పరలోక విశ్వాసం – 2 : ప్రళయం, దాని సూచనలు & తీర్పుదిన విశేషాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[29:27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
పుస్తక మూలం: పరలోకం (Aakhir)

1- శాశ్వతంగా ఉండుటకు అల్లాహ్ ఈ లోకాన్ని సృష్టించలేదు. ఒక రోజు రానుంది అంతం కానుంది. ఆ రోజే “ఖియామత్” రోజు. ఏలాంటి సందేహం లేని యదార్థం అది. అల్లాహ్ ఆదేశం:

وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَّا رَيْبَ فِيهَا

పునరుత్తాన దినము రానున్నది, అందెట్టి సందేహం లేదు“. (హజ్ 22: 7).

మరో చోట ఇలా చెప్పాడు:

وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ

మాకు ప్రళయ కాలం రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు అది తప్పక మీకు వచ్చును“. (సబా 34: 3).

ప్రళయ దినం సమీపములోనే ఉంది. దాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

[اقْتَرَبَتِ السَّاعَةُ ] {القمر:1}

తీర్పు కాలం సమీపించినది“. (ఖమర్ 54: 1).

మరో చోట:

اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ – 21:1

ప్రజలకు తీర్పు కాలం సమీపించినది. వారు అజాగ్రత్తలో పడి విముఖులై యున్నారు“. (అంబియా 21:1)

ఆ సమీపం అనేది మన అంచనా ప్రకారం లేదు. మానవులు దాన్ని తెలుసుకోలేరు. కాలము గడిసిన ప్రకారం అది కేవలం అల్లాహ్ కే తెలుసు.

ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. ఆ విషయాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికి తెలుపలేదు. అల్లాహ్ చెప్పెను:

يَسْأَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ ۚ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ تَكُونُ قَرِيبًا – 33:63

ప్రజలు ప్రళయకాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయం నీకేమీ తెలుసు? ప్రళయకాలం సమీపములోనే కావచ్చు“. (అహ్ జాబ్ 33: 63).

ప్రవక్త దానికి ముందు వచ్చే సూచనలు సూచించారు. అందులో కొన్ని క్రింద తెలుపబడుచున్నవిః

అందులో ఒకటి: మసీహుద్దజ్జాల్ రానున్నాడు. అతని రాకతో ఘోరమైన అరాచకం ప్రభలిపోతుంది. అల్లాహ్ అతనికి ఇచ్చిన శక్తితో విచిత్ర కార్యక్రమాలు ప్రజలకు చూపిస్తాడు. అందుచేత అనేక మంది మోసబోతారు. ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే అది వర్షం కురిపిస్తుంది. అతని ఆజ్ఞతో అప్పటికప్పుడే మొక్కలు మొలు స్తాయి. మృతుడ్ని జీవింపజేస్తాడు. తదితర వింతలు చూపిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: అతడు ఒంటి కన్ను వాడు. అతడు స్వర్గం నరకం లాంటి రెండు విషయాలు చూపిస్తాడు అతడు స్వర్గం అని చెప్పేది నరకం, అతడు నరకం అని చెప్పేది స్వర్గం. అతడు 40 రోజులు నివసిస్తాడు.ఒక రోజు ఒక సంవత్సరముగా, ఒక రోజు ఒక నెలగా, ఒక రోజు ఒక వారముగా ఉండును. మిగిత రోజులు సామాన్య రోజులుగా ఉండును. అతడు మక్కా, మదీనా తప్ప ప్రతి దేశం తిరుగును.

ప్రళయదిన సూచనల్లో రెండవది: ఈసా దిమిష్క్ (Damascus) (ఇది ఈనాడు సీరియా దేశం యొక్క రాజధాని) తూర్పున తెల్లని స్థంబం (మీనార్) నుండి ఫజ్ర్ నమాజ్ సమయంలో దిగి వచ్చును. సామూహికంగా (జమాఅత్ తో) ఫజ్ర్ నమాజ్ చేసుకొని దజ్జాల్ ను వెతికి సంహరించుదురు.

ప్రళయదిన సూచనల్లో మూడవది: పశ్చిమ దిశ నుండి సూర్యోదయమగును. అది చూసి భయకంపితులై అనేక మంది (ఇస్లామే సత్యమని) విశ్వసించుదురు. కాని ఆ సమయాన ఏమి లాభముండదు. తదితర ఎన్నో సూచనలున్నాయి.

2- ఈ భూమిపై కేవలం దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉన్నపుడు ప్రళయం సంభవించును. అది ఏ విధంగనగాః ప్రళయానికి ముందు ఒక మందమారుతమైన గాలి వీస్తుంది దానితో విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టంతటిని చంపి ప్రపంచాన్ని నశింపజేయాలనుకున్నప్పుడు “సూర్” (పెద్ద శంకు) ఊదుటకు దానికి నియమింపబడిన దూతకు ఆజ్ఞ ఇస్తాడు. దాన్ని విన్న ప్రజలందరు సొమ్మసిల్లి పోతారు. అదే విషయం అల్లాహ్ ఈ వాక్యంలో తెలిపాడు:

وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ

“సూరు” (శంకు) ఊదబడును. కావున ఆకాశములలోను భూమిలోనున్న వారందరు సొమ్మసిల్లి పోవుదురు. కాని అల్లాహ్ కోరినవారు సొమ్మసిల్లరు. (జుమర్ 39: 68).

అది శుక్రవారము రోజగును. ఆ తర్వాత దైవదూతలు కూడా చనిపోయి పరమ పవిత్రుడైన అల్లాహ్ తప్ప ఎవరూ ఉండరు.

3- సమాధులలో ప్రవక్తల, ధర్మయుద్ధంలో మరణించిన అమర వీరుల తప్ప అందరి దేహములను మట్టి తినేస్తుంది. కాని వెన్నె ముకలో గల ఒక బీజము అట్లే మిగిలి యుంటుంది. అల్లాహ్ ప్రజలందరికి పునఃర్జన్మ ఇవ్వాలని కోరినపుడు శంకు ఊదుటకు నిర్ణయించబడిన దూత ఇస్రాఫీల్ ను ముందు జీవింపజేయును. అతను శంకు ఊదును. మానవులందరు తొలిసారి (తల్లి గర్భం నుండి) వచ్చిన తీరు నగ్నముగా, ఖత్న (సున్నతీలు) చేయ బడకుండా సమాధుల నుండి లేచి వచ్చుదురు. అల్లాహ్ ఆదేశం:

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51

సూరు ఊదబడును. అప్పుడే వారు తమ సమాధుల నుండి లేచి తమ ప్రభువు వద్దకు పరుగిడుదురు“. (యాసీన్ 36: 51).

يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ

ఆ దినమున వారు సమాధుల నుండి లేచి ఒక గుర్తునకు పరిగెత్తి పోవునట్లు పరుగెత్తి పోవుదురు. అప్పుడు వారి కన్నులు క్రిందుగా నుండును. వారిపై అవమానము క్రమ్ముకొను చుండును. ఇదే వారితో వాగ్దానము చేయబడుచున్న దినము“. (మఆరిజ్ 70: 43,44).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం, అందరికన్నా ముందు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి నుండి వెలికి వస్తారు. అందరూ మహ్షర్ మైదానము వైపు పరిగెత్తుతారు. అది చాలా విస్తీర్ణము మరియు విశాలమైన భూమి. అవిశ్వాసులు తలక్రిందులైన ముఖముతో వస్తారు. ఈ విషయము విన్న సహచరులు తలక్రిందులైన ముఖముతో ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. కాళ్ళతో నడిపించు శక్తి గలవాడు ముఖముతో కూడా నడిపించును” అని మహాప్రవక్త సమాధానమిచ్చారు”. (ముస్లిం 2806). అల్లాహ్ మాటను తిరస్కరించిన వారు గ్రుడ్డివానిగా లేపబడుతారు. సూర్యుడు చాలా దగ్గరుంటాడు. ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి యుంటారు. కొందరు చీలమండల వరకు, మరి కొందరు నడుము వరకు, కొందరు పూర్తిగా మునిగి యుంటారు. కొందరికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. ప్రవక్త చెప్పారు: ఏడు రకాల (గుణము గల) వారికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. 1. న్యాయశీలుడైన పాలకునికి. 2. యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో మరియు ఆయన విధేయతలో గడిపిన యువకునికి. 3. మస్జిద్ లోనే తన మనుస్సు లగ్నం చేసుకున్న వ్యక్తికి. 4. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు వారు అల్లాహ్ కొరకే కలుసు కుంటారు. అల్లాహ్ కొరకే వేరు అవుతారు. 5. ఉన్నత వంశీయురాలైన, అందమైన స్త్రీ దుష్టక్రియకు అహ్యానిస్తే కేవలం అల్లాహ్ భయముతో తిరస్కరించిన వ్యక్తికి. 6. కుడి చెయ్యి దానం చేసినదేమిటో ఎడమ చెయ్యికి తెలియనంత రహస్యంగా దానా దర్మాలు చేసే వ్యక్తికి. 7. ఏకాంతములో అల్లాహ్ ధ్యానం చేస్తుండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి“. (బుఖారి 1423, మస్లిం 1031). ఇది పురుషులకే ప్రత్యేకం కాదు. స్త్రీలకు తమ కర్మల ప్రకారం లెక్క జరుగును. సత్కార్యములు గలవారికి మంచి ఫలితము, దుష్కార్యములు గలవారికి చెడు ఫలితము లభించును. మరియు వారికి పురుషులకు లభించినట్లు పూర్తి తీర్పు మరియు ప్రతిఫలము లభించును.

ప్రజలందరికి ఆ నాడు దాహము ఎక్కువగును. 50 వేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రో జు అది. కాని విశ్వాసునికి అది ఫర్జ్ నమాజ్ చేసినంత సమయముగా అతి వేగంగా గడిసి పోవును. ఆ తరువాత విశ్వాసులు ప్రవక్తకు నొసంగబడిన “హౌజె కౌసర్” వద్దకు వచ్చి కౌసర్ నీరు త్రాగుదురు. (అది గౌరవము గల చాలా గొప్ప బహుమానము. అది అల్లాహ్ మన ప్రవక్తకే ప్రత్యేకించును. ప్రళయ దినాన ఆయన అనుచరులు అందు నుండి త్రాగుదురు. కౌసర్ నీరు పాలకన్నా తెలుపుగా, తేనేకన్నా తీపుగా మరియు కస్తూరి కన్నా ఎక్కువ సువాసన ఉండును. ఆకాశతారలకన్నా ఎక్కువ పాత్రలు అచ్చట ఉండును. ఒక్కసారి త్రాగిన వారికి మరెప్పుడూ దాహమవదు).

మహ్షర్ మైదానములో ప్రజలు తీర్పు కొరకు చాలా కాలము నిలుచుండి వారు తమ తీర్పు, లెక్క కొరకు ఎదురు చూచుదురు. అచ్చటి బాధలు మరియు ఎండతాపాన్ని భరించలేక దైవసన్నిధిలో తమ గురించి సిఫారసు చేయువారి కోసం వెతుకుతూ ఆదం వద్దకు వస్తే ఆయన నాతో కాదనగా నూహ్ వద్దకు వస్తారు. ఆయన కూడా మన్నించమంటారు. తర్వాత ఇబ్రాహీం, తర్వాత మూసా, తర్వాత ఈసా వద్దకు వస్తే వారు కూడా మాతో కాదని విన్నవించుకుంటారు. అప్పుడు ప్రవక్త వద్దకు వస్తే నేను దీనికి అర్హతగల వాన్నని ఆయన అల్లాహ్ అర్ష్ క్రింద సజ్దా చేసి అల్లాహ్ స్తోత్రములు పఠించి సిఫారసు చేయు అనుమతి కోరుతారు. అప్పుడు అల్లాహ్ “ఓ ముహమ్మద్ తలెత్తు నీ కోరిక తీర్చగలను అడుగు, సిఫారసు చెయ్యి స్వీకరించ బడును” అని లెక్క తీర్పు కొరకు అనుమతిస్తాడు. ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతీల (అనుచరుల) తీర్పు అగును.

మానవుని కర్మల్లో మొదటి లెక్క నమాజ్ గురించి అగును. అందులో నెగ్గినవారి కర్మలను మాత్రమే చూడబడును. నెగ్గనివారి కర్మలు రద్దు చేయబడును. అదే విధముగా ఐదు విషయాలు గురించి ప్రశ్నించబడును. 1. నీ జీవిత కాలాన్ని ఏ కార్యాల్లో గడిపావు? 2. నీ యౌవ్వనాన్ని ఏ కార్యాల్లో కృశింపజేశావు? 3,4. ధనం ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు చేశావు? 5. తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు?. అతని దాసుల మధ్య జరిగే తీర్పులో మొదటిది అన్యాయంగా రక్తాలు చిందించిన వారి తీర్పు. అప్పుడు నష్టపరిహారాన్ని కట్టించుటకు సత్కర్యాలు లేక దుష్టకార్యాలు తప్ప మరేమీ ఉండవు. ఈ విధంగా పీడుతులకు అన్యాయము చేసినవాని సత్కార్యాలు పంచి పెట్టబడును. ఇతని సత్కార్యాలు అయిపోయి ఇంకా పీడితులు మిగిలి ఉంటె వారి పాపాలు అతనిపై వేయబడును.

నరకముపై వంతెన వేయబడును. (ఆ వంతెన వెంట్రుకకన్నా సన్నగా ఖడ్గం కన్నా వాడిగా ఉండును). ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం దానిపై దాటుదురు. కొందరు కనురెప్ప కొట్టినంతలో, కొందరు గాలి తీరు, కొందరు గుఱ్ఱపు రౌతు తీరు, కొందరు ప్రాకుచు పోవుదురు. దానికి కొండ్లుండును. అవి ప్రజలను నరకములో పడవేయును. అందులో పడువారు అవిశ్వాసులు మరియు విశ్వాసి అయినా పాపాత్ములు. అవిశ్వాసులు శాశ్వతంగా అందులో ఉందురు. కాని విశ్వాసులైన పాపాత్ములు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్ష పడిన తర్వాత స్వర్గానికి పంపబడుదురు. అల్లాహ్ తనిష్టపడిన ప్రవక్తలకు, మహాభక్తులకు తౌహీద్ సాక్ష్యమిచ్చిన పాపాత్ముల సిఫారసు చేయు అనుమతి ఇచ్చి, వీరి సిఫారసుతో వారిని నరకము నుంచి తీసి స్వర్గములో చేర్పించును. వంతెన దాటిన తర్వాత -స్వర్గానికి అర్హులైన వారు- నరకము స్వర్గము మధ్యలో ఆగి యుందురు. వారి పరస్పర అన్యాయాల తీర్పు వారు హృదయాల కల్ముషాలను దూరము చేసిన తర్వాత వారు స్వర్గములో చేరుదురు. స్వర్గస్తులు స్వర్గ ములో నరకవాసులు నరకంలో చేరిన పిదప వారి ముందు, వారు చూస్తుండగా మృత్యువును పొట్టేలు రూపంలో స్వర్గనరక ముల మధ్య జిబహ్ చేయ(కోయ) బడును. మళ్ళీ ఓ స్వర్గవాసులారా! శాశ్వతంగా ఉండండి మరణం లేదు. ఓ నరకవాసులారా! మీకూ శాశ్వతం మరణం లేదు అని అనబడును. ఒక వేళ ఎవరైనా సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు అంతులేని సంతోషంతో చనిపోతారు. మరియు ఎవరైనా బాధ, చింతతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ : https://teluguislam.net/hereafter/

ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు :

%d bloggers like this: