త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] – కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2]
కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్
[మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్‌లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.

ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ
(మా మిన్ జుర్‌అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్‌అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్‌హిల్లాహ్)
అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.

గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.

ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్‌లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.

الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
(అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్)
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)

కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.

ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.

أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
(ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్)
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)

అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.

ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.

ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللَّهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللَّهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
(మన్ కజమ గైజన్ వహువ ఖాదిరున్ అలా అన్ యున్ఫిజహు దఆహుల్లాహు అజ్జవజల్ల అలా రుఊసిల్ ఖలాయిఖి యౌమల్ ఖియామతి హత్తా యుఖయ్యిరహుల్లాహు మినల్ హూరిల్ ఈని మా షాఅ)

“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.

దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ
(లైసష్షదీదు బిస్సురఅ, ఇన్నమష్షదీదుల్లజీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్)

“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”

ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.

సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْهَا فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ
(మన్ తబిఅ జనాజతన్ హత్తా యుసల్లా అలైహా వ యుఫ్రగ మిన్హా ఫలహు కీరాతాన్, వమన్ తబిఅహా హత్తా యుసల్లా అలైహా ఫలహు కీరాతున్, వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లహువ అస్ఖలు ఫీ మీజానిహి మిన్ ఉహుద్)

“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”

గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్‌లో పాల్గొందామా?

అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.

జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.

مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ. قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ
(మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు కీరాతున్, వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు కీరాతాన్. కీల వమల్ కీరాతాన్? కాల మిస్లుల్ జబలైనల్ అజీమైన)

“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”

పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.

ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్‌లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్‌లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.

ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
(మన్ కరఅ అషర ఆయాతిన్ ఫీ లైలతిన్ కుతిబ లహు అల్ కిన్తార్, వల్ కిన్తార్ ఖైరుమ్ మినద్దున్యా వమా ఫీహా)

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.

అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్‌లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు.

ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الْغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ الْمُقَنْطَرِينَ
(మన్ కామ బి అష్రి ఆయాతిన్ లమ్ యుక్తబ్ మినల్ గాఫిలీన్, వమన్ కామ బిమిఅతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్, వమన్ కామ బి అల్ఫి ఆయ కుతిబ మినల్ ముకన్తరీన్)

“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్‌లో లిఖించబడుతుంది.”

ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.

ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/O0rxrJs_Nms [22 నిముషాలు]

ఈ ప్రసంగంలో, స్వర్గంలో ప్రవేశించే వారి గురించి వివరించబడింది. ముఖ్యంగా నాలుగు రకాల స్వర్గవాసుల గురించి చర్చించబడింది. మొదటి రకం వారు విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లేవారు, వీరిలో 70,000 మంది ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. వీరి లక్షణాలు: ఇతరులను మంత్రించమని కోరరు, అపశకునాలు నమ్మరు, వాతలు పెట్టించుకోరు మరియు పూర్తిగా అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుతారు. రెండవ రకం వారు విచారణ తర్వాత స్వర్గానికి వెళ్లేవారు. మూడవ రకం అస్ హాబుల్ ఆరాఫ్, వీరి పుణ్యాలు పాపాలు సమానంగా ఉంటాయి, వీరు కొంతకాలం ఆగి అల్లాహ్ దయతో స్వర్గానికి వెళ్తారు. నాల్గవ రకం వారు పాపాల కారణంగా నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత, వారి ఈమాన్ కారణంగా స్వర్గానికి వెళ్లేవారు. పెద్ద పాపాలు చేసిన వారు కూడా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే (తౌబా), విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లే అవకాశం ఉందని ఖుర్ఆన్ ఆయత్ ల ద్వారా స్పష్టం చేయబడింది. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు, ముఖ్యంగా ఉక్కాషా బిన్ మెహ్సన్ మరియు మూర్ఛ రోగంతో బాధపడిన స్త్రీ ఉదంతాలు, స్వర్గం పట్ల వారికున్న ఆకాంక్షను మరియు అల్లాహ్ పై వారికున్న ప్రగాఢ విశ్వాసాన్ని వివరిస్తాయి.

أَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
[అవూదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్మాలినా]
మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా చెడు పనుల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు]
అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, అతడిని ఎవరూ దారి తప్పించలేరు. మరియు ఆయన ఎవరిని దారి తప్పిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు]
మరియు అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]
మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

أَمَّا بَعْدُ، فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ
[అమ్మా బఅదు ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్]
ఇక తర్వాత, నిశ్చయంగా, ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).

وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
[వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
మరియు ఉత్తమమైన మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.

وَشَرُّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్అతున్, వ కుల్ల బిద్అతిన్ దలాలతున్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు చెడ్డ విషయాలు (ధర్మంలో) కొత్తగా కల్పించబడినవి, మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం ఒక బిద్అత్ (, మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్నికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా, హమ్ద్ మరియు సనా తర్వాత స్వర్గములో ప్రవేశించే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం.

స్వర్గములో ప్రవేశించే వారు నాలుగు రకాలు. అల్లాహ్ దయ, ఆయన కరుణ మూలంగా ఎవరైతే స్వర్గములో ప్రవేశిస్తారో, స్వర్గ ప్రవేశం ఎవరికి జరుగుతుందో వారు నాలుగు రకాలు.

మొదటి రకం: విచారణ లేకుండా, అతను చేసిన కర్మల లెక్క తీసుకోకుండా స్వర్గ ప్రవేశం జరుగుతుంది. అదృష్టవంతులు వారు, ఎటువంటి లెక్క లేదు, విచారణ లేదు. విచారణ లేకుండా స్వర్గ ప్రవేశం. ఇది మొదటి రకం.

రెండవ రకం: విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. నిలబడాలి, పుస్తకం ఇవ్వబడుతుంది, ఖుర్ఆన్ మరియు హదీస్ లో చెప్పబడిన విధంగా ప్రతి విషయం గురించి లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు పెట్టావు? జీవితం ఎలా గడిచింది? వయసు, యవ్వనం, ప్రతి విషయం గురించి, ప్రతి చిన్న ప్రతి పెద్ద. అల్లాహ్ హక్కులు పూర్తి చేశావా లేదా? దాసుల హక్కులు పూర్తి చేశావా లేదా? ఫర్జ్ విషయాలు, ఆదేశాలు పాటించావా లేదా? ప్రతి విషయం గురించి అడగడం జరుగుతుంది. పరీక్ష తర్వాత, విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. రెండవ రకం.

మూడవ రకం: వారు నరకానికి పోరు, కానీ స్వర్గ ప్రవేశానికి నిర్ణీత సమయం వరకు ఆపబడతారు. వారు నరకానికి ఏ మాత్రం పోరు స్వర్గానికే పోతారు, కాకపోతే నిర్ణీత సమయం వరకు స్వర్గానికి పోకుండా ఆపబడతారు. వారినే అస్ హాబుల్ ఆరాఫ్ అంటారు, వారి ప్రస్తావన సూర నెంబర్ 7, సూర ఆరాఫ్ లో ఉంది. ఆరాఫ్ వారు నిర్నీత సమయం వరకు స్వర్గం పోకుండా ఆపబడతారు, తర్వాత స్వర్గానికి పోతారు. ఇది మూడవ రకం.

నాల్గవ రకం: వారి పాపాల మూలంగా నరకానికి పోతారు. శిక్ష ముగిసిన తర్వాత వారి ఈమాన్ మూలంగా చివరికి అల్లాహ్ తన దయతో స్వర్గానికి పంపిస్తాడు.

ఈ నాలుగు రకాలు స్వర్గానికి పోయేవారు.

వారిలో మొదటి వారు ఎవరు? విచారణ లేకుండా, ఎటువంటి లెక్క తీసుకోకుండా స్వర్గానికి పోయేవారు. వారి గురించి బుఖారీలో ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం.

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం. ఈయన ఎవరు? మన ప్రవక్త గారి పినతండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కుమారులు. పెద్ద సహాబీ. ఖుర్ఆన్ జ్ఞానం కలిగిన వారు. ముఫస్సిర్ సహాబీ. ఆయన కోసం ప్రవక్త గారు దుఆ చేశారు. అందుకే ఖుర్ఆన్ యొక్క ఆయతుల పరమార్థం, అర్థం బాగా తెలిసిన వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు. ఆయన అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏమని? “నాకు గత సమాజాలను చూపించడం జరిగింది”. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి గత సమాజాలు చూపించడం జరిగింది. తద్వారా నేను చూసింది ఏమిటంటే, (లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో) ఒక ప్రవక్తతో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు, అంటే స్వర్గానికి పోయేవారు, పాస్ అయిన వారు, ఆయన్ని అల్లాహ్ ని విశ్వసించిన వారు విశ్వాసులు, మూమినీన్లు కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది అంటే పది కంటే తక్కువ మంది. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయనతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయనతో పాటు ఎవరూ లేరు. అంటే ఆ ప్రవక్తకి విశ్వసించిన వారు ఒక్కరు కూడా లేరు.

ఆ తర్వాత, అకస్మాత్తుగా నాకు పెద్ద సమూహం గోచరించింది. బహుశా ఇది నా అనుచర సమాజం అని అనుకున్నాను. కానీ ఇది మూసా అలైహిస్సలాం, ఆయన అనుచర సమాజం. ఆ తర్వాత, ఇటువైపు చూడండి అని నన్ను చెప్పటం జరిగింది, నేను చూశాను, పెద్ద సమూహం. ఎక్కడ వరకు చూస్తున్నానో అక్కడ వరకు ఉంది జనాలు, పెద్ద సమూహం. మరోవైపు చూడండి అని చెప్పడం జరిగింది, మరోవైపు చూశాను, పెద్ద సమూహం కనపడింది.

అప్పుడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మీ అనుచర సమాజం. వీరిలో డెబ్బై వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి తమ గృహంలోకి వెళ్ళిపోయారు. ఇది విన్న సహాబాలు వారి మనసులో రకరకాల ఆలోచనలు, వారు ఎవరై ఉంటారు? విచారణ లేకుండా, లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గ ప్రవేశం. సుబ్ హా నల్లాహ్! ఎంత అదృష్టవంతులు! వారెవరు? బహుశా ఇస్లాం స్థితిలోనే జన్మించి షిర్క్ దరిదాపులకి కూడా పోని వారు ఉండవచ్చు అని రకరకాల ఆలోచనలు, మాటలు మాట్లాడుకుంటున్నారు. అటువంటి వారు అయ్యి ఉండవచ్చు, ఇటువంటి వారు అయ్యి ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉండగా, అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సహాబాల మాటలు విని, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఓ దైవ ప్రవక్త! ఆ డెబ్బై వేల మంది ఎవరు? విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గం, వారు ఎవరు దైవ ప్రవక్త అంటే దానికి సమాధానంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే:

هُمُ الَّذِينَ لاَ يَرْقُونَ وَلاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
[హుముల్లదీన లా యర్కూన వలా యస్తర్కూన వలా యతతయ్యరూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన]
“వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు.”

ఈ నాలుగు లక్షణాలు, గుణాలు కలిగిన వారు. వారెవరు? వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

ఒక సహాబీ, ఆయన పేరు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు, ఆయన ఇది విని వెంటనే, ఓ దైవ ప్రవక్త, విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గంలో ప్రవేశించే వారిలో నేను కూడా ఉండాలని దుఆ చేయండి అల్లాహ్ తో అని విన్నవించుకున్నారు. ఎవరు? ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దుఆ చేసే అవసరం లేదు, నువ్వు వారిలో ఉన్నావు అని శుభవార్త చెప్పేశారు. “పో ఉక్కాషా, నువ్వు వారిలో ఉన్నావు. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విచారణ లేకుండా, లెక్కల అది లెక్కలు లేకుండా డైరెక్ట్ గా స్వర్గం పంపుతారో, నువ్వు వారిలో ఉన్నావు” అని చెప్పారు. సుబ్ హా నల్లాహ్! ఈ భాగ్యం ఉక్కాషా బిన్ మెహ్సన్ కి ఖచ్చితంగా తెలిసిపోయింది. అల్ హమ్దులిల్లాహ్. ఇది విని ఇంకో సహాబీ లేచారు. ఓ దైవ ప్రవక్త, నా కోసం కూడా దుఆ చేయండి, నేను కూడా ఆ సమూహంలో ఉండాలి అని. దానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “సబకక బిహా ఉక్కాషా” అన్నారు. అంటే, ఉక్కాషా నీకన్నా ముందుకి వెళ్ళిపోయాడు, ఆ భాగ్యాన్ని ఆయన నోచుకున్నాడు అని చెప్పేశారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ బుఖారీలోనే మూడు చోట్ల ఉంది.

ఇదే హదీస్ ముస్లిం గ్రంథంలో కొంచెం తేడాతో ఇలా ఉంటుంది.

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَلاَ يَكْتَوُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
[హుముల్లదీన లా యస్తర్కూన వలా యతతయ్యరూన వలా యక్తవూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన]
“వారు ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునాలు పాటించరు, (వ్యాధి నివారణకు) వాతలు పెట్టించుకోరు మరియు తమ ప్రభువు పైనే నమ్మకం కలిగి ఉంటారు.”

వారు ఎవరంటే, వారు మంత్రించి ఊదించుకోరు. రెండవది, అపశకునం పాటించరు. ఈ అపశకునం గురించి రెండు వారాల ముందు మనం తెలుసుకున్నాం జుమా ప్రసంగంలోనే అపశకునం అంటే ఏమిటి అనేది. మూడవది, శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు. నాలుగవది, కేవలం అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు. ఇది పూర్తి హదీస్, విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారి గురించి.

దీనికి సంబంధించిన సహాబియాత్ లలో, సహాబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి, వారి జీవిత చరిత్ర మనము చదివితే. ప్రపంచ సమస్యలను, ప్రపంచ బాధలను పట్టించుకోకుండా, వారు ప్రాధాన్యత ఇచ్చింది పరలోకానికి. వారిలో ప్రతి ఒక్కరూ నేను విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారిలో ఉండాలని ప్రయత్నం చేసేవారు. దానికి ఉదాహరణ ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం. ఈ హదీస్ కూడా బుఖారీలో ఉంది, ముస్లింలో కూడా ఉంది. ఇది ఏమిటి?

అతా బిన్ అబూ రిబాహ్ అంటున్నారు, నాకు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా పిలిచి, నేను నీకు ఒక స్వర్గ స్త్రీని, స్వర్గ మహిళని చూపించనా అని అడిగారు. “ఖుల్తు బలా”, తప్పనిసరిగా చూపించండి, స్వర్గ మహిళ! అంటే ప్రతి ఒక్కరికి గ్యారెంటీ లేదు కదా. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఎవరు స్వర్గానికి పోతారో ఖచ్చితంగా చెప్పగలమా? కానీ ఎవరెవరికైతే మన ప్రవక్త గారు ముందే చెప్పి పోయారో వారు ఖచ్చితం గ్యారెంటీ. ఆ విషయం ఇది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ అంటున్నారు “ఓ అతా బిన్ అబూ రిబాహ్, స్వర్గ మహిళకి చూపించినా?” చూపించండి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో ఆ నల్ల రంగు గల స్త్రీ.

ఆవిడ ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాకు మూర్ఛ రోగం ఉంది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నేను నగ్నంగా అయిపోతాను, నా శరీరంలో బట్టలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. స్వస్థత కోసం దుఆ చేయండి దైవ ప్రవక్త అన్నారు.

ఇది విని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడకి రెండు ఆప్షన్లు ఇచ్చారు. అది ఏమిటి?

إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكِ الْجَنَّةُ، وَإِنْ شِئْتِ دَعَوْتُ اللَّهَ أَنْ يُعَافِيَكِ
[ఇన్ షి’తి సబర్తి వలకిల్ జన్నతు, వ ఇన్ షి’తి దఅవుతుల్లాహ అన్ యుఆఫియకి]
“నువ్వు తలచుకుంటే సహనం వహించు, నీకు స్వర్గం ఉంది. లేదా నువ్వు కోరుకుంటే నేను అల్లాహ్ తో దుఆ చేస్తాను, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.”

ఆ స్వర్గ మహిళ మొదటి ఆప్షన్ ఎన్నుకున్నది. నేను సహనం వహిస్తాను ఓ దైవ ప్రవక్త, ఎందుకంటే నాకు స్వర్గం లభిస్తుంది, చెప్పారు కదా, స్వర్గం గ్యారెంటీ ఇస్తున్నారు కదా. నాకు ఈ రోగం ఉన్నా పర్వాలేదు, నేను సహనం వహిస్తాను, కాకపోతే ఒక్క విన్నపం. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నా శరీరం నుంచి నా బట్టలు ఎగరకుండా ఉండాలి, నేను నగ్నం అవ్వకూడదు, దాని కోసం ప్రార్థించండి అన్నారు. దాని కోసం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేశారు.

అభిమాన సోదరులారా, ఇది సహాబాల ప్రయత్నం, వారి కృషి, ఏ విధంగా నేను స్వర్గానికి పోవాలి, అది కూడా విచారణ లేకుండా స్వర్గానికి పోవాలి అనేది.

ఒక ప్రశ్న, అది ఏమిటంటే, కొందరు చిన్న చిన్న ఏదో పాపాలు చేస్తారు, పెద్ద పాపాలు కూడా చేస్తారు, కాకపోతే బుఖారీ హదీస్ లో చెప్పబడిన ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి కదా అవి ఉండవు. అపశకునం పాటించరు. షిర్క్ చేయరు. మంత్రించి ఊదించుకోరు. అల్లాహ్ పై నమ్మకం ఉంది. ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి, వేరే పాపాలు చేస్తున్నారు. అటువంటి వారు కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోతారా? ఈ ప్రశ్న షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్-మునజ్జిద్ తో అడగడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు, చిన్న పెద్ద పాపాలకి పాల్పడిన వాడు కూడా కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సూర ఫుర్ఖాన్ లోని ఈ ఆయత్ ను పఠించారు. ఆయత్ ఏమిటి?

وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ
వారు అల్లాహ్‌తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప – అల్లాహ్‌ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. (25:68)

అంటే, వారు అల్లాహ్ తో పాటు మరే దైవాన్ని మొరపెట్టుకోరు అంటే షిర్క్ చేయరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు, అంటే హత్య చేయరు. వారు వ్యభిచారానికి పాల్పడరు, వ్యభిచారం చేయరు. మూడు విషయాలు, షిర్క్ చేయరు, హత్య చేయరు, వ్యభిచారం చేయరు. ఈ చేష్టలకు ఒడగట్టిన వారు, చేస్తే? హత్య చేశారు, లేదా వ్యభిచారం చేశారు, లేదా షిర్క్ చేశారు. ఇలా చేస్తే, పాప ఫలాన్ని పొంది తీరుతాడు. అంతేకాకుండా:

يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا
ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. (25:69)

ఇక మూడోవ ఆయత్.

إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్‌ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్‌ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు.(25:70)

అయితే, ఈ పాప కార్యాల తర్వాత, పాపం చేసిన తర్వాత కుమిలిపోయి, పశ్చాత్తాపం చెంది, కన్నీళ్లు కార్చి, అంటే ఇక్కడ పశ్చాత్తాపం అంటే జోక్ కాదు, సీరియస్. ఏ పశ్చాత్తాపం గురించి అల్లాహ్ చెప్పాడో, “యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా”. తౌబయే నసూహా. ఏ విధంగా ఖుర్ఆన్ లో హదీస్ లో తౌబా అంటే ఏమిటి, ఆ విధంగా తౌబా పశ్చాత్తాపం చెంది, కుమిలిపోయి పశ్చాత్తాపం చెందారో, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చేస్తాడు. సుబ్ హా నల్లాహ్! వారు చేసిన పాపాలు పుణ్యాలుగా మార్చివేయబడతాయి. అల్లాహ్ క్షమాపశీలి, కరుణామయుడు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? తౌబా చేసుకుంటే, ఆ నాలుగు లక్షణాలు ఉంటే, షిర్క్ చేయని వారు, మంత్రించి ఊదుకోని వారు, అపశకునం పాటించని వారు, అల్లాహ్ పై నమ్మకం వేసిన వారు, వేరే పాపాలు చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో కుమిలిపోతూ నిజమైన తౌబా చేసుకుంటే వారికి కూడా విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి అవకాశం ఉంది.

ఇక వారు ఎవరు? మూడవ వర్గం, నరకానికి పోరు, నిర్నీత సమయం వరకు ఆరాఫ్ పైన, ఆరాఫ్ అది స్థలం అక్కడ పరలోకములో. ఆరాఫ్ అంటే ఒక స్థలం పేరు, గోడ పేరు. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు, వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. అంటే ఆరాఫ్ పైన ఉన్న మనుషులు స్వర్గానికి పోయేవారు ఎవరు, నరకానికి పోయేవారు ఎవరు, వారి ఆనవాలను బట్టి గుర్తుపట్టేస్తారు వాళ్ళు, ఆరాఫ్ వాళ్ళు, ఆ గోడ పైన ఉన్నవారు. వారు స్వర్గవాసులను పిలిచి “అస్సలాము అలైకుమ్”, మీపై శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికీ ఇంకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే స్వర్గం లభిస్తుందన్న ఆశతో వారు ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు? వీరి గురించి అత్యధిక ధర్మ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఆరాఫ్ వాళ్ళు, వారి సత్కర్మలు, దుష్కర్మలు, పుణ్యాలు, పాపాలు సరిసమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారిని నరకంలో పోకుండా ఆపుతాయి, వారి దుష్కర్మలు స్వర్గానికి పోకుండా ఆపుతాయి. అందుకు నిర్నీత సమయం వరకు వారు వేచి ఉంటారు, స్వర్గానికి పోకుండా ఆపబడి ఉంటారు, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయతో వారిని స్వర్గానికి పంపిస్తాడు. వీరు మూడవ రకం వారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించే ఆ సమూహంలో చేరిపించు గాక. ఆమీన్. మనందరికీ ఇహపరలోకాల సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

హౌదె కౌసర్ | మరణానంతర జీవితం : పార్ట్ 50 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మానవుల కర్మల నమోదు  – [మరణానంతర జీవితం – పార్ట్ 50]
https://youtu.be/acqUQX3MOKQ [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన విశ్వాసులకు ప్రసాదించబడే ఒక గొప్ప వరం, “హౌదె కౌసర్” గురించి వివరించబడింది. తీర్పుదినం యొక్క భయంకరమైన పరిస్థితులలో, ప్రజలు తీవ్రమైన దాహంతో ఉన్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ద్వారా ఈ ప్రత్యేకమైన కొలను (హౌద్) ప్రసాదించబడుతుంది. దాని నీరు పాలకన్నా తెల్లగా, తేనెకన్నా తియ్యగా ఉంటుంది. ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు స్వర్గంలో ప్రవేశించే వరకు మళ్ళీ దాహం గొనరు. ఈ హౌద్ వద్దకు ప్రవక్త అనుచరులు మాత్రమే చేరగలుగుతారు, మరియు వారిని ప్రవక్త తమ చేతులతో నీరు త్రాగిస్తారు. అయితే, ప్రవక్త తర్వాత ధర్మంలో కొత్త విషయాలను కల్పించినవారు (బిద్అత్ చేసినవారు) మరియు ఆయన మార్గాన్ని అనుసరించని వారు ఈ గొప్ప భాగ్యానికి నోచుకోలేరు మరియు హౌద్ నుండి దూరంగా నెట్టివేయబడతారు. ధర్మంపై స్థిరంగా ఉండి, కష్టాలలో సహనం వహించిన వారికి ఈ భాగ్యం లభిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా, ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన స్థితి అలుముకుంటుంది, ప్రజలందరూ చెమటలో మునిగి, దీర్ఘకాలం వల్ల వేచి చూస్తూ వేచి చూస్తూ అలసిపోయి, సిఫారసు చేయడానికి ప్రవక్తలను సైతం విన్నవించుకొని నానా రకాల బాధలకు గురి అవుతూ ఉన్న ఆ సందర్భంలో, ఎన్నో ఘట్టాలు వారి ముందు దాటుతూ ఉంటాయి. లెక్కతీర్పు తీసుకోవడం జరుగుతుంది, అది కూడా చాలా క్లిష్ట పరిస్థితి. అటువైపున త్రాసులో తూకం చేయడం జరుగుతుంది. మరోవైపు కుడిచేతిలో కర్మపత్రాలు పొందే వారు కొందరు ఉంటే, ఎడమచేతిలో కర్మపత్రాలు పొందే వారు మరికొందరు అభాగ్యులు ఉంటారు.

ఇలాంటి ఈ సందర్భంలో సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది, వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది. కనీసం ఒక చుక్క బొట్టు నీళ్లు దొరికినా ఎంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది. అలాంటి సందర్భంలో హౌదె కౌసర్ అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది.

ఆ సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌదె కౌసర్. అంటే, అది ఒక మహా విశాలమైన హౌద్. ఒక నెల మీరు ప్రయాణం చేసినా దాని పొడుగు అనేది అంతము కాదు. వెడల్పు కూడా అలాగే ఉంటుంది. మరియు దాని యొక్క నీళ్లు పాలకంటే తెల్లగా, తేనెకంటే తీపిగా ఉంటాయి. ఆ హౌద్ లో వచ్చిపడే నీళ్లు స్వర్గంలో ఉన్నటువంటి నహరె కౌసర్ (కౌసర్ నది) నుండి వస్తాయి.

మహాశయులారా, దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు అంటే, దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం. మరియు ఆ హౌదె కౌసర్, దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో, వారు స్వర్గంలో వెళ్లే అంతవరకు వారికి దాహం కలగదు.

అయితే, ఆ హౌదె కౌసర్ నీరును పొందే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అది ప్రాప్తించదు. హౌదె కౌసర్ వద్ద ఆ నీరు త్రాగడానికి ఏ పాత్రలైతే ఉంటాయో, వెండి బంగారపు పాత్రలు ఉంటాయి మరియు వాటి సంఖ్య ఆకాశంలో నక్షత్రాల్లాంటి సంఖ్య. అక్కడ ఆ హౌదె కౌసర్ వద్దకు రావడానికి ప్రతి ఒక్కరికీ పర్మిషన్, అనుమతి అనేది ఉండదు. మరియు అక్కడ ప్రతి ఒక్కరు తమిష్టానుసారం త్రాగలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత, వారి యొక్క శుభ హస్తాలతో అది ఇవ్వడం జరుగుతుంది. వారి శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

حَوْضِي مَسِيرَةُ شَهْرٍ، وَزَوَايَاهُ سَوَاءٌ
(హౌదీ మసీరతు షహ్రిన్, వ జవాయాహు సవా)
“నాకు అక్కడ ఇవ్వబడే హౌద్ దాని యొక్క పొడుగు ఒక నెల ప్రయాణం చేసే అంత దూరం ఉంటుంది మరియు దాని యొక్క వెడల్పు కూడా అంతే ఉంటుంది.”

مَاؤُهُ أَبْيَضُ مِنَ اللَّبَنِ، وَرِيحُهُ أَطْيَبُ مِنَ الْمِسْكِ
(మాఉహు అభ్యదు మినల్లబన్, వ రీహుహు అత్‌యబు మినల్ మిస్క్)
దాని యొక్క రంగు పాలకంటే తెల్లగా మరియు దాని యొక్క సువాసన కస్తూరి కంటే ఎక్కువ సువాసన

మరియు అక్కడ త్రాగడానికి పాత్రలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న విధంగా ఉంటాయి.

مَنْ يَشْرَبْ مِنْهَا فَلا يَظْمَأُ أَبَدًا
(మన్ యష్రబ్ మిన్హా ఫలా యద్మఉ అబదా)
“ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు ఎప్పటికీ దాహం గొనరు.”

మరి ఎవరైతే ఒకసారి ఆ హౌదె కౌసర్ నుండి త్రాగుతారో ప్రవక్త శుభ హస్తాలతో, వారికి ఆ తర్వాత ఎప్పుడూ దాహం ఏర్పడదు.

ఆ ప్రళయ దినం, అక్కడ ఆ దీర్ఘకాలం, ఒక మైల్ దూరాన ఉన్న సూర్యుడు, చెమటలతో, చెమటలు కారుతూ కారుతూ, దాహం పెరిగిపోతుంది. అక్కడ ఆ దాహం తీరడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంటుంది. అదే హౌదె కౌసర్.

అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభ హస్తాలతో విశ్వాసులకు ఆ నీరు త్రాగిస్తూ ఉంటారు. ఆ నీరును త్రాగిన వారే భాగ్యవంతులు. మరియు ఆ నీరు త్రాగడం నుండి తోయబడిన వారు, దూరం చేయబడిన వారే అభాగ్యులు. ఒకసారి ఈ హదీథును వినండి, భాగ్యవంతులు ఎవరో, అభాగ్యులు ఎవరో తెలుసుకొని భాగ్యవంతుల్లో చేరే ప్రయత్నం చేయండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

إِنِّي فَرَطُكُمْ عَلَى الْحَوْضِ
(ఇన్నీ ఫరతుకుమ్ అలల్ హౌద్)
“నిశ్చయంగా, నేను హౌదె కౌసర్ పై మీ గురించి వేచి చూస్తూ ఉంటాను

مَنْ مَرَّ بِي شَرِبَ
(మన్ మర్ర బీ షరిబ్)
ఎవరైతే నా వద్దకు వస్తారో వారు త్రాగి ఉంటారు

ఎవరైతే నా వద్దకు వస్తారో, వారు నా శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగి ఉంటారు.

وَمَنْ شَرِبَ لَمْ يَظْمَأْ أَبَدًا
(వమన్ షరిబ లమ్ యద్మఅ అబదా)
మరి ఎవరైతే త్రాగుతారో, వారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాహానికి గురి కారు.

وَلَيَرِدَنَّ عَلَىَّ أَقْوَامٌ أَعْرِفُهُمْ وَيَعْرِفُونَنِي ثُمَّ يُحَالُ بَيْنِي وَبَيْنَهُمْ فَأَقُولُ إِنَّهُمْ مِنِّي فَيُقَالُ إِنَّكَ لاَ تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ فَأَقُولُ سُحْقًا سُحْقًا لِمَنْ بَدَّلَ بَعْدِي
(వలయరిదన్న అలయ్య అఖ్వామున్ ఆరిఫుహుమ్ వ యారిఫూననీ, సుమ్మ యుహాలు బైనీ వ బైనహుమ్. ఫ అఖూలు ఇన్నహుమ్ మిన్నీ, ఫ యుఖాలు ఇన్నక లా తద్రీ మా అహదసూ బాదక, ఫ అఖూలు సుహ్ఖన్ సుహ్ఖన్ లిమన్ బద్దల బాదీ)

హౌదె కౌసర్ వద్దకు నా దగ్గరికి కొందరు వస్తారు. నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతారు. అంతలోనే నా మధ్యలో, వారి మధ్యలో ఒక అడ్డు వేయడం జరుగుతుంది. నేను అంటాను, వారు నా వారు, వారిని రానివ్వండి. అప్పుడు చెప్పడం జరుగుతుంది, నీకు తెలియదు నీ తర్వాత వీరు నీ సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో. అప్పుడు నేను అంటాను, ఇలా నా ధర్మంలో మార్పు చేసుకున్న వారు నాకు దూరమే ఉండాలి, దూరమే ఉండాలి, దగ్గరికి రాకూడదు అని

గమనించారా? హౌదె కౌసర్ ఆ రోజు లభించే ఆ నీరు మన కొరకు ఎంత శుభకరమైనది. కానీ అల్లాహ్ పంపిన సత్య ధర్మం, అల్లాహ్ పంపినటువంటి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనందుకు, లేదా విశ్వసించి ఆయన అడుగుజాడలలో జీవితం గడపనందుకు, ఆయన తెచ్చిన సత్య ధర్మంలో ఇష్టానుసారం మార్పులు చేసుకొని, అవి కూడా ధర్మానికి సంబంధించిన విషయాలని భావించి జీవితం గడిపేవారు ఎంత దురదృష్టానికి గురవుతారు. మరియు ఇలాంటివారే అభాగ్యులు. ఆ రోజు ప్రవక్త శుభ హస్తాల ద్వారా హౌదె కౌసర్ నీరు నోచుకొని వారు.

ఈ హౌదె కౌసర్ గురించి మరికొన్ని వివరాలు ఉన్నాయి. మహాశయులారా, హౌదె కౌసర్ గురించి సహీ ముస్లిం షరీఫ్ లోని మరో ఉల్లేఖన వినండి. ఈ హదీథులో భాగ్యవంతులు, అభాగ్యులు ఇద్దరి ప్రస్తావన ఉంది.

అయితే మహాశయులారా, ఈ హదీద్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏమిటి?

ఒకటి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ప్రజలందరి మధ్యలో తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు.

రెండో విషయం మనకు తెలిసింది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని గుర్తుపట్టి హౌదె కౌసర్ వైపునకు మనల్ని తీసుకెళ్లి తమ శుభ హస్తాలతో మనకు హౌదె కౌసర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే, తప్పకుండా వుదూ చేస్తూ ఉండాలి, నమాజ్ చేస్తూ ఉండాలి.

మూడో విషయం, నమాజ్, వుదూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇక నమాజు, వుదూ తర్వాత జీవితంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాన్ని పాటించాలి. ఆయన తెచ్చిన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. నమాజ్ అయితే చేస్తున్నాము కదా అని జీవిత ఇతర విషయాల్లో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని, మనకిష్టమైన ఆచారాలను ఆచరిస్తూ ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని, ఆయన ఆదర్శాన్ని విడనాడడం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందకుండా ఉండడానికి కూడా కారణం కావచ్చు. ఏమన్నారు ప్రవక్త గారు? మిమ్మల్ని నేను వుదూ యొక్క అవయవాలు మెరుస్తుండడం వల్ల గుర్తుపడతాను, కానీ అదే సందర్భంలో మీలోని కొందరిని, మీలోని ఒక వర్గాన్ని నా వద్దకు రాకుండా, వారు నా వరకు చేరకుండా ఒక అడ్డు వేసి వారిని దూరం చేయడం జరుగుతుంది. అంటే, వారి యొక్క అవయవాలు మెరుస్తున్నాయి, కానీ వారిలో మరికొన్ని ఇతర చెడులు కూడా ఉన్నాయి.

అందుకు మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శం మన జీవిత వ్యవహారంలోని ప్రతీ విషయంలో పాటించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రళయ దినాన గొప్ప వరంగా బహుకరించబడే ఈ హౌద్, దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన హదీథులు చాలా ఉన్నాయి. హదీథ్ పరిభాషలో అహాదీథె ముతవాతిరా అని అంటారు. అంటే సంకోశానికి, అంటే అనుమానానికి, సందేహానికి ఏ తావు లేనటువంటి సంఖ్యలో అన్ని హదీథులు వచ్చి ఉన్నాయి అని భావం.

మరొక విషయం, ప్రళయ దినాన కేవలం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కరికే కాదు, ఇతర ప్రవక్తలకు కూడా హౌద్ ఇవ్వబడుతుంది. వారి వారి అనుచర సంఘాలు వారి వద్దకు వచ్చి వారి శుభ హస్తాలతో కూడా వారు ఆ నీరు త్రాగుతారు. కానీ అతిపెద్ద సంఖ్యలో మన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకే ప్రజలు హాజరవుతారు. వారిని అనుసరించిన వారి సంఖ్యనే అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఎన్నో హదీథులు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకు, తిర్మిదిలోని హదీథ్, షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామేలో ప్రస్తావించారు. హదీథ్ నెంబర్ 2156.

إِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا
(ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదా)
“నిశ్చయంగా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఉంటుంది.”

మరో ఉల్లేఖనంలో ఉంది,

وَإِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا تَرِدُهُ أُمَّتُهُ
(వ ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదన్ తరిదుహు ఉమ్మతుహు)
ప్రతి ప్రవక్తకు హౌద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ హౌద్ వద్దకు ఆ ప్రవక్త యొక్క అనుచర సంఘం హాజరవుతుంది

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందడానికి మరొక గొప్ప అవకాశం ఎలాంటి వారికి లభిస్తుందంటే, ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉండి, ఏ కష్టాలు, ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఎదురైనా సహనం వహిస్తూ ఉంటారో, అలాంటి వారు తప్పకుండా ఈ శుభ అవకాశాన్ని పొందుతారు.

గమనించండి ఈ హదీథును. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీథ్.

إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدِي أَثَرَةً فَاصْبِرُوا حَتَّى تَلْقَوْنِي عَلَى الْحَوْضِ
(ఇన్నకుమ్ సతల్ ఖౌన బాదీ అసరతన్, ఫస్బిరూ హత్తా తల్ ఖౌనీ అలల్ హౌద్)
“నిశ్చయంగా, నా తర్వాత మీరు పక్షపాతాన్ని చూస్తారు. కనుక, మీరు నన్ను హౌద్ వద్ద కలిసే వరకు సహనం వహించండి.”

నా తర్వాత మీరు హక్కు గల వారికి ఇవ్వవలసిన హక్కు ఇవ్వకుండా, హక్కు లేని వారికి ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అయితే మీరు సహనం వహిస్తూ ఉండండి. ఎంతవరకు సహనం వహించాలి? మరణం వచ్చేవరకు సహనము వహించండి, నా హౌద్ వద్దకు మీరు వచ్చేంతవరకు సహనం వహిస్తూ ఉండండి. ఈ విధంగా ఈ హదీథులో మనకు అల్లాహ్ ధర్మంపై స్థిరంగా ఉండడంలో, ప్రపంచంలోని ఏదైనా ఒక హక్కు మనకు లభించకున్నా, అందులో మనం ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకుండా, ప్రవక్త ఈ శుభవార్తను అందుకొని మనం ప్రవక్త ఆదర్శాన్ని పాటిస్తూ ఉండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ పరలోకాన కలుసుకునే అంతవరకు మనం సహనం వహిస్తూ ఉంటే, తప్పకుండా ప్రవక్త శుభ హస్తాలతో ఆ నీరు మనం త్రాగవచ్చు.

అయితే మహాశయులారా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఇవ్వడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడిందో, అందులో కూడా ఆ ప్రవక్తలను ఆ కాలంలో వారు అనుసరించి ఉంటేనే వారికి అది ప్రాప్తమవుతుంది. ఇది ఒక విషయం. రెండో విషయం, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, నేను గత ప్రవక్తలను నమ్ముతున్నాను అన్నంత మాత్రాన, వారికి ఆ ప్రవక్తల నుండి కూడా హౌదె కౌసర్, అంటే వారికి లభించే హౌద్ నుండి నీరు త్రాగే అవకాశం దొరుకుతుంది అని భావించవద్దు. ఎందుకంటే ప్రతి ప్రవక్త తమ వెనుక వచ్చే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారు. తమ వెనుక వచ్చే ప్రవక్తను విశ్వసించాలి అని కూడా చెప్పారు. ఇదే విషయం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఉన్న ఏసుక్రీస్తు వారు, హజరత్ ఈసా అలైహిస్సలాం చెప్పారు,

يَأْتِي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ
(యాతీ మిమ్ బాదీ ఇస్ముహూ అహ్మద్)
“నా తరువాత ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఆయన పేరు అహ్మద్.” (అస్-సఫ్ఫ్ 61:6)

నా తర్వాత అహ్మద్ పేరు గల ఒక ప్రవక్త వస్తారు. ఆ ప్రవక్తను మీరు విశ్వసించండి. ఆ ప్రవక్తను మీరు నమ్మండి అని. మరియు బైబిల్ గ్రంథంలో ఆదరణకర్త అన్న పేరుతో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన వచ్చి ఉంది.

అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, మనం మా ప్రవక్తలను నమ్ముతున్నాము, అందుగురించి పరలోకంలో మేము సాఫల్యం పొందుతాము, మా ప్రవక్తల ద్వారా మేము హౌద్ నీళ్ళను పొందుతాము, ఆ పరలోకంలోని ఘట్టాలను మేము చాలా సులభతరంగా దాటిపోతాము అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. ఇది భ్రమగానే అయిపోతుంది. మరియు ఆ రోజు చాలా నష్టంలో పడవలసి ఉంటుంది. అల్లాహ్ మనందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి, వారి ఆదర్శాన్ని పాటించి, ధర్మంపై స్థిరంగా ఉండి, ఆయన తెచ్చిన ధర్మంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోకుండా, ఆయన చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41749

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

విశ్వాసుల మాతృమూర్తుల యొక్క ఘనత, విశిష్టత – హబీబుర్రహన్ జామి’ఈ [వీడియో | టెక్స్ట్]

విశ్వాసుల మాతృమూర్తుల యొక్క ఘనత, విశిష్టత
హబీబుర్రహన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=j3mXasfRBgo [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఉమ్మహాతుల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తులు), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల యొక్క ఉన్నత స్థానం మరియు ప్రత్యేకతలను వివరిస్తారు. సాధారణ స్త్రీల కంటే వారి స్థాయి ఎంతో ఉన్నతమైనదని, అల్లాహ్ వారిని ప్రత్యేకంగా ప్రవక్త కోసం ఎంపిక చేశారని ఖురాన్ ఆయతుల ఆధారంగా తెలియజేస్తారు. వారు విశ్వాసులందరికీ తల్లులని, ప్రవక్త మరణానంతరం వారిని వివాహం చేసుకోవడం నిషిద్ధమని స్పష్టం చేస్తారు. వారి సత్కార్యాలకు రెండింతల పుణ్యం లభిస్తుందని మరియు అల్లాహ్ వారిని అన్ని రకాల మాలిన్యాల నుండి పరిశుభ్రపరిచాడని వివరిస్తారు. ఈ ప్రపంచంలోనే కాక, స్వర్గంలో కూడా వారు ప్రవక్త భార్యలుగానే ఉంటారనే గౌరవాన్ని కూడా ప్రస్తావించారు.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

ఉమ్మహాతుల్ ము’మినీన్ అందరి ఘనత, ప్రత్యేకత. ఉమ్మహాతుల్ ము’మినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా నుంచి మైమూనా రదియల్లాహు అన్హా వరకు, వారందరి విశిష్టతలు, ఘనతలు, ప్రత్యేకతలు.

ఉమ్మహాతుల్ ము’మినీన్, వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కాదు. వారి ప్రత్యేకత ఇది. ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటి? వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల గురించి ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించాడు. ముఖ్యంగా సూరతుల్ అహ్జాబ్ లో కొంచెం వివరంగా ఉంటుంది.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ
(యా నిసాఇన్ నబియ్యి లస్తున్న కఅహదిమ్ మినన్ నిసా)
ఓ ప్రవక్త సతీమణులారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. (33:32)

గౌరవంలో, మర్యాదలో, ఘనతలో, విశిష్టతలో, మంచి విషయాలలో, అన్ని విషయాలలో మీరు సాధారణమైన స్త్రీలు కారు , వారు ఎవ్వరైనా సరే, గొప్ప గొప్ప సహాబియాతులు అయినా, గొప్ప ప్రముఖ సహాబాల సతీమణులైనా, తాబయీన్లు, ముహద్దసీన్లు, సామాన్య ప్రజలు, ఎవరైనా సరే, ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత, అలాగే ఇతరుల వారు సమానులు కారు. ఇది వారి ప్రత్యేకత.

అలాగే రెండవ విషయం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని, ఉమ్మహాతుల్ ము’మినీన్లని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకై ఎంపిక చేశాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

لَّا يَحِلُّ لَكَ النِّسَاءُ مِن بَعْدُ وَلَا أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ
ఇక దీని తరువాత, వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు – వారి అందచందాలు నీకు ఎంత నచ్చినాసరే! (33:52)

ఓ ప్రవక్తా! ఇక, అంటే మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులు, ఉమ్మహాతుల్ ము’మినీన్, 11 మంది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరిగా వివాహం చేసుకునింది మైమూనా బిన్తె హారిత్ రదియల్లాహు అన్హాని. మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆదేశం ఇచ్చాడు. ఓ ప్రవక్తా! ఇక నుంచి ఇంకో వివాహం చేసుకోవటం నీకు సమ్మతం కాదు, ఇక నువ్వు చేసుకోలేవు. ఈ 11 మంది మాత్రమే నీ కోసం ఎంపిక చేశాను, ఇక నీకు అనుమతి లేదు. ఇక తర్వాత ఏ స్త్రీని అయినా నువ్వు వివాహం చేసుకోలేవు. ఒక సతీమణిని విడాకులు ఇచ్చి దానికి బదులుగా కూడా నువ్వు చేసుకోలేవు. ఈ ప్రత్యేకత, ఈ గౌరవం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ప్రసాదించాడు.

మూడవది, వారు ఉమ్మహాతుల్ ము’మినీన్ల స్థానం అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. విశ్వాసుల కొరకు తల్లులు. మూడవ ప్రత్యేకత.

النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ
దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు.  (33:6)

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువగా హక్కు ఉంది. ఆయన భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ స్థానం, ఆ గౌరవం వారికి ప్రసాదించాడు.

ఏ గొప్ప సహాబీ సతీమణి అయినా, భర్త మరణించిన తర్వాత ఇంకో వివాహం చేసుకునే అనుమతి ఉంది. కానీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుమతి ఉమ్మహాతుల్ ము’మినీన్లకి ప్రసాదించలేదు. ఎందుకు? వారు తల్లులు మనకు. ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరికీ ఉమ్మహాతుల్ ము’మినీన్ తల్లులు. ఆ గౌరవం అల్లాహ్ వారికి ప్రసాదించాడు.

నాలుగవ ప్రత్యేకత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వారు వివాహమాడడం ధర్మసమ్మతం కాదు, ఈ విషయం చెప్పింది ఇప్పుడు.

وَلَا أَن تَنكِحُوا أَزْوَاجَهُ مِن بَعْدِهِ أَبَدًا
(వలా అన్ తన్కిహు అజ్వాజహూ మిమ్ బ’అదిహీ అబదా)
అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. (33:53)

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఇంకో వివాహం చేసుకోలేరు, సమ్మతం లేదు. వారి ప్రత్యేకత ఇది.

ఐదవది, వారు ఈ ప్రపంచంలోనే కాదు, స్వర్గంలో కూడా ప్రవక్త గారికి భార్యలుగానే ఉంటారు, సతీమణులుగానే ఉంటారు.

ఆరవ ప్రత్యేకత, ఆయతె తఖ్ఈర్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్లను ఒక సందర్భంలో రెండు అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండింటిలో ఒకటి మీరు నిర్ణయించుకోండి అన్నాడు. ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా? ఈ రెండింటిని ఏదో ఒకటి ఎన్నుకోండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఈ ఆప్షన్ ఇచ్చాడు. ఈ ప్రాపంచిక జీవితం కావాలా? పరలోకం కావాలా? ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా?

అల్లాహ్ ఈ ఆయతును సెలవిచ్చాడు సూరహ్ అహ్జాబ్ లోనే.

يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا
ఓ ప్రవక్తా! నీ భార్యలకు ఇలా చెప్పు: “మీరు గనక ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకు బెళుకులను కోరుకుంటూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి, మిమ్మల్ని ఉత్తమరీతిలో సాగనంపుతాను –(33:28)

ప్రపంచం కోరుకుంటే, ఈ ప్రాపంచిక జీవితం కోరుకుంటే మీకు ఎంతో కొంత మొత్తం నేను ఇచ్చేస్తాను, ప్రపంచానికి సంబంధించిన విషయాలు, ధనము, ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే.

وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا
“కాని ఒకవేళ అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే, మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్‌ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.” (33:29)

ఒకవేళ మీకు అల్లాహ్ కావాలా, ఆయన ప్రవక్త కావాలా, పరలోకం ఎన్నుకుంటారా, అటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సద్వర్తనుల కొరకు గొప్ప ప్రతిఫలం ప్రసాదించి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచాడు. అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లలో అందరూ, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు విషయాలు అవకాశాలు ఇచ్చాడో, ప్రాపంచిక జీవితం కావాలా, పరలోకం కావాలా అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లో అందరూ ఉమ్మడిగా, సంతోషంగా, హృదయపూర్వకంగా వారు ఎన్నుకునింది ఏమిటి? పరలోక జీవితమే.

ఉమ్మహాతుల్ ము’మినీన్లను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని షిర్క్ నుండి, షైతాన్ నుండి, చెడు పనుల నుండి, అన్ని కీడుల నుండి అన్ని అశుద్ధతల నుండి అల్లాహ్ వారిని పరిశుద్ధం చేశాడు, పవిత్రులుగా చేశాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا
ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్‌ అభిలాష.(33:33)

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది, ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి షిర్క్ యొక్క మాలిన్యం, చెడు మాలిన్యం, అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది అల్లాహ్ అభిలాష. కావున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేశాడు. ఇది వారి ప్రత్యేకత.

ఇక ఎనిమిదవది, వారు ఏ సదాచరణ చేసినా, ఏ మంచి పని చేసినా, ఏ సద్వర్తన, ఏ పుణ్య కార్యం ఏది చేసినా వారికి రెండింతల పుణ్యం ప్రసాదించబడుతుంది. ఇది వారి ప్రత్యేకత. రెండింతల పుణ్యం.

అల్లాహ్ సెలవిచ్చాడు:

وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا
మరి మీలో ఎవరు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము.(33:31)

మీలోని వారు అల్లాహ్ కు విధేయత చూపుతారో, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపుతారో, మంచి పనులు చేస్తారో, సదాచారాలు చేస్తారో, సత్కార్యాలు చేస్తారో, మేము రెండింతల పుణ్యాన్ని ప్రసాదిస్తాము. గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము. ఇది ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటంటే, వారు చేసే సదాచరణకి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇది వారి ప్రత్యేకత.

అలాగే, వారి ఇండ్ల ప్రస్తావన పారాయణం మరియు హిక్మత్ తో చేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ ఖురాన్ పారాయణంతో, హిక్మత్ తో చేశాడు. అదే సూరా 34వ ఆయత్.

وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا
మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్‌ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మృదుస్వభావి, అన్నీ తెలిసినవాడు.(33:34)

మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మృదు స్వభావి, అన్నీ ఎరిగినవాడు, తెలిసినవాడు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల ఇండ్ల ప్రస్తావన ఖురాన్ పారాయణం మరియు హిక్మత్, ప్రవక్త గారి ప్రవచనాలతో, వహీ జలీ అయినా, వహీ ఖఫీ అయినా, ఖురాన్ మరియు హిక్మత్ తో వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ చేశాడు, ఇది వారి ప్రత్యేకత.

అలాగే, స్వర్గంలో కూడా వీరు ప్రవక్తకి భార్యలుగానే ఉంటారు అని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా కథనం, ఈ ఉల్లేఖనం, ఈ హదీస్ ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ మరియు తబరానీలో ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సందర్భంలో అడిగారు. ఓ దైవ ప్రవక్తా, స్వర్గంలో ఏ సతీమణి మీ తోడుగా ఉంటారు అని ప్రశ్న. ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా అడిగిన ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, ఏ సతీమణి స్వర్గంలో మీకు తోడుగా ఉంటారు అని అడిగితే, దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఓ ఆయిషా, వారిలో నువ్వు కూడా ఉన్నావు. ఇంకా ఇతర రివాయతుల ఆధారంగా, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఈ ప్రాపంచిక జీవితంలో ఎలాగైతే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సతీమణులుగా, భార్యలుగా ఉన్నారో, స్వర్గంలో కూడా వారు మహా ప్రవక్తకి సతీమణులుగానే ఉంటారు.

అభిమాన సోదరులారా! ఇంతవరకు మనము ఉమ్మడిగా ఉమ్మహాతుల్ ము’మినీన్లకు సంబంధించిన ఘనత తెలుసుకున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41386

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం
[మరణానంతర జీవితం – పార్ట్ 49]
https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.

అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.

ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.

وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ
وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
إقْرَأْ كِتَابَكَ
كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا

మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్) – [మరణానంతర జీవితం – పార్ట్ 51] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన)
[మరణానంతర జీవితం – పార్ట్ 51] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kjbs6O5YVHI
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వసలామున్ అలా ఇబాదిల్లజీనస్తఫా అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక “నరకంపై వంతెన”. అల్లాహు అక్బర్.

మహాశయులారా, ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాలలో అతి భయంకరమైనది, అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి. ఆ రోజు అల్లాహు తఆలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు. ప్రతీ మనిషీ ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు.

వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా, కాన అలా రబ్బిక హత్మమ్ మఖ్దియ్యా.
(وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا)
అనువాదం: మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం.

మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. అయితే, ఆ వంతెన ఎలాంటిది? దేనిపై వేయబడుతుంది? ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది? దానిపై ఎవరు ఎలా వెళ్తారు, దాటుతారు? ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది.

మహాశయులారా, ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ వంతెన నరకంపై ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే భావం ఏమిటి? ఏ కొంచెం కాలు జారినా, డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము. అల్లా మనందరినీ రక్షించు గాక. అయితే అది వెడల్పుగా ఉండదు. ఇది కూడా చాలా ఘోరమైన విషయం. సహీహ్ ముస్లిం షరీఫ్‌లో వచ్చి ఉంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు:

బలగనీ అన్నల్ జిస్ర అలా జహన్నమ్ అహద్దు మినస్ సైఫ్ వ అదఖ్ఖు మినష్ షఅర్.
(بَلَغَنِي أَنَّ الْجِسْر عَلَى جَهَنَّم أَحَدُّ مِنَ السَّيْفِ وَأَدَقُّ مِنَ الشَّعْرِ)
అనువాదం: ఆ నరకంపై ఉన్న వంతెన, కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అని నాకు చేరింది.

ఆ నరకంపై ఉన్న వంతెన కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది. అల్లాహు అక్బర్. తాడు అని అనవచ్చా? లేదు. గమనించండి. అయితే, ఇది కత్తి పదును కంటే మరీ కుచ్చగా, పదునుగా మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటది అని ఏదైతే తెలపడం జరిగిందో, అది ఎలా కావచ్చు? మనం అనుమానానికి గురి కాకూడదు. ఎలాంటి సందేహం వహించవద్దు. ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము.

అంతిమ దినం పై విశ్వాసం [5] : నరక  విశేషాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

మొదటి ఖుత్బా :-  

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం, లెక్కల పత్రము శిక్ష ప్రతిఫలం గురించి స్వర్గం గురిచి తెలుసుకున్నాం. ఈ రోజు మనం నరకం గురించి తెలుసుకుందాం. 

1. ఓ అల్లాహ్ దాసులారా! అంతిమ దినం పై విశ్వాసంలో స్వర్గనరకాలను విశ్వసించడం కూడా ఉంది. ఈ రెండూ శాశ్వతమైన నివాసాలు, స్వర్గం ఆనందాల నిలయం, విశ్వాసులు మరియు పవిత్రమైన దాసుల కోసం అల్లాహ్ సిద్ధం చేశాడు. నరకం శిక్షా స్థలం, ఇది రెండు రకాల వ్యక్తుల కోసం అల్లాహ్ సిద్దం చేశాడు: అవిశ్వాసులు మరియు పెద్ద పాపాలకు పాల్పడ్డ విశ్వాసులు. 

అంతిమ దినం పై విశ్వాసం [4] : స్వర్గ విశేషాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థానం, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం, లెక్కల పత్రము శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకున్నాం ఈ రోజు మనం విశ్వాసుల కొరకు సృష్టించబడిన స్వర్గం గురించి తెలుసుకుందాం. 

1. స్వర్గనరకాలను విశ్వసించడం అంతిమ దినాన్ని విశ్వసించడంలో భాగం మరియు ఇది మానవుల మరియు జిన్నాతుల శాశ్వత నివాసం. స్వర్గం అనేది అనుగ్రహాల నిలయం, దీనిని విశ్వాసులకు మరియు పవిత్రమైన దాసుల కోసం తయారు చేయబడింది. దీని కొరకు అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించడం, వారి ఆజ్ఞలను పాటించడం తప్పనిసరి. స్వర్గం లోపల ఏ కన్ను చూడని, ఏ చెవి వినని మరియు ఏ మనసు అలోచించ లేనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు: 

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ  جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ

(అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు.) (98:7-8)

మరో చోట అల్లాహ్ ఇలా అన్నాడు. 

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ

(వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు.) (32:17)

అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు [3] – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా  శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆ హష్ర్  మైదానంలో సమస్త మానవాళి సమావేశమైనప్పటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనం లెక్కల పత్రము, శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకుందాం.   

ఓ అల్లాహ్ దాసులారా! లెక్కల పత్రము మరియు శిక్ష లేక ప్రతిఫలం అనేవి సత్యం. ఖుర్ఆన్ మరియు హదీసు ద్వారా ఎన్నో ఆధారాలు మనకు లభిస్తాయి. మరియు సమస్త విశ్వాసులు ఈ విషయాన్ని ఏకీభవిస్తారు. దీని గురించి తెలియజేస్తూ అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/