సేకరణ మరియు కూర్పు:ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఉర్దూ పరిశీలన:షేక్ మక్సూద్ ఉల్ హసన్ ఫైజీ – అల్-గాత్,సౌదీ అరేబియా
తెలుగు పరిశీలన: అబ్దుస్ సమీ, దాయి వ ముబల్లిగ్ రాజమండ్రి
[డౌన్లోడ్ PDF] [4 పేజీలు]
الحمد لله، والصلاة والسلام على رسول الله. أما بعد!
ఇస్రా మరియు మేరాజ్ సంఘటన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలో ఒక క్లిష్ట సమయంలో జరిగింది, ఆ సమయంలో ఆయనపై దుఃఖం యొక్క పెద్ద భారం ఉంది. ఇస్లాం ఆహ్వానం (దావత్) ప్రారంభించి పదేళ్లు గడిచాయి, కానీ ముష్రిక్కుల (బహుదైవారాధకుల) వ్యతిరేకత తగ్గడానికి బదులు మరింత పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఆయన పెదనాన్న అబూ తాలిబ్ మరియు భార్య హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హా) మరణం తర్వాత ముష్రిక్కులకు మరింత స్వేచ్ఛ దొరికినట్లయింది. ప్రవక్త గారు ఆశతో తాయిఫ్ వైపు వెళ్ళారు, కానీ అక్కడ కూడా ఆయనకు బాధలే ఎదురయ్యాయి. చివరికి ఒక ముష్రిక్ పెద్ద (ముత్ఇమ్ బిన్ అది) ఆశ్రయం పొంది మక్కాలోకి ప్రవేశించారు. దీని తర్వాతే అల్లాహ్ తరపున ఈ ఆహ్వానం (మేరాజ్) వచ్చింది. ఇందులో ఒకవైపు ఆయనకు అల్లాహ్ యొక్క అద్భుత నిదర్శనాలను చూపించడం జరిగితే, మరోవైపు ఆయనకు ఓదార్పు మరియు ప్రశాంతతను ఇస్తూ – “లోకంలోని వారు మిమ్మల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, ఆకాశవాసుల దృష్టిలో మీ స్థానం ఏమిటో చూడండి” అని తెలియజేయడం జరిగింది.
రండి, సంక్షిప్తంగా ఆయనకు చూపించబడిన ఆ అద్భుతాలను చూద్దాం:
[1] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వక్షస్థలం చీల్చి (షఖ్ఖె సద్ర్), గుండెకు శస్త్రచికిత్స చేసి, దానిని ఈమాన్ (విశ్వాసం) మరియు హిక్మత్ (జ్ఞానం)తో నింపడం. [బుఖారీ: 3887]
[2] గాడిద కంటే పెద్దది, కంచర గాడిద కంటే చిన్నది అయిన తెల్లని జంతువు ‘బురాక్‘పై ప్రయాణించడం. దాని అడుగు అది చూసే చివరి చూపు మేర పడేది. [బుఖారీ: 3887]
[3] రాత్రి యొక్క అత్యంత తక్కువ సమయంలో మస్జిదె హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు, అక్కడ నుండి ఏడు ఆకాశాలకు మరియు స్వర్గ-నరకాల దర్శనం చేసి తిరిగి మక్కాకు చేరుకోవడం.
[4] మస్జిదె అఖ్సాలో ప్రవక్తలందరికీ ఇమామత్ (నమాజుకు నాయకత్వం) వహించడం.
[5] వివిధ ఆకాశాలలో వివిధ ప్రవక్తలను కలవడం. [బుఖారీ: 3887]
ఏయే ఆకాశంలో ఎవరిని కలిశారంటే:
మొదటి ఆకాశం: హజ్రత్ ఆదమ్ (అలైహిస్సలాం)
రెండో ఆకాశం: హజ్రత్ ఈసా మరియు యహ్యా(అలైహిస్సలాం)
మూడో ఆకాశం: హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం)
నాలుగో ఆకాశం: హజ్రత్ ఇద్రీస్ (అలైహిస్సలాం)
ఐదో ఆకాశం: హజ్రత్ హారూన్ (అలైహిస్సలాం)
ఆరో ఆకాశం: హజ్రత్ మూసా (అలైహిస్సలాం)
ఏడో ఆకాశం: హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం)
[6] ‘సిద్రతుల్ ముంతహా‘ (చిట్టచివరి బేరి చెట్టు) వరకు చేరుకోవడం. దాని పండ్లు హజర్ ప్రాంతపు పెద్ద మట్టి కుండలంత పెద్దవిగా, ఆకులు ఏనుగు చెవులంత ఉన్నాయి. దాని వేర్లు ఆరో ఆకాశంలో, పై కొమ్మలు ఏడో ఆకాశం వరకు ఉన్నాయి. ఇది అనేక అద్భుతాలకు కేంద్రం:
1) ‘జన్నతుల్ మఅవా‘ (నివాస స్వర్గం) దీనికి దగ్గరలోనే ఉంది)
2) అదే చోట కలాల (కలంతో రాసే) శబ్దం వినిపిస్తుంది.
3) అదే స్థానంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మూడు కానుకలు లభించాయి:
– ఐదు పూటల నమాజుల కానుక.
– సూరహ్ అల్-బఖరాలోని చివరి రెండు ఆయతులు.
– ప్రవక్త గారి ఉమ్మత్ (అనుచరుల)లో ఎవరైతే షిర్క్ (బహుదైవారాధన) చేయరో, వారి ఘోర పాపాలు (కబీరా గునాహ్) క్షమించబడతాయనే శుభవార్త. [ముస్లిం: 173]
4) హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను ఇక్కడ ఆయన అసలు రూపంలో రెండోసారి చూశారు.
5) ఇక్కడ నాలుగు నదులను చూశారు, వాటి ఊటలు అక్కడే ఉన్నాయి. [బుఖారీ: 3887]
6) మద్యం, పాలు మరియు తేనె పాత్రలు సమర్పించగా, ప్రవక్త గారు పాల పాత్రను స్వీకరించారు. [బుఖారీ: 3887]
[7] బైతుల్ మామూర్‘ను చూశారు. ప్రతిరోజూ డెబ్భై వేల మంది మలైకా (దేవదూతలు) అందులో నమాజు చేస్తారు [తవాఫ్ చేస్తారు]. [బుఖారీ: 3207]
[8] హజ్రత్ మూసా (అలైహిస్సలాం)ను చూశారు – ఆయన గోధుమ రంగు, పొడవైన శరీరం మరియు ఉంగరాల జుట్టు కలిగి ఉన్నారు. హజ్రత్ ఈసా (అలైహిస్సలాం)ను చూశారు – ఆయన మధ్యస్థ ఎత్తు, మధ్యస్థ శరీరం, ఎరుపు మరియు తెలుపు కలసిన రంగు, మరియు తిన్నని జుట్టు కలిగి ఉన్నారు. నరక ద్వార పాలకుడు ‘మాలిక్‘ను చూశారు, అతను సలాం చేశాడు. అలాగే దజ్జాల్‌ను కూడా చూశారు. [బుఖారీ: 3239, ముస్లిం: 165, 172]
[9] స్వర్గాన్ని పరిశీలించారు. అందులో ముత్యాల గుమ్మటాలు ఉన్నాయి మరియు దాని మట్టి కస్తూరిలా (సువాసనతో) ఉంది. [బుఖారీ: 349,ముస్లిం:163]
[10] స్వర్గంలో ‘కౌసర్‘ నదిని చూశారు. [బుఖారీ: 4964, 6581]
[11] దైవదూతల ఏ సమూహం మీదుగా వెళ్ళినా, వారందరూ – “ఓ ముహమ్మద్! మీ ఉమ్మత్‌కు ‘హిజామా‘ (కప్పింగ్ థెరపీ) చేయించుకోమని ఆజ్ఞాపించండి” అని చెప్పారు. [ఇబ్న్ మాజా: 3479,సహీహా: 2263]
[12] ఫిరౌన్ పనిమనిషి (కేశాలంకరిణి) మరియు ఆమె భర్త, పిల్లల గొప్ప ముగింపును కూడా చూశారు (వారిని ఫిరౌన్ చంపించివేశాడు). [ముస్నద్ అహ్మద్: 5/30]
[13] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను మరొక రూపంలో చూశారు: ఆయన అల్లాహ్ భయంతో పాతబడిన గొంగళిలా (శిథిలమైన వస్త్రంలా) వణికిపోతున్నారు. [సహీహా: 2289]
[14] హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) ముహమ్మద్ ఉమ్మత్‌కు పంపిన ప్రత్యేక సందేశం: “ఓ ముహమ్మద్! మీ ఉమ్మత్‌కు నా తరపున సలాం చెప్పండి. స్వర్గపు మట్టి ఎంతో సారవంతమైనదని, నీరు తీపిగా ఉంటుందని, కానీ అది మైదానంలా (ఖాళీగా) ఉంటుందని, అందులో తోటలు పెంచడానికి ‘సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్‘ అనేవి విత్తనాలు (చెట్లు) అని తెలియజేయండి.” [తిర్మిజీ, హసన్ అల్-అల్బానీ:3462]
[15] మరో రివాయత్ (ఉల్లేఖనం) ప్రకారం – మీ ఉమ్మత్‌తో చెప్పండి, వారు స్వర్గంలో ఎక్కువ మొక్కలు నాటుకోవాలని, ఎందుకంటే అక్కడి మట్టి ఎంతో శ్రేష్ఠమైనది మరియు భూమి విశాలమైనది. ప్రవక్త గారు స్వర్గపు మొక్కలు ఏమిటని అడగగా, ఇబ్రహీం (అలైహిస్సలాం) బదులిచ్చారు: ‘లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా‘. [ముస్నద్ అహ్మద్: 5/418,సహీహా: 105]
[16] రాగి గోర్లు కలిగిన కొంతమంది మనుషులు తమ ముఖాలను, వక్షాలను గీక్కుంటున్నారు. వారి గురించి జిబ్రయీల్ (అలైహిస్సలాం) వివరిస్తూ – “వీరు ప్రజల మాంసాన్ని తినేవారు (అంటే చాడీలు చెప్పేవారు, పరోక్షనింద చేసేవారు) మరియు ప్రజల గౌరవానికి భంగం కలిగించేవారు” అని చెప్పారు. [అబూ దావూద్: 4878]
[17] కొంతమంది పెదవులను అగ్ని కత్తెరలతో కత్తిరించడం జరుగుతుంది. వారు ఎవరని అడగ్గా – “వీరు మీ ఉమ్మత్‌కు చెందిన ప్రసంగీకులు (ఖతీబ్‌లు). వీరు ప్రజలకు మంచి విషయాలు చెబుతారు కానీ తాము మాత్రం పాటించరు, వీరు గ్రంథాన్ని చదువుతున్నా అర్థం చేసుకోరు” అని చెప్పబడింది. [షర్హుస్సున్నహ్: 4159,ముస్నద్ అహ్మద్, సహీహా: 291]
[18] హజ్రత్ అబూ బకర్ (రజియల్లాహు అన్హు)కు ‘సిద్దీఖ్‘ అనే బిరుదు రావడానికి ఈ మేరాజ్ సంఘటనే కారణమైంది. [సహీహా: 306]
[19] హజ్రత్ సాలిహ్ (అలైహిస్సలాం) గారి ఒంటెను చంపినవాడిని కూడా ప్రవక్త గారు నరకంలో చూశారు. (ముస్నద్ అహ్మద్)
పై సత్య విషయాలు అందరికీ తెలియజేయండి. బిద్అత్ మరియు అపోహాలను దూరం చేసి, అసలు ఇస్లాంను పెంపొందించండి.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44187
ఇతర ముఖ్యమైన పోస్టులు & వీడియోలు
- మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు – నసీరుద్దీన్ జామియీ (హఫిజహుల్లాహ్) [వీడియో]
ప్రవక్త మేరాజ్ (గగణ ప్రయాణాని)కి రజబ్ లోనే వెళ్ళారా? ఈ సందర్భంగా తర్వాత రోజుల్లో షబె మేరాజ్ జరుపుకున్నారా? - మేరాజ్ ప్రయాణంలో దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో]
- ఇస్రా మరియు మేరాజ్ యాత్ర – సలీం జామియీ [వీడియో & టెక్స్ట్]
- ఇస్రా వ మేరాజ్ – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]
- మేరాజ్ కానుక – నమాజ్ (కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత) – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]
- మేరాజున్ నబీ పండుగ – జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)