దైవప్రవక్తలలో శ్రేష్టులయిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వంశంలో జన్మించారు. ఆయన అల్లాహ్ దాసులు మరియు అంతిమ దైవప్రవక్త. ప్రళయం వరకు రాబోయే మానవులందరి కోసం ఆయనను ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఆయన రాకతో దైవప్రవక్తల పరంపర సమాప్తమయ్యింది. ఆయన ఇతర ప్రవక్తలపై విశిష్టత మరియు ఆధిక్యతను పొందివున్నారు. ఇలాగే ఆయన ఉమ్మత్ స్థాయి కూడా ఇతర ఉమ్మత్ (అనుచర సమాజం)ల కన్నా ఎక్కువగా వుంది. ఆయన విధేయతను అల్లాహ్ తప్పనిసరి చేశాడు. ఆయనకు గల ప్రత్యేకతలు ఇతర ప్రవక్తలకు లేవు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రండి! మన ప్రియ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మహత్యం, ఆయన అద్భుతాలు మరియు
కొన్ని ప్రత్యేకతలను గూర్చి తెలుసుకొందాం.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్థాయి మరియు ఆయన విశిష్టత
1) శ్రేష్ట వంశము
తన వంశము (కుటుంబం) రీత్యా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ఉన్నత స్థానం కలిగి వున్నారు.
ఈ విషయాన్నే వాయిలా బిన్ అసఖా (రదియల్లాహు అన్హు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు:
“నిస్సందేహంగా అల్లాహ్, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానంలో ‘కనాన’ ను ఎన్నుకున్నాడు. తదుపరి ‘కనాన’ నుండి ఖురైష్ ను, వారి నుండి బనూ హాషిమ్ ను ఎన్నుకున్నాడు. బనూ హాషిమ్ నుండి నన్ను ఎన్నుకున్నాడు.” (సహీ ముస్లిం : 2276)
ఇలాగే, రోము చక్రవర్తి (హెరిక్లెస్), అబూసుఫ్యాన్ (అప్పటి వరకు ఆయన ఇంకా ముస్లిం కాలేదు)ను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశావళిని గూర్చి అడగ్గా – ఆయన జవాబిస్తూ, “అతను మాలో ఎంతో ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి” అని అన్నారు. దీని పై హెరిక్లెస్ స్పందిస్తూ – దైవప్రవక్తలు (సాధారణంగా) తమ జాతుల్లోని ఉన్నత వంశానికి చెందినవారై వుంటారు అని అన్నాడు. (సహీ బుఖారీ : 7, సహీ ముస్లిం : 1773)
2) మానవాళి కొరకు గొప్ప కటాక్షం
వాస్తవానికి మానవాళి పై అల్లాహ్ ఉపకారాలు లెక్కలేనంతగా వున్నాయి. కానీ వాటిలో అన్నింటి కన్నా ప్రత్యేక ఉపకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆగమనం. ఈ విషయాన్ని అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే – ఆయన, వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్దుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందు వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై వున్నారు.” (ఆలి ఇమ్రాన్ : 164)
ఈ ఆయత్ లో అల్లాహ్ సెలవిచ్చినట్లు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవదౌత్య బాధ్యతలు అప్పగించబడ్డ సమయంలో మానవ జాతి స్పష్టమైన అపమార్గానికి లోనై అజ్ఞానపు అంధకార లోయలలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో అల్లాహ్ వారి వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పంపి, వారిని అంధకారం నుండి బయటకు తీసి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా వారిని రుజుమార్గం వైపునకు దారి చూపాడు. ఇలా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కొరకు ఒక కారుణ్యంగా వున్నారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.” (అంబియా : 107)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“ప్రజలారా! నేను ప్రజల కొరకు (అల్లాహ్ తరఫు నుండి) బహుమానంగా పంపబడిన కారుణ్యాన్ని”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది, అయిష్టతతో వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదిం- చేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకొని, శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.
ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖనం ప్రస్తావించారు: “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూకోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఇవన్నియూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి“. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).
ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహుద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహుద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే కొంత బంగారం తప్ప అది నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారు: “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు“.
ప్రవక్త తిండి మరియు వస్త్రాధారణ
తిండి విషయం: నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయంకాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.
ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు. ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.
అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న, మందమైన ఓ గుడ్డ మరియు లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారు: నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడుస్తూ ఉండగా ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండినది.
ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు ఒక భూమి తప్ప, అది కూడా దానం చేశారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయం
న్యాయం విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబీ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే ప్రవక్త వినిపించుకునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారు: “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని కోరేవాణ్ణి“.
ఒకసారి ఉసైద్ బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు, వెంటనే ఉసైద్ అన్నాడు: ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. ప్రవక్త చెప్పారు: సరే తీర్చుకో, ఉసైద్ అన్నాడు: ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది, మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది, అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు, ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య చుంబించుకోసాగాడు. మళ్ళీ చెప్పాడు: ప్రవక్తా! నేను కోరింది ఇదే.
అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హుని సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారు: “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడయితే అతన్ని శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని“.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడు: “నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది”. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారు: “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడు: “అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు”. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు.
అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉంది: ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్ర్ [1] లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖ్బా భుజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారు:
(ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?). (ఘాఫిర్ 28)
[1]అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.
ఒక రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్ , వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూ: ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటెను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగొల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా (రజియల్లాహు అన్హా) వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.
వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు.”
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది.
బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సందర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్ట రోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది.
ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త — ఇలా చెప్పారు: “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విషయంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రదియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం“.
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవ గౌరవాల్లో కూడా శత్రువులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విజయ ధనం పంపిణీ చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు“.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ (రజియల్లాహు అన్హా) మిగిలారు. అయినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారు: “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది“.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 9: ప్రవక్త చరిత్రలోని నేర్చుకోదగ్గ విషయాలు(1) ప్రవక్త గారి పరిహాసం, బాలలతో అనురాగం, ఇంటి వారితో ప్రవక్తగారి వ్యవహారం, ప్రవక్త గారి కారుణ్యం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహసించే వారు, తమ ఇల్లాలితో వినోదంగా, ఉల్లాసంగా గడిపేవారు. చిన్నారులతో ఆనందంగా ఉండేవారు. వారి కొరకు సమయం కేటాయించేవారు. వారి వయసు, బుద్ధిజానాలకు తగిన రీతిలో వారితో ప్రవర్తించేవారు. తమ సేవకుడైన అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్షుతో కూడా ఒకప్పుడు పరిహసిస్తూ “ఓ రెండు చెవులవాడా” అని అనేవారు.
ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తా! నాకొక సవారి ఇవ్వండని అడిగాడు. ప్రవక్త పరిహాసంగా “మేము నీకు ఒంటె పిల్లనిస్తాము” అని అన్నారు. నేను ఒంటె పిల్లను తీసుకొని ఏమి చేయాలి? అని ఆశ్చర్యంగా అడిగాడతను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రతి ఒంటె, పిల్లనే కంటుంది కదా” అని నగుమోహంతో అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ముందు ఎల్లప్పుడూ మంద హాసంతో, నగుమోహంతో ఉండేవారు. వారి నుండి మంచి మాటే వినేవారు. జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్షు ఉల్లేఖనం ప్రకారం: నేను ఇస్లాం స్వీకరించినప్పటి నుండీ, ప్రవక్త వద్దకు ఎప్పుడు వచ్చినా ఆయన రావద్దని చెప్పలేదు. నేను ఎప్పుడు చూసినా చిరునవ్వే ఉండేది. ఒకసారి “ప్రవక్తా! నేను గుఱ్ఱంపై స్థిరంగా కూర్చోలేకపోతాను అని” విన్నవించు కున్నాను. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా రొమ్ము మీద కొట్టాడు. మళ్ళీ ఇలా దుఆ చేశారు: “అల్లాహ్ ఇతన్ని స్థిరంగా కూర్చోబెట్టు. ఇతడ్ని మార్గదర్శిగా, సన్మార్గగామిగా చెయ్యి”. ఆ తర్వాత నేను ఎప్పుడూ గుఱ్ఱం మీది నుంచి పడలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ బంధువులతో కూడా పరిహసించే వారు. ఒకసారి ప్రవక్త తమ కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళారు. అక్కడ హజ్రత్ అలీ రజియలాహు అను కన్పించక పోవడంతో. ఆయన ఎక్కడి వెళ్ళాడమ్మా! అని కూతుర్ని అడిగారు. దానికి ఫాతిమ రజియల్లాహు అన్హా సమాధానమిస్తూ “మా ఇద్దరి మధ్య చిన్న తగాద ఏర్పడింది. అందుకు ఆయన నాపై కోపగించుకొని, అలిగి వెళ్ళిపోయారు” అని అంది. ప్రవక్త అక్కడి నుండి మస్తిదుకు వచ్చారు. అతను అందులో పడుకొని ఉన్నారు. ఆయన మీది నుండి దుప్పటి తొలిగి పోయింది. ఆయన శరీరానికి మట్టి అంటుకొని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన శరీరానికి అంటుకొని ఉన్న మట్టిని తూడుస్తూ “అబూ తురాబ్ (మట్టివాడా)! లే అబూ తురాబ్! లే” అని అన్నారు.
ప్రవక్త బాలలతో
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులకు, కూతుళ్ళకు ప్రవక్త ఉత్తమ సద్గుణాల్లో ఓ గొప్ప వంతు ఉండింది. ఒక్కోసారి ప్రవక్త తమ సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హా తో పరుగు పందెం పెట్టేవారు. ఆమె తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటే వద్దనేవారు కాదు. స్వయంగా ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట నా స్నేహితురాళ్ళతో కలసి ఆడుకునేదాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి రాగానే ఆ బాలికలు భయపడి దాక్కునేవారు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నా దగ్గరకు పంపేవారు. నేను వారితో మళ్ళీ ఆడుకునేదాన్ని”. “
బాలలతో అనురాగంగా కలిగి యుండి, వారిని ప్రేమగా చూసుకుంటూ ఒక్కోసారి వారితో ఆటలాడేవారు. షధాద్ రజియల్లాహు అను ఉల్లేఖనం ప్రకారం: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజులో తమ వెంట హసన్ లేదా హుసైన్ ను తీసుకొచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వెళ్ళి అబ్బాయిని కూర్చోబెట్టారు. అల్లాహు అక్బర్ అని నమాజునారంభించారు. సజ్జాలో వెళ్ళి, చాలా ఆలస్యం అయినప్పటికీ లేవలేదు. నాకు అనుమానం కలిగి కొంచం తల లేపి చూశాను. ఆ అబ్బాయి ఆయన వీపుపై ఉన్నాడు. నేను మళ్ళీ సలో ఉండిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించిన తర్వాత సహచరులు: ‘ప్రవక్తా! మీరు దీర్ఘంగా స చేసినందుకు ఏదైనా సంఘటన జరిగిందా లేదా మీపై దివ్యవాణి (వక్త) అవతరణ జరుగుతుందా అని భావించాము’ అని అడిగారు. అందుకు ప్రవక్త చెప్పారుః “ఇవన్నీ ఏమి కాదు, విషయం ఏమిటంటేః అబ్బాయి నా వీపుపై ఎక్కాడు. అతను కోరిక తీరక ముందే తొందరగా లేవడం నాకు బావ్యమనిపించలేదు.
అనసు రజియల్లాహు అన్షు ఉల్లేఖనంలో ఉందిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఉత్తమ గుణం గలవారు. నాకో చిన్న తమ్ముడు ఉండేవాడు. అతని పేరు ఉమైర్. ప్రవక్త ప్రేమతో, అతని తృప్తి కొరకు ఇలా అనేవారు: “ఉమైర్ నీ నుఫైర్ ఎలా ఉంది”. నుషైర్ అంటే బుర్ర పిట్ట. అతను దానితో ఆడుకునేవాడు.
ప్రవక్త ఇల్లాలితో
ఇంటివారితో ప్రవక్త వ్యవహారంలో సర్వ సద్గుణాలు ఏకమయ్యాయి. ఆయన చాలా వినయనమ్రతతో మెదిలేవారు. తమ చెపులు స్వయంగా కుట్టుకునేవారు. అవసరమున్న చోట బట్టలకు మాసికలేసుకునేవారు. ఎప్పుడూ భోజనానికి వంకలు పెట్టేవారు కారు. ఇష్టముంటే తినే, లేదా వదిలేసేవారు. స్త్రీ జాతిని ఒక మనిషి గా గౌరవించేవారు. అంతే కాదు, తల్లి, భార్య, కూతురు, చెల్లి రూపాల్లో వివిధ గౌరవాలు ప్రసాదించేవారు. ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడుః నా సేవా సద్వర్తనలకు అందరికన్నా ఎక్కువ అర్హులేవరు అని. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అనే జవాబిచ్చారు. నాల్గవ సారి అడిగినప్పుడు “నీ తండ్రి” అని చెప్పారు. మరొసారి ఇలా చెప్పారు: “ఏ వ్యక్తి తన తల్లిదండ్రిలో ఒకరిని లేదా ఇద్దరిని పొంది, వారి సేవా చేసుకోకుండా నరకంలో ప్రవేశిస్తాడో అల్లాహ్ అతన్ని తన కరుణకు దూరమే ఉంచుగాకా!”.
ఆయన సతీమణి ఏదైనా పాత్ర నుండి త్రాగినప్పుడు, ఆయన ఆ పాత్ర తీసుకొని ఆమె ఎక్కడ తన మూతి పెట్టిందో అక్కడే తమ మూతి పెట్టి త్రాగేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “మీలో మంచివారు తమ ఇల్లాలి పట్ల మంచి విధంగా మెలిగేవారు. నేను నా ఇల్లాలి పట్ల మీ అందరికన్నా మంచి విధంగా వ్యవహరించేవాణ్ణి”.
(ఈనాడు మనం మన భార్యలతో ఉత్తమ రీతిలో వ్యవహరించి ఉంటే మరియు మన ఇల్లాలులు ప్రవక్త సతీమణుల లాంటి సద్గుణాలు అవలంబించి ఉంటే మన జీవితాలు సుఖశాంతులతో నిండి ఉండేవి. మనందరికి అల్లాహ్ ఈ భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్).
ప్రవక్త కారుణ్యం
ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి కరుణ గుణం: ఆయన ఇలా ప్రవచించారు: “కరుణించేవారిని కరుణామయుడైన అలాహ్ కరుణిస్తాడు. మీరు భువిలో ఉన్నవారిపై కరుణ చూపండి. దివిలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు”. ప్రవక్తలో ఈ గొప్ప గుణం అధిక భాగంలో ఉండింది. చిన్నలు, పెద్దలు, దగ్గరివారు, దూరపువారు అందరితో గల ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యవహారాల్లో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన కరుణ, వాత్సల్యపు నిదర్శనం ఒకటి: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిలవాళ్ళ ఏడుపు విని సామూహిక నమాజు దీర్ఘంగా కాకుండా, సంక్షిప్తముగా చేయించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ ఖతాదా రజియల్లాహు అను ఉల్లేఖించారు: “నేను నమాజు కొరకు నిలబడినప్పుడు దీర్ఘంగా చేయించాలని అనుకుంటాను, కాని పసి పిల్లవాని ఏడుపు విని నేను సంక్షిప్తంగా చేయిస్తాను. తన తల్లికి అతని వల్ల ఇబ్బంది కలగ కూడదని”.
తమ అనుచర సంఘం పట్ల ఆయన కరుణ, మరియు వారు అల్లాహ్ ధర్మంలో చేరాలన్న కాంక్ష యొక్క నిదర్శనం: ఒక యూద పిల్లవాడు వ్యాదిగ్రస్తుడయ్యాడు. అతడు ప్రవక్త సేవ చేసేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పరామర్శ కొరకు బయలుదేరి, అతని తలకడన కూర్చున్నారు. కొంత సేపటికి, “అబ్బాయీ! ఇస్లాం స్వీకరించు” అని చెప్పారు? అతడు తన తలాపునే నిలుచున్న తండ్రి వైపు చూశాడు. అబుల్ ఖాసిం (ప్రవక్త విశేషనామం, కునియత్) మాట విను అని అతని తండ్రి చెప్పాడు. ఆ అబ్బాయి అప్పుడే ఇస్లాం స్వీకరించాడు. మరి కొంత సేపటికే చనిపోయాడు. ప్రవక్త అతని వద్ద నుండి వెళ్తూ ఇలా అన్నారు: “ఇతన్ని అగ్ని నుండి కాపాడిన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు”.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొట్టిగా గాని లేదా పొడుగ్గా గాని కాకుండా మధ్యరకమైన ఎత్తులో ఉండిరి. విస్తరించిన భుజాలు. సరితూగిన అవయవాలు. విశాలవక్షస్తుడు. చంద్రబింబం లాంటి అందమైన ముఖం. సుర్మా పెట్టుకున్నటువంటి కళ్ళు. సన్నటి ముక్కు. అందమైన మూతి. సాంద్రమైన గడ్డం.
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అను కథనం, అంబర్ గ్రిస్ (ambergris) మరియు కస్తూరి లేదా ఇంకేదైనా సువాసనగల పదార్థం, ద్రవ్యాల సువాసన ప్రవక్త సువాసన కంటే ఎక్కవ ఉన్నది నేను ఎన్నడూ చూడలేదు/ ఆఘ్రాణించేలదు. ప్రవక్త చెయ్యి కంటే ఎక్కువ సున్నితమైన వస్తవును ఎప్పుడూ నేను ముట్టుకోలేదు.
ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, మందహాసంగా ఉండేవారు. తక్కువ సంభాషించేవారు. మధుర స్వరం గలవారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్షు ఆయన గురించి ఇలా చెప్పాడుః ఆయన అందరిలో అందమైన వారు. అందరికన్నా ఎక్కువ దాతృత్వ గుణం గలవారు, మరియు అందరి కన్నా గొప్ప శూరుడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాలు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా శూరులు, బలశాలి. అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్షు ఉల్లేఖించారు: యుద్ధం చెలరేగి ఒకరిపై ఒకరు విరుచుకుపడేటప్పుడు మేము ప్రవక్త వెనక ఉండేవారము.
ఆయన అందరికన్నా ఎక్కువ ఉదారులు, ఔదార్యము ఉన్నవారు. ఆయన్ను ఏదైనా అడుగుతే ఎప్పుడూ లేదు, కాదు అనలేదు.
అందరికన్నా ఎక్కువ ఓర్పు, సహనం గలవారు. ఎప్పుడూ తమ స్వంత విషయంలో ఎవరితో ప్రతీకారం కోరలేదు. ఎవరినీ కోపగించలేదు. కాని అల్లాహ్ నిషిద్ధతాల పట్ల జోక్యం చేసుకున్నవాడిని అల్లాహ్ కొరకు శిక్షించేవారు.
ఆయన దృష్టిలో దూరపు – దగ్గరివారు, బలహీనులు – బలలవంతులు అనే తారతమ్యము లేదు. హక్కులో అందరూ సమానం. మరింత తాకీదు చేస్తూ ఇలా చెప్పారు: “ఏ ఒకరికి మరొకరిపై ఆధిక్యత, ఘనత లేదు. కేవలం తఖ్వా (అల్లాహ్ భయభీతి) తప్ప. మానవులందరూ సమానులే. గత కాలల్లో గతించిన జాతుల్లో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయు డవుతే శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అందుకే వారు నాశనం అయ్యారు. వినండి! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేసేవాన్ని”.
ఎప్పుడూ ఏ భోజనానికి వంక పెట్ట లేదు. ఇష్టముంటే తినేవారు. లేదా వదిలేవారు. ఒక్కోసారి నెల రెండు నెలల వరకు ఇంటి పొయ్యిలో మంటే ఉండకపోయేది. ఆ రోజుల్లో ఖర్జూరం మరియు నీళ్ళే వారి ఆహారంగా ఉండేది. ఒక్కోసారి ఆకలితో కడుపుపై రాళ్ళు కట్టుకునేవారు.
చెప్పుల మరమ్మతు చేసుకునేవారు. దుస్తులు చినిగిన చోట కుట్లు వేసుకునేవారు. ఇంటి పనుల్లో ఇల్లాలికి సహకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేవారు.
పేదరికం వల్ల పేదలను చిన్న చూపు చూసేవారు కారు. రాజ్యాధికారం వల్ల రాజులతో భయపడేవారు కారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుఱ్ఱం, ఒంటె, గాడిద మరియు కంచర గాడిదలపై ప్రయాణం చేసేవారు.
ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా అందరికన్నా ఎక్కువ మందహాసంతో ఉండేవారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేవారు. సువాసనను ప్రేమించే వారు. దుర్వాసనను అసహ్యించుకునేవారు. సర్వ సద్గుణాలను, ఉత్తమ చేష్టలను అల్లాహ్ ఆయనలో సమకూర్చాడు.
అల్లాహ్ ఆయనకు నొసంగిన విద్యా జ్ఞానం ముందువారిలో, వెనుక వారిలో ఎవ్వరికీ నొసంగ లేదు. ఆయన నిరక్షరాస్యులు. చదవలేరు, వ్రాయ లేరు. మానవుల్లో ఎవరూ ఆయనకు గురువు కారు. దివ్యగ్రంథం ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. దాని గురించి అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
{ఇలా అను ఓ ప్రవక్తా! ఒకవేళ మానవులూ జిన్నాతులూ అందరూ కలసి ఈ ఖుర్ ఆను వంటిదానిని దేనినయినా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు. వారందరూ ఒకరికొకరు సహాయులు అయినప్పటికినీ. (బనీ ఇస్రా ఈల్ 7: 88).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నపటి నుండి చదవడం, వ్రాయడం నేర్చుకోకుండా నిరక్షరాస్యులవడం తిరస్కారుల అపోహాలకు ఒక అడ్డు కట్టుగా నిలిచింది. ఈ గ్రంథాన్ని ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- స్వయంగా వ్రాసారు, లేదా ఇతరులతో నేర్చుకున్నారు, లేదా పూర్వ గ్రంథాల నుండి చదివి వినిపిస్తున్నాడన్న అపోహాలు వారు లేపుతూ ఉంటారు. నిరక్షరాస్య మనిషి ఎలా ఇలా చేయగలడు? అందుకని వాస్తవంగా ఇది అల్లాహ్ వైపు నుండి అవతరించినదే.
మహిమలు (MIRACLES)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించిన మహిమల్లో అతి గొప్పది దివ్య గ్రంథం ఖుర్ఆన్. ఇది ప్రళయం వరకూ మహిమగా నిలిచి ఉంది. అది భాషా ప్రావీణులను, వాక్పుతులను అశక్తతకు గురి చేసింది. ఖుర్ఆన్ లో ఉన్నటువంటి పది సూరాలు, లేదా ఒక సూరా, లేదా కనీసం ఒక్క ఆయతెనా తేగలరా అని అలాహ్ అందరితో ఛాలెంజ్ చేశాడు. ముషీకులు స్వయంగా తమ అసమర్థత, అశక్తతను ఒప్పుకున్నారు.
ఆయన మహిమల్లో ఒకసారి ముఫ్రికులు మహత్యము చూపించమని కోరారు. ప్రవక్త అల్లాహ్ తో దుఆ చేశారు. చంద్రుణ్ణి రెండు వేరు వేరు ముక్కల్లో వారికి చూపించబడింది. (దీని వివరం పైన చదివారు).
కంకర రాళ్ళు ఆయన చేతులో సుబ్ హానల్లాహ్ పఠించాయి. అవే రాళ్ళు అబూ బక్ర్ చేతులో, తర్వాత ఉమర్ చేతులో, ఆ తర్వాత ఉస్మాన్ — చేతులో పెట్టారు. అప్పుడు కూడా అవి తస్బీహ్ పఠించాయి.
ఎన్నో సార్లు ఆయన వ్రేళ్ళ నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి.
ప్రవక్త భోజనం చేసేటప్పుడు ఆ భోజనం కూడా తస్బీహ్ పఠిస్తున్నది సహచరులు వినేవారు.
రాళ్ళు, చెట్లు ఆయనకు సలాం చేసేవి.
ఒక యూదురాళు ప్రవక్తను చంపే ఉద్దేశ్యంతో మేక మాంసంలోని దండచెయి భాగంలో విషం కలిపి బహుమానంగా పంపింది. ఆ మాంసపు దండచెయి మాట్లాడింది.
ఒక గ్రామీణుడు ఏదైనా మహిమ చూపించండి అని కోరినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టును ఆదేశించగా అది దగ్గరికి వచ్చింది. మరోసారి ఆదేశించగా తన మొదటి స్థానానికి తిరిగి వెళ్ళింది.
ఏ మాత్రం పాలు లేని మేక పొదుగును చెయితో తాకగానే పాలు వచ్చేశాయి. దాని పాలు పితికి స్వయంగా త్రాగి, అబూ బక్రకు త్రాపించారు.
అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అను కళ్ళల్లో అవస్త ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని అతని కళ్ళల్లో పెట్టగా అప్పడికప్పుడే సంపూర్ణ స్వస్థత కలిగింది.
ఒక సహచరుని కాలు గాయపడంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కాలును చెయితో తుడిస్తారు. వెంటనే అది నయం అయ్యింది.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అను కొరకు దీర్ఘాయుష్మంతుడుగను, అధిక ధన సంతానం గలవాడవాడిగను మరియు అల్లాహ్ వారికి శుభం (బర్కత్) ప్రసాదించాలని దుఆ చేశారు. అలాగే ఆయనకు 120 మంది సంతానం కలిగారు. ఖర్జూరపు తోటలన్నీ ఏడాదికి ఒక్కసారే ఫలిస్తాయి. కాని ఆయన ఖర్జూరపు తోట ఏడాదికి రెండు సార్లు పండేది. ఇంకా ఆయన 120 సంవత్సరాలు జీవించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు మెంబర్ పై ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి వచ్చి, అనావృష్టి దాపురించింది మీరు వర్షం కొరకు దుఆ చేయండని కోరగా, రెండు చేతులెత్తి దుఆ చేశారు. ఎక్కడా లేని మేఘాలన్నీ పర్వతాల మాదిరిగా ఒక చోట చేరి, వారం రోజుల పాటు కుండ పోత వర్షం కురిసింది. మరో జుమా రోజు ఖుత్బా సందర్భంలో వర్షం వల్ల నష్టం చేకూరుతుందని విన్నవించుకోగా రెండు చేతులెత్తి దుఆ చేశారు. అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలందరూ ఎండలో నడచి వెళ్ళారు.
ఖందక యుద్ధంలో పాల్గొన్న వెయ్యి మంది వీరులందరికీ సుమారు మూడు కిలోల యవధాన్యాల రొట్టెలు మరియు ఒక చిన్న మేక మాంసం తో ప్రవక్త వడ్డించారు. అందరూ కడుపు నిండా తృప్తికరంగా తిని వెళ్ళారు. అయినా రొట్టెలు మరియు మాంసంలో ఏ కొదవ ఏర్పడలేదు.
అదే యద్దంలో బషీర్ బిన్ సఅద్ కూతురు తన తండ్రి మరియు మామ కొరకు తీసుకొచ్చిన కొన్ని ఖర్జూరపు పండ్లు వీరులందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తినిపించారు.
అబూ హురైరా రజియల్లాహు అన్షు వద్ద ఉన్న ఒకరి భోజనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి సైన్యానికి తినిపించారు.
హిజ్రత్ కు వెళ్ళే రాత్రి ఆయన్ను (సల్లల్లాహు అలైహి వసల్లం) హత్య చేయుటకు వేచిస్తున్న వంద మంది ఖురైషుల పై దుమ్ము విసురుతూ వారి ముందు నుండి వెళ్ళి పోయారు. వారు ఆయన్ని చూడలేకపోయారు.
హిజ్రత్ ప్రయాణంలో సురాఖా బిన్ మాలిక్ ఆయన్ను చంపడానికి వెంటాడుతూ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని శపించారు. అందుకు అతని గుఱ్ఱం కాళ్ళు మోకాళ్ళ వరకు భూమిలో దిగిపోయాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.