ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఏది లేదు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఏది లేదు
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/ta7KklHK6V0 [19 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాం అనుగ్రహం యొక్క ప్రాముఖ్యత మరియు శ్రేష్ఠత గురించి 10 ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి. ఇస్లాం అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మరియు ఇష్టపడిన సహజ సిద్ధమైన ధర్మం. ఇది స్వచ్ఛమైన తౌహీద్ (ఏకదైవారాధన) ను బోధిస్తుంది మరియు జ్ఞానం, న్యాయం, సమానత్వం, సులభత్వం, మరియు ఓర్పు వంటి గుణాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ధర్మంలో ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేస్తుంది మరియు ఇది నైతిక విలువలతో కూడిన ఉత్తమమైన సమాజాన్ని (ఉమ్మతే వసత్) నిర్మిస్తుంది. ఈ అనుగ్రహాలన్నీ ఇస్లాంను ఇతర అనుగ్రహాల కంటే ఉన్నతమైనదిగా నిరూపిస్తాయని వక్త పేర్కొన్నారు.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్షైతా నిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బ’అద్. అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ రోజు మనం, ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అన్న అంశంపై ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనపై ఎన్నో అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించాడు. ఆ వరాలలో, ఆ అనుగ్రహాలలో అన్నిటికంటే శ్రేష్ఠమైనది, దానికి మించినది లేనిది అది ఇస్లాం ధర్మం. దీని గురించి అనేక విషయాలు ఉన్నాయి, కాకపోతే ఈ రోజు మనం 10 విషయాలు తెలుసుకుందాం.

మొదటి విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దాసుల కొరకు అనుగ్రహించిన ధర్మం, ఇష్టపడిన ధర్మం అన్నమాట. ఈ విషయం అల్లాహ్ సూర ఆలి ఇమ్రాన్ లో ఇలా తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
(ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం)
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం. (3:19)

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వమయ్ యబతగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలయ్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్)
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా ఆయత్ మూడులో ఇలా సెలవిచ్చాడు:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను(5:3)

ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత స్పష్టంగా ఇస్లాం మీ కొరకు ధర్మంగా ఎన్నుకున్నాను, మీ కొరకు దీనిని పరిపూర్ణం చేశాను, దీనిని ,అంటే ఇస్లాంని అల్లాహ్ ఏమన్నాడు? నా అనుగ్రహం అంటున్నాడు. ‘ని’మతీ’, నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. ఇది మొదటి విషయం. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దాసుల కోసం అనుగ్రహించిన, ఇష్టపడిన ధర్మం ఇస్లాం ధర్మం.

ఇక రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన ధర్మం. సహజ సిద్ధమైన, స్వాభావిక ధర్మం. ఇది ప్రత్యేకత ఇది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర రూమ్, ఆయత్ 30లో ఇలా సెలవిచ్చాడు:

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్‌) ధర్మంపై నిలుపు. అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్‌ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం. కాని చాలామంది తెలుసుకోరు. (30:30)

ఈ ఆయత్ లో ‘ఫితర‘ అని ఉంది. ఫితరతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా’. ‘ఫితరత్‘ అంటే సహజత్వం లేక నైజం అన్నమాట. వేరే మాటలలో చెప్పాలంటే, అల్లాహ్ మానవుణ్ణి సహజ ధర్మంపై, అంటే దేవుని ఏకత్వంపై, తౌహీద్ స్వభావంపై పుట్టించాడు. కాబట్టి మానవ నైజములోనే ఏకత్వం, తౌహీద్, ఏక దైవ ఆరాధన అంతర్లీనమై ఉంది అన్నమాట. అందుకే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. బుఖారీలో హదీస్ ఉంది:

كُلُّ مَوْلُودٍ يُولَدُ عَلَى الْفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ أَوْ يُنَصِّرَانِهِ أَوْ يُمَجِّسَانِهِ
(కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫితర, ఫ అబవాహు యుహవ్విదానిహి అవ్ యునస్సిరానిహి అవ్ యుమజ్జిసానిహి)
ప్రతి బిడ్డ సహజత్వం (ఇస్లాం) తోనే పుడతాడు. అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీ (అగ్ని ఆరాధకుడు) గానో చేసేస్తారు.

అంటే ప్రతి బిడ్డ సహజత్వంతోనే పుడతాడు, నైజంతోనే పుడతాడు, సహజత్వంతోనే పుడతాడు, అంటే మువహ్హిద్ గానే పుడతాడు, తౌహీద్ లోనే పుడతాడు. కాకపోతే పెరిగిన కొద్దీ ఆ బిడ్డ యొక్క అమ్మానాన్న అతనికి యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీగానో చేసేస్తారు అన్నమాట. అంటే రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన, స్వాభావిక గల ధర్మం అన్నమాట.

ఇక మూడవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం. ఖురాన్ లోని సూర ఇఖ్లాస్:

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ‎﴿١﴾‏ اللَّهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ‎﴿٤﴾
(ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్)
(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. (ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.

అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో మూల సూత్రాలు, సృష్టికర్త అంటే ఎవరు, మూల సూత్రాలు తెలియజేశాడు. అల్లాహ్ ఒకే ఒక్కడు, ఎటువంటి అక్కరా, ఎటువంటి అవసరం లేనివాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. తినటం, త్రాగటం, నిద్రించటం, కునుకు, నిద్ర, అవసరం, సహాయం తీసుకోవటం, ఇలాంటి ప్రపంచములో ప్రతి జీవి, ప్రతి వ్యక్తికి ఇది అవసరం ఉంటుంది. ఎటువంటి అవసరం అక్కర లేకుండా ఏ జీవి ఉండలేదు, జీవించలేదు. కావున సకల లోకాలకు సృష్టికర్త అటువంటి వాడు కాదు. అవసరం లేని వాడు అల్లాహ్, అక్కర లేనివాడు అల్లాహ్. అలాగే ఆయనకి అమ్మానాన్న లేరు, సంతానమూ లేదు. ఆయనకి సమానము ఎవరూ లేరు. ఇంకా మనము ఖురాన్ పరిశీలిస్తే, అల్లాహ్ పుట్టినవాడు కాదు, అల్లాహ్ కి చావు, మరణం రాదు అన్నమాట. ఇది మూడవ విషయం.

ఇక నాలుగవ విషయం ఏమిటంటే, జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞతల ధర్మం ఇస్లాం ధర్మం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ ‎﴿١﴾‏ خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ ‎﴿٢﴾‏ اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ ‎﴿٣﴾‏ الَّذِي عَلَّمَ بِالْقَلَمِ ‎﴿٤﴾‏ عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ‎﴿٥﴾
(ఓ ప్రవక్తా!) సృష్టించిన నీ ప్రభువు పేరుతో చదువు. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో, నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞాన బోధ చేశాడు. ఆయన మనిషిని అతడు ఎరుగని, తెలియని దానిని నేర్పించాడు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మొట్టమొదటి సారి వచ్చిన దివ్యవాణి ఇది. అంటే మొదటి దైవవాణి జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి, విద్య గురించి వచ్చిందన్నమాట. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర ముజాదలలో ఇలా సెలవిచ్చాడు:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫ ఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్ లజీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. (58:11)

మీలో విశ్వసించిన వారిది మొదటి విషయం, రెండవది జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతాడు. అంటే మూడవ విషయం ఏమిటంటే, జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞత గల ధర్మం ఇస్లాం ధర్మం. ఇది నాలుగో విషయం.

ఐదవ విషయం ఏమిటంటే, మానవుల మధ్య న్యాయం, సమానత్వం కలిగిన ధర్మం. ఇస్లాం ధర్మం మానవుల మధ్య, జనుల మధ్య, దైవదాసుల మధ్య, సృష్టి మధ్య సమానత్వం కలిగిన ధర్మం, ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు:

وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ
(వ ఇజా హకమ్తుమ్ బైనన్నాసి అన్ తహ్కుమూ బిల్ అద్ల్)
ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి. (4:58)

إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ
(ఇన్నల్లాహ య’మురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఈతాయి జిల్ ఖుర్బా)
అల్లాహ్‌ న్యాయం చేయమనీ, ఉపకారం (ఇహ్‌సాన్‌) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు.  (16:90)

అంటే ఐదవ విషయం ఏమిటి? మానవుల మధ్య, సృష్టి మధ్య, దైవదాసుల మధ్య పూర్తిగా న్యాయం చేసే ధర్మం ఇస్లాం ధర్మం.

అలాగే ఆరవ విషయం ఏమిటంటే, సులభమైన ధర్మం ఇస్లాం ధర్మం. అల్లాహ్ అంటున్నాడు సూర హజ్ లో:

وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ
(వమా జ’అల అలైకుమ్ ఫిద్దీని మిన్ హరజ్)
ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు (22:78)

మానవ మాత్రులు భరించలేనంతటి కష్టతరమైన, క్లిష్టతరమైన బాధ్యతను అల్లాహ్ మనపై మోపలేదు అన్నమాట. అలాగే అల్లాహ్ సూర బఖరా యొక్క చివరలో ఇలా సెలవిచ్చాడు:

لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا
(లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్’అహా)
అల్లాహ్‌ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. (2:286)

అంటే ఇది ఆరవ విషయం, సులభమైన ధర్మం. మనిషి మోయలేని భారం అల్లాహ్ వేయలేదు అన్నమాట.

ఇక ఏడవ విషయం ఏమిటంటే, ఓర్పుని, సహనాన్ని బోధించే ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష నిమిత్తం ప్రపంచంలో సమస్యలు ఇస్తాడు, మనిషికి సమస్యలు వస్తాయి. రోగాలు వస్తాయి. ఆరోగ్యంతో పాటు అనారోగ్యము ఉంటుంది, లాభంతో పాటు నష్టమూ ఉంటుంది, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అల్లాహ్ కొందరికి ఇస్తాడు, కొందరికి ఇవ్వడు. కొందరు ధనవంతులు, కొందరు పేదవారు. ఉన్నవారు, లేనివారు. కానీ ఇదంతా ఎందుకు? పరీక్ష కోసం. కావున సహనాన్ని, ఏ సమయంలో, కష్టంలో, దుఃఖంలో, నష్టంలో, బాధలో సమీప బంధువులు, దగ్గర ఉన్నవారు చనిపోయినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? వ్యాపారంలో నష్టం జరిగింది, ఉద్యోగం అకస్మాత్తుగా పోయింది, ఇబ్బందుల్లో వచ్చేసాము. కానీ ఇస్లాం ధర్మం సహనం బోధిస్తుంది. ఏ విధంగా? దానికి వివరాలు ఉన్నాయి, నేను వివరం చెప్పటం లేదు. ఖురాన్లో వివరాలు ఉన్నాయి. అల్లాహ్ అంటున్నాడు:

إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్)
స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు (8:46)

అల్లాహ్ యొక్క సహాయం కోరండి బాధల్లో, సమస్యల్లో, అనారోగ్యంలో, కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకాటాల్లో అల్లాహ్ సహాయం కోరండి. ఏ విధంగా కోరండి? సహనం ద్వారా, నమాజ్ ద్వారా. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అసర్ లో నాలుగు విషయాలు తెలియజేశాడు. ఈ నాలుగు గుణాలు, నాలుగు లక్షణాలు కలిగిన వారు ఇహపర లోకాలలో నష్టపోరు అని. వారిలో ఒకటి ఏమిటి? విశ్వాసం. రెండవది సత్కార్యం. మూడవది హఖ్, సత్యం. నాలుగవది సహనం. కావున ఇస్లాం ధర్మం సహనాన్ని బోధించే ధర్మం.

ఇక ఎనిమిదవ విషయం ఏమిటంటే, ధర్మం విషయంలో బలవంతం చేయదు ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది (2:256)

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ ۚ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا
ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.(18:29)

అంటే సత్యం మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది, కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్ని సిద్ధం చేసి ఉంచాము. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సత్యం ఏది, అసత్యం ఏది స్పష్టంగా తెలియజేశాడు. బలవంతం చేయడు. ఎటువంటి బలవంతమూ లేదు. మీకు నచ్చితే, మీకు ఇష్టం ఉంటే మీరు స్వీకరించండి, లేకపోతే వదలండి. బలవంతం అనేది లేదు. కాకపోతే మంచి చేసే వారికి ప్రతిఫలం అలాగే ఉంటుంది, చెడు చేసే వారికి ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది. అభిమాన సోదరులారా! అంటే ఎనిమిదవ విషయం ఏమిటి? ఇస్లాం ధర్మం ధర్మం విషయంలో బలవంతం చేయదు.

తొమ్మిదవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అంటే ఉమ్మతే ముహమ్మదియా, ఉమ్మతే వసత్. అంటే మెరుగైన, ఉత్తమమైన సమాజం అన్నమాట. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا
అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్‌)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.)(2:143)

అభిమాన సోదరులారా! ఈ ఆయత్ లో ‘వసత్’ అనే పదం వచ్చింది. ‘వసత్’ అనే పదానికి అర్థం మధ్యస్థం, కానీ మెరుగైన, ఉత్తమమైన అని అర్థం కూడా వస్తుంది. ఈ భావములోనే ఇక్కడ ప్రయోగించబడింది. ఉత్తమమైనది, మెరుగైనది అన్నమాట ఇస్లాం ధర్మం.

అభిమాన సోదరులారా! ఇక పదవ విషయం ఏమిటంటే, నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం. ఈ విషయం గురించి చెప్పుకుంటూ పోతే ఖురాన్ లో, ప్రవక్త గారి ప్రవచనాలలో అసంఖ్యాకమైన వచనాలు, వాక్యాలు ఉన్నాయి. నైతికత అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? నడక, నడవడిక, నీతి, నిజాయితీ, సత్యము, న్యాయము, ధర్మము. ఏ విధంగా అమ్మానాన్నతో ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి? సంతానంతో ఎలా ఉండాలి? ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలి? జంతువులతో ఎలా ఉండాలి? దారి హక్కు ఏమిటి? శారీరక హక్కు ఏమిటి? జననం నుండి మరణం వరకు నియమాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనకు బోధించారు.

ఉదాహరణకు ఒక రెండు మూడు చెప్పి నేను ముగిస్తున్నాను. అదేమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ‘అక్సరు మా యుద్ఖిలుల్ జన్నత, తఖ్వల్లాహి వ హుస్నుల్ ఖులుఖ్’. అంటే స్వర్గానికి పోవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఎక్కువ మంది, అత్యధికంగా స్వర్గానికి ఏ కారణం వల్ల పోతున్నారు? దైవభీతి మరియు సద్గుణాలు స్వర్గ ప్రవేశానికి ఎక్కువగా దోహదకారి అవుతుందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దుఆ నేర్పించారు. ఆ దుఆ ఏమిటి? ‘

اللَّهُمَّ أَنْتَ حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي
అల్లాహుమ్మ అంత హస్సంత ఖల్ఖీ ఫహస్సిన్ ఖులుఖీ’.
ఓ అల్లాహ్! నీవు నా రూపురేఖలను అందంగా మలచినట్లే నా నడవడికను కూడా ఉత్తమంగా మలచు.

ఇంకా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ
‘బు’ఇస్తు లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాఖ్’.
నేను నడవడికను, మంచి గుణాలను పూర్తి చేయటానికే నేను పంపబడ్డాను.

అంటే ఇది దీని గురించి చాలా వివరంగా ఖురాన్ లో మరియు హదీస్ లో చెప్పడం జరిగింది. ఏ విధంగా మాట్లాడాలి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ
‘మన్ కాన యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యకుల్ ఖైరన్ అవ్ లియస్ముత్’.
ఎవరికైతే అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం ఉందో వారు మాట్లాడితే సత్యమే మాట్లాడాలి లేకపోతే మౌనం వహించాలి.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అభిమాన సోదరులారా! సారాంశం ఏమిటంటే, పదవ విషయం, ఇస్లాం ధర్మం నైతిక విలువలు గల ధర్మం. నేను ముఖ్యంగా 10 విషయాలు చెప్పాను. ఇస్లాం కి, ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అని అంశం పైన నేను పది అనుగ్రహాలు చెప్పాను.

  1. ఇస్లాం తన దాసుల కోసం అల్లాహ్ అనుగ్రహించిన, ఇష్టపడిన ధర్మం.
  2. ఇది సహజ సిద్ధమైన, స్వాభావిక గల ధర్మం.
  3. స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం.
  4. జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞతల గల ధర్మం.
  5. మానవుల మధ్య న్యాయం, సమానత్వం కలిగిన ధర్మం.
  6. సులభమైన ధర్మం.
  7. సహనాన్ని బోధించే ధర్మం.
  8. ధర్మం విషయంలో ఎటువంటి బలవంతం చేయని ధర్మం.
  9. ఉమ్మతే వసత్ అంటే మెరుగైనది, ఉత్తమమైన సమాజం.
  10. నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుని, దాని ప్రకారంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42189

షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 1 – నసీరుద్దీన్ జామిఈ  [వీడియో | టెక్స్ట్]

షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 1
https://youtu.be/dYx8j7WAV9k [43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు

أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ
అస్అలుల్లాహల్ కరీమ్, రబ్బల్ అర్షిల్ అజీం అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్
(పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ను అర్థిస్తున్నాను: ఇహపరలోకాల్లో నిన్ను వలీ* గా చేసుకొనుగాక మరియు నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక)

وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة
(వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్ వ ఇజబ్తులియ సబర్ వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్)
(ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉంది)

[*] వలీ అంటే అల్లాహ్ యొక్క సన్నిహితుడు, అతడికి అల్లాహ్ సన్మార్గం చూపుతాడు, సద్భాగ్యం ప్రసాదిస్తాడు, అతనికి సహాయసహకారాలు అందిస్తాడు.

ఈ ప్రసంగంలో, ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్) రచించిన “అల్-ఖవాయిద్ అల్-అర్బా” (నాలుగు నియమాలు) అనే పుస్తకం యొక్క పరిచయం మరియు ప్రారంభ దుఆల గురించి వివరించబడింది. ఇస్లాం యొక్క పునాది అయిన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ప్రాముఖ్యతతో ప్రసంగం ప్రారంభమవుతుంది. తౌహీద్‌ను షిర్క్ నుండి వేరు చేయడానికి ఇమామ్ ఈ పుస్తకాన్ని రచించారని, మరియు పాఠకుల కోసం దుఆతో ప్రారంభించడం ఆయన పద్ధతి అని వక్త పేర్కొన్నారు. మూడు ముఖ్యమైన దుఆలు వివరించబడ్డాయి: 1) అల్లాహ్ ఇహపరలోకాలలో తన వలీ (మిత్రుడు)గా చేసుకోవాలని కోరడం. 2) ఎక్కడ ఉన్నా ముబారక్ (శుభవంతుడు)గా చేయమని ప్రార్థించడం. 3) అనుగ్రహం పొందినప్పుడు కృతజ్ఞత (షుక్ర్), పరీక్షకు గురైనప్పుడు సహనం (సబ్ర్), మరియు పాపం చేసినప్పుడు క్షమాపణ (ఇస్తిగ్ఫార్) కోరే వారిలో చేర్చమని వేడుకోవడం. ఈ మూడు గుణాలు సౌభాగ్యానికి మరియు సాఫల్యానికి ప్రతీకలని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

ప్రియ వీక్షకులారా, అల్హందులిల్లాహి హందన్ కసీరా. ఇస్లాం ధర్మానికి పునాది అయినటువంటి కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్, దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు ఉన్నాయి. అయితే 1115వ హిజ్రీ శకంలో జన్మించినటువంటి ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్, ఆయన ఈ సౌదీ అరబ్‌లోని రియాద్ క్యాపిటల్ సిటీకి దగ్గర దిర్ఇయ్యాలో జన్మించారు. ఆయన ధర్మ విద్య నేర్చుకున్న తర్వాత ధర్మ ప్రచారం మొదలుపెట్టిన సందర్భంలో ఇక్కడ ఈ అరబ్ ప్రాంతంలో, వారి చుట్టుపక్కల్లో అనేక మంది ముస్లింలు చాలా స్పష్టమైన షిర్క్ చేస్తుంటే చూశారు. వారు చేస్తున్న ఆ షిర్క్ పనులు, వాటిని వారు షిర్క్ అని భావించడం లేదు. ఈ రోజుల్లో అనేక మంది ముస్లింలలో ఉన్నటువంటి మహా భయంకరమైన అజ్ఞానం అనండి, పొరపాటు అనండి, అశ్రద్ధ అనండి, వారు ఏ షిర్క్‌లో ఉన్నారో దానిని షిర్క్ అని భావించడం లేదు. అయితే ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వారి ముందు వారు చేస్తున్న ఆ పనులన్నిటినీ కూడా షిర్క్ అని స్పష్టపరిచారు. దానికై ఎన్నో సంవత్సరాలు చాలా కృషి చేశారు. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే ఈ దావా ప్రచారంలో ఆయన కేవలం చెప్పడం ద్వారానే కాదు, ప్రజల వద్ద ఆధారాలు స్పష్టంగా ఉండాలి, ఇంకా ముందు తరాల వారికి కూడా తెలియాలి అని కొన్ని చిన్న చిన్న రచనలు, పుస్తకాలు కూడా రచించారు. ఉసూల్ ఎ సలాసా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా, కష్ఫుష్ షుబహాత్ ఇంకా ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి పుస్తకం అల్-ఖవాయిద్ ఉల్-అర్బా. నాలుగు నియమాలు. నాలుగు మూల పునాది లాంటి విషయాలు. దేనికి సంబంధించినవి? ఈ నాలుగు నియమాలు వీటిని మనం తెలుసుకున్నామంటే తౌహీద్‌లో షిర్క్ కలుషితం కాకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడగలుగుతాము.

అయితే ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారి అలవాటు ఏమిటంటే, ఆయన ఎక్కడ బోధ చేసినా గాని, ఏ పుస్తకాలు రచించినా గాని సర్వసామాన్యంగా పాఠకులకు, విద్యార్థులకు ముందు దీవిస్తారు, దుఆలు ఇస్తారు, ఆశీర్వదిస్తారు. అల్లాహ్‌తో వీరి గురించి ఎన్నో మేళ్ళను కోరుతారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ పద్ధతి ఇది.

అయితే రండి, ఏ ఆలస్యం లేకుండా మనం ఈ పుస్తకం చదవబోతున్నాము. మధ్యమధ్యలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చూపిస్తాను కూడా. అయితే అసలు నాలుగు నియమాలు చెప్పేకి ముందు ఒక నాలుగు రకాల మంచి దుఆలు ఇస్తారు, ఆ తర్వాత తౌహీద్‌కు సంబంధించిన ఒక మూల విషయం తెలియజేస్తారు, ఆ తర్వాత ఆ నాలుగు నియమాలు చెప్పడం మొదలుపెడతారు. అయితే ఇది చాలా చిన్న పుస్తకం. మనం ఆ విషయాలను కొంచెం వివరంగా తెలుసుకుంటాము. మంచిగా అర్థం కావడానికి, మన సమాజంలో ఉన్నటువంటి షిర్క్‌ను మనం కూడా ఉత్తమ రీతిలో ఖండిస్తూ ప్రజలను ఈ షిర్క్ నుండి దూరం ఉంచడానికి.

సోదర మహాశయులారా,

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో.

ద్వారా పుస్తకం ప్రారంభిస్తున్నారు. మనకు తెలిసిన విషయమే ఖురాన్ గ్రంథం యొక్క ప్రారంభం కూడా బిస్మిల్లాహ్ నుండే అవుతుంది. ఏ పని అయినా మనం బిస్మిల్లాహ్, అల్లాహ్‌ యొక్క శుభ నామంతో మొదలుపెట్టాలి. అప్పుడే అందులో మనకు చాలా శుభాలు కలుగుతాయి. అల్లాహ్‌, ఇది మన అందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ యొక్క అసలైన పేరు. ఆ తర్వాత రెండు పేర్ల ప్రస్తావన వచ్చింది, అర్-రహ్మాన్, అర్-రహీమ్. ఇందులో అల్లాహ్‌ యొక్క విశాలమైన కారుణ్యం, ప్రజలపై ఎడతెగకుండా కురుస్తున్నటువంటి కారుణ్యం గురించి చెప్పడం జరిగింది.

సోదర మహాశయులారా, సోదరీమణులారా దీని ద్వారా మనం గమనించాలి ఒక విషయం. అదేమిటంటే అల్లాహ్‌ త’ఆలా యొక్క పేర్లు, అల్లాహ్‌ యొక్క శుభ నామములు వాటిని సమయ సందర్భంలో దృష్టి పెట్టుకొని, ఎక్కడ ఎలాంటి పేరు ఉపయోగించాలి, ప్రత్యేకంగా దుఆ చేస్తున్నప్పుడు మనం అల్లాహ్‌తో ఏ విషయం కోరుతున్నాము, అడుగుతున్నాము, అర్ధిస్తున్నాము, దానికి తగిన అలాంటి భావం గల అల్లాహ్‌ యొక్క పేర్లు ఉపయోగించడం ద్వారా మనం చాలా లాభం పొందగలుగుతాము మరియు అలాంటి దుఆలు త్వరగా స్వీకరించబడతాయి కూడా.

ఇక ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ చెబుతున్నారు,

أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ
అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక్ ఫిద్దున్యా వల్ ఆఖిరహ్.
పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్‌ను అర్ధిస్తున్నాను, ఇహపరలోకాల్లో అల్లాహ్‌ నిన్ను వలీగా చేసుకొనుగాక.

సోదర మహాశయులారా, ఇక్కడ మీరు చూశారు, ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్‌ త’ఆలా నిన్ను ఇహపరలోకాలలో వలీగా చేసుకొనుగాక. మొదటి దుఆ ఇది. ఆ తర్వాత మరో రెండు దుఆలు కూడా ఉన్నాయి. ఈ దుఆ ప్రస్తావించేకి ముందు, అస్అలుల్లాహ్ అల్-కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్. అల్లాహ్‌ యొక్క రెండు పేర్లు, అల్లాహ్‌ యొక్క సృష్టిలో అత్యంత మహా పెద్దగా ఉన్నటువంటి ఆ సృష్టికి నీవు ప్రభువు అన్నటువంటి ఆ సృష్టి ప్రస్తావన ఇక్కడ చేశారు.

అల్-కరీమ్, అల్లాహ్‌ యొక్క పేరు. గత రమదాన్‌లో అల్హందులిల్లాహ్ అల్లాహ్‌ యొక్క శుభ నామముల గురించి దర్స్ ఇవ్వడం జరిగింది. నా YouTube ఛానల్‌లో మీరు చూడవచ్చు, అల్లాహ్‌ యొక్క ఎన్నో పేర్ల గురించి వివరం అక్కడ ఇవ్వడం జరిగింది. అల్-కరీమ్, ఎక్కువగా కరం చేసేవాడు, దాతృత్వ గుణం గలవాడు, ఎక్కువగా ప్రసాదించేవాడు. పరమదాత అని ఇక్కడ అనువాదం చేయడం జరిగింది. ధర్మవేత్తలు అంటారు అల్లాహ్‌ యొక్క ఈ పేరు అల్-కరీమ్‌లో మరెన్నో ఉత్తమ పేర్లు వచ్చేస్తాయి. ఎన్నో ఉత్తమ పేర్ల భావాలు ఇందులో వచ్చేస్తాయి.

ఆ తర్వాత రబ్. రబ్ అంటే మనం తెలుగులో సర్వసామాన్యంగా ప్రభువు అని అనువదిస్తాము. అయితే ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, రబ్ అన్న ఈ పదం యొక్క భావంలో సృష్టించడం, పోషించడం, ఈ విశ్వ వ్యవస్థను నడిపించడం ఈ మూడు భావాలు తప్పనిసరిగా వస్తాయి. ఎవరిలోనైతే ఈ మూడు రకాల శక్తి, సామర్థ్యాలు, గుణాలు ఉన్నాయో, అలాంటివాడే రబ్ కాగలుగుతాడు. అతను ఎవరు? అల్లాహ్‌.

ఆ తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం, అల్-అర్షిల్ అజీమ్. రబ్, ఎవరికి రబ్? సర్వమానవులకు రబ్. సర్వ జిన్నాతులకు రబ్. సర్వలోకాలకు రబ్ అల్లాహ్‌ మాత్రమే. కానీ ఇక్కడ దుఆ చేస్తూ అల్-అర్షిల్ అజీమ్ అని చెప్పడం జరిగింది. ధర్మవేత్తలు అంటారు, షేక్ అబ్దుర్రజాక్ అల్-బద్ర్ హఫిదహుల్లాహ్, షేక్ అబ్దుల్ ముహ్సిన్ అల్-ఖాసిమ్ మస్జిద్-ఎ-నబవీ యొక్క ఇమామ్ ఇంకా వేరే ఎందరో పెద్ద పెద్ద పండితులు అరబీలో ఈ పుస్తకాన్ని వివరించారు. వారు ఇక్కడ ఒక మాట ఏం చెబుతున్నారు? సర్వసృష్టిలో అల్లాహ్‌ యొక్క అర్ష్ చాలా పెద్దది, బ్రహ్మాండమైనది. అయితే అల్లాహ్‌ యొక్క గొప్ప తౌహీద్ విషయంలో ముందు కొన్ని ముఖ్య బోధనలు వస్తున్నాయి, అందుకు అల్లాహ్‌ యొక్క సృష్టిలో అత్యంత బ్రహ్మాండమైన, పెద్ద సృష్టికి నీవు ప్రభువు అని ఇక్కడ అర్ధించడం జరుగుతుంది.

ఖురాన్‌లో అర్ష్ యొక్క గుణంలో దానితోపాటు అల్-అర్షిల్ కరీమ్, అల్-అర్షిల్ అజీమ్, అల్-అర్షిల్ మజీద్ అన్నటువంటి ప్రస్తావన వచ్చి ఉంది. అయితే అర్ష్ ఎంత పెద్దగా ఉన్నది ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క హదీసులో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా మీరు విని ఉన్నారు, ఖురాన్ వ్యాఖ్యానాలలో, అలాగే ప్రత్యేకంగా ఆయతుల్ కుర్సీ యొక్క వ్యాఖ్యానంలో కూడా ఈ మొత్తం భూమ్యాకాశాలు, విశ్వం ఇదంతా ఒక చిన్న ఉంగరం మాదిరిగా కుర్సీ ముందు, ఆ కుర్సీ ఈ బ్రహ్మాండమైన విశ్వం లాంటిగా మనం భావిస్తే, దాని ముందు ఈ భూమ్యాకాశాలన్నీ కూడా కలిసి ఒక చిన్న ఉంగరం మాదిరిగా. అలాగే కుర్సీ, అర్ష్ ముందు ఎంత చిన్నదంటే అర్ష్‌ను మనం ఒక పెద్ద ఎడారిగా భావిస్తే అందులో కుర్సీ ఒక చిన్న ఉంగరం మాదిరిగా. అర్థమైందా? గమనించారా మీరు?

ఈ భూమ్యాకాశాలన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక చిన్న ఉంగరం మాదిరిగా. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉదాహరణ ఇస్తారంటే ఒక పెద్ద ఎడారి ఉంది, దాని మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న ఉంగరం పడి ఉన్నది. అల్లాహ్‌ యొక్క అర్ష్ ఎడారి మాదిరిగా అయితే కుర్సీ ఆ ఉంగరం లాంటిది. కుర్సీ ఆ ఎడారి లాంటిదైతే ఈ భూమ్యాకాశాలు మొత్తం విశ్వం ఆ ఉంగరం లాంటిది. అంటే ఈ మొత్తం భూమ్యాకాశాల కంటే చాలా చాలా చాలా ఎన్నో రెట్లు పెద్దగా కుర్సీ. మరియు కుర్సీ కంటే ఎన్నో రెట్లు పెద్దగా అల్లాహ్‌ యొక్క అర్ష్.

అల్లాహ్‌ రబ్బుల్ ఆలమీన్ అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు, సింహాసనంపై అల్లాహ్‌ త’ఆలా ఇస్తివా అయి ఉన్నాడు. ఇక్కడ సలఫె సాలిహీన్ యొక్క మన్హజ్, వారి యొక్క విధానం ఏమిటంటే మనం అల్లాహ్‌ యొక్క అర్ష్‌ను విశ్వసించాలి, అర్ష్‌ అంటే ప్రభుత్వం, ఏదో కేవలం శక్తి అని నమ్మకూడదు. అల్లాహ్‌ యొక్క సృష్టి అది. అత్యంత పెద్ద సృష్టి. అల్లాహ్‌ త’ఆలా దానిపై ఇస్తివా అయి ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? ఎటువైపులా ఉన్నాడు? ఈ వివరాల్లోకి మనం వెళ్ళకూడదు. అర్థమైంది కదా?

అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్. ఆ తర్వాత ఏం దుఆ చేస్తున్నారు? అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్‌ త’ఆలా నిన్ను ఇహలోకంలో, పరలోకంలో వలీగా చేసుకొనుగాక.

సోదర మహాశయులారా, ఇది చాలా గొప్ప దుఆ. అల్లాహ్‌ మనల్ని వలీగా చేసుకోవడం, మనం అల్లాహ్‌కు వలీగా అయిపోవడం, అల్లాహ్‌ మన కొరకు వలీ అవ్వడం ఇది మహా గొప్ప అదృష్టం. ఎవరైతే అల్లాహ్‌కు వలీ అవుతారో, మరి ఎవరికైతే అల్లాహ్‌ వలీ అవుతాడో, అలాంటి వారికి ఏ బాధ, ఏ చింత ఉండదు. ఖురాన్‌లో అనేక సందర్భాల్లో అల్లాహ్‌ త’ఆలా తెలియజేశాడు,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్జనూన్.
నిశ్చయంగా అల్లాహ్‌ స్నేహితులకు భయముగానీ, దుఃఖంగానీ ఉండదు.(10:62).

జరిగిపోయిన భూతకాలం గురించి గాని, రాబోతున్న భవిష్యత్తు గురించి గాని ఎలాంటి భయము, ఎలాంటి చింత ఉండదు. ఎవరికి? అల్లాహ్‌ యొక్క వలీలకు. అంతేకాదు, ఎవరైతే అల్లాహ్‌ యొక్క వలీ అవుతారో అలాంటివారు మార్గభ్రష్టత్వంలో పడే, షిర్క్‌లో పడేటువంటి ప్రమాదం ఉండదు. అవును, సూరత్ ఆయతుల్ కుర్సీ వెంటనే ఆయత్ ఏదైతే ఉన్నదో ఒకసారి దాని తర్వాత ఆయతులు గమనించండి. ఆయతుల్ కుర్సీ తర్వాత లా ఇక్రహ ఫిద్దీన్, ఆ తర్వాత

اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ
అల్లాహు వలియ్యుల్లజీన ఆమనూ యుఖ్రిజుహుమ్ మినజ్జులుమాతి ఇలన్నూర్.
విశ్వసించినవారి వలీ గా స్వయంగా అల్లాహ్‌ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. (2:257).

అల్లాహ్‌ త’ఆలా విశ్వాసులకు వలీ. అల్లాహ్‌ తమ ఔలియాలను జులుమాత్‌ల నుండి వెలికితీసి నూర్ వైపునకు తీసుకొస్తాడు. జులుమాత్, అంధకారాలు, చీకట్లు. ఎలాంటివి? షిర్క్ యొక్క అంధకారం, బిదాత్ యొక్క అంధకారం, పాపాల అంధకారం నుండి బయటికి తీసి అల్లాహ్‌ త’ఆలా తౌహీద్ యొక్క వెలుతురులో, సున్నత్ యొక్క కాంతిలో మరియు పుణ్యాల యొక్క ప్రకాశవంతమైన మార్గంలో వేస్తాడు. గమనించారా?

మరియు ఈ గొప్ప అదృష్టాన్ని ఎలా పొందగలుగుతాము మనం? ఒకరు దుఆ ఇస్తారు. కానీ ఆ దుఆకు తగ్గట్టు మన ప్రయత్నం కూడా ఉండాలి కదా? నా కొడుకు పాస్ కావాలని దుఆ చేయండి. సరే మంచిది, చేస్తాము. కానీ కొడుకు అక్కడ ప్రిపరేషన్ కూడా మంచిగా చేయాలి కదా? నా కొడుకు ఆరోగ్యం బాగలేదు, మీరు అల్లాహ్‌ ఆరోగ్యం ప్రసాదించాలని దుఆ చేయండి. సరే మనం చేస్తాము. కానీ మందులు వాడడం గాని, డాక్టర్ వద్దకు తీసుకువెళ్లడం గాని ఇలాంటి ప్రయత్నాలు కూడా జరగాలి కదా? అలాగే మనం అల్లాహ్‌ యొక్క వలీ కావాలంటే ఏం చేయాలి?

సూరత్ ఫుస్సిలత్‌లో అల్లాహ్‌ త’ఆలా ఇచ్చినటువంటి శుభవార్త, ఆ శుభవార్త ఎవరికి ఇవ్వబడినది? ఆ పనులు మనం చేయాలి. అలాగే అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్జనూన్ అనే ఆయత్ తర్వాత సూర యూనుస్‌లో వెంటనే అల్లాహ్‌ ఏమంటున్నాడు? ఎవరు వారు ఔలియా? అల్లజీన ఆమనూ వకాను యత్తఖూన్. (10:63). ఎవరైతే విశ్వసిస్తారో, తౌహీద్‌ను అవలంబిస్తారో, భయభీతి మార్గాన్ని అవలంబిస్తారో. ఇక ఫుస్సిలత్‌లో చూస్తే ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహ్. “అల్లాహ్‌ యే మా ప్రభువు” అని పలికి, ఆ తరువాత దానికే కట్టుబడి ఉన్నవారిపై (41:30). ఎవరైతే మా యొక్క ప్రభువు అల్లాహ్‌ అని అన్నారో, సుమ్మస్తఖామూ. ఆ తౌహీద్ పై, ఆ విశ్వాసంపై, సత్కార్యాలపై స్థిరంగా ఉన్నారు. షిర్క్, బిదాత్‌లు, పాపకార్యాల యొక్క ఎలాంటి తుఫానీ గాలులు వచ్చినా గాని వారు ఏమాత్రం అటు ఇటు వంగకుండా, ఆ పాపాల్లో పడకుండా, తౌహీద్ పై, పుణ్యాలపై, సున్నత్ పై స్థిరంగా ఉండాలి. అల్లాహ్‌ త’ఆలా అల్లా తఖాఫూ వలా తహ్జనూ అని శుభవార్తలు ఇచ్చాడు. ఆ శుభవార్తలోనే ఒకటి ఏముంది? ఆ తర్వాత ఆయత్‌లో

نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
నహ్ను ఔలియా ఉకుమ్ ఫిల్ హయాతిద్దున్యా వ ఫిల్ ఆఖిరహ్.
ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూవచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. (41:31).

మేము మీ ఇహలోక జీవితంలో కూడా మీకు ఔలియా. వ ఫిల్ ఆఖిరహ్, పరలోకంలో కూడా. చూశారా దుఆ? ఏమి ఇచ్చారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్? అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్‌ నిన్ను ఇహలోకంలో, పరలోకంలో వలీగా చేసుకొనుగాక.

ఇక సోదర మహాశయులారా, ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటే ఎన్నో ఆయతులు, హదీసుల ఆధారంగా ఇవ్వవచ్చు. కానీ సమయం చాలా ఎక్కువగా అవుతుంది. కేవలం సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీసు వినిపించి, ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏం చెబుతున్నారో అది మనం విందాము, మరొక దుఆ ఏదైతే ఇచ్చారో అది కూడా మనం తెలుసుకుందాం. సహీ బుఖారీలో హదీసు ఏమిటి?

ఎవరైతే అల్లాహ్‌ యొక్క వలీలతో శత్రుత్వం వహిస్తారో, నేను స్వయంగా వారితో యుద్ధానికి సిద్ధమవుతాను” అని అల్లాహ్‌ చెప్పినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూస్తున్నారా? ఎవరైతే అల్లాహ్‌కు వలీలుగా అవుతారో, వారు అల్లాహ్‌కు ఎంత ప్రియులు అవుతారు మరియు అల్లాహ్‌ వారి వైపు నుండి ఎలా పోరాడుతాడో. కానీ అల్లాహ్‌ యొక్క ఈ వలీ కావడానికి ఏంటి? అదే హదీసులో చెప్పడం జరిగింది. అదే హదీసులో చెప్పడం జరిగింది.

అల్లాహ్‌ ఏ విషయాలైతే మనపై విధిగావించాడో వాటిని మనం తూచా తప్పకుండా, పాబందీగా పాటిస్తూ ఉండాలి. ఇక అల్లాహ్‌ విధించిన వాటిలో అత్యుత్తమమైనది, అత్యున్నత స్థానంలో, మొట్టమొదటి స్థానంలో తౌహీద్. కదా? వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహ్. సూర బఖరా ఆయత్ నెంబర్ 187 కూడా చూడవచ్చు మనం.

ఆ తర్వాత అల్లాహ్‌ త’ఆలా విధిగావించిన విషయాలు పాటించిన తర్వాత నఫిల్ విషయాలు ఎక్కువగా పాటిస్తూ ఉండడం. ఇక్కడ నఫిల్ అంటే ఎంతో మంది కేవలం నమాజులు అనుకుంటారు, కాదు. నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు, హుకూకుల్లాహ్, అల్లాహ్‌ మరియు దాసులకు మధ్య సంబంధించిన విషయాల్లో, హుకూకుల్ ఇబాద్ మరియు మన యొక్క సంబంధాలు దాసులతో ఏమైతే ఉంటాయో అన్నిటిలో కూడా కొన్ని విధులు ఉన్నాయి, మరి కొన్ని నఫిల్‌లు ఉన్నాయి. ఆ నఫిల్‌లు కూడా అధికంగా చేస్తూ ఉండాలి. అప్పుడు అల్లాహ్‌ యొక్క వలీ కావడానికి మనం చాలా దగ్గరగా అవుతాము.

లేదా అంటే ఈ రోజుల్లో ఎందరో చనిపోయిన వారిని, ఎందరో సమాధులను ఔలియాల యొక్క సమాధులు అని, చనిపోయిన వారిని మాత్రమే వలీగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక నియమం తెలుసుకోండి. ఎవరైతే ఇహలోకంలో వలీ అవ్వడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయలేదో, చనిపోయిన తర్వాత వారు వలీ కాజాలరు.

సోదర మహాశయులారా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా పుస్తకం మనం ప్రారంభించాము. ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే దుఆ ఇచ్చారో, అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. ఈ దుఆ ఒకటి ముందు మనం తెలుసుకున్నాము.

సోదర మహాశయులారా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా పుస్తకం మనం ప్రారంభించాము. ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే దుఆ ఇచ్చారో, అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. ఈ దుఆ ఒకటి ముందు మనం తెలుసుకున్నాము.

وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَ مَا كُنْتَ
(వ అన్ యజ్అలక ముబారకన్ అయ్న మా కున్త్)
నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.

ఇది చాలా గొప్ప విషయం. ముబారక్, కేవలం పేరు పెట్టుకుంటే ముబారక్ కాజాలరు.

సోదర మహాశయులారా, ఇది కూడా చాలా మంచి దుఆ, చాలా గొప్ప దుఆ. మరియు ప్రవక్తల గురించి అల్లాహ్‌ త’ఆలా తెలిపినటువంటి ఇది ఒక గొప్ప శుభవార్త. ఈసా అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్రలో మీరు విని ఉన్నారు,

وَجَعَلَنِي مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا
వ జఅలనీ ముబారకన్ అయ్న మా కున్తు వ అవ్సానీ బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా.
నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. (19:31).

అల్లాహ్‌ త’ఆలా నన్ను ఎక్కడ ఉన్నా గాని ముబారక్, శుభవంతుడిగా చేశాడు అని ఈసా అలైహిస్సలాం చెప్పారు. ఇమామ్ హసన్ అల్-బస్రీ రహిమహుల్లాహ్ చెబుతున్నారు, అల్లాహ్‌ త’ఆలా నిన్ను ముబారక్ చేయుగాక, నిన్ను శుభవంతుడిగా చేయుగాక అంటే నీవు ధర్మంపై స్థిరంగా ఉండి ఇతరులకు మంచిని ఆదేశిస్తూ, ఇతరులను చెడు నుండి ఖండిస్తూ ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్‌ నీకు ప్రసాదించుగాక. ఇంత గొప్ప విషయం చూస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో బర్కత్, శుభాలు రావాలంటే ఎలా వస్తాయి? స్వయంగా మనం ఆ బర్కత్, శుభాలు వచ్చేటువంటి విషయాలను పాటించడం మరియు మన చుట్టుపక్కల్లో ఎవరైతే దీనికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, వారికి కూడా ప్రేమగా బోధ చేస్తూ ఆ చెడుల నుండి దూరం చేస్తూ వారు కూడా శుభవంతులుగా అవ్వడానికి ప్రయత్నం చేయడం. ఒకసారి మీరు క్రింది ఈ ఆయత్‌ను గమనించండి, అల్లాహ్‌ త’ఆలా చెబుతున్నాడు:

وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِم بَرَكَاتٍ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ
వలవ్ అన్న అహలల్ ఖురా ఆమనూ వత్తఖవ్ ల ఫతహ్నా అలైహిమ్ బరకాతిమ్ మినస్సమాఇ వల్ అర్ద్.
ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల (ద్వారాల)ను తెరచేవాళ్ళం (7:96)

గమనిస్తున్నారా? బరకాత్ ఎలా వస్తాయి? ముబారక్ మనిషి ఎలా కాగలుగుతాడు? దానికి కొరకు ఉత్తమ మార్గం అల్లాహ్‌ త’ఆలా స్వయంగా తెలియజేశాడు. ఆ మార్గాలను మనం అవలంబించాలి, వాటిపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

ఇక రండి ఆ తర్వాత మూడవ దుఆ, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏంటి మూడవ దుఆ? చెబుతున్నారు,

وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر
(వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్ వ ఇజబ్తులియ సబర్ వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్)
ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక.

మూడు విషయాల ప్రస్తావన ఇక్కడ ఉంది. ఇది మూడవ దుఆ. గమనిస్తున్నారా ఎంత మంచి ఉత్తమమైన దుఆ ఉంది ఇక్కడ? ఏముంది?

వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్. అల్లాహ్‌ వైపు నుండి మనకు ఏది ప్రసాదించబడినా, దానికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. సోదర మహాశయులారా, ఇది చాలా గొప్ప అనుగ్రహం. కానీ మనలో చాలామంది ఏమనుకుంటారు? నాకేమున్నది? తిండికి మూడు పూటలు సరిగ్గా తిండి దొరుకుతలేదు. నాకు జాబ్ లేదు. నాకు ఉద్యోగం లేదు. నా పిల్లలు మంచిగా నా యొక్క అడుగుజాడల్లో లేరు. ఈ విధంగా మనం ఓ నాలుగు విషయాలు ఏదో మనకు నచ్చినవి లేవు, ఇక మనకు ఏ మేలూ లేదు అని అనుకుంటాము. తప్పు విషయం. మనం బ్రతికి ఉండడం ఇది అల్లాహ్‌ యొక్క చాలా గొప్ప వరం. మనం ఆరోగ్యంగా ఉండి ఈ శ్వాస పీల్చుకుంటూ ఉన్నాము, చూస్తున్నాము, వింటున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, ఇవన్నీ గొప్ప వరాలు కావా? ఇంకా ఇస్లాం యొక్క భాగ్యం మనకు కలిగింది అంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ గొప్ప వరం ఏమున్నది? మనం ఉన్న విషయాలను గనక ఒకవేళ ఆలోచిస్తే, వ ఇన్ తఉద్దూ ని’మతల్లాహి లా తుహ్సూహా. మీరు అల్లాహ్‌ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. (16:18). వమా బికూమ్ మిన్ ని’మతిన్ ఫమినల్లాహ్. మీ వద్ద ఉన్న ప్రతి అనుగ్రహం అల్లాహ్‌ తరఫు నుంచే వచ్చినది. (16:53). అయితే మనం మనలో కృతజ్ఞత భావాన్ని పెంచాలి. ఎందుకంటే కృతజ్ఞత ద్వారా అనుగ్రహాలు పెరుగుతాయి. ల ఇన్ షకర్తుమ్ ల అజీదన్నకుమ్. అల్లాహ్‌ వాగ్దానంగా చెబుతున్నాడు, ఒకవేళ మీరు కృతజ్ఞత చూపిస్తే నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను. (14:7). మీరు గనక కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ల అజీదన్నకుమ్. ఇంకా అధికంగా నేను మీకు ప్రసాదిస్తాను, మీ యొక్క అనుగ్రహాలను ఇంకా పెంచుతూ పోతాను. అందుకొరకే మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి.

కృతజ్ఞత ఎలా చెల్లించాలి? కేవలం థాంక్స్ అంటే సరిపోతుందా? కాదు. ముందు విషయం, మనసా వాచా అన్ని అనుగ్రహాలు కేవలం అల్లాహ్‌ వైపు నుండే అన్నటువంటి భావన, నమ్మకం, నాలుకతో వాటి ప్రస్తావన ఉండాలి. అయ్యో ఆ గొట్ట కాడికి పోతేనే అయ్యా, మాకు దొరికిండు, మాకు లభించినది అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఫలానా బాబా దగ్గరికి పోతేనే మాకు ఈ ఆరోగ్యం వచ్చింది అని అనుకుంటారు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. సంతానం ఇవ్వడం గాని, ఆరోగ్యాలు ఇవ్వడం గాని కేవలం ఒకే ఒక్కడు అల్లాహ్‌ మాత్రమే ఇచ్చేవాడు. వేరే ఎవరి శక్తిలో లేదు. ఈ అనుగ్రహాలను మనం అల్లాహ్‌ వైపునకు కాకుండా వేరే వారి వైపునకు అంకితం చేస్తే ఇది షిర్క్‌లో చేరిపోతుంది. కృతజ్ఞతకు వ్యతిరేకం ఇది.

ఇక కృతజ్ఞత నోటితో ఉంటుంది, ఆచరణతో కూడా ఉంటుంది. అల్లాహ్‌ ఏం చెప్పాడు? ఇ’మలూ ఆల దావూద షుక్రా. “ఓ దావూదు సంతతివారలారా! కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేయండి.” (34:13). ఓ దావూదు సంతతివారలారా, మీరు ఇ’మలూ, అమల్ చేయండి షుక్ర్‌ను ఆచరణ రూపంలో చెల్లించండి, కృతజ్ఞత ఆచరణ పరంగా చెల్లించండి. కృతజ్ఞత ఆచరణ రూపంలో ఎలానండి? ఇలా అంటే ఏ ఏ అనుగ్రహం అల్లాహ్‌ వైపు నుండి మనకు లభించినదో దానిని కేవలం అల్లాహ్‌ యొక్క ప్రసన్నతలో, ఆయన యొక్క విధేయతలోనే ఆ అనుగ్రహాన్ని మనం ఉపయోగించాలి. చెవు, అల్లాహ్‌ ఎందుకు ఇచ్చాడు? కళ్ళు, అల్లాహ్‌ ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు చేతులు, అల్లాహ్‌ ఎందుకు ఇచ్చాడు? అల్లాహ్‌ ఏ దేని కొరకైతే అవి ఇచ్చాడో వాటి ఆ ఉద్దేశంలోనే వాటిని ఉపయోగించాలి. నేను ఉదాహరణగా ఇవి చెప్పాను. ప్రతి అనుగ్రహం. ఎవరైతే ఈ షుక్రియా, కృతజ్ఞత భావం కలిగి, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారో, అల్లాహ్‌ వారికి అనుగ్రహాలు పెంచడంతో పాటు వారి యొక్క పుణ్యాలు చాలా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అల్లాహ్‌ షకూర్. ఎవరైతే షుక్రియా అదా చేస్తారో, కృతజ్ఞత చెల్లిస్తారో, వారిని ఆదరణిస్తాడు, వారికి ఎంతో గౌరవం ప్రసాదిస్తాడు. షకూర్, అల్లాహ్‌ యొక్క దాసులు. అల్లాహ్‌ త’ఆలా తమ ప్రవక్తల్లో కొందరిని అబ్దన్ షకూరా, ఇతడు నా దాసుడు, కృతజ్ఞత చెల్లించేవాడు అని ప్రశంసించాడు. ఇంకా ఈ కృతజ్ఞత చెల్లిస్తూ ఉండడం ద్వారా అల్లాహ్‌ యొక్క ప్రియమైన, తక్కువ దాసులు ఎవరైతే ఉంటారో, వారిలో మనం చేరిపోతాము.

హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి గురించి వస్తుంది. ఒక సందర్భంలో ఆయన, ఓ అల్లాహ్‌ నీ యొక్క తక్కువ దాసులలో నన్ను చేర్చుకో అని దుఆ చేశారట. పక్కన ఎవరో విన్నవారు, ఏంటి ఇలా దుఆ చేస్తున్నారు మీరు అంటే, ఖురాన్‌లో అల్లాహ్‌ ఏమంటున్నాడు? వ ఖలీలుమ్ మిన్ ఇబాదియష్ షకూర్. నా యొక్క కృతజ్ఞత చెల్లించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. (34:13). అల్లాహ్‌ త’ఆలా ఆ కృతజ్ఞత చెల్లించేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

రెండవది ఏమిటి? ఇజబ్తులియ సబర్. ఉబ్తులియ. ఏదైనా బలా, ఆపద, కష్టం, పరీక్ష వచ్చింది, ఓపిక సహనం వహించాలి. సోదర

మహాశయులారా, షుక్ర్, సబ్ర్ ఇవి రెండు ఎంత పెద్ద అనుగ్రహాలో ఒకసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసు ఉంది, ఇన్న అమ్ రల్ ము’మిని అజబ్. విశ్వాసుని యొక్క విషయమే చాలా వింతగా ఉంది. మరియు ఈ విశ్వాసునికి తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు. అతడు అన్ని స్థితుల్లో కూడా మేలు, ఖైర్, మంచినే పొందుతాడు. అల్లాహ్‌ అతనికి ఏదైనా అనుగ్రహించాడు, అసాబతుస్సర్రా, షకర్. అతను కృతజ్ఞత చెల్లిస్తాడు, ఫకాన ఖైరల్లహ్. అదే అతని కొరకు మేలు అవుతుంది. వ ఇజా అసాబతుద్దర్రా. ఒకవేళ అతనికి ఏదైనా కీడు, ఏదైనా నష్టం వాటిల్లింది, సబర్. అతను సహనం వహిస్తాడు, ఫకాన ఖైరల్లహ్. అతనికి మేలు జరుగుతుంది. ఈ మేలు విశ్వాసునికి తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు అని చెప్పారు.

సబ్ర్ అన్నది, సహనం అన్నది పుణ్య కార్యాలు చేస్తూ పాటించాలి. ఇది చాలా అవసరం. ఉదాహరణకు తౌహీద్ పై ఉండడం, ఇది గొప్ప పుణ్య కార్యం. నమాజు చేయడం, ఉపవాసాలు పాటించడం, ఇందులో కూడా సహనం అవసరం ఉంటుంది. పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. అవును, ఎలా? మనకు ఒక పాప కార్యం చాలా ఇష్టంగా ఉంటుంది, అది అల్లాహ్‌కు ఇష్టం లేదు. దాన్ని మనం వదులుకోవాలి. ఉదాహరణకు ఈ రోజుల్లో మన చేతుల్లో మొబైల్ ఉంటుంది. పాటలు వినడం గాని, ఏదైనా ఫిలిములు చూడడం గాని, నగ్న చిత్రాలు చూడడం గాని, ఎన్నెన్నో అనవసరమైన వీడియోలు వస్తూ ఉంటాయి, చూసుకుంటూ వెళ్తారు, టైం పాస్ చేసుకుంటూ ఉన్నాము అని అనుకుంటారు, కానీ అది వారి యొక్క టైం ఫెయిల్ అవుతుంది. వారి యొక్క కర్మ పత్రాల్లో పాపాలు రాయబడుతున్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాం. ఈ విధంగా పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం, ఓపిక చాలా అవసరం ఉంటుంది.

మూడవ విషయం, సబ్ర్, సహనం అన్నది అల్లాహ్‌ వైపు నుండి ఏవైనా ఆపదలు వచ్చేసాయి. అంటే అనారోగ్యానికి గురయ్యారా? పరీక్షలో ఫెయిల్ అయ్యారా? సంతానం ఏదైనా మీకు చాలా ఇబ్బందిలో పడవేస్తున్నారా? మీ యొక్క పంట పొలాలు గిట్ల ఏవైనా నష్టంలో పడ్డాయా? మీ యొక్క వ్యాపారం ఏదైనా మునిగిపోయిందా? అందులో ఏదైనా లాస్ వచ్చేసిందా? మీ యొక్క జాబ్ పోయిందా? ఏ ఆపద అయినా గాని, ఏ కష్టమైనా గాని తూఫానీ గాలి వచ్చింది, ఇల్లు పడిపోయింది. ఇలాంటి ఏ ఆపద అయినా గాని సహనం వహించాలి. సహనం అస్సబ్రు ఇంద సద్మతిల్ ఊలా. సహనం అన్నది కష్టం, ఆపద యొక్క ప్రారంభంలో నుండే మొదలవ్వాలి. రోజులు గడిచిన తర్వాత ఇక చేసేది ఏమీ లేక సరే మంచిది ఇక సహనం చేద్దాం, ఓపిక వహిద్దాం, ఇది సహనం అనబడదు. ఈ సహనం వల్ల కూడా అల్లాహ్‌ రబ్బుల్ ఆలమీన్ వద్ద స్థానాలు చాలా పెరుగుతాయి. ఇన్నమా యు వఫ్ఫస్సాబిరూన అజ్ రహూమ్ బిగైరి హిసాబ్. నిశ్చయంగా సహనం పాటించేవారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. (39:10).

ఇక మూడవది ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్. ఏదైనా పాపం జరిగితే ఇస్తిగ్ఫార్ చేయాలి, అల్లాహ్‌తో క్షమాపణ కోరుకోవాలి. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, షుక్ర్, సబ్ర్, ఇస్తిగ్ఫార్. ప్రవక్తల యొక్క ఉత్తమ గుణాలు, పుణ్యాత్ముల యొక్క ఉత్తమ గుణాలు. ఇది మనం పాటించాలి. సూర ఆలి ఇమ్రాన్‌లో చూడండి అల్లాహ్‌ త’ఆలా ఏమంటున్నాడు?

وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ
వల్లజీన ఇజా ఫఅలూ ఫాహిషతన్ అవ్ జలమూ అన్ఫుసహుమ్ జకరుల్లా ఫస్తగ్ఫరూ లి జునూబిహిమ్.
మరియు వారు ఏదేని నీచ కార్యానికి పాల్పడినపుడు గానీ, తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నపుడు గానీ వెంటనే అల్లాహ్‌ను స్మరించి తమ పాపాల క్షమాపణ కొరకు వేడుకుంటారు. (3:135).

వారి నుండి ఏదైనా పొరపాటు జరిగింది, అశ్లీల కార్యం జరిగింది, ఏదైనా వారు తమపై అన్యాయం చేసుకున్నారు అంటే వెంటనే అల్లాహ్‌ను గుర్తు చేసుకొని అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారు. ఈ ఉత్తమ గుణం రావాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి పాపం చేయని వారు. అయినా ఒక్కొక్క సమావేశంలో వంద వంద సార్లు ఇస్తిగ్ఫార్ చేసేవారు. అంతే కాదు సహీ ముస్లిం, సహీ బుఖారీ లోని హదీసు, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా తూబూ ఇలల్లాహి వస్తగ్ఫిరూ. అల్లాహ్‌ వైపునకు మరలండి, పాపాల నుండి క్షమాపణ కోరుకోండి. నేను అల్లాహ్‌తో 70 సార్ల కంటే ఎక్కువగా, (మరో ఉల్లేఖనంలో) 100 సార్ల కంటే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉంటాను. ప్రవక్తకు అవసరమే లేదు కదా? ఎందుకంటే ఆయన పాప రహితుడు, రసూలుల్లాహ్. అయినా గాని అంత క్షమాపణ కోరుతున్నారంటే మనకు ఈ అవసరం ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకొరకే అల్లాహ్‌ త’ఆలా పుణ్యాత్ముల యొక్క గుణం సూర నిసాలో ఏం తెలిపాడు? వారి నుండి ఏదైనా పొరపాటు జరిగింది అంటే వెంటనే క్షమాపణ కోరుకుంటారు. ఇన్నమత్తవ్బతు అలల్లాహి లిల్లజీన య’మలూ నస్సూఅ బిజహాలతిన్. ఏదో పొరపాటున, అశ్రద్ధగా, తెలియనందువల్ల. బిజహాలతిన్, పొరపాటు జరిగింది. వెంటనే ఫస్తగ్ఫరూ, వెంటనే వారు అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారు. అందుకు ఇక ఎవరైతే పొరపాట్లపై పొరపాట్లు, పాపాలపై పాపాలు చేసుకుంటూ పోతారో, అలాంటి వారిని నేను క్షమించను వ లైసతిత్తవ్బతు అని అల్లాహ్‌ త’ఆలా హెచ్చరిస్తున్నాడు.

అందుకొరకే షుక్ర్‌తో జీవితం గడపండి. ఆపద వస్తే సహనం వహించండి. మరియు ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఎప్పుడు జరిగినా గాని, ఎంత పెద్దది జరిగినా గాని వెంటనే అల్లాహ్‌ వైపునకు మరలి క్షమాపణ కోరుతూ ఉండండి.

ఆ తర్వాత ఏమంటున్నారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్?

ఫఇన్న హా ఉలాఇస్సలాస ఉన్వానుస్సఆదహ్
వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.

ఈ మూడు మనిషి యొక్క సౌభాగ్యానికి, అదృష్టానికి గొప్ప చిహ్నం, గొప్ప గుర్తు. అల్లాహు అక్బర్. అందుకొరకు మనం కూడా భాగ్యవంతుల్లో చేరాలి, మనం కూడా అదృష్టవంతుల్లో చేరాలి అంటే తప్పకుండా ఏం చేయాలి? షుక్ర్, సబ్ర్ మరియు ఇస్తిగ్ఫార్.

అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ ఈ పాఠాలు ఇంకా ముందుకి మనం వింటూ ఉంటాము. మరియు ఇలాంటి పుస్తకాలు తప్పకుండా మీరు చదువుతూ ఉండండి. అల్లాహ్‌ యొక్క దయ గలిగితే ఈరోజే లేకుంటే రేపటి వరకు దీని యొక్క PDF కూడా మీకు పంపించడం జరుగుతుంది. అంతే కాదు అల్లాహ్‌ యొక్క దయ గలిగితే ఒక షార్ట్ వీడియో, మూలం, మతన్ అని ఏదైతే అంటారో ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారిది, అది కూడా మీకు పంపించే ప్రయత్నం ఇన్షాఅల్లాహ్ చేస్తాను. అయితే ఈనాటి పాఠంలోని మతన్, మూలం ఏమిటి?

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో.

أَسْأَلُ اللهَ الْكَرِيمَ رَبَّ الْعَرْشِ الْعَظِيمِ أَنْ يَتَوَلَّاكَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ
(అస్అలుల్లా హల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్)
పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్‌ను అర్ధిస్తున్నాను, ఇహపరలోకాల్లో అల్లాహ్‌ త’ఆలా నిన్ను వలీగా చేసుకొనుగాక.

وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَ مَا كُنْتَ
(వ అన్ యజ్అలక ముబారకన్ అయ్న మా కున్త్)
నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.

وَأَنْ يَجْعَلَكَ مِمَّنْ إِذَا أُعْطِيَ شَكَرَ، وَإِذَا ابْتُلِيَ صَبَرَ، وَإِذَا أَذْنَبَ اسْتَغْفَرَ
(వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్, వ ఇజబ్తులియ సబర్, వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్, ఫఇన్న హా ఉలాఇస్సలాస ఉన్వానుస్సఆదహ్)
ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.

అర్థమైంది కదా? అల్లాహ్‌తో నేను అర్ధిస్తున్నాను. ఆ అల్లాహ్‌ యే పరమదాత మరియు మహోన్నత సింహాసనానికి ప్రభువు. ఏమని అర్ధిస్తున్నారు? నిన్ను ఇహపరలోకాల్లో వలీగా చేసుకొనుగాక. నీవు ఎక్కడా ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేసుకొనుగాక. ఇంకా ఏదైనా నీతో, ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.

ఇక ఈ దుఆల యొక్క వివరణ నేను మీకు ఇచ్చాను ఈనాటి క్లాస్‌లో. ఇక రేపటి క్లాస్‌లో హనీఫియత్, మిల్లతి ఇబ్రాహీమీ అంటే ఏమిటి అది తెలుసుకుందాము. ఆ తర్వాత అల్లాహ్‌ యొక్క దయతో ఆ నియమాలు ఏమిటో అవి కూడా ఇన్షాఅల్లాహ్ ఇంకా ముందు క్లాసులో తెలుసుకుంటూ ఉందాము.

జజాకుముల్లాహు ఖైరా, వాఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41603

మహావివేకి లుక్మాన్ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

మంచికైనా చెడుకైనా మనిషి నాలుక, హృదయాలే మూలమని చెప్పిన మహానుభావుడు లుక్మాన్

లుక్మాన్ (అలైహిస్సలాం) ఆఫ్రికా ఖండంలో జన్మించారు. ఆయన అడవుల్లో పెరిగి పెద్దయ్యారు. అడవుల్లో కాలికి చెప్పులు కూడా లేకుండా తిరిగేవారు. కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకుని అడవుల్లో వన్య మృగాలతో పాటు ఉండేవారు. అడవిలో జీవితం, రోజూ అడవి మృగాలతో తల పడడం – ఈ విధంగా ఆయన కఠిన మైన జీవితాన్ని గడిపేవారు. భయం అంటే ఎరుగని వ్యక్తిత్వాన్ని సంతరిం చుకున్నారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు. ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయా లను ఆయన తెలుసుకున్నారు.

ఆఫ్రికాపై దండెత్తిన బానిస వ్యాపారులు ఆయన్ను నిర్బంధించారు. ఆయన్ను ఒక బానిసగా అమ్మివేశారు. తన స్వేచ్ఛా స్వాతంత్రయాలు  కోల్పోయా రాయన. స్వేచ్ఛగా తిరగడానికి లేదు, మాట్లాడడానికి లేదు. జీవితంలో ఎదు రైన ఈ కష్టాన్ని ఆయన భరించారు, సహనం వహించారు. అల్లాహ్ అనుగ్రహం కోసం ఎదురుచూడసాగారు. 

ఆయన్ను కొనుక్కున్న వ్యక్తి మంచి మనిషి. తెలివి, వివేకం కలిగినవాడు. అతను లుక్మాన్ను దయగా చూసేవాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) సాధారణమైన వ్యక్తి కాదని అతను గుర్తించాడు.

లుక్మాన్ వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒక రోజు లుక్మాన్ను పిలిచి గొర్రెను కోసి అందులో అత్యంత చెడ్డ భాగాలు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) ఒక గొర్రెను కోసి దాని గుండె, నాలుకలను తీసుకుని యజమాని వద్దకు వెళ్ళారు. లుక్మాన్ తీసుకొచ్చిన వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరు నవ్వు నవ్వాడు. శరీరంలో అత్యంత చెడ్డ భాగాలుగా గుండె, నాలుకలను తీసుకు వచ్చిన ఎన్నిక ఆయనకు నచ్చింది. లుక్మాన్ (అలైహిస్సలాం) చాలా లోతయిన విషయాన్ని ఈ విధంగా చెప్పారని అతను అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి యజమాని లుక్మాన్ (అలైహిస్సలాం) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రారంభించాడు. ఆయన్ను మరింత ఆదరంగా చూడసాగాడు.

కొన్ని రోజుల తర్వాత యజమాని లుక్మాన్ను మళ్ళీ పిలిచి ఈసారి గొర్రెను కోసి దానిలో అత్యంత ఉత్తమమైన అవయవాలు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ యజమాని చెప్పినట్టు చేశారు. కాని విచిత్రంగా ఈసారి కూడా గొర్రె గుండె, నాలుకలే తీసుకువచ్చారు. యజమాని వాటిని చూసి శరీరంలో అత్యంత చెడ్డ భాగాలు, మంచి భాగాలు రెండు కూడా ఇవే ఎలా అవుతాయని ప్రశ్నించాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) యజమానికి సమాధానమిస్తూ, “మనిషి మంచివాడైతే అతని గుండె, నాలుకలు చాలా ఉత్తమమైన భాగాలు, మనిషి చెడ్డవాడైతే అతని గుండె, నాలుకలు అత్యంత చెడ్డ భాగాలు” అన్నారు. ఈ సంఘటన తర్వాతి నుంచి యజమాని లుక్మాన్ పట్ల అత్యంత గౌరవాదరాలు చూపడం ప్రారంభించాడు. చాలామంది లుక్మాన్ వద్దకు సలహా కోసం కూడా వచ్చేవారు. ఆయన వివేక విచక్షణలు, తెలివితేటలు యావత్తు రాజ్యంలో మారు మోగిపోసాగాయి.

యజమాని తన కుటుంబ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన మరణానంతరం లుక్మాన్ (అలైహిస్సలాం)కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాడు. యజమాని మరణించిన తర్వాత లుక్మాన్ (అలైహిస్సలాం)కు స్వాతంత్ర్యం లభించింది. ఆయన (అలైహిస్సలాం) అక్కడి నుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి చివరకు బనీ ఇస్రాయీల్ వద్ద స్థిరపడ్డారు. దావూద్ (అలైహిస్సలాం) పాలనా కాలంలో ఆయన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. మహావివేకంతో, విచక్షణతో, నిష్పక్షపాతంగా ఆయన ఇచ్చే తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి. అక్కడే ఆయన పెళ్ళి చేసుకుని సంసార జీవితాన్ని గడిపారు.

లుక్మాన్ తన కుమారుడికి చేసిన బోధ దివ్యఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది:

31:13 وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం.”

31:14 وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ

మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.

31:15 وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِي الدُّنْيَا مَعْرُوفًا ۖ وَاتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَيَّ ۚ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ

ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను.”

31:16 يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ

(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్‌ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు.

31:17 يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ

“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.

31:18 وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ

“జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు.

31:19 وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ

“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.”

(దివ్యఖుర్ఆన్ 31 : 13-19)

మనిషి మంచివాడు లేదా చెడ్డవాడన్నది అతని హృదయం, నాలుకల వల్ల తెలుస్తుంది. ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతుల్లో ఉంది.

మంచి యజమాని తన వద్ద ఉన్న వివేకవంతులైన నౌకర్లను గౌరవించాలి.

లుక్మాన్ తన కుమారునికి ఇచ్చిన సలహాను అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ప్రస్తావించి మానవాళికి ఒక ఉదాహరణగా చూపించాడు. ఈ సలహాను యావత్తు మానవాళి మార్గదర్శక సూత్రంగా అనుసరించవలసి ఉంది.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి [వీడియో & టెక్స్ట్]

ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి
బులూగుల్ మరాం | హదీస్ 1237
https://youtu.be/ScQ39BtR9Fg [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1237. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు`;

“ఎల్లప్పుడూ మీకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరిలా చేసినపుడు) అల్లాహ్ యొక్క ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.” (బుఖారి , ముస్లిం)

అల్లాహ్ ను విశ్వసించే వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపంచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానయినా ఎదుటి వారిని మించిపోవాలన్న పేరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూసినపుడు అల్లాహ్ పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదలపట్ల దయ, జాలి ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచీచెబ్బరల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతనొక దయాశీలిగా, సత్పౌరునిగా ఉంటాడు

ఈ ప్రసంగంలో, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక ముఖ్యమైన హదీద్ వివరించబడింది. ప్రాపంచిక విషయాలలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడటం ద్వారా అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే సమయంలో, ధార్మిక విషయాలలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారిలా పుణ్యకార్యాలలో పురోగమించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ సూత్రం అసూయ, అసంతృప్తి వంటి సామాజిక రుగ్మతలకు విరుగుడుగా పనిచేస్తుందని వక్త నొక్కి చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి అసంతృప్తికి లోనవ్వకుండా, పేదవారిని, అవసరమైన వారిని చూసి మనకున్నదానిపై సంతృప్తి చెంది, అల్లాహ్ పట్ల కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఉద్భోదించారు. ఈ రెండు గుణాలు (కృతజ్ఞత మరియు సహనం) ఉన్నవారిని అల్లాహ్ తన ప్రత్యేక దాసుల జాబితాలో చేర్చుతాడని కూడా వివరించారు.

వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం,

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
(వ అన్ అబీ హురైరత రదియల్లాహు త’ఆలా అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం)
హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

انْظُرُوا إِلَى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ
(ఉన్ జురూ ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్)
మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి.

وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ
(వలా తన్ జురూ ఇలా మన్ హువ ఫౌఖకుమ్)
మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారి వైపు చూడకండి.

فَهُوَ أَجْدَرُ أَنْ لَا تَزْدَرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ
(ఫహువ అజ్ దరు అల్ లా తజ్ దరూ ని’మతల్లాహి అలైకుమ్)
మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఏంటి దీని భావం? హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. ఎల్లప్పుడూ, మీరు ఎల్లప్పుడూ మీకన్నా క్రింది స్థాయిలో ఉన్న వారిని మాత్రమే చూడండి. మీరు ప్రాపంచిక సిరిసంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి. గమనిస్తున్నారు కదా? హదీద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపు చూడండి. ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారి వైపుకు చూడకండి. మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అల్పదృష్టితో చూడకుండా ఉండడానికి ఇదే ఉత్తమ మార్గం.

ఇక ఒకవేళ మీరు హదీద్ లోని అరబీ పదాలు అర్థం చేసుకోవాలి శ్రద్ధగా అంటే చూడండి ఇక్కడ, ఉన్ జురూ – మీరు చూడండి. ఇలా మన్ హువ అస్ ఫల మిన్కుమ్ – మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపున. వలా తన్ జురూ – చూడకండి. ఇలా మన్ హువ ఫౌఖకుమ్ – ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో. ఫహువ అజ్ దరు – ఇదే ఉత్తమ విధానం, ఉత్తమ మార్గం. ఫహువ అజ్ దరు, అది మీ కొరకు ఎంతో మేలు, ఉత్తమ మార్గం. దేని కొరకు? అల్ లా తజ్ దరూ – మీరు చిన్నచూపుతో చూడకుండా, మీరు తమకు తాము అల్పంగా భావించకుండా, దేనిని? ని’మతల్లాహి అలైకుమ్ – మీపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని.

సోదర మహాశయులారా, సభ్యతా, సంస్కారాలు, మర్యాదలు వీటికి సంబంధించి హదీద్ లు మనం తెలుసుకుంటున్నాము. ఇందులో ఈ హదీద్ కూడా ఎంత ముఖ్యమైనది ఈనాటి మన సమాజంలో ఒకసారి అర్థం చేసుకోండి. హదీద్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఇచ్చిన బోధనలని గనక మనం గ్రహించామంటే, పరస్పరం ఎంతో ప్రేమగా, ఒకరు మరొకరితో ఎంతో మంచి రీతిలో కలిసిమెలిసి ఉండవచ్చును. ఈ రోజుల్లో అసూయ, ఈర్ష్య, జిగస్సు, పరస్పరం కపటం, ద్వేషం లాంటి ఈ సామాజిక రోగాలు ఏవైతే పెరిగిపోతున్నాయో, ఇలాంటి హదీథులను చదవకపోవడం వల్ల.

ఈ హదీద్ లో మీకు మూడు విషయాలు తెలుస్తున్నాయి కదా. ఆ మూడు విషయాలు ఏంటి? ఈ హదీద్ ద్వారా మనకు కలిగిన లాభాలు, ప్రయోజనాలు ఏంటి? చివర్లో సంక్షిప్తంగా తెలుసుకుందాము. అయితే రండి.

ఒక హదీద్ లో వస్తుంది, ఈ భావాన్ని మీరు మరో హదీస్ ఆధారంగా మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

رَحِمَ اللَّهُ عَبْدًا
(రహిమల్లాహు అబ్దన్)
అల్లాహ్ ఆ దాసున్ని కరుణించు గాక! చూడండి.

ఇంతకుముందు చదివిన హదీస్ లో ఒక ఆదేశం ఉంది. ఇలా చేయండి, ఇలా చేయకండి, ఇందు ఈ లాభం, ఇలా తెలపబడింది. కానీ ఆ హదీద్ ను విడమరిచి చెప్పేటువంటి మరికొన్ని హదీద్ లలో ఘనతలు, లాభాలు ఎలా ఉన్నాయో గమనించండి. అక్కడ ఏముంది? రహిమల్లాహ్, అల్లాహ్ కరుణించు గాక! ఈ గుణం గనక నేను, మీరు అవలంబించుకున్నామంటే అల్లాహ్ యొక్క కరుణ మనపై కురుస్తుంది. ఏంటి? రహిమల్లాహు అబ్దన్, అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించు గాక!

نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ
(నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు)
ప్రాపంచిక రీత్యా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి వైపున చూస్తాడు.

فَحَمِدَ اللَّهَ وَشَكَرَهُ
(ఫ హమిదల్లాహ వ షకరహ్)
ఓ అల్లాహ్! అతనికంటే నేను ఎంతో మేలు ఉన్నాను. నేను ఎంతో బాగున్నాను. అతనికంటే ఎంతో మంచి స్థితిలో ఉన్నాను. నీకే సర్వ స్తోత్రములు! నీకే అన్ని రకాల పొగడ్తలు! నీకే అన్ని రకాల కృతజ్ఞతలు!

وَفِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు)
మరి ఎవరైతే ధర్మపరంగా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడో అతన్ని చూస్తాడు.

فَجَدَّ وَاجْتَهَدَ
(ఫ జద్ద వజ్తహద్)
ఆ తర్వాత అతను చాలా చాలా అలాంటి పుణ్యాలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా త్యాగం, ప్రయాస, ప్రయత్నం, కష్టపడతాడు, స్ట్రగుల్ చేస్తాడు దేనికొరకు? ధర్మ కార్యాల్లో, పుణ్య విషయాల్లో అలాంటి వారి స్థానానికి చేరుకోవడానికి, వారికంటే ఇంకా ముందుకు ఉండడానికి.

అమర్ బిన్ షు’ఐబ్ ఉల్లేఖించిన ఒక హదీద్ లో ఇలా కూడా వస్తుంది:

خَصْلَتَانِ
(ఖస్లతాని)
రెండు ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు ఎవరిలో ఉంటాయో, అల్లాహ్ వారిని

شَاكِرًا صَابِرًا
(షాకిరన్ సాబిరా)
కృతజ్ఞత చెల్లించే వారిలో, ఓపిక సహనాలు వహించే వారిలో అతన్ని కూడా లిఖింపజేస్తాడు. షుక్ర్ చేసేవారు, సబ్ర్ చేసేవారు, కృతజ్ఞత చెల్లించేవారు, సహనాలు పాటించేవారు పుణ్యదాసులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారి జాబితాలో అల్లాహ్ త’ఆలా ఇతన్ని కూడా చేర్చుతాడు. ఎ

వరిని? ఎవరిలోనైతే ఈ రెండు గుణాలు ఉంటాయో. ఏంటి ఆ రెండు గుణాలు?

مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ دُونَهُ فَحَمِدَ اللَّهَ عَلَى مَا فَضَّلَهُ بِهِ
(మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ దూనహు ఫ హమిదల్లాహ అలా మా ఫద్దలహు బిహ్)
ఎవరైతే ప్రాపంచిక విషయాలలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి, అల్లాహ్ అతనికంటే ఎక్కువగా అతనికి ఏదైతే అనుగ్రహించాడో దానిని చూసి అల్లాహ్ యొక్క స్తోత్రం పఠిస్తాడు.

وَمَنْ نَظَرَ فِي دِينِهِ إِلَى مَنْ هُوَ فَوْقَهُ فَاقْتَدَى بِهِ
(వ మన్ నజర ఫీ దీనిహి ఇలా మన్ హువ ఫౌఖహు ఫక్ తదా బిహ్)
మరియు ధర్మ విషయాల్లో తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారిని చూసి వారి లాంటి ఆ సత్కార్యాలు చేసే ప్రయత్నం చేస్తాడు.

وَأَمَّا مَنْ نَظَرَ فِي دُنْيَاهُ إِلَى مَنْ هُوَ فَوْقَهُ
(వ అమ్మా మన్ నజర ఫీ దున్యాహు ఇలా మన్ హువ ఫౌఖహు)
కానీ ఎవరైతే దీనికి భిన్నంగా, ప్రపంచ రీత్యా తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్న వారిని చూస్తాడో,

وَآسَفَ عَلَى مَا فَاتَهُ
(వ ఆసఫ అలా మా ఫాతహు)
అతని వద్ద ఉన్న దానిని చూసి, అయ్యో నాకు ఇది దొరకపాయె, నాకు ఇది ఇవ్వకపాయె, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇంత తక్కువ చేస్తున్నాడో, ఇట్లా బాధపడుతూ ఉంటాడు.

فَإِنَّهُ لَا يُكْتَبُ شَاكِرًا وَلَا صَابِرًا
(ఫ ఇన్నహు లా యుక్తబు షాకిరన్ వలా సాబిరా)
ఇలాంటి వ్యక్తి, షాకిరీన్, సాబిరీన్ లో, కృతజ్ఞత చెల్లించే, సహనాలు పాటించే వారి జాబితాలో లిఖించబడడు.

అందుకొరకే మన సలఫె సాలిహీన్ రహిమహుముల్లాహ్ ఏమనేవారో తెలుసా? నీవు ప్రపంచ రీత్యా నీకంటే పై స్థాయిలో ఉన్నవారితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకు. దీనివల్ల నీలో ఒక న్యూనతాభావం, అయ్యో నాకు లేకపాయె ఇంత గొప్ప స్థితి, నాకు లేకపాయె ఇంత గొప్ప సంపద, నాకు లేకపాయె ఇలాంటి అందం, నాకు లేకపాయె ఇలాంటి… ఈ బాధ అనేది అతనిలో అతన్ని కుమిలిపోయే విధంగా చేస్తుంది.

అందుకొరకు ఏమి చేయాలి? బీదవాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వారిని చూడాలి. వారి వద్ద ధర్మం ఎక్కువ ఉండి, ప్రపంచ పరంగా ఏమంత ఎక్కువ లేకున్నా గానీ, వారికి తోడుగా ఉండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల అల్లాహ్ వారికంటే మంచి స్థితిలో మనల్ని ఉంచాడు అని అల్లాహ్ యొక్క కృతజ్ఞతాభావం కలుగుతుంది.

ఈ సందర్భంలో ఈనాటి టెక్నాలజీ కాలంలో, మరొక ఈ హదీద్ ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప బోధన ఏమిటంటే, ఇక ఏం పనిపాట లేదు కదా అని కొందరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో, చాట్… షేర్ చాట్, ఏమేమో సోషల్ మీడియాలో ఏం చూస్తారండీ? మన అవ్వలు, మన అక్కలు అందరూ, ఆ… వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టాలంట, అవంతా చూపిస్తున్నారు. కిచెన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా చూపిస్తున్నారు. ఆ… నెలకు ఒకసారి జీతం దొరికినప్పుడు, ఆమె భర్త ఎంతగానో మంచి బట్టలు ఆమెకు కొనిస్తాడో, అవన్నీ వాళ్ళు వ్లోగ్ లు అంట, ఇంకా ఏమేమో యూట్యూబ్ లలో అంతా కచరా పెడుతున్నారు కదా పెట్టేవాళ్ళు. ఈ పని పాట లేని వాళ్ళు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటారు.

తర్వాత, ఏమండీ ఈసారి నెల జీతం దొరికిన తర్వాత ఇంట్లో ఫలానా తెచ్చుకుందామా? అని మెల్లగా మొదలవుతాయి మాటలు. ఇక ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఈ విధంగా శక్తి సామర్థ్యము లేకున్నా పర్లేదండీ, ఫలానా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారట లోన్, ఫలానా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంట.

ఇవన్నీ ఇలాంటి కోరికలు ఎందుకు పెరుగుతున్నాయి? అలాంటి ఛానెల్ లను చూడకూడదు. ఏ ఛానెల్ ద్వారా అయితే, అయ్యో మన వద్ద ఇది లేకపాయే, ఇది ఉంటే ఎంత బాగుండు అని మనం కుమిలిపోతామో, అలాంటి ఛానెల్ లు చూసుకుంటూ మన ఇల్లులు పాడు చేసుకోవద్దు.

ప్రపంచ రీత్యా, ఈ విషయమైనా గానీ, హోదా, అంతస్తు, విద్య, ఇంకా అందచందాలు, సిరిసంపదలు, సౌకర్యాలు, ఏ విషయంలోనైనా ప్రపంచ రీత్యా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, వారి యొక్క ఛానెల్ లను, వారి యొక్క ప్రోగ్రాంలను చూసుకుంటూ ఉండి, అయ్యో నాకు లేకపాయె, నాకు లేకపాయె అన్నటువంటి బాధల్లో ఉండకూడదు.

ఈ ప్రపంచ రీత్యా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి, అల్హందులిల్లాహ్ ఓ అల్లాహ్ నీ యొక్క ఎంత అనుగ్రహం! కొందరైతే ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు, నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను. అయ్యో ఫలానా సిటీలో నేను వెళ్ళినప్పుడేదో చూశాను, పైపులలో ఉంటున్నారు, చెట్ల కింద ఉంటున్నారు. నాకైతే దానికంటే మంచిగా కనీసం కిరాయి ఇల్లు అయినా గానీ ఉంది కదా ఓ అల్లాహ్! ఇలాంటి కృతజ్ఞతాభావంలో జీవితం గడపాలి.

కానీ ధర్మపర విషయానికి వస్తే, ధర్మ విషయాలలో, మంచి కార్యాలలో, పుణ్య విషయాలలో మనకంటే ఎక్కువ స్థాయిలో ఎవరున్నారో వారిని చూసి, అలాంటి మార్గం అవలంబించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=19057

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ధార్మిక విద్యార్జనలో సహనం ప్రాముఖ్యత [వీడియో]

బిస్మిల్లాహ్

[48:46నిముషాలు]
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

ధర్మ జ్ఞానం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/ilm-knowledge/

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 11: ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం [వీడియో]

బిస్మిల్లాహ్

[20:33 నిముషాలు]

ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం సహనాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [20:33 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ద్

జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది, అయిష్టతతో వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదిం- చేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకొని, శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖనం ప్రస్తావించారు: “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూకోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఇవన్నియూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి“. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).

ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహుద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహుద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే కొంత బంగారం తప్ప అది నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారు: “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు“.

ప్రవక్త తిండి మరియు వస్త్రాధారణ

తిండి విషయం: నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయంకాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.

ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు. ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.

అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న, మందమైన ఓ గుడ్డ మరియు లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారు: నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడుస్తూ ఉండగా ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండినది.

ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు ఒక భూమి తప్ప, అది కూడా దానం చేశారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయం

న్యాయం విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబీ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే ప్రవక్త వినిపించుకునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారు: “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని కోరేవాణ్ణి“.

ఒకసారి ఉసైద్ బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు, వెంటనే ఉసైద్ అన్నాడు: ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. ప్రవక్త చెప్పారు: సరే తీర్చుకో, ఉసైద్ అన్నాడు: ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది, మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది, అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు, ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య చుంబించుకోసాగాడు. మళ్ళీ చెప్పాడు: ప్రవక్తా! నేను కోరింది ఇదే.

అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హుని సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారు: “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడయితే అతన్ని శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని“.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 10: ప్రవక్త ﷺ వారి ఓపిక, సహనాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[18:05 నిముషాలు]

ప్రవక్త ﷺ వారి ఓపిక సహనాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [18:05 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త ﷺ ఓపిక, సహనం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడు: “నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది”. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారు: “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడు: “అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు”. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు.

అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉంది: ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్ర్ [1] లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖ్బా భుజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారు:

(ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?). (ఘాఫిర్ 28)

[1] అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.

ఒక రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్ , వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూ: ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటెను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగొల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా (రజియల్లాహు అన్హా) వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.

వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు.”

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది.

బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సందర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్ట రోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది.

ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త — ఇలా చెప్పారు: “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విషయంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రదియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం“.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవ గౌరవాల్లో కూడా శత్రువులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విజయ ధనం పంపిణీ చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు“.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ (రజియల్లాహు అన్హా) మిగిలారు. అయినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారు: “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది“.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

35 వ అధ్యాయం
విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం: “ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు” (తగాబున్‌ 64:11).

పై ఆయతులో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు అనేది “అల్‌ ఖమ” ఇలా ప్రస్తావించారు: “అతనిపై ఏదైనా ఆపద వస్తే, అది అల్లాహ్ తరఫు నుండి అని  అతను తెలుసుకొని, సంతోషిస్తాడు, మనఃపూర్వకంగా ఒప్పుకుంటాడు”.

అబు హురైరా (రది అల్లాహు అన్హు) కథనం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “కుఫ్ర్ కు (సత్యతిరస్కారానికి) సంబంధించిన రెండు గుణాలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి: ఒకరి వంశపరంపరను నిందించుట. రెండవది: చనిపోయినవారిపై శోకము చేయుట”.

అబ్దుల్లా బిన్‌ మస్ ఊద్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “చెంపలను బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ అజ్ఞాన కాలపు అరుపులు పలుకులు పలికేవాడు మన (సంప్రదాయము అనుసరించే) వాడుకాడు”. (బుఖారి,ముస్లిం).

అనసు (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “అల్లాహ్ ఏ మానవునికి మేలు చేయగోరుతాడో, అతని పాపాలకు బదులు శిక్ష ఇహలోకంలోనే తొందరగా ఇచ్చేస్తాడు. ఏ మానవునికి మేలు చేయగోరడో, అతని పాపాలకు బదులు శిక్షను ప్రళయం వరకు వేచి ఉంచి అక్కడ ఇస్తాడు”. (తిర్మిజి).

మరో సారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లాహ్ ఏ సమాజం, సంఘాన్ని ప్రేమస్తాడో, దానిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు దానిని సహనంతో (సహిస్తారో), వారిని అల్లాహ్ ఇష్టపడుతాడు.ఎవరు అసహనము చూపుతారో, అల్లాహ్ వారిపై ఆగ్రహస్తాడు”. (తిర్మిజి).

ముఖ్యాంశాలు:

1. తగాబున్‌ ఆయతు యొక్క భావం.

2. సహనం అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం.

3. వంశపరంపర లోని లోపాలను ఎంచుట మంచిది కాదు.

4.చెంపలు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అజ్ఞానకాలపు పలుకులు పలికేవాని గురించి కఠినంగా హెచ్చరించబడింది.

5. అల్లాహ్ మేలు కోరిన వ్యక్తి లక్షణం తెలిసింది.

6. అల్లాహ్ మేలు కోరని వ్యక్తి లక్షణం తెలిసింది.

7. అల్లాహ్  ప్రేమించిన వ్యక్తి చిహ్నం.

8. పరీక్ష ఆపదపై అసంతృప్తి వ్యక్తం చేయుట నిషిద్ధం.

9. వాటిపై సహనం వహించుట వలన పుణ్యం లభిస్తుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఓపికతో అల్లాహ్ కు విధేయులగుట, పాపం నుండి దూరంగా ఉండి సహనం వహించుట – ఇవి రెండూ విశ్వాసంలో లెక్కించబడుతాయి. అంతే కాదు అవి దాని పునాది. దాని భాగాలే. అల్లాహ్ ప్రేమించేవాటిని, ఆయనకు ఇష్టమున్న, ఆయన సన్నిధిలో చేర్పించేవాటిని ఓపికతో (ఆచరించుట), ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండి సహనం వహించుటయే విశ్వాసం.

ఇస్లాం పునాది మూడు సూత్రాల పై ఉంది.

  1. అల్లాహ్ , ఆయన ప్రవక్త తెలిపిన వాటిని సత్యం అని నమ్ముట.
  2. అల్లాహ్ , ఆయన ప్రవక్త ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించుట.
  3. అల్లాహ్ , ఆయన ప్రవక్త నిషేధించినవాటి నుండి దూరంగా ఉండుట.

అల్లాహ్ వ్రాసిన విధివ్రాత బాధాకరమైనప్పటికి దానిపై ఓపిక వహించుట ఇందులోనే వస్తుంది. కాని దాన్ని తెలుసుకొనుట, ఆచరించుట చాలా అవసరం కాబట్టి దానిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.

ఆపద, కష్టం అల్లాహ్ తరఫు నుండియే వస్తుంది అని, అల్లాహ్ దాన్ని నిర్ణయించడంలో సంపూర్ణ వివేచణాపరుడని, దానిని మానవునిపై నిర్ణయించడం కూడా ఆయన సంపూర్ణ వరమేనని తెలుసుకున్న వ్యక్తి అల్లాహ్ వ్రాసిన విధివ్రాతతో సంతోషించి, దాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకొని, అసంతృప్తికరమైన వాటిపై అల్లాహ్ సన్నిధానం కోరుతూ, పుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షతో భయపడుతూ మరియు సత్ప్రవర్తన అవలంబించే సమయం వచ్చిందని భావిస్తూ సహనం వహించాలి. అప్పుడు అతని హృదయానికి తృప్తి  శాంతి కలుగుతుంది. అతని విశ్వాసం, ఏకత్వంలో బలం వస్తుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

బాలుడు మరియు రాజు కథ (కందకాలవాళ్ళ వృత్తాంతం)[ఆడియో]

బిస్మిల్లాహ్
బాలుడు మరియు రాజు కథ (కందకాలవాళ్ళ వృత్తాంతం) [ఆడియో]
https://youtu.be/w-allzUZM6E [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (25 నిముషాలు)

ఈ ఆడియో సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]– 5 వ పార్ట్ నుండి తీసుకోబడింది. ఈ కథ సహీహ్ హదీసులో వచ్చింది మరియు ఖురాన్ లో సూరతుల్ బురూజ్ లో ప్రస్తావించ బడింది 


హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు – హదీసు # 30

ఈ ఆడియో వివరించిన హదీసు క్రింద చదవండి :

30. హజ్రత్ సుహైబ్‌ (రది అల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనం:

“పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు బాగా ముసలివాడై పోయిన తరువాత (ఒకనాడు) రాజుతో “నేనిక ముసలివాణ్ణయిపోయాను. నాకు ఒక బాలుణ్ణి అప్పగిస్తే నేనతనికి మాంత్రిక విద్యలన్నీ నేర్పిస్తాను” అన్నాడు. దానికి రాజు సరేనని ఒక బాలుణ్ణి అతని వద్దకు పంపాడు. మాంత్రికుడు ఆ బాలునికి మాంత్రికవిద్యను నేర్పేవాడు. అయితే ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళే దారిలో ఒక మతగురువు నివాసం ఉండేది. ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా (దారిలో కొంత సేపు) మత గురువు దగ్గర కూడా కూర్చొనేవాడు. ఆ విధంగా అతను ఆ గురువు మాటలకు ప్రభావితుడయ్యాడు. దాంతో అతను మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో మత గురువు దగ్గర కూడా కూర్చోవడం ప్రారంభించాడు. (రావడంలో ఆలస్యమవుతున్నందుకు) మాంత్రికుడు బాలుణ్ణి కొట్టేవాడు. అతను ఈ విషయం మతగురువుకి తెలియజేశాడు. అది విని ఆయన, “మాంత్రికుడు నిన్ను కొడతాడని భయం వేస్తే ఇంట్లో (పనుంటే) ఆగమన్నారని చెప్పు. అలాగే ఆలన్యమెందుకయిందని ఇంట్లో నిలదీస్తే మాంత్రికుడు ఆగమన్నాడని చెప్పు” అని అన్నాడు.

అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ బాలుడు తను వెళ్ళే దారిలో ఒక పెద్ద మృగాన్ని చూశాడు. అది మనుషుల రాక పోకలకు అడ్డంకిగా నిల్చుంది. అప్పుడా బాలుడు ఈ రోజు మాంత్రికుడు గొప్పవాడో లేక మతగురువు గొప్పవాడో తేలిపోవాలని మనసులో అనుకున్నాడు, అతను చేతిలో ఒక రాయి తీసుకొని “ఓ అల్లాహ్‌! మతగురువు చేస్తున్న పని నీ దృష్టిలో మాంత్రికుని పని కన్నా ప్రీతికరమైనదైతే. (ఈ రాయితో) మృగాన్ని చంపెయ్యి. మనుషులు తమ దారిన తాము వెళ్ళిపోతారు” అని వేడుకొని రాయిని మృగంపైకి విసిరేశాడు. ఆ దెబ్బకు మృగం చచ్చిపోయింది. దాంతో ప్రజలు (నిర్భయంగా) ఆ దారిగుండా రాకపోకలు సాగించారు. ఆ తరువాత అతను మతగురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించాడు. అది విని మతగురువు “నాయనా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడివి అయ్యావు. (దైవభక్తి, విద్యాపరంగా) నువ్వు ఏ స్థాయికి చేరుకున్నావో నాకర్థమయ్యింది. త్వరలోనే నీకు పరీక్షలు ఎదురౌతాయి. (అయితే ఒక విషయం మాత్రం గుర్తుం చుకో) ఆ పరీక్షా సమయం ఆసన్నమయినప్పుడు నా గురించి ఎవరికీ చెప్పకు సుమా!” అని హితవు పలికాడు.

ఈ బాలుడు పుట్టు గుడ్డివారిని కుష్టు రోగులను కూడా (దైవ సహాయంతో) నయం చేసేవాడు. అన్ని రకాల రోగాలకూ చికిత్సలు చేసేవాడు. రాజ దర్చారులోని ఒకతనికి కంటిచూపు పోయింది. అతను ఈ బాలుణ్ణి గురించి విని ఎన్నో కానుకలు వెంటబెట్టుకొని వచ్చి ఆ బాలునితో “నువ్వు గనక నాకు నయం చేస్తే నేను తీసుకువచ్చిన ఈ కానుకలన్నీ నీకే” అన్నాడు. దానికి ఆ అబ్బాయి “నేనెవరికీ నయం చేయలేను. నయం చేసేది కేవలం అల్లాహ్‌ మాత్రమే. నువ్వు కూడా అల్లాహ్‌ను విశ్వసిస్తే, నేను నీ కోసం దుఆ చేస్తాను (నీ వ్యాధి నయమయిపోతుంది)” అని చెప్పాడు. ఆ బాలుని మాటలు విని ఆ వ్యక్తి అల్లాహ్‌ను విశ్వసించాడు. అల్లాహ్‌ అతనికి నయం చేశాడు.

ఆ తరువాత అతను రాజు దగ్గరికి వెళ్ళి మునుపటిలాగే అతని ముందు కూర్చున్నాడు. రాజు అతన్ని చూసి “నీకు తిరిగి దృష్టి ఎలా వచ్చింది?” అనడిగాడు. దానికతను “నా ప్రభువు నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాడు” అని సమాధాన మిచ్చాడు. అందుకు రాజు “ఏమిటి? నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. “నాకూ నీకూ ప్రభువు అల్లాహ్‌ (మాత్రమే)” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. దాంతో రాజు (కోపోద్రిక్తుడై) అతన్ని బంధించి శిక్షించసాగాడు. ఆఖరికి అతను ఆ బాలుని గురించి రాజుకి చెప్పేశాడు.

బాలుణ్ణి రాజు దర్చారుకి తీసుకురావడం జరిగింది. “నువ్వు పుట్టుకతో అంధులైనవారిని, కుష్టు రోగుల్ని కూడా నయం చేస్తున్నావట. ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావట. ఇంద్రజాలంలో అంతటి నైపుణ్యం వచ్చిందా నీకు!” అని రాజు ఆ బాలుణ్ణి ప్రశ్నించాడు. దానికా బాలుడు “నేను ఎవరికీ నయం చేయలేను. నయం చేసే వాడు అల్లాహ్‌ మాత్రమే” అని సమా ధానమిచ్చాడు. బాలుని సమాధానం విని రాజు అతన్ని కూడా బంధించి యాతన పెట్టసాగాడు. చివరికి ఆ బాలుడు మతగురువు గురించి చెప్పేశాడు.

మతగురువుని కూడా (రాజు దర్బారులో) నిలబెట్టడం జరిగింది. తన ధర్మం నుండి మరలిపొమ్మని ఆయనకు చెప్పబడింది. కాని ఆయన అందుకు నిరాకరించాడు. రాజు ఒక రంపాన్ని తెప్పించాడు. దాన్ని గురువు నడినెత్తిన ఉంచి ఆయన శిరస్సును కోయటం జరిగింది. దాంతో ఆయన తలకాయ రెండు ముక్కలై పోయింది.

ఆ తరువాత రాజ దర్బారు లోని వ్యక్తిని తీసుకువచ్చారు. అతన్ని కూడా తన ధర్మం నుండి మరలి పొమ్మని ఆదేశించడం జరిగింది. ఆ వ్యక్తి కూడా నిరాకరించాడు. అతని తల పాపటిలో రంపం పెట్టి కోయడంతో అతని తల కూడా రెండు ముక్కలైంది.

ఆ తరువాత బాలుణ్ణి పట్టుకొని తీసుకు వచ్చారు. తన ధర్మం నుండి తిరిగిపోవాలని అతన్ని కూడా ఆదేశించడం జరిగింది. కాని అ బాలుడు కూడా ససేమిరా అన్నాడు. రాజు ఆ పసివాణ్ణి తన ప్రధాన భటులకు అప్పగించి “ఇతన్ని ఫలానా పర్వత శిఖరం పైకి తీసుకెళ్ళండి. ఇతను తన ధర్మం విడిచిపెడితే సరి; లేకపోతే అక్కణ్ణుంచి క్రిందికి తోసెయ్యండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ పిల్లవాడి తీసుకొని కొండపైకెక్కారు. అక్కడ ఆ బాలుడు, “దేవా! ఎలాగైనాసరే (నీయిష్ట ప్రకారం) వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు అండగా ఉండు” అని వేడుకున్నాడు. దాంతో ఆ కొండ కంపించసాగింది. ఆ ప్రకంపనకు వాళ్ళందరూ క్రిందపడి పోయారు. ఆ పిల్లవాడు తిరిగి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అతణ్ణి చూసి (ఆశ్చర్యపోతూ) “నీ వెంటవెళ్ళిన వారు ఏమైపోయారు? (వాళ్లు నిన్ను క్రిందికి తోసెయ్యలేదా?)” అని అడిగాడు. దానికి ఆ బాలుడు “వారికి ప్రతిగా అల్లాహ్‌ నాకు తోడ్పడ్డాడని” సమాధాన మిచ్చాడు.

రాజు కోపం చల్లారలేదు. ఆ పిల్లవాడిని ఇంకొంతమందికి అప్పజెప్పి “ఇతన్ని పడవ ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకెళ్ళండి. వీడు తన ధర్మం నుండి మరలి పోతే సరి; లేకపోతే నడి సముద్రంలోకి విసరివేయండి” అని ఆజ్ఞాపించాడు. (రాజు ఆజ్ఞానుసారం) భటులు ఆ పిల్ల వాడిని తీసుకెళ్ళారు. అతను పడవలో కూర్చొని “దేవా! ఎలాగైనాసరే వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు రక్షణ కల్పించు” అని వేడుకున్నాడు. దాంతో పడవ తలక్రిందులయింది. తోడు వచ్చిన వారంతా మునిగిపోయారు.

తిరిగి ఆ పిల్లవాడు రాజు దగ్గరికి చేరు కున్నాడు. రాజు అతన్ని చూసి “వాళ్ళు ఏమైపోయారు?” అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు “వారికి ప్రతిగా అల్లాహ్‌ నాకు సహాయపడ్డాడు” అని జవాబిచ్చాడు. ఇంకా ఆ బాలుడు ఇలా అన్నాడు: “నేను చెప్పే పద్ధతి అనుసరించనంతవరకు నువ్వు నన్ను చంపలేవు.” ఆ పద్ధతి ఏమిటని రాజు అడిగాడు. అప్పుడు పిల్లవాడు చెప్పాడు : “ప్రజలందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో హాజరుపరచు. నన్ను ఉరికంబం ఎక్కించి నా అంబులపొది నుండి ఒక బాణం తీసుకో. అ తరువాత బాణాన్ని వింటి తంతువుపై వుంచి ఈ మాటలు (ఈ పిల్లవాని ప్రభువైన అల్లాహ్‌ నామముతో అని) చెప్పి బాణాన్ని నాపైకి ప్రయోగించు. అలా చేస్తే నువ్వు నన్ను చంపడంలో సఫలీకృతుడవుతావు.”

రాజు (పిల్లవాడు చెప్పినట్లే) ప్రజలందరినీ ఒక పెద్ద స్థలంలో సమీకరించాడు. ఉరితీయడం కోసం పిల్లవాడిని ఊరి కొయ్యల మీదకు ఎక్కించాడు. అతని అంబులపొది నుండి ఒక బాణం తీసి, దాన్ని వింటి తంతువుపై ఉంచి “బిస్మిల్లాహి రబ్బిల్‌ గులామి (ఈ పిల్ల వాని ప్రభువైన అల్లాహ్‌ నామముతో)” అంటూ బాణాన్ని వదలిపెట్టాడు. బాణం వచ్చి అ పిల్లవాని కణతకు తగిలింది. ఆ పిల్లవాడు కణతను పట్టుకొని నేలకొరి గాడు.

జరిగినది చూసిన ప్రజలంతా “మేము ఈ బాలుని ప్రభువును విశ్వసించాము” అని నినదించసాగారు. కొంతమంది రాజువద్దకు వెళ్ళి “ప్రభూ! ఇన్నాళ్ళు తమరు జరగకూడదని భీతిల్లినదే జరిగిపోయింది. మీరు భయపడిన విపత్తు వచ్చిపడింది. ప్రజలంతా అల్లాహ్‌ను విశ్వసిస్తున్నారు” అని రాజుకు వార్తనందజేశారు. అది విని రాజు వెంటనే తోవల ప్రక్కల్లో కందకాలు త్రవ్వమని ఆదేశించాడు. రాజు ఆదేశానుసారం కందకాలు త్రవ్వబడ్డాయి. వాటిలో మంటలు రగిలించారు. తాము విశ్వసించిన ధర్మాన్ని వదలని ప్రజలను అందులోకి విసరి వేయమని లేదా ఆ మంటల్లోకి దూకెయ్యమని వారితో చెప్పండని రాజు (తన భటులను) ఆజ్ఞాపించాడు. వారు (రాజాజ్ఞను శిరసావహించి) అలాగే చేశారు. (ఈ దారుణమారణ హోమం జరుగుతుండగా) ఒక స్త్రీ తన చేతుల్లో ఓ పసివాడిని మోసుకొని అక్కడికి వచ్చింది. అయితే మంటల్లో దూకటానికి తటపటాయిస్తుండగా ఆమె చేతు ల్లోని పసికందు “అమ్మా! సహనం వహించు. నిస్సందేహంగా నువ్వు సత్యంపై ఉన్నావు” అంటూ మంటల్లో దూకేయమని తల్లిని పురికొల్పాడు. (ముస్లిం)

ముఖ్యాంశాలు:

1.పై హదీసు ద్వారా కలిగే అతి ముఖ్యమైన గుణపాఠం ఏమిటంటే ధర్మావలంబనలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లను సహన స్థయిర్యాలతో ఎదుర్కోవాలి. అవసరమైతే ధర్మం కోసం ప్రాణాలర్చించడానికి కూడా వెనుకాడరాదు.

2. అల్లాహ్ ప్రియదాసుల (వలీల) మహిమలు వాస్తవమే. అల్లాహ్ తన వివేచనతో తన యిష్టప్రకారం వాటి అవసరాన్ని గుర్తిస్తే తన దాసుల ద్వారా వాటిని ఉనికిలోకి తెస్తాడు.

3. ఈ హదీసు ద్వారా ఖుర్‌ఆన్‌ యొక్క సత్యబోధనా ప్రశస్తి ఇనుమడిస్తోంది. రేయింబవళ్ళ తెరల మరుగునపడి కాలం చేత విస్మరించబడిన అతి ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్టు వివరించే దైవగ్రంథ హితబోధనామృతానికి ఇది అద్దం పడుతోంది.

4. హదీసు లేకుండా ఖురాన్‌ను వ్యాఖ్యానించడం, విశదీకరించడం సాధ్యం కాదు. హదీసులో కందకం వాళ్ళ గాధ వివరించబడనట్లయితే దివ్య ఖురాన్‌లో చెప్పబడిన ‘అస్‌హాబుల్‌ ఉఖ్‌దూద్‌‘ (కందకాలవాళ్ళ) వృత్తాంత వాస్తవికత ఏమిటో మనకు అర్ధం అయ్యేది కాదు. ఖురాన్‌ సూక్తుల్లోని ఈ సూక్ష్మతను, సమగ్రతను హదీసు విశదపరచింది.

5. ఇటువంటి గాధలు సత్య సందేశ ప్రధాతలకు స్ఫూర్తినీ, స్థయిర్యాన్నీ అందజేస్తాయి.


ఇతర కధలు:
https://teluguislam.net/category/stories-kadhalu/

సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు
హదీసులు # 25 – 52

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

సహనం, ఓర్పు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3RjoZaSlju7cCMlRuCMNco

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

భాగం 01 (ఖుర్’ఆన్ అయతులు)  (29 నిముషాలు)

భాగం 02 (హదీసు #25) (34 నిముషాలు)

భాగం 03 (హదీసు #26,27) (29 నిముషాలు)

భాగం 04 (హదీసు #28,29) (25 నిముషాలు)

భాగం 05 (హదీసు #30) (25 నిముషాలు)

భాగం 06 (హదీసు #31 – 35) (29 నిముషాలు)

భాగం 07 (హదీసు #36 – 40) (25 నిముషాలు)

భాగం 08 (హదీసు #41) (36 నిముషాలు)

భాగం 09 (హదీసు #42,43) (27 నిముషాలు)

భాగం 10 (హదీసు #44) (27 నిముషాలు)

భాగం 11 (హదీసు #45-49) (23 నిముషాలు)

భాగం 12 (హదీసు #50-53) (36:22 నిముషాలు)


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
సహనం , ఓర్పు [PDF]