిఫారసు చెయ్యాలి అన్నటువంటి ఈ కేటగిరీని మనం ఎన్నుకునే దానికి బదులుగా అంతకంటే గొప్ప స్థానం దైవదూతలు మరియు ప్రవక్తలతో పాటు ఏ విశ్వాసులకు ఇతరుల గురించి సిఫారసు చేసే హక్కు ఇవ్వబడుతుందో అలాంటి పుణ్యాత్ముల్లో మనం చేరేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇస్లాం నేర్పేది కూడా మనకు ఇదే.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో మనకు తెలిపారు. “మీరు అల్లాహ్ తో స్వర్గాన్ని కోరుకున్నప్పుడు ఫిరదౌస్ గురించి మీరు దుఆ చేయండి. దానిని కోరుకోండి. స్వర్గాలలో అన్ని స్వర్గాల కంటే శ్రేష్టమైనది, అన్ని స్వర్గాల కంటే అతి ఉత్తమ, ఉన్నత స్థానంలో ఉన్నది మరియు మధ్యలో ఉన్నది ఆ ఫిరదౌస్“.

ఈవిధంగా ఎప్పుడూ కూడా మనం టాప్ లో కాదు, హై టాప్ లో ఉండే ప్రయత్నం చేయాలి. మనం హై టాప్ కు చేరకపోయినా కనీసం దానికి దగ్గరలోనైనా చేరవచ్చు. కానీ ముందే మనం టార్గెట్ చాలా చిన్నది పెట్టుకుంటే హై స్టేజ్ వరకు ఎప్పుడు చేరుకుంటాము?

ఈ సిఫారసులు పొందడానికి, సిఫారసులు చేయడానికి ఎలాంటి అధికారం ఉండాలి? ఎలాంటి కండిషన్స్ ఉండాలి? అల్లాహు తఆలా ఖురాన్ లో, హదీతుల్లో ఎలాంటి కండీషన్స్ మనకు నిర్ణయించాడు? వాటిని తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం.

గత కార్యక్రమంలో మరియు కార్యక్రమంలో ముందు వరకు మనం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాకుండా వేరే ప్రవక్తలకు, దైవదూతలకు, విశ్వాసులకు ఏఏ సందర్భాలలో ఎలాంటి సిఫారసు చేసే హక్కు దొరుకుతుందో తెలుసుకోవడంతో పాటు ఆ సిఫారసును పొందడానికి ఏఏ సత్కార్యాలు పనికి వస్తాయో అవి కూడా మనం తెలుసుకున్నాము. అయితే సిఫారసు చేయడానికి, సిఫారసు పొందడానికి ఎలాంటి కండీషన్స్, నిబంధనలు అవసరమో అల్లాహు తఆలా వాటిని కూడా ఖురాన్ లో తెలిపి ఉన్నారు. ఆ కండీషన్స్, ఆ నిబంధనలు మనలో ఉన్నప్పుడే మనం ఒకరికి సిఫారసు చేయగలుగుతాము. ఆ కండీషన్స్ మనలో ఉన్నప్పుడే ఒకరి సిఫారసు మనం పొందగలుగుతాము. వాటిని తెలుసుకోవడం మనలో ఏదైనా ఒకటి దానిలో లేకుంటే అది మనలో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం కూడా తప్పనిసరి.

అందులో మొట్ట మొదటి విషయం. సిఫారసు యొక్క సర్వాధికారం కేవలం అల్లాహ్ చేతిలో ఉన్నదన్న విషయాన్ని మనం దృఢంగా నమ్మాలి. ఎందుకంటే మహాశయులారా! నమ్మకం ఎంత బలహీనం అయిపోతుందో, అంతే పుణ్యాత్ములను, బాబాలను, దర్గాలను ఇంకా వేరే ఎవరెవరినో మనం ఆశించి వారు మనకు సిఫారసు చేస్తారు అని వారి వద్దకు వెళ్లి కొన్ని పూజ పునస్కారాలు, కొన్ని ఉపాసనాలు, కొన్ని ఆరాధనలు వారి సంతోషానికి అక్కడ చేసే ప్రయత్నాలు ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్నారు. అయితే ఆ ప్రళయ దినాన ఎవరి సిఫారసు చెల్లదు. ఎవరు కూడా ఏ సిఫారసు చేయలేరు. ఎవరికీ కూడా ఏ అధికారం ఉండదు. సర్వాధికారం సిఫారసు గురించి, అన్ని రకాల సిఫారసులకు ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే.

రెండవ విషయం మనం తెలుసుకోవలసినది ప్రళయ దినాన ఎక్కడా కూడా, ఏ ప్రాంతంలో కూడా అల్లాహ్ అనుమతి లేనిది ఏ ఒక్కరు నాలుక విప్పలేరు, మాట మాట్లాడలేరు. ఆయతల్ కుర్సీ అని ఏదైతే మనం ఆయత్ చదువుతామో సూరయే బకరా లో ఆయత్ నెంబర్ 255. అందులో చాలా స్పష్టంగా ఈ విషయం అల్లాహు తఆలా తెలియజేసాడు. مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? .అరబీ గ్రామర్ ప్రకారంగా ఈ పదాల కూర్పును కూడా గమనించండి. చెప్పే విధానాన్ని కూడా గమనించండి. ఎవరు అతను? ఎవరికి అలాంటి అధికారం ఉన్నది? ఎవరు చేయగలుగుతారు ఈ కార్యం? అతని వద్ద సిఫారసు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది? ఆయన అనుమతి లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు చేయగలుగుతారు? ఎవరికి అంతటి శక్తి, సామర్థ్యం ఉన్నది? రెండో విషయం ఏంటి? అల్లాహ్ అనుమతి లేనిది ఎవరు కూడా సిఫారసు చెయ్యలేరు, ఎవరు నోరు విప్పలేరు, మాట మాట్లాడలేరు.

మూడో విషయం మనం తెలుసుకోవలసినది. అల్లాహ్ అనుమతి ఇచ్చిన వారే సిఫారసు చేస్తారు అని కూడా మనకు రెండో విషయం ద్వారా తెలిసింది కదా! ఇక అల్లాహ్ ఎవరికి అనుమతి ఇస్తాడు? ఆయన ఇష్టపడిన వారికే సిఫారసు చేసే అనుమతి ఇస్తాడు. ఇక ఈ విషయము ఇహలోకంలో మనం ప్రత్యేకంగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), సామాన్యంగా ఇతర ప్రవక్తలు తప్ప పేరు పెట్టి ఫలాన వ్యక్తి కూడా సిఫారసు చేయగలుగుతాడు, అల్లాహ్ అతనికి అనుమతి ఇస్తాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే అలాంటి ఏ ఆధారము ఖురాన్ మరియు హదీత్ లో లేదు. విషయాన్ని గమనిస్తున్నారా! మూడో విషయం ఏంటి? అల్లాహ్ ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడో వారికే అనుమతిస్తాడు. ముందు దీని యొక్క ఆధారం వినండి.

۞ وَكَم مِّن مَّلَكٍۢ فِى ٱلسَّمَـٰوَٰتِ لَا تُغْنِى شَفَـٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ

సూరా నజ్మ్ ఆయత్ నెంబర్ 26. “ఆయన ముందు ఎవరు కూడా సిఫార్సు చేసే అధికారం కలిగిలేరు. ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఎవరైనా సిఫారసు చేయగలుగుతారు. కానీ అల్లాహ్ ఎవరి పట్ల ఇష్టపడతాడో మరియు ఎవరి గురించి కోరుతాడో అతనికి మాత్రమే అల్లాహు తఆలా అనుమతి ఇస్తాడు“.

ఈ మూడో విషయం కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోకుంటే, దీనిని అర్థం చేసుకోకుంటే ఈరోజు చాలా నష్టం కలుగుతుంది. ప్రజలు తమ ఇష్టానుసారంగా ఇతను నాకు సిఫారసు చేస్తాడు. అంతే కాదు వారి యొక్క పేర్లతో వారి తాత ముత్తాతల పేర్లతో సంతకాలు చేయించుకొని, కాగితాలు భద్రంగా దాచుకొని సమాధుల్లో కూడా పెట్టుకుంటున్నారు. ఈవిధంగా మనకు వారి యొక్క సిఫారసు లభిస్తుంది అన్నటువంటివి ఇవన్నీ మూఢ నమ్మకాలు. అల్లాహ్ ఎవరిపట్ల ఇష్టపడతాడో, అల్లాహ్ ఎవరికి ఇష్టపడిన తర్వాత ఎవరిని కోరుతాడో వారికే అనుమతి ఇస్తాడు. ఈ ఆయత్ ద్వారా మనకు మరో విషయం కూడా బోధపడుతుంది. అల్లాహ్ ఎందరినో ఇష్టపడవచ్చు. కానీ సిఫారసు చేయడానికి అనుమతి కొందరికే ఇవ్వవచ్చు.

ఎందుకంటే నాలుగో కండీషన్, నాలుగో విషయం కూడా గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఏమి తెలుసుకున్నాం మనం? సిఫారసు చేయడానికి ఏదైతే అనుమతి కలగాలో, అల్లాహ్ ఇష్టపడిన వారికే అనుమతిస్తాడు. అయితే వీరు ఎవరి గురించి సిఫారసు చేయాలి? వారిపట్ల కూడా అల్లాహు తఆలా ఇష్టపడాలి. వారి యొక్క మాట, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క జీవిత విధానం ఇదంతా కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడే అల్లాహ్ తెలియపరుస్తాడు నీవు సిఫారసు చేయాలి, ఇతని గురించి చేయాలి అని.

ఉదాహరణకు అల్లాహ్ ఒక వ్యక్తికి అనుమతి ఇచ్చాడు అనుకోండి. నీవు సిఫారసు చెయ్యి అని. అయితే తాను కోరిన వారందరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు. అల్లాహు తఆలా కొన్ని హద్దులు నిర్ణయిస్తాడు. కొన్ని షరతులు నిర్ణయిస్తాడు. నిబంధనలు పెడతాడు. వాటిలో ఒకటి ముఖ్యమైనది ఏమిటి? ఎవరి గురించి సిఫారసు చెయ్యాలో వారిపట్ల కూడా అల్లాహు తఆలా సంతోషంగా ఉండాలి.

సూరయే మర్యమ్ ఆయత్ నెంబర్ 87. “అల్లాహ్ వద్ద ఎవరైతే తన ఒడంబడికను నిలుపుకున్నారో అలాంటి వారికే సిఫారసు లభిస్తుంది“. సిఫారసు చేసే హక్కు గాని, మరియు సిఫారసు పొందే హక్కు గాని. ఎందుకంటే అల్లాహ్ తో ఏ వాగ్దానం ఉన్నదో ప్రత్యేకంగా “కలిమె తయ్యిబా” కు సంబంధించిన వాగ్దానం. అందులో మనిషి ఏమాత్రం వెనక ఉండకూడదు.

మరియు సూరా తాహా ఆయత్ నెంబర్ 109 లో “ఆ రోజు ఎవరి సిఫారసు ఎవరికీ ఎలాంటి లాభం చేకూర్చదు. కేవలం అల్లాహ్, రహ్మాన్ అనుమతించిన వారికి మరియు ఎవరి మాట, ఎవరి పలుకుతో అల్లాహ్ ఇష్టపడ్డాడో వారు మాత్రమే“.

ఈవిధంగా మహాశయులారా! ఈ ఆయతులు అన్నింటినీ పరిశీలించండి. ఈ రోజుల్లో ఈ విషయాలు, ఈ సత్యాలు తెలియక సిఫారసు కు సంబంధించిన పెడ మార్గంలో, తప్పుడు భావంలో ఏదైతే పడి ఉన్నారో, వాటి నుండి మనం బయటికి రావడం తప్పనిసరి. ఆ తప్పుడు మార్గాలు ఏమిటి? సిఫారసు కు సంబంధించిన దుర నమ్మకాలు, మూడనమ్మకాలు, దుర విశ్వాసాలు ఏమిటి? ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో మనం తెలుసుకుందాం.

43:86  وَلَا يَمْلِكُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ الشَّفَاعَةَ إِلَّا مَن شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُونَ

అల్లాహ్‌ను వదలి వీళ్లు ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారికి, సిఫారసుకు సంబంధించిన ఏ అధికారమూ లేదు. కాని సత్యం గురించి సాక్ష్యమిచ్చి, దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం (సిఫారసుకు యోగ్యులు).” (సూరా అజ్ జుఖ్ రుఫ్ 43:86)

ఇక్కడ మనం సూరయే జుఖ్ రూఫ్ ఆయత్ నెంబర్ 86 లో కూడా పరిశీలించడం చాలా లాభదాయకం. “ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులను పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఇతరులతో దుఆ చేస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు ఎలాంటి సిఫారసుకు అధికారులు కాజాలరు”. అల్లాహు అక్బర్.

సిఫారసుకు సంబంధించిన దురనమ్మకం, మూడ విశ్వాసం, ఎవరైతే అల్లాహ్ ను వదిలి అల్లాహ్ తో దుఆ చేయకుండా, ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి యొక్క సిఫారసు పొందాలని కోరుతున్నారో వారికి ఎలాంటి సిఫారసు లభించదు. ఎవరైతే సత్యానికి సాక్ష్యం పలికి ఉంటారో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ కు సాక్ష్యం పలికి ఉంటారో, వారు దాని యొక్క భావాలను, అర్ధ భావాలను కూడా తెలుసుకొని ఉంటారో. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం పలకడం ఏంటిది? దాని అర్థ భావాలను తెలుసుకోవడం ఏంటిది? సాక్ష్యం పలకటం అంటే నోటితో పలకడం అని సామాన్యంగా మనం అనుకుంటాము కదా! కానీ దాని యొక్క అర్ధ భావాలను తెలుసుకోవడం అంటే అల్లాహ్ కు ఎవరినీ భాగస్వామిగా కలపకపోవడం. దుఆ లో, మొక్కుబడులలో, సజ్దాలో, సాష్టాంగ పడటంలో, రుకూ చేయడంలో ఇంకా వేరే ఎన్ని ఆరాధనకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరిని కూడా మనం భాగస్వామిగా చెయ్యకూడదు. ఆరాధనకు సంబంధించిన ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయకూడదు.

ఈరకంగా ఎవరైతే తన విశ్వాసం మరియు ఏకేశ్వరోపాసన లో షిర్క్ లేకుండా నమాజ్ యొక్క పాబంది చేస్తూ తన నాలుకను కూడా కాపాడుకుంటూ ఉంటాడో, ప్రజల్ని దూషిస్తూ, ప్రజల యొక్క పరోక్ష నింద చేస్తూ, చాడీలు చెప్పుకుంటూ ఇతరులలో ఎలాంటి అల్ల కల్లోలం జరపకుండా నాలుకను కాపాడుకుంటాడో అలాంటి వారే సిఫారసును పొందగలుగుతారు.

చివరిలో ఒక హదీత్ కూడా వినండి ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “మాటిమాటికి ప్రజల్ని శపించేవారు, శాపనార్థాలు పెట్టేవారు ప్రళయ దినాన సాక్షానికి కూడా అర్హులు కారు, సిఫారసుకు కూడా అర్హులు కారు“. సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 4703. ఎంత గంభీర్యమైన విషయమో గమనించాలి. సిఫారసు ఎలాంటి వారు పొందలేరు అని ఇందులో తెలపడం జరుగుతుంది.

ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో సిఫారసు కు సంబంధించిన మూడ నమ్మకాలు ఏంటి? దుర విశ్వాసాలు ఏంటి? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: