https://youtu.be/w-allzUZM6E [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (25 నిముషాలు)
ఈ ఆడియో సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]– 5 వ పార్ట్ నుండి తీసుకోబడింది. ఈ కథ సహీహ్ హదీసులో వచ్చింది మరియు ఖురాన్ లో సూరతుల్ బురూజ్ లో ప్రస్తావించ బడింది
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు – హదీసు # 30
ఈ ఆడియో వివరించిన హదీసు క్రింద చదవండి :
30. హజ్రత్ సుహైబ్ (రది అల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనం:
“పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు బాగా ముసలివాడై పోయిన తరువాత (ఒకనాడు) రాజుతో “నేనిక ముసలివాణ్ణయిపోయాను. నాకు ఒక బాలుణ్ణి అప్పగిస్తే నేనతనికి మాంత్రిక విద్యలన్నీ నేర్పిస్తాను” అన్నాడు. దానికి రాజు సరేనని ఒక బాలుణ్ణి అతని వద్దకు పంపాడు. మాంత్రికుడు ఆ బాలునికి మాంత్రికవిద్యను నేర్పేవాడు. అయితే ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళే దారిలో ఒక మతగురువు నివాసం ఉండేది. ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా (దారిలో కొంత సేపు) మత గురువు దగ్గర కూడా కూర్చొనేవాడు. ఆ విధంగా అతను ఆ గురువు మాటలకు ప్రభావితుడయ్యాడు. దాంతో అతను మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో మత గురువు దగ్గర కూడా కూర్చోవడం ప్రారంభించాడు. (రావడంలో ఆలస్యమవుతున్నందుకు) మాంత్రికుడు బాలుణ్ణి కొట్టేవాడు. అతను ఈ విషయం మతగురువుకి తెలియజేశాడు. అది విని ఆయన, “మాంత్రికుడు నిన్ను కొడతాడని భయం వేస్తే ఇంట్లో (పనుంటే) ఆగమన్నారని చెప్పు. అలాగే ఆలన్యమెందుకయిందని ఇంట్లో నిలదీస్తే మాంత్రికుడు ఆగమన్నాడని చెప్పు” అని అన్నాడు.
అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ బాలుడు తను వెళ్ళే దారిలో ఒక పెద్ద మృగాన్ని చూశాడు. అది మనుషుల రాక పోకలకు అడ్డంకిగా నిల్చుంది. అప్పుడా బాలుడు ఈ రోజు మాంత్రికుడు గొప్పవాడో లేక మతగురువు గొప్పవాడో తేలిపోవాలని మనసులో అనుకున్నాడు, అతను చేతిలో ఒక రాయి తీసుకొని “ఓ అల్లాహ్! మతగురువు చేస్తున్న పని నీ దృష్టిలో మాంత్రికుని పని కన్నా ప్రీతికరమైనదైతే. (ఈ రాయితో) మృగాన్ని చంపెయ్యి. మనుషులు తమ దారిన తాము వెళ్ళిపోతారు” అని వేడుకొని రాయిని మృగంపైకి విసిరేశాడు. ఆ దెబ్బకు మృగం చచ్చిపోయింది. దాంతో ప్రజలు (నిర్భయంగా) ఆ దారిగుండా రాకపోకలు సాగించారు. ఆ తరువాత అతను మతగురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించాడు. అది విని మతగురువు “నాయనా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడివి అయ్యావు. (దైవభక్తి, విద్యాపరంగా) నువ్వు ఏ స్థాయికి చేరుకున్నావో నాకర్థమయ్యింది. త్వరలోనే నీకు పరీక్షలు ఎదురౌతాయి. (అయితే ఒక విషయం మాత్రం గుర్తుం చుకో) ఆ పరీక్షా సమయం ఆసన్నమయినప్పుడు నా గురించి ఎవరికీ చెప్పకు సుమా!” అని హితవు పలికాడు.
ఈ బాలుడు పుట్టు గుడ్డివారిని కుష్టు రోగులను కూడా (దైవ సహాయంతో) నయం చేసేవాడు. అన్ని రకాల రోగాలకూ చికిత్సలు చేసేవాడు. రాజ దర్చారులోని ఒకతనికి కంటిచూపు పోయింది. అతను ఈ బాలుణ్ణి గురించి విని ఎన్నో కానుకలు వెంటబెట్టుకొని వచ్చి ఆ బాలునితో “నువ్వు గనక నాకు నయం చేస్తే నేను తీసుకువచ్చిన ఈ కానుకలన్నీ నీకే” అన్నాడు. దానికి ఆ అబ్బాయి “నేనెవరికీ నయం చేయలేను. నయం చేసేది కేవలం అల్లాహ్ మాత్రమే. నువ్వు కూడా అల్లాహ్‌ను విశ్వసిస్తే, నేను నీ కోసం దుఆ చేస్తాను (నీ వ్యాధి నయమయిపోతుంది)” అని చెప్పాడు. ఆ బాలుని మాటలు విని ఆ వ్యక్తి అల్లాహ్‌ను విశ్వసించాడు. అల్లాహ్ అతనికి నయం చేశాడు.
ఆ తరువాత అతను రాజు దగ్గరికి వెళ్ళి మునుపటిలాగే అతని ముందు కూర్చున్నాడు. రాజు అతన్ని చూసి “నీకు తిరిగి దృష్టి ఎలా వచ్చింది?” అనడిగాడు. దానికతను “నా ప్రభువు నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాడు” అని సమాధాన మిచ్చాడు. అందుకు రాజు “ఏమిటి? నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. “నాకూ నీకూ ప్రభువు అల్లాహ్ (మాత్రమే)” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. దాంతో రాజు (కోపోద్రిక్తుడై) అతన్ని బంధించి శిక్షించసాగాడు. ఆఖరికి అతను ఆ బాలుని గురించి రాజుకి చెప్పేశాడు.
బాలుణ్ణి రాజు దర్చారుకి తీసుకురావడం జరిగింది. “నువ్వు పుట్టుకతో అంధులైనవారిని, కుష్టు రోగుల్ని కూడా నయం చేస్తున్నావట. ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావట. ఇంద్రజాలంలో అంతటి నైపుణ్యం వచ్చిందా నీకు!” అని రాజు ఆ బాలుణ్ణి ప్రశ్నించాడు. దానికా బాలుడు “నేను ఎవరికీ నయం చేయలేను. నయం చేసే వాడు అల్లాహ్ మాత్రమే” అని సమా ధానమిచ్చాడు. బాలుని సమాధానం విని రాజు అతన్ని కూడా బంధించి యాతన పెట్టసాగాడు. చివరికి ఆ బాలుడు మతగురువు గురించి చెప్పేశాడు.
మతగురువుని కూడా (రాజు దర్బారులో) నిలబెట్టడం జరిగింది. తన ధర్మం నుండి మరలిపొమ్మని ఆయనకు చెప్పబడింది. కాని ఆయన అందుకు నిరాకరించాడు. రాజు ఒక రంపాన్ని తెప్పించాడు. దాన్ని గురువు నడినెత్తిన ఉంచి ఆయన శిరస్సును కోయటం జరిగింది. దాంతో ఆయన తలకాయ రెండు ముక్కలై పోయింది.
ఆ తరువాత రాజ దర్బారు లోని వ్యక్తిని తీసుకువచ్చారు. అతన్ని కూడా తన ధర్మం నుండి మరలి పొమ్మని ఆదేశించడం జరిగింది. ఆ వ్యక్తి కూడా నిరాకరించాడు. అతని తల పాపటిలో రంపం పెట్టి కోయడంతో అతని తల కూడా రెండు ముక్కలైంది.
ఆ తరువాత బాలుణ్ణి పట్టుకొని తీసుకు వచ్చారు. తన ధర్మం నుండి తిరిగిపోవాలని అతన్ని కూడా ఆదేశించడం జరిగింది. కాని అ బాలుడు కూడా ససేమిరా అన్నాడు. రాజు ఆ పసివాణ్ణి తన ప్రధాన భటులకు అప్పగించి “ఇతన్ని ఫలానా పర్వత శిఖరం పైకి తీసుకెళ్ళండి. ఇతను తన ధర్మం విడిచిపెడితే సరి; లేకపోతే అక్కణ్ణుంచి క్రిందికి తోసెయ్యండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ పిల్లవాడి తీసుకొని కొండపైకెక్కారు. అక్కడ ఆ బాలుడు, “దేవా! ఎలాగైనాసరే (నీయిష్ట ప్రకారం) వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు అండగా ఉండు” అని వేడుకున్నాడు. దాంతో ఆ కొండ కంపించసాగింది. ఆ ప్రకంపనకు వాళ్ళందరూ క్రిందపడి పోయారు. ఆ పిల్లవాడు తిరిగి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అతణ్ణి చూసి (ఆశ్చర్యపోతూ) “నీ వెంటవెళ్ళిన వారు ఏమైపోయారు? (వాళ్లు నిన్ను క్రిందికి తోసెయ్యలేదా?)” అని అడిగాడు. దానికి ఆ బాలుడు “వారికి ప్రతిగా అల్లాహ్ నాకు తోడ్పడ్డాడని” సమాధాన మిచ్చాడు.
రాజు కోపం చల్లారలేదు. ఆ పిల్లవాడిని ఇంకొంతమందికి అప్పజెప్పి “ఇతన్ని పడవ ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకెళ్ళండి. వీడు తన ధర్మం నుండి మరలి పోతే సరి; లేకపోతే నడి సముద్రంలోకి విసరివేయండి” అని ఆజ్ఞాపించాడు. (రాజు ఆజ్ఞానుసారం) భటులు ఆ పిల్ల వాడిని తీసుకెళ్ళారు. అతను పడవలో కూర్చొని “దేవా! ఎలాగైనాసరే వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు రక్షణ కల్పించు” అని వేడుకున్నాడు. దాంతో పడవ తలక్రిందులయింది. తోడు వచ్చిన వారంతా మునిగిపోయారు.
తిరిగి ఆ పిల్లవాడు రాజు దగ్గరికి చేరు కున్నాడు. రాజు అతన్ని చూసి “వాళ్ళు ఏమైపోయారు?” అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు “వారికి ప్రతిగా అల్లాహ్ నాకు సహాయపడ్డాడు” అని జవాబిచ్చాడు. ఇంకా ఆ బాలుడు ఇలా అన్నాడు: “నేను చెప్పే పద్ధతి అనుసరించనంతవరకు నువ్వు నన్ను చంపలేవు.” ఆ పద్ధతి ఏమిటని రాజు అడిగాడు. అప్పుడు పిల్లవాడు చెప్పాడు : “ప్రజలందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో హాజరుపరచు. నన్ను ఉరికంబం ఎక్కించి నా అంబులపొది నుండి ఒక బాణం తీసుకో. అ తరువాత బాణాన్ని వింటి తంతువుపై వుంచి ఈ మాటలు (ఈ పిల్లవాని ప్రభువైన అల్లాహ్ నామముతో అని) చెప్పి బాణాన్ని నాపైకి ప్రయోగించు. అలా చేస్తే నువ్వు నన్ను చంపడంలో సఫలీకృతుడవుతావు.”
రాజు (పిల్లవాడు చెప్పినట్లే) ప్రజలందరినీ ఒక పెద్ద స్థలంలో సమీకరించాడు. ఉరితీయడం కోసం పిల్లవాడిని ఊరి కొయ్యల మీదకు ఎక్కించాడు. అతని అంబులపొది నుండి ఒక బాణం తీసి, దాన్ని వింటి తంతువుపై ఉంచి “బిస్మిల్లాహి రబ్బిల్ గులామి (ఈ పిల్ల వాని ప్రభువైన అల్లాహ్ నామముతో)” అంటూ బాణాన్ని వదలిపెట్టాడు. బాణం వచ్చి అ పిల్లవాని కణతకు తగిలింది. ఆ పిల్లవాడు కణతను పట్టుకొని నేలకొరి గాడు.
జరిగినది చూసిన ప్రజలంతా “మేము ఈ బాలుని ప్రభువును విశ్వసించాము” అని నినదించసాగారు. కొంతమంది రాజువద్దకు వెళ్ళి “ప్రభూ! ఇన్నాళ్ళు తమరు జరగకూడదని భీతిల్లినదే జరిగిపోయింది. మీరు భయపడిన విపత్తు వచ్చిపడింది. ప్రజలంతా అల్లాహ్‌ను విశ్వసిస్తున్నారు” అని రాజుకు వార్తనందజేశారు. అది విని రాజు వెంటనే తోవల ప్రక్కల్లో కందకాలు త్రవ్వమని ఆదేశించాడు. రాజు ఆదేశానుసారం కందకాలు త్రవ్వబడ్డాయి. వాటిలో మంటలు రగిలించారు. తాము విశ్వసించిన ధర్మాన్ని వదలని ప్రజలను అందులోకి విసరి వేయమని లేదా ఆ మంటల్లోకి దూకెయ్యమని వారితో చెప్పండని రాజు (తన భటులను) ఆజ్ఞాపించాడు. వారు (రాజాజ్ఞను శిరసావహించి) అలాగే చేశారు. (ఈ దారుణమారణ హోమం జరుగుతుండగా) ఒక స్త్రీ తన చేతుల్లో ఓ పసివాడిని మోసుకొని అక్కడికి వచ్చింది. అయితే మంటల్లో దూకటానికి తటపటాయిస్తుండగా ఆమె చేతు ల్లోని పసికందు “అమ్మా! సహనం వహించు. నిస్సందేహంగా నువ్వు సత్యంపై ఉన్నావు” అంటూ మంటల్లో దూకేయమని తల్లిని పురికొల్పాడు. (ముస్లిం)
ముఖ్యాంశాలు:
1.పై హదీసు ద్వారా కలిగే అతి ముఖ్యమైన గుణపాఠం ఏమిటంటే ధర్మావలంబనలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లను సహన స్థయిర్యాలతో ఎదుర్కోవాలి. అవసరమైతే ధర్మం కోసం ప్రాణాలర్చించడానికి కూడా వెనుకాడరాదు.
2. అల్లాహ్ ప్రియదాసుల (వలీల) మహిమలు వాస్తవమే. అల్లాహ్ తన వివేచనతో తన యిష్టప్రకారం వాటి అవసరాన్ని గుర్తిస్తే తన దాసుల ద్వారా వాటిని ఉనికిలోకి తెస్తాడు.
3. ఈ హదీసు ద్వారా ఖుర్‌ఆన్ యొక్క సత్యబోధనా ప్రశస్తి ఇనుమడిస్తోంది. రేయింబవళ్ళ తెరల మరుగునపడి కాలం చేత విస్మరించబడిన అతి ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్టు వివరించే దైవగ్రంథ హితబోధనామృతానికి ఇది అద్దం పడుతోంది.
4. హదీసు లేకుండా ఖురాన్‌ను వ్యాఖ్యానించడం, విశదీకరించడం సాధ్యం కాదు. హదీసులో కందకం వాళ్ళ గాధ వివరించబడనట్లయితే దివ్య ఖురాన్‌లో చెప్పబడిన ‘అస్‌హాబుల్ ఉఖ్‌దూద్‘ (కందకాలవాళ్ళ) వృత్తాంత వాస్తవికత ఏమిటో మనకు అర్ధం అయ్యేది కాదు. ఖురాన్ సూక్తుల్లోని ఈ సూక్ష్మతను, సమగ్రతను హదీసు విశదపరచింది.
5. ఇటువంటి గాధలు సత్య సందేశ ప్రధాతలకు స్ఫూర్తినీ, స్థయిర్యాన్నీ అందజేస్తాయి.
You must be logged in to post a comment.