అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
[ఇక్కడ చదవండి డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [23 పేజీలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3JL2EaR6so-ViMpDU-HFzZ
ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు (క్రొత్త వీడియోలు) :
- 1. పరలోక విశ్వాసం- పరలోక చింత మరియు మరణం
- 2. పరలోక విశ్వాసం – చావు వాస్తవికత
- 3. పరలోక విశ్వాసం – సమాధి సంగతులు
- 4. ప్రళయదిన సూచనలు
- 5. ప్రళయం ఎలా సంభవిస్తుంది, ఎలా అందరూ హాజరవుతారు, అర్ష్ నీడలో ఎవరుంటారు?
- 6. లెక్క, తీర్పు, సిఫారసు, పుల్ సిరాత్ (నరకంపై వంతెన దాటుట)
- 7. నరకం, దాని శిక్షలు
- 8.స్వర్గం దాని వరాలు
(పాత వీడియోలు) :
- పరలోక విశ్వాసం – 1: మరణం, సమాధి సంగతులు [వీడియో]
- పరలోక విశ్వాసం – 2 : ప్రళయం, దాని సూచనలు & తీర్పుదిన విశేషాలు [వీడియో]
- పరలోక విశ్వాసం – 3 : స్వర్గ శుభాలు, నరక శిక్షలు [వీడియో]
[క్రింద పూర్తి పుస్తకాన్ని చదవండి]
اليوم الآخر – పరలోకం
సర్వ లోకాలకు పోషకుడైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, అల్లాహ్ కరుణ మరియు శాంతి ఘనత గల ప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై, ఆయన అనుచరులపై కురువుగాకా! అమీన్.
విశ్వాస ఆరు స్థంబాల్లో పరలోక విశ్వాసం ఒక మూల స్థంబం. మానవుడు దివ్య గ్రంథం ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల్లో పరలోకము గురించి తెలుపబడిన రీతిలో విశ్వసించనంత వరకు విశ్వాసి కాజాలడు.
పరలోక విషయాలను తెలుసుకొనుట, ఎల్లపుడూ దాని జ్ఞప్తిలో ఉండుట చాలా ముఖ్యం. ఈ మూలంగా ఆత్మ శుద్ధి, దైవ భీతి మరియు ఇస్లాంపై స్థిరంగా ఉండే భాగ్యం కలుగుతుంది. ఆ నాటి కష్టాల, బాధల జ్ఞాపకం పట్ల అశ్రద్ధ కంటే కఠిన హృదయులుగా మార్చునది మరియు పాపానికి ఒడిగట్టే ధైర్యం ఇచ్చునది మరొకటి లేదు. అల్లాహ్ ఇలా తెలిపాడుః
[يَوْمًا يَجْعَلُ الوِلْدَانَ شِيبًا] {المزمل:17}
ఆ దినము బాలురను ముసలి వానిగా చేసివేయునట్టి దినము. (ముజమ్మిల్ 73: 17). మరో చోట ఇలా తెలిపాడుః
[يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ، يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَى وَمَا هُمْ بِسُكَارَى وَلَكِنَّ عَذَابَ اللهِ شَدِيدٌ] {الحج:1، 2}
ఓ ప్రజలారా! మీరు మీ ప్రభువునకు భయపడండి, నిశ్చయంగా ప్రళయ కాలం నాటి భూకంపం చాలా గొప్ప విషయం. మీరు ఆ దినమును చూచునపుడు ప్రతి పాలిచ్చు స్త్రీ తన చంటిబిడ్డను మరచి పోవును. ప్రతి గర్భిణికి గర్భము జారిపడును. ప్రజలు మత్తులుగా కనబడుదురు. వాస్తవంగా వారు మత్తులో ఉండరు. కాని అల్లాహ్ శిక్ష చాలా కఠినమైనది. (హజ్ 22:1,2).
మరణం
1- ప్రతి జీవికి ఇహలోకములో అది చివరి మెట్టు. అల్లహ్ ఆదేశం:
ప్రతి మనిషి చావును చవి చూస్తాడు. (ఆలె ఇమ్రాన్ 3: 185).
భూమి పై ఉన్నవారందరూ నశింతురు. (రహ్మాన్ 55: 26).
[إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُمْ مَيِّتُونَ] {الزُّمر:30}
నీవు చావవలసి ఉన్నది. మరి వారూ చావ వలసి ఉన్నది. (జుమర్ 39: 30).
ఇహలోకములో ఏ మానవునికీ శాశ్వతం లేదు. అల్లాహ్ ఆదేశం:
పూర్వం ఏ మానవుడు శాశ్వతంగా జీవించియుండు నట్లుగా మేము చేయలేదు. (అంబియా 21: 34).
1- చావు ఖచ్చితమైన విషయం. అందులో సందేహానికి చోటు లేదు. అయినా అనేక మంది అశ్రద్ధగా ఉన్నారు. కాని ముస్లిం అధికంగా దాన్ని జ్ఞప్తిలో ఉంచాలి. దానికి సిద్ధమై ఉండాలి. వృధా గా సమయం దాటక ముందే ఇహలోకంలోనే పరలోక సామాగ్రి తయారు చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
(اغْتَنِمْ خَمْسًا قَبْلَ خَمسٍ: حَياتَكَ قَبلَ مَوتِك، وَ صِحَّتَكَ قَبْلَ سَقمِكَ، وَ فَراغَكَ قَبلَ شُغلِكَ، وَ شَبَابَكَ قَبلَ هَرمِكَ، وَ غِناكَ قَبلَ فَقرِكَ)
“ఐదు విషయాలను మరో ఐదు విషయాలకంటే ఎంతో ఉత్తమమైనవని తెలుసుకోః జీవితాన్ని చావు రాక ముందు. ఆరోగ్యమును వ్యాది, అనా రోగ్యముకు ముందు. తీరికను పనులు మోపు కాక ముందు. యౌవనాన్ని వృద్ధాప్యముకు ముందు మరియు కలిమిని (సిరివంతమును) బీదరికంకు ముందు”. (హాకిం, బైహకీ ఫీ షొఅబిల్ ఈమాన్).
గమనార్హమైన విషయమేమనగాః శవం తన వెంట సమాధిలో ఇహలోక సామాగ్రి తీసుకెళ్ళదు. తన ఆచరణ మట్టుకే తనతో ఉంటుంది. అందుకు సత్కార్యాల సామాగ్రి వెంట తీసుకెళ్ళే ప్రయత్నం చేయు. దాని మూలంగానే నీవు అచ్చట సుఖాలు పొందుతావు. అల్లాహ్ కరుణతో ఆ శిక్షల నుండి రక్షణ కూడా పొందుతావు.
2- మనిషి చావు గుప్తముగా ఉంది. అది అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు. ఎవరి చావు ఎక్కడ వచ్చునో ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. ఎందుకనగా ఇది అగోచర జ్ఞానంలో ఒకటి. అందుకే అల్లాహ్ కు మాత్రమే తెలియును.
3- చావు వచ్చిన తరువాత దానిని నెట్టేయడం, ఆలస్యం చేయడం మరియు చావు రాకుండా పరిగెత్తడం కాని పని. అల్లాహ్ ఆదేశం:
ప్రతి జాతి వారికొక గడువు నియమింపబడియున్నది. మరియు వారి గడువు వచ్చినపుడు ఒక గడియ వెనుక గాని ముందు గాని వారు కానేరరు. (ఆరాఫ్ 7: 34).
4- విశ్వాసుని వద్దకు ప్రాణం తీయు దూత అందమైన ముఖము, సువాసన దుస్తులతో వస్తాడు. అతనితో కరుణ దూతలు స్వర్గము యొక్క శుభవార్తలు వినిపిస్తూ హాజరవుతారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడుః
ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ అని పలికిరో, మరల అందు స్థిరముగా ఉండిరో వారి యొద్దకు దేవదూతలు దిగివచ్చి ‘మీరు భయపడకండి. మరియు చింత పడకండి మీతో వాగ్దానం చేయబడుతున్న స్వర్గంతో సంతోషపడండి’ అని పలుకుదురు. (హామ్మీం అస్సజ్దా 41: 30).
అవిశ్వాసుని వద్దకు ప్రాణం తీయు దూత భయంకరమైన నల్లటి రూపములో దుర్వాసన దుస్తులతో వస్తాడు. అతనితో శిక్ష దూతలు శిక్షల శుభవార్తతో హాజరవుతారు. ఈ విషయమే అల్లాహ్ ఇలా తెలిపాడుః
ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి, ఇటు తెండి, బయటకు తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యా యంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసు తనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకర మైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది!. (అన్ఆమ్ 6: 93).
చావు వచ్చినపుడు వాస్తవము స్పష్టమయి అసలు సంగతే మిటో ప్రతీ ఒకరికీ తెలుస్తుంది. అల్లాహ్ ఇలా తెలిపాడుః
తుదకు వారిలోనొకనికి చావు వచ్చునపుడు ఓ నాప్రభువా! నన్ను తిరిగి పంపి వేయుము. నేను వదలి వచ్చిన దానిలో సత్కార్యము చేయుదును అని పలుకును. అట్లు కానేరదు. అది ఒక మాట, దానిని అతడు పలుకుచున్నాడు. వారు మరల సజీవులై లేచు దినము వరకు వారి ముందర అడ్డు ఉన్నది. (మూమినూన్ 23: 99-100).
అవిశ్వాసులు మరియు పాపాత్ములు ఇహలోకానికి తిరిగి వచ్చి సత్కార్యములు చేయాలని కోరుదురు కాని అపుడు ఆ పశ్చాత్తాపం ఏమీ పనికి రాదు. అల్లాహ్ ఆదేశం చదవండిః
మరియు నీవు పాపాత్ములను చూచెదవు, వారు బాధను చూచునపుడు తాము తిరిగి పోవుటకు మార్గము గలదా? అని పలుకుదురు. (షూరా 42: 44).
5- తన దాసులపై అల్లాహ్ కరుణ ఒకటేమనగాః మరణానికి ముందు ఎవరి చివరి మాట “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉండునో అతను స్వర్గ ప్రాప్తుడవుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
(مَنْ كَانَ آخِرُ كَلاَمِهِ ، لآ إله إلا الله دَخَلَ الْجَنَّة)
“ఈ ప్రపంచములో ఎవరి చివరి పలుకులు “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉండునో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు”. (అబూ దావూద్ 3114). ఎందుకనగా ఈ క్లిష్ట సమయంలో మనిషి కలిమహ్ పఠించడం అసాధ్యం. అది తను మనుస్ఫూర్తిగా పఠించి దాని ప్రకారం ఆచరించినవాడయితే తప్ప. మనుస్ఫూర్తిగా పఠించని వ్యక్తి మరణ వేదనలో గల కష్టాలను భరించ లేక అది మరచిపోవును. అందుకు సక్రాత్ లో ఉన్న వ్యక్తికి దగ్గర కూర్చున్నవారు అతనికి కలిమహ్ తల్ ఖీన్ చేయడం (ఉపదేశించడం) పుణ్యకార్యం.
సమాధి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః శవాన్ని సమాధిలో పెట్టి అతని బంధువులు తిరిగి పోతుండగా అతడు వారి చెప్పుల శబ్దం వింటాడు. అప్పుడు ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ‘ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి’? అని ప్రశ్నిస్తారు. ‘అతను అల్లాహ్ దాసుడు మరియ అల్లాహ్ ప్రవక్త’ అని నేను సాక్ష్యమిస్తున్నానని విశ్వాసి బదులిస్తాడు. ‘ఇదిగో నరకంలో నీ ఈ స్థలాన్ని చూడు దానికి బదులుగా స్వర్గంలో ఈ స్థలం అల్లాహ్ నీకు ప్రసాదించాడు’ అని అతనికి చెప్పబడుతుంది. అతడు స్వర్గము నరకము రెండూ చూస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరియు అవిశ్వాసి లేదా వంచకున్ని ‘ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి’? అని ప్రశ్నిస్తారు. ‘నాకు తెలియదు. లోకముతీరు నేనన్నాను’ అని అతను సమాధానమిస్తాడు. ‘నీవు తెలుసుకోలేదు మరియు ఖుర్ఆన్ పఠించలేదంటూ ఇనుప గదాలతో ఒక్క సారి కొడితే అతడు దాన్ని భరించలేక అరుస్తాడు. అతని కేకను ఇరుజాతులు తప్ప సమీపములోనున్న వారందరు వింటారు’. (బుఖారి 1338, ముస్లిం 2870).
ఆత్మను సమాధిలో ఉన్న దేహంలో పంపడమనేది పరలోక విషయం. మనిషి ఊహలకు అందనిది. అయినా సమాధిలో శుభాలకు, వరాలకు అర్హులైన విశ్వాసులకు శుభాలు మరియు శిక్షలకు అర్హులైన అవిశ్వాసులకు శిక్షలు జరగడం వాస్తవమేనని ముస్లిములందరూ ఏకీభవించారు. అల్లాహ్ ఇలా తెలిపాడుః
వారు ఉదయం, సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు. ప్రళయ గడియ వచ్చినపుడు ‘ఫిర్ఔను ప్రజలను తీవ్రమైన శిక్షలో ప్రవేశింపజెయ్యండి’ అని ఆజ్ఞాపించబడుతుంది. (మోమిన్ 40: 46). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః
(تَعَوَّذُوا بِاللهِ مِن عَذَابِ الْقَبر)
“సమాధి శిక్షల నుండి అల్లాహ్ శరణు కోరండి”. (ముస్లిం 2867).
బుద్ధీ జ్ఞానాలతో గమనిస్తే ఇది తిరస్కరించలేని విషయం. ఇలాంటి ఉదాహరణాలు మానవుడు ఎన్నో చూస్తాడు. నిద్ర పోయిన వ్యక్తి కలలో ఎంతో శిక్షించబడుతున్నట్లుగా చూస్తాడు, అరుస్తాడు, సహాయం కోరుతాడు. కాని అతని ప్రక్కనే ఉన్న వ్యక్తికి అతని గురించి ఏమీ తెలియదు. ఇహలోకములోనే ఇలా ఉన్నప్పుడు చావు బ్రతుకుల్లో ఎంతో తేడా ఉన్న ఆ మరణాంతర విషయాన్ని ఊహించ గలమా? సమాధిలో శిక్ష ఆత్మ, దేహము రెండింటికగును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః సమాధి పరలోకము యొక్క మొదటి మెట్టు అది క్షేమంగా దాటిన వారికి ఆ తరువాత చాలా సుఖము గలదు. మరియు క్షేమంగా దాటని వారికి ఆ తర్వాత చాలా కష్టము గలదు. (తిర్మిజి 2308).
అందుకని విశ్వాసి అధికంగా సమాధి శిక్షల నుండి అల్లాహ్ శరణు కోరుతుండాలి. ప్రత్యేకంగా నమాజులో సలాంకు ముందు. మరియు పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. పాపాలే సమాధి శిక్షలకు మరియు నరక శిక్షలకు మూల కారణం.
సమాధి శిక్షలు: అనేక మంది సమాధి చేయబడుతారు కాబట్టి సమాధి శిక్ష అనబడింది. నీట మునిగి పోయినవారు, కాలి పోయినవారు మరియు క్రూర జంతువులకు ఆహారముగానైన వారందరికి శిక్షలు బర్ జఖ్ (ఇహపర లోకాల మధ్య స్థానం)లో తప్పవు. సమాధి శిక్షలు అనేక రకాలుగా ఉండును. ఇనుప గదాలతో కొట్టబడును. సమాధి చీకటితో నిండిపోవును. నరక పడకలు వేయబడి నరక ద్వారములు తెరువబడును. చెడు కార్యములు దుర్వాసన, అందవికారంగా మరియు భయంకరమైన రూపములో తోడుగా ఉండును. ఈ శిక్షలు అవిశ్వాసులకు మరియు వంచకులకు శాశ్వతంగా ఉండును. కాని విశ్వాసి అయిన పాపాత్మునికి పాపాల ప్రకారంగా శిక్ష జరిగిన తర్వాత అంతమై పోవును.
సమాధి వరాలు: స్వచ్ఛమైన విశ్వాసుని సమాధి విస్తీర్ణము చేయబడి నూర్ (కాంతి)తో నింపబడును. మరియు స్వర్గ ద్వారములతో సువాసన, స్వర్గము యొక్క గాలి వీస్తుండగా స్వర్గ పడకలు వేసి యుండును. మరియు సత్కార్యాలు సువాసనతో నిండి అందమైన రూపములో తోడుగానుండును.
ప్రళయ దినం మరియు దాని సూచనలు
1- శాశ్వతంగా ఉండుటకు అల్లాహ్ ఈ లోకాన్ని సృష్టించలేదు. ఒక రోజు రానుంది అంతం కానుంది. ఆ రోజే “ఖియామత్” రోజు. ఏలాంటి సందేహం లేని యదార్థం అది. అల్లాహ్ ఆదేశం:
పునరుత్తాన దినము రానున్నది, అందెట్టి సందేహం లేదు. (హజ్ 22: 7). మరో చోట ఇలా చెప్పాడుః
మాకు ప్రళయ కాలం రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు అది తప్పక మీకు వచ్చును. (సబా 34: 3). ప్రళయ దినం సమీపములోనే ఉంది. దాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడుః
[اقْتَرَبَتِ السَّاعَةُ ] {القمر:1}
తీర్పు కాలం సమీపించినది. (ఖమర్ 54: 1). మరో చోటః
ప్రజలకు తీర్పు కాలం సమీపించినది. వారు అజాగ్రత్తలో పడి విముఖులై యున్నారు. (అంబియా 21:1)
ఆ సమీపం అనేది మన అంచనా ప్రకారం లేదు. మానవులు దాన్ని తెలుసుకోలేరు. కాలము గడిసిన ప్రకారం అది కేవలం అల్లాహ్ కే తెలుసు.
ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. ఆ విషయాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికి తెలుపలేదు. అల్లాహ్ చెప్పెనుః
ప్రజలు ప్రళయకాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయం నీకేమీ తెలుసు? ప్రళయకాలం సమీపములోనే కావచ్చు. (అహ్ జాబ్ 33: 63).
ప్రవక్త దానికి ముందు వచ్చే సూచనలు సూచించారు. అందులో కొన్ని క్రింద తెలుపబడుచున్నవిః
అందులో ఒకటిః మసీహుద్దజ్జాల్ రానున్నాడు. అతని రాకతో ఘోరమైన అరాచకం ప్రభలిపోతుంది. అల్లాహ్ అతనికి ఇచ్చిన శక్తితో విచిత్ర కార్యక్రమాలు ప్రజలకు చూపిస్తాడు. అందుచేత అనేక మంది మోసబోతారు. ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే అది వర్షం కురిపిస్తుంది. అతని ఆజ్ఞతో అప్పటికప్పుడే మొక్కలు మొలు స్తాయి. మృతుడ్ని జీవింపజేస్తాడు. తదితర వింతలు చూపిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః అతడు కాణుడు. అతడు స్వర్గం నరకం లాంటి రెండు విషయాలు చూపిస్తాడు అతడు స్వర్గం అని చెప్పేది నరకం, అతడు నరకం అని చెప్పేది స్వర్గం. ఒక రోజు ఒక సంవత్సరముగా, ఒక రోజు ఒక నెలగా, ఒక రోజు ఒక వారముగా ఉండును. మిగిత రోజులు సామాన్య రోజులుగా ఉండును. అతడు మక్కా, మదీనా తప్ప ప్రతి దేశం తిరుగును.
ప్రళయదిన సూచనల్లో రెండవదిః ఈసా దిమిష్క్ (Damascus) (ఇది ఈనాడు సీరియా దేశం యొక్క రాజధాని) తూర్పున తెల్లని స్థంబం (మీనార్) నుండి ఫజ్ర్ నమాజ్ సమయంలో దిగి వచ్చును. సామూహికంగా (జమాఅత్ తో) ఫజ్ర్ నమాజ్ చేసుకొని దజ్జాల్ ను వెతికి సంహరించుదురు.
ప్రళయదిన సూచనల్లో మూడవదిః పశ్చిమ దిశ నుండి సూర్యోదయమగును. అది చూసి భయకంపితులై అనేక మంది (ఇస్లామే సత్యమని) విశ్వసించుదురు. కాని ఆ సమయాన ఏమి లాభముండదు. తదితర ఎన్నో సూచనలున్నాయి.
2- ఈ భూమిపై కేవలం దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉన్నపుడు ప్రళయం సంభవించును. అది ఏ విధంగనగాః ప్రళయానికి ముందు ఒక మందమారుతమైన గాలి వీస్తుంది దానితో విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టంతటిని చంపి ప్రపంచాన్ని నశింపజేయాలనుకున్నప్పుడు “సూర్” (పెద్ద శంకు) ఊదుటకు దానికి నియమింపబడిన దూతకు ఆజ్ఞ ఇస్తాడు. దాన్ని విన్న ప్రజలందరు సొమ్మసిల్లి పోతారు. అదే విషయం అల్లాహ్ ఈ వాక్యంలో తెలిపాడుః
“సూరు” (శంకు) ఊదబడును. కావున ఆకాశములలోను భూమిలోనున్న వారందరు సొమ్మసిల్లి పోవుదురు. కాని అల్లాహ్ కోరినవారు సొమ్మసిల్లరు. (జుమర్ 39: 68).
అది శుక్రవారము రోజగును. ఆ తర్వాత దైవదూతలు కూడా చనిపోయి పరమ పవిత్రుడైన అల్లాహ్ తప్ప ఎవరూ ఉండరు.
3- సమాధులలో ప్రవక్తల, ధర్మయుద్ధంలో మరణించిన అమర వీరుల తప్ప అందరి దేహములను మట్టి తినేస్తుంది. కాని వెన్నె ముకలో గల ఒక బీజము అట్లే మిగిలి యుంటుంది. అల్లాహ్ ప్రజలందరికి పునఃర్జన్మ ఇవ్వాలని కోరినపుడు శంకు ఊదుటకు నిర్ణయించబడిన దూత ఇస్రాఫీల్ ను ముందు జీవింపజేయును. అతను శంకు ఊదును. మానవులందరు తొలిసారి (తల్లి గర్భం నుండి) వచ్చిన తీరు నగ్నముగా, ఖత్న (సున్నతీలు) చేయ బడకుండా సమాధుల నుండి లేచి వచ్చుదురు. అల్లాహ్ ఆదేశం:
సూరు ఊదబడును. అప్పుడే వారు తమ సమాధుల నుండి లేచి తమ ప్రభువు వద్దకు పరుగిడుదురు. (యాసీన్ 36: 51).
ఆ దినమున వారు సమాధుల నుండి లేచి ఒక గుర్తునకు పరిగెత్తి పోవునట్లు పరుగెత్తి పోవుదురు. అప్పుడు వారి కన్నులు క్రిందుగా నుండును. వారిపై అవమానము క్రమ్ముకొను చుండును. ఇదే వారితో వాగ్దానము చేయబడుచున్న దినము. (మఆరిజ్ 70: 43,44).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం, అందరికన్నా ముందు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి నుండి వెలికి వస్తారు. అందరూ మహ్షర్ మైదానము వైపు పరిగెత్తుతారు. అది చాలా విస్తీర్ణము మరియు విశాలమైన భూమి. అవిశ్వాసులు తలక్రిందులైన ముఖముతో వస్తారు. ఈ విషయము విన్న సహచరులు తలక్రిందులైన ముఖముతో ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. “కాళ్ళతో నడిపించు శక్తి గలవాడు ముఖముతో కూడా నడిపించును” అని మహాప్రవక్త సమాధానమిచ్చారు. (ముస్లిం 2806). అల్లాహ్ మాటను తిరస్కరించిన వారు గ్రుడ్డివానిగా లేపబడుతారు. సూర్యుడు చాలా దగ్గరుంటాడు. ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి యుంటారు. కొందరు చీలమండల వరకు, మరి కొందరు నడుము వరకు, కొందరు పూర్తిగా మునిగి యుంటారు. కొందరికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. ప్రవక్త చెప్పారుః “ఏడు రకాల (గుణము గల) వారికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. 1. న్యాయశీలుడైన పాలకునికి. 2. యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో మరియు ఆయన విధేయతలో గడిపిన యువకునికి. 3. మస్జిద్ లోనే తన మనుస్సు లగ్నం చేసుకున్న వ్యక్తికి. 4. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు వారు అల్లాహ్ కొరకే కలుసు కుంటారు. అల్లాహ్ కొరకే వేరు అవుతారు. 5. ఉన్నత వంశీయురాలైన, అందమైన స్త్రీ దుష్టక్రియకు అహ్యానిస్తే కేవలం అల్లాహ్ భయముతో తిరస్కరించిన వ్యక్తికి. 6. కుడి చెయ్యి దానం చేసినదేమిటో ఎడమ చెయ్యికి తెలియనంత రహస్యంగా దానా దర్మాలు చేసే వ్యక్తికి. 7. ఏకాంతములో అల్లాహ్ ధ్యానం చేస్తుండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి”. (బుఖారి 1423, మస్లిం 1031). ఇది పురుషులకే ప్రత్యేకం కాదు. స్త్రీలకు తమ కర్మల ప్రకారం లెక్క జరుగును. సత్కార్యములు గలవారికి మంచి ఫలితము, దుష్కార్యములు గలవారికి చెడు ఫలితము లభించును. మరియు వారికి పురుషులకు లభించినట్లు పూర్తి తీర్పు మరియు ప్రతిఫలము లభించును.
ప్రజలందరికి ఆ నాడు దాహము ఎక్కువగును. 50 వేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రో జు అది. కాని విశ్వాసునికి అది ఫర్జ్ నమాజ్ చేసినంత సమయముగా అతి వేగంగా గడిసి పోవును. ఆ తరువాత విశ్వాసులు ప్రవక్తకు నొసంగబడిన “హౌజె కౌసర్” వద్దకు వచ్చి కౌసర్ నీరు త్రాగుదురు. (అది గౌరవము గల చాలా గొప్ప బహుమానము. అది అల్లాహ్ మన ప్రవక్తకే ప్రత్యేకించును. ప్రళయ దినాన ఆయన అనుచరులు అందు నుండి త్రాగుదురు. కౌసర్ నీరు పాలకన్నా తెలుపుగా, తేనేకన్నా తీపుగా మరియు కస్తూరి కన్నా ఎక్కువ సువాసన ఉండును. ఆకాశతారలకన్నా ఎక్కువ పాత్రలు అచ్చట ఉండును. ఒక్కసారి త్రాగిన వారికి మరెప్పుడూ దాహమవదు).
మహ్షర్ మైదానములో ప్రజలు తీర్పు కొరకు చాలా కాలము నిలుచుండి వారు తమ తీర్పు, లెక్క కొరకు ఎదురు చూచుదురు. అచ్చటి బాధలు మరియు ఎండతాపాన్ని భరించలేక దైవసన్నిధిలో తమ గురించి సిఫారసు చేయువారి కోసం వెతుకుతూ ఆదం వద్దకు వస్తే ఆయన నాతో కాదనగా నూహ్ వద్దకు వస్తారు. ఆయన కూడా మన్నించమంటారు. తర్వాత ఇబ్రాహీం, తర్వాత మూసా, తర్వాత ఈసా వద్దకు వస్తే వారు కూడా మాతో కాదని విన్నవించుకుంటారు. అప్పుడు ప్రవక్త వద్దకు వస్తే నేను దీనికి అర్హతగల వాన్నని ఆయన అల్లాహ్ అర్ష్ క్రింద సజ్దా చేసి అల్లాహ్ స్తోత్రములు పఠించి సిఫారసు చేయు అనుమతి కోరుతారు. అప్పుడు అల్లాహ్ “ఓ ముహమ్మద్ తలెత్తు నీ కోరిక తీర్చగలను అడుగు, సిఫారసు చెయ్యి స్వీకరించ బడును” అని లెక్క తీర్పు కొరకు అనుమతిస్తాడు. ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతీల (అనుచరుల) తీర్పు అగును.
మానవుని కర్మల్లో మొదటి లెక్క నమాజ్ గురించి అగును. అందులో నెగ్గినవారి కర్మలను మాత్రమే చూడబడును. నెగ్గనివారి కర్మలు రద్దు చేయబడును. అదే విధముగా ఐదు విషయాలు గురించి ప్రశ్నించబడును. 1. నీ జీవిత కాలాన్ని ఏ కార్యాల్లో గడిపావు? 2. నీ యౌవ్వనాన్ని ఏ కార్యాల్లో కృశింపజేశావు? 3,4. ధనం ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు చేశావు? 5. తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు?. అతని దాసుల మధ్య జరిగే తీర్పులో మొదటిది అన్యాయంగా రక్తాలు చిందించిన వారి తీర్పు. అప్పుడు నష్టపరిహారాన్ని కట్టించుటకు సత్కర్యాలు లేక దుష్టకార్యాలు తప్ప మరేమీ ఉండవు. ఈ విధంగా పీడుతులకు అన్యాయము చేసినవాని సత్కార్యాలు పంచి పెట్టబడును. ఇతని సత్కార్యాలు అయిపోయి ఇంకా పీడితులు మిగిలి ఉంటె వారి పాపాలు అతనిపై వేయబడును.
నరకముపై వంతెన వేయబడును. (ఆ వంతెన వెంట్రుకకన్నా సన్నగా ఖడ్గం కన్నా వాడిగా ఉండును). ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం దానిపై దాటుదురు. కొందరు కనురెప్ప కొట్టినంతలో, కొందరు గాలి తీరు, కొందరు గుఱ్ఱపు రౌతు తీరు, కొందరు ప్రాకుచు పోవుదురు. దానికి కొండ్లుండును. అవి ప్రజలను నరకములో పడవేయును. అందులో పడువారు అవిశ్వాసులు మరియు విశ్వాసి అయినా పాపాత్ములు. అవిశ్వాసులు శాశ్వతంగా అందులో ఉందురు. కాని విశ్వాసులైన పాపాత్ములు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్ష పడిన తర్వాత స్వర్గానికి పంపబడుదురు. అల్లాహ్ తనిష్టపడిన ప్రవక్తలకు, మహాభక్తులకు తౌహీద్ సాక్ష్యమిచ్చిన పాపాత్ముల సిఫారసు చేయు అనుమతి ఇచ్చి, వీరి సిఫారసుతో వారిని నరకము నుంచి తీసి స్వర్గములో చేర్పించును. వంతెన దాటిన తర్వాత -స్వర్గానికి అర్హులైన వారు- నరకము స్వర్గము మధ్యలో ఆగి యుందురు. వారి పరస్పర అన్యాయాల తీర్పు వారు హృదయాల కల్ముషాలను దూరము చేసిన తర్వాత వారు స్వర్గములో చేరుదురు. స్వర్గస్తులు స్వర్గ ములో నరకవాసులు నరకంలో చేరిన పిదప వారి ముందు, వారు చూస్తుండగా మృత్యువును పొట్టేలు రూపంలో స్వర్గనరక ముల మధ్య జిబహ్ చేయ(కోయ) బడును. మళ్ళీ ఓ స్వర్గవాసు లారా! శాశ్వతంగా ఉండండి మరణం లేదు. ఓ నరకవాసులారా! మీకూ శాశ్వతం మరణం లేదు అని అనబడును. ఒక వేళ ఎవరైనా సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు అంతులేని సంతోషంతో చనిపోతారు. మరియు ఎవరైనా బాధ, చింతతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.
నరకము మరియు నరకశిక్షలు
అల్లాహ్ ఆదేశం:
ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయ పడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది. (బఖర 2: 24).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “మీరు కాల్చే ఇహలోక అగ్ని నరకాగ్నిలో 70వ భాగం”. ఇదే చాలై పోయేది కాదు అని సహచరులు అనగా “ఈ అగ్ని కన్నా నరకాగ్ని 69 భాగములు ఎక్కువగా ఉండును. ప్రతి భాగములో ఇంతే వేడి ఉండును” అని బదులిచ్చారు. నరకములో ఏడు అంతస్తులు గలవు. ప్రతి అంతస్తు మరో అంతస్తు కన్నా ఎక్కువ శిక్ష (వేడి) గలది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో చేరుదురు. కాని వంచకులకు ఎక్కువ శిక్ష, బాధ గల క్రింది స్థానం గలదు. నరకవాసుల్లో తిరస్కారులకు శాశ్వతంగా శిక్ష జరుగును. కాలిపోయినపుడల్లా చర్మము మారును. అల్లాహ్ ఆదేశం:
[كُلَّمَا نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا العَذَابَ] {النساء:56}
వారి చర్మము కాలిపోవునపుడల్లా దానికి బదులుగా వేరు చర్మమును వారు బాధ రుచి చూచుటకై కల్పించుచుందుము. (నిసా 4: 56). మరో చోట ఇలా తెలిపాడుః
[وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَى عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُمْ مِنْ عَذَابِهَا كَذَلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ] {فاطر:36}
తిరస్కరించిన వారికి నరకాగ్నియున్నది. వారు చనిపోవుటకు వారికి చావు విధింపబడదు. దాని బాధ వారి నుండి తగ్గింప బడదు. ఇటులే ప్రతి కృతఘ్నునకు శిక్ష విధించుచున్నాము. (ఫాతిర్ 35: 36).
వారిని సంకెళ్ళతో కట్టి వారికి బేడీలు వేయబడునని తెలుపబడిందిః
[وَتَرَى المُجْرِمِينَ يَوْمَئِذٍ مُقَرَّنِينَ فِي الأَصْفَادِ ، سَرَابِيلُهُمْ مِنْ قَطِرَانٍ وَتَغْشَى وُجُوهَهُمُ النَّارُ] {إبراهيم:49، 50}
ఆ రోజు నీవు నేరస్థులను చూస్తావు. వారు సంకెళ్ళలో బంధించబడి ఉంటారు. గందకపు వస్త్రాలు ధరించబడి ఉంటారు. అగ్ని వారి ముఖాలను క్రమ్ముకొనును. (ఇబ్రాహీం 14: 49,50).
వారి తిండి విషయం ఇలా తెలిపాడుః
నిశ్చయంగా జెముడు వృక్షము పాపిష్టులకు ఆహరమగును. అది నూనె మడ్డి వలె ఉండును. అది కడుపులో సలసలకాగు నీళ్ళ వలె కాగును. (దుఖాన్ 44: 43-46).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: “జఖ్ఖూం ఒక చుక్కైనా భూమిపై పడినచో భూమిపై ఉన్నవారి జీవనోపాయం చెడి పోతుంది. ఇక అది తినేవారికి ఎంత బాధ ఉండునో!”. నరక శిక్షల కఠినత్వం మరియు స్వర్గ శుభాల గొప్పతనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరించారుః “ప్రపంచంలో అత్యధికంగా సుఖాలను అనుభవించిన అవిశ్వాసున్ని ఒక్కసారి నరకములో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభ వించావా? అని ప్రశ్నిస్తే, “లేదు ఎప్పుడూ లేదు” అని బదులిస్తాడు. అదే విధంగా ప్రపంచములో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభ వించిన విశ్వా సున్ని ఒకసారి స్వర్గములో ప్రవేశించి ఎప్పుడైనా నీవు బీద రికాన్ని, కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే “నేను ఎప్పుడూ చూడ లేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేస్తే ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయినట్లవుతుంది”. (ముస్లిం 2807).
స్వర్గం
అది సదాకాలమైన, గౌరవ నివాసం. దాన్ని మహాను భావుడైనా అల్లాహ్ తన పుణ్యదాసుల కొరకు సిద్ధ పరిచాడు. అందులోగల వరాలను ఏ కన్ను చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి మనుస్సు ఊహించనూ లేదు. దీని సాక్ష్యానికి ఈ ఆయత్ చదవండిః
వారి కర్మలకు ప్రతిఫలంగా కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచి పెట్టబడిందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికీ తెలియదు. (సజ్దా 32: 17).
అల్లాహ్ మీలో విశ్వాసులైన వారికిని విద్యగల వారికి పదవులు ఉన్నతములుగా జేయును. (ముజాదల 58: 11).
వారు అందులో ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనె కాలువలు మరియు సేవించే వారికి మధురంగా ఉండే మద్యపానాలుండును. ఇది ప్రపంచము లాంటిది కాదు. అల్లాహ్ ఆదేశం:
పరిశుభ్రమైన ద్రాక్ష రసములతో నిండుగిన్నెలు వారి వద్దకు తేబడును. అది తెల్లది గాను త్రాగు వారికి రుచిగా ఉండును. అందు తల తిరగదు. మరియు దాని వలన మతి చెడదు. (సాఫ్ఫాత్ 37: 45-47).
అక్కడి సుందరి స్త్రీల (హూరెఐన్ల)తో వివాహము జరుగును. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “స్వర్గములో ఉన్న స్త్రీ ఒక్కసారి ప్రపంచవాసులను త్రొంగి చూచినట్లయితే భూమ్యాకాశాల మధ్య కాంతితో, సువాసనతో నిండిపోతుంది”. (బుఖారి 2796).
విశ్వాసులకు అక్కడ లభించే అతిపెద్ద వరం అల్లాహ్ దర్శనం.
స్వర్గవాసులకు మలమూత్రం, ఉమ్మి లాంటివేవీ ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెముటలో కస్తూరి లాంటి సువాసన గలదు. ఈ శుభాలు, వరాలు శాశ్వతంగా ఉండును. ఇవి తరగవు, నశింపవు. ప్రవక్త సలల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “స్వర్గములో చేరిన వారి సుఖాలకు అంత ముండదు. వారి దుస్తులు పాతబడవు. వారి యవ్వనం అంతం కాదు”. (ముస్లిం 2836). అందులో అతితక్కువ అద్రుష్టవంతుడు నరకం నుండి వెళ్ళి స్వర్గంలో ప్రవేశించిన చివరి విశ్వాసుడు. అది అతనికి పది ప్రపంచాలకంటే అతి ఉత్తమంగా ఉండును.
ఓ అల్లాహ్! స్వర్గంలో చేర్పించే కార్యాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించి మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము. ఆమీన్!!
You must be logged in to post a comment.