నాలుక ఉపద్రవాలు – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue
https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్ అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.

ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?

“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,

مَنِ النَّجَاةُ؟
(మన్ నజాత్?)”
“ముక్తికి మార్గం ఏది?”

ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ
(అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక)
నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి

ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.

అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.

  • దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
  • రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
  • మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.

ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.

ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ
(మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్)
“ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”

ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.

ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,

أَىُّ الْمُسْلِمِينَ أَفْضَلُ؟
(అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్?)”
“ముస్లింలలో ఉత్తముడు ఎవరు?”

ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:

مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ
(మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ)
“ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”

ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.

మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟
(అతద్రూన మల్ గీబహ్?)
“గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”

సహాబాలు అన్నారు,

اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ
(అల్లాహు వ రసూలుహూ అ’అలమ్)
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”

సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,

ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ
(దిక్రుక అఖాక బిమా యక్రహ్)
“నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”

అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),

أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟
(అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?)
“ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”

“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,

إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ
(ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు)
“అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”

అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.

وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ
(వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు)
“ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”

అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.

కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:

…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ
“… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)

అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.

ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.

రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لاَ يَدْخُلُ الْجَنَّةَ نَمَّامٌ
(లా యద్ఖులుల్ జన్నత నమ్మామున్)
“చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు.”

చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.

మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:

وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ
“ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”

ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.

నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ
“నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”

సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.

ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.

ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.

అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24855

పాపాలు (Sins):
https://teluguislam.net/sins/

ఈ క్రింది లింక్‌ దర్శించి, మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: గ్రూప్ 1: https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

పరలోక విశ్వాసం – 3 : స్వర్గ శుభాలు, నరక శిక్షలు [వీడియో]

బిస్మిల్లాహ్

[15:58 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
పుస్తక మూలం: పరలోకం (Aakhir)

నరకము మరియు నరకశిక్షలు

అల్లాహ్ ఆదేశం:

فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَافِرِينَ

ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయ పడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది“. (బఖర 2: 24).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః మీరు కాల్చే ఇహలోక అగ్ని నరకాగ్నిలో 70వ భాగం“. ఇదే చాలై పోయేది కాదు అని సహచరులు అనగా ఈ అగ్ని కన్నా నరకాగ్ని 69 భాగములు ఎక్కువగా ఉండును. ప్రతి భాగములో ఇంతే వేడి ఉండును అని బదులిచ్చారు. నరకములో ఏడు అంతస్తులు గలవు. ప్రతి అంతస్తు మరో అంతస్తు కన్నా ఎక్కువ శిక్ష (వేడి) గలది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో చేరుదురు. కాని వంచకులకు ఎక్కువ శిక్ష, బాధ గల క్రింది స్థానం గలదు. నరకవాసుల్లో తిరస్కారులకు శాశ్వతంగా శిక్ష జరుగును. కాలిపోయినపుడల్లా చర్మము మారును. అల్లాహ్ ఆదేశం:

[كُلَّمَا نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا العَذَابَ] {النساء:56}

వారి చర్మము కాలిపోవునపుడల్లా దానికి బదులుగా వేరు చర్మమును వారు బాధ రుచి చూచుటకై కల్పించుచుందుము“. (నిసా 4: 56).

మరో చోట ఇలా తెలిపాడు:

[وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَى عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُمْ مِنْ عَذَابِهَا كَذَلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ] {فاطر:36}

తిరస్కరించిన వారికి నరకాగ్నియున్నది. వారు చనిపోవుటకు వారికి చావు విధింపబడదు. దాని బాధ వారి నుండి తగ్గింప బడదు. ఇటులే ప్రతి కృతఘ్నునకు శిక్ష విధించుచున్నాము“. (ఫాతిర్ 35: 36).

వారిని సంకెళ్ళతో కట్టి వారికి బేడీలు వేయబడునని తెలుపబడిందిః

[وَتَرَى المُجْرِمِينَ يَوْمَئِذٍ مُقَرَّنِينَ فِي الأَصْفَادِ ، سَرَابِيلُهُمْ مِنْ قَطِرَانٍ وَتَغْشَى وُجُوهَهُمُ النَّارُ] {إبراهيم:49، 50}

ఆ రోజు నీవు నేరస్థులను చూస్తావు. వారు సంకెళ్ళలో బంధించబడి ఉంటారు. గందకపు వస్త్రాలు ధరించబడి ఉంటారు. అగ్ని వారి ముఖాలను క్రమ్ముకొనును“. (ఇబ్రాహీం 14: 49,50).

వారి తిండి విషయం ఇలా తెలిపాడు:

إِنَّ شَجَرَتَ الزَّقُّومِ طَعَامُ الْأَثِيمِكَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِكَغَلْيِ الْحَمِيمِ

నిశ్చయంగా జెముడు వృక్షము పాపిష్టులకు ఆహరమగును. అది నూనె మడ్డి వలె ఉండును. అది కడుపులో సలసలకాగు నీళ్ళ వలె కాగును“. (దుఖాన్ 44: 43-46).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం: జఖ్ఖూం ఒక చుక్కైనా భూమిపై పడినచో భూమిపై ఉన్నవారి జీవనోపాయం చెడి పోతుంది. ఇక అది తినేవారికి ఎంత బాధ ఉండునో!. నరక శిక్షల కఠినత్వం మరియు స్వర్గ శుభాల గొప్పతనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరించారుః “ప్రపంచంలో అత్యధికంగా సుఖాలను అనుభవించిన అవిశ్వాసున్ని ఒక్కసారి నరకములో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభ వించావా? అని ప్రశ్నిస్తే, “లేదు ఎప్పుడూ లేదు” అని బదులిస్తాడు. అదే విధంగా ప్రపంచములో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభ వించిన విశ్వా సున్ని ఒకసారి స్వర్గములో ప్రవేశించి ఎప్పుడైనా నీవు బీద రికాన్ని, కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే నేను ఎప్పుడూ చూడ లేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేస్తే ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయినట్లవుతుంది“. (ముస్లిం 2807).

స్వర్గం

అది సదాకాలమైన, గౌరవ నివాసం. దాన్ని మహాను భావుడైనా అల్లాహ్ తన పుణ్యదాసుల కొరకు సిద్ధ పరిచాడు. అందులోగల వరాలను ఏ కన్ను చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి మనుస్సు ఊహించనూ లేదు. దీని సాక్ష్యానికి ఈ ఆయత్ చదవండి:

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ

వారి కర్మలకు ప్రతిఫలంగా కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచి పెట్టబడిందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికీ తెలియదు“. (సజ్దా 32: 17).

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ

అల్లాహ్ మీలో విశ్వాసులైన వారికిని విద్యగల వారికి పదవులు ఉన్నతములుగా జేయును“. (ముజాదల 58: 11).

వారు అందులో ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనె కాలువలు మరియు సేవించే వారికి మధురంగా ఉండే మద్యపానాలుండును. ఇది ప్రపంచము లాంటిది కాదు.

అల్లాహ్ ఆదేశం:

يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍبَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَلَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ

పరిశుభ్రమైన ద్రాక్ష రసములతో నిండుగిన్నెలు వారి వద్దకు తేబడును. అది తెల్లది గాను త్రాగు వారికి రుచిగా ఉండును. అందు తల తిరగదు. మరియు దాని వలన మతి చెడదు“. (సాఫ్ఫాత్ 37: 45-47).

అక్కడి సుందరి స్త్రీల (హూరెఐన్ల)తో వివాహము జరుగును. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: స్వర్గములో ఉన్న స్త్రీ ఒక్కసారి ప్రపంచవాసులను త్రొంగి చూచినట్లయితే భూమ్యాకాశాల మధ్య కాంతితో, సువాసనతో నిండిపోతుంది“. (బుఖారి 2796).

విశ్వాసులకు అక్కడ లభించే అతిపెద్ద వరం అల్లాహ్ దర్శనం.

స్వర్గవాసులకు మలమూత్రం, ఉమ్మి లాంటివేవీ ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెముటలో కస్తూరి లాంటి సువాసన గలదు. ఈ శుభాలు, వరాలు శాశ్వతంగా ఉండును. ఇవి తరగవు, నశింపవు. ప్రవక్త సలల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారు: స్వర్గములో చేరిన వారి సుఖాలకు అంత ముండదు. వారి దుస్తులు పాతబడవు. వారి యవ్వనం అంతం కాదు“. (ముస్లిం 2836). అందులో అతితక్కువ అద్రుష్టవంతుడు నరకం నుండి వెళ్ళి స్వర్గంలో ప్రవేశించిన చివరి విశ్వాసుడు. అది అతనికి పది ప్రపంచాలకంటే అతి ఉత్తమంగా ఉండును.

ఓ అల్లాహ్! స్వర్గంలో చేర్పించే కార్యాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించి మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము. ఆమీన్!!

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ : https://teluguislam.net/hereafter/

ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు :

మీ భార్యా బిడ్డలను నరకాగ్ని నుండి రక్షించుకోండి

బిస్మిల్లాహ్

మీ భార్యా బిడ్డలను నరకాగ్ని నుండి రక్షించుకోండి

ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త’ఆలా) ఇలా ఆదేశించాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ

“విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మీ కుటుంబాలను మానవులు, రాళ్ళు, ఇంధనం కాగల అగ్ని నుండి కాపాడుకోండి. దానిలో ఎంతో బలిష్టులు, అత్యంత కఠినులు అయిన దైవదూతలు నియమించబడి ఉంటారు. వారు ఎంత మాత్రం అల్లాహ్‌ ఆజ్ఞను ఉల్లంఘించరు. వారు తమకు ఆదేశించిన దాన్నే పాటిస్తారు.” (అత్తహ్రీమ్‌:6)

ఈ వాక్యంలో అల్లాహ్‌ (త’ఆలా) రెండు విషయాలను గురించి ఆదేశించాడు:

1. మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి.
2.మీ కుటుంబాన్నీ నరకాగ్ని నుండి రక్షించుకోండి.

కుటుంబం అంటే భార్యాబిడ్డలు అని అర్థం. అంటే ప్రతి వ్యక్తి తనతోపాటు తన భార్యాబిడ్డలను కూడా నరకాగ్ని నుండి రక్షించటం తప్పనిసరి అన్నమాట. భార్యా బిడ్డల పట్ల ఇదే నిజమైన శ్రేయోభిలాష మరియు అల్లాహ్‌ విధేయత కూడా. అల్లాహ్‌ (త’ఆలా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను దీనిని గురించి ఆదేశించినప్పుడు:

(అంటే నీ బంధుమిత్రులను నరకాగ్ని పట్ల హెచ్చరించు) అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కుటుంబం వారిని, తన తెగవారిని పిలిచారు. వారిని నరకాగ్ని పట్ల హెచ్చరించారు. చివరగా తన కుమార్తె హజ్రత్‌ ఫాతిమా(రదియల్లాహు అన్హా)ను పిలిచి ఇలా ఉపదేశించారు. “ఓ ఫాతిమా (రదియల్లాహు అన్హా)! నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో, అల్లాహ్‌కు వ్యతిరేకంగా (తీర్పు దినం నాడు) నేను నీకు దేనికీ పనికిరాను.” (ముస్లిమ్‌)

తన బంధుమిత్రులను, తన తెగవారిని నరకాగ్ని పట్ల హెచ్చరించిన తరువాత, తన కూతుర్ని నరకాగ్ని పట్ల హెచ్చరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్లిములందరికీ తమ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించటం కూడా తల్లిదండ్రుల బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత అని చాటి చెప్పారు.

ఒక హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“ప్రతి శిశువు ప్రకృతి (ఇస్లాం) నియమానుసారం జన్మిస్తాడు. వాడి తల్లిదండ్రులు వాడిని యూదునిగానో, క్రైస్తవునిగానో, నాస్తికునిగానో మార్చి వేస్తారు.” (బుఖారి)

అంటే సాధారణంగా తల్లిదండ్రులే తమ సంతానాన్ని స్వర్గమార్గం లేదా నరక మార్గాన పెడతారు.

అల్లాహ్‌ (త’ఆలా) ఖుర్‌ఆన్‌లో మానవుని యొక్క అనేక బలహీనతలను గురించి పేర్కొ న్నాడు. ఉదా: “మానవుడు మహా అత్యాచారి మరియు కృతఘ్నుడు.” (ఇబ్రాహీమ్‌:34). “మానవుడు చాలా తొందరపాటుగలవాడు.” (బనీ ఇస్రాయీల్‌:11) మొదలైనవి. ఇతర బలహీనతల్లో ఒక బలహీనత ఏమిటంటే మానవుడు త్వరగా లభించే లాభాలకు ప్రాముఖ్యత ఇస్తాడు. అవి తాత్కాలికమైనవైనా, లేదా తక్కువ సంఖ్యలో ఉన్నా సరే. అయితే ఆలస్యంగా లభించే లాభాలను హీనంగా చూస్తాడు. అవి శాశ్వతమైనవైనా, అధిక సంఖ్యలో ఉన్నాసరే.

అల్లాహ్‌ ఆదేశం:

إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا

వారు త్వరగా లభించే దాన్ని (ఇహలోకాన్ని) ప్రేమిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే కఠినమైన దినాన్ని విస్మరిస్తున్నారు.” (అద్దహ్ర:27)

మానవుల్లోని ఈ స్వాభావిక బలహీనతల వల్లే చాలా మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఇహలోకపు తాత్కాలిక జీవితంలో భోగభాగ్యాలు, గౌరవోన్నతులు పెద్దపెద్ద స్థానాలు ఇప్పించటానికి చదివించే ప్రయత్నం చేస్తారు. దానికి ఎంతకాలం పట్టినా, ఎంత ధనం ఖర్చు అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. అయితే చాలా తక్కువ మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని పరలోక జీవితంలోని గొప్పగొప్ప స్థానాలు, గౌరవాలు ఇప్పించడానికి ధార్మిక విద్యను ఇప్పించే ఏర్పాటు చేస్తారు. పరలోక విద్య ప్రాపంచిక విద్యకన్నా ఎంతో సులువైనది. సులభమైనదీను. ఇది ఉభయ లోకాల దృష్ట్యా తల్లిదండ్రులకు లాభం చేకూర్చేదే.

ప్రాపంచిక విద్యను అభ్యసించే చాలా మంది యువకులు ఆచరణలో తల్లి దండ్రుల పట్ల ద్రోహులుగా, స్వతంత్రులుగా మారుతున్నారు. ధార్మిక విద్యను అభ్యసించే చాలా మంది యువకులు తమ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపుతూ, వారి సేవ చేస్తున్నారు. ఇంకా పరలోకం దృష్ట్యా నిస్సందేహంగా సద్బుద్ధి, దైవభీతి, ధార్మికతగల ఇలాంటి సంతానమే లాభదాయకం కాగలదు. ఈ వాస్తవాలన్నింటినీ తెలిసి ఉండి, స్వీకరిస్తూ కూడా 99% మంది తల్లిదండ్రులు తము సంతానం కొరకు ధార్మిక విద్యకంటే ప్రాపంచిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రండి! మానవుని యొక్క ఈ బలహీనతను మరో వైపు నుండి పరిశీలిద్దాం.

ఊహించండి! ఒక ఇంటికి నిప్పు అంటుకుంది. ఇంట్లో ఉన్న వారందరూ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. పొరపాటున ఒక అబ్బాయి ఇంట్లో ఉండిపోతాడు. ఆ సమయంలో తల్లిదండ్రుల పరిస్థితి, ఆందోళన ఎలా ఉంటుంది? ప్రాపంచిక సమస్యలు, వ్యాపారం, ఉద్యోగం, అనారోగ్యం మొదలైనవి ఏవైనా ఆ అబ్బాయి నుండి మరల్చగలవా? ఎంతమాత్రం కాదు. తమ కుమారుడు ఆ నిప్పు నుండి రక్షించబడనంత వరకు తల్లిదండ్రులు రెప్పపాటుకైనా సుఖంగా ఉండలేరు. తమ సంతానాన్ని మంటల నుండి రక్షించటానికి తల్లిదండ్రుల ప్రాణాలు పణంగా పెట్టాలన్నా దానికి కూడా వారు సిద్ధపడతారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. తాత్కాలికమైన ఈ ఇహలోక జీవితంలో ప్రతి వ్యక్తీ తన సంతానాన్ని మంటల నుండి రక్షించాలని కోరుకుంటాడు. కానీ పరలోకంలో నరకాగ్ని నుండి తన సంతానాన్ని రక్షించాలని మాత్రం చాలా కొద్దిమందికే అర్థమవుతుంది.

 وَقَلِيلٌ مِّنْ عِبَادِيَ الشَّكُورُ

అల్లాహ్‌ ఆదేశం : “నా దాసుల్లో చాలా కొద్ది మందే కృతజ్ఞత చూపేవారు.” (సబా:13)

నిస్సందేహంగా మానవుని ఈ బలహీనత పరీక్షలోని భాగమే. పరీక్ష కోసమే మానవుడి ఇహలోక జీవితంలోనికి పంపబడింది. ఈ పరీక్ష గురించి తెలివిగా ప్రవర్తించేవాడే బుద్ధిమంతుడు. తన సృష్టికర్త, ప్రభువుకు విధేయత చూపడమే మానవుని తెలివి తేటలకు నిదర్శనం. అల్లాహ్‌ (త’ఆలా) విశ్వాసులకు నరకాగ్ని నుండి తమ్ము తాము రక్షించుకోవాలని, తమ కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించుకోవాలని ఆదేశించాడు. ప్రతి ముస్లిం తనను, తన కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించు కోవడానికి ఇక్కడి తపన, ఆందోళన కంటే 69 రెట్లు అధికంగా ఆందోళన, తపనతో ఉండాలి. ఈ బాధ్యతను నిర్వర్తించటానికి ప్రతి ముస్లిం రెండు విషయాలను విధిగా పాటించాలి.

మొదటిది ఖుర్‌ఆన్‌, హదీసుల విద్యను అభ్యసించడం

ఖుర్‌ఆన్‌, హదీసుల విద్యను అభ్యసించడం. అజ్ఞానం అనేది ప్రాపంచిక విషయాల దైనా, ధార్మిక విషయాలదైనా మానవున్ని నష్టాలకు, కష్టాలకు గురిచేస్తుంది. అల్లాహ్‌ దీన్ని గురించి ఇలా ఆదేశించాడు:

 هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ

“జ్ఞానమున్నవారూ, జ్ఞానం లేనివారూ ఇద్దరూ సమానులు కాగలరా?” (అజ్జుమర్‌:9)

మనం చూస్తూ ఉంటాం తీర్పు దినాన్ని విశ్వసించే వ్యక్తి, ప్రళయ మైదానం గురించి తెలిసిన వ్యక్తి, స్వర్గనరకాల శిక్షా ప్రతిఫలాలను గురించి తెలిసే వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది. మరో వ్యక్తి కేవలం సాంప్రదాయంగా తీర్పు దినాన్ని విశ్వసిస్తాడు. కాని తీర్పు మైదానంలోని పరిస్థితులను గురించి స్వర్గనరకాల శిక్షా ప్రతిఫలాల గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు. ఇటువంటి వ్యక్తి జీవితం వేరుగా ఉంటుంది. ఖుర్‌ఆన్‌ హదీసుల జ్ఞానం గలవారు ఇతరుల కన్నా ఎంతో మంచి నడవడిక కలిగి, సత్యవంతులై, భీతిపరులై, ఎల్లప్పుడూ అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారు.

إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ

అల్లాహ్‌ ఆదేశం: “వాస్తవం ఏమిటంటే అల్లాహ్‌ దాసుల్లో కేవలం (ఖుర్‌ఆన్‌ హదీసుల) విద్యగలవారే అల్లాహ్‌కు భయపడతారు.” (ఫాతిర్‌:28)

తమ సంతానాన్ని ప్రాపంచిక విద్య కోసం ధార్మిక విద్యకు దూరం చేసే తల్లి దండ్రులు వాస్తవంగా తమ సంతానం యొక్క పరలోక జీవితాన్ని నాశనం చేసి చాలా పెద్ద అపరాధాన్ని చేస్తున్నారు. ఇంకా తమ సంతానాన్ని ప్రాపంచిక విద్యతోపాటు ధార్మిక విద్యా శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు కేవలం తమ సంతానం యొక్క పరలోక జీవితాన్నే అలంకరించటం లేదు. తమ పరలోక జీవితాన్ని కూడా అలంకరించు కుంటున్నారు.

రెండవది – ఇంట్లో ఇస్లామీయ వాతావరణ స్థాపన:

పిల్లల వ్యక్తిత్వాన్ని ఖుర్‌ఆన్‌ హదీసుల బోధనల రూపంలో తీర్చిదిద్దడానికి ఇంట్లో ఇస్లామీయ వాతావరణం తప్పనిసరి. అయిదు పూటలూ నమాజు తప్పనిసరిగా పాటించటం, ఇంట్లో వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు సలాం చేయటం, సత్యం పలికే అలవాటు చేయటం, ఆహార సమయాల్లో ఇస్లామీయ నియమాలను దృష్టిలో ఉంచటం, దానధర్మాల అలవాటు చేయటం, పడుకునేటప్పుడు, మేల్కొనేటప్పుడు దుఆలను పఠించటం నేర్పించాలి. సంగీతం, పాటలు డప్పులు వాయించటం, చిత్రాలు, సినీ పత్రికలు, నగ్న చిత్రాలు గల వార్తాపత్రికలు మొదలైన వాటి నుండి ఇంటిని దూరంగా ఉంచాలి. అసత్యం, పరోక్ష నింద, దుర్భాషలాడటం, పొట్లాటలు, వివాదాలకు దూరంగా ఉంచాలి. ప్రవక్తల జీవిత చరిత్రలు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర ఖుర్‌ఆన్‌ గాధలు, యుద్దాలు, ప్రవక్త అనుచరుల (స్త్రీ పురుషుల) జీవిత చరిత్రలు గల పుస్తకాలు పిల్లలకు అందివ్వడం, పరస్పరం మంచిగా ప్రవర్తించటం ఈ విషయాలన్ని పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ప్రధాన పాత్ర వహిస్తాయి. అందువల్ల తమ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించే బాధ్యతను నిర్వర్తించాలనుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ సంతానాన్ని ధార్మిక విద్యా శిక్షణ ఇవ్వటంతోపాటు ఇంట్లో పరిపూర్ణ ఇస్లామీయ వాతావరణాన్ని కూడా స్థాపించాలి.


ఈ పోస్ట్ నరక విశేషాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ అనే పుస్తకం పేజీ:29-32 నుండి తీసుకోబడింది.

ఇతరములు:

మృతునికి అతని అసలు స్థానం స్వర్గం లేక నరకం చూపబడుతుంది

బిస్మిల్లాహ్

1822. హజ్రత్‌ అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”

(సహీహ్‌ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్‌, 90వ అధ్యాయం – అల్‌మయ్యతి యూరజు అలైహి మఖ్‌ అదుహు బిల్‌ ఘదాతి వల్‌ అషియ్యి)

[అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు), vol 2,స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం]

నరకం నుండి బయట పడే చివరి మనిషి

117. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చారు –

నరకం నుండి అందరికంటే చివర్లో బయటపడే, స్వర్గంలోనూ అందరికంటే చివర్లో ప్రవేశించే వ్యక్తిని గురించి నాకు బాగా తెలుసు. అతను నరకం నుండి పడుతూ లేస్తూ బయలుదేరుతాడు. అతనితో అల్లాహ్ ‘వెళ్ళు, (ఇక) స్వర్గంలో ప్రవేశించు’ అని అంటాడు. ఆ వ్యక్తి స్వర్గం దగ్గరికి వస్తాడు. చూస్తే స్వర్గం పూర్తిగా నిండిపోయి (జనంతో) క్రిక్కిరిసి ఉన్నట్లు కన్పిస్తుంది. దాంతో అతను వెనక్కి తిరిగొచ్చి “ప్రభూ! అది పూర్తిగా నిండిపోయి ఉంది (నాకక్కడ చోటే ఉన్నట్లు కన్పించడం లేదు)” అని అంటాడు.దానికి అల్లాహ్ “వెళ్ళు, స్వర్గంలో ప్రవేశించు. నేనక్కడ నీకు ప్రపంచమంత చోటిచ్చాను. ప్రపంచ మంతేమిటీ, దానికి పదింతలు విశాలమైన చోటిచ్చాను (వెళ్ళు)” అని అంటాడు.(అయితే ఆ వ్యక్తికి నమ్మకం కలగలేదు అందువల్ల) అతను “ప్రభూ! తమరు (సర్వలోకాల) చక్రవర్తి అయి ఉండి నాలాంటి వారితో పరిహాసమాడుతున్నారా? లేక నన్ను ఆట పట్టిస్తున్నారా?” అని అంటాడు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయం తెలియజేస్తూ ఫక్కున నవ్వారు. అప్పుడు ఆయన పల్లు కూడా స్పష్టంగా కనిపించాయి” అని అన్నారు. ఈ వ్యక్తి స్వర్గవాసులలో అందరికంటే అతి తక్కువ అంతస్తు కలవాడని అంటారు.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 51 వ అధ్యాయం – సిఫతుల్ జన్నతి వన్నార్]

విశ్వాస ప్రకరణం – 81 వ అధ్యాయం – నరకం నుండి బయట పడే చివరి మనిషి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఆత్మహత్య చేసుకున్న వాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లింకే స్వర్గ ప్రవేశం

69. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం,

కొండ మీద నుండి పడి ఆత్మహత్య చేసుకున్న వాడు నరకానికి పోయి, మాటిమాటికి కొండ మీద నుండి త్రోయబడే ఘోర శిక్షను శాశ్వతంగా చవిచూస్తూ ఉంటాడు. విషం తిని ఆత్మహత్య చేసుకున్న వాడు నరకంలో విషంచేత పట్టుకొని తింటూ ఎల్లప్పుడు తనను తాను హతమార్చుకుంటూ ఉంటాడు. ఏదైనా ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలో కూడా అదే ఆయుధం తీసుకొని కడుపులో పొడుచుకుంటూ, ఎల్లప్పుడు తీవ్ర యాతనలు అనుభవిస్తూ ఉంటాడు.

[సహీహ్ బుఖారీ : 76 వ ప్రకరణం – తిబ్, 56 వ అధ్యాయం]

విశ్వాస ప్రకరణం – 45 వ అధ్యాయం – ఆత్మహత్య చేసుకున్న వాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లింకే స్వర్గ ప్రవేశం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు

1743. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

నేను స్వర్గ ద్వారం దగ్గర నిలబడి చూశాను. స్వర్గంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది నిరుపేదలే ఉన్నారు.  ధనికులు (విచారణ కోసం ద్వారం ముందు) నిరోధించబడ్డారు. అయితే నరకానికి పోవలసిన ధనికుల్ని నరకంలోకి పంపమని ముందే ఆజ్ఞాపించడం జరిగింది. నేను నరక ద్వారం దగ్గర కూడా నిలబడి చూశాను. నరకంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది స్త్రీలే ఉన్నారు.

[సహీహ్ బుఖారీ : 67 వ ప్రకరణం – నికాహ్, 87 వ అధ్యాయం – హద్దసనా ముసద్దద్]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 26 వ అధ్యాయం – స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఉపవాసము ఒక డాలు వంటిది

706. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

ఉపవాసము ఒక డాలు వంటిది. (కాబట్టి) ఉపవాసి అశ్లీలమైన పలుకులు పలకడం గానీ, మూర్ఖుల్లా, అజ్ఞానుల్లా ప్రవర్తించడం గాని చేయకూడదు. ఎవరైనా అతనితో జగడానికి దిగితే లేదా దూషిస్తే అతనావ్యక్తితో తాను ఉపవాసం ఉన్నానని రెండుసార్లు చెప్పాలి

(ఆయన ఇంకా ఇలా అన్నారు):

నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యంగా చెబుతున్నాను, ఉపవాసి నోటి వాసన అల్లాహ్ దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ఎంతో శ్రేష్ఠమైనది. అల్లాహ్ ఇలా అంటున్నాడు – ఉపవాసి నా (ప్రసన్నత) కోసం ఆహారపానీయాలు, లైంగిక వాంచలు త్యజిస్తున్నాడు. ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది. అందవల్ల స్వయంగా నేనే దాని పుణ్యఫలాన్ని (ఉపవాసికి) ప్రసాదిస్తాను. ఒక సత్కార్యానికి పదింతల పుణ్యం లభిస్తుంది

[సహీహ్ బుఖారీ : 30 వ ప్రకరణం – సౌమ్, 2 వ అధ్యాయం – ఫజ్లిస్సౌమ్]

ఉపవాస ప్రకరణం – 29 వ  ప్రకరణం – ఉపవాసకుడు నోరు పారేసుకోరాదు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

English Version : As-Siyaam (fasting) is Junnah (protection or shield or a screen or a shelter from the Hell-fire)

ఏక ధైవారాధకుల నరక విమోచనకై సిఫారసు

116. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :

 (పరలోకంలో కర్మల విచారణ ముగిసిన తరువాత) స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు. ఆ తరువాత “హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వారిని (సయితం) నరకం నుండి బయటకు తీయండి” అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఈ ఆజ్ఞతో (చాలామంది) మానవులు నరకం నుండి బయటపడతారు. వారిలో కొందరు (బాగా కాలిపోయి బొగ్గులా) నల్లగా మారిపోతారు. అలాంటి వారిని వర్షనది లేక ‘జీవనది’ లో పడవేస్తారు. దాంతో వారు యేటి ఒడ్డున ధాన్యపు విత్తనం మొలకెత్తినట్లు మొలకెత్తుతారు. ఆ మొక్క పసిమి వన్నెతో ఎంత అందంగా ముస్తాబయి మొలకెత్తుతుందో మీరు చూడలేదా?

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్,15  వ అధ్యాయం – తఫాజులి అహ్ లిల్ ఈమాని ఫిల్ ఆమాల్]

విశ్వాస ప్రకరణం : 80 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth