ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్
ఖుత్బాలోని ముఖ్యాంశాలు
1) ఇస్రా వ మేరాజ్ ప్రాముఖ్యత
2) ఇస్రా వ మేరాజ్ తారీఖు
3) ఇస్రా వ మేరాజ్ లోని సంఘటనలు
4) ఇస్రా వ మేరాజ్ ఉద్దేశ్యము
ఇస్లామీయ సోదరులారా!
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ ఎన్నో అద్భుతాలను ప్రసాదించాడు. వాటిలో ఒక ముఖ్యమైన అద్భుతం – ఇస్రా వ మేరాజ్. ఈ అద్భుతంలో రెండు ముఖ్యమైన భాగాలు వున్నాయి. ఒక భాగం – ఇస్రా అని పిలువబడే ‘మస్జిదుల్ హరామ్’ నుండి ‘మస్జిదె అఖ్సా’ వరకు సాగిన ప్రయాణానికి సంబంధించినది. ఇక రెండవ భాగం – ‘మస్జిదె అఖ్సా’ నుండి ఆకాశాల కన్నా పైకి, అల్లాహ్ కోరుకున్నంత వరకు సాగిన ప్రయాణం. దీనిలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వర్గనరకాలతో పాటు, ఎన్నో అల్లాహ్ సూచనలు చూపించడం జరిగింది, ఎన్నో ప్రవక్తలను పరిచయం చేయడం జరిగింది మరియు ఐదు పూటల నమాజ్ విధి (ఫర్జ్) గా చేయబడ్డాయి – దీనినే ‘మేరాజ్‘ అని పిలుస్తారు.
మేరాజ్ సంఘటన గురించి అహ్లుస్సున్నహ్ వల్ జమాఅత్ విశ్వాస మేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెలకువగావున్న స్థితిలో, శరీర సమేతంగా తనకు ‘ఇస్రా వ మేరాజ్’ చేయించడం జరిగింది. అంతేగానీ, నిద్రలో, ఆత్మరూపంలో కాదు.
ఇమామ్ తహావీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు : మేరాజ్ అనేది సత్యం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మెలకువ స్థితిలో, శరీర సమేతంగా సంచరింపజేయడం జరిగింది మరియు ఆకాశాల వరకూ, ఇంకా వాటికన్నా పైకి అల్లాహ్ కోరుకున్నంత వరకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అల్లాహ్ తాను కోరుకున్నట్లుగా ఆయనను గౌరవించి, తాను కోరుకున్న దానిని ఆయనకు ‘వహీ’ చేశాడు.
‘ఇస్రా’ గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
“తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదుల్ హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకునిపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే మేమతనికి మా (శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.” (బనీ ఇస్రాయీల్ 17:1)
ఈ ఆయత్ ‘సుబ్ హాన’ అన్న పదంతో అల్లాహ్ ప్రారంభించాడు. దీని శాబ్దిక అర్థం ఏమిటంటే – ఆయన (అల్లాహ్) అన్ని లోపాలకు అతీతుడు. కానీ, అరబ్బీ భాషలో దీనిని ‘ఆశ్చర్యాన్ని‘ వెలిబుచ్చే సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా అల్లాహ్ శక్తిసామర్థ్యాలకు గాను ఆశ్చర్యం ప్రకటించబడుతోంది – ఆ శక్తిసామర్థ్యాలు ఏమిటంటే – అల్లాహ్ తన దాసుణ్ణి, ఆ రోజుల్లో 40 రేయింబవళ్ళలో పూర్తి చేయగలిగే ప్రయాణాన్ని రాత్రికి రాత్రే పూర్తి చేయించాడు. దీనిని వెల్లడించిన శైలి కూడా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మెలకువతో, శరీర సమేతంగా మేరాజ్ చేయించడం జరిగిందని నిరూపిస్తోంది. ఎందుకంటే – ఒకవేళ నిద్ర స్థితిలో, ఆత్మరూపంలో ఈ ప్రయాణం జరిగి వుంటే, దాని కోసం ‘సుబ్ హాన’ పదాన్ని ఉపయోగించి ఆశ్చర్యం ప్రకటించాల్సిన అవసరం వుండేది కాదు.
ఇదేగాక, అల్లాహ్ దీనిలో అబ్ద్ (దాసుడు) పదాన్ని వాడాడు. అంటే ఆయన దాసుణ్ణి సంచారం గావించాడు. ఈ పదం కూడా ఆత్మ, శరీరం – రెండింటినీ కలిపి వాడబడుతుంది. కేవలం ఆత్మ కోసం కాదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కలలో కాకుండా మెలకువతో శరీర సమేతంగా మేరాజ్ యాత్ర చేయించి గౌరవించడం జరిగిందనడానికి ఇది రెండవ ఆధారం.
ఇక దీని మూడవ ఆధారం ఏమిటంటే – ఒకవేళ ‘ఇస్రా వ మేరాజ్’ సంఘటన కలలో జరిగివుంటే, మరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కలను జనాలకు వివరించినప్పుడు వారు దానిని (నమ్మకుండా) తిరస్కరించేవారు కాదు. కనుక మక్కా అవిశ్వాసుల తిరస్కరణ ద్వారా మనకు తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో తన కలను వివరించలేదు, వారితో స్పష్టంగా తనకు మెలకువ స్థితిలో, శరీర సమేతంగా ‘ఇస్రా వ మేరాజ్’ చేయించడం జరిగిందని చెప్పారు.అందుకే వారు- మక్కా నుండి ఏలియా (బైతుల్ మఖ్దిస్)కు మేము 40 రేయింబవళ్ళలో పూర్తి చేసే యాత్రను ఈయన రాత్రికి రాత్రే అక్కడికెళ్ళి తిరిగి వచ్చేశారు! అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను పరిహసించారు.

You must be logged in to post a comment.