దైవ దర్శనం
ఇస్లాంకు చెందిన పలు ఇతర విషయాల వలె సృష్టికర్త అయిన అల్లాహ్‌ను దర్శించడానికి సంబంధించిన విషయంలోనూ ముస్లింలకు చెందిన పలు వర్గాలు హెచ్చు తగ్గులకు గురయ్యారు.
ఒక వర్గమయితే ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం ద్వారా ఇహలోకంలోనే అల్లాహ్ ను దర్శించవచ్చని ప్రకటించింది. మరొక వర్గం ఖుర్‌ఆన్ లోని “చూపులు ఆయనను అందుకోలేవు. కాని ఆయన చూపులను అందుకోగలడు.” (103 :6) అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇహలోకంలోనే కాకుండా పరలోకంలోనూ అల్లాహ్ ను చూడలేమని ప్రకటించింది.అయితే పవిత్ర ఖుర్‌ఆన్ ద్వారా, హదీసుల ద్వారా నిరూపించబడే విశ్వాసమేమిటంటే ఇహలోకంలో ఏ వ్యక్తయినా, చివరకు దైవప్రవక్త అయినా అల్లాహ్‌ను చూడడం సాధ్యం కాదు.
ఖుర్‌ఆన్‌లో దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) వృత్తాంతం ఎంతో వివరంగా పేర్కొనబడింది. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఫిర్‌ఔన్ నుంచి విముక్తిని పొందిన తర్వాత ఇస్రాయీల్ సంతతిని వెంటబెట్టుకొని సీనా ద్వీపకల్పానికి చేరుకున్న తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనను తూర్ పర్వతం మీదకు పిలిచాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) నలభై రోజులు అక్కడ ఉన్న తర్వాత అల్లాహ్ ఆయనకు పలకలను అందజేసాడు. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు అల్లాహ్ ను దర్శించాలనే కోరిక కలిగింది. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) “ఓ నా ప్రభువా! నేను నిన్ను చూడగలిగేందుకై నాకు నిన్ను చూడగలిగే శక్తిని ప్రసాదించు.” అప్పుడు అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు: “ఓ మూసా! నీవు నన్ను ఏ మాత్రం చూడలేవు. అయితే కొంచెం నీ ముందు ఉన్న కొండ వైపు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉన్నట్లయితే నీవు కూడా నన్ను చూడగలవు.” అప్పుడు అల్లాహ్ తన తేజోమయ కాంతిని ఆ కొండపై ప్రసరింపజేయగా అది పిండి పిండి అయిపొయింది. అది చూసి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆయన (అలైహిస్సలాం) పశ్చాత్తాపంతో ఈ విధంగా అర్ధించారు: “నీ అస్తిత్వం పవిత్రమైనది. నేను నీ వైపుకు (నా కోరిక పట్ల పశ్చాత్తాపంతో) మరలుతున్నాను. అలాగే నేను అందరికంటే ముందు (అగోచర విషయాలను) విశ్వసించేవాడిని. (మరిన్ని వివరాల కొరకు ఖుర్‌అన్‌లోని ‘ఆరాఫ్ అధ్యాయపు 143వ వాక్యాన్ని పఠించండి). ఈ వృత్తాంతాన్ని బట్టి ఇహలోకంలో అల్లాహ్ ను చూడటమనేది సాధ్యం కాదని రుజువవుతోంది.
ఇక దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ ప్రయాణం విషయానికొస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును దర్శించారని పలికే వ్యక్తి అసత్యవాది” అని పేర్కొన్న విషయం కూడా దీనిని ధృవికరిస్తోంది. (బుఖారీ, ముస్లిమ్) ఇహలోకంలో దైవ ప్రవక్తలు సైతం అల్లాహ్‌ను చూడలేకపొయినప్పుడు మామూలు దాసులు అల్లాహ్‌ను తాము చూశామని పేర్కొనడం అసత్యం తప్ప మరేమి కాగలదు?
పవిత్ర ఖుర్‌ఆన్ ద్వారా, ప్రామాణికమైన హదీసుల ద్వారా పరలోకంలో స్వర్గలోకవాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను దర్శిస్తారని రుజువవుతోంది. ఖుర్‌ఆన్‌లో యూనుస్ అనే అధ్యాయపు 26 వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు : “మంచి పనులు చేసేవారి కొరకు మంచి ప్రతిఫలంతో పాటు ఇంకా మరొక వరం ప్రసాదించబడు తుంది.” ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా హజ్రత్ సుహైబ్ రూమి (రదియల్లాహు అన్హు) ద్వారా పేర్కొనబడిన ఒక ఉల్లేఖనం ఈ విధంగా ఉంది : దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వాక్యాన్ని పఠించిన తర్వాత ఈ విధంగా పేర్కొన్నారు: “స్వర్గ వాసులు స్వర్గంలోకి, నరకవాసులు నరకంలోకి ప్రవేశించిన తర్వాత ప్రకటించే ఒక వ్యక్తి ఈ విధంగా ప్రకటిస్తాడు : “ఓ స్వర్గవాసులారా! అల్లాహ్ మీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నేడు ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నాడు” అప్పుడు వారు ఇలా ప్రశ్నిస్తారు: “ఆ వాగ్దానం ఏది? అల్లాహ్ (తన కరుణ ద్వారా) మా ఆచరణలను (త్రాసులో) బరువైనవిగా మార్చివేయలేదా? అల్లాహ్ మమ్మల్ని నరకాగ్ని నుంచి రక్షించి స్వర్గంలోకి ప్రవేశింపజేయలేదా?” అప్పుడు వారికి, అల్లాహ్ కు నడుమ ఉన్న పరదా తొలగించబడుతుంది. అప్పుడు స్వర్గలోకవాసులకు అల్లాహ్ ను దర్శించే మహద్భాగ్యం ప్రాప్తమవుతుంది. (హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా పేర్కొంటున్నారు) ‘అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దర్శనానికి మించి ప్రియమైనది, కనులకు ఆనందకరమైనది స్వర్గవాసులకు మరేదీ ఉండబోదు. (ముస్లిమ్)
ఖుర్‌ఆన్ లో మరొకచోట అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు ; “అ రోజు ఎన్నో వదనాలు తాజాగా కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి. (ఖుర్‌ఆన్, ఖియామహ్ :22-23) ఈ ఆయతులో స్వర్గవాసులు అల్లాహ్ వైపు చూస్తూ ఉండటమనేది స్పష్టంగా పేర్కొనబడింది. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: మేము దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయి ఉన్నాము. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పున్నమి నాటి చంద్రుని వైపు చూసి ఈ విధంగా పేర్కొన్నారు : “స్వర్గంలో మీరు నేడు ఈ చంద్రుని చూస్తున్న రీతిలోనే మీ ప్రభువును చూస్తారు. అల్లాహ్ ను చూడడం మీకు ఏమాత్రం కష్టం కాబోదు.” (బుఖారీ)
కనుక ఇహలోకంలోనే అల్లాహ్‌ను దర్శించవచ్చని ప్రకటించినవారు మార్గభ్రష్టులై పోయారు. అలాగే పరలోకంలోనూ అల్లాహ్ ను దర్శించడం అసాధ్యమని పేర్కొన్నవారూ మార్గభ్రష్టులై పోయారు. నిజమైన విశ్వాసమేమిటంటే ఇహలోకంలో అల్లాహ్‌ను దర్శించడం అసాధ్యం. అయితే స్వర్గంలో స్వర్గవాసులు అల్లాహ్‌ను చూస్తారు. ఆ విధంగా అల్లాహ్ సందర్శనమనే మహోన్నతమైన అనుగ్రహం ద్వారా స్వర్గలోకపు మిగిలిన వరానుగ్రహాల పరిపూర్తి జరుగుతుంది.
You must be logged in to post a comment.