మరణాంతర జీవితం – పార్ట్ 11: విశ్వాసులలో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో, వారు ప్రళయదినాన ఎలా హాజరవుతారు? [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 11 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 11. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 22:03 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక – విశ్వాసులలో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో, వారు ప్రళయదినాన ఎలా హాజరవుతారు? ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దీని వల్ల మనకు ఇహలోకంలో అలాంటి పాపాలు చేయకుండా జాగ్రత్తపడి ఉండాలన్నటువంటి ఒక జాగృతి కలుగుతుంది.

ఆ పాపాల్లో – అల్లాహ్ ఏ ధనధాన్యాలు మనకు ప్రసాదించాడో వాటిలో ఆయన ఒక నిర్ణీత పరిమాణంలో బీదవాళ్లకు ఇవ్వాలని ఏదైతే ఆదేశించాడో – అంటే జకాత్, విధిదానం అది చెల్లించకపోవడం. వాస్తవానికి మనం చూస్తే బంగారం గాని, వెండి గానీ లేదా మన వద్ద ఉన్నటువంటి కాష్ అమౌంట్ అందులో కేవలం రెండున్నర శాతం మాత్రమే మనం ఇవ్వాల్సింది. అంటే తొంబై ఏడున్నర శాతం మన వద్దనే ఉంటుంది. బీదవాళ్లకు కేవలం రెండున్నర శాతం మాత్రమే. కానీ మనలో ఎంతోమంది ధనవంతులు ఈ రెండున్నర శాతం కూడా పేదవాళ్లకు వారి హక్కు ఇవ్వడం మానుకుంటారు.

దీని మూలంగా ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేచి ప్రళయ దినాన ఆ మహా మైదానంలో హాజరు అవుతామో ఈ జకాత్ చెల్లించని వారు ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటారు. ఏంటి అది? వారి యొక్క ఆ సొమ్మును ఇనుప పత్రాలుగా తయారు చేసి నరకాగ్నిలో వేడి చేసి, వాటి ద్వారా ఆ మనిషి యొక్క ముఖము ముందటి భాగం, వెనుకభాగం, కుడి, ఎడమ ప్రక్కలలో వాతలు పెట్టడం జరుగుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? వినండి ఈ హదీస్. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఇలా వాతలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. చల్లారినప్పుడల్లా మళ్ళీ వేడి చేయడం, మళ్లీ వాతలు పెట్టడం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ రోజున ఏ రోజైతే యాబైవేల సంవత్సరాల పరిమాణంలో ఉందో ఎప్పటివరకు జరుగుతుంది? మానవుల మధ్యలో తీర్పు జరిగి పూర్తి అయ్యేంత వరకు. ఆ తరువాత ఇక అతడు స్వర్గవాసుల్లో అవుతాడా? నరకవాసుల్లో అవుతాడా? ఆ నిర్ణయాలు తర్వాత జరుగుతాయి. కానీ ఈశిక్ష ఇలా జరుగుతూనే ఉంటుంది ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే సమాధులు నుండి లేచి హాజరవుతారో”.

అలాగే ఒంటెల్లో కుడా జకాత్ ఉంది. ఎవరి వద్దనయితే ఆవులు ఉంటాయో వారు కూడా జకాత్ చెల్లించాలి. కనీసం 5 ఒంటెలు ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించాలి. కనీసం 30 ఆవులు ఉన్న వ్యక్తి అతను జకాత్ చెల్లించాలి. కనీసం 120 మేకలు ఉన్న వ్యక్తి ఇందులో నుండి జకాత్ తీయాలి. జకాత్ చెల్లించకుంటే ప్రళయ దినాన ఆ వ్యక్తి హాజరు అవుతాడు. అతని ఆ జంతువులు వస్తాయి. ఆ జంతువులు అతన్ని తమ కాళ్లతో, కొమ్ములతో కొడుతూ వారిని తొక్కుతూ ఈవిధంగా శిక్ష జరుగుతూనే ఉంటుంది ప్రజల మధ్యలో తీర్పు జరిగేంత వరకు. అల్లాహు అక్బర్. అందుగురించి ఈనాటి ఈ జీవితంలో మనం చిన్నపాటి కష్టాన్ని భరించలేక పోతామో, ఇక్కడ ఎవరైనా ఏదైనా సందర్భంలో సహాయానికి రావచ్చు. కానీ అక్కడ ఎవరూ కూడా ఏ సహాయాన్ని పొందలేరు.

ఇంకా రెండవ పాపం – గర్వము, అహంకారము. ఇది కూడా మహా చెడ్డ పాపం. ఎవరిలో ఈచెడ్డ గుణం చోటు చేసుకుంటుందో ఎన్నో సత్యాలను, ధర్మాలను, ఎన్నో మంచి విషయాల్ని తిరస్కరిస్తాడు. అందుగురించి ఎవరైతే ఇహలోకంలో అహంకారానికి గురి అవుతారో వారికి ఇలాంటి శిక్ష ఇవ్వడం జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హెచ్చరించారు. “మైదానే మెహ్ షర్ లో గర్వ అహంకారానికి గురైన వారిని ఎలా తీసుకురావడం జరుగుతుంది? వారు చిన్న చీమలు ఏవైతే ఉంటాయో, వాటి కంటే అధ్వానంగా ఉంటారు. వారు గర్వంలో, అహంకారంలో తమకు తాము ఎంతో పెద్దగా, గొప్పగా చెప్పుకునేవారు. అల్లాహ్ (తఆలా) చూసే వారు కూడా వారిని హీనంగా భావించాలని చీమ కంటే మరీ చిన్నగా. అప్పుడు నలువైపుల నుండి వారిపై అవమానం అనేది కమ్ముకొని ఉంటుంది“. ఎవరైతే అల్లాహ్ ఇహలోకంలో వారికీ ఏ అనుగ్రహం, వరం ప్రసాదించి ఉన్నా దానిపై ఎలాంటి గర్వానికి గురి కాకుండా ఆ అనుగ్రహాన్ని, ఆయన యొక్క విధేయతలో ఉపయోగించే ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ప్రజలకు సేవ చెయ్యాలి. అల్లాహ్ పట్ల విశ్వాసం, నమ్మకం బలంగా కలిగి ఉండాలి.

మూడవ రకమైన పాపం – ఇందులో ఎన్నో రకాల పాపాలు వస్తాయి. ఏమిటి శిక్ష? అల్లాహ్ వారిపై ఆగ్రహిస్తాడు ఆ ప్రళయదినాన. వారి వైపున కన్నెత్తి చూడడు, వారితో మాట్లాడడు, వారికి కఠిన శిక్ష విధిస్తాడు. ఎవరు అలంటి వారు? ఎవరికైతే అల్లాహ్ ధర్మ విద్య ప్రసాదించాడో అతడు దానిపై ఆచరిస్తూ, ఇతరులకు సత్య విషయాలు తెలియ జేస్తూ, ధర్మ విషయాలు ప్రజలకు బోధ చేస్తూ, ప్రజలు ఏదైనా విషయం ధర్మానికి సంబంధించింది అడిగినప్పుడు అతనికి తెలిసి ఉంటే ఏమాత్రం దాపరికం, ఏమాత్రం దాన్ని దాచి పెట్టకుండా స్పష్టంగా తెలియజేయాలి. ఎవరైతే దాచి పెడతారో వారితో కూడా అల్లాహ్ (తఆలా) ప్రళయదినాన మాట్లాడడు.

చదవండి ఖురాన్ యొక్క ఆయత్ “మేము స్పష్టమైన ఆధారాలు ఏవైతే అవతరింపజేశామో అవి వారికి చేరినప్పటికీ వాటిని వారు దాచిపెడతారు. ఎవరైతే ఇలాంటి కార్యానికి గురి అవుతారో? ఏమిటి శిక్ష వారికి? ప్రళయదినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారితో మాట్లాడడు.” ఈ రోజుల్లో ఎంతో మంది అల్లాహ్ ఆయతులను ప్రపంచపు యొక్క చిన్నపాటి సామాగ్రి కొరకు అమ్ముకుంటూ ఉంటారు. ప్రజలకు ఇష్టమైన రీతిలో వారి కోరికల ప్రకారంగా వారికి పరిష్కారం తెలిపే ప్రయత్నం చేస్తారు. అల్లాహ్ తో భయపడకుండా అల్లాహ్ అవతరింపజేసిన సత్య విషయాల్ని దాచిపెడతారు. అలాంటి వారికి సూరయే బకరాలోని 174, 175 ఆయతులు వారిలో జాగృతిని తీసుకురావాలి. వారు అలాంటి చెడు అలవాటును మానేయాలి.

మరొక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియపరిచారు. “ఎవరైతే విద్య నేర్చుకొని దాన్ని కంఠస్తం చేసి ఉన్నారు. అయినా అది ప్రజలకు తెలియ చేయకుండా మౌనం వహిస్తారు. దాన్ని దాచిపెడతారు. ప్రళయదినాన అతడు హాజరవుతాడు. అతన్ని తీసుకురావడం జరుగుతుంది. అతని నోటికి కళ్లెం వేయబడుతుంది. ఎలాంటి కళ్లెం? నరకానికి సంబంధించిన కళ్లెం“. ఈ హదీస్ ఇబ్నుమాజా లో ఉంది. హదీస్ నెంబర్ 261. ఈవిధంగా అల్లాహ్ ప్రసాదించిన విద్యను ప్రజలకు తెలియ చేయకుండా, ధర్మం వారికి నేర్పకుండా ఉండడం కూడా మనల్ని శిక్షకు గురి చేస్తుంది.

ఇంకా ఎవరి పట్ల అయితే అల్లాహ్ (తఆలా) తన ఆగ్రహం వ్యక్తం పరుస్తాడో, మాట్లాడాడో, వారి వైపు కన్నెత్తి చూడడో మరియు వారికి కఠిన శిక్ష విధిస్తాడో వారిలో ఒకరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని దాన్ని పూర్తి చేయకుండా వాగ్దాన వ్యతిరేకం చేయడం. ఇది కూడా మహా పాపం. అల్లాహ్ ఖురాన్ సూర ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 77 లో ఇలా తెలిపాడు. “ఎవరైతే అల్లాహ్ పేరున వాగ్దానాలు చేసి ప్రజలతో ఒడంబడికలు చేసుకొని వాటిని పూర్తి చేయకుండా వాగ్దాన వ్యతిరేకం చేస్తారో, అలాంటి వారికి ప్రళయ దినాన ఎలాంటి పుణ్యాల్లో రవ్వంత వారికి భాగం లేదు. అల్లాహ్ వారితో మాట్లాడడు. వారి వైపున చూడడు. వారికి కఠిన శిక్ష విధిస్తాడు“.

ఇంకా మహాశయులారా! ఏ పాపాల వల్లనయితే అల్లాహ్ ఆగ్రహం కురుస్తుందో, అల్లాహ్ వారి వైపున చూడడో, మాట్లాడడో వారిలో మరో మూడు రకాల వారు వస్తారు. వారి గురించి సహీ ముస్లిం షరీఫ్ హదీస్ నెంబర్ 106 లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు. “మూడు రకాల మనుషులు ఉన్నారు. అల్లాహ్ ప్రళయదినాన వారితో మాట్లాడడు. వారి వైపున చూడడు. వారిని శుభ్రపరచడు. వారికి కఠిన శిక్ష విధిస్తాడు“. ఈవిధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సార్లు చెప్పారు.

ఇదే మాట అప్పుడు అబూధర్ (రదియల్లాహు అన్హు) ఓ ప్రవక్తా! వారు నాశనం అయిపోయారు. వారు చాలా నష్టంలో పడిపోయారు. ఎవరు వారు? ఎలాంటి పాపాలు చేసినవారు? అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారు. “తమ వస్త్రాలను చీల మండలాని (ankles) కి క్రిందిగా తొడిగే వారు, ఈ రోజుల్లో మనలో ఎంతో మంది ఈ పాపానికి గురి అవుతున్నారు. మనకు నష్టం ఏముందండి ఒకవేళ మనం చీల మండలానికి పైగా తొడుగుతే? చీల మండలానికి పైగా తొడిగితే ఇంతటి ఘోరమైన శిక్షల నుండి, ప్రళయదినాన సంభవించేటువంటి ఇలాంటి ఘోర బాధల నుండి మనం తప్పించుకోగలుగుతాం కదా!

ఆ ముగ్గురు ఎవరు? ఒకరు చీల మండలానికి క్రింది గా తమ వస్త్రాలు ధరించే వారు. రెండోవారు ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసి, వారికి బాధ కలిగించే వారు. మాటిమాటికి గుర్తు చేసి, వారిని మనసు నొప్పించే వారు. మూడో రకమైన వారు తమ యొక్క సామాగ్రిని అసత్యపు ప్రమాణాలతో విక్రయించేవారు. ఈ మూడు రకాల వారికి ఈశిక్ష అని తెలియజేయడం జరిగింది.

ఇలాంటి శిక్షకే గురి అయ్యేవారు మరికొందరు ఉన్నారు. వారి ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు. మూడు రకాల వారు. అల్లాహ్ ప్రళయదినాన వారి వైపున చూడడు. వారిని శుభ్రపరచడు. వారికి కఠిన శిక్ష, బాధాకరమైన శిక్ష ఉంటుంది. వారిలో ఒకరు దారిలో ఒక బాటసారి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి దాహం కలిగింది. పక్కనే అక్కడ ఒక వ్యక్తి అతని వద్ద అతని అవసరానికంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. అయినా ఒకరికి త్రాగడానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యక్తి కూడా ప్రళయ దినాన అల్లాహ్ కరుణను నోచుకోడు. అల్లాహ్ మాట్లాడడు. అల్లాహ్ కఠిన శిక్ష విధిస్తాడు. రెండో రకమైన వ్యక్తి. తన నాయకుడు అతని చేతిలో చేయి వేసి మాట వాగ్ధానం ఇచ్చి నేను నీకు విధేయుడిగా ఉంటాను అని అంటాడు. కానీ ఇది కేవలం ప్రాపంచిక ఉద్దేశంతో. అతని ద్వారా ప్రపంచ లాభం ఏదైనా కలిగితే అతనితో ఉంటాడు. లేదా అతనికి వ్యతిరేకంగా ఉంటాడు. ఇలాంటి వారికి కూడా ఈ శిక్ష ఉంటుంది. మూడో రకమైన వ్యక్తి అస్ర్ తరువాత నిలబడి తన సామాను అమ్ముకుంటున్నాడు. మాట మాటల్లో అల్లాహ్ సాక్షిగా నేను దీనిని ఇంతకే కొన్నాను అని అబద్దపు ప్రమాణాలు అల్లాహ్ పేరు మీద చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 77 ఏదైతే మనం ఇంతకుముందు విన్నామో అది పఠించారు, పారాయణం చేశారు.

ఈ హదీత్ సహీ బుఖారీ లో ఉంది. హదీత్ నంబర్ 2358. ఇంకా ఆ ప్రణయ దినాన మహా మైదానంలో ఎలాంటి పాపాలు చేసిన వారికి ఏమి జరుగుతుంది? ఈ హదీత్ వినండి, సహీ ముస్లిం షరీఫ్, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “మూడు రకాల వారు ఉన్నారు. అల్లాహ్ ప్రణయ దినాన వారితో మాట్లాడడు. వారిని శుభ్రపరచడు. వారి వైపునకు చూడడు. వారికి కఠిన శిక్ష ఉంటుంది. ఎవరు వారు? వివాహమైన తరువాత వృద్ధాప్యానికి చేరుకుంటూ కూడా వ్యభిచారానికి గురి అయ్యేవాడు. రెండు రకమైన వ్యక్తి, రాజ్య పీఠానికి అధికారుడు అయ్యాడు. అయినా అబద్దం పలుకుతున్నాడు. అలాంటి వ్యక్తికి కూడా ఈ శిక్ష. మూడో రకమైన వ్యక్తి బీదవాడు, బిచ్ఛం అడుక్కు తినేటటువంటి పరిస్థితి. అయినా గర్వాహంకారానికి గురి అవుతున్నాడు. ఇలాంటి ముగ్గురిని కూడా కఠిన శిక్షకు గురి చేసి అల్లాహ్ వారిని శుభ్రపరచడు, వారితో మాట్లాడాడు. వారి వైపున చూడడు అని చెప్పడం జరిగింది“.

అలాగే ఆ ప్రళయదినాన ఎక్కడైతే అల్లాహ్ క్షణం పాటు మన వైపు చూసి మాట్లాడకుంటే మన యొక్క పరిస్థితి గత ఎపిసోడ్ లలో మనం విని ఉన్నాము. ఎంత ఘోరంగా ఉంటుంది. ఎంత దీర్ఘకాలం ఉంటుంది. అక్కడ ఆ కష్టాలను ఎదుర్కోకుండా ఉండాలంటే ఇహలోకంలో ఇలాంటి పాపాలు మనం విడనాడు కోవాలి.

మరొక హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరో రకమైన ముగ్గురు గురించి చెప్పారు. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తెలిపారు. మూడు రకాల వారి వైపున అల్లాహ్ (తఆలా) ప్రళయదినాన కన్నెత్తి చూడడు. ఒక రకమైన వ్యక్తి, తన తల్లిదండ్రుల పట్ల అవిధేయునిగా ఉండేవాడు. పురుషులు లాంటి దుస్తులు, పురుషులు లాంటి వేషాలు వేసే స్త్రీ. మూడో రకమైన వ్యక్తి తన ఇంట్లో చెడును చూసి కూడా సహిస్తూ ఉండేవాడు. దాన్ని ఆపివేయడం, దాన్ని తీసివేయడం, ఆ చెడు నుండి తన ఇంటి వారిని ఆపడం ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. అలాంటి వ్యక్తిని దయ్యూస్ అంటారు. ఇలాంటి వారిపట్ల కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కన్నెత్తి చూడడు“.

ఇంకా ప్రళయదినాన ఆ మైదానంలో మనం ఆకలి దప్పులకు గురి కాకూడదు అంటే ఇహలోకంలో ఆ పరలోకాన్ని గుర్తు చేసుకోవాలి. బీద వాళ్ళను గుర్తు చేయాలి. విశ్వాస మార్గం మీద ఉండి కేవలం తనను తాను మాత్రమే జీవిస్తున్నాడు అన్నట్లుగా భావించకుండా తానే కడుపు నిండా తినుకుంటూ, ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి కడుపు నిండా తిని బేవులు తీస్తూ ఉన్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. ఇలా బేవులు తీయడం మానుకో, ఇహలోకంలో ఎల్లప్పుడూ కడుపు నిండా తినుకుంటా ఉండేవారు ప్రళయ దినాన దీర్ఘకాలం వరకు ఆకలితో ఉంటారు. అల్లాహు అక్బర్. తిర్మిది యొక్క హదీత్ ఇది.

ఈవిధంగా ప్రజలారా! ప్రళయ దినాన ఇలాంటి పాపాలకు గురి అయ్యే వారికి ఇలాంటి శిక్షలు ఉన్నాయి అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఆ రోజు రాకముందు మనం ఇహలోకంలో మనల్ని మనం చక్క దిద్దుకోవాలి. విశ్వాస మార్గాన్ని అవలంభించి ఏకైక సృష్టికర్తను ఆరాధిస్తూ, ఆయన ప్రవక్త విధానాన్ని పాటిస్తూ, మనం ఇస్లాం ప్రకారంగా జీవితం గడుపుతూ, సాధ్యమైనంతవరకు పాపాల నుండి దూరం ఉంటూ ఉంటె, ప్రళయ దినం దీర్ఘకాలం ఏదైతే ఉందో, ఎన్నో కష్టాలు, బాధలతో కూడుకొని ఉందో ఆ కష్ట బాధలు మన నుండి దూరమై ఆ కాలం మనకు చాలా తేలికగా, తొందరగా గడవవచ్చు. అల్లాహ్ (తఆలా) అన్ని రకాల పాపాల నుండి మనల్ని కాపాడుగాక.

అయితే మరో రకం అవిశ్వాసులు వారి ప్రస్తావన గడిచింది. విశ్వాసంలో పాపాత్ములు వారి ప్రస్తావన కూడా ఈ రోజు మనం విన్నాము. ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో పుణ్యాత్ములే పుణ్యాత్ములు. అల్లాహ్ యొక్క ప్రియమైన దాసులు. వారిపై అల్లాహ్ యొక్క కరుణలు ఎలా కురుస్తాయి ప్రళయ దినాన? వాటిని విని అలాంటి వారిలో మనం చేరే ప్రయత్నం చేద్దాము. తరువాయి భాగాన్ని కూడా తప్పకుండా వింటారు అని ఆశిస్తూ మీతో శెలవు తీసుకుంటున్నాను

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: