ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.

ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.

అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహు వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.”  (5:49)

అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.

وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)
వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.

వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్)
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.

ఇదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:

وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ
(వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్)
 “ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)

ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.

అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముజ్జాలిమూన్)
అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.” (5:45)

ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్)
ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)

అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.

అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.

అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్‌కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.

మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్‌కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.

రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.

అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.

అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.

ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.

ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43352

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర – షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర
https://youtu.be/r_3VWYO4FHI [జుమా ఖుత్బా: 25 నిముషాలు]
షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ (హఫిజహుల్లాహ్), జామె అల్ గన్నామ్, జుల్ఫీ, సఊదియ
అనువాదం: షేఖ్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత, దానివల్ల విశ్వాసం ఎలా పెరుగుతుందో వివరించబడింది. ముఖ్యంగా, రెండవ ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవిత చరిత్రపై దృష్టి సారించబడింది. ఆయన ఇస్లాం స్వీకరణ, ఆయన ధైర్యం, ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు, ఆయన పరిపాలన, మరియు ఆయన అమరత్వం (షహాదత్) వంటి ముఖ్య ఘట్టాలను హదీసుల ఆధారాలతో వివరించారు. ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఖురాన్ ఆయతులు అవతరించిన సందర్భాలు, ఆయన జ్ఞానం, మరియు ఆయన నిరాడంబర జీవితం గురించి కూడా చర్చించబడింది. ఆయన జీవితం నుండి ముస్లింలు నేర్చుకోవలసిన పాఠాలను ఈ ప్రసంగం ఎత్తి చూపుతుంది.

యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో | టెక్స్ట్]

యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/dTlJikQ_EoE [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రవక్త యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర వివరించబడింది. ఆయన వంశం, ఆయన తండ్రి ఇస్ హాఖ్ (అలైహిస్సలాం) మరియు తాత ఇబ్రాహీం (అలైహిస్సలాం కూడా ప్రవక్తలేనని ప్రస్తావించబడింది. యాఖూబ్ (అలైహిస్సలాం) తన మామయ్య కుమార్తెలు లయ్యా మరియు రాహీల్ లను వివాహం చేసుకున్న వృత్తాంతం, ఆయనకు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆయన తన ప్రయాణంలో కన్న కల, దాని ఆధారంగా ఒక పుణ్యక్షేత్రం (బైతుల్ మఖ్దిస్) నిర్మిస్తానని మొక్కుకున్న సంఘటన, మరియు ఆ మొక్కును నెరవేర్చిన విధానం కూడా వివరించబడింది. చివరగా, ప్రవక్తలు వారి జాతి కోసమే పంపబడ్డారని, కేవలం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే యావత్ మానవాళి కోసం పంపబడ్డారని స్పష్టం చేయబడింది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్]
మరియు ప్రవక్తలలో శ్రేష్ఠుడు మరియు ప్రవక్తల నాయకునిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

نَبِيِّنَا مُحَمَّدٍ وَّ عَلَى آلِهِ وَ أَصْحَابِهِ أَجْمَعِيْنَ
[నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై మరియు వారి అనుచరులందరిపై శుభాలు కలుగుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహా ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించాడు, అయితే సంతానము తరఫున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే, చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటిచూపుకి ఆయన దూరమైపోయారు. ఎవరాయన అంటే, ఆయనే ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలాం వారు.

యాఖూబ్ అలైహిస్సలాం వారు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్ హాఖ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్ హాఖ్ అలైహిస్సలాం కూడా ప్రవక్త, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త కాబట్టి, నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను.

ఇక రండి, యాఖూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్ హాఖ్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాఖూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది.

రిబ్కాతో వివాహం జరిగిన తరువాత, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సంతానం కోసమో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈస్ (ఈసు అని కూడా చెబుతూ ఉంటారు), రెండవ కుమారుని పేరు యాఖూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఈస్ పెద్ద కుమారుడు, యాఖూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఈస్ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాఖూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. ఈస్ వారిని ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు, యాఖూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు, అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.

ఇకపోతే, ఆ పుట్టిన ఇద్దరు కుమారులు, ఈస్ మరియు యాఖూబ్, ఇద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాప్యానికి చేరుకున్నారు, ఆయన కంటిచూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తరువాత, వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగినప్పుడు, తల్లి రిబ్కా యాఖూబ్ వారిని పిలిచి, “చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో.” అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాఖూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు.

ప్రవక్తలు ఎందుకు వచ్చారు? [వీడియో | టెక్స్ట్]

ప్రవక్తల రాక ఉద్దేశ్యం
https://youtu.be/e0k8L0QdnRk [12 నిముషాలు]
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

ఈ ప్రసంగంలో, ప్రవక్తల పంపకం యొక్క ఉద్దేశ్యం, వారి పాత్ర మరియు సందేశం గురించి వివరించబడింది. అల్లాహ్ తన ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చేవారిగా మరియు హెచ్చరించే వారిగా పంపాడని, ఏకదైవారాధన వైపు ప్రజలను పిలవడానికి మరియు బహుదైవారాధన (షిర్క్) నుండి హెచ్చరించడానికి వారు వచ్చారని స్పష్టం చేయబడింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని, వారి మధ్య వచ్చిన ప్రవక్తలందరి ప్రాథమిక సందేశం ఒక్కటేనని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో వివరించబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ చేసిన ఈ ఏర్పాటును అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది.

అల్హందులిల్లాహ్. ఉసూలె సలాస, త్రిసూత్రాలు, 22వ పాఠం.

ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు,

وَأَرْسَلَ اللَّهُ جَمِيعَ الرُّسُلِ مُبَشِّرِينَ وَمُنذِرِينَ
(వ అర్సలల్లాహు జమీఅర్రుసుల్ ముబష్షిరీన వ మున్దిరీన్)
అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ కూడా శుభవార్త ఇచ్చే వారిగా మరియు హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

దలీల్ ఇప్పుడే ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము, కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గమనించండి. అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ చూపాడు! మనం మార్గభ్రష్టత్వంలో పడి ఉండకుండా, చనిపోయిన తర్వాత నరకంలో శిక్ష పొందకుండా, మన మేలు కొరకు అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపరను ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి షిర్క్ మొదలయ్యాక నూహ్ అలైహిస్సలాంని ఆ తర్వాత ఇంకా ఎందరో ప్రవక్తలని పంపుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పరంపరను అంతం చేశాడు.

అయితే ఆ ప్రవక్తలందరూ శుభవార్త ఇచ్చేవారు, హెచ్చరించేవారు. ఇక రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, శుభవార్త ఏంటి అది? ఎవరి కొరకు? మూడో విషయం, హెచ్చరిక ఏమిటి? ఎవరి కొరకు?

శుభవార్త ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్తను అనుసరిస్తారో, ఇక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, అలాంటి వారికి స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ యొక్క గొప్ప వరాలు, అనుగ్రహాల యొక్క శుభవార్త.

ఇక ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించరో, అల్లాహ్ తో పాటు వేరే వారిని భాగస్వామిగా కలుపుతారో, ఎవరైతే ప్రవక్తల్ని వారి వారి కాలాలలో అనుసరించలేదో, ఇప్పుడు ప్రళయం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో అలాంటి వారికి హెచ్చరిక. దేని గురించి? నరకం నుండి. ఇంకా వేరే భయంకరమైన శిక్షల నుండి.

అందుకొరకు ఈ పాఠంలోని ఈ మొదటి అంశం ద్వారా తెలిసేది ఏమిటంటే అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరిక చేసే వారిగా ఏదైతే పంపాడో మనం శుభవార్తను అందుకునే వారిలో చేరాలి.

ఇక ఈ మాటపై దలీల్ ఏమిటి? సూరతున్నిసా లోని ఈ ఆయత్.

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ
(రుసులమ్ ముబష్షిరీన వమున్దిరీన్)
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము (4:165)

అల్లాహు త’ఆలా ప్రవక్తలని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. ఎందుకు?

لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ
(లిఅల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతుమ్ బ’అదర్రుసుల్)
ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము) (4:165)

ప్రవక్తలను పంపిన తర్వాత ప్రజల వద్ద అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క సాకు మిగిలి ఉండకూడదు. వారి వద్ద ఏ ప్రమాణం మిగిలి ఉండకూడదు. అంటే ఏమిటి? రేపటి రోజు ప్రజలు వచ్చి ఎప్పుడైతే అల్లాహు త’ఆలా లెక్క తీసుకుంటాడో వారి మధ్యలో తీర్పు చేస్తాడో మరియు వారు వారి యొక్క షిర్క్, ఇంకా అవిధేయత కారణాల వల్ల ఏదైతే నరకంలో వెళ్తూ ఉంటారో, అప్పుడు వారు “ఓ అల్లాహ్! మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నావు? నీవైతే మా హితోపదేశానికి, మమ్మల్ని మార్గం చూపడానికి, సన్మార్గం వైపునకు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఏ ప్రవక్తను పంపలేదు కదా, ఏ గ్రంథాన్ని అవతరింపజేయలేదు కదా” ఇలాంటి ఏ మాట చెప్పడానికి అవకాశం మిగిలి ఉండకూడదు. అందుకే అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపేసి స్వయం అల్లాహ్ ఒక హుజ్జత్, ఒక నిదర్శనం, వారిపై ఒక ప్రమాణం అల్లాహు త’ఆలా చేశాడు. ఇక ఎవరైతే సన్మార్గంపై ఉండరో, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే పాటించరో, ప్రవక్తల్ని అనుసరించరో దాని కారణంగా నరకంలో వెళితే ఇది అల్లాహ్ ది ఎంత మాత్రం తప్పు కాదు. అల్లాహ్ విషయంలో ఎలాంటి అన్యాయం చేశాడు అన్నటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే అల్లాహ్ వైపు నుండి మనం మార్గదర్శకత్వం పొందే సాధనాలన్నీ కూడా అల్లాహ్ యే ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి. కానీ మనం ఒకవేళ సన్మార్గంపై రాకుంటే అది మన తప్పు అవుతుంది.

ఇక ఈనాటి పాఠంలో ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే షిర్క్ గురించి హెచ్చరిస్తూ వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. త్వరపడకండి. ఏదైనా ఆశ్చర్యం కలుగుతుందా? ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఆయన నబీ కూడా. మేము విన్నాము మరి ఇప్పుడు మొట్టమొదటి ప్రవక్త నూహ్ అని అంటున్నారు అలైహిస్సలాతో వసలామ్. అయితే ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త ఇది మాట కరెక్టే, ఇందులో అనుమానం లేదు. కానీ ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి షిర్క్ లేకుండినది. ప్రజలు బహుదైవారాధనలో పడలేదు, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. కాకపోతే కొన్ని వేరే తప్పులు ఉండినవి. కానీ షిర్క్ లాంటి పాపం నూహ్ అలైహిస్సలాం ఏ జాతిలో పుట్టారో, నూహ్ అలైహిస్సలాం పుట్టుక కంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ షిర్క్ ఎప్పుడైతే మొదలైనదో ఆ షిర్క్ ను ఖండించడానికి మళ్ళీ ప్రజలను ఏక దైవారాధన వైపునకు పిలవడానికి నూహ్ అలైహిస్సలాంను పంపడం జరిగింది. అందుకొరకే అవ్వలుర్రుసుల్, మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం అని ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా రుజువు అవుతుంది. ప్రవక్త హదీసుల్లో హదీసుష్షఫా’అ అని చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది.

ఇక ఖురాన్ ఆయత్, సూరతున్నిసాలో:

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ
(ఓ ముహమ్మద్‌!) మేము నూహ్‌ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).

అల్లాహు త’ఆలా ప్రవక్తల ప్రస్తావన కంటే ముందు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకొచ్చారు.

ఇక సోదర మహాశయులారా, నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అంతిమ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఖాతమున్నబియ్యీన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేమగా, గౌరవంగా మన ప్రవక్త అంటాము, అంటే వేరే ఎవరి ప్రవక్త కాదు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. సర్వ మానవాళి వైపునకు ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు ప్రతి దేశంలో ఉన్న వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి, ప్రవక్తగా చేసి పంపబడ్డారు.

అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ఖురాన్లో ఉంది.

وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ
(వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్)
అయితే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరకు అంతిమ ముద్ర. (33:40)

అలాగే అనేక సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: “లా నబియ్య బ’అదీ”, నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్తగా రాలేరు. మీరేదో ఆశ్చర్యపడుతున్నట్లు ఉన్నది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా! మరి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి కంటే ముందు వస్తారు కదా, ఆయన ప్రవక్త కదా! ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే ప్రళయానికి ముందు వస్తారో ప్రవక్త యొక్క హోదాలో రారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతీ, ప్రవక్త ధర్మాన్ని, షరీయత్ను అనుసరించే వారే కాదు ప్రజలందరినీ కూడా అనుసరించే రీతిలో పాలన చేసే వారు. అందరిపై షరీయతె ఇస్లామియా అమలు చేసే వారిగా వస్తారు.

ఇక ప్రవక్తలందరి ప్రస్తావన వచ్చింది కదా! అయితే వారందరినీ మొదటి ప్రవక్త నుండి మొదలుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఎంతమంది ప్రవక్తలొచ్చారో వారందరి రాక అసలైన ఉద్దేశం ఏమిటి?

يَأْمُرُهُمْ بِعِبَادَةِ اللَّهِ وَحْدَهُ
(య’మురుహుమ్ బి ఇబాదతిల్లాహి వహ్ దహ్)
కేవలం అల్లాహ్ నే ఆరాధించమని ఆయన వారిని ఆదేశిస్తారు

وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ
(వ యన్హాహుమ్ అన్ ఇబాదతిత్తాఘూత్)
మరియు త్రాగూత్ (మిథ్యా దైవాల) ఆరాధన నుండి వారిని వారించేవారు.

ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరెవరిని పూజించడం జరుగుతుందో, తాఘూత్ ల యొక్క ఇబాదత్ నుండి ఖండిస్తారు. ఇది ప్రవక్తల యొక్క రాక ముఖ్య ఉద్దేశం.

ఈ మాట, దీనికి ఆధారం సూరతున్నహ్ల్ ఆయత్ నంబర్ 36.

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలా)
ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను పంపాము (16:36)

ఆ ప్రవక్త తమ జాతి వారికి:

أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్)
అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించండి. త్రాగూత్ కు దూరంగా ఉండండి (16:36)

అని చాలా స్పష్టంగా చెప్పేవారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఏ అల్లాహ్ పుట్టించాడో, పోషిస్తున్నాడో, ఈ సర్వ లోకాన్ని నడిపిస్తున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడు.

ఈనాటి పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపాడు. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్టచివరి ప్రవక్త, ప్రవక్తల పరంపరకు అంతిమ మరియు ప్రవక్తలందరికీ ఒక ముద్ర లాంటి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

మరియు ప్రవక్తలందరూ కూడా తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశించేవారు. మిథ్యా దైవాలను, అల్లాహ్ తప్ప అందరి ఆరాధనలను, తాఘూత్ యొక్క పూజను వదులుకోవాలి అని స్పష్టంగా ఖండించేవారు.

తాఘూత్ అంటే ఏమిటి? దీని గురించి మరింత వివరంగా వచ్చే పాఠంలో తెలుసుకోబోతున్నాము. వచ్చే పాఠం వినడం మర్చిపోకండి, చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ ఆరాధనపై స్థిరత్వం ప్రసాదించుగాక. ఆమీన్.

واخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته
(వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్).

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41240

త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి
https://teluguislam.net/2023/04/19/u3mnj/

తాగూత్ (الطَّاغُوتِ) & దాని యొక్క రకాలు [వీడియో & టెక్స్ట్]

తాగూత్ & దాని యొక్క రకాలు
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
youtube.com/watch?v=rzm66iOZUwg [22 నిముషాలు]

ఈ పాఠంలో, వక్త ‘తాగూత్’ అనే విషయాన్ని వివరిస్తారు. అల్లాహ్‌ను కాకుండా ఆరాధించబడే ప్రతిదాన్ని ‘తాగూత్’ అంటారు. ప్రతి ఒక్కరూ తాగూత్‌ను తిరస్కరించి, అల్లాహ్‌ను మాత్రమే విశ్వసించాలని ఇస్లాం నిర్దేశిస్తుందని వక్త పేర్కొన్నారు. ఇమామ్ ఇబ్న్ అల్-ఖయ్యిమ్ నిర్వచనం ప్రకారం, ఆరాధన, విధేయత లేదా అనుసరణలో మానవుడు తన పరిధిని దాటడానికి కారణమయ్యేది తాగూత్. ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్-వహాబ్ ప్రకారం, ఐదు ప్రధాన తాగూత్‌లు ఉన్నాయి: 1. ఇబ్లీస్ (సైతాన్), 2. తన ఆరాధన పట్ల సంతోషించేవాడు, 3. తనను ఆరాధించమని ప్రజలను పిలిచేవాడు, 4. అగోచర జ్ఞానం ఉందని చెప్పుకునేవాడు, 5. అల్లాహ్ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా తీర్పు చెప్పేవాడు. చివరగా, “ధర్మానికి శిరస్సు ఇస్లాం, దాని స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం జిహాద్” అనే హదీస్‌తో వక్త పాఠాన్ని ముగించారు.

అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు [3] – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా  శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆ హష్ర్  మైదానంలో సమస్త మానవాళి సమావేశమైనప్పటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనం లెక్కల పత్రము, శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకుందాం.   

ఓ అల్లాహ్ దాసులారా! లెక్కల పత్రము మరియు శిక్ష లేక ప్రతిఫలం అనేవి సత్యం. ఖుర్ఆన్ మరియు హదీసు ద్వారా ఎన్నో ఆధారాలు మనకు లభిస్తాయి. మరియు సమస్త విశ్వాసులు ఈ విషయాన్ని ఏకీభవిస్తారు. దీని గురించి తెలియజేస్తూ అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

మొహర్రం నెల మరియు ఆషూరా ఉపవాసం గొప్పతనం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బహ్]     

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ అరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట. మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి. మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యమూ బిద్అత్ క్రిందికే వస్తుంది. మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! అల్లాహ్ దైవభీతి కలిగి ఉండండి మరియు ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి – అల్లాహ్ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. ఉదాహరణకు ఆయన కొన్ని సమయాలను ఎంచుకున్నాడు. వాటికి ఇతర సమయాల పై ప్రాధాన్యతను ఆధిక్యతను ప్రసాదించాడు, ఈ సమయాలలో మొహర్రం నెల కూడా ఉంది. ఇది ఎంతో ఉన్నతమైన నెల మరియు ఇది హిజ్రీ సంవత్సరం యొక్క మొదటి నెల అలాగే గౌరవప్రదమైన నెలలలో ఇది కూడా ఒకటి అల్లాహ్ దీని గురించి ఇలా సెలవిస్తున్నాడు:  

(إِنَّ عِدَّةَ الشُّهُورِ عِنْدَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ذَلِكَ الدِّينُ الْقَيِّمُ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنْفُسَكُمْ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవ ప్రదమైనవి.) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. 

(మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) అనగా ఈ గౌరవప్రదమైన నెలలలో అని అర్థం. ఎందుకంటే వీటిలో చెడు మరియు అవిధేయతల పాపం పెరుగుతుంది.  

(మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) ఈ వాక్యం యొక్క వివరణలో ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలియజేశారు:

అల్లాహ్ దౌర్జన్యాన్ని, అన్యాయాన్ని సంవత్సరపు పన్నెండు మాసాల్లోనూ నిషేధించాడు మరియు ముఖ్యంగా అందులో నాలుగు మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశాడు. ఎందుకంటే ఇందులో చేసేటువంటి పాపకార్యాలు మరియు అవిధేయత యొక్క పాపం పెరుగుతుంది. అదేవిధంగా సత్కార్యాలు, సదాచరణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది. 

అదేవిధంగా (మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) ఈ వాక్యం యొక్క వివరణలో ఖతాదా (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:

ఈ పవిత్రమైన మాసాలలో చేసేటువంటి దౌర్జన్యపు పాపం యొక్క తీవ్రత ఇతర నెలల్లో చేసేటువంటి పాపం యొక్క తీవ్రత కంటే అతి ఎక్కువగా ఉంటుంది.

ఇంకా ఇలా అన్నారు:

అల్లాహ్ తన సృష్టిలో నుండి కొందరిని ఎన్నుకున్నాడు. దైవదూతలలో కొందరిని దైవ సందేశారులుగా మరియు మానవులలో నుండి కొందరిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. అదేవిధంగా ఈ భూమండలంపై ఉన్న మస్జిద్ లలో నుండి కొన్నింటిని ఎన్నుకున్నాడు, మాసాలలోనుండి రమజాన్ మాసంతో పాటు నాలుగు గౌరవప్రదమైన నెలలను కూడా ఎన్నుకున్నాడు, రోజులలో నుండి శుక్రవారంను, రాత్రులలో లైలతుల్ ఖద్ర్ రాత్రిని ఎన్నుకున్నాడు. కాబట్టి అల్లాహ్ వేటినైతే గొప్పదిగా భావించాడో మనం కూడా తప్పక వాటిని గొప్పదిగా భావించాలి.  

అబూబకర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు:

“సంవత్సరం 12 నెలలు కలిగి ఉంది. వీటిలో నాలుగు నిషిద్ధ మాసాలు ఉన్నాయి వాటిలో నుండి మూడు ఒకదాని తరువాత మరొకటి వస్తాయి. అవి జిల్ ఖా, జిల్ హిజ్జా మరియు మొహర్రం కాగా నాలుగవది జమాదిస్సానీ మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే రజబ్ నెల” (బుఖారి, ముస్లిం) 

ముహర్రం మాసానికి ఈ పేరు ఎందుకంటే ఇది పవిత్రమైన మాసం, దాని పవిత్రత మరియు గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. 

రజబ్ ముజిర్ నెల అని పిలవడానికి గల కారణం ఏమిటంటే; ముజిర్ సంతతి వారు ఈ నెలను తన స్థానం నుంచి తరలించేవారు కాదు. కానీ కొందరు అరబ్బు తెగలవారు ఈ నిషిద్ధ మాసాలను వాటి సమయాల్లో కాకుండా వారికి అనుకూలంగా మార్చుకునే వారు “ఈ ప్రక్రియను అల్ నసీ అని పిలుస్తారు.” 

అల్లాహ్ తఆలా ఈ మాసాలకు ఎంతో ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని ప్రసాదించాడు.  కనుక మనం వీటిని గుర్తించి ఈ మాసాలలో వారించబడిన విషయాలకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఈ మాసాలలో యుద్ధాలు చేయడం నిషేధించబడింది మరియు పాపకార్యాలకు దూరంగా ఉండమని వారించబడింది.  

ఓ ముస్లిం లారా! మొహర్రం నెలలో అత్యధికంగా నఫీల్ ఉపవాసాలు పాటించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “రంజాన్ ఉపవాసాల తర్వాత అన్నింటికన్నా శ్రేష్టమైన ఉపవాసాలు అల్లాహ్ మాసము అయిన మొహర్రం నెల ఉపవాసాలు”. (ముస్లిం) 

ఓ విశ్వాసులారా! ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క రుబూబియత్ యొక్క రుజువు ఏమిటంటే ఆయన కొన్ని దినాలను ఎన్నుకున్నాడు, ఇందులో చేయబడేటువంటి ఆరాధనలకు ఇతర దినాలలో చేసే ఆరాధనలపై ప్రాధాన్యతను ప్రసాదించాడు అందులో నుండి ఆషూరా దినము (మొహర్రం నెల 10వ తారీకు) కూడా ఉంది. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం హిజ్రీ సంవత్సరం యొక్క 10వ రోజు, ఈరోజుకు గల గొప్పదనానికి ఒక ఆసక్తి కరమైన నేపథ్యం కూడా ఉంది, అదేమిటంటే  అల్లాహ్ తన ప్రవక్త అయినటువంటి మూసా అలైహిస్సలాం మరియు ఆయన సమాజానికి ముక్తి కలిగించి ఫిర్ఔన్ మరియు అతని జాతిని సముద్రంలో ముంచి వేశాడు.  ఈ కారణంగా మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ కు కృతజ్ఞతతో మొహర్రం నెల పదవ తారీకున ఉపవాసాన్ని పాటించేవారు ఆ తరువాత గ్రంథవహులు అనగా (యూదులు మరియు నస్రానీలు) కూడా ఈ ఉపవాసం పాటించేవారు. అలాగే అజ్ఞాన కాలపు అరబ్ జాతుల వారు కూడా ఉపవాసం పాటించేవారు వీరు గ్రంథవహులు కాదు విగ్రహారాధకులు. కాబట్టి ఖురేష్ జాతి వారు కూడా ఈ ఉపవాసాన్ని పాటించేవారు.

ఎప్పుడైతే మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు హిజ్రత్ చేసి మదీనా వచ్చారో అక్కడి యూదులను ఉపవాసం పాటించడం చూసి మీరెందుకు ఈ దినం నాడు ఉపవాసం పాటిస్తారు? అని ప్రశ్నించారు. వారు ఆయనతో ఈరోజు ఎంతో విశిష్టమైనది ఈ రోజే అల్లాహ్ మూసా ప్రవక్తకు మరియు ఆయన సహచరులకు ఫిరోన్ నుండి ముక్తిని ప్రసాదించాడు. అందుకే’ మూసా అలైహిస్సలాం అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు ఉపవాసం ఉండేవారు. అందుకే మేము కూడా ఈరోజు ఉపవాసం పాటిస్తున్నాము అని అన్నారు. ఇది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: మూసా అలైహిస్సలాం కు మీకన్నా మేము దగ్గర వాళ్ళము.” ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు స్వయంగా తాను కూడా ఈరోజు ఉపవాసం ఉండేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు.(బుఖారి, ముస్లిం) 

అంతేకాదు యూదులు ఆ రోజున తమ స్త్రీలకు ఆభరణాలు మరియు అందమైన దుస్తులు ధరింపజేసి వారిని అలంకరించేవారు. (ముస్లిం) 

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:
యూదులు మరియు నస్రానీలు ఆషూరా దినాన్ని గౌరవించేవారు“.(ముస్లిం) 

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేశారు:

అజ్ఞాన కాలంలో ఖురైషులు ఆషూరా దినం నాడు ఉపవాసం వుండేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఆ రోజు ఉపవాసం వుండేవారు. ఆ తరువాత ఆయన మదీనా కు విచ్చేసిన తర్వాత కూడా ఆ రోజు ఉపవాసం పాటించేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు. ఆ తర్వాత రమజాన్ మాసపు ఉపవాసాలు ఫర్జ్ అయ్యాయి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (ఆషూరా దినపు ఉపవాసం) నిర్ణయాన్ని ప్రజలపై వదిలేస్తూ ఇలా సెలవిచ్చారు: “మీలో ఇష్టమైవారు ఆ రోజు ఉపవాసం వుండవచ్చు ఇష్టంలేని వారు త్యజించ వచ్చు.” (బుఖారి, ముస్లిం) 

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేశారు: ఇదే రోజున ఖురైషులు కాబా గృహం మీద (ఘిలాఫ్) నల్లటి వస్త్రాన్ని ధరింప చేసేవారు. (బుఖారి) 

ఎప్పుడైతే అల్లాహ్ తఆలా రంజాన్ ఉపవాసాలను విధిగావించాడో అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: మీలో ఇష్టమైనవారు ఆ రోజు ఉపవాసం ఉండవచ్చు ఇష్టం లేనివారు త్యగించవచ్చు. అనగా ఈ ఆషూరా ఉపవాసం రంజాన్ ఉపవాసాల మాదిరిగా విధి కాదు. కేవలం ఇది అభిలాష నియమైనది.కాబట్టి ఉపవాసం పాటించిన వారు తప్పకుండా గొప్ప పుణ్యఫలాన్ని పొందుతారు.  

ఒక వ్యక్తి ప్రవక్త వారిని ఈ విధంగా ప్రశ్నించాడు. మీరు ఏ విధంగా ఉపవాసాలు పాటిస్తారు? అప్పుడు ప్రవక్త వారు ఇలా అన్నారు “ప్రతి నెలలో మూడు రోజులు మరియు రంజాన్ నెల ఉపవాసాలు ఇవి ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటంతో సమానం, అరఫా ఉపవాసం గురించి నాకు అల్లాహ్ పై నమ్మకం ఉంది. దీని ద్వారా గతించిన ఒక సంవత్సరం మరియు రాబోయే ఒక సంవత్సరం యొక్క పాప క్షమాపణ కలుగుతుంది. మరియు ఈ విషయంలో కూడా అల్లాహ్ పై నాకు నమ్మకం ఉంది. ఆషూరా ఉపవాసం వలన గతించిన ఒక సంవత్సరం యొక్క పాప క్షమాపణ కలుగుతుంది. (ముస్లిం) 

అయితే గతించిన ఒక సంవత్సరంలో మనిషి ద్వారా జరిగినటువంటి చిన్న చిన్న పాపాలను ఆ రోజు ఉపవాసం పాటించడం ద్వారా అల్లాహ్ క్షమిస్తాడు. ఇది అల్లాహ్  యొక్క అపారమైన కారుణ్యము, ఆయన ఒకరోజు ఉపవాసం ద్వారా ఒక సంవత్సరం యొక్క పాపాలను క్షమిస్తున్నాడు. ఇక పెద్ద పాపాల విషయానికొస్తే ఇది కేవలం స్వచ్ఛమైన పశ్చాత్తాపం ద్వారా మాత్రమే క్షమించబడతాయి, అల్లాహ్ ఎంతో గొప్పవాడు మరియు కరుణామయుడు. 

ఓ ముస్లిం లారా! ఆషూరా ఉపవాసం యొక్క ఔన్నత్యం ఏమిటంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ ఉపవాసం గురించి చాలా జాగ్రత్త వహించేవారు.  అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా తెలియజేశారు: నేను మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని, ఆషూరా ఉపవాసము మరియు రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు పాటించినంతగా ఇతర ఉపవాసాలు పాటించడాన్ని నేను చూడలేదు. (బుఖారి) 

సలఫె స్వాలిహీన్ యొక్క ఒక సమూహం దీని ఘనతను కోల్పోకుండా ఉండటానికి  ప్రయాణంలో కూడా అషురాలో ఉపవాసం ఉండేవారు.ఇబ్న్ రజబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇబ్నే అబ్బాస్, అబూ ఇస్ హాఖ్, జోహ్రీ, లాంటి సలఫ్ యొక్క ఒక జమాత్ ప్రయాణంలో కూడా ఆషూరా ఉపవాసాన్ని పాటించేవారు. 

జోహ్రీ ఇలా అనే వారు: రంజాన్ లో విడిచిపెట్టబడిన ఉపవాసాలు ఇతర దినాలలో (ఖజా) ద్వారా తిరిగి పాటించవచ్చు కానీ ఆషూరా పుణ్యఫలాన్ని విడిచిపెడితే మాత్రం దానిని (ఖజా) చేయడం కుదరదు. (బైహఖీ) 

ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) గారు ప్రయాణంలో కూడా ఆషూరా ఉపవాసం పాటించవచ్చు అనే విషయాన్ని స్పష్టపరిచారు. 

సహాబాలు తమ పిల్లలకు ఉపవాసాన్ని అలవాటు చేయడానికి గాను ఈ ఆషూరా ఉపవాసాన్ని పెట్టించేవారు. రబీ బిన్తె ముఅవ్విజ్ (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చుట్టుప్రక్కల నివసించే బస్తీలలో “ఆషూరా దినం నాడు ఉపవాసం వుండండి” అన్న సందేశాన్ని పంపించారు. ఈ మేరకు, స్వయంగా మేము కూడా ఆ రోజు ఉపవాసం వుండేవాళ్ళం మరియు మా చిన్న పిల్లల చేత కూడా ఉపవాసం పాటింపజేసేవాళ్ళం. ఒకవేళ పిల్లలు భోజనం కోసం అల్లరి చేస్తే మేము వారికి ఇఫ్తార్ సమయం వరకు కాలం వెళ్ళబుచ్చటానికి ఆటబొమ్మలను ఇచ్చి శాంతింపజేసేవాళ్ళం.(బుఖారి ముస్లిం)  

అల్లాహ్ దాసులారా! ఆషూరా ఉపవాసం యొక్క సున్నత్ విధానం ఏమిటంటే దానితోపాటు నెల 9వ తేదీన ఉపవాసం కూడా ఉండాలి. దీని ఆధారం హదీసులో ఇలా ఉంది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: ఒకవేళ నేను వచ్చే సంవత్సరం కూడా జీవించి ఉంటే’ నేను 10 వ తేదీతో పాటు 9వ తేదిన కూడా ఉపవాసం ఉంటాను, కానీ తదుపరి సంవత్సరం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు లేరు.(ముస్లిం) 

ఓ ప్రజలారా! 10వ తేదీతో పాటు 9వ తేదీ ఉపవాసం ఉండడానికి గల కారణం ఏమిటంటే ముస్లింలు యూదులకు వ్యతిరేకంగా వ్యవహరించమని ఆదేశించబడింది. యూదులు పదవ తేదీన ఉపవాసం పాటిస్తారు కావున ప్రవక్త వారు దీనిని ఇష్టపడలేదు కాబట్టి ఈ సారూప్యతను తొలగించడానికి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారు 10వ తేదీతో పాటు తొమ్మిదవ తేదీన ఉపవాసం ఉండమని మార్గ నిర్దేశం చేశారు. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకతలలో ఒకటి 

ఒకవేళ ఎవరైనా కేవలం పదవ తేదీన ఉపవాసం పాటించాలా? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, “అవును”  కానీ ఉత్తమం ఏమిటంటే 10వ తేదీతో పాటు దాని కంటే ఒకరోజు ముందు కూడా ఉపవాసం ఉండాలి. ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా వెలువడినటువంటి సాంప్రదాయము. 

అల్లాహ్ ఖుర్ఆన్  యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.    

స్తోత్రం మరియు దరూద్ తరువాత 

ఓ ముస్లిం లారా! అల్లాహ్ ఆలా తన గొప్ప వివేకంతో ఈ రాత్రి పగటిని తయారు చేశాడు. అదేమిటంటే సదాచరణ చేసేవారు ఎవరు? అని పరీక్షించడానికి. 

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: 

(وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِمَنْ أَرَادَ أَنْ يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورا

(ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది.) 

మరొకచోట ఇలా అంటున్నాడు:  

(الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا

(మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు.) 

అబూ బరజ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “తీర్పుదినం రోజున ఐదు విషయాల గురించి విచారించనంత వరకు మానవుని పాదాలు కదల లేవు. అతని వయస్సు ఎక్కడ ఖర్చు చేశాడు, జ్ఞానం గురించి విద్య నేర్చుకుని ఆచరించాడా లేదా, అతని ధనం గురించి దానిని ఎక్కడి నుంచి సంపాదించాడు మరియు ఎక్కడ ఖర్చు చేశాడు, మరియు అతని యవ్వనం గురించి దాన్ని ఎక్కడ ఖర్చు చేశాడు”. (తిర్మీజి) 

ఓ విశ్వాసులారా! ఈ రోజుల్లో మనం గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము కాబట్టి ఎవరైనా గత సంవత్సరం (తమ లెక్కల పత్రంలో) మనం ఏ సత్కార్యాన్ని నమోదు చేసామో ఎవరైనా నాకు చెప్పగలరా? మరియు కొత్త సంవత్సరంలో మేము ఏ చర్యలను స్వాగతించబోతున్నాం? సంవత్సరాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి, ఈ సంవత్సరం చూడండి, ఇలా గడిచిపోయింది. ఒక రోజు ఒక గంట గడిచిపోయినట్లుగా గడిచింది, కాబట్టి మన గురించి మనం పరిగణనలోకి తీసుకోవాలి, ఈ సంవత్సరంలో స్వర్గం పొందడం కొరకు మరియు నరకం నుండి ముక్తి పొందడానికి ఎం చేసుకున్నాము? అల్లాహ్ కు విధేయత చూపడంలో మనం ఎంత చురుకుదనం చూపించాం? గడిచిన పూర్తి సంవత్సరంలో ఎన్ని నఫీల్ నమాజులు చదివాము? ఎన్ని నఫీల్ ఉపవాసాలు పాటించాము? ఎన్ని దానధర్మాలు చేశాము? ఎంత సమయాన్ని అల్లాహ్ మార్గంలో గడిపాము? ఎన్నిసార్లు మొదటి సమయంలో మస్జిద్ కి వెళ్ళాము? ఎన్నిసార్లు మనల్ని మనం పాపాల నుండి కాపాడు కొన్నాము? అల్లాహ్ నిషేధించబడిన విషయాలను చూడటం నుండి మన కంటిని ఎంతవరకు రక్షించుకున్నాం? మన నాలుకను ఎంతవరకు అదుపులో ఉంచుకున్నాము?  మనం మన హృదయాలను కుళ్ళు కుతంత్రాల నుండి ఈర్షద్వేషాల నుండి పరిశుభ్రపరచుకున్నామా? మనం మన బంధుమిత్రులతో, ఇరుగుపొరుగుతో మన బంధుత్వాన్ని మెరుగుపరుచుకున్నామా? ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఎన్నిసార్లు పరదా గురించి బోధించాము? ఒకసారి ఆలోచించండి!  

మొదటిది: తనకు జీవితంలో మరో అవకాశం ఇచ్చినందుకు అల్లాహ్ కు ధన్యవాదాలు. 

రెండవది: మునుపటి నెల మరియు సంవత్సరం వెలుగులో స్వీయ పరిశీలన. 

మూడవది: మిగిలిన రోజులలో మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి. 

ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా అన్నారు:

మీ లెక్క తీసుకోబడక ముందే మీ లెక్క చూసుకోండి, మీకు మీరే మీ కర్మలను తూకం వేసుకోండి, దీని ద్వారా మీ లెక్క సులభతరం అవుతుంది, మరియు తీసుకోబోయేటువంటి ఆ పెద్ద లెక్క కొరకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఓ ముస్లింలారా! మృత్యువు జీవితాన్ని ఢీ కొట్టకముందే మీ పగలు మరియు రాత్రిని మంచి పనులతో నింపుకోండి. 

మరియు ఇది కూడా తెలుసుకోండి అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు. 

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما) 

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) 

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి ఆయన ఖలీఫాలు,తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.  

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.  

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి.ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.  

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.   

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గం లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.  మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము. మరియు  నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.  

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ న్యాయం గురించి, బందువుల హక్కులు నెరవేర్చడం గురించి అజ్ఞాపిస్తున్నాడు. అశ్లీలం దౌర్జన్యం నుండి ఆపుతున్నాడు. ఆయన మనకు హితోపదేసిస్తున్నాడు, కనుక మనం ఎల్ల వేళలా ఆయనను స్మరిస్తూ ఉండాలి, ఆయన ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపాలి. అల్లాహ్ స్మరణ అన్నిటి కంటే గొప్పది. అల్లాహ్ మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు. 

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/

అల్లాహ్ పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ పట్ల విశ్వాసం
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0Ud2-JK7Y7k [17 నిముషాలు]

ఈ ప్రసంగంలో, విశ్వాసంలోని ప్రాథమిక అంశాల గురించి వివరించబడింది. ముఖ్యంగా ‘అర్కానుల్ ఈమాన్’ (విశ్వాస మూలస్తంభాలు) లోని మొదటి అంశమైన అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి వివరంగా చర్చించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు జిబ్రీల్ అలైహిస్సలాం మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈమాన్ యొక్క ఆరు మూలస్తంభాలు వివరించబడ్డాయి: అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి చెడు విధిరాతను విశ్వసించడం. అల్లాహ్ అస్తిత్వం, ఆయన సర్వాధికారాలు (తౌహీద్ అర్-రుబూబియ్య), ఆరాధనలకు ఆయన ఒక్కడే అర్హుడు (తౌహీద్ అల్-ఉలూహియ్య), మరియు ఆయన పవిత్ర నామాలు, గుణగణాలు (తౌహీద్ అల్-అస్మా వస్సిఫాత్) అనే మూడు ముఖ్య విషయాలను తెలుసుకోవడం ద్వారా అల్లాహ్ పై సంపూర్ణ విశ్వాసం కలుగుతుందని బోధించబడింది. ఖురాన్ ఆయతుల ఆధారాలతో ఈ అంశాలు స్పష్టంగా వివరించబడ్డాయి.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి ముఖ్యాంశం, అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

చూడండి, దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో వచ్చి, “ఈమాన్ (విశ్వాసం) అంటే ఏమిటి? తెలుపండి” అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “ఈమాన్ (విశ్వాసం) అంటే అల్లాహ్ ను విశ్వసించాలి, దైవదూతలను విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించాలి, దైవ ప్రవక్తలను విశ్వసించాలి, పరలోక దినాన్ని విశ్వసించాలి, మంచి చెడు విధివ్రాతను విశ్వసించాలి.” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని చెప్పారు. దానికి దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు, “అవును, మీరు చెప్పింది నిజమే” అన్నారు.

రండి ఈరోజు మనము విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి విషయం, అల్లాహ్ పై విశ్వాసం గురించి తెలుసుకుందాం.

అల్లాహ్ ను విశ్వసించడం అంటే అల్లాహ్ ఉన్నాడు అని, అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు గొప్ప నామాలు, పేర్లు ఉన్నాయి అని విశ్వసించటం. దీని క్లుప్తమైన వివరణ ఇప్పుడు మీ ముందర ఉంచడం జరుగుతూ ఉంది.

అల్లాహ్ ఉన్నాడు అని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఇదే వాస్తవము కూడా. అల్లాహ్ ఉన్నాడు అని మనందరి ఆత్మ సాక్ష్యమిస్తుంది. సమస్యలు, బాధలు వచ్చినప్పుడు “దేవుడా” అని విన్నవించుకుంటుంది మన ఆత్మ. సృష్టిలో గొప్ప గొప్ప నిదర్శనాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉంచి ఉన్నాడు. ఆ నిదర్శనాలను చూసి, అల్లాహ్ ఉన్నాడు, సృష్టికర్త అయిన ప్రభువైన అల్లాహ్ ఉన్నాడు అని మనము గుర్తించాలి. ఉదాహరణకు, భూమి, ఆకాశాలు, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్రులు, ఇవన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినవి. అల్లాహ్ కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో, ఏ ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు అవ్వవు. వీటన్నింటినీ సృష్టించిన వాడు గొప్ప శక్తిమంతుడు, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మానవుల ద్వారా భూమి, ఆకాశాలను, సముద్రాలను, వీటిని పుట్టించడమో, సృష్టించటమో వీలుకాని పని. కాబట్టి, ఇది మానవులు సృష్టించిన సృష్టి కాదు, సృష్టికర్త, ప్రభువు అల్లాహ్ సృష్టించిన సృష్టి అని ఈ సృష్టిలో ఉన్న నిదర్శనాలు చూసి మనము అల్లాహ్ ఉన్నాడు అని గుర్తించాలి.

ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, ఒకవేళ సృష్టిలో ఉన్న నిదర్శనాలను చూసి మనము తెలుసుకోకపోయినా, మన శరీరంలో ఉన్న అవయవాలను బట్టి కూడా మనము మహాప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడని తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అవయవాలలో నుంచి ఏ ఒక్క అవయవము పాడైపోయినా, అలాంటి అవయవము ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో కూడా తయారు కాబడదు. మళ్ళీ అల్లాహ్ సృష్టించిన వేరే మనిషి శరీరం నుండి తీసుకుని మనము ఒకవేళ దాన్ని అతికించుకున్నా గానీ, అది అల్లాహ్ ఇచ్చిన అవయవం లాగా పని చేయదు. కాబట్టి మన శరీర అవయవాలే సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క గొప్పతనాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా మనము అల్లాహ్, సృష్టికర్త ఉన్నాడు అని మనం నమ్మాలి. ఇదే నిజమైన నమ్మకం.

చూడండి, ఖురాను గ్రంథం 52వ అధ్యాయం, 35వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ
(అమ్ ఖులిఖూ మిన్ ఘైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్)
ఏమిటి, వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా?” (52:35)

అంటే, ఎవరికి వారు స్వయంగా సృష్టించబడలేదు, వారిని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని ఆలోచింపజేస్తున్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అలాగే, ఖురాను గ్రంథం 51వ అధ్యాయం, 20 మరియు 21 వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
(వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మూఖినీన్)
నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి.” (51:20)

وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
(వఫీ అన్ఫుసికుమ్ అఫలా తుబ్సిరూన్)
స్వయంగా మీ ఆత్మల్లో (అస్తిత్వంలో) కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా?” (51:21)

చూశారా? మన శరీరంలోనే నిదర్శనాలు ఉన్నాయి. అవి చూసి అల్లాహ్ ను గుర్తుపట్టండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు. మొత్తానికి, సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడు. అదే విషయం మన ఆత్మ సాక్ష్యమిస్తుంది, అదే విషయం సృష్టిలో ఉన్న నిదర్శనాలు, సూచనలు మనకు సూచిస్తూ ఉన్నాయి.

ఇక, అల్లాహ్ ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మూడు విషయాలను బాగా అవగాహన చేసుకోవాలి. ఆ మూడు విషయాలు ఏమిటంటే:

మొదటి విషయం: అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టికర్త, వస్తువులన్నింటినీ ఆయనే సృష్టించాడు, అన్నింటికీ ఆయనే యజమాని, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయి అని విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ అర్-రుబూబియ్య అంటారు.

ఖురాను గ్రంథం 39వ అధ్యాయం, 62వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ
(అల్లాహు ఖాలిఖు కుల్లి షైఇన్)
అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే.”  (39:62)

జనన మరణాలను ప్రసాదించువాడు, ఉపాధి ప్రసాదించువాడు, లాభనష్టాలు కలిగించువాడు, సంతానము ప్రసాదించువాడు, వర్షాలు కురిపించువాడు, పంటలు పండించువాడు, సర్వాధికారాలు కలిగి ఉన్నవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనము తెలుసుకొని విశ్వసించాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గురించి తెలుసుకోవటానికి మరో రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని నమ్మాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ ఉలూహియ్య అంటారు.

ఆరాధనలు ప్రత్యక్షమైన ఆరాధనలు ఉన్నాయి, గుప్తమైన ఆరాధనలు ఉన్నాయి, చిన్న ఆరాధనలు ఉన్నాయి, పెద్ద ఆరాధనలు ఉన్నాయి. ఆరాధన ఏదైనా సరే, ప్రతి ఆరాధనకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని మనము తెలుసుకొని నమ్మాలి. ఆ తర్వాత ప్రతి చిన్న, పెద్ద, బహిరంగమైనది, గుప్తమైనది ఆరాధన ఏదైననూ అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆరాధనలకు అర్హుడు ఆయన ఒక్కడే కాబట్టి.

ప్రత్యక్ష ఆరాధనలు ఏవి? గుప్తమైన ఆరాధనలు ఏవి? అంటే నమాజు, ఉపవాసము, దుఆ, జంతుబలి, ఉమ్రా, హజ్, ఇవన్నీ ప్రత్యక్షంగా కంటికి కనిపించే ఆరాధనలు. గుప్తమైన ఆరాధనలు అంటే అల్లాహ్ పట్ల అభిమానం, అల్లాహ్ మీద నమ్మకం, అల్లాహ్ తో భయపడటం, ఇవి పైకి కనిపించని రహస్యంగా, గుప్తంగా ఉండే ఆరాధనలు. ఈ ఆరాధనలు అన్నీ కూడాను మనము కేవలం అల్లాహ్ కోసమే చేయాలి.

ఆరాధనల గురించి ఒక రెండు ముఖ్యమైన విషయాలు మీ ముందర ఉంచి నా మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిస్తాను. అసలు ఆరాధన ఎంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను, జిన్నాతులను ఈ ఆరాధన కోసమే సృష్టించాడు అని తెలియజేసి ఉన్నాడు.

ఖురాను గ్రంథం 51వ అధ్యాయము, 56వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియ’బుదూన్)
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.” (51:56)

చూశారా? మానవులు మరియు జిన్నాతులు అల్లాహ్ ను ఆరాధించటానికి సృష్టించబడ్డారు. మరి ఏ విషయం కోసం అయితే మానవులు సృష్టించబడ్డారో, అదే విషయాన్ని విస్మరిస్తే ఎలాగ? కాబట్టి ఆరాధన ముఖ్యమైన విషయం, మన పుట్టుక అందుకోసమే జరిగింది కాబట్టి, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉండాలి.

అలాగే, ప్రవక్తలు పంపించబడినది మరియు దైవ గ్రంథాలు అవతరింపజేయబడినది కూడా మానవులు అల్లాహ్ ను ఆరాధించటం కోసమే. మానవులు షైతాను వలలో చిక్కి, ఎప్పుడైతే అల్లాహ్ ను మరిచిపోయారో, అల్లాహ్ ను ఆరాధించటం మానేశారో, అల్లాహ్ ను వదిలి బహుదైవారాధన, మిథ్యా దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలను మళ్ళీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, అల్లాహ్ ను ఆరాధించే వారిలాగా చేయటానికి ప్రవక్తలను పంపించాడు, దైవ గ్రంథాలు అవతరింపజేశాడు.

చూడండి ఖురాను గ్రంథం 16వ అధ్యాయం, 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అని’బుదుల్లాహ వజ్తనిబుత్ తాఘూత్)

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. గా ఉండండి” అని బోధపరచాము.” (16:36)

చూశారా? ప్రవక్తలు వచ్చింది ఎందుకోసం అంటే అల్లాహ్ ఒక్కడే ఆరాధనలకు అర్హుడు, ఆయననే ఆరాధించండి, మిథ్యా దేవుళ్ళను ఆరాధించకండి అని చెప్పటానికే వచ్చారు. అందుకోసమే గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి. కాబట్టి ఆరాధన ముఖ్యమైనది. ఆరాధనలు మనము అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

ఇక, ఆరాధన స్వీకరించబడాలంటే రెండు ముఖ్యమైన షరతులు ఉంటాయండి. ఒక షరతు ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఆరాధనలు చేయాలి, దీనిని అరబీ భాషలో ఇఖ్లాస్ లిల్లాహ్ అంటారు. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారమే ఆరాధనలు చేయాలి. అరబీ భాషలో దీనిని ముతాబి’అతు సున్నతి రసూలిల్లాహ్ అంటారు. ఆరాధన స్వీకరించబడాలంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజము కాబట్టి, ప్రతి ఆరాధన అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించిన పద్ధతి ప్రకారము చేయాలి. అప్పుడే ఆ ఆరాధన స్వీకరించబడుతుంది.

ఇక, అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధిస్తే, అది బహుదైవారాధన అనిపించుకుంటుంది, దానిని అరబీ భాషలో షిర్క్ అంటారో. బహుదైవారాధన, షిర్క్, పెద్ద నేరము, క్షమించరాని నేరము. ఎట్టి పరిస్థితిలో ఆ నేరానికి పాల్పడకూడదు అని తెలియజేయడం జరిగింది.

ఇక, అల్లాహ్ ను తెలుసుకోవటానికి మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ కు పవిత్రమైన నామాలు, పేర్లు ఉన్నాయి, వాటిని ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ అంటారు. ఈ పేర్లలో అల్లాహ్ యొక్క గుణాలు తెలియజేయడం జరిగి ఉంది. కాబట్టి అందులో ఎలాంటి వక్రీకరణ చేయకుండా, మన ఇష్టానుసారంగా అర్థాలు తేకుండా, ఏ విధంగా అయితే అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారో, ఆ ప్రకారము ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి.

ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రహ్మాన్, రహీమ్ అని పేర్లు ఉన్నాయి. రహ్మాన్, రహీమ్ అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అని. అలాగే అల్లాహ్ కు సమీ’, బసీర్ అనే పేర్లు ఉన్నాయి. సమీ’ అంటే వినేవాడు, బసీర్ అంటే చూసేవాడు అని అర్థం. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రజ్జాఖ్, గఫూర్ అని పేర్లు ఉన్నాయి. రజ్జాఖ్ అంటే ఉపాధి ప్రదాత, గఫూర్ అంటే మన్నించేవాడు, క్షమించేవాడు. ఆ ప్రకారంగా, అల్లాహ్ యొక్క గుణాలను, అల్లాహ్ యొక్క లక్షణాలను తెలిపే చాలా పేర్లు ఉన్నాయి. అవి ఉన్నది ఉన్నట్టుగానే మనము విశ్వసించాలి.

ఇక, ఈ అల్లాహ్ యొక్క నామాల ద్వారా మనము అల్లాహ్ తో దుఆ చేస్తే, ఆ దుఆ తొందరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది.

ఖురాను గ్రంథం 7వ అధ్యాయం, 180 వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా)
అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి.” (7:180)

అల్లాహ్ కు ఉన్న పేర్లతో ఆయన్నే పిలవండి అని అల్లాహ్ చెప్పాడు కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు, ఉదాహరణకు మనతో పాపము దొర్లింది, మన్నించమని మనం అల్లాహ్ తో వేడుకుంటున్నామంటే, “ఓ పాపాలను మన్నించే ప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, యా గఫూర్, ఓ పాపాలను మన్నించే ప్రభువా, ఓ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, నీవు గఫూర్, పాపాలను మన్నించేవాడివి, నన్ను మన్నించు” అని వేడుకోవాలి. అలా వేడుకుంటే చూడండి, ప్రార్థనలో ఎంత విశిష్టత వస్తూ ఉందో చూశారా? ఆ ప్రకారంగా మనము వేడుకోవాలి.

ఇవి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను పూర్తిగా విశ్వసించటానికి ఈ మూడు ముఖ్యమైన విషయాలు. అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు పేర్లు ఉన్నాయి అని, ఈ మూడు విషయాలను మనం అవగాహన చేసుకుంటే అల్లాహ్ మీద మనకు సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది.

ఈ మూడింటిలో నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము, మిగతా రెండు విషయాలని మనము వదిలేశాము అంటే అప్పుడు మన విశ్వాసము అల్లాహ్ మీద సంపూర్ణము కాజాలదు. ఉదాహరణకు, మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించే సమయానికి అల్లాహ్ గురించి తెలుసుకొని ఉన్నారు. ఒక విషయం మాత్రమే తెలుసుకున్నారు: సృష్టి మొత్తానికి అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయని ఆ ఒక్క విషయాన్ని మాత్రమే వారు తెలుసుకున్నారు. కానీ ఆరాధనల విషయంలో మాత్రం వారు తప్పు చేసేవారు, విగ్రహాలను ఆరాధించేవారు. అల్లాహ్ కు గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయన్న విషయాన్ని వారు విశ్వసించే వారు కాదు. కాబట్టి వారి విశ్వాసము అసంపూర్ణము అని చెప్పబడింది, వారు విశ్వాసులు కారు అని చెప్పబడింది. కాబట్టి, అల్లాహ్ మీద మన విశ్వాసము పూర్తి అవ్వాలంటే, అల్లాహ్ గురించి ఈ మూడు విషయాల అవగాహన చేసుకుని మనము నమ్మాలి, ఆచరించాలి.

అల్లాహ్ మీద విశ్వాసం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తెలుసుకొని విశ్వసిస్తాడో అతనిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదుకుంటాడు, సహకరిస్తాడు, అతని కోరికలు తీరుస్తాడు, సమస్యలు పరిష్కరిస్తాడు. అలాగే, అల్లాహ్ ను విశ్వసించిన వ్యక్తి మంచి జీవితం గడుపుతాడు. మార్గభ్రష్టత్వానికి గురి అయ్యి పశువుల్లాగా, చాలామంది చేస్తున్న చేష్టలకు దూరంగా ఉంటాడు. అలాగే మనిషి అల్లాహ్ ను విశ్వసించటము ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ప్రసన్నత పొందుతాడు.

ఇవి అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి మనము తెలుసుకొనవలసిన ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30628


అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ:
https://teluguislam.net/allah/

మక్కా విశిష్టత [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మక్కా విశిష్టత (Importance of Makkah)
https://youtu.be/TLNWmdSKxEk [43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, మక్కా నగరం యొక్క ఇస్లామీయ ప్రాముఖ్యత, ఘనత మరియు పవిత్రత గురించి వివరించబడింది. అల్లాహ్ తన సృష్టిలో కొన్ని ప్రదేశాలకు, కాలాలకు మరియు వ్యక్తులకు ఇతరులపై ఘనతను ప్రసాదించాడని, ఇది ఆయన సంపూర్ణ వివేకం మరియు శక్తికి నిదర్శనమని ప్రసంగం మొదలవుతుంది. మక్కా అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశమని, అది మానవాళి కోసం నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధన గృహం (కాబా) ఉన్న నగరమని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం చరిత్ర, ఆయన తన భార్య హాజర్ మరియు కుమారుడు ఇస్మాయిల్ ను ఆ నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళడం, జమ్ జమ్ బావి ఆవిర్భావం మరియు మక్కా నగరం ఎలా ఏర్పడిందో వివరించబడింది. మక్కా యొక్క పవిత్రత (హరమ్), అక్కడ వర్తించే ప్రత్యేక నియమాలు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో దానికున్న ప్రాముఖ్యత కూడా చర్చించబడ్డాయి. చివరగా, కాబా మరియు హజర్ అల్-అస్వద్ (నల్లరాయి) గురించి ఉన్న కొన్ని అపోహలను తొలగించి, వాటి వాస్తవ ఇస్లామీయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగం ముగుస్తుంది.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا

నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు.  (3:96-97)

సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా మనందరి ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయనే మనందరి ఏకైక, ఏ భాగస్వామి లేని నిజమైన ఆరాధ్యుడు. ఆ తర్వాత, లెక్కలేనన్ని సలాత్ సలాం, కరుణలు, శాంతులు ప్రత్యేకంగా చిట్టచివరి ప్రవక్త, దయామయ మహనీయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఇతర ప్రవక్తలందరిపై కురియు గాక.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహు త’ఆలా సర్వ సృష్టికర్త, సర్వ అధికారుడు, ఎలాంటి ఏ భాగస్వామి లేనివాడు. ఆయన కోరినది సృష్టిస్తాడు మరియు తన సృష్టిలో ఎవరికి ఏ హోదా, అంతస్తు, ఎవరికి ఎలాంటి ప్రత్యేకత ఇవ్వాలో ఇస్తాడు. అందులో అతన్ని అడిగేవారు ఎవరూ లేరు.

لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ
ఆయన తన చేష్టలకు ఎవరికీ జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు, కాని వారే (మానవులే) జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. (21:23)

అల్లాహ్ చేసిన దానిలో అల్లాహ్ ను ప్రశ్నించేవాడు ఎవడూ లేడు.

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ
నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.  (28:68)

అల్లాహు త’ఆలా కోరినది సృష్టిస్తాడు, యఖ్తార్, ఎన్నుకుంటాడు. అల్లాహు త’ఆలా ఈ విధంగా తన సృష్టిలో ఎన్నుకోవడంలో అద్వితీయుడు, అతనికి ఏ భాగస్వామి లేడు. అతడు ఒకరితో ఏదైనా సలహా, సంప్రదింపులు చేసి, వారి కోరికలను అనుసరించడానికి ఏదైనా లొంగిపోయి ఉంటాడు, న’ఊదు బిల్లాహ్, ఇలాంటి ప్రసక్తి ఏ మాత్రం లేదు. అయితే ఇలా అల్లాహు త’ఆలా అద్వితీయుడు కావడం, ఎన్నుకునే విషయంలో ఇది అతని యొక్క, అతని యొక్క రుబూబియ్యత్, ఆ అల్లాహ్ యొక్క సంపూర్ణ వివేకం మరియు అతడే సర్వశక్తిమంతుడు అన్నదానికి గొప్ప నిదర్శనం.

అయితే అల్లాహు త’ఆలా కొందరి ప్రజలను మరికొందరిపై, కొందరు ప్రవక్తలను మరికొందరి ప్రవక్తలపై, కొన్ని ప్రాంతాలను మరికొన్ని ప్రాంతాలపై, కొన్ని నెలలను మరికొన్ని నెలలపై, కొన్ని రోజులను మరికొన్ని రోజుల పై, కొన్ని రాత్రులను మరికొన్ని రాత్రులపై, కొన్ని సత్కార్యాలను మరికొన్ని సత్కార్యాలపై ఘనత ప్రసాదించాడు. సర్వ సృష్టిలో, అంటే అల్లాహ్ తప్ప సర్వమూ వాటిలన్నింటిలోకెల్లా, వాటన్నిటిలోకెల్లా అత్యుత్తములు, అతి గొప్పవారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వాసాల్లో, సత్కార్యాల్లో, అన్ని విషయాల్లో అతి గొప్ప ఘనత గలది తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ మాత్రమే ఏ భాగస్వామి లేకుండా ఆరాధ్యనీయుడు అని నమ్మడం, విశ్వసించడం, అలా ఆచరించడం.

ఇస్లామీయ 12 నెలల్లో రమదాన్ మాసానికి చాలా గొప్ప ఘనత ఉంది. రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ కి చాలా గొప్ప ఘనత ఉంది. మరియు రోజుల్లో, పగల్లో యౌమున్నహర్, ఖుర్బానీ చేసేటటువంటి రోజు, ఈదుల్ అద్ హా అది చాలా గొప్ప ఘనత గల రోజు. అయితే ప్రదేశాల్లో, ప్రాంతాల్లో అల్లాహ్ కు అత్యుత్తమ, అతి ప్రియమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే, మొట్టమొదటి స్థానంలో అది మక్కతుల్ ముకర్రమా.

మక్కతుల్ ముకర్రమా గురించి ఈ రోజు నేను జియోగ్రాఫికల్ పరంగా నేను మాట్లాడను. మక్కాకు అల్లాహు త’ఆలా ఈ రకంగా కూడా ఏ ఘనతలు ప్రసాదించి ఉన్నాడో దాని యొక్క వివరణలోకి వెళ్ళను. కానీ అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశం ఇది అని మనకు అంటే మక్కా అని ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు?

వల్లాహి, ఇన్నకి లఖైరు అర్దిల్లాహ్, వ అహబ్బు అర్దిల్లాహి ఇలల్లాహ్.
అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఓ మక్కా, నీవు అల్లాహ్ భూమిలో అత్యంత ఖైర్, మేలు, శుభం ఉంది నీలో మరియు అల్లాహ్ కు, అల్లాహ్ యొక్క ఈ భూమిలో అత్యంత ప్రియమైన ప్రదేశం నీవు.

వలవ్ లా అన్నీ ఉఖ్రిజ్తు మిన్కి మా ఖరజ్తు.
నన్ను ఈ మక్కా నుండి వెలివేయడం జరిగింది, లేదా అంటే నేను మక్కా నుండి వెళ్లి మదీనాలో స్థావరం అక్కడ వలస చేసి అక్కడ ఉండటం అలా చేసేవాడిని కాదు.

అల్లాహు త’ఆలా ఈ మక్కా నగరం, దీని యొక్క ప్రమాణాలు చేసి ఉన్నాడు, లా ఉక్సిము బిహాదల్ బలద్ అని.

అల్లాహు త’ఆలా ఈ సర్వ భూమండలంపై తన ఆరాధనా కేంద్రంగా నిర్మించడానికి ఆదేశం ఇచ్చినటువంటి ఆ ప్రదేశం మక్కాలో ఉంది. ఆ ఆయతులే నేను ఆరంభంలో చదివాను, సూరత్ ఆలి ఇమ్రాన్, సూర నెంబర్ 3, ఆయత్ నెంబర్ 95.

إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ

నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. (3:96)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అబూ దర్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రశ్నించారు, అయ్యు మస్జిదిన్ వుది’అ ఫిల్ అర్ది అవ్వల్. ప్రప్రథమంగా ఈ భూమండలంపై నిర్మించబడినటువంటి మస్జిద్ ఏ మస్జిద్ అని అడిగినప్పుడు, అల్ మస్జిదుల్ హరాం. కాబతుల్లాహ్, దాని చుట్టూ ఉన్నటువంటి మస్జిద్-ఎ-హరాం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీస్.

సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం కంటే ముందు ఎందరో ప్రవక్తలు ఈ ప్రపంచంలో వచ్చారు. ఆదం అలైహిస్సలాం ఆది మానవులతో పాటు ప్రవక్త కూడా. ఆదం అలైహిస్సలాం తర్వాత ఇద్రీస్, షీత్ అలైహిస్సలాం లాంటి ప్రవక్తలు కూడా వచ్చారు. కానీ షిర్క్ ను ఖండిస్తూ, తౌహీద్ ను ధ్రువపరుస్తూ, తౌహీద్ వైపునకు ప్రజలను ఆహ్వానించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ తర్వాత హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం ఎందరో వచ్చారు. మనకు కొన్ని ఉల్లేఖనాల ద్వారా వారు కూడా హజ్ చేశారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన తూఫాన్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే కాబతుల్లాహ్ ఉన్నదో దాని చుట్టుపక్కల ఆ మక్కా నగరం, ఆ కాబతుల్లాహ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలు, ఆ పర్వతాలు ఉండినవి కానీ కాలాల తరబడి ఎవరూ కూడా అక్కడ వచ్చి నివసించేవారు కాదు.

అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతని యొక్క పనులలో ఎలాంటి హిక్మత్, ఔచిత్యాలు ఉంటాయో, ఎలాంటి వివేకాలు ఉంటాయో అన్నీ మనము గ్రహించలేము. కేవలం అల్లాహు త’ఆలా తన దయ కరుణతో తెలిపిన కొన్ని విషయాలు తప్ప.

అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం మొదటి భార్య సారాతో ఏ సంతానము కలగలేదు. ఆ తర్వాత రెండో భార్య హాజర్ తో అల్లాహు త’ఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం లాంటి ఒక సుపుత్రున్ని ప్రసాదిస్తాడు. ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉంటాడు. అప్పుడు అల్లాహ్ యొక్క అనుమతితో ఇబ్రాహీం అలైహిస్సలాం పాలు త్రాగే బాలుడైన ఇస్మాయిల్ మరియు అతని యొక్క తల్లి హాజర్ ఇద్దరినీ ఈ ప్రాంతానికి తీసుకువచ్చి వదిలేస్తారు. అదే విషయాన్ని స్వయంగా ఖురాన్ లో తెలిపాడు. స్వయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తూ అంటున్నారు, ఇంద బైతికల్ ముహర్రమ్. ఓ ప్రభువా, నేను నా యొక్క భార్య మరియు కుమారున్ని ఇక్కడికి తీసుకువచ్చి వదిలాను. ఎక్కడ? గైరి జీ జర్’ఇన్. అక్కడ ఎలాంటి ఒక చెట్టు లేదు, ఒక మొక్క లేదు. మరియు అక్కడ నీటి యొక్క సౌకర్యం కూడా లేదు. కానీ అల్లాహు త’ఆలా చూడడానికి ఇలాంటి ఈ పరీక్ష పెట్టినా, ఇక ముందుకు ఇక్కడ ఈ నగరాన్ని ప్రజలు వచ్చి నివసించడానికి సౌలభ్యంగా ఉండడానికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏర్పాటు చేశాడు.

ఇక్కడ సహీ బుఖారీలో ఆ వివరణ ఏదైతే వచ్చి ఉందో, ఖురాన్ యొక్క తఫ్సీర్ మరియు సహీ బుఖారీలో వచ్చిన హదీసులు, వాస్తవంగా పూర్తి మనం వినాలి. అందులో తండ్రికి, భార్యకు, భర్తకు ప్రతి ఒక్కరికి మన సమాజంలోని ప్రతి ఒక్కరికి ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. గమనించండి. ఆ గుణపాఠాల గురించి ఇప్పుడు నేను వివరాలు ఇవ్వలేను ఎందుకంటే నా అంశం ఫద్లు మక్కా, మక్కా విశిష్టత ఉంది. కానీ అక్కడ చిన్న విషయం ఒకటి ఏం తెలియజేస్తున్నానంటే, హాజర్ అలైహస్సలాం తన కుమారుడు పాలు త్రాగే వాడు, ఏమైనా ఎదిగినటువంటి బాలుడు కాదు. తీసుకొని ఆ ప్రదేశంలో ఉండి ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇబ్రాహీం, ఎవరి ఆధారంగా మమ్మల్ని వదిలి వెళ్తున్నావు అని అంటే, అల్లాహ్ వైపున చూపిస్తే, ఆ తల్లి హాజర్ ఎంత గొప్ప మాట అంటుంది, ఎంతటి గొప్ప విశ్వాసం, అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం, ఎలాంటి ప్రగాఢమైన బలమైన విశ్వాసమో గమనించండి. “అలాంటప్పుడు అల్లాహు త’ఆలా మమ్మల్ని వృధా చేయడు.” అక్కడి నుండి మొదలవుతుంది మక్కా నగరం. ఆ తర్వాత జుర్హుమ్ వంశానికి సంబంధించిన వారు వస్తారు.

అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే మక్కాలో జన్మించారు. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ రావడం ప్రారంభమైంది. సుమారు 53 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జీవించారు. ప్రవక్త పదవి పొందడానికి 40 సంవత్సరాలు ముందు, ప్రవక్త పదవి పొందిన తర్వాత 13 సంవత్సరాలు. అక్కడే అనేక మంది గొప్ప సహాబాలు వచ్చారు. ఆ సహాబాల యొక్క ప్రస్తావన ముహాజిరీన్ అని, వస్సాబిఖూనల్ అవ్వలూన్ అని అల్లాహు త’ఆలా సూరతు తౌబాలో కూడా వారిని ప్రశంసిస్తూ ప్రస్తావించాడు.

అల్లాహు త’ఆలా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా నుండే బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి మళ్ళీ ఆకాశాల వైపునకు, గగన ప్రయాణం, ఇస్రా వ మి’రాజ్ జరిగినది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నగరాన్ని చాలా ప్రేమించేవారు. బుఖారీ, ముస్లిం యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత అక్కడ వారి యొక్క సహాబాలు, వారి యొక్క ఆరోగ్యాలు కొంచెం అనారోగ్యానికి గురి అవ్వడం, అక్కడి యొక్క వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం, ఆ సందర్భంలో ప్రవక్త దుఆ ఏం చేశారు? అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ మదీనత కమా హబ్బబ్త మక్కత అవ్ అషద్ద్. ఓ అల్లాహ్, మక్కా పట్ల ఎలాంటి ప్రేమ మాకు నీవు కలుగజేశావో, అలాంటిది అంతకంటే ఎక్కువ ప్రేమ నీవు మాకు మదీన విషయంలో కూడా… సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనం మక్కా గురించి తెలుసుకుంటున్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రేమించేవారని.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు ఈ మక్కా నగరం గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆలను గమనించండి, మక్కా యొక్క విశిష్టతను మీరు గ్రహించండి. ఒక దుఆ చేశారు, సూరత్ ఇబ్రాహీం 37,

فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ
ఫజ్’అల్ అఫ్’ఇదతమ్ మినన్నాసి తహ్వీ ఇలైహిమ్.
కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి (14:37)

ఓ అల్లాహ్, ప్రజల యొక్క హృదయాలు, ప్రజల యొక్క హృదయాలు ఈ మక్కా వైపునకు తిరిగి రావాలి. మక్కా యొక్క ప్రేమ వారి హృదయాల్లో నాటుకోవాలి. అలాంటి భాగ్యం నీవు కలుగజేయి.

అంతేకాదు, సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 126 లో తెలుస్తుంది, ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు,

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا
రబ్బిజ్’అల్ హాదా బలదన్ ఆమినా.
నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి.  (2:126)

ఓ మా ప్రభువా, ఈ మక్కా నగరాన్ని నీవు అమ్న్ ఓ అమాన్, శాంతి నిలయంగా చేయు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా దానిని ఎలా శాంతి నిలయంగా చేశాడో గమనించండి.

సూరత్ అన్ కబూత్ ఆయత్ నెంబర్ 67 లో చెప్పాడు,

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. (29:67)

వారు గమనించడం లేదా? మేము హరమ్ ని ఎంత శాంతి నిలయంగా చేశాము, ఎంత ప్రశాంతతమయిన ప్రదేశంగా చేశాము, ఈ మక్కా చుట్టుపక్కల ఉన్నవారు దొంగతనాలు, దోపిడీలు, లూటీలు ఇంకా కిడ్నాప్ లు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మక్కా వారు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ సూరత్ అన్ కబూత్ లో ఉన్నటువంటి ఆయత్ మీరు ఒకవేళ వినకుంటే, చిన్న సూరా మీకు కూడా గుర్తు ఉంది కదా,

لِإِيلَافِ قُرَيْشٍ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. (106:1-4)

చుట్టుపక్కన మక్కా నగరానికి చుట్టుపక్కన ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనలో జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ మక్కాలో ఉండే వారు, అల్లాహు త’ఆలా వారికి ఎంతటి గొప్ప ప్రశాంతత, అమ్న్ ఓ అమాన్ ప్రసాదించాడు. ఇమాం ఖుర్తుబి రహిమహుల్లాహ్ తమ తఫ్సీర్ లో తెలియజేశారు, ఇన్న మక్కత లమ్ తజల్ హరమన్ ఆమినన్ మినల్ జబాబిరతి వ మినజ్ జలాజిల్. అల్లాహు త’ఆలా మక్కాను చాలా కాపాడాడు. అక్కడ ఎంతటి గొప్ప శాంతి ప్రసాదించాడంటే ఇంతటి వరకు, ఇప్పటి వరకు ఏ దుర్జన్యపరుడైన రాజు వశపరచుకోలేకపోయాడు మరియు అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి భూకంపాలు కూడా రాలేదు.

అల్లాహు త’ఆలా సూరత్ ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 97 లో ఈ ఆయత్ ఏదైతే స్టార్టింగ్ లో తిలావత్ చేయబడిందో, అక్కడ ఈ అమ్న్ ఓ అమాన్, ప్రశాంతత, శాంతి గురించి ఎంత గొప్ప విషయం చెప్పాడు, వమన్ దఖలహు కాన ఆమినా. ఎవరైతే ఈ మక్కా నగరం, మస్జిదుల్ హరాం, ఇందులో ప్రవేశిస్తాడో అతనికి శాంతియే శాంతి ఉంది.

కనుక చూడండి, అల్లాహు త’ఆలా ఇక్కడ ఈ మక్కా నగరానికి ఇంతటి గౌరవం ఏదైతే ప్రసాదించాడో అది ఎప్పటి నుండి? ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి కాదండి. ఎప్పటి నుండి? అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించాడో అప్పటి నుండి. సహీ బుఖారీ లోని హదీస్, ఇన్నల్లాహ హర్రమ మక్కత యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. ఫహియ హరామున్ బి హురామిల్లాహి ఇలా యౌమిల్ ఖియామా. అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించినప్పటి నుండి మక్కాకు ఒక ప్రత్యేక గౌరవం ప్రసాదించాడు. అల్లాహు త’ఆలా ఈ గౌరవాన్ని ప్రళయ దినం నాటికి ఉంచుతానని కూడా వాగ్దానం చేసి ఉన్నాడు.

అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ఏ కొన్ని క్షణాల గురించి అయితే అనుమతి ఇవ్వడం జరిగిందో, ఆ విషయాన్ని కూడా మనం గమనించామంటే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇక్కడ ఏ రక్తపాతం గురించి అనుమతి లేకుండినది, ప్రళయం వరకు కూడా లేదు అని.

అంతేకాదు సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం దాని చుట్టుపక్క ప్రాంతాలకు ఎన్నో కిలోమీటర్ల వరకు ప్రశాంతత ఉండాలని అల్లాహు త’ఆలా తో దుఆ ఏదైతే చేశారో, సహీ బుఖారీ, సహీ ముస్లిం లో వచ్చి ఉంది, ఇన్న ఇబ్రాహీమ హర్రమ మక్కా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడి ప్రశాంతత గురించి ఇచ్చిన బోధనల్లో, సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన ఈ హదీస్ కూడా చాలా ప్రాముఖ్యత గలది. లా యహిల్లూ లిమ్ రి’ఇన్ యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అన్ యస్ఫిక బిహా దమా. అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ వ్యక్తి కూడా అక్కడ రక్తం ప్రవహింప చేయడు, రక్తపాతానికి ఒడిగట్టడు. అంతేకాదు, సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ను గమనించండి, లా యహిల్లూ లి అహదికుమ్ అన్ యహ్మిల బి మక్కత అస్సిలాహ్. మీరు మక్కాలో నడుస్తున్నప్పుడు ఎలాంటి ఆయుధాలు ధరించి అక్కడ నడవడం ఇది సమంజసం కాదు.

అంతేకాదండి, అల్లాహు అక్బర్, మక్కాకు అల్లాహు త’ఆలా ప్రసాదించినటువంటి విశిష్టత కేవలం మానవులకే కాదు, అక్కడి యొక్క ఆ ప్రాంతానికి, అక్కడ వచ్చే, తిరిగే అటువంటి పక్షులకు, అక్కడ పెరిగే అటువంటి వృక్షాలకు, ఇంకా ఎవరి నుండి ఏదైనా వస్తువు తప్పిపోయి పడిపోతే దానికి కూడా ఎంతటి మర్యాద అనండి, గౌరవం అనండి, ఎంతటి రెస్పెక్ట్ ఉందో మనకు సహీ హదీసుల్లో తెలుస్తుంది.

సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అక్కడి వృక్షాలను నరికేయరాదు. అక్కడ వేట, షికారీ చేయరాదు. మరియు ఎవరికైనా ఏదైనా పడిపోయిన వస్తువు దొరికినా, దానిని అతను ఎత్తుకోకూడదు. ఎవరైనా దాన్ని తీసుకున్నాడంటే, సంవత్సరం అయినా గానీ తన వద్ద ఉంచి, భద్రంగా అది ఎవరిది అని వెతుకుతూ ఉండి, అతని వరకు చేర్పించే ప్రయత్నం చేయాలి. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా?

అందు గురించే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ సందర్భంలో, ఏ సందర్భంలో అండి? ప్రవక్త ఏదైతే హజ్ చేశారో, లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట ఉన్నారో, అందులో హ్యూమానిటీ కి సంబంధించిన, మానవత్వానికి సంబంధించిన గొప్ప నియమ, నిబంధనలు, సూత్రాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే తెలిపారో, ఒక్కసారి ఈ హదీస్ ను గమనించండి. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీస్,

ఇన్న దిమా అకుమ్, వ అమ్వాలకుమ్, వ అ’రాదకుమ్, అలైకుమ్ హరామున్, క హుర్మతి యౌమికుమ్ హాదా, ఫీ బలదికుమ్ హాదా, ఫీ షహ్రికుమ్ హాదా.

ప్రజలారా, ఈ మక్కా నగరం ఎంత గౌరవ, మర్యాద గల ప్రదేశమో తెలుసు కదా? ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామో, జిల్ హిజ్జా నెల, ఇది కూడా ఎంతటి గౌరవ, ప్రాముఖ్యత గల నెలనో తెలుసు కదా? మరియు ఈ రోజు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాలో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు కూడా ఎంతటి గౌరవప్రదమైన రోజో తెలుసు కదా? ఇక గౌరవప్రదమైన రోజు, గౌరవప్రదమైన నెల, గౌరవప్రదమైన ప్రదేశంలో ఉండి, వీటన్నింటిని గుర్తిస్తూ నేను చెబుతున్నాను శ్రద్ధగా వినండి. మీ యొక్క రక్తం అంటే మీ యొక్క ప్రాణం, మీ యొక్క ధనం, మీ యొక్క పరువు, మానాలు కూడా చాలా గౌరవమైనవి, విలువ గలవి. వాటిని ఎవరూ కూడా అక్రమంగా దాడి చేయడం, ఒకరిని నరికేయడం, హత్య చేయడం, ఒకరి ధనం పై అన్యాయంగా దోచుకునే ప్రయత్నం చేయడం, ఒకరి యొక్క మానవ పరువులో ఏదైనా జోక్యం చేసుకోవడం, హరాం, ఎంతమాత్రం కూడా దీనికి అనుమతి లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఒక వ్యక్తిని తిట్టకూడదు, ఒక వ్యక్తిని హత్య చేయకూడదు, ఒకరి సామాను, ఒకరి యొక్క వస్తువులను దొంగలించకూడదు అన్న విషయాన్ని ప్రవక్త, క బలదికుమ్ హాదా, మీ యొక్క ఈ బలద్, ఈ నగరం యొక్క గౌరవం ఎలా ఉందో అంతకంటే గొప్పగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తు చేస్తున్నారు.

అందుకొరకే, ముస్లిమేతరులలో ఉన్నటువంటి మరొక అపోహ ఏమిటంటే, ఈ కాబతుల్లాహ్, న’ఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అసల్ ఒక విగ్రహాల గృహం అని. అయితే హదీస్ తో దీనిని వారు నిరూపించే ప్రయత్నం చేస్తారు, ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విగ్రహాలను అయితే పడేశారో, దానిని తీసుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క విగ్రహాలు, వాటిని ప్రస్తావిస్తారు. కానీ మనం ఒకవేళ నిజంగా చూస్తే, ఖురాన్ ఆయతులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, మానవ చరిత్ర, ఏ చరిత్రనైతే భద్రంగా ఉందో దానిలో తెలుస్తున్న విషయం ఏమిటి? మొట్టమొదటి మానవుడు ఆది మానవుడు, ఆదం అలైహిస్సలాం, వారి యొక్క సంతానం కాలాల తరబడి షిర్క్ కు పాల్పడలేదు.

كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً
మానవులందరూ ఒకే ఒక సమాజంగా ఉండేవారు. (2:213)

ఒకే ఒక ధర్మం, ఏకదైవారాధనపై అందరూ నిలిచి ఉన్నారు. ఎంతవరకు? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆ తర్వాత మెల్లి మెల్లిగా వారిలో షిర్క్ అనేది పాకింది. దానిని ఖండించడానికే ప్రవక్తలను పంపడం జరిగింది. కాబతుల్లాహ్, దీని యొక్క పునాది తౌహీద్ పై, ఏకదైవారాధనపై ఉండినది. అమర్ బిన్ లుహై మొట్టమొదటి చెడ్డ వ్యక్తి, అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని నరకంలో చూసినట్లు కూడా హదీస్ లో తెలియపరిచారు. అతడు మొట్టమొదటిసారిగా షిర్క్ కు పునాది వేశాడు. దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు, షిర్క్ నుండి పరిశుభ్రం చేశారు కాబా గృహాన్ని. కానీ ఇది వాస్తవానికి విగ్రహాలయం మాత్రం కాదు. సోదర మహాశయులారా, చివరిలో సూరతుల్ నమ్ల్ ఆయత్ 91 ద్వారా మన యొక్క ఈ నాటి ప్రసంగాన్ని సమాప్తం చేద్దాము.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్ర మైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (27:91)

నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ నగరం యొక్క ప్రభువుని ఆరాధించాలి అని. ఆయనే ఈ నగరానికి చాలా గొప్ప గౌరవప్రదమైన స్థానం కలుగజేశాడు. అతనికే సర్వాధికారం ఉంది, సర్వ సర్వమూ అతని యొక్క ఆధీనంలో ఉంది. మరియు నేను విధేయులలో, ముస్లింలలో ఉండాలి, అయి ఉండాలి అని కూడా నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది.

అయితే ఈ ఆయత్ ను చివరిలో ప్రస్తావించడానికి ముఖ్య కారణం ఏంటి? మనం ఎప్పుడైనా అల్లాహ్ ప్రసాదించిన గౌరవాన్ని, అది ప్రాంతానికి సంబంధించినా, ఏ వ్యక్తికి సంబంధించినా, ఏదైనా నెలకు సంబంధించినా, ఏదైనా కార్యానికి సంబంధించినా ప్రస్తావిస్తున్నప్పుడు దాని యొక్క గొప్పతనం, దాని యొక్క గౌరవంలో మనం అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మర్చిపోకూడదు. మనం వాస్తవంగా అల్లాహ్ ను గౌరవిస్తున్నాము. అందుకొరకే అల్ హుబ్బు ఫిల్లాహ్ వల్ బుగ్దు ఫిల్లాహ్. అల్లాహ్ ఏ ఏ విషయాలను ప్రేమిస్తాడో వాటన్నిటినీ ప్రేమించడం. అల్లాహ్ ఏ ఏ విషయాలను ద్వేషిస్తాడో వాటన్నిటినీ ద్వేషించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. అర్థమైంది కదా?

అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నేను దుఆ చేస్తున్నాను. ఈ మక్కా విశిష్టత గురించి ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో దాని యొక్క గౌరవాన్ని కాపాడే అటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. దీని విషయంలో ఎవరు ఏ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారో అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17091

హజ్, ఉమ్రా – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf