దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) లాభనష్టాల అధికారం కలవాడు ఎవరు? 2) సఫర్ మాసం వగైరా లలో దుశ్శకునం పాటించడం. 3) నక్షత్రాల ద్వారా (గ్రహాల ద్వారా) అదృష్టాన్ని తెలుసుకోవడం. 4) మాంత్రికుల వద్దకు వెళ్ళడం. 5) విచారణ లేకుండానే స్వర్గంలోకి ప్రవేశించే వారి గుణగణాలు
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కు వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు.
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7: 188)
ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : “సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?” ఇలా అను: “నాకు అల్లాహ్ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.
“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ప్రసంగం యొక్క ముఖ్య విషయాలు
ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.
తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.
విగ్రహారాధన ప్రారంభం
అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.
అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.
ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.
చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.
మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.
రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.
అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.
చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.
ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు
అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.
నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:
(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ) “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)
ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.
ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.
నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:
(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా) “మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)
మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.
మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.
జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి
అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:
إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ
(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్) “మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60) ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:
(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్) “ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24) అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:
وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً
(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్) “అల్లాహ్‌యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24) ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.
అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”
ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:
يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ
(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్) “ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24) ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:
إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ
(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్) “ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25) అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:
أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ
(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్) “(ఓ నూహ్!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111) అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.
మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.
అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:
وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ
(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్) “నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109) నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:
وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ
(వమా అన బితారిదిల్ ము’మినీన్) “నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114) నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.
నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్) “అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14) అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.
అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:
(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా) “మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)
చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:
إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్) “నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59) అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.
అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:
(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్) “ఓ నూహ్! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32) అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.
మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:
(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్) “ఓ నూహ్! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116) వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.
దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం
అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?
(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్) “ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36) ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?
(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్) “నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118) అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?
(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్) “నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37) అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.
నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:
(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా) “నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27) నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.
అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:
(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్) “ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38) అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.
అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:
(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్) “నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28) నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.
మహా జలప్రళయం మరియు రక్షణ
ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).
మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.
ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,
بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ
(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా) “దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41) అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.
(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్) “దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (23:28) దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.
ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.
బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:
(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్) “ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42) బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:
(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’) “నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43) ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.
తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:
يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ
(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక) “ఓ నూహ్! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46) ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.
إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ
(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్) “నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46) అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.
నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.
నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:
(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్) “ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29) ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:
وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ
(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్) “ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42) అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.
తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.
وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ
(వస్తవత్ అలల్ జూదియ్యి) “ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44) ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.
అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.
నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం
ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.
ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.
అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.
ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.
అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
—
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
“తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజెయ్యబడింది) https://youtu.be/IjbFjYK0z3c [10 నిముషాలు]
సూరా అల్ కహఫ్ (ఆయతులు 4 – 5)
18:4 وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).
18:5 مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.
ఈ ప్రసంగంలో, అల్లాహ్‌కు సంతానం ఉందని చెప్పేవారిని హెచ్చరించమని ఆదేశించే ఖురాన్ (సూరహ్ అల్-కహఫ్, ఆయత్ 4-5) ఆయతులపై వివరణ ఇవ్వబడింది. ఇది ఎటువంటి జ్ఞానం లేదా ఆధారం లేని తీవ్రమైన పాపమని, కేవలం అజ్ఞానంతో పలికే మాట అని వక్త నొక్కిచెప్పారు. యూదులు, క్రైస్తవులు, మక్కా ముష్రికులు గతంలో ఇలాంటి వాదనలు చేశారని ఉదహరించారు. దీనికి విరుద్ధంగా, అల్లాహ్‌కు తల్లిదండ్రులు, భార్య లేదా సంతానం లేరని, ఆయన ఏకైకుడని సూరహ్ అల్-ఇఖ్లాస్ స్పష్టం చేస్తుందని తెలిపారు. ఈ సత్యాన్ని ఇతరులకు తెలియజేయడం (దావత్) ప్రతీ ముస్లిం బాధ్యత అని, దీనికోసం కనీసం సూరహ్ అల్-ఇఖ్లాస్ మరియు ఆయతుల్ కుర్సీ యొక్క భావాన్ని తెలుసుకుని చెప్పినా సరిపోతుందని అన్నారు. అయితే, ఇతరుల వాదన ఎంత మూర్ఖంగా ఉన్నప్పటికీ, వారితో మృదువుగా, గౌరవప్రదంగా సంభాషిస్తూ దావత్ ఇవ్వాలని, ఈ పద్ధతులను తెలుసుకోవడం తప్పనిసరి అని బోధించారు.
وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا వయున్దిరల్లదీన ఖాలుత్తఖదల్లాహు వలదా ఈ ఖురాన్ ద్వారా (యున్దిర్) హెచ్చరించాలి.
اتَّخَذَ اللَّهُ وَلَدًا ఇత్తఖదల్లాహు వలదా నవూజుబిల్లాహ్. అల్లాహ్ తన కొరకు సంతానం చేసుకున్నాడు అని ఎవరైతే అంటున్నారో, అలాంటి వారిని కూడా మీరు ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించాలి.
ఇక మీరు ఈ ఆయతును గమనించండి. మనం ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నామా?
అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఈ ఖురాన్ ద్వారా మీరు వారిని హెచ్చరించండి – “మీకు జ్ఞానం లేని మాటలు అల్లాహ్ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? అల్లాహ్ ఎవరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు. అల్లాహ్ ఎవరినీ కూడా తనకు భార్యగా చేసుకోలేదు”
యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. మక్కా యొక్క ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అని అనేవారు. మరియు ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, మహేశ్వరుడు అన్నటువంటి పదాలు ఆ ఏకైక సృష్టికర్త గురించే మేము అంటున్నాము అని అంటారు. కానీ మళ్ళీ ఆ సృష్టికర్తకు సంతానాలు ఉంటాయి. ఆ సృష్టికర్తకు ఎందరో భార్యలు ఉంటారు. అంతేకాదు, వాళ్ళ యొక్క దేవుళ్ళ సంగతి ఎలా అంటే, పెద్ద దేవుడు కొన్ని సందర్భాల్లో చిన్న దేవుళ్ళపై కోపగించి వారిపై శాపం కూడా కురిపిస్తాడు మరియు శాపం పడిన వారిని కరుణించి వరాలు కూడా కురిపిస్తాడు. ఈ విధంగా ఎన్నో విచిత్ర సంఘటనలు మనం వింటూ చూస్తూ ఉన్నాము.
నిజంగా, వాస్తవంగా మనందరి సృష్టికర్త ఎవరు అంటే, అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, సంతాన భార్య లేదు, సంతానమూ లేరు, అతనికి ఏ కుటుంబము, పరివారము అని లేరు.
(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. (సూరా అల్ ఇఖ్లాస్)
మనందరికీ ఈ సూరా గుర్తుంటుంది కదా. దీని యొక్క అనువాదం తెలుసుకొని ప్రేమగా ఒక్కసారైనా గానీ మనం మన చుట్టుపక్క ఉన్నటువంటి బహుదైవారాధకులకు, అవిశ్వాసులకు, సత్య తిరస్కారులకు, అల్లాహ్‌తో పాటు వేరే వారిని పూజించే వారికి ఈ సూరత్ యొక్క అనువాదం మనం వినిపించాలి.
ఈ రోజుల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు. మేము మేము అవిశ్వాసులకు దావత్ ఇవ్వాలి అని అనుకుంటాము, కానీ మాకు ఎక్కువ జ్ఞానం ఏమీ లేదు. ఎలా వారికి దావత్ ఇవ్వాలి? చూడండి, దావత్ యొక్క విషయం కొన్ని సందర్భాలలో, కొన్ని సందర్భాలలో ఇది లోతైన జ్ఞానం, చాలా పటిష్టమైన ఆధారాలతో కూడిన జ్ఞానం కూడా అవసరం ఉంటుంది. మరెన్నో సందర్భాలలో కేవలం ఖుల్ హువల్లాహు అహద్ ఈ మొత్తం సూరా మరియు ఆయతుల్ కుర్సీ, ఆయతుల్ కుర్సీ మీకు గుర్తు ఉంది అంటే దాని అనువాదం చూసుకోండి. ఆయతల్ కుర్సీలో 10 విషయాలు అల్లాహ్ ఏకత్వం గురించి తెలుపబడ్డాయి. మీరు దాని యొక్క అనువాదం కనీసం తెలియజేశారు అంటే ఎంతో ఒక గొప్ప సత్యాన్ని, మీరు సత్కార్యాల్లో చాలా ఉన్నత శిఖరానికి చెందిన ఒక సత్కార్యం గురించి ప్రజలకు బోధించిన వారు అవుతారు.
అయితే ఈ లోకంలో చూడటానికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారు, ఎంతో తమకు తాము మేధావులు అనుకునేవారు నిజ సృష్టికర్త అయిన అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారంటే, ఆ తర్వాత ఆయతు నంబర్ ఐదు చదవండి.
నవూజుబిల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లాహ్. అల్లాహ్‌కు సంతానం ఉంది అని ఎవరైతే అంటున్నారో, ఈ మాట చెప్పడానికి వారి నోరు ఎలా విప్పారు?ఎందుకంటే:
مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ మా లహుమ్ బిహీ మిన్ ఇల్మ్ వారికి దీని గురించి ఎలాంటి జ్ఞానం లేదు
وَلَا لِآبَائِهِمْ ۚ వలా లిఆబాఇహిమ్ ఇలాంటి మాట పలికిన వారి తాత ముత్తాతలకు కూడా ఈ జ్ఞానం నిజ జ్ఞానం లేదు.
ఈ మాట ఎంత భయంకరమైనదో తెలుసా? ఎంత ఘోరమైనదో తెలుసా?
كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ కబురత్ కలిమతన్ తఖ్రుజు మిన్ అఫ్వాహిహిమ్ వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది.
ఖురాన్‌లో వేరే కొన్ని సందర్భాలలో అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు?
تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ తకాదుస్-సమావాతు యతఫత్తర్న అల్లాహ్‌కు సంతానం ఉన్నది అని వారు పలికే మాట ఎంత చెండాలమైనది, ఎంత తప్పు మాట, ఎంత దారుణమైనది అంటే భూమ్యాకాశాలు బ్రద్దలైపోతాయి.
ఎందుకంటే ఈ మానవుడు మరియు జిన్నాతులలో షైతానులు తప్ప సర్వ సృష్టి అల్లాహ్ ఏకత్వాన్ని నమ్ముతుంది.
وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ద్, తౌఅన్ వ కర్హా, వ ఇలైహి యుర్జాఊన్ ఆకాశాల్లో, భూమిలో ఉన్న సమస్తము కూడా అల్లాహ్‌కు మాత్రమే వారు ఇస్లాం ముస్లింలుగా ఉన్నారు.
అస్లమ అంటే వారు విధేయులై ఉన్నారు. శిరసావహించి ఉన్నారు. అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మి ఉన్నారు. అల్లాహ్ యొక్క ఏకత్వంలో వారు ఏమాత్రం భాగస్వామి కలగజేయరు. కానీ సర్వ సృష్టిలో అతి ఉత్తముడైన ఈ మానవుడే అల్లాహ్ పట్ల ఎంతటి అబద్ధపు మాట పలుకుతున్నాడో అల్లాహ్ స్వయంగా చెప్పాడు:
إِن يَقُولُونَ إِلَّا كَذِبًا ఇన్ యఖూలూన ఇల్లా కదిబా వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.
అయితే ఇక్కడ ఒక సత్యం మీరు తెలుసుకోండి. ఖురాన్ చదువుతూ ఉంటాము కానీ మనం అర్థం చేసుకో చేసుకుంటూ ఉండము. అందుకొరకే ఎన్నో విషయాలు పై నుండే మనకు దాటిపోతూ ఉంటాయి.
ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో స్వయం వారి వద్ద ఈ షిర్క్ గురించి ఎలాంటి ఆధారం లేదు. వారు చెబుతున్న ఈ మాట ఎలాంటి సత్యంతో కూడినది కాదు. అల్లాహ్‌కు వేరే భాగస్వాములు ఉన్నారు, సంతానం ఉంది అని అనడం ఇది అజ్ఞానంతో, మూర్ఖత్వంతో కూడిన మాట.
అందుకొరకే ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హా బ్ రహిమహుల్లాహ్ యొక్క మనమడు కితాబు తౌహీద్ యొక్క వ్యాఖ్యానం ఏదైతే రాశారో అందులో ఒక మాట ఇది కూడా చెబుతున్నారు ఆరంభంలోనే. – “ఎవరు ఎంత పెద్ద ప్రపంచపు చదువులు చదివినా, అల్లాహ్‌తో పాటు ఇతరులను సాటి కలుపుతున్నాడంటే అతడు అసలైన జ్ఞానానికి దూరం, అజ్ఞానంలో, మూర్ఖత్వంలో పడి ఉన్నాడు.”
కానీ ఇక్కడ వారి ఆ మాట మూర్ఖత్వంతో కూడినది. కానీ వారికి దావత్ ఇచ్చే విషయంలో, సందర్భంలో మనం ప్రతి ఒక్కరితో వారి యొక్క తగిన స్థానానిని, వారి యొక్క ఏ హోదా అంతస్తు ఉందో ఈ లోకంలో వారిని గౌరవిస్తూ, గౌరవిస్తూ అంటే వారితో ఎలా సంభాషించాలి, ఎలా మాట్లాడాలి, దావత్ ఇచ్చే విషయంలో ఎలా మనం వారిని మృదు వైఖరితో, తీపి మాటతో మాట్లాడాలి ఆ విషయాలు కూడా మనం తెలుసుకొని ఉండడం తప్పనిసరి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నిజ సృష్టికర్తను ఎలా గుర్తించాలి? ఆయన గుణగణాలేమిటి? https://youtu.be/YXvC41kqzPw(8:34 నిముషాలు ) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ ప్రసంగంలో “అల్లాహ్ అంటే ఎవరు?” మరియు “అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి?” అనే రెండు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. పొగను చూసి నిప్పును, వస్తువును చూసి దాని తయారీదారుని గుర్తించినట్లే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని చూసి దాని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని తార్కికంగా అర్థం చేసుకోవచ్చని వక్త వివరిస్తారు. ఆ సృష్టికర్త ఒక్కడేనని, ఆయనకు ఎవరూ సాటిలేరని స్పష్టం చేస్తారు. ఆయన ఏకత్వాన్ని, గొప్పతనాన్ని మరియు లక్షణాలను వివరించడానికి, వక్త దివ్య ఖురాన్‌లోని ‘సూరహ్ అల్-ఇఖ్లాస్’ మరియు ‘ఆయతుల్ కుర్సీ’లను వాటి తెలుగు అనువాదంతో సహా ఉదహరించారు. ఈ వచనాల ద్వారా అల్లాహ్ నిరపేక్షాపరుడని, సజీవుడని, సర్వజ్ఞుడని, మరియు ఆయనకు తల్లిదండ్రులు, సంతానం లేరని, ఆయనకు ఎవరూ సమానులు కారని నొక్కిచెప్పారు. సత్యాన్ని గ్రహించి, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్‌ను ఆరాధించాలని ఈ ప్రసంగం పిలుపునిస్తుంది.
అల్హందులిల్లాహ్. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ రెండు ప్రశ్నలకు సంక్షిప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.
అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు మనం లాజికల్‌గా కూడా సమాధానం పొందవచ్చు. అంటే, పొగను చూసి దూరంగా, పొగను చూసి అక్కడ అగ్ని మండుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాము. ఒక టేబుల్‌ను, కట్టెతో చేయబడిన అల్మారీని చూసి, దీనిని తయారు చేసేవాడు ఒక కార్పెంటర్ అని, ఎక్కడైనా ఏదైనా మంచి డిజైన్‌ను చూసి ఒక మంచి ఆర్టిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉదాహరణలు మన ముందుకు వస్తాయి కదా.
అయితే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని మన కళ్లారా మనం చూస్తూనే ఉన్నాము కదా. అయితే, వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని అట్లే మనకు తప్పకుండా తెలుస్తుంది. ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు.
ఈ లోకంలో ఆ నిజమైన సృష్టికర్తను వదలి ఎంతోమంది ప్రజలు వేరే ఎవరెవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఒక్కసారి ప్రశాంతమైన మనసుతో మీరు ఆలోచించండి. ఆ ఆరాధ్యులలో, ఎవరినైతే ఆ నిజ సృష్టికర్తను వదిలి ఎవరినైతే ప్రజలు పూజిస్తున్నారో, ఆ పూజ్యులలో ఏ ఒక్కరైనా గానీ “మేము ఆకాశం సృష్టించామని, భూమిని మేము సృష్టించామని, వర్షాన్ని మేము కురిపిస్తున్నామని,” ఈ విధంగా ఏమైనా దావా చేసిన వారు ఉన్నారా? లేరు. ఉండరు కూడా.
అయితే, ఇంకా ఇలాంటి ఉదాహరణలతోనే మీకు సమాధానాలు ఇస్తూ ముందుకు పోవడం మంచిది కాదు. స్వయంగా ఆ సృష్టికర్త, మనందరి నిజ ఆరాధ్య దైవం, ఆయన యొక్క అంతిమ గ్రంథంలో సర్వ మానవాళిని ఉద్దేశించి, స్వయంగా ఆయన తన గురించి ఏ పరిచయం అయితే మనకి ఇచ్చాడో, ఒక్కసారి శ్రద్ధగా ఆలకిద్దాము.
“వారికీ ఇలా చెప్పు, అల్లాహ్ ఆయన ఒక్కడు, ఏకైకుడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఏ అవసరం లేని వాడు, సృష్టిలో ప్రతీ ఒక్కరి అవసరాన్ని తీర్చువాడు. ఆయన ఎవరిని కనలేదు అంటే, ఆయనకు భార్య, పిల్లలు ఎవరూ లేరు. ఇంకా, ఆయన కూడా ఎవరికీ పుట్టిన వాడు కాడు, అంటే ఆయనకు తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేడు.“
ఇది దివ్య గ్రంథం, సర్వ మానవాళి కొరకు మార్గదర్శిగా పంపబడినటువంటి దివ్య గ్రంథం ఖురాన్‌లోని 112వ అధ్యాయం.
ఇక ఆ సృష్టికర్త అయిన అల్లాహ్, సూరతుల్ బఖరా, సూరహ్ నెంబర్ రెండు, ఆయత్ నెంబర్ 255లో తన గురించి ఎలా పరిచయం చేశాడో, చాలా శ్రద్ధగా ఆలకించండి.
ఆ నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సుమారుపది గుణాలు ఈ ఆయతులో తెలుపబడ్డాయి. శ్రద్ధగా వినండి మరియు ఆయన తప్ప ఈ సృష్టిలో ఏ ఒక్కరిలోనైనా ఈ గుణాలు ఉన్నాయా గమనించండి. తద్వారా ఆయన ఏకైకుడు, ఆయనే ఒకే ఒక్కడు మన ఆరాధనలకు అర్హుడు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని కూడా గ్రహించండి. ఇప్పుడు నేను మీ ముందు పఠించినటువంటి ఆయతి యొక్క తెలుగు అనువాదం:
అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గానీ నిద్ర గానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్సీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, చాలా గొప్పవాడు.
అల్లాహు అక్బర్. అధ్యాయం 112లో మీరు సుమారు నాలుగు Unique , సాటి లేని అటువంటి గుణాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చదివిన ఈ రెండవ అధ్యాయంలోని 255వ ఆయతులో సుమారు పది గుణాలు తెలుసుకున్నారు. నిశ్చింతగా, ఏకాంతంలో పరిశీలించండి. మరియు మన ఈ శరీరంలో నుండి ప్రాణం వీడకముందే సత్యాన్ని గ్రహించండి. ఆ నిజమైన సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net