మరణాంతర జీవితం – పార్ట్ 07 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
పార్ట్ 07. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:32 నిముషాలు]
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షిక ప్రళయం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితి ఉంటుందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
మహాశయులారా! ప్రళయం, పునరుత్థానదినం, పరలోకం మరోసారి అందరూ బ్రతికించబడి అల్లాహ్ యందు సమీకరించబడే రోజు. ఆ రోజు గురించి వెంటనే భయకంపితులై ఆ రోజు రాకముందే దాని గురించి మనం విశ్వాసం, పుణ్యాలతో, సత్కార్యాలతో సిద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి.
ఈ రోజుల్లో మనకు ఎన్నో అనుభవాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో వెళ్తాము లేదా ఏదైనా సంఘటన సంభవిస్తుంది. చాలా బాధకు గురి అవుతాము. అప్పుడు మనం ఒకవేళ ముందు నుండే జాగ్రత్తపడి ఉండేది ఉంటే ఈనాటి రోజు చూసే రోజు కాకపోవచ్చు. ఎలాగైతే రిజల్ట్ వచ్చే సందర్భంలో ఏ స్టూడెంట్ అయితే చదువు కాలంలో సమయాన్ని వృధా చేసి తల్లిదండ్రులు, అటువైపున సార్లు, టీచర్ లు, మరోవైపున శిక్షణ ఇచ్చే వారు ఎన్నో రకాలుగా బోధ చేసినప్పటికీ పెడచెవిన పెట్టి వారి యొక్క బోధనలను ఏ మాత్రం విలువ నివ్వకుండా, సమయాన్ని వృధా చేశాడో రిజల్ట్ వచ్చే రోజు ఎలా పశ్చాత్తాప పడతాడు. ఈ ఉదాహరణలు, ఈ అనుభవాలు మనకు ఎందుకు ఇక్కడ కలుగుతున్నాయి? ఆ పరలోక దినం, అక్కడ పశ్చాత్తాపపడే ఆ రోజు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే ఆ రోజు మనం కూడా అలాంటి దురదృష్టవంతుల్లో కలవకూడదని.
అందుకు మహాశయులారా! ఆ పునరుత్థాన దినం మనమందరము సమాధుల నుండి లేపబడి ఏదైతే అల్లాహ్ ఎదురునకు సమీకరింప బడతామో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఖురాన్ లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దానిని ఈరోజు మనం అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తాము. ఆ రోజును అల్లాహ్ (తఆలా) ఎంతో గొప్ప రోజుగా, గొప్ప దినంగా, ఎంతో గాంభీర్యమైన ఒక దినంగా పేర్కొన్నాడు. ఆ గొప్ప దినాన, ఏ దినాన అయితే ప్రజలందరూ సర్వ లోకాల ప్రభువు ఎదుట నిలబడడానికి వెళ్తారు. మరియు ఆ రోజు అవిశ్వాసుల కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్ ని విశ్వసించని వారి గురించి ఎంతో కఠినంగా, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
సూరతుల్ ముద్దస్సిర్ ఆయత్ తొమ్మిది, పదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు: “ఆ రోజు చాలా కష్టతరమైన రోజు. విశ్వాసాన్ని నమ్మని తిరస్కరించిన వారి గురించి అది ఏమాత్రం సులభతరంగా ఉండదు“.
అది ఎంత భయంకరమైన మరియు మన యొక్క ఆలోచనా విధానాన్ని కూడా మార్చి వేసే అంతటి భయంకరమైన రోజు అంటే ఏ తల్లి కూడా ఈ లోకంలో తన పసికందును, పాలు త్రాగే పిల్లని మర్చిపోదు. కానీ ఆ రోజున పరిస్థితి ఏమవుతుంది? సూరతుల్ హజ్ లోని తొలి ఆయత్ లోనే అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ఇలా స్పష్టపరిచాడు – “ఓ ప్రజలారా! మీ ప్రభువు తో మీరు భయపడండి. నిశ్చయంగా ఆ ప్రళయ దినం అనేది చాలా భయంకరమైన, చాలా గొప్ప దినం“. ఆనాటి విషయమే చాలా గొప్ప విషయం, భయంకరమైన విషయం. ఆరోజు భూమి కంపించి పోతుంది. అందులో ప్రకంపనలు ఏర్పడతాయి. దాని మూలంగా ఒక ఆందోళన ఏర్పడుతుంది. “ప్రళయ దినాన ఏ ప్రకంపనలు అయితే జరుగుతాయో చాలా గొప్ప విషయం అది. ఆ రోజు ప్రతి పాలిచ్చు తల్లి పాలు త్రాగే తన పసికందును మర్చిపోతుంది. మరియు ప్రతి గర్భిణి స్త్రీ ఆమె యొక్క గర్భం పడిపోతుంది“. గమనించారా! “మరియు ప్రజలు మత్తులో ఉన్నట్లుగా కనబడతారు. ఏదో మత్తు సేవించడం వల్ల ఎలాగైతే సొమ్మసిల్లి పోతారో అందువల్ల కాదు. కానీ ఆరోజు అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది“. అందుగురించి అలాంటి భయంకరమైన ఆ ప్రళయదినం రాకముందే విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే ఆరోజు విశ్వాసులకు కొరకు ఎంతో సులభతరంగా గడిచిపోతుంది.
ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క ఆ భయంకరం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనిషి పరిస్థితి ఏమవుతుందో సూరయే ఇబ్రాహీం లో అల్లాహ్ (తఆలా) ఈ విధంగా తెలియజేసాడు. మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఇహలోకంలో సన్మార్గాన్ని విడనాడి దుర్మామార్గంలో పడి ఉన్నారో, ఏకత్వ మార్గాన్ని వదిలి బహుదైవత్వంలో పడి ఉన్నారో, మరియు ఎవరైతే శాంతి మార్గాన్ని విడనాడి అశాంతి జీవితం గడుపుతున్నారో గమనించండి ఈ ఆయత్ ను: దుర్మార్గులు, దౌర్జన్య పరులు, షిర్క్ చేసేవారు, పాపాల్లో మునిగి తేలాడుతున్న వారు, వారి యొక్క పాపాల్ని వారి యొక్క షిర్క్ పనులను, వారి యొక్క దుర్మార్గాన్ని అల్లాహ్ చూడటం లేదు, అల్లాహ్ కు తెలియదు అన్నటువంటి భ్రమలో మీరు పడి ఉండకండి. అల్లాహ్ (తఆలా) వారికి కొంత వ్యవధిని ఇస్తున్నాడు. ఈ వ్యవధి ఎప్పటివరకు కొందరికైతే ప్రపంచంలోనే గుణపాఠం దొరుకుతుంది. కానీ ఎంతోమంది ఆనాటి వరకు ఏనాడైతే వారి యొక్క చూపులు చాలా క్రిందికి అయిపోతాయి. పరిగెడుతూ ఉంటారు. సమాధుల నుండి లేచిన తర్వాత పరిగెత్తుతారు. వారి తలలు కూడా క్రిందికి వంగి ఉంటాయి. కనురెప్పలు ఎత్తి కూడా చూడడానికి అవకాశం అనేది ఉండదు. అంత భయకంపితులై ఉంటారు. ఆనాటి పరిస్థితిలో అవిశ్వాసంగా ఇక్కడికి చేరుకున్నాము కదా!అని సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలఎత్తడం, కళ్ళు ఎత్తి చూడడం అది కూడా వారికి సిగ్గుగా అనిపిస్తుంది మరియు ఆనాటి యొక్క భయంకరం, గాంభీర్యంతో వారి యొక్క హృదయాలు బయటికి వస్తాయా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొందరు పాపాత్ములు వారి పరిస్థితి ఇంతకంటే మరీ ఘోరంగా వారి యొక్క హృదయాలు బయటికి వచ్చి పడతాయా? అన్నటువంటి పరిస్థితి ఉంటుంది.
మహాశయులారా!, మరి కొందరి పరిస్థితి ఆనాడు ఎలా ఉంటుందో సూరయే గాఫిర్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు: “అతి సమీపంలో రానున్న ఆ భయంకరమైన రోజు గురించి వారిని హెచ్చరించండి. వారి యొక్క హృదయాలు గొంతు వరకు వస్తున్నాయి. దానిని వారు ఇటు మింగ లేక పోతున్నారు అంటు బయటికి రాలేక పోతుంది”. అంత గాంభీర్యం అయిన పరిస్థితి ఉంటుంది. అంతెందుకండీ చిన్న పిల్లలు, వారు అయితే ఇంకా ఏ పాపం చెయ్యలేదు. వారు చేసేటటువంటి పని వారి గురించి రాయబడదు. అయినా గాని ఆ ప్రళయం సంభవించే రోజు ఎంతటి భయంకరమైన రోజు అంటే ఆ పిల్లల యొక్క వెంట్రుకలు కూడా తెల్ల పడిపోతాయి.
సూరయే ముజ్జమ్మిల్ లో అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు: “మీరు ఒకవేళ ఆ ప్రళయ దినాన్ని నిరాకరిస్తే, తిరస్కరిస్తే మరి ఆ శిక్ష నుండి మీరు ఎలా బయటపడతారు, ఎలా రక్షింపబడతారు. ఆ ప్రళయ దినం నాటి యొక్క భయంకరత్వం ఎలా ఉంది? పిల్లలు సైతం ముసలివారు గా ఏర్పడతారు”. అంతటి గాంభీర్యం.
ఆ రోజు మనిషి యొక్క పరిస్థితి ఎంతవరకు చేరుకుంటుంది అంటే తనను తాను తప్ప మరి ఎవరి గురించి కూడా ఆలోచించలేడు. చివరికి మనిషి అతని యొక్క భార్యను గాని లేదా భార్య తన యొక్క భర్తను గాని, తల్లి కొడుకును గాని, కొడుకు తల్లిని గాని, కూతురు తండ్రిని గాని, తండ్రి కూతురును గాని, సోదరులు పరస్పరం, సోదరీమణులు పరస్పరం ఎవరు కూడా ఎవరైతే ఇహలోకంలో క్లోజ్ ఫ్రెండ్ అని, సుఖదుఃఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి మాటలు చెప్పుకునేవారు సైతం ఆ ప్రళయదినాన తమను తప్ప మరెవరి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకసారి ఖురాన్ లో ఈయొక్క విషయాన్ని ఎలా స్పష్టంగా తెలుపడం జరిగిందో గమనించండి. సూరత్ అబస ఆయత్ నెంబర్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు: “ఆ ప్రళయదినం సంభవించినప్పుడు మనిషి తన సోదరునితో పారిపోతాడు. తన తల్లిదండ్రులతో కూడా పారిపోతాడు. తన భార్య, స్త్రీ అయితే తన భర్త మరియు సంతానం నుండి పారిపోతారు. ఆ రోజు ప్రతి ఒక్కరికీ స్వయం తన గురించి ఎంత బాధ, ఎంత పశ్చాత్తాపం, ఎంత రంది ఉంటుందో ఇతరుల గురించి ఆలోచించే ఆ పరిస్థితిని రానివ్వదు.”
ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లో హదీత్ ఉంది. ప్రళయ దినాన శంకు ఊదబడిన తరువాత అందరూ సమాధుల నుండి లేచి వచ్చినప్పుడు వారి శరీరంపై దుస్తులు ఉండవు, కాళ్ళకు చెప్పులు ఉండవు మరియు పురుషులు ఒడుగులు చేయబడిన స్థితిలో ఖత్న, సున్నతీ లేకుండా లేప బడతారు. అందరూ ఈవిధంగా నగ్నంగా వస్తారు అన్న విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతూ ఉన్నప్పుడు హజ్రత్ ఆయిషా సిద్దీక (రదియల్లాహు అన్హా) గారు అడిగారు: “ప్రవక్తా! మరి ఆ సందర్భంలో పురుషులు, స్త్రీల యొక్క దృష్టి ఒకరిపై ఒకరికి పడదా?” అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ఆయేషా! ఆనాటి పరిస్థితి అంతకంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఎవరికీ ఎవరి గురించి ఏ ఆలోచన ఉండదు. ఇలా దృష్టి ఒకరిపై వేసి చూడాలి అన్నటువంటి ఆ ఆలోచన రానే రాదు”.
ఆ రోజు అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు పాపాల్లో కూరుకుపోయి తమ జీవితం సత్కార్యాలు నుండి దూరం ఉంచినవారు నరక శిక్ష గురించి, ప్రళయం యొక్క ఆ గాంభీర్యం గురించి అవన్నీ వారికి ఆ రోజున ఎప్పుడైతే సత్యాలు తెలుస్తాయో వారికి కోరిక ఏముంటుంది? భూమి నిండా బంగారం కానీ, ఇంకా ఏదైనా వారికి లభిస్తే వారు దానిని ఒక పరిహారంగా అల్లాహ్ ఎదుట ఇచ్చి, ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క భయంకరత్వం దాని నుండి రక్షించుకోవాలని, తప్పించుకోవాలని ఆలోచిస్తారు. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ యాబై నాలుగులో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: ఇహలోకంలో షిర్క్ చేస్తూ, పాపాలు చేస్తూ అల్లాహ్ అవిధేయత లో జీవితం గడిపిన ప్రతి మనిషి భూమి నిండా ధనం అతనికి లభిస్తే అదంతా కూడా ఆనాటి గాంభీర్యం మరియు శిక్ష నుండి తప్పించుకోవటానికి ఒక పరిహారంగా ఇచ్ఛేద్దామా అని ఆలోచిస్తాడు. సూరయే రఆద్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ మరి కొందరి గురించి ఏమని తెలిపాడంటే – వారి వద్ద ఈ భూమి కాదు ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నాకానీ, ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నా కానీ దానిని పరిహారంగా చెల్లించి ఆనాటి శిక్షల నుండి, ఆనాటి ఆందోళనకరల నుండి తప్పించుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఏమాత్రం సాధ్యపడదు. ఆ రోజు ఏ డబ్బు, ఏ ధనము, ఏ బంగారం, ఏ వెండీ, ఏ డైమండ్స్ ఏదీ కూడా చెల్లదు. ఆ రోజు విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగా తీర్పు జరుగుతుంది. ఎవరు విశ్వాసాన్ని అవలంభించి సత్కార్యాలు చేసి ఉన్నారో వారి కొరకే సుఖాలు, ఐశ్వర్యాలు, అన్ని రకాల లాభాలు, భోగభాగ్యాలు ఉంటాయి. అల్లాహ్ ఎవరి నుండి ధనము, డబ్బు స్వీకరించడు వారిని ఆ శిక్ష నుండి తప్పించడానికి, ఆ శిక్ష నుండి రక్షించడానికి. గమనించండి, సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ తొంబై ఒకటిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు – “ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, అవిశ్వాసానికి ఒడిగట్టారో, వారు అ విశ్వాసులుగా ఉన్నప్పుడే వారికి చావు వచ్చిందో భూమి నిండా బంగారం కూడా వారు ప్రాయశ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటే అది స్వీకరించబడదు. వారికి ఆ రోజు కఠినమైన శిక్ష ఉంటుంది, బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఎవరు కూడా వారికీ ఎలాంటి సహాయం చేసేవారు ఉండరు.” ఇలాంటి ఆయతులతో, ఇలాంటి బోధనలతో గుణపాఠం నేర్చుకొని మనలో వెంటనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం నాకు మీకు అందరికి ప్రసాదించు గాకా!
సహీ బుఖారీ లో హదీత్ ఉంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – సత్య తిరస్కారిని, అవిశ్వాసిని ప్రళయ దినాన తీసుకురావడం జరుగుతుంది. అతనితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది. ఏమీ! నీ వద్ద ఈభూమి నిండా బంగారం ఉంటే నీవు దానిని పరిహారంగా చెల్లించి ఈ శిక్షల నుండి తప్పించుకుందామని అనుకుంటివా? అతను అంటాడు, అవును. అప్పుడు అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది. నేనైతే ఇహలోకంలో నీవు ఉన్నప్పుడు దీనికంటే ఎంతో తేలికమైన విషయం నీతో నేను కోరాను. విశ్వాసాన్ని అవలంభించు, సత్కార్యాలు చేస్తూపో. ఇదే నీతో నేను కోరబడినది ఇహలోకంలో, కానీ అది మాత్రం చేయలేదు. ఇప్పుడు నీ వద్ద భూమి నిండా బంగారం ఉంటే దాన్ని పరిహారంగా చెల్లించాలి అనుకుంటున్నావు. ఇది ఎక్కడ సాధ్యపడుతుంది?
ఇంకా ఆ ప్రళయదిన గాంభీర్య విషయాలు మరిన్ని తెలుసుకునేటివి చాలా ఉన్నాయి. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
పూర్తి భాగాలు క్రింద వినండి
- మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
You must be logged in to post a comment.