విశ్వాసి స్వయం తనపట్ల పాటించవలసిన మర్యాద | ఇస్లామీయ జీవన విధానం
https://youtu.be/SPvnqC42DTg [31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఆత్మ శుద్ధి (తజ్కియతున్ నఫ్స్) యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రసంగం వివరిస్తుంది. మనిషి ఇహపర లోకాలలో సాఫల్యం పొందాలంటే తన ఆత్మను పరిశుద్ధం చేసుకోవడం ఎంత అవసరమో సూరహ్ అష్-షమ్స్ మరియు సూరహ్ అల్-అస్ర్ ఆధారంగా బోధించబడింది. ఆత్మ ప్రక్షాళన కొరకు నాలుగు ప్రధాన సోపానాలను – తౌబా (పశ్చాత్తాపం), మురాఖబా (దైవ చింతన/పర్యవేక్షణ), ముహాసబా (ఆత్మ పరిశీలన), మరియు ముజాహదా (నిరంతర పోరాటం) – ప్రసంగీకులు వివరించారు. వ్యాపారంలో లాభనష్టాలను బేరీజు వేసుకున్నట్లుగానే, ప్రతి ముస్లిం తన పుణ్యకార్యాలు మరియు పాపాలను నిత్యం సమీక్షించుకోవాలని, అల్లాహ్ యే తనను చూస్తున్నాడన్న స్పృహతో జీవించాలని ఈ ప్రసంగం ఉద్బోధిస్తుంది.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.
ప్రియ విద్యార్థులారా! శుభప్రదమైన రమదాన్ మాసంలోని ఎనిమిదవ రోజు మనం ‘ఇస్లామీయ జీవన విధానం‘ అనే పుస్తకం నుండి ఎనిమిదవ పాఠం చదవబోతున్నాము. “స్వయం మనము మన పట్ల పాటించవలసిన మర్యాద.”
ఆత్మ పరిశుద్ధత మరియు సాఫల్యం
తన ఇహపరాల శుభం, తనకు తాను మంచి శిక్షణలో నడిపించుటపై ఆధారపడి ఉందని ముస్లిం విశ్వసిస్తాడు. అర్థమైందా? ఎప్పటివరకైతే మనం స్వయం మనల్ని సంస్కరించుకోమో, మన మనస్సును అదుపులో పెట్టుకొని ఒక మంచి మార్గంలో ఉండమో, అప్పటివరకు మనం ఇహపరాల శుభాలు, మేళ్లు, అన్ని రకాల సౌభాగ్యాలు పొందలేము. గమనించండి సూరతుష్ షమ్స్ లోని ఈ ఆయత్:
قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا
[ఖద్ అఫ్ లహ మన్ జక్కాహా * వఖద్ ఖాబ మన్ దస్సాహా]
{నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధ పరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణచివేసినవాడు విఫలుడయ్యాడు}. (91: షమ్స్: 9,10).
ఇక సూరతుల్ అస్ర్ ను గమనిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా:
وَٱلْعَصْرِ إِنَّ ٱلْإِنسَـٰنَ لَفِى خُسْرٍ إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَتَوَاصَوْا۟ بِٱلْحَقِّ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ
[వల్ అస్రి * ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్] [ఇల్లల్లజీన ఆమనూ వ అమిలుస్స్వా లిహాతి వ తవాసౌ బిల్ హఖ్ఖి వ తవాసౌ బిస్సబ్ర]
{కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురిఅయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహనబోధ చేసుకునేవారూ తప్ప}. (103: అస్ర్))
కాలం సాక్షి, కాలం ప్రమాణంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషి నష్టంలో పడి ఉన్నాడు అని చెప్పిన తర్వాత, ఆ నష్టం లో నుండి బయటికి వచ్చేవారు ఎవరు? పేర్లు తీసి చెప్పలేదు, వారిలోని నాలుగు గుణాలు, మంచి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తావించాడు:
దీనిలో మొట్టమొదటిది విశ్వాసం మరియు సత్కార్యాలు. మన యొక్క మనస్సు శుభ్రంగా ఉండడానికి, మన ఆత్మ సంస్కరణలో ఉండడానికి, ఈ సత్కార్యాలు ఎంత ముఖ్యమో ఇంకా ముందుకు తెలుసుకోనున్నారు, గమనించండి.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللَّهِ قَالَ: كُلُّ أُمَّتِي يَدْخُلُونَ الْجَنَّةَ إِلَّا مَنْ أَبَى قَالُوا: يَا رَسُولَ اللَّهِ وَمَنْ يَأْبَى قَالَ: مَنْ أَطَاعَنِي دَخَلَ الْجَنَّةَ وَمَنْ عَصَانِي فَقَدْ أَبَى. البخاري
“నా అనుచరసంఘంలో ప్రతీ ఒకడు స్వర్గంలో ప్రవేశించగలడు. తిరస్కరించినవాడు తప్ప”. తిరస్కరించినవాడెవడు? ప్రవక్తా అని వారడగ్గా, “నా విధేయులైనవారు స్వర్గంలో చేరుదురు. విధేయులు కానివారు తిరస్కరించినవారు” అని ప్రవక్త బదులిచ్చారు. (బుఖారి 7280).
స్వర్గంలో అందరూ ప్రవేశిస్తారు కానీ ఎవరైతే తిరస్కరిస్తాడో (అంటే స్వర్గంలో పోను అని అంటాడో)… ఎవరైనా ఇలా అంటారా? అదే సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది ప్రవక్త మాట ద్వారా. “ఎవరైతే తిరస్కరించాడో” అంటే ప్రవక్త, స్వర్గంలో వెళ్ళడానికి ఎవరు తిరస్కరిస్తారు? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వర్ణించారు, ఎలా వివరించారో గమనించండి, శ్రద్ధగా వినండి.
“ఎవరు నాకు విధేయత పాటిస్తారో, నా విధేయులైన వారు స్వర్గంలో చేరుదురు. విధేయులు కాని వారు (నా మాట వినని వారు) తిరస్కరించిన వారు.”
ఇక ఇంతకుముందు ఇప్పుడిప్పుడే నేను చెప్పినట్లు, ఆత్మను శుభ్రపరచి మంచి శిక్షణలో ఉంచునది విశ్వాసము మరియు సత్కార్యాలని; ఈ మనస్సును అణచివేయునది, పాడుచేయునది అవిశ్వాసము, దుష్కార్యాలు, పాపాలు అని ఒక విశ్వాసి నమ్ముతాడు.
నమాజ్ మరియు పాపాల ప్రక్షాళన
అల్లాహ్ యొక్క ఈ ఆదేశంపై శ్రద్ధ వహించండి, సూరహ్ హూద్ ఆయత్ నెంబర్ 114:
وَأَقِمِ ٱلصَّلَوٰةَ طَرَفَىِ ٱلنَّهَارِ وَزُلَفًۭا مِّنَ ٱلَّيْلِ
[వ అఖిమిస్సలాత తరఫయిన్నహారి వ జులఫమ్ మినల్లైల్, ఇన్నల్ హసనాతి యుజ్ హిబ్ నస్సయ్యి ఆత్]
{పగటి రెండు కొనలయందు, రాత్రి కొంతకాలమున నమాజు స్థాపించు. నిశ్చయముగా పుణ్యములు పాపములను దూరం చేస్తాయి}. (11: హూద్: 114).
ఈ ఆయత్ ద్వారా పాపాల నష్టం, ఆ పాపాలను తుడిచివేసే పుణ్యాలు చేస్తే, మన ఆత్మ శుద్ధి యొక్క విషయం కూడా ఇందులో బోధపడుతుంది. వాటన్నిటిలో నమాజ్ ఆచరణ పరంగా చాలా గొప్ప విషయం అని కూడా బోధపడుతుంది.
ఇక పాపాల నష్టాన్ని, దీనివల్ల మన ఆత్మ ఎంత చెడిపోతుందో గమనించండి, సూరతుల్ ముతఫ్ఫిఫీన్ ఆయత్ నెంబర్ 14:
كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
[కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్]
{ఇట్లు కాదు. కాని వీరి కర్మల యొక్క చిలుము వీరి హృదయాలను క్రమ్ముకొని యున్నది}. (83: తత్ ఫీఫ్: 14).
అల్లాహ్ మనల్ని ఇలాంటి పరిస్థితికి గురి కాకుండా కాపాడుగాక, ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడు. ఇలాంటి సందర్భంలో కొన్ని దుఆలు కూడా గుర్తొస్తాయి కదా? చెప్పాలా ఏదైనా ఒక దుఆ? మీరు కూడా నేర్చుకుంటున్నారా? శ్రద్ధగా వినండి మరి:
اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا
[అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా]
ఓ అల్లాహ్! నా ఆత్మకు భయభక్తులను ప్రసాదించు. దానిని (నా ఆత్మను) పరిశుద్ధపరచు. దానిని పరిశుద్ధ పరచేవారిలో నీవే ఉత్తముడవు. (సహీహ్ ముస్లిం)
ఇప్పుడు ఈ ఆయత్ సూరతుల్ ముతఫ్ఫిఫీన్ ది ఏదైతే మీరు చదివారో, దాని యొక్క అనువాదం కూడా విన్నారో, దీని వ్యాఖ్యానంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీహ్ హదీస్ వస్తుంది. దాని సంక్షిప్త భావం ఏమిటంటే:
“ఎప్పుడైతే మనిషి ఒక పాపం చేస్తాడో అతని మనస్సులో ఒక నల్ల మచ్చ గుర్తు పడుతుంది. ఒకవేళ అతను తౌబా చేసుకున్నాడు, ఏదైనా పుణ్యకార్యం చేశాడు అంటే ఆ మచ్చ దూరమైపోయి, మనస్సు మళ్ళీ శుభ్రంగా, తెల్లగా ఉంటుంది (మెరుస్తూ ఉంటుంది అనండి, పర్లేదు).“
ఒకవేళ తౌబా చేయకుండా, పుణ్యకార్యాల వైపునకు తిరగకుండా, అదే పాపంపై పాపం, పాపంపై పాపం, పాపాలు పాపాలు చేస్తూ ఉంటాడో… అల్లాహు అక్బర్! పెనం తెలుసు కదా? దోశలు వేస్తారు, ఆమ్లెట్లు వేస్తారు, దాని వెనుక కింద ఎలా ఉంటుంది? ఆ విధంగా అతని యొక్క మనస్సు మొత్తం నల్లగా మారిపోతుంది. అల్లాహు అక్బర్. అదే విషయం అల్లాహ్ ఈ ఆయత్ లో తెలుపుతున్నాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ ను తిలావత్ చేశారు.
ఆత్మ శుద్ధి కొరకు నాలుగు సూత్రాలు
మన ఆత్మ శుభ్రపరచుకోవాలంటే, విశ్వాసం కరెక్ట్ గా, బలంగా ఉండాలి మరియు పుణ్యాలపై పుణ్యాలు, సత్కార్యాలపై సత్కార్యాలు చేస్తూ ఉండాలి. రండి శ్రద్ధగా వినండి కొన్ని విషయాలు. ఈ ఆయతులు ఏవైతే మనం చదివామో, అర్థం చేసుకున్నామో, అందుకే ముస్లిం ఎల్లప్పుడూ తన ఆత్మను శుద్ధి చేస్తూ, మంచి శిక్షణ, సంస్కరణలో ఉంచాలి. రేయింబవళ్లు సత్కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూ, చెడు నుండి దూరం ఉండాలి. ఆత్మ పరిశీలన చేస్తూ ఉండాలి. అనగా తన ఆత్మ చెడు వైపునకు మొగ్గుతుందా, లేక మంచి వైపునకా అనేది పరిశీలిస్తూ ఉండాలి. దానిని మంచి వైపునకు, విధేయత వైపునకు మలచి, చెడు మరియు అరాచకాల నుంచి దూరం ఉంచడానికి, ఇప్పుడు నేను తెలపబోతున్న నాలుగు ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి.
సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే: మీరు మీ ఇహపరాల శుభాలు కోరుతూ అల్లాహ్ ను సంతృప్తి పరచాలనుకుంటే, మీ ఆత్మ శుద్ధి కలగడం తప్పనిసరి. మనస్సు పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి. ఇబ్రహీం (అలైహిస్సలాం) వారి ప్రస్తావనలో ఆ ఆయత్ గుర్తుందా?
إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ
[ఇల్లా మన్ అతల్లాహ బిఖల్బిన్ సలీం]
ఎవరు ప్రవేశిస్తారు స్వర్గంలో? ఖల్బె సలీం – శుద్ధమైన, మంచి మనస్సు ఉన్నవారే. (26:89)
అయితే మన మనస్సు మంచిగా, శుభ్రంగా, సంస్కరణలో, మంచి శిక్షణలో ఉండడానికి ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు విషయాలు మంచిగా గుర్తుంచుకోండి.
1. తౌబా (పశ్చాత్తాపం)
మొదటి విషయం: క్షమాభిక్ష, తౌబా, ఇస్తిగ్ఫార్. అంటే ఏమిటి? తౌబా అని అంటాము కదా, ఏమిటి? తౌబా మనం అల్లాహ్ తో తౌబా చేస్తున్నాము, మనం ఇస్తిగ్ఫార్ చేస్తున్నాము, పాపాల క్షమాభిక్ష కోరుతున్నాము అల్లాహ్ తో అంటే ఈ మూడు సూత్రాలు అనండి, మూల విషయాలు అనండి.. ఆ తౌబా, ఇస్తిగ్ఫార్ లో ఉండడం తప్పనిసరి:
- సర్వ చెడులను, పాపాలను విడనాడాలి. వాటి జోలికి వెళ్ళకూడదు.
- జరిగిన పాపంపై పశ్చాత్తాప పడాలి. “అయ్యో, ఛీ! ఎందుకైతే నాతో జరిగిందో” అని ఒక బాధ ఉండాలి. “ఆహా ఇంత మంచిగుండే కదా నేను ఎందుకు చేయకపోతిని” ఈ విధంగా కాదు, అస్తగ్ఫిరుల్లాహ్.
- ఇక ముందు, ఇన్ ఫ్యూచర్ (భవిష్యత్తులో) తిరిగి ఆ పాపం చేయను అని దృఢ సంకల్పం చేసుకోవాలి.
ఇలాంటి తౌబా చేసిన వారి కొరకు అల్లాహ్ ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నాడో గమనించండి, సూరతుత్ తహ్రీమ్ ఆయత్ నెంబర్ 8:
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ تُوبُوٓا۟ إِلَى ٱللَّهِ تَوْبَةًۭ نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّـَٔاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّـٰتٍۢ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ
{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ తో నిజమైన క్షమాపణ వేడుకోండి. మీ ప్రభువు మీ పాపములను క్షమించి, కాలువలు ప్రవహించు స్వర్గ వనములలో మిమ్ము ప్రవేశింపజేయునని ఆశ గలదు}. (66: తహ్రీం: 8).
ఏం జరుగుతుంది?
అప్పుడు మీ ప్రభువు మీ పాపాలను మీ నుండి దూరం చేసి, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు.
“వచ్చు” అంటే ఆశనే కాదు, పక్కా నమ్మకం. ఎందుకు? ఉలమాల యొక్క ఇత్తిఫాక్ (ఏకాభిప్రాయం), వ్యాఖ్యానకర్తల యొక్క ఇత్తిఫాక్: “అసా రబ్బుకుమ్” (ప్రభువు) అల్లాహ్ ఈ పని చేస్తాడు అన్నట్లుగా “అసా” అన్న పదం వస్తే అది ఖచ్చితమైన విషయం అని నమ్మాలి.
ఇక మరో శుభవార్త. శుభవార్తతో పాటు ఇందులో గొప్ప మన కొరకు ఒక సందేశం కూడా. వినండి హదీస్, అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
عَنْ أَبِي مُوسَى عَنْ النَّبِيِّ قَالَ: إِنَّ اللَّهَ عَزَّ وَجَلَّ يَبْسُطُ يَدَهُ بِاللَّيْلِ لِيَتُوبَ مُسِيءُ النَّهَارِ وَيَبْسُطُ يَدَهُ بِالنَّهَارِ لِيَتُوبَ مُسِيءُ اللَّيْلِ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا
“పగలు పాపము చేసినవారు తౌబా చేయాలని, అల్లాహ్ రాత్రి సమయమున తన చేయి చాపుతాడు. రాత్రి పాపము చేసినవారు తౌబా చేయాలని, పగలు తన చేయి చాపుతాడు. ఇలా పశ్చిమాన సూర్యోదయము అయ్యే వరకు ఉంటుంది}. (ముస్లిం 2759).
అల్లాహ్ మన పాపాల్ని మన్నించడానికి తను చేయి చాపుతున్నాడు. “రా నా దాసుడా! నేను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరగా నా వద్దకు వచ్చేసెయ్, నా వైపునకు తిరుగు, పాపాన్ని వదులు.” తౌబా, ఇస్తిగ్ఫార్ చెయ్ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన చేయిని చాపుతాడు. ఇప్పటికీ కూడా మనం తౌబా కొరకు ముందడుగు వేయకుంటే నష్టం ఎవరిది? అల్లాహ్ ది ఏమాత్రం కాదు, మనదే. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రాత్రి, పగలు చేయి చాపుతూ ఆహ్వానిస్తూ ఉంటాడు తౌబా గురించి. ఎప్పటి వరకు? పశ్చిమాన సూర్యోదయం అయ్యే వరకు ఇలా జరుగుతూ ఉంటుంది. (ముస్లిం షరీఫ్ యొక్క సహీహ్ హదీస్: 2759).
అయితే ఈ నాలుగు విషయాలు తప్పనిసరి మన ఆత్మ శుద్ధి కొరకు అని చెప్పాను కదా, అందులో మొదటిది తౌబా. ఎంత ఎక్కువగా తౌబాలు చేస్తారో అంతే ఎక్కువగా మనస్సు శుభ్రం అవుతుంది. తౌబా దాని అసలైన భావంలో, దాని మూడు మూల సూత్రాలు ఏవైతే నేను ప్రారంభంలో తెలిపానో, వాటిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. మర్చిపోయారా? లేదు కదా. మరోసారి గుర్తుంచుకోండి:
1. సర్వ చెడులను, పాపాలను విడనాడాలి.
2. జరిగిన పాపంపై పశ్చాత్తాప పడాలి.
3. మరియు ఇక ముందు (ఇన్ ఫ్యూచర్) నేను తిరిగి ఆ పాపం చేయనని దృఢ సంకల్పం చేసుకోవాలి.
2. మురాఖబా
ఇక రెండవది: మురాఖబా. మురాఖబా అంటే ఏమిటి? ప్రతి క్షణం విశ్వాసి తన ప్రభువుతో భయపడుతూ ఉండాలి. అల్లాహ్ అతన్ని చూస్తూ ఉన్నాడు, అతని రహస్య బహిరంగ విషయాలను గుర్తెరుగువాడు అని మంచిగా, గట్టిగా, బలంగా నమ్మాలి. ఈ విధంగా మనస్సు అల్లాహ్ దృష్టి తనపై ఉన్నదని విశ్వసించి, అతని ధ్యానంతో (అంటే అల్లాహ్ యొక్క జిక్ర్ తో), అల్లాహ్ యొక్క విధేయతతో ఆనందం పొందుతుంది. నిజంగానా? ఇది చూద్దాం ఒకసారి, మౌల్వీ సాబ్ చెప్పిండు కదా నిజంగానా? అని కాదు. ఆయతులు వస్తున్నాయి, హదీసులు వస్తున్నాయి. అల్లాహ్ తెలిపినటువంటి మాట ఇది, కనుక అనుభవం గురించి పాటించకండి. నిజంగా మీ జీవితంలో మీరు ఆనందం పొందడానికి, నిజంగా మీరు శాంతి పొందడానికి ఇలా చేయండి, తప్పకుండా పొందుతారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో, ఇన్షా అల్లాహ్ ముందుకు తెలుసుకుందాము, కానీ రండి. సూరతున్నీసా ఆయత్ నెంబర్ 125 లో:
أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ
[అస్లమ వజ్ హహూ లిల్లాహ్]
తనను తాను అల్లాహ్ వైపునకు సమర్పించినవాడు. అల్లాహ్ ముందు తలవంచిన వాడు. అల్లాహ్ ఆజ్ఞా పాలన కొరకు శిరస్సు వహించిన వాడు, తల వంచిన వాడు. అతడే నిజమైన రీతిలో, వాస్తవ రూపంలో ఆనందం పొందగలుగుతాడు. చదవండి ఈ ఆయత్:
وَمَنْ أَحْسَنُ دِينًۭا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُۥ لِلَّهِ وَهُوَ مُحْسِنٌۭ
[వమన్ అహ్ సను దీనమ్ మిమ్మన్ అస్లమ వజ్ హహూ లిల్లాహి వహువ ముహ్సిన్]
{అల్లాహ్ ఆజ్ఞలకు శిరసావహించి సత్కార్యములు చేయువాని మతముకంటే ఎవ్వని మతము శ్రేష్ఠమైనది}. (4: నిసా: 125).
“కాజాలడు” అన్న మాటను ప్రశ్న రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించారా, అల్లాహ్ స్వయంగా ప్రశంసిస్తున్నాడు “అహ్ సను దీనా” – అతని ధర్మం అందరికంటే ఉత్తమమైన ధర్మం అని. ఈ విధంగా మనం అల్లాహ్ ఆజ్ఞల పట్ల శిరసావహించడం అంటే ఏంటి? మనస్సులో ఆ భావం ఉన్నప్పుడే కదా? అర్థమైందా?
ఇక గమనించండి, మురాఖబా – అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ నుండి ఏ క్షణం కూడా మనం ఎక్కడా దాగి లేము, కనుమరుగై లేము. అల్లాహ్ మనల్ని చూడకుండా మనం ఎక్కడైనా ఉండగలుగుతాము అలాంటి అవకాశమే లేదు. చదవండి ఈ ఆయత్ సూరహ్ యూనుస్ లో ఆయత్ నెంబర్ 61:
وَمَا تَكُونُ فِى شَأْنٍۢ وَمَا تَتْلُوا۟ مِنْهُ مِن قُرْءَانٍۢ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ
[వమా తకూను ఫీ షానిన్ వమా తత్లూ మిన్హు మిన్ ఖుర్ ఆనిన్ … ఇల్లా కున్నా అలైకుమ్ షుహూదన్ ఇజ్ తుఫీదూన ఫీహ్]
{నీవు ఏ స్థితిలో ఉన్నా, ఖుర్ఆను నుండి దేనిని వినిపించినా, (మానవులారా) మీరు ఏది చేసినా, ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్ని చూస్తునే ఉంటాము}. (10: యూనుస్: 61).
అల్లాహ్ అంటున్నాడు “మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము.” ఎక్కడ? మీరు ఎక్కడ ఉన్నా గాని. చీకటిలో ఉన్నా, వెలుతురులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా… చివరికి లక్షలాది మంది మధ్యలో ఉండి, ఆ లక్షలాది మంది తమ తమ భాషల్లో, తమ తమ ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరు ఉన్నప్పటికీ… అల్లాహ్ అందరిని చూస్తున్నాడు, అందరి మాట వింటున్నాడు, అందరి భాషలు అర్థం చేసుకుంటున్నాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందరి గురించి అన్ని రకాలుగా తెలిసి ఉన్నాడు.
అయితే చాలా చిన్న చిన్న విషయాలు కూడా అల్లాహ్ కు తెలుసా? అవును చదవండి ఆయత్ ఇంకా ముందుకు:
وَمَا يَعْزُبُ عَن رَّبِّكَ مِن مِّثْقَالِ ذَرَّةٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَلَا أَصْغَرَ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرَ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
భూమిలో, ఆకాశాలలో ఉన్న రవ్వంత వస్తువు కూడా నీ ప్రభువు నుండి గోప్యంగా లేదు. ఆ రవ్వంత దానికంటే చిన్నదైనా సరే, పెద్దదైనా సరే ఏదీ కూడా (అల్లాహ్ నుండి గోప్యంగా లేదు), ప్రతీదీ కూడా స్పష్టమైన గ్రంథంలో (నమోదు చేసి) ఉంది. (10:61)
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎక్కడైనా కెమెరా ఉన్నది అని అంటే ఎంత భయంగా ఉంటారు? సిగ్నల్ పై కెమెరా ఉన్నది అంటే రెడ్ లైట్ ని క్రాస్ చేస్తారా? కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నుండి ఎక్కడా ఏమీ దాగి మనం ఉండలేము, అల్లాహ్ కు తెలియనిది ఏదీ లేదు అని ఇంత స్పష్టంగా తెలిసినప్పటికీ, మనం ఇంకా అల్లాహ్ విషయంలో ఎంత మోసానికి గురి అయి ఉంటాము, ఎన్ని పాపాలకు ప్రతిరోజు పాల్పడుతూ ఉంటాము?
మురాఖబా యొక్క అసలైన భావం ఈ హదీస్ లో కూడా ఉంది గమనించండి. హదీసే జిబ్రీల్ అన్నటువంటి పేరు గాంచిన హదీస్ కదా? అందులో మూడో ప్రశ్న, మొదటి ప్రశ్న ఈమాన్ గురించి, రెండో ప్రశ్న ఇస్లాం గురించి, మూడో ప్రశ్న “ఇహ్సాన్” గురించి. ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు?
أَنْ تَعْبُدَ اللَّهَ كَأَنَّكَ تَرَاهُ فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ
[అన్ తఅ బుదల్లాహ క అన్నక తరాహు, ఫ ఇన్ లమ్ తకున్ తరాహు ఫ ఇన్నహూ యరాక్]
“నీవు అల్లాహ్ ను ప్రార్థిస్తున్నప్పుడు అతన్ని చూస్తున్నట్లుగా భావించు. అతన్ని చూస్తున్నట్లు నీవు భావించలేకపోతే, నిశ్చయంగా ఆయన నిన్ను చూస్తున్నాడని నమ్ము”. (బుఖారి 50, ముస్లిం 8).
ఎన్ని విషయాలు తెలుసుకున్నారు నాలుగిట్లో? రెండు. మొదటిది తౌబా, రెండవది మురాఖబా.
3. ముహాసబా (ఆత్మ పరిశీలన)
ఇప్పుడు మూడవది: ఆత్మ పరిశీలన. మన ఆత్మ పరిశుద్ధి, పరిశుద్ధంగా ఉండడానికి తౌబా మరియు మురాఖబా తర్వాత ఇది కూడా చాలా అవసరం – ఆత్మ పరిశీలన. ఎప్పుడైతే ముస్లిం ఇహలోకంలో రేయింబవళ్లు కష్టపడతాడో, శ్రమిస్తాడో దాని మంచి ఫలితం పరలోకంలో పొందాలని, అతనికి గౌరవ స్థానం కలగాలని, అల్లాహ్ సంతృప్తి పొందాలని, మరియు ఈ లోకంలో కష్టపడి పుణ్యాలు సంపాదించడానికే ఉన్నప్పుడు… ఇక అతని ఆలోచన ఎలా ఉండాలి? ఒక బిజినెస్ మ్యాన్ లాగ.
అవును, ఈ రచయిత ఎంత గొప్పవారు, మస్జిద్ నబవీలో దర్స్ ఇచ్చేవారు, చాలా రోజుల క్రితం చనిపోయారు అల్లాహ్ స్వర్గం ప్రసాదించుగాక వారికి. అయితే ఎంత మంచి ఒక ఉదాహరణ ఇచ్చారు! పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, చిన్న కొంత సరుకు అమ్ముకొని ఓ పూట అన్నం తినేవారైనా గాని.. ఆత్మ పరిశీలనను ఒక బిజినెస్ తో ఎలా పోల్చారో గమనించండి.
ఒక వ్యాపారి దృష్టిలో తన మూలధనం విలువ ఎంతనో, అంతకంటే మించిన విలువ ముస్లిం దృష్టిలో అల్లాహ్ విధించిన విధులు ఉండాలి. అల్లాహు అక్బర్. వ్యాపారి మూలధనంపై వచ్చే లాభాన్ని చూసుకున్నట్లు, ఒక ముస్లిం తన నఫిల్ (విధిగా లేని అదనపు) సత్కార్యాలను చూసుకోవాలి. ఇక పాపాలను, అల్లాహ్ పట్ల పాటించే అవిధేయత, ప్రవక్త ఆదేశాల ఆజ్ఞల పట్ల పాటించే అవిధేయత – వాటిని ఎలా చూడాలి? వ్యాపారంలో నష్టం మాదిరిగా భావించాలి.
అంతేకాకుండా, పొద్దంతా చేసిన వాటిని పడుకునేకి ముందు కనీసం లెక్కించుకొనుటకు, ఆత్మ పరిశీలనకై ఒకానొక సమయంలో ఏకాంతంలో గడపాలి. ఇక ఇలా ఏకాంతంలో గడిపి ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఏం చేయాలి? విధులలో ఏదైనా లోటు, కొరత చూసినట్లయితే తనను తాను మందలించుకొని, నిందించుకొని అప్పటికప్పుడే ఆ కొరతను పూర్తిచేసేవి ఉంటే పూర్తి చేయాలి. అలా పూర్తి అయ్యేవి కాకుంటే, నఫిల్ ల ద్వారా, అదనపు సత్కార్యాల ద్వారా ఆ కొరతను పూర్తి చేయాలి. ఒకవేళ నఫిల్ లలో ఏదైనా కొరత ఉంటే, లోటు ఉంటే, వాటికి బదులుగా అధికంగా నఫిల్ లు చేసి ఆ లోటును తీర్చాలి.
ఇక బిజినెస్ లాసెస్ (నష్టాలు) – నిషిద్ధ కార్యాలకు పాల్పడి నష్టం వాటిల్లినట్లయితే పశ్చాత్తాప పడి క్షమాపణ వేడుకోవాలి. ఫస్ట్ పాయింట్ తెలిపాము కదా నాలుగిట్లో – అల్లాహ్ వైపునకు మరలి, దానికి బదులుగా మంచి పని చేయాలి. ఆత్మ పరిశీలన – “ముహాసబయే నఫ్స్” అన్న దానికి ఇదే అర్థం. మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ హష్ర్ ఆయత్ నెంబర్ 18 లో ఇదే విషయం తెలియజేస్తున్నాడు:
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَلْتَنظُرْ نَفْسٌۭ مَّا قَدَّمَتْ لِغَدٍۢ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ ١٨
{విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కు మీరు చేసే పనులన్నీ తెలుసు}. (59: హష్ర్: 18).
మరియు ఇదే భావంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గుర్తు చేస్తూ ఉండేవారు ప్రజలకు:
عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ قَالَ: حَاسِبُوا أَنْفُسَكُمْ قَبْلَ أَنْ تُحَاسَبُوا
[హాసిబూ అన్ఫుసకుమ్ ఖబ్ల అన్ తుహాసబూ]
‘మీరు పరిశీలింపబడే (రోజు రాక ముందే) మీ ఆత్మలను పరిశీలించుకోండి”. (తిర్మిజి 2459).
ఆత్మ శుద్ధి కొరకు, ఆత్మ సంస్కరణ కొరకు నాలుగు మూల విషయాలు – వాటిలో తౌబా గురించి విన్నాము, మరియు మురాఖబా గురించి విన్నాము, ముహాసబా గురించి విన్నాము.
4. ముజాహదా (తీవ్ర ప్రయత్నం)
ఇప్పుడు రండి ముజాహదా. ముజాహదా అంటే తీవ్ర ప్రయత్నం. ఎలాంటిది? శత్రువులలో అతి పెద్ద శత్రువు తన మనసే అన్న విషయం ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. అల్లాహు అక్బర్. అందుకొరకే చూడండి సర్వసామాన్యంగా మనం ఏమంటాము? “ఒరేయ్ షైతాన్ వాడు చాలా బద్ధ శత్రువు”. అవును ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు: “నిశ్చయంగా షైతాన్ మీకు బహిరంగ శత్రువు” (2:168). కానీ దానితో పాటు మన యొక్క నఫ్స్ (ఆత్మ/మనసు)… ఇది ఎంత పెద్ద షైతానో దీనిని కూడా గమనించండి.
ఈ రోజుల్లో, ప్రత్యేకంగా రమదాన్ లో అంటాము “అయ్యో షైతాన్లు బందీఖానాలో ఉన్నాయి కదా, ఎలా మనకు ఈ పాపాలు జరుగుతున్నాయి?” మన షైతాన్ మనలో… మన నఫ్స్, మన కోరిక, మన ఆత్మ. అందుకొరకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి ఉదయం సాయంకాలపు దుఆలలో ఒకటి ఏమున్నది? ఒక దుఆలోని భాగం: “అవూజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్ షైతాని వ షిర్కిహి (ఔ షరికిహి).” షైతాన్ నుండి ఎలా శరణు కోరడం జరుగుతుందో, తన ఆత్మ కీడు నుండి కూడా “మిన్ షర్రి నఫ్సీ” అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ నేర్పారు. ఈ దుఆలు నేర్చుకోండి, చదువుతూ ఉండండి.
అయితే శత్రువులలో అతిపెద్ద శత్రువు తన మనసే అన్న విషయం ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. చెడు వైపునకు ప్రేరేపించుట, మంచి నుండి దూరం ఉంచుట, ఇంకా చెడును ఆదేశించి సుఖశాంతులను కోరుట, మరియు మనోవాంఛలను – అందులో నష్టమే ఉన్నప్పటికీ – వాటిని పూర్తి చేయుటకు ప్రేరేపించుట ఈ మనస్సు యొక్క స్వాభావిక గుణం.
وَمَا أُبَرِّئُ نَفْسِي ۚ إِنَّ النَّفْسَ لَأَمَّارَةٌ بِالسُّوءِ
[వమా ఉబర్రిఉ నఫ్సీ ఇన్నన్నఫ్స లఅమ్మారతుమ్ బిస్సూ]
నేను నా అంతరాత్మ పవిత్రతను చాటుకోవడం లేదు. నిశ్చయంగా ఆత్మ చెడునే ఎక్కువగా ప్రేరేపిస్తుంది. (12:53) – పదమూడవ పారాలోని మొదటి ఆయత్ ఉంది కదా.
ఈ విషయం తెలుసుకున్న ముస్లిం తన మనస్సును సత్కార్యాలు చేయుటకు, చెడు నుండి దూరం ఉంచుటకు తీవ్ర ప్రయత్నం చేయాలి. ఇదే ముజాహదా. మరియు ఇలా చేసే వారి గురించి సూరతుల్ అంకబూత్ లోని ఆయత్ నెంబర్ 69 లో అల్లాహ్ ఎంత గొప్ప శుభవార్త ఇచ్చాడో చూడండి:
وَٱلَّذِينَ جَـٰهَدُوا۟ فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا
[వల్లజీన జాహదూ ఫీనా లనహ్ దియన్నహుమ్ సుబులనా]
{మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మార్గాలను చూపుతాము}. (29: అన్ కబూత్: 69).
గమనించండి “సుబులనా” అని అల్లాహ్ బహువచనం చెబుతున్నాడు. అల్లాహు అక్బర్. మీరు ఒక్క అల్లాహ్ మార్గంలో నడవండి, అల్లాహ్ మీ కొరకు ఎన్నో సులభతరాలను ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఇది అసలైన భక్తుల యొక్క ఉత్తమ గుణం. విశ్వాసుల, సత్యవంతుల బాట ఇదే.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రివేళ చాలా దీర్ఘంగా తహజ్జుద్ నమాజ్ (తరావీహ్ నమాజ్ మరియు రాత్రి యొక్క నమాజ్ చేస్తుండేవారు – ఇషా తర్వాత నుండి మొదలుకొని ఫజర్ ప్రవేశించే వరకు ఉన్నటువంటి రాత్రి నమాజ్ ఏదైతే ఉందో దానినే తహజ్జుద్, తరావీహ్, ఖియాముల్ లైల్, సలాతుల్ లైల్, రాత్రి నమాజ్.. ఇవన్నీ పేర్లు ఉన్నాయి, విషయం ఒకటే). ఎంత దీర్ఘంగా చేసేవారంటే, ప్రవక్త యొక్క కాళ్లు వాపు వచ్చేవి. అది చూసి ప్రశ్నించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సమాధానం ఇచ్చారు? ప్రశ్న ఏం జరిగింది ప్రవక్తతో? “ఓ ప్రవక్తా! మీ పాపాలన్నీ మన్నించేసాడు అల్లాహ్ తాలా. ఎందుకు ఇంత కఠోరంగా మీరు శ్రమిస్తున్నారు?” అంటే ఏమన్నారు?
أَفَلاَ أَكُونُ عَبْدًا شَكُورًا
[అఫలా అకూను అబ్దం షకూరా]
ఏమి నేను అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలిపే దాసుణ్ణి కాకూడదా? (సహీహ్ బుఖారీ: 4837, సహీహ్ ముస్లిం: 2819)
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక మనం మన పాపాల మన్నింపు కొరకు ఇంకెంత శ్రమించాలో ఆలోచించండి, ప్రయత్నం చేయండి. తౌబా, మురాఖబా, ముహాసబా, ముజాహదా – ఈ నాలుగు విషయాలను పాటించండి, ఆత్మ శుద్ధి కలుగుతుంది. తద్వారా ఇహపర లోకాల శుభాలు, మేళ్లు, అన్ని రకాల భోగభాగ్యాలు అల్లాహ్ ప్రసాదిస్తాడు. చివరికి స్వర్గ ప్రవేశం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తోడు, అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం.
అల్లాహ్ మనందరికీ మన ఆత్మ శుద్ధి గురించి ఆలోచించే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు దఆవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43400

You must be logged in to post a comment.