హలాల్ సంపాదన [వీడియో]

హలాల్ (ధర్మ సమ్మతమైన) సంపాదన – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/AxJTx4-tinU [14 నిముషాలు]

అల్లాహ్‌ యొక్క భయం లేనివాడు ఎలా సంపాదించాలి, ఎందులో ఖర్చు చేయాలి అన్న విషయాన్ని గ్రహించడు. ఎలాగైనా తన బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగాలి. అది దొంగతనం, లంచం, అక్రమం, అపహరణ, అబద్ధం, నిషిద్ధ వ్యాపారం, వడ్డీ, అనాథల సొమ్ము తిని అయినా, లేదా జ్యోతిష్యం, వ్యభిచారం లాంటి నిషిద్ధ పనులు చేసి వాటి బత్తెం తీసుకొని, లేదా బైతుల్‌ మాల్‌, పబ్లిక్‌ ప్రాపర్టీల నుండి అపహరణ చేసి, ఇతరులను ఇబ్బందికి గురి చేసి వారి సొమ్ముతిని, లేదా అనవసరంగా బిక్షమడిగి ఎలాగైనా డబ్బు కావాలన్న ఆశ. ఈ డబ్బుతో అతను తింటాడు, దుస్తులు ధరిస్తాడు, వాహానాల్లో పయనిస్తాడు, ఇల్లు నిర్మిస్తాడు, లేదా కిరాయికి తీసుకుంటాడు మరియు అందులో అన్ని రకాల భోగభాగ్యాలను సమకూర్చుకుంటాడు. ఇలా నిషిద్ధమైన వాటిని తన కడుపులోకి పోనిస్తాడు.

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు:

అక్రమ సంపాదన

“నిషిద్ధమైన వాటితో పెరిగిన ప్రతి శరీరం నరకంలో చేరడమే మేలు” .
(తబ్రాని కబీర్‌: 19/136. సహీహుల్‌ జామి: 4495).

అంతే కాదు, ప్రతి మనిషి, నీవు ఎలా సంపాదించావు? ఎందులో ఖర్చు చేశావు? అని ప్రళయదినాన ప్రశ్నించబడతాడు. అక్కడ వినాశమే వినాశం. కనుక ఎవరి వద్ద అక్రమ సంపద ఉందో, అతి తొందరగా దాని నుండి తన ప్రాణాన్ని విడిపించుకోవాలి. అది ఎవరిదైనా హక్కు ఉంటే తొందరగా అతనికి అప్పగించి, అతనితో క్షమాపణ కోరాలి. ఈ పని ప్రళయం రాక ముందే చేసుకోవాలి. ఎందుకనగా అక్కడ దిర్హం, దీనార్‌లు చెల్లవు. కేవలం పుణ్యాలు, లేక పాపాల చెల్లింపులుంటాయి.


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలుఅను పుస్తకం నుంచి తీసుకుబడింది]

ధర్మపరమైన నిషేధాలు – 44: హలాల్ ను హరాం మరియు హరాం ను హలాల్ చేసే వ్యక్తి (ఏలాంటి వాడైనా సరే అతని)ని అనుసరించకు [వీడియో]

బిస్మిల్లాహ్

[5:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 44

44హలాల్ ను హరాం మరియు హరాం ను హలాల్ చేసే వ్యక్తి (ఏలాంటి వాడైనా సరే అతని)ని అనుసరించకు. ఈ హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అల్లాహ్ హలాల్ చేసినదే హలాల్. అల్లాహ్ హరాం చేసినదే హరాం. దేనిని ఆయన ధర్మంగా చేశాడో అదే ధర్మం.

[اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ الله] {التوبة:31}

వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, సాధువులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31).

عَنْ عَدِىِّ بْنِ حَاتِمٍ > قَالَ : أَتَيْتُ النَّبِىَّ ^ وَفِى عُنُقِى صَلِيبٌ مِنْ ذَهَبٍ قَالَ فَسَمِعْتُهُ يَقُولُ [اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ الله] قَالَ قُلْتُ يَا رَسُولَ الله إِنَّهُمْ لَمْ يَكُونُوا يَعْبُدُونَهُمْ. قَالَ: «أَجَلْ وَلَكِنْ يُحِلُّونَ لَهُمْ مَا حَرَّمَ اللهُ فَيَسْتَحِلُّونَهُ وَيُحَرِّمُونَ عَلَيْهِمْ مَا أَحَلَّ اللهُ فَيُحَرِّمُونَهُ فَتِلْكَ عِبَادَتُهُمْ لَهُمْ». {السنن الكبرى للبيهقي، كتاب آداب القاضي ، باب ما يقضي به القاضي… ، 10/198}

అదీ బిన్ హాతిం (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాను. అప్పుడు నా మెడలో బంగారు శిలువ ఉండింది. నేను చేరుకునే సరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, సాధువులను తమ ప్రభువులుగా చేసుకున్నారు”. (తౌబా 9: 31). అన్న ఆయతు పఠిస్తున్నారు. ‘ప్రవక్తా!  యూదులు, క్రైస్తవులు తమ పండితుల, సన్యాసుల పూజా, ఆరాధనలు చేసేవారు కాదు కదా?’ అని నేనడిగాను. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన వాటిని పండితులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించేవారు. అలాగే అల్లాహ్ హలాల్ చేసిన వాటిని వారు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. ఇదే వారి ఆరాధన చేసినట్లు” అని విశదపరిచారు.

(బైహఖీ ‘సునన్ కుబ్రా’లో, కితాబు ఆదాబిల్ ఖాజి, బాబు మా యఖ్ జీ బిహిల్ ఖాజీ…, 10/198).

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ధర్మపరమైన నిషేధాలు (భాగాలు) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2ipsEd3T9LtuCJ3_1vELEu

ధర్మపరమైన నిషేధాలు (క్లిప్స్) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0PzbYW7saGrZ3TYVB51Rtb

ధర్మపరమైన నిషేధాలు – 43: అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని నీవు హరాం (నిషిద్ధం) చేయకు. లేదా అల్లాహ్ హరాం చేసిన దానిని నీవు హలాల్ చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[3:10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 43

43- అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని నీవు హరాం (నిషిద్ధం) చేయకు. లేదా అల్లాహ్ హరాం చేసిన దానిని నీవు హలాల్ చేయకు. ఇంకా ప్రసిద్ధ, ప్రాముఖ్యమైన ధర్మ విషయాలను తిరస్కరించకు. ఉదాహరణకుః మత్తు నిషిద్ధత, నమాజు విధితము, తదితరాలు.

[وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الكَذِبَ هَذَا حَلَالٌ وَهَذَا حَرَامٌ لِتَفْتَرُوا عَلَى اللهِ الكَذِبَ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللهِ الكَذِبَ لَا يُفْلِحُونَ] {النحل:116}

మీరు ఇట్లే నోటికొచ్చినట్లు ‘ఇది ధర్మసమ్మతమైనది, అది అధర్మమైనది’ అని అబద్ధాలు పలకకండి. ఇందువల్ల మీరు అల్లాహ్ పై అసత్యాన్ని మోపినవాళ్ళవుతారు. అల్లాహ్ పై అసత్యారోపణలు చేసేవారు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. (నహల్ 16: 116).

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో]

బిస్మిల్లాహ్

[17:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జిబహ్ చేసే పద్ధతి, దాని ఆదేశాలు

భూనివాస జంతువులు ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయ(కోయ)బడినప్పుడే అవి తినుటకు ధర్మసమ్మతం.

జిబహ్ అంటే:   గొంతు, ఆహారనాళం మరి కంఠనాళాలను కోయుట. గత్యంతరం లేని పరిస్థితిలో ఎక్కడి నుండైనా రక్తం ప్రవహించాలి.

ఎందుకనగా ఏ జంతువును, పక్షులను వశపరుచుకొని జిబహ్ చేయగలమో వాటిని ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయకుంటే వాటిని తినుట ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా జిబహ్ చేయబడనివి మృతుల్లో లెక్కించబడుతాయి.

జిబహ్ నిబంధనలు

1-జిబహ్ చేయు వ్యక్తి: బుద్ధిమంతుడు, ఆకాశ ధర్మాన్ని అవలంభించినవాడయి ఉండాలి. అంటే ముస్లిం లేదా యూదుడు మరియు క్రైస్తవుడు. కాని పిచ్చివాడు, త్రాగుబోతు మరియు జిబహ్ పద్ధతులు తెలియని బాలుడు జిబహ్ చేస్తే తినడం యోగ్యం కాదు. ఎందుకనగా వీరిలో బుద్ధీజ్ఞానాల కొరత వల్ల జిబహ్ ఉద్దేశ్యం పూర్తి కాదు. అలాగే అవిశ్వాసి, బహుదైవారాధకుడు, మజూసి (అగ్ని పూజారి), సమాధుల పూజారులు జిబహ్ చేసినది ధర్మసమ్మతం కాదు.

2-జిబహ్ చేసే ఆయుధం: రక్తాన్ని ప్రవహింపజేసే పదునైన మొనగల ఏ వస్తువుతో జిబహ్ చేసినా అది యోగ్యమే. అది ఇనుపదైనా, రాయి అయినా లేదా మరేదైనా సరే. అయితే అది దంతం, ఎముక, గోరు అయి ఉండకూడదు. వాటితో జిబహ్ చేసినవి యోగ్యం కావు.

3- గొంతు (శ్వాస పీల్చు మార్గం), ఆహారనాళం మరియు కంఠనాళాలను కోయాలి.

జిబహ్ కొరకు కచ్చితంగా ఈ అవయవాలను ప్రత్యేకించడంలోని మర్మం ఏమిటంటేః వివిధ నరాలు అక్కడే ఉంటాయి గనుక రక్త ప్రవాహం మంచి విధంగా జరుగుతుంది. తొందరగా ప్రాణం పోతుంది. జంతువుకు ఎక్కువ అవస్థ ఏర్పడదు. దాని మాంసం కూడా రుచిగా ఉంటుంది.

వేటాడినప్పుడు లేదా వేరే ఏదైనా సందర్భంలో పై తెలిపిన ప్రకారం జిబహ్ చేయడం అసాధ్యమైనప్పుడు బిస్మిల్లాహ్ అని పదునైన ఆయుధం దాని వైపు విసిరినప్పుడు అది దాని శరీరంలో తాకి వెంటనే చనిపోయినా, లేదా ప్రాణంగా ఉన్నప్పుడు దానిని వశపరుచుకొని జిబహ్ చేసినా అది ధర్మసమ్మతం అవుతుంది.

తినుటకు యోగ్యమైన జంతువులు ఊపిరాడక, గట్టి దెబ్బ తాకి, ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయి, పరస్పర కొమ్ములాట వల్ల లేదా ఏదైనా క్రూరమృగం దాడితో మరణిస్తే అవి నిషిద్ధం. అయితే అవి మరణించే ముందు కొంత ప్రాణం ఉన్నప్పుడు వశపరుచుకొని జిబహ్ చేయగలిగితే అవి ధర్మసమ్మతం అవుతాయి.

4- జిబహ్ చేయు వ్యక్తి జిబహ్ చేసేటప్పుడు బిస్మిల్లాహ్ అనాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనడం సున్నత్.

జిబహ్ కు సంబంధించిన ధర్మాలు

1- జంతువును పదును లేని ఆయుధంతో జిబహ్ చేయడం “మక్రూహ్”.

2- ఏ జంతువును జిబహ్ చేయనున్నామో దాని ముందు అది చూస్తుండగా కత్తికి పదును పెట్టడం “మక్రూహ్”.

3- జంతువును ఖిబ్లాకు వ్యెతిరేక దిశలో పెట్టి జిబహ్ చేయడం “మక్రూహ్”.

4- పూర్తిగా ప్రాణం పోక ముందే దాని మెడ విరుచుటగాని లేదా చర్మం తీయుటగాని “మక్రూహ్”.

మేక, ఆవులు ఎడమ వైపు పరుండబెట్టి జిబహ్ చేయడం సున్నత్. ఒంటెను నిలబెట్టి దాని ఎడమ చెయిని (ముందు కాళును) కట్టేసి జిబహ్ చేయుట సున్నత్. వల్లాహు అఅలమ్. 

వేట

అవసర నిమిత్తం వేటాడుట తప్ప కాలక్షేపం కోసం, మనోరంజన కోసం వేటాడుట యోగ్యం కాదు.

వేటాడుతూ వేటాడబడిన జంతువును పట్టుకున్నాక రెండు స్థితులుః

1- దానిని పట్టుకున్నప్పుడు దానిలో ప్రాణం ఉంటే తప్పక దానిని జిబహ్ చేయాలి.

2- పట్టుకున్నప్పడు అది చనిపోయి ఉండవచ్చు. లేదా ప్రాణం ఉండి కూడా లేనట్లుగానే ఏర్పడితే అది ధర్మసమ్మతమే.

జిబహ్ నిబంధనల మాదిరిగానే వేట నిబంధనలు ఉన్నాయిః

1- బుద్ధిజ్ఞానం గల ముస్లిం లేదా యూదుడు, క్రైస్తవుడై ఉండాలి. పిచ్చివాడు, త్రాగుబోతు, మజూసి, బహుదైవారాధకులు జిబహ్ చేసిన దానిని తినుట ముస్లింకు యోగ్యం కాదు.

2- వేటాయుధం పదునుగా ఉండాలి. రక్తం ప్రవహించాలి. గోరు, ఎముక, దంతాలు ఉపయోగించరాదు. పదునైన మొనగల వైపు నుండి జంతువు గాయమైతే అది ధర్మ సమ్మతం. దాని మొన వెనక భాగం నుండి దెబ్బ తగిలి చనిపోతే యోగ్యం కాదు. శిక్షణ ఇవ్వబడిన వేట కుక్క మరియు పక్షులు చంపిన జంతువులు కూడా యోగ్యమే. అయితే అవి వేట శిక్షణ ఇవ్వబడినవి అయి ఉండుట తప్పనిసరి.

వేట శిక్షణ అంటే దానిని వదిలినప్పుడు లేదా ‘పో’ అన్నప్పుడు పోవాలి. అది ఏదైనా జంతువును వేటాడిన తర్వాత తన యజమాని వచ్చే వరకు అతని కొరకు పట్టి ఉంచాలి. అది స్వయంగా తినకూడదు.

3-  ఆయుధాన్ని వేట ఉద్దేశ్యంతో విడవాలి. ఆయుధం చేతి నుండి జారిపడి ఏవైనా పశుపక్షాదులు చనిపోతే అవి ధర్మసమ్మతం కావు. అలాగే వేట కుక్క దానంతట అదే వెళ్ళి వేటాడి తీసుకువస్తే అదీ ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా వేటాడే మనిషి తనుద్దేశ్యంతో దానిని పంపలేదు గనక. ఎవరైనా ఒక జంతువు లేదా పక్షికి గురి పెట్టి బాణం వదిలాడు కాని అది మరో దానికి తగిలితే, లేదా గుంపులో ఉన్న వాటికి తగిలి కొన్ని చనిపోతే అవన్నియూ ధర్మసమ్మతమే.

4- వేట పశువు లేదా వేట పక్షి లేదా బాణం ఏదీ విడిసినా అల్లాహ్ పేరుతో విడవాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనుట సున్నత్.

గమనికః కుక్కను పెంచటం నిషిద్ధం. కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిన ఉద్దేశ్యాలకు తప్ప. ఆయన సల్లల్లహు అలైహి వసల్లం తెలిపిన ప్రకారం ఈ మూడిట్లో ఏదైనా ఒకటై ఉండాలిః వేట కొరకు, లేదా పశుసంపద భద్రత కోసం, లేదా వ్యవసాయోత్పత్తుల, పైరుపంటల పరిరక్షణ కోసం.


ముందు పాఠాలు:

అన్నపానీయాల ఆదేశాలు -1 [వీడియో]

అన్నపానీయాల ఆదేశాలు -1 [వీడియో]

బిస్మిల్లాహ్

[14:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అన్నపానీయాల ఆదేశాలు

అల్లాహ్ తన దాసులకు పవిత్రమైన వస్తువులు తినుటకు ఆదేశించి, అపవిత్రమైన వాటిని వారిం- చాడు. అల్లాహ్ ఆదేశం సూర బఖర 2:172లో:

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ]
ఓ విశ్వాసులారా! మేమొసంగిన పవిత్ర వస్తువులను భుజించండి“.  (2:172)

అన్నపానీయాల విషయంలో నియమం ఏమిటంటే: నిషేధింపబడిన కొన్ని వస్తువులు తప్ప అన్నియూ ధర్మసమ్మతమే (హలాల్). అల్లాహ్ తన దాసుల కొరకు పవిత్ర వస్తువులను ధర్మసమ్మతం చేసింది వారు వాటి నుండి ప్రయోజనం పొందాలని. అయితే వాటిని అల్లాహ్ అవిధేయత కొరకు ఉపయోగించుట ఎంత మాత్రం యోగ్యం కాదు.

తిను త్రాగు వస్తువుల్లో అల్లాహ్ తన దాసుల కొరకు నిషేధించిందేమిటో ఇలా స్పష్టపరిచాడు.

[وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ] {الأنعام:119}

వాస్తవానికి గత్యంతరంలేని సంకట పరిస్థితులలో తప్ప, మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లాహ్ ఏ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో, వాటి వివరాలను మీకు ఆయన ఇది వరకే తెలియజేశాడు“. (అన్ఆమ్ 6: 119).

ఏ వస్తువు నిషిద్ధం అని తెలుపబడలేదో అది ధర్మసమ్మతం అన్న మాట. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:

إِنَّ اللهَ فَرَضَ فَرَائِضَ؛ فَلاَ تُضَيِّعُوْهَا، وَحَدَّ حُدُوْدًا؛ فَلاَ تَعْتَدُوهَا، وَحَرَّمَ أَشْيَاء؛ فَلاَ تَنْتَهِكُوْهَا، وَسَكَتَ عَنْ أَشْيَاءَ رَحْمَةً لَكُمْ مِنْ غَيْرِ نِسْيَانٍ؛ فَلاَ تَبْحَثُوا عَنْها. [سنن الدارقطني 4/184، حسنه النووي ].

“అల్లాహ్ మీపై కొన్ని విధులను విధించాడు; మీరు వాటిని వృధా చేయకండి. కొన్ని కట్టుబాట్లను నిర్ణయించాడు; వాటిని అతిక్రమించకండి. కొన్ని వస్తువులను నిషిద్ధపరిచాడు; వాటిని ఉల్లఘించకండి. మరికొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు. మరచిపోయి కాదు, వాస్తవంలో మీపై కరుణిస్తూ; మీరు వాటి వెంటబడకండి”. (హాకిం 4/129. జామిఉల్ ఉసూల్ 5/59, నవవీ హసన్ అన్నారు).

తిను, త్రాగు, ధరించు ఏ విషయాలు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషిద్ధం అని తెలుపలేదో వాటిని నిషేధించుట యోగ్యం కాదు.

నియమం ఏమిటంటేః నష్టం లేని పవిత్రమైన ప్రతి వస్తువు ‘ముబాహ్‘ (యోగ్యం). అపవిత్రమైన మరియు నష్టంగల వస్తువులు నిషిద్ధం. ఉదా: పీనుగు [1], రక్తం [2], మత్తుపదార్థాలు, ధూమపానం మరియు అపరిశుభ్రంతో కలుషితమైన వస్తువులన్నియూ నిషిద్ధం. ఎందుకనగా అవి అపవిత్రంతో పాటు హాని కలిగించునవి కూడాను.

  • [1] పీనుగు అంటే ధార్మిక పద్ధతితో జిబహ్ చేయకుండానే దానంతట అది చనిపోయినది.
  • [2] రక్తం అంటే జిబహ్ చేసేటప్పుడు స్రవించే రక్తం. ధార్మిక పద్ధతితో జిబహ్ చేసిన తర్వాత మాంసం మధ్యలో లేదా నరాల్లో ఉండిపోయే కొంతపాటి రక్తం ధర్మసమ్మతమే.

యోగ్యమైన ఆహారాలు రెండు రకాలు: జంతువులు (మాంసాహారాలు). కూరగాయలు. (శాఖాహారాలు). వీటిలో నష్టం లేనివి యోగ్యం.

జంతువులు రెండు రకాలు: జలనివాస జంతువులు. భూనివాస జంతువులు. జల నివాస జంతువులన్నీ ధర్మసమ్మతమే. వాటిని జిబహ్ చేయాలన్న నిబంధన కూడా లేదు. చివరికి అవి దానంతటవే చనిపోయినవైనా యోగ్యమే.

భూనివాస జంతువుల్లో ఇస్లాం నిషేధించినవి తప్ప మిగితవన్నీ ధర్మసమ్మతమే. (కాని వాటిని జిబహ్ చేయాలి). ఇస్లాం నిషేధించినవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • 1- పెంపుడు గాడిదలు.
  • 2- కోరలు గల మృగాలన్నియూ నిషిద్ధం, సివంగి (దుమ్ముల గొండి) తప్ప.

పక్షులన్నియూ ధర్మసమ్మతమే. ఈ క్రింది పక్షులు తప్పః

(1) కాళ్ళ గోళ్ళ ఆధారంగా వేటాడే పక్షులు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

نَهَي رَسُولُ الله عَنْ كُلِّ ذِىْ نَابٍ مِنَ السِّبَاعِ، وَ عَنْ كُلِّ ذِيْ مِخْلَبٍ مِنَ الطُّيُوْر

కోరలు గల ప్రతి మృగ జంతువు, మరియు కాళ్ళతో పట్టుకొని భక్షించే ప్రతి పక్షిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నివారించారు“. (ముస్లిం 1934).

(2) గద్ద, కాకి, రాబందుల్లాంటి శవాలను తినే పక్షులు. అవి మలినము, అపరిశుభ్రమైనవాటిని తింటాయి గనుక నిషిద్ధం.

(3) పాము, ఎలుక మరియు పురుగులు, క్రిమికీటకాలు లాంటి అశుద్ధమైనవి కూడా నిషిద్ధం.

పైన తెలుపబడిన జంతువులు, పక్షులు తప్ప మిగితవన్నీ ధర్మసమ్మతమే: గుఱ్ఱం, ఒంటె, ఆవు, ఎద్దు, మేక, గొర్రె, బర్రె, కోడి, అడవిగాడిద, నిప్పుకోడి, కుందేలు, ఉడుం వగైరాలు.

జల్లాల‘ నిషిద్ధం. జల్లాల అంటే ఎక్కువ శాతం మలినం తినే పక్షి, పశువు అని అర్థం. కాని దానిని మూడు రోజులు అలాంటి పదార్థాలు తినకుండా ఆపి, పరిశుభ్రమైన తిను పదార్థాలు ఇస్తూ ఉంటే ఆ తర్వాత అది ధర్మసమ్మతం అమవుతుంది.

ఉల్లి, ఎల్లి లాంటి దుర్వాసన గల వస్తువులు (ధర్మసమ్మత మైనప్పటికీ) మస్జిదుకు వెళ్ళే ముందు అవి పచ్చివిగా తినుట ‘మక్రూహ్’ (ఇష్టం లేని కార్యం).

ప్రాణం పోవులాంటి పరిస్థితి ఏర్పడి నిషిద్ధ వస్తువు తప్ప మరేది లేనప్పుడు ప్రాణం కాపాడుటకు సరిపడునంత పరిమాణంలో నిషిద్ధ వస్తువు తినవచ్చు. కాని విషం తినకూడదు.

చుట్టూ గోడ లేని మరియు కాపలాదారుడు లేని పండ్ల తోట నుండి దాటుతూ క్రింద పడిన పండ్లు తినవచ్చు. కాని తన వెంట తీసుకెళ్ళ కూడదు. అలాగే రాళ్ళు విసిరి పండ్లు క్రింద పడగొట్టి, లేదా చెట్టు ఎక్కి తినడం యోగ్యం కాదు. అలాగే ఒక చోట కుప్పజేసియున్న దానిలో నుండి తీసుకోవడం కూడా యోగ్యం కాదు. కాని మరీ అత్యవసర పరిస్థితిలో ఆకలిని తీర్చు పరిమాణంలో తింటే తప్పు లేదు.


తరువాతి పాఠం:
అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో]

ధర్మసంపాదన నుండి తీసిన దానం దిన దినాభివృద్ధి అవుతుంది

595. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:-

“దేవుని దగ్గరకు పవిత్ర వస్తువు మాత్రమే చేరుతుంది. అందువల్ల ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేసినా సరే దేవుడు దాన్ని కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పర్వతం మాదిరిగా పెరిగిపోతుంది.”

[సహీహ్ బుఖారీ : 97 వ ప్రకరణం – తౌహీద్, 23 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తాలా – తారుజుల్ మలాయికతు వర్రూహు ఇలై]

19 వ అధ్యాయం – ధర్మసంపాదన నుండి తీసిన దానం దిన దినాభివృద్ధి అవుతుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్