
[17:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
జిబహ్ చేసే పద్ధతి, దాని ఆదేశాలు
భూనివాస జంతువులు ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయ(కోయ)బడినప్పుడే అవి తినుటకు ధర్మసమ్మతం.
జిబహ్ అంటే: గొంతు, ఆహారనాళం మరి కంఠనాళాలను కోయుట. గత్యంతరం లేని పరిస్థితిలో ఎక్కడి నుండైనా రక్తం ప్రవహించాలి.
ఎందుకనగా ఏ జంతువును, పక్షులను వశపరుచుకొని జిబహ్ చేయగలమో వాటిని ఇస్లామీయ పద్ధతిలో జిబహ్ చేయకుంటే వాటిని తినుట ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా జిబహ్ చేయబడనివి మృతుల్లో లెక్కించబడుతాయి.
జిబహ్ నిబంధనలు
1-జిబహ్ చేయు వ్యక్తి: బుద్ధిమంతుడు, ఆకాశ ధర్మాన్ని అవలంభించినవాడయి ఉండాలి. అంటే ముస్లిం లేదా యూదుడు మరియు క్రైస్తవుడు. కాని పిచ్చివాడు, త్రాగుబోతు మరియు జిబహ్ పద్ధతులు తెలియని బాలుడు జిబహ్ చేస్తే తినడం యోగ్యం కాదు. ఎందుకనగా వీరిలో బుద్ధీజ్ఞానాల కొరత వల్ల జిబహ్ ఉద్దేశ్యం పూర్తి కాదు. అలాగే అవిశ్వాసి, బహుదైవారాధకుడు, మజూసి (అగ్ని పూజారి), సమాధుల పూజారులు జిబహ్ చేసినది ధర్మసమ్మతం కాదు.
2-జిబహ్ చేసే ఆయుధం: రక్తాన్ని ప్రవహింపజేసే పదునైన మొనగల ఏ వస్తువుతో జిబహ్ చేసినా అది యోగ్యమే. అది ఇనుపదైనా, రాయి అయినా లేదా మరేదైనా సరే. అయితే అది దంతం, ఎముక, గోరు అయి ఉండకూడదు. వాటితో జిబహ్ చేసినవి యోగ్యం కావు.
3- గొంతు (శ్వాస పీల్చు మార్గం), ఆహారనాళం మరియు కంఠనాళాలను కోయాలి.
జిబహ్ కొరకు కచ్చితంగా ఈ అవయవాలను ప్రత్యేకించడంలోని మర్మం ఏమిటంటేః వివిధ నరాలు అక్కడే ఉంటాయి గనుక రక్త ప్రవాహం మంచి విధంగా జరుగుతుంది. తొందరగా ప్రాణం పోతుంది. జంతువుకు ఎక్కువ అవస్థ ఏర్పడదు. దాని మాంసం కూడా రుచిగా ఉంటుంది.
వేటాడినప్పుడు లేదా వేరే ఏదైనా సందర్భంలో పై తెలిపిన ప్రకారం జిబహ్ చేయడం అసాధ్యమైనప్పుడు బిస్మిల్లాహ్ అని పదునైన ఆయుధం దాని వైపు విసిరినప్పుడు అది దాని శరీరంలో తాకి వెంటనే చనిపోయినా, లేదా ప్రాణంగా ఉన్నప్పుడు దానిని వశపరుచుకొని జిబహ్ చేసినా అది ధర్మసమ్మతం అవుతుంది.
తినుటకు యోగ్యమైన జంతువులు ఊపిరాడక, గట్టి దెబ్బ తాకి, ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయి, పరస్పర కొమ్ములాట వల్ల లేదా ఏదైనా క్రూరమృగం దాడితో మరణిస్తే అవి నిషిద్ధం. అయితే అవి మరణించే ముందు కొంత ప్రాణం ఉన్నప్పుడు వశపరుచుకొని జిబహ్ చేయగలిగితే అవి ధర్మసమ్మతం అవుతాయి.
4- జిబహ్ చేయు వ్యక్తి జిబహ్ చేసేటప్పుడు బిస్మిల్లాహ్ అనాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనడం సున్నత్.
జిబహ్ కు సంబంధించిన ధర్మాలు
1- జంతువును పదును లేని ఆయుధంతో జిబహ్ చేయడం “మక్రూహ్”.
2- ఏ జంతువును జిబహ్ చేయనున్నామో దాని ముందు అది చూస్తుండగా కత్తికి పదును పెట్టడం “మక్రూహ్”.
3- జంతువును ఖిబ్లాకు వ్యెతిరేక దిశలో పెట్టి జిబహ్ చేయడం “మక్రూహ్”.
4- పూర్తిగా ప్రాణం పోక ముందే దాని మెడ విరుచుటగాని లేదా చర్మం తీయుటగాని “మక్రూహ్”.
మేక, ఆవులు ఎడమ వైపు పరుండబెట్టి జిబహ్ చేయడం సున్నత్. ఒంటెను నిలబెట్టి దాని ఎడమ చెయిని (ముందు కాళును) కట్టేసి జిబహ్ చేయుట సున్నత్. వల్లాహు అఅలమ్.
వేట
అవసర నిమిత్తం వేటాడుట తప్ప కాలక్షేపం కోసం, మనోరంజన కోసం వేటాడుట యోగ్యం కాదు.
వేటాడుతూ వేటాడబడిన జంతువును పట్టుకున్నాక రెండు స్థితులుః
1- దానిని పట్టుకున్నప్పుడు దానిలో ప్రాణం ఉంటే తప్పక దానిని జిబహ్ చేయాలి.
2- పట్టుకున్నప్పడు అది చనిపోయి ఉండవచ్చు. లేదా ప్రాణం ఉండి కూడా లేనట్లుగానే ఏర్పడితే అది ధర్మసమ్మతమే.
జిబహ్ నిబంధనల మాదిరిగానే వేట నిబంధనలు ఉన్నాయిః
1- బుద్ధిజ్ఞానం గల ముస్లిం లేదా యూదుడు, క్రైస్తవుడై ఉండాలి. పిచ్చివాడు, త్రాగుబోతు, మజూసి, బహుదైవారాధకులు జిబహ్ చేసిన దానిని తినుట ముస్లింకు యోగ్యం కాదు.
2- వేటాయుధం పదునుగా ఉండాలి. రక్తం ప్రవహించాలి. గోరు, ఎముక, దంతాలు ఉపయోగించరాదు. పదునైన మొనగల వైపు నుండి జంతువు గాయమైతే అది ధర్మ సమ్మతం. దాని మొన వెనక భాగం నుండి దెబ్బ తగిలి చనిపోతే యోగ్యం కాదు. శిక్షణ ఇవ్వబడిన వేట కుక్క మరియు పక్షులు చంపిన జంతువులు కూడా యోగ్యమే. అయితే అవి వేట శిక్షణ ఇవ్వబడినవి అయి ఉండుట తప్పనిసరి.
వేట శిక్షణ అంటే దానిని వదిలినప్పుడు లేదా ‘పో’ అన్నప్పుడు పోవాలి. అది ఏదైనా జంతువును వేటాడిన తర్వాత తన యజమాని వచ్చే వరకు అతని కొరకు పట్టి ఉంచాలి. అది స్వయంగా తినకూడదు.
3- ఆయుధాన్ని వేట ఉద్దేశ్యంతో విడవాలి. ఆయుధం చేతి నుండి జారిపడి ఏవైనా పశుపక్షాదులు చనిపోతే అవి ధర్మసమ్మతం కావు. అలాగే వేట కుక్క దానంతట అదే వెళ్ళి వేటాడి తీసుకువస్తే అదీ ధర్మసమ్మతం కాదు. ఎందుకనగా వేటాడే మనిషి తనుద్దేశ్యంతో దానిని పంపలేదు గనక. ఎవరైనా ఒక జంతువు లేదా పక్షికి గురి పెట్టి బాణం వదిలాడు కాని అది మరో దానికి తగిలితే, లేదా గుంపులో ఉన్న వాటికి తగిలి కొన్ని చనిపోతే అవన్నియూ ధర్మసమ్మతమే.
4- వేట పశువు లేదా వేట పక్షి లేదా బాణం ఏదీ విడిసినా అల్లాహ్ పేరుతో విడవాలి. బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనుట సున్నత్.
గమనికః కుక్కను పెంచటం నిషిద్ధం. కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిన ఉద్దేశ్యాలకు తప్ప. ఆయన సల్లల్లహు అలైహి వసల్లం తెలిపిన ప్రకారం ఈ మూడిట్లో ఏదైనా ఒకటై ఉండాలిః వేట కొరకు, లేదా పశుసంపద భద్రత కోసం, లేదా వ్యవసాయోత్పత్తుల, పైరుపంటల పరిరక్షణ కోసం.
ముందు పాఠాలు:
You must be logged in to post a comment.