12- మేరాజున్ నబి పండుగ
రజబ్ నెల 27వ తేది మేరాజున్ నబీ పవిత్రమైన సంఘటన జరిగిందని ఆ పండుగను జరుపుకునే వారి అభిప్రాయం. అందువలన వారు ప్రతి ఏటా మేరాజున్ నబీ రాత్రి ఒక పండుగ కొరకు ముస్తాబవుతారు. అలాగే తమ ఇండ్లల్లో ప్రత్యేకమైన వంటకాలు చేసుకుంటారు. మరియు ఫాతిహాలు అర్పిస్తారు. మసీదులను పచ్చటి మరియు ఎర్రటి లైట్లతో అలంకరిస్తారు, మసీదులలో ప్రత్యేకమైన నఫిల్ నమాజులు చదువుతారు. మరియు ఆ రాత్రంతా మేరాజున్ నబీ జరిగిన సంఘటను గురించి మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్ర గురించి ప్రసంగాల సభలు నిర్వహిస్తారు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రత్యేకమైన “దరూద్ దుఆ” లను చదువుతారు. ఆ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.
కొంతమంది ప్రజలు మేరాజున్ నబీ గురించి కొన్ని కల్పిత విషయాలు జొప్పించుకొని ప్రసంగాలు చేస్తారు, అంతే కాక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) గారి పట్ల ధర్మ హద్దులు మీరి అతిగా పొగుడ్తారు. ఉదాహరణకు:
1- ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు అల్లాహ్ తన తేజస్సు తెరను తొలిగించాడు. కనుక అల్లాహ్‌ను అసలైన రూపంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కళ్ళారా దర్శించే భాగ్యాన్ని పొందినట్లు అంటారు.
2- ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ రాత్రి అల్లాహ్ వద్దకు చేరుకునేందుకు తమ కాళ్ళ నుండి చెప్పులను తీయబోతే, అల్లాహ్ ఆయన్ని చెప్పులతో సహా ఆహ్వానించారు అని కథలు చెప్పుకుంటారు.
౩- మేరాజ్ రాత్రి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను స్వయంగా సందర్శించారు మరియు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మధ్య ఆలింగనము చేసుకునే వ్యత్యాసం మాత్రమే మిగిలిందని అంటారు.
4- అల్లాహ్ తన తేజస్సు తెరను తొలిగించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అల్లాహ్‌ను చూస్తే అల్లాహ్ కూడా ప్రవక్త రూపంలోనే ఉన్నారని అంటారు.
హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి ఆయిషా (రజియల్లాహు అన్హ) గారు ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కళ్ళారా చూసారని అంటారో వారు అల్లాహ్ పై అబద్దాన్ని అంటగట్టినట్టే”…. (బుఖారి: 259)
ఇలా అనేకమైన షిర్క్ కు చెందిన విషయాలను మేరాజ్ రాత్రిన అమాయక ప్రజల ముందు ప్రసంగిస్తారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని అల్లాహ్ స్థాయికి పెంచి అల్లాహ్ అంటే ప్రవక్త, ప్రవక్త అంటే అల్లాహ్ అని విశ్వసిస్తారు. ఇలా విశ్వసించటం క్రైస్తవుల విశ్వాసంకంటే హీనమైన విశ్వాసంగా తెలుస్తుంది. ఎందుకంటే? క్రైస్తవులు యేసు (అలైహిస్సలాం) వారిని అల్లాహ్ కుమారునిగా విశ్వసిస్తారు. కాని మన ముస్లిం ప్రజలలో కొంత మంది ప్రజలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను పూర్తిగా అల్లాహ్ స్థాయికి పెంచి అనేక కవితాగానాలు రచించారు. మరియు ఆ రాత్రంతా వాటిని పాడుతుంటారు.
అందుకనే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “మీరు నన్ను పొగడటంలో హద్దులు మీరకండి, ఎలాగైతే క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసా(అలైహిస్సలాం) గారి పట్ల హద్దుమీరి పొగడ్తల్లో ముంచారో! నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను మాత్రమే. కనుక మీరు నన్ను అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారి: ౩189)
13- పవిత్రమైన మేరాజ్ సంఘటన వాస్తవం
మేరాజున్ నబీ యాత్ర ఎప్పుడు జరిగిందని అడిగితే? దానికి సూటిగా ఒక జవాబుగా హిజ్రత్ కు ఒక ఏడాది ముందు జరిగిందని చెప్పవచ్చు.
కాని ఏ నెలలో? ఏ తేదిలో అని చెప్పడానికి స్పష్టమైన ఆధారం ఇస్లామీయ చరిత్రలో భధ్రపరచబడలేదు. కనుక ప్రవక్త గారి చరిత్రను రచించినవారిలో కూడా మేరాజ్ సంఘటన గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. వాటిలో కొన్నిటిని మీ ముందు ఉంచుతున్నాము:
1- దైవదౌత్యం ప్రసాదించబడిన సంవత్సరమే ఈ మేరాజ్ సంభవించిందని ఇమామ్ తబ్రీ కథనం.
2- దైవదౌత్యం అయిదు సంవత్సరాల తరువాత జరిగిందని ఇమామ్ నూవీ, ఇమామే ఖుర్తిబీ కథనం.
౩- దైవదౌత్యం పదవ సంవత్సరం రజబ్ నెల 27వ తేదిన సంభవించిందని, సులైమాన్ మన్సూర్‌పూరి కథనం.
4- హిజ్రత్ పదహారు మసాల ముందు రమజాన్ నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ పదునాలుగు మాసాల ముందు ముహర్రం నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ కు ఒక సంవత్సరం ముందు రబీఉల్ అవ్వల్ మాసంలో సంభవించిందని రచయితలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏదైనప్పటికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారి తదనంతరం మేరాజ్ సంఘటన జరిగినట్లు స్పష్టమవుతుంది. మరియు హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారు దైవదౌత్య శకం పదవ సంవత్సరం రమజాన్ నెలలో మరణించినట్లు తెలుస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ కంటే ఒక యేడాది ముందు మేరాజ్ సంఘటన సంభవించినదిగా భావించాలి. (వివరాలకు అర్రహిఖుల్ మఖ్తూమ్ – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర తెలుగు, 224-225 చూడండి).
మేరాజున్ నబీ సంఘటన ఏ నెలలో మరియు ఏ తేదిన జరిగిందో అన్న విషయం మన మహానీయులైన ధర్మ గురువులకే స్పష్టమైన జ్ఞానం లేదంటే మనం రజబ్ నెల 27వ తేదిన మేరాజున్ నబీ పండుగ జరుపుకోవడం ఎంతవరకు ధర్మం. అలాగే మేరాజ్ రాత్రి ఆరాధనలు మరియు పగలు ఉపవాసం గనక ఇస్లామీయ సాంప్రదాయం అనుకుంటే, ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అల్లిహి వసల్లం) మేరాజ్ తరువాత పన్నెండు సంవత్సరాల వరకు సహాబాల మధ్య బతికున్నారు, అయినా ఆయన మేరాజ్ జరిగిన పవిత్రమైన రోజు ఇలాంటి ఆరాధనలు ఎందుకు పాటించలేదు? తరువాత సహాబాలు మేరాజ్ రోజున పండుగగా ఎందుకు నిర్వహించలేదు. ఒకవేళ వారు ప్రతి సంవత్సరం మేరాజ్ రాత్రిని ఆరాధనల కొరకు మరియు పగలు ఉపవాసం కొరకు ప్రత్యేకం చేసుకొని పర్వదినంగా నిర్వహించి ఉంటే, మేరాజ్ జరిగిన మాసము మరియు తేది కూడా స్పష్టంగా తెలిసి ఉండేది కదా! మరియు ఆ రోజున చేసే కార్యాలకు, ఆరాధనలకు ప్రవక్త ఆమోదం కూడా లభించి ఉండేది కదా!.
నా ప్రియమైన ముస్లిం సోదరులారా! మనం పుణ్యాలు చేయుట కొరకు ఆశక్తి చూపాలి, కాని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గదర్శకం ప్రకారమే మనం ఆరాధనలు చెయ్యాలి. అప్పుడే అవి అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యానికి నోచుకుంటాయి. మేరాజున్ నబీ అన్నది ఇస్లామీయ ధర్మానికి చెందిన ఒక విశ్వాసనీయ సంఘటన, మరియు ఎంతో అద్భుతమైన సంఘటన, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చాలా కష్టాలకు, దుఃఖాలకు నష్టాలకు గురికాబడ్డారు. అంతలో హజ్రత్ ఖదీజా(రజియల్లాహు అన్హా) కూడా మృతి చెందారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సంవత్సరానికి ఆముల్ హుజ్న్ (శోక సంవత్సరం) గా భావించారు. అప్పుడు అల్లాహ్ ఆయన శోకాన్ని, మరియు దుఃఖాన్ని దూరం చేయుట కొరకు ఈ మహోన్నతమైన మేరాజ్ గగన యాత్రను ఏర్పాటు చేసినట్లు ధర్మగురువులు భావిస్తారు.
అక్కడ ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అనేక మంది ప్రవక్తలను కలిసి మాట్లాడారు. స్వర్గం, నరకం మరియు అనేక అద్భుత విషయాలను చూసారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి ఉమ్మత్ కొరకు అల్లాహ్ ఒక మహోన్నత బహుమానంగా, ఐదు సమయాల నమాజులను విధిగా ప్రసాదించాడు. మరియు “సూరతుల్ బఖరా” చివరి ఆయతులను కూడా ప్రసాదించాడు.
మనం మేరాజున్‌నబి గురించి పవిత్రమైన సంఘటనగా విశ్వసించాలి, ఆ సంఘటన గురించి ఉన్న వాస్తవాలను యదాతధంగా నమ్మాలి. మరియు ప్రతి రోజు ఐదు సమయాల నమాజును విధిగా పాటించాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గం, నరకం గురించి తెలియజేసిన విషయాలను నిత్యం గుర్తుంచుకొని భయభక్తితో జీవితాన్ని గడపాలి.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 83-87). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
బిద్అత్ (నూతనాచారం) – Bidah
- రజబ్ నెల వాస్తవికత – రజబ్కీ కుండే (కుండల పండుగ)
- రజబ్ నెల ఘనత ఏమిటి? రజబ్ నెలలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు [వీడియో]
- మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు [వీడియో]
- [నూతనాచారం]
- బిద్అత్ (నూతనచారము) – “దైవ ప్రవక్త ధర్మము” పుస్తకము నుండి (ఖలీలుల్ రహ్మాన్)
- కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు– హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)
- ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది. కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు [Video]
You must be logged in to post a comment.