6. విష సర్పాలు, తేళ్ళకాటు ద్వారా శిక్ష:
నరకంలో విషసర్పాల, తేళ్ళ కాటుల ద్వారా కూడా శిక్షించటం జరుగుతుంది. పాములు, తేళ్ళు ఈ రెండూ మానవ శత్రువులుగా భావించబడతాయి. ఈ రెంటి పేరు వింటేనే భయమేస్తుంది. ఈ రెండు ఉన్న చోట ఎవరూ కూర్చోవటం కాదు కదా, అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధపడరు. పాములు, తేళ్ళు ఎలా ఉంటాయంటే వాటిని చూడగానే మానవుని ఒళ్ళు జలదరిస్తుంది. భయంతో వణికిపోవడం జరుగుతుంది. పాములు, తేళ్ళు ఎంత వరకు విషం కలిగి ఉంటాయి? దీని గురించి కేవలం అల్లాహ్కే తెలుసు. కాని పరిశోధనల ద్వారా, ప్రయోగాల ద్వారా కొన్ని పుస్తకాల్లో ఉన్న వివరాలను బట్టి పాము అత్యంత విషపూరితమైనదని, మానవుని శత్రువని తేలింది.
ఫ్రాన్సులో ఉన్న పాముల ప్రదర్శనశాలలో ఉన్న ఒక విషసర్పాన్ని గురించి కొన్ని వివరాలు ప్రచురించబడ్డాయి. వీటి ప్రకారం 1 1/2 మీటర్ల పొడవైన ఈ పాము తన విషంతో ఒకేసారి అయిదుగురిని చంపగలదు.
1999 ఫిబ్రవరిలో కింగ్ సఊద్ యూనివర్శిటీలో విద్యార్థుల కొరకు ఒక విద్యా ప్రదర్శన ఏర్పాటయింది. ఇందులో ప్రపంచంలో ఉన్న వివిధ రకాలకు చెందిన విషసర్పాలను ప్రదర్శించటం జరిగింది. వీటిని గాజు పెట్టెలలో ఉంచడం జరిగింది. వీటిలో కొన్నిటిని గురించి ఈ క్రింది వివరాలు సేకరించబడ్డాయి.
అరబి కోబ్రా ఇది అరబ్ దేశాలలో ఉంది. ఇది ఎంత విషపూరితమైనదంటే దీని 20 మిల్లీ గ్రాముల విషం 70 కిలోల మానవుడ్ని వెంటనే చంపగలదు. అయితే ఈ కోబ్రా ఒకేసారి 200 మిల్లీగ్రాముల నుండి 300 మిల్లీగ్రాముల వరకు విషాన్ని శత్రువు పై విసరగలదు (ఉమ్మగలదు). భారతదేశం, పాకిస్తాన్లలో గల కింగ్ కోబ్రా ద్వారా కాటు వేయబడిన వ్యక్తి వెంటనే మరణిస్తాడు. పాశ్చాత్య దేశాలలో ఉండే వెస్ట్ డైమండ్ బేక్ర్ సర్పాలు కూడా అత్యంత విషపూరితమైనవే.
ఇండోనేషియాలోని ఉమ్మి విసిరే విషసర్పం రెండు మీటర్లు పొడవు ఉంటుంది. ఇది మూడు మీటర్ల దూరం నుండి మానవుని కళ్ళలోనికి విషాన్ని విసురుతుంది. దీనివల్ల మానవుడు వెంటనే మరణిస్తాడు.
నరకం కంటే ముందు అవిశ్వాసులను సమాధిలో కూడా పాము కాటుల ద్వారా శిక్షించటం జరుగుతుంది. సమాధి శిక్షను గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“అవిశ్వాసి మున్కర్ నకీర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనప్పుడు, వాడిపై 99 పాములు వదలివేయటం జరుగుతుంది. తీర్పుదినం వరకు అవి అతన్ని కాటు వేస్తూ మాంసాన్ని పీక్కుతింటూ ఉంటాయి. “
సమాధిలోని పాముల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉపదేశిం చారు:
“ఒకవేళ ఆ పాము ఒకసారి భూమిని కాటు వేస్తే భూమిపై ఏ ఆకు కూరలు పండవు.” (ముస్నద్ అహ్మద్)
సమాధిలోని పాముల గురించి ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖనంలో ఈ విధంగా కూడా పేర్కొనబడింది:
“ఒక్కొక్క పాముకు, 70 ముఖాలు ఉంటాయి. వాటితో అవి అవిశ్వాసిని తీర్పుదినం వరకు కాటు వేస్తూ ఉంటాయి.”
నరకంలోని పాముల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పేర్కొన్నారు:
“అవి ఒంటెలా ఎత్తుగా ఉంటాయి. అవి ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసికి 40 సంవత్సరాల వరకు బాధ కలుగుతూ ఉంటుంది.” (ముస్నద్ అహ్మద్)
సమాధిలో, నరకంలో కాటు వేసే పాములు నిస్సందేహంగా ఇహలోకంలోని పాముల కంటే ఎన్నో రెట్లు విషం గలవి, ప్రమాదకరమైనవి, భయంకరమైనవి. ఇహ లోకంలో ఒక సామాన్య విషసర్పం కాటు వేస్తేనే మానవుడు గిలగిల విలపిస్తాడు. వెంటనే మానవుడు స్పృహ కోల్పోతాడు. విషం ప్రవేశించిన భాగం పనికిరాకుండా పోతుంది. ముక్కు ద్వారా, నోటి ద్వారా, చెవి ద్వారా, కళ్ళద్వారా రక్తం స్రవిస్తుంది. ఈ పరిస్థితి అంతా పాము ఒక్కసారి కాటు వేసినందుకే జరుగుతుంది. ఆ మానవుడ్నే వేల రెట్లు అధిక విషం గల పాములు కాటు వేస్తూ ఉంటే ఎంతటి వ్యధకు గురవుతాడో ఆలోచించండి!
తేలు కాటు ప్రభావం, పాము కాటు ప్రభావానికి వేరుగా ఉంటుంది. తేలు కాటు వేస్తే మానవుడు రెండు విధాల బాధలకు గురవుతాడు. మొదట శరీరం ఉబ్బిపోతుంది. తరువాత ఊపిరి పీల్చుకోవటం కష్టం అవుతుంది. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది.
నరక తేళ్ళ గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
“అవి అడవి గాడిదల్లా ఉంటాయి. ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసి నలభై సంవత్సరాల వరకు దాని మంటను భరిస్తూ ఉంటాడు.” (ముస్నద్ అహ్మద్)
అంటే దీని అర్ధం తేలు నిరంతరం కాటు వేస్తూ ఉంటే నరకవాసుని శరీరం కూడా ఉబ్బుతూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవటంలోనూ బాధ పెరుగుతూ ఉంటుంది. ఇది నరకంలోని అవిశ్వాసికి ఇవ్వబడే శిక్షల్లో ఒకటి. అవిశ్వాసులు నరకంలోని పాములను తేళ్ళను చంపగలరా? ఎక్కడికైనా పారిపోగలరా? లేదా ఎక్కడైనా దాక్కోని రక్షణ పొందగలరా?
అల్లాహ్ ఆదేశం:
رُّبَمَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا لَوْ كَانُوا مُسْلِمِينَ
తిరస్కారులే అప్పుడు పశ్చాత్తాపపడుతూ, “అయ్యో! మేము ముస్లిములమయి ఉంటే ఎంత బాగుండేది” అని అంటారు. (అల్ హిజ్ర్ 15:2)
అయితే ఓ విశ్వాసులారా! నరక శిక్షలను విశ్వసించే ప్రజలారా! అల్లాహ్ శిక్షలకు భయపడండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క అవిధేయతకు దూరంకండి. అల్లాహ్ శిక్షల గురించి తెలిసి కూడా ఆయనకు అవిధేయత చూపటం అల్లాహ్కు ఆగ్రహం కలిగించినట్టే అవుతుంది.
فَهَلْ أَنتُم مُّنتَهُونَ
“మరి మీరు అల్లాహ్ అవిధేయతను వదిలివేస్తారా?” (అల్ మాయిదహ్ 5:91)
ఈ పోస్ట్ నరక విశేషాలు – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ అనే పుస్తకం పేజీ:21-23 నుండి తీసుకోబడింది.
ఇతరములు:
- మరణానంతర జీవితం [పుస్తకం]
- మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
- సోదరులారా! ఇలాంటి స్థలం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి!
- నరక విశేషాలు – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]
- స్వర్గ సందర్శనం – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]
- మీ భార్యా బిడ్డలను నరకాగ్ని నుండి రక్షించుకోండి – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
- ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books)