రజబ్ అంటే: అరబీ భాషలో “గౌరవమైనది, పవిత్రమైనది”. కనుక అరబ్ వాసులు ఈ నెలను పవిత్రంగా భావించేవారు మరియు మూఢ (జాహిలియత్) కాలంలో ఈ నెలలో తమ ఆరాధ్యులైన విగ్రహాల పేరున జంతువులను బలినిచ్చేవారు. ఆ జంతువులను వారు ‘అతీరా’ అని పేర్కొనేవారు. కాని ఇస్లాం ధర్మం వచ్చిన తరువాత ఆ ఆచారాన్ని నిర్మూలించడం జరిగింది.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) రాక మునుపే, అంటే అజ్ఞాన కాలం నుండే రజబ్, జిల్ ఖాదా, జిల్ హిజ్జా మరియు ముహర్రం నెలలను పవిత్రంగా భావించేవారు. ఆ నెలలలో దండయాత్రలు లేక యుద్దాలు, తగాదాలు వంటి కార్యాలు నిషేధించబడి యున్నవి. దానివల్ల ప్రజలు హజ్ నియమాలను శాంతి భద్రతతో నెరవేర్చుటకు అనుకూల మయ్యేది. తరువాత ఆ నిషేధిత ఆదేశం కూడా తొలిగిపోయింది. అనివార్యమైన స్థితిలో ధర్మయుద్దాలు చేయవచ్చునని ధర్మగురువులు ఏకీభవించారు. కాని ఇతర నెలలకంటే ఎక్కువగా ఈ నాలుగు నెలల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని పాపాలకు మరియు అల్లాహ్ ఎడల అవిధేయతకు గురికాకుండా జాగ్రత్త పడాలని హితోపదేశం చేశారు. (లతాయిఫుల్ మఆరిఫ్).
“నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే కొనసాగుతున్నది) వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి”. (సూరతు తౌబా:36).
ప్రస్తుత కాలంలో కొంత మంది ముస్లింల చేత రజబ్ నెలలో ప్రత్యేకమైన నూతన కార్యాలను ఆరాధనలుగా జొప్పించుకున్నారు. అంటే; నఫిల్ ఉపవాసాలు, రగాయిబ్ నమాజ్, మరియు షబే మేరాజ్ పండుగ వంటి ఆరాధనలు. ఇలాంటి ఆరాధనలు నెరవేర్చుటకు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఆదేశించినట్లు హదీసు గ్రంథాలలో ఎక్కడ రుజువులు లేవు. అయినా కొంత మంది ప్రజలు కొన్ని బలహీనమైన, మనోకల్పిత హదీసులను ఆధారంగా చేసుకొని ఆరాధిస్తున్నారు. అలాంటి హదీసుల పట్ల అనేక ఇస్లామీయ ముఖ్య పండితులు ఇలా తెలియజేశారు:
ఇమామ్ హజ్రత్ ఇబ్ను హజర్ (రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలియజేశారు: “రజబ్ నెలలో పాటించే ఉపవాసాలకుగాని, నఫిల్ నమాజులకుగాని ఎటువంటి ఆధారపూర్వకమైన హదీసులు లేవు”(తబ్యీ నుల్ అజబ్: 71)
ఇమామ్ సుయూతి (రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలిపారు: “రజబ్ నెల ఉపవాసాల గురించి ఉన్న హదీసులన్నీ నిరాధారమైనవి, మనోకల్పితమైనవి కూడా. ” (అష్షమారీఖ్ ఫీ ఇల్మిత్ తారీఖ్-40).
హజ్రత్ అలీ బిన్ ఇబ్రాహీమ్ అల్ అత్తార్(రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలిపారు: “రజబ్ నెల ఉపవాసాల గురించి హదీసులన్నీ నిరాధారమైనవి, మనోకల్పితమైనవి.” (అల్ ఫాయిదుల్ మజ్మూఅ -440).
ఇమామ్ ఇబ్నుల్ జౌజి(రహ్మతుల్లాహి అలైహి) మరియు షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్ను తైమియా (రహ్మతుల్లాహి అలైహి) మరియు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ (రహ్మతుల్లాహి అలైహి) మరియు అనేక ప్రముఖ ధర్మ గురవుల అభిప్రాయం ప్రకారం: “రజబ్ నెలలో పాటించే ప్రత్యేకమైన ఆరాధనల ప్రాముఖ్యతకు ఎలాంటి విశ్వాసనీయ ఆధారాలు లేవు”అని తెలిపారు.
ప్రియమైన ముస్లిం సోదరులారా! మనం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధేయతను మరియు ఆయన చూపిన మార్గాన్ని మాత్రమే అనుసరించాలి. క్రొత్త క్రొత్త ఆచారాలను, ఆరాధనలను వెలుగులోకి తెచ్చుకొని ఆరాధించడం ధర్మ సమ్మతం కాదు. ప్రతి నెలలో ధర్మ పరమైన ఆరాధనలు ఎలాగైతే పాటిస్తున్నామో, అలాగే రజబ్ నెలలో కూడా మనం ఆరాధనలు పాటించాలి.
11- రజబ్‌కే కుండే
రజబ్‌కే కుండే పేరుతో ఒక పండుగ 1906వ సంవత్సరంలో భారతదేశం రాంపూర్ అనే పట్టణంలో ఆరంభమైనది. ఖుర్‌షీద్ అహ్మద్ మీనాయి అనే వ్యక్తి “దాస్తానే అజీబ్” అనే పేరున ఒక కట్టుకథ రచించాడు.
హజ్రత్ ఇమామ్ జాఫర్ సాదిఖ్ (రహ్మతుల్లాహి అలైహి) గారి గురించి ఆయన ఆదేశించినట్లుగా అతను ఇలా రాశాడు:
“ఎవరైతే రజబ్ 22వ తేదిన నా పేరున మొక్కుబడి చెల్లిస్తూ “కుండల ఆచారాన్ని” పాటించి, నా పేరున తన అవసరాన్ని వేడుకుంటే అతని అవసరం తప్పక తీరుతుంది. ఒక వేళ అతని అవసరం తీరకపోతే ప్రళయ దినాన నా దుస్తుల అంచు అతని చేతిలో ఉంటుంది.”
మన అమాయక ముస్లిం ప్రజలు ఆ కథను ఆధారంగా చేసుకొని, ప్రతి ఏట ‘కుండల పండుగ‘ పేరుతో మొక్కుబడి చెల్లిస్తూ రాత్రంతా హల్వా, పూరీలు అర్పిస్తారు. మరియు వాటిపై ఫాతిహాలు చేస్తారు. స్వతహాగా వారు తింటారు, ఇతరులను కూడా విందుగా ఆహ్వానిస్తారు.
1, ప్రియమైన ముస్లిములారా! మీరే ఆలోచించండి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయిన 1400 సంవత్సరాల తరువాత ఆరంభమైన ఈ కార్యం ఎలా పుణ్యపరమైనది?
2, ధర్మానికి చెందిన ప్రతి పుస్తకంలో మొక్కుకోవడం మరియు వేడుకోవడం, అల్లాహ్ యొక్క ఆరాధనే అవుతుందని ఉంది. ఆ ఆరాధన అల్లాహ్‌కు మాత్రేమే సొంతం చేయాలి. అల్లాహ్‌ను తప్ప ఇతరులను ‘మొక్కుకోవడం, మొరపెట్టుకోవడం షిర్క్ అవుతుంది. అలాంటప్పుడు హజ్రత్ ఇమామ్ జాఫర్ (రహ్మతుల్లాహి అలైహి) లాంటి మహా ధర్మ గురువులు ఇలాంటి బహుదైవారాధన గురించి ఆదేశమిచ్చినట్టు, దానిని ప్రోత్సహించినట్లు మనం ఎలా భావించగలం?
3, రజబ్ నెల 22వ తేదికి మరియు ఇమామ్ జాఫర్ (రహ్మతుల్లాహి అలైహి) గారికి సంబంధం ఏమిటి? ఆ రోజు ఆయన జననం కాదు మరియు మరణం కూడా కాదు. ఆయన 80 హిజ్రీ, రమజాన్ 8వ తేదిన జన్మించారు, 148 హిజ్రీ, షవ్వాల్ 15వ తేదిన మరణించారు. ఆయన జీవితంలో ఆ తేదిన ముఖ్యమైన సంఘటన జరిగినట్లు కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే; రజబ్ 22వ తేదిన కాతిబే వహీ హజ్రత్ ముఆవియా (రజియల్లాహు అన్హు) గారి మరణం జరిగింది. అలాంటప్పుడు ఇమామ్ జాఫర్ (రహ్మతుల్లాహి అలైహి) గారికి మరియు రజబ్ నెలకు ఎలాంటి పొంతన లేదు.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 79-82). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ఒక కీలకమైన ఘట్టం, ఇస్రా మరియు మేరాజ్ (రాత్రి ప్రయాణం మరియు ఆరోహణ) గురించి వివరించబడింది. ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కాలో పది సంవత్సరాల పాటు ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక, మరియు సామాజిక కష్టాల గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా తాయిఫ్‌లో ఆయనపై జరిగిన దాడి, ఆ తర్వాత ఆయన ప్రియమైన భార్య హజ్రత్ ఖదీజా మరియు పినతండ్రి అబూ తాలిబ్ మరణంతో కలిగిన దుఃఖం గురించి చెప్పబడింది. ఈ కష్టాల సమయంలో అల్లాహ్ తన ప్రవక్తకు ఓదార్పుగా ప్రసాదించిన అద్భుత ప్రయాణమే ఇస్రా మరియు మేరాజ్. ఈ ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఏడు ఆకాశాలలో ప్రవక్తలను కలవడం, స్వర్గ నరకాలను దర్శించడం, మరియు ముఖ్యంగా ముస్లిం సమాజానికి బహుమానంగా లభించిన ఐదు పూటల నమాజు, సూరహ్ బఖరా చివరి రెండు ఆయతులు, మరియు షిర్క్ చేయని వారి పాపాలు క్షమించబడతాయన్న శుభవార్త గురించి వివరించబడింది. ఈ ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, దానిని స్మరించుకునే పేరుతో బిద్అత్ (నూతన ఆచారాలు) చేయకుండా, ప్రవక్త తెచ్చిన అసలైన బోధనలను, ముఖ్యంగా నమాజును మరియు తౌహీద్‌ను ఆచరించాలని నొక్కి చెప్పబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
మహాశయులారా! ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రవక్త పదవిని పొందారు. ఆ తర్వాత ఇంచుమించు పది సంవత్సరాల వరకు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే మనం ఆరాధించాలి అని బోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల కష్టాలను కూడా భరించారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం ఊహించలేని, మనం పరస్పరం చెప్పుకోలేనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాల కష్టాలు వచ్చాయి. కానీ అల్లాహ్ కొరకు ఎంతో సహనం వహించారు.
పది సంవత్సరాలు గడిచిన తర్వాత మక్కా నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అయితే మక్కా నగరానికి ఇంచుమించు ఒక 80, 90 కిలోమీటర్ల దూరంలో తాయిఫ్ ఒక పెద్ద నగరము. అక్కడ నివసించే వారికి ఇస్లాం బోధన చేద్దామని వెళ్లారు. కానీ అక్కడి నుండి కూడా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కేవలం అల్లాహ్‌ను ఆరాధించే వారు అయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంతోషం కలిగేకి బదులుగా వారు కేవలం నిరాకరించలేదు, పైగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఎంతగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం నుండి రక్తం వెళ్లి పాదాల్లో ఏ బూట్లయితే వేసుకున్నారో, చెప్పులయితే వేసుకున్నారో అందులో రక్తం ఆగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సొమ్మసిల్లిపోయారు, స్పృహ తప్పిపోయారు.
మక్కా నగరం తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు, 25 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ, ఆమెకు ఒక ఉత్తమమైన భార్యగా నిలిచిన వారు హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా కూడా చనిపోయారు. గమనించండి, కేవలం సామాన్య మనలాంటి మనుషులకే మన భార్య చనిపోయింది అంటే మనకు ఏడుపొస్తుంది. కానీ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా ఒక సామాన్య భార్య కాదు, ఒక సామాన్య స్త్రీ కాదు. ఆ చరిత్రలోకి వెళితే చాలా సమయం మనకు ఇది అయిపోతుంది. హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారు చనిపోయాక కొద్ది రోజులకు వెన్నెముక లాంటి సహాయం అందించిన పినతండ్రి హజ్రత్ అబూ తాలిబ్ కూడా చనిపోతారు. ఆయన కేవలం చనిపోవడమే కాదు, ఇస్లాం ధర్మం స్వీకరించకుండా తాత ముత్తాతల ఆచారం మీద నేను చనిపోతున్నాను అని అనడం ప్రవక్త గారికి చెప్పలేనంత బాధ కలిగింది.
ఇన్ని బాధలను, ఇన్ని కష్టాలను, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఒక శుభ ఘడియ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అదేమిటి? రాత్రిలోని కొన్ని క్షణాల్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు, బురాఖ్ అన్న ఒక జంతువు తీసుకొచ్చారు. ఆ జంతువు గురించి సహీహ్ హదీథ్ లో వచ్చిన ప్రస్తావన ఏమిటి? అది హైట్ లో గాడిద కంటే పెద్దగా మరియు కంచర గాడిద కంటే చిన్నగా మరియు దాని వేగం ఎక్కడివరకైతే దాని దృష్టి పడుతుందో అక్కడి వరకు అది ఒక గంతు వేస్తుంది. అంతటి వేగం గల ఒక జంతువును తీసుకుని వచ్చారు.
కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం ఎన్నో క్యాలెండర్లలో, ఎన్నో ఫోటోలలో బురాఖున్ నబీ, ప్రవక్త వారికి గగన ప్రయాణం, మేరాజ్ ఏ వాహనంపై అయితే జరిగిందో దాని పేరు బురాఖ్ అని దానికి ఒక స్త్రీ ముఖం లాంటిది, ఇంకా వెనక ఒక తోక వేరే రకం లాంటిది, దాని కాళ్లు మరో జంతువు రకం లాంటివి, ఇలాంటి ఫోటోలు చూస్తాము. ఇవన్నీ కూడా అబద్ధము, అసత్యము, బూటకం. ఎందుకంటే ఆ జంతువు యొక్క చిన్నపాటి వర్ణన వచ్చింది కానీ అది, దాని ముఖం, దాని యొక్క ఇమేజ్, దాని యొక్క ఫోటో ఆ కాలంలో ఎవరూ తీయలేదు, దాని గురించి ఎలాంటి ప్రస్తావన హదీథుల్లో రాలేదు. ఇది మన యొక్క ధర్మంపై ఒక మహా అపనింద మనం వేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి ఫోటోలను మనం ప్రచారం చేసి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లినటువంటి బురాఖ్ అని చెప్పడం ఇది చాలా తప్పు విషయం.
అయితే సహీహ్ హదీథుల్లో వచ్చిన విషయం ఏంటి? ఆ జంతువు, దాని యొక్క వేగం మనం చెప్పలేము. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కించుకొని మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, ఫలస్తీన్ కి వెళ్లారు. ఆ ప్రస్తావన సూరహ్ బనీ ఇస్రాయీల్ లోని మొదటి ఆయతులోనే ఉంది.
“ఆయన పరమ పవిత్రుడు. తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిద్-ఎ-హరామ్ నుండి మస్జిద్-ఎ-అఖ్సా వరకు తీసుకువెళ్లాడు. దాని పరిసరాలను మేము శుభప్రదంగా చేశాము. ఇది మేము మా సూచనలను అతనికి చూపించటానికి చేశాము.” (17:1)
ఆ ప్రభువు, అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయనే రాత్రివేళ తన దాసునిని మస్జిద్-ఎ-హరామ్ నుండి బైతుల్ మఖ్దిస్, మస్జిద్-ఎ-అఖ్సా ఫలస్తీన్ వరకు తీసుకువెళ్లాడు. ఆ మస్జిద్-ఎ-అఖ్సా దాని చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా మేము దానిని శుభకరమైనదిగా చేశాము. ఎందుకు తీసుకువెళ్ళాము? మా యొక్క సూచనలు, మా యొక్క మహిమలు ఆయనకు చూపించాలని. అయితే దీనిని ఇస్రా అని అంటారు. ఇస్రా అంటే ఏంటి? మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు రాత్రివేళ ఏదైతే ప్రయాణం జరిగిందో దానిని ఇస్రా అని అంటారు. మరియు బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల వైపునకు ఏ ప్రయాణం అయితే జరిగిందో దానిని మేరాజ్ అని అంటారు. దాని ప్రస్తావన ఖుర్ఆన్ లో సూరహ్ నజ్మ్ లో వచ్చి ఉంది.
అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్రా, మేరాజ్ ఈ ప్రయాణం ఏదైతే చేశారో ఇది వాస్తవం. ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన ఉంది, సహీహ్ హదీథుల్లో దాని వివరాలు వచ్చి ఉన్నాయి. కానీ ఆ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమేమి జరిగినది? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడెక్కడ ఏమేమి దర్శించారు? ఏ ఏ అద్భుత విషయాలు మనకు తెలియజేశారు? మన విశ్వాసానికి, ఆచరణకు సంబంధించిన బోధనలు అందులో ఏమున్నాయి? అవి మనం తెలుసుకోవాలి ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల ద్వారా మరియు వాటి ప్రకారంగా మనం ఆచరించాలి, వాటి ప్రకారంగా మన విశ్వాసం సరిచేసుకోవాలి.
అలా కాకుండా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? జషన్, షబ్-ఎ-మేరాజ్, మేరాజున్ నబీ యొక్క ఉత్సవాలు అని జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి వాట్సాప్ లో ఒక సందర్భంలో ఏం రాశాడు? చేసుకునే వాళ్ళు చేసుకుంటారయ్యా, మీకేం నొస్తుంది? మీకేం బాధ కలుగుతుంది? అని బూతులు కూడా వదిలారు కొందరు. కానీ ఇక్కడ వారి మదిలో, వారి ఆలోచనలో ఏముందంటే, మేము ఏం చేసినా గానీ ప్రవక్త ప్రేమలో చేస్తున్నాము కదా, మేం ఏం చేసినా గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ గగన ప్రయాణం, మేరాజ్ అయితే ఒక గొప్ప బహుమానంగా ఇవ్వబడినదో దానిని గుర్తు చేసుకుంటున్నాము కదా, ఇందులో తప్పేమిటి? ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు వారివి ఉంటాయి కావచ్చు. కానీ ఇక్కడ గమనించాలి. ఏంటి గమనించాలి? ఒకవేళ ఇలా చేయడం ధర్మం అయితే ఈ ధర్మాన్ని అల్లాహ్ మనకు నేర్పలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు చేయలేదు, ఇమాములు చేయలేదు. అలాంటి కార్యం మనం చేస్తున్నాము అంటే మన ఆలోచన, మన ఉద్దేశం ఎంత ఉత్తమంగా, మంచిగా ఉన్నప్పటికీ అందులో మనకు పుణ్యం లభించదు, దాని వల్ల మనం బిద్అత్ లో పడిపోతాము, అది మహా ఘోరమైన పాపం అయిపోతుంది.
అందు గురించి మహాశయులారా! అలాంటి బిద్అత్ లకు, దురాచారాలకు మనం గురి కాకుండా ఈరోజు మీరు కొన్ని విషయాలు వింటారు ఇన్షా అల్లాహ్. ఏమిటి ఆ విషయాలు? ఈ గగన ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ ఏ బహుమానాలు బహూకరించబడ్డాయి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దృశ్యాలను చూశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రయాణం ఎలా జరిగింది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి?
అయితే పూర్తి వివరంగా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ప్రసంగం జరుగుతుంది. కానీ అలా కాకుండా టూ ద పాయింట్ హదీథుల ఆధారంగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దానిని మీరు శ్రద్ధగా ఆలకిస్తారు అని ఆశిస్తున్నాను.
ఇస్రా మరియు మేరాజ్ ప్రయాణం
మొదటి విషయం ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల జరిగినటువంటి గొప్ప మహిమ, ఒక అద్భుతం ఏమిటంటే ఈ ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెస్ట్ ఆపరేషన్ అని అనండి మీరు, హార్ట్ ఆపరేషన్ అని అనండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అని మీరు చెప్పుకోండి, చెప్పుకోవచ్చు. అది జరిగింది. వాస్తవం. హజ్రత్ అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్తున్నారు, నేను స్వయంగా చూశాను ఆ కుట్లను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఛాతి చీల్చబడి, అందులో నుండి గుండెను బయటికి తీసి, జమ్ జమ్ నీళ్లతో దానిని కడిగి, అందులో ఈమాన్, విశ్వాసం, హిక్మత్, వివేకాలతో నింపబడినది. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో దీని ప్రస్తావన ఉంది.
ఇక ఏ వాహనం పైన అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేశారో నేను ఇంతకు ముందు తెలిపినట్లు గాడిద కంటే పెద్దది మరియు కంచర గాడిద కంటే చిన్నది, దాని పేరు ఏమిటి? బురాఖ్. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలోని ఈ హదీథ్ లోనే వచ్చి ఉంది. ఇంతకు ముందు నేను చెప్పిన నంబర్ 3887.
మరియు ఈ ప్రయాణం మస్జిద్-ఎ-హరామ్ మక్కా నుండి మొదలుకొని ఫలస్తీన్, ఫలస్తీన్ నుండి ఏడు ఆకాశాలు, ఏడు ఆకాశాల పైన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సంభాషించడం మరియు స్వర్గాన్ని చూడడం, నరకాన్ని చూడడం మధ్యలో ఇంకా ఎన్నో విషయాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్నో రోజులు, ఎన్నో గంటలు పట్టలేదు. لَيْلًا (లైలన్) రాత్రిలోని కొంత భాగం మాత్రమే. అది ఎలా? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సర్వశక్తిమంతుడు. అవునా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఈ రోజు ఆ అల్లాహ్ ఇచ్చినటువంటి మేధ, బుద్ధి, జ్ఞానం, సైన్స్, విద్యతో రాకెట్లు తయారు చేస్తున్నారు. సామాన్యంగా ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడి నుండి మక్కా నేను ఒక రోజులో పోయి వస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంచుమించు 1000 కిలోమీటర్లు. కానీ ఈ రోజుల్లో సాధ్యమా లేదా? నాలుగు సార్లు పోయి రావచ్చు కదా మక్కా. అదే రాకెట్ యొక్క వేగం ఎంత ఉన్నది? అయితే నేను ఈ విషయాలు మళ్ళీ విడమరిచి చెప్పడానికి వెళ్తే సమయం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. మన విశ్వాసులం, ఖుర్ఆన్ లో వచ్చిన విషయం, సహీహ్ హదీథ్ లో వచ్చిన విషయాన్ని మనం తూచా తప్పకుండా నమ్మాలి, ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు గురి కాకూడదు.
అయితే మస్జిద్-ఎ-అఖ్సా లో చేరిన తర్వాత అక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదమ్ అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంత మంది ప్రవక్తలు వచ్చారో వారందరినీ జమా చేశాడు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఇమామత్, నమాజ్ చేయించే అటువంటి నాయకత్వం ఈ గొప్పతనం ఎవరికి లభించింది? ఎవరికీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అంటే ఇమాముల్ అంబియా అని అంటాము కదా మనం సామాన్యంగా ఉర్దూలో. ఇది వాస్తవ రూపంలో అక్కడ జరిగింది.
ఏడు ఆకాశాలలో ప్రయాణం మరియు సిద్రతుల్ ముంతహా
ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణంలో మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, ఏడు ఆకాశాలలో పైకి వెళ్లారైతే, మొదటి ఆకాశంలో హజ్రత్ ఆదమ్ అలైహిస్సలాం తో కలిశారు. రెండవ ఆకాశంలో ఈసా మరియు యహ్యా అలైహిముస్సలాం తో కలిశారు. మూడవ ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం తో కలిశారు. నాలుగవ ఆకాశంలో హజ్రత్ ఇద్రీస్ అలైహిస్సలాం తో కలిశారు. ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం తో కలిశారు. మరియు ఆరవ ఆకాశంలో హజ్రత్ మూసా అలైహిస్సలాం తో కలిశారు. ఏడవ ఆకాశంలో హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తో కలిశారు.
ఈ విధంగా ఏడు ఆకాశాలకు పైన ఒక రేగు చెట్టు ఉంది. దానిని సిద్రతుల్ ముంతహా అని అంటారు. ఆ చెట్టు, రేగు పండు ఒక్కొక్క పండు పెద్ద పెద్ద కడవలు చూసి ఉంటారు. పల్లెటూర్లలో పాతకాలంలో గోధుమాలో లేదా వడ్లు వేయడానికి పెద్ద పెద్ద గుమ్మీలు వాడేవారు. ఒక్కొక్క దాంట్లో 300 కిలో, 500 కిలోలు కూడా అంత స్థలం ఉంటుంది. ఆ విధంగా పెద్ద పెద్ద ఒక్కొక్క పండు అంత పెద్దగా ఉంటుంది. మరియు దాని యొక్క ఆకులు ఏనుగుల చెవుల మాదిరిగా అంత పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. హదీథ్ లో వచ్చిన విషయం ఏంటంటే, హిజ్ర్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంత వాసులు ఎలాంటి మట్టి నీళ్లు వేయడానికి బిందెలు లాంటివి, నీళ్లు పోసుకోవడానికి కడవల లాంటివి ఏదైతే ఉపయోగిస్తారో దానికి సమానమైన పండ్లు ఆ రేగు పండు ఒక్కొక్కటి మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటాయి.
ఇంకా ఆ రేగు చెట్టు యొక్క వ్రేళ్లు ఆరవ ఆకాశంలో ఉన్నాయి మరియు దాని యొక్క కొమ్మలు ఏడు ఆకాశాలకు పైగా ఉన్నాయి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎన్నో విషయాలు చూపించడం జరిగింది, ఎన్నో విషయాలు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగాయి. ఉదాహరణకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే అల్లాహ్ యొక్క చాలా దగ్గరగా ఉండే అల్లాహ్ ఆదేశాలను రాస్తూ ఉండే దైవదూతల కలముల శబ్దం విన్నారు, సిద్రతుల్ ముంతహాలో.
జన్నతుల్ మఅవా అన్నది దానికి సమీపంలోనే ఉన్నది. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మూడు విషయాలు బహుమానంగా ఇవ్వబడ్డాయి. ఎలా? మీకు ఏదైనా బహుమానం దొరికింది, ఏదైనా పెద్ద గిఫ్ట్ దొరికింది, ఒక షీల్డ్, క్రికెట్ లో మీరు కప్ గెలిచారు. దానిని తీసుకొచ్చి పారేస్తారా? ఏం చేస్తారు? కాపాడుతారు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ లభించిన విషయాలు ఏమిటి? ఐదు పూటల నమాజులు, ఇక దాని వివరణలో వెళ్తాలేను, ముందు 50 ఉండే ఆ తర్వాత ఇలా తగ్గింది అనేది. రెండవ బహుమానం, సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు, ఆమన రసూల్ బిమా ఉన్జిలా అక్కడ నుండి మొదలుకొని. మరియు మూడవ బహుమానం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజంలో, వారిని అనుసరించే వారిలో ఎవరైతే షిర్క్ నుండి దూరం ఉంటారో అల్లాహ్ త’ఆలా వారి యొక్క ఘోరమైన పాపాలను కూడా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్. ఈ మూడు పెద్ద బహుమానాలు.
సహీహ్ ముస్లిం షరీఫ్, హదీథ్ నంబర్ 173 లో వీటి ప్రస్తావన వచ్చి ఉంది. సిద్రతుల్ ముంతహా మరియు అక్కడ ఆ తర్వాత నుండి ఏదైతే విషయాలు చెప్పానో వాటి ప్రస్తావన. ఇక్కడ గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు లభించినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? ఏమిటి? చెప్పండి! ఐదు పూటల నమాజు. ఇంకా? సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు. మరియు మూడో విషయం? షిర్క్ చేయని వారి యొక్క ఘోర పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు అని శుభవార్త.
ఈ రోజుల్లో మేరాజున్ నబీ అన్నటువంటి బిద్అత్ చేసి, ఇంకా అందులో ఎన్నో రకాల షిర్క్ పనులు చేసి, రజబ్ మాసంలో రజబ్ కే కూండే అన్న పేరు మీద ఎన్నో షిర్క్ పనులు చేసుకుంటూ మనం ప్రవక్త విధానానికి ఎంత వ్యతిరేకం చేస్తున్నాము. ఎంతో మంది ఎవరైతే జషన్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని ఈ మేరాజ్-ఉన్-నబీ పేరు మీద రాత్రి జాగారం చేస్తారో, సంవత్సరంలో ఎన్ని నమాజులు వారు చేస్తున్నారు? ఆ రోజు వచ్చి ఎన్నో నఫిల్‌లు చేస్తారు కావచ్చు కానీ, మహాశయులారా! గమనించండి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప బహుమానంగా ఏ విషయాలు అయితే ఈ ప్రయాణంలో పొందారో వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం పాటించాలి, వాటిని ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా, అందులో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వాటిని మనం పాటించాలి.
ఇంకా మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని రెండవ సారిగా అతని యొక్క అసలైన రూపంలో చూశారు.
అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మత్తుపానీయం మరియు పాలు మరియు తేనె మూడు విషయాలు ఇవ్వబడ్డాయి. ప్రవక్తా ఇదిగో తీసుకోండి, మీరు సేవించండి అన్నట్లుగా ఏ విషయాలు ఇవ్వబడ్డాయి? అల్లాహు అక్బర్! మత్తుపానీయం, మరియు పాలు, మరియు తేనె. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తీసుకున్నారు? పాలు తీసుకున్నారు. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో ఈ ప్రస్తావన ఉంది.
మరియు ఏడవ ఆకాశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మఅమూర్ అని చూశారు. బైతుల్ మఅమూర్ ఏంటి? ఇహలోకంలో మన కొరకు బైతుల్లాహ్ ఎలానైతే ఉందో, కాబతుల్లాహ్, అలాగే దానికి స్ట్రెయిట్ గా ఏడు ఆకాశాల పైన బైతుల్ మఅమూర్ ఉంది. దైవదూతలు అక్కడ నమాజ్ చేస్తారు, దాని యొక్క తవాఫ్ చేస్తారు. ఒక్కసారి 70,000 మంది దైవదూతలు అక్కడ తవాఫ్ చేస్తారు, నమాజ్ చేస్తారు. మరియు ఒక్కసారి ఎవరికైతే ఈ అవకాశం దొరికిందో ప్రళయం వరకు మళ్ళీ వారికి ఈ అవకాశం దొరకదు. గమనించండి దైవదూతల సంఖ్య ఎంత గొప్పగా ఉందో. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నంబర్ 3207.
ఇంకా మహాశయులారా, ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ మూసా అలైహిస్సలాం వారిని కూడా చూశారు. అలాగే నరకం యొక్క కాపరి, మాలిక్ అతని పేరు, అతనిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఈ ప్రయాణంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని కూడా చూశారు, అలాగే నరకాన్ని కూడా దర్శించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం దర్శించారో అక్కడ చూశారు, వజ్రాలతో తయారు చేయబడినటువంటి అక్కడ గోపురాలు ఉన్నాయి. ఖైమా, ఇక్కడ ఏదైనా వాతావరణం చాలా సునాయాసంగా ఉండి, వేడి కూడా ఎక్కువ లేకుండా, చలి కూడా లేకుండా, మోసమ్-ఎ-రబీ అని ఏదైతే అంటారో మనం చూస్తాము కదా, ఎడారిలో డైరాలు వేసుకొని, ఖైమాలు వేసుకొని అక్కడ కొంత సమయం గానీ లేదా కొద్ది రోజులు గానీ గడుపుతారు. చూశారా కదా? అయితే అలాంటి ఖైమాలో వారికి ఎంత ఆనందం ఏర్పడుతుంది, అన్ని రకాల సౌకర్యాలు బహుశా అందులో ఉంటాయి కావచ్చు కానీ అస్తగ్ ఫిరుల్లాహ్, ఇది పోలిక కాదు స్వర్గంలో లభించే అటువంటి ఖైమాకు. కానీ అక్కడ ఒకే ఒక వజ్రం ఇంత పెద్దగా ఉంటుంది, ఆ ఒకే వజ్రంతో చాలా పెద్ద ఖైమాగా తయారు చేయబడుతుంది. మరియు అక్కడి యొక్క మట్టి కస్తూరి అని చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రస్తావన బుఖారీ 349, అలాగే సహీహ్ ముస్లిం 163 లో వచ్చి ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గంలో కౌథర్ అనేటువంటి ఒక పెద్ద వాగు ఏదైతే ప్రసాదించడం జరుగుతుందో దానిని కూడా చూసి వచ్చారు. అలాగే ఫిరౌన్ కూతురికి జడలు వేసే అటువంటి ఒక సేవకురాలు, ఆమె ఇస్లాం స్వీకరించింది, మూసా అలైహిస్సలాం ను విశ్వసించింది. దానికి బదులుగా ఫిరౌన్ ఆ దౌర్జన్యపరుడు, దుర్మార్గుడు ఏం చేశాడు? ఆమెను, ఆమె యొక్క నలుగురి సంతానాన్ని సలసల మసులుతున్న నూనెలో, వేడి నూనెలో వేసేశాడు. అయితే ఆమెకు స్వర్గంలో ఏ గొప్ప అక్కడ గృహం అయితే ప్రసాదించబడిందో, దానిని అక్కడి నుండి వస్తున్నటువంటి సువాసనను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహీహ్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, జిల్ద్ 5, పేజ్ 30.
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మరొక రూపంలో చూశారు. అల్లాహ్ తో భయపడుతూ ఎంత కంపించిపోయారంటే అతని యొక్క పరిస్థితి ఒక చాలా మాసిపోయిన లేదా పాడైపోయిన తట్టు గుంత ఎలా ఉంటుందో అతనిని చూస్తే అలా ఏర్పడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను సహీహాలో ప్రస్తావించారు, 2289.
ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం సందేశం
ఇంకా మహాశయులారా, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తతో కలిసి ఏం చెప్పారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నా వైపు నుండి నీ అనుచర సంఘానికి సలాం తెలుపు. అల్లాహు అక్బర్. సల్లల్లాహు అలైహి వ ఆలా ఆలిహి వసల్లం. అల్లాహ్ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా తన కరుణ, శాంతులు కురియజేయుగాక. గమనించండి. ఒకవేళ నేను, మీరు, మనందరము, ముస్లింలం అని అనుకునే వాళ్ళము, మేరాజ్-ఉన్-నబీ లాంటి బిదత్ పనులు, జషన్-ఎ-మేరాజ్ అని బిదత్ పనులు చేయకుండా నిజమైన ధర్మంపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మంపై ఉండి ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సలాం కూడా మనకు కలుగుతుంది. ఆయన ప్రత్యేకంగా సలాం పంపారు. ఇంకా ఏం చెప్పారు? ఓ ముహమ్మద్, నీ అనుచర సంఘానికి తెలుపు, ఈ స్వర్గం దీని యొక్క మట్టి ఇది చాలా మంచిది. ఇక్కడ విత్తనం వేసిన వెంటనే మంచి చెట్లు మరియు దానికి ఫలాలు వెంటనే అవుతూ ఉంటాయి. అట్లాంటి మట్టి ఇది. మరియు ఇక్కడి యొక్క నీరు కూడా చాలా మంచి నీరు. కానీ ఇప్పటివరకు అది ఎలాంటి చెట్టు లేకుండా ఉంది. అక్కడ చెట్టు మనకు కావాలంటే ఏం చేయాలి? నీ అనుచర సంఘానికి తెలుపు, సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అధికంగా చదువుతూ ఉంటే అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో మంచి చెట్లు నాటుతాడు, పరలోకంలో స్వర్గంలో చేరిన తర్వాత వారికి ఆ చెట్లు ప్రసాదించబడతాయి. అల్లాహు అక్బర్. ఏమైనా కష్టమా ఆలోచించండి? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం.
అలాగే మహాశయులారా, మరొక హదీథ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పారు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అధికంగా చదువుతూ ఉండమని చెప్పండి. ఈ హదీథ్ లు తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉన్నాయి. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని చెప్పారు.
నరకంలోని దృశ్యాలు మరియు హజ్రత్ అబూ బకర్ (ర.అ) విశ్వాసం
అలాగే నరకంని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్శించారు. నరకంలో ఏం చూశారు? నరకంలో ఒక చాలా భయంకరమైన దృశ్యం చూశారు. కొందరి యొక్క గోర్లు వారి యొక్క ఆ గోర్లు ఎలాంటివి? ఇత్తడివి. చాలా పొడుగ్గా ఉన్నాయి. వాటితో వారు తమ ముఖాలను, తమ శరీరాన్ని గీకుతున్నారు. తోలు బయటికి వచ్చేస్తుంది. వారి గురించి జిబ్రీల్ ను అడిగారు, ఈ పరిస్థితి వీరికి ఎందుకు జరుగుతుంది? అప్పుడు జిబ్రీల్ వీరికి తెలిపారు, వీరు ఎవరు తెలుసా? ప్రజల మానంలో, వారి యొక్క పరువులో చేయి వేసుకొని వారిని అవమానపరిచేవారు. అంటే పరోక్ష నిందలు, చాడీలు, గీబత్, చుగ్లీ, ఇంకా వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని వారిని నిందించడం, వారి యొక్క మానం, పరువులో జోక్యం చేసుకోవడం, ఇలా చేసుకునే వారికి ఈ శిక్ష జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సునన్ అబూ దావూద్ లో హదీథ్ వచ్చి ఉంది, 4878 హదీథ్ నంబర్.
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో రకాల దృశ్యాలు చూశారు కానీ మనకు సమయం అనేది సరిపోదు గనుక ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అదేమిటి? షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు, హదీథ్ నంబర్ 306.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం, ఈ మేరాజ్ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు ప్రజలకు తెలుపుతున్నారు. ఎవరైతే సత్య విశ్వాసులో వారు తూచా తప్పకుండా నమ్మారు. కానీ అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేశారు. ఏమని? మేము మక్కా నుండి ఫలస్తీన్ కు ఒక నెల రోజులు పడుతుంది మాకు పోవాలంటే. నీవు కేవలం ఫలస్తీన్ వరకే కాదు, ఏడు ఆకాశాల పైకి రాత్రిలోని కొన్ని క్షణాల్లో, కొంత సమయంలోనే వెళ్లి వచ్చావు అంటున్నావు అని హేళన చేశారు. అంతే కాదు, కొందరు అవిశ్వాసులు అయితే ఒకవేళ నీవు వాస్తవంగా ఫలస్తీన్ వెళ్లి, మస్జిద్-ఎ-అఖ్సా చూసి వచ్చావంటే దాని యొక్క వివరణ మాకు తెలుపు అని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎప్పుడైతే వారు అడిగారో నాకు దాని వివరణ ఏమీ తెలియదు. కానీ ఆ మస్జిద్-ఎ-అఖ్సా యొక్క దృశ్యం అల్లాహ్ నా ముందుకు తీసుకొచ్చాడు. వారు అడిగిన ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పుకొచ్చాను. అల్లాహు అక్బర్.
అక్కడ ఆ సమయంలో అబూ బకర్ రదియల్లాహు త’ఆలా అన్హు లేరు. ఎక్కడో దూరంగా ఏదో పని మీద ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాలు విన్న ఒక వ్యక్తి, “ఈరోజు అబూ బకర్, “ఎల్లవేళల్లో అబూ బకర్ ను చూశాము, ముహమ్మద్ చెప్పింది నిజమే, ముహమ్మద్ చెప్పింది నిజమే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ కు తోడుగా ఉన్నాడు కదా, ఈరోజు అబూ బకర్ కు వెళ్లి నేను తొందరగా ఈ విషయం తెలియజేస్తాను, అబూ బకర్ ఈ విషయాన్ని తిరస్కరిస్తాడు, అబద్ధం అని అంటాడు అన్నటువంటి నమ్మకంతో వెళ్లి, “అబూ బకర్! ఎవరైనా ఒక రాత్రిలో మక్కా నుండి ఫలస్తీన్ వెళ్లి వచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా?” అంటే, “లేదు.” సంతోషం కలిగింది అతనికి. వెంటనే అన్నాడు, “మరి మీ స్నేహితుడు, మీ యొక్క గురువు ముహమ్మద్ అంటున్నాడు కదా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ బకర్ వెంటనే చెప్పారు, “నిజమా? ముహమ్మద్ ఈ మాట చెప్పారా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అతను అన్నాడు, “అవును, ముహమ్మద్ ఈ మాట చెప్పాడు. అంతే కాదు, రాత్రిలోని కొంత భాగంలో ఫలస్తీన్ వరకే కాదు, మస్జిద్-ఎ-అఖ్సా కాదు, అక్కడి నుండి ఏడు ఆకాశాల పైకి కూడా వెళ్లారట.” వెంటనే అబూ బకర్ చెప్పారు, “ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పి ఉంటే నూటికి నూరు పాళ్లు నిజం, ఇది సత్యం, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.” అతడే, ప్రశ్న అడిగినవాడు, అబూ బకర్ గురించి ఏదో తప్పుగా ఆలోచించి వచ్చినవాడు చాలా ఆశ్చర్యపోతాడు. “ఎలా నీవు ఇది నిజం నమ్ముతున్నావు?” అని అంటే, “నీకు ఇందులో ఏం అనుమానం? ప్రవక్త చెప్తారు నాకు పొద్దున వహీ వస్తుంది, సాయంకాలం వహీ వస్తుంది, అల్లాహ్ నుండి దైవదూత వస్తున్నాడు, నాకు ఈ సందేశం ఇచ్చారు, మేము అన్ని విషయాలను నమ్ముతున్నాము. ఒకవేళ అల్లాహ్ త’ఆలా తలుచుకొని ప్రవక్తని అక్కడి వరకు తీసుకువెళ్లాడంటే ఇందులో మాకు నమ్మని విషయం ఏమిటి?” అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిద్దీఖ్, సత్యవంతుడు అన్నటువంటి బిరుదు లభించినది. సత్యవంతుడు అని బిరుదు లభించినది.
అందుకు మహాశయులారా, గమనించండి. సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు హజ్రత్ అబూ బకర్ కు ప్రవక్తను అనుసరిస్తే లభించిందా? ప్రవక్తను నమ్మితే లభించిందా? లేదా అనుసరణ, ఆచరణ అన్నిటినీ వదులుకొని కేవలం ప్రేమ, ప్రేమ, ప్రేమ అని కేవలం నోటికి చెప్పుకుంటే లభించిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అబూ బకర్ కు ఉన్నంత ప్రేమ ఇంకా ఎవరికీ లేకుండే. కానీ ఆయన అంతే అనుసరించేవారు. ప్రవక్త మాటను ఆచరించేవారు. ఈ గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలి. ఆచరణ అనేది ఉండాలి ప్రవక్త సున్నత్ ప్రకారంగా, దురాచారాన్ని వదులుకోవాలి, బిదత్ లను వదులుకోవాలి, షిర్క్ లను వదులుకోవాలి. మరియు ఏదైతే నమాజులను వదులుతున్నామో అది వదలకూడదు. ఎందుకు? ఇదే సామాన్య విషయమా నమాజ్? ఎక్కడ దొరికింది నమాజ్ ప్రవక్తకు? ఆకాశాల పైకి పిలువబడి ఇవ్వబడినది. ఇంతటి గౌరవమైన విషయాన్ని మనం ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా వదులుతున్నాము. అల్లాహ్ త’ఆలా మనందరికీ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్త గారు ఏ ఏ విషయాలు చూశారో, ఏ ఏ బహుమానాలు పొందారో, దాని గురించి కొన్ని విషయాలు ఏదైతే విన్నామో వాటిని అర్థం చేసుకొని, వాటిని పాటించే భాగ్యం ప్రసాదించుగాక. స్వర్గంలో తీసుకెళ్ళేటువంటి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు నరకంలో తీసుకెళ్ళే విషయాల నుండి దూరం ఉండే అల్లాహ్ త’ఆలా భాగ్యం కూడా మనకు ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
నరకంలో విషసర్పాల, తేళ్ళ కాటుల ద్వారా కూడా శిక్షించటం జరుగుతుంది. పాములు, తేళ్ళు ఈ రెండూ మానవ శత్రువులుగా భావించబడతాయి. ఈ రెంటి పేరు వింటేనే భయమేస్తుంది. ఈ రెండు ఉన్న చోట ఎవరూ కూర్చోవటం కాదు కదా, అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధపడరు. పాములు, తేళ్ళు ఎలా ఉంటాయంటే వాటిని చూడగానే మానవుని ఒళ్ళు జలదరిస్తుంది. భయంతో వణికిపోవడం జరుగుతుంది. పాములు, తేళ్ళు ఎంత వరకు విషం కలిగి ఉంటాయి? దీని గురించి కేవలం అల్లాహ్‌కే తెలుసు. కాని పరిశోధనల ద్వారా, ప్రయోగాల ద్వారా కొన్ని పుస్తకాల్లో ఉన్న వివరాలను బట్టి పాము అత్యంత విషపూరితమైనదని, మానవుని శత్రువని తేలింది.
ఫ్రాన్సులో ఉన్న పాముల ప్రదర్శనశాలలో ఉన్న ఒక విషసర్పాన్ని గురించి కొన్ని వివరాలు ప్రచురించబడ్డాయి. వీటి ప్రకారం 1 1/2 మీటర్ల పొడవైన ఈ పాము తన విషంతో ఒకేసారి అయిదుగురిని చంపగలదు.
1999 ఫిబ్రవరిలో కింగ్ సఊద్ యూనివర్శిటీలో విద్యార్థుల కొరకు ఒక విద్యా ప్రదర్శన ఏర్పాటయింది. ఇందులో ప్రపంచంలో ఉన్న వివిధ రకాలకు చెందిన విషసర్పాలను ప్రదర్శించటం జరిగింది. వీటిని గాజు పెట్టెలలో ఉంచడం జరిగింది. వీటిలో కొన్నిటిని గురించి ఈ క్రింది వివరాలు సేకరించబడ్డాయి.
అరబి కోబ్రా ఇది అరబ్ దేశాలలో ఉంది. ఇది ఎంత విషపూరితమైనదంటే దీని 20 మిల్లీ గ్రాముల విషం 70 కిలోల మానవుడ్ని వెంటనే చంపగలదు. అయితే ఈ కోబ్రా ఒకేసారి 200 మిల్లీగ్రాముల నుండి 300 మిల్లీగ్రాముల వరకు విషాన్ని శత్రువు పై విసరగలదు (ఉమ్మగలదు). భారతదేశం, పాకిస్తాన్‌లలో గల కింగ్ కోబ్రా ద్వారా కాటు వేయబడిన వ్యక్తి వెంటనే మరణిస్తాడు. పాశ్చాత్య దేశాలలో ఉండే వెస్ట్ డైమండ్ బేక్ర్ సర్పాలు కూడా అత్యంత విషపూరితమైనవే.
ఇండోనేషియాలోని ఉమ్మి విసిరే విషసర్పం రెండు మీటర్లు పొడవు ఉంటుంది. ఇది మూడు మీటర్ల దూరం నుండి మానవుని కళ్ళలోనికి విషాన్ని విసురుతుంది. దీనివల్ల మానవుడు వెంటనే మరణిస్తాడు.
నరకం కంటే ముందు అవిశ్వాసులను సమాధిలో కూడా పాము కాటుల ద్వారా శిక్షించటం జరుగుతుంది. సమాధి శిక్షను గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“అవిశ్వాసి మున్‌కర్ నకీర్‌ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనప్పుడు, వాడిపై 99 పాములు వదలివేయటం జరుగుతుంది. తీర్పుదినం వరకు అవి అతన్ని కాటు వేస్తూ మాంసాన్ని పీక్కుతింటూ ఉంటాయి. “
సమాధిలోని పాముల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉపదేశిం చారు:
“ఒకవేళ ఆ పాము ఒకసారి భూమిని కాటు వేస్తే భూమిపై ఏ ఆకు కూరలు పండవు.” (ముస్నద్ అహ్మద్)
సమాధిలోని పాముల గురించి ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖనంలో ఈ విధంగా కూడా పేర్కొనబడింది:
“ఒక్కొక్క పాముకు, 70 ముఖాలు ఉంటాయి. వాటితో అవి అవిశ్వాసిని తీర్పుదినం వరకు కాటు వేస్తూ ఉంటాయి.”
నరకంలోని పాముల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పేర్కొన్నారు:
“అవి ఒంటెలా ఎత్తుగా ఉంటాయి. అవి ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసికి 40 సంవత్సరాల వరకు బాధ కలుగుతూ ఉంటుంది.” (ముస్నద్ అహ్మద్)
సమాధిలో, నరకంలో కాటు వేసే పాములు నిస్సందేహంగా ఇహలోకంలోని పాముల కంటే ఎన్నో రెట్లు విషం గలవి, ప్రమాదకరమైనవి, భయంకరమైనవి. ఇహ లోకంలో ఒక సామాన్య విషసర్పం కాటు వేస్తేనే మానవుడు గిలగిల విలపిస్తాడు. వెంటనే మానవుడు స్పృహ కోల్పోతాడు. విషం ప్రవేశించిన భాగం పనికిరాకుండా పోతుంది. ముక్కు ద్వారా, నోటి ద్వారా, చెవి ద్వారా, కళ్ళద్వారా రక్తం స్రవిస్తుంది. ఈ పరిస్థితి అంతా పాము ఒక్కసారి కాటు వేసినందుకే జరుగుతుంది. ఆ మానవుడ్నే వేల రెట్లు అధిక విషం గల పాములు కాటు వేస్తూ ఉంటే ఎంతటి వ్యధకు గురవుతాడో ఆలోచించండి!
తేలు కాటు ప్రభావం, పాము కాటు ప్రభావానికి వేరుగా ఉంటుంది. తేలు కాటు వేస్తే మానవుడు రెండు విధాల బాధలకు గురవుతాడు. మొదట శరీరం ఉబ్బిపోతుంది. తరువాత ఊపిరి పీల్చుకోవటం కష్టం అవుతుంది. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది.
నరక తేళ్ళ గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
“అవి అడవి గాడిదల్లా ఉంటాయి. ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసి నలభై సంవత్సరాల వరకు దాని మంటను భరిస్తూ ఉంటాడు.” (ముస్నద్ అహ్మద్)
అంటే దీని అర్ధం తేలు నిరంతరం కాటు వేస్తూ ఉంటే నరకవాసుని శరీరం కూడా ఉబ్బుతూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవటంలోనూ బాధ పెరుగుతూ ఉంటుంది. ఇది నరకంలోని అవిశ్వాసికి ఇవ్వబడే శిక్షల్లో ఒకటి. అవిశ్వాసులు నరకంలోని పాములను తేళ్ళను చంపగలరా? ఎక్కడికైనా పారిపోగలరా? లేదా ఎక్కడైనా దాక్కోని రక్షణ పొందగలరా?
తిరస్కారులే అప్పుడు పశ్చాత్తాపపడుతూ, “అయ్యో! మేము ముస్లిములమయి ఉంటే ఎంత బాగుండేది” అని అంటారు. (అల్ హిజ్ర్ 15:2)
అయితే ఓ విశ్వాసులారా! నరక శిక్షలను విశ్వసించే ప్రజలారా! అల్లాహ్ శిక్షలకు భయపడండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క అవిధేయతకు దూరంకండి. అల్లాహ్ శిక్షల గురించి తెలిసి కూడా ఆయనకు అవిధేయత చూపటం అల్లాహ్‌కు ఆగ్రహం కలిగించినట్టే అవుతుంది.
فَهَلْ أَنتُم مُّنتَهُونَ
“మరి మీరు అల్లాహ్ అవిధేయతను వదిలివేస్తారా?” (అల్ మాయిదహ్ 5:91)
36వ అధ్యాయం: ప్రదర్శనాబుద్ధి అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
(ప్రవక్తా! ఇలా చెప్పండి: “నేను మీలాంటి మానవమాత్రుణ్ణే, నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. ‘మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒకే ఒక్కడు. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు”). (కహఫ్ 18:110).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు,అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “నేను ఇతర సహవర్తులకంటే అధికంగా “షిర్క్” కు అతీతుణ్ణి. ఎవరు ఒక పని చేసి, అందులో నాతో ఇతరుల్ని సాటికల్పిస్తారో నేను అతణ్ణీ, అతని ఆ పనిని స్వీకరించను“. (ముస్లిం).
అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నేను మీకు మసీహుద్దజ్జాల్ కన్నా భయంకరమైన విషయము తెలపనా?” అని ప్రశ్నిస్తే ‘తప్పక తెలుపండని’ మేము విన్నవించుకోగా “గుప్తమైన షిర్క్, అదేమనగా: ఒక వ్యక్తి చూసినవారు నన్ను మెచ్చుకోవాలని అలంకరిస్తూ, ఎన్నలతో నమాజ్ చేస్తాడు”. (అలా స్తుతించబడటానికి, చూచిన వారు మెచ్చుకోవాలనే ఉద్దేశముతో చేయడం గుప్తమెన షిర్క్)అని చెప్పారు. (అహ్మద్,ఇబ్ను మాజ: 4204).
ముఖ్యాంశాలు:
1. సూరయే కహఫ్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. (ప్రతి పని సంకల్ప శుద్ది (ఇఖ్లాస్)తో కూడుకొని యుండాలని చెప్పడం జరిగింది).
2. ఒక గొప్ప విషయం: సత్కార్యంలో అల్లాహ్ యేతరుల ఏ కొంచెం ప్రవేశమున్న (ఆ క్రియలో, లేక సంకల్పంలో) అది రద్దు చేయబడుతుంది.
3. అల్లాహ్ సంపూర్ణంగా అతీతుడు కనుక (ప్రదర్శనాబుద్ధితో కలుషితమైన) కార్యాన్ని స్వీకరించడు, (దానికి ఫలితం ప్రసాదించడు).
4. దానికి మరో కారణం ఏమనగా అల్లాహ్ అందరికన్నా ఘనతగలవాడు. (ఆయన్ని వదలి లేక ఆయనతో మరొకరిని సాటి కల్పించడం ఘోరమైన పాపం).
5. ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) తమ అనుచరుల పట్ల ప్రదర్శనా బుద్ధి నుండి భయం చెంది (దాని నుండి దూరముండాలని తాకీదు చేసారు).
6. దాన్ని విశదీకరించి చెప్పారు: నమాజు చేసే వ్యక్తి, చూసేవారు మెచ్చుకోవాలని ఎంతో అందముగా చేసే ప్రయత్నం చేస్తాడు.
తాత్పర్యం:(అల్లామా అల్ సాదీ)
అల్లాహ్ కొరకు నిర్దుష్టమైన భక్తి / ఏకాగ్ర చిత్తం కలిగియుండుట ధర్మం యొక్క పునాది. మరియు అదే తౌహీద్‌కు ప్రాణం. నిర్దుష్టమైన భక్తి / ఏకాగ్రచిత్తం (ఇఖ్లాస్) అంటే మానవుడు తను చేసే ప్రతి పని ఉద్దేశం అల్లాహ్ సంతృప్తి, ఆయన నుండి పుణ్యం, ప్రళయమున సాఫల్యం పొందుట కొరకే ఉండాలి. ఇదే అసలైన తౌహీద్.
దీనికి బద్ద విరుద్ధం ప్రదర్శనాబుద్ధి. చూసినవారు మెచ్చుకోవాలని, పొగడాలని, హోదా, ప్రాపంచిక లాభం పొందుట దాని ఉద్దేశం ఉండకూడదు.
ప్రదర్శనా బుద్ది గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలి:-
ఒక వ్యక్తి ఏదైనా సత్కార్యం చేయునప్పుడు, దాని ఉద్దేశం ప్రజలు చూడాలి అని మనుసులో వచ్చినప్పుడు, ఆ ఆలోచనను దూరం చేయకుండా అలాగే ఉండిపోతే దాని వలన ఆ సత్కార్యం వృథా అవుతుంది (ఫలితం లభించదు). అది చిన్న షిర్క్ అవుతుంది. అలాగే పెద్ద షిర్క్‌కు కారణం అవుతుందను భయం కూడా ఉంటుంది.
సత్కార్యం చేసే ఉద్దేశం అల్లాహ్ సంతృప్తితో పాటు ప్రజలు చూడాలి అని కూడా మనుస్సులో వచ్చినప్పుడు, అతని ఆ సత్కార్యంలో ప్రదర్శనాబుద్ది ప్రవేశించింది కనుక అది కూడా వృథా అవుతుందని నిదర్శనాలున్నాయి. సత్కార్యం చేసే ఉద్దేశం కేవలం అల్లాహ్ సంతృప్తి అయినప్పటికీ, మధ్యలో ప్రదర్శనాబుద్ది ఉద్దేశం ప్రవేశించి, అతను దాన్ని తొలగించి ఏకాగ్రచిత్తం (ఇఖ్లాసు) పాటిస్తే అతనికి ఏలాంటి నష్టం ఉండదు. ఆ దురుద్దేశాన్ని అతను తొలగించకుంటే, ఎంత శాతం ప్రదర్శనాబుద్ధి ఉందో, అంతే ఆ సత్కార్యంలో కొరత ఏర్పడుతుంది.విశ్వాసం, ఇఖ్లాస్లలో బలహీనత వస్తుంది.
ప్రదర్శనాబుద్ధి మహాగండం. దానికి చికిత్స చాలా అవసరం. మనసుకు ఇఖ్లాసు యొక్క మంచి శిక్షణ ఇవ్వాలి. ప్రదర్శనాబుద్ధిని, నష్టం కలిగించే మనోవాంఛల్ని తొలగించుటకు తగిన ప్రయత్నం చేయాలి. అందుకు అల్లాహ్ సహాయం కోరాలి. అల్లాహ్ తన దయ మరియు కరుణతో ఇఖ్లాస్ భాగ్యం ప్రసాదించి, తౌహీద్ వాస్తవికత యొక్క జ్ఞానం కలిగిస్తాడు.
ప్రాపంచిక లాభం, మనోవాంఛల కొరకు సత్కార్యం చేయుట:
అల్లాహ్ సంతృప్తి ఉద్దేశం ఏ మాత్రం లేకుండా, కేవలం పై ఉద్దేశమే ఉంటే, అతనికి దానికి బదులు ఏ లాభమూ ఉండదు. ఇలా ఒక విశ్వాసి ప్రవర్తించుట సమంజసం కాదు. విశ్వాసి అతని విశ్వాసం ఎంత బలహీనంగా ఉన్నప్పటికి అతను అల్లాహ్ సంతృప్తి, పరలోక లాభం కోరుటయే చాలా అవసరం.
ఎవరు అల్లాహ్ సంతృప్తి, ప్రాపంచిక లాభం రెండు ఉద్దేశాలతో చేసినప్పుడు, రెండు ఉద్దేశాలు ఒకే పరిమాణంలో ఉంటే, అతను విశ్వాసి అయి ఉంటే, వాస్తవానికి అతని విశ్వాసంలో, ఇఖ్లాస్లో కొరత ఉన్నట్లే. ఇఖ్లాసులో కొరత ఉన్నప్పుడు అతని కార్యం కూడా సంపూర్ణం కాదు. (ఫలితం సంపూర్ణంగా ఉండదు).
ఎవరు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, సంపూర్ణ ఇఖ్లాస్ తో చేస్తారో, కాని అతను దానిపై వేతనము లేక బహుమానము పొందుతాడు. దానితో అతను తన పని, ధర్మంలో సహాయం తీసుకుంటాడు. ఉదా: ఎవరైనా ఒకమంచి పని, పుణ్యకార్యం చేసినందుకు ఏదైనా బత్తెం దొరికినట్టు. ముజాహిద్ జిహాద్ చేయుటకు వెళ్ళినప్పుడు యుద్ధఫలం (గనీమత్)పొందినట్లు. మస్జిద్, మద్‌రసా మరియు ధర్మకార్యాలు నిర్వహించే వారికి వక్ఫ్ బోర్డు ఇచ్చే వేతనాలు. ఇలాంటివి తీసుకొనుట వలన విశ్వాసం, తౌహీద్‌లో ఏలాంటి కొరత, నష్టం వాటిల్లదు.ఎందుకనగా అతని ఆ సత్కార్యం చేయు ఉద్దేశం ఉంటుంది. అతను పొందునది అతలధర్మం పై నిలకడ కొరకు సహాయము చేయును. అందుకే జకాత్ మరియు మాలె పై (యుధ్ధ ఫలం లాంటిది) లాంటి ధనంలో, ధార్మిక మరియు లాభదాయకమైన ప్రాపంచిక కార్యాలు నిర్వహించువారికి హక్కు ఉంది.
నేటి సమాజంలో రోజు రోజుకు మనిషి నాగరికతకు సంబంధించిన ఏదోఒక పేరుతో పండుగలను జరుపుకునే సంస్కృతి వచ్చింది. మరియు ఆ పండుగలు జరిపే విధానం అధర్మ రీతిలోనే కాకుండా, మానవ నైతిక గుణాలకు పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. కనుక అలాంటి పండుగలను ముస్లిం సమాజం నిర్వహించరాదని ఇస్లామీయ పండితులు ఫత్వాలు జారి చేసారు. ఆ పండుగలలో నుండి ఒక పండుగ వాస్తవాన్ని ఇక్కడ మేము తెలియజేస్తున్నాము. కనుక మన ముస్లిం సమాజం అధర్మమైన సంస్కృతి నుండి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము.
ప్రేమికుల రోజు
వాలెంటైన్స్ డే అంటే…?
ప్రేమానురాగాలు పరిమళించే, ప్రేమ కుసుమాలు గుభాళించే శుభ దినం అని అంటారు కొందరు. అయితే ఈ రోజు వెనుక గల కథనాలేమిటో తెలుసా?
1) రోమ్ దేశస్తులు ప్రతి ఏటా పిబ్రవరి 14వ తేదీని (యూనొ) అనే స్త్రీ దేవత కొరకు మహత్తరమైన శుభ దినంగా భావిస్తారు. వారు ఆమెను తమ దేవీలకు రాణిగా ఆరాధిస్తారు. వివాహం చేసుకునేవారి కోసం శుభ సూచకం అని నమ్ముతారు.
2) క్లోడియస్ 11వ పరిపాలన కాలంలో వాలెంటైన్ అనే వ్యక్తి ఉండేవాడు. పెళ్ళి, పిల్లలు, సంసారం మనిషిని పిరికివాణ్ణి చేశాయి అని తలచిన అప్పటి రాజు యుద్ధం నిమిత్తం సైనికులు పెళ్ళి చేసుకోకూడదన్న ఆజ్ఞ జారీ చేశాడు. వాలెంటైన్ అనే వ్యక్తి రాజుకి తెలియకుండా రహస్య పెళ్ళిళ్ళు జరిపించేవాడు. అది తెలుసుకున్న రాజు అతన్ని పట్టుకొని క్రీశ. 270వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేది లూబెర్ కీలియా అనే రోము దేశస్థులు పండుగ రాత్రి ఉరి తీయించాడు. అప్పటి నుండి వాలెంటైన్ పేరుతో పండుగ జరుపుకోవడం పరిపాటయింది. ఆ తర్వాత 1996 లో స్వయంగా చర్చి గురువులే ఈ పండుగ అశ్లీలతను, నీతిబాహ్యతను పెంపొందించే విధంగా ఉందని భావించి బహిష్కరించారు కూడా.
అయితే నేడు అనేక దేశాలలో ముస్లింలు సైతం ఈ పండుగ సంబరాల్లో పాల్గొనడం మనం చూస్తాం. ఇతర మతాలు ఈ పండుగను ఏ దృష్టితో చూస్తున్నాయి అన్న విషయం అప్రధానం. ఇస్లాం మాత్రం ఇటువంటి నీతికి అనుమతించదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వెకిలి చేష్టలు, వెర్రి పోకడలు ముస్లిం సమాజానికే మాయని మచ్చ.
ముస్లింలు వాలెంటైన్స్ డే ఎందుకు చేయకూడదు?
ఇస్లాంలో పర్వదినం అంటే ఆరాధన, పుణ్యార్జన మార్గం, పవిత్ర భావాల సమ్మేళనం. దైవ ప్రసన్నత కోసం, స్వర్గ ప్రాప్తి కోసం, పవిత్ర లక్ష్యంతో పర్వదినం జరుపుకోవాల్సి ఉంటుంది. పిచ్చిగా త్రాగి, పశువుల్లా ప్రవర్తించడం ఇస్లాం సంస్కృతి కానేకాదు. అదో పాశ్చాత్య దురాచారం. ఆ మాటకొస్తే ముస్లిం పండుగలు మూడే. రమజాన్ పండుగ, ఖుర్బానీ పండుగ, శుక్రవారం. వీటిని మినహాయించి, స్వయంగా ముస్లింలలో ప్రాచుర్యంలో ఉన్న మీలాదున్ నబీగానీ, షబెబరాత్‌గానీ, పీనుగుల పండుగ (ముర్దోంకి ఈద్) గానీ, ఇతరత్రా ఉత్సవాలు, ఉరుసులుగానీ, ఇస్లాం ప్రభోదించని వింత పోకడలే. మరలాంటప్పుడు సరదా కోసం, సహజీవనం (వివాహేతర సంబంధం) కోసం నిర్వహించబడే పండుగలకు ఎలా వీలుంటుంది?
కొందరు ముస్లింలు – మేము ఈ ఉత్సవంలో, ఇది ఇస్లామీయ పండుగ అన్న భావంతో పాల్గొనడం లేదు. పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకునేందుకు పాల్గొంటున్నాము అంతే అని అంటారు. వారి ఈ వాదన పస లేనిది. ఎందుకంటే? ఈ పండుగ ముమ్మాటికి రోమ్ దేశానికి చెందిన విగ్రహారాధకులది, యూద, క్రైస్తవులది అన్న విషయం తెలిసిందే. ఇందులో ముస్లింలు వెళ్ళి పాల్గొనడం ఎంత వరకు సహేతుకం? మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోదించారు:
“ఎవడు ఏ జాతి వేషధారణను (విధానాన్ని) అవలంబిస్తాడో వాడు వారిలో ఒకడుగా పరిగణించబడతాడు.” (అబూదావూద్: 2831)
ప్రేమంటే ఇదేనా…?
పసుపు ఎరుపు గులాబీలు పట్టుకొని రోడ్లపై పడి తిరగడమా ప్రేమంటే…? అశ్లీల భావాలను రేకెత్తించేలా ప్యాషన్ దుస్తులు ధరించి కుర్రకారును రంజింపజేయడమా ప్రేమంటే…? బోయ్/గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి కామోన్మాదంతో రగిలిపోతూ చిందులు తొక్కడమా ప్రేమంటే…? ఇంట్లో నుంచి పారిపోయి సహజీవనం (అక్రమ సంబంధం) సాగించడమా ప్రేమంటే…? ఇది ప్రేమంటే ‘ప్రేమ పవిత్రమైనది’ అని చెప్పడమైనా మానుకోవాలి. లేదా ఇలాంటి నీచ నికృష్ట చేష్టల్ని కూకటి వేళ్ళతో పెకళించాలి. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సిగ్గూ, లజ్జ, అభిమానాన్ని, నీతిని తగులుబెడుతున్న సినిమాల చేదు ఫలం మాత్రమే. షైతాన్, షైతాన్ మనస్తత్వం గల మనుషులు, ‘మీరెప్పుడైనా లవ్‌లో పడ్డారా” అని కవ్విస్తారు. ఈ మాయదారి ట్రిక్కుల్ని అందిపుచ్చుకోమని మనల్ని ఉసిగొల్పుతారు. తల్లిదండ్రులు చూడటం లేదు లేదా వారే దీనికి ఆజ్యం పోస్తున్నారు అన్న అంశాన్ని ప్రక్కనబెడితే – అల్లాహ్ చూస్తున్నాడన్న భయం కలగటం లేదా? రేపు దేవుడు ఖచ్చితంగా దీని గురించి నిలదీస్తాడన్న ఆలోచన రావడం లేదా?
హజ్రత్ అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హితోపదేశం చేశారు:
“గతించిన జాతులు చేసిన నీతిమాలిన పోకడలకు నా ఉమ్మత్ (సముదాయం) జానెడుకు జాన, మూరకు మూర అలవాటుపడనంత వరకు ప్రళయం సంభవించదు.”అది విన్న మేము (సహాబాలు) “యా రసూలుల్లాహ్! ఏమిటి మేము ‘రోమ్’ మరియు ‘ఈరాన్’ ప్రజలను అనుసరిస్తామా?” అని అన్నాము. అందుకు “వారు తప్ప మరెవర్ని అనుకుంటున్నారు?” అని సమాధానమిచ్చారు. (బుఖారి: 6774)
“అల్లాహ్‌ను పరలోకాన్ని విశ్వసించినవారు అల్లాహ్‌పై, ఆయన ప్రవక్తపై తిరుగుబాటు చేస్తున్నవారిని ఎన్నటికి ప్రేమించరు. చివరికి వారు తమ తండ్రులైనా, కొడుకులైనా, సోదరులైనా లేదా తమ కుటుంబసభ్యులైనా సరే, ససేమిరా ప్రేమించరు. అలా ప్రేమించడాన్ని నీవు ఎన్నటికీ చూడలేవు”. (సూరతుల్ ముజాదిలా:22)
మానవుల్లో ఒండొకరి పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం ఉండవచ్చు. ఆ మాటకొస్తే పశువుల్ని, ఇతరత్రా జీవరాసుల్ని సైతం ప్రేమించమంటుంది ఇస్లాం. అలా ప్రేమించలేనివారు పరిపూర్ణ విశ్వాసులు కారు అని కూడా ఖరారు చేస్తుంది. కానీ నిజమైన ప్రేమ, అభిమానం మాత్రం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ మీదే ఉండాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
“మరియు మీరు అల్లాహ్‌నే ఆరాధించండి. మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగు వారితో, అపరిచితులైన పొరుగు వారితో ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ గర్విష్టిని, బడాయిలు చెప్పుకునే వాణ్ని ప్రేమించడు” (సూరతున్ నిసా: ౩6)
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీరు పరస్పరం కరుణతో మెలగనంత వరకు విశ్వాసులు కాలేరు”అది విన్న సహచరులు ‘యా రసూలుల్లాహ్! మేమందరం పరస్పరం కరుణతోనే మసులుకుంటున్నాము కదా! అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మీ ఈ పరస్పర కరుణవాత్సల్యాలు కేవలం మీ ఆప్తుల వరకే పరిమితం కాకూడదు. “రహ్మతన్నాసి” సమస్త మానవుల పట్ల కనికరం కలిగి ఉండాలి. “రహ్మతన్ ఆమ్మహ్” విశ్వమంతటి ప్రాణుల పట్ల సాత్విక కరుణతో మెలగాలి” అన్నారు. (సహిహ్ తర్గీబ్:2253)
మరో హదీసులో ఇలా ఉంది: “ఒక బంధువు ఉపకారం చేస్తే ప్రతిగా ఉపకారం చేసేవాడు (నిజమైన) బంధు ప్రియుడు కాడు. తెగతెంపులు చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాన్ని కొనసాగించే వాడే (సిసలైన) బంధు ప్రియుడు.” (బుఖారి)
అల్లాహ్ పట్ల ప్రేమంటే…?
ఒక సారి ఒక పల్లెవాసి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పవిత్ర సన్నిధికి వచ్చి – “ప్రళయం ఎప్పుడొస్తుంది?” అని అడిగాడు. “దాని కోసం నువ్వు ఏమి ఏర్పాట్లు చేసుకున్నావు?” అని అడిగారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). దానికా వ్యక్తి “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారిని ప్రేమించడం అన్నాడు”. అతని సమాధానం విని “అయితే నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో వారితోనే ఉంటావు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. (బుఖారి, ముస్లిం)
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: (ఓ ప్రవక్తా!) ఇలా అను: “మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మరియు మీ పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. (సూరతు ఆల ఇమ్రాన్:31)
మనకు ఏది మంచిదో, ఏది చెడ్డదో మనల్ని పుట్టించిన, 70 తల్లులకన్నా ఎక్కువ ప్రేమ గల పరమోన్నత ప్రభువుకి బాగా తెలుసు. మనం ఉత్తమ రీతిలో జీవితం గడపడానికి, ఇంకా ఇహపరాల్లో సాఫల్యం పొందడానికే ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక వేళ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తే దాని దుష్ఫలితాలను తప్పకుండా మనం అనుభవించాల్సి ఉంటుంది.
ఈనాడు మనం….
పాశ్చాత్య సంస్కృతి వెర్రి తలలు వేస్తున్నది. సమాజమంతా కలుషితమై పోతున్నది. విచిత్రమేమిటంటే మన ఇళ్ళకు మనమే నిప్పు పెట్టి మనమే ఆనందిస్తున్నాము. ఎంత విడ్డూరం!
పాశ్చాత్య దేశాలు దైవాజ్ఞల్ని ఉల్లంఘించి తమ సొంత జీవన విధానాలను అనుసరించాయి. దాని దుష్పరిణామాలను నేడు తమ కళ్ళారా చూస్తున్నారు. వారు మాత్రమే కాదు మొత్తం ప్రపంచం దాని దుష్ఫలితాలను చూస్తోంది.
నా ప్రియ సోదర సోదరిమణులారా! మనం స్తుతిని మాని ఆత్మ విమర్శ చేసుకోవలసిన తరుణమిది. మనం దేవుని చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాని చేదు ఫలాలు మన ముందు రాకుండా ఉంటాయా?
మనం దేవుని చట్టాలను ఉల్లంఘించి ఈ రోజు దాని దుష్పలితం ఏయిడ్స్ అనే ఒక పెద్ద రూపంలో చూస్తున్నాం. ఇదంతా కూడా నీతిబాహ్యత, అశ్లీలం లాంటి వ్యర్థ విషయాలతో నిండిన సంస్కృతిని ఆదరించిన పాప ఫలితమే.
మొత్తానికి చెప్పొచ్చేటేమిటంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్టు మనం దైవాజ్ఞలకనుగుణంగా జీవితం గడపాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల మన ఈ నిజమైన ప్రేమే మనల్ని ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సఫలీకృతుల్ని చేయగలదు.
అదే విధంగా మరి కొన్ని పండుగలు కూడా మన సమాజంలో వ్యాపించి ఉన్నాయి, వీటిలో నుండి ఏ ఒక్కటిని కూడా జరుపుకోవడం ధర్మం కాదు.
1- జన్మదిన వేడుకలు: తమ పేరున లేక తమ పిల్లల పేరున లేక ఇతరుల పేరున జన్మదిన వేడుకలు నిర్వహించడం ఇస్లాం సంప్రదాయం కాదు. ఆ రోజు చేసే పార్టీలు, మరియు సంతోషాలు అంతా క్రైస్తవులు మరియు ధర్మేతరుల కార్యాలు.
2- జనవరి ఫస్ట్: జనవరి మొదటి తేదిన లేక డిసెంబర్ 31 రాత్రిని పండుగ దినంగా చేసుకోవడం, లేక ఒకరికొకరు ఆ రోజున విష్ చెయ్యడం వంటి కార్యాలన్ని నిషేధించబడ్డాయి.
3- “మదర్స్ డే” లేక “ఫాదర్స్‌డే“ (అమ్మా లేక నాన్న పండుగ) అనే పండుగలు మరియు వారికి విష్ చేసే విధానాలన్ని అధర్మమైనవి.
4- “మ్యారేజ్‌డే“ కొంత మంది ప్రజలు ప్రతి ఏట ‘మ్యారేజ్ డే’ (పెళ్ళి దినోత్సవం) చేసుకుంటారు. ఆ రోజు ఒకరికొకరు బహుమానాలతో విష్ చేసుకుంటారు. మరియు కొంత మంది పార్టీలు కూడా చేస్తారు.
5- ‘ఏప్రిల్ ఫూల్’ఈ పదంలోనే ఫూల్ అని పేర్కొనబడినది. ఆ రోజున ఇతరులతో అబద్దాలు పలికి మోసగించడం, ఆ రోజున ఎగతాళిగా జరుపుకోవడం పూర్తిగా అధర్మమైనది. ఇలాంటి అబద్ధమైన మాటలకు మరియు నవ్వులాటలకు ఇస్లామీయ ధర్మంలో ఎలాంటి స్థానం లేదు.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 129-137). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
ఇస్లాంకు చెందిన పలు ఇతర విషయాల వలె సృష్టికర్త అయిన అల్లాహ్‌ను దర్శించడానికి సంబంధించిన విషయంలోనూ ముస్లింలకు చెందిన పలు వర్గాలు హెచ్చు తగ్గులకు గురయ్యారు.
ఒక వర్గమయితే ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం ద్వారా ఇహలోకంలోనే అల్లాహ్ ను దర్శించవచ్చని ప్రకటించింది. మరొక వర్గం ఖుర్‌ఆన్ లోని “చూపులు ఆయనను అందుకోలేవు. కాని ఆయన చూపులను అందుకోగలడు.” (103 :6) అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇహలోకంలోనే కాకుండా పరలోకంలోనూ అల్లాహ్ ను చూడలేమని ప్రకటించింది.అయితే పవిత్ర ఖుర్‌ఆన్ ద్వారా, హదీసుల ద్వారా నిరూపించబడే విశ్వాసమేమిటంటే ఇహలోకంలో ఏ వ్యక్తయినా, చివరకు దైవప్రవక్త అయినా అల్లాహ్‌ను చూడడం సాధ్యం కాదు.
ఖుర్‌ఆన్‌లో దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) వృత్తాంతం ఎంతో వివరంగా పేర్కొనబడింది. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఫిర్‌ఔన్ నుంచి విముక్తిని పొందిన తర్వాత ఇస్రాయీల్ సంతతిని వెంటబెట్టుకొని సీనా ద్వీపకల్పానికి చేరుకున్న తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనను తూర్ పర్వతం మీదకు పిలిచాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) నలభై రోజులు అక్కడ ఉన్న తర్వాత అల్లాహ్ ఆయనకు పలకలను అందజేసాడు. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు అల్లాహ్ ను దర్శించాలనే కోరిక కలిగింది. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) “ఓ నా ప్రభువా! నేను నిన్ను చూడగలిగేందుకై నాకు నిన్ను చూడగలిగే శక్తిని ప్రసాదించు.” అప్పుడు అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు: “ఓ మూసా! నీవు నన్ను ఏ మాత్రం చూడలేవు. అయితే కొంచెం నీ ముందు ఉన్న కొండ వైపు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉన్నట్లయితే నీవు కూడా నన్ను చూడగలవు.” అప్పుడు అల్లాహ్ తన తేజోమయ కాంతిని ఆ కొండపై ప్రసరింపజేయగా అది పిండి పిండి అయిపొయింది. అది చూసి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆయన (అలైహిస్సలాం) పశ్చాత్తాపంతో ఈ విధంగా అర్ధించారు: “నీ అస్తిత్వం పవిత్రమైనది. నేను నీ వైపుకు (నా కోరిక పట్ల పశ్చాత్తాపంతో) మరలుతున్నాను. అలాగే నేను అందరికంటే ముందు (అగోచర విషయాలను) విశ్వసించేవాడిని. (మరిన్ని వివరాల కొరకు ఖుర్‌అన్‌లోని ‘ఆరాఫ్ అధ్యాయపు 143వ వాక్యాన్ని పఠించండి). ఈ వృత్తాంతాన్ని బట్టి ఇహలోకంలో అల్లాహ్ ను చూడటమనేది సాధ్యం కాదని రుజువవుతోంది.
ఇక దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ ప్రయాణం విషయానికొస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును దర్శించారని పలికే వ్యక్తి అసత్యవాది” అని పేర్కొన్న విషయం కూడా దీనిని ధృవికరిస్తోంది. (బుఖారీ, ముస్లిమ్) ఇహలోకంలో దైవ ప్రవక్తలు సైతం అల్లాహ్‌ను చూడలేకపొయినప్పుడు మామూలు దాసులు అల్లాహ్‌ను తాము చూశామని పేర్కొనడం అసత్యం తప్ప మరేమి కాగలదు?
పవిత్ర ఖుర్‌ఆన్ ద్వారా, ప్రామాణికమైన హదీసుల ద్వారా పరలోకంలో స్వర్గలోకవాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను దర్శిస్తారని రుజువవుతోంది. ఖుర్‌ఆన్‌లో యూనుస్ అనే అధ్యాయపు 26 వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు : “మంచి పనులు చేసేవారి కొరకు మంచి ప్రతిఫలంతో పాటు ఇంకా మరొక వరం ప్రసాదించబడు తుంది.” ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా హజ్రత్ సుహైబ్ రూమి (రదియల్లాహు అన్హు) ద్వారా పేర్కొనబడిన ఒక ఉల్లేఖనం ఈ విధంగా ఉంది : దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వాక్యాన్ని పఠించిన తర్వాత ఈ విధంగా పేర్కొన్నారు: “స్వర్గ వాసులు స్వర్గంలోకి, నరకవాసులు నరకంలోకి ప్రవేశించిన తర్వాత ప్రకటించే ఒక వ్యక్తి ఈ విధంగా ప్రకటిస్తాడు : “ఓ స్వర్గవాసులారా! అల్లాహ్ మీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నేడు ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నాడు” అప్పుడు వారు ఇలా ప్రశ్నిస్తారు: “ఆ వాగ్దానం ఏది? అల్లాహ్ (తన కరుణ ద్వారా) మా ఆచరణలను (త్రాసులో) బరువైనవిగా మార్చివేయలేదా? అల్లాహ్ మమ్మల్ని నరకాగ్ని నుంచి రక్షించి స్వర్గంలోకి ప్రవేశింపజేయలేదా?” అప్పుడు వారికి, అల్లాహ్ కు నడుమ ఉన్న పరదా తొలగించబడుతుంది. అప్పుడు స్వర్గలోకవాసులకు అల్లాహ్ ను దర్శించే మహద్భాగ్యం ప్రాప్తమవుతుంది. (హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా పేర్కొంటున్నారు) ‘అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దర్శనానికి మించి ప్రియమైనది, కనులకు ఆనందకరమైనది స్వర్గవాసులకు మరేదీ ఉండబోదు. (ముస్లిమ్)
ఖుర్‌ఆన్ లో మరొకచోట అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు ; “అ రోజు ఎన్నో వదనాలు తాజాగా కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి. (ఖుర్‌ఆన్, ఖియామహ్ :22-23) ఈ ఆయతులో స్వర్గవాసులు అల్లాహ్ వైపు చూస్తూ ఉండటమనేది స్పష్టంగా పేర్కొనబడింది. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: మేము దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయి ఉన్నాము. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పున్నమి నాటి చంద్రుని వైపు చూసి ఈ విధంగా పేర్కొన్నారు : “స్వర్గంలో మీరు నేడు ఈ చంద్రుని చూస్తున్న రీతిలోనే మీ ప్రభువును చూస్తారు. అల్లాహ్ ను చూడడం మీకు ఏమాత్రం కష్టం కాబోదు.” (బుఖారీ)
కనుక ఇహలోకంలోనే అల్లాహ్‌ను దర్శించవచ్చని ప్రకటించినవారు మార్గభ్రష్టులై పోయారు. అలాగే పరలోకంలోనూ అల్లాహ్ ను దర్శించడం అసాధ్యమని పేర్కొన్నవారూ మార్గభ్రష్టులై పోయారు. నిజమైన విశ్వాసమేమిటంటే ఇహలోకంలో అల్లాహ్‌ను దర్శించడం అసాధ్యం. అయితే స్వర్గంలో స్వర్గవాసులు అల్లాహ్‌ను చూస్తారు. ఆ విధంగా అల్లాహ్ సందర్శనమనే మహోన్నతమైన అనుగ్రహం ద్వారా స్వర్గలోకపు మిగిలిన వరానుగ్రహాల పరిపూర్తి జరుగుతుంది.
“విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మీ కుటుంబాలను మానవులు, రాళ్ళు, ఇంధనం కాగల అగ్ని నుండి కాపాడుకోండి. దానిలో ఎంతో బలిష్టులు, అత్యంత కఠినులు అయిన దైవదూతలు నియమించబడి ఉంటారు. వారు ఎంత మాత్రం అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించరు. వారు తమకు ఆదేశించిన దాన్నే పాటిస్తారు.”(అత్తహ్రీమ్:6)
ఈ వాక్యంలో అల్లాహ్ (త’ఆలా) రెండు విషయాలను గురించి ఆదేశించాడు:
1. మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి.
2.మీ కుటుంబాన్నీ నరకాగ్ని నుండి రక్షించుకోండి.
కుటుంబం అంటే భార్యాబిడ్డలు అని అర్థం. అంటే ప్రతి వ్యక్తి తనతోపాటు తన భార్యాబిడ్డలను కూడా నరకాగ్ని నుండి రక్షించటం తప్పనిసరి అన్నమాట. భార్యా బిడ్డల పట్ల ఇదే నిజమైన శ్రేయోభిలాష మరియు అల్లాహ్ విధేయత కూడా. అల్లాహ్ (త’ఆలా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను దీనిని గురించి ఆదేశించినప్పుడు:
(అంటే నీ బంధుమిత్రులను నరకాగ్ని పట్ల హెచ్చరించు) అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కుటుంబం వారిని, తన తెగవారిని పిలిచారు. వారిని నరకాగ్ని పట్ల హెచ్చరించారు. చివరగా తన కుమార్తె హజ్రత్ ఫాతిమా(రదియల్లాహు అన్హా)ను పిలిచి ఇలా ఉపదేశించారు. “ఓ ఫాతిమా (రదియల్లాహు అన్హా)! నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో, అల్లాహ్‌కు వ్యతిరేకంగా (తీర్పు దినం నాడు) నేను నీకు దేనికీ పనికిరాను.” (ముస్లిమ్)
తన బంధుమిత్రులను, తన తెగవారిని నరకాగ్ని పట్ల హెచ్చరించిన తరువాత, తన కూతుర్ని నరకాగ్ని పట్ల హెచ్చరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్లిములందరికీ తమ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించటం కూడా తల్లిదండ్రుల బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత అని చాటి చెప్పారు.
ఒక హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ప్రతి శిశువు ప్రకృతి (ఇస్లాం) నియమానుసారం జన్మిస్తాడు. వాడి తల్లిదండ్రులు వాడిని యూదునిగానో, క్రైస్తవునిగానో, నాస్తికునిగానో మార్చి వేస్తారు.”(బుఖారి)
అంటే సాధారణంగా తల్లిదండ్రులే తమ సంతానాన్ని స్వర్గమార్గం లేదా నరక మార్గాన పెడతారు.
అల్లాహ్ (త’ఆలా) ఖుర్‌ఆన్‌లో మానవుని యొక్క అనేక బలహీనతలను గురించి పేర్కొ న్నాడు. ఉదా: “మానవుడు మహా అత్యాచారి మరియు కృతఘ్నుడు.” (ఇబ్రాహీమ్:34). “మానవుడు చాలా తొందరపాటుగలవాడు.” (బనీ ఇస్రాయీల్:11) మొదలైనవి. ఇతర బలహీనతల్లో ఒక బలహీనత ఏమిటంటే మానవుడు త్వరగా లభించే లాభాలకు ప్రాముఖ్యత ఇస్తాడు. అవి తాత్కాలికమైనవైనా, లేదా తక్కువ సంఖ్యలో ఉన్నా సరే. అయితే ఆలస్యంగా లభించే లాభాలను హీనంగా చూస్తాడు. అవి శాశ్వతమైనవైనా, అధిక సంఖ్యలో ఉన్నాసరే.
“వారు త్వరగా లభించే దాన్ని (ఇహలోకాన్ని) ప్రేమిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే కఠినమైన దినాన్ని విస్మరిస్తున్నారు.” (అద్దహ్ర:27)
మానవుల్లోని ఈ స్వాభావిక బలహీనతల వల్లే చాలా మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఇహలోకపు తాత్కాలిక జీవితంలో భోగభాగ్యాలు, గౌరవోన్నతులు పెద్దపెద్ద స్థానాలు ఇప్పించటానికి చదివించే ప్రయత్నం చేస్తారు. దానికి ఎంతకాలం పట్టినా, ఎంత ధనం ఖర్చు అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. అయితే చాలా తక్కువ మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని పరలోక జీవితంలోని గొప్పగొప్ప స్థానాలు, గౌరవాలు ఇప్పించడానికి ధార్మిక విద్యను ఇప్పించే ఏర్పాటు చేస్తారు. పరలోక విద్య ప్రాపంచిక విద్యకన్నా ఎంతో సులువైనది. సులభమైనదీను. ఇది ఉభయ లోకాల దృష్ట్యా తల్లిదండ్రులకు లాభం చేకూర్చేదే.
ప్రాపంచిక విద్యను అభ్యసించే చాలా మంది యువకులు ఆచరణలో తల్లి దండ్రుల పట్ల ద్రోహులుగా, స్వతంత్రులుగా మారుతున్నారు. ధార్మిక విద్యను అభ్యసించే చాలా మంది యువకులు తమ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపుతూ, వారి సేవ చేస్తున్నారు. ఇంకా పరలోకం దృష్ట్యా నిస్సందేహంగా సద్బుద్ధి, దైవభీతి, ధార్మికతగల ఇలాంటి సంతానమే లాభదాయకం కాగలదు. ఈ వాస్తవాలన్నింటినీ తెలిసి ఉండి, స్వీకరిస్తూ కూడా 99% మంది తల్లిదండ్రులు తము సంతానం కొరకు ధార్మిక విద్యకంటే ప్రాపంచిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రండి! మానవుని యొక్క ఈ బలహీనతను మరో వైపు నుండి పరిశీలిద్దాం.
ఊహించండి! ఒక ఇంటికి నిప్పు అంటుకుంది. ఇంట్లో ఉన్న వారందరూ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. పొరపాటున ఒక అబ్బాయి ఇంట్లో ఉండిపోతాడు. ఆ సమయంలో తల్లిదండ్రుల పరిస్థితి, ఆందోళన ఎలా ఉంటుంది? ప్రాపంచిక సమస్యలు, వ్యాపారం, ఉద్యోగం, అనారోగ్యం మొదలైనవి ఏవైనా ఆ అబ్బాయి నుండి మరల్చగలవా? ఎంతమాత్రం కాదు. తమ కుమారుడు ఆ నిప్పు నుండి రక్షించబడనంత వరకు తల్లిదండ్రులు రెప్పపాటుకైనా సుఖంగా ఉండలేరు. తమ సంతానాన్ని మంటల నుండి రక్షించటానికి తల్లిదండ్రుల ప్రాణాలు పణంగా పెట్టాలన్నా దానికి కూడా వారు సిద్ధపడతారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. తాత్కాలికమైన ఈ ఇహలోక జీవితంలో ప్రతి వ్యక్తీ తన సంతానాన్ని మంటల నుండి రక్షించాలని కోరుకుంటాడు. కానీ పరలోకంలో నరకాగ్ని నుండి తన సంతానాన్ని రక్షించాలని మాత్రం చాలా కొద్దిమందికే అర్థమవుతుంది.
وَقَلِيلٌ مِّنْ عِبَادِيَ الشَّكُورُ
అల్లాహ్ ఆదేశం : “నా దాసుల్లో చాలా కొద్ది మందే కృతజ్ఞత చూపేవారు.” (సబా:13)
నిస్సందేహంగా మానవుని ఈ బలహీనత పరీక్షలోని భాగమే. పరీక్ష కోసమే మానవుడి ఇహలోక జీవితంలోనికి పంపబడింది. ఈ పరీక్ష గురించి తెలివిగా ప్రవర్తించేవాడే బుద్ధిమంతుడు. తన సృష్టికర్త, ప్రభువుకు విధేయత చూపడమే మానవుని తెలివి తేటలకు నిదర్శనం. అల్లాహ్ (త’ఆలా) విశ్వాసులకు నరకాగ్ని నుండి తమ్ము తాము రక్షించుకోవాలని, తమ కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించుకోవాలని ఆదేశించాడు. ప్రతి ముస్లిం తనను, తన కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించు కోవడానికి ఇక్కడి తపన, ఆందోళన కంటే 69 రెట్లు అధికంగా ఆందోళన, తపనతో ఉండాలి. ఈ బాధ్యతను నిర్వర్తించటానికి ప్రతి ముస్లిం రెండు విషయాలను విధిగా పాటించాలి.
మొదటిది ఖుర్‌ఆన్, హదీసుల విద్యను అభ్యసించడం
ఖుర్‌ఆన్, హదీసుల విద్యను అభ్యసించడం. అజ్ఞానం అనేది ప్రాపంచిక విషయాల దైనా, ధార్మిక విషయాలదైనా మానవున్ని నష్టాలకు, కష్టాలకు గురిచేస్తుంది. అల్లాహ్ దీన్ని గురించి ఇలా ఆదేశించాడు:
“జ్ఞానమున్నవారూ, జ్ఞానం లేనివారూ ఇద్దరూ సమానులు కాగలరా?” (అజ్జుమర్:9)
మనం చూస్తూ ఉంటాం తీర్పు దినాన్ని విశ్వసించే వ్యక్తి, ప్రళయ మైదానం గురించి తెలిసిన వ్యక్తి, స్వర్గనరకాల శిక్షా ప్రతిఫలాలను గురించి తెలిసే వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది. మరో వ్యక్తి కేవలం సాంప్రదాయంగా తీర్పు దినాన్ని విశ్వసిస్తాడు. కాని తీర్పు మైదానంలోని పరిస్థితులను గురించి స్వర్గనరకాల శిక్షా ప్రతిఫలాల గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు. ఇటువంటి వ్యక్తి జీవితం వేరుగా ఉంటుంది. ఖుర్‌ఆన్ హదీసుల జ్ఞానం గలవారు ఇతరుల కన్నా ఎంతో మంచి నడవడిక కలిగి, సత్యవంతులై, భీతిపరులై, ఎల్లప్పుడూ అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారు.
అల్లాహ్ ఆదేశం: “వాస్తవం ఏమిటంటే అల్లాహ్ దాసుల్లో కేవలం (ఖుర్‌ఆన్ హదీసుల) విద్యగలవారే అల్లాహ్‌కు భయపడతారు.”(ఫాతిర్:28)
తమ సంతానాన్ని ప్రాపంచిక విద్య కోసం ధార్మిక విద్యకు దూరం చేసే తల్లి దండ్రులు వాస్తవంగా తమ సంతానం యొక్క పరలోక జీవితాన్ని నాశనం చేసి చాలా పెద్ద అపరాధాన్ని చేస్తున్నారు. ఇంకా తమ సంతానాన్ని ప్రాపంచిక విద్యతోపాటు ధార్మిక విద్యా శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు కేవలం తమ సంతానం యొక్క పరలోక జీవితాన్నే అలంకరించటం లేదు. తమ పరలోక జీవితాన్ని కూడా అలంకరించు కుంటున్నారు.
రెండవది – ఇంట్లో ఇస్లామీయ వాతావరణ స్థాపన:
పిల్లల వ్యక్తిత్వాన్ని ఖుర్‌ఆన్ హదీసుల బోధనల రూపంలో తీర్చిదిద్దడానికి ఇంట్లో ఇస్లామీయ వాతావరణం తప్పనిసరి. అయిదు పూటలూ నమాజు తప్పనిసరిగా పాటించటం, ఇంట్లో వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు సలాం చేయటం, సత్యం పలికే అలవాటు చేయటం, ఆహార సమయాల్లో ఇస్లామీయ నియమాలను దృష్టిలో ఉంచటం, దానధర్మాల అలవాటు చేయటం, పడుకునేటప్పుడు, మేల్కొనేటప్పుడు దుఆలను పఠించటం నేర్పించాలి. సంగీతం, పాటలు డప్పులు వాయించటం, చిత్రాలు, సినీ పత్రికలు, నగ్న చిత్రాలు గల వార్తాపత్రికలు మొదలైన వాటి నుండి ఇంటిని దూరంగా ఉంచాలి. అసత్యం, పరోక్ష నింద, దుర్భాషలాడటం, పొట్లాటలు, వివాదాలకు దూరంగా ఉంచాలి. ప్రవక్తల జీవిత చరిత్రలు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర ఖుర్‌ఆన్ గాధలు, యుద్దాలు, ప్రవక్త అనుచరుల (స్త్రీ పురుషుల) జీవిత చరిత్రలు గల పుస్తకాలు పిల్లలకు అందివ్వడం, పరస్పరం మంచిగా ప్రవర్తించటం ఈ విషయాలన్ని పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ప్రధాన పాత్ర వహిస్తాయి. అందువల్ల తమ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించే బాధ్యతను నిర్వర్తించాలనుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ సంతానాన్ని ధార్మిక విద్యా శిక్షణ ఇవ్వటంతోపాటు ఇంట్లో పరిపూర్ణ ఇస్లామీయ వాతావరణాన్ని కూడా స్థాపించాలి.
ఈ ప్రసంగంలో వక్త ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే) జరుపుకోవడం వెనుక ఉన్న వాస్తవాలను మరియు ఇస్లాం ధర్మం ప్రకారం దాని నిషిద్ధతను వివరిస్తున్నారు. ఫిబ్రవరి 14న జరుపుకునే ఈ పండుగ రోమన్ల కాలం నాటి విగ్రహారాధన మరియు క్రైస్తవ మతానికి చెందిన సెయింట్ వాలెంటైన్ చరిత్రతో ముడిపడి ఉందని, ఇది ఇస్లాం యొక్క ఏకేశ్వరోపాసన (తౌహీద్) భావనలకు విరుద్ధమని తెలిపారు. “ప్రేమ” అనే పేరుతో నేటి యువత అశ్లీలత, వ్యభిచారం మరియు సిగ్గులేనితనానికి అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షైతాన్ ఆదం (అలైహిస్సలాం) మరియు హవ్వా (అలైహిస్సలాం) లను మోసగించి వారి వస్త్రాలను తొలగించినట్లే, నేడు వాలెంటైన్స్ డే పేరుతో యువతలో సిగ్గు (హయా)ను చంపి వారిని పాపాల వైపు నడిపిస్తున్నాడని హెచ్చరించారు. నిజమైన ప్రేమ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల బాధ్యతను గుర్తించి వారిని ఇలాంటి పాశ్చాత్య సంస్కృతుల నుండి మరియు నరకాగ్ని నుండి కాపాడుకోవాలని సూచించారు.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ [అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మ బాద్] సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు సకల స్తోత్రాలు మరియు ప్రవక్తల నాయకులు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు వారి కుటుంబం పై, వారి సహచరులందరి పై అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు శాంతి కురియుగాక. ఆ తరువాత.
إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَن تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَ آمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ۚ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ [ఇన్నల్లజీన యుహిబ్బూన అన్ తషీఅల్ ఫాహిషతు ఫిల్ల్దజీన ఆమనూ లహుమ్ అజాబున్ అలీమున్ ఫిద్దున్యా వల్ ఆఖిరతి వల్లాహు యలము వ అన్తుమ్ లా తలమూన్] నిశ్చయంగా ఎవరైతే విశ్వాసులలో అశ్లీలత వ్యాపించాలని కోరుకుంటారో వారికి ఇహలోకంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అల్లాహ్‌కు (అన్నీ) తెలుసు. కాని మీకు తెలియదు. (24:19)
సోదర మహాశయులారా! 2016 ఫిబ్రవరి నెల యొక్క ఏడవ తారీఖు ఈ రోజు. వచ్చే ఆదివారం వరకు ప్రపంచంలో మహా అపరాధాలు, ఎన్నో రకాల పాపాలు, అశ్లీలత ఇంకా ఎన్నో రకాల చెడులు విచ్చలవిడిగా జరగనున్నాయి. అంటే ప్రతి సంవత్సరం 14 ఫిబ్రవరి (14th February) ఆ దినాన్ని ‘వాలెంటైన్ డే’ అని గానీ, అరబ్బీలో ‘ఈద్-ఉల్-హుబ్‘ అని, ఉర్దూలో ‘యౌమ్-ఎ-ఆషికా‘ అని మరియు సామాన్యంగా తెలుగులో పేపర్లలో ఎక్కువ శాతం వాలెంటైన్ డే తో పాటు ‘ప్రేమికుల రోజు’ అని మనం చూస్తూ, వింటూ వస్తున్నాము.
అయితే మహాశయులారా! ఈ వాలెంటైన్ డే దీని యొక్క వాస్తవికత ఏమిటి? ముస్లింలు, ముస్లిం సమాజంలో ఉన్నవారు ప్రత్యేకంగా మరియు సామాన్యంగా ఏ మనిషి అయినా ఈ రోజుల్లో ప్రేమికుల రోజు అనే పేరుతో జరుగుతున్న సంబరాలు అని దానికి పేరు పెట్టండి, ఉత్సవం అని పేరు పెట్టండి లేక ఇంకా ఏ పేరు పెట్టుకున్నా గానీ, అందులో పాల్గొనడం లేదా తమ సంతానం మగపిల్లలైనా, ఆడపిల్లలైనా వారికి అనుమతి ఇవ్వడం, అందులో పాల్గొనడానికి, ఇది మనకు ఎంతవరకు సమంజసం? దీని గురించి కొన్ని నిజాలు, కొన్ని సత్యాలు మనం వినే ప్రయత్నం చేద్దాము.
అయితే ఈ విషయంలో నేను నా యొక్క ఈ రోజు టాపిక్ ను, శీర్షికను కొన్ని భాగాలుగా విభజించాను. ముందు మనం ఈ వాలెంటైన్ డే దీని యొక్క చారిత్రక వాస్తవికత ఏమిటి? దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ పేరు మీద ఈ రోజుల్లో జరుగుతున్నది ఏమిటి? అది రెండో భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మూడో భాగంలో ప్రేమ యొక్క వాస్తవికత ఏమిటి? నాలుగో భాగంలో ప్రేమ అనే పేరు మీద ఈ రోజుల్లో మన యువకులు, యువతులు ఎలాంటి పాపాలకు, ఘోరమైన, వారు తమ వేడి రక్తంలో భవిష్యత్తు గురించి ఏమాత్రం దూరపు ఆలోచన లేకుండా ఏ కార్యాలైతే చేయబోతున్నారో అందులో ఉన్నటువంటి నష్టాలు ఏమిటో కొన్ని వారికి మనం తెలియజేద్దాము. అలాంటి వాటితో మనం దూరం ఉండడానికి ఏ సాధనాలు అవసరము అవి కూడా మనం కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. కానీ సోదరులారా! గంట, గంటన్నర, రెండు గంటల వరకు మనం మాట్లాడుకుంటూ పోయినా ఈ టాపిక్ సమాప్తం కాదు. కానీ సాధ్యమైనంత వరకు 30 నుండి 40 నిమిషాల లోపుగా ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
వాలెంటైన్ డే – చారిత్రక నేపథ్యం
సోదరులారా! ఈ వాలెంటైన్ డే అన్నది ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పటి నుండి వచ్చింది? అనే చరిత్రను, చరిత్ర పుటల్లోకి వెళ్లి తెలుసుకుంటే చాలా భిన్నమైన విషయాలు మనకు కానవస్తున్నాయి. దానికి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మరికొందరు నాలుగు, నాలుగు కంటే ఎక్కువ కారణాలు కూడా దానికి, దాని గురించి చెప్పి ఉన్నారు. వాటన్నిటిని సమకూర్చిన తర్వాత అందులో నుండి నేను తీసినటువంటి ఒక రిజల్ట్ ఏమిటంటే:
రోమన్లు చాలా పాత కాలంలో, అంటే ఇంచుమించు 2000 సంవత్సరాలకు ముందు కూడా, అప్పట్నుండి వారు విగ్రహారాధకులు. వారు చలికాలం సమాప్తం అవ్వడానికి వచ్చి, అక్కడి నుండి మరో కాలం మొదలయ్యే సందర్భంలో రెండు రకాల లేక రెండు ఉద్దేశాలతో పండుగ అని, ఉత్సవం అని వారు కొన్ని సంబరాలు జరుపుకునేవారు. ఈ 14 ఫిబ్రవరి తర్వాత నుండి మంచి పంటలు పండుతాయని, ఆ పంటలు పండించే విషయంలో వారు ఒక ఆనాటి కాలంలో ఏదో ఒక దేవీ దేవతను వారు పూజించేవారు. అయితే ఇది వారికి ఆ దేవతల పట్ల ప్రేమ ఉండి, ఆ ప్రేమలో ఆ దేవత కారణంగా మంచి పంటలు ఈ రోజుల్లో పండటం మొదలవుతాయి అనే ఉద్దేశంతో ఇది జరుపుకునేవారు.
ఇంకా మరికొందరు మరికొన్ని కారణాలు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి, రోమన్ రాజు, అక్కడి రాజు తమ సైన్యంలో ఉన్న సైనికులకు వివాహం చేసుకోవడం నిషిద్ధ పరిచాడు. కానీ అప్పటి కాలంలో అతని దేశంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ ఫాదర్ ‘సెయింట్ వాలెంటైన్’ అని, అతడు రహస్యంగా కొందరి పెళ్లిళ్లు చేస్తూ ఉండేవాడు. అయితే మరికొందరు ఇక్కడ మరో కారణం కూడా చెప్పారు. ఈ వాలెంటైన్ అనే ఫాదర్ ప్రచారం చేస్తూ ఉండేవాడు, ధర్మ ప్రచారం ఆనాటి ప్రకారంగా క్రైస్తవ ధర్మ ప్రచారం. ఆ రాజుకు ఇష్టం లేక అతడు ఆ వాలెంటైన్ ని జైల్లో వేశాడు. అయితే ఏ కారణంతో జైల్లో పోయినా గానీ, జైల్లో వెళ్ళిన తర్వాత అక్కడ జైలర్ ఉంటాడు కదా, ఆ జైలర్ యొక్క కూతురితో అతనికి ప్రేమ కలిగింది. చివరికి అతని ద్వారా ఆమె, ఆమె కుటుంబానికి సంబంధించిన ఎంతోమంది క్రైస్తవ ధర్మంలోకి వచ్చారు. ఈ విషయం రాజుకు తెలిసింది, క్రీస్తుశకం 269 అని కొందరు, 270 అని మరికొందరు.. అయితే 14 ఫిబ్రవరి 269 లేదా 70 నాడు అతనికి ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్ష వేసే ముందు తాను, అంటే వాలెంటైన్, తన యొక్క ప్రేమను చాటి చెబుతూ ఒక లెటర్ తన యొక్క ప్రేమికురాలికి రాశాడు. ఈ విధంగా చారిత్రకంగా ఎన్నో కారణాలు దీని గురించి చెప్పుకుంటారు.
కానీ ఆ కారణాల యొక్క లోతులోకి మనం ఎంత వెళ్ళినా గానీ, ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? దాని వల్ల నష్టాలు ఏమిటి? వాటిని గమనించడం ఎక్కువ అవసరం గనుక నేను ఇంక కొన్ని కారణాలు కొందరు చరిత్రకారులు ఏదైతే చెప్పారో వాటన్నిటిని నేను ఇప్పుడు చెప్పదల్చుకోలేదు, టైం అందులో మనకు వృధా అయిపోతుంది. సంక్షిప్తంగా మనకు రెండు కారణాలు ఆ చరిత్రలో కనబడుతున్నాయి. ఒకటి: వారు ఆధ్యాత్మిక ప్రేమతో, కొందరి దేవతల ప్రేమతో ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని పూజలు చేసుకునేవారు. కానీ తర్వాత క్రైస్తవ ధర్మ ప్రచారంలో కొన్ని సంఘటనలు జరిగాయి, వాలెంటైన్ అనే ఒక ఫాదర్ అతని పేరు ముందుకు వచ్చింది. అందులో కూడా ఒక ప్రేమ కథ అనేది ఉంది. తర్వాత కాలంలో అంటే ఈనాటికి ఒక 200, 250 సంవత్సరాల క్రితం, 1700 శతాబ్దంలో ఆ వాలెంటైన్ అనే పేరు మీద యూరప్ దేశాల్లో ఒకరికి ఒకరు యువకులు, యువతులు ప్రేమ కార్డులు పంచుకోవడం, గులాబీ పువ్వులు వారికి బహుమానంగా ఇవ్వడం, ఇలాంటి ఒక ఉత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టారు.
ఆ మధ్యలో ఈ వాలెంటైన్ డే అనే పేరుతో అశ్లీలత పెరిగిపోతుంది అని క్యాథలిక్ చర్చ్ కు సంబంధించిన పెద్దలు దీన్ని ఖండించారు. ఇది చేయకూడదు అని వారు ఎన్నో వార్నింగ్ లు కూడా ఇచ్చారు. మరియు అదంతా చేసినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే, ఇది కేవలం యూరప్ లోనే కాదు, కేవలం క్రైస్తవుల్లోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది సర్వసామాన్యం అవుతూ ఉన్నది. మరి ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తమకు తాము ముస్లింలం అని అనుకునే ప్రత్యేకంగా యువకులు, యువతులు మరియు ముస్లిం సమాజానికి సంబంధించిన కొందరు ఇందులో అడుగుపెట్టడం, దీనిని ఒక ప్రేమ రోజుగా భావించి ఇందులో వారు చేసే లాంటి కొన్ని పనులు చేయడం.
వాలెంటైన్ డే వేడుకల్లో ఏం జరుగుతుంది?
అయితే సోదరులారా! ఇందులో జరిగేది ఏమిటి? సామాన్యంగా ఇందులో కార్డులు పంచిపెట్టుకుంటారు. ప్రత్యేకంగా అవి కూడా రెడ్ కలర్ లో లేదా కనీసం అందులో ఎర్రపు అక్షరాలతో రాసి ఉన్న ప్రేమ చిహ్న విషయాలు ఉంటాయి మరియు గులాబీ పువ్వు.. ఈ విధంగా కొన్ని కార్యాలు వారు చేసుకుంటారు. ఈ రోజుల్లో అంతకంటే మరీ ఘోరంగా ప్రేమికుల రోజు అని, వాలెంటైన్ డే అని యువకులు, యువతులు బయటికి వెళ్తారు, పార్కులలోకి వెళ్తారు. కొందరు క్లబ్బులు రిజర్వేషన్ చేసుకుంటారు, మరికొందరు మరికొన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటారు. ఇక అక్కడ జరిగే అశ్లీలత, చెడు అన్నది అన్ని హద్దులకు మీరి ఉంటుంది. చాలా మితిమీరిన కార్యాలు కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి.
షైతాన్ యొక్క కుట్ర మరియు మానవ పతనం
రండి ఇస్లాం ధర్మ ప్రకారంగా చూసుకున్నా, లేదా ఒక మానవత దృష్ట్యా మనం దీనిపై గమనించినా, ఒక బుద్ధి గల వ్యక్తి ఎంత మాత్రం ఇలాంటి అశ్లీల కార్యంలో, అశ్లీలతతో కూడి ఉన్న కార్యంలో పాల్గొనడం సహించడు, ఇష్టపడడు. ఇందులో పాల్గొనడం వల్ల మనకు ఏయే నష్టాలు జరుగుతాయి అనేది నేను మీకు చెప్పే ముందు, వివరించే ముందు, షైతాన్ అనేవాడు ఎవడు, మనతోని ఎలాంటి కార్యాలు చేయించాలని అతడు చాలా పాత కాలం నుండి వాగ్దానం చేసి ఉన్నాడు, ఆ యొక్క సత్యాన్ని మీరు ఖురాన్ ద్వారా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనందరి మానవుల ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం, ఆయన్ని స్వయంగా అల్లాహ్ పుట్టించాడు కదా. మరియు స్వయంగా అల్లాహుతాలా ఆయన్ని పుట్టించి స్వర్గంలో ఉంచాడు. మరియు అక్కడ అదే స్వర్గంలో ఆయన యొక్క భార్యను కూడా అల్లాహుతాలా పుట్టించాడు. మరియు అక్కడ వారి ఇద్దరినీ ఉంచి ఒక చిన్న పరీక్ష పెట్టాడు: “మీరు ఈ స్వర్గంలో ఎక్కడ ఏమి తిన్నా, ఎక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ చెట్టుకు సమీపానికి వెళ్ళకూడదు.”
కానీ షైతాన్ వాడు ఏం చేశాడు? మోసం చేశాడా? ఎలా మోసం చేశాడు? దాని వివరణలోకి పోతే సమయం సరిపోదు మనకు. సంక్షిప్తంగా షైతాన్ అక్కడ ఎలాంటి పాత్ర వహించాడు అనే విషయాన్ని గమనించండి.
ముందు ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం వద్దకు షైతాన్ రూపంలో రాలేదు. ఎలా వచ్చాడు? ఏదో చాలా మంచి మనిషి, వారి మేలు గురించి ఏదో ఒక మంచి విషయం చెప్తున్నాడు అన్నట్లుగా వచ్చాడు. అంటే రూపు మార్చి వచ్చాడు.
రెండవ విషయం (అందులో షైతాన్ పాత్ర): ప్రమాణాలు చేశాడు. మూడవది: భ్రమ పెట్టాడు. “ఎందులోనైతే, దేని వల్లనైతే నీకు నష్టం చేకూరుతుంది అని అల్లాహ్ తెలిపాడో, ఆ విషయాన్ని మరిచిపోయే విధంగా నీవు ఈ చెట్టు దగ్గరికి వెళ్లి దాని రుచి చూసి, దాన్ని నీవు తినేదుంటే నీవు దైవదూతవైపోతావు, నీకు శాశ్వతమైన జీవితం ఇక్కడ లభిస్తుంది” అని మోసపు మాటలు.
అర్థమవుతుందా? ఈ విషయాన్ని అల్లాహుతాలా సూరె ఆరాఫ్ లో ప్రస్తావించిన తర్వాత ఏమంటున్నాడు అల్లాహుతాలా?
ఓ ఆదం సంతతి వారలారా! షైతాను మీ తల్లిదండ్రులను స్వర్గం నుంచి బయటికి తీయించి, వారి మర్మస్థానాలు వారికి కనిపించేలా చేయటానికి వారి దుస్తుల్ని ఎలా తొలగింపజేశాడో అలాగే వాడు మిమ్మల్ని కూడా చెరపకూడదు సుమా! (7:27)
ఇక్కడ విషయం గమనించండి. ఇక్కడ ఇప్పుడు చెప్పేవాడు, నసీర్ ఒక ముస్లిం వ్యక్తి అని మీరు గ్రహించకండి, మీరు ఆలోచించకండి. లేదా ఈ బోధనలు కేవలం ముస్లింలకు అని కూడా మీరు అనుకోకండి. అల్లాహ్ ఇస్తున్న సందేశం ఖురాన్ లో ఏంటి గమనించండి: “యా బనీ ఆదం” – ఓ ఆదం సంతానమా! ఓ ముస్లింలారా అంటున్నాడా అల్లాహుతాలా? లేదు. ఓ సౌదీ వాళ్ళు అంటున్నాడా? సర్వ మానవాళిని ఉద్దేశించి సర్వ సృష్టికర్త ఏమంటున్నాడు? “యా బనీ ఆదమ లా యఫ్తినన్నకుముష్ షైతాన్”. షైతాన్ మిమ్మల్ని ఏ ఉపద్రవంలో, ఏ ఫిత్నాలో పడవేయకూడదు, “కమా అఖ్రజ అబవైకుమ్ మినల్ జన్న”, ఎలాగైతే మీ తల్లిదండ్రులైన ఆదం, హవ్వాలను స్వర్గం నుండి అతడు బయటికి రప్పించాడో.
ఆ తర్వాత మరి ఆ ఆయత్ యొక్క అందులోనే ఏముంది? షైతాన్ ఆ కుట్ర ఎందుకు పన్నాడు? అలాంటి పాత్ర వహించి, మోసం చేసి, ప్రమాణాలు చేసి, రూపు మార్చి వచ్చి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాడు? “లి యన్జిఅ అన్హుమా లిబాసహుమా లియురియహుమా సౌఆతిహిమా”. వారి యొక్క స్వర్గపు దుస్తులు వారిపై ఏవైతే ఉండెనో వాటిని తీసేసి, వారిని నగ్నంగా చేసేసి, వారు పరస్పరం ఒకరి ఒకరు దాచుకునే అటువంటి మర్మ అవయవాలు మరొకరి ముందు బహిర్గపరచటం, తెరవడం ఆ చెడు ఉద్దేశం వానిది.
అంటే ఏం తెలిసింది? మనిషిని అతని యొక్క మర్మ అవయవాలను భద్రంగా ఉండకుండా, ఒకరి దృష్టి పడకుండా ఏదైతే మనం కాపాడుకోవాలో అలా కాకుండా విచ్చలవిడిగా, అశ్లీలత, నగ్నత్వం ఇలాంటివి బయటపడాలి. మనిషి అన్ని రకాల లజ్జ, బిడియం, అన్ని రకాల హయాకు దూరమైపోవాలి. శీలాన్ని, మానాన్ని కోల్పోవాలి మానవుడు. ఇది ఎవరి పన్నాగం? షైతాన్. అలాంటి షైతాన్ నుండి అల్లాహ్ మనల్ని హెచ్చరిస్తున్నాడు.
ఇక ఈ ప్రేమికుల రోజు, 14 ఫిబ్రవరిలో జరిగే వాలెంటైన్ డే, అందులో ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. ఇందులో జరిగే ఏ ఏ కార్యాలు వాళ్ళు చేస్తున్నారో వాటిని మనం కొంచెం పరిశీలిస్తే, ధర్మపరంగా చూసినా, ప్రాపంచిక పరంగా చూసినా అందులో చెడుయే చెడు ఉంది. కానీ యవ్వనంలో బుద్ధి, జ్ఞానాలు అంతా ఎదిగి ఉండవు గనుక, దూరపు ఆలోచన తక్కువ ఉంటుంది గనుక, ముందే దైవ భయభీతి నుండి మనసు ఖాళీ అయిపోతుంది గనుక, షైతాన్ వారికి కొన్ని రకాల మోసపు మాటలతో భ్రమ పెట్టి, అందులో ఎన్నో రకాల మంచితనాన్ని వారికి చూపిస్తాడు. ఉదాహరణకు ఈ రోజుల్లో ఏమనుకుంటారు? ఇది ఈనాటి కాలం యొక్క ఫ్యాషన్. నేను హయ్యర్ చదువు చదువుతున్నాను, నేను అందరితో పాల్గొనడం చాలా ముఖ్యం. మరికొందరు ఏమంటారో తెలుసా? ఈనాటి కాలంలో అమ్మాయిల మీద భరోసా ఏమీ లేకుండా అయిపోయింది, అందుగురించి ఎవరితో మనం పెళ్లి చేసుకోబోతున్నామో వారిని ముందే చూసుకుంటూ ఉండడం, ముందు నుండే కలిసి ఉండడం, వారు వేరే దిక్కు వెళ్ళకుండా, వేరే ఎవరి ప్రేమలో పడకుండా ఉండడం… అంటే వేరే ఎవరి ప్రేమలో పడకుండా ఉండడానికి మనం మన ప్రేమ వలలో చిక్కించాలా? కానీ ఇట్లాంటి మోసపు ఆలోచనలు షైతాన్ వారి మదిలో వేస్తూ ఉంటాడు. దీనివల్ల వారిలో ఎన్నో రకాల చెడు. మొట్టమొదటి సారిగా దైవ భయభీతి, ధర్మపాలన అనేది వారిలో నశించిపోతుంది. ఇంకా వారిలో హయా, సిగ్గు, లజ్జ అనేది నశించిపోతూ ఉంటుంది.
ఇంకా బంధుత్వాలు పెంచుతున్నామన్న ఒక భ్రమలో ఉంటారు కానీ, అతి ముఖ్యమైన బంధుత్వాలను తెంచుతూ ఉంటారు. సామాన్యంగా యువకులు ఈ రోజుల్లో ఏ ప్రేమలో పడతారో.. సామాన్యంగా అమ్మాయిలు ఇంట్లో ఎక్కువ చెప్పుకోకపోయినా, యువకులు తండ్రితో కాకున్నా తల్లితో, తల్లితో కాకున్నా ఇంట్లో ఏదైనా పెద్ద అక్క ఉండేదుంటే వారితో సైలెంట్ గా, ఎంతో గోప్యంగా, రహస్యంగా “నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెలో ఇన్ని రకాల మంచితనాలు ఉన్నాయి, ఆమె యొక్క గుణం ఇలా ఉంది, ఆమె రేపటి రోజు వచ్చి తల్లికి సాయం చేస్తుంది, మన ఇంట్లో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఈ విధంగా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఫలానా సంబంధం పెరుగుతుంది, మనకు ఫలానా ఫలానా లాభాలు కలుగుతున్నాయి” అన్నటువంటి కొన్ని ఇలాంటి మాటలు అల్లుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ విధంగా తల్లిదండ్రి యొక్క ప్రేమకు స్వయంగా వారి మనసులో అక్రమమైన ఒక ప్రేమ అమ్మాయిది కుదిరింది, లేదా ఒక అమ్మాయి మనసులో అక్రమ మార్గాల ద్వారా ఒక అబ్బాయి ప్రేమ కుదిరింది అంటే ఏమవుతుంది? తల్లిదండ్రుల ప్రేమ అనేది తగ్గుతూ పోతుంది.
గమనించండి, ఎవరైతే వయసు ఎదిగి ఉన్నారో వారికి ఈ విషయాలు చాలా తొందరగా అర్థం కావచ్చు. కానీ ఎవరైతే ఇంకా వేడి రక్తంలో ఉండి, ఇంకా యవ్వనంలో ఉన్నారో కొంచెం మనం ఆలోచిస్తే, కొన్ని సందర్భాల్లో మనం మన ప్రేమికుడు లేదా ప్రేమికురాలు, ఆమె వారి యొక్క కోరికలను పూర్తి చేయడానికి ఎన్నో త్యాగాలకు మనం సిద్ధపడతాము. కానీ అదే ఏదైనా చిన్న ఆదేశం తల్లిదండ్రి వైపు నుండి వచ్చింది అంటే ఆ త్యాగానికి మనం సిద్ధపడము. అయితే ఇక్కడ విషయం ఇంకా దీని గురించి లోతుగా మనం మన సమాజంలో ఉన్న ఎన్నో ఉదాహరణలు తీసుకుంటే మాట ఎక్కువైపోతుంది.
మరొక చాలా పాపం, ఎన్నో ఎందరో యువకులు, యువతులు ఇలాంటి 14 ఫిబ్రవరి వేడుకల్లో, సంబరాల్లో పాల్గొంటారో సామాన్యంగా ఎక్కువ మందితో జినా, వ్యభిచారం అనేది జరిగిపోయి ఉంటుంది. అల్లాహ్ కాపాడుగాక! మరి ఈ వ్యభిచారం ఎంత మహా చెడ్డ కార్యం, ఎంత మహా చెడ్డ పాపం. అందుగురించే ఖురాన్ లో అల్లాహుతాలా ఆ జినా, వ్యభిచారం దాని యొక్క దరిదాపులకు కూడా మీరు వెళ్ళకండి అని అల్లాహుతాలా మనకు ఖురాన్ లో ఆదేశించాడు. డైరెక్ట్ వ్యభిచారం చేయకండి అని అక్కడ డైరెక్ట్ గా చెప్పలేదు. ఏమన్నారు? “వలా తఖ్రబుజ్ జినా” – మిమ్మల్ని వ్యభిచారం వరకు తీసుకెళ్ళే ఏ ఏ సాధనాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ మీరు దూరంగా ఉండండి.
ఇంకా ఇలాంటి కార్యాలు జరిగిన తర్వాత సమాజంలో తల్లి ముఖం ఎత్తకుండా, తండ్రి తమ స్నేహితుల్లో, తమ బంధువుల్లో ముఖం చూపించకుండా అయిపోతాడు. చివరికి అతడు కూడా, అతని వేడి రక్తంలో అతనికి తొందరగా అర్థం కాదు, “నేను మహా ఘన కార్యం చేశాను” అన్నట్లుగా భావిస్తాడు. “పోనీ నా బంధువులు అందరూ దూరమైపోయినా ఏమవుతుంది, నేను సంపాదించేవాణ్ని, నేను ఒక పురుషుణ్ని” అన్నటువంటి చెడు భ్రమలో పడి “తీసుకెళ్లి ఎక్కడైనా నేను బ్రతకవచ్చు” అని అనుకుంటాడు. కానీ స్వయంగా కొద్ది రోజులు గడిచిన తర్వాత అతని మనసు, లేదా ఉర్దూలో దాన్ని అంటారు ‘జమీర్’ అని, అంతరాత్మ అతన్ని నిందిస్తూ ఉంటుంది. “ఛీ, నువ్వు ఎలాంటి మనిషివి. ఒక స్త్రీ ప్రేమలో పడి నీ తల్లిని దూరం చేసుకున్నావు, నీ తండ్రిని దూరం చేసుకున్నావు, అక్కచెల్లెళ్లను దూరం చేసుకున్నావు, అన్నదమ్ములను దూరం చేసుకున్నావు” అన్నటువంటి బద్నామీ, అన్నటువంటి చెడు పేరు అతనికి పుడుతూ ఉంటుంది.
అంతేకాకుండా ఈ 14 ఫిబ్రవరిలో ఎన్నో రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతాయి. ఇందులో కేవలం మోసాలే కాదు, ఆత్మహత్యలు, గొడవలు, హత్య నేరాలు అటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఒక ఫంక్షన్ లో పాల్గొన్నాడు, ఒక అమ్మాయి నచ్చింది. ఆ తర్వాత ఏదో ఫంక్షన్ లో వెళ్ళిన తర్వాత అంతకంటే మరి అమ్మాయి నచ్చింది. అతనితో ఏదైనా సంబంధం కుదిరించబోయిండు, అతని యొక్క ప్రేమికుడు ఇతనికి శత్రువుగా మారిండు. ఈ విధంగా ఎన్నో సంఘటనలు ఇంకా మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికంటే భయంకరమైనది షిర్క్. ఒక ముస్లిం అనే వ్యక్తి షిర్క్ అనే ఘోరమైన పాపం ఏదైతే ఉందో దాని నుండి కూడా భయపడాలి.
నిజమైన ప్రేమ (Love) ఇస్లాం దృష్టిలో
ప్రేమ అన్న ఈ పదం, దీని వాస్తవికత ఏంటంటే ప్రతి ప్రాణిలో, ప్రత్యేకంగా మనిషిలో అల్లాహుతాలా ఈ ప్రేమను పుట్టించాడు, ఉంచాడు. కానీ స్వయంగా అల్లాహుతాలా వీటి యొక్క హద్దులు తెలిపాడు, నేర్పాడు. మనం ముందు అల్లాహ్ యొక్క దాసులం. మన సృష్టికర్త అయిన అల్లాహ్ మనల్ని పుట్టించాడు. అందుగురించి అందరికంటే ఎక్కువ ప్రేమ మనకు ఎవరిది ఉండాలి? ఎవరిది? అల్లాహ్ యొక్క ప్రేమ ఉండాలి. కేవలం చెప్పుకునే వరకే కాదు, వాస్తవ రూపంలో, ఆచరణ రూపంలో ఉండాలి. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక.
ఈ ప్రేమ, అల్లాహ్ యొక్క ప్రేమ ఇది ధార్మిక ప్రేమ. అల్లాహ్ తో పాటు, అల్లాహ్ తర్వాత ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఈ రెండు ప్రేమలు, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరి ప్రేమలు ఏ విధంగా ఉండాలో అలా లేనందువల్ల మనం ఎన్నో రకాల చెడులకు గురవుతున్నాము. ప్రేమ అన్నది ధార్మిక పదం కూడా. ఖురాన్ లో అల్లాహుతాలా చెప్పాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ ఓ విశ్వాసులారా! మీలో ఎవరయినాసరే తమ ధర్మం నుంచి తిరిగిపోతే (పోవచ్చు), అల్లాహ్ త్వరలోనే మరో జాతి వారిని తీసుకువస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు.(5:54)
సుబ్ హాన వ త’ఆలా, గమనించండి. అల్లాహుతాలా మరికొన్ని కార్యాలు, వేరే విషయాలు చెప్పాడు కానీ అన్నిటికంటే ముందు ఈ ప్రేమ విషయాన్ని ప్రస్తావించాడు. అదే సూరె బఖరాలో:
وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ [వల్లజీన ఆమనూ అషద్దు హుబ్బన్ లిల్లాహ్] …కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు… (2:165) అని అల్లాహుతాలా చెప్పాడు.
ఇక ఆ తర్వాత ప్రజల్లో, మానవుల్లో ఎవరెవరితో ఎలాంటి ప్రేమ ఉండాలి అనేది అల్లాహ్ ఆదేశించిన మేరకు ఉండాలి.
ఇకపోతే మరొక ప్రేమ ప్రకృతిపరమైనది. ప్రకృతిపరమైన ప్రేమ దానిని కూడా అల్లాహుతాలా అనుమతిచ్చాడు. కానీ అది ధర్మపరమైన ప్రేమ కంటే మించి ఇతరుల పట్ల ఉండకూడదు. సామాన్యంగా ఈ రోజుల్లో అల్లాహ్ ను కాకుండా వేరే వారిని ఎవరైతే పూజిస్తారో – విగ్రహాలను కానీ, ఇంకా వేరే ఏవైనా కానీ – వారు వారిని ప్రేమిస్తారు. కదా? సామాన్యంగా మనం ఏమంటాము? ఇలాంటి ఆ ప్రేమ షిర్క్ ప్రేమ. ఆ ప్రేమ కేవలం అల్లాహ్ తోనే ఉండేదుంటే ఇది తౌహీద్ అవుతుంది. కానీ అల్లాహ్ ను ప్రేమించే విధంగా వేరే ఎవరినైనా దేవతలను, దేవీలను ప్రేమిస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది అని అంటాము.
కానీ ఈ 14 ఫిబ్రవరిలో కూడా ప్రేమ పేరు మీద ఏదైతే జరుగుతుందో, యువకుల యువతుల మధ్య ఏ ప్రేమలైతే ఉంటాయో ఇవి కూడా షిర్క్ వరకు చేరుతాయి. కానీ వాటిని మనం గమనించడం లేదు. అందుగురించి సోదరులారా, మహాశయులారా! ఈ ప్రేమ వలలో చిక్కుకోకుండా ఇలాంటివన్నీ, కొన్ని పది వరకు ఏదైతే నేను పాపాలు లెక్కించానో, వాటిని, వాటిలో మనం పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎలా చేయగలుగుతాము? అసలు ఇందులో పడడానికి మూల కారణాలు ఏమిటి? ముందు ఇలాంటి 14 ఫిబ్రవరికి సంబంధించిన గానీ లేక వేరే తప్పుడు ప్రేమలు ఏవైతే ఉన్నాయో వాటిలో పడడానికి కారణాలు ఏంటి అవి తెలుసుకుందాము, అలాంటి కారణాల్లో ఎవరైనా ఉండేదుంటే దూరం కావడానికి. ఆ తర్వాత వీటి నుండి బయటికి వచ్చే మార్గాలు ఏమిటో అవి కూడా తెలుసుకుందాము.
యువత పెడదారిన పడడానికి కారణాలు మరియు పరిష్కారాలు
దీన్నే సామాన్యంగా ఏమంటాం మనం? ఫస్ట్ రోగాన్ని ఏర్పాటు చేయడం, ఈ రోగం ఎలా వచ్చింది అనేది రీజన్. తర్వాత దానికి ట్రీట్మెంట్. సోదరులారా ఈ రోజుల్లో ఒక యువకుడు ఒక యువతి ప్రేమలో చిక్కిపోతున్నాడు, పడిపోతున్నాడు లేక ఒక యువతి యువకుని ప్రేమలో పడుతుంది అనడానికి మూల కారణం: ఇక్తిలాత్. అంటే పరదా, హిజాబ్ ఇలాంటి ఏవీ లేకుండా కలిసిమెలిసి ఉండడం. కో-ఎడ్యుకేషన్ గానీ… ఇందులో అతి ముఖ్యమైనది మన ఇండ్లల్లో మనం పెద్దలం మన యొక్క బిడ్డలకు, భార్యలకు, అక్కచెల్లెళ్లకు పరదా యొక్క శిక్షణ ఇవ్వకపోవడం. మరియు చదువు విషయంలో గానీ, బజార్లలో గానీ, ఇంకా పెళ్లిళ్లలో గానీ, వేరే ఎన్నో చోట్ల స్త్రీలు, పురుషులు కలిసిమెలిసి ఉండడం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు: “ఏ పురుషుడు కూడా స్త్రీతో ఒంటరిగా ఉండకూడదు.” ఎందుకు? దీని వల్ల ఏం జరుగుతుంది? మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎక్కడైతే ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఒంటరిగా కలుస్తాడో అక్కడ వారిద్దరి మధ్యలో షైతాన్ మూడో వాడై కలుస్తాడు.” ఇక ఎక్కడైతే షైతాన్ వచ్చి కలుస్తాడో అక్కడ మేలు జరుగుతుందా? ఇంతకుముందే ఆదం అలైహిస్సలాం సంఘటన మనం విన్నాము.
అయితే ఇక ఏం చేయాలి మరి? ఇలాంటి కో ఎడ్యుకేషన్ (Co-education/mixing), అందరూ కలిసిమెలిసి ఉండే సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. మరొక హదీస్ కూడా మీకు వినిపిస్తాను. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? అశ్లీలతను, చెడును, వ్యభిచారాన్ని మనం తెలియకుండానే ఎలా ప్రచారం చేస్తూ ఉంటామో గమనించండి. బహుశా మీరు కూడా చూసి ఉండవచ్చు. పెన్ ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారా లేదా? సామాన్యంగా స్కూళ్లలో పెన్ లలో ఏం రాసి ఉండేది? ‘టచ్ మీ’ (Touch me), ‘కిస్ మీ’ (Kiss me) ఇంకా ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా. అంతేకాకుండా ఈ కార్డుల మీద, కీచైన్ అని ఉపయోగిస్తాము, అలాంటి వాటి మీద. కానీ వీటి ద్వారా ఎంత చెడు ప్రబలిపోతుంది, అశ్లీలత పెరిగిపోతుంది అనే విషయాన్ని ప్రజలు గమనించడం లేదు.
ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
لَأَنْ يُطْعَنَ فِي رَأْسِ أَحَدِكُمْ بِمِخْيَطٍ مِنْ حَدِيدٍ خَيْرٌ لَهُ مِنْ أَنْ يَمَسَّ امْرَأَةً لَا تَحِلُّ لَهُ [ల అన్ యుతఅన ఫీ రసి అహదికుమ్ బిమిహ్యతిన్ మిన్ హదీదిన్ ఖైరుల్ లహు మిన్ అన్ యమస్స ఇమ్రఅతన్ లా తహిల్ల లహు] మీలో ఒక వ్యక్తి నెత్తి మీద ఇనుప సూది తో పొడవటం, అతనికి ధర్మసమ్మతం కాని ఒక స్త్రీని తాకడం కంటే చాలా మేలు. (తబ్రానీ యొక్క సహీహ్ హదీస్)
సామాన్యంగా షైతాన్ ఎలాంటి వస్వసాలు వేస్తాడు? అబ్బా! ఎంత స్మార్ట్ గా ఉందిరా, కొంచెం ఒక్కసారి అట్లా పక్కనుండి పోతే… ఇట్లాంటి చెడు ప్రేరేపణలు షైతాన్ గాడు వేస్తాడు కదా? అలాంటప్పుడు ఇలాంటి హదీస్ లను మనం గమనించాలి. ప్రవక్త ఏమంటున్నారు? మీరు ఒక ఇనుప సూది తోని మిమ్మల్ని కొట్టడం, అలా దానితో ఒక దెబ్బ మీకు తగలడం, మీకు ధర్మసమ్మతం కాని ఒక స్త్రీతో మీరు టచ్ కావడం కంటే చాలా మేలు. అంటే ధర్మసమ్మతం కాని స్త్రీతో టచ్ కావడం అంతకంటే మరీ ఘోరమైన విషయం అని.
ఇంకా సామాన్యంగా స్త్రీలు బయటికి వెళ్ళేటప్పుడు అలంకరణతో వెళ్లడం, ఇది కూడా మహా చెడుకు మూల కారణం. కానీ ఈ రోజుల్లో సమాజంలో వారు ఏమనుకుంటారు? స్త్రీలే కాదు, చివరికి వారి యొక్క భర్తలు గానీ, వారి యొక్క తండ్రులు గానీ, వారి యొక్క సోదరులు గానీ.. ఇది స్త్రీ యొక్క హక్కు, ఆమె ఇష్టం ఎట్లా వెళ్లినా ఏంటి? కానీ ఎంత బుద్ధి తక్కువ తనం. ఏ మంచి వస్తువు అయినా గానీ అది కప్పబడి, దాన్ని ఏదైనా మరో వస్తువుతోని మూసివేసి, బయటికి తీసుకెళ్తే ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది. కానీ ఓపెన్ గా ఉంటే? మీరు కొని తినే వస్తువులే చూసుకోండి. చివరికి ఒక చిన్న ఉదాహరణ చాక్లెట్ యే చూడండి. చాక్లెట్ కవర్ లో ఉంటే మీకు మంచిగా అనిపిస్తుందా? కవర్ లో లేకుండా బయట ఉంటే మంచిగా అనిపిస్తుందా? స్త్రీ అదే కవర్ లో, బుర్ఖాలో.. దాన్ని చెడు అని అంటున్నారు. అంటే ఈ రోజుల్లో ఈ చెడు ఎంత ప్రబలిపోయిందంటే మన యొక్క ఆలోచనలే మారిపోతున్నాయి.
సోదరులారా ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో కారణాలు కావచ్చు. కానీ వీటికి అడ్డుకట్ట ఎలా కట్టాలి అని అంటే, ముందు దైవ భయభీతి అనేది మనలో రావాలి. మరియు ఇంట్లో పెద్దలు దూరపు ఆలోచనతో తమ యొక్క సంతానం పట్ల వారి యొక్క బాధ్యత ఎంతవరకు ఉన్నదో అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో చాలావరకు తల్లులు, తండ్రులు తమ సంతానం యొక్క బాధ్యత గురించి చాలా అలక్ష్యత, ఎలాంటి బాధ్యత లేదు అన్నటువంటి భావంలో పడి ఉన్నారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: “కుల్లుకుమ్ రాయిన్ వ కుల్లుకుమ్ మస్వూలున్ అన్ రఇయ్యతిహి”. మీలో ప్రతి ఒక్కడూ సంరక్షకుడే మరియు మీలో ప్రతి ఒక్కరూ తన బాధ్యతలో ఉన్న వారి గురించి ప్రళయ దినాన ప్రశ్నించబడతాడు. అంతేకాకుండా ప్రతి యువకుడు తన దృష్టిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దృష్టి ఇది ఫస్ట్ స్టెప్. ఈ దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడి నుండి చెడు ఆలోచనలు మొదలవుతాయి, ఆ తర్వాత చెడు ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ దృష్టిని మనం కాపాడుకోలేకపోతే ఈ చేతిని కూడా వ్యభిచారంలో పడకుండా మనం కాపాడలేము, కాళ్లను కూడా వ్యభిచారంలో పడకుండా మనం కాపాడలేము. అందుగురించే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: “అనుకోకుండా, అకస్మాత్తుగా ఎవరైనా స్త్రీ మీద మీ దృష్టి పడితే, మరోసారి కావాలని మీరు చూడకండి” అని మనకు ప్రవక్త గారు ఆదేశించి ఉన్నారు.
అంతేకాకుండా యువకులు సంపాదించేవారు కొంతవరకు వారిలో బాధ్యత భావం కలిగింది అంటే పెళ్లిళ్లు చేయడంలో తొందరపాటు చేయాలి. ఎందుకు? పెళ్లిళ్లు కానందువల్ల, పెళ్లికి సంబంధించిన ఈ కట్నకానుకల యొక్క సాకులతో పెళ్లిళ్లు ఆలస్యమైపోతున్నాయి. మరి ఎందరో యువతులు, యువకులు? ఈ మన సమాజంలో కట్నకానుకల ప్రాబ్లం ఏదైతే ఉందో అది పోవాలంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. అదే చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి తప్పుడు మార్గంలో పడడానికి ఒక కారణం మన ఈ కట్నకానుకలు కూడా ఉన్నాయి, వాటిని ఖండించే తక్కువ చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక వ్యక్తి, ప్రతి మనిషి ఇలాంటి అశ్లీల కార్యాల్లో పాల్గొనకూడదు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది? మా కాలేజీ వాళ్ళు 14 ఫిబ్రవరి సెలబ్రేషన్ చేస్తున్నారు అందులో పాల్గొనాలి. ఏదో ఒక రకంగా మీరు మీ అబ్బాయిలకు, మీ అమ్మాయిలకు, మీ సంతానానికి ఏదో మంచి గిఫ్ట్స్ లేదా వేరే ఎక్కడైనా ప్రయాణం ఉద్దేశంతో తీసుకెళ్లి ఇలాంటి సెలబ్రేషన్స్ లలో పాల్గొనకుండా ఉంచండి.
ఎందుకు? ఖురాన్ లో అల్లాహ్ తాలా చెప్పాడు:
إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَن تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَ آمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالْآخِرَةِ [ఇన్నల్లజీన యుహిబ్బూన అన్ తషీఅల్ ఫాహిషతు ఫిల్ల్దజీన ఆమనూ లహుమ్ అజాబున్ అలీమున్ ఫిద్దున్యా వల్ ఆఖిరతి] “ఎవరైతే విశ్వాసుల మధ్య చెడు, అశ్లీలత, అసహ్య కార్యాలు ప్రబలిపోవాలి అని కోరుతారో అలాంటి వారికి ఈ లోకంలో చాలా కఠినమైన, బాధాకరమైన శిక్ష ఉంది మరియు ప్రళయ దినాన కూడా చాలా కఠినమైన శిక్ష వారికి ఉంది.“
ఆ తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు గమనించండి: “వల్లాహు యలము వ అన్తుమ్ లా తలమూన్” – అల్లాహ్ కు చాలా తెలుసు, మీకు తెలియదు. అంటే ఈ చెడును ఎంత మాత్రం ప్రబలకుండా, చెడు యొక్క ప్రచారం జరగకుండా మీరు ప్రయత్నం చేయండి. కానీ ఎవరైతే చెడు ప్రచారం కావాలని కోరుకుంటారో అలా కోరుకునే వారి గురించి కూడా కఠినమైన శిక్ష ఇహపరలోకాల్లో ఉన్నది అని అల్లాహ్ తాలా హెచ్చరిస్తున్నాడు.
మరి ఎవరైతే ఇలాంటి వారి కార్యాల్లో పాల్గొంటారో, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీసు నుండి కూడా భయపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: “మన్ తషబ్బహ బి ఖౌమిన్ ఫహువ మిన్హుమ్”. ఎవరైతే మరొకరి పోలికలు వహిస్తారో వారి గతి వారితోనే అవుతుంది. ఇమామ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి చెప్పారు ఈ హదీస్ లో ఎవరైతే అవిశ్వాసులు చెడు కార్యాలు చేస్తున్నారో, చెడు మాటలు మాట్లాడుతున్నారో, వారి యొక్క చెడు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో.. అలాగే వారి యొక్క పండుగలు, వారి యొక్క ప్రార్థనలు, ఆరాధనలు వీటన్నిటిలో పాల్గొనడం వారి యొక్క కార్యాలు చేయడం లాంటిది. మరి అలాంటి వారి గతి వారితోనే అవుతుంది.
అంతేకాకుండా ఖురాన్ లో కూడా అల్లాహ్ తాలా ఏం చెప్పాడు?
ఎవరైతే ఇలాంటి చెడు కార్యాలు చేసే వారితో స్నేహాన్ని కుదుర్చుకొని, అలాంటి చెడుకు ప్రోత్సహించి వారితో ఉంటాడో వారి గతి చివరికి వారితోనే అయిపోతుంది.
ఈ విధంగా సోదరులారా చాలా హెచ్చరికలు ఉన్నాయి. అందుగురించి మనం ఇలాంటి విషయాలకు భయపడాలి. 14 ఫిబ్రవరి వాస్తవానికి ప్రేమికుల రోజు కాదు, చెడును ప్రచారం చేసే, అశ్లీలత, వ్యభిచారం ఇంకా ఎన్నో రకాల పాపాలు ప్రబలించే ఈ చెడ్డ దినం. ఆ దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, దాన్ని ఒక ఉత్సవంగా భావించడం ఇది మహా తప్పు కార్యం.
అల్లాహ్ మనందరినీ కూడా ఇలాంటి చెడుల నుండి కాపాడుగాక. అల్లాహ్ తాలా మనందరినీ కూడా మంచి మార్గంలో ఉంచి, బుద్ధి జ్ఞానాలతో ఇలాంటి చెడులకు దూరముండి ఇతరులను కూడా దూరం ఉంచే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
You must be logged in to post a comment.