షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 3
https://youtu.be/VEyPUZ3PWz0 [39 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు
ఈ ప్రసంగంలో, షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రచించిన ‘అల్-ఖవాయిద్ అల్-అర్బా’ (నాలుగు సూత్రాలు) అనే పుస్తకంలోని మొదటి సూత్రం గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని అవిశ్వాసులు, అల్లాహ్‌ను ఏకైక సృష్టికర్తగా, పోషకుడిగా మరియు సర్వ వ్యవహారాల నిర్వాహకుడిగా (తౌహీద్ అల్-రుబూబియ్యత్) అంగీకరించారని, కానీ ఈ నమ్మకం మాత్రమే వారిని ఇస్లాంలోకి ప్రవేశింపజేయలేదని ఈ సూత్రం స్పష్టం చేస్తుంది. దీనికి రుజువుగా సూరత్ యూనుస్ మరియు ఇతర సూరాల నుండి ఆయత్లు ఉదహరించబడ్డాయి. వారి అవిశ్వాసానికి అసలు కారణం, వారు కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి (తౌహీద్ అల్-ఉలూహియ్యత్) అనే విషయం నిరాకరించి, తమ ఇతర దైవాలను వదులుకోకపోవడమే అని సూరత్ అస్-సాఫ్ఫాత్ ఆధారంగా వివరించబడింది. ఆరాధనలో ఇతరులను భాగస్వాములుగా కల్పించడం (షిర్క్) అనేది తౌహీద్ అల్-రుబూబియ్యత్‌ను అంగీకరించినప్పటికీ ఒక వ్యక్తిని ఇస్లాం నుండి బహిష్కరిస్తుందని ఈ పాఠం నొక్కి చెబుతుంది.
అల్హందులిల్లాహి హందన్ కసీరా, వ సల్లల్లాహు వ సల్లమ అలా నబియ్యినా ముహమ్మదిన్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి తస్లీమన్ మజీదా, అమ్మా బాద్.
ప్రియ వీక్షకుల్లారా, ఈరోజు అల్-ఖవాయిదుల్ అర్బఅ, నాలుగు నియమాలు అనే పుస్తకం ఏదైతే మనం చదువుతున్నామో, షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ వారిది, ఈ పుస్తకం నుండి మూడవ పాఠం చదవబోతున్నాము. మన యొక్క ఈ కంటిన్యూయేషన్ లో మూడో క్లాస్.
ఇంతకుముందు పాఠాలు మీకు తెలిసి ఉన్నాయి అని ఆశిస్తున్నాను నేను. మనం ఏం చదివాము? ముందు దుఆ ఇచ్చారు. ఆ తర్వాత హనీఫియ్యత్ మిల్లతె ఇబ్రాహీం అంటే ఏమిటో తెలియజేశారు. ఆ తర్వాత తౌహీద్ ఉంటేనే ఆరాధనను ఆరాధన అనబడుతుంది. ఎలాగైతే వుదూతో చేయబడిన నమాజును మాత్రమే నమాజు అని అనబడుతుంది. ఎలాగైతే అపానవాయువు జరిగితే వుదూ భంగమైతే, వుదూ మిగిలి ఉండదు, నమాజు కాదు, నెరవేరదు, చేసినా అది లెక్కించబడదు, దాని పుణ్యం మనిషి పొందడు, పైగా అతనికి శిక్ష కలుగుతుంది. అలాగే అంతకంటే మరీ ఘోరంగా, ఎవరైనా నేను అల్లాహ్‌ను ఆరాధిస్తున్నాను అన్నటువంటి సంతోషంలో ఉండి, షిర్క్ నుండి దూరం ఉండకుంటే, ఆ షిర్క్ అతని ఆ ఆరాధనను చెడగొడుతుంది, పాడుచేస్తుంది, దాని పుణ్యం అతనికి లభించదు. ఒకవేళ అది పెద్ద షిర్క్ అయ్యేది ఉంటే, అదే స్థితిలో చనిపోయేది ఉంటే, క్షమాపణ అల్లాహ్ తో కోరకుంటే, అతడు శాశ్వతంగా నరకంలో ఉంటాడు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మనము తెలుసుకున్నాము.
ఇక రండి, ఆ నాలుగు నియమాలు ఏవైతే ఉన్నాయో, వేటి ద్వారానైతే మనం షిర్క్‌ను మంచి రీతిలో అర్థం చేసుకోగలుగుతామో, ఆ నాలుగు నియమాలలో మొదటిది ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాము.
మొదటి సూత్రం: అవిశ్వాసులు రుబూబియ్యత్‌ను అంగీకరించారు
ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ చెబుతున్నారు.
మొదటి నియమం:
الْقَاعِدَةُ الْأُولَى: أَنْ تَعْلَمَ أَنَّ الْكُفَّارَ الَّذِينَ قَاتَلَهُمْ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم مُقِرُّونَ بِأَنَّ اللَّهَ تَعَالَى هُوَ الْخَالِقُ الرَّازِقُ الْمُدَبِّرُ، وَأَنَّ ذَلِكَ لَمْ يُدْخِلْهُمْ فِي الْإِسْلَامِ.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవిశ్వాసులతో యుద్ధం చేశారో, వారు అల్లాహ్ యే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అని నమ్మేవారు. అయినా ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది (అంటే అందువల్ల వారు ముస్లింలు కాలేదు)
అల్లాహు అక్బర్. గమనించండి. అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అన్నటువంటి విశ్వాసం వారిది. అయినా ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. అంటే ఈ విశ్వాసం వల్ల వారు ముస్లింలు కాలేదు. వారిని ముస్లింలుగా పరిగణించడం జరగలేదు. వారిని విశ్వాసులుగా లెక్కించడం జరగలేదు.
దలీల్ (ఆధారం). దలీల్ ఇస్తున్నారు సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. కానీ ఆ దలీల్, ఆ దలీల్ యొక్క వివరణ మనం వినేకి ముందు ఇక్కడ మరొక్కసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తమ కాలంలోని ఏ అవిశ్వాసులతో యుద్ధాలు చేశారో, ఉదాహరణకు అబూ జహల్, అబూ లహబ్ ఇంకా వేరే ఎందరో. వారు అల్లాహ్ గురించి, ఏ అల్లాహ్నైతే మనం నమ్ముతున్నామో ఆ అల్లాహ్ యే నిజమైన సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అన్నటువంటి నమ్మకం వారిది. కానీ ఈ నమ్మకం, ఈ విశ్వాసం ద్వారా వారు ఇస్లాంలో ప్రవేశించలేకపోయారు. ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేరిపించలేకపోయింది. ఈ విశ్వాసం, ఈ నమ్మకం ద్వారా వారు ముస్లింలుగా, విశ్వాసులుగా పరిగణించబడలేదు. దలీల్ వస్తుంది. విషయం అర్థమైంది కదా?
ఇక ఎందుకు ముస్లింలుగా పరిగణించబడలేదు? ఎందుకు అంటే ఇక్కడ అల్లాహ్ యే ఖాలిఖ్, సృష్టికర్త, రాజిఖ్, పోషకుడు, ఇంకా అల్లాహ్ మాత్రమే అల్ ముదబ్బిర్, ఈ విశ్వ వ్యవస్థను నడిపేవాడు, ఈ విధంగా వారి నమ్మకం ఏదైతే ఉండిందో దీనిని తౌహీదె రుబూబియ్యత్ అని అంటారు. ఇంతకుముందు ఎన్నో సందర్భాలలో మనం చదివి ఉన్నాము కదా? తౌహీద్, అల్లాహ్ ఏకత్వాన్ని మనం నమ్మాలి లేకుంటే విశ్వాసులము సంపూర్ణంగా కాము. అయితే ఆ అల్లాహ్ యొక్క ఏకత్వం ఏ విషయంలో? రుబూబియ్యత్, అస్మా వ సిఫాత్ మరియు ఉలూహియ్యత్. ఈ మూడిటిలో కూడా అల్లాహ్‌ను అద్వితీయునిగా, ఏకైకుడిగా, ఎలాంటి భాగస్వామి లేని వాడిగా నమ్మడం తప్పనిసరి.
ఇక ఈ ముష్రికులు, ఈ కాఫిర్లు, అవిశ్వాసులు, ఎవరైతే ప్రవక్త కాలంలో ఉండినారో అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, మరియు ఆయనే ఈ విశ్వాన్ని నడిపేవాడు అని నమ్మేవారు. అంటే ఏంటి? తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మేవారు. అంతేకాదు, ఎన్నో అస్మా వ సిఫాత్‌లను నమ్మేవారు అని కూడా తెలుస్తుంది, ఇంకా ఆయత్లు ఉన్నాయి. ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ సంక్షిప్తంగా ఒక మూల విషయం చెప్పి దాని యొక్క ఒక్క ఆధారం ఇచ్చి సంక్షిప్తంగా చెప్పాలనుకున్నారు. కానీ మన ప్రాంతాలలో ప్రజలు షిర్క్‌లో ఎలా కూరుకుపోయారంటే, కేవలం అనువాదం చదివి ఒక ఆయత్ దాని అనువాదం చదివేస్తే అంత స్పష్టంగా అర్థం కాదు. అందుకొరకే ఎన్నో ఉదాహరణలు తీసుకొచ్చి, ఎన్నో రకాల ఆధారాలు తీసుకొచ్చి వారికి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆధారం తీసుకొస్తారు ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్. దాన్ని ఇప్పుడు మనం చదువుదాము. కానీ అంతకంటే ముందు ఆ నియమం ఏదైతే తెలిపారో దాన్ని అర్థం చేసుకోండి. ఏంటి నియమం? ముష్రికులు అల్లాహ్‌ను మాత్రమే సృష్టికర్త, పోషకుడు, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అని అల్లాహ్ మాత్రమే అని నమ్మినప్పటికీ వారు ముస్లింలుగా కాలేదు. వారిని విశ్వాసులుగా పరిగణించబడలేదు. ఎందుకంటే వారు కేవలం తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు. తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మలేదు. కాకపోతే తౌహీదె అస్మా వ సిఫాత్ ను కూడా నమ్మినటువంటి కొన్ని దలీల్‌లు కనబడతాయి మనకు.
రండి ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ చెప్పినటువంటి ఆ దలీల్ ముందు చదివి, ఇంకా ఈ అంశాన్ని మరికొన్ని వేరే ఆధారాలతో తెలుసుకొని, ఆ తర్వాత మన సమాజంలోని ఈనాటి మనం ముస్లింలం ఎలాంటి ఈ నియమానికి సంబంధించి మనం కూడా ఎలాంటి తప్పులో ఉన్నామో, మనలోని చాలామంది, ఆ విషయాన్ని అర్థం చేసుకుందాం.
ఖుర్ఆన్ ఆధారం – సూరత్ యూనుస్
قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ
“ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణములేని దాని నుండీ, ప్రాణములేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌యే” అని వారు తప్పకుండా చెబుతారు. “మరలాంటప్పుడు మీరు (అల్లాహ్ శిక్షకు) ఎందుకు భయపడరు?” (10:31)
ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ గమనించండి మీరు, ఒక్కొక్కటిగా గమనించండి. ఐదు ప్రశ్నలు అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెబుతున్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఈ ముష్రికులను అడుగు, వీరిని ప్రశ్నించు:
- మొదటి ప్రశ్న: ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడు ఎవడు?
- రెండో ప్రశ్న: చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు?
- మూడో ప్రశ్న: ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు?
- నాలుగో ప్రశ్న: ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు?
- ఐదో ప్రశ్న: సమస్త కార్యాల నిర్వహణ కర్త ఎవరు?
అర్థమైందా? చూస్తున్నారు కదా, అరబీ ఆయత్ మరియు దాని అనువాదంలో ఐదు విషయాలు స్పష్టంగా కనబడ్డాయా మీకు? భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధిని సమకూర్చే వాడు ఎవడు? మీ యొక్క చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు? మరియు ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, నాలుగవది ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు? ఐదవది సమస్త కార్యాల నిర్వహణ కర్త ఎవరు? ఈ ఐదు ప్రశ్నలు మీరు అడగండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పబడినది, ప్రవక్త వారు వారిని అడిగారు, వారికి సమాధానం ఏముండింది? ఖుర్ఆన్లో వచ్చింది వారి సమాధానం. ఫసయఖూలూనల్లాహ్ (فَسَيَقُولُونَ اللَّهُ) – “అల్లాహ్ యే” అని వారు తప్పకుండా చెబుతారు. అయితే వారికి చెప్పండి: ఫఖుల్ (فَقُلْ) – అఫలా తత్తఖూన్ (أَفَلَا تَتَّقُونَ) – అయితే మీరు ఎందుకు భయపడటం లేదు? షిర్క్ చేయడం ద్వారా ఎంత నష్టం ఉన్నదో, షిర్క్ చేస్తే అల్లాహ్ ఎలాంటి శిక్ష ఇస్తాడో, ఈ శిక్ష నుండి, ఈ షిర్క్ నుండి, శిక్షకు గురిచేసే అటువంటి ఈ షిర్క్ నుండి మీరు ఎందుకు భయపడరు, ఎందుకు దూరం ఉండరు?
సోదర మహాశయులారా, గమనించారా? ఈ విధంగా ఈ మొదటి నియమంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటో అర్థమైంది కదా మీకు? ఏంటి? అల్లాహ్ త’ఆలాను సృష్టికర్తగా, పోషణకర్తగా, ఉపాధి ప్రధాతగా, ఇంకా ఈ విశ్వ వ్యవస్థను నడిపేవాడిగా, జీవన్మరణాల అధికారి, ప్రధాతగా కేవలం నమ్మితే సరిపోదు. ఇది కేవలం తౌహీదె రుబూబియ్యత్ మాత్రమే.
ఇక ముష్రికులు అల్లాహ్ యొక్క కొన్ని నామాలను కూడా నమ్మేవారు అని చెప్పాను కదా? దానికి ఏంటి దలీల్? రండి. కొన్ని రకాల దలీల్ నేను మీకు వినిపిస్తాను, చూపిస్తాను. చాలా శ్రద్ధగా మీరు ఈ విషయాన్ని గ్రహించండి.
అయితే ఇంతకుముందు నేను మీ మొబైల్లో చాలా సులభంగా ఖుర్ఆన్ అనువాదం చదవగలుగుతారు అని చెప్పి ఉన్నాను కదా? అహ్సనుల్ బయాన్ నుండి. అయితే అందులో నుండే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను, ఇదిగోండి.
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ
(వలఇన్ సఅల్తహుం మన్ ఖలఖస్సమావాతి వల్ అర్ద లయఖూలున్న ఖలఖహున్నల్ అజీజుల్ అలీం)
“భూమ్యాకాశాలను సృష్టించినదెవరు?” అని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే, “సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయినవాడే (అల్లాహ్‌యే) సృష్టించాడ”ని వారు తప్పకుండా సమాధానమిస్తారు.” (43:9)
చూశారా? మీకు గనుక నేను ఖుర్ఆన్లోని మరికొన్ని ఆయతులు ఒకచోట సమకూర్చాను. ఈ అంశం మీకు చాలా స్పష్టంగా అర్థం కావాలని ఒక్కసారి స్పీడ్‌గా ఆ ఆయతులు, వాటి అనువాదం, ఆ ఆయతుల యొక్క రిఫరెన్స్, ఏ సూరాలలో, ఏ ఆయత్ నెంబర్లో ఒక్కసారి చూడండి. ఈ అంశం మీకు చాలా స్పష్టంగా అర్థమైపోవాలి.
ఇక్కడ చూస్తున్నారా? చాలా స్పష్టంగా కనబడుతుందా మీకు? మొదటి దలీల్ ఇప్పుడు మనం చదివినది, ఏదైతే ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ ప్రస్తావించారో సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. ఆ తర్వాత రెండో దలీల్ చూడండి, ఎంత స్పష్టంగా ఉంది:
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
(వలఇన్ సఅల్తహుం మన్ ఖలఖహుం లయఖూలున్నల్లాహ్. ఫఅన్నా యు’ఫకూన్)
“మిమ్మల్ని పుట్టించినదెవర”ని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా అంటారు. మరలాంటప్పుడు వారు ఎటు తిరిగిపోతున్నారు(ట)?!” (సూరత్ జుఖ్రుఫ్ 43:87)
అలాగే చూడండి మరొక ఆయత్. ఇది సూరత్ అన్కబూత్లో:
وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ مِن بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
(వలఇన్ సఅల్తహుం మన్ నజ్జల మినస్సమాయి మాఅన్ ఫఅహ్యా బిహిల్ అర్ద మింబ’అది మౌతిహా లయఖూలున్నల్లాహ్. ఖులిల్ హందులిల్లాహ్, బల్ అక్సరుహుం లా య’అఖిలూన్)
“ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా భూమిని, అది చచ్చిన తరువాత బ్రతికించినదెవరు? అని నువ్వు వారిని ప్రశ్నించినట్లయితే ‘అల్లాహ్‌యే’ అని వారి నుంచి సమాధానం వస్తుంది. సకల స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి అని నువ్వు చెప్పు. కాని వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు.” (29:63)
ఇదే సూరత్ జుమర్ ఆయత్ నెంబర్ 61 చూస్తే:
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
(వలఇన్ సఅల్తహుం మన్ ఖలఖస్సమావాతి వల్ అర్ద వసఖ్ఖరష్షమ్స వల్ ఖమర లయఖూలున్నల్లాహ్. ఫఅన్నా యు’ఫకూన్)
“భూమ్యాకాశాలను సృష్టించినవాడెవడు? సూర్యచంద్రులను పనిలో నిమగ్నుల్ని చేసినవాడెవడు? అని నువ్వు వారిని అడిగితే ‘అల్లాహ్‌యే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు వారు (సత్యం నుంచి) ఎలా తిరిగిపోతున్నారు?” (29:61)
ఖలకస్సమావాతి వల్ అర్ద్ (خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ) అన్న పదం, భూమ్యాకాశాలను పుట్టించింది ఎవరు? ఇది సూరత్ లుఖ్మాన్, సూర నెంబర్ 31 ఆయత్ నెంబర్ 25 లో కూడా ఉంది. సూరత్ జుఖ్రుఫ్, సూర నెంబర్ 43 మరియు ఆయత్ నెంబర్ 9 లో కూడా ఉంది. అందుకొరకు ఇక్కడ దాని అనువాదం ప్రస్తావించడం జరగలేదు. అలాగే సూరత్ జుమర్, సూర నెంబర్ 39 ఆయత్ నెంబర్ 38 లో కూడా ఉంది.
ఇక రండి సూరతుల్ ముఅ్మినూన్. ఈ సూరాలో ఆయత్ నెంబర్ 84 నుండి 89 వరకు ఆరు ఆయతులలో అల్లాహ్ కొన్ని ప్రశ్నలు ఆ ముష్రికులతో అడుగుతున్నాడు మరియు వారి యొక్క సమాధానం ఏముందో శ్రద్ధగా చూడండి, వినండి.
قُل لِّمَنِ الْأَرْضُ وَمَن فِيهَا إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿٨٤﴾ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ ﴿٨٥﴾
(ఖుల్ లిమనిల్ అర్దు వమన్ ఫీహా ఇన్ కున్తుం త’అలమూన్. సయఖూలూన లిల్లాహ్. ఖుల్ అఫలా తజక్కరూన్)
“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.“అల్లాహ్‌వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు. (23:84-85)
ఇక ఆ తర్వాత మళ్ళీ రెండో ప్రశ్న చూడండి.
قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ ﴿٨٦﴾ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ ﴿٨٧﴾
(ఖుల్ మన్ రబ్బుస్సమావాతిస్సబ్’ఇ వరబ్బుల్ అర్షిల్ అజీమ్. సయఖూలూన లిల్లాహ్. ఖుల్ అఫలా తత్తఖూన్)
“సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు.“అల్లాహ్‌యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి) అడుగు. (23:86-87)
ఆ తర్వాత గమనించండి మళ్ళీ ప్రశ్న.
قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿٨٨﴾ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ ﴿٨٩﴾
(ఖుల్ మన్ బియదిహీ మలకూతు కుల్లి షైఇన్ వహువ యుజీరు వలా యుజారు అలైహి ఇన్ కున్తుం త’అలమూన్. సయఖూలూన లిల్లాహ్. ఖుల్ ఫఅన్నా తుస్’హరూన్)
“సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో- ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.“అల్లాహ్ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.” (23:88-89)
గమనించారా? ఇప్పుడు మీరు చదివిన ఈ ఆయతులన్నిటి ద్వారా ఏం తెలిసింది? సార్వభౌమత్వం, శరణు ఇచ్చేవాడు, శరణు తీసుకునేవాడు కాదు. ఇంకా అర్ష్ అజీమ్ యొక్క రబ్. సప్తాకాశాల యొక్క రబ్. మరియు ఈ భూమి, ఇందులో ఉన్న సమస్తము, వీటన్నిటికీ అధికారి ఎవరు? అలాగే మిమ్మల్ని పుట్టించిన వాడు ఎవడు? భూమ్యాకాశాలను పుట్టించిన వాడు ఎవడు? సూర్యచంద్రులను మీ ఉపయోగానికి, మీరు ప్రయోజనం పొందడానికి ఒక లెక్క ప్రకారంగా దానిని అదుపులో ఉంచినవాడు ఎవడు? ఆకాశం నుండి వర్షం కురిపించేది ఎవరు? చనిపోయిన భూమి నుండి పంటను పండించేది, ఆ భూమిని బ్రతికించేది ఎవరు? ఈ విధంగా ఆయత్ యూనుస్లోనిది కూడా కలుపుకుంటే అందులోని ఐదు ప్రశ్నలు, ఈ విధంగా చూశారా? సుమారు 12 కంటే ఎక్కువ ప్రశ్నలు వారిని ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటికీ అధికారి, వీటన్నిటినీ చేసేవాడు ఎవడు అని ఆ కుఫ్ఫార్, అవిశ్వాసుల సమాధానం ఒక్కటే. ఏమిటి? అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్.
అవిశ్వాసానికి అసలు కారణం – ఉలూహియ్యత్‌ను (కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి) తిరస్కరించడం
అయినా గానీ వారిని ముస్లింలు అని ఎందుకు చెప్పలేదు? వారు విశ్వాసులు అని ఎందుకు చెప్పడం జరగలేదు? ఎందుకు? ఖుర్ఆన్ స్వయంగా సమాధానం ఇస్తుంది. ఖుర్ఆన్ స్వయంగా సమాధానం ఇస్తుంది, చూడండి. అది కూడా మీకు చూపిస్తున్నాను.
సూరా నెంబర్ 37, ఆయత్ నెంబర్ 35 చూడండి. సూరత్ సాఫ్ఫాత్.
إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ ﴿٣٥﴾ وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ ﴿٣٦﴾
“అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడ”ని వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు.“పిచ్చిపట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము మా పూజ్య దైవాలను వదులుకోవాలా?” అని అనేవారు.” (సూరత్ సాఫ్ఫాత్ 37:35-36)
తెలిసిందా ఆధారం, ఖుర్ఆన్ ద్వారా? వారు తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు. ఇన్షాఅల్లాహ్ నాలుగో నియమంలో కూడా వస్తుంది, ఈనాటి ముస్లింల కంటే ఎక్కువ బలమైన నమ్మకం తౌహీదె రుబూబియ్యత్ పట్ల వారికి ఉండినది. కానీ ఉలూహియ్యత్, కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి, ఈ విషయాన్ని వారు తిరస్కరించారు.
చూస్తున్నారు కదా దలీల్? “ఇన్నహుం కానూ ఇజా ఖీల లహుం లా ఇలాహ ఇల్లల్లాహ్” (إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ) – అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు అని వారితో చెప్పబడినప్పుడు, “యస్తక్బిరూన్” (يَسْتَكْبِرُونَ) – తకబ్బుర్, గర్వం, అహంకారం ప్రదర్శించేవారు.
అంతేకాదు నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యవంతుడు, అమీన్, ఎంతో మంచివాడు అన్నటువంటి ప్రశంసలు కురిపించేవారు సైతం, ఈ తౌహీదె ఉలూహియ్యత్ మాట విని ఆ ఈ పిచ్చివాడు, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఈ కవి, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. గమనించండి, ఏ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినైతే ప్రశంసించేవారో, తౌహీదె ఉలూహియ్యత్ వైపునకు పిలిచినందుకు, ఆహ్వానించినందుకు, ఆ ప్రవక్తనే షాఇర్, మజ్నూన్, కవి, పిచ్చివాడు అని అంటున్నారు, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాఇర్ కవి కూడా కారు, పిచ్చివారు కూడా కారు. కానీ వారలా అనేవారు. అని ఏమనేవారు? “లతారికూ ఆలిహతినా” (لَتَارِكُو آلِهَتِنَا) – ఈ కవి, పిచ్చివారి మాటలు విని మేము మా యొక్క పూజ్య దైవాలను వదులుకోవాలా? అంటే అర్థమైంది కదా? ఇక్కడ “ఆలిహతినా” (آلِهَتِنَا), మా యొక్క ఆరాధ్య దైవాలు, మేము ఎవరినైతే పూజించే వారిమో వారు ఈ భూమ్యాకాశాలను పుట్టించారని నమ్మేవారు కాదు. వారు మమ్మల్ని పుట్టించారా? లేదు లేదు లేదు, అల్లాహ్ యే పుట్టించాడు. మీరు ఎవరినైతే పూజిస్తారో, ఆరాధన యొక్క కొన్ని రకాలు ఎవరి ముందైతే చేస్తారో, వారు మీకు ఉపాధిని ఇస్తున్నారా? ఆకాశం నుండి ఏదైనా మీకు కురిపిస్తున్నారా? భూమి నుండి పంట పండిస్తున్నారా? మీకు కావలసినటువంటి ఆహారం వసగుతున్నారా? వారేమనేవారు? లేరు లేరు లేరు, అది కేవలం అల్లాహ్ మాత్రమే ఇస్తాడు. మరి అలాంటప్పుడు అల్లాహ్‌నే మీరు ఆరాధించండి. లేదు లేదు, వీరిని కూడా ఆరాధిస్తాం. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్.
సోదర మహాశయులారా, ఈ మాటను ఇన్ని ఆధారాలతో, ఇంత వివరంగా మీకు నచ్చచెప్పడం జరుగుతుంది అంటే ఇక మీరు సమాజంలో చూడండి. ఈరోజు ముస్లింలు అని తమకు తాము చెప్పుకునే వాళ్ళు, నమాజులు కూడా చేసేవాళ్ళు, ఉపవాసాలు కూడా ఉండేవాళ్ళు, కొన్ని సందర్భాలలో అల్లాహ్ శక్తి కలగజేస్తే హజ్ కూడా చేసేవాళ్ళు. కానీ, అయ్యో మా బడే పాహాడ్ సాహెబ్‌ను ఎలా వదులుకోవాలి? ఫలానా మా బాబాగారిని ఎలా వదులుకోవాలి? మీరు వహాబీలు చెప్పిన మాటకు విని మేము మా యొక్క పీర్ సాహెబ్‌ను వదులుకోవాలా? ఇలా అంటారు కదా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆనాటి కాలంలో ముష్రికులు ఇచ్చినటువంటి సమాధానం, ఈ రోజుల్లో మనం, మనకు మనం ముస్లింలు అనుకునే వాళ్ళలో ఎంతోమంది ఇలాంటి సమాధానాలు ఇస్తారు. అయితే గమనించండి, అల్లాహ్ వద్ద కుటుంబం, వంశం, పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఇతనికి ఎంత హోదా అంతస్తు ఉంది, ఇవన్నీ అల్లాహ్ చూడడు. ఒకవేళ అల్లాహ్ అలా చూసేవాడైతే సొంత బాబాయి అబూ లహబ్, తబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్బ్ అని హెచ్చరికను, శాపనను, నరకం లో వేయబడతాడు అన్నటువంటి విషయం ఖుర్ఆన్లో ఇలా వస్తుందా? అంటే అల్లాహ్ వద్ద ఏం చూడడం జరుగుతుంది? ఎవరు తౌహీదె ఉలూహియ్యత్‌ను విశ్వసిస్తారో, ఎవరు తౌహీదె ఉలూహియ్యత్ ప్రకారంగా తమ జీవితాన్ని గడుపుతారో.
మొదటి నియమం ఈ నాలుగు నియమాల్లో అల్-ఖవాయిదుల్ అర్బాలో తెలిసిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవిశ్వాసులతోనైతే యుద్ధం చేశారో వారు అల్లాహ్ నే సృష్టికర్తగా, పోషకునిగా, సర్వ వ్యవస్థను నడిపేవాడిగా నమ్మేవారు. కానీ ఆ నమ్మకం, ఆ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేదు. దలీల్ సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. ఎందుకు చేర్చలేదు? ఎందుకంటే వారు తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు, తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మలేదు. ఏమిటి దలీల్? ఇది, సూరత్ సాఫ్ఫాత్ సూరా నెంబర్ 37, ఆయత్ నెంబర్ 35.
సోదర మహాశయులారా, మరికొన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ సమయం సరిపోదు అందుకొరకే నేను ముందుకు సాగుతున్నాను. ఇక ఇక్కడ విషయం అర్థమైంది కదా? నేను ఈ అన్ని వివరాలు మీకు ఏదైతే తెలియజేశానో సొంత నా వైపు నుండి ఇది కాదండి. ఇక్కడ చూడండి ఇది పీడీఎఫ్ షేఖ్ సాలెహ్ అల్-ఫౌజాన్ హఫిజహుల్లాహ్ వారు అల్-ఖవాయిదుల్ అర్బా యొక్క వ్యాఖ్యానం చేసినది. ఈ పీడీఎఫ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది షేఖ్ అబ్దుల్ ముహ్సిన్ అల్-ఖాసిమ్, ఇమాం వ ఖతీబ్ మస్జిద్-ఎ-నబవీ వారు. మరియు ఇది షేఖ్ అబ్దుర్రజాఖ్ అల్-బద్ర్ హఫిజహుల్లాహ్. మరియు ఇది షేఖ్ సాలెహ్ ఆలష్ షేఖ్. ఇంకా అలాగే షేఖ్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ వారి యొక్క, ఇవన్నీ చదివి మరియు ఖుర్ఆన్లో ఈ ముష్రికుల యొక్క తౌహీదె రుబూబియ్యత్ గురించి వచ్చినటువంటి ఆ ఆయతులను చదివి వాటిని గ్రహించి, అర్థం చేసుకొని ఆ తర్వాత వీటి యొక్క సారాంశం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము.
ఇకనైనా మీరు ఈ ఖుర్ఆన్ ఆధారంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ఆధారంగా చెప్పబడుతున్న విషయాలను శ్రద్ధ వహించండి, మంచిగా అర్థం చేసుకోండి, ఆ తర్వాతనే మీరు తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మకుంటే ఎంత ఘోరమైన నష్టం జరుగుతుందో దాన్ని అర్థం చేసుకోగలుగుతారు.
ఇక ఆయత్ ఏదైతే వచ్చినదో ప్రత్యేకంగా సూరత్ యూనుస్‌లోని ఆయత్ నెంబర్ 31, దానిలోని ఒక్కొక్క విషయాన్ని నేను వివరిస్తే ఇంకా చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ సంక్షిప్తంగా మీకు అర్థమైంది కదా? ఆ ఆయత్ నెంబర్ 31 లో ఐదు ప్రశ్నలు ముష్రికులతో చేయబడ్డాయి. భూమ్యాకాశాల నుండి మీకు ఆహారం ఇచ్చేది ఎవరు? ముష్రికులు ఏం జవాబు ఇచ్చారండి? అల్లాహ్ మాత్రమే అని. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలు ఏమంటారు? నేను వారి యొక్క తావీజు వేసుకున్నా, కాబా యొక్క తలుపు ఏదైతే ఉందో అది నేను నా ఇంట్లో దాని ఫోటో పెట్టుకున్నా, నేను ఫలానా బాబా వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకొని వచ్చినా, అప్పుడే నాకు శుభం కలిగిందండి, నా వ్యాపారం పెరిగిందండి, నా పంట మంచిగా పండిందండి, నేను ఫలానా వలీ వద్దకు వారి యొక్క దర్గా వద్దకు, మజార్ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాతనే నాకు సంతానం కలిగిందండి, లేకుంటే అంతకుముందు నేను ఎన్నో నమాజులు చేస్తూ ఉండేవాడిని, కానీ సంవత్సరాల తరబడి ఎంతో దుఆ చేసినా నాకు సంతానం కాలేదు, ఇలా అనేవారు మన సమాజంలో ఉన్నారా? ఎంత బాధాకరమైన విషయం గమనించండి. ప్రవక్త కాలం నాటి ముష్రికులు ఏం నమ్ముతున్నారు? భూమ్యాకాశాల నుండి ఎక్కడి నుండైనా ఆహారం ఇచ్చేది కేవలం అల్లాహ్ మాత్రమే. కేవలం అల్లాహ్ మాత్రమే.
ఇక ఆ తర్వాత? ఎవరు మీ చెవుల మరియు మీ కళ్ళ పై అధికారం కలిగి ఉన్నాడు? ఈ ప్రశ్నకు సమాధానంలో కూడా వారేమంటారు? అల్లాహ్ మాత్రమే. కానీ ఈ రోజుల్లో మన అనేక మంది ముస్లింలు ఈ విషయంలో కూడా వేరే ఎవరెవరితో భయపడుతూ ఉంటారు. ఇక్కడ మీ చెవులపై, మీ కళ్ళపై అధికారం ఎవరికి ఉంది, ఇమాం ఇబ్ను కసీర్ రహీమహుల్లాహ్ చెప్పారు, “మొదటగా ఈ శక్తిని ప్రసాదించినది ఎవరు? ఈ వినే శక్తి, చూసే శక్తి ప్రసాదించినది ఎవరు? అల్లాహ్ తలుచుకుంటే ఎప్పుడైనా మీ నుండి వాటిని తీసుకోగలుగుతాడు.” సూరతుల్ ముల్క్ ఆయత్ నెంబర్ 23, సూరతుల్ అన్’ఆమ్ ఆయత్ నెంబర్ 46 ఆధారంగా ఈ మాట తెలియజేశారు.
ఇక ఆ తర్వాత ఏముంది? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు? ఇక్కడ ఒక ఉదాహరణ ఏమివ్వడం జరిగింది? వేరే తఫ్సీర్‌లలో, ఉదాహరణకు ఇమాం నవాబ్ సిద్దీఖ్ హసన్ ఖాన్ అల్-ఖన్నూజీ రహీమహుల్లాహ్ తమ తఫ్సీర్లో తెలియజేస్తున్నారు. ఈ జీవి నుండి నిర్జీవిని, నిర్జీవి నుండి జీవిని, ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని, ప్రాణము లేని దాని నుండి ప్రాణమున్న దానిని వెలికి తీయడం ఇది ఎంతో శక్తి గల విషయం. ఏమంటారు? బికుద్రతిహిల్ అజీమా వ మిన్నతిహిల్ అమీమా. తీసిన వారు ఎవరు? అంటే కేవలం అల్లాహ్ మాత్రమే. ఫత్హుల్ బయాన్, ఇక్కడ ఉంది చూడండి. ఏమంటున్నారు ఇక్కడ? అల్లాహ్ త’ఆలా ప్రాణమున్న కోడి నుండి గుడ్డు, గుడ్డులో ప్రాణం లేదు. కానీ అల్లాహ్ తలుచుకున్నప్పుడు అదే ప్రాణం లేని గుడ్డు ద్వారా మళ్ళీ కోడిపిల్లను పుట్టిస్తాడు. కదా? ఇది ఒక ఉదాహరణ మనకు అర్థం కావడానికి. అలాగే మరొక ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. “వన్నబాత మినల్ హబ్బా” – ఒక చెట్టు నుండి విత్తనం, విత్తనం నుండి చెట్టు. ఈ విధంగా, ఇక వేరే కొన్ని ఇలాంటి ఉదాహరణలు కూడా ఇవ్వబడినవి.
సోదర మహాశయులారా, ఆ తర్వాత అల్లాహ్ చెబుతున్నాడు, “వమన్ యుదబ్బిరుల్ అమ్ర్” – అంటే ఈ సర్వ విశ్వ వ్యవస్థను నడిపేవాడు. అంటే ఏంటి? పుట్టించడం, చావు ఇవ్వడం, ఇంకా ఈ పూర్తి విశ్వంలో అందరికీ వారికి తగిన అవసరాలన్నీ తీరుస్తూ ఉండడం. ఈ ఖగోళం ఏదైతే చూస్తామో, ఖగోళ శాస్త్రం అని చదువుతారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు కదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవి వాటి వాటి సమయాల్లో, వాటి వాటి కక్ష్యలో తిరుగుతూ ఉండే విధంగా, ఇదంతా నిర్వహించేవాడు, ఈ పూర్తి విశ్వంలో ఎక్కడ ఏమి జరిగినా గానీ దానికి బాధ్యుడు, నడిపించేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే.
ఇంతటి గొప్ప శక్తి గల అలాంటి అల్లాహ్‌ను వదిలి వీర్యపు బిందువుతో పుట్టినటువంటి ఒక మానవుడు, అది కూడా చనిపోయాడు, అతన్ని పూజించడం? మానవుడు అతనిలో స్వయం ఏ శక్తి లేదు, అల్లాహ్ ఏ కొత్త శక్తి ఇచ్చాడో అది ప్రాణం ఉన్నంతవరకు సద్వినియోగించుకొని అతని యొక్క విధేయతలో గడపాలి. అలా కాకుండా ఎవరెవరినో మనం ఎంతో పుణ్యాత్ములుగా భావించి వారిని పూజిస్తే, ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు వారి కొరకు చేస్తే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి.
అందుకొరకే ఈ మొదటి నియమం ద్వారా తెలపబడిన విషయం ఏమిటంటే, ముష్రికులు సైతం తౌహీదె రుబూబియ్యత్, అందులో వచ్చేటటువంటి ఎన్నో విషయాలు, ఒక 12, 13 ప్రశ్నల రూపంలో వారిని అడగడం జరిగింది, వారు కేవలం ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే సృష్టించాడు, వీటికి అధికారి, అల్లాహ్ తప్ప వేరే ఎవరిలో కూడా వీటి శక్తి లేదు అని స్పష్టంగా చెప్పేశారు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలు ఈ తౌహీదె రుబూబియ్యత్లో కూడా షిర్క్ చేస్తున్నారు. వారు అల్లాహ్‌ను అంతగా నమ్మినప్పటికీ ముస్లింలు కాలేదు అంటే, ఉలూహియ్యత్‌ను తిరస్కరించారు, అల్లాహ్ ఆరాధనలో వేరేవారిని భాగస్వామిగా చేశారు. మరి ఈరోజు మనం ముస్లింలమని పేరును పెట్టుకొని అలాంటి ఆరాధనలో ఏదైనా భాగస్వామ్యం కలగజేస్తే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడా? మనం అల్లాహ్ యొక్క శిక్ష నుండి తప్పించుకోగలుగుతామా?
అల్లాహ్ త’ఆలా ఈ మొదటి నియమాన్ని ఏదైతే మనం విన్నామో, ఇన్ని ఆధారాలతో మంచిగా అర్థం చేసుకొని, మన ఇంటి వారిలో ఎవరైతే ఇలాంటి షిర్క్‌కు పాల్పడి ఉన్నారో, మన చుట్టుపక్కల ఎవరైతే రుబూబియ్యత్‌ను నమ్మి ఉలూహియ్యత్‌ను నమ్మటం లేదో, ఈ ఆయతులు, ఈ హదీసులు, ఈ దలాయిల్ ఆధారాలన్నీ చూపించి వారికి మంచిగా నచ్చచెప్పే, వారికి తౌహీద్ యొక్క దావత్ మంచి రీతిలో ఇచ్చేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43982
షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు
[1] షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 1 – నసీరుద్దీన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]
[2] షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 2 – నసీరుద్దీన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]