అల్లాహ్ వద్ద అల్లాహ్ దాసుల హక్కు చాలా గొప్పది. అల్లాహ్ హక్కులో లోపం జరిగితే అల్లాహ్ తో క్షమాపణ వేడుకొని ఆ పాపం నుండి రక్షణ పొందవచ్చు కాని మానవ హక్కులు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. అది కూడా దిర్హం, దినార్ లతో గాక పాపపుణ్యాలతో తీర్పు చేయబడే దినం రాకముందే చెల్లించాలి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا
“అమానతులను (అప్పగింతలు) యోగ్యులైన వారికి అప్పగించండి” అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. (నిసా 4: 58).
అప్పు తిరిగిచ్చే విషయంలో అలక్ష్యం మన సమాజంలో సర్వసామాన్యమైపోయింది. కొందరు తమకు చాలా అవసరం ఉన్నందుకు కాదు, తమ జీవితం భోగభాగ్యాల్లో గడవడానికి మరియు ఇతరుల గుడ్డి అనుకరణలో పడి కొత్త బండ్లు, హౌస్ ఫర్నీచర్ లాంటి నశించిపోయేవాటిని కొనేందుకు అప్పు తీసుకుంటారు. అందుకని ఎక్కువ ఇంస్టాల్మెంట్స్ పై విక్రయించే దుకాణాల్లోకి వెళ్తారు. అయితే అనేక ఇంస్టాల్మెంట్స్ వ్యాపారాల్లో అనుమానం, నిషిద్ధం ఉంటుందన్న విషయాన్ని కూడా గ్రహించరు.
అత్యవసరమైన అక్కర లేకున్నా అప్పు తీసుకోవటం వలన, చెల్లించ వలసినప్పుడు ‘రేపుమాపు’ అని జాప్యం జరుగుతుంది. లేదా ఇచ్చిన వాడు నష్టపోవలసి వస్తుంది. దీని దుష్ఫలితం నుండి హెచ్చరిస్తూ ప్రవక్త ఇలా తెలిపారు:
“ఎవరయితే తిరిగి ఇచ్చే ఉద్దేశ్యంతో ఇతరుల నుండి (అప్పుగా) సొమ్ము తీసుకుంటాడో, అల్లాహ్ అతని తరఫున చెల్లిస్తాడు. (అంటే అల్లాహ్ సహాయం చేస్తాడు). ఎవరయితే ఇతరులను నష్టపరచాలన్న ఉద్దేశ్యంతో తీసుకుంటాడో, అల్లాహ్ అతన్నే నష్టపరుస్తాడు”. (బుఖారి 2387).
ప్రజలు అప్పు విషయంలో చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. దానిని తక్కువ విలువగలదని భావిస్తున్నారు. కాని అల్లాహ్ వద్ద అది చాలా పెద్ద విష యం. అంతేకాదు; షహీద్ (అల్లాహ్ మార్గంలో తన ప్రాణాన్ని కోల్పోయిన వారి)కి చాలా ఘనత, లెక్కలేనన్ని పుణ్యాలు మరియు ఉన్నతస్థానం ఉన్నప్పటికీ అతను కూడా అప్పు చెల్లించని బాధ్యత నుండి తప్పించుకోలేడు. దీనికో నిదర్శనగా ప్రవక్త ఈ ప్రవచనం చదవండి:
“సుబ్ హానల్లాహ్! అప్పు గురించి ఎంత కఠినమైన విషయం అవతరించింది?! నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి! ఒక వ్యక్తి అల్లాహ్ మార్గంలో షహీద్ అయి, మళ్ళీ లేపబడి మళ్ళీ షహీద్ అయి, మళ్ళీ లేపబడి, మళ్ళీ షహీద్ అయినప్పటకీ ఒకవేళ అతనిపై ఏదైనా అప్పు ఉంటే, అది అతని వైపు నుండి చెల్లింపబడనంత వరకు అతను స్వర్గంలో ప్రవేశించలేడు”. (నసాయి ముజ్జబా 7/314. సహీహుల్ జామి: 3594)
అశ్రద వహించేవాళ్ళు ఇకనైనా దారికి రావాలి!!!
[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) అనే పుస్తకం నుండి తీసుకోబడింది]