మరణాంతర జీవితం – పార్ట్ 10 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
పార్ట్ 10. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:21 నిముషాలు]
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఆ మహా మైదానంలో ఒక వైపున ఆరాధ్యనీయులు, మరోవైపు ఎవరినైతే ఆరాధించడం జరిగిందో వారి మధ్యలో జరుగుతున్న వివాదాలను మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము. ఏ పుణ్యాత్ములనైతే ఆరాధించడం జరిగినదో వారు ఇలాంటి ఆరాధనతో తమ జీవితంలో ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. అలాంటి వారు ఆ మైదానంలో ఎవరినైతే మేము మిమ్మల్ని ఆరాధించాము అని అంటారో, అలాంటి వారికి ఏమి సమాధానం ఇస్తారు? వినండి “షిర్క్ చేసిన వాళ్ళు ఎవరినైతే అల్లాహ్ తో పాటు భాగస్వామిగా కలిపి షిర్క్ చేశారో వారిని చూసినప్పుడు అల్లాహ్ వైపునకు తిరిగి ఓ మా ప్రభువా! వీరు! వీరే, వీరినే మేము నిన్ను కాకుండా భాగస్వామిగా చేసి, నిన్ను వదిలి వీరిని మేము ఆరాధిస్తూ ఉంటిమి. వీరితో మేము దుఆలు చేస్తూ ఉంటిమి, వీరిని మేము అర్థిస్తూ ఉంటిమి. అప్పుడు వారు తిరిగి మాట వారి వైపునకు వేసి, మీరు అసత్యం పలుకుతున్నారు, మీరు అసత్యం పలుకుతున్నారు“. మరోచోట ఆయత్ ఉంది. “మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు“. ఈ విధంగా పరస్పరం వివాదం జరుగుతుంది. వారు వీరిని తిరస్కరిస్తారు.
ఎవరైనా గాని, ఈ రోజుల్లో ఎందరో కలిమా చదివిన ముస్లిం సోదర సోదరీమణులు కూడా అల్లాహ్ ను కాకుండా ఎవరెవరితో దుఆ చేస్తున్నారు. ఆరాధనకు సంబంధించిన ఎన్నో విషయాలు అల్లాహ్ ను కాకుండా, ఎవరెవరితో ఆ ఆరాధన యొక్క కొన్ని భాగాలు, కొన్ని రకాలు వారి ముందు పాటిస్తూ ఉన్నారు. అయితే పరలోకమున మైదానే మెహ్ షర్ లో వెళ్ళిన తరువాత ఏమి జరుగుతుంది? ఈ ఆయతులను చదివి తెలుసుకొని వీటి ద్వారా గుణపాఠం పొందే ప్రయత్నం చేయాలి.
ఇంకా ఈ ఇహలోకంలో ఆరాధనా సంబంధమైన విషయాల్లోనే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో సత్య మార్గాన్ని విడనాడి, సృష్టికర్త పంపినటువంటి సన్మార్గాన్ని వదిలేసి, కొందరి నాయకులను, కొందరి పెద్దలను ఏదైతే అనుసరిస్తూ ఉంటారో, ప్రళయ దినాన, ఆ మహా మైదానంలో వచ్చిన తర్వాత వారిని కూడా వారు తిరస్కరించి, మీరు మమ్మల్ని మీ వైపునకు ఇహలోకంలో లాక్కొనే ప్రయత్నం చేశారు. మీరు మమ్మల్ని ఇహలోకంలో పురికొల్పి, అల్లాహ్ ను వదిలి అల్లాహ్ పంపిన మార్గాన్ని వదిలి మీ వెనుక నడవాలి అని చెప్పారు. కానీ ఏమిటి? ఈ రోజు మాకు ఏమి సహాయం చేయడం లేదు.?
ఒకసారి మీరు సూర సాఫ్ఫాత్ ఆయత్ నెంబర్ పంతొమ్మిది నుండి ముప్పై ఐదు వరకు చదివి చూడండి. ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) అక్కడ జరిగే పరస్పరం వారి యొక్క వాగ్విదానాన్ని, ప్రశ్నోత్తరాలని, వారి మధ్యలో జరిగేటువంటి మాటల్ని ఎంత స్పష్టంగా అల్లాహ్ (తఆలా) తెలియజేసాడు. పరిస్థితి ఇంకా ఎప్పుడైతే ముదిరి పోతుందో, దీర్ఘకాలం అవిశ్వాసానికి గురి అయినందుకు ఆ కాలం మరింత కష్టంగా గడుస్తూ ఉంటుంది. ఇహలోకంలో ఎవరు ఎవరినైతే పూజించడం జరిగిందో, ఎవరెవరి వెనుక నడవడం జరిగిందో, వారందరినీ చూస్తున్నప్పటికీ వారు సహాయానికి రావట్లేదు. మరింత పరిస్థితి ఎప్పుడైతే దారుణంగా మారుతుందో, బలహీనులు, బలహీన వర్గాలు, ఏ బలం ఉన్న వారిని అనుసరించేవారో, ఏ ఏ ప్రజలు తమ నాయకుల్ని అనుసరించేవారో, ఏ ఏ ఆరాధించేవారు తమతమ వారిని ఎవరినైతే ఆరాధించేదో వాళ్ళందరినీ చూస్తూ వారి యొక్క సహాయం ఏమాత్రం పొందని యెడల శాపనార్థాలు కూడా మొదలుపెడతారు ఆ మైదానే మెహ్ షర్ లో, ఆ మహా మైదానంలో. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.
ఒకసారి సూరయే ఇబ్రహీం ఆయత్ నెంబర్ ఇరవై ఒకటి చూడండి. “వారందరూ అల్లాహ్ ఎదుట స్పష్టంగా హాజరవుతారు. బలహీనులు, బలవంతులతో గర్వంగా తమకు తాము నాయకులుగా అనుకున్న వాళ్ళతో అంటారు. మేము ఇహలోకంలో మీ వెనుక వెనుక ఉంటిమి. మిమ్మల్ని అనుసరించుకుంటూ ఉంటిమి. అయితే, ఈ రోజు మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి ఏ కొంచెమైనా దూరం చేసేఅటువంటి ఏదైనా అధికారం మీకు ఉందా? అలాంటిది ఏదైనా సహాయం మాకు చేయగలుగుతారా? ఆ నాయకులు, ఆ పెద్ద వారందరూ ఏమంటారు? అల్లాహ్ మాకు మార్గం చూపి ఉండేది ఉంటే, మేము కూడా మీకు మార్గం చూపి ఉండేవారిమి. అస్తగ్ ఫిరుల్లా! అబద్దం ఇది. అక్కడ కూడా అబద్ధం పలుకుతున్నారు. ఇహలోకంలో అల్లాహ్ (తఆలా) సన్మార్గం మనకు స్పష్టం చేసి పంపలేదా? ఇప్పుడు ఇక్కడ మనకు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా సమానమే“. అనుసరించే వాళ్లు, బలహీనులు, ప్రజలు తమ నాయకులకు ఏ శాపనాలు అయితే కురిపిస్తారో వాటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా ఖురాన్ లో మీరు చూడండి.
సూరయే అహ్ జాబ్ ఆయత్ నెంబర్ అరవై ఆరు నుండి అరవై ఎనిమిది వరకు – “ఆనాడు ఎప్పుడైతే నరకంలో వారి యొక్క ముఖాలు కాల్చుకుంటూ, తిప్పబడుతూ కాల్చడం జరుగుతుందో, అయ్యో! మేము అల్లాహ్ ను, అల్లాహ్ కు విధేయత చూపి, ప్రవక్తకు విధేయత చూపి ఉండేది ఉంటే ఎంత బాగుండును! వారంటారు – ఓ మా ప్రభువా! మేము మా నాయకులను, మా పెద్దవారిని అనుసరిస్తూ వచ్చాము. వారు మమ్మల్ని సన్మార్గం నుండి దూరం చేసి మార్గభ్రష్టత్వం లో పడవేశారు. ఓ ప్రభువా! ఇప్పుడు వారికి రెట్టింపు రెట్టింపు శిక్షలు ఇవ్వు. పెద్ద పెద్ద శాపనార్థాలు వారిపై కురిపించు.“ ఇలా శపిస్తూ ఉంటారు.
ఇంకా పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో సన్మార్గం మన వద్దకు వచ్చినప్పటికీ మనం దాన్ని స్వీకరించకుండా ఉంటాము. మా పెద్దలు మమ్మల్ని వద్దంటున్నారు, మా నాయకులు సత్యాన్ని స్వీకరించ వద్దు అంటున్నారు. ఈవిధంగా మనం ఎవరెవరినో అనుసరించి సన్మార్గం నుండి దూరమవుతాము. కానీ ఆనాడు ఎప్పుడైతే పరిస్థితి అంతా స్పష్టంగా మనకు అర్థమవుతుందో శాపనాలు కురిపించడం కూడా సరిపోయినట్లు ఏర్పడదు. మనసుకు శాంతి ఏర్పడదు. ఆ సందర్భంలో అప్పుడు ఏమంటారు? మీరే స్వయంగా చదవండి, గమనించండి, శ్రద్ధగా వినండి.
సూరయే హామీమ్ వస్సజ్దా, ఫుస్సిలత్ అని కూడా దానిని అంటారు. ఆయత్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఉంది. “ఓ మా ప్రభువా! జిన్నాతులలో, మానవులలో ఎవరెవరైతే మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేశారో వారందరినీ మాకు చూపించు. మేము వారిని మా కాళ్ళ కింద వేసి త్రొక్కుతాము. వారు నీచులుగా అయిపోవాలి“. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.
సోదరులారా! ఇంతటి ఘోరమైన పరిస్థితి ఆ రోజు రానుంది. అవన్నీ వివరాలు అల్లాహ్ మనకు తెలియజేశాడు. ఇకనైనా మనం గుణపాఠం నేర్చుకోకూడదా? మహాశయులారా! సోదర సోదరీమణులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత, ఆ మైదానంలో సమీకరింపబడిన తరువాత ఏ పరిస్థితులు దొరుకుతాయి? ఎవరు ఎవరికి ఎలాంటి సమాధానాలు చెప్పుకుంటారు? ఇవన్నీ వివరాలు ఏదైతే మనం వింటున్నామో ఆ కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గొప్ప దయ, కరుణ మనపై ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం నరకంలో పోకూడదని మనం ఆనాటి ఆ కష్టాలు అన్నిటినీ భరించకూడదని అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న చిన్న విషయాల్ని కూడా ఎంత స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడంటే, ఇకనైనా మనం సన్మార్గం వైపునకు రాకుండా ఆ ఏకైక సృష్టికర్త యొక్క మార్గాన్ని అవలంబించకుండా జీవితం గడిపితే ఎంత నష్టంలో కూరుకు పోతామో మీరే ఆలోచించండి. ఈనాడు ఈ మాటలు, పనికిమాలినవి, ఏం లాభం లేవు అని కొన్ని సందర్భాల్లో షైతాన్ ఆలోచన వల్ల ఎవరి మనసులో వచ్చినా ఈ పరిస్థితులు అన్నిటినీ కూడా ఎదుర్కొనేది ఉంది. ఎందుకంటే సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ మనకు ఈ విషయాలు తెలిపాడు గనుక తప్పకుండా ఇది సంభవించనున్నాయి.
అల్లాహ్ ను కాకుండా, ఆ సృష్టికర్తను కాకుండా ఎవరెవరినైతే మనం ఈరోజు గొప్పగా భావిస్తున్నామో వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చిన్నవాళ్ళుగా అవుతారు. ఆ రోజు సృష్టికర్త ఆకాశాలను తన ఒక చేతిలో చుట్టుకుంటాడు, భూమిని తన పిడికిలిలో పట్టుకుంటాడు. ఆ తరువాత ఎక్కడ ఉన్నారు? ఇహలోకంలో గర్వం, అహంకారంలో పడి తమకు తాము పెద్ద నాయకులుగా భావించేవాళ్ళు ఎక్కడున్నారు? కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు రాజు అయినంత మాత్రాన తన రాజ్యాధికారం ఎంత గొప్పది? నన్ను ఎదిరించే వారు ఎవరూలేరుగా భావించేవారు ఎక్కడున్నారు? ఎవరి వైపు నుండి ఏ యొక్క శబ్దం కూడా రాదు. ఎవరి నుండి ఏ మాట వినబడరాదు. అప్పుడు స్వయంగా అల్లాహ్ అంటాడు. “నేను మాత్రమే ఈరోజు రాజును. నాకే సర్వాధికారం ఉన్నది“.
సర్వ సృష్టిలో ప్రవక్తలు, అల్లాహ్ కు అతి ప్రియులైన వారు. ఆ మైదానంలో ఎప్పుడైతే ఒక దీర్ఘకాలం గడిచిపోతుంది. ప్రజలందరూ ఇంకా సృష్టికర్త అయిన అల్లాహ్ తీర్పు చేయడానికి ఎప్పుడు వస్తాడు? అని వేచిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పదండి మనమందరం కలసి ఆదమ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్దాము. ఆయన అల్లాహ్ వద్ద మన గురించి సిఫారసు చేస్తే అల్లాహ్ మనలో తీర్పు చేయడానికి వస్తాడు అని వెళ్తే, ఆదమ్ (అలైహిస్సలాం), ఎవరినైతే అల్లాహ్ స్వయంగా తన చేతులతో శుభ హస్తాలతో సృష్టించాడో, ఆ ఆదమ్ (అలైహిస్సలాం) కూడా చాలా బాధలో ఉంటారు. నాతో జరిగిన తప్పు, ఆయనతో జరిగిన చిన్నపాటి పొరపాటు. కానీ దానికి ఎంత భయపడుతూ ఉంటారంటే ఆ సమయంలో నేను అల్లాహ్ యందు సిఫారసు చేయడానికి ఏమాత్రం హక్కు కలిగి లేను. నేను చేయలేను. మీరు వెళ్ళండి, కావాలంటే ప్రవక్త నూహ్ దగ్గరికి వెళ్ళండి అని అంటారు. కానీ ఆయన స్వయంగా మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి ఈ మహా మైదానం, అలాంటి అక్కడ జరిగే ఈ పరిస్థితులు ఎవరెవరి మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నాము? ప్రవక్త నూహ్, ప్రవక్త ఇబ్రాహీం, ప్రవక్త మోసే, ప్రవక్త యేసు అలైహిముస్సలాం అజ్మయీన్ ఎవరు కూడా అల్లాహ్ ముందు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతారు. మరి ఈ రోజు స్వర్గాలు రాసి మనకు కొందరు పేపర్లు ఇస్తున్నారు. మీరు చనిపోయిన తర్వాత మీ వారిని తీసుకెళ్ళి ఖననం చేసేటప్పుడు నేను రాసిచ్చిన ఈ సంతకం తో పాటు ఉన్న ఈ పేపర్ ని తీసుకెళ్లి సమాధిలో పెట్టండి. ఎవరు కూడా వచ్చి ప్రశ్నలు అడగరు. ఎవరు కూడా వచ్చి ఏమీ ప్రశ్నించరు. డైరెక్ట్ స్వర్గంలో వెళ్ళిపోతారు. ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి కల్పిత విషయాలలో మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఆ పరలోక దినం పట్ల మనం భయపడాలి. ఆ పరలోకం పట్ల మన విశ్వాసం బలంగా ఉండాలి. ఆ విశ్వాసమే ఇహలోకంలో మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి ఎంతో దోహద పడుతుంది.
సహీహ్ ముస్లిం షరీఫ్ హదీస్ నెంబర్ ఇరవై తొమ్మిది, అరవై తొమ్మిదిలో హజరత్ అబూ సాయీద్ ఖుద్రి మరియు హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఆ మైదానంలో అల్లాహ్ ఒక దాసుడ్ని కలుస్తాడు. అల్లాహ్ ప్రశ్నిస్తాడు. నేను నీకో హోదా, అంతస్తు ఇచ్చి పెళ్లి, పేరంటాలు జరిపించి అన్ని వరాలు ఇహలోకంలో నీకు ప్రసాదించలేదా? గుర్రాలు, ఒంటెలు, ఎన్నో రకాల జంతువులు నీ ఆధీనంలో ఉండే విధంగా నేను చెయ్యలేదా? నీవు కొందరిపై నాయకత్వం వహించి కొందరు నీ మాట వినే విధంగా నీకు పరపతి, హోదా ఇవ్వలేదా? ఆ వ్యక్తి ఇవన్నీ విషయాలని స్వీకరిస్తాడు. అవును అల్లాహ్! నీవు ఇవన్నీ నాకు ప్రసాదించావు. అప్పుడు అల్లాహ్ మరో ప్రశ్న అడుగుతాడు. ఈ రోజు నాతో కలిసే రోజు ఒక రోజు ఉంది అని నీవు నమ్మేవానివా? అప్పుడు అతను సమాధానం పలుకుతాడు – ఓ అల్లాహ్ లేదు. ఇహలోకంలో లభించిన ఈ హోదా, అంతస్తులు, ఇహలోకంలో లభించిన ఈ వరాలు, ఇవన్నిటినీ చూసుకొని మురిసిపోయి ఎక్కడ పరలోకం? ఎక్కడ అల్లాహ్ ను కలుసుకోవడం? ఎక్కడ చనిపోయిన తర్వాత మరోసారి లేవడం? ఈ రోజుల్లో మనం అంటున్నాము కదా! మనలో ఎంతోమంది ఇలాంటి భ్రమకు గురిఅయి ఉన్నాముకదా? లేదు అల్లాహ్ నీతో కలిసే ఒక రోజు ఉంది అని నాకు నమ్మకం లేకుండినది అని అంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు – ఇహ లోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో ఇక ఇక్కడ కూడా నేను నిన్ను మర్చిపోతాను. అంటే ఇక నా స్వర్గంలో చేరలేవు. ఈ మైదానంలో ఎలాంటి సుఖాలు, వరాలు కొందరు పుణ్యాత్ములకు, విశ్వాసులకు లభించనున్నాయో వాటిలో నీకు ఏభాగము లభించదు. అల్లాహు అక్బర్.
ఈ విధంగా అల్లాహ్ మరో వ్యక్తితో కలుస్తాడు. మూడో వ్యక్తితో కలుస్తాడు. నాలుగు వ్యక్తితో కలుస్తాడు. ఈ మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు. అతను ఇహలోకంలో లభించిన వరాలన్నిటినీ కూడా స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతను అంటాడు. నేను నిన్ను విశ్వసించాను. నీ ప్రవక్తను విశ్వసించాను. నువ్వు పంపిన గ్రంథాన్ని విశ్వసించాను. నేను నమాజ్ చేశాను. ఉపవాసాలు ఉన్నాను. దానధర్మాలు కూడా చేశాను. సాధ్యమైనంతవరకు ఎంత అతనికి సాధ్యపడుతుందో అంతా తాను చేసిన మంచితనాన్ని అంతా చెప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు. మా యొక్క సాక్షిని మీ ముందుకు తీసుకు రావాలా? అప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు, ఆలోచిస్తాడు. అప్పుడు. ఎవ్వరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకడానికి అని. అప్పుడు అతని మూతి మీద ముద్ర వేయబడుతుంది. ఆ తరువాత అతని తొడ మాట్లాడుతుంది, అతని ఎముకలు మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు ఈ వ్యక్తి వంచకుడు, కపటవిశ్వాసుడు అని స్పష్టం అవుతుంది. కానీ అతను చెప్పుకున్న మంచితనాలన్నీ కూడా ఒక సాకుగా చెప్పుకుంటాడు. ఆనాటి ఆ గాంభీర్య పరిస్థితి నుండి బయటికి వచ్చే ఏదైనా అవకాశం ఉంటుందో ఏమో అని”.
చెప్పే విషయం ఏమిటంటే, చూడడానికి కొందరు కొన్ని సత్కార్యాలు చేసినా పరలోకంపై విశ్వాసం బలంగా లేకుంటే అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది. అల్లాహ్ ఒక్కొక్క విషయం గురించి నన్ను ప్రశ్నించనున్నాడు అన్నటువంటి బలమైన విశ్వాసం, బలమైన నమ్మకంతో ఏ సత్కార్యాలు చేయకుంటే చాలా చాలా నష్టపోతారు.
అల్లాహ్ (తఆలా) మనందరికీ సత్భాగ్యం ప్రసాదించుగాక! ప్రళయ దినాన ఆ తరువాత మజిలీలు ఏమిటి? అక్కడ ఏమి జరగనుంది? ఆ వివరాలు ఇన్షా అల్లాహ్ తరువాయి భాగాలలో మనం వింటూ ఉందాము. అల్లాహ్ (తఆలా) మనందరి పరలోక విశ్వాసాన్ని మరింత బలంగా చేయుగాక. ఇహలోకంలో ఉన్నన్ని రోజులు పరలోక విశ్వాస నమ్మకంతో సత్కార్యాలలో జీవితం గడుపుతూ విశ్వాసమార్గం మీద నడిచేటటువంటి సత్భాగ్యం ప్రసాదించుగాక!
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
పూర్తి భాగాలు క్రింద వినండి
- మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
You must be logged in to post a comment.