[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/meraj-kanuna-namaz
[PDF] [27 పేజీలు]
ఖుత్బా యందలి ముఖ్యాంశాలు:
- 1) నమాజ్ విధి గావించబడడం
- 2) నమాజ్ ప్రాధాన్యత
- 3) నమాజ్ మహత్యం
- 4) నమాజ్ ను త్యజించేవారి శిక్ష మరియు దాని ఆజ్ఞ.
ఇస్లామీయ సోదరులారా!
ఈ రోజు జుమా ఖుత్బాలో (ఇన్షా అల్లాహ్) అల్లాహ్ సామీప్యం పొందడానికి అన్నింటికన్నా గొప్ప మాధ్యమం, కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత అయిన ఒక (ముఖ్యమైన) ఆచరణ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఏ ముస్లిమ్ అయినా ప్రాపంచిక ఆందోళనలకు, దు:ఖానికి గురై నిరుత్సాహ స్థితిలో ఈ ఆచరణ నిమిత్తం అల్లాహ్ ముందు నిలబడితే అతని ఆందోళన, దు:ఖాల భారం తగ్గి అతనికి అసలైన హృదయ ప్రశాంతత లభిస్తుంది. ఆ ఆచరణ పేరు నమాజ్. అల్లాహ్ దీనిని అర్హత కలిగిన ప్రతి ముస్లిమ్ పై విధిగా ఖరారు చేశాడు.
విధిగా చేయబడిన ఆచరణలన్నీ ఈ భూమి మీదే విధిగా గావించబడగా, నమాజ్ ను మాత్రం అల్లాహ్ తన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వైపునకు పిలిచి, ఆకాశాలపై తాను అనుకొన్న చోట దానిని విధి (ఫర్జ్)గా చేయడం దీని ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను సూచిస్తుంది. .
మేరాజ్ సంఘటనను గూర్చి చెబుతూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:
“…… తదుపరి అల్లాహ్ తాను వహీ చేయదలుచుకున్నది నావైపుకు వహీ చేశాడు. ఇంకా రేయింబవళ్ళలో 50 నమాజులు విధిగా చేశాడు. తదుపరి నేను మూసా (అలైహిస్సలాం) వైపుకు దిగొచ్చే సరికి ఆయన నాతో – మీ ప్రభువు దేనిని విధిగా చేశాడు? అని అడిగారు. నేను – 50 నమాజులు అని అన్నాను. ఆయన – మీరు మీ ప్రభువు వైపుకు తిరిగి వెళ్ళి దీనిని తగ్గించమని కోరండి. ఎందుకంటే మీ అనుచర సమాజం 50 నమాజులు చదివే శక్తి సామర్థ్యాలు కలిగి వుండదు. నేను బనీ ఇస్రాయీలను పరికించి, పరీక్షించి వున్నాను.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు – నేను నా ప్రభువు వైపుకు తిరిగి వెళ్లి – నా ప్రభూ ! నా ఉమ్మత్ పై (ఈ విధిని) కాస్త తగ్గించు అని వేడుకున్నాను. దీనిపై అల్లాహ్ 5 నమాజులు తగ్గించాడు. తదుపరి నేను మళ్ళీ మూసా (అలైహిస్సలాం) దగ్గరికి చేరుకోగానే ఆయన – ఏ మయ్యింది? అని నన్ను అడిగారు. నేను – అల్లాహ్ 5 నమాజులు తగ్గించాడు అని చెప్పాను. ఆయన నాతో – మీ ఉమ్మత్ దీనిని కూడా ఆచరణలో పెట్టే శక్తి కలిగి వుండదు. మీరు మళ్ళీ వెళ్ళి తగ్గింపు కోసం అడగండి అని అన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు :
నేను నా ప్రభువుకూ, మూసా (అలైహిస్సలాం)కు మధ్య పలుమార్లు రావడం, పోవడం జరిగింది. ప్రతిసారీ అల్లాహ్ 5 నమాజులు తగ్గిస్తూ పోయి చివరికి నాతో – ఓ ముహమ్మద్! ఇక రేయింబవళ్ళలో ప్రతి రోజూ 5 నమాజులు వున్నాయి. ప్రతి నమాజు (పుణ్యం) పది రెట్లు. ఇలా (ప్రతిఫలం రీత్యా) ఇవి 50 నమాజులు.”
(బుఖారీ : 7517, ముస్లిం : 162)
50 నమాజులను 5కు తగ్గించి అల్లాహ్ తన ప్రియతమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచర సమాజం (ఉమ్మత్)పై ప్రత్యేకంగా అనుగ్రహించాడు. (సంఖ్యాపరంగా) నమాజులు తగ్గినప్పటికీ పుణ్యఫలం రీత్యా అవి 50కు సమానమే. అందుకే అల్లాహ్ ప్రసాదించిన ఈ ప్రత్యేక అనుగ్రహానికి గాను మనం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయనకు ధన్యవాదాలు తెలియజేయడమెలా అంటే మనం 5 పూటల నమాజులను విధిగా పాటిస్తూ వుండాలి. అందులో ఎలాంటి సోమరితనాన్ని ప్రదర్శించకూడదు.
నమాజ్ ప్రాముఖ్యత
దివ్య ఖురాన్లో అల్లాహ్ నమాజ్ గురించి మాటిమాటికి, పలు రీతుల్లో ప్రస్తావించాడు. ఒక చోట దీనిని గూర్చి ఆదేశిస్తూ ఇలా సెలవిచ్చాడు:
وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتُوا۟ ٱلزَّكَوٰةَ وَٱرْكَعُوا۟ مَعَ ٱلرَّٰكِعِينَ
“మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, (నా సన్నిధిలో) రుకూ చేసే వారితోపాటు మీరూ రుకూ చేయండి”. (బఖర 2: 43)
అలాగే ఇలా కూడా సెలవిచ్చాడు:
وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَيُؤْتُوا۟ ٱلزَّكَوٰةَ ۚ وَذَٰلِكَ دِينُ ٱلْقَيِّمَةِ
“వారు అల్లాహ్ ను ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించు కోవాలనీ, ఏకాగ్రచిత్తులై నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ఇస్తూ వుండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం” (బయ్యినహ్ 98 : 5)
ఈ ఆయత్లలో అల్లాహ్ నమాజ్ను నెలకొల్పమని ఆదేశించాడు. దీని అర్థం ఏమిటంటే దానిని ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా దాని షరతులు, మౌలికాంశాలు, తప్పనిసరి విషయాలను దృష్టిలో వుంచుకొని నెలకొల్పుతూ వుండాలి. షరీయత్తు పరమైన కారణమేదీ లేకుండా ఒక్క నమాజు కూడా త్యజించకూడదు.
మరోచోట అల్లాహ్ నమాజులను కాపాడు కాపాడుకోమని ఆజ్ఞాపిస్తూ ఇలా సెలవిచ్చాడు:
حَـٰفِظُوا۟ عَلَى ٱلصَّلَوَٰتِ وَٱلصَّلَوٰةِ ٱلْوُسْطَىٰ وَقُومُوا۟ لِلَّهِ قَـٰنِتِينَ
“నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్ సమక్షంలో వినమ్రులై వుండండి”. (బఖర 2 : 238)
ఈ ఆయతో అల్లాహ్ నమాజులను కాపాడుకోమని అంటే క్రమం తప్పకుండా చదువుతూ వుండమని ఆదేశించాడు. ముఖ్యంగా మధ్యలో వున్న నమాజు అంటే అస్ర్ నమాజును కాపాడుకోమని ఆజ్ఞాపించాడు.
కనుక ముస్లిములందరూ క్రమం తప్పకుండా నమాజులు చదువుతూ వుండాలి మరి!
ఇంకో చోట అల్లాహ్ నమాజ్ ను క్రమం తప్పకుండా నెలకొల్పమని మరియు తమ ఇంటి వారికి కూడా దీని గురించి ఆజ్ఞాపించమని ఆదేశిస్తూ ఇలా సెలవిచ్చా డు:
وَأْمُرْ أَهْلَكَ بِٱلصَّلَوٰةِ وَٱصْطَبِرْ عَلَيْهَا ۖ لَا نَسْـَٔلُكَ رِزْقًۭا ۖ نَّحْنُ نَرْزُقُكَ ۗ وَٱلْعَـٰقِبَةُ لِلتَّقْوَىٰ
“నీ యింటి వారికి నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సైతం దానిపై స్థిరంగా వుండు. మేము నీనుంచి ఉపాధిని అడగడం లేదు. పైగా మేమే నీకు ఉపాధిని ఇస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులు (కలవారి)కే”. ( తాహా 20 : 132)
అల్లాహ్ నమాజ్ ను క్రమం తప్పకుండా నెలకొల్పమని కేవలం ఆజ్ఞ మాత్రమే యివ్వలేదు. దానిని పాటించే వారికే స్వర్గంలో గౌరవ సత్కారాలు లభిస్తాయని శుభవార్తను యిచ్చాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెల విచ్చాడు:
إِلَّا ٱلْمُصَلِّينَ ٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَآئِمُونَ …. وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ أُو۟لَـٰٓئِكَ فِى جَنَّـٰتٍۢ مُّكْرَمُونَ
“కానీ నమాజు చేసే వారు మాత్రం అలాంటి వారు కారు. వారు తమ నమాజుల (వ్యవస్థ)పై నిత్యం కొనసాగుతారు……ఇంకా వారు తమ నమాజులను కాపాడుతారు. ఇలాంటి వారే స్వర్గవనాలలో సగౌరవంగా వుండేవారు”. (మఆరిజ్ 70: 22-35)
అలాగే ఇంకొక చోట నమాజ్ ను క్రమంతప్పకుండా నెలకొల్పేవారికి జన్నతుల్ ఫిర్ దౌస్ (స్వర్గపు అత్యున్నత అంతస్తు)కు వారసులుగా ఖరారు చేస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قَدۡ اَفۡلَحَ الۡمُؤۡمِنُوۡنَۙ ﴿23:1﴾ الَّذِيۡنَ هُمۡ فِىۡ صَلَاتِهِمۡ خَاشِعُوۡنَ ۙ ﴿23:2﴾ وَالَّذِيۡنَ هُمۡ عَنِ اللَّغۡوِ مُعۡرِضُوۡنَۙ ﴿23:3﴾ وَالَّذِيۡنَ هُمۡ لِلزَّكٰوةِ فَاعِلُوۡنَۙ ﴿23:4﴾ وَالَّذِيۡنَ هُمۡ لِفُرُوۡجِهِمۡ حٰفِظُوۡنَۙ ﴿23:5﴾ اِلَّا عَلٰٓى اَزۡوَاجِهِمۡ اَوۡ مَا مَلَـكَتۡ اَيۡمَانُهُمۡ فَاِنَّهُمۡ غَيۡرُ مَلُوۡمِيۡنَۚ ﴿23:6﴾ فَمَنِ ابۡتَغٰى وَرَآءَ ذٰ لِكَ فَاُولٰٓـئِكَ هُمُ الۡعٰدُوۡنَ ۚ ﴿23:7﴾ وَالَّذِيۡنَ هُمۡ لِاَمٰنٰتِهِمۡ وَعَهۡدِهِمۡ رَاعُوۡنَ ۙ ﴿23:8﴾ وَالَّذِيۡنَ هُمۡ عَلٰى صَلَوٰتِهِمۡ يُحَافِظُوۡنَۘ ﴿23:9﴾ اُولٰٓـئِكَ هُمُ الۡوَارِثُوۡنَ ۙ ﴿23:10﴾ الَّذِيۡنَ يَرِثُوۡنَ الۡفِرۡدَوۡسَؕ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ ﴿23:11﴾
“నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటి వారంటే – తమ నమాజులలో వారు అణకువ కలిగి వుంటారు. వారు పనికి మాలిన వాటిని పట్టించుకోరు. వారు (తమపై విధించిన) జకాతు విధానాన్ని పాటిస్తారు. వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు. అయితే తమ భార్యల, (షరీయతు ప్రకారం) తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు. కానీ ఎవరైనా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు. వారు తమ అప్పగింతల, వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు. వారు తమ నమాజులను పరిరక్షిస్తూ వుంటారు. ఇలాంటి వారే వారసులు. (స్వర్గంలోని) ఫి డౌస్ ప్రదేశానికి వారు వారసులవు తారు. వారక్కడ కలకాలం వుంటారు”. (మూమినూన్ 23:1-11)
మరో చోట అల్లాహ్ నమాజ్ నెలకొల్పేవారికి శుభవార్తను అందజేస్తూ సెలవిచ్చా డు:
إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَأَقَامُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتَوُا۟ ٱلزَّكَوٰةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
“విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులు నెలకొల్పేవారికి, జకాతు చెల్లించే వారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం వుంది. వారికెలాంటి భయం కానీ, చీకూ చింత గానీ వుండవు”. (బఖర 2: 277)
ఇంకోచోట అల్లాహ్ నిజమైన విశ్వాసుల గుణగణాలను వివరిస్తూ నమాజ్ నెలకొల్పడం గురించి ఇలా ప్రస్తావించాడు:
إِنَّمَا ٱلْمُؤْمِنُونَ ٱلَّذِينَ إِذَا ذُكِرَ ٱللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ ءَايَـٰتُهُۥ زَادَتْهُمْ إِيمَـٰنًۭا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَمِمَّا رَزَقْنَـٰهُمْ يُنفِقُونَ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُؤْمِنُونَ حَقًّۭا ۚ لَّهُمْ دَرَجَـٰتٌ عِندَ رَبِّهِمْ وَمَغْفِرَةٌۭ وَرِزْقٌۭ كَرِيمٌۭ
“నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే – అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠింపబడినప్పుడు, అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చుపెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే. వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు వున్నాయి. మన్నింపు వుంది. గౌరవప్రదమైన ఆహారం వుంది.” (అన్ఫాల్ 8 : 2–4)
మరో చోట భయభక్తులు కలవారి లక్షణాలను పురస్కరించుకొని నమాజ్ నెలకొల్పేవారిని సన్మార్గగాములుగా, సాఫల్యం పొందిన వారుగా ఖరారు చేస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“అలిఫ్ లామ్ మీమ్, ఈ గ్రంథం ( అల్లాహ్ గ్రంథం అన్న విషయం)లో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో (సంపదలో)నుంచి ఖర్చుపెడతారు. మేము నీ వైపునకు (అంటే ప్రవక్త వైపునకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసిస్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢ నమ్మకం కలిగి వుంటారు. ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన వున్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే.” (బఖర 2 : 1-5)
ఇంకో చోట వినమ్రులయ్యే వారి లక్షణాలను పురస్కరించుకొని నమాజ్ నెలకొల్పేవారి గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
فَإِلَـٰهُكُمْ إِلَـٰهٌۭ وَٰحِدٌۭ فَلَهُۥٓ أَسْلِمُوا۟ ۗ وَبَشِّرِ ٱلْمُخْبِتِينَ ٱلَّذِينَ إِذَا ذُكِرَ ٱللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَٱلصَّـٰبِرِينَ عَلَىٰ مَآ أَصَابَهُمْ وَٱلْمُقِيمِى
“మీ ఆరాధ్య దేవుడు ఒకే ఆరాధ్యదేవుడని తెలుసుకోండి. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహించండి. (కనుక ఓ ముహమ్మద్!) వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు. (వారిలోని సుగుణం ఏమిటంటే) అల్లాహ్ నామం స్మరించినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. తమపై ఏ ఆపద వచ్చినా వారు ఓర్పు వహిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చు చేస్తూ వుంటారు”. (హజ్ 22 : 34-35)
ఈ ఆయత్ ద్వారా తెలిసిందేమిటటంటే – వినమ్రత, అణకువకు గల అవసరం ఏమిటంటే, మనిషి అల్లాహ్ ఆదేశానుసారం ఐదు నమాజులు క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ నెలకొల్పుతూ వుండాలి. ఒకవేళ అతను నమాజుల పట్ల అశ్రద్ధగానీ, సోమరితనం గానీ చూపిస్తే, అతను తనకు తాను అల్లాహ్ ఆజ్ఞ కన్నా గొప్ప వాడిగా అనుకొంటున్నాడు. మరిచూస్తే, ఇది కూడా గర్వానికి సూచనే. ఎందుకంటే, అల్లాహ్ ఆదేశం ముందు తలవంచడానికి బదులు, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ తన ఇష్టానుసారం నమాజు చదువుతాడు. ఇలాంటి గర్వం ఎవరి మనస్సులోనైనా ఆవగింజంత వున్నా సరే, అతను స్వర్గంలోకి ప్రవేశించలేడు.
అల్లాహ్ దృష్టిలో నమాజ్ కు ఎంత ప్రాముఖ్యత వుందటే నమాజ్ ను అల్లాహ్ ‘విశ్వాసం’ అని ఖరారు చేస్తూ ఇలా సెలవిచ్చాడు:
وَمَا كَانَ ٱللَّهُ لِيُضِيعَ إِيمَـٰنَكُمْ ۚ إِنَّ ٱللَّهَ بِٱلنَّاسِ لَرَءُوفٌۭ رَّحِيمٌۭ
“అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృథా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులైన) మానవుల పట్ల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమ కృపాశీలుడు”. (బఖర 2: 143)
ఖిబ్లా మార్పుకు ముందు ఎవరైతే బైతుల్ మఖ్ దిస్ వైపునకు తిరిగి నమాజ్ చేసారో వారి గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ – మేము మీ విశ్వాసాన్ని అంటే ఖిబ్లా మార్పునకు ముందు బైతుల్ మఖ్ దిస్ వైపునకు తిరిగి మీరు చదివిన నమాజులను వృథా కానివ్వము అని సెలవిచ్చాడు.
ఇక్కడ నమాజు విశ్వాసం (ఈమాన్) లాగా ఖరారు చేయడం ద్వారా దీనికి గల మహత్యం,ప్రాముఖ్యత అర్థమవుతాయి.
నమాజ్ ప్రాముఖ్యత గూర్చి మేము కొన్ని ఆయతులు ప్రస్తావించాం. అలాంటివి ఇంకా చాలా వున్నాయి. ఇస్లాంలోని మౌలికాంశాలలో నమాజ్ గురించి దివ్య ఖురాన్లో అన్నింటి కన్నా ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది. అందుకే ముస్లిములందరూ దీనిని విధిగా క్రమం తప్పకుండా పాటిస్తూ వుండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని త్యజించకూడదు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా నమాజ్ ప్రాధాన్యత గురించి నొక్కి వక్కాణిస్తూ నమాజ్ నెలకొల్పడాన్ని, అంటే క్రమం తప్పకుండా నమాజును చదవడాన్ని ఇస్లాం మూల స్థంబాలలో ఒకటిగా మరియు మూలవిధిగా ఖరారు చేశారు.
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఇస్లాం ధర్మ పునాది 5 మౌలికాంశాలపై ఆధారపడి వుంది. (అవేమిటంటే) అల్లాహ్ తప్ప మరో నిజమైన ఆరాధ్యదైవం లేడని, ముహమ్మద్ – (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్య మివ్వడం, నమాజ్ నెలకొల్పడం, జకాత్ చెల్లించడం, హజ్ నిర్వర్తించడం మరియు రమజాన్ మాసంలో ఉపవాసాలుండడం.” (బుఖారీ, ముస్లిం)
అందుకే సహాబాలలో ఎవరైనా బైత్ (ప్రమాణం) చేయడానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద కొస్తే, ఆయన వారితో – ఐదు నమాజులను క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ చదువుతూ వుంటాను అని కూడా ప్రమాణం చేయించేవారు.
జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద బైత్ చేసినప్పుడు – “నమాజులను క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ నెలకొల్పుతూ వుంటానని, జకాత్ ఇస్తూ వుంటానని, ప్రతి ముస్లిం శ్రేయోభిలాషి (మంచిని కాంక్షించేవాడి)గా వుంటానని ప్రమాణం చేశాను”. (బుఖారీ: 524, ముస్లిం: 56)
నమాజ్ ఔన్నత్యాన్ని, ప్రాధాన్యతలను దృష్టిలో వుంచుకొని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఉమ్మతు కు నమాజ్ గురించే ఆఖరి వసీయతు చేశారు. దీని గురించి ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) ఇలా వివరించారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణించడానికి ముందు వ్యాధిగ్రస్తులై వున్నప్పుడు మాటిమాటికీ ఇలా ఉద్బోధించారు – “క్రమం తప్పకుండా నమాజ్ చదువుతూ వుండండి, (మీ స్వాధీనంలోని) బానిసల(సేవకుల) హక్కులను నెరవేర్చండి.”
ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం: ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు మాటిమాటికి ఉచ్చరిస్తూ పోయారు. చివరికి వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఆయన ఉచ్చరించడం (మాట్లాడడం) కష్టమైపోయింది. (ఇబ్నె మాజ: 1625, సహీహ్ – అల్బానీ)
అలీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (నోటి నుంచి వెలువడ్డ) ఆఖరి మాట ఇది: “నమాజ్ నెలకొల్పుతూ వుండండి, బానిసల (సేవకుల) హక్కులు నెరవేర్చండి”. (ఇబ్నె మాజ: 2698, సహీహ్ -అల్బానీ)
అందుకే ముస్లింలందరూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆఖరి వసీయతుపై ఆచరిస్తూ ఐదు నమాజులను క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ నెలకొల్పుతూ వుండాలి. దానిలో ఏమాత్రం ఏమరుపాటుకు గురికాకూడదు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) ను యమన్ వైపుకు పంపుతూ ఇలా హితబోధ చేశారు:
“నువ్వు గ్రంథ ప్రజలు గల ప్రాంతానికి వెళుతున్నావు. అందుకే మొట్టమొదట వారిని – లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ గురించి సాక్ష్యమివ్వడానికి ఆహ్వానించు. ఒకవేళ వారు నీ మాట ఒప్పుకుంటే, తదుపరి వారికి – అల్లాహ్ మీపై రేయింబవళ్ళలో 5 నమాజులు విధిగా చేశాడని చెప్పు. దీనిని కూడా వారు స్వీకరిస్తే, తదుపరి వారికి – అల్లాహ్ మీపై జకాత్ను విధిగా చేశాడని చెప్పు. అది (జకాత్) మీలోని ధనవంతుల నుండి వసూలు చేసి (మీలోని) బీదవారికి అప్పగించబడుతుంది. ఒకవేళ వాళ్ళు ఈ విషయంలో కూడా నీకు విధేయత చూపితే, వారి దగ్గరి శ్రేష్ట వస్తువుల జోలికి పోవద్దు. అలాగే పీడితుల ఆర్తనాదానిక్కూడా దూరంగా వుండు. ఎందుకంటే పీడితుల ఆర్తనాదానికి, అల్లాహ్ కు మధ్య ఏ తెర అడ్డుగా వుండదు”. (బుఖారీ : 1496, ముస్లిం : 19)
తల్హా బిన్ ఉబైదుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:
నజద్ వాసుల్లోని ఒక వ్యక్తి – అతని జుట్టు చిందరవందరగా వుంది, అతని గుసగుసలైతే వినవచ్చు గానీ, అతను పలికేది అర్థం కాకుండా వుంది – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దగ్గరగా వచ్చి అకస్మాత్తుగా ఇస్లాం గురించి అడగడం మొదలుపెట్టాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – రేయింబవళ్ళలో 5 పూటలు నమాజ్ నెలకొల్పాలి అని అన్నారు. ఆ వ్యక్తి – ఇవి కాకుండా ఇంకా వేరే నమాజులు ఏమైనా విధిగా చదవాలా? అని అడిగాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – లేదు, కానీ నీవు స్వచ్ఛందంగా (నఫిల్ నమాజులు)చదువుకోవచ్చు అన్నారు. . తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – ఇంకా రమజాన్ మాసంలో ఉపవాసాలు కూడా వుండాలి అని అన్నారు. ఆ వ్యక్తి – ఇవి కాక, ఇంకా వేరే ఉపవాసాలు ఏవైనా విధిగా పాటించాలా? అని అడిగాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – లేదు, కానీ నీవు స్వచ్ఛందంగా – (నఫిల్ ఉపవాసాలు) వుండవచ్చు అని అన్నారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి జకాత్ విధిత్వము గురించి వివరించారు. అతను – ఇదిగాక, ఇంకా ఏవైనా నా సంపదలో నుంచి విధిగా చెల్లించాలా? అని అడిగాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – లేదు, కానీ నీవు స్వచ్ఛందంగా దానం చేయవచ్చు అని అన్నారు.
ఆ వ్యక్తి తిరిగి వెళుతూ ఇలా అన్నాడు – అల్లాహ్ సాక్షి! నేను వీటిలో (ఈ ఆదేశాలలో) ఏ మాత్రం పెంచనూ, తగ్గించను (అంటే యధావిధిగా ఆచరిస్తాను). దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- “ఒకవేళ ఇతను తాను చెప్పినట్లు చేస్తూపోతే – తప్పకుండా సాఫల్యం పొందుతాడు” అని అన్నారు. (బుఖారీ : 46, ముస్లిం : 11)
ఈ హదీసు ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – ఇస్లాం స్వీకరణ తర్వాత ఈ సత్య ధర్మం యొక్క అన్నిటికన్నా ప్రముఖ విధి రేయింబవళ్ళలోని 5 నమాజులు. కానీ దురదృష్టవశాత్తూ ఇస్లాం ధర్మంతో తమను జోడించుకొనే (ముస్లిములని చెప్పుకునే) చాలా మంది నేడు దీని మొట్టమొదటి మరియు ఎంతో ప్రాముఖ్యమైన విధి విషయంలోనే ఏమరుపాటుకు గురైవున్నారు. స్వయానా తమకు తాము దీని గురించి పట్టించుకోరు, తమ సంతానానిక్కూడా దీని గురించి బోధించరు. మరి చూడబోతే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 10 సం||ల పిల్లవాడికి ఒకవేళ అతను నమాజు చదవకపోతే – శిక్షించమని ఆజ్ఞాపించి వున్నారు.
“మీ పిల్లలు 7 సం. |ల వయస్సుకు వచ్చినప్పుడు వారికి నమాజ్ గురించి ఆదేశించండి, వారు 10 సం. లకు చేరుకున్నప్పుడు (నమాజ్ చదవకపోతే) వారిని శిక్షించండి.” (అహ్మద్, సహీహుల్ జామె – అల్ బానీ : 5868)
కనుక మనం కూడా క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ నమాజులు చదువుతూ వుండాలి మరియు మన పిల్లలకు కూడా బాల్యం నుంచే దానిని అలవాటు చేయాలి, తద్వారా వాళ్ళు పెరిగి పెద్దయ్యాక కూడా ఈ ప్రముఖమైన విధిని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు.
ఒక హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) క్రమం తప్పకుండా నమాజ్ చదివే వారికి అల్లాహ్ అతనికి తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశింప జేస్తానని వాగ్దానం చేశాడు – అన్న శుభవార్తను అందజేశారు.
ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ తన దాసులపై 5 నమాజులు విధి (ఫర్జ్)గా చేశాడు. ఇక ఎవరైనా ఈ నమాజులలో దేనిని కూడా తేలిగ్గా తీసుకొని విడిచిపెట్టకుండా, సక్రమంగా నెలకొల్పాడో, అతనికి అల్లాహ్ చేసిన వాగ్దానమేమిటంటే – ఆయన ఆ వ్యక్తిని తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. ఒకవేళ ఎవరైనా ఇలా చేయకపోతే – అతనికి ఏ విధమైన వాగ్దానం లేదు. అల్లాహ్ తలచుకుంటే అతణ్ణి శిక్షించనూ వచ్చు లేదా (అతణ్ణి క్షమించి) స్వర్గంలోకి ప్రవేశింపజేయనూ వచ్చు”. (అబూ దావూద్: 142, సహీహ్ – అల్బానీ)
ఒక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజ్ను ధర్మం యొక్క మూల స్థంభం లాగా ఖరారు చేశారు. స్తంభం లేకపోతే ఏ కట్టడం కూడా నిలువలేదు. అలాగే నమాజ్ చదవకపోతే ధర్మం కూడా మిగిలి వుండదు!
ముఆజ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“ఒక విషయానికి ఇస్లాం వేరు (లాంటిది). దాని స్తంభం నమాజ్ కాగా జిహాద్ దాని శిఖరం” (తిర్మిజీ : 2616, ఇబ్నె మాజ: 3973, సహీహ్ – అల్బానీ)
ఈ కారణంగానే, ప్రళయం రోజు అన్నింటికన్నా ముందుగా, నమాజ్ విషయంలో లెక్క తీసుకోబడుతుంది. ఒకవేళ దాసుడెవరైనా దానిలో సఫలీకృతు డైతే మిగతా విషయాల్లో కూడా సఫలుడౌతాడు. ఒకవేళ నమాజు లెక్కలో సాఫల్యం పొందలేకపోతే మిగతా విషయాల్లో కూడా సాఫల్యం పొందలేడు.
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రళయం రోజు దాసునితో అన్నింటికన్నా ముందుగా నమాజు విషయంలో లెక్క తీసుకోబడుతుంది. అది గనక సరిగా తేలితే మిగతా ఆచరణలు కూడా సరిగా తేలుతాయి. ఒకవేళ నమాజ్ సరిగా లేకపోతే మిగతా ఆచరణలు కూడా సరిగ్గా తేలవు.”
మరో ఉల్లేఖనంలో ఇలా వుంది:
“అతని నమాజ్ను పరికించడం జరుగుతుంది. అది గనక సవ్యంగా వుంటే అతను సఫలీకృతుడవుతాడు, ఒకవేళ అది సవ్యంగా లేకపోతే, అతను అగౌరవపరచబడి నష్టపోయేవారిలో చేరిపోతాడు”. (తబ్రానీ – ఔసత్, అస్సహీహ : 1358)
నమాజు మహత్యాలు
(1) నమాజ్ సిగ్గు మాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ٱتْلُ مَآ أُوحِىَ إِلَيْكَ مِنَ ٱلْكِتَـٰبِ وَأَقِمِ ٱلصَّلَوٰةَ ۖ إِنَّ ٱلصَّلَوٰةَ تَنْهَىٰ عَنِ ٱلْفَحْشَآءِ وَٱلْمُنكَرِ ۗ وَلَذِكْرُ ٱللَّهِ أَكْبَرُ ۗ وَٱللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ
“(ఓ ప్రవక్తా!) నీ వైపునకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ వుండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలిన తనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతి మరువ రాదు). మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు”. (అన్కబూత్ 29 : 45)
(2) (సద్వచనాల) సాక్ష్యం తరువాత అన్నిటి కన్నా ఉత్తమ ఆచరణ నమాజ్.
అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను – అల్లాహ్ కు అన్నింటికన్నా ప్రియమైన ఆచరణ ఏది? అని అడిగాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమయం ప్రకారం నమాజు చదవడం అని అన్నారు. నేను – ఆ తరువాత? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- తల్లిదండ్రులతో మంచిగా మెలగడం అని అన్నారు. నేను – ఆ తర్వాత? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం అని అన్నారు. (బుఖారీ: 5970, ముస్లిం: 85)
(3) నమాజ్ చిన్న పాపాలను కడిగేస్తుంది.
ఒకవేళ పెద్ద పాపాలకు దూరంగా వుంటే గనక, ఐదు పూటల నమాజు వాటి మధ్య జరిగే చిన్న పాపాలకు పరిహారం (కఫ్ఫారా) అవుతుంది.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఒకవేళ మీలో ఎవరి గుమ్మం ముందైనా ఒక కాలువ ప్రవహిస్తూ వుండి, దానిలో అతను ప్రతి రోజూ 5 సార్లు స్నానం చేస్తూ వుంటే అతని ఒంటి మీద మురికి ఏమైనా మిగిలి వుంటుందా? అని అడిగారు. అందరూ – వుండదు, ఏ మాత్రం వుండదని అన్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – ఐదు నమాజుల ఉదాహరణ కూడా ఇలాంటిదే. అల్లాహ్ వీటి ద్వారా పాపాలను కడిగేస్తాడు”. (బుఖారీ, ముస్లిం)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఐదు పూటల నమాజ్, ఒక శుక్రవారం తదుపరి శుక్రవారం వరకు, ఒక రమజాన్ మాసం తదుపరి రమజాన్ మాసం వరకు – మధ్యలో జరిగే చిన్న పాపాల కోసం పరిహారం (కఫ్పారా) అవుతాయి. షరతు ఏమిటంటే – పెద్ద పాపాలకు దూరంగా వుండాలి”. (ముస్లిం: 233) ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: ఒక ముస్లిం ఎవరైనా మంచిగా వుజూ చేసి, తదుపరి నమాజ్ చేస్తే, అల్లాహ్ ఆ నమాజు మరియు దాని తర్వాత రాబోయే నమాజు మధ్య జరిగే అతని చిన్న పాపాలను క్షమిస్తాడు”. (ముస్లిం : 227)
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏదైనా ఫర్జ్ నమాజ్ కోసం సమయం ఆసన్నమయినప్పుడు, ముస్లిం ఎవరైనా దాని కోసం మంచిగా వుజూ చేసి, దానిలో ప్రశాంతతను పాటించి తదుపరి వినమ్రతతో ప్రశాంతంగా రుకూ చేస్తే ఆ నమాజ్ అతని గత పాపాలకు పరిహారం అవుతుంది. కానీ షరతు ఏమిటంటే – అతను పెద్ద పాపాలకు దూరంగా వుండాలి. ఈ శ్రేష్ఠత ప్రళయం వరకూ వుంది”. (ముస్లిం : 228)
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“మీరు (పాపాలలో) మండుతున్నారు, మీరు (పాపాలలో) మండుతున్నారు. తదుపరి మీరు ఫజర్ నమాజ్ చదివితే, అది వాటిని (అంటే మీ పాపాలను) కడిగేస్తుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ (పాపాలలో) మండుతారు, మీరు మళ్ళీ (పాపాలలో) మండుతారు. తదుపరి మీరు జొహర్ నమాజ్ చదివితే అది వాటిని (మీ పాపాలను) కడిగేస్తుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ (పాపాలలో) మండుతారు, మీరు మళ్ళీ (పాపాలలో) మండుతారు. తదుపరి మీరు అస్ర్ నమాజ్ చదివితే అది వాటిని (మీ పాపాలను) కడిగేస్తుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ (పాపాలలో) మండుతారు, మీరు మళ్ళీ (పాపాలలో) మండుతారు. తదుపరి మీరు మగ్రిబ్ నమాజ్ చదివితే అది వాటిని (మీ పాపాలను) కడిగేస్తుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ (పాపాలలో) మండుతారు. మీరు మళ్ళీ (పాపాలలో) మండుతారు. తదుపరి మీరు ఇషా నమాజ్ చదవితే అది వాటిని (మీ పాపాలను) కడిగేస్తుంది. ఇలా మీరు నిద్రకు ఉపక్రమించినప్పుడు మీపై ఏ పాపం లిఖించబడి వుండదు. ఈ స్థితిలోనే మీరు నిద్రలేస్తారు.”(తబ్రానీ – సహీహ్ అల్బానీ, సహీహ్ అత్త బ్ వత్తర హీబ్: 357)
సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా ఒక ముస్లిం నమాజు చదవడం ప్రారంభించినప్పుడు అతని పాపాలు అతని తలపైకి ఎత్తబడతాయి. తదుపరి అతను సజ్దా చేసినప్పుడు అతని పాపాలు క్రిందికి పడిపోతాయి. ఇలా అతను నమాజు పూర్తి చేసేసరికి అతని మొత్తం పాపాలు క్రింద పడిపోతాయి.” (తబ్రానీ – సహీహ్ అల్బానీ, సహీహ్ అత్తర్ గీబ్ వత్తర్ హీబ్: 362)
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర కూర్చొని వుండగా ఒక వ్యక్తి ఆయన దగ్గరికొచ్చి – ఓ దైవ ప్రవక్తా! నాతో ఒక పాపం జరిగిపోయింది. దానికి శిక్ష తప్పనిసరి. కనుక మీరు నన్ను (దీనికిగాను) శిక్షించండి అని వేడుకున్నాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి – ఏం పాపం చేశావు, ఎలా చేశావు అని ఏమీ అడగలేదు. ఈ లోగా నమాజువేళ అయ్యేసరికి అతను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు నమాజు చదివాడు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికొచ్చి మళ్ళీ అదేమాట పలికాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో – మాతో పాటు నువ్వు నమాజు చదవలేదా? అని అడిగారు. అతను – చదివానండి అని అన్నాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) – వెళ్ళు, అల్లాహ్ నీ పాపాలను క్షమించేశాడు అని చెప్పారు. (బుఖారీ : 6823, ముస్లిం : 2765)
(4) నమాజ్ చదివే వారికి నమాజ్, పరలోకంలో వారికి కాంతి ప్రసాదించబడడానికి కారణభూతమవుతుంది.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.
“ఏ వ్యక్తి అయినా క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ నమాజ్ చదువుతూ వుంటే – ఆ నమాజ్ అతనికి కాంతి మరియు ఆధారం (లాగా వుంటుంది). ప్రళయం రోజు సాఫల్యానికి కారణభూతమవుతుంది. ఇక ఏ వ్యక్తి అయినా ఎల్లప్పుడూ నమాజ్ చదవకపోతే అతనికి కాంతి వుండదు, ఆధారమూ ఉండదు. ప్రళయం రోజు సాఫల్యానికి కారణభూతం కూడా కాలేదు. ప్రళయం రోజు అతను ఖారూన్, ఫిరౌన్, హమాన్ మరియు ఉబై బిన్ ఖలఫ్ (లాంటి దురదృష్టవంతు)లతో వుంటాడు.” (అహ్మద్ : 2/169, దారిమి : 2/301, సహీహ్ -అల్ బానీ)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“చీకట్లలో మసీదులకు నడిచి వచ్చే (తరలివచ్చే) వారికి – ప్రళయం రోజు సంపూర్ణంగా కాంతి ప్రసాదించబడుతుంది- అన్న శుభవార్తను అందించండి”. (అబూ దావూద్: 561, తిర్మిజీ : 223, సహీహ్ -అల్ జానీ)
(5) నమాజు కోసం నడిచి వెళితే ఒక్కో అడుగుకు ప్రతిగా పాపాలు క్షమించబడతాయి మరియు దర్జాలు పెంచబడతాయి.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.
“ఏ వ్యక్తి అయినా తన ఇంట్లో వుజూ చేసుకొని, కేవలం అల్లాహ్ విధులలోని ఒక ప్రముఖ విధిని నిర్వర్తించాలన్న (నమాజ్ చదవాలన్న) ఉద్దేశ్యంతో ఇంటి నుంచి బయలు దేరి అల్లాహ్ గృహాల్లో (మసీదులు) ఒక గృహం వైపునకు వెళితే, అతను వేసే రెండు అడుగుల్లో ఒక అడుగు అతని పాపాన్ని తుడిచి వేస్తుంది, మరో అడుగు అతని ఒక దర్జా (స్థాయి)ని పెంచుతుంది”. (ముస్లిం : 666)
మరో ఉల్లేఖనంలో ఇలా వుంది:
“ఒకవేళ మీలో ఎవరైనా బాగా వుజూ చేసుకొని, (నమాజు నిమిత్తం) మస్జిదు వెళితే, అతని కుడి కాలు లేవగానే అల్లాహ్ అతని కొరకు ఒక పుణ్యాన్ని లిఖిస్తాడు మరియు అతని ఎడమ కాలు క్రింద వుంచగానే అల్లాహ్ అతని ఒక పాపాన్ని తుడిచేస్తాడు”. (అబూ దావూద్: 563)
(6) నమాజ్ చదివేవాడు మస్జిదు వెళ్ళిన ప్రతి సారి అతని కోసం స్వర్గంలో అతిథి ఏర్పాట్లు చేయబడతాయి.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా ఉదయం గానీ, సాయంత్రం గానీ మస్జిద్ కు వెళితే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో అతిథి ఏర్పాట్లు చేయిస్తాడు. అతను ఉదయం, సాయంత్రం ఎప్పుడు వెళ్ళినా సరే- (ఈ ఏర్పాటు వుంటుంది)”. (బుఖారీ : 662, ముస్లిం: 669)
(7) నమాజు చదివే వారి కోసం దైవ దూతలు సైతం ప్రార్థిస్తారు.
మనిషికి సామూహిక నమాజు ద్వారా దొరికే పుణ్యం – ఒంటరిగా లేక బజారులో చదివే నమాజు పుణ్యం కన్నా 20 రెట్ల కంటే అధికంగా వుంటుంది. ఇక ఎవరైనా బాగా వుజూ చేసుకొని, కేవలం నమాజ్ చదవాలన్న సంకల్పంతో మస్జిదు వస్తే అతను వేసే ఒక్కో అడుగుకు గాను అతని ఒక దర్జా పెంచబడుతుంది మరియు ఒక పాపం తుడిచివేయబడుతుంది. ఇలా మస్జిదు వచ్చి నమాజు కోసం వేచి చూస్తున్నంత వరకూ అతను నమాజులో వున్నట్లే. (అంటే నమాజు పుణ్యం దొరుకుతూ వుంటుంది.)
అతను జాయెనమాజ్ (నమాజు కోసం ఉపయోగించబడే వస్త్రం) మీద కూర్చొని వున్నంత వరకు దైవ దూతలు అతని కోసం ప్రార్థిస్తూ ఇలా అంటూ వుంటారు ‘ఓ అల్లాహ్! ఇతణ్ణి కరుణించు, ఇతణ్ణి క్షమించు, ఓ అల్లాహ్ ! ఇతని పశ్చాత్తాపాన్ని స్వీకరించు. అతను ఇతరులకు కష్టం కలిగించనంత వరకూ లేదా అతని వుజూ భంగం కానంత వరకూ వారు ఇలా అతని కోసం ప్రార్థిస్తూ వుంటారు.’ (బుఖారీ : 2119, ముస్లిం: 649)
(8) నమాజ్ చదివే వానికి ఇహ్రాం ధరించిన వానిలాగా పుణ్యం దొరుకుతుంది.
అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా తన ఇంటి నుండి వుజూ చేసి ఫర్జ్ నమాజ్ కోసం వెళతాడో అతనికి ఇహ్రాం ధరించిన వ్యక్తికి దొరికే పుణ్యం దొరుకుతుంది”. (అబూ దావూద్:558, హసన్ – అల్బానీ)
(9) నమాజ్ పాపాల మంటను చల్లారుస్తుంది.
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా అల్లాహ్ ఒక దైవదూతను నియమించాడు. అతను ప్రతి నమాజు సమయంలో ఇలా ప్రకటిస్తూ వుంటాడు – ఓ ఆదం సంతానమా! నిలబడండి, (నిలబడి) పాపాల ద్వారా మీరు మండించుకున్న మంటను చల్లార్చుకోండి!” (తబ్రానీ, హసన్ -అల్బానీ, సహీహ్ అత్తర్బ్ వత్తర్గీబ్: 358)
(10) ఐదు నమాజులను క్రమం తప్పకుండా నెలకొల్పేవాడు సత్యసంధుల (సిద్దీఖ్) మరియు షహీదుల కోవకు చెందినవాడు.
అమ్ బిన్ మర్ర అల్ జహమి (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధి కొచ్చి, “ఓ దైవ ప్రవక్తా! ఒకవేళ సద్వచనాల సాక్ష్యం ఇచ్చి, దీనితో పాటు ఐదు నమాజులు (క్రమం తప్పకుండా) చదువుతూ, జకాత్ చెల్లిస్తూ, రమజాన్ మాసపు ఉపవాసాలు పాటిస్తూ, దాని రాత్రిళ్ళలో నిలబడుతూ (అంటే నమాజు చేస్తూ) వుంటే నేను ఏ సమూహంలో వుంటాను? దీనికి మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగాడు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “నువ్వు సత్యసంధుల, షహీదుల సమూహంలో వుంటావు” అని జవాబిచ్చారు.
(బజ్జార్, ఇబ్నె ఖుజైమా, ఇబ్నె హెబ్బాన్, సహీహ్- అల్ బానీ, సహీహ్ అత్తర్ గీబ్ వత్తర్ హీబ్ : 361)
(11) నమాజ్ కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత (మనశ్శాంతి)
అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ఇలా సెలవిచ్చారు –
“నాకు ఈ ప్రపంచంలోని రెండు వస్తువులు ప్రియమైనవి. స్త్రీలు మరియు సువాసన. నా కంటి చలువ నమాజ్ యందు వుంచబడింది.” (అహ్మద్, నసాయి, సహీహ్- అల్ బానీ)
ఉద్దేశ్యపూర్వకంగా నమాజ్ త్యజించడం కుఫ్రి మరియు దాని శిక్ష ఎంతో ఘోరమైనది.
రండి, ఇక నమాజులను వృథా చేసే వారి గురించి, వాటిని నెలకొల్పడంలో అశ్రద్ధ చూపే వారి గురించి, వాటిని తమ ఇష్ట ప్రకారం (అసలు సమయాన్ని వదిలేసి) నెలకొల్పే వారి గురించి, వాటిని పూర్తిగా త్యజించిన వారి గురించి అల్లాహ్ ఏమని సెలవిచ్చాడో తెలుసుకుందాం,
నమాజులను వృథా చేసేవారికి అల్లాహ్ నరక శిక్షను గురించి హెచ్చరించాడు:
فَخَلَفَ مِنۢ بَعْدِهِمْ خَلْفٌ أَضَاعُوا۟ ٱلصَّلَوٰةَ وَٱتَّبَعُوا۟ ٱلشَّهَوَٰتِ ۖ فَسَوْفَ يَلْقَوْنَ غَيًّا
“ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజులను వృథా చేశారు, తమ మనో వాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు. (లేదా నరకంలోని ఒక లోయ ‘గై’ లో స్థలం పొందుతారు)”. (మర్యమ్ 19: 59)
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ‘గై’ గురించి ఇలా వివరించారు. అది నరకంలోని ఒక నది, దాని రుచి ఎంతో చెడుగానూ, దాని లోతు ఎంతో ఎక్కువగానూ వుంటుంది.
(కితాబుస్సలాత్ – ఇబ్నుల్ ఖయ్యూం – 40 పేజీ)
నమాజులను, వాటి నిర్ణీత వేళల్లో కాకుండా తమ ఇష్ట ప్రకారం చదివేవారి పర్యవసానం గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
فَوَيْلٌۭ لِّلْمُصَلِّينَ ٱلَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ
“ఆ నమాజీలకు వినాశం తప్పదు. (వైల్ అనే నరక స్థానం వారి కొరకు వున్నది) (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.” (మాఊన్ 107 : 4-5)
ఈ ఆయతులలో అల్లాహ్ కొందరు నమాజీలకు వినాశం (లేదా నరకంలోని ఒక లోయ) గురించి హెచ్చరించాడు. వారెలాంటి నమాజీలంటే – నమాజులు చదువుతారు, కానీ వాటి నిర్ధారిత వేళలను పట్టించుకోకుండా, తమ ఇష్టం వచ్చినప్పుడు చదువుతారు. ఓ సారి నిర్ణీత వేళలో చదివితే మరోసారి తమ ఇష్ట ప్రకారం చదువుతారు.
కనుక, ఇలా నమాజులను ఆలస్యంగా నిర్ణీత సమయాల్లో కాకుండా) చేయడాన్ని అలవాటుగా చేసుకున్నవారు, ఈ ఆయత్ ల ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి. ప్రత్యేకించి ఫజర్, జొహర్ మరియు అసర్ నమాజులు. వీటిని వారు వాటి ఆఖరి సమయంలో లేదా ఒక్కోసారి సమయం దాటి పోయాక చదువుతూ వుంటారు!
ప్రళయం రోజు నమాజును త్యజించిన వారి పర్యవసానం గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
فِى جَنَّـٰتٍۢ يَتَسَآءَلُونَ عَنِ ٱلْمُجْرِمِينَ مَا سَلَكَكُمْ فِى سَقَرَ قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ
“వారు (స్వర్గ) వనాలలో (కూర్చొని) అడుగుతూ వుంటారు, అపరాధుల గురించి. ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకువచ్చింది? (అని ప్రశ్నిస్తారు). వారిలా సమాధానమిస్తారు – మేము నమాజు చేసేవారము కాము.” (ముద్దస్సిర్ 74 : 40-43)
ఈ ఆయతులలో అల్లాహ్ తెలియజేసిందేమిటంటే స్వర్గవాసులు నరకవాసులతో – ఏ ఆచరణ మిమ్మల్ని నరకంలోకి చేర్చింది? అని అడుగుతారు. దానికి వారు తమ మొదటి నేరంగా మేము నమాజులు చదవలేదు అని అంటారు.
దీని ద్వారా రూఢీ అయినదేమిటంటే నమాజు చదవకపోవడం నరకానికి చేర్చే ఆచరణ. వల్ ఇయాజు బిల్లాహ్.
అల్లాహ్ నమాజులను నెలకొల్పడంలో బద్దకంగా వ్యవహరిం చడాన్ని మునాఫిక్ (కపట విశ్వాసులు)ల కొన్ని లక్షణాలను వివరిస్తూ (దీనిని కూడా) ఉదహరించాడు:
إِنَّ ٱلْمُنَـٰفِقِينَ يُخَـٰدِعُونَ ٱللَّهَ وَهُوَ خَـٰدِعُهُمْ وَإِذَا قَامُوٓا۟ إِلَى ٱلصَّلَوٰةِ قَامُوا۟ كُسَالَىٰ يُرَآءُونَ ٱلنَّاسَ وَلَا يَذْكُرُونَ ٱللَّهَ إِلَّا قَلِيلًۭا
“నిశ్చయంగా కపటులు అల్లాహ్ ను మోసం చేయాలని చూస్తున్నారు. అయితే అల్లాహ్ వీరి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్దకంతో, కేవలం జనాలకు చూపించే ఉద్దేశ్యంతో నిలబడతారు. ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు.” (నిసా 4 : 142)
ఇంత వరకూ మేము వివరించిన ఆయతులలో, నమాజు చదవని వారికి, దానిని నెలకొల్పడంలో అశ్రద్ధ చూపేవారికి గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఉద్దేశ్యపూర్వకంగా నమాజును వదలిపెట్టడం కుఫ్ర్ (అవిశ్వాసం).
దీని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“మనిషి మరియు కుఫ్ర్ కు మధ్య తేడా నమాజును త్యజించడం”. (అహ్మద్, ముస్లిం)
సునన్ తిర్మిజీ లోని ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి:
“కుఫ్ర్ (అవిశ్వాసం) మరియు ఈమాన్ (విశ్వాసం) మధ్య తేడా నమాజును వదలిపెట్టడం”. (తిర్మిజీ : 2618, సహీహ్ -అల్బానీ)
అబూ మూసా అష్తోరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“మన మరియు వారి (అవిశ్వాసుల) మధ్య గల ఒప్పందం నమాజ్. అందుకే ఎవరైతే దానిని విడిచిపెడతాడో అతను కుఫ్ర్ చేశాడు”. (తిర్మిజీ : 2621, ఇబ్నె మాజ : 1079, సహీహ్-అల్బానీ)
ఇమామ్ అబూ అబ్దుల్లాహ్ అల్ మర్వజీ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చా రు:
అల్లాహ్ నమాజ్ ను త్యజించడంపై గట్టిగా హెచ్చరించాడు మరియు తన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట – నమాజు త్యజించినవాడు విశ్వాసం (ఈమాన్) నుండి వైదొలుగుతాడని తాకీదు చేయించాడు, ఇలా కుఫ్ర్ మరియు ఈమాన్ల మధ్య నమాజును తప్ప దాసుల ఏ ఇతర ఆచరణలను కూడా సూచన లాగా సెలవీయలేదు. అంటే ఈ రెండింటి మధ్య బేధం గుర్తించడానికి నమాజ్ నే సూచనగా చేయడం జరిగింది.
(తాజీమ్ ఖద్రుస్సలాత్ లిల్ మర్వజి- 1వ సంపుటం, 132వ పేజీ)
అబ్దుల్లా బిన్ షఖీఖ్ అల్ అఖీలి (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు:
“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలు నమాజును తప్ప వేరే ఇతర ఏ ఆచరణలు వదిలి పెట్టినా దానిని కుఫ్ర్ అని భావించేవారు కాదు.” (తిర్మిజీ, హాకిమ్, సహీహ్- అల్లానీ, సహీహ్ అత్తర్ గీబ్ వత్తర్ హీబ్ : 565)
ఇమామ్ మున్దరి (రహిమహుల్లాహ్) ఇలా వివరించారు:
సహాబాలు మరియు వారి తర్వాత వచ్చిన సలఫుస్సాలిహీన్స్ ఒక సమూహం కలిగివున్న దృష్టి కోణం ఏమిటంటే – ఉద్దేశ్యపూర్వకంగా నమాజును దాని సమయం గడిచిపోయేంత వరకు విడిచి పెట్టేవాడు అవిశ్వాసి (కాఫిర్).
ఈ దృష్టి కోణం ఉన్న వారిలో ప్రముఖులు- ఉమర్ బిన్ ఖత్తాబ్, అబ్దుల్లా బిన్ మస్ హోద్, అబ్దుల్లా బిన్ అబ్బాస్, ముఆజ్ బిన్ జబల్, జాబిర్ బిన్ అబ్దుల్లా, అబూ దర్గా (రదియల్లాహు అన్హుమ్). వీరితో పాటు ఇమాములలో – అహ్మద్ బిన్ హంబల్, ఇసహాఖ్ బిన్ రాహవే, అబ్దుల్లా బిన్ ముబారక్, నఖీ, హకం బిన్ ఉతైబా, అయ్యూబ్ సఖ్ తియానీ, అబూ దావూద్ తియాల్సి, అబూ బక్ర్ బిన్ అబీ షైబా మరియు జహీర్ బిన్ హర్బ్ వగైరాలు ప్రముఖులు. (అత్తర్ గీబ్ వత్తర్ హీబ్: 1వ సంపుటం, 386వ పేజీ)
ఈ ఆధారాలన్నింటి ద్వారా రుజువైనదేమిటంటే – ఉద్దేశ్యపూర్వకంగా నమాజు వదిలిపెట్టడం కుఫ్ర్, సహాబాలు కూడా దీనిని కుఫ్ర్ అనే భావించేవారు, అందుకే దీనిని త్యజించిన వారికి మేము ముందుగా వివరించినట్లు అల్లాహ్ తీవ్రమైన శిక్షను గురించి హెచ్చరించాడు.
ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చి – ఓ దైవ ప్రవక్తా! ఒకవేళ నేను ఆచరిస్తే గనక నన్ను స్వర్గానికి తీసుకెళ్ళే ఆచరణ(ల) గురించి తెలియజేయండి అని విన్నవించుకున్నాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం):
“నిన్ను ఎలా శిక్షించినా లేదా అగ్నిలో మండించినా అల్లాహ్ తో మాత్రం షిర్క్ చేయకు. నీ సంపద నుండి, నీ ప్రతి వస్తువు నుండి నిన్ను గెంటేసినా నువ్వు మాత్రం నీ తల్లిదండ్రులకు విధేయత చూపు. ఉద్దేశ్యపూర్వకంగా నమాజ్ ను ఎప్పుడూ విడిచి పెట్టకు. ఎందుకంటే ఉద్దేశ్యపూర్వకంగా దీనిని వదిలేసే వాడి బాధ్యత నుండి అల్లాహ్ ముక్తుడవుతాడు.”
(తబ్రానీ, సహీహ్- అల్ బానీ, సహీహ్ అత్తర్ గీబ్ వత్తర్ హీబ్ : 569)
ఈ తాకీదునే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమ్మె ఐమన్ (రదియల్లాహు అన్హ) లకు చేసారు.
ఫర్జ్ నమాజు వేళలో నిద్రించే వ్యక్తికి విధించే శిక్ష గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కలలో చూసివున్నారు. దీని గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:
సముర బిన్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం –
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగించాక మా వైపునకు తిరిగి – మీలో ఎవరైనా ఈ రోజు రాత్రి ఏమైనా కల చూశారా? అని అడిగేవారు. ఒకవేళ ఎవరైనా చూసివుంటే అతను దాని గురించి చెప్పగా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాని గూఢార్థాన్ని వివరించేవారు. ఇలా, అలవాటు ప్రకారం ఒక రోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇదే విషయం అడగగా మేము – లేదు, మేమెవ్వరం చూడలేదండి అని జవాబిచ్చాం. దీనిపై ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) –
“కానీ నేను ఈ రోజు రాత్రి కల చూశాను. అదేమిటంటే – ఇద్దరు వ్యక్తులు నా వద్దకొచ్చారు. నన్ను లేపి, పదండి అని అన్నారు. నేను వారితో పాటు నడుస్తూ వెళ్ళాను. ఇలా మేము ఒక వ్యక్తి దగ్గరి కొచ్చాం. అతను పెడతల (తల వెనుక భాగం) ఆధారంగా తిన్నగా పడివున్నాడు. అతని దగ్గర మరో వ్యక్తి నిలబడి ఒక రాయితో అతని తలను చితక్కొడుతున్నాడు. అతను రాయితో కొట్టగానే రాయి కొద్ది దూరం పోతుంది. అతను ఆ రాయిని మళ్ళీ తీసుకొచ్చేలోపల ఇతని తల మళ్ళీ యధాస్థితికి వచ్చేస్తుంది. తదుపరి మళ్ళీ అతను రాయితో బాదుతాడు. నేనా ఇద్దరు వ్యక్తులతో – సుబహానల్లాహ్! ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అని అడిగాను,వాళ్ళు నాతో – ‘ముందుకెళదాం’ అని అన్నారు. ఇలా మేము ముందుకు సాగాం….. ఆతర్వాత వాళ్ళు నాతో – ఇక తల చితక్కొట్టబడిన మొదటి వ్యక్తి గురించి చెప్పాలంటే అతను దివ్య ఖురాను చదివేవాడు, కానీ దానిపై ఆచరించేవాడు కాదు మరియు ఫర్జ్ నమాజు వేళలో నిద్రిస్తూ వుండేవాడు అని అన్నారు”. (బుఖారీ : 7047)
ఇమామ్ ఇబ్న్ అల్-ఖయ్యూం రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు:
ఉద్దేశ్యపూర్వకంగా నమాజు విడిచిపెట్టడం పెద్ద పాపాల్లో ఒకటన్న విషయంలో ముస్లిముల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. దీని పాపం అల్లాహ్ దృష్టిలో చంపడం, సంపద దోచుకోవడం, వ్యభిచారం మరియు మద్యపానం సేవించడం కన్నా ఎక్కువ. నమాజును త్యజించినవాడు అల్లాహ్ అయిష్టతకు, శిక్షకు మరియు ఇహపరలోకాల్లో అవమానానికి గురై వుంటాడు.
ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) తన ఆచరణలను వ్రాసేవారు.
“ఆయన ఇలా అనేవారు- నా దృష్టిలో మీ ముఖ్యమైన పని నమాజ్ చదవడం. ఎందుకంటే దానిని కాపాడుకున్నవాడు తన ధర్మాన్ని కాపాడుకుంటాడు. ఇక దానిని వృధా చేసుకున్నవాడు ఇతర ఇస్లామీయ విధులను వృధా చేసుకుంటాడు. నమాజును త్యజించిన వాడికి ఇస్లాంతో ఏవిధమైన సంబంధం లేదు.”
(కితాబుస్సలాత్ – ఇబ్నుల్ ఖయ్యూం : 21, 22 పేజీలు)
అల్లాహ్ మనందరికీ ఇస్లామీయ విధుల్లో అతి ముఖ్యమైన ఈ విధిని నిర్వర్తించే మరియు దీనిని సక్రమంగా ఎల్లప్పుడు కాపాడే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!!
రెండవ ఖుత్బా
ప్రియతమ సోదరులారా!
మొదటి ఖుత్బాలో మీరు మేరాజ్ కానుకైన 5 నమాజుల విధిత్వము, ప్రాముఖ్యత మరియు మహత్యాల గురించి ఖురాన్, హదీసుల వెలుగులో కొన్ని విషయాలు విన్నారు. అంతేగాక ఉద్దేశ్యపూర్వకంగా నమాజ్ విడిచిపెట్టడం పెద్దపాపం అని దానికి విధించబడే శిక్ష గురించి కూడా విన్నారు.
ఇక ఈ రోజు మనం సామాన్య ముస్లిం ప్రజానీకం పరిస్థితి ఒకసారి చూస్తే మనకు తెలిసే దేమిటంటే – ఎంతో మంది ముస్లిములు దీని గురించి అశ్రద్ధకు లోనై వున్నారు. ఇలా, వీరు ఎంతో ప్రమాదకరమైన దారిలో పయనిస్తున్నారు. వాళ్ళు వెంటనే పశ్చాత్తాపపడి అల్లాహ్ ను సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి. నమాజుల గురించి మరీ అశ్రద్ధ చేయకుండా తమ ఇష్టానుసారం ఒకసారి చదివి మరోసారి విడిచి పెట్టేవారు, ఒక్కోసారి అన్ని నమాజులు చదివి ఇంకోసారి, ఒక నమాజు చదివి మరొకటి వదిలి పెట్టేవారు, ఒకసారి సమయం ప్రకారం చదివి మరోసారి సమయం దాటి పోయాక చదివేవారు, ఒకసారి మస్జిదు వెళ్ళి సామూహిక నమాజ్ చేసి మరోసారి షరీయత్తు పరమైన కారణమేదీ లేకుండానే తమ ఇంట్లో నమాజు చదివేవారు ఇలాంటి వారు కూడా తమ నడవడికను మార్చుకోవాలి. వారిపై విధిగా వున్న దేమిటంటే వారు అన్ని నమాజులు సామూహికంగా వాటి ఆరంభ సమయంలోనే చదవాలి.
ఎంతో మంది ముస్లిములు ఇతర నమాజులన్నీ సమయం ప్రకారం చదివి, వారి ఫజ్ర్ నమాజు మాత్రం వారి పడకలపై వృధా కావడం మనం చూస్తూ వుంటాం. అలాగే వారి అసర్ నమాజు కూడా (వృథా అవుతుంది). మరి చూడబోతే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రెండు నమాజులను (ఫజ్ర్ మరియు అసర్) క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ నెలకొల్పేవారికి స్వర్గపు శుభవార్తను ఇచ్చివున్నారు.
అబూ మూసా అష్ హరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు –
“ఏ వ్యక్తి అయినా రెండు చల్లటి (వేళల) నమాజులను (ఫజర్ మరియు అస్ర్) చదువుతూ వుంటాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.” (బుఖారీ : 574, ముస్లిం : 635)
“సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు నమాజు చదివే వ్యక్తి (ఫజర్, అస్ర్ నమాజులు) నరకంలోకి అస్సలు వెళ్ళడు (అంటే స్వర్గంలోకి వెళతాడు)”. (ముస్లిం : 634)
అంటే – ఫజర్ మరియు అసర్ నమాజులను క్రమం తప్పకుండా ఎల్లప్పుడూ నెలకొల్పే వ్యక్తి అన్నమాట,
ఇక ఫజర్ నమాజు సమయంలో నిద్రపోయే వ్యక్తి గురించి – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కల గురించి మేము మొదటి ఖుత్బాలో వివరించనట్లు – అతని తలను రాయితో చితక్కొట్టడం జరుగుతూ వుండడాన్ని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూశారని తెలుసుకున్నాం . వల్ ఇయాజిబిల్లాహ్.
ఇక అసర్ నమాజు విషయాని కొస్తే, దీనిని వదలి పెట్టేవారి గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“అసర్ నమాజ్ చదవని వ్యక్తి- అతని ఇంటివారు, అతని సంపద లాక్కోబడినట్లే” (బుఖారీ : 552, ముస్లిం : 626)
మరో ఉల్లేఖనంలో ఇలా వుంది:
“అసర్ నమాజు వదిలిపెట్టే వ్యక్తి ఆచరణలన్నీ వృథా అయిపోతాయి”. (బుఖారీ : 553)
మరి కొంత మంది ఇషా మరియు ఫజర్ నమాజుల విషయంలో అశ్రద్ధ చూపుతారు. మరి చూడబోతే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కపట విశ్వాసుల గురించి చెబుతూ – ఇషా మరియు ఫజర్ నమాజులు వారికి అత్యంత భారంగా వుంటాయి అని సెలవిచ్చారు.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా కపట విశ్వాసులకు అన్నింటికన్నా భారమైన నమాజులు, ఫజర్ మరియు ఇషా నమాజులు – ఒకవేళ వారికి వీటి (ఈ రెండు నమాజుల) పుణ్యం గనక తెలిస్తే, వీటి కోసం మోకాళ్ళపై రావాల్సి వచ్చినా, తప్పకుండా వచ్చేవారు”.(బుఖారీ: 644, ముస్లిం : 651)
కనుక, ఒక (నిజమైన) విశ్వాసికి – ఈ నమాజులను భారంగా తలచి, వీటి పట్ల అశ్రద్ద చూపడం ఎంత మాత్రం శోభించదు. పైగా వీటిని అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికి ఒక మాధ్యమంగా, మోక్షానికి ఒక కారణంగా భావించి సక్రమంగా ఎల్లప్పుడూ నెలకొల్పుతూ వుండాలి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَٱسْتَعِينُوا۟ بِٱلصَّبْرِ وَٱلصَّلَوٰةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى ٱلْخَـٰشِعِينَ ٱلَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَـٰقُوا۟ رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَٰجِعُونَ
“మీరు సహనం ద్వారా నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమైన పనే. కాని (అల్లాహ్ కు) భయపడేవారికి (ఇది సులువైన పని). (ఎందుకంటే) ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి వుందనీ, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందనీ వారు నమ్ముతారు.” (బఖర 2 : 45-46)
అల్లాహ్ మనందరినీ ఆయనపై పూర్తిగా నమ్మకముంచి, తౌహీద్ తర్వాత అతి ముఖ్య ఇస్లామీయ విధి (నమాజ్)ని సంపూర్ణంగా ఎల్లప్పుడూ నెలకొల్పే, వినయవిధేయతలు చూపేవారిలో చేర్చుగాక! ఆమీన్!!
—
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్