ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]

బిస్మిల్లాహ్

القول السديد شرح كتاب التوحيد – للشيخ السعدي

ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖౌలుస్ సదీద్ షర్హు కితాబిత్ తౌహీద్)
షేఖ్ అబ్దుర్ రహ్మాన్ అస్సఅదీ రహిమహుల్లాహ్
Al-Qawl as-Sadid sharh Kitab at-Tawhid – Imam as-Sa’di
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.

తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

[ఇక్కడ పుస్తకం చదవండి/డౌన్లోడ్ చేసుకోండి]

ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ

విషయ సూచిక:

1. ఏకత్వపు బాటకు సత్యమైన మాట – [పోస్ట్ లింక్]

2. తౌహీదు ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం – [పోస్ట్ లింక్]

3. తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గం లో చేరుతారు – [పోస్ట్ లింక్]

4. షిర్క్ నుండి భయపడుట[పోస్ట్ లింక్]

5. “అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు” అనే ప్రమాణానికి ఆహ్వానించుట – [పోస్ట్ లింక్]

6. తౌహీదు మరియు “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము – [పోస్ట్ లింక్]

7.కష్టం తొలగిపోవుటకు, లేక రాకుండా ఉండుటకు కడాలు, దారాలు వాటిలాంటివి ధరించుట షిర్క్ – [పోస్ట్ లింక్]

8. మంత్రాలు మరియు తాయత్తుల విషయం లో వచ్చిన ఆదేశాలు – [పోస్ట్ లింక్]

9. చెట్లు, రాళ్ళతో శుభం (తబర్రుక్) కోరుట – [పోస్ట్ లింక్]

10. అల్లాహ్ యేతరుల కొరకు జిబాహ్(జంతు బలిదానం) – [పోస్ట్ లింక్]

11. అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబాహ్ చేసే చోట , అల్లాహ్ కొరకు జిబాహ్ చేయరాదు

12. అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కు కొనుట షిర్క్

13. అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్

14. అల్లాహ్ యేతరులతో “దుఆ” చేయుట, లేక సహాయం కొరకు “మొర” పెట్టు కొనుట షిర్క్ – [పోస్ట్ లింక్]

15. అల్లాహ్ ఆదేశం: “ఏ వస్తువునూ సృష్టించలేనివారిని, స్వయంగా తామే సృష్టింపబడ్డవారిని, ఎవరికీ సహాయం చేయలేని వారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకో లేని వారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (7:ఆరాఫ్: 191, 192). – [పోస్ట్ లింక్]

16. అల్లాహ్ ఆదేశం: చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగి పోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు “సత్యం పలికాడు”, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని అంటారు.(34: సబా:23). – [పోస్ట్ లింక్]

17. సిఫారసు (షఫాఅత్) – [పోస్ట్ లింక్]

18. అల్లాహ్ ఆదేశం: ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించ లేవు. (28: ఖసస్:56). – [పోస్ట్ లింక్]

19. ఆదమ్ సంతానంలో కొందరు ధర్మాన్ని విడనాడి అవిశ్వాసంలో పడిపోవుటకు కారణం పూర్వ పుణ్య పురుషుల ప్రేమలో “గులువ్వు” చేయడం, అంటే హద్దు మీరటం.

20. పుణ్యపురుషుని సమాధి వద్ద అల్లాహ్ యొక్క ఆరాధన చేయుట చాలా కఠినంగా నివారించబడితే ఇక పుణ్యపురుషున్ని ఆరాధించేవాని గతి ఏమిటి?

21. పుణ్య పురుషుల సమాధుల విషయంలో హద్దు మీరుట (గులువ్వు) వలన ఆ సమాధులు విగ్రహాలుగా మారుతాయి.

22. తౌహీదును రక్షించుటకు, షిర్క్ వరకు చేర్పించే ప్రతీ దారిని మూసివేయుటకు ప్రవక్త చేసిన కృషి. – [పోస్ట్ లింక్]

23.ప్రవక్త వారి సంఘంలో కొందరు “ఔసాన్” (విగ్రహాలను) పూజిస్తారు. – [పోస్ట్ లింక్]

24. ఇంద్రజాలం.

25. ఇంద్రజాలం యొక్క కొన్ని రకాలు.

26. జోతిష్యం మరియు అలాంటి పనులు.

27. ఇంద్రజాలం ద్వారా ఇంద్రజాలం చేయబడిన వ్యక్తి చికిత్స.

28. అపశకునం.

29. జోతిష్య శాస్త్రం.

30. నక్షత్ర బలంతో వర్షం కురిసింది అని నమ్ముట – [పోస్ట్ లింక్]

31. అల్లాహ్ ఆదేశం: ప్రజలలో కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్ధులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. (2:బకరా:165).

32. వాస్తవానికి తన మిత్రుల గురించి ఉరకే మిమ్మల్ని భయపెట్టింది షైతానేనని ఇప్పుడు మీరు గ్రహించే ఉంటారు. కనుక మీరు నిజమైన విశ్వాసులే అయితే, ఇకముందు మానవులకు భయపడకండి, నాకు భయపడండి.(3: ఆలె ఇమ్రాన్:175).

33. మీరు విశ్వాసులైతే కేవలం అల్లాహ్ పై నమ్మకం ఉంచండి.(5: మాఇద:2). – [పోస్ట్ లింక్]

34. ఏమిటీ, ఈ ప్రజలు అల్లాహ్ యుక్తి అంటే నిర్భయంగా ఉన్నారా? వాస్తవానికి నాశనం కాబోయే జాతి మాత్రమే అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉంటుంది.(7: ఆరాఫ్: 99).

35. విధివ్రాతపై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం – [పోస్ట్ లింక్]

36. ప్రదర్శనా బుద్ధి – [పోస్ట్ లింక్]

37. మానవుడు తాను చేసే సత్కార్యంతో ప్రాపంచిక లాభం పొందాలని ఉద్దేశించుట కూడా ఒక రకమైన షిర్క్

38. హలాల్ ను హరాం మరియు హరాంను హలాల్ చేయు పండితులకు, పాలకులకు విధేయత చూపుట (అల్లాహ్ ను త్యజించి) వారిని ప్రభువులుగా చేసుకొనుటయే

39. ప్రవక్తా! “నీ వద్దకు పంపబడిన గ్రంధాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము” అని ప్రకటన అయితే చేసి, (తమ వ్యవహారాల) పరిష్కారం కొరకు ‘తాగూత్’ వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి ‘తాగూత్’ను తిరస్కరించండి అని వారిని ఆదేశించటం జరిగింది. షైతాన్ వారిని పెడత్రోవ పట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. (నిసా 4:60)

40. అల్లాహ్ నామాలను, గుణ విశేషణాలను తిరస్కరించువాడు

41.అల్లాహ్ ఆదేశం: “వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తిస్తారు. అయినా దాన్ని తిరస్కరిస్తారు” (నహ్ల్ 16:83)

42.అల్లాహ్ ఆదేశం: “మీరు తెలిసి కూడా ఇతరులను అల్లాహ్ కు సాటి కల్పించకండి” (బఖర 2:22)

43. అల్లాహ్ నామ ప్రమాణంతో తృప్తి చెందని వ్యక్తి గురుంచి ఆదేశం

44. “అల్లాహ్ కోరినట్లు మరియు నీవు కోరినట్లు” అని పలుక వచ్చునా?

45. కాలాన్ని దూషించువారు, వాస్తవంగా అల్లాహ్ ను బాధ పెట్టేవారే – [పోస్ట్ లింక్]

46. ఖాజియుల్ ఖుజాత్ లాంటి బిరుదులు ధర్మ సమ్మతమేనా?

47. అల్లాహ్ నామాల పట్ల గౌరవం మరియు అందుకోసం పేరు మార్చుట

48. ఖుర్ఆన్, ప్రవక్త మరియు అల్లాహ్ వచనములతో పరిహాసం

49. అల్లాహ్ ఆదేశం: “కష్టకాలం తీరిపోయిన తరువాత, మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపినప్పుడు ఇలా అంటాడు, ‘నేను అసలు దీనికి అర్హుణ్ణే” (హామీమ్ అస్-సజ్డా  41:50)

50. అల్లాహ్ ఆదేశం: “అప్పుడు అల్లాహ్ వారికి ఒక చక్కని, ఏ లోపమూ లేనటువంటి పిల్లవాణ్ణి ప్రసాదించాడు.కానీ వారు అయన ప్రసాదించిన ఈ కానుక విషయంలో ఇతరులను ఆయనకు భాగస్వామ్యులుగా చేయసాగారు” (ఆరాఫ్ 7:190)

51. అల్లాహ్ ఆదేశం: “అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేసుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగేవారిని వదిలి పెట్టండి” (ఆరాఫ్ 7:180)

52. “అల్లాహ్ కు సలాం” అని చెప్పరాదు

53. “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని చెప్పరాదు

54. “నా దాసుడు, నా దాసి” అని పిలువరాదు

55. అల్లాహ్ పేరుతో యాచించే వారిని వట్టి చేతులతో పంపకూడదు

56. అల్లాహ్ పేరుతో కేవలం స్వర్గమే అడగాలి.

57. ‘ఒకవేళ’ ‘అట్లైనచో’, ‘ఇలా చేసి ఉంటే’ లాంటి పదాలు ఉపయోగించుట.

58. గాలిని దూషించుట నివారించబడినది.

59. అల్లాహ్ ఆదేశం: అల్లాహ్ ను గురించి అఙాన భూయిష్టమైన, సత్యదూరమైన, అనుమానాలు వ్యక్తం చెయ్యసాగారు. వారు ఇప్పుడు ఏమంటారంటే:”ఈ వ్యవహారాన్ని నడపటంలో మాకు ఏదైనా భాగం ఉందా?” వారికి ఇలా చెప్పు: ” (ఎవరికీ ఏ భాగము లేదు) ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలూ అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి”. (ఆలె ఇమ్రాన్ 3:154)

60. విధి వ్రాతను తిరస్కరించువారు

61. ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు

62. అధికంగా ప్రమాణాలు చేయుట

63. అల్లాహ్ మరియు అయన ప్రవక్తతో చేయబడిన వాగ్దానం

64. అల్లాహ్ పై ప్రమాణం చేయుట

65. తన దాసుల ఎదుట అల్లాహ్ ను సిఫారసుగా చేయుట ఎంత మాత్రం సమ్మతం కాదు

66. ప్రవక్త ద్వారా తౌహీద్ రక్షణ మరియు షిర్క్ మార్గాలను మూసివేయుట

67. అల్లాహ్ ఆదేశం: “వారు అసలు అల్లాహ్ కు తగిన విధంగా విలువ నివ్వలేదు. ప్రళయ దినాన యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఇమిడి ఉంటుంది.ఆకాశాలు అయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కు (బహుదైవారాధన)కు అయన ఎంతో అతీతుడు” (జుమర్ 39:67)

[క్రింద పుస్తకం చదవండి]

1వ అధ్యాయం : ఏకత్వపు బాటకు సత్యమైన మాట

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْأِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] الذريات56

నేను జిన్నాతులను, మానవులను నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను”. (జారియాత్ 52:56).

 [وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ] {النحل:36}

“మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. (అతడన్నాడు): “మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, మిథ్యదైవా(తాగూత్)ల ఆరాధనను త్యజించండి”. (నహ్ల్ 16:36).

[وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالوَالِدَيْنِ إِحْسَانًا] {الإسراء:23}

“నీ ప్రభువు ఇలా ఆజ్ఞాపించాడు: ఆయనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ”. (బనీ ఇస్రాఈల్ 17: 23)

 [وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا] {النساء:36}

మీరంతా అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, మరియు ఆయనకు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకండి(నిసా 4: 36).

[قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا] {الأنعام:151}

(ప్రవక్తా వారికి చెప్పు): రండి, మీ ప్రభువు మీపై నిషేధించినవి ఏవో మీకు చదివి వినిపిస్తానుః మీరు ఆయనకు ఏలాంటి భాగస్వాములను కల్పించకండి”. (అన్ఆమ్ 6:151).

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ముద్ర వేసి ఇచ్చిన ఆదేశాలను చూడదలుచుకున్నవారు పైన పేర్కొనబడిన ఆయతును (6:151) చదవాలి.

عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: كُنْتُ رِدْفَ رَسُولِ الله ﷺ عَلَى حِمَارٍ يُقَالُ لَه عُفَيرٌ قَالَ: فَقَالَ لِيْ: (يَا مُعَاذ! تَدْرِي مَا حَقُّ اللهِ عَلَى الْعِبَادِ ، وَمَا حَقُّ الْعِبَادِ عَلَى الله؟) قَالَ قُلْتُ: اَللهُ وَرَسُوْلُهُ اَعْلَمُ، قَالَ: (فَإِنَّ حَقَّ اللهِ عَلَى الْعِبَادِ اَنْ يَعْبُدُوْالله وَلاَ يُشْرِكُوْا بِهِ شَيْئًا ، وَحَقُّ الْعِبَادِ عَلَى اللهِ عَزَّوَجَلَّ اَنْ لاَ يُعَذِّبَ مَنْ لاَّ يُشْرِكُ بِهِ شَيْئاً) قَالَ قُلْتُ: يَا رَسُوْلَ الله! أَفَلاَ أُبَشِّرُ النَّاسَ؟ قَالَ: (لاَ تُبَشِّرْهُمْ فَيَتَّكِلُوْا).

హజ్రత్ ముఆజ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనక గాడిదపై ప్రయాణం చేస్తున్నాను. -ఆ గాడిద పేరు ‘ఉఫైర్’-అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ ముఆజ్! దాసుల మీద అల్లాహ్ హక్కు, అల్లాహ్ మీద దాసుల హక్కు ఏముందో నీకు తెలుసా? అని అడిగారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని నేను సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆయన ఇలా అన్నారుః దాసుల మీద ఉన్న అల్లాహ్ హక్కు ఏమిటంటే; వారు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు ఎవరినీ భాగస్వామిగా కల్పకూడదు. మరియు అల్లాహ్ మీదున్న దాసుల హక్కు ఏమిటంటే; ఆయనకు ఎవరినీ భాగస్వామిగా కల్పనివారిని ఆయన శిక్షించకూడదు. అయితే ప్రవక్తా! నేను ఈ శుభవార్త ప్రజలకు తెలియజేయనా? అని అడిగాను. దానికి ఆయన ఇప్పుడే వారికీ శుభవార్త ఇవ్వకు, వారు దీని మీదే ఆధారపడిపోయి (ఆచనణ వదులుకుంటారేమో) అని చెప్పారు. (ముస్లిం 30, బుఖారి 5967).

ముఖ్యాంశాలు

 1. జిన్నాతులను, మానవులను ఉద్దేశపూర్వకంగా సృష్టించడం జరిగింది, హేతువురహితంగా కాదు.
 2. తొలిఆయతులో ‘ఆరాధన’ అన్న పదానికి అర్థం తౌహీద్ (అంటే ఏ భాగస్వామ్యం లేకుండా ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం). ఎలా అనగా (ప్రవక్తలకు వారి జాతికి మధ్య వచ్చిన అసలు) వివాదం ఇందులోనే([1]).
 3. ఏ భాగస్వామ్యం లేకుండా అల్లాహ్ ను మాత్రమే ఆరాధించనివాడు అల్లాహ్ ఆరాధన చేయనట్లు. ఈ భావమే ఈ ఆయతులో ఉందిః నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు”. (కాఫిరూన్ 109:3).
 4. ప్రవక్తలను ఉద్దేశపూర్వకంగా పంపడం జరిగింది.
 5. ప్రతి సమూదాయంలోనూ ప్రవక్తలు వచ్చారు.
 6. ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే.
 7. అతిముఖ్యవిషయం (దీని పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం), అదేమిటంటే: మిథ్యదైవా(తాగూత్)లను తిరస్కరించనిదే అల్లాహ్ ఆరాధన కానేకాదు. ఈ భావమే సూరె బఖర (2:256)లోని ఈ ఆయతులో ఉందిః కనుక ఎవరయితే మిథ్యదైవా(తాగూత్)లను తిరస్కరించి అల్లాహ్ ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు”.
 8. అల్లాహ్ తప్ప ఎవరెవరు పూజింపబడుతున్నారో (వారు దానికి ఇష్టపడి ఉన్నారో) వారందరూ తాగూత్ లో పరిగణింపబడతారు.
 9. పూర్వీకుల వద్ద సూరె అన్ఆమ్ (6:151-153)లోని మూడు స్పష్టమైన (ముహ్కమ్) ఆయతుల ఘనత చాల ఉండింది. వాటిలో పది బోధనలున్నాయి. తొలి బోధన షిర్క్ (అల్లాహ్ కు ఇతరులను భాగస్వామిగా చేయడం) నుండి నివారణ.
 10. సూరె బనీ ఇస్రాఈల్ (17:22-39)లో స్పష్టమైన పద్దెనిమిది బోధనలున్నాయి. అల్లాహ్ వాటి ఆరంభము ఇలా చేశాడుః

 [لَا تَجْعَلْ مَعَ اللهِ إِلَهًا آَخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَخْذُولًا] {الإسراء:22}

 నీవు అల్లాహ్ తో పాటు వెరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు. అలా గనక చేస్తే నీవు నిందితుడవై, నిస్సహాయుడవై కూర్చుంటావుముగింపు ఇలా చేశాడుః

[وَلَا تَجْعَلْ مَعَ اللهِ إِلَهًا آَخَرَ فَتُلْقَى فِي جَهَنَّمَ مَلُومًا مَدْحُورًا] {الإسراء:39}

నీవు అల్లాహ్ తో పాటు వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోకు. అలాచేస్తే అవమానించబడి, ప్రతి మేలుకు దూరం చేయబడి, నరకంలో త్రోయబడతావు.

అల్లాహ్ ఈ బోధనల ప్రాముఖ్యత, గొప్పతనాన్ని మనకు ఇలా తెలియజేశాడుః

[ذَلِكَ مِمَّا أَوْحَى إِلَيْكَ رَبُّكَ مِنَ الحِكْمَةِ] {الإسراء:39}

ఇవన్నీ నీ ప్రభువు నీ వద్దకు వహీ ద్వారా పంపిన వివేచనభరిత (వివేకంతో నిండివున్న) విషయాలు”.

సూరె నిసా లోని ముప్పై అరవ ఆయతు (4:36)ను ‘ఆయతు హుఖూఖిల్ అషర’ అని అంటారు. అంటే పది హక్కులు అందులో తెలుపబడ్డాయి. అల్లాహ్ దాని ఆరంభం కూడా ఇలా చేశాడుః

[وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا] {النساء:36}

అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, ఆయనకు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకండి([2]).

 1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయేకి ముందు చేసిన వసియ్యతు (మరణశాసన)పై శ్రద్ధ వహించాలి.
 2. మనపై ఉన్న అల్లాహ్ హక్కు ఏమిటో తెలుసుకోవాలి.
 3. మానవులు తమపై ఉన్న అల్లాహ్ హక్కును నెరవేరుస్తే అల్లాహ్ పై వారి హక్కు ఏముంటుందో కూడా తెలుసుకోవాలి.
 4. (ముఆజ్ రజియల్లాహు అన్హు గారి హదీసులో ప్రస్తావించబడిన వషయం అప్పుడు) అనేక మంది సహాబాలకు తెలియదు.
 5. ఔచిత్యముంటే విద్యకు సంబంధించిన ఏదైనా విషయం ఎవరికైనా తెలుపకపోవడం యోగ్యమే.
 6. ముస్లింను సంతోషపరిచే విషయం వినిపించడం అభిలషణీయం.
 7. విశాలమైన అల్లాహ్ కారుణ్యంపై మాత్రమే ఆధారపడి (ఆచరణ వదులుకొనుట) నుండి భయపడాలి.
 8. ప్రశ్నించబడిన వ్యక్తికి జవాబు తెలియకుంటే ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అనాలి.
 9. విద్యకు సంబంధించిన ఏదైనా విషయం ఎప్పుడైనా ఒకరికి నేర్పి మరొకరికి నేర్పకపోవడం యోగ్యమే.
 10. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాడిదపై ప్రయాణం చేయడం మరియు ఒకరిని తమ వెనక ఎక్కించుకోవడం ద్వారా ఆయనగారి వినయ నమ్రత ఉట్టిపడుతుంది.
 11. వాహనము (భరించగల్గితే) ఎవరినైనా ఎక్కించుకొనుట యోగ్యం.
 12. ఏకదైవారాధన ఎంత గొప్ప విషయం అనేది తెలుస్తుంది.
 13. హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు గారి ఘనత కూడా తెలుస్తుంది.

తాత్పర్యం

ఈ అధ్యాయం పేరు ‘కితాబుత్ తౌహీద్’ (ఏకత్వపు అధ్యాయం). ఈ పేరు, మొదటి నుండి చివరి వరకు ఈ పుస్తకంలో ఏముందో దానిని తెలియపరుస్తుంది. అందుకే ప్రత్యేకంగా ‘ఖుత్బా[3]’ ప్రస్తావన రాలేదు. అంటే ఈ పుస్తకంలో ఏకదైవారాధన, దాని ఆదేశాలు, హద్దులు, షరతులు, ఘనతలు, ప్రమాణాలు, నియమాలు, వివరాలు, ఫలములు, కర్తవ్యములు, ఇంకా దానిని బలపరిచే, పటిష్టం చేసే, బలహీన పరిచే, సంపూర్ణం చేసే విషయాలన్నీ ప్రస్తావించబడ్డాయి.

తౌహీద్ అంటే ఏమిటో తెలుసుకోండిః సంపూర్ణ గుణాలు గల ప్రభువు (అల్లాహ్) ఏకైకుడు అని తెలుసుకొనుట, విశ్వసించుట ఇంకా వైభవం గల గొప్ప గుణాల్లో ఆయన అద్వితీయుడని మరియు ఆయన ఒక్కడే సర్వ ఆరాధనలకు అర్హుడని ఒప్పుకొనుట.

తౌహీద్ మూడు రకాలు

ఒకటి: తౌహీదుల్ అస్మా వ సిఫాత్

అల్లాహ్ ఘనమైన, మహా గొప్ప గుణాలుగల అద్వితీయుడు అని ఆయన గుణాల్లో ఎవనికి, ఏ రీతిలో భాగస్వామ్యం లేదు అని విశ్వసించుట. అల్లాహ్ స్వయంగా తన గురించి తెలిపిన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ గురించి తెలిపిన గుణనామములు, వాటి అర్థ భావాలు, వాటికి సంబంధించిన ఆదేశాలు ఖుర్ఆన్, హదీసులో వచ్చిన తీరు, అల్లాహ్ కు తగిన విధముగా నమ్మాలి. ఏ ఒక్క గుణనామాన్ని తిరస్కరించవద్దు, నిరాకరించవద్దు, తారుమారు చేయవద్దు, ఇతరులతో పోల్చవద్దు.

ఏ లోపాల, దోషాల నుండి పవిత్రుడని అల్లాహ్ స్వయం తన గురించి, లేదా ప్రవక్త అల్లాహ్ గురించి తెలిపారో వాటి నుండి అల్లాహ్ పవిత్రుడని నమ్మాలి.

రెంవది: తౌహీదుర్ రుబూబియత్

సృషించుట, పోషించుట, (సర్వజగత్తు) నిర్వహణములో అల్లాహ్ యే అద్వితీయుడని విశ్వసించుట. సర్వసృష్టిని అనేక వరాలు ఇచ్చి పోషించేది ఆయనే. ఇంకా తన సృష్టిలోని ప్రత్యేకులైన –ప్రవక్తలు, వారి అనుచరుల- వారికి నిజమైన విశ్వాసం, ఉత్తమ ప్రవర్తన, లాభం చేకూర్చే విద్య, సత్కార్యాలు చేసే భాగ్యాం ప్రసాదించి అనుగ్రహిస్తున్నది ఆయనే. ఈ శిక్షణయే హృదయాలకు, ఆత్మలకు ప్రయోజనకరమైనది, ఇహపరాల శుభాల కొరకు అనివార్యమైనది.

మూడవది: తౌహీదుల్ ఉలూహియ్యత్ (తౌహీదుల్ ఇబాదత్)

సర్వసృష్టి యొక్క పూజ, ఆరాధనలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని తెలుసుకోవాలి, నమ్మాలి. ప్రార్థనలన్నీ చిత్తశుద్ధితో, ఆయన ఒక్కనికే అంకితం చేయాలి. ఈ చివరి రకములోనే పైన తెలుపబడిన రెండు రకాలు ఆవశ్యకముగా ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే తౌహీదుల్ ఉలూహియ్యత్ అన్న ఈ రకంలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ మరియు తౌహీదుర్ రుబూబియత్ గుణాలు కూడా వచ్చేస్తాయి. అందుకే ఆయన అస్మా వ సిఫాత్ లో మరియు రుబూబియత్ లో అద్వితీయుడు, ఏకైకుడు అయినట్లు ఆరాధనలకు కూడా ఒక్కడే అర్హుడు.

మొదటి ప్రవక్త నుండి మొదలుకొని చివరి ప్రవక్త వరకు అందరి ప్రచార ఉద్దేశం తౌహీదుల్ ఉలూహియ్యత్ వైపునకు పిలుచుటయే.

‘అల్లాహ్ మానవులను ఆయన్ను ఆరాధించుటకు, ఆయన కొరకే చిత్తశుద్ధిని పాటించుటకు పుట్టించాడని మరియు ఆయన ఆరాధన వారిపై విధిగావించబడినది’ అని స్పష్టపరిచే నిదర్శనాలను రచయిత ఈ అధ్యాయంలో పేర్కొన్నారు.

ఆకాశ గ్రంథాలన్నియూ మరియు ప్రవక్తలందరూ ఈ తౌహీద్ (ఏకదైవత్వం) ప్రచారమే చేశారు. మరియు దానికి వ్యతిరేకమైన బహుదైవత్వం, ఏకత్వంలో భాగస్వామ్యాన్ని ఖండించారు. ప్రత్యేకంగా మన ప్రవక్త ముహమ్మ్దద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

దివ్య గ్రంథం ఖుర్ఆన్ కూడా ఈ తౌహీద్ గురించి ఆదేశమిచ్చింది, దానిని విధిగావించింది, తిరుగులేని రూపంలో దానిని ఒప్పించింది, చాలా గొప్పగా దానిని విశదపరిచింది, ఈ తౌహీద్ లేనిదే మోక్షం గానీ, సాఫల్యం గానీ, అదృష్టం గానీ ప్రాప్తించదని నిక్కచ్చిగా చెప్పింది. బుద్ధిపరమైన, గ్రాంథికమైన నిదర్శనాలు మరియు దిజ్మండలంలోని, మనిషి ఉనికిలోని నిదర్శనాలన్నియూ తౌహీద్ (ఏకదైవత్వం)ను పాటించుట విధి అని చాటి చెప్పుతాయి.

తౌహీద్ మానవులపై ఉన్న అల్లాహ్ యొక్క హక్కు. అది ధర్మవిషయాల్లో అతిగొప్పది, మౌలిక విషయాల్లో కూడా మరీ మూలమైనది, ఆచరణకు పుణాది లాంటిది. (అంటే తౌహీద్ లేనివాని సదాచరణలు స్వీకరించబడవు).


[1] ప్రవక్తను తిరస్కరించిన మక్కా అవిశ్వాసులు నమాజులు చేసేవారు, హజ్ చేసేవారు, దానధర్మాలు ఇతర పుణ్యకార్యాలు చేసేవారు. కాని అల్లాహ్ కు ఇతరులను భాగస్వాములుగా చేసేవారు. అందుకే అది ఏకదైవారాధన అనబడదు.

[2] భావం ఏమిటంటే: హక్కుల్లోకెల్లా మొట్టమొదటి హక్కు అల్లాహ్ ది. ఏ భాగస్వామ్యం లేకుండా అల్లాహ్ ఆరాధన చేయనివాడు అల్లాహ్ హక్కును నెరవార్చనివాడు. ఈ హక్కు నెరవేర్చకుండా మిగితా హక్కులన్నీ నెరవేర్చినా ఫలితమేమీ ఉండదు.

[3] సామాన్యంగా ప్రతి ధార్మిక పుస్తక ఆరంభం ‘అల్ హందులిల్లాహి నహ్మదుహు….’ అన్న అల్లాహ్ స్తోత్రములతో చేయబడుతుంది

2వ అధ్యాయం: తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం

అల్లాహ్ ఆదేశం:

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ

“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్‌” (షిర్క్‌) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్‌ ఆమ్‌ 6 : 82).

ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్‌ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).

ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:

“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).

అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో  ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్!  నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.

(ఇబ్ను హిబ్బాన్‌ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).

అల్లాహ్ ఇలా సెలవిచ్చారని  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్‌).

ముఖ్యాంశాలు:

1.  అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.

2. తౌహీద్‌ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.

3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.

4. సూరయే అన్‌ఆమ్‌ లోని ఆయతులో “జుల్మ్‌” అంటే షిర్క్‌ అని భావం.

5. ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.

6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.

7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.

8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.

9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.

10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.

11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).

12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్‌ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.

13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.

14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.

15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .

16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.

17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.

18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.

19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.

20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్‌హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం  “ముఖం” (Face).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్‌ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్‌ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).

1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.

2.తౌహీద్‌ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.

3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.

4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.

5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.

6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్‌ పై ఆధారపడియుంది. తౌహీద్‌ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.

7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్‌ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్‌, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.

8.హృదయాంతరంలో తౌహీద్‌ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.

9.ఏ దాసునిలో తౌహీద్‌, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.

10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.

11. తౌహీద్‌ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్‌, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్‌ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో  వైపు కొందరుంటారు; తౌహీద్‌, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.

12) ఇహపరాల్లో తౌహీద్‌ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.

13) విశ్వాసులైన  తౌహీద్‌ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్‌ ఆన్‌, హదీసులో చాలా ఉన్నవి.

3వ అధ్యాయం: తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గంలో చేరుతారు

إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ

అల్లాహ్ (త’ఆలా) ఆదేశం: “నిజానికి ఇబ్రాహీమ్‌ తనకు తానే ఒక సంఘం (ఉమ్మహ్). అల్లాహ్ కు పరమ విధేయుడు. ఆయన యందే మనస్సు నిలిపినవాడు. అతను ఎన్నడూ ముష్రిక్  గా ఉండలేదు?” (సూరహ్ నహ్ల్ 16:120).

وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ

“… మరియు ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వామ్యులుగా చేయరో (వారే మేళ్ళ వైపునకు పరుగులు తీసేవారు)“ (సూరహ్ మూ’మినూన్‌ 23:59).

హుసైన్‌ బిన్‌ అబ్దుర్ రహ్మాన్‌ కథనం: నేను సఈద్‌ బిన్‌ జుబైర్‌ వద్ద ఉండగా “నిన్న రాత్రి రాలి పడిన నక్షత్ర చుక్కను ఎవరు చూశారు?” అని అడిగారాయన. “నేను చూశాను. అప్పుడు నేను నమాజులో లేను, కాని విషపురుగు కాటేసినందున బాధతో ఉన్నాను”. అని చెప్పాను. “అయితే నీవు ఏమి చేశావు ?” అని ఆయన ప్రశ్నించారు. “రుఖ్యా (మంత్రం) చదివాను” అని జవాబిచ్చాను. “ఎందుకు అలా చేశావు?” అని ఆయనడిగారు. “షాతబి మాకు ఒక హదీసు వినివించారు (దాని ఆధారంగా నేను చదివాను)” అనిచెప్పాను. “ఆయన ఏ హదీసు మీకు వినిపించారు” అని ఆయన అడిగారు. నేను చెప్పాను: “బురైద బిన్‌ హుసయ్యిబ్‌ ఉల్లేఖించిన ఒక హదీసు మాకు వినిపించారు. ఆయన చెప్పారు: “దిష్టి  తగిలితే మరియు విషపురుగు కాటేస్తే తప్ప మంత్రించకూడదు” అని. “ఎవరు విన్న హదీసుపై ఆచరించారో   వారు మంచి పని చేశారు” అని సఈద్‌ చెప్పి. మాకు ఇబ్నె అబ్బాసు (రది అల్లాహు అన్హు) ఈ హదీసు వినిపించారు ” అన్నారు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. (వారికి సారథ్యం వహిస్తూ) ప్రవక్తలు నా ముందు నుంచి వెళ్ళసాగారు. అప్పుడు కొందరు ప్రవక్తల వెనక ఓ చిన్న సమూహం ఉంది. కొందరు ప్రవక్తల వెనక ఒక్కొక్క వ్యక్తి మాత్రమే ఉంటే, మరికొందరి ప్రవక్తల వెనక ఇద్దరేసి వ్యక్తులు ఉండేవారు. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని ప్రవక్తలు కూడా వారిలో ఉన్నారు. ఆ తరువాత నాకు ఒక పెద్ద జన సమూహము కన్పించింది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కాని ఆ సమూహం హజ్రత్‌ మూసా (అలైహిస్సలాం), ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. ఆ తరువాత జన సమూహం మరొకటి చూశాను. అప్పుడు ఈ జన సమూహం మీ అనుచర సమాజమే. వీరిలో డెబ్బయ్ వేల మంది ఎలాంటి విచారణ, శిక్ష లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు” అని తెలుపబడింది.

ఆ తరువాత ప్రవక్త లేచి వెళ్ళిపోయారు. (డెబ్బై వేల మంది ఎవరయి ఉంటారో) అని కొందరు అనుచరులు పరస్పరం మాట్లాడుకుంటూ “బహుశ వారు ప్రవక్త మైత్రిత్వం (స్నేహం) పొందిన వారు కావచ్చు” అన్నారు. మరి కొందరు “వారు ఇస్లాంలోనే పుట్టి ఏ మాత్రం షిర్క్‌ చేయని వారు కావచ్చు” అని అన్నారు. ఇలా చర్చించూకుంటూ ఉండగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వచ్చేశారు. వారందరూ చర్చించుకున్న విషయాలను ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వారు మంత్రాలు చేయించుకునేవారు కారు, దుశ్శకునాలను పాటించరు, వాతలతో చికిత్స చేయించుకోరు. వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని (ఏ కష్టమొచ్చినా) ఆయన మీదే ఆధారపడతారు” అని విశదీకరించారు.

ప్రవక్త అనుచరుల్లో ఉక్కాషా బిన్‌ మిహ్సన్‌ లేచి నిలబడి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అని కోరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నీవు వారిలో ఒకడివి”. ఇది చూసి మరో వ్యక్తి లేచి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అన అడిగాడు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఉక్కాషా నీ  కంటే ముందు ఈ సదవకాశాన్ని ఉపంయోగించుకున్నాడు”. (బుఖారి, ముస్లిం).

ముఖ్యాంశాలు:

1. తౌహీద్‌  విషయంలో ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు.

2. తౌహీద్‌ యొక్క భావం స్పష్టమయింది.

3. ప్రవక్త ఇబ్రాహీం ముష్రికులలోని వారు కారు అని అల్లాహ్ వారిని ప్రశంసించాడు.

4. షిర్క్‌ నుండి దూరమున్న ఔలియా అల్లాహ్ లను (అల్లాహ్  భక్తులను) ప్రశంసించబడింది.

5. మంత్రం చేయించుట, వాతలు వేయించుటను మానుకొనుట “తౌహీద్ యొక్క తహ్ఖీఖ్‌” చేసినట్టగును.

6. పై హదీసులో వచ్చిన గుణాలు అలవరచుకొనుట అల్లాహ్ పై “భరోసా” (నమ్మకం, ఆధారం) చాలా ఉన్నట్టు

7. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల అపారవిద్య తెలుస్తుంది. (ఆ డెబ్బై వేల మంది అల్లాహ్ దయ తరువాత) వారి సత్కార్యాలతోనే (విచారణ, శిక్ష లేకుండా) స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు.

8. సహాబీలు మంచి విషయాల్లో మున్ముందుగా ఉండడానికి ఎంతగా కాంక్షించేవారో తెలుస్తుంది.

9. ముహమ్మద్‌ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఉమ్మతీలు” (అనుచర సమాజం) ఉన్నత స్థానంలో, సంఖ్యలో ఇతర ప్రవక్తల “ఉమ్మతీల” (అనుచరుల) కంటే ఎక్కువగా, శ్రేష్ఠులుగా ఉన్నట్టు తెలుస్తుంది.

10. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) “ఉమ్మతీల” ఘనత కూడ తెలుస్తుంది.

11. ప్రవక్త ఎదుట గత “ఉమ్మతీలందరు” ప్రత్యక్షమయ్యారు.

12. ప్రతీ “ఉమ్మత్‌” తమ ప్రవక్త వెంట వచ్చును.

13. ప్రవక్తలను అనుసరించిన ప్రజలు అల్ప సంఖ్యాకులు అని తెలుస్తుంది.

14. ఏ ప్రవక్తను విశ్వసించిన వారు ఎవరూ ఉండరో, ఆ ప్రవక్త ఒంటరిగా వచ్చును.

15. దీని వల్ల తెలిసిందేమిటంటే: మెజారిటి ఉన్నప్పుడు విర్రవీగ వద్దు. మైనారిటిగా ఉన్నప్పుడు చింతించవద్దు.

16. విష పురుగు కాటు వేసినా, దిష్టి తగిలినా (రుఖ్యా) మంత్రం చేయించుట ధర్మసమ్మతం.

17. సఈద్ బిన్‌ జుబైర్‌ “ఎవరు విన్న హదీసుపై ఆచరించాలో వారు మంచి పని చేశారు” అని అన్న పదంతో పూర్వీకులు విద్యలో ఎంత ఆరితేరిన వారో తెలుస్తుంది. ఇంకా; వీరు చెప్పిన హదీసు మరియు హుసైన్‌ బిన్‌ అబ్దుర్  రహ్మాన్‌ చెప్పిన హదీసులో తేడా ఏ మాత్రం లేదు.

18. పూర్వ పండితులు అనవసర ప్రశంసల నుండి దూరంగా ఉుండేవారు.

19. ఉక్కాషాకు “నీవు వారిలో ఒకడివి అని ప్రవక్త చెప్పడం ప్రవక్త పదవి గుర్తుల్లో ఒకటి.

20. ఉక్కాషా ఘనత (అతడు స్వర్గవాసి అని తెలుపబడుట).

21. ఉక్కాషా తరువాత వ్యక్తికి ప్రవక్త చెప్పిన మాటల ద్వారా సందర్భాన్ని బట్టి స్పష్టంగా కాకుండా సైగల ద్వారా సంక్షిప్తంగా మాట్లాడడం యోగ్యం అని తెలుస్తుంది.

22. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నీతి, సత్ప్రవర్తన కూడా ఈ హదీసులో ఉట్టిపడుతుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయం దీనికంటే ముందు అధ్యాయాన్ని సంపూర్ణ పరుస్తుంది. ఇది దానికి సంబంధించినదే.

తౌహీద్‌ యొక్క “నిర్ధారణ” అంటే: పెద్ద షిర్క్‌, చిన్న షిర్క్‌ నుండి, వాక్కులోనూ, విశ్వాసంలోనూ, కర్మలలోనూ అన్ని బిద్‌అత్‌ (కల్పిత ఆచారా)ల నుండి, పాపాల నుండి తౌహీద్‌ను కాపాడుట, శుద్ది పరుచుట. ఇవన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకు మాత్రమే చేయుట. ఎందుకనగా అత్యధికమైన షిర్క్‌ తౌహీద్‌కు విరుద్ధమైనది. అత్యల్పమైన షిర్క్‌ సంపూర్ణ తౌహీద్‌కు విరుద్దమైనది. బిద్‌అత్ , పాపాలు తౌహీద్‌ను కలుషితం చేసి, దాని సంపూర్ణత్వానికి అడ్డుపడతాయి. దాని లాభాల నుండి దూరం చేస్తాయి.

తౌహీద్‌ యొక్క నిర్ధారణ చేసిన వాని హృదయం విశ్వాసం, తౌహీద్‌, ఇఖ్లాస్ (సంకల్పశుద్ది)తో నిండిపోతుంది. తన ఆచరణ దాన్ని సత్యపరుస్తుంది. అది ఏ విధంగా అనగా: అల్లాహ్ యొక్క సమస్త ఆదేశాలకు అతడు శిరసావహిస్తాడు. అవిధేయతకు పాల్పడి విశ్వాసాన్ని నష్టపరుచుకోడు. అలాంటివాడే స్వర్గంలో విచారణ లేకుండా వెళ్లేవాడు. అందులో ప్రవేశించే మొదటి వ్యక్తి అయ్యేవాడు.

అల్లాహ్ కు పూర్ణ విధేయుడై, అల్లాహ్ పై ధృడమైన నమ్మకం ఉంచి, ఏ ఒక్క విషయంంలో కూడా అల్లాహ్ ను వదలి మానవుల వైపు మరలకుండా, వారిని అడగకుండా ఉండి, అతని బాహ్యం, ఆంతర్యం, మాటలు, చేష్టలు, ప్రేమ, ద్వేషం అన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట , ప్రవక్త అడుగుజాడల్లో నడుచుట తౌహిద్‌ యొక్క నిర్దారణకు ప్రత్యేక నిదర్శనం.

ఇక్కడ ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. “ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది.” (6: 132).

ఆశలతో, వాస్తవం లేని మాటలతో తౌహీద్‌ యొక్క నిర్ధారణ కాదు. మనస్సులో స్థిరమైన విశ్వాసం, ఇహ్సాన్‌ (ఆరాధనా సౌందర్యం) వాస్తవికతలతో, దానికి తోడుపడే సత్ప్రవర్తన, సత్కార్యాలతో అవుతుంది.

ఈ విధంగా తౌహీద్‌ యొక్క నిర్ధారణ చేసినవారు ఈ అధ్యాయంలో చెప్పబడిన ఘనతలకు అర్హులవుతారు.

4 వ అధ్యాయం: షిర్క్‌ నుండి భయపడుట

అల్లాహ్ ఆదేశం:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

“అల్లాహ్ క్షమంచనిది కేవలం షిర్క్‌ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారికొరకు క్షమిస్తాడు.” (నిసా 4:48).

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ

“నన్ను, నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు” అని ఇబ్రాహీం (అలైహిస్సలాం) దుఆ చేశారు. (ఇబ్రాహీం 14:35).

అతి ఎక్కువగా నేను మీ పట్ల భయం చెందేది “షిర్క్‌ అస్గర్” (చిన్న షిర్క్) కు మీరు పాల్పడుతారని” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినప్పుడు, సహచరులు “అదేమిటి” అని అడిగినందుకు “ప్రదర్శనాబుద్ధి” అని బదులిచ్చారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం).

అల్లాహ్ తో మరొకరిని సాటి కల్పించి, అర్ధించేవాడు అదే స్థితిలో చనిపోతే నరకంలో చేరుకుంటాడు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారని ఇబ్ను మసూద్‌ (రది అల్లాహు అన్హు) తెలిపారు. (బుఖారి).

“అల్లాహ్ తో మరెవ్వరినీ సాటి కల్పించని స్థితిలో చనిపోయిన వ్యక్తి స్వర్గంలో చేరుకుంటాడు. అల్లాహ్ తో సాటి కల్పించి చనిపోయిన వ్యక్తి నరకంలో చేరుకుంటాడు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు.

ముఖ్యాంశాలు:

1. షిర్క్‌ నుండి భయపడుట.

2. ప్రదర్శనాబుద్ధి షిర్క్‌లో వస్తుంది.

3. అది “షిర్క్‌ అస్గర్” (చిన్న షిర్క్) లో వస్తుంది.

4. సత్కార్యాలు చేసేవారిలో అది చోటు చేసుకుంటుందన్న భయం ఎక్కువ ఉంటుంది.

5. స్వర్గనరకాలు సమీపములోనే ఉన్నాయని తెలిసింది.

6. ఒకే హదీసులో రెండిటిని కలిపి చెప్పడం జరిగింది.

7. షిర్క్‌ చేయకుండా చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు స్వర్గంలో చేరుతాడు. షిర్క్‌ చేసి చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు నరకంలో పోతాడు. అతడు అందరికన్నా ఎక్కువ ప్రార్థనలు చేసినవాడైనప్పటికినీ.

8. ముఖ్య విషయం: ఇబ్రాహీం (అలైహిస్సలాం) తమను, తమ సంతానాన్ని  విగ్రహారాధన నుండి కాపాడమని అల్లాహ్ ను ప్రార్థించారు.

9. “ప్రభూ! ఈ విగ్రహాలు చాలా మందిని మార్గం తప్పించాయి” (14: 36). అంటూ (దుర్మార్గంలో పడుతున్న) అధికసంఖ్యాకులతో గుణపాఠం నేర్చుకొని “ఓ ప్రభూ! నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడుము” అని అర్ధించారు.

10. ఇమాం బుఖారి (రహిమహుల్లాహ్) తెలిపిన ప్రకారం ఇందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావం ఉంది.

11. షిర్క్‌ నుండి దూరమున్నవారి ఘనత తెలిసింది.

తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ) 

షిర్క్‌ తౌహీద్ కు విరుద్ధం. దాని రెండు రకాలు: ఒకటి షిర్క్‌ అక్బర్‌ (జలి) (పెద్ద షిర్క్). రెండవది: షిర్క్‌ అస్గర్  (ఖఫి) (చిన్న షిర్క్)

షిర్క్‌ అక్బర్‌ అంటే: అల్లాహ్ తో ‘మొరపెట్టుకున్నట్లు, భయం చెందినట్లు, ప్రేమంచినట్లు ఇతరులతో మొరపెట్టుకొనుట. భయం చెందుట, ప్రేమించుట. సారాంశమేమనగా: అల్లాహ్ కు చేయవలసిన ప్రార్ధనలు, ఆరాధనలు ఇతరులకు చేయుట షిర్క్‌ అక్బర్‌. దీనికి పాల్పడినవానిలో ఏ మాత్రం తౌహీద్‌ లేనట్లే. అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించింది ఇలాంటి ముష్రికు పైనే. అతని నివాసం నరకం. ఇక ఏవైనా ఇలాంటి పనులు చేస్తూ దానిని “వసీల”, “పుణ్యపురుషుల ప్రేమ”, అన్న పేర్లతో నిజాన్ని  వక్రీకరిస్తే అది కూడా  షిర్క్‌ అవుతుంది.

షిర్క్‌ అస్గర్‌ అంటే: షిర్క్‌ అక్బర్‌ వరకు చేర్పించే సాధనాలు, కార్యాలు. ఉదాహరణకు: “గులువ్వు ” (అతిశయోక్తి. అంటే: పుణ్యపురుషుల విషయంలో హద్దులు మీరుట), అల్లాహ్ యేతరుల ప్రమాణం, చూపుగోలుతనం, ప్రదర్శనాబుద్ధి మొదలగునవి).

5 వ అధ్యాయం: “అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు” అనే ప్రమాణానికి ఆహ్వానించుట

అల్లాహ్ ఆదేశం:

قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّ

ఇలా చెప్పండి! నా మార్గం ఇది. స్పష్టమగు సూచనను అనుసరించి నేను అల్లాహ్ వైపునకు పిలుస్తాను“. (యూసుఫ్ 12 : 108).

ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మఆజ్ (రదియల్లాహు అన్హు) ను యమన్ దేశానికి పంపుతూ ఇలా ఉపదేశించారు:

“నీవు గ్రంథమివ్వబడిన (క్రైస్తవుల) వైపునకు వెళ్తున్నావు. మొట్టమొదట నీవు వారిని “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం ఇవ్వాలని ఆహ్వానించు”. మరో రివాయత్ లో ఉంది. “అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మాలని చెప్పు. వారు నీ ఈ మాటకు విధేయులయితే, అల్లాహ్ వారికి రోజుకు (24 గంటల్లో) ఐదు సార్లు నమాజు చేయుట విధించాడని తెలుపు. నీ ఈ మాటకు కూడా విధేయత చూపితే, అల్లాహ్ వారిపై జకాత్ విధించాడని తెలియజేయి. అది వారి ధనికుల నుండి వసూలు చేసి, పేదలకు పంచబడుతుంది అని తెలుపు. నీ ఈ మాటను వారు అమలు పరుస్తే, (వారి నుండి జకాత్ వసూలు చేసినప్పుడు) వారి శ్రేష్ఠమైన వస్తువుల జోలికి పోకు. పీడితుని ఆర్తనాదాలకు భయపడు. పీడితుని ఆర్తనాదానికి, అల్లాహ్ కు మధ్య ఏలాంటి అడ్డుతెర ఉండదు”.

సహల్ బిన్ సఅద్ కథనం: ఖైబర్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను రేపు యుద్ధపతాకం ఎలాంటి వ్యక్తికి ఇస్తానంటే, అతను అల్లాహ్, ఆయన ప్రవక్తని ప్రేమిస్తాడు. అతన్ని అల్లాహ్, ఆయన ప్రవక్త ప్రేమిస్తారు. అల్లాహ్ అతని ద్వారా (ఖైబర్) విజయం చేకూరుస్తాడు“. ఆ పతాకం ఎవరికి దొరుకుతుందో అన్న ఆలోచనలోనే వారు రాత్రి గడిపి, తెల్లవారుకాగానే ప్రవక్త సమక్షంలో హాజరయి, తనకే ఆ పతాకం లభిస్తుందని ఆశించారు. అప్పుడు “అలీ బిన్ అబీ తాలిబ్ ఎక్కడున్నాడ“ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడిగారు. ఆయన కళ్ళలో ఏదో బాధగా ఉంది అని సమాధానమిచ్చారు ప్రజలు. ఎవరినో పంపి అతన్ని పిలిపించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతని కళ్ళల్లో తమ లాలాజలాన్ని ఉమ్మినారు. తక్షణమే అలీ (రదియల్లాహు అన్హు) తనకసలు ఎలాంటి బాధే లేనట్లు పూర్తిగా ఆరోగ్య వంతులైపోయారు. యుద్ధ పతాకం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అలీ (రదియల్లాహు అన్హు) చేతికి ఇచ్చి, ఇలా బోధించారు: “నీవు నెమ్మదిగా, హుందాగా వెళ్ళి వారి మైదానంలో దిగు. ఆ తరువాత వారికి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజెయ్యి. వారు నిర్వహించవలసిన అల్లాహ్ హక్కులు వారిపై ఏమున్నాయో వారికి బోధించు. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఏ ఒక్కనికి అల్లాహ్ రుజు మార్గం (ఇస్లాం) ప్రసాదించినా అది నీకోసం ఎరుపు రంగు ఒంటెల కంటే ఎంతో విలువైనది, శ్రేష్ఠమైనది“. (బుఖారి, ముస్లిం).

ముఖ్యాంశాలు: 

1. అల్లాహ్ వైపునకు ఆహ్వానించుట (ప్రవక్త మరియు) ఆయన్ని అనుసరించిన వారి జీవితాశయం.

2. ‘ఇఖ్లాసు’ ఉండుట చాలా ముఖ్యం. ఎందుకనగా ధర్మం వైపు ఆహ్వానిస్తున్నామంటున్న అనేక మంది స్వయంగా తమ వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నారు.

3. విద్య ఆధారంగా (ధర్మప్రచారం చేయుట) కూడా ఒక విధి.

4. అల్లాహ్ ను లోపాలు లేని పవిత్రుడని నమ్ముటమే ఉత్తమమైన తౌహీద్.

5. అల్లాహ్ లోపాలు గలవాడని భావించుట చాలా చెడ్డ షిర్క్.

6. ముస్లిం, ముష్రికులకు అతి దూరంగా ఉండాలి. ఎందుకనగా అతను షిర్క్ చేయనప్పటికి వారిలో కలసిపోయే ప్రమాదముంటుంది.

7. విధుల్లో మొట్టమొదటిది తౌహీద్.

8. అన్నిటికి ముందు, చివరికి నమాజుకన్నా ముందు తౌహీద్ ప్రచారం మొదలు పెట్టాలి.

9. మఆజ్ హదీసులో “అన్ యువహ్హిదుల్లాహ్” (అల్లాహ్ ఏకత్వాన్ని స్వీకరించుట) మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” రెండిటి భావం ఒక్కటే. .

10. మనిషి దైవ గ్రంథం పొందిన (యూదుడు, క్రైస్తవుడు లాంటి) వాడు అయి కూడా “లాఇలాహ ఇల్లల్లాహ్” అర్థం తెలుసుకోలేకపోవచ్చు, లేక తెలుసుకొని కూడా దాని ప్రకారం ఆచరించకపోవచ్చు.

11. విద్యను క్రమ క్రమంగా నేర్పాలని బోధపడింది.

12. ముఖ్యమైన విషయంతో ఆరంభించాలని తెలిసింది.

13. జకాత్ సొమ్మును ఎందులో ఖర్చు పెట్టాలో తెలిసింది.

14. (జకాత్ సొమ్ము ఎందులో ఖర్చు చెయ్యాలి తెలియక, మఆజ్ సందేహ పడకుండా ప్రవక్త ముందే వివరించినట్లు) శిష్యులను సందిగ్ధంలో పడవేసే విషయాలను పండితుడు ముందే విశదీకరించాలి.

15. (జకాత్ వసూలు చేసే అతను) కేవలం మంచి సొమ్ము మాత్రమే తీసుకొనుట నివారించబడింది.

16. పీడుతుని ఆర్తనాదానికి భయపడాలి.

17. అతని ఆర్తనాదం స్వీకరించబడటానికి ఏదీ అడ్డు పడదు అని తెలుపబడింది.

18. ప్రవక్త, సహాబీలు, ఇతర మహాభక్తులు (తౌహీద్ ప్రచారంలో) భరించిన కష్టాలు, ఆకలి, అంటు వ్యాధి బాధలు, తౌహీద్ యొక్క నిదర్శనాలు.

19. “నేను యుద్ధపతాకం ఇస్తాను” అన్న ప్రవక్త మాట, ఆయనకు ప్రసాదించబడిన అద్భుత సంకేతం (ము’అజిజ).

20. అలీ (రదియల్లాహు అన్హు) కళ్ళల్లో ఆయన లాలాజలం పెట్టడం కూడా ఒక అద్భుత సంకేతమే.

21. అలీ (రజియల్లాహు అన్హు) యొక్క ఘనత తెలిసింది.

22. ఇందులో సహాబాల ఘనత కూడా తెలుస్తుంది. ఎలా అనగా? యుద్ధ పతాకం ఏ అదృష్టవంతునికి లభిస్తుందో అని ఆలోచించడంలోనే నిమగ్నులయ్యారు, అతని ద్వారానే అల్లాహ్ విజయం ప్రసాదిస్తాడన్న విషయం వారు మరచిపోయారు.

23. అదృష్టంపై విశ్వాసం ఇందులో రుజువవుతుంది. అది ఎలా? యుద్ధ పతాకం కోరినవారికి లభించలేదు. కోరని, ఏ మాత్రం ప్రయత్నం చేయని వారికి లభించింది.

24. “నిదానంగా బయలుదేరు” అన్న ప్రవక్త మాటలో (యుద్ధ) శిక్షణ, పద్దతి బోధపడుతుంది.

25. ఎవరితో యుద్ధం చేయబోతున్నారో ముందు వారికి ఇస్లాం పిలుపు నివ్వా లి.

26. ఇంతకు ముందే పిలుపు ఇవ్వడం, లేక యుద్ధం జరిగియుంటే పరవా లేదు.

27. “వారిపై విధియున్న వాటిని వారికి తెలుపు” అనడంలో ధర్మ ప్రచార రంగంలో అవసరమైన వివేకం కానవస్తుంది.

28. ఇస్లాంలో అల్లాహ్ హక్కులు ఏమున్నవో వాటిని తెలుసుకొనుట ఎంతైనా అవసరం.

29. ఒక్క వ్యక్తి అయినా తమ ద్వారా రుజుమార్గం పొందుతే ఇది ఎంత పుణ్యకార్యమో తెలుస్తుంది. .

30. ఫత్వా ఇస్తున్నప్పుడు అవసర సందర్భంగా అల్లాహ్ నామముతో ప్రమాణం చేయవచ్చును.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్): ఈ గ్రంధంలోని అధ్యాయాల్లో ఏ క్రమాన్ని పాటించారో అది చాలా ఉత్తమమైనది. మొదట తౌహీద్ “విధి” అని తెలిపారు, తరువాత దాని ఘనత, సంపూర్ణత ప్రస్తావన తెచ్చి, పిదప బాహ్యంతర్యాల్లో దాని “నిర్ధారణ”, ఆ తరువాత దానికి విరుద్ధమైన షిర్క్ తో భయంను ప్రస్తావించారు. ఇలా మనిషి ఒక విధంగా తనకు తాను పరిపూర్ణుడవుతాడు. ఆ తరువాత “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పిలుపునివ్వాలన్న అధ్యాయాన్ని చేర్చారు.

ఇది ప్రవక్తల విధానం. ఒకే అల్లాహ్ ఆరాధన చేయాలని వారు తమ జాతి వారికి పిలుపు ఇచ్చారు. ఇదే విధానం ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ది. ఆయన వివేకంతో, చక్కని హితబోధతో, ఉత్తమమైన రీతిలో వాదనతో ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు. అందులో అలసిపోలేదు. బలహీనత చూపలేదు. అల్లాహ్ ఆయన ద్వారా ఇస్లాం ధర్మాన్ని స్థాపించాడు. అది తూర్పు, పశ్చిమాల్లో వ్యాపించింది. అనేక మంది ఋజుమార్గం పొందారు. ఆయన స్వయంగా ఈ బాధ్యతను నెరవేర్చుతూ, తమ అనుచరులను ప్రచారకులుగా తీర్చిదిద్ది ఇతర ప్రాంతాలకు పంపేవారు. మొట్ట మొదట తౌహీద్ గురించే బోధించాలని చెప్పేవారు. ఎందుకనగా సర్వ కర్మల అంగీకారం దానిపైనే ఆధారపడియుంది. ఇలాంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే మొదట తౌహీద్ గురించి తెలుసుకోవాలి. పిదప దాని ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరిపై తన శక్తి మేరకు ఈ బాధ్యత ఉంటుంది. పండితుడు తన విద్య తో ఈ బాధ్యతను నెరవేర్చాలి. ధన, ప్రాణ శక్తి గలవాడు, హోదా గలవాడు దాన్ని ఉపయోగించి ఈ బాధ్యతను నెరవేర్చాలి. కనీసం ఒక మాటతోనైనా ఈ బాధ్యతను నెరవేర్చినవానిని అల్లాహ్ కరుణించుగాక! శక్తి, సామర్థ్యాలు కలిగియుండి కూడా ఈ బాధ్యతను నెరవేర్చని వానికి వినాశము ఉంటుంది.

6 వ అధ్యాయం: తౌహీద్ మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము

అల్లాహ్ ఆదేశం:

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓ

ఈ ప్రజలు మొర పెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు.”
(బనీ ఇస్రాయీల్ 17 : 57). 

وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِۦٓ إِنَّنِى بَرَآءٌۭ مِّمَّا تَعْبُدُونَ

“ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతి వారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. “మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది… (జుక్రుఫ్ 43: 26).

ٱتَّخَذُوٓا۟ أَحْبَارَهُمْ وَرُهْبَـٰنَهُمْ أَرْبَابًۭا مِّن دُونِ ٱللَّهِ وَٱلْمَسِيحَ ٱبْنَ مَرْيَمَ وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوٓا۟ إِلَـٰهًۭا وَٰحِدًۭا ۖ لَّآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَـٰنَهُۥ عَمَّا يُشْرِكُونَ

“వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు…” (తౌబా 9: 31).

وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادًۭا يُحِبُّونَهُمْ كَحُبِّ ٱللَّهِ ۖ ۗ

“కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు…” (బఖర 2:165)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:

‘ఎవడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం మరొక్కడు లేడు) అని, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణం సురక్షితంగా ఉండును. అతని లెక్క (ఉద్దేశం) అల్లాహ్ చూసుకుంటాడు’. (ముస్లిం).

తరువాత వచ్చే పాఠాల్లో ఇదే వివరణ ఉంది. 

ముఖ్యాంశాలు: 

1. ఇందులో ముఖ్య విశేషం : తౌహీద్ (ఏక దైవ విశ్వాసం) మరియు షహాదత్ (లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం) యొక్క వ్యాఖ్యానం ఉంది. దాన్ని అనేక ఆయతుల ద్వారా స్పష్టం చేయడం జరిగింది 

2. బనీ ఇస్రాయీల్ లోని వాక్యం (17:57) – మహాపురుషులతో మొరపెట్టుకునే ముష్రికుల ఆ కార్యాన్ని రద్దు చేస్తూ, ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అని చెప్పబడింది. 

3. సూరె తౌబాలోని వాక్యం. “యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ను గాక తమ పండితులను, సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారని అల్లాహ్ తెలిపాడు”. ఇంకా “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించవలసిన ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింద”నీ తెలిపాడు. అయితే వారు తమ పండితుల, సన్యాసులతో మొరపెట్టుకోలేదు. వారి పూజా చేయలేదు. కాని పాపకార్యాల్లో వారి విధేయత పాటించారు. 

4. “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది? అన్న అవిశ్వాసులకు ఇబ్రాహీం మాట. తమసత్య ప్రభువును ఇతర మిథ్య ఆరాధ్యులతో స్పష్టమైన పద్దతిలో వేరు జేరు. 

ఇలా అవిశ్వాసులతో అసహ్యత, విసుగు మరియు అల్లాహ్ తో ప్రేమయే “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పరమార్థము అని అల్లాహ్ తెలిపాడు. అందుకే ఆ వాక్యం తరువాతనే ఈ వాక్యం ఉంది. 

ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచి వెళ్ళాడు, బహుశా వారు దాని వైపునకు మరలుతారని. (జుఖ్ రుఫ్ 43: 28). 

5. మరొకటి బఖరలోని వాక్యం. అందులో ప్రస్తాంవించబడిన అవిశ్వాసుల గురించి, “వారు నరకము నుండి బయటికి వెళ్ళేవారు కారు” అని అల్లాహ్ తెలిపాడు. వారు నియమించుకున్న వారిని అల్లాహ్ ను ప్రేమించవలసినట్లు ప్రేమిస్తారు. వారు అల్లాహ్ ను కూడా ప్రేమించువారు అని దీనితో తెలుస్తుంది. కాని వారి ఈ ప్రేమ వారిని ఇస్లాంలో ప్రవేశింపజేయలేకపోయింది. ఇది వీరి విషయం అయితే, ఎవరయితే తమ నియమించుకున్న వారిని అల్లాహ్ కంటే ఎక్కువ, లేక కేవలం వారినే ప్రేమించి, అల్లాహ్ ను ఏ మాత్రం ప్రేమించరో, వారి సంగతి ఎలా ఉంటుంది….? ఆలోచించండి! 

6. “ఎవరు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యదైవం మరొక్కడు లేడు) చదివి, అల్లాహ్ తప్ప పూజింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణాలు సురక్షితంగా ఉండును. అతని వ్యవహారం అల్లాహ్ చూసుకుంటాడు” అన్న ప్రవక్త ప్రవచనం “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావాన్ని తెలిపే దానిలో ముఖ్యమైనది. కేవలం నోటి పలుకుల ద్వారానే అతని ధన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పలేదు. ఆ పదాలు, దాని భావం తెలుసుకున్నవాని గురించే ఆ ఘనత లేదు. లేక దాన్ని కేవలం ఒప్పుకున్న వానికే రక్షణ లేదు. లేక అతడు కేవలం అల్లాహ్ తోనే మొరపెట్టుకుంటున్నందుకని కాదు. అతడు దాన్ని పలుకడంతో పాటు మిథ్యా దైవాలను తిరస్క.రించనంతవరకు అతని ధనప్రాణాలకు రక్షణ లేదు. ఇంకా అతడు అందులో సందేహపడితే, ఆలస్యం చేస్తే కూడా రక్షణ లేదు. ఈ విషయం ఎంతో ముఖ్యమైనది, గొప్పదైనది!. ఎంతో స్పష్టంగా తెలుపబడింది! వ్యెతిరేకులకు విరుద్ధంగా ఎంతో ప్రమాణికమైన నిదర్శన ఉంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

వాస్తవానికి తౌహీద్ యొక్క భావం ఏమనగా: “అల్లాహ్ అద్వితీయుడని అతని గుణాలతో తెలుసుకొని, నమ్ముట. కేవలం అయన్ని మాత్రమే ఆరాధించుట.” 

ఇది రెండు రకాలు: 

ఒకటి: అల్లాహ్ యేతరుల ఉలూహియత్ (ఆరాధన)ను తిరస్కరించుట. అది ఎలా అనగా; సృష్టిలోని ప్రవక్త, దైవదూత, ఇంకెవరయినా ఆరాధనకు అర్హులు కారని, వారికి ఏ కొంత భాగం కూడా అందులో లేదని తెలుసుకొని విశ్వసించుట. 

రెండవది: ఉలూహియత్ కు అర్హుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకి సాటి మరొకడు లేడని విశ్వసించుట. కేవలం ఇంతే సరిపోదు. ధర్మాన్ని కేవలం అల్లాహ్ కే అంకితం చేసి, ఇస్లాం, ఈమాన్, ఇహాసాన్ ను పూర్తి చేసి, అల్లాహ్ హక్కులతో పాటు అల్లాహ్ దాసుల హక్కులను అల్లాహ్ సంతృప్తి, దాని ప్రతిఫలం పొందడానికే పూర్తి చేయుట. 

దాని సంపూర్ణ భావంలో మరొకటి: అల్లాహ్ యేతరుల ఆరాధన నుండి అసహ్యత, విసుగు చెందుట. అల్లాహ్ ను గాక ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించినట్లు వారిని ప్రేమించుట, అల్లాహ్ కు విధేయత చూపినట్లు వారికి విధేయత చూపుట “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావానికి విరుద్ధమైనది

7 వ అధ్యాయం: కష్టం తొలగిపోవుటకు, లేక రాకుండా ఉండుటకు కడాలు, దారాలు, వాటి లాంటివి ధరించుట షిర్క్

 إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ

“ఒక వేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకునే దేవతలు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా?” (జుమర్ 39: 38).

ఇమ్రాన్ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి చేతిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాగి కడం (bracelet) చూసి, “ఇది ఏమిటి?” అని అడిగారు. “వాహిన” [*] దూరము కావడానికి వేసుకున్నాను అని అతడు చెప్పాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “దాన్ని తీసివేయి. అది నీ “వాహిన” పెరుగుటకే కారణమవుతుంది. ఒక వేళ అది నీవు ధరించి ఉన్నప్పుడు మరణించావంటే ఎన్నటికీ సాఫల్యం పొందవు” అని హెచ్చరించారు. (అహ్మద్).

[*] భుజములోని ఒక నరం ఉబ్బి రోగము వస్తుంది. అది దూరము కావడానికి వారు అలాంటివి వేసుకునేవారు

ఉఖ్బా బిన్ ఆమిర్ కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం: “తాయత్తు వేసుకున్నవారి ఉద్దేశాన్ని అల్లాహ్ పూర్తి చేయకుండుగాక. గవ్వ (సీపి) వేసుకున్న వానికి కూడా అల్లాహ్ స్వస్థత ప్రసాదించకుండా ఉండుగాక “. (అహ్మద్). మరో ఉల్లేఖనంలో ఉంది: “తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు“.

ఇబ్ను అబి హాతింలో ఉంది: హుజైఫా ఒక వ్యక్తి చేతిలో జ్వరం దూరం కావడానికి వేసుకున్న దారాన్ని చూసి తెంచారు. తరువాత ఈ ఆయతు చదివారు. “వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు.” (యూసూఫ్ 12 : 106).

ముఖ్యాంశాలు:

1. రోగాలు దూరమగుటకు కడాలు (bracelets), దారాలు (cords) వేసుకొనుట కఠినంగా నివారించబడింది.

2.”అతను అదే స్థితిలో చనిపోతే సఫలుడు కాడు” అన్న దానితో షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్), కబీర గునాహ్ లో (ఘోర పాపాల్లో) పెద్దది అని తెలుస్తుంది.

3. తెలియక పోవడము ఒక సాకుగా పరిగణింపబడలేదు.

4. దాని వలన లాభం కలగదు. ప్రవక్త ఆదేశానుసారం: ‘దాని వలన “వహన్” ఇంకా పెరుగుతుంది.’

5. ఇలాంటి పని చేసిన వారిని కఠినంగా హెచ్చరించబడింది.

6. ఇలాంటివి వేసుకున్నవారు దాని వైపే అప్పగించబడుతారు.

7. తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు అని స్పష్టం అయింది.

8. జ్వరం దూరం కావడానికి దారం వేసుకొనుట కూడా ఇందులోనే పరిగణించబడుతుంది.

9. హుజైఫా పఠించిన ఆయతుతో తెలిసిందేమిటంటే; ప్రవక్త సహచరులు పెద్ద షిర్క్ ప్రస్తావించబడిన ఆయతులతో చిన్న షిర్క్ గురించి ప్రమాణంగా ప్రస్తావించేవారు. సూరె బఖర వాక్యంలో ఇబ్నె అబ్బాసు (రదియల్లాహు అన్హు) ఇలాగే తెలిపారు.

10. దిష్టి తగలకుండా గవ్వ (సీపి) వేసుకొనుట కూడా షిర్క్ అవుతుంది.

11. తాయత్తు వేసుకున్న వారిని, గవ్వ వేసుకున్న వారిని శపించబడింది. అంటే అల్లాహ్ వారిని తన సంరక్షణలో ఉంచడు.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

నష్టం, కష్టం దూరం కావడానికి, లేక రాకుండా ఉండడానికి ఉపయోగించే సాధనాల (జరియ, అస్బాబ్)లో ఏవి యోగ్యం, ఏవి నిషేధం తెలుసుకొనటానికి, సాధనాల (జరీయ, అస్బాబ్)కు సంబంధించిన ఆదేశాల్ని తెలుసుకొనుట ఎంతయినా అవసరం. ఇందులో మూడు విషయాల్ని తెలుసుకొనుట చాలా ముఖ్యం.

1. ధార్మికంగా లేక శాస్త్రీయంగా లాభకరమయిన సాధనం అని రుజువైన వాటినే సాధనంగా ఉపయోగించాలి.

2. వాటిని ఉపయోగించే వ్యక్తి ఆధారం, భరోసా వాటిపై ఉండ కూడదు. వాటిని సాధనంగా చేసిన అల్లాహ్ పై నమ్మకం ఉండాలి.

3. సాధనాలు ఎంత గొప్పవి, శక్తి గలవైనా అల్లాహ్ వ్రాసి ఉంచిన విధి, (తఖ్ దీర్)కి అవి లోబడి ఉంటాయి. దానిని తప్పించుకోలేవు. అల్లాహ్ తాను కోరినట్లు వాటిలో మార్పు చేస్తాడు. అల్లాహ్ కోరితే అందులోని గుణాన్ని అలాగే ఉంచుతాడు. ఆయన దాసులు వాటిని తెలుసుకొని, ఉపయోగించి వాటిలో ఉన్నటువంటి అల్లాహ్ తత్వాన్ని గమనించగలరనీ. అతను కోరితే అందులోని గుణాన్ని మార్చనూవచ్చు. ఇలా దాసులు వాటిపైనే నమ్మకం ఉంచకూడదనీ, అల్లాహ్ శక్తిని అర్థం చేసుకోగలరనీ. మార్పు చేయు సర్వశక్తి, సర్వ ఇష్టం ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది.

పై ముఖ్య విషయం తెలుసుకున్న తరువాత, ఇక వచ్చిన కష్టం తొలగడానికి, లేక కష్టం రాకుండా జాగ్రత్త పడడానికి దారం లేక కడం లాంటివి వేసుకున్న వాడు షిర్క్ చేసినట్లే కదా? ఎలా అనగా; అది కష్టం రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడునది అని విశ్వసిస్తే ఇది పెద్ద షిర్క్ అవుతుంది. అతడు అల్లాహ్ను గాక ఇతరులను స్వస్థత ఇచ్చేవాడుగా నమ్మినందుకు ఇది రుబూబియత్ కు సంబంధించిన షిర్క్. ఇంకా అతడు అందులో స్వస్థత ఉంది అని దానిపై భరోసా, నమ్మకం, ఆశ ఉంచినందుకు, ఇది ఉలూహియత్ కు సంబంధించిన షిర్క్ అవుతుంది.

ఒక వేళ అతడు అల్లాహ్ యే కష్టనష్టాలు రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడువాడు అని విశ్వసించి, అవి కేవలం సాధనం అని నమ్మినవాడు, ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం లేని దానిని సాధనంగా నమ్మినవాడవుతాడు. ఇది నిషిద్ధం (హరాం). మరియు ఇస్లాం పై, వైద్య శాస్త్రంపై ఒక అబద్దం మోపినవాడవుతాడు. ఎలా అనగా; ఇస్లామీయ ధర్మం దీనిని చాలా కఠినంగా నివారించింది. అది నివారించినవి లాభాన్నిచ్చేవి కావు.

శాస్త్రీయంగా కూడా ఇవి ఆమోదం పొందినవి కావు. లాభం చేకూర్చే ఔషదాల్లో లెక్కించబడవు.

అందుకే ఇవి షిర్క్ వైపునకు లాక్కొని వెళ్ళే సాధనాలు. వాటిని వేసుకున్న వాని మనుస్సు వాటిపై లగ్నం అయి ఉంటుంది. అందుకే అది షిర్క్ భాగాల్లో ఒక భాగం. లేక సాధనాల్లో ఒక సాధనం.

ఇది ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం కాదని తెలిసినప్పుడు, విశ్వాసుడు తన విశ్వాసం సంపూర్ణమగుటకు దానిని వదిలి వేయాలి. అతని తౌహీద్ సంపూర్ణం అయిందంటే నివారించబడిన వాటిపై అతని మనుస్సు లగ్నం కాదు. లాభం లేని వాటిపై మనుస్సు లగ్నం కావడం బుద్ధిహీనతకు నిదర్శనం. ఎలా అనగా మనిషి తనకు లాభం లేని వాటిని ఉపయోగించడు. అందులో నష్టమే ఉంది.

ఈ సత్య ధర్మం యొక్క పునాది: “ప్రజల నుండి విగ్రహారాధనను, సృష్టి రాసుల పైనుండి నమ్మకాన్ని దూరము చేసి, వారి ధర్మాన్ని దురాచారాల, దుష్చేష్టల నుండి దూరం చేసి వారి బుద్ధి జ్ఞానాలను సంపూర్ణం చేయుట. బుద్ధిని అభివృద్ధి పరిచే, ఆత్మలను పరిశుద్ధపరిచే, ధార్మిక, ప్రాపంచిక స్థితిగతులను సంస్కరించే లాభదాయకమయిన విషయాల గురించి కృషి చేయుట.”

8 వ అధ్యాయం: మంత్రాలు (రుఖ్ యా) మరియు తాయత్తుల విషయంలో వచ్చిన ఆదేశాలు

అబూ బషీర్ అన్సారి (రదియల్లాహు అన్హు) కథనం; ఆయన ఓ ప్రయాణంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉండగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక చాటింపు చేసే వ్యక్తిని ఈ వార్త ఇచ్చి పంపారు: “తమ ఒంటె మెడలో ఎవరు కూడా తీగతో తయారైన పట్టా ఉంచకూడదు. ఒక వేళ ఉంటే తెంపాలి“. (బుఖారి, ముస్లిం). . 

ఇబ్ను మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ప్రవక్త ఈ చెప్పగా విన్నాను. “మంత్రము, తాయత్తులు, తివల (భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయుట) షిర్క్“. (అహ్మద్, అబూ దావూద్). 

అబుల్లాహ్ బిన్ ఉకైం ఉల్లేఖనలో ఉంది: “ఎవరు ఏదైనా వస్తువు వేసుకుంటే అతన్ని దాని వైపునకే అప్పగించబడుతుంది“. (అహ్మద్ , తిర్మిజి).

తాయత్తు అంటే: దిష్టి తగలకుండా తమ సంతానానికి ధరింపజేయబడే వస్తువులు. ఇది ఖుర్ఆన్ నుండి ఉంటే కొందరు పూర్వ ధర్మవేత్తలు యోగ్యమని చెప్పారు. మరి కొందరు యోగ్యం కాదని నివారించబడింది అని చెప్పారు. నివారించినవారిలో ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఉన్నారు.

మంత్రాలను “అజాయిం ” అని అంటారు. దిష్టి తగిలినప్పుడు, విష పురుగులు కాటేసినప్పుడు మంత్రిచవచ్చును కాని షిర్క్ అర్థమునిచ్చే పదాలు ఉండకూదడు.

తివల అంటే: భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు చేయబడే ఇంద్రజాలం. 

రువైఫిఅ యొక్క హదీసు అహ్మద్ ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీ ఆయనకి ఇలా తెలిపారు: “ఓ రువైఫిఅ ! నీవు దీర్ఘకాలం బ్రతుకవచ్చు. ఈ విషయం ప్రజలకు తెలియజేయి: గడ్డమును ముడి వేసేవారితో, లేక తీగలు మెడలో వేసుకునేవారితో, పశువుల పేడ, ఎముకలతో మలమూత్ర పరిశుద్ధి చేసేవారితో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఏలాంటి సంబంధం లేదు“.

సఈద్ బిన్ జుబైర్ ఇలా చెప్పారు: ‘ఒక వ్యక్తి ధరించిన తాయత్తును తీసే వారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభించును‘.

వాకీఅ, ఇబ్రాహీం నఖఈతో ఉల్లేఖించారు: “వారు అన్ని రకాల తాయుత్తులను నిషిద్ధంగా భావించేవారు. అవి ఖుర్ఆన్ కు సంబంధించినవైనా, లేదా ఖుర్ ఆన్ కు సంబంధం లేనివైనా.”

ముఖ్యాంశాలు: 

1. మంత్రము (రుఖ్య) , తాయత్తు యొక్క వివరణ తెలిసింది. 

2. తివల యొక్క భావం తెలిసింది. 

3. ఏలాంటి వ్యత్యాసం లేకుండా పైన పేర్కొన్న మూడూ విషయాలు కూడా షిర్క్ గా పరిగణింపబడుతాయి. 

4. దిష్టి తగలకుండా, విషపురుగు కాటేసినప్పుడు షిర్క్ పదాలు లేకుండా మంత్రించుట షిర్క్ కాదు. 

5. ఖుర్ఆన్ ఆయతులతో వ్రాయబడిన తాయత్తు విషయములో పండితుల బేధాభిప్రాయం ఏర్పడినది. (వాస్తవమేమిటంటే అది కూడా యోగ్యం కాదు. ఎలా అనగా మంత్రం షిర్క్ అని తెలిపిన తరువాత యోగ్యమైనదేదో ప్రవక్త స్వయంగా తెలిపారు. కాని తాయత్తు విషయంలో అలా తెలుపలేదు). 

6. పశువులకు దిష్టి తగలకుండా తీగలు, ఇంకేవైనా వేయుట కూడా షిర్క్ కు సంబంధించినవే. 

7. అలాంటివి వేసినవారిని కఠినంగా హెచ్చరించబడింది. 

8. ఒక వ్యక్తి మెడ నుండి తాయత్తు తీయుట ఎంత పుణ్యమో తెలిసింది.

9. ఇబ్రాహీం నఖఈ మాట, పైన తెలిపిన మాటకు విరుద్ధం ఏమి కాదు. ఎలా అనగా; ఈయన ఉద్దేశం అబుల్లాహ్ బిన్ మస్ ఊద్ శిష్యులు అని. 

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

తాయత్తులు వేసుకొనుట షిర్క్ అని తెలిసింది. అయితే ఇందులో కొన్ని షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్). ఉదా: షైతాన్ తో లేక సృష్టిరాసులతో మొరపెట్టుకొనుట, అల్లాహ్ ఆధీనంలో ఉన్నదాని గురించి ఇతరులతో మొరపెట్టుకొనుట పెద్ద షిర్క్ లో పరిగణించబడుతుంది. ఈ విషయం మరీ వివరంగా తరువాత అధ్యాయాల్లో వస్తుంది. మరి కొన్ని నిషిద్ధమున్నవి. ఉదా: అర్ధం లేని పేర్లతో, పదాలతో. ఇవి షిర్క్ వైపునకు తీసుకెళ్తాయి. 

ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు గనుక, ఖుర్ఆన్ మరియు హదీసులో వచ్చిన దుఆలు వ్రాయబడిన తాయత్తులు విడనాడడమే ఉత్తమం. ఈ పద్ధతి నిషిద్ధమున్న వాటి ఉపయోగమునకు దారి తీస్తుంది. అపరిశుద్ధ స్థలాల్లో పోక తప్పదు గనక, వాటిని వేసుకున్నవాడు దాని గౌరవ మర్యాదను పాటించలేడు. (ఇవి పాటించినవానికి సయితం అనుమతి లభించదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వలేదు).

మంత్రం విషయంలో ఉన్న వివరాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఖుర్ఆన్, హదీసు నుండి ఉంటే మంత్రించేవాని గురించి అభిలషనీయమే. ఎందుకనగా ఇది కూడా ఒక ఉపకారం, పుణ్యం క్రింద లెక్కించబడుతుంది గనుక యోగ్యం కూడా. కాని మంత్రం చేయించుకునే వ్యక్తి స్వయంగా అడగక ఉండడమే మంచిది. మంత్రించడమైనా లేక ఇంకేదైనా అడగక ఉండడం మానవుని సంపూర్ణ నమ్మకం, బలమైన విశ్వాసం యొక్క నిదర్శన. అడగడంలో అతనికి లాభం మరియు అది యోగ్యం అయినప్పటికీ అడగక పోవడం మంచిది అనబడుతుంది. ఇందులోనే వాస్తవ తౌహీద్ యొక్క రహస్యం ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆచరించేవారు చాలా అరుదు. మంత్రంలో అల్లాహ్ యేతరులతో స్వస్థత కోరి, వారితో దుఆ చేయబడుతే అది పెద్ద షిర్క్. ఎందుకంటే: దుఆ, మొర అల్లాయేతరులతో చేయరాదు గనక. ఈ వివరాలన్ని జాగ్రత్తగా తెలుసుకో! అందులో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను గమనించకుండా అన్నిటి గురించి ఒకే రకమైన తీర్పు చేయకు. జాగ్రత్తగా ఉండు! 

9 వ అధ్యాయం: చెట్లు , రాళ్ళతో శుభం (తబర్రుక్‌ ) కోరుట

أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ وَمَنَاةَ الثَّالِثَةَ الْأُخْرَىٰ

అల్లాహ్ ఆదేశం: “ఈ లాత్‌, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికతను గురించి కాస్తయినా ఆలోచించారా?” (సూరా నజ్మ్ 53:19,20).

అబూ వాఖిద్‌ లైసీ (రది అల్లాహు అన్హు) కథనం: మేము  ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) తో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం  స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు శుభం (తబర్రుక్‌) కలగాలని కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్‌”” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్‌ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము.

అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: “అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్‌ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయినవారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు”అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు.

(తిర్మిజీ ). సహీ అని నిరూపించబడిన హదీసు.

ముఖ్యాంశాలు 

1. సూరె నజ్మ్ లోని ఆయత్‌ యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (అదే మనగా: ఆ దేవతలు వారికి లాభనష్టాలు చేకూర్చేవి అని ముష్రికులు భావించేవారు. అందుకే వారితో మొరపెట్టుకునేవారు. అక్కడ జంతువులను బలిచ్చేవారు. వారి సాన్నిధ్యం కోరేవారు).

2. సహాబాలు (సహచరులు) “జాతు అన్వాత్‌ ” నిర్ణయించండని ప్రవక్తను కోరింది, అచ్చట “తబర్రుక్‌’ (శుభం) పొందాలనే ఉద్దేశంతోనే. వాటిని దేవతలుగా చేసుకుందామనికాదు.

3. సహాబాలు (సహచరులు) కేవలం తమ కోరికను వెల్లడించారు  తప్ప, దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు.

4. కోరిక ఉద్దేశం కూడా అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికే ఉండేది. ఎందుకనగా: అల్లాహ్ దానిని  ప్రేమిస్తాడని వారనుకున్నారు.

5. ఇది షిర్క్‌కు సంబంధించినదని సహాబాలకు తెలియనప్పుడు ఇతరులకు తెలియకపోవడం సంభవం. (కాని తెలిసిన వెంటనే విడనాడడం కూడా తప్పనిసరి).

6. ప్రవక్త సహాబాలు (సహచరులు), తమ సత్కార్యాలకు బదులుగా పొందిన వాగ్దానం, క్షమాపణ శుభవార్త లాంటివి అంత సులభంగా ఇతరులు పొందలేరు.

7. వారికి తెలియదు కదా అని ప్రవక్త ఊరుకోలేదు. “అల్లాహు అక్బర్! ఇవే మార్గాలు. మీకంటే ముందు గతించిన వారి మార్గాలను మీరు అనుసరిస్తారు” అని మూడు సార్లు హెచ్చరించి, అలాంటి కోరికలు చెడు అని  స్పష్టం చేసారు.

8. మరో ముఖ్య విషయం ప్రవక్త తమ సహచరులతో ఇలా అనడం: మీ ప్రశ్న, కోరిక బనీ ఇస్రాయీల్‌, మూసాతో ప్రశ్నించి, కోరినటువంటిదే. వారు: “వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసిపెట్టు” అని కోరారు.

9. ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారిని నివారించడం “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావంలోనే వస్తుంది. ఇది చాలా సూక్ష్మమైనది. అందుకే సహచరులు కూడా అది “లాఇలాహ ఇల్లల్లాహ్” భావానికి విరుద్ధమైనదని ముందు గమనించలేక పోయారు.

10. ఇచ్చట కూడా ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం), అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పారు. (మాటి మాటికి ప్రమాణం చేయటం ఆయన అలవాటు కాదు. కాని విషయం చాలా గంభీరమైనది గనుక ప్రమాణం చేసి చెప్పారు).

11. తమ కోరికను వెల్లడించినందుకు వారు మతభ్రష్టులు కాలేదు. దీనీతో తెలిసిందేమిటంటే షిర్క్‌ చిన్నదీ  (కనబడనిది) ఉంటుంది, పెద్దదీ (కనబడునది) ఉంటుంది.

12 “మేము కొత్తగా ఇస్లాం స్వీకరించియుంటిమి” అన్న వారి మాటతో ఇతర సహచరులు దినిని షిర్క్‌గా  భావించేవారు అని తెలుస్తుంది.

13. ఆశ్చర్యం కలిగినప్పుడు “అల్లాహు అక్బర్‌” అనవచ్చు అని తెలిసింది. ఇలా అనకూడదు అని అనేవారి మాట ప్రవక్త మాటకు విరుద్ధం అని స్పష్టమయింది.

14. (షిర్క్‌ మరియు బిద్‌ అత్‌ )కు చేర్పించే  సాధనాలన్నిటినీ  రద్దు చేయాలని తెలిసింది.

15. జాహిలియ్యత్‌ (అజ్ఞానకాలం) నాటి పోలికను అవలంబించుట నుండి నివారించబడింది.

16. విద్య నేర్పుతున్నప్పుడు అవసర సందర్భంగా ఆగ్రహించవచ్చును.

17. “ఇవే సాంప్రదాయాలు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) ఒక నియమం తెలిపారు.

18. ప్రవక్త మహత్యాల్లో ఒకటి ఆయన భవిష్యసూచన ఇచ్చినట్టు సంభవించింది.

19. ఖుర్‌ఆన్‌లో యూదుల, క్రైస్తవుల ఏ విషయాల్ని చెడుగా ప్రస్తావించి వారిన హెచ్చరించబడిందో, అలాంటి పనుల నుండి మనము దూరముండాంలని మనకు కూడా హెచ్చరిక ఉంది.

20. పండితుల వద్ద ఉన్న ఒక నియమం వాస్తవమైనది. అది: ఆరాధనల (ఇబాదత్‌ల) పునాది ఆజ్ఞ (హుకుం) పై ఉంది. (మన ఇష్టానుసారం ఇబాదత్‌ చేయరాదు).

21. గ్రంథమవ్వబడిన వారి సాంప్రదాయాలు, అలవాట్లు ఎలా చెడ్డవో ముష్రికులవి కూడా అలాగే చెడ్డవి.

22. ఎవరైతే అధర్మం నుండి ధర్మంలో అడుగుపెడుతాలో వారిలో కొన్ని పాత అలవాట్లు ఉంటాయి అని తెలిసింది. అబూ వాఖిద్‌ లైసీ (రది అల్లాహు అన్హు) అదే చెప్పింది. “మేము కొత్తగా ఇస్తాం స్వీకరించియుంటిమి”.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

‘చెట్లతో, రాళ్ళతో శుభం కోరుట ముష్రిక్కుల పని. ‘చెట్లతో, రాళ్ళతో, సమాధులతో ఇంకేదానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది “గులువ్వు” (అతిశయోక్తి). ఎవరితో, ఏ దానితో తబర్రుక్‌ కోరబడుతుంటో, వారి ఆరాధన, వారితో దుఆ (ప్రార్ధన) చేయడం లాంటి పనులకు ఇది గురి చేస్తుంది. అల్లాహ్ యేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్‌ అక్బర్ (పెద్ద షిర్క్) అన్న విషయం తెలిసిందే. చివరికి ముఖామె ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్‌ మఖ్డిస్, అక్కడ ఉన్న “సఖ్ర్” మొదలగు వాటితో తబర్రుక్‌ కోరుట కూడా తప్పు.

కాబతుల్లా లోని హజర్  అస్వద్‌ (నల్ల రాయి)ను ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నె యమానిని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహ్ కు విధేయత చూపుట. ఆయన ఔన్నత్యాల ముందు వినయ వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్‌ యొక్క సారాంశము. దీనికున్న ఆదేశం ఇతర వాటికి లేదు.

10వ అధ్యాయం: అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం)

అల్లాహ్ ఆదేశం:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

ఇలా అను: “నా నమాజ్, నా ఖుర్బాని (జంతుబలి), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు.” (అన్ ఆమ్ 6: 162,163).

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ

“నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు.” (కౌసర్ 108: 2).

అలీ (రజియల్లాహు అన్హు)  కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నాలుగు మాటలు నేర్పారు:

 • (1) అల్లాహ్ తప్ప ఇతరులకు జిబహ్ చేసిన వానిని అల్లాహ్ శపించాడు.
 • (2) తన తల్లిదండ్రుల్ని శపించిన, దూషించిన వానిని అల్లాహ్ శపించాడు.
 • (3) “ముహాదిన్ ” (బిద్ అతి, దురాచారం చేయు వాని)ని అల్లాహ్ శపించాడు.
 • (4) భూమిలో తమ స్థలాల (ఆస్తుల) గుర్తుల్ని మార్చిన వానిని అల్లాహ్ శపించాడు.

(ముస్లిం).

తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. మరొక వ్యక్తి నరకంలో చేరాడు“.

అది ఎలా? అని సహచరులు అడుగగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

ఇద్దరు మనుషులు ఒక గ్రామం నుండి వెళ్తుండగా, అక్కడ ఆ గ్రామవాసుల ఒక విగ్రహం ఉండింది. అక్కడి నుండి దాటిన ప్రతి ఒక్కడు ఆ విగ్రహానికి ఏ కొంచమైనా బలి ఇవ్వనిదే దాటలేడు. (ఆ విగ్రహారాధకులు) ఒకనితో అన్నారు: ఏదైనా బలి ఇవ్వు. “నా వద్ద ఏమి లేదు” అని అతడన్నాడు. “దాటలేవు. కనీసం ఒక ఈగనైనా బలి ఇవ్వు”. అతడు ఒక ఈగను ఆ విగ్రహం పేరు మీద బలిచ్చాడు. వారు అతన్ని దాటనిచ్చారు. కాని అతడు నరకంలో చేరాడు. “నీవు కూడా ఏదైనా బలి ఇవ్వు” అని మరో వ్వక్తితో అన్నారు. “నేను అల్లాహ్ తప్ప ఇతరులకు ఏ కొంచెమూ బలి ఇవ్వను” అని అతడన్నాడు. వారు అతన్ని నరికేశారు. అతడు స్వర్గంలో ప్రవేశించాడు.”

(అహ్మద్).

ముఖ్యాంశాలు:

 1. మొదటి ఆయతు యొక్క వ్యాఖ్యానం.
 2. రెండవ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
 3. శాపం ఆరంభం అల్లాయేతరులకు జిబహ్ చేసినవారితో అయింది.
 4. తల్లిదండ్రుల్ని దూషించిన, శపించినవానినీ శపించడమైనది. నీవు, ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించావంటే అది నీవు స్వయంగా నీ తల్లిదండ్రుల్ని దూషించినట్లే.
 5. “ముహాదిన్”ని శపించడమైనది. ఏ పాపంపై శిక్ష ఇహంలోనే అల్లాహ్ విధించాడో, ఒక వ్యక్తి ఆ పాపం చేసి ఆ శిక్ష నుండి తప్పించుకోడానికి ఇతరుల శరణు కోరుతాడు. అతన్ని కూడా “ముహాదిన్ ” అనబడుతుంది.
 6. భూమి గుర్తులను మార్చిన వానిని కూడా శపించబడినది. నీ భూమి, నీ పక్కవాని భూమి మధ్యలో ఉండే గుర్తుల్ని వెనుక, ముందు చేసి మార్చేయడం అని భావం.
 7. ఒక వ్యక్తిని ప్రత్యేకించి శపించడంలో, పాపాన్ని ప్రస్తావించి అది చేసిన వారిని శపించడంలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి.
 8. ఈగ కారణంగా ఒకతను నరకంలో మరొకతను స్వర్గంలో చేరిన హదీసు చాలా ముఖ్యమైనది.
 9. అతడు తన ప్రాణం కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఈగను బలి ఇచ్చాడు. కాని నరకంలో చేరాడు.
 10. విశ్వాసుల వద్ద షిర్క్ ఎంత ఘోర పాపమో గమనించవచ్చు. తన ప్రాణాన్ని కోల్పోవడం సహించాడు. కాని షిర్క్ చేయడానికి ఒప్పుకోలేదు.
 11. నరకంలో చేరినవాడు విశ్వాసుడే. అతను మొదటి నుండే అవిశ్వాసి అయితే ఈగ కారణంగా నరకంలో చేరాడు అని అనబడదు.
 12. ఈ హదీసు మరో హదీసును బలపరుస్తుంది. అది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ప్రవచనం: “స్వర్గం మీ చెప్పు యొక్క పట్టీ  (గూడ) కంటే చేరువుగా ఉంది, నరకం కూడా అలాగే“. (బుఖారి).
 13. ముస్లింలు, ముస్లిమేతరులు అందరి వద్ద మనఃపూర్వకంగా ఉన్న ఆచరణ చాలా ప్రాముఖ్యత గలది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

జిబహ్ కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. పూర్తి చిత్తశుద్ధితో చేయాలి. నమాజు గురించి చెప్పబడినట్లే దీని గురించి ఖుర్ఆన్ లో స్పష్టంగా చెప్పబడింది. ఎన్నో చోట్ల దాని ప్రస్తావన నమాజుతో కలసి వచ్చింది. ఇక ఇది అల్లాహ్ యేతరుల కొరకు చేయుట షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్).

షిర్క్ అక్బర్ దేనినంటారో గుర్తుంచుకోండి: “ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా అల్లాయేతరుల కొరకు చేయుట“. అయితే ఏ విశ్వాసం, మాట, కార్యాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్పిందో అది అల్లాహ్ కు చేస్తే అది తౌహీద్, ఇబాదత్, ఇఖ్లాసు. ఇతరల కొరకు చేస్తే షిర్క్, కుఫ్ర్ . ఈ షిర్క్ అక్బర్ యొక్క నియమాన్ని మీ మదిలో నాటుకొండి.

అదే విధంగా షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్) అంటేమిటో తెలుసుకోండి. “షిర్క్ అక్బర్ వరకు చేర్పించే ప్రతీ సంకల్పం, మాట, పని. అది స్వయం ఇబాదత్ కాకూడదు“. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్ యొక్క ఈ రెండు నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే, దీనికి ముందు, తరువాత అధ్యాయాలన్నింటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా సందేహమనిపించే విషయాల్లో ఇది మీకు స్పష్టమైన గీటురాయిగా ఉంటుంది.

11వ అధ్యాయం: అల్లాహ్  తప్ప ఇతరుల కొరకు జిబహా చేసే చోట, అల్లాహ్ కొరకు జిబహా చేయరాదు

అల్లాహ్ ఆదేశం: 

لَا تَقُمْ فِيهِ أَبَدًۭا
నీవు ఎన్నడూ అందులో నిలబడకు“. (9: తౌబా: 108). 

సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు కథనం: బువాన అనే స్థలంలో ఒక వ్యక్తి ఒంటె జిబహా చేయాలని మ్రొక్కుకున్నాడు. దాన్ని గురించి ప్రవక్త ﷺ తో ప్రశ్నించగా, “అక్కడ జాహిలియ్యత్ కాలంలోని విగ్రహాల్లో ఏదైనా విగ్రహం ఉందా? దాని పూజ జరుగుతూ ఉందా?” అని ఆయన అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. “వారి పండుగలో (ఉర్సు, జాతరలలో) ఏదైనా పండుగ (ఉర్సు,జాతర) అక్కడ జరుగుతుందా?” అని అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు: “నీ మ్రొక్కుబడిని పూర్తి చేయు. అల్లాహ్ అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడిని పూర్తి చేయరాదు. మానవుడు తన శక్తికి మించిన దాన్ని మ్రొక్కుకుంటే అది కూడా పూర్తి చేయరాదు”. (అబూ దావూద్). 

ముఖ్యాంశాలు

1. ఇందులోని ఆయతు యొక్క వ్యాఖ్యానం. 

2. అల్లాహ్ విధేయత, అవిధేయత కొన్ని సందర్భాల్లో భూమి పై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. (అందుకే షిర్క్ జరిగే చోట జిబహ్ చేయవద్దు అని చెప్పబడింది). 

3. కఠిన సమస్యను నచ్చజెప్పెటప్పుడు సులభరీతిలో ఏలాంటి చిక్కు లేకుండా స్పష్టపడునట్లు చెప్పాలి. 

4. అవసర సందర్భంలో “ఫత్వా” ఇచ్చువారు వివరాన్ని కోరవచ్చు. 

5. ఎలాంటి ధార్మిక అడ్డు, ఆటంకం లేనప్పుడు ప్రత్యేక చోటును మ్రొక్కుబడి కొరకు నిర్ణయించవచ్చును. 

6. జాహిలియ్యత్ (మూఢవిశ్వాస) కాలంలో విగ్రహం ఉన్నచోట, దాన్ని తర్వాత తొలగించినప్పటికీ అచ్చట జిబహ్ చేయరాదు. 

7. వారి పండుగ (ఉర్సు, జాత్ర) జరుగుతున్న స్థలం, అది ఇప్పుడు జరగనప్పటికీ అక్కడ కూడా జిబహ్ చేయరాదు. 

8. ఇలాంటి స్థలాల్లో జిబహ్ చేయుటకు మ్రొక్కుకుంటే దానిని పూర్తి చే యకూడదు. అది పాపపు మ్రొక్కు అగును. 

9. ఉద్దేశపూర్వకంగా కానప్పటికీ ముస్లింలు ముష్రికుల పండుగ (ఉర్సు, జాత్ర)ల పోలికల నుండి జాగ్రత్తగా వహించాలి. 

10. అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడి చేయరాదు. 

11. మనిషి తన శక్తికి మించిన దాని మ్రొక్కు చేయకూడదు. 

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

దీనికి ముందు అధ్యాయం తరువాత, వెంటనే ఈ అధ్యాయాన్ని ప్రస్తావించడంలో ఉత్తమమైన ఔచిత్యం ఉంది. మొదటిది షిర్క్ అక్బర్ అయితే, ఇది దానికి వసీల (మార్గం, సాధనం). ఏ చోటనైతే అవిశ్వాసులు, ముష్రికులు తమ దేవతల (వలీల) సాన్నిధ్యం పొందుటకు అల్లాతో షిర్క్ చేస్తూ వారి కొరకు జిబహ్ చేస్తారో అవి షిర్క్ యొక్క చిహ్నాలు, గుర్తులు అయ్యాయి. అక్కడ ఎవరైనా ముస్లిం జిబహ్ చేస్తే, అతని ఉద్దేశం అల్లాహ్ కొరకే ఉన్నప్పటికీ అది బాహ్యంగా వారి విధంగనే ఏర్పడుతుంది. (అంటే చూసేవాళ్ళకు అల్లాహ్ యేతరలకు చేస్తున్నట్లే ఏర్పడుతుంది). ఇలా బాహ్య రూపంలో వారికి పోలిన పనులు చేస్తే, చివరికి ఆంతర్యం కూడా ఒకటి అయి పోయే భయం ఉంటుంది. (ఈ రోజుల్లో అయిపోయినట్లే కనబడుతుంది). 

అందుకే ఇస్లాం వారి (అవిశ్వాసులు, ముష్రికులు) పోలికల నుండి దూరముండాలని హెచ్చరించింది. అది వారి పండుగలు, వారి లాంటి కార్యాలు, వారి లాంటి దుస్తులు ఇంకా వారికి ప్రత్యేకించిన ప్రతీ దానితో ముస్లిం దూరముండాలి. వాస్తవానికి ఇది వారిలో కలసిపోవుటకు ఒక సాధనంగా మారుతుంది. ముష్రికులు అల్లాహ్ యేతరులకు సజ్దా చేసే సమయంలో, ముస్లింలు నఫిల్ నమాజు చేయుట నివారించబడింది. ఈ నివారణ వచ్చింది వారి పోలిక నుండి దూరముంచుటకే. 

12వ అధ్యాయం: అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కు కొనుట షిర్క్

అల్లాహ్ ఆదేశం:

يُوفُونَ بِٱلنَّذْرِ
వారు మొక్కుబడి చెల్లించేవారు” (76: దహ్ర్ : 7). 

మరోచోట:

وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍۢ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ
మీరేమి ఖర్చుపెట్టినదీ, మీరు మొక్కుబడి చేసుకున్నదీ, అంతా అల్లాహ్ కు తెలుసు“. (2: బఖర: 270). 

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “అల్లాహ్ కు విధేయత చూపాలని మొక్కుబడి చేసిన వ్యక్తి విధేయత చూపాలి. కాని ఎవరు అల్లాహ్ కు అవిధేయత చూపాలని మొక్కుబడి చేస్తాడో అతడు అవిధేయత చూపకూడదు”. (బుఖారి). 

ముఖ్యాంశాలు: 

1. మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయాలి. 
2. మొక్కుబడి ఇబాదత్ (ఆరాధన) అని తెలిసింది, దాన్ని ఇతరుల కొరకు చేయుట షిర్క్.
3. పాపకార్యానికి, అవిధేయతకు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయకూడదు. 

13వ అధ్యాయం: అల్లాహ్ తప్ప ఇతరులతో శరణు కోరుట షిర్క్

అల్లాహ్ ఆదేశం: 

وَأَنَّهُۥ كَانَ رِجَالٌۭ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍۢ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًۭا
మానవులలో కొందరు జిన్నాతులలో కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు“. (72: జిన్న్: 6). 

ఖవ్ లా బిన్తె హకీం కథనం: ప్రవక్త ﷺ ఇలా ఆదేశించగా నేను విన్నాను:

ఎవరైనా ఒక స్థలంలో చేరిన తరువాత “అఊజు బికలిమా తిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ” చదివినచో వారికి ఆ స్థలం నుండి వెళ్ళే వరకు ఏ హాని కలగదు“. (ముస్లిం). 

ముఖ్యాంశాలు: 

 • 1. కొందరు మనుషులు జిన్నాతుల శరణు కోరేవారు అని సూరె జిన్న్ వాక్యంలో తెలిసింది. 
 • 2. అది షిర్క్ అని తెలిసింది. 
 • 3. పైన పేర్కొనబడిన హదీసుతో కూడా అల్లాహ్ తో మాత్రమే శరణు వేడాలని తెలిసింది. అల్లాహ్ వాక్కు (కలిమ), ఆయన గుణమని, సృష్టిరాశి కాదు అని తెలిసింది. ఒక వేళ సృష్టి అయి ఉంటే ప్రవక్త వాటిద్వారా శరణు కోరేవారు కాదు. ఎందుకనగా సృష్టితో శరణు కోరుట షిర్క్. 
 • 4. పైన తెలుపబడిన దుఆ చిన్నది అయినప్పటికి దాని ఘనత, లాభం చాలా వుంది. 

ఓ సందర్భంలో ఒక క్రియ, పని ద్వారా ఏదైనా ప్రాపంచిక లాభం కలిగితే, లేక కష్టం, నష్టం దూరమైతే అది షిర్క్ కాదు అనటానికి అది ప్రమాణం కాదు. (దేనితో లాభం కలిగిందో అదే స్వయం షిర్క్ కావచ్చు. అందుకు ఏది షిర్కో, ఏది షిర్క్ కాదో అనేది ఖుర్ఆన్, హదీసుల ద్వారా తెలుసుకోవాలి). 

14వ అధ్యాయం: అల్లాహ్ యేతరులతో “దుఆ” చేయుట, లేక సహాయం కొరకు “మొర” పెట్టుకొనుట షిర్క్

అల్లాహ్ ఆదేశం:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ

అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్నిగాని లాభాన్నిగాని కలిగించ లేని ఏ శక్తిని వేడుకోకు. ఒక వేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు“. (యూనుస్ 10 : 106,107).

 إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ

అల్లాహ్ ను కాదని మీరు ఆరాధిస్తున్నవి మీకు ఏ ఉపాధినీ ఇచ్చే అధికారం కలిగి లేవు, ఉపాధి కొరకు అల్లాహ్ ను అడగండి!” (అన్ కబూత్ 29 : 17).

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమ మార్గభ్రష్టుడైన వాడు ఎవడు? మానవులందరిని సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అహ్ ఖాఫ్ 46: 5,6).

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ

బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు?.” (నమ్ల్  27: 62).

తబ్రానీలో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ఒక కపటవిశ్వాసి విశ్వాసులకు చాలా బాధకలిగించేవాడు. ఒకసారి సహచరులు “పదండి! మనం ప్రవక్తతో ఈ కపటవిశ్వాసి గురించి మొరపెట్టుకుందాము” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  చెప్పారు: “నాతో కాదు మొర పెట్టుకోవలసింది. అల్లాహ్ తో మొరపెట్టుకోవాలి“.

ముఖ్యాంశములు:

1. “దుఆ” (ప్రార్థన) సర్వ సామాన్యమైనది. కాని “ఇస్తిగాస” (మొర) ప్రత్యేకించబడినది.

2. సూరె యూనుస్ లోని ఆయత్ (అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించలేని ……….) యొక్క భావం తెలిసింది.

3. అదే షిర్క్ అక్బర్ .

4. పుణ్యపురుషుడు, మహాభక్తుడు అల్లాహ్ యేతరులతో వారి సంతృప్తి కొరకు మొరపెట్టుకుంటే అతడు కూడా దుర్మార్గులలో కలసిపోతాడు.

5. సూరె యూనుస్ లోని రెండవ ఆయతు (అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే …..) యొక్క భావం తెలిసింది.

6. అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకుంటే వారు ఏ లాభమూ చేకూర్చలేరు. అది అవిశ్వాసం కూడాను.

7. అన్ కబూత్ లోని ఆయతు (అల్లాహ్ ను కాదని మీరు పూజిస్తున్నవి…….) యొక్క భావం కూడా తెలిసింది.

8. స్వర్గం అల్లాహ్ తో కోరినట్లు, ఉపాధి కూడా అల్లాహ్ తో మాత్రమే కోరాలి.

9. అహ్ ఖాఫ్ లోని ఆయతు (అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి……..) యొక్క భావం తెలిసింది.

10. అల్లాహ్ ను వదలి ఇతరులతో దుఆ చేసిన వానికంటే ఎక్కువ దుర్మార్గుడు, భ్రష్టుడు మరొకడు లేడు.

11. ఎవరితోనైతే మొరపెట్టుకొనడం జరుగుతుందో వారు మొరపెట్టుకునే వారిని ఎరుగరు.

12. ఇహలోకంలో మొరపెట్టుకోవటం, పరలోకంలో వారి పరస్పర ద్వేషానికి, శతృత్వానికి కారణమగును.

13. అల్లాహ్ ను వదలి ఇతరులను మొరపెట్టుకొనుట వారి ఆరాధన చేసినట్లు అగును.

14. మొరపెట్టుకోబడినవాడు ఈ మొరను తిరస్కరిస్తాడు.

15. ఇదే పరమ మార్గభ్రష్టత్వానికి కారణం.

16. అహ్  ఖాఫ్ వాక్యం (బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు……….) యొక్క భావం తెలిసింది.

17. చాలా ఆశ్చర్యకరమైన విషయం: కష్ట కాలాలలో అల్లాహ్ తప్ప ఎవరూ వినరని విగ్రహరాధకులు సయితం ఒప్పుకుంటారు. అందుకే ఆ సమయాల్లో అల్లాహ్ తోనే చిత్త శుద్ధితో మొరపెట్టుకుంటారు. (కాని ఈనాటి సమాధి పూజారులైన ముస్లింల విషయం బాధకరమైనది. అల్లాహ్ వారికి తౌహీద్ మార్గం చూపుగాక!).

18. పై హదీసు ద్వారా తెలిసిందేమిటంటే; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తౌహీద్ ను అన్ని రకాల షిర్క్ నుండి దూరముంచడానికి చాలా ప్రయత్నం చేశారు. అల్లాహ్ తో ఏలాంటి మర్యాద పాటించాలో నేర్పారు.

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :

పదవ అధ్యాయం లోని తాత్పర్యంలో తెలుపబడిన షిర్క్ అక్బర్ యొక్క పరిచయాన్ని నీవు అర్థం చేసుకొనియుంటే 12, 13, 14వ అధ్యాయాలు కూడా అర్థం చేసుకోగలవు.

మొక్కుబడి ఒక ఆరాధన. దాన్ని పూర్తి చేసిన వారిని అల్లాహ్ ప్రశంసించాడు. అల్లాహ్ విధేయత కొరకు మొక్కుకున్న మొక్కు బడి పూర్తి చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు.

ఏ పని గురించి ధర్మం ఆదేశించిందో, లేక అది చేసినవారిని ప్రశంసించిందో అది ఇబాదత్. మరొకసారి ఇబాదత్ (ఆరాధన) పరిచయాన్ని (భావాన్ని) గుర్తుంచుకొండి: “అల్లాహ్, ఇష్టపడే, తృప్తి చెందే ప్రతీ బాహ్య, ఆంతర్య మాటలు, చేష్టలు“.

అన్ని రకాల కీడు నుండి అల్లాహ్ శరణు మాత్రం కోరాలని అల్లాహ్ ఆదేశించాడు. ఇది ఇబాదత్. అల్లాహ్ తో శరణు కోరితే దాన్ని తౌహీద్ , విశ్వాసం అంటారు. ఇతరులతో కోరితే షిర్క్ అంటారు.

దుఆ మరియు మొరపెట్టుకొనుటలో వ్యత్యాసం ఏమనగా: దుఆ అన్ని పరిస్థితులకు ఉపయోగపడుతుంది. కష్టకాలాల్లో మొరపెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నియు పూర్తి చిత్తశుద్ధితో అల్లాహ్ తోనే చేయాలి. ఆయనే దుఆలు వినేవాడు. అంగీకరించేవాడు. కష్టాలను తొలగించువాడు. శక్తి లేని దాని గురించి దైవదూత, వలీలతో మొరపెట్టుకునేవాడు ముష్రిక్, కాఫిర్ అవుతాడు. ధర్మభ్రష్టుడవుతాడు. సృష్టిలో ఎవరి వద్ద కూడా స్వయంగా తనకు, లేక ఇతరులకు లాభనష్టాలు చేకూర్చే ఏ శక్తి లేదు. అందరూ అన్ని విషయాల్లో అల్లాహ్ ఎదుట బీదవాళ్ళే.

15వ అధ్యాయం: ఏ వస్తువునూ సృష్టించలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?

అల్లాహ్ ఆదేశం:

أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ

“ఏ వస్తువునూ సృష్టించలేనివారిని, స్వయంగా తామే సృష్టింపబడ్డవారిని, ఎవరికీ సహాయం చేయలేనివారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (ఆరాఫ్ 7: 191, 192).

అల్లాహ్ ఆదేశం:

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِي

అల్లాహ్ ను కాదని మీరు పిలిచే ఇతరులకు కనీసం ఖర్జూరం విత్తనం పై ఉండు పొర అంత అధికారం కూడా లేదు.” (ఫాతిర్ 35: 13).

అనస్ (రజియల్లాహు అన్హు) కథనం: ఉహద్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాయపడ్డారు. అందులో ఆయన నాలుగు పళ్ళు విరిగాయి. అప్పుడు ఆయన అన్నారు: “తమ ప్రవక్తను గాయపరచిన జాతి సాఫల్యం ఎలా పొందగలదు?” అప్పుడే ఈ వాక్యం అవతరించింది. “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు“. (ఆలె ఇమ్రాన్ 3:128).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజ్ర్ నమాజులో, రెండవ రకాతులోని రుకూ నుండి తలెత్తి, “సమిఅల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హందు” అన్న తరువాత “ఓ అల్లాహ్ ఫలాన, ఫలానను శపించు” అని అన్నది విన్నారు. అప్పుడే ఈ ఆయతు అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు.” (ఆలె ఇమ్రాన్ 3:128). – (బుఖారి, నసాయీ).

మరో ఉల్లేఖనంలో ఉంది: సఫ్వాన్ బిన్ ఉమయ్యా, సుహైల్ బిన్ అమ్ర్, హారిస్ బిన్ హిషాంపై “బద్ దుఆ” చేస్తున్నప్పుడు (శపిస్తున్నప్పుడు) అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు.” (ఆలె ఇమ్రాన్ 3: 128). – (బుఖారి).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “నీ దగ్గరి బంధువులను భయపెట్టు.” (షుఅరా 26: 214). అన్న ఆయతు అవతరించిన తరువాత “ఓ ఖురైషులారా!” అని లేక ఇలాంటిదే ఒక పదముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరిని సమావేశపరచి ఇలా చెప్పారు: “మీ ప్రాణాలను మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి. అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ఓ అబ్బాసు బిన్ అబ్దుల్ ముత్తలిబ్! అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ప్రవక్త మేనత్త సఫియ్యా! నేను నీకు అల్లాహ్ వద్ద ఏ మాత్రం సహాయం చేయలేను. ముహమ్మద్ కుమార్తె ఫాతిమా! నీవు కోరినంత నా సొమ్ము అడుగు ఇచ్చేస్తా, కాని అల్లాహ్ వద్ద నేను నీకు ఏ మాత్రం సహాయం చేయలేను“. (బుఖారి).

ముఖ్యాంశాలు:

1. పై రెండు ఆయతుల భావం.

2. ఉహద్ యుద్ధం యొక్క సంఘటన.

3. సకల ప్రవక్తల నాయకులైన ముహమ్మద్  (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఖునూత్ “లో దుఆ చేస్తు అంటున్నారు. (అలాంటి మహాపురుషులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొరపెట్టుకుంటే, సామాన్యులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొర పెట్టుకొనుట ఎక్కువ అవసరం).

4. ఎవరిని శపించబడినదో వారు అప్పుడు అవిశ్వాసులుగా ఉండిరి.

5. వీరు ఇతర అవిశ్వాసులు చేయని ఘోరకార్యాలు వారు చేశారు. ఉదా: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గాయపరిచారు. ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. అమర వీరులైన (హత్యచేయబడిన విశ్వాసుల) అవయవాలను సయితం కోశారు. వీరు (విశ్వాసులు) వారి (అవిశ్వాసుల) తండ్రి సంబంధిత దగ్గరి బంధువులే.

6. ఇంత జరిగినందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని శపించినప్పుడు పై వాక్యం “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు”  ను అల్లాహ్ అవతరింపజేసాడు.

7. “వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది“(ఆలె ఇమ్రాన్ 3:128). అన్న అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ వారిని క్షమించాడు. వారు ఇస్లాం స్వీకరించారు. .

8. ముస్లింపై కష్టకాలం దాపురించినప్పుడు “ఖునూత్ నాజిల” చేయవలెను.

9. ఎవరిని శపించబడుతుందో వారిని, వారి తండ్రుల పేరుతో కలిపి శపించ వచ్చును.

10. ఖునూత్ లో ప్రత్యేకించబడిన ఒక్కొక్క వ్యక్తిని పై ప్రవక్త శపించారు.

11. (షుఆరా:214) ఆయత్ అల్లాహ్ అవతరించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అందరిని సమూహపరచి తౌహీద్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసింది.

12. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తౌహీద్ ప్రచారం చేయునప్పుడు, “పిచ్చివాడు” అని అవిశ్వాసుల ద్వారా పిలువబడ్డారు. ఈ రోజుల్లో ఎవరైనా ముస్లిం అదే పని చేస్తుంటే వారి తో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.

13. దగ్గరి, దూరపు బంధువులందరికి “నేను మీకు సహాయము చేయలేను” అని స్పష్టం చేశారు. స్వయం తమ కుమార్తె అయిన ఫాతిమాకు కూడా “ఓ ఫాతిమా! నేను నీకు సహాయము చేయలేను ” అని చెప్పారు. ఆయన ప్రవక్తల నాయకులై, స్త్రీల నాయకురాలైన ఫాతిమ (రజియల్లాహు అన్హా)కు ఏ మాత్రం పనికి రాను అని తెలిపారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం తప్ప మరేది పలకరు అని అందరి విశ్వాసం. అయినా ఈ రోజుల్లో ఈ రోగం సామాన్య ప్రజలకే కాక విద్యావంతులు కూడా అర్థం చేసుకోలేకున్నారు. తౌహీద్ , ధర్మం వారి వద్ద ఎంత విచిత్రమైందో అగపడుతుంది.

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :

ఇక్కడి నుండి తౌహీద్ యొక్క నిదర్శనాలు ప్రారంభం అవుతున్నాయి. తౌహీద్ ను నిరూపించడానికి ఉన్నటువంటి గ్రాంధిక, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలు మరేదానికి లేవు.

తౌహీద్ రుబూబియత్, ఉలూహియత్ స్వయంగా ఇవి రెండు పెద్ద నిదర్శనాలు. సృష్టి, నిర్వహణలో అద్వితీయుడైన, అన్ని విధాలుగా సర్వశక్తుడైన వాడే ఆరాధనలకు అర్హుడు. అతడు తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాడు.

అదే విధంగా సృష్టిరాసుల గుణాలను పరిశీలిస్తే కూడా దాని నిదర్శనాలు కనబడుతున్నాయి. అల్లాహ్ యేతరులలో దైవదూత, మానవుడు, చెట్లు, గుట్టలు మొదలగు ఎవరెవరి పూజా చేయబడుతుందో వారందరూ/అవన్నియు అల్లాహ్  ఎదుట దీనులు, బలహీనులు, భిక్షకులు. లాభనష్టాలు చేకూర్చే రవ్వంత శక్తి కూడా లేనివారు. ఏ కొంచెమూ సృష్టించలేరు. వారే సృష్టింపబడ్డారు. లాభనష్టాలు, జీవన్మరణాలకు మరియు రెండవసారి పునరుత్తానానికి వారు అధికారులు కారు. అల్లాహ్ మాత్రమే సర్వ సృష్టికి సృష్టికర్త. పోషకుడు. నిర్వహకుడు. లాభనష్టాలు చేకూర్చే, కోరిన వారికి ప్రసాదించే, కోరనివారికి ప్రసాదించకుండా ఉండే అధికారం కలవాడు. సర్వశక్తి ఆయన చేతిలో ఉంది. ఇంతకు మించిన, మంచి నిదర్శనాలు ఇంకేం కావాలి. వీటి ప్రస్తావన అల్లాహు తఆలా, ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రస్తావించాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనేక సార్లు తెలిపారు. ఇది అల్లాహ్ ఒక్కడు, సత్యుడు, బహుదైవత్వం (షిర్క్) తుఛ్ఛం అనడానికి స్వాభావికమైన, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలతో పాటు, గ్రాంధిక, ఎల్లవేళల్లో కనవినబడుతున్న నిదర్శనాలు కూడానూ.

సృష్టిలో కెల్ల అతి ఉన్నతుడైన ఒక మానవుడు (ప్రవక్త) స్వయం తన దగ్గరి బంధువునికి ఏ లాభం అందించలేక పోయినప్పుడు ఇతరులకు ఏమివ్వగలడు? ఇంతా తెలిసికూడా అల్లాహ్ తో షిర్క్ చేసినా, సృష్టిలో ఏ ఒక్కరిని అల్లాహ్ కు సమానంగా నిలబెట్టినవాడు నాశనమవుగాకా, అతడు ధర్మం కోల్పోయిన తరువాత, బుద్ధి జ్ఞానం కూడా కోల్పోయాడు.

అల్లాహ్ ను ఆ తరువాత సృష్టిని తెలుసుకున్నవాడు, అతని ఈ తెలివితో కేవలం అల్లాహ్ నే ఆరాధించాలి, ధర్మమును ఆయనకే ప్రత్యేకించాలి, ఆయన్ను మాత్రమే ప్రశంసించాలి, తన నాలుక, హృదయం, శరీరాంగాలతో ఆయనకే కృతజ్ఞత తెలుపాలి. సృష్టి రాసులతో భయం, ఆశ లాంటివేమి ఉండకూడదు.

16 వ అధ్యాయం: చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగి పోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు

إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ

అల్లాహ్ ఆదేశం: (చివరకు దైవదూతల హృదయాల నుండి భయం తొలగిపోయినపుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని అంటారు). (సబా 34:23).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు:

“అల్లాహ్ ఆకాశంలో ఒక ఆదేశం జారి చేసినప్పుడు, ఆయన ఆజ్ఞకు (విధేయులై) దైవదూతలు తమ రెక్కలు కొడుతారు. దాని శబ్దం కొండరాతిపై గొలుసుతో కొట్టినట్లు ఉంటుంది. ఆయన ఆదేశం వారి వరకు చేరుతుంది. చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు, వారు “మీ ప్రభువు ఏమని పలికాడు?” అని అడుగుతారు. వారు, “సత్యం పలికాడు”, ఆయన మహెూన్నతుడు, మహిమాన్వితుడు అని చెబుతారు. ఈ మాటను దొంగలించడానికి షైతాన్ వింటూ ఉంటాడు. షైతానులు ఒకరిపై ఒకరు ఇలా ఉంటారు అని (ఈ హదీసు ఉల్లేఖించేవారిలో ఒకరు) సుఫ్యాన్ బిన్ ఉమయ్య నా తమ అరచేతిని వంచి వ్రేళ్ళ మధ్య వ్యత్యాసముంచి వివరించారు. ఆ షైతాన్ ఒక్క మాట విని, అతని క్రింద ఉన్న షైతాన్ కు ఇస్తాడు. ఇలా ప్రతి ఒకడు తన క్రిందివానికి ఇస్తూ చివరివాడు మాంత్రికునికి, లేక జ్యోతిష్యునికి ఇస్తాడు. ఒకప్పుడు ఆ మాట క్రిందికి చేరక ముందే (అల్లాహ్ ఆకాశంలో నియమించిన) అగ్ని జ్వాల అతడ్ని పట్టుకొని (కాల్చేస్తుంది). ఒకప్పుడు ఆ అగ్నిజ్వాల పట్టుకోక ముందే ఆ మాటను అతడు పంపేస్తాడు. ఆ ఒక్క మాటలో మాంత్రికుడు, లేక జ్యోతిష్యుడు వంద అబద్దాలు కలిపి (ప్రజలకు చెబుతాడు). అతడు చెప్పింది నిజమయేదుంటే, ప్రజలు అతను (మాంత్రికుడు, జ్యోతిష్యుడు) అలా, అలా చెప్పలేదా అని అనుకుంటారు. కాని అందులో నిజమయేది ఆ ఆకాశం నుండి విన్న ఒక్క మాటే”. (బుఖారి).

నవాసుబ్ను సమ్ ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“అల్లాహ్ ఒక విషయం వహీ (దివ్య సందేశం) పంపాలని కోరినప్పుడు వహీ ద్వారా మాట్లాడుతాడు. అప్పుడు అల్లాహ్ భయంతో ఆకాశాలు కంపించిపోతాయి. ఆకాశవాసులు ఇది విన్నప్పుడు సొమ్మసిల్లి, సజ్దాలో పడిపోతారు. మొట్ట మొదట వారిలో జిబ్రీల్ తలెత్తుతారు. అల్లాహ్ తాను కోరింది వహీ ద్వారా అతనితో మాట్లాడుతాడు. తరువాత జిబ్రీల్ దైవదూతల ముందు వెళ్తారు. ప్రతీ ఆకాశం నుండి వెళ్తున్నప్పుడు ఆ ఆకాశ దైవదూతలు మీ ప్రభువు ఏమన్నాడు? అని అడుగుతారు. “సత్యం పలికాడు. ఆయన మహెన్నతుడు, మహిమాన్వితుడు” అని అతడంటాడు. వారందరు జిబ్రీల్ అన్నట్లు అంటారు. తరువాత జిబ్రీల్ ఆ విషయాన్ని ఎక్కడ చేరవేయాలని అల్లాహ్ చెప్పాడో అక్కడికి చేరవేస్తారు”.

ముఖ్యాంశాలు:

1. ఖుర్ ఆన్ ఆయతు యొక్క భావం (అల్లాహ్ వహీ చేసినప్పుడు దైవ దూతల భయ కంపనాల వివరణ ఉంది).

2. ఇందులో షిర్క్ కు విరుద్ధంగా బలమైన ఋజువు ఉంది. ప్రత్యేకంగా పుణ్యపురుషుల పేరు మీద జరిగే షిర్క్. ఈ ఆయత్ ఆంతర్యాల నుండి షిర్క్ పునాదులను బద్దలు చేస్తుంది అని అనబడింది.

3. “సత్యం పలికాడు, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూ” అన్న ఆయతు భావం.

4. వారు ప్రశ్నించింది ఎందుకు అన్నది కూడా తెలుస్తుంది. (అల్లాహ్ భయంతో).

5. ఆ తరువాత జిబ్రీల్ “అల్లాహ్ ఇలా ఇలా చెప్పాడు” అని వారికి బదులిస్తారు.

6. “మొదటిసారిగా తల ఎత్తేవారు జిబ్రీల్ ” అన్న ప్రస్తావన వచ్చింది.

7. ఆకాశవాసులందరు అడిగినందుకు జిబ్రీల్ వారందరికి సమాధానమిస్తారు.

8. ఆకాశవాసులందరూ సొమ్మసిల్లిపోతారు.

9. ఆకాశాలు కంపించేది అల్లాహ్ యొక్క వచనములతో.

10. అల్లాహ్ ఆదేశమిచ్చిన చోటకి వహీ తీసుకెళ్ళేవారు జిబ్రీలె.

11. షైతానులు మాటలను దొంగతనం చేసే ప్రయత్నాలు చేసేవారు.

12. షైతానులు ఒకరిపై ఒకరు ఎక్కుతారు, ఆకాశంలోని మాట అందుకోవటానికి.

13. వారిని తరిమి కొట్టడానికి అగ్నిజ్వాల పంపబడుతుంది.

14. ఒక్కప్పుడు అగ్నిజ్వాల అతన్ని అందుకొని కాల్చేస్తుంది. ఒకప్పుడు అతడు తప్పించుకొని ఆ మాట మాంత్రికుని, లేక జ్యోతిష్యునికి అందిస్తాడు.

15. ఒక్కోసారి మాంత్రికుని, జ్యోతిష్యుని మాట నిజమవుతుంది.

16. మాంత్రికుడు, జ్యోతిష్యుడు ఆ ఒక్క మాటకు వంద అబద్దాలు కలుపుతాడు.

17. అతని అసత్య మాటల్ని ప్రజలు నిజమనుకునేది ఆ ఒక్క ఆకాశ మాట నిజమయినందుకే.

18. అసత్యాన్ని, మిథ్యాన్ని మనుస్సు ఎంత తొందరగా ఒప్పుకుంటుందో చూడండి. ఒక్క మాటను చూస్తారు, కాని వంద అబద్దాలున్నాయని గమనించరు.

19. షైతానులు పరస్పరం ఆమాటను అందుకొని జ్ఞాపకముంచుకుంటారు. ఇతర మాటల్ని నిజమని భావింపజేసే ప్రయత్నం చేస్తారు.

20. ఇందులో అల్లాహ్ గుణవిశేషణాలు రుజువవుతున్నాయి. “అష అరియ్య, ముఅత్తిల” వర్గంవారు వాటిని తిరస్కరిస్తారు. (వాస్తవానికి తిరస్కరించ కూడదు).

21. కంపించుట, సొమ్మసిల్లుట అనేది అల్లాహ్ భయం వలన జరుగుతుంది.

22. దైవదూతలు అల్లాహ్ కు సజ్దా  చేస్తారు.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఇందులో కూడా తౌహీద్ విధితం, షిర్క్ తుచ్ఛం అని చెప్పడానికి గొప్ప నిదర్శనం ఉంది. పై మూల వాక్యాల్లో అల్లాహ్ గొప్పతనం, ఔన్నత్యం ప్రస్తావించబడినది. ఆ గొప్పతనం, ఔన్నత్యం ముందు సర్వ సృష్టి యొక్క పెద్దరికాలు మట్టిలో కలిసిపోతాయి. అతని మాట వింటేనే భూమ్యాకాశాల్లో ఉన్న సర్వ దైవదూతల గుండెలు అదిరిపోతాయి. వారందరు ఆయన ఎదుట తల మోకరిల్లి, ఆయన గొప్పతనం, ఔన్నత్యాలను స్తుతిస్తారు. ఆయనతో భయపడుతారు. ఇలాంటి గొప్ప గుణం గల ప్రభువే, ఆరాధనకు అర్హుడు కాగలడు. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు, పొగడ్తలకు, ప్రశంసలకు, కృతజ్ఞతకు అర్హులు కారు.

17వ అధ్యాయం: సిఫారసు (షఫాఅత్) [Intercession]

అల్లాహ్ ఆదేశం:

وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ

ప్రవక్తా! తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు అండగా నిలిచి, సహాయం చేసే (అధికారం గల) వాడుగానీ లేదా తమ కొరకు సిఫారసు చేసే వాడుగానీ ఎవడూ ఉండని స్థితిలో ఎప్పుడైనా హాజరు కావలసివస్తుందని భయపడుతూ ఉండేవారికి నీవు దీని (ఖుర్ఆన్) ద్వారా ఉపదేశించు.” (అన్ ఆమ్ 6:51).

قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا

(ఓ ప్రవక్తా!) చెప్పు: “సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉంది.” (జుమర్ 39:44).

مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ

ఆయన సముఖంలో ఆయన అనుమతి లేకుండా సిఫారసు చెయ్యగల వాడెవ్వడు?” (బఖర 2:255).

وَكَم مِّن مَّلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِن بَعْدِ أَن يَأْذَنَ اللَّهُ لِمَن يَشَاءُ وَيَرْضَىٰ

“ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం ఉపయోగపడదు. అల్లాహ్ తాను ఎవరిని గురించైతే ఏదైనా విన్నపం వినదలుస్తాడో, ఎవడైతే ఆయనకు ఇష్టమైనవాడో, అటువంటి వ్యక్తి విషయంలో దానికి (సిఫారసుకు) అనుమతి ఇస్తేనే తప్ప.” (నజ్మ్  53:26).

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ

(ప్రవక్తా! ఈ ముష్రికులతో) ఇలా అను, “అల్లాహ్ ను కాదని మీరు ఆరాధ్యులుగా భావించిన వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలో గాని, భూమిలోగాని, రవ్వంత వస్తువుకు కూడా యజమానులుకారు” (సబా 34:.22-23).

షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు:

“తనలో తప్ప ముష్రికులు భావించే వారిలో ఏ శక్తి లేదని అల్లాహ్ స్పష్టం చేశాడు. ఆయన తప్ప మరెవ్వరికి (భూమ్యాకాశాల్లో దేనికీ) ఏలాంటి అధికారం లేదు. ఎవరూ అల్లాహ్ మద్దతుదారులూ కారు. కేవలం సిఫారసు మిగిలి ఉన్నది. దాన్ని స్పష్టం చేశాడు; ఆయన అనుమతి ఇచ్చిన వారికి తప్ప మరెవ్వరి సిఫారసు పనికిరాదు. అదే విషయం ఈ వాక్యంలో ఉంది.

وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ

వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వాని విషయంలో తప్ప.” (అంబియా 21:28).

ఏ సిఫారసు గురించి ముష్రికులు (పనికి వస్తుందన్నట్లు) ఇక్కడ భావిస్తున్నారో ప్రళయ దినమున అది కనబడదు, పనికిరాదు. ఖుర్ ఆన్ దానిని రద్దు చేసింది.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా తెలిపారు: “ప్రళయదినాన అందరూ సమూహమైన చోట (మహ్-షర్ మైదానం లో) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు కొరకు దీర్ఘ సమయం వరకు సజ్దాలో ఉండి, ఆయన స్తోత్రములు పఠిస్తారు. వెంటనే సిఫారసు చేయరు. తరువాత ఇలా చెప్పబడుతుంది. “ఓ ముహమ్మద్ ! తల ఎత్తు, పలుకు, నీ మాట వినబడుతుంది. అడుగు, ఇవ్వబడుతుంది. సిఫారసు చేయి, అంగీక రించబడుతుంది“.

ఒక సారి అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఇలా ప్రశ్నించారు: “ప్రళయ దినాన మీ సిఫారసుకు అర్హులు ఎవరు కాగలరు?“. దానికి ఆయన “ఎవరు “లాఇలాహ ఇల్లల్లాహ్” హృదయాంతర సత్యత మరియు స్వఛ్ఛతతో అంటారో వారు” అని సమాధానమిచ్చారు. ఈ సిఫారసు, అల్లాహ్ అనుమతి తరువాత లభించేది సత్య విశ్వాసులకు. కానిఅల్లాహ్ తో  షిర్క్ చేసినవారు దీనికి నోచుకోలేరు.

అల్లాహ్ అనుమతి ఇచ్చిన వారి సిఫారసు, దుఆతో సత్యవిశ్వాసులను క్షమించడం వాస్తవానికి ఇది వారికి అల్లాహ్ వైపు నుండి లభించే గౌరవం, ఘనత. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు గౌరవం, ప్రసాదం, ఇలా ఆయన “మఖామె మహ్మూద్ ” (అత్యంత స్తుతింపబడిన మహోన్నత స్థానం) పొందుతారు.

ఖుర్ఆన్ రద్దు చేసిన సిఫారసు షిర్క్ తో కలుషితమైన సిఫారసు. అందుకే స్వయంగా ఆయన అనుమతితో చెల్లే సిఫారసును గురించి అనేక చోట్ల ప్రస్తావించాడు. దానికి అర్హులు తౌహీద్ ను విశ్వసించిన సత్య విశ్వాసులు అని ప్రవక్త స్పష్టం చేశారు.

(షేఖుల్ ఇస్లాం వివరణ సమాప్తమయింది).

ముఖ్యాంశాలు:

1. ఖుర్ ఆన్ ఆయతుల భావం తెలిసింది.

2. రద్దు చేయబడిన సిఫారసు వివరణ వచ్చింది.

3. చెల్లునటువంటి సిఫారసు వివరణ వచ్చింది.

4. మఖామె మహ్మూద్ ను షఫాఅతె కుబ్రా (పెద్ద సిఫారసు) అని అంటారు, దాని ప్రస్తావన వచ్చింది.

5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ సిఫారసు సాధారణంగా చేయరు. ముందు దీర్ఘ సమయం వరకు సజ్దాలో ఉంటారు తరువాత అనుమతి లభిస్తుంది.

6. దాని అర్హులైన అదృష్టవంతులెవరో కూడా తెలిసింది.

7. అల్లాహ్ తో షిర్క్ చేసినవారికి అది ప్రాప్తం కాదు.

8. దాని వాస్తవికత కూడా తెలిసింది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

రచయిత (ముహమ్మద్ బిన్అబ్దుల్ వహ్హాబ్) రహిమహుల్లాహ్ సిఫారసుకు సంబంధించిన అధ్యాయాన్ని ఇచ్చట ప్రస్తావించడానికి కారణం ముష్రికుల భ్రమ, తప్పుడు ఆలోచనను దూరం చేయడానికి.

అది ఏమనగా: దైవదూతల, ప్రవక్తల, వలీల (ఔలియా అల్లాహ్)తో ముష్రికులు దుఆ చేస్తూ, మొరపెట్టుకుంటూ, తాము షిర్క్ కు అతీతులమని చెప్పుకుంటారు. అది ఎలా అనేది వారే స్వయంగా ఇలా తెలుపుతారు: “వారు మా లాంటి మనుషులని మాకు తెలిసినప్పటికీ మేము వారితో దుఆ చేస్తాము. ఎందుకనగా వారు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానం గలవారు. మేము వారితో దుఆ చేస్తే, వారు మమ్మల్ని అల్లాహ్ వరకు చేర్పిస్తారు. అల్లాహ్ వద్ద మాకు సిఫారసు చేస్తారు. ఎలాగైతే రాజుల, అధికారుల వరకు చేరుకోవటానికి, వారి దగ్గర ఉండే కొందరు ప్రత్యేక సిఫారసు చేయువారు, సామాన్య ప్రజల అవసరాలు తీర్చుటకు గాను రాజుల, అధికారుల వద్ద సిఫారసు చేస్తారో“.

కాని ఇది అసత్యం, తుఛ్ఛం. సర్వ అధికారులకన్నా గొప్ప అధికారి అయిన, శక్తి సామర్థ్య వంతుడైన అల్లాహ్ యొక్క ఉదాహరణ భిక్షకుడైన, అసమర్ధుడైన రాజుతో ఇవ్వబడుతుంది. కొందరు మంత్రులతో కలసియే అతను రాజు అయినందుకు (అతని అసమర్థత అట్లే ఏర్పడుతుంది). ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఆయతులతో ఇలాంటి భ్రమ తొలిగిపోతుంది. సర్వ లోకాలకు అధికారి అయిన అల్లాహ్యే సిఫారసు యొక్క అధికారి అని అందులో స్పష్టంగా ఉంది. ఆయన అనుమతి లేనిదే ఎవ్వరూ ఎవ్వరికీ సిఫారసు చేయలేరు. ఎవని మాట, కర్మలతో అల్లాహ్ సంతృప్తి పడతాడో అతని కొరకే అనుమతి లభించేది. తౌహీద్, ఇఖ్లాస్  ఉన్న వ్యక్తి తోనే అల్లాహ్ ఇష్టపడతాడు. అయితే ముష్రిక్ (షిర్క్ చేసినవానికి) సిఫారసు ప్రాప్తం కాదు.

18 వ అధ్యాయం: అల్లాహ్ ఆదేశం: “ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించ లేవు”

إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ

అల్లాహ్ ఆదేశం: “ఓ ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించలేవు“. (ఖసస్ 28:56).

ముసయ్యిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: అబూ తాలిబ్ మరణ సమయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. అక్కడ అబుల్లా బిన్ అబీ ఉమయ్య, అబూ జహల్ ఇద్దరు అవిశ్వాసులున్నారు. ప్రవక్త అన్నారు: “చిన్నాన్నా! “లా ఇలాహ ఇల్లల్లాహ్” వచనం పలకండి, అల్లాహ్ వద్ద మీ పట్ల దాన్ని ఒక ఋజువుగా ఉంచి మాట్లాడతాను“.

అప్పుడు వారిద్దరు: “అబ్దుల్ ముత్తలిబ్ ధర్మంను విడనాడుతావా?” అని హెచ్చరించారు. ప్రవక్త మళ్ళీ చెప్పారు. వారిద్దరు అదే మాట అన్నారు. అబూ తాలిబ్ పలికిన చివరి మాట: “నేను అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్నే విశ్వసిస్తున్నాను”, “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను అతడు తిరస్కరించాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు: “అల్లాహ్ నన్ను నివారించని వరకు మీ కొరకు క్షమాపణ కోరుతూ ఉంటాను“. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యం అవతరింప జేశాడు. “ముష్రికులను క్షమించవలసినదిగా ప్రార్థన చెయ్యటం ప్రవక్తకూ, విశ్వాసులకూ తగనిపని” (తౌబా 9:113). అబూ తాలిబ్ విషయంలో ఈ ఆయతు అవతరించింది. “ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శ కత్వాన్ని ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించగలడు”. (ఖసస్ 28: 56). (ఈ మొత్తం విషయం బుఖారి మరియు ముస్లిం హదీసులలో ఉల్లేఖించబడింది).

ముఖ్యాంశాలు:

1. మొదటి ఆయతు యొక్క భావం. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవిత కాలంలోనే స్వయంగా తన పినతండ్రికి ఏ లాభం చేయలేకపోతే, మరణించిన తర్వాత ఎవరికి ఏ సహాయం చేయగలరు?).

2. (ముష్రికులను క్షమించవలసినదిగా ప్రార్థన చెయ్యటం………. ) అన్న ఆయతు యొక్క భావం తెలిసింది.

3. ముఖ్యమైన విషయం ఇందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావం. అంటే కేవలం నోటితో పలికితే సరిపోదు, నిర్మలమైన మనస్సుతో సాక్ష్యం ఇచ్చుట తప్పనిసరి. నోటి మాటలు సరిపోవును అని చెప్పే కొందరి పండితులకు ఈ హదీసు విరుద్ధంగా ఉన్నది.

4. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి “లాఇలాహ ఇల్లల్లాహ్” చదవమని అబూ తాలిబ్ తో అన్న ప్పుడు, ప్రవక్త ఉద్దేశం ఏమిటో అబూ జహల్, అతనితో ఉన్న ఇద్దరికి బాగా తెలుసు. (అందుకే వారు తాతముత్తాతల ధర్మాన్ని విడనాడకూడదని అతనికి చెప్పగలిగారు). అందరికంటే అబూ జహల్ ఎక్కువ ఇస్లాం మౌలిక విషయాన్ని తెలుసుకున్నప్పటికీ (ఇస్లాంలో చేరలేదు). వారిని అల్లాహ్  శపించుగాక!

5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), తన పినతండ్రి ఇస్లాం స్వీకరించాలని చాలా ప్రయత్నం చేశారు.

6. అబ్దుల్ ముత్తలిబ్ మరియు అతని పూర్వీకులు ఇస్లాం స్వీకరించారు –  అన్నవారి భ్రమ దీనిద్వారా దూరం కావాలి.

7. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని కొరకు ఇస్తిగ్ఫార్ (క్షమించమని అల్లాహ్ తో ప్రార్థించుట) చేశారు. ఆయన పినతండ్రి క్షమించబడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా ఇస్తిగ్ఫార్ చేయుటను అల్లాహ్ నివారించాడు.

8. దుష్ట స్నేహితుల దుష్ప్రభావం మనిషి పై పడుతుంది.

9. దుర్మార్గంపై ఉన్న పూర్వీకుల బాటను అనుసరించడం, గౌరవించడం కూడా హానికరం.

10. “మా పెద్దల ఆచారాన్ని ఎలా వదులుకోవాలి” అన్న సందేహంలో పడి ఉన్నవారు, వాస్తవానికి అబూజహల్ అన్నటువంటి మాటే అంటున్నారు.

11. మనిషి సఫలుడు అవుతాడు అన్నదానికి ఒక సాక్ష్యం అతని అంతిమ ఘడియల్లో ఉన్న ఆచరణ. అతడు (అబూ తాలిబ్) ఒకవేళ కలిమాహ్  పలికియుంటే అది అతనికి ఉపయోగపడేది.

12. దుర్మార్గుల మనుస్సులో ఉన్న (పెద్దల ఆచరణ విడనాడకూడదు అనే) భ్రమ ఎంత భయంకరమో గమనించాలి. ఎందుకనగా కొన్ని సంఘటనలలో వారికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు చెప్పినను తిరస్కరించి వివాదానికి కూడా తయారయి  వారు దాన్ని గౌరవిస్తూ, దాన్ని విడనాడడానికి సిద్ధంగా లేకపోవడమే.

తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయం కూడా దీనికంటే మునుపటి లాంటిదే. సృష్టిలో శ్రేష్ఠులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ వద్ద ఉన్నత స్థానంగల వారు, సిఫారసు చేసేవారిలో ఎక్కువ అర్హత గలవారు, అయినా స్వయంగా తమ పినతండ్రికి ఋజుమార్గం ప్రసాదించలేక పోయారు. ఋజుమార్గం ప్రసాదించేవాడు అల్లాహ్ యే అయినప్పుడు ఇతరులు ఏమి చేయగలుగుతారు? అల్లాహ్ యే సత్యమైన ఆరాధ్యుడు అని తెలుస్తుంది. ఆయన సృష్టించటంలో అద్వితీయుడైతే, ఋజుమార్గం ప్రసాదించడంలో కూడా అద్వితీయుడు. మరెవ్వరి చేతిలో ఈ శక్తి లేదు. – “ప్రవక్త నీవు ఋజుమార్గం చూపుతావు” అని ఖుర్ఆన్ లో వచ్చిన దానికీ భావం: “ప్రవక్త అల్లాహ్ యొక్క వహీ (సందేశం) ప్రజలకు అందజేస్తారు. వారు దాని ద్వారా ఋజుమార్గం పొందుతారు” అని అర్థం.

19వ అధ్యాయం: ఆదం సంతానంలో కొందరు ధర్మాన్ని విడనాడి అవిశ్వాసంలో పడిపోవుటకు కారణం పూర్వ పుణ్యపురుషుల ప్రేమలో “గులువ్వు” చేయడం, అంటే హద్దు మీరటం.

అల్లాహ్ ఆదేశం: 

يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لَا تَغْلُوا۟ فِى دِينِكُمْ
“గ్రంథ ప్రజలారా! మీ ధర్మ విషయాల్లో మీరు హద్దులు మీరకండి”.. (4: నిసా: 171).

అల్లాహ్ ఆదేశం: 

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّۭا وَلَا سُوَاعًۭا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًۭا
మీరు మీ ఆరాధ్య దైవాలను ఎంత మాత్రం విడిచి పెట్టకండి. వద్దా, సువాఅ లను విడిచిపెట్టకండి. యగూస్ ను, యఊఖ్ ను, నసర ను కూడ విడనాడకండి అని వారన్నారు“. (71: నూహా : 23) 

ఇబ్ను అబ్బాసు పై ఆయత్ను వాఖ్యానిస్తూ ఇలా చెప్పారు: ఇవి నూహ్ ప్రవక్తకు ముందు ఉన్న పుణ్య పురుషుల పేర్లు. వారు చనిపోయిన తరువాత వారి వారసుల వద్దకు షైతాన్ వచ్చి, “వారి ఫోటోలను, ప్రతిమలను వారు కూర్చెండే స్థలాల్లో పెట్టండి. వాటికి పేర్లు కూడా నిర్ణయించండి” అని చెప్పాడు. వారు అలా చేశారు. ఈ దశలో ఇంకా వారి పూజా జరగలేదు. వారు కూడా చనిపొయిన తరువాత జ్ఞానం కొరత ఏర్పడింది. అప్పుడు వారి సంతానం ద్వారా పూజ మొదలయింది. (బుఖారీ). 

“అనేక పూర్వ పండితులు ఇలా చెప్పారు: (పైన పేర్కొనబడిన) పుణ్యపురుషులు చనిపోయిన తరువాత, వారు తబర్రుక్ పొందే ఉద్దేశంతో వారి సమాధుల దగ్గర కూర్చునేవారు. తరువాత వారి విగ్రహాలు తయారు చేశారు. కొంత కాలం గడిచాక వాటి పూజ ప్రారంభం అయింది” అని ఇబ్ను ఖయ్యిం రహిమహుల్లాహ్ వివరించారు. 

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఉల్లేఖించారు: ప్రవక్త ఆదేశించారు: “క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ విషయంలో మితిమీరి ప్రవర్తించినట్లు, మీరు నా విషయంలో మితిమీరి ప్రవర్తించకండి. నేను అల్లా దాసున్ని. అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని అనండి”. (బుఖారి, ముస్లిం). మరో సారి ఇలా చెప్పారు: “గులువ్వు (హద్దులు మీరుట) నుండి జాగ్రత్తగా ఉండండి. మీకంటే ముందువారిని నశింపచేసింది గలువ్వే”. (తిర్మిజి, ఇబ్ను మాజ, అహ్మద్). అబ్దుల్లాః బిన్ మన్ ఊద్ ఉల్లేఖించారు, ప్రవక్త ఇలా సెలవిచ్చారు: “మితి మీరే వాళ్ళు సర్వ నాశనమయ్యారు”. మూడు సార్లు ఇలా అన్నారు. (ముస్లీం). 

ముఖ్యాంశాలు: 

1. ఈ అధ్యాయం, దీని తరువాత రెండు అధ్యాయాలను గ్రహిస్తే, ఇస్లాం మరియు ఇతర మతాల్లో ఉన్న వ్యత్యాసం స్పష్టం అవుతుంది. (ఇస్లాం పునాది తౌహీద్ పై ఉంటే, ఇతరులు పునాది షిర్క్ పై ఉంది). మరియు అల్లాహ్ తన దాసుల హృదయాలను మార్చే అనేక విచిత్రాలు కనబడుతాయి. 

2. మొదటి సారిగా భూభాగం పై షిర్క్ మొదలయింది పుణ్యపురుషుల విషయంలో (అతిశయోక్తిలో పడిపోయి) మోసబోయినందు వలన అని తెలిసింది. 

3. ప్రవక్తల్ని అల్లాహ్ తౌహీద్ ప్రచారానికి పంపినప్పటికీ, వారు బోధించిన ధర్మంలో మార్పు వచ్చింది పుణ్యపురుషుల విషయంలో మితిమీరడం వల్లనే. 

4. ధర్మం, స్వభావం వాటిని తిరస్కరించినప్పటికీ ప్రజలు బిద్ అతులను (దురాచారాలను) తొందరగా స్వీకరిస్తారు. 

5. దానికి కారణం ధర్మాన్ని, అధర్మంతో, సత్యాన్ని అసత్యంతో కలుషితం చేసినందు వలన. అందులో మొదటిది: పుణ్యపురుషుల ప్రేమలో మితి మీరుట. రెండవది: జ్ఞానులు, విద్యావంతులు చేసిన కొన్ని పనులు, అవి సదుద్దేశంతో కూడి యుండగా వారి తరువాత వచ్చేవారు, వారి ఉద్దేశాన్ని వేరుగా అని భావించుట. 

6. సూరె నూహ్ లోని ఆయతు యొక్క భావం. 

7. ధర్మం మనుసులో తరుగుతూ ఉండుట, అధర్మం పెరుగుట మనిషి స్వభావంలోనే ఉంది. 

8. కొందరు పూర్వ పండితులు చెప్పినదానికి ఇది సాక్ష్యంగా ఉంది. వారు చెప్పారు: బిద్ అత్, కుఫ్ర్ కు కారణం అవుతుంది. అది ఇబ్లీసుకు, పాపం కంటే ఎక్కువ ఇష్టం. ఎందుకనగా పాపం చేయువాడు తౌబా చేస్తాడు, కాని బిద్దత్ చేయువాడు తౌబా చేయడు. 

9. చేసేవాడు ఎంత సదుద్దేశంతో చేసినా బిద్దత్ అతడిని ఎలా నశింప జేస్తుందో  షైతాను బాగా తెలుసు. 

10. దీనితో ఒక మౌలిక విషయం తెలుస్తుంది. అదేమనగా : బిద్ అత్ నుండి దూరముండాలి. అది ఎటు వైపు తీసుకెళ్తుందో గమనించాలి. 

11. ఒక మంచి పని చేయుటకయినా సమాధి దగ్గర కూర్చుండటం (ముజావరి చేయుట) చాలా నష్టం. 

12. ప్రతిమలు, ఫోటోలను ఉంచుటను నివారించడం, వాటిని తీసివేయడం లో ఉన్న లాభం, ఔచిత్యం తెలుస్తుంది. 

13. పై సంఘటనను బాగుగా తెలుసుకొనుట చాలా అవసరం. కాని చాలా ముస్లిములు అశ్రద్ధలో ఉన్నారు. 

14. చాలా విచిత్ర విషయం: బిద్ అతీలు ఈ సంఘటనను తఫ్సీర్, హదీసు గ్రంధాలల్లో చదువుతారు. వారు పుణ్యపురుషుల విషయంలో మితిమీరుట, వారు అక్కడ చేసే పనులు మంచివి, శ్రేష్ఠమైనవి అని అంటారు. ఇక అల్లాహ్, ఆయన ప్రవక్త నివారించినదానిని వ్యెతిరేకించుట ఏలాంటి కుఫ్ర్ అంటే దాని వలన వారి ధనప్రాణాలు కూడా స్వాధీనం చేసు కొనుట ధర్మమమని విశ్వసిస్తారు

15. వారు ఆ పుణ్యపురుషుల సమాధుల దగ్గర చేసే ప్రార్థనల ఉద్దేశం కేవలం వారి సిఫారసు పొందడమే. 

16. మా పూర్వికులు ప్రార్థన చేయుటకే వారి ప్రతిమలను తయారు చేశారు అని వెనుకటి వారు భావించారు. 

17. (క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ విషయంలో మితిమీరి ప్రవర్తించినట్లు, …….) అన్న హదీసు ద్వారా ఆ విషయాన్ని చాలా స్పష్టం చేశారు. 

18. మితిమీరినవారు వినాశము పొందుగాక అని మనకు హితవు చేస్తున్నారు. 

19. జ్ఞానం నశించిన తరువాతనే షిర్క్ మొదలయింది. దీని ద్వారా జ్ఞానం యొక్క విలువ, అది లేనిచో ఎంత నష్టం కలుగుతుందో అర్థం అవుతుంది. 

20. విద్వాంసుల మరణంతో విద్య నశించిపోతుంది. 

తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ) 

గులువ్వు అంటే హద్దు మీరటం. అది ఎలా అనగా: ఎవరూ సాటి లేని అల్లాహ్ యొక్క ప్రత్యేక హక్కుల్లో కొన్నింటిని పుణ్యపురుషుల్లో ఉన్నవి అని నమ్ముట. అల్లాహ్ అన్ని విధాలుగా సంపూర్ణుడు. అన్ని విధాలుగా అతీతుడు (ఎవరి అక్కర ఏ మాత్రం లేనివాడు). ఆయనే అన్ని విధాల నిర్వాహకుడు. ఆరాధనలకు అర్హతగలవాడు ఆయన తప్ప మరెవ్వడూ లేడు. ఇలా ఎవరైనా పై (అండర్ లైన్లో ఉన్న) గుణాలు ఇతరుల్లో ఉన్నాయని నమ్మితే, అతడు అతని విషయంలో హద్దు మీరిన వాడవుతాడు. అతణ్ణి అల్లాహ్కు సమానంగా నిలబెట్టిన వాడవుతాడు. ఇది పెద్ద షిర్క్. 

హక్కులు మూడు రకాలు అన్న విషయం కూడా తెలుసుకోవాలి. 

1) అల్లాహ్ యొక్క ప్రత్యేక హక్కు. అందులో ఆయనతో భాగస్వామి ఎవ్వడూ లేడు. అది ఆయన ఇబాదత్ (ఆరాధన). ఇందులో ఇతరులను అల్లాహ్ కు సాటి కల్పించకు. ప్రేమ, భయం, ఆశ అన్ని విధాలుగా ఆయన్నే వేడుకో. ఆయన వైపునకే మరలు. 

2) ప్రవక్తల ప్రత్యేక హక్కు. అది వారిని గౌరవించడం, మర్యాద చేయడం. 

3) “హఖ్హే ముష్తరక్“. అంటే అల్లాహ్, ఆయన ప్రవక్తలపై విశ్వాసం. అల్లాహ్ మరియు ప్రవక్తల విధేయత. అల్లాహ్, ఆయన ప్రవక్తల ప్రేమ. ఇది వాస్తవానికి అల్లాహ్ హక్కు. తరువాత దానికనుగుణంగా ప్రవక్తల హక్కు. సత్యవంతులు ఈ హక్కులను ఉత్తమరీతిలో తెలుసుకొని ఎవరి హక్కులు వారికి చెల్లి – స్తారు. వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరచిపోరు. 

20వ అధ్యాయం: పుణ్యపురుషుని సమాధి వద్ద అల్లాహ్ యొక్క ఆరాధన చేయుట చాలా కఠినంగా నివారించబడితే ఇక పుణ్యపురుషుణ్ణి ఆరాధించేవాని గతి ఏమిటి?

ఆయిషా రజియల్లాహు అన్హా కథనం: ఒక సారి ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ఆమె హబషా (నేటి ఇథోపియ దేశం)లో చూసిన చర్చి, అందులోని ఫోటోల విషయం ప్రస్తావించింది. అప్పుడు ప్రవక్త అన్నారు: “వారిలోని పుణ్యపురుషుడు చనిపోతే అతని సమాధిపై ఆలయం నిర్మించి, అందులో వారి ఫోటోలు పెట్టేవారు. అలాంటి వారు అల్లాహ్ వద్ద ఆయన సర్వ సృష్టిలో కెల్ల నీచులు”. (బుఖారీ, ముస్లిం). వారు రెండు ఉపద్రవాలను (ఫిత్న) ఒక చోట చేర్చారు. (1) సమాధులు. (2). ప్రతిమలు, ఫోటోలు. 

ఆయిషా రజియల్లాహు అన్హా కథనం: ప్రవక్తకు మరణ సమయం ఆసన్నమయినప్పుడు ఆయన పరిస్థితి చాలా బాధాకరంగా మారిపోయింది. ఒక్కో సారి ఆయన తన దుప్పటిని ముఖం మీదికి లాక్కునేవారు. కాస్సేపటికి ఊపిరి ఆడకపోవడంతో ముఖం మీది దుప్పటిని తొలగించి వేసేవారు. అలాంటి స్థితిలో సయితం ఆయన (సమాధి పూజలను శపిస్తూ) “యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు. అల్లాహ్ వారిని శపించుగాక!” అని అన్నారు. ఈ విధంగా ప్రవచించి ఆయన ముస్లింలను ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పరోక్షంగా హెచ్చరించారు. ఈ హదీసు తెల్పిన తరువాత హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా దానిపై ఇలా వ్యాఖ్యానించారు. “దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించి ఉండకపోతే ఆయన సమాధి (ప్రజల దర్శనార్థం) తెరచి ఉంచబడేది. అంతేకాదు అది కొంత కాలానికి ప్రార్థనా స్థలంగా కూడ మారిపోయేదని భయంగా ఉండేది. (అందుకే తెరచి ఉంచలేదు). (బుఖారి, ముస్లిం). 

ప్రవక్త ﷺ తమ మరణానికి ఐదు రోజులు ముందు ఉపదేశించిన మాటల్ని నేను విన్నాను, అని జుందబ్ ఉల్లేఖించారు. “మీలో ఎవరినైనా నా స్నేహితుడ్నిగా (ఖలీల్) చేసుకొనుటకు నేను, అల్లాహ్ ముందు, ఇష్టపడను. ఎందుకనగా అల్లాహ్ ఇబ్రాహీంను “ఖలీల్” చేసుకున్నట్లు, నన్ను కూడా స్నేహితుడ్ని “ఖలీల్” చేసుకున్నాడు. నా అనుచర సంఘంలో ఎవరినైనా “ఖలీల్” చేసుకుంటే అబూ బకర్ ను చేసేవాణ్ణి. వినండి! మీకంటే ముందువారు, తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలంగా మార్చుకున్నారు. వినండి! మీరు సమాధులను ప్రార్థనా స్థలంగా చేసుకోకండి. నేను దాని నుండి మిమ్మల్ని నివారిస్తున్నాను“. (ముస్లిం). 

ఇలాంటి సమాధి పూజల నుండి ప్రవక్త తమ జీవితంలోని చివరి ఘడియలలో నివారించారు. అలా చేసేవారిని శపించారు. 

మస్జిద్ లేకున్ననూ సమాధి దగ్గర నమాజు చేయకూడదు. ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పిన “అది కొంతకాలానికి ప్రార్థనా స్థలంగా కూడా మారిపోవచ్చని భయంగా ఉండేంది” అన్న మాటకు ఇదే భావం. లేకుంటే సహచరులు ప్రవక్త సమాధిని ప్రార్థన స్థలంగా మారుస్తారని భావించనూ- లేము. ఎందుకనగా ఎక్కడ నమాజు చేయనుద్దేశించబడిందో అదే మస్జిద్. అంతే కాదు నమాజు చేయబడే ప్రతి చోటను మస్జిద్ అనబడును. ప్రవక్త హదీసు భావం అదే: “నా కోసం, (నా అనుచరులకు) యావత్తు భూమండలం ప్రార్థనా స్థలంగా, పరిశుద్ధమైనదిగా చేయబడింది”. 

ప్రవక్త చెప్పినట్లు ఇబ్ను మనోద్ ఉల్లేఖించారు: “ప్రజల్లో అత్యంత నీచమైన వాళ్ళుగా పరిగణించబడేవారు రెండు రకాలవారు: ఎవరు జీవించి యుండగా ప్రళయం సంభవిస్తుందో వారు. సమాధులపై ప్రార్థనా స్థలాలు నిర్మించేవారు”. (అహ్మద్, అబూ హాతిం). 

ముఖ్యాంశాలు: 

1. పుణ్యపురుషుని సమాధిపై ప్రార్థనాలయం నిర్మించి, అక్కడ అల్లాహ్ ఆరాధన చేయువానిని ప్రవక్తహెచ్చరించారు. అతని సంకల్పం (నియ్యత్) మంచిదైనప్పటికి. 

2. ఫోటోలు, ప్రతిమల నుండి కఠినంగా నివారించారు. 

3. ప్రవక్త 4 దాని గురించి అనేకసార్లు బోధించారు. దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. తొలుత మాములుగా దానిని నివారించారు. తరువాత మరణానికి ఐదు రోజుల ముందు. మళ్ళీ పరలోక ప్రయాణానికి సిద్ధంగా ఉన్న చివరి ఘడియల్లో కూడా కఠినంగా నివారించారు. 

4. తన సమాధి వద్ద అలా చేయకూడదని ప్రవక్త తన సమాధి తయారు కాక ముందే హెచ్చరించారు. 

5. ఈ ఆచారం యూదులది, క్రైస్తవులది. వారు తమ ప్రవక్తల సమాధుల వద్ద అట్లే చేస్తారు. 

6. వారి ఈ చర్యపై ప్రవక్త సల్లల్లాహు అలైపా వసల్లం వారిని శపించారు. 

7. అందులో ఆయన ఉద్దేశం ఆయన సమాధి పట్ల మనల్ని హెచ్చరించడం. 

8. ఆయన సమాధిని తెరచి ఉంచకపోవడానికి కారణము తెలిసింది. 

9. సమాధులను ప్రార్థన స్థలం చేయడం అన్నదాని భావం తెలిసింది. 

10. సమాధులపై ప్రార్థనాలయం నిర్మించేవారిని, ప్రళయం ఎవరిపై సంభవిస్తుందో వారిని కలిపి ప్రవక్త ఒకే హదీసులో చెప్పారు. ఇలా షిర్క్క ముందు సంభవించే దాని కారణాలు, సాధనాలు, మరియు దాని పర్యవసానం (Result) ను కూడా తెలిపారు. 

11. మరణానికి ఐదు రోజుల ముందు ఇచ్చిన ప్రసంగంలో రెండు సంఘాల ఖండన చేశారు. బిన్అ అతి సంఘాల్లో ఇవి రెండు చాలా చెడ్డవి. కొందరు పండితులు వారిని 72 సంఘాల నుండి బహిష్కరించారు. ఒకటి: రాఫిజ. రెండవది: జహామియ్య. రాజీల కారణంగనే షిర్క్, సమాధుల పూజ మొదలయింది. మొదటి సారిగా సమాధులపై వీరే మస్జిద్ నిర్మించారు. 

12. ప్రవక్తకు చివరి ఘడియల్లో (సక్రాత్ లో) చాలా బాధ గలిగింది 

13. ఖలీల్ యొక్క గౌరవపదం ప్రవక్తకు లభించింది. 

14. “ఖుల్లత్” (స్నేహం) ముహబ్బత్ కన్నా ఉన్నతమైనది. 

15. అబూ బకర్ సిద్దీఖ్ ప్రవక్త వారి సహచరుల్లో శ్రేష్ఠులు అని తెలిసింది. 

16. ప్రవక్త తరువాత ఖలీఫా ఆయనే అన్నట్లు సంకేతం ఉంది. 

తాత్పర్యం : (అల్లామా అల్ సాదీ) 

పుణ్యపురుషుల సమాధి వద్ద చేయబడే కార్యాలను గురించి కొంత వివరంగా తెలుసుకుందాము. రెండు రకాల కార్యాలు అక్కడ జరుగుతాయి. ఒకటి: యుక్తమైనది. రెండవది: యుక్తంకానిది. 

యుక్తమైనది: దేనినైతే ధర్మం సమ్మతించిందో అది. ఉదా: సమాధుల దర్శనం. కాని దూర ప్రయాణం చేసి దర్శించకూడదు. (దగ్గరి శ్మశానంలో). ముస్లిం భక్తుడు ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరిస్తూ దర్శనానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి సామాన్యంగా అందరి కొరకు, ప్రత్యేకంగా తనవారి కొరకు అల్లాతో దుఆ చేస్తాడు. ఇలా వారి క్షమాపణ, మన్నింపులకు దుఆ చేసిన- వాడు, స్వయంగా పుణ్యం చేసినవాడవుతాడు. ప్రళయాన్ని జ్ఞప్తి చేసిన వాడు, గుణపాఠం నేర్చుకున్నవాడవుతాడు. 

యుక్తం కానిది: ఒక విధంగా ఇది నిషిద్ధం. ఇది షిర్క్ కు ఒక మార్గం, సాధనం అవుతుంది. ఉదా: తబర్రుక్ (శుభం) కొరకు వాటిని ముట్టుకొనుట. వారిని వసీల (అల్లాహ్ వరకు చేర్పించేవారు)గా భావించుట. అక్కడ నమాజు చేయుట. దీపాలు వెలిగించుట. దానిపై గుమ్మటం, భవనం నిర్మించుట. దాని గురించి, అందులో ఉన్నవారి గురించి గులువ్వు చేయుట. ఇవి స్వయంగా ఇబాదత్ కావు. కాని షిర్క్ సాధనాలు. 

రెండవ విధంగా ఇది షిర్క్ అక్బర్. ఉదా: వారితో దుఆ, మొరపెట్టుకొనుట. ఇహపర అవసరాలు వారితో కోరుట. విగ్రహపూజారులు విగ్రహాలతో ఇలాగే చేస్తారు. ఇవన్నియు వారు స్వయంగా పూర్తి చేస్తారు అని విశ్వసించినా, లేక వారు వసీల (అల్లాహ్ వరకు చేర్పించేవారు) అని విశ్వసించినా (రెండూ తప్పులే). ముష్రికులు కూడా ఇదే విధంగా అనేవారు. చదవండి ఖుర్ఆన్ ఆయతు: వారు మా కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు). (10: యూనుసు: 18). 

మరోచోట ఉంది: వారంటారు: శ్రీవారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము. (39: జుమర్ : 3). 

సమాధిలో ఉన్నవారితో దుఆ చేయువారు, వారు లాభం చేకూర్చి, నష్టం, కష్టం దూరం చేయువారు అని విశ్వసించినవారు, అల్లాహ్ మాత్రమే అధికారం గలవాడు, కాని వారు మనకు మరియు అల్లాహ్ కు మధ్య రాయబారి (వసీల, వాస్త) లాంటివారు అని విశ్వసిస్తూ వారితో దుఆ, మొరపెట్టుకునేవారు ముష్రికులు, కాఫిర్లు. వీరు ముష్రికులు, కాఫిర్లు కారు అని నమ్మినవారు కూడ కాఫిర్లవుతారు. ఇంకా అతడు ఖుర్ఆన్, హదీసులను తిరస్కరించిన- వాడవుతాడు. అల్లాహ్ను గాక ఇతరులతో దుఆ చేసేవాడు, స్వయంగా వారిస్తారని విశ్వసించినా, లేక వారు వసీల అని విశ్వసించినా ముష్రికులు అని ప్రవక్త అనుచర సంఘం ఏకీభవించింది. 

21వ అధ్యాయం: పుణ్యపురుషుల సమాధుల విషయంలో హద్దు మీరుట (గులువ్వు) వలన ఆ సమాధులు విగ్రహాలుగా మారుతాయి

ప్రవక్త ఇలా సెలవిచ్చారు: “ఓ అల్లాహ్ నా సమాధిని పూజింపబడే విగ్రహంగా మార్చకు. ప్రవక్త సమాధులను ప్రార్థనా స్థలంగా మార్చుకున్న వారిపై అల్లాహ్ ఆగ్రహం అవతరించుగాక. (ముఅత్తా ఇమాం మాలిక్). 

ఇబ్ను జరీర్ ఈ లాత్, ఈ ఉజ్జా వాస్తవికతను గురించి కాస్తయినా ఆలోచి ంచారా?) (53: నజ్: 25) అన్న వాక్యంలో ఇలా వ్యాఖ్యానించారు: లాత్ సత్తు కలిపేవాడు. (ఎండిన పిండి ముద్దలను నీటిలో కలిపి బాటసారులకు త్రాగించేవాడు). అతడు చనిపోయిన తరువాత అతని సమాధిపై కూర్చోవటం ప్రారంభించారు. 

అబుల్ జౌజా కూడా ఇబ్ను అబ్బాసుతో ఉల్లేఖించిన దానిలో “అతను హజ్ కొరకు వచ్చేవారికి సత్తు తయారు చేసేవాడు అని అన్నారు”. 

ఇబ్ను అబ్బాసు కథనం: సమాధుల దర్శనం చేసే స్త్రీలను, వాటిపై ప్రార్థనా- లయం కట్టి, దీపాలు వెలిగించేవారిని ప్రవక్త ఈ శపించారు. (అబూ దావూద్). 

ముఖ్యాంశాలు: 

1. అల్లాహ్ తప్ప పూజింపబడే ప్రతీ వస్తువు ను “వసన్” అంటారు. 

2. ఇబాదత్ (ఆరాధన) యొక్క భావం తెలిసింది. 

3. ఏది సంభవిస్తుందని ప్రవక్త భయంచెందారో దాని గురించి అల్లాహ్ శరణు కోరారు. 

4. “శరణు కోరారు” అన్న దానిలోనే సమాధుల పై ప్రార్థనాలయం కట్టిన వారి విషయం చెప్పారు. 

5. అల్లాహ్ ఆగ్రహం వారిపై కురుస్తుంది. 

6. అరేబియలో కెల్ల పెద్ద విగ్రహంగా పేరుపొందిన “లాత్” పూజ ఎలా ప్రారంభమయిందో తెలిసింది. 

7. అతడు పుణ్యపురుషుడు అని తెలిసింది. 

8. అతని పేరు, దాని అర్థం తెలిసింది. 

9. సమాధులను దర్శించే స్త్రీలను శపించడమైనది. 10. దీపాలు వెలిగించే వారూ శపించబడ్డారు. 

22 వ అధ్యాయం: తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి.

అల్లాహ్ ఆదేశం చూడండి:

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).

అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్‌ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్‌ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).

అలీ బిన్‌ హుసైన్‌ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని  నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్‌ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:

“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్‌ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్‌ ముఖ్ తార్ ).

ముఖ్యాంశాలు:

1. సూరయే  తౌబా ఆయతు యొక్క భావం.

2. షిర్క్‌ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.

3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.

4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.

5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.

6. నఫిల్‌ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.

7. స్మశానంలో నమాజ్‌ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.

8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్‌ జఖ్‌)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్‌, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.

తాత్పర్యం(అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్  వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్‌ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.

సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్‌ భద్రతకై షిర్క్‌ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.

23 వ అధ్యాయం: ప్రవక్త వారి సంఘంలో కొందరు “ఔసాన్” (విగ్రహాలను) పూజిస్తారు

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ

అల్లాహ్ ఆదేశం: “గ్రంథజ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారి పరిస్థితి ఎలా వుందంటే, వారు “జిబ్త్ “ను “తాగూత్” ను నమ్ముతారు.” (నిసా 4:51).

قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ

మరో ఆదేశం: “అల్లాహ్ వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపు కంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా? వారు అల్లాహ్ శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకు పడింది. వారు కోతులుగా, పందులుగా చెయ్యబడ్డారు. వారు తాగూత్ దాస్యం చేశారు.” (మాఇద 5:60).

قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا

మరో చోట: “కాని ఈ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు, “మేము వారిమీద ఒక ఆరాధనా మందిరాన్ని నిర్మిస్తాము” అని అన్నారు.” (కహఫ్  18:21).

అబూ సయీద్  ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  చెప్పారు:

“మీరు తప్పకుండా పూర్వీకుల (అంటే గత మతస్థుల) జీవన విధానాలను బాణం, బాణంకు సమానం ఉన్నట్లు అనుసరిస్తారు. చివరికి వారు ఉడుము కన్నంలోకి దూరితే, వారి వెంట మీరు కూడా అందులోకి దూరుతారు”. సహచరులు ఈ మాట విని దైవప్రవక్తా! “ఏమిటీ మేము యూదుల్ని, క్రైస్తవుల్ని అనుసరిస్తామా?” అని అడిగారు (ఆశ్చర్యంతో). దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం): “మరి ఎవరు అనుకుంటుకున్నారు?” అని అన్నారు. (బుఖారి, ముస్లిం).

సౌబాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు:

“అల్లాహ్ నా కొరకు భూమిని చుట్టి దగ్గరికి చేశాడు. నేను దాని తూర్పు పడమర అంతా చూశాను. నా ఎదుట చుట్టబడిన భూమి అంతటిలో నా అనుచర సంఘం చేరుకుంటుంది. నాకు ఎర్రని, తెల్లని రెండు ధన భండారాలు ఇవ్వబడినవి. నేను నా ప్రభువుతో ఇలా వేడుకున్నాను: “నా అనుచర సంఘాన్ని అనావృష్టి (ఖహత్) ద్వారా నశింపజేయకు. వారిపై గెలిచి, వారిని అణచివేసే ముస్లిమేతరులైన శత్రువులకు వారిపై విజయం ప్రసాదించకు”. అప్పుడు నా ప్రభువు అన్నాడు: “వారిని అనావృష్టితో నశింపజేయను. ముస్లిమేతరులైన శత్రవులకు వారిపై ఆధిపత్యం ఇవ్వను. వారంతా ఏకమై వచ్చినప్పటికీ. ఇది వారిలో ఒకడు మరొకడ్ని నాశనం జేసి, ఖైదీలుగా చేయకుండా అందరు ఏకమై ఉన్నంత వరకు”. (ముస్లిం).

ఇదే హదీసును బర్ ఖాని ఉల్లేఖించారు, అందులో ఇంకా ఇలా వుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

“నేను నా అనుచర సంఘం పట్ల వారిలోని దుర్మార్గులైన నాయకులు, పండితులతో భయపడుతున్నాను. వారిపై ఒకసారి కత్తి పడిందంటే ప్రళయం వరకు లేపబడదు. నా అనుచర సంఘంలోని ఒక చిన్న సమూహం ముష్రికులతో కలువని వరకు, మరొక సమూహం విగ్రహాలను పూజించని వరకు ప్రళయం సంభవించదు. నా అనుచర సంఘంలో 30 అసత్యవాదులు వస్తారు. వారిలో ప్రతి ఒక్కడు తనే ప్రవక్త అని అరోపణ చేస్తాడు. నేను చిట్టచివరి ప్రవక్తని. నా తరువాత ఏ ప్రవక్త రాడు. ఎల్లకాలం, ఎల్లవేళల్లో సత్యం, ధర్మంపై ఒక సంఘము ఉండే ఉంటుంది. వారికి దైవ సహాయం లభిస్తూనే ఉంటుంది. ఆ సంఘాన్ని వదలి వెళ్ళినవాడు దానిని ఏ మాత్రం హాని కలిగించలేడు. చివరికి ప్రళయం సంభవిస్తుంది”.

ముఖ్యాంశాలు:

1. సూరె నిసా ఆయతు భావం.

2. సూరె మాఇద ఆయతు భావం.

3. సూరె కహఫ్ ఆయతు భావం.

4. ఇది చాలా ముఖ్య విషయం : ఇందులో జిబ్త్, తాగూత్ పై విశ్వాసం అంటే ఏమిటి? అది హృదయాంతర విశ్వాసమా? లేక అది మిథ్యం , అసత్యం అని తెలిసి, దానితో ప్రేమ, ఇష్టం లేనప్పటికి కేవలం దాన్ని అనుసరించిన వారితో సంబంధమా?

5. అవిశ్వాసుల అవిశ్వాసం తెలిసి కూడా వారు విశ్వాసులకన్నా ఉత్తమమైన మార్గంపై ఉన్నారన్న యూదుల మాట కూడా తెలిసింది.

6. ఒక ముఖ్య విషయం అది ఈ అధ్యాయంలో ఉద్దేశించినది. అది అబూ సఈద్ హదీసులో వచ్చినది; ప్రవక్త అనుచర సంఘంలో కొంత మంది గత మతస్తులను అనుసరిస్తారు.

7. వీరిలో కొంత మంది విగ్రహ పూజారులు అవుతారు.

8. విచిత్రమైన విషయం : ప్రవక్తలు అని ప్రకటన చేసేవారు వస్తారు. ఉదా: ముఖ్తార్ అబూ ఉబైద్ సఖఫీ. అతడు “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను చదివి, ప్రవక్త అనుచర సంఘంలోనివాడయి, ముహమ్మద్ ప్రవక్తను సత్యప్రవక్త, చివరి ప్రవక్త అని, ఖుర్ఆన్ సత్యం అని నమ్మి కూడా వాటికి వ్యెతిరేకించి తానే ప్రవక్త అని ప్రకటించుకున్నాడు. అతడు ప్రవక్త సహచరుల చివరి జీవితకాలంలో పుట్టినవాడు. అతన్ని చాలా మంది అనుసరించారు.

9. ఇంతకు ముందు కాలంలో జరిగినట్లు ఇస్లాం ధర్మం నశించిపోదు. ఎల్లప్పుడు దానిని అనుసరించేవారు కొందరు ఉంటారు అన్న శుభవార్త ఉంది.

10. వారు సంఖ్యలో అల్పులయినప్పటికీ వారిని విడనాడినవాడు, వ్యెతిరేకించినవాడు వారికి ఏ హానీ కలిగించలేడు అన్న గొప్ప సూచన ఉంది.

11. ఇది ప్రళయము వరకు ఉండును.

12. ఇందులో ఉన్న గొప్ప సూచనలు:

 • అల్లాహ్, ప్రవక్తకు తూర్పు, పడమర వరకు ఉన్న భూమిని దగ్గరికి చేశాడు. ప్రవక్త ఈ దాని గురించి తెలిపిన విషయం నిజమయింది. (అంటే తూర్పు, పడమరలో ఇస్లాం వ్యాపించింది). ఉత్తరం, దక్షిణం గురించి ఇలా ఏమి తెలుపలేదు.
 • రెండు ధనభండారాలు లభించాయి అని తెలిపారు.
 • ప్రవక్త చేసిన రెండు దుఆలు అల్లాహ్ స్వీకరించాడు.
 • పరస్పర యుద్ధాలకు, వినాశనాలకు గురికాకూడదు అన్న మూడవ దుఆ అల్లాహ్ స్వీకరించలేదు.
 • వారి పై కత్తి నడిచిందంటే అగదు అన్నది కూడా సత్యమైంది.
 • పరస్పరం హత్యయత్నాలు, ఖైదీలు చేయడం జరుగతుంది అన్న విషయం తెలిసింది.
 • అనుచర సంఘం పై భ్రష్టనాయకుల, పండితుల (మౌల్వీల) భయం ఉంది అని తెలిపారు.
 • వీరిలో తానే ప్రవక్త అని ఆరోపించేవారు వస్తారు అన్న సూచన ఉంది.
 • అల్లాహ్ సహాయం పొందే ఒక సమూహం ధర్మం వైపు ఎల్లప్పుడూ ఉంటుందన్న శుభవార్త ఇచ్చారు. ప్రవక్త తెలిపిన పై సూచనలు మన బుద్ధిజ్ఞానంతో ఆలోచిస్తే అసంభవం అని అంటామేమో, కాని అవి పూర్తిగా నిజమైనాయి.

13. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచర సంఘం పట్ల భయం మార్గభ్రష్టులైన పండితులతో మాత్రమే ఉంది అని తెలిపారు.

14. విగ్రహ పూజ యొక్క భావాన్ని వివరించారు. (అది అల్లాహ్ యేతరులకు రుకూ, సజా చేయడమే కాదు. వారు హలాల్ చేసినదాన్ని హలాల్, హరాం చేసినదాన్ని హరాంగా నమ్ముట కూడా).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం ముస్లిం సంఘంలో సంభవించిన షిర్క్ నుండి హెచ్చరించడం. ఇది ముస్లిం సమాజంలో వ్యాపించింది. అదే విధంగా “లాఇలాహ ఇల్లల్లాహ్” నోటితో పలికి, తనకు తాను ముస్లిం అని చాటుకున్న వ్యక్తి, దానికి వ్యెతిరేకమున్న: సమాధిలో ఉన్నవారితో దుఆ, మొరపెట్టు కొనుట లాంటి పనులు చేసి, దానికి వసీల అన్న పేరు పెడితే అతని తౌహీద్ లో ఏలాంటి తేడా ఉండదు అని అన్నవారి ఖండన కూడా ఇందులో ఉంది.

“వసన్” అంటే: అల్లాహ్ తప్ప పూజింపబడే వారు. అందులో పూజింపబడే చెట్లు, రాళ్ళు (సమాధులపై ఉన్న) నిర్మాణాలు. ఇంకా ప్రవక్తలు, పుణ్యాత్ములు,దుష్టులు అన్నీ వస్తాయి. ఇబాదత్ కేవలం అల్లాహ్ హక్కు. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయువాడు, లేక వారిని ఆరాధించేవాడు, వారిని “వసన్” (విగ్రహంగా, ఆరాధ్యదైవంగా) చేసుకున్నవాడయ్యాడు. అందువల్ల అతను ఇస్లాం నుండి దూరమవుతాడు. తనకు తాను ముస్లిం అని చెప్పుకున్నా లాభం లేదు. తమను తాము ఇస్లాం వైపుకు అంకితం చేసుకున్న అవిశ్వాసులు, నాస్తికవాదులు, తిరస్కారులు, కపట విశ్వాసులు (మునాఫిఖులు) ఎంత మంది లేరు. వాస్తవ ధర్మంతోనే స్వఛ్చమైన విశ్వాసుడు అనబడును. కేవలం పేరుతో, పదాలతో కాదు.

24వ అధ్యాయం: ఇంద్రజాలం

అల్లాహ్ ఆదేశం:

وَلَقَدْ عَلِمُوا۟ لَمَنِ ٱشْتَرَىٰهُ مَا لَهُۥ فِى ٱلْـَٔاخِرَةِ مِنْ خَلَـٰقٍۢ
ఈ విద్య కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు“. (2: బఖర: 102). 

మరో చోట:

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُوا۟ نَصِيبًۭا مِّنَ ٱلْكِتَـٰبِ يُؤْمِنُونَ بِٱلْجِبْتِ وَٱلطَّـٰغُوتِ
“వారు “జిబ్త్”ను “తాగూత్” ను నమ్ముతారు.” (4: నిసా: 51). 

జిబ్తి అంటే: ఇంద్రజాలం, తాగూత్ అంటే షైతాన్ అని ఉమర్ రదియల్లాహు అన్హు చెప్పారు.
తాగూత్ అంటే; జ్యోతిష్యులు. వారి వద్దకు షైతానులు వస్తారు. వారు ప్రతి వాడలో ఒకరుండేవారు అని జాబిర్ చెప్పారు. 

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఆదేశించారు: “నాశనం చేసే ఏడు విషయాల నుండి దూరముండండి“. ఏ విషయాలు ప్రవక్తా! అని సహచరులు అడిగినప్పుడు, “అల్లాహ్ తో షిర్క్ చేయుట. ఇంద్రజాలం. అల్లాహ్  నిషేధించిన ప్రాణాన్ని అన్యాయంగా హతమార్చుట. వడ్డి తినుట. అనాధుల సొమ్ము తినుట. రణరంగం నుండి వెనుదిరుగుట. అమాయకులు మరియు పవిత్రులైన ముస్లిం స్త్రీ పై అపనింద మోపుట” అని వివరించారు ప్రవక్త ﷺ.

జున్దుబ్, ప్రవక్త చెప్పినట్లు ఉల్లేఖించారు: “ఇంద్రజాలం చేయువాని శిక్ష ఖడ్గంతో నరకడం”. (తిర్మిజీ). 

అబూ దావూద్ లో బజాల బిన్ అబ్ద ఉల్లేఖించారు: ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గవర్నర్లకు ఇలా ఆదేశాలు వ్రాసారు: “ఇంద్రజాలం చేసే ప్రతి స్త్రీ పురుషున్ని నరికి వెయ్యండి“. మేము ముగ్గురు స్త్రీలను హతమార్చాము. హఫ్సా రజియల్లాహు అన్హా ఆమె పై ఇంద్రజాలం చేసిన ఆమె బానిసరాలును హతమార్చండి అని ఆదేశించారు. ఆ బానిసరాలు నరికివేయబడింది. అదే విధంగా జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ఉంది. మాంత్రికుణ్ణి హతమార్చే విషయం ముగ్గురి సహాబీలతో రుజువైనది అని ఇమాం అహ్మద్ రహిమహుల్లా చెప్పారు. 

ముఖ్యాంశాలు: 

1. సూరె బఖర ఆయతు యొక్క భావం. 
2. సూరె నిసా ఆయతు యొక్క భావం. 
3. జిబ్త్, తాగూత్ యొక్క భావం. అందులోని వ్యత్యాసం తెలిసింది.
4. తాగూత్, జిన్నాతులోని వాడు కావచ్చు, లేదా మనుష్యులలోనివాడు కావచ్చు. 
5. ప్రత్యేకంగా నివారించబడిన, నాశనం చేసే ఏడు విషయాలను గుర్తుంచుకోవాలి. 
6. ఇంద్రజాలం చేసేవాడు అవిశ్వాసుడవుతాడు. 
7. అతని తౌబా స్వీకరించబడదు. అతన్ని హతమార్చాలి. 
8. ఉమర్ రజియల్లాహు అన్హు వారి కాలంలోనే అలాంటి వాళ్ళున్నారంటే, ఆ తరువాతి కాలపు సంగతి ఏమి చెప్పనవసరం లేదు. 

25వ అధ్యాయం: ఇంద్రజాలం యొక్క కొన్ని రకాలు

ఇమాం అహ్మద్ హదీసు ఉల్లేఖించారు ముహమ్మద్ బిన్ జఅఫర్ తో, ఆయన హదీసు ఉల్లేఖించారు ఔఫ్ తో , ఆయన హయ్యాన్ బిన్ అలాతో, ఆయన హదీసు ఉల్లేఖించారు ఖుత్నుబ్ను ఖబీసతో, ఆయన తన తండ్రితో, ఆయన ప్రవక్త ﷺ తో విన్నారు, ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:

“పక్షుల్ని ఎగరేసి (ఇయాఫ), నేలపై గీతలు గీసి (తర్ఖ్ ), ఇంకే విధంగానైనా శకునం పాటించుట (తియర), ఇవన్నియు ఇంద్రజాలం రకాలు”. 

ఇయాఫ అంటే: పక్షుల్ని ఎగరేసి శకునం పాటించటం. తర్ఖ్ అంటే: నేలపై గీతలు గీసి శకునం పాటించటం అని ఔఫ్ రహిమహుల్లా చెప్పారు. జిబ్త్ అంటే: షైతాన్ యొక్క ఈలలు, అరుపులు అని హసన్ బసరీ రహిమహుల్లాః అన్నారు. (దీని సనద్ సరియైనది). 

ఇబ్ను అబ్బాసు రజియల్లాహు అన్హుమా కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఏ వ్యక్తి ఎంత జ్యోతిష్య విద్య నేర్చుకుంటాడో, అతడు అంతే ఇంద్రజాలం నేర్చుకున్నట్లు. ఎంత నేర్చుకుంటే అంతే పాపం కూడా పెరుగుతూ ఉంటుంది“. (అబూ దావూద్. దీని సనద్ ఉత్తమమైనది). 

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారు: “ఎవరు ముడి వేసి అందులో మంత్రిస్తారో అతడు ఇంద్రజాలం చేసినట్లే. ఇంద్రజాలం చేసినవాడు షిర్క్ చేసినట్లు. ఎవరు ఒక వస్తువును ధరిస్తారో అతను దాని వైపే అప్పగించబడుతాడు“. (నసాయి). 

ఇబ్ను మస్ ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఒకసారి ప్రవక్త ﷺ “అజ్ హ్ ” అంటేమిటో మీకు తెలుపనా?” అని అడిగారు. మళ్ళీ ఆయనే “చాడీలు చెప్పడం, ప్రజల మధ్య జగడము వేయుట” అని విశదీకరించారు. (ముస్లిం). 

ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త చెప్పారు: “కొన్ని ప్రసంగాలలో కూడా మంత్రం లాంటి ప్రభావం ఉంటుంది“. (బుఖారీ, ముస్లిం). 

ముఖ్యాంశాలు: 

1. ఇయాఫ, తర్ఖ్ , అపశకునం ఇవన్నియు ఇంద్రజాలం రకాలు.
2. ఇయాఫ, తర్ఖ్ , తియర యొక్క అర్థం తెలిసింది.
3. జ్యోతిష్య విద్య ఇంద్రజాలం రకంలోనిదే. 
4. ముడి వేసి మంత్రించుట కూడా ఆ రకానికి సంబంధించిందే.
5. చాడీలు చెప్పడం దాని రకాల్లోనే లెక్కించబడుతుంది.
6. ప్రసంగం కూడా ఒక్కోసారి దాని రకాల్లో వస్తుంది. 

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

ఇంద్రజాలంకి సంబంధించిన పాఠాన్ని తౌహీద్ అధ్యాయాల్లో ప్రస్తావించడానికి కారణం ఏమనగా మాంత్రికుని ఉద్దేశం పూర్తికావటానికి అందులోని అనేక రకాలు షిర్క్ మరియు షైతాన్ యొక్క ఆత్మతో వసీల కోరుతూ చేయబడుతాయి. మానవుడు చిన్నవైనా, పెద్దవైనా అన్ని రకాల ఇంద్రజాలాన్ని వదులుకోనంత వరకు అతని తౌహీద్ సంపూర్ణం కాదు. అందుకే దాన్ని షిర్క్ తో కలిపి చెప్పబడింది. అది రెండు విధాలుగా షిర్క్లో చేరుతుంది. 

ఒకటి: ఇందులో షైతానుల సహాయం కోరడం, వారితో సంబంధం ఉంచడం జరుగుతుంది. మాంత్రికులు తమ కోరికను వారితో పొందుటకు, వారి సేవలను అందుకొనుటకు వారు కోరునది వారి సన్నిధానంలో ఉంచుతారు. 

రెండవది: అగోచర జ్ఞానం ఉన్నదన్న ఆరోపణ, అల్లాహ్ కు ఉన్న విద్య, జ్ఞానంలో భాగస్తుడు ఉన్నాడన్న ఆరోపణ ఉంది. ఈ ఆరోపణ నేరుగా చేయకున్నా దాని వరకు చేర్పించే బాటను వారు అనుసరిస్తారు. ఇది షిర్క్, కుఫ్ర్ యొక్క భాగాల్లో ఒక భాగం.

ఇంతేగాక అందులో నిషిద్ధమైన, చెడ్డ కార్యాలు జరుగుతాయి. ఉదా: హతమార్చడం, ప్రేమగా కలిసియున్నవారిని విడదీయడం, బుద్ధీ, జ్ఞానాన్ని మార్చి వేసే ప్రయత్నాలు. ఇది కఠినంగా నిషేధించబడినదానిలో ఒకటి. ఇంకా షిర్క్, దానికి సంబంధించిన మార్గాల్లో ఒకటి. అందుకే ఇంతటి ఘోరమైన నష్టాలను అడ్డుకొనటానికే మాంత్రికుణ్ణి హతమార్చాలని చెప్ప బడింది. 

దాని రకాల్లో ఒకటి ఈ రోజుల్లో ప్రజల్లో చెలామణిలో ఉన్న చాడీలు. దాని వలన కూడా ప్రజల మధ్య బేధాన్ని ప్రేమగా ఉన్నవారిని విడదీయడం జరుగుతుంది. ఇంద్రజాలంలో అనేక రకాలు గలవు. ప్రతీ ఒక్కటి మరో దానికంటే చెడ్డది. 

26వ అధ్యాయం: జ్యోతిష్యం మరియు అలాంటి పనులు

ప్రవక్త సతీమణుల్లో ఒకరు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఎవరైనా “అర్రాఫ్” వద్దకు వెళ్ళి అతన్ని ఒక విషయం అడిగి అతను చెప్పిన సమాధానాన్ని సత్యం అని నమ్మితే, అతని నలుబై రోజుల నమాజు అంగీకరింపబడదు”. (ముస్లిం). 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: “ఎవరు “కాహిన్’ వద్దకు వచ్చి అతను చెప్పింది సత్యం అని నమ్ముతాడో అతను ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించినవాడవుతాడు”. (అబూ దావూద్ ).

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరు “కాహిన్ లేక అర్రాఫ్” వద్దకు వచ్చి అతని మాటను సత్యపరుస్తాడో అతడు ముహమ్మద్ ప్రవక్త పై అవతరించినదానిని తిరస్కరించినవాడవుతాడు”. (అబూ దావూద్ ….).

ఇమ్రాన్ బిన్ హుసైన్ మహాప్రవక్త నుండి ఉల్లేఖించారు: “అపశకునం పాటించినవాడు లేక తన కొరకు అపశకునం పాటించువాణ్ణి (వెతికి, అతనితో తన అదృష్టం తెలుసుకున్నవాడు). “కహానత్” చేసినతడు లేక చేయించుకున్నతడు. ఇంద్రజాలం చేసినతడు లేక చేయించినవాడు. కాహిన్ మాటల్ని సత్యం అని భావించినతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు”. (బజ్జార్ సరియైన సనద్ తో సేకరించారు). 

గొప్ప వ్యాఖ్యానకర్త ఇమాం బగవి చెప్పారు: అర్రాఫ్ అంటే; కొన్ని మూల విషయాల అధారంతో దొంగలించబడిన వస్తువులను, కనబడని, తప్పిపోయిన వస్తువులను తెలుపుతానని అరోపించేవాడు. కాహిన్ అంటే కూడా అతడే అని కొందరున్నారు. మరి కొందరున్నారు: కాహిన్ అంటే; భవిష్యత్తులో సంభవించేవాటిని తెలిపేవాడు. మనుస్సులో ఉండేవాటిని తెలిపేవాడు అని కూడా అన్నారు. 

షేఖుల్ ఇస్లాం  ఇబ్ను తైమియ్యా రహిమహుల్లాహ్  చెప్పారు: కాహిన్ ను, మునజ్జిం రమ్మాల్ లాంటి వారిని అర్రాఫ్ అంటారు. ఈ మార్గాల ద్వారా వారు కొన్ని విషయాలను తెలుపుతామని ఆరోపణ చేస్తారు. 

“అబ్ జద్ ” అక్షరాలు వ్రాసి, నక్షత్రాల్లో చూసి (భవిష్యత్తు గురించి తెలుసుకునే) వారి గురించి ఇబ్న్ అబ్బాసు చెప్పారు: “ప్రళయదినాన వారికి ఎలాంటి పుణ్య ఫలము లభించదు.”

ముఖ్యాంశాలు: 

1. ఖుర్ఆన్ పై విశ్వాసం, కాహిన్ మాటను సత్యమని నమ్ముట ఈ రెండు విషయాలు ఒక మనిషిలో కలిసి ఉండలేవు. 
2. అది అవిశ్వాసం అని స్పష్టం అయింది. 
3. కహానత్ చేయించేవారి ప్రస్తావన వచ్చింది. 
4. అపశకునం పాటించువాని వద్దకు వెళ్ళినవాని ప్రస్తావన వచ్చింది.
5. ఇంద్రజాలం చేయించేవాని ప్రస్తావన వచ్చింది. 
6. అబ్ జద్ (అక్షరాల జ్ఞానం) నేర్చుకునే వాని ప్రస్తావన వచ్చింది.
7. కాహిన్, అర్రాఫ్ మధ్య ఉన్న వ్యత్యాసం తెలిసింది. 

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

అగోచర జ్ఞానంలో అద్వితీయుడు అల్లాహ్  మాత్రమే. ఇందులో తాను అల్లాహ్  తో భాగస్తుడు అని కహానత్, అర్రాఫ ఆధారంతో ఎవరు ఆరోపణ చేస్తాడో, లేక ఇలా ఆరోపణ చేసినవానిని నమ్ముతాడో అతడు అల్లాహ్  ప్రత్యేకతల్లో ఇతరులను సాటి కల్పించినవాడవుతాడు. అందుచేత అల్లాహ్ , ఆయన ప్రవక్తను తిరస్కరించినవాడవుతాడు. 

అనేక కహానత్ లు షైతాన్ కు సంబంధించినవి. అవి షిర్క్ లేకుండా ఉండవు. ఇంకా అగోచర జ్ఞాన ఆరోపణకు సహాయపడే మార్గాల సన్నిధానం కోరడం కూడా జరగుతుంది. ఇలా ఇది రెండు విధాలుగా షిర్క్. ఒకటి: అల్లాహ్ కు ప్రత్యేకించిన అగోచరజ్ఞానంలో భాగస్తుడని అరోపణ చేసినందుకు. రెండవది: అల్లాహ్ యేతరుల సన్నిధానం కోరినందుకు. 

ఇలా ధర్మాన్ని, బుద్ధి, జ్ఞానాన్ని నష్టము కలిగించే దురాచారాలు, దుష్కార్యాల నుండి ఇస్లాం ధర్మం ప్రజల్ని దూరంగా ఉంచింది. 

27వ అధ్యాయం: ఇంద్రజాలం ద్వారా ఇంద్రజాలం చేయబడిన వ్యక్తి చికిత్స

జాబిర్ కథనం: ఇంద్రజాలం ద్వారా ఇంద్రజాలం చికిత్స చేయవచ్చునా? అని ప్రవక్త ﷺ ముందు ప్రశ్న వచ్చినప్పుడు “అది షైతాన్ పని” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (అహ్మద్, అబూ దావూద్ ).

ఇందులో ఇంకా ఇలా ఉంది: అదే ప్రశ్న ఇమాం అహ్మద్ రహిమహుల్లాతో చేసినప్పుడు ఆయన “అబ్దులాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు వీటన్నిటితో ఇష్టపడేవారు కాదు” అని చెప్పారు. (అంటే నిషిద్ధం అని భావించేవారు).

బుఖారిలో ఖతాద కథనం: నేను ఇబ్ను ముసయ్యిబ్ తో అడిగాను: ఒక వ్యక్తిపై మంత్రం చేయబడింది. లేక అతను తన భార్య వద్దకు వెళ్ళకుండా మంత్రించారు. అయితే అది దూరం చేయవచ్చునా? లేక దాన్ని దూరము చేయుటకు మంత్రం చేయవచ్చునా? దానికి ఆయన “పరవాలేదు. వారు దాని ద్వారా మంచి చేయగోరుతున్నారు. లాభం కలిగే దాన్ని నివారించకూడదు” అని అన్నారు. 

హసన్ బస్రి రహిమహుల్లాహ్ చెప్పారు: “ఇంద్రజాలాన్ని, ఇంద్రజాలం చేసేవాడే దూరము చేయగలుగుతాడు”. 

ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ చెప్పారు:

“ఇంద్రజాలం చేయబడిన వ్యక్తి నుండి దాని ప్రభావం దూరం చేసే విధానాలు రెండు: ఒకటి: అలాంటి ఇంద్రజాలం ద్వారానే దూరం చేయుట. ఇది షైతాన్ పని. హసన్ బస్రి చెప్పిన దానికి భావం అదే. ఇందులో అది చేసేవాడు, చేయబడేవారిద్దరూ షైతాన్కు ఇష్టమైన పనులు చేస్తారు, అతడు వారితో సంతోషపడి తన ప్రభావాన్ని దూరం చేసుకుంటాడు. రెండవది: దానిని దూరము చేయుటకు ధర్మసమ్మతమైన మంత్రాలు, ప్రవక్త నేర్పిన దుఆలు, వైద్యశాస్త్రం ద్వారా చికిత్స చేయుట. ఇది ధర్మసమ్మతమైనది.”

ముఖ్యాంశాలు: 

1. ఇంద్రజాలం ద్వారా ఇంద్రజాలాన్ని దూరం చేయుట నివారించబడింది. 
2. నివారించబడిన దానిలో, యోగ్యమైన దానిలో మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి. 

28వ అధ్యాయం:  అపశకునం

అల్లాహ్  ఆదేశం: 

أَلَآ إِنَّمَا طَـٰٓئِرُهُمْ عِندَ ٱللَّهِ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
అసలు వాస్తవానికి వారి అపశకునం అల్లాహ్  చేతులలో ఉంది. కాని వారిలో చాలా మంది జ్ఞానహీనులు“. (7: ఆరాఫ్: 131). 

అల్లాహ్  పంపిన ప్రవక్తలు ఇలా అన్నారు:

قَالُوا۟ طَـٰٓئِرُكُم مَّعَكُمْ
మీ దుశ్శకునం స్వయంగా మీ వెంటనే ఉంది“. (36: యాసీన్: 19). 

అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం: ప్రవక్త ﷺ చెప్పారు: “అస్పృశ్యత (అంటు వ్యాధి) సరైనది కాదు. అపశకునం పాటించకూడదు. గుడ్లగూబ (అరుపు, లేక ఒకరి ఇంటిపై వాలితే ఆ ఇంటివారికీ నష్టం కలుగుతుందని భావించుట) సరి కాదు. ఉదర వ్యాధితో(*) అపశకునం పాటించుట కూడా సరైనది కాదు“. (బుఖారీ, ముస్లిం). ముస్లిం హదీసు గ్రంథంలో “తారా బలం, దయ్యాల నమ్మకం కూడా సరైనది కాదు“. అని ఉంది. 

(*) కొందరి నమ్మకం ప్రకారం రోగి కడుపులోకి ఒక జంతువు దూరి ఆకలిగా ఉన్నప్పుడు తీవ్రమైన దుఃఖం కలిగిస్తుంది. దీనివల్ల ఒక్కోసారి రోగి మృత్యువాతన కూడా పడతాడు. ఈ నమ్మకాన్ని అరబిలో “సఫర్” అంటారు. 

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఉపదేశించారు: “అస్పృశ్యతా పాటింపు లేదు. దుశ్శకునం పాటించడం ధర్మ సమ్మతం కాదు. అయితే శుభ శకునం (ఫాల్) (*) పాటించడమంటే నాకిష్టమే“”. అప్పుడు అనుచరులు “మంచి శకునం అంటే ఏమిటి?” అని అడిగారు. దానికి ప్రవక్త “(మంచి శకునం అంటే) మంచి మాట (సద్వచనం)” అని సమాధానమిచ్చారు. 

(*) అకస్మాత్తుగా ఏదైనా మంచి మాట విని లేదా సందర్భోచితమైన మాట విని దాన్నుండి సకారాత్మక ఫలితం తీయడమే మంచి శకునం (ఫాల్). ఇది ధర్మసమ్మతమే. 

ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త ﷺ దగ్గర దుశ్శకునం పాటించే ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన “ఫాల్” మంచిది. అది ముస్లింను తన పనుల నుండి ఆపదు. మీలో ఎవరైనా తనకు ఇష్టం లేనిది చూస్తే ఇలా అనాలి: “అల్లాహుమ్మ లా యాతి బిల్ హసనాతి ఇల్లా అంత. వలా యద్ ఫఉస్సయ్యిఆతి ఇల్లా అంత. వలాహౌల వలాఖువ్వత ఇల్లా బిక” (అర్థం: ఓ అల్లాహ్ ! మంచిని ప్రసాదించేవాడివి నీవే. చెడును దూరము చేయువాడివి నీవే. మంచి చేయుటకు, చెడు నుండి దూరముంచుటకు నీకు తప్ప మరెవ్వరికి సాధ్యం కాదు). అని చెప్పారు. (అబూ దావూద్). 

ఇబ్ను మస్ ఊద్, ప్రవక్త ﷺ చెప్పినట్లు ఉల్లేఖించారు: “దుశ్శకునం పాటించుట షిర్క్. దుశ్శకునం పాటించుట షిర్క్. మనలో ప్రతీ ఒకడు దానికి గురవుతాడు. కాని అల్లాహ్  పై ఉన్న నమ్మకం ద్వారా అల్లాహ్  దాన్ని దూరము చేస్తాడు“. (అబూ దావూద్, తిర్మిజి. తిర్మిజి చెప్పారు: చివరి పదాలు ఇబ్ను మన్ ఊద్ రజియల్లాహు అన్హు చెవితనవి). 

ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హుమా) కథనం: “దుశ్శకునం తన పనికి అడ్డు పడిందని ఎవడు నమ్ముతాడో అతడు షిర్క్ చేసినట్లు“. దాని పరిహారం ఏమిటని అడిగినప్పుడు: “అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక. వలా తైర ఇల్లా తైరుక. వలాఇలాహ గైరుక” అనండి అని తెలిపారు. (అర్థం: నీ మంచి తప్ప మంచి ఎక్కడా లేదు. నీ శకునం తప్ప శకునం ఎక్కడా లేదు. నీ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు). (అహ్మద్). 

నిన్ను పని చేయనిచ్చేది లేక పనికి అడ్డుపడేది దుశ్శకునం” అని ఫజ్ ల్ బిన్ అబ్బాసు రజియల్లాహు అన్హు అన్నారు. 

ముఖ్యాంశాలు: 

 • 1. ఖుర్ఆన్లోని పై రెండు ఆయతుల భావం తెలిసింది. “అసలు వాస్తవానికి వారి అపశకునం అల్లాహ్  చేతులలో ఉంది”. “మీ దుశ్శకునం స్వయంగా మీ వెంటనే ఉంది”. 
 • 2. అస్పృశ్యత పాటించడము సరికాదు. 
 • 3. దుశ్శకునం పాటించడం సరికాదు. 
 • 4. గుడ్లగూబ నష్టం కలిగిస్తుందని భావించుట సరికాదు. 
 • 5. సఫర్ కూడా సరైనది కాదు. 
 • 6. ఫాల్ అలాంటిది కాదు. అది మంచిది. 
 • 7. ఫాల్ అంటేమిటో కూడా తెలిసింది. 
 • 8. అది ఇష్టం లేనప్పటికి, ఒక్కోసారి మనుస్సులో అలాంటి భావం కలిగితే నష్టం లేదు. ఎందుకనగా అల్లాహ్  తనపై నమ్మకం ఉన్నవారి నుండి దాన్ని దూరము చేస్తాడు. 
 • 9. అలా మనుస్సులో కలిగినప్పుడు ఏమనాలో తెలిసింది. 
 • 10. దుశ్శకునం షిర్క్. 
 • 11. దుశ్శకునం అంటేమిటో కూడా తెలిసింది. 

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

పక్షులతో, పేర్లతో, పదాలతో, స్థలము వగైరాలతో అపశకునం పాటించుటను అరబిలో “తియర” అంటారు. అల్లాహ్  అపశకునమును నివారించి, దాన్ని పాటించేవారిని కఠినంగా హెచ్చరించాడు. ప్రవక్త ఫాల్ అంటే ఇష్టపడేవారు. అపశకునమంటే అసహ్యించుకునేవారు. 

అపశకునం మరియు ఫాల్లో వ్యత్యాసం ఏమనగా: ఫాల్ మానవుని విశ్వాసము, బుద్ధి, జ్ఞానములో లోపం కలుగచేయదు. అల్లాహ్ యేతరులపై మనస్సు లగ్నం వల్ల, విశ్వాసం, అల్లాహ్  పై నమ్మకముపై దెబ్బకొట్టింది. ఇలా (గీత గీయబడిన) రెండిట్లో లోపం కలుగ జేసింది అనడంలో ఏలాంటి సందేహం లేదు. ఆ తరువాత ఈ కారణంగా అతని మనస్సు బలహీనత, పిరికితనం, సృష్టిరాసులతో భయం ఎలా చోటు చేసుకుంటుందో అడుగకు. నిరాధారమైన వాటిని ఆధారంగా నమ్మి, అల్లాహ్  వైపు లగ్నం కాకుండా దూరమవుతాడు. ఇదంతయు ఏకత్వ విశ్వాస బలహీనత, అవనమ్మకము, షిర్క్ వాటి మార్గాల అనుసరణ, బుద్ధిని చెడగొట్టే దురాచారాల వలన కలుగుతుంది. 

రెండవది: అతడు ఆ ప్రభావాన్ని స్వీకరించడు. కాని అది తన ప్రభావాన్ని చూపి బాధ, చింతకు గురి చేస్తుంది. ఇది చూడడానికి మొదటిదానికంటే చిన్నది అయినా, అది చెడు, మానవునికి నష్టం. అతని మనస్సు బలహీనతకు కారణం మరియు అల్లాహ్  పై ఉండే నమ్మకంలో కూడా బలహీనత వస్తుంది. ఒకప్పుడు ఏదైనా ఇష్టములేని సంఘటన జరిగితే అది ఈ కారణంగానే అని భావిస్తాడు. అపశకునం పై అతని నమ్మకం మరీ రెట్టింపవుతుంది. ఒకప్పుడు పైన వివరించిన భాగంలో చేరే భయం కూడా ఉంటుంది. 

అపశకునమును ఇస్లాం అసహ్యించుకునేదీ, దాన్ని పాటించేవారిని హెచ్చరించేదీ, అది ఏకత్వ విశ్వాసం మరియు అల్లాహ్ పై నమ్మకమును ఎలా వ్యెతిరేకమో పైవివరణ ద్వారా మీకు తెలియవచ్చు. ఇలాంటిది ఎవరికైనా సంభవించి, స్వభావికమైన ప్రభావాలు అతని పై తమ ప్రభావాన్ని చూపుతే తను వాటిని దూరము చేయుటకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అల్లాహ్ తో సహాయము కోరాలి. ఆ చెడు అతని నుండి దూరము కావాలంటే, ఏ విధంగా కూడా దాని వైపునకు మ్రొగ్గు చూప కూడదు. 

29వ అధ్యాయం: జ్యోతిష్యశాస్త్రం

బుఖారిలో ఖతాద కథనం: అల్లాహ్  నక్షత్రాలను మూడు ఉద్దేశాలతో పుట్టించాడు. (1). ఆకాశ అలంకారానికి. (2) షైతానులను తరిమి కొట్టడానికి. (3). మార్గం పొందడానికి సంకేతాలుగా. ఇవి గాక వేరే భావించేవాడు తప్పులో పడి, తన భాగ్యాన్ని కోలిపోతాడు. తనకు తెలియనిదానిలో అడుగుపెట్టిన వాడవుతాడు. 

చంద్రుని దశల విద్యను నేర్చుకొనుట ‘ఖతాద’ ఇష్టపడలేదు. ‘ఇబ్ను ఉయయన’ దీని అనుమతి ఇవ్వలేదు. ఈ రెండు రివాయతులను ‘హర్బ్’ ఉల్లేఖించారు. 

ఇమాం అహ్మద్ మరియు ఇస్హాఖ్ అది నేర్చుకొనుట యోగ్యమే అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ మూసా రజియల్లాహు అను ఉల్లేఖించారు: “ముగ్గురు మనుషులు స్వర్గంలో ప్రవేశించరు. (1). మత్తు సేవించుటకు బానిస అయినవాడు. (2). రక్త సంబంధాలను తెంచువాడు. (3). ఇంద్రజాలాన్ని సత్యం అని నమ్మేవాడు. (అహ్మద్). 

ముఖ్యాంశాలు: 

1. నక్షత్రాల సృష్టిలో ఉన్న ఔచిత్యం. 

2. అవి తప్ప వేరే భావంతో ఉన్నవాడు తప్పులో ఉన్నాడు. 

3. చంద్రుని దశల విద్య నేర్చుకునే విషయంలో ఉన్న భిన్నాభిప్రాయం. (విషయం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే బిన్నాభిప్రాయం దూరమవుతుంది. అదేమనగ: ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకొనుటకు ఆ విద్య నేర్చుకొనుట హరాం. ఎందుకనగా అది అల్లాహ్  తప్ప మరెవ్వరికి తెలియదు. కాని తేది, సంవత్సరాలు లాంటి విషయాలు తెలుసుకొనుటకు విద్య నేర్చుకోవచ్చు). 

4. ఇంద్రజాలం మిథ్యం, తప్పు అని తెలిసి కూడా ఆ విషయాల్ని సత్యం అని నమ్మిన వారికి హెచ్చరించడమైనది. 

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

జ్యోతిష్యశాస్త్రం రెండు రకాలు: 

ఒకటి: “ఇల్మె తాసీర్” అంటారు. ఇందులో భూలోకములో సంభవించునవి ఖగోళ పరిస్థితులను బట్టి యున్నాయి అనుట. ఇది నిషిద్ధం. ఇంకా అగోచర జ్ఞానంలో అద్వితీయుడైన అల్లాహ్ తో పొత్తు కలసిన ఆరోపణ చేసినట్లు. లేక ఆరోపణ చేసినవాణ్ణి సత్యపరచినట్లగును. ఇందులో తుచ్ఛమైన ఆరోపణలు, అల్లాహ్ యేతరుల పై మనస్సు లగ్నం కావడం, బుద్ధిజ్ఞానాన్ని చెడగొట్టే విషయాలు ఉన్నవి గనుక తౌహీదు కు విరుద్ధం. ఎందుకనగా తుఛ్ఛమైన మార్గాలను అనుసరించుట. వాటిని నమ్ముట వలన ధర్మము. జ్ఞానము రెండూ పాడవుతాయి. 

రెండవది: “ఇల్మె తైసీర్“: సూర్యచంద్రలు, నక్షత్రాలతో ఖిబ్లా, సమయాలు, దిశలు తెలుసుకొనుట. ఇందులో ఎలాంటి అభ్యంతరము లేదు. ఇందులో అనేకము లాభదాయకమైనవి. ప్రార్థనాసమయాలు, దిశలు తెలుసుకొనుటకు వాటిని ఉపయోగించాలని ఇస్లాం ప్రోత్సహించింది. ధర్మం నిషేధించినది, నివారించినది ఏమిటో, యోగ్యపరచినది, లేక విధి అని తెలిపినది ఏమీటో, రెంటిలోని వ్యత్యాసమును బాగుగా తెలుసుకొనుట చాలా అవసరం. మొదటిది తౌహీదకు విరుద్ధం. రెండవది విరుద్ధం కాదు. 

30 వ అధ్యాయం: నక్షత్రబలంతో వర్షం కురిసింది అని నమ్ముట

అల్లాహ్ ఆదేశం:

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
“అల్లాహ్ మీకొసంగిన ఉపాధిని (వర్షాన్ని) ఆయన్ని తిరస్కరించుటకు ఉపయోగిస్తున్నారా?” (వాఖిఅ 56:82).

అబూ మాలిక్ అష్ అరి (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:

నా అనుచర సంఘంలోనివారు జాహిలియ్యత్ (అజ్ఞాన కాలాని)కి సంబంధించిన నాలుగు విషయాలను విడనాడరు.

 • (1) వంశంపై గర్వపడుట.
 • (2) ఇతర వంశాలను దూషించుట.
 • (3) నక్షత్రాల ప్రభావంతో వర్షం కురుస్తుందని తారాబలాన్ని నమ్ముట.
 • (4) శోకము చేయుట“.

ఇంకా ఇలా చెప్పారు: “శోకము చేయు స్త్రీ తౌబాచేయకుండా చనిపోతే ప్రళయదినాన లేపబడినప్పుడు ఆమెపై తార్ కోల్ (Tar coal) పైజామా, చిడుము (ఖారిష్) వ్యాధికి గురి చేసే కవచము ఉండును“.

జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహ్నీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: హుదైబియ ప్రాంతములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు ఫజర్ నమాజ్ చదివించారు. ఆ గడిచిన రాత్రి వర్షం కురిసింది. నమాజ్ అయిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల వైపు తిరిగి “మీ ప్రభువు ఏం సెలవిచ్చాడో మీకు తెలుసా?” అని అడిగారు. ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకు తెలియదు’ అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అల్లాహ్ ఇలా చెప్పాడని తెలిపారు: “ఈ రోజు ఉదయం నా దాసుల్లో  కొందరు విశ్వాసులయిపోయారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ దయ వల్ల మనకు వర్షం కురిసింది” అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు”. (బుఖారి, ముస్లిం).

ఇలాంటి హదీసు ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) కూడా ఉల్లేఖించారు. అందులో ఇంకా ఈ విషయం ఉంది. అందులో కొందరున్నారు: ఫలాన, ఫలాన నక్షత్ర (ప్రభావం) నిజమయింది (అందుకే వర్షం కురిసింది). అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులు అవతరింపజేసాడు;

فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ  وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ فِي كِتَابٍ مَّكْنُونٍ لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

“నక్షత్రాల స్థానాలు సాక్షిగా చెబుతున్నాను: మీరు తెలుసుకుంటే, ఇది చాలా పెద్ద ప్రమాణం: ఇది ఒక మహోన్నతమైన ఖురాన్; ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవరూ తాకలేరు. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపజేసినటు వంటిది. అయినా మీరు ఈ వాణిని తేలిక విషయంగా తీసుకుంటారా? అల్లాహ్ మీకొసంగిన ఉపాధిని, ఆయన్ని తిరస్కరించుటకు ఉపయోగిస్తు న్నారా?” (వాఖిఅ 56: 75-82).

ముఖ్యాంశాలు:

1. సూరె వాఖిల ఆయతు యొక్క భావం.
2. జాహిలియ్యత్ (అజ్ఞాన కాలం)కు సంబంధించిన నాలుగు విషయాల ప్రస్తావన.
3. అందులో కొన్ని అవిశ్వాసం, తిరస్కారమునకు సంబంధించినవి.
4. తిరస్కారంలో కొన్ని రకాలు ధర్మభ్రష్టతకు కారణము కావు.
5.”నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసించువారు, మరికొందరు నన్ను తిరస్కరించువారయ్యారు” అన్నది అల్లాహ్ కారుణ్యమైన వర్షం కురిసినప్పటి సంగతి.
6. ఇక్కడ విశ్వాసం యొక్క వాస్తవికతను గమనించాలి. (అల్లాహ్ కరుణ, దయ వలన అని చెబితే విశ్వాసం).
7. అవిశ్వాసం యొక్క వాస్తవికతనూ గమనించాలి. (ఫలాన, ఫలాన నక్షత్ర ప్రభావం అని చెప్పితే అది అవిశ్వాసం).
8. నక్షత్రం నిజమయింది అనుట కూడా అవిశ్వాసం గనుక దానిని గమనించాలి.
9. శిష్యులకు విషయం బాగుగా అర్థం కావడానికి ప్రశ్నించి మరీ జవాబు చెప్పాలి అని “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అన్న వాక్యంలో తెలుస్తుంది.
10. శోకము చేసేవారికి ప్రళయము నుండే శిక్ష మొదలవుతుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

అనుగ్రహించువాడు, కష్టాలు తొలగించువాడు అల్లాహ్ మాత్రమేనని మనసా వాచా విశ్వసించి, వాటిని ఆయన విధేయత కొరకే ఉపయోగించుట తౌహీద్ అయినప్పుడు, “ఫలాన నక్షత్రం వలన వర్షం కురిసింది” అనుట ఆ తౌహీద్ విశ్వాసానికి చాలా విరుద్ధం. వర్షమూ, ఇతర వరాలు అల్లాహ్ యే ఇచ్చువాడనుట తప్పనిసరి. ఆయనే వాటిని తన దాసులకు ప్రసాదించాడు కనుక.

వర్షం కురువటానికి నక్షత్రాలు ఏ విధంగానూ కారణం కాజాలవు. అల్లాహ్ యొక్క దయ, కరుణా కటాక్షముల వలన, మానవుల అవసరము, వారు తమ వాజ్మూలిక, స్థితి భాషలో తమ ప్రభువుతో వేడుకొనుట ద్వారా అల్లాహ్ వారి అవసరాలను బట్టి తన వివేకము, కరుణతో వర్షం కురిపిస్తాడు.

మానవుడు తనపై, సర్వ సృష్టిపై ఉన్న అల్లాహ్ యొక్క బాహ్యాంతర సర్వ వరాలను విశ్వసించనంత వరకు అతని తౌహీద్ సంపూర్ణం కాదు. అనుగ్రహాలన్నిటిని అల్లాహ్ కు అంకితం చేయాలి. ఆయన్ను ఆరాధిస్తున్నప్పుడు, స్మరిస్తున్నప్పుడు, కృతజ్ఞత తెలుపుతున్నప్పుడు వాటి సహాయము, ఆధారము తీసుకోవాలి.

ఇలాంటి సందర్భములలోనే తౌహీద్ వాస్తవికత తెలుస్తుంది. దీనితోనే విశ్వాసం యొక్క పరిపూర్ణత మరియు కొరతా తెలుస్తుంది.

31వ అధ్యాయం: ఇతరులను అల్లాహ్ కు సమానులుగా చేసుకొని, అల్లాహ్ ను ప్రేమించునట్లు వారిని ప్రేమించుట

అల్లాహ్ ఆదేశం: 

وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ
ప్రజలలో కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. (2: బఖర: 165). 

మరో ఆదేశం: 

قُلْ إِن كَانَ ءَابَآؤُكُمْ وَأَبْنَآؤُكُمْ وَإِخْوَٰنُكُمْ وَأَزْوَٰجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَٰلٌ ٱقْتَرَفْتُمُوهَا وَتِجَـٰرَةٌۭ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَـٰكِنُ تَرْضَوْنَهَآ أَحَبَّ إِلَيْكُم مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ وَجِهَادٍۢ فِى سَبِيلِهِۦ فَتَرَبَّصُوا۟ حَتَّىٰ يَأْتِىَ ٱللَّهُ بِأَمْرِهِۦ ۗ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْفَـٰسِقِينَ ٢٤

ప్రవక్త ﷺ ఇలా చెప్పండి: ఒక వేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీ ఆప్తులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లాహ్ కంటే ఆయన ప్రవక్త కంటే ఆయన మార్గంలో శ్రమించటం (జిహాద్) కంటే మీకు ఎక్కువ ప్రియతరమైతే, అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి. అల్లాహ్ దోషులకు మార్గం చూపడు. (9: తౌబా: 24). 

అనసు రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

“మీలో నెవరి దృష్టిలోనైనా, నేను అతని కుమారుని కన్నా, అతని తండ్రి కన్నా మరియు ప్రజలందరికన్నా, అధికంగా ప్రేమ పాత్రుణ్ణి కానంతవరకు మీలో ఎవడూ నిజమయిన విశ్వాసి కాలేడు”. (బుఖారి: 15, ముస్లిం: 70). 

అనసు ఉల్లేఖనలో ప్రవక్త ﷺ  చెప్పారు:

ఈ క్రింది మూడు లక్షణాలు కలిగి ఉన్నవాడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. 1) అందరికంటే ఎక్కువ అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను అభిమానించడం. 2) ఎవరిని ప్రేమించినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించడం. 3) (నరక) అగ్నిలో పడటానికి ఎంతగా అసహ్యించుకుంటాడో, అవిశ్వాస స్థితి వైపునకు మరలిపోవడానికి కూడా అంతగా అసహ్యించుకోవడం”. (బుఖారీ, ముస్లిం). 

మరో ఉల్లేఖనలో ఉంది:

“అందరికంటే ఎక్కువ అల్లాహ్ ను , అల్లాహ్ ప్రవక్తను అభిమానించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించడు”. 

అబ్ధుల్లాహ్ బిన్ అబ్బాసు రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“ఎవరైనా ఒకరితో ప్రేమ, ద్వేషము, స్నేహము, శతృత్వమూ అల్లాహ్ కొరకే కలిగి యుంటాడో, అల్లాహ్ యొక్క స్నేహం, సహాయం వీటి ద్వారానే లభిస్తుందని అతను తెలుసుకోవాలి. ఎవరు కూడా ఎంత గొప్ప నమాజు, రోజాలు పాటించేవాడైనా ఇవి లేకుండా విశ్వాస మాధుర్యాన్ని పొందలేడు. సామాన్య ప్రజల ప్రేమ, సోదర సంబంధాలు ఐహికంగా పరిమితమైనవి. ఇలాంటి ఉద్దేశం వారికి ఏ మాత్రం లాభం చేకూర్చదు”. (ఇబ్ను జరీర్). 

ఇబ్ను అబ్బాసు రజియల్లాహు అన్హు సూరె బఖర యొక్క ఈ 166వవాక్యం: “వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి“. ను వ్యాఖ్యానిస్తూ “అస్బాబ్” అంటే “ప్రేమ, (స్నేహం), సంబంధాలు” అని చెప్పారు. 

తెలుగుఇస్లాం.నెట్ గమనిక: పై వాక్యం అర్ధం కావడానికి సూరె బఖర యొక్క ఈ 165, 166వ ఆయతులు క్రింద గమనించండి:

2:165  وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ

కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు.సర్వశక్తులూ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్‌ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్‌ పాపానికి ఒడిగట్టరు).

2:166  إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ

ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.

ముఖ్యాంశాలు:

 • 1. సూరె బఖరలోని వాక్యం యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (బహుదైవారాధకులకు అల్లాహ్ యేతరులతో ఉన్న ప్రేమ యొక్క ప్రస్తావన అందులో ఉంది).
 • 2. సూరె తౌబాలొ ఉన్న వాక్యం యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (అందులో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు బదులు ఇతరుల పట్ల ప్రేమ ఫలితం తెలుపబడింది). 
 • 3. ప్రవక్తపై ప్రేమ తమ ఆత్మ, సంతానం, ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా ఉండాలి.
 • 4. కొన్ని సందర్భాల్లో విశ్వాసి కాడు అని అంటే మత భ్రష్టుడయ్యాడు అన్న భావం కాదు. 
 • 5. విశ్వాసంలో మాధుర్యం అనేది ఉంది. కాని మానవుడు ఒక్కొక్కప్పుడు దాన్ని ఆస్వాదిస్తాడు, ఒకప్పుడు ఆస్వాదించడు. 
 • 6. ఆత్మసంబంధమైన నాలుగు విషయాలున్నవి, అవి లేకుండా మానవుడు అల్లాహ్ స్నేహం, ఆయన వద్ద స్థానమూ పొందలేడు. అవి లేకుండా విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించలేడు. 
 • 7. సామాన్య ప్రజల ప్రేమ, సోదరత్వం ఐహికంగా ఉందని ప్రవక్త అనుచరులు (సహాబా) కొన్ని పరిస్థితులను బట్టి తెలుసుకున్నారు. 
 • 8. సూరె బఖర 166వ ఆయతు యొక్క వ్యాఖ్యానం కూడా తెలిసింది. 
 • 9. కొందరు బహుదైవారాధకులు కూడా అల్లాహ్ తో చాలా ప్రేమ చూపే వారుంటారు. 
 • 10. సూరె తౌబాలో వచ్చిన ఎనిమిది వస్తువుల ప్రేమ, ఎవరికైతే తన ధర్మం కంటే ఎక్కువ ప్రియమైనవో వారికి శిక్షవార్త ఇవ్వబడింది. 
 • 11. ఎవరు అల్లాహ్ తో పాటు ఒక్క బాగస్వామిని నిర్ణయించుకొని, అల్లాహ్ తో ఉండవలసిన ప్రేమ వారితో కలిగియుంటే అతను పెద్ద షిర్క్ చే సినవాడవుతాడు. 

తాత్పర్యం: 

తౌహీద్ యొక్క మూలం, ప్రాణం “ప్రేమ కేవలం ఒకే ఒక అల్లాహ్ కు అంకితం చేయుట”. అదే ఆరాధన, ప్రార్థన యొక్క మూలం. ఇంకా చెప్పాలంటే అదే వాస్తవమైన ఆరాధన. మానవుని ప్రేమ తన ప్రభువుతో సంపూర్ణం కానంత వరకు, ఆ ప్రేమను అన్ని రకాల ప్రేమల పై ఆధిక్యత పొందనంత వరకు అతని తౌహీద్ సంపూర్ణం కాదు. అల్లాహ్ ప్రేమకే ఆధిక్యత ఇచ్చి, ఇతర ప్రేమలన్నిటిని దానికనుగుణంగా ఉంచాలి. ఇందులోనే సత్ఫలితము, మేలు ఉన్నాయి. 

ఇందులోని ఒక భాగం, భాగమే కాదు దాని పరిపూర్ణత “అల్ హుబ్బు ఫిల్లాహ్ (అల్లాహ్ కొరకు ప్రేమించుట)లో ఉంది. అల్లాహ్ ఏ కార్యాలను, ఎవరెవరిని ప్రేమిస్తాడో మానవుడు వాటన్నిటిని ప్రేమించాలి. అల్లాహ్ కార్యాలను, ఎవరెవరిని ప్రేమించడో వారిని ప్రేమించకుండా ఉండాలి. అల్లాహ్ స్నేహితులతో స్నేహంగా, శత్రువులతో శతృత్వంగా మెలగాలి. ఈ విధంగా మానవుని ఏకత్వ విశ్వాసం సంపూర్ణమవుతుంది. 

ఇతరులను అల్లాహ్ కు సమానులుగా చేసుకొని, అల్లాహ్ ను ప్రేమించునట్లు వారిని ప్రేమించుట, వారి విధేయతను అల్లాహ్ విధేయత పై ఆధిక్యం ఇచ్చుట, మరవకుండా ఎల్లప్పుడూ వారిని స్మరించుట, ప్రస్తావించట, వారితో దుఆ చేయుట ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్). అల్లాహ్ వారిని క్షమించడు. అతను తన మనస్సును మహాశక్తిమంతుడు, సకల స్తోత్రాలకు తగినవానితో దూరము చేసి, ఏ శక్తిసామర్థ్యం లేని వాని వైపు లగ్నం చేశాడు. బహుదైవారాధకులు పట్టుకున్న దుర్భలమైన సాధనం, సంబంధం ప్రళయమున పనికి రాదు. తెగిపోతుంది. ఈ (బూటకపు ప్రేమ అక్కడ ద్వేషం, శతృత్వంలో మారిపోతుంది. 

ప్రేమ మూడు రకాలుగా ఉంటుందన్నది కూడ తెలుసుకోండి! 

1. అల్లాహ్ యొక్క ప్రేమ. ఇదే ఏకత్వం, విశ్వాసం యొక్క మూలం. 

2. అల్లాహ్ కొరకు ప్రేమ. ప్రవక్తల, వారి అనుచరుల పట్ల ప్రేమ. ఇంకా అల్లాహ్ ప్రేమించు కార్యాలు, కాలాలు, స్థలాలు వగైరాల ప్రేమ. ఇది అల్లాహ్ ప్రేమకు అనుగుణంగా ఉంటుంది. దాన్ని సంపూర్ణం చేస్తుంది. 

3. అల్లాహ్ తో ప్రేమ. ఇది బహుదైవారాధకుల్లో ఉంటుంది. వారు అల్లాహ్ తో పాటు, అల్లాహ్ కు సమానంగా నిలబెట్టుకున్న వారిని, చెట్లు, రాళ్ళు, మానవులు, దైవదూతల్లో నియమించుకున్న వారి బూటకపు దేవతలను ప్రేమిస్తారు. ఇది అసలైన షిర్క్ (బహుదైవారాధన). 

నాలుగో రకం కూడా ఉంది. అది స్వాభావికమైన ప్రేమ. అది తినుత్రాగు వస్తువుల్లో, సంభోగంలో, దుస్తుల్లో, తమ భార్య/భర్తతో సత్సంబంధము కలిగి ఉండడంలో, మానవునికి నచ్చిన, ఇష్టమున్న దాన్ని ప్రేమిస్తాడు. వీటిని ఇస్లామియ పరిభాషలో “ముబాహ” అనవచ్చు. అవి అల్లాహ్ యొక్క ప్రేమ, ఆయన విధేయతకు సహాయపడితే ఇబాదత్ (ప్రార్థన)లో లెక్కించబడుతాయి. ఒక వేళ దానికి అడ్డుపడితే, అల్లాహ్ ప్రేమించని వాటి వైపుకు తీసుకెళ్తే నివారించబడిన వాటిలో లెక్కించబడుతాయి. లేకుంటే అవి “ముబాహా “గానే ఉంటాయి. (నిజం అల్లాహ్ కే తెలుసు). 

32వ అధ్యాయం: కేవలం అల్లాహ్ తో భయపడండి

إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيْطَـٰنُ يُخَوِّفُ أَوْلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ ١٧٥
వాస్తవానికి తన మిత్రులను గురించి ఊరకే మిమ్మల్ని భయపెట్టింది షైతానేనని ఇప్పుడు మీరు గ్రహించే ఉంటారు. కనుక మీరు నిజమైన విశ్వాసులే అయితే, ఇకముందు మానవులకు భయపడకండి, నాకు భయపడండి. (3: ఆలె ఇమ్రాన్: 175). 

إِنَّمَا يَعْمُرُ مَسَـٰجِدَ ٱللَّهِ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمْ يَخْشَ إِلَّا ٱللَّهَ ۖ فَعَسَىٰٓ أُو۟لَـٰٓئِكَ أَن يَكُونُوا۟ مِنَ ٱلْمُهْتَدِينَ ١٨
‘అల్లాహ్ ను , అంతిమ దినాన్ని విశ్వసించి, నమాజును స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవరికి భయబడనివారు మాత్రమే అల్లాహ్ మసీదులకు సంరక్షకులూ, సేవకులూ కాగలుగుతారు. వారు సరియైన మార్గంలో నడుస్తారని ఆశించవచ్చు. (9: తౌబా: 18). 

وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِىَ فِى ٱللَّهِ جَعَلَ فِتْنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِ
ప్రజలలో, “మేము అల్లాహ్ ను  విశ్వసించాము” అని అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, కాని అతడు అల్లాహ్ మార్గంలో హింసించబడినప్పుడు, లోకులు పెట్టిన పరీక్షను అల్లాహ్ విధించిన శిక్షగా భావిస్తాడు. (29: అన్కబూత్ : 10), 

అబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖించారు. ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ఉపదేశించారు: 

విశ్వాస బలహీనత, అపనమ్మకానికి చిహ్నాలు ఇవి: ప్రజల్ని సంతోష పరచడానికి నీవు అల్లాహ్ కు కోపం వచ్చినట్లు చేయుట, అల్లాహ్ ప్రసాదించిన ఆహారానికి బదులుగా ప్రజలకు కృతజ్ఞత తెలుపుట, వారిని పొగడుట. నొసంగని దానిపై ప్రజల్ని దూషించుట. అల్లాహ్ యొక్క ఆహారమును ఏ లోభి యొక్క లోభము తీసుకోలేదు. ఎవరి అయిష్టము దాన్ని ఆపలేదు“. (బ్రహఖి). 

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు: 

ఎవరు అల్లాహ్ ను  సంతోష పరచడానికి ప్రజల కోపాన్ని సహిస్తారో, అల్లాహ్ అతనితో సంతోషించి, ప్రజలు కూడ అతనితో సంతోషపడునట్లు చేస్తాడు. ఎవరు అల్లాహ్ ను  అసంతృప్తి పరచి ప్రజల్ని సంతోష పరుస్తాడో, అల్లాహ్ అతనితో అసంతృప్తి చెంది. ప్రజలు కూడ అతనితో అసంతృప్తి చెందినట్లు చేస్తాడు“. (ఇబ్నుహిబ్బాన్ ). 

ముఖ్యాంశాలు: 

 • 1. సూరె ఆలె ఇమ్రాన్ లోని ఆయతు యొక్క వ్యాఖ్యానం. (అందులో కేవలం అల్లాహ్ తో భయపడాలని బోధించబడింది). 
 • 2. సూరె తౌబా లోని ఆయతు యొక్క వ్యాఖ్యానం. 
 • 3. సూరె అన్ కబూత్ లోని ఆయతు యొక్క వ్యాఖ్యానం. 
 • 4. విశ్వాసం, నమ్మకం ఒకప్పుడు బలముగా ఉంటే, మరొకప్పుడు బలహీనమవుతుంది. 
 • 5. అది బలహీనమయినదనుటకు మూడు గుర్తులు. (అబూ సఈద్ ఖుద్రి హదీసులో తెలుపబడినవి). 
 • 6. కేవలం అల్లాహ్ తో భయపడుట కూడా ఇస్లామీయ విధుల్లో ఒక విధి.
 • 7. దానిని వదలినవానికి శిక్ష ప్రస్తావన ఉంది. 
 • 8. దానిని అనుసరించినవాని ప్రతిఫల ప్రస్తావన ఉంది.

33 వ అధ్యాయం: “మీరు విశ్వాసులైతే కేవలం అల్లాహ్ పై నమ్మకం ఉంచండి”

إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లాహ్ ఆయతులు పారాయణం చేయబడి నప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభువు పట్ల నమ్మకం కలిగివుంటారు.” (అన్ ఫాల్ 8:2)

 وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ

అల్లాహ్ ను నమ్ముకున్నవానికి  అల్లాహ్ యే చాలు.” (తలాఖ్ 65:3).

ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మాకు అల్లాహ్ చాలు. ఆయనే శ్రేష్టుడైన కార్యసాధకుడు“. అని ఇబ్రాహీం (అలైహిస్సలాం) అగ్నిలో వేయబడినప్పుడు అన్నారు.

అలాగే (ఉహద్ యుద్ధం తరువాత) ప్రజలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి “మీకు వ్యతిరేకంగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి, వాటికి భయపడండి” అని అన్నప్పుడు, దానిని విని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా “మాకు అల్లాహ్ చాలు, ఆయనే శ్రేష్టుడైన కార్యసాధకుడు” అన్నారు. అందుచేత ప్రవక్త అనుచరులలో విశ్వాసము పెరిగినది.

ముఖ్యాంశాలు:

1. విధుల్లో తవక్కుల్ కూడా ఒకటి..
2. అది విశ్వా స నిబంధనలలో ఒకటి.
3. సూరె అన్ ఫాల్ లోని ఆయత్ యొక్క వాఖ్యానం.
4. అదే ఆయతు చివరిలో ఇవ్వబడిన బోధ.
5. సూరె తలాఖ్ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
6. “మాకు అల్లాహ్ చాలు…….” వచనముల యొక్క ప్రాముఖ్యత వివరించ బడింది. కష్టకాలాల్లో ఇబ్రాహీం మరియు ముహమ్మద్ ప్రవక్తలు దీనిని చదివారు.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

అల్లాహ్ పై నమ్మకం తౌహీద్, విశ్వాసం యొక్క విధుల్లో చాలా ముఖ్య మైనది. నమ్మకం ఎంత ఎక్కువగా ఉండునో అంతే విశ్వాస బలం పెరుగును. తౌహీద్ సంపూర్ణం అగును. మానవుడు తన ఐహిక, ధార్మిక సంబంధమైన ఏ కార్యం చేయాలనుకున్నా, వదులు కోవాలనుకున్నా అల్లాహ్ పై నమ్మకం, ఆయన సహాయం కోరుట తప్పనిసరి. అది తప్ప వేరే మార్గం లేదు.

అల్లాహ్ పై నమ్మకం యొక్క వాస్తవికత: ఏ పని అయినా అది అల్లాహ్ తరుపునే అవుతుంది అని మానవుడు తెలుసుకోవాలి. అల్లాహ్ కోరునది అగును. కోరనిది కాదు. ఆయనే లాభనష్టాలు చేకూర్చేవాడు. ప్రసాదించువాడు, ప్రసాదమును ఆపుకునేవాడు. పుణ్యం చేయు శక్తి, పాపం నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ తప్ప మరెవ్వరూ ప్రసాదించలేరు అని తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకున్న తరువాత ఐహిక, ధార్మిక లాభాలు పొందుటకు, కష్టాలు తొలిగిపోవుటకు తన మనస్సులో ఆయనపై మాత్రమే ఆధారపడాలి. తను కోరునది పొందుటకు సంపూర్ణంగా అల్లాహ్ పై ఆధారపడాలి. దానితో పాటు తన శక్తి కొలది కృషి చేయాలి, వాటి సాధనాలను ఉపయోగించాలి.

ఏ మానవుడు, పైన తెలిపిన విషయాన్ని తెలుసుకొని, ఆ ప్రకారంగా అల్లాహ్ పై ఆధారం, నమ్మకం ఉంచుతాడో అతడు ఈ శుభవార్త తెలుసుకోవాలి: అలాంటివారికి అల్లాహ్ యే చాలు. వారి కొరకు అల్లాహ్ చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అల్లాహ్ యేతరులతో సంబంధం, నమ్మకం ఉంచినవాడు, వారిపై ఆధారపడేవాడు ముష్రిక్  అవుతాడు. అతని ఆశలన్నియు వృధా అవుతాయి.

34వ అధ్యాయం: అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందడం, అల్లాహ్ ఎత్తుగడపట్ల నిర్భయంగా ఉండటం గురించి

أَفَأَمِنُوا۟ مَكْرَ ٱللَّهِ ۚ فَلَا يَأْمَنُ مَكْرَ ٱللَّهِ إِلَّا ٱلْقَوْمُ ٱلْخَـٰسِرُونَ
ఏమిటీ, ఈ ప్రజలు అల్లాహ్ యుక్తి అంటే నిర్భయంగా ఉన్నారా? వాస్తవానికి నాశనం కాబోయే జాతి మాత్రమే అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉంటుంది.” (7: ఆరాఫ్ : 99). 

وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِۦٓ إِلَّا ٱلضَّآلُّونَ
తమ ప్రభువు కారుణ్యం పట్ల, మార్గం తప్పినవారు మాత్రమే నిరాశ పడతారు“. (15: హిజ్ర్ : 56). 

ఇబ్ను అబ్బాసు ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త ﷺ ను ఘోరమైన పాపాల గురించి ప్రశ్నించబడినప్పుడు ఇలా చెప్పారు: 

అల్లాహ్ తో షిర్క్ చేయుట. (ఇతరులను సాటి కల్పించుట). అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందుట. అల్లాహ్ యుక్తితో నిర్భయంగా ఉండుట“. (తబ్రాని, మజ్మఉ జ్జవాఇద్: 1/104). 

ఇబ్ను మస్ ఊద్ చెప్పారు: అతిఘోరమైన పాపాలు ఇవి: అల్లాహ్ తో షిర్క్ చేయుట. అల్లాహ్ యుక్తితో నిర్భయంగా ఉండుట. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుట. అల్లాహ్ దయ పట్ల ఆశను వదులుకొనుట“. (ముసన్నఫు అబ్దిర్ రజాఖ్: 10/459. తబ్రాని ఫిల్ కబీర్ : 8783, 8784). 

ముఖ్యాంశాలు: 

 • 1. సూరె ఆరాఫ్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. (అందులో అల్లాహ్ ఎత్తుగడ నుండి నిర్భయంగా ఉండేవారి ప్రస్తావన ఉంది). 
 • 2. సూరె హిజ్ర్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. 
 • 3. అల్లాహ్ ఎత్తుగడ పట్ల నిర్భయంగా ఉండే వారికి కఠిన హెచ్చరిక ఇవ్వబడింది. 
 • 4. నిరాశ చెందేవారికి కూడా కఠిన హెచ్చరిక ఇవ్వబడింది. 

తాత్పర్యం

ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం: మానవుడు అల్లాహ్ కి భయపడుట, ఆయన పై ఆశ ఉంచుట చాలా ముఖ్యం. తన పాపాలను మరియు అల్లాహ్ న్యాయాన్ని, ఆయన కఠిన శిక్షను చూసి భయపడాలి. అల్లాహ్ యొక్క సామాన్య, ప్రత్యేక దయను, విశాలమైన క్షమాపణ చూసి ఆశించాలి. కొన్ని ఉదాహరణలు: పుణ్య కార్యం చేయుటకు భాగ్యం కలిగితే దాన్ని అల్లాహ్ స్వీకరించాలని ఆశిస్తూ, అందులో ఏదైనా లోపం వలన ఆ పుణ్య కార్యం రద్దు చేయబడుతుందేమోనని భయపడాలి. 

ఏదైనా పాపం జరిగిన తరువాత తౌబా చేస్తూ, అది స్వీకరించబడాలని, ఆ పాపం మన్నించబడాలని ఆశిస్తూ, తౌబాలో ఏదైనా కొరత వలన, పాపం వైపున మ్రొగ్గినందుకు శిక్షకు గురి కావలసి వస్తుందేమోనని భయపడాలి. అనుగ్రహం, సౌలభ్యం వరించినప్పుడు అవి రెట్టింపు కావాలని, దీర్ఘకాలం ఉండాలని, దాని కృతజ్ఞత తెలుపుకునే భాగ్యం కలగాలని ఆశించాలి. కృతజ్ఞతలో లోపం వలన అవి నశిస్తాయని భయం చెందాలి. 

బాధకరమైన సందర్భాల్లో అవి తొలిగిపోవాలని, సుఖం లభించాలని, వాటి పై సహనం వహిస్తూ అల్లాహ్ దానికి బదులుగా సత్ఫలితం ప్రసాదించాలని ఆశించాలి. సహనం వహించకున్నట్లయితే పుణ్యం వ్యర్థమయి, బాధకరమైన సంఘటనలు సంభవించి ఈ రెండూ ఒకేసారి ఏకమవుతాయేమోనని భయపడాలి. 

భయం, ఆశ సంపూర్ణ విశ్వాసికి సర్వ పరిస్థితులలో తోడుగా ఉంటాయి. ఇవి తప్పనిసరి మరియు లాభదాయకమైనవి కూడాను. దీనితోనే సాఫల్యం ప్రాప్తమవుతుంది. 

మానవుని పట్ల రెండు దుష్ప్రవర్తనల భయం చాలా ఉంటుంది. 

 • 1) భయానికి గురై అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందుతాడు. 
 • 2) ఆశలు అధికమై అల్లాహ్ శిక్షను మరచిపోతాడు, ఎత్తుగడ పట్ల నిర్భయంగా ఉంటాడు. ఇలా ఈ రెండింటిలో మితిమీరడం వలన, భయం, ఆశ యొక్క విధిని, తౌహీద్ యొక్క ముఖ్య అంశాన్ని కోల్పోవలసి వస్తుంది.

అల్లాహ్ కారుణ్యం పట్ల రెండు కారణాల వల్ల నిరాశచెందుతారు.

1) మానవుడు తన ఆత్మపై అన్యాయం చేస్తూ, నిషిద్ధ కార్యాలకు పాల్పడి, కావాలని అవి చేస్తూ, వాటిని వదులుకోకుండా ఉంటాడు. అప్పుడు అల్లాహ్ కరుణ పై అతనికి ఆశ ఉండదు. ఎందుకనగా తను ఏ పాపాలకు పాల్పడ్డాడో అవి అతన్ని ఈ స్థితికి గురి చేస్తాయి. ఇక ఇదే అతని గుణంగా, ప్రవర్తనగా మారిపోతుంది. షైతాన్ మానవునితో కోరేది ఇదే. ఈ స్థితికి మానవుడు చేరుకున్నప్పుడు స్వచ్ఛమైన తౌబా చేసి (పశ్చాత్తాప పడి), ఆ స్థితి నుండి బయటికి రావాలి. 

2) తాను చేసిన దుష్కార్యాలకు చాలా భయ పడుతూ, ఆ భయంతో అల్లాహ్ కారుణ్యం విశాలమైనదనే విషయాన్ని మరచిపోతాడు, తాను తౌబా చేసినా, అల్లాహ్ వైపునకు మరలినా అల్లాహ్ క్షమించడని తన మూర్ఖత్వం వలన భావిస్తాడు. ఇలా ఆయన కరుణ పట్ల నిరాశ చెందుతాడు. ఈ నిషిద్ధమైన మరియు నష్టానికి గురి చేసే స్థితి, తన ప్రభువు విషయంలో ఉండ వలసిన జ్ఞానం లేక పోవడం. ఏ హక్కులు పాటించాలో తెలుసుకోక పోవడం. మరియు స్వయంగా తన ఆత్మ బలహీనత వలన. అతను అల్లాహ్ ను  సరియైన రీతిలో తెలుసుకొని, సోమరితనాన్ని వదలుకుంటే అతని చిన్న ప్రయత్నం వలన అల్లాహ్ యొక్క అనంత కరుణను నోచుకున్నట్లు తప్పక గమనిస్తాడు. 

అల్లాహ్ ఎత్తుగడపట్ల నిర్భయంగా ఉండుటకు కూడా వినాశానికి గురి చేసే రెండు కారణాలు గలవు:- 

1) మానవుడు ధర్మం పట్ల విముఖత చూపి, అల్లాహ్ గురించి ఏమి తెలుసుకోకుండా, అతనిపై ఆయన ఏ హక్కులు ఉన్నాయో తెలుసుకొనక యుండుట. ఇందు వల్ల అతను ఎల్లప్పుడూ విధియైన విషయాల్లో అశ్రద్ధ చూపుతూ, నిషిద్ధ కార్యాలకు పాల్పడుతాడు. చివరికి అతని హృదయంలో భయం, విశ్వాసమూ లేనట్లవుతుంది. ఎలా అనగా విశ్వాసమున్న వ్యక్తిలో అల్లాహ్ భయం, ఇహపరలోకాల శిక్ష భయం ఉంటుంది. 

2) అజ్ఞానుడు ఇబాదత్ (ఆరాధన) చేస్తూ మురిసిపోయి, తను చేసిన కర్మలపై గర్వపడుతాడు. చివరికి భయం లేని వాడవుతాడు. అల్లాహ్ వద్ద అతనికి చాలా గొప్ప స్థానం ఉందని భ్రమ పడతాడు. ఇలా అల్లాహ్ ఎత్తుగడతో నిర్భయుడవుతాడు. తన నీచమైన, బలహీనమైన మనుసుపై నమ్మకం ఉంచుతాడు. అందుకే ఇది తౌహీద్ కు వ్యతిరేకమైనది. 

35 వ అధ్యాయం: విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం

అల్లాహ్ ఆదేశం: 

“ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు” (తగాబున్‌ 64:11).

పై ఆయతులో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు అనేది “అల్‌ ఖమ” ఇలా ప్రస్తావించారు: 

“అతనిపై ఏదైనా ఆపద వస్తే, అది అల్లాహ్ తరఫు నుండి అని  అతను తెలుసుకొని, సంతోషిస్తాడు, మనఃపూర్వకంగా ఒప్పుకుంటాడు”.

అబు హురైరా (రది అల్లాహు అన్హు) కథనం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:

కుఫ్ర్ కు (సత్యతిరస్కారానికి) సంబంధించిన రెండు గుణాలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి: ఒకరి వంశపరంపరను నిందించుట. రెండవది: చనిపోయినవారిపై శోకము చేయుట”.

అబ్దుల్లా బిన్‌ మస్ ఊద్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: 

“చెంపలను బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ అజ్ఞాన కాలపు అరుపులు పలుకులు పలికేవాడు మన (సంప్రదాయము అనుసరించే) వాడుకాడు”. (బుఖారి,ముస్లిం).

అనసు (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: 

“అల్లాహ్ ఏ మానవునికి మేలు చేయగోరుతాడో, అతని పాపాలకు బదులు శిక్ష ఇహలోకంలోనే తొందరగా ఇచ్చేస్తాడు. ఏ మానవునికి మేలు చేయగోరడో, అతని పాపాలకు బదులు శిక్షను ప్రళయం వరకు వేచి ఉంచి అక్కడ ఇస్తాడు”. (తిర్మిజి).

మరో సారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: 

“పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లాహ్ ఏ సమాజం, సంఘాన్ని ప్రేమస్తాడో, దానిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు దానిని సహనంతో (సహిస్తారో), వారిని అల్లాహ్ ఇష్టపడుతాడు.ఎవరు అసహనము చూపుతారో, అల్లాహ్ వారిపై ఆగ్రహస్తాడు”. (తిర్మిజి).

ముఖ్యాంశాలు:

1. తగాబున్‌ ఆయతు యొక్క భావం.

2. సహనం అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం.

3. వంశపరంపర లోని లోపాలను ఎంచుట మంచిది కాదు.

4.చెంపలు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అజ్ఞానకాలపు పలుకులు పలికేవాని గురించి కఠినంగా హెచ్చరించబడింది.

5. అల్లాహ్ మేలు కోరిన వ్యక్తి లక్షణం తెలిసింది.

6. అల్లాహ్ మేలు కోరని వ్యక్తి లక్షణం తెలిసింది.

7. అల్లాహ్  ప్రేమించిన వ్యక్తి చిహ్నం.

8. పరీక్ష ఆపదపై అసంతృప్తి వ్యక్తం చేయుట నిషిద్ధం.

9. వాటిపై సహనం వహించుట వలన పుణ్యం లభిస్తుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఓపికతో అల్లాహ్ కు విధేయులగుట, పాపం నుండి దూరంగా ఉండి సహనం వహించుట – ఇవి రెండూ విశ్వాసంలో లెక్కించబడుతాయి. అంతే కాదు అవి దాని పునాది. దాని భాగాలే. అల్లాహ్ ప్రేమించేవాటిని, ఆయనకు ఇష్టమున్న, ఆయన సన్నిధిలో చేర్పించేవాటిని ఓపికతో (ఆచరించుట), ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండి సహనం వహించుటయే విశ్వాసం.

ఇస్లాం పునాది మూడు సూత్రాల పై ఉంది.

 1. అల్లాహ్ , ఆయన ప్రవక్త తెలిపిన వాటిని సత్యం అని నమ్ముట.
 2. అల్లాహ్ , ఆయన ప్రవక్త ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించుట.
 3. అల్లాహ్ , ఆయన ప్రవక్త నిషేధించినవాటి నుండి దూరంగా ఉండుట.

అల్లాహ్ వ్రాసిన విధివ్రాత బాధాకరమైనప్పటికి దానిపై ఓపిక వహించుట ఇందులోనే వస్తుంది. కాని దాన్ని తెలుసుకొనుట, ఆచరించుట చాలా అవసరం కాబట్టి దానిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.

ఆపద, కష్టం అల్లాహ్ తరఫు నుండియే వస్తుంది అని, అల్లాహ్ దాన్ని నిర్ణయించడంలో సంపూర్ణ వివేచణాపరుడని, దానిని మానవునిపై నిర్ణయించడం కూడా ఆయన సంపూర్ణ వరమేనని తెలుసుకున్న వ్యక్తి అల్లాహ్ వ్రాసిన విధివ్రాతతో సంతోషించి, దాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకొని, అసంతృప్తికరమైన వాటిపై అల్లాహ్ సన్నిధానం కోరుతూ, పుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షతో భయపడుతూ మరియు సత్ప్రవర్తన అవలంబించే సమయం వచ్చిందని భావిస్తూ సహనం వహించాలి. అప్పుడు అతని హృదయానికి తృప్తి  శాంతి కలుగుతుంది. అతని విశ్వాసం, ఏకత్వంలో బలం వస్తుంది.

36వ అధ్యాయం: ప్రదర్శనాబుద్ధి

قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

(ప్రవక్తా! ఇలా చెప్పండి: “నేను మీలాంటి మానవమాత్రుణ్ణే, నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. ‘మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒకే ఒక్కడు. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు”). (కహఫ్ 18:110).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు,అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “నేను ఇతర సహవర్తులకంటే అధికంగా “షిర్క్” కు అతీతుణ్ణి. ఎవరు ఒక పని చేసి, అందులో నాతో ఇతరుల్ని సాటికల్పిస్తారో  నేను అతణ్ణీ, అతని  ఆ పనిని స్వీకరించను“. (ముస్లిం).

అబూ సఈద్‌ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నేను మీకు మసీహుద్దజ్జాల్‌ కన్నా భయంకరమైన విషయము తెలపనా?” అని ప్రశ్నిస్తే  ‘తప్పక తెలుపండని’ మేము విన్నవించుకోగా “గుప్తమైన షిర్క్‌, అదేమనగా: ఒక వ్యక్తి చూసినవారు నన్ను మెచ్చుకోవాలని అలంకరిస్తూ, ఎన్నలతో నమాజ్‌ చేస్తాడు”. (అలా స్తుతించబడటానికి, చూచిన వారు మెచ్చుకోవాలనే ఉద్దేశముతో చేయడం గుప్తమెన షిర్క్‌) అని చెప్పారు. (అహ్మద్‌,ఇబ్ను  మాజ: 4204).

ముఖ్యాంశాలు:

1. సూరయే కహఫ్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. (ప్రతి పని సంకల్ప శుద్ది (ఇఖ్లాస్)తో కూడుకొని యుండాలని చెప్పడం జరిగింది).

2. ఒక గొప్ప విషయం: సత్కార్యంలో అల్లాహ్ యేతరుల ఏ కొంచెం ప్రవేశమున్న (ఆ క్రియలో, లేక సంకల్పంలో) అది రద్దు చేయబడుతుంది.

3. అల్లాహ్ సంపూర్ణంగా అతీతుడు కనుక (ప్రదర్శనాబుద్ధితో కలుషితమైన) కార్యాన్ని స్వీకరించడు, (దానికి ఫలితం ప్రసాదించడు).

4. దానికి మరో కారణం ఏమనగా  అల్లాహ్ అందరికన్నా ఘనతగలవాడు. (ఆయన్ని వదలి లేక ఆయనతో మరొకరిని సాటి కల్పించడం ఘోరమైన పాపం).

5. ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) తమ అనుచరుల పట్ల ప్రదర్శనా బుద్ధి నుండి భయం చెంది (దాని నుండి దూరముండాలని తాకీదు చేసారు).

6. దాన్ని విశదీకరించి చెప్పారు: నమాజు చేసే వ్యక్తి, చూసేవారు మెచ్చుకోవాలని ఎంతో అందముగా చేసే ప్రయత్నం చేస్తాడు.

తాత్పర్యం:(అల్లామా అల్ సాదీ) 

అల్లాహ్ కొరకు నిర్దుష్టమైన భక్తి / ఏకాగ్ర చిత్తం కలిగియుండుట ధర్మం యొక్క పునాది. మరియు అదే తౌహీద్‌కు ప్రాణం. నిర్దుష్టమైన భక్తి / ఏకాగ్రచిత్తం (ఇఖ్లాస్) అంటే మానవుడు తను చేసే ప్రతి పని ఉద్దేశం అల్లాహ్ సంతృప్తి, ఆయన నుండి పుణ్యం, ప్రళయమున సాఫల్యం పొందుట కొరకే ఉండాలి. ఇదే అసలైన  తౌహీద్‌.

దీనికి బద్ద  విరుద్ధం ప్రదర్శనాబుద్ధి. చూసినవారు మెచ్చుకోవాలని, పొగడాలని, హోదా, ప్రాపంచిక లాభం పొందుట దాని ఉద్దేశం ఉండకూడదు.

ప్రదర్శనా బుద్ది  గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలి:-

ఒక వ్యక్తి ఏదైనా సత్కార్యం చేయునప్పుడు, దాని ఉద్దేశం ప్రజలు చూడాలి అని మనుసులో వచ్చినప్పుడు, ఆ ఆలోచనను దూరం చేయకుండా అలాగే ఉండిపోతే దాని వలన ఆ సత్కార్యం వృథా అవుతుంది (ఫలితం లభించదు). అది చిన్న షిర్క్‌ అవుతుంది. అలాగే పెద్ద షిర్క్‌కు కారణం అవుతుందను భయం కూడా ఉంటుంది.

సత్కార్యం చేసే ఉద్దేశం అల్లాహ్ సంతృప్తితో పాటు ప్రజలు చూడాలి అని కూడా మనుస్సులో వచ్చినప్పుడు, అతని ఆ సత్కార్యంలో ప్రదర్శనాబుద్ది ప్రవేశించింది కనుక అది కూడా వృథా అవుతుందని నిదర్శనాలున్నాయి. సత్కార్యం చేసే ఉద్దేశం కేవలం అల్లాహ్ సంతృప్తి అయినప్పటికీ, మధ్యలో ప్రదర్శనాబుద్ది ఉద్దేశం ప్రవేశించి, అతను దాన్ని తొలగించి ఏకాగ్రచిత్తం (ఇఖ్లాసు) పాటిస్తే అతనికి ఏలాంటి నష్టం ఉండదు. ఆ దురుద్దేశాన్ని అతను తొలగించకుంటే, ఎంత శాతం ప్రదర్శనాబుద్ధి ఉందో, అంతే ఆ సత్కార్యంలో కొరత ఏర్పడుతుంది.విశ్వాసం, ఇఖ్లాస్లలో బలహీనత వస్తుంది.

ప్రదర్శనాబుద్ధి మహాగండం. దానికి చికిత్స చాలా అవసరం. మనసుకు ఇఖ్లాసు యొక్క మంచి శిక్షణ ఇవ్వాలి. ప్రదర్శనాబుద్ధిని, నష్టం కలిగించే మనోవాంఛల్ని తొలగించుటకు తగిన ప్రయత్నం చేయాలి. అందుకు అల్లాహ్ సహాయం కోరాలి. అల్లాహ్ తన దయ మరియు కరుణతో ఇఖ్లాస్ భాగ్యం ప్రసాదించి, తౌహీద్‌ వాస్తవికత యొక్క జ్ఞానం కలిగిస్తాడు.

ప్రాపంచిక లాభం, మనోవాంఛల కొరకు సత్కార్యం చేయుట:

అల్లాహ్ సంతృప్తి ఉద్దేశం ఏ మాత్రం లేకుండా, కేవలం పై ఉద్దేశమే ఉంటే, అతనికి దానికి బదులు ఏ లాభమూ ఉండదు. ఇలా ఒక విశ్వాసి  ప్రవర్తించుట సమంజసం కాదు. విశ్వాసి అతని విశ్వాసం ఎంత బలహీనంగా ఉన్నప్పటికి అతను అల్లాహ్ సంతృప్తి, పరలోక లాభం కోరుటయే చాలా అవసరం.

ఎవరు అల్లాహ్ సంతృప్తి, ప్రాపంచిక లాభం రెండు ఉద్దేశాలతో  చేసినప్పుడు, రెండు ఉద్దేశాలు ఒకే పరిమాణంలో ఉంటే, అతను విశ్వాసి అయి ఉంటే, వాస్తవానికి అతని విశ్వాసంలో, ఇఖ్లాస్లో కొరత ఉన్నట్లే. ఇఖ్లాసులో కొరత ఉన్నప్పుడు అతని కార్యం కూడా సంపూర్ణం కాదు. (ఫలితం సంపూర్ణంగా ఉండదు).

ఎవరు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, సంపూర్ణ ఇఖ్లాస్ తో చేస్తారో, కాని అతను దానిపై వేతనము లేక బహుమానము పొందుతాడు. దానితో అతను తన పని, ధర్మంలో సహాయం తీసుకుంటాడు. ఉదా: ఎవరైనా ఒకమంచి పని, పుణ్యకార్యం చేసినందుకు ఏదైనా బత్తెం దొరికినట్టు. ముజాహిద్  జిహాద్‌ చేయుటకు వెళ్ళినప్పుడు యుద్ధఫలం (గనీమత్‌)పొందినట్లు. మస్జిద్, మద్‌రసా మరియు ధర్మకార్యాలు నిర్వహించే వారికి వక్ఫ్ బోర్డు ఇచ్చే వేతనాలు. ఇలాంటివి తీసుకొనుట వలన విశ్వాసం, తౌహీద్‌లో ఏలాంటి కొరత, నష్టం వాటిల్లదు.ఎందుకనగా అతని ఆ సత్కార్యం చేయు ఉద్దేశం ఉంటుంది. అతను పొందునది అతలధర్మం పై నిలకడ కొరకు సహాయము చేయును. అందుకే జకాత్‌ మరియు మాలె పై (యుధ్ధ ఫలం లాంటిది) లాంటి ధనంలో, ధార్మిక మరియు లాభదాయకమైన ప్రాపంచిక కార్యాలు నిర్వహించువారికి హక్కు ఉంది.

37వ అధ్యాయం: మానవుడు తాను చేసే సత్కార్యంతో ప్రాపంచిక లాభం పొందాలని ఉద్దేశించుట కూడ ఒక రకమైన షిర్క్

అల్లాహ్ ఆదేశం: 

ఎవరైతే కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షణాలనూ కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతి ఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి లోటు చెయ్యటం అంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరేమి ఉండదు. (అక్కడ తెలిసిపోతుంది) వారు ప్రపంచంలో చేసినదంతా మట్టిలో కలసి పోయింది అనీ, వారు చేసినదంతా కేవలం మిథ్య అనీ“. (11: హూద్ : 15, 16). 

ప్రవక్త ﷺ  ఉపదేశించారని, అబూ హురైరా ఉల్లేఖించారు:

దీనార్, దిర్హం, మంచి దుప్పట్ల దాసుడు నాశనమయ్యాడు. అవి దొరికితే అతడు సంతొషిస్తాడు, లేనిచో అసంతృప్తికి లోనవుతాడు. అతను నాశనమవుగాకా, నష్టంలో పడుగాకా!. అతనికి ముళ్ళు గుచ్చుకున్నా తీయరాకుండా అవుగాకా. గుఱ్ఱం కళ్ళెం పట్టుకొని అల్లాహ్ మార్గంలో (జిహాద్ లో) నిలబడిన వ్యక్తికి శుభవార్త! అతని తలవెట్రుకలు చిందరవందరై ఉన్నాయి. అతని పాదాలకు దుమ్ము ధూళి పట్టి ఉంది. అతడిని ప్రహరితిరుగుటకు నియమిస్తే దానిపైనే ఉంటాడు. సైన్యం వెనక ఉంచుతే అక్కడే ఉంటాడు. అనుమతి కోరితే అతనికి అనుమతి లభించదు. సిఫారసు చేస్తే అది స్వీకరించబడదు“. (బుఖారీ: 6435). 

ముఖ్యాంశాలు: 

 • 1. ప్రళయమున లాభాన్నిచ్చే కార్యం చేస్తూ ప్రపంచాన్ని కూడా పొందాలని ఉద్దేశించుట (షిర్క్ వస్తుంది). 
 • 2. సూరె హూద్ ఆయతు యొక్క వ్యాఖ్యానం 
 • 3. (ప్రాపంచిక లాభంకోరు) ముస్లింను “దీనార్, దిర్హం, మంచి చాదర్లు, దుప్పట్ల దాసుడు” అని పిలవడం జరిగింది. 
 • 4. దాని వివరణ ఏమనగ అతనికి అది దొరికితే సంతొషిస్తాడు, దొరుకనిచో అసంతృప్తికి లోనవుతాడు. 
 • 5. అలాంటి వ్యక్తికి వినాశం ఉంది అని చెప్పబడింది. 
 • 6. అలాగే అతని ముళ్ళు గుచ్చుకున్నా తీయరాకుండా అవుగాకా అని శపించబడింది. 
 • 7. పై హదీసులో తెలుపబడిన గుణాలు ఉన్న ముజాహిద్ (ధర్మ యుద్ధవీరున్ని) ప్రశంసించడమైనది. 

38వ అధ్యాయం: హలాల్ ను హరాం మరియు హరాంను హలాల్ చేయు పండితులకు, పాలకులకు విధేయత చూపుట (అల్లాహ్ ను  త్యజించి) వారిని ప్రభువులుగా చేసుకొనుటయే

ఇబ్ను అబ్బాసు రజియల్లాహు అన్హు చెప్పారు:

సమీప కాలంలో మీపై ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురుస్తుంది. ఎందుకనగా ప్రవక్త ఇలా చెప్పారు అని నేనంటుంటే, కాదు అబూ బకర్ మరియు ఉమర్ ఇలా చెప్పారు అని మీరు అంటున్నారు“. (అహ్మద్). 

ఇమాం అహ్మద్ చెప్పారు:

సనద్ మరియు దాని సత్యతను తెలుసుకొని కూడా హదీసును వదలివేసి సుఫ్యాన్ (ఇస్లామీయ పండితులు) అభిప్రాయాన్ని తీసుకునేవారిని చూసి ఆశ్చర్యం ఏర్పడుతుంది. ఎందుకంటే అల్లాహ్ చెప్పాడు: 

فَلْيَحْذَرِ ٱلَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرِهِۦٓ أَن تُصِيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصِيبَهُمْ عَذَابٌ أَلِيمٌ
దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అనీ, తమ పై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అని భయపడాలి“. (24: నూర్ : 63). ఉపద్రవం అంటేమిటో తెలియునా? ఉపద్రవం అంటే షిర్క్. ఎవరైనా ప్రవక్త మాటను తిరస్కరిస్తే అతని హృదయములో వక్రత్వం చోటు చేసుకుంటుంది. అతను నాశనమవుతాడు.

అదీ బిన్ హాతిం ఉల్లేఖించారు, ప్రవక్త వారు “అల్లాహ్ ను కాదని తమ విద్వాంసులను, తమ సన్యాసులను, తమ ప్రభువులుగా చేసుకున్నారు“. (9: తౌబా: 31) అన్న ఖుర్ఆన్ వాక్యం చదవగా, ఆయన విని, ‘ప్రవక్తా! మేము వారిని పూజించలేదు కదా?’ అని ప్రశ్నించారు. “అల్లాహ్ హరాం చేసిన దానిని వారు హలాల్ చేస్తే మీరు కూడా దాన్ని హలాల్ అని నమ్మలేదా?, హలాల్ చేసిన దానిని వారు హరాం చేస్తే మీరు కూడా దాన్ని హరాం అల్లాహ్ అని నమ్మలేదా?” అని అడిగారు ప్రవక్త . ‘అవును’ అని అతనన్నాడు. చెప్పారు: “అదే వారి ఆరాధన”. (అహ్మద్, తిర్మిజి.  అప్పుడు ప్రవక్త హదీసు “హసన్” స్థానములో ఉందని ఇమాం తిర్మిజి చెప్పారు). 

ముఖ్యాంశాలు: 

 • 1. సూరె నూర్ ఆయత్ యొక్క వ్యాఖ్యానం. 
 • 2. సూరె తౌబా ఆయత్ యొక్క వ్యాఖ్యానం. (సంభాషణ ఆరంభంలో) 
 • 3. ఆరాధన యొక్క ఏ భావాన్ని అదీ తిరస్కరించారో దానిని గమనించాలి. (అది చాలా ముఖ్యం). 
 • 4. ఇబ్ను అబ్బాసు అబూ బకర్ మరియు ఉమర్ ల పేరు తీసుకొని, అలాగే ఇమాం అహ్మద్, సుఫ్యాన్ పేరు తీసుకొని చెప్పేదేమిటంటే ప్రవక్త ఆదేశం వచ్చిన తరువాత ఇతరుల మాట వినకూడదు. 
 • 5. ఈ రోజుల్లో పరిస్థితులు చాలా మారాయి. అనేక మంది సన్యాసులను ఆరాధించుటయే ఉత్తమమైన కర్మగా భావించి, దానికి “విలాయత్” అని నామకరణము చేస్తున్నారు. విద్యజ్ఞానాల పేరుతో విద్వాంసులు ఆరాధించబడుతున్నారు. పరిస్థితి మరింత భయంకరంగా మారి: ఎవరు పుణ్యపురుషుల్లో లెక్కించబడరో, అల్లాహ్ ను  వదలి వారి ఆరాధన కూడా జరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే మూర్ఖుల పూజ జరుగుతుంది. 

తాత్పర్యం: 

రచయిత రహిమహుల్లాహ్  ఈ అధ్యాయాన్ని ఇందులో చేర్చడానికి కారణం స్పష్టంగా ఉంది. పోషకుడు, ఆరాధ్యుడు అయిన అల్లాహ్ కే ఖద్ రీ (స్వాభావిక), షర్ యీ (ధార్మిక) మరియు జజాఈ ఆదేశం (Criminal law) ఇచ్చే హక్కు ఉంది. కేవలం ఆయన ఆరాధనే జరగాలి. ఆయనతో మరొకరిని సాటి కల్పించరాదు. ఎల్లవేళల్లో ఆయన విధేయతయే పాఠించాలి. ఆయన అవిధేయతకు గురి కాకూడదు. ఆయన తప్ప (ఆయన ఆదేశించిన) ఇతురుల విధేయత ఆయన విధేయతకు అనుగుణంగా ఉండాలి. (ఒక వేళ ఈ విధంగా) విద్వాంసుల / పండితుల, అధికారుల విధేయత పాటిస్తే, ఇంకా అల్లాహ్ ఆయన ప్రవక్త విధేయతను వారి విధేయతకు అనుగుణంగా చేస్తే వాస్తవంగా అతను అల్లాహ్ ను  కాదని వారిని “రబ్” చేసుకున్నవాడు, వారి పూజ చేయువాడు, వారితో తీర్పులు కోరినవాడు, వారి తీర్పును, అల్లాహ్ ఆయన ప్రవక్త తీర్పుపై ప్రాధాన్యత ఇచ్చినవాడవుతాడు. నిస్సందేహంగా ఇదే అవిశ్వాసం (కువ్). ఎలాగైతే ఆరాధనకు అల్లాహ్ అర్హుడో అలాగే ఆదేశం, తీర్పు కూడా ఆయనదే చెల్లును. 

ప్రతి వ్యక్తిపై విధిగా ఉన్న విషయం ఏమనగా: ఏ ఒకరు కూడా అల్లాహ్ ను తప్ప ఇతరులను తీర్పు ఇచ్చేవానిగా (అల్లాహ్ ప్రవక్త ఆజ్ఞకు వ్యెతిరేకంగా తమ ఆజ్ఞను చెలాయించే వానిగా) నిర్ణయించుకోకూడదు. ప్రజల మధ్య ఏ సమస్యలోనైనా వివాదం తలెత్తితే (దాని తీర్పునకు) అల్లాహ్ (అంటే: ఖుర్ ఆన్ గ్రంథం) ఆయన ప్రవక్త (అంటే: సహీ హదీసుల) వైపు దాన్ని నివేదించాలి. ఈ విధంగా మానవుడు అల్లాహ్ ధర్మాన్ని అవలంబించినవాడు, ఆయన సంతృప్తి కొరకే ఏకాగ్రచిత్తంతో తౌహీద్ ను పాటించినవాడవుతాడు. అల్లాహ్ ఆయన ప్రవక్త (ఖుర్ఆన్, హదీసు)ను వదలి ఇతరులతో తీర్పు కోరేవాడు వాస్తవంగా “తాగూత్”తో తీర్పు కోరినవాడవుతాడు. ఇలా చేస్తూ తనకు తాను విశ్వాసి అని భావించినా అది అతని భ్రమ. అతడు అసత్యవాది. 

ఇస్లాం ధర్మంలోని ప్రధానాంశాలు, దాని శాఖలన్నిట్లో అల్లాహ్, ఆయన ప్రవక్త తీర్పుకు ప్రాధాన్యత ఇవ్వనంత వరకు, (దాన్ని స్వీకరించనంత వరకు) ఏ వ్యక్తీ సరియైన, సంపూర్ణ విశ్వాసి కాజాలడు. 

39వ అధ్యాయం: “(తమ వ్యవహారాల) పరిష్కారం కొరకు ‘తాగూత్’ వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా?

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ ءَامَنُوا۟ بِمَآ أُنزِلَ إِلَيْكَ وَمَآ أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوٓا۟ إِلَى ٱلطَّـٰغُوتِ وَقَدْ أُمِرُوٓا۟ أَن يَكْفُرُوا۟ بِهِۦ وَيُرِيدُ ٱلشَّيْطَـٰنُ أَن يُضِلَّهُمْ ضَلَـٰلًۢا بَعِيدًۭا

ప్రవక్తా! “నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము” అని ప్రకటన అయితే చేసి, (తమ వ్యవహారాల) పరిష్కారం కొరకు ‘తాగూత్’ వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి ‘తాగూత్’ ను తిరస్కరించండి అని వారిని ఆదేశించటం జరిగింది. షైతాన్ వారిని పెడత్రోవ పట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. (4: నిసా: 60). 

وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا۟ فِى ٱلْأَرْضِ قَالُوٓا۟ إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ
“భూమిపై కల్లోలాన్ని రేకిత్తించకండి” అని వారితో అన్నప్పుడల్లా వారు “మేము సంస్కర్తలము మాత్రమే” అని అంటారు. జాగ్రత్త! వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు. కాని వారు గ్రహించటం లేదు. (2: బఖర: 11). 

وَلَا تُفْسِدُوا۟ فِى ٱلْأَرْضِ بَعْدَ إِصْلَـٰحِهَا
ధరణి సంస్కరణ జరిగిన తరువాత, దానిపై సంక్షోభాన్ని సృష్టించకండి“. (7: ఆరాఫ్: 56). 

أَفَحُكْمَ ٱلْجَـٰهِلِيَّةِ يَبْغُونَ ۚ وَمَنْ أَحْسَنُ مِنَ ٱللَّهِ حُكْمًۭا لِّقَوْمٍۢ يُوقِنُونَ
(వారు అల్లాహ్ శాసనానికి విముఖులై) అజ్ఞానపు (జాహిలియ్యత్) తీర్పు కావాలని కోరుకుంటున్నారా?“. (5: మాఇద: 50). 

అబ్దుల్లా బిన్ ఉమర్ ఉల్లేఖించారు. ప్రవక్త ﷺ ఉపదేశించారు: ” నేను తీసుకొని వచ్చిన ధర్మ సూత్రములకు మీ మనోవాంఛలు కట్టుబడి ఉండనంత వరకు మీలో ఎవరూ విశ్వాసులు కాజాలరు“. (ఇది సహీ హదీసు, మేము దీనిని సహీ సనద్ తో ‘కితాబుల్ హుజ్జు’లో ఉల్లేఖించాము అని ఇమాం నవవి రపామహుల్లాహ్ చెప్పారు). 

షఅబి ఇలా పేర్కొన్నారు: కపట విశ్వాసి మరియు యూదుని మధ్య వివాదం జరిగింది. ముహమ్మద్ ప్రవక్త ﷺ  లంచము తీసుకోరని యూదునికి తెలిసి, ఆయన వద్దకు (తీర్పు కొరకు) వెళ్తామని అతనన్నాడు. యూదులు లంచము తీసుకుంటారు అని కపట విశ్వాసికి తెలుసు గనుక, యూదుల వద్దకు వెళ్లామని అతనన్నాడు. చివరికి జుహైనా వంశానికి చెందిన ఒక జ్యోతిష్యుని వద్దకు వెళ్తామని ఇద్దరు ఒప్పుకున్నారు. అప్పుడే పై వాక్యం (4: నిసా: 60) అవతరించింది. 

(పై వాక్యం అవతరణకు మరో కథనం కూడా ఉంది): ఇద్దరు జగడము చేసుకొని ఒకడన్నాడు – “ప్రవక్త ముహమ్మద్ వద్దకు వెళ్తాము”, మరొకడన్నాడు కఅబ్ బిన్ అష్రఫ్ (యూదుని) వద్దకు వెళ్లామని. చివరికి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి అక్కడ తీర్పు అయిన తరువాత, వారిద్దరిలో ఒకడు ఆ తీర్పును అంగీకరించక ఉమర్ వద్దకు వచ్చారు. (ఎవరి వైపు తీర్పు అయినచో) అతను పూర్తి వివరాన్ని ఉమర్ ముందు పెట్టాడు. ప్రవక్త తీర్పును వ్యెతిరేకించిన వాడిని ఇది నిజమేనా? అని అడిగారు ఉమర్ . ‘ఔను’ అన్నాడతను. అప్పుడు ఉమర్ ఖడ్గముతో అతన్ని (ప్రవక్త ﷺ తీర్పును తిరస్కరించిన వాన్ని) హతమార్చారు. 

ముఖ్యాంశాలు: 

1. సూరె నిసా ఆయతు యొక్క భావం తెలిసింది. ‘తాగూత్’ యొక్క భావం కూడా తెలిసింది. 

2. సూరె బఖరలోని వాక్యం యొక్క భావం కూడా తెలిసింది. (అల్లాహ్ అవతరింపజేయని దానితో తీర్పు కోరడం మహా ఉపద్రవం అని తెలుస్తుంది). 

3. సూరె ఆరాఫ్ వాక్యం యొక్క వ్యాఖ్యానం. 

4. సూరె మాఇద వాక్యం యొక్క వ్యాఖ్యానం. 

5. మొదటి వాక్యం యొక్క వ్యాఖ్యానంలో షఅబి చెప్పిన విషయం అర్థమయింది. 

6. సత్యవిశ్వాసం, అసత్య విశ్వాసం యొక్క తేడా తెలిసింది

7. ఉమర్ (ప్రవక్త మాటను వినని) వంచకునితో ఎలా వ్యవహరించారో తెలిసింది. 

8. ప్రవక్త ﷺ తీసుకువచ్చిన ధర్మాన్ని తమ మనోవాంఛలు అనుసరించనంత వరకు ఏ వ్యక్తీ విశ్వాసి కాలేడు. 

40వ అధ్యాయం: “అల్లాహ్ నామాలను, గుణవిశేషణాలను తిరస్కరించువాడు”

هُمْ يَكْفُرُونَ بِٱلرَّحْمَـٰنِ
వారు రహ్మాన్ ను తిరస్కరిస్తున్నారు“. (13: రఅద్: 30). 

బుఖారిలో ఉంది. అలీ ఇలా చెప్పారు: “ప్రజలు అర్థం చేసుకోగల విషయాలే వారికి తెలుపండి. (ఊహజ్ఞానానికి అందని విషయం తెలిపి) అల్లాహ్ ఆయన ప్రవక్త తిరస్కరించబడాలని మీరు కోరుతున్నారా?“.

అబ్దుర్ రజాఖ్, మఅ మర్ తో, ఆయన ఇబ్ను తావూసుతో ఆయన ఇబ్ను అబ్బాసుతో ఉల్లేఖించారు: అల్లాహ్ గుణమునకు సంబంధించిన ఒక హదీసు విని అసహ్యంతో వణుకుతున్న ఒక వ్యక్తిని ఇబ్ను అబ్బాసు చూసి, ఇలా అన్నారు: “అదేమిటి? వీరి భయం, వణుకుట చాలా విచిత్రంగా ఉంది. అల్లాహ్ యొక్క “ముహ్ కమ్” వాక్యాలు విని అంగీకరిస్తారు. “ముతషాబహ్” వాక్యాలు విని (స్వీకరించక) నాశనమవుతారు“. 

ప్రవక్త ﷺ రహ్మాన్ విషయం ఖురైషు సంఘము ముందు ప్రస్తావించినప్పుడు వారు తిరస్కరించారు. అప్పుడే అల్లాహ్, పై (13: రఅద్: 30) వాక్యం అవతరింపజేసాడు. 

ముఖ్యాంశాలు: 

 • 1. అల్లాహ్ నామములను, గుణవిశేషణాలను తిరస్కరించువానిలో ఏ మాత్రం విశ్వాసం ఉండదు. 
 • 2. సూరె రఅద్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. 
 • 3. శ్రోతలకు అర్థం కాని విషయాలు చెప్పకపోవడం మంచిది. 
 • 4. ఎందుకనగా, అందువలన అల్లాహ్ ఆయన ప్రవక్తను ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అతను తిరస్కరిస్తాడేమో. 
 • 5. ఇబ్ను అబ్బాసు ఈ అభిప్రాయము కూడా తెలిసింది: ఎవరు అల్లాహ్ యొక్క గుణవిశేషణాలను తిరస్కరిస్తారో వారు నాశనమవుతారు. 

తాత్పర్యం:

అందువలన అల్లాహ్ ను , ఆయన శుభనామములను మరియు గుణవిశేషణాలను విశ్వసించుట విశ్వాసానికి మూలం వంటిది. వాటి పట్ల మానవుని జ్ఞానం మరియు విశ్వాసం ఎంత వృద్ధి చెందునో, అతను అల్లాహ్ ఇబాదత్ లో ఎంత నిమగ్నుడగునో అంతే అతని తౌహీద్ కూడా వృద్ధి చెందును. సంపూర్ణ గుణాలు, మహోన్నతుడు, ఘననీయుడు అల్లాహ్ మాత్రమేనని తెలుసుకున్నవాడు, ఆయనే అసలైన ఆరాధ్యుడు, ఆయన తప్ప ఇతరులు తుచ్ఛము అని తెలుసుకొనుట తప్పనిసరి. అల్లాహ్ నామములు, గుణాల్లో ఏ ఒక్క దాన్ని తిరస్కరించినా అతడు తౌహీదు వ్యెతిరేకమైన దాన్ని నమ్మినవాడవుతాడు. ఇది అవిశ్వాస భాగాల్లో ఒకటి. 

41వ అధ్యాయం: “వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తిస్తారు. అయినా దాన్ని తిరస్కరిస్తారు”

అల్లాహ్ ఆదేశం:

يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَـٰفِرُونَ
“వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తిస్తారు. అయినా దాన్ని తిరస్కరిస్తారు”. (16:నహ్ల్ : 83). 

పై ఆయుతు యొక్క వ్యాఖ్యానం ఇమాం ముజాహిద్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: “నేను నా తాతల నుండి పొందిన ఆస్తి. ఇది నా సొమ్ము” అని మనిషి చెప్పుకొనుట. 

ఔన్ బిన్ అబ్దుల్లాహ్ చెప్పారు: “ఫలాన వ్యక్తి లేకుంటే ఇది నాకు లభించేది కాదు“. ఇబ్ను ఖుతైబ చెప్పారు: “ఇది మా దేవతల సిఫారసుతో దొరికినది” అని అనుట. 

జైద్ బిన్ ఖాలిద్ ఉల్లేఖించిన హదీసు “నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసించినవారు, మరి కొందరు నన్ను తిరస్కరించినవారున్నారు” (ఈ హదీసు 30వ అధ్యాయంలో గడిసింది). ఈ హదీసు వాఖ్యానంలో అబుల్ అబ్బాస్ (ఇబ్ను తైమియ) తెలిపారు:

“ఇలా అలాహ్ వరాలను అల్లాహ్ యేతరుల పేరున అంకితం చేసేవారిని, అల్లాహ్ కి సాటి కల్పించేవారిని అల్లాహ్ ఖుర్ ఆన్, హదీసులో అనేక చోట్ల అసహ్యించుకున్నట్లు తెలిపాడు.”

ఈ మాటను వివరిస్తూ కొందరు పండితులు చెప్పారు: “గాలి మంచిగా ఉంది. నావికుడు తెలివైనవాడు ఉన్నాడు” లాంటి పదాలు అనేక మంది అంటుంటారు. (ఇలా వారు అల్లాహ్ వరాల్ని తిరస్కరించి, వాటిని ప్రశంసిస్తారు). 

ముఖ్యాంశాలు: 

1. ఉపకారాన్ని గుర్తిస్తారు, మళ్ళి తిరస్కరిస్తారు అన్న దాని గురించి వివరించబడింది. 
2. ఈ విధంగా ప్రజలు చాలా అంటుంటారు అని తెలిసింది. 
3. ఈ విధంగా మాట్లాడటం వలన అల్లాహ్ ఉపకారాన్ని తిరస్కరించి నట్లగును. 
4. ఒకే హృదయంలో (అల్లాహ్ వరాలను గుర్తించి, తిరస్కరించు వంటి) రెండు గుణాలు ఉంటాయి అని తెలిసింది. 

తాత్పర్యం: 

అన్ని రకాల ఉపకారాలు అల్లాహ్ యే చేయువాడు అని మనసా వాచా నమ్ముట సర్వ మానవులపై విధిగా ఉంది. దీనితోనే తౌహీద్ సంపూర్ణమవుతుంది. (ఈ విషయము ముందు వచ్చేసింది). అల్లాహ్ వరాలను మనసా వాచా తిరస్కరించువాడు అవిశ్వాసి అవుతాడు. 

అవి అల్లాహ్ వైపు నుండి అని హృదయపూర్వకంగా విశ్వసించి, నోటితో ఒకప్పుడు అల్లాహ్ తరఫున అని విశ్వసించి, మరొకప్పుడు తన తరఫున లేక తన వృత్తి వలన లేక తన కష్టం వలన అని అనుట. ఇలాంటి గుణం ఈ రోజుల్లో ప్రజల్లో చెలామణి ఉంది. ఇలాంటివారు వెంటనే (పశ్చాత్తాపపడి) తౌబా చేయాలి. అన్ని విషయాలను అల్లాహ్ వైపునకే అంకితం చేయాలి. ఈ విధంగానే విశ్వాసం సంపూర్ణం అవుతుంది. 

విశ్వాసానికి మూలమైన కృతజ్ఞత యొక్క మూడు స్థంబాలున్నవి:- 

1- అతని పై మరియు ఇతరులపై ఉన్న అనుగ్రహాలు, సుఖసంతోషాలు అల్లాహ్ తరఫున అని హృదయపుర్వకంగా నమ్మాలి. 
2- దాన్ని బహిర్గతం చేయాలి. అల్లాహ్ కు ప్రశంసలు, కృతజ్ఞత తెలుపాలి.
3- ఉపకారుని (అల్లాహ్) విధేయతలో, అతనిని ప్రార్థనలో వాటిని సహాయంగా తీసుకోవాలి. 

42వ అధ్యాయం”మీరు తెలిసికూడా ఇతరులను అల్లాహ్ కు సాటి కల్పించకండి”:

అల్లాహ్ ఆదేశం: 

فَلَا تَجْعَلُوا۟ لِلَّهِ أَندَادًۭا وَأَنتُمْ تَعْلَمُونَ
మీరు తెలిసికూడా ఇతరులను అల్లాహ్ కు సాటి కల్పించకండి” (2: బఖర: 22). 

పై ఆయతులో “అన్ దాద్” అంటే షిర్క్ (అల్లాకు ఇతరులను సాటి కల్పించడం). అది (షిర్క్) కారు చీకటిలో నల్లటి రాతి బండపై నడిచే చీమ కన్నా మరీ గుప్తమైనది. ఇంకా ఇలాంటి పదాలు పలికినా అది షిర్క్ లో వస్తుంది:

అల్లాహ్ ప్రమాణంగా మరియు నీ జీవన ప్రమాణంగా“.
ఓ వ్యక్తి! నా ప్రాణం సాక్షి“. “ఈ కుక్క లేకుంటే దొంగలు పడేవారు“.
ఇంట్లో ఈ బాతు లేకుంటే దొంగలు (ఇంటిని) దోచుకునేవారు“.
అల్లాహ్ కోరునది మరియు నీవు కోరునది (అగును)“.
అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి లేకుంటే...”

లాంటి మాటలు పలుకరాదు. ఇవన్నియు అల్లాహ్ తో సాటి కల్పించినట్లగును”. ఇది ఇబ్ను అబ్బాస్ వాఖ్యానం. (దీనిని ఇబ్ను అబీ హాతిం ఉల్లేఖించారు).

ప్రవక్త ప్రవచించారని, ఉమర్ ఉల్లేఖించారు:

“అల్లాహ్ యేతరుల ప్రమాణం చేసేవాడు “కుఫ్ర్” చేసినవాడు లేక “షిర్క్” చేసినవాడవుతాడు”. (తిర్మిజి). 

ఇబ్ను మసూద్ ఇలా చెప్పారు:

సత్య విషయంలో అల్లాహ్ యేతరుల ప్రమాణం కంటే అసత్య విషయం పై అల్లాహ్ ప్రమాణం చేయుట నాకు ఇష్టం“. (తబ్రాని). 

ప్రవక్త ఉపదేశించారని, హుజైఫా ఉల్లేఖించారు:

“అల్లాహ్ మరియు ఫలానా కోరినట్లు అగును” అని చెప్పకండి. “అల్లాహ్ కోరినట్లు అగును. ఆ తరువాత ఫలానా కోరినట్లు అగును” అని పలుకకండి”. (అబూ దావూద్). 

అల్లాహ్ మరియు నీ శరణు కోరుచున్నాను” అని అనుటను ఇబ్రాహీం నఖఇ (ఇస్లామీయ పండితులు) ఇష్టపడేవారు కాదు. “అల్లాహ్ శరణు కోరుచున్నాను. మళ్ళీ ఫలాన వ్యక్తి శరణు” అనుట మంచిదే. “అల్లాహ్ లేకుంటే, మళ్ళీ ఆయన లేకుంటే” అనవచ్చును. కాని “అల్లాహ్ మరియు ఆయన లేకుంటే అనకూడదు“. 

ముఖ్యాంశములు: 

1- సూరె బఖరలోని “అన్ దాద్” యొక్క వ్యాఖ్యానం తెలిసింది. 

2- షిర్క్ అక్బర్ గురించి అవతరించిన ఆయతు సంబధం షిర్క్ అస్గర్ తో ఉందని వ్యాఖ్యానించేవారు. 

3- అల్లాహ్ యేతరుల ప్రమాణం చేయుట షిర్క్ 

4- సత్యమైన విషయంలో అల్లాహ్ యేతరుల ప్రమాణం చేయుట “యమీనె గమూసు” (అల్లాహ్ నామంతో చేసే అబద్ధపు ప్రమాణం) కంటే మహా పాపమైనది. 

5– “మరియు”, “మళ్ళీ” పదాల్లో ఉన్న వ్యత్యాసం తెలిసింది.

తాత్పర్యం: 

31వ అధ్యాయంలో అల్లాహ్ ఆదేశం “కొందరు అల్లాహ్ ను  కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు“. ను ప్రస్తావించిన ఉద్దేశం ప్రార్థన, ప్రేమ, భయం మరియు ఆశ తదితర ప్రార్థనల్లో గల షిర్క్ అక్బర్ గురించి తెలుపడం జరిగింది. 

అయితే ఈ అధ్యాయంలో అల్లాహ్ యేతరుల ప్రమాణం లాంటి వాజ్మూలిక షిర్క్, “అల్లాహ్ మరియు ఫలాన లేకుంటే…”, “ఇది అల్లాహ్ తరఫున మరియు నీ తరఫున”, “కాపాలాదారుడు లేకుంటే దొంగలు పడేవారు”, ఫలానా ఔషధము లేకుంటే నేను చనిపోయేవాడిని”, “ఫలాన సంపదలో ఫలాన అనుభవం, నైపుణ్యం లేకుంటే ఈ లాభం లభించేది కాదు” లాంటి మానవులను, అల్లాహ్ ను  ఒకే స్థానంలో ఉంచే షిర్క్ అస్గర్ కు సంబంధించిన పదాలు తౌహీద్ కు వ్యెతిరేకమైనవి. సర్వ కార్యాల సంబంధం, అవి సంభవించుట మరియు సర్వ సాధనాల, కారణాల లాభం అల్లాహ్ తరఫునుండే, ఆయన తలచినప్పుడే జరుగును అని విశ్వసించుట తప్పనిసరి. ఆ తరువాత అవి ఏ కారణాల వల్ల సంభవించినవో వాటిని, వాటి లాభాల్ని ప్రస్తావించవచ్చును. ఇలా అనాలి: “అల్లాహ్ లేకుంటే, మళ్ళీ……. (కాని “మరియు” అనకూడదు). ఇలా ఎందుకనగా సర్వ కారణాలు సయితం అల్లాహ్ వ్రాసిన విధి ప్రకారం సంభవించును. 

43వ అధ్యాయం: అల్లాహ్ నామ ప్రమాణంతో తృప్తి చెందని వ్యక్తి గురించి

అల్లాహ్ నామ ప్రమాణంతో తృప్తి చెందని వ్యక్తి గురించి ఆదేశం ప్రవక్త ప్రవచించారని, ఇబ్ను ఉమర్ ఉల్లేఖించారు:

“మీరు మీ తాత ముత్తాతల నామములతో ప్రమాణాలు చేయకండి. అలాహ్ నామం ప్రమాణం చేయువాడు సత్యంపలకాలి. ఎవరి కొరకు అల్లాహ్ పేరున ప్రమాణం చేయబడిందో, అతను దాన్ని ఒప్పుకోవాలి. అతను దాన్ని ఒప్పుకొనక పోతే అల్లాహ్ తో అతనికి సంబంధం ఉండదు”. (ఇబ్ను మాజ) 

ముఖ్యాంశాలు

1- తాతముత్తాతల పేరున ప్రమాణం చేయుట నివారించబడింది. 
2- ఎవరి ఎదుట (కోసం) అల్లాహ్ పేరున ప్రమాణం చేయబడిందో అతను దాన్ని ఒప్పుకోవాలి. 
3- ఒప్పుకొననివారికి హెచ్చరించడమైనది. 

తాత్పర్యం: 

నీ ఎదుటివాడు సత్యవంతుడు, న్యాయశీలుడు మరియు మంచివాడు అని తెలిస్తే, అతను నీతో ఒక విషయంలో అల్లాహ్ పై ప్రమాణం చేస్తే నీవు తప్పక నమ్మాలి. ఎందుకనగా అతని సత్యతను తిరస్కరించడానికి నీ వద్ద ఏ ఆధారం లేదు. 

ముస్లిములు అల్లాహ్ గౌరవమర్యాదను ఏ విధంగా నమ్ముతారో దాని ఆధారంగా చూస్తే అల్లాహ్ పేరున చేయబడిన ప్రమాణాన్ని వారు ఒప్పుకోవాలి. అల్లాహ్ పేరున ప్రమాణాన్ని స్వీకరించక తలాఖ్ (*), లేక బద్ దుఆ (శాపము) యొక్క షర్తు పెట్టువారికి కూడ పైన పేర్కొన్న హెచ్చరిక వర్తిస్తుంది. ఎందుకనగా అది అల్లాహ్ పట్ల ఉండవలసిన మర్యాదకు వ్యెతిరేకం. ఇంకా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల్లో జోక్యం చేసినవాడవుతాడు. 

(*) అంటే ఒక విషయం పై నీవు ప్రమాణం చేస్తే, ఎదుటివాడు దాన్ని నమ్మక, లేదు “అల్లాహ్ ప్రమాణం! కాదు. ఈ మాట అబద్ధం అయితే నా భార్యకు విడాకులు, లేక నాపై శాపం కురుస్తుంది అని ప్రమాణం చేయు” అని అంటాడు. (ఇది తప్పుడు విధానం. ఇలాంటి వారి కొరకు పైన చెప్పబడిన హెచ్చరిక ఇవ్వబడింది). 

ఎదుటివాడు అబద్ధములాడువాడు, పాపాత్ముడు అని స్పష్టం అయినప్పుడు అతని ప్రమాణాన్ని తిరస్కరించువానిపై ఆ హెచ్చరిక వర్తించదు. స్వయంగా అతని హృదయంలో అల్లాహ్ పట్ల గౌరవమర్యాదలు లేవు. 

44వ అధ్యాయం: అల్లాహ్ కోరినట్లు మరియు నీవు కోరినట్లు అని పలుకవచ్చునా?

ఖుతైల ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త వద్దకు ఒక యూదుడు వచ్చి “మీరు “అల్లాహ్ కోరినట్లు మరియు నీవు కోరినట్లు” అని ఇంకా “కాబా ప్రమాణం” అని అల్లాతో షిర్క్ చేస్తారు అని అన్నాడు. అప్పుడు ప్రవక్త తమ సహచరులకు ఇలా ఆదేశించారు: “ప్రమాణం చేయదలిచినప్పుడు “వరబ్బిల్ కాబా” (కాబా యొక్క ప్రభువు సాక్షి) అనండి. ఇంకా (అల్లాహ్ కోరినట్లు మరియు నీవు కోరినట్లు అనకుండా) “అల్లాహ్ కోరినట్లు తరువాత నీవు కోరినట్లు” అనండి”.. (నసాయి). 

ఇబ్ను అబ్బాస్ కథనం: ఒక వ్యక్తి ప్రవక్తతో “అల్లాహ్ కోరినట్లు మరియు మీరు కోరినట్లు” అని అన్నాడు. ప్రవక్త ఇది విని “ఏమిటి? నన్ను అల్లాతో సాటి కల్పిస్తున్నావా? అల్లాహ్ మాత్రమే కోరినట్లు అని పలుకు” అని బోధించారు. (నసాయి). 

ఆయిష రజియల్లాహు అన్హా యొక్క (తల్లి తరఫున) సోదరుడు తుఫైల్ ఉల్లేఖించారు: “నేను యూదుల వద్దకు వచ్చినట్లు, ఈ విధంగా సంభాషించి నట్లు స్వప్నంలో చూసాను. “ఉజైర్ అల్లాహ్ కుమారుడు అని మీరు చెప్పక పోతే మీరు మంచివారు” అని అన్నాను. అప్పుడు వారన్నారు: “అల్లాహ్ కోరినట్లు, మరియు ముహమ్మద్ కోరినట్లు” అని మీరు చెప్పకపోతే మీరూ మంచివారు”. మళ్ళి నేను క్రైస్తవుల వద్దకు వెళ్ళాను. వారితో చెప్పాను: “యేసు అల్లాహ్ కుమారుడు” అని చెప్పకపోతే, మీరు మంచివారు. అప్పుడు వారన్నారు: “అల్లాహ్ కోరినట్లు, మరియు ముహమ్మద్ కోరినట్లు” అని మీరు చెప్పకపోతే మీరూ మంచివారు”. తెల్లవారిన తరువాత ఈ విషయం కొందరికి తెలిపి, మళ్ళి ప్రవక్త వద్దకు వచ్చి వారికీ తెలియజేసాను. “నీవు ఎవరికైనా ఈ విషయం చెప్పావా?” అని ఆయన అడిగారు. “అవును” అన్నాను. అప్పుడు ఆయన అల్లాహ్ స్తోత్రములు పఠించి, ఇలా చెప్పారు: తుఫైల్ ఒక స్వప్నం చూశాడు. మీలో కొందరికి తెలిపాడు. మీరు ఒక మాట అంటుంటారు. దాన్ని నివారించకపోవడానికి ఫలాన, ఫలాన కారణం ఉండింది. ఇప్పుడు నివారిస్తున్నాను. ఇక మీరు “అల్లాహ్ కోరినట్లు, మరియు ముహమ్మద్ కోరినట్లు” అని చెప్పకండి. “కేవలం అల్లా కోరినట్లు” అని చెప్పండి. 

ముఖ్యాంశాలు: 

1- యూదులకు చిన్న షిర్క్ గురించి తెలుసు. 

2- మానవుడు తలచుకుంటే (సత్యం, అసత్యంలో) వ్యత్యాసం తెలుసుకోగలడు. 3- పై హదీసులో సహచరుడు అన్న మాటపై “ఏమిటి? నన్ను అల్లాతో సాటి కల్పుతున్నావా?” అని ప్రవక్త అన్నారు. అయితే “యా అక్రమల్ ఖలిఖి మాలీ మన్ అలూజు బిహీ సివాక” (ఓ మానవుల్లో శ్రేషులైనవాడా! నేను మిమ్మల్ని కాదని ఇంకెవరి శరణు కోరాలి? లాంటి పదాలు, కవిత్వాలు పాడువారిని వింటే ఇంకేమందురో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం!!. 

4- “అల్లాహ్ కోరినట్లు మరియు మీరు కోరినట్లు” అనుట షిర్కె అక్బర్ కాదు అని తెలుస్తుంది. ఎలా అనగా (ఒక వేళ అది షిర్కె అక్బర్ అయి ఉంటే) “ఇది వరకే దాన్ని నివారించేవాడిని కాని ఫలాన ఫలాన ఆటంకము ఉండేది అని ప్రవక్త అనేవారు కాదు. 

5- మంచి స్వప్నం కూడా వహీ భాగాల్లో ఒకటి. 

6- మంచి స్వప్నం కూడా ఒక్కప్పుడు కొన్ని ధార్మిక ఆధారాలకు కారణం అవుతుంది. (కాని ఇది ప్రవక్త జీవిత కాలం వరకే పరిమితం). 

45 వ అధ్యాయం: కాలాన్ని దూషించువారు, వాస్తవంగా అల్లాహ్ ను బాధ పెట్టినవారే

అల్లాహ్ (తఆలా) చెప్పాడు:

وَقَالُوا مَا هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنَا إِلَّا الدَّهْرُ

వారు ఇలా అంటారు: “జీవితం అంటే కేవలం మన ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. ఇక్కడే మన మరణం, ఇక్కడే మన జీవితం. కాల పరిభ్రమణం తప్ప, మనలను ఏదీ చంపలేదు”. (జాసియ 45:24).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:

ఆదము సంతానం (మానవులు) కాలాన్ని దూషిస్తూ నాకు బాధ కలిగిస్తున్నారు. నిజానికి కాలం కూడా నేనే. నేనే రాత్రిని, పగటిని ఒకదాని వెనుక మరొకటి వచ్చేలా త్రిప్పుతున్నాను“. (బుఖారి: 4826. ముస్లిం: 2985).

మరొక ఉల్లేఖనం లో ఇలా ఉంది:

కాలాన్ని దూషించకండి. అల్లాహ్ యే కాలం (కాల చక్రం తిప్పువాడు)“.

ముఖ్యాంశాలు:

1- కాలాన్ని దూషించుట నివారించబడింది.

2. కాలాన్ని దూషించడాన్ని అల్లాహ్ ను బాధపెట్టడమే.

3- “అల్లాహ్ యే కాలాన్ని (త్రిప్పువాడు)” అన్న విషయం పై శ్రద్ధ చూపాలి.

4- ఉద్దేశపూర్వకంగా కానప్పటికీ కొన్ని సమయాల్లో మానవుని నోట తిట్లు వెలువడుతాయి. (అలక్ష్యంగా ఉండవదు).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

అజ్ఞాన కాలంలో ఇది చెలామణి ఉండినది. ఇప్పుడు అనేక పాపాత్ములు, బుద్ధిహీనులు, కాలం, వారి కోరికలకు వ్యెతిరేకంగా ఉన్నట్లు చూసి కాలాన్ని తిడతారు. ఒక్కోసారి శాపనార్థాలు పెడుతారు. ఇది వారి ధర్మలోపం, బుద్ధి తక్కువ తనం వల్ల జరుగుతుంది.

వాస్తవానికి “కాలం” చేతిలో ఏమీ లేదు. దానికి ఎలా ఆజ్ఞ అవుతుందో అలా నడుస్తుంది. దానిలో మార్పులు వివేకుడు, శక్తివంతుడైన అల్లాహ్ ఆజ్ఞ వల్ల సంభవిస్తాయి. అందుచేత ఇలా తిట్లు, దూషణలు దాన్ని త్రిప్పుతున్నవానికి బాధ కలిగించుతాయి.

ఇది ధర్మంలో లోటు, బుద్ధిలో కొరతకు నిదర్శనం. దీని వల్ల విషయం మరింత గంభీరం అవుతుంది. సహనం ద్వారాలు మూయబడుతాయి. ఇది తౌహీద్ కు వ్యెతిరేకం అవుతుంది.

అన్ని రకాల మార్పులు అల్లాహ్ నిర్ణయించిన, వ్రాసిన విధివ్రాత ప్రకారం సంభవిస్తాయని పూర్తి వివేకముతో విశ్వాసి గ్రహిస్తాడు. ఎందులో అల్లాహ్ ఆయన ప్రవక్త లోపము తెలుపలేదో అందులో అతను ఏ లోపము చూపడు. అల్లాహ్ యొక్క ప్రతి వ్యవహారంతో సంతృప్తి చెందుతాడు. ఆయన ఆజ్ఞను సంతోషంతో స్వీకరిస్తాడు. ఇలా అతడు మనశ్శాంతి, తృప్తి పొందుతాడు. అతని తౌహీద్ సంపూర్ణం అవుతుంది.

46వ అధ్యాయం: ఖాజియుల్ ఖుజాత్ లాంటి బిరుదులు ధర్మసమ్మతమేనా?

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైరా ఉల్లేఖించారు: “ఎవరైనా “మలికుల్ అమ్లాక్” అని పేరు పెట్టుకుంటే అది అల్లాహ్ దృష్టిలో అతి నీచమైన పేరుగా పరిగణించబడుతుంది. అల్లాహ్ తప్ప మరెవ్వడు రాజు కాడు”. (బుఖారి. ముస్లిం). 

“మలికుల్ అమ్లాక్” అంటే (రాజాధిరాజు) అని సుఫ్యాన్ అన్నారు. మరొక ఉల్లేఖనలో ఉంది: “ప్రళయదినాన అందరికన్నా ఎక్కువ అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యేవాడు, నీచుడు……….” అని అర్థము. 

ముఖ్యాంశాలు: 

1- ‘రాజాధిరాజు’ అని పేరు పెట్టుకొనుట నివారించబడింది. 
2- సుఫ్యాన్ చెప్పిన ప్రకారం ‘రాజాధిరాజు’ లాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు. 
3- ఎంత కఠినంగా దీన్ని నివారించబడిందో దాన్ని గ్రహించాలి. మనుస్సులో ఆ భావం లేకున్నా దాన్ని ఉపయోగించరాదు. 
4- ఇది అల్లాహ్ గౌరవ మర్యాదలకు వ్యెతిరేకముగా ఉన్నందున నివారించబడింది. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

ఇది మరియు దీని తరువాత ఆధ్యాయం, దీనికి ముందు అధ్యాయం యొక్క భాగమే. అదేమనగా మాటలు, చేష్టలు మరియు సంకల్పంలో ఎంత మాత్రం అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించవద్దు. ఏ ఒక్కరూ అల్లాహ్ నామాల్లో, గుణాల్లో భాగస్వామ్యం చూపునటువంటి పేరు పెట్టకూడదు. ఉదాహరణకు: న్యాయాధిపతి. రాజాధిరాజు. సార్వభౌముడు. అబుల్ హకం లాంటివి. ఇవన్నియు తౌహీద్ మరియు అల్లాహ్ నామాల, గుణాల రక్షణ కొరకు మరియు ఏ పదాల ద్వారా అల్లాహ్ హక్కుల్లో, ప్రత్యేకతల్లో ఇతరుల భాగస్వామ్యం ఉందని అనుమానం వస్తుందో అలాంటి షిర్క్ యొక్క సాధనాలను అంతమొందించుటకు చెప్పబడినవి. 

47వ అధ్యాయం: అల్లాహ్ నామాల పట్ల గౌరవం మరియు అందుకోసం పేరు మార్చుట

అబూ షురైహ్ కథనం: అతను ‘అబుల్ హకం‘ అనే విశేష నామము (surname)తో పిలువబడేవారు. ప్రవక్త అతనికి ఇలా ఉపదేశించారు: “హకం అల్లాహ్ మాత్రమే. హుకుం (ఆజ్ఞ, ఆదేశం) అతనిది మాత్రమే నడుస్తుంది“. అప్పుడు అతనన్నాడు: “నా జాతివారు విబేధాల్లో పడినప్పుడు నా వద్దకు వచ్చేవారు. నేను వారి మధ్య తీర్పు చేసేవాణ్ణి. వారి రెండు వర్గములవారు నా తీర్పుతో సంతృప్తి పడేవారు. “ఇది చాలా మంచి విషయం. అయితే నీ సంతానం ఎవరెవరు?” అని అడిగారు ప్రవక్త. “షురైహ్”, “ముస్లిం”, “అబ్దుల్లా” అని నేను వివరించారు. “వారిలో పెద్ద ఎవరు?” అని అడిగారు ప్రవక్త. “షురైహ్” అని నేను చెప్పాను. “అయితే నీవు ” అబూ షురైహ్” అని ప్రవక్త చెప్పారు. (అబూ దావూద్). 

ముఖ్యాంశాలు: 

 • 1- అల్లాహ్ నామములను, గుణాలను గౌరవించాలి. ఇతరుల కొరకు ఆ నామములను ఉపయోగించినప్పుడు ఆ భావం లేకున్నా సరే. 
 • 2- అల్లాహ్ గౌరవంలో భాగముగా ఉన్న పేర్లను మార్చవచ్చును. 
 • 3- surname (విశేష నామము) కొరకు పెద్ద కుమారుని పేరును ఎన్నుకోవాలి. 

48వ అధ్యాయం: ఖుర్ఆన్, ప్రవక్త మరియు అల్లాహ్ వచనములతో పరిహాసం

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِٱللَّهِ وَءَايَـٰتِهِۦ وَرَسُولِهِۦ كُنتُمْ تَسْتَهْزِءُونَ
“మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అను: “మీ వేళాకోళం, అల్లాహ్ తోనా? ఆయన ఆయతులతోనా? ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డారు”. (9: తౌబా: 65). 

అబ్దులాహ్ బిన్ ఉమర్, ముహమ్మద్ బిన్ కఅబ్, జైద్ బిన్ అస్లం మరియు ఖతాద రజియల్లాహు అన్హుంల కథనం:- వారి హదీసు పదాలు వేరు వేరు ఉన్నాయి కాని భావం ఒకటే – అది :

“తబూక్ యుద్ధంలో ఒక కపటవిశ్వాసి ఇలా అన్నాడు: “మా ఈ ఖుర్ఆనేవేత్తల కంటే ఎక్కువ కడుపుగోరువారు, అసత్యులు మరియు యుద్ధ మైదానము నుండి వెనకుండే వారెవరినీ మేము చూడలేదు”. అంటే ప్రవక్త ఆయన సహచరులూ అని అతని ఉద్దేశం. ఇది విన్న వెంటనే ఔఫ్ బిన్ మాలిక్ “అలా కాదు! నీవు అబద్ధం పలుకుతున్నావు. నీవు మునాఫిఖ్ (కపటవిశ్వాసి). నీ ఈ విషయం తప్పక ప్రవక్తకు తెలుపతాను” అని ప్రవక్త ﷺ వద్దకు వెళ్ళారు. కాని ఆయనకు ముందే ప్రవక్త ﷺ వద్దకు వహీ వచ్చింది. (ఆ విషయం ప్రవక్తకు తెలిసింది). ఆ కపటవిశ్వాసి కూడ (సాకు చెప్పుటకు) వెనకే వచ్చాడు. అప్పుడే ప్రవక్త ప్రయాణ ఉద్దేశంతో ఓంటెపై ఎక్కారు. “ప్రవక్తా! మేము కేవలం ఉల్లాసానికి, ప్రయాణపు అవస్థ దూరుమగుటకు ఎగితాళి చేస్తుంటిమి” అని సాకులు చెప్ప సాగాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ఇప్పటికీ ఆ సంఘటన నా కళ్ళలో మెదులుతూ ఉంది: అతను ప్రవక్త ఒంటె పల్లము యొక్క త్రాడు పట్టుకొని ‘మేము పరియాచకము చేస్తుంటిమి అని అంటున్నాడు. ప్రవక్త అతనికి జవాబులో “మీ వేళాకోళం, అల్లాహ్ తోనా, ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా?” ఈ వాక్యం మట్టుకు వినిపిస్తున్నారు. అతని వైపు తిరిగి చూడనూ లేదు. దానికి మించి ఒక్క అక్షరం పలుకనూ లేదు. (ఇబ్ను జరీర్: 10/119. ఇబ్ను అబీ హాతిం). 

ముఖ్యాంశాలు: 

 • 1- ఇందులో తెలిసిన ముఖ్య విషయమేమనగా ఎవరు ఇస్లాంకు సంబంధిత విషయాలతో ఎగితాళి చేస్తాడో అతడు అవిశ్వాసుడవుతాడు. 
 • 2- ఎగితాళి చేయువారెవరైనా సరే, పై వాక్యం వెలుగులో అతను (అవిశ్వాసానికి ఒడిగట్టినట్లే). 
 • 3- చాడీలు చెప్పడం, మరియు అల్లాహ్ ఆయన ప్రవక్త పట్ల శ్రేయోభిలాష చూపడంలో చాలా వ్యత్యాసం ఉంది. (అంటే ఔఫ్ బిన్ మాలిక్, ఆ వంచకుని విషయం, ప్రవక్తకు తెలుపుట, చాడీల్లో లెక్కించబడదు). 
 • 4- స్వయం అల్లాహ్ ప్రేమించునటువంటి మన్నింపు, క్షమాపణ మరియు అల్లాహ్ శతృవులపై కఠినత్వం చూపుటలో చాలా తేడా ఉంది. 
 • 5- కొన్ని సందర్భాల్లో సాకులు ఒప్పుకోబడవు. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

ఖుర్ ఆన్, ప్రవక్త మరియు అల్లాహ్ నామ స్మరణ ఎందులో ఉందో వాటితో పరిహాసమాడటం విశ్వాసానికి వ్యెతిరేకం. ధర్మభ్రష్టతకు కారణం. అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను, గ్రంథాలను విశ్వసించడం, వాటిని గౌరవించడం మరియు మర్యాద చూపడం ధర్మం, మరియు విశ్వాస భాగమే. ఎగితాళి, పరిహాసం శుద్ధ అవిశ్వాసం కన్నా చాలా భయంకరమైనది. ఎందుకనగా ఇది అవిశ్వాసమే గాకుండా ధర్మంతో పరిహాసము చేయడం కూడా అవుతుంది. అవిశ్వాసులు రెండు రకాలు: (1). తిరస్కారులు. (2). అభ్యంతరము, ఆక్షేపము చేసేవారు. 

ఇందులో రెండో రకంవారే అల్లాహ్ ఆయన ప్రవక్తతో యుధ్ధానికి సిద్ధమైనవారు. వారే అల్లాహ్ ధర్మంలో, ఆయన ప్రవక్త విషయంలో, అనవసర జోక్యం చేసుకుంటూ విమర్శలు, ఆక్షేపములు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారే కఠిన అవిశ్వాసులు, మహాకల్లోలం, కలతలు సృష్టించేవారు. 

49వ అధ్యాయం:

అల్లాహ్ ఆదేశం:

وَلَئِنْ أَذَقْنَـٰهُ رَحْمَةًۭ مِّنَّا مِنۢ بَعْدِ ضَرَّآءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَـٰذَا لِى
కష్టకాలం తీరిపోయిన తరువాత, మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపినప్పుడు ఇలా అంటాడు, “నేను అసలు దీనికి అర్హుడనే “. (41: హామీ అస్సజ్దా: 50). 

పై ఆయతులో “నేను అసలు దీనికి అర్హుడనే ” అనే పదాన్ని వ్యాఖ్యానిస్తూ ముజాహిద్ రహిమహుల్లాహ్ చెప్పారు: “ఇది నా కష్టార్జితం. దీనికి నేను అర్హుడను”. 

ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఇలా వ్యాఖ్యానించారు: ఈ సంపద నా దగ్గరిదే.”

సూరె ఖసస్ లోని వాక్యం : ఖారూన్ అన్నాడు: “నాకు లభ్యమైన జ్ఞానం మూలంగానే ఇదంతా నాకు ఇవ్వబడింది” (28: 78)ను వాఖ్యానిస్తూ ఖతాద రహిమహుల్లాహ్ చెప్పారు: “వ్యాపారంలో నాకున్న ప్రావీణ్యత, అనుభవం ద్వారా ఈ ధనం లభ్యమైంది.”

మరి కొందరు వ్యాఖ్యానికులు ఇలా చెప్పారు: నేను దీనికి అర్హుణ్ణి అని అల్లాహ్ కు తెలుసు కనుక ఇది నాకు లభించింది. 

ముజాహిద్ రహిమహుల్లాహ్ చెప్పింది ఇదే భావం: నా ఉన్నతి, గౌరవాన్నిబట్టి ఇది నాకు ఇవ్వబడింది. 

అబూ హురైర రజియల్లాహు అన్హు కథనం: ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నారు:

“పూర్వ ఇస్రాఈల్ సంతతిలో ఒక కుష్టు రోగి, ఒక అంధుడు మరియు ఒక బట్టతలవాడు ఉండేవారు. ఆ ముగ్గురిని పరీక్షించాలన్న ఉద్దేశంతో అల్లాహ్ వారివద్దకు ఒక దూతను పంపాడు. అతను కుష్టురోగి వద్దకు వచ్చి, “నీకు అతి ప్రియమైనదేమిటి?” అని అడిగాడు. దానికా కుష్టురోగి “అందమైన రంగు, చర్మం. ముందు ఈ వ్యాధిపోవాలి. దీని మూలంగానే జనం నన్ను అసహ్యించుకుంటున్నారు” అని అన్నాడు. దైవదూత అతని శరీరాన్ని స్పృశించాడు. దాంతో అతని కుష్టురోగం తొలిగిపోయి అందమైన చర్మం, ఆకర్షవంతమైన రంగు లభించాయి. అప్పుడు దైవదూత అతనితో “నీకెలాంటి సంపద అంటే ఇష్టం”? అని అడిగాడు మళ్ళీ. దానికా వ్యక్తి “నాకు ఒంటెలంటే ఇష్టం” అని అన్నాడు. వెంటనే అతనికి పది నెలల సూడి ఒంటె ప్రసాదించబడినది. దైవదూత అతడ్ని ఆశీర్వదిస్తూ “అల్లాహ్ నీ పశుసంపదలో శుభాభివృద్ధులు ప్రసాదించుగాక” అని అన్నాడు. ఆ తరువాత దైవదూత బట్టతలవాడి దగ్గరకు వెళ్ళి “నీకు అన్నిటికంటే ఎక్కువ ఏది ఇష్టం?” అని అడిగాడు. “నాకు అందమైన శిరోజాలంటే ఇష్టం. నా బట్టతలను చూసి జనం నన్ను అసహ్యించుకుంటున్నారు. అందుచేత ముందు ఈ బట్టతల తొలిగి పోయి మంచి వెంట్రుకలు రావాలి” అన్నాడు. దైవదూత తన చేతితో అతని తల నిమిరాడు. దానితో అతని బట్టతలపై అందమైన వెంట్రుకలు వచ్చేశాయి. “మరి నీకెలాంటి సంపదంటే ఇష్టం?” అని అడిగాడు దైవదూత మళ్ళీ దానికా వ్యక్తి “నాకు ఆవులంటే మహా యిష్టం” అన్నాడు. వెంటనే దైవదూత అతనికి సూడి ఆవు ఇచ్చేశాడు. పైగా “అల్లాహ్ నీ ఈ పశుసందపలో శుభాభివృద్ధులు కలిగించుగాకా” అని దీవించాడు. ఆ తరువాత దైవదూత అంధుడి దగ్గరకు వెళ్ళి “నీకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన వస్తువేది?” అని అడిగాడు. దానికా వ్యక్తి “అల్లాహ్ నాకు దృష్టి ప్రసాదిస్తే లోకవాసులను చూడగలను” అని అన్నాడు. దైవదూత అతని కళ్ళపై చెయ్యి తిప్పాడు. అల్లాహ్ అతనికి దృష్టి ప్రసాదించాడు. అప్పుడు దైవదూత “సరే, నీకు ఎలాంటి సంపద అంటే ఇష్టం?’ అని అడిగాడు. దానికా వ్యక్తి “నాకు మేకలంటే ఇష్టం” అని అన్నాడు. దైవదూత అతనికి సూడి మేక ఇచ్చాడు. 

కొంతకాలంలో దైవదూత ఇచ్చిన ఒంటె, ఆవు, మేక ప్రసవించి పశుసంపద వృద్ధి చెందింది. కుష్టురోగి దగ్గర ఒంటెల మంద, బట్టతల వాని దగ్గర ఆవుల మంద, అంధుని దగ్గర మేకల మందలు వృద్ధి చెందాయి. 

కొంత కాలం గడిచిన తరువాత ఆ దైవదూత ఇది వరకటి లాగే మానవాకారంలో (ఒకప్పటి కుష్టురోగి దగ్గరకు వచ్చి “నేనొక పేదవాడ్ని, ప్రయాణంలో నా ప్రయాణసామాగ్రి అంతా ఖర్చు అయినది. ఇప్పుడు నేను అల్లాహ్ (దయ), తరువాత నీ సహాయం లేకుండా నా యింటికి కూడా చే రుకోలేని పరిస్థితి వచ్చింది. అందుచేత నీకు అందమైన దేహం, రూపం, సిరిసంపదలు ప్రసాదించిన అల్లాహ్ పేరుతో అర్థిస్తున్నాను. నాకొక ఒంటెను దానం చెయ్యి. దాని మీద సవారీ చేసి నేను నా ఇంటికి చేరుకుంటాను” అని అన్నాడు. దానికా కుష్టురోగి (తన గత జీవాతాన్ని విస్మరించి) ప్రస్తుతం నా బాధ్యతలు, ఖర్చులు బాగా పెరిగిపోయాయి (నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను)” అని అన్నాడు. దైవదూత ఈ మాటలు విని “బహుశా నేను నిన్ను గుర్తుపట్టాననుకుంటా. నీవు గతంలో కుష్టరోగిగా ఉండేవాడివి కదూ?. దాని వల్ల జనం నిన్ను అసహ్యించుకునేవారు. నీవు పేదవాడిగా ఉంటే, అల్లాహ్ నీకు ఈ సంపద ప్రసాదించాడు. ఔను కదూ?” అని అన్నాడు. కుష్టురోగి (ఈ వాస్తవాలను అంగీకరించకుండా) ఈ సిరి సంపదలు తరతరాల నుంచి వస్తూ నాకు వారసత్వంలో లభించాయి” అని అన్నాడు. దానికి దైవదూత “నీవు చెప్పింది అబద్ధమయితే అల్లాహ్ నిన్ను తిరిగి పూర్వస్థితికి చేర్చుగాక!” అని శపించాడు. 

ఆ తరువాత దైవదూత తన మొదటి రూపంలోనే బట్టతల వాని దగ్గరకు వెళ్ళి, కుష్టురోగితో అన్న మాటలే అతనితో కూడా అన్నాడు. దానికి బట్టతల వాడు కూడా కుష్టురోగి ఇచ్చినటువంటి సమాధానమే ఇచ్చాడు. దైవదూత అతడ్ని కూడా శపిస్తూ “నీవు చెప్పింది అబద్ధమయితే అల్లాహ్ నిన్ను పూర్వ స్థితికి తిరిగి చేర్చుగాక!” అని అన్నాడు. 

అక్కడి నుండి దైవదూత తన మొదటి ఆకారంలోనే అంధుని దగ్గరకు వెళ్ళి “నేనొక నిరుపేదను, బాటసారిని, నా ప్రయాణ సామగ్రి అంతా అంతమయిపోయింది. ప్రస్తుతం నేను అల్లాహ్ (దయ), తరువాత నీ సహాయం లేకుండా నా ఇంటికి చేరుకోలేని పరిస్థితి వచ్చింది. అందుచేత నీకు దృష్టి ప్రసాదించిన అల్లాహ్ పేరుతో అర్థిస్తున్నాను. నాకొక మేకను ఇవ్వు. దాంతో నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను” అని అన్నాడు. దానికా అంధుడు సమాధానమిస్తూ “నిజమే, నేను అంధుడిగా ఉన్నప్పుడు అల్లాహ్ నాకు దృష్టి ప్రసాదించాడు. నేను పేదవాడిగా ఉన్నప్పుడు ఆయన నన్ను ధనికుడిగా చేశాడు. నేనాయన పట్ల కృతజ్ఞతగా నా ఆస్తిలో నీవు కోరుకున్నది తీసుకునే అధికారం నీకిస్తున్నాను. అల్లా సాక్షి! ఈ రోజు నీవు అల్లాహ్ పేరుతో (నా ఆస్తిలో) ఏది తీసుకున్నా దానికి నేనెలాంటి అభ్యంతరం చెప్పను (నీవు నిస్సంకోచంగా తీసుకో)” అని అన్నాడు. దైవదూత ఈ మాటలు విని “నీ సంపద నీకే శుభప్రదం (నాకేమీ అవసరం లేదు). ఇది ఒక పరీక్ష మాత్రమే. (ఇందులో నీవు నెగ్గావు) తత్ఫలితంగా అల్లాహ్ నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. ఈ పరీక్షలో) నీ సహచరులిద్దరు (విఫలమయి) అల్లాహ్ ఆగ్రహానికి గురయిపోయారు” అని అన్నాడు. (బుఖారీ. ముస్లిం. లూలు వల్ మర్గాన్ 1868). 

ముఖ్యాంశాలు: 

1- ఈ అధ్యాయంలోని మొదటి వాక్యం యొక్క వ్యాఖ్యానం.
2- “నేను అసలు దీనికి అర్హుణ్ణి” యొక్క భావం. 
3- “నాకు లభ్యమైన జ్ఞానం మూలంగానే ఇదంతా నాకు ఇవ్వబడింది” యొక్క భావం. 
4- ఈ విచిత్రమైన వృత్తాంతములో చాలా గొప్ప గుణపాఠాలున్నవి. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

ఈ అధ్యాయం ద్వారా తెలిసేదేమిటంటే: ఏ వ్యక్తి తనకు లభించిన అనుగ్రహం, ఉపాధి స్వయంగా తన కృషి, జ్ఞానం, నైపుణ్యంతో లభించిందని భావిస్తాడో, లేక అతను దానికి అర్హుడని, తనకు ఇలా ప్రసాదించడం అల్లాహ్ విధి అని అనుకుంటాడో, ఇలా అనుకొనుట, భావించుట తౌహీదు కు వ్యెతిరేకం. ఎందుకనగా స్వచ్ఛమైన విశ్వాసి తనపై ఉన్న అల్లాహ్ యొక్క అన్ని అనుగ్రహాలను అవి బాహ్యంగా ఉన్నా, గుప్తంగా ఉన్నా, అవి అల్లాహ్ దయతో, ఆయన తరఫు నుండి అని విశ్వసించి, అందుకు అల్లాహ్ స్తోత్రము పఠిస్తాడు. అల్లాహ్ విధేయతలో వాటి సహకారం పొందుతాడు. ఇలా లభించడం అల్లాహ్ పై ఉన్న తన హక్కు అని భావించడు. అన్ని హక్కులు అల్లాహ్ కే ఉన్నాయి. అతడు కేవలం అల్లాహ్ దాసుడు. ఇలా తౌహీద్ విశ్వాసం పరిపూర్ణమవుతుంది. దీనికి వ్యెతిరేకమైనది కృతఘ్నత అవుతుంది. అహంకారం, మనోవాంఛల అనుసరణ తప్పుల్లో అతి చెడ్డది. 

50వ అధ్యాయం:

అల్లాహ్ ఆదేశం:

فَلَمَّآ ءَاتَىٰهُمَا صَـٰلِحًۭا جَعَلَا لَهُۥ شُرَكَآءَ فِيمَآ ءَاتَىٰهُمَا ۚ فَتَعَـٰلَى ٱللَّهُ عَمَّا يُشْرِكُونَ
“అప్పుడు అల్లాహ్ వారికి ఒక చక్కని, ఏ లోపమూ లేనటువంటి పిల్లవాణ్ణి ప్రసాదించాడు. కాని వారు ఆయన ప్రసాదించిన ఈ కానుక విషయంలో ఇతరు లను ఆయనకు భాగస్వాములుగా చేయసాగారు”. (7: ఆరాఫ్: 190). 

ఇబ్ను హజం చెప్పారు: ఏ పేరులో ‘అల్లాహ్ యేతరుల దాసుడు’ అన్న భావం వస్తుందో అది నిషిద్ధం అని ఏకీభవించబడినది. ఉదాహరణకు: అబ్దు అమర్, అబ్దుల్ కాబ మొదలైనవి. కాని ప్రవక్త తాత ‘అబ్దుల్ ముత్తలిబ్’ పేరు ఇలాంటిది కాదు. (అయినా ఎవరు ఆ పేరు పెట్టవద్దు). 

ముఖ్యాంశాలు: 

1- అల్లాహ్ యే తరులకు దాసుడు అన్న భావం గల పేరు చేర్చుట నిషిద్ధం.
2-పై వాక్యం యొక్క వ్యాఖ్యానం తెలిసింది. 
3- అసలు భావం ఉద్దేశించక పోయినా కేవలం పేరు మూలంగా షిర్క్ అవుతుంది. 
4- ఏ అంగవైకల్యం లేకుండా సంతానం కలగడం కూడా అల్లాహ్ యొక్క గొప్ప దయ. 
5- విధేయతలో గల షిర్క్, ఆరాధనలో గల షిర్క్ మధ్య సలఫే సాలిహీన్ (సత్పురుషులైన పూర్వీకులు) వ్యత్యాసం పాటించేవారు. 

51వ అధ్యాయం:

అల్లాహ్ ఆదేశం:

وَلِلَّهِ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ فَٱدْعُوهُ بِهَا ۖ وَذَرُوا۟ ٱلَّذِينَ يُلْحِدُونَ فِىٓ أَسْمَـٰٓئِهِۦ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا۟ يَعْمَلُونَ
“అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగేవారిని వదలి పెట్టండి”. (7: ఆరాఫ్: 180). 

పై ఆయతులో “వైదొలగేవారిని” అంటే షిర్క్ చేసేవారిని అని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్పారని ఇబ్ను అబీ హాతిం తెలిపారు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు చెప్పారు: ముష్రికులు తమ దేవతల్లో ‘లాత్’ పేరు అల్లాహ్ తో, ‘ఉజ్జా’ పేరు ‘అజీజ్’తో పెట్టారు. (ఇది కూడ ఒక షిర్క్ లాంటి విషయమే). 

అఅమష్ చెప్పారు: అల్లాహ్ తన కొరకు తెలుపని పేర్లు, ఆయనకున్నవని తెలుపుట కూడా సత్యం నుండి వైదొలగినవారిలో పరిగణించబడుతారు. 

ముఖ్యాంశాలు: 

1- అల్లాకు అనేక నామములు గలవు. 
2- అల్లాకు గల నామములన్నియూ సుందరమైనవే. 
3- ఆ నామములతో వేడుకోవాలని (ప్రార్థించాలని) ఆదేశించబడింది. 
4- అందులో వక్ర మార్గాన్ని అవలంభించిన మూర్ఖుల నుండి దూరముండాలి. 
5- అల్లాహ్ నామాల్లో సత్యం నుండి వైదొలగుట అంటేమిటో తెలిసింది.
6- అందులో సత్యం నుండి వైదొలగినవారికి కఠిన హెచ్చరిక గలదు. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

అల్లాహ్ స్వయంగా తన కొరకు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు తెలిపిన మంచి నామములను విశ్వసించుటయే తౌహీద్ యొక్క మూలం. అదే విధంగా వాటి గొప్ప భావాల, అందులో ఉన్న సూక్ష్మ విషయాల జ్ఞానం తెలుసుకొనుట. వాటితో అల్లాహ్ ను వేడుకొనుట, ఆరాధించుట కూడా తప్పనిసరి. 

మానవుడు ఎప్పుడు దుఆ చేసినా – అది తన ప్రాపంచిక, పరలోక (ఏ దాని గురించైనా) అల్లాహ్ నామాల్లో తన అవసరానికి తగిన నామము యొక్క ఆధారంతో దుఆ చేయాలి. ఉదాహరణకు: ఉపాధి కొరకు దుఆ చేయునప్పుడు “రజ్జాఖ్” (ఉపాధినిచ్చేవాడు) నామముతో, కరుణ, క్షమాపణ కోరినప్పుడు “రహీం” (నిరంతరం కనికరం చూపేవాడు), “రహ్మాన్” (అనంత కరుణ జూపేవాడు), “బర్ర్” (మహెూపకారి), “కరీం” (అనుగ్రహించేవాడు), “అఫువ్వ్” (అత్యధికంగా మన్నించేవాడు), “గపూర్” (అత్యధికంగా క్షమించేవాడు), “తవ్వాబ్” (పాపుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు) లాంటి నామములతో దుఆ చేయవలెను. 

ఆరాధనా రీత్యా ఆయన నామములను, గుణవిశేషాలతో వేడుకొనుట మరీ ఉత్తమం. వేడుక సందర్భంలో నామముల భావాల్ని మనస్సులో తెచ్చుకోవాలి. హృదయాంతరంలో వాటి ప్రభావం దిగిపోవాలి. ఉదాహరణకు: మహత్యం, గౌరవం, ఘనత, వైభవం గల పేర్లతో ఆయన గౌరవం, మహత్యం మనస్సులో నిండిపోవాలి. ఉపకారం, కనికరం భావాలుగల ఆయన నామములతో ఆరాధించినప్పుడు మనస్సు ఆయన ప్రేమ, కృతజ్ఞతా భావంతో నిండిపోవాలి. విద్య, వివేకం, అధికారం, శక్తి భావంగల పేర్లతో మనస్సు ఆయన భయబీతి, ఆయన ఎదుట వినమ్రతతో నిండిపోవాలి. సూక్ష్మజ్ఞానం, దృష్టి భావంగల నామములతో మనస్సులో ఆయన తన చేష్టలను చూస్తున్నాడన్న, తన దుస్సంకల్పం, దురుద్దేశాన్ని గమనిస్తున్నాడన్న భయం కలగాలి. అక్కరలేనివాడు, ఇతర అవసరాలను తీర్చువాడు అన్న భావంగల నామములతో వేడుకుంటూ అన్ని సందర్భాల్లో ఆయన వైపునకు మరలే గుణం మనస్సులో కలగాలి. అల్లాహ్ నామగుణాలను తెలుసు కున్నప్పుడే హృదయానికి ఆ ప్రభావం కలుగుతుంది.. 

అల్లాహ్ నామగుణాల విషయంలో, సత్యం నుండి వైదొలుగుట, పైన తెలిపినవాటికి బద్ద విరుద్ధం. దాని రకాలు:- 

 • వాటి అర్థాల్ని, భావాల్ని తిరస్కరించే ధైర్యం “జహ్ మియా” అను ఒక వర్గం చేసింది. 
 • లేక సృష్టి గుణాలతో పోల్చటం. ఇలా “రాఫిధ”లోని ఒక వర్గం చేసింది. అందుకు వారిని “ముషబ్బిహ” అంటారు. 
 • లేక సృష్టిలోని కొందరికి అలాంటి పేర్లు పెట్టుట. ఇలా ‘ముష్రికులు’ చేశారు. అల్లాహ్ యొక్క పేరు ఇలాహాతో లాత్, అజీజ్తో ఉజ్జా, మన్నాన్ తో మనాత్ అని తమ దేవతల పేర్లు పెట్టుకున్నారు. ఆ తరువాత అల్లా కు గల ప్రత్యేక హక్కులు వారికి ఇచ్చేశారు. 

ఈ రూపాల్లో ఏ ఒక్కటి సంభవించినా అల్లాహ్ పేర్లలో సత్యం నుండి వైదొలిగినట్లే. పదాల్లో, వాటి భావంలో మార్పు చేయుట. దానికున్న సరియైన భావాన్ని వదలి వక్ర భావం తెలుపుట. ఇవన్నియు తౌహీదు వ్యెతిరేకం. 

52వ అధ్యాయం: ‘అల్లాహ్ కు సలాం’ అని చెప్పరాదు

అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్  రజియల్లాహు అన్హు కథనం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజు చేసినప్పుడు “తన దాసుల తరఫున అల్లాహ్ కు సలాం. ఫలాన వ్యక్తిపై సలాం” అని అనేవాళ్ళము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “అల్లాహ్ కు సలాం అని చెప్పకండి. అల్లాహ్ స్వయముగా సలాం (శాంతినిచ్చువాడు)”. (బుఖారీ, ముస్లిం). 

ముఖ్యాంశాలు: 

1- సలాం యొక్క వివరం తెలిసింది. 
2- ‘సలాం’ అనునది ఒక దుఆ, మరియు కానుక. 
3- అల్లాహ్ కు సలాం అని పలుకుట యోగ్యం కాదు. 
4- దాని కారణం కూడా తెలిసింది. 
5- అల్లాహ్ కొరకు ఎలాంటి సలాం తగినదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు నేర్పారు. (అదియే అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు…….). 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

“అల్లాహ్ యే  సలాం ప్రసాదించువాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశదీకరించారు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయన సృష్టిలో ఒకరితో పోలినవాడు కాడు. తన దాసులను ఆపదల, కష్టాల నుండి రక్షించేవాడు కూడా ఆయనే. మానవులు అతనిని ఏ మాత్రం నష్ట పరచలేరు. ఏదైనా లాభం చేకూర్చా లన్నా చేకూర్చలేరు. వారే అల్లాహ్ అవసరం కలవారు. వారి సర్వ వ్యవహారాల్లో ఆయన అక్కర కలవారు. కాని ఆయన మాత్రం సర్వసంపన్నుడు. స్వయంగానే స్తుతిపాత్రుడు, నిస్సహాయుడు. 

53వ అధ్యాయం: “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని చెప్పరాదు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ నీవు కోరితే క్షమించు. నీవు కోరితే కరుణించు అని అనరాదు. అలా కాకుండా దృఢ నమ్మకంతో, స్పష్టంగా అర్థించండి. అల్లాహ్ ను ఎవరు బలవంతం పెట్టలేరు”. (బుఖారీ. ముస్లిం. లూలు: 1716). 

మరొక ఉల్లేఖనలో ఉంది: “తన పెద్ద పెద్ద కోరికలను కూడా ఆయనతోనే కోరుకోవాలి. ఎందుకనగా అల్లాహ్ వద్ద ఏ వస్తువూ పెద్దదీ కాదు“. 

ముఖ్యాంశాలు: 

1- దుఆ చేస్తున్నప్పుడు “నీకు ఇష్టమైతే” అనకూడదు. 
2- దాని నివారణకు కారణం కూడా తెలుపబడింది. 
3- పూర్తి నమ్మకంతో దుఆ చేయాలని ఆదేశించబడింది. 
4- పెద్ద పెద్ద కోరికలైనా ఆయన ముందే ఉంచాలని ఆదేశించబడింది. 
5- దీని కారణం కూడా తెలియజేయబడింది. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

అన్ని పనులు, వ్యవహారాలు అల్లాహ్ కోరిన ప్రకారం, ఆయన ఇష్టంతోనే జరుగును. అయినా మానవుడు తన ధార్మిక సంబంధమైన కరుణ, క్షమాపణ లాంటివి, ధార్మిక విషయాల్లో సహాయపడే ఐహిక సంబంధమైన ఆరోగ్యం, ఉపాధి మొదలైనవి అల్లాతో పూర్తి నమ్మకం మరియు దృఢ నిశ్చయంతో అర్థించవలెను. ఇలాంటి వేడుకోలు, యాచన, అర్థింపుయే ఆరాధన, ఉపాసనకూ మూలం. 

పెద్ద కోరికలను ఆయన ముందు ఉంచితే (నఊజుబిల్లా) ఆయన తీర్చలేడు అని కాదు. అందుకే చిన్నదైనా, పెద్దదైనా ఏ దానికైనా అల్లాహ్ నే వేడుకోవాలి. ఇందులో, మరియు కొన్ని దుఆలలో మానవుడు అల్లాహ్ ఇష్టం పై వదులుకునే విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు: “ఓ అల్లాహ్ నాకు జీవితం మేలుంటేఅది ప్రసాదించు. చావు మేలుంటే అది ప్రాప్తిచేయు”. మరియు దుఆయే ఇస్తిఖారా లాంటివి. 

ఇందులో ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో మేలుంటుందా లేదా, మానవునికి తెలియదు. అందుకు దానికి సంబంధించినదేదైనా అర్ధించినప్పుడు అల్లాహ్ ఇష్టంపై వదలాలి. కాని మానవుడు తనకు లాభంగలదని నిశ్చయింగా తెలిసినది అడిగినప్పుడు పూర్తి నమ్మకంతో అడగాలి. 

54వ అధ్యాయం: నా దాసుడు, నా దాని అని పిలువరాదు

అబూ హురైర ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “మీలోనెవరు (తన సేవకునితో) నీ ప్రభువుకు అన్నం వడ్డించు. నీ ప్రభువుకు వుజు చేయించు అని చెప్పకూడదు. దానికి బదులు మీ నాయకునికి లేక యజమానికి వడ్డించు, వుజు చేయించు అని చెప్పాలి. అలాగే మీలోనెవరు (తమ సేవకునితో) “నా దాసుడా, నా దాసి” అని పిలువరాదు. దానికి బదులు నా బాలుడా, నా సేవకుడా లేక నా బాలికా అని పిలవాలి”. (బుఖారి. ముస్లిం.). 

ముఖ్యాంశాలు: 

1- నా దాసుడా, నా దాసి అని చెప్పవద్దు. 
2- సేవకుడు తన యజమానితో నా ప్రభువు అని చెప్పవద్దు. నీ ప్రభువుకు అన్నం వడ్డించు అని చెప్పవద్దు. 
3- మొదటి దానికి బదులు నా బాలుడా లేక నా బాలికా లేక నా సేవకుడా అని పిలవాలి. 
4- రెండవ దానికి బదులు నా నాయకుడు, నా యజమని అని చెప్పాలి. 
5- ఈ హెచ్చరిక ఉద్దేశం ఏమనగా మనము ఉపయోగించే పదాలలో కూడా ‘తౌహీద్’ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

నా దాసుడా, నా దాసి అనే బదులు నా బాలుడా, నా బాలిక అనడం అభిలషణీయం. ఇది కేవలం సందేహం, అనుమానం నుండి దూరముండుటకు. అలా ఆనడం నిషిద్ధమేమి లేదు. కాని మర్యాద, పదాలు కూడా మంచివి ఉపయోగించడంలో ఉన్నది. మరియు పదాల్లో కూడా మర్యాద పాటించడం ఇఖ్లాస్ (స్వఛ్ఛత)కు నిదర్శనం. ఇలాంటి పదాల్లో ఈ జాగ్రత్త ఎంతైనా అవసరం. 

55వ అధ్యాయం: అల్లాహ్ పేరుతో యాచించేవారిని వట్టి చేతులతో పంపకూడదు

ప్రవక్త ﷺ ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: “అల్లాహ్ పేరుతో అడిగినవాడికి ఇవ్వండి. అల్లాహ్ పేరుతో శరణు కోరినవాడికి శరణు ఇవ్వండి. మిమ్మల్ని ఆహ్వానించినవారి ఆహ్వానాన్ని స్వీకరించండి. మీకు ఒకరు మేలు చేస్తే, మీరు తిరిగి వారికి అలాగే మేలు చేయండి. బదులు ఇవ్వడానికి మీ వద్ద ఏమి లేనిచో మీరు వారికి బదులు తీర్చినాము అన్నంత తృప్తి కలిగే వరకు వారి కోసం అల్లాహ్ తో దుఆ చేయండి“. (అబూ దావూద్..). 

ముఖ్యాంశాలు: 

1- అల్లాహ్ పేరుతో శరణు కోరువారికి శరణు ఇవ్వాలి.
2- అల్లాహ్ పేరుతో అడిగినవారికి ఇవ్వాలి. 
3- ఆహ్వానం స్వీకరించాలి. 
4- ఎవరైనా ఉపకారం చేస్తే వారికి బదులు ఇవ్వాలి. 
5- బదులు ఇచ్చే శక్తి లేకుంటే వారి కొరకు దుఆ చేయాలి. 
6- బదులు ఇచ్చినాము అన్నంత తృప్తి కలిగే వరకు దుఆ చేయాలి. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

అన్నిటిలో గొప్ప ఆధారం, అల్లాహ్ పేరుతో ఒకరు ఏదైనా అడిగినప్పుడు, అల్లాహ్ యొక్క గౌరవము, మర్యాద దృష్టిలో ఉంచుకొని, అడిగిన వాని హక్కు తనపై ఉన్నదన్న విషయం గమనించి, అతనికి ఇవ్వాలని ఈ అధ్యాయంలో హితువు చేయబడింది. 

56వ అధ్యాయం: అల్లాహ్ పేరుతో కేవలం స్వర్గమే అడగాలి

జాబిర్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “అల్లాహ్ సమ్ముఖమై ప్రార్థించి కేవలం స్వర్గమే అడగాలి”. (అబూ దావూద్). 

ముఖ్యాంశాలు: 

1- ప్రత్యేకంగా అల్లాహ్ ను ఉద్దేశించి అతి ముఖ్యమైన స్వర్గము తప్ప మరేదీ అడగరాదు. 
2- అల్లాకు ముఖము ఉంది అన్న విషయం ఈ హదీసు ద్వారా రుజువవుతుంది. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

అర్థించే వ్యక్తి అల్లాహ్ శుభనామములను, విశేషణాలను గౌరవించాలి. ప్రత్యేకంగా అల్లాహ్ నుద్దేశించి (సమ్ముఖమై) ప్రాపంచిక విషయాల్ని అడగరాదు. స్వర్గం, అందులోని వరాలు, ఆయన సంతృష్టి, ఆయన గౌరవనీయ ముఖ దర్శనం, ఆయనతో సంభాషణ భాగ్యం తప్ప మరొకటి అర్థించ కూడదు. 

57వ అధ్యాయం: ‘ఒకవేళ’, ‘అట్లైనచో’, ‘ఇలా చేసి ఉంటే’ లాంటి పదాలు ఉపయోగించుట

అల్లాహ్ ఆదేశం:

يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ ٱلْأَمْرِ شَىْءٌۭ مَّا قُتِلْنَا هَـٰهُنَا
“ఒకవేళ” మాకు అధికారం ఉండివున్నట్లయితే ఇక్కడ మేము చంపబడి ఉండే వాళ్ళము కాము. (3: ఆలె ఇమ్రాన్ : 154).

మరో చోట ఇలా చెప్పబడింది:

ٱلَّذِينَ قَالُوا۟ لِإِخْوَٰنِهِمْ وَقَعَدُوا۟ لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا۟
వారు “గనక” మా మాటలు ఆలకించివున్నట్లయితే చంపబడి ఉండేవారు కారు” అని అన్నవారు వీరే . (3: ఆలె ఇమ్రాన్ : 168). 

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నీకు లాభం చేకూర్చేవాటిపై శ్రద్ధ వహించు. అందులో సహాయం కొరకు అల్లాహ్ ను అర్థించు. (విధివ్రాత పై నమ్మకం ఉంచి) పని చేయకుండా ఉండకు. సోమరితనానికి గురికాకు. ఆ తరువాత ఏదైనా నష్టం, ఆపద కలిగితే “అయ్యో! ఒకవేళ నేను ఇలా చేస్తే, అలా జరిగి ఉండేది” అని చెప్పకు. కాని “ఖద్దరల్లాహు మా షాఅ ఫఅల” (అల్లాహ్ విధి వ్రాసాడు. ఆయన కోరినట్లే జరిగింది) అని అనండి. “ఒకవేళ ఇట్లు చేస్తే” అన్న పదం షైతాన్ ద్వారాలు తెరుస్తుంది. (షైతానీయ కర్మలకు నాంది పలుకుతుంది). (ముస్లిం). 

ముఖ్యాంశాలు: 

1- సూరె ఆలె ఇమ్రాన్ లోని రెండు వాక్యాల భావం తెలిసింది. (అందులో నిషేధించిన పదం ఉపయోగించువారి ప్రస్తావన ఉంది). 
2- ఏదైనా ఆపద, కష్టం వచ్చినప్పుడు “ఒకవేళ ఇలా చేస్తే” లాంటి పదాల ఉపయోగాన్ని స్పష్టంగా నిషేధించడం జరిగింది. 
3- అది షైతానీయ కర్మలకు ద్వారము తెరుస్తుందని కూడా తెలియజేయబడింది. 
4- దానికి బదులు మంచి పదాలు బోధించబడ్డాయి. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

గమనిక: మానవుడు పైన నిషేధించిన పదం రెండు రకాలుగా ఉపయోగిస్తాడు. ఒకరకం మంచిదైతే. రెండవది మంచిది కాదు. మరో విధంగా చెప్పాలంటే ఒకటి ప్రశంసనీయమైనది. రెండవది దానికి విరుద్ధం. ప్రశంసనీయానికి విరుద్ధమైనది ఎలా? 

తనకిష్టము లేని ఒక సంఘటన తన పై లేక తన ద్వారా జరుగుతుంది. అప్పుడు అతను “ఒకవేళ నేను ఇలా చేస్తే అలా అయిఉండేది” అని అంటాడు. ఇదే షైతాన్ పని. ఎందుకనగా ఇందులో రెండు విధాల నివారణలున్నాయి.  

ఒకటి: పశ్చాత్తాపము, కోపం, నిరాశ పెరుగుతుంది. ఇది లాభం లేదు. అందుకే ఈ పరిస్థితి రానివ్వదు. 

రెండు: అల్లాహ్ పట్ల, ఆయన వ్రాసి ఉంచిన విధివ్రాత పట్ల ఉండవలసిన మర్యాదకు వ్యెతిరేకమగును. అన్ని విషయాలు, సంఘటనలన్నియు అందులో వ్రాసి ఉన్నాయి. అందులోని ఏది సంభవించనుందో, అది తప్పక సంభవించవలసినదే. దాన్ని ఎవరూ ఆపలేరు. “ఒకవేళ నేను, ఇట్లు చేస్తే, అట్లు చేస్తే” అనడంలో ఒక వింధంగా అభ్యంతరం ఉంటుంది. విధివ్రాతపై విశ్వాసం బలహీన పడుతుంది. 

కావున వీటిని మానవుడు వదలనంత వరకు అతని విశ్వాసం సంపూర్ణం కాదు. 

ప్రశంసనీయమైనది: ఏదైనా మేలును కోరుతూ అనుట. ఇది ప్రశంసనీయమైనది. 

ఉదాహరణకు; అతని వద్ద ఉన్నంత ధనం ఒకవేళ నా వద్ద ఉంటే, అతను (ధర్మమార్గంలో) ఖర్చు చేసినట్లు నేను కూడా చేసేవాడిని”. ఏదైనా చెడును కోరుతూ అన్నట్లైతే అది ప్రశంసనీయమైనది కాదు. ఈ పదం పలికే వ్యక్తి కోపం, చింత, విధివ్రాతపై బలహీన విశ్వాసంతో పలికినట్లైతే అది తప్పు. అలా చెప్పకూడదు. ఒకరికి బోధ, విద్య లాంటి మంచిని కోరుతూ చెప్పిన్నట్లైతే అదే ప్రశంసనీయమైనది. 

58వ అధ్యాయం: గాలిని దూషించుట నివారించబడింది

ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు:

మీరు గాలిని దూషించకండి. ఏదైనా అసహ్యకరమైనది చూసినచో ఈ దుఆ చదవండి: అల్లాహుమ్మ ఇన్నా నస్ అలుక మిన్ ఖైరి హాజిహిర్రీహి, వ ఖైరి మా ఫీహా, వ ఖైరి మా ఉమిరత్ బిహీ. వ నఊజు బిక మిన్ షర్రి హాజిహిర్రీహి, వషర్రి మా ఫీహా, వషర్రి మా ఉమిరత్ బిహీ. (తిర్మిజి).

అర్థము: (ఓ అల్లాహ్ ! ఈ గాలి యొక్క మంచిని, అందులో ఉన్న మంచిని మరియు దానికి ఇవ్వబడిన ఆజ్ఞ యొక్క మంచిని కూడ నీతో కోరుచున్నాము. ఈ గాలి యొక్క చెడు నుండి, మరియు అందులో ఉన్న చెడు నుండి, మరియు దానికి ఇవ్వబడిన ఆజ్ఞ యొక్క చెడు నుండి నీ శరణు కోరుచున్నాము). 

ముఖ్యాంశాలు: 

1- గాలిని దూషించుట నివారించబడింది. 
2- అసహ్యకరమైనదేదైనా చూసినచో మంచి దుఆ చదవాలని బోధించబడింది. 
3- తనకు దొరికిన ఆజ్ఞ ప్రకారం అది నడుస్తుంది. 
4. ఒకప్పుడు దానికి లాభకరమైన ఆదేశం లభిస్తుంది. ఇంకొక్కప్పుడు నష్టకరమైన ఆదేశం లభిస్తుంది. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

వెనుకటి అధ్యాయంలో కాలాన్ని దూషించకండి అని చదివారు. ఇది కూడ అలాంటిది. కాని అది కాలం, అందులో సంభవించే సంఘటనలను దూషించుట నిషేధించబడింది. ఇందులో ప్రత్యేకంగా గాలిని దూషించుట నిషేధించబడింది. 

నిషేధంతో పాటు ఇది పిచ్చితనము మరియు బుద్ధితక్కువతనం కూడాను. అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం గాలి వీస్తుంది. దాన్ని దూషించువాడు వాస్తవంగా అల్లాహ్ ను దూషిస్తున్నాడు. అల్లాహ్ ను దూషించినట్లవుతుంది అని ఆ వ్యక్తి బహుశ గ్రహించడు. గ్రహించినట్లయితే ఇది మరీ ఘోరంగా ఉంటుంది. కాని విశ్వాసి తప్పక గ్రహించాలి. 

59వ అధ్యాయం:

అల్లాహ్ ఆదేశం:

وَطَآئِفَةٌۭ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِٱللَّهِ غَيْرَ ٱلْحَقِّ ظَنَّ ٱلْجَـٰهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ ٱلْأَمْرِ مِن شَىْءٍۢ ۗ قُلْ إِنَّ ٱلْأَمْرَ كُلَّهُۥ لِلَّهِ
అల్లాహ్ ను గురించి అజ్ఞాన భూయిష్టమైన, సత్య దూరమైన, అనుమానాలు వ్యక్తం చెయ్యసాగారు. వారు ఇప్పుడు ఏమంటారంటే: “ఈ వ్యవహారాన్ని నడపటంలో మాకూ ఏదైనా భాగం ఉందా?” వారికి ఇలా చెప్పు : “(ఎవరికి ఏ భాగమూ లేదు) ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త అధికారాలూ అల్లాహ్ చేతుల్లో ఉన్నాయి”. (3: ఆలె ఇమ్రాన్ : 154). 

మరో ఆదేశం:

وَيُعَذِّبَ ٱلْمُنَـٰفِقِينَ وَٱلْمُنَـٰفِقَـٰتِ وَٱلْمُشْرِكِينَ وَٱلْمُشْرِكَـٰتِ ٱلظَّآنِّينَ بِٱللَّهِ ظَنَّ ٱلسَّوْءِ ۚ عَلَيْهِمْ دَآئِرَةُ ٱلسَّوْءِ
అల్లాహ్ విషయంలో కుశంకలు (చెడు అనుమానాలు) గలవారే చెడుల వలయంలోకి స్వయంగా వచ్చిపడ్డారు. (48: ఫత్ హా : 6). 

మొదటి వాక్యం గురించి ఇబ్న్ ఖయ్యిం ఇలా చెప్పారు: ఇందులో ఉన్న “అనుమానం” ఇలా వ్యాఖ్యానం చేయబడింది: “అల్లాహ్ తమ ప్రవక్తకు సహాయం చేయడు. ఈయన ధర్మ ప్రచారం ఇంతటితో సమాప్తం” అని కపటవిశ్వాసులు అనుమానించారు. 

ఇలా కూడా ఉంది: “ఈ (ఉహద్ యుద్ధంలో) ముస్లింలకు ఏ నష్టం ఏ కలిగిందో, అది అల్లాహ్ యొక్క విధివ్రాత మరియు వివేకానికి విరుద్ధంగా జరిగింది” అని వారు అన్నారు. అంతే కాదు “వారు విధివ్రాతను, అల్లాహ్ వివేకాన్ని తిరస్కరించారు. ప్రవక్త ప్రచారం ముందుకు సాగుట, ఈ సత్యధర్మం ఇతర అసత్య మతాలపై ఆధిక్యం వహించుటను తిరస్కరించారు వంచుకులు” అని కూడా వ్యాఖ్యానించబడింది. 

అవిశ్వాసుల, కపటవిశ్వాసులు ఈ కుశంకల, అనుమానాల ప్రస్తావన సూరె ఫత్ హా లో కూడా వచ్చింది. ఈ కుశంకలు, అనుమానాలు అల్లాహ్ మర్యాదకు, ఆయన వివేకానికి, స్తోత్రానికి, వాగ్దానాకి మరియు సహాయానికి విరుద్ధం కనుక దీనిని దురభిమానం, కుశంకలు అనబడింది. 

(ఇబ్ను ఖయ్యిం తెలిపిన వ్యాఖ్యానంలో మూడు విషయాలు తెలిసినవి): అల్లాహ్ అసత్యానికి సత్యం పై శాశ్వత విజయం ఇస్తాడని, అందు వలన సత్యం మట్టిలో కలసిపోతుందని లేక అది (ముస్లింలకు కలిగిన నష్టం) అల్లాహ్ వ్రాసిన విధివ్రాత ప్రకారం జరగలేదని. లేక అల్లాహ్ విధివ్రాత ప్రశంసనీయమైన సంపూర్ణ వివేకముతో లేదు, అది కేవలం అతని ఇష్టం అని ఎవరు అనుమానిస్తారో వారి ఈ అనుమానం అవిశ్వాసుల్లాంటి అనుమానమే. అందుకు వారికి నరక శిక్ష ఉంది. 

అనేక మంది స్వయంగా తమ, లేక ఇతరుల వ్యవహారాల్లో అల్లాహ్ పట్ల చెడు అనుమానము పాటిస్తారు. అల్లాహ్ ను, ఆయన నామగుణాలను తెలుసుకున్నవారు, ఆయన వివేకము, స్తోత్రము యొక్క కారణాలను గమనించిన వారే ఈ దురఅనుమానము నుండి దూరంగా ఉండ గలుగుతారు. 

 తమ కొరకు మేలు గోరే బుద్ధిగలవారు అల్లాహ్ వైపునకు మరలి, ఆయన పట్ల గల సందేహాలను గురించి ఆయనతో క్షమాపణ కోరాలి. 

ప్రజల సంభాషణల పై నీవు కొంత శ్రద్ధ వహిస్తే, చాలా మందిని విధివ్రాత, కర్మ పై ఆక్షేపము, అభ్యంతరము చేస్తూ “అది ఇలా ఉంటే బాగుండు, ఇది అలా ఉంటే బాగుండు” అని అంటూ చూస్తావు. హాఁ! ఈ గుణం కొందరిలో ఎక్కువ ఉంటే, మరికొందరిలో తక్కువ ఉంటుంది. అందులో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది కూడా చూడు సుమా! అరబిలో ఒక పద్యం ఉంది. దాని భావం: “నీవు దాని నుండి దూరమున్నావంటే చాలా పెద్ద గండము నుండి రక్షణ పొందావు. లేకుంటే నీవు రక్షణ పొందిన వారిలో లేవన్న మాట”. 

ముఖ్యాంశాలు: 

1- ఆలె ఇమ్రాన్ ఆయతు యొక్క వ్యాఖ్యానం. 
2- సూరె ఫత్ హా ఆయతు యొక్క వ్యాఖ్యానం. 
3- దురఅనుమానము యొక్క రకాలు లెక్కలేనన్ని ఉన్నాయి. 
4- ఎవరు అల్లాహ్ ను, ఆయన నామగుణాలను మంచి విధంగా అర్థం చేసుకున్నారో వారే దాని నుండి రక్షణ పొందగలుగుతారు. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

అల్లాహ్ తెలిపిన తన నామములను, గుణములను విశ్వసించాలి, సత్యం అని నమ్మాలి. అదే విధంగా ధర్మమునకు మద్దతిస్తానని, సత్యమును స్థాపించి అసత్యమును ఖండిస్తానని చేసిన వాగ్ధానాల్ని సత్యం అని నమ్మాలి. దాన్ని విశ్వసించుట, దానిపై తృప్తి పడుట కూడా విశ్వాసమే. 

60వ అధ్యాయం: విధివ్రాతను తిరస్కరించువారు

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా కథనం:

“ఇబ్ను ఉమర్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! ఒకరి వద్ద ఉహద్ కొండంత బంగారం ఉండి, దాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినా, అతను విధివ్రాతపై విశ్వసించనంత వరకు దాన్ని అల్లాహ్ స్వీకరించడు. మళ్ళీ దానికి ఆధారంగా ప్రవక్త హదీసును వినిపించారు. “ఈమాన్ (విశ్వాసం) అంటే: అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన పంపిన గ్రంథాల్ని, ప్రవక్తల్ని, ప్రళయదినాన్ని మరియు విధివ్రాత యొక్క మంచి చెడులను విశ్వసించుట”. (ముస్లిం).

ఉబాద్ బిన్ సామిత్ తన పుత్రునికి హితువు చేస్తూ చెప్పారు:

“నా కుమారుడా! ఏ నష్టం నీకు కలుగనుందో, అది కలుగక తప్పదు అని, ఏ నష్టం నీకు కలుగ లేదో, అది ఎన్నటికీ నీకు కలుగదు అని విశ్వసించనంత వరకు నీవు విశ్వాస మాధుర్యాన్ని పొందలేవు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను: “మొట్టమొదటిసారి అల్లాహ్ కలమును సృష్టించాడు. ఆ పిదప “వ్రాయి” అని దాన్ని ఆదేశించాడు. “ఏమి వ్రాయాలి ప్రభువు?” అని అది విన్నవించుకోగా “ప్రళయము వరకు అన్నిటి విధి (కర్మ) వ్రాయు”. నా పుత్రుడా! నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విన్నాను: “ఎవరు ఈ విశ్వాసంపై కాకుండా మరో విశ్వాసంపై చనిపోతాడో అతను నా అనుచర సంఘంలోనివాడు కాడు”. (అబూ దావూర్, తిర్మిజి).

ముస్నద్ అహ్మద్ ఒక ఉల్లేఖనం ఇలా ఉంది: “మొట్టమొదట అల్లాహ్ సృష్టించినది కలము. తరువాత “వ్రాయి” అని దానికి ఆజ్ఞ ఇచ్చాడు. అది అప్పుడు ప్రళయం వరకు సంభవించేవాటన్నిటిని వ్రాసేసింది“. (5/317). ఇబ్ను వహబ్ ఉల్లేఖనలో ఉంది: “విధివ్రాత యొక్క మంచి, చెడు (అన్నిరకములను) విశ్వసించనివారిని అల్లాహ్ అగ్నిలో కాలుస్తాడు”. 

ముస్నద్ అహ్మద్, సునన్ అబీ దావూద్ లో ఉంది, ఇబ్ను దైలమి చెప్పారు: నేను ఉబై బిన్ కఅబ్ వద్దకు వచ్చి “విధి విషయంలో నాలో కొన్ని సందేహాలున్నాయి. మీరు ఏదైనా హదీసు వినిపించండి. దానివలన అల్లాహ్ వాటిని నా నుండి దూరము చేయుగాకా“. అప్పుడు ఆయన చెప్పారు: “నీవు ఉహద్ కొండంత బంగారం దానం చేసినా, నీ విధివ్రాతను విశ్వసించనట్లయితే అల్లాహ్ దాన్ని స్వీకరించడు. అదే విధంగా నీకు ఏ ఆపద రానుందో అది రాక తప్పదు. ఏది రానులేదో, అది రానేరాదు. ఈ విశ్వాసానికి విరుద్ధంగా మరేదైనా విశ్వాసం పై నీవు మరణిస్తే నీవు నరకవాసి అవుతావు“. ఇది విన్న తరువాత నేను అబ్దుల్లా బిన్ మస్ ఊద్ , హుజైఫ్ బిన్ యమాన్ మరియు జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హుం వద్దకు వెళ్ళి ప్రశ్నించగా వారందరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇదే హదీసు వినిపించారు. ఇది సహీ హదీసు. దీన్ని హాకిం తన సహీ గ్రంథంలో వ్రాసారు. 

ముఖ్యాంశాలు: 

1- విధివ్రాత ను విశ్వసించడం తప్పనిసరి. 
2- ఎలా విశ్వసించాలి అని తెలిసింది. 
3- దాన్ని విశ్వసించని వాని కర్మలు వృధా అవుతాయి. 
4- దాన్ని విశ్వసించనంత వరకు విశ్వాస మాధుర్యాన్ని పొందలేరని తెలిసింది. 
5- మొట్టమొదటి సారి అల్లాహ్ సృష్టించిందేమిటో (కలము) దాని ప్రస్తావన వచ్చింది. 
6- ప్రళయం వరకు సంభవించే విధి (అన్నివిషయాలు), అదే సందర్భంలో వ్రాయబడింది. 
7- విశ్వసించనివారితో ప్రవక్తకు ఏలాంటి సంబంధం లేదు.  
8- పూర్వ పుణ్య పురుషులు పండితులతో ప్రశ్నించి తమ సందేహాలను దూరము చేసుకునేవారు. 
9- సందేహాలు దూరమగుటకు పండితులు ఇచ్చిన జవాబుల పద్దతేమిటి? వారు ఆ విషయానికి సంబంధించిన, ప్రవక్త ﷺ హదీసు వినిపించేవారు. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

విధివ్రాతపై విశ్వాసం విశ్వాస మూలసూత్రాల్లో ఒకటని, అల్లాహ్ కోరునదే సంభవించునని, కోరనిది సంభవించదని మరియు ఇలా విశ్వసించనివాడు వాస్తవంగా అల్లాహ్ నే విశ్వసించలేదని ఖుర్ఆను, హదీసు మరియు ఇజ్ మాఎ ఉమ్మత్ ద్వారా రుజువైనది. 

విధికి సంబంధించిన అన్ని విషయాల్ని మనము విశ్వసించాలి. అల్లాహ్ సర్వము తెలిసినవాడు. ప్రళయం వరకు సంభవించునటు వంటివి అన్నిటిని సురక్షితమైన గ్రంథం (లౌహె మహ్ ఫూజ్)లో వ్రాసిఉంచాడు. ప్రతీది ఆయన సృష్టి, శక్తి మరియు నిర్వహణకు లోబడి యున్నాయని విశ్వసించాలి. విధిపై విశ్వాసం సంపూర్ణమయ్యేది ఈ విశ్వాసంతో:- అల్లాహ్ తన దాసులను బలవంతము చేయలేదని, వారికి విధేయత, అవిధేయత యొక్క స్వేఛ్ఛ అనేది ఉన్నదని నమ్మాలి. 

61వ అధ్యాయం: ఫోటోగ్రాఫర్లు, చిత్రకారులు

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “అల్లాహు తఆలా ఇలా చెప్పాడు: “నేను సృష్టించిన తీరులో సృష్టించదులుచుకున్న వారికంటే పరమ దుర్మార్గులు మరెవ్వరు?. (మహా శక్తి గలవారైతే) ఒక అణువు లేక ఒక విత్తనం లేక జొన్న తయారు చే సి చూపండి“. (బుఖారీ, ముస్లిం). 

ప్రవక్త బోధించారని, ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు:

ప్రళయదినాన అందరి కంటే కఠినమైన శిక్ష అల్లాహ్ సృష్టిని పోలిన వాటిని సృష్టించిన వారికి విధించబడుతుంది“. (బుఖారి, ముస్లిం). 

ఇబ్ను అబ్బాస్ కథనం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:

ప్రతీ చిత్రకారుడు నరకములో యుండును. అతను చిత్రించిన ప్రతి చిత్రానికి బదులు ఒక ప్రాణం వేయబడుతుంది. దాని ద్వారా అతన్ని శిక్షించడం జరుగుతుంది“. (బుఖారీ, ముస్లిం). 

ఆయన ఉల్లేఖనలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు:

ఇహములో బొమ్మలు గీసేవాడ్ని అల్లాహ్ ప్రళయదినాన నిలదీసి ఈ బొమ్మలకు ప్రాణం పొయ్యి అని ఆజ్ఞాపిస్తాడు. కాని అతను ఆ బొమ్మలకు ప్రాణం పొయ్యలేడు“. (బుఖారి, ముస్లిం, లూలు). 

అలీ రజియల్లాహు అన్హు నన్ను ఉద్దేశించి ఇలా చెప్పారని అబుల్ హయ్యాజ్ ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ కార్యము పై పంపారో దానిపై నిన్ను పంపనా?

నీవు ఏ చిత్రాన్ని చూసినా దాన్ని తడిచివేయుము. ఎత్తైన ఏ సమాధిని చూసినా దాన్ని నేలమట్టము చేయుము”. (ముస్లిం). 

ముఖ్యాంశములు: 

1- చిత్రకారులకు కఠిన శిక్ష యున్నదని తెలుపబడింది. 

2- దాని కారణము తెలుపబడింది. దాని పై శ్రద్ధ వహించాలి: అది అల్లాహ్ పట్ల మర్యాదకు వ్యెతిరేకం. అందుకే అల్లాహ్ తెలిపాడు: “నేను సృష్టించిన తీరులో సృష్టించదులుచుకున్న వారికంటే పరమ దుర్మార్గులు మరెవ్వరు?. 

3- అల్లాహ్ శక్తిగలవాడు. వారు అశక్తులు. “ఒక అణువు లేక ఒక విత్తనం లేక జొన్న తయారు చేసి చూపండి” అని చెప్పబడును కాని ఎవ్వరూ తయారు చేయలేరు. 

4- అందరికన్నా కఠినమైన శిక్ష వారికే గలదు. 

5- ప్రతి చిత్రానికి బదులు అల్లాహ్ ఒక ప్రాణం తయారు చేసి వాటి ద్వారా వారికి శిక్ష ఇచ్చును. 

6- అందులో ప్రాణం పోయుము అని కూడా అతనికి శిక్షించబడును. 

7- చిత్రాలను చూసినచో వాటిని తొలిగించాలని ఆదేశం. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

ఇది గత అధ్యాయం లాంటిది. సంకల్పం, మాటలు, చేష్టలు అన్నిట్లో అల్లాహ్ తో ఇతరులను భాగస్వాములు చేయుట ఎంత మాత్రం తగదు. ప్రాణులను చిత్రించుట అల్లాహ్ సృష్టించిన సృష్టితాలను పోలినట్లగును. (ప్రపంచంలో మొట్టమొదట షిర్క్ ప్రారంభమైంది ఈ చిత్రాల ద్వారానే). అందుకే ఇస్లాం దీన్ని కఠినంగా నివారించింది. 

62వ అధ్యాయం: అధికంగా ప్రమాణాలు చేయుట

అల్లాహ్ ఆదేశం:

మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి“. (5: మాఇద: 89).

అబూ హురైర కథనం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:

అసత్య ప్రమాణం చేయడం వల్ల సరుకు అమ్ముడు పోతుంది గాని, వ్యాపారంలోని శుభం తరిగిపోతుంది“. (లూలు: 1035). 

సల్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:

“మూడు రకాల మనుషులతో అల్లాహ్ సంభాషించడు. వారిని (పాపాల నుండి) పరిశుద్ధ పరచడు. వారికి కఠిన శిక్ష కలుగును: వృద్ధ వ్యభిచారుడు. అహంకారము గల యాచకుడు. అల్లాహ్ (పేరున ప్రమాణాన్ని) ఒక సరుకుగా చేసుకున్న వ్యక్తి. ఏది కొన్నా ప్రమాణం చేస్తాడు. ఏది అమ్మినా ప్రమాణం చేస్తాడు”. (తబ్రాని సహీ సనద్ తో ఉల్లేఖించారు). 

ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

“మీలో నా జీవితకాలంలో ఉన్నవారు అందరికంటే ఎంతో శ్రేష్ఠులు. ఆ తరువాత నా జీవిత కాలానికి సమీప కాలంలో ఉండేవారు (అందరికంటే శ్రేష్ఠులు). ఆ తరువాత వారి సమీప కాలంలో ఉండేవారు”.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవిత కాలం తరువాత రెండు కాలాలను ప్రస్తావించారా లేక మూడు కాలాలను ప్రస్తావించారా అనే సంగతి నాకు తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:

ఆ తరువాత వచ్చేవారు తమంతట తామే (ఇతరులు అడగక పోయినా) సాక్ష్యమిస్తారు. ఎదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని నెరవేర్చరు. వారిలో అత్యధిక మంది స్థూలకాయలుగా ఉంటారు“.(లూలు: 1647). 

అబ్దుల్లా బిన్ మస్ ఊద్ కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

నా జీవిత కాలంలో ఉండేవారు అందరికంటే ఎంతో శ్రేషులు. ఆ తరువాత నా జీవిత కాలానికి అతి సమీప కాలంలో ఉండేవారు ఎక్కువ శ్రేష్ఠులు. ఆ తరువాత వారి కాలానికి సమీప కాలంలో ఉండేవారు శ్రేషులు. ఆ తరువాత వచ్చేవారు (పనికి మాలినవారు) వారి సాక్ష్యం వారి ప్రమాణాన్ని, వారి ప్రమాణం వారి సాక్ష్యాన్ని మించిపోతాయి”. (లూలు: 1646). 

ఇబ్రాహీం నఖ్ ఈ చెప్పారు :

మా బాల్యంలో మా పెద్దలు సాక్ష్యం మరియు వాగ్దానం విషయంలో మమ్మల్ని అదుపులో ఉంచడానికి దండించేవారు“. (అహ్మద్: 1/378,417). 

ముఖ్యాంశాలు: 

1- ప్రమాణాలను కాపాడాలని హితువు చేయబడింది. 

2- ప్రమాణంతో సరుకు అమ్ముడుపోతుంది, గాని వ్యాపారంలో శుభం ఉండదని తెలిసింది. 

3- ప్రమాణంతో సరుకు అమ్మే, కొనే వారి గురించి కఠిన శిక్ష ఉంది. 

4- పాప కారణాలు చిన్నవిగా ఉన్నప్పటికి, దాని శిక్ష పెద్దదిగా ఉండవచ్చును. 

5- అడగక ముందే తమంతట తాము ప్రమాణం చేయువారు ప్రశంసించబడలేదు. 

6- మొదటి మూడు కాలాలు లేక నాలుగు కాలాలను ప్రశంసించడమైనది. ఆ తరువాత ఏమి జరుగనుందో తెలుపబడింది. 

7- అడగక ముందే సాక్ష్యం పలికే వారు ప్రశంసలకు అర్హులు కారు. 

8- పూర్వకాలంలోని పుణ్యపురుషులు తమ సంతానానికి సాక్ష్యం, వాగ్దానం విషయంలో (మంచి శిక్షణ ఇవ్వడానికై) దండించేవారు. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

ఒక విషయాన్ని నొక్కి చెప్పటానికి ప్రమాణం చేయుట ధర్మసమ్మతం అని తెలుపబడింది. ఇంకా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని పాటించుటకు. అందుకే అల్లాహ్ ప్రమాణం చేయుట మాత్రమే విధిగా నిలిచింది. అల్లాహ్ యే తరుల నామముతో ప్రమాణం చేయుట షిర్క్ అనబడింది. 

ఈ మర్యాద యొక్క హక్కు ఏమనగా: సత్య విషయంలోనే ప్రమాణం చేయాలి. అధికంగా ప్రమాణం చేయకుండా అల్లాహ్ యొక్క గౌరవమును కాపాడాలి. అసత్య ప్రమాణం మరియు అధిక ప్రమాణం ఇవి రెండూ గౌరవ మర్యాదలు మరియు గొప్పతనానికి విరుద్ధం. 

63వ అధ్యాయం: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో చేయబడిన వాగ్దానం

అల్లాహ్ ఆదేశం:

وَأَوْفُوا۟ بِعَهْدِ ٱللَّهِ إِذَا عَـٰهَدتُّمْ
మీరు అల్లాహ్ తో ఏదైనా వాగ్దానం చేసినప్పుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. (16: నహ్ల్ : 91). 

బురైద రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరినైనా సైన్యాధిపతిగా నిర్ణయించినప్పుడు “అల్లాహ్ తో భయపడు, నీతో ఉన్న ముస్లింలతో మంచిగా ప్రవర్తించు” అని అతనికి హితవు చేసేవారు.

మళ్ళి (ఒకసారి) ఇలా చెప్పారు:

“అల్లాహ్ పేరుతో పోరాడండి. అల్లాహ్ ను తిరస్కరించినవానితో పోరాడండి. యుద్ధ ధనం దొంగలించకండి. వాగ్దాన వ్యెతిరేకం చేయకండి. హతుని అవయవాలను కోయకండి. బాలలను హతమార్చకండి. ముష్రికులైన (బహుదైవారాధకులైన) నీ శత్రువులు కలసినప్పుడు మూడు విషయాలు వారి ముందు ప్రస్తావించు: అందులో ఏ ఒక్కదాన్ని స్వీకరించినా, దాన్ని మీరు ఒప్పుకోండి. యుద్ధం నుండి దూరంగా ఉండండి. మొదట వారికి ఇస్లాం గురించి బోధించు.

వారు ఇస్లాం స్వీకరిస్తే, వారిని వారు ఉండే (దారుల్ కుఫ్ర్) ప్రాంతం నుండి ముస్లింలుండే (దారుల్ ఇస్లాం) ప్రాంతానికి వలస పోవాలని చెప్పు. వారు వలస వెళితే, ముందు నుండి అక్కడ (దారుల్ ఇస్లాంలో) ఉన్నవారికి లభించే లాంటి హక్కులు మీకు లభించును. వారి పై ఉన్నటువంటి బాధ్యతలు మీపై ఉండును(*).

వలస పోవుటకు నిరాకరిస్తే, వారితో ఎడారి అరబ్బుల తీరులో ప్రవర్తించ బడును. అనగా అల్లాహ్ ఆదేశాలు వారిపై జారి అగును. యుద్ధఫలంలో వారికి ఎలాంటి భాగం ఉండదు. వారు యుద్ధంలో పాల్గొంటే తప్ప. (అప్పుడు భాగం ఉండును). ఇస్లాం స్వీకరించకున్నట్లయితే పన్ను (కప్పం) చెల్లించండని తెలుపు. చెల్లిస్తామని ఒప్పుకుంటే, వారి మాటను నమ్ము. వారిపై యుద్ధానికి సిద్ధం కావద్దు. ఇది కూడా నిరాకరిస్తే, అప్పుడు అల్లాహ్ తో సహాయాన్ని అర్థించి, పోరాడు.

కోటలో ఉన్న (శత్రువులను) నీవు ముట్టడించినప్పుడు, అల్లాహ్ ఆయన ప్రవక్త పూచి మీద (వారితో సంధి చేయండని) నీతో వారు కోరితే, నీవు వారికి అల్లాహ్ ఆయన ప్రవక్త పూచి ఇవ్వకు. స్వయం నీ పూచి, నీస్నేహితుల పూచి మీద (సంధి చేయుము). అల్లాహ్ ఆయన ప్రవక్త పూచికి వ్యెతిరేకం చేయుటకన్నా మీ పూచి, మీ స్నేహితుల పూచికి వ్యెతిరేకము చేయుట సులభము. కోటలో ఉన్న శత్రువులను ముట్టడించినప్పుడు అల్లాహ్ యొక్క తీర్పు ప్రకారం (మీతో సంధి) కోరితే, అలా చేయకు. నీ తీర్పు ప్రకారం (సంధికి) సిద్ధం కావాలని చెప్పుము.. ఎందుకనగా నీవు అల్లాహ్ తీర్పు ప్రకారం (తీర్పు చేయగలవని) నీకు తెలుసా?. (ముస్లిం). 

(*) (ఇది. సంపూర్ణ న్యాయం. స్వదేశియులకే అన్ని హక్కులు అనుట న్యాయం కాదు. స్వదేశియులకు లభించే యుద్ధ ఫలం వారికి లభిస్తుంది. స్వదేశియులు చేయునటివంటి యుద్ధం. అందులో సహాయం వారూ చేయాలి.  

ముఖ్యాంశాలు: 

1- అల్లాహ్ పూచి, ఆయన ప్రవక్త పూచి మరియు ముస్లిముల పూచి మధ్యలో వ్యత్యాసం ఉంది. 

2- రెండు అపాయాలు ఎదురైనప్పుడు అందులో (ఏ ఒకటి చేయక తప్పనప్పుడు) తేలికైనదాన్ని చేసుకోవాలి. 

3- అల్లాహ్ పేరుతో యుద్ధం చేయాలి. 

4- అల్లాహ్ ను తిరస్కరించినవారితో పోరాడండి. 

5- అల్లాహ్ సహాయాన్ని అర్థించి, వారితో పోరాడండి. 

6- అల్లాహ్ తీర్పులో, పండితుల (నాయకుల) తీర్పులో వ్యత్యాసం ఉంది. 

7- ప్రవక్త సహచరుడు కూడా ఏదైనా తీర్పు చేసినప్పుడు అది అల్లాహ్ తీర్పుకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా అన్న విషయం అతనికి తెలియదు. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

శత్రువులకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పూచి ఇచ్చి, దానికి వ్యెతిరేకం చేయుట లాంటి పరిస్థితుల నుండి జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ అధ్యాయం యొక్క ప్రస్తావన ఉద్దేశం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందో, అప్పుడు ముస్లింలు అల్లాహ్, ఆయన ప్రవక్త పూచి విలువను కాపాడ లేదని, అల్లాహ్ గౌరవమును విడనాడారని మరియు రెండు అపాయాలు ఎదురైన సందర్భం లో (చిన్నదాన్ని ఎదురుకోవాలన్న హితువు మరచి) పెద్ద దానికి గురైన వారయ్యారన్న భావం. ఇంకా ఇది స్వయంగా మన ధర్మాన్ని మనం హేళన చేసినట్లు, మన ధర్మం పట్ల అవిశ్వాసులకు అసహ్యం కలిగించినట్లు అగును. అదే వాటిని పూర్తి చేయుట, ప్రత్యేకంగా మరీ దృఢముగా చేసిన ప్రమాణాలను తప్పక పూర్తి చేయుట వలన స్వయంగా మన ఇస్లాం యొక్క మంచితనాన్ని (మన ఆచరణ ద్వారా) వారి ముందు ఉంచిన వాళ్ళ మగుదుము. ఇలా వారిలోని న్యాయశీలురు ఇస్లాంను సరియైన పద్ధతిలో అర్థంచేసుకోగలరు. తదుపరి దాన్ని గౌరవించి, అనుసరించ గలరు. 

64వ అధ్యాయం: అల్లాహ్ పై ప్రమాణం చేయుట

జుందుబ్ బిన్ అబ్ధుల్లాహ్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఒక వ్యక్తి “అల్లాహ్ ప్రమాణంగా, అల్లాహ్ ఫలాన వ్యక్తిని క్షమించడు” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అన్నాడు: “నేను ఫలాన వ్యక్తిని క్షమించనని నా పేరున, నాపై ప్రమాణం చేసేవాడెవడు ఇతను. నేను నిశ్చయంగా అతడ్ని (ఫలాన వ్యక్తిని) క్షమించాను. నీ (ప్రమాణం చేసినవాని) కర్మలను వ్యర్థం చేసాను. (ముస్లిం). 

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ఉంది: ఆ పదాలు పలికినవాడు ఒక ఆబిద్. (నిరంతరం ఆరాధనలో ఉండేవాడు). మళ్ళి అబూ హురైరా చెప్పారు: “అతను పలికిన ఒక మాట, అది అతని ఇహ పర రెండు లోకాల్ని నాశనం చేసింది“. (అబూ దావూద్). 

ముఖ్యాంశాలు: 

1- అల్లాహ్ పై ప్రమాణం చేయుట నుండి హెచ్చరించబడింది. 

2- నరకం మన చెప్పుల వారు కంటే దగ్గరగా ఉంది. 

3- స్వర్గం కూడా అలాగే. 

4- “కొన్ని సందర్భాల్లో మానవుడు మాట్లాడే మాట వల్ల, అతను నరకంలోని అతి క్రింది భాగంలో పడిపోతాడు” అని ఉల్లేఖించబడిన హదీసు యొక్క సాక్ష్యాధారం ఉంది ఈ అధ్యాయంలో. 

5- ఒకప్పుడు మానవుడు ఏ విషయాన్ని అతి అసహ్యకరమైనదిగా, విలువలేనిదిగా భావిస్తాడో, దాని వలనే అతన్ని (అల్లాహ్) మన్నిస్తాడు. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

ఇది, దీని తరువాత అధ్యాయంలో వచ్చిన విషయం వాస్తవంగా అల్లాహ్ పట్ల ఉండవలసిన మర్యాదకు వ్యెతిరేకం. తౌహీదు విరుద్ధం కూడాను. అల్లాహ్ పై ప్రమాణం అనేది ఎక్కువశాతం మానవునిలో వచ్చేది, తన కర్మలపై తనకు తాను అధికంగా అనవసరంగా సంబర పడినప్పుడు. అహంకార భావానికి గురైనప్పుడు. ఇలాంటి వాటి నుండి జాగ్రత్త పడనంత వరకు విశ్వాసం సంపూర్ణం కాదు. 

65వ అధ్యాయం: తన దాసుల ఎదుట అల్లాహ్ ను సిఫారసుగా చేయుట ఎంత మాత్రం సమ్మతం కాదు

జుబైర్ బిన్ ముత్ ఇమ్ కథనం: ఒక ఎడారిలో ఉండే అరబ్బు వ్యక్తి (పల్లెటూరి మనిషి) ప్రవక్త వద్దకు వచ్చి “(పోయేవారి) ప్రాణాలు పోతున్నాయి. (ఉండేవారి) కడుపులు మండుతున్నాయి. ధనసంపద మట్టిలో కలసిపోతుంది. మీ ప్రభువుతో వర్షానికై అర్థించండి. మేము అల్లాహ్ ను మీ ఎదుటకు సిఫారసుగా ఉంచుతాము, మిమ్మల్ని అల్లాహ్ వద్ద సిఫారసుగా ఉంచుతాము” అని అన్నాడు. ఇది విన్న వెంటనే ప్రవక్త ﷺ “సుబ్ హానల్లాహ్, సుబ్ హానల్లాహ్ ” అని అంటూ పోయారు. దాని ప్రభావం చివరికి సహచరుల ముఖాల మీద ప్రతిబింబించింది. మళ్ళీ ప్రవక్త ﷺ “నీ పాడుగాను! అల్లాహ్ అంటే తెలుసా? ఇలాంటి మాటలకు (గీతపై ఉన్న పదాలు) అల్లాహ్ ఉన్నతుడు, గొప్పవాడు. అల్లాహ్ ను ఒకరి ఎదుట సిఫారసుగా ఉంచరాదు సుమా” అని బోధించారు. (అబూ దావూద్ ). 

ముఖ్యాంశాలు: 

1. అల్లాహ్ ను మీ వద్దకు సిఫారసిగా చేస్తున్నాము అన్న వ్యక్తి పట్ల (సుబ్ హానల్లాహ్ అంటూ) అది మంచిది కాదని వ్యక్తం చేశారు. 

2- (ఆ ఎడారి అరబ్బు అన్న మాటకు ప్రవక్త ﷺ ముఖ ప్రతిబింబాలు మారాయి, మారినట్లు సహచరుల ముఖాల ద్వారా కూడా స్పష్టం అయ్యింది. 

3- “మిమ్మల్ని అల్లాహ్ వద్ద సిఫారసుగా ఉంచుతాము” అన్న అతని మాటను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘తప్పు’ అని చెప్పలేదు. (ఎందుకనగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలో అలా అనుట ధర్మసమ్మతమే). 

4- ఈ సందర్భంలో ‘సుబ్ హానల్లాహ్’ అనుట ఎంత సమచితమో అర్థమయింది. 

5- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలో సహచరులు వర్షం కొరకు దుఆ చేయాలని ఆయనతో కోరేవారు. 

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ): 

అల్లాహ్ చాలా గొప్పవాడు. ఆయన్ను సిఫారసు చేయుటకు ఆయన దాసుల ఎదుట ప్రస్తావించుట – ఇది ఆయన గొప్పతనానికి విరుద్ధం. సామాన్యంగా ఎవరి ఎదుట సిఫారసు చేయబడుతుందో అతను సిఫారసు చేసే వ్యక్తి కంటే ఉన్నత స్థానంలో ఉంటాడు. ఇలా అల్లాహ్ ను ఆయన దాసుల ఎదుట సిఫారసు కొరకు నిలబెట్టుట అల్లాహ్ అమర్యాద అగును. ఎప్పుడు అలా చేయకూడదు. సిఫారసు చేసేవారు అల్లాహ్ వద్ద ఆయన అనుమతి లేనిది సిఫారసు చేయలేరు. వారందరు భయపడుతుంటారు. ఇక అల్లాహ్ ను వారి ఎదుట సిఫారసిగా నిలబెట్టుట ఎలా సంభవం, అలోచించండి. ఆయన ఎంత గొప్ప వాడో తెలియదా? సర్వ జగత్తు ఆయన ముందు తలవంచి, విధేయత చూపుతుంది. 

66వ అధ్యాయం: ప్రవక్త ﷺ ద్వారా తౌహీద్ రక్షణ మరియు షిర్క్ మార్గాలను మూసివేయుట

అబ్దుల్లా బిన్ షిబ్బీర్ కథనం: బనీ ఆమిర్ సంఘంతో నేను ప్రవక్త వద్దకు వెళ్ళాను. “మీరు మా సయ్యిద్” అని మేమన్నాము. అప్పుడు ప్రవక్త ఈ “శుభం గలవాడు, గొప్పవాడైన అల్లాహ్ యే  సయ్యిద్” అని చెప్పారు. “మాలో మీరు ఎక్కువ ఘనత, ఉన్నత స్థానం గలవారు” అని వారన్నారు. “ఇలాంటి సముచితమైన పదాలు పలకండి పరవాలేదు. కాని షైతాన్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండండని” ప్రవక్త చెప్పారు. (అబూ దావూద్).

అనస్ రజియల్లాహు అన్హు కథనం: కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “మాలో శ్రేష్ఠులు, మాలో శ్రేష్ఠులైన వారి కుమారులు, మాలోని సయ్యిద్, మాలోని సయ్యిద్ యొక్క కుమారులైన ఓ ప్రవక్తా!” అని అన్నారు. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఓ ప్రజలారా! మీరనే మాటలు అనండి. కాని షైతాన్ మిమ్మల్ని మనోవాంఛలకు గురి చేసి, దుర్మార్గంలో పడవేయకుండా జాగ్రత్త పడండి. నేను ముహమ్మద్. అల్లాహ్ దాసుడిని, ఆయన ప్రవక్తని. అల్లాహ్ నన్ను ఏ స్థానంలో ఉంచాడో, దానికి మీరు మితిమీరుట నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు“. (నసాయి). 

ముఖ్యాంశాలు: 

1- ‘గులువ్వు’ (మీతిమీరుట) నుండి హెచ్చరించబడింది. 
2- ‘మీరు సయ్యిద్’ అని ఎవరిని అనబడిందో, అతను జవాబులో ఏమనాలనేది తెలిసింది. 
3- వారు అన్న మాట తప్పేమి కాదు. అయినా షైతాన్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. 
4- అల్లాహ్ నాకు ప్రసాదించిన స్థానాని కంటే మీరు నన్ను ఇంకాపైకి ఎత్తకండి అన్న దాని భావం స్పష్టంగా ఉంది. 

తాత్పర్యము: 

ఇలాంటి అధ్యాయం వెనుకటి పేజిల్లో మీరు చదివారు. కాని సందర్భాన్ని బట్టి రచయితగారు మళ్ళీ ప్రస్తావించినారు. షిర్క్ వరకు చేర్పించే మార్గాలను మూసివేయనంత వరకు తౌహీద్ సంపూర్ణం కాదు. అది భద్రంగా ఉండదు. ఈ అధ్యాయం మరియు వెనక చదివిన ఇలాంటి అధ్యాయంలో తేడా ఏమనగా: అది షిర్క్ వరకు చేర్పించే కర్మలతో, చేష్టలతో తౌహీద్ ను కాపాడాలని. ఇది వాజ్మూలిక సంబంధమైన షిర్క్ తో తౌహీద్ ను కాపాడాలని. షిర్క్ లో పడవేసే ‘గులువ్వు’ వరకు చేర్పించే ప్రతి మాట/పలుకు నుండి దూరంగా ఉండనంత వరకు తౌహీద్ సంపూర్ణం కాదు. 

సారాంశమేమనగా: తౌహీద్ దాని షరతులతో, పునాదులతో, దాన్ని సంపూర్ణం చేయు విషయాలతో కూడి ఉండనంత వరకు మరియు దానికి విరుద్ధమైనవాటి నుండి, లోపము కలిగించేవాటి నుండి, బాహ్యంగా, గోప్యంగా, మాటల, చేష్టల ద్వారా, మరియు దృఢసంకల్పంతో, నమ్మకంతో దూరముండనంత వరకు సంపూర్ణం కాదు. 

67వ అధ్యాయం: వారసలు అల్లాహ్‌ను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు

అల్లాహ్ ఆదేశం:

 وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
వారసలు అల్లాహ్ కు తగిన విధంగా విలువనివ్వలేదు. ప్రళయదినాన యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఇమిడి ఉంటుంది. ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కు (బహుదైవారాధన)కు ఆయన ఎంతో అతీతుడు. (39: జుమర్ : 67). 

అబ్దుల్లాహ్ బిన్ మస్  ఊద్ కథనం: యూద మత పండితుడొకడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి ఇలా అన్నాడు: “ముహమ్మద్! మా గ్రంథాలలో ఈ విధంగా వ్రాసి ఉంది – అల్లాహ్ ప్రళయదినాన ఒక వ్రేలిపై సప్తాకాశాలను, మరొక వ్రేలిపై భూమండలాలను, వేరొక వ్రేలిపై వృక్షాలను, ఇంకొక వ్రేలిపై నేలను, ఒక వ్రేలిపై నీటిని, మిగిలిన సమస్త సృష్టి రాసుల్ని ఒక వ్రేలిపై ఎత్తి పట్టుకొని “నేనే విశ్వ సామ్రాజ్యాధినేతను” అని అంటాడు”. 

ప్రవక్త ﷺ అతని మాట విని వాటిని ధృవపరుస్తున్నట్లు ఉల్లాసంతో నవ్వారు. ఆ నవ్వులో ఆయన చిగుళ్ళు కుడా కన్పించాయి. ఆ తరువాత ప్రవక్త ﷺ ఈ ఆయతు పఠించారు: వారు అసలు అల్లాహ్ కు తగిన విధంగా విలువనివ్వలేదు. ప్రళయదినాన యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఇమిడి ఉంటుంది. ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కు (బహుదైవారాధన)కు ఆయన ఎంతో అతీతుడు. (39: జుమర్ : 67). (లూలు: 1774). 

ముస్లింలో ఉంది: “పర్వతాలు, వృక్షాలు ఒక వ్రేలిపై ఎత్తిపట్టుకుంటాడు. మళ్ళీ వాటిని గట్టిగా ఊపి, “నేనే విశ్వ సామ్రాజ్యాధినేతను, నేనే అల్లాహ్ ను” అని అంటాడు. బుఖారిలో ఉంది: “ఆకాశాల్ని ఒక వ్రేలిపై, నీటిని, నేలను ఇంకొక వ్రేలిపై, మిగిలిన సృష్టినంతా మరొక వ్రేలిపై తీసుకుంటాడు”. 

ముస్లింలో ఇబ్ను ఉమర్ యొక్క ‘మర్ ఫూ’ ఉల్లేఖనం ఇలా ఉంది: “అల్లాహ్ ప్రళయదినాన ఆకాశాల్ని చుట్టి తన కుడి చేతిలో తీసుకుంటాడు. మళ్ళి “నేనే విశ్వసామ్రాజ్యాధినేతను. ప్రపంచంలో విర్రవీగే, అహంకారానికి గురైన రాజులు ఎక్కడున్నారు? అని ప్రశ్నిస్తాడు. తరువాత సప్త భూమండలాల్ని చుట్టి తన ఎడమ చేతిలో తీసుకుంటాడు. మళ్ళి “నేనే విశ్వసామ్రాజ్యాధినేతను (ప్రపంచంలో) విర్రవీగే, అహంకారానికి గురైన రాజులు ఎక్కడున్నారు? అని ప్రశ్నిస్తాడు. 

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనలో ఉంది: “మీ చేతిలో ఒక రవ్వగింజ ఉన్నతీరు, రహ్మాన్ అరచేతిలో సప్తాకాశాలు, సప్త భూమండలాలుండును‘. (ఇబ్ను జరీర్ : 24/17. ఇబ్ తాలుత్ తన్ దీద్: 170). 

ఇబ్ను జరీర్ కథనం: నాకు యూనుసు హదీసు వినిపించారు, మాకు ఇబ్ను వహబ్ తెలిపారు, ఇబ్ను జైద్ చెప్పారు, నాకు నా తండ్రి హదీసు వినిపించారు, ప్రవక్త ప్రవచించారు: “(అల్లాహ్ యొక్క) కుర్చీ ఎదుట సప్తాకాశాలు ఒక డాలులో ఏడు దిర్ హంలు వేసినట్లు“. (ఇబ్ను జరీర్: 317. ఇబ్ తాలుత్ తన్ దీద్: 170. ఫీహీ అబ్దుర్ రహ్మాన్ బిన్ జైద్ జఈఫ్). 

అబూ జర్ గిఫారి కథనం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను. “అర్ష్ (అల్లాహ్ సింహాసనము) ఎదుట కుర్చీ , ఒక విశాలమైన ఎడారి భూమిలో ఒక ఇనుప కడం (వ్రేళ్ళ మెట్ట) పడి ఉన్నట్లే“. (బైహఖి ఫిల్ అస్మా…: 404. ఇబ్ను కసీర్). 

అబ్ధుల్లాహ్ బిన్ మస్ ఊద్  కథనం: “మొదటి ఆకాశం మరియు రెండవ ఆకాశం మధ్య ఐదు వందల సంవత్సరాల దూరముంది. అదే విధంగా ప్రతీ రెండు ఆకాశాల మధ్య. ఏడవ ఆకాశము మరియు కుర్చీ మధ్య ఐదు వందల సంవత్సరాల దూరము. కుర్సీ మరియు నీళ్ల మధ్య ఐదు వందల సంవత్సరాల దూరము. అర్ష్ నీళ్ళపై ఉంది. అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు. మీరు చేసే కర్మలు అల్లాహ్ కు గోప్యంగా ఏమి లేవు“. (ఈ హదీసు ఇబ్ను మహ్దీ , హమ్మద్ బిన్ సల్మాతో, ఆయన ఆసింతో, ఆయన జుర్ తో, ఆయన అబ్దుల్లాతో ఉల్లేఖించారు. అదే విధంగా మసూది, ఆసింతో, ఆయన అబూ వాయిల్తో, ఆయన అబ్దుల్లాతో ఉల్లేఖించారు. ఈ విషయం హాఫిజ్ జహ్ బి తెలుపుతూ, ఈ హదీసు ఉల్లేఖన పరంపరాలు ఇంకెన్నో ఉన్నాయి అని చెప్పాడు. 

అబ్బాసుబ్ను అబ్దుల్ ముత్తలిబ్ కథనం: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “భూమ్యాకాశాల మధ్య దూరము ఎంతో మీకు తెలుసా?” అని అడిగారు. “అల్లాహ్ ఆయన ప్రవక్తకే బాగా తెలుసు” అన్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: “వాటి మధ్య ఐదు వందల సంవత్సరాల దూరముంది. ప్రతి రెండు ఆకాశాల మధ్య అంతే దూరముంది. ప్రతి ఆకాశము యొక్క స్థూలము కూడా అంతే ఉంది. ఏడవ ఆకాశము మరియు అర్ష్ మధ్య సముద్రం ఉంది. సముద్రం పై భాగము మరియు క్రింది భాగము మధ్య దూరము భూమ్యాకాశాల మధ్య ఉన్నంత దూరము. అల్లాహ్ దానిపై ఉన్నాడు. మానవులు చేసే కర్మలు ఆయనకు గోప్యంగా లేవు“. (అహ్మద్ 1/206. అబూ దావూద్). 

ముఖ్యాంశాలు: 

1- భూమండలం ఆయన పిడికిలిలో ఉంది అనే వాక్యం యొక్క వివరణ తెలిసింది. 

2- ఈ అధ్యాయంలో తెలుపబడిన విషయాలు యూదుల (మత గ్రంథాల్లో ) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా ఉండినవి. వారు వాటిని తిరస్కరించనూ లేదు. దానికి వేరే భావం తెలుపనూ లేదు. 

3- యూద మత పండితుడు ఆ విషయం ప్రస్తావించిన తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ధృవికరించారు. ఖుర్ఆన్ వాక్యాలు అవతరించాయి. 

4- ఈ గొప్ప విషయం ఆ యూద మత పండితుడు చెప్పినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వారు. 

5- అల్లాహ్ కు రెండు చేతులున్నవని మరియు కుడి చేతిలో ఆకాశాలు, మరో చేతిలో భూమండలాలు ఉండునని తెలిసింది. 

6- ఎడమ చేయి ఉంది అని కూడా తెలిసింది. 

7- ప్రపంచంలో విర్రవీగిన, తలబిరుసుతనానికి, అహంకారానికి గురైనవారు ఎక్కడ ఉన్నారు? అని అప్పుడు అల్లాహ్ అంటాడు. 

8- మనిషి చేతిలో రవ్వ గింజ ఉన్నట్లు, అల్లాహ్ చేతిలో భూమ్యాకాశాలు ఉండును. 

9- కుర్సీ ఆకాశము కన్నా చాల పెద్దది. 

10- అర్ష్ కుర్సీ కన్నా పెద్దది. 

11- అర్ష్ వేరు, కుర్సీ మరియు నీళ్ళు వేరు. 

12- ప్రతి రెండు ఆకాశాల మధ్య దూరము తెలుపబడింది. 

13- ఏడవ ఆకాశం మరియు కుర్సీ మధ్య దూరము తెలుపబడింది. 

14- కుర్సీ మరియు నీళ్ల మధ్య దూరము తెలుపబడింది. 

15- అల్లాహ్ యొక్క అర్ష్ నీళ్ళపై ఉంది. 

16- అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు. 

17- భూమ్యాకాశాల మధ్య దూరము తెలిసింది. 

18- ప్రతి ఆకాశము యొక్క స్థూలము (దొడ్డు) ఐదు వందల సంవత్సరాల దూరము. 

19- ఏడవ ఆకాశము మరియు అర్ష్ మధ్యలో ఉన్న లోతు ఐదు వందల సంవత్సరాల దూరము. 

%d bloggers like this: