అధర్మమైన సమ్మతమైన వసీలా
https://youtu.be/mh_RqyUcea4 [13 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ‘వసీలా’ (అల్లాహ్‌కు సాన్నిహిత్యం కోరే సాధనం) అనే భావనను వివరిస్తున్నారు. ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన వసీలాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు. ధర్మబద్ధమైన మార్గం కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారానే నిర్దేశించబడిందని నొక్కిచెప్పారు. ముఖ్యంగా, మరణించిన వారి ద్వారా, వారు ప్రవక్తలు లేదా పుణ్యాత్ములు అయినప్పటికీ, సహాయం కోరడం లేదా దుఆ చేయడం నిషిద్ధమని వివరించారు. ఆరాధన “ఎవరి కోసం” మరియు “ఎలా” అనే ఇబ్నె తైమియా సూత్రాన్ని ఉటంకించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కాలంలో కరువు ఏర్పడినప్పుడు, వర్షం కోసం దుఆ చేయడానికి మరణించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా, జీవించి ఉన్న ప్రవక్త పినతండ్రి అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను వసీలాగా చేసుకున్న చారిత్రక ఉదాహరణను అందించారు. దీని ద్వారా జీవించి ఉన్న పుణ్యాత్ముల ద్వారా మధ్యవర్తిత్వం కోరవచ్చని, కానీ మృతుల ద్వారా కాదని స్పష్టం చేశారు. అలాగే, ‘ఇస్తిఆనత్’ (ప్రాపంచిక విషయాలలో అనుమతించబడిన సహాయం) మరియు ‘ఇస్తిగాసా’ (కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాలలో సహాయం కోరడం) మధ్య తేడాను వివరిస్తూ, రెండోది అల్లాహ్ యేతరుల నుండి కోరడం హరామ్ అని తేల్చిచెప్పారు.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّيْنِ، أَمَّا بَعْدُ.
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. అంతిమ విజయం దైవభీతిపరులకే. ప్రవక్తల నాయకులు, దైవసందేశహరులందరిపై మరియు ప్రళయదినం వరకు వారిని సన్మార్గంలో అనుసరించేవారిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురుపించుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
అధర్మమైన వసీలా
అభిమాన సోదరులారా! గత ఎపిసోడ్లో మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకున్నాం. అవి తప్ప వేరే ఇతర పద్ధతుల ద్వారా ఆశ్రయం పొందటం అది అధర్మమైన వసీలా అవుతుంది.
ప్రియ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక గీటురాయిని తెలియజేశాడు, చూపించాడు. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? స్వర్గానికి పోయే దారి ఏమిటి? నరకానికి పోయే దారి ఏమిటి? మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ గ్రంథం, దివ్య గ్రంథం ఖురాన్ మజీద్ ని అవతరింపజేశాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, ప్రవచనాలు. ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో మన జీవన విధానం, ఈ లోకంలో, ప్రపంచంలో, ఇహంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోకూడదు, ఇవన్నీ మనకు తెలియజేయడం జరిగింది ఖురాన్ లో మరియు హదీస్ లో.
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తప్ప ఇతర మార్గం ఎన్నుకుంటే, అది మన బుద్ధికి, మన తెలివికి సరైనది అని అనిపించినా, అది ఖురాన్ పరంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా లేకపోతే, అది ధర్మ సమ్మతం కాదు అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి.
ఆరాధన ఎవరి కోసం? ఎలా?
అందుకే షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లాహి అలై ఒక చక్కని సూత్రం చెప్పారు. అది ఏమిటంటే:
مَنْ تَعْبُدُ؟ كَيْفَ تَعْبُدُ؟
(మన్ త’అబుద్? కైఫ త’అబుద్?)
ఎవరిని ఆరాధించాలి? ఆ ఆరాధన ఎలా చేయాలి?
ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎవరి కొరకు? కైఫ త’అబుద్, ఆ ఆరాధన ఎలా చేయాలి? సూటిగా చెప్పాలంటే, ఆరాధన, ఇబాదత్ ఎవరి కోసం? ఆ ఇబాదత్ ఎలా చేయాలి? రెండే రెండు విషయాలు. దీనికి సూటిగా చెప్పాలంటే చక్కని సమాధానం: ఆరాధన కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధానం ప్రకారమే.
మృతులను వసీలాగా తీసుకోవటం
అభిమాన సోదరులారా! కావున ఈ ధర్మ సమ్మతం కాని విషయాలలో, ధర్మ సమ్మతం కాని వసీలాలలో ఉదాహరణకు ఒకటి ఏమిటి? మృతులను దుఆ చేయమని కోరటం. మృతులను, పరమపదించిన వారిని దుఆ చేయమని కోరటం, వారిని వసీలాగా తీసుకోవటం, వాస్తాగా తీసుకోవటం, ఇది ఇస్లాంలో అధర్మం అని మనం తెలుసుకోవాలి.
అది ఎవరైనా సరే, పుణ్య పురుషులు కావచ్చు, ఔలియాలు కావచ్చు, అలాగే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే, మరణించిన వారి సహాయం కోరటం, వారి వసీలాను కోరటం, వారి వసీలా ద్వారా దుఆ చేయటం ఇది ఇస్లాంలో సమ్మతం కాదు. ఎందుకంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు – ఇది ప్రామాణికమైన హదీస్, అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది, సహీహ్ హదీస్ ఇది, ప్రామాణికమైన హదీస్ ఇది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హులు వారు గానీ, ఇతర సహాబాలు గానీ, తాబయీన్లు గానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత వారి ద్వారా దుఆ చేయలేదు, వారి వసీలా తీసుకోలేదు. ఇది ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం ఇది. మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు, మనకంటే ఎక్కువ ఖురాన్, హదీస్ తెలిసినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌కు భయపడేవారు, మనకంటే ఎక్కువ దైవభీతి కలిగినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనకంటే ఎక్కువ ధర్మ జ్ఞానం కలిగినవారు, సహాబాలు, తాబయీన్లు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వసీలాగా తీసుకున్నారా? తీసుకోలేదు.
ఇంకా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దుఆ చేసేవారు. పోయి, “ఓ దైవ ప్రవక్త! కరువు వచ్చింది, వర్షం లేదు, నీరు వలన మనుషులు, జంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ దైవ ప్రవక్త, దుఆ చేయండి” అని కోరేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.
కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, ఆ తర్వాత కాలానికి చెందిన వారు, వారెవరైనా ప్రవక్తల, మృతుల, చనిపోయిన పుణ్యాత్ముల వసీలా తీసుకునేవారా? కాదు. ఒక హదీస్ ఇలా ఉంటుంది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క వేడుక: “ఓ అల్లాహ్! గతంలో మేము మా ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము, నీవు వర్షం కురిపించి మా కరువు తీర్చే వాడివి. ఇప్పుడు మేము మా ప్రవక్త బాబాయి గారిని ఆశ్రయించి నిన్ను ప్రార్థిస్తున్నాము. కనుక మాపై వర్షం కురిపించు” అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రార్థించేవారు.
దీంట్లో స్పష్టంగా ఏముంది? స్పష్టంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. “ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత వరకు ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము.” అంటే ఇప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు కాబట్టి, పరమపదించారు కాబట్టి, ఇప్పుడు మనము ప్రవక్త గారి బాబాయి అయిన, పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అన్హు గారిని ఆశ్రయించి, అబ్బాస్ గారి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు బ్రతికి ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.
అంటే దీని సారాంశం ఏమిటి అభిమాన సోదరులారా? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత వరకు సహాబాలు ప్రవక్త ద్వారా ప్రార్థించేవారు. ఆయన పరమపదించిన తర్వాత కరువు వస్తే, ప్రవక్తగారి పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు అన్హు ద్వారా దుఆ చేసేవారు. దీనితో అర్థం ఏమైందంటే, చనిపోయిన వారి ద్వారా దుఆ చేయకూడదు. వారిని వసీలాగా తీసుకోకూడదు. ఎవరైతే పుణ్యాత్ములు, దైవభీతిపరులు, తఖ్వా గలవారు బ్రతికి ఉన్నారో, వారి ద్వారా దుఆ చేయవచ్చుమని మనకు అర్థమవుతుంది.
దైవ ప్రవక్త హోదాను వసీలాగా చేసుకోవడం
అలాగే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తు, వేరే ఇతరుల అంతస్తులను వసీలాగా కూడా చేసుకోకూడదు. ప్రవక్త గారి అంతస్తును, ఇతర వారి అంతస్తులను కూడా ఆసరాగా చేసుకోకూడదు, వసీలాగా చేసుకోకూడదు. ఒక్క హదీస్ ఉంది, ఆ హదీస్ కి కొందరు ఆధారంగా తీసుకుంటారు, అది సమంజసం కాదు. ఆ హదీస్ ఏమిటంటే:
“ఇదా సఅల్తుముల్లాహ ఫస్ అలూహు బిజాహీ, ఫ ఇన్న జాహీ ఇందల్లాహి అజీమ్”.
ఈ హదీస్, దీని అర్థం ఏమిటి? “మీరు అల్లాహ్ ను అడిగితే నా హోదాను, అంతస్తులను ఆసరాగా చేసుకుని అడగండి, ఎందుకంటే నా స్థాయి చాలా గొప్పది” అని ఇది ఆ ఒక ఉల్లేఖనం ఉంది. ఇది కాల్పనిక హదీస్, ‘మౌజూ’, ‘మన్ ఘడత్’. ఇది కాల్పనిక హదీస్, సత్యం లేశమైనా దీంట్లో లేదు అని గ్రహించాలి. ఈ హదీస్‌ను ఆధారంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, సమ్మతం కాదు, న్యాయం కాదు. ఎందుకంటే ఇది ‘మౌజూ’, ‘మన్ ఘడత్’ హదీస్ ఇది.
అలాగే, సృష్టితాలలో ఏ ఒక్కరి అస్తిత్వాన్నైనా ఆధారంగా చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారాలు ఖురాన్ లో గానీ, ప్రామాణికమైన హదీసులలో గానీ లేవు.
సహాయం కోరటంలోని రకాలు
అభిమాన సోదరులారా! అలాగే సృష్టితాలను సహాయం చేయమని కోరటం రెండు రకాలు. ఒకటి ఇస్తిఆనత్, ఇది సమ్మతమే. ఇస్తిఆనత్ అంటే ఏమిటి? ఏదైనీ వ్యవహారములో సహాయం కోరటం. ఉదాహరణకు స్నేహితులు, అమ్మ నాన్న, భార్య, భర్త, సంతానము, పిల్లలు… బ్రతికి ఉన్నారు, వారితో మనం జీవిస్తున్నాము, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇచ్చు పుచ్చుకోవటం. ఇది సమ్మతమే. ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:
وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా)
పుణ్యకార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో పరస్పరం సహకరించుకోండి. (సూరె మాయిదా: 2)
ఒకరి సహాయం కోరటము, “నాకు ఈ పని చేసి పెట్టండి, ఫలానా వస్తువు తీసుకొని రండి, ఇది వారికి ఇచ్చివేయండి”, అంటే ఇది ఇస్తిఆనత్. పరస్పరం ఇటువంటి విషయాలలో సహాయం చేసుకోవచ్చు. ఇది దాంట్లో రాదు.
సృష్టితాల సహాయంలో రెండవది ఏమిటి? ఇస్తిగాసా. ఇస్తిగాసా అంటే, అల్లాహ్ మాత్రమే చేయగలిగే పనులను, అల్లాహ్ మాత్రమే చేయగలిగే విషయాలను మృతులను కోరటం. ఏ పని అయితే అల్లాహ్ మాత్రమే చేస్తాడో, ఏది అయితే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమో, అటువంటివి సృష్టితాలతో కోరటం, ఇది కూడా అధర్మం కిందకి వస్తుంది. కేవలం అల్లాహ్‌కు సాధ్యమైన విషయాల కొరకు, బ్రతికి ఉన్న వారిని అర్థించటం ఇది కూడా ధర్మ సమ్మతం కాదు.
అభిమాన సోదరులారా! నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, వసీలా రెండు రకాలు: ధర్మ సమ్మతం – గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రెండవది అధర్మమైన వసీలా, అంటే మృతులను దుఆ చేయమని కోరటం, దైవ ప్రవక్త అంతస్తు లేదా ఇతరుల, పుణ్యాత్ముల అంతస్తులను వసీలాగా చేసుకోవటం, చనిపోయిన వారిని సహాయం కోరటం, ఇవన్నీ అధర్మమైన వసీలా. ఇది ఇస్లాం ధర్మంలో ముమ్మాటికీ కరెక్ట్ కాదు, నిషిద్ధము, ఇది తప్పు, అధర్మం, అన్యాయం, పాపం.
ఇక సహాయం వస్తే ఇది రెండు రకాలు. ఇస్తిఆనత్, పరస్పరం సహాయం చేసుకోవటం, వ్యవహారంలో ఏమైనా వస్తువులలో, లావాదేవీల్లో, తినే తాగే విషయాలలో ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే ఇస్తిగాసా, ఏదైతే అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడో, కేవలం అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన విషయాల కొరకు సృష్టితలతో కోరటం, ఇది అధర్మమైన వసీలాగా పరిగణిస్తుంది.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అన్నదే మా చివరి మాట. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43148
వసీలా , తవస్సుల్
- అల్లాహ్ సామీప్యం కోసం సృష్టితాలను ‘సాధనంగా’ చేసుకోవటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF]
- వసీలా వాస్తవికత – ఖుత్ బాతే నబవీ ﷺ (మర్కజ్ దారుల్ బిర్ర్) [PDF] [4p]
- వసీలా ధర్మ పరిధిలో – జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ [PDF] [6p]
- ధర్మ సమ్మతమైన వసీలా – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్] [14 నిముషాలు]
- అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా (వసీలాగా) మనం పెట్టుకోవచ్చు? [మరణానంతర జీవితం – పార్ట్ 17] [ఆడియో, టెక్స్ట్]
- దుఆలో ధర్మసమ్మతమైన వసీలా ఏది? – నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో] [24 నిముషాలు]
- ధర్మసమ్మతమైన వసీలా ఆధారాలు – నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో] [26 నిముషాలు
తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/
You must be logged in to post a comment.