[21:14 నిముషాలు]
హిజ్రత్ మదీనా, బద్ర్ యుద్ధం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [21:14 నిముషాలు]
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :
ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీన నుండి వచ్చి మజిలి చేసిన కొందరితో కలిసి వారిని అల్లాహ్ వైపు పిలిచారు. వారు ఆయన మాటలను శ్రద్ధగా విని, ఆయన్ను విశ్వసించి, అనుసరిస్తామని వారు ఏకీభవించారు. అయితే “ఒక ప్రవక్త రానున్నాడు, అతని ఆగమన కాలం సమీపించిందని” వారు ఇంతకు ముందే యూదులతో వినేవారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి ఇస్లాం బోధ చేశారో, యూదులు చెప్పే మాట గుర్తొచ్చి, ఆ ప్రవక్త ఈయనే అని తెలుసుకొని, ఈయన్ని విశ్వసించడంలో యూదులు మనకంటే ముందంజ వేయకూడదని వారు పరస్పరం అనుకొని తొందరగా విశ్వసించారు. వారు ఆరుగురు. ఆ తరువాత సంవత్సరం పన్నెండు మంది ప్రవక్తతో కలసి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకున్నారు. వారు తిరిగి మదీన వెళ్ళేటప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్అబ్ బిన్ ఉమైర్ (రదియల్లాహు అన్హు)ను వారితో పంపారు. అతను వారికి ఖుర్ఆన్ నేర్పాలని మరియు ఇస్లాం ధర్మాదేశాలు బోధించాలని. అతను అక్కడి సమాజంపై మంచి ప్రభావం వేయగలిగారు. అంటే మదీనవాసులు అతని ప్రచారం పట్ల ఆకర్షితులయ్యే విధంగా అతను అక్కడ ఉండి ఇస్లాం బోధించగలిగారు. ఒక సంవంత్సరం తర్వాత అతను మక్కా వచ్చేటప్పుడు తన వెంట 72 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిశారు. అల్లాహ్ ధర్మ సహాయానికి ఎల్లవేళల్లో సిద్ధమేనని వారు శపథం చేసి తిరిగి మదీన వెళ్ళిపోయారు.
కొత్త ప్రచారం కేంద్రం
మదీన పట్టణం ఇస్లాం మరియు ముస్లింలకు మంచి ఆశ్రయం, శాంతి స్థానంగా అయ్యింది. అక్కడికి మక్కా పీడిత ముస్లిముల హిజ్రత్[1] మొదలయ్యింది. ముస్లిములను హిజ్రత్ చేయనివ్వకూడదని ఖురైషు గట్టి పట్టు పట్టారు. హిజ్రత్ చేయబూనిన కొందరు ముస్లిములు నానా రకాల హింసా దౌర్జన్యాలకు గురయ్యారు. అందుకు ముస్లిములు రహస్యంగా హిజ్రత్ చేసేవారు. అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తతో అనుమతి కోరినప్పుడల్లా “తొందరపడకు, బహుశా అల్లాహ్ నీకొక ప్రయాణమిత్రుడు నొసంగవచ్చును” అని చెప్పేవారు. చివరికి చాలా మంది ముస్లిములు హిజ్రత్ చేశారు.
[1] హిజ్రత్ అంటే వలసపోవుట. అంటే తన స్వగ్రామంలో ఇస్లాం ధర్మ ప్రకారం జీవితం గడపడం కష్టతరమైతే, దాన్ని వదిలి వేరే ప్రాంతానికి ప్రయాణమగుట.
ముస్లిములు ఈ విధంగా హిజ్రత్ చేసి, మదీనలో వెళ్ళి స్థానం ఏర్పరుచుకుంటున్న విషయాన్ని చూసి ఖురైషులకు పిచ్చెక్కి పోయింది. అంతే కాదు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతిష్ట, ఆయన ప్రచారం దినదినానికి వృద్ధి చెందుతున్నది చూసి వారు భయం చెందారు. అందుకని వారందరూ కలసి సమాలోచన చేసి ప్రవక్తను హతమార్చాలని ఏకీభవించారు. అబూ జహల్ ఇలా చెప్పాడు: “మనం ప్రతి తెగ నుండి శక్తివంతుడైన ఒక యువకునికి కరవాలం ఇవ్వాలి. వారందరూ ముహమ్మదును ముట్టడించి, అందరు ఒకేసారి దాడి చేసి సంహరించాలి. అప్పుడు అతని హత్యానేరం అన్ని తెగలపై పడుతుంది. బనీ హాషిం అందరితో పగతీర్చుకొనుటకు సాహసించలేరు” అని పథకం వేశారు. వారి ఈ పథకం, దురాలోచన గురించి అల్లాహ్ ప్రవక్తకు తెలియ జేశాడు. అల్లాహ్ అనుమతిని అనుసరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు)తో హిజ్రత్ కొరకు సిద్ధమయ్యారు. అలీ (రదియల్లాహు అన్హు)ను పిలిచి, “ఈ రాత్రి నీవు నా పడకపై నిద్రించు, (నీకు ఏ నష్టమూ కలగదు). చూసే వారికి నేనే నిద్రిస్తున్నానన్న భ్రమ కలుగుతుంది” అని చెప్పారు.
అవిశ్వాసులు తమ పథకం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటిని చుట్టుముట్టారు. అలీ (రదియల్లాహు అన్హు)ను నిద్రిస్తున్నది చూసి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అని భ్రమపడ్డారు. ఆయన బైటికి వచ్చిన వెంటనే ఒకే దాడిలో హత్య చేయాలని ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. వారు ముట్టడించి కాపుకాస్తున్న వేళ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మధ్య నుండి వెళ్ళారు. వారి తలలపై మన్ను విసురుతూ అక్కడి నుండి వెళ్ళారు. అల్లాహ్ వారి చూపులను పట్టుకున్నాడు. ప్రవక్త వారి ముందు నుండి దాటింది వారు గ్రహించలేక పోయారు. అక్కడి నుండి ప్రవక్త అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) వద్దకెళ్ళి, ఇద్దరూ కలసి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న సౌర్ గుహలో దాగి పోయారు. అటు ఖురైషు శక్తిశాలి యువకులు తెల్లారే వరకు నిరీక్షిస్తునే ఉండిపోయారు. తెల్లారిన తర్వాత ప్రవక్త పడక నుండి అలీ (రదియల్లాహు అన్హు) లేచి, వీరి చేతిలో చిక్కాడు. ప్రవక్త గురించి అడిగారు. అలీ (రదియల్లాహు అన్హు) ఏమీ చెప్ప లేదు. అతన్ని పట్టి లాగారు, కొట్టారు, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది.
అప్పుడు ఖురైషులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వెతకడానికి అన్ని దిక్కులా అన్వేషీలను పంపారు. ఆయన్ని జీవనిర్జీవ ఏ స్థితిలో పట్టు కొచ్చినా, అతనికి 100 ఒంటెల బహుమానం అని ప్రకటించారు. కొందరు అన్వేషీలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన మిత్రుడు ఉన్న గుహ వద్దకు చేరుకున్నారు. వారిలో ఏ ఒక్కడైనా వంగి తన పాదాల్ని చూసుకున్నా, వారిద్దర్ని చూసేవాడు. అందుకు అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) (ప్రవక్త పట్ల) కంగారు పడ్డారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి ఇలా ధైర్యం చెప్పారు: “అబూ బక్ర్! ఏ ఇద్దరికి తోడుగా మూడోవాడు అల్లాహ్ ఉన్నాడో వారి గురించి నీకు రందేమిటి. దిగులు పడకు అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు“. వాస్తవంగా వారు ఆ ఇద్దరిని చూడలేదు కూడా.
మూడు రోజుల వరకు అదే గుహలో ఉండి, మదీనాకు బయలుదేరారు. దూర ప్రయాణం, మండే ఎండలో ప్రయాణం సాగుతూ రెండవ రోజు సాయంకాలం ఒక గుడారం నుండి వెళ్ళుచుండగా అక్కడ ఉమ్మె మఅబద్ పేరుగల స్త్రీ ఉండెను. నీ వద్ద తిను త్రాగటకు ఏమైనా ఉందా అని ఆమెతో అడిగారు. నా వద్ద ఏమీ లేదు. ఆ మూలన బలహీన మేక ఉంది. మందతో పాటు నడవలేకపోతుంది. దానిలో పేరుకు మాత్రం పాలు కూడా లేవు అని చెప్పింది. పిదప ఆమె అనుమతి మేరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ మేక వద్దకు వెళ్ళి దాని పొదుగును చెయితో తాకగానే అందులో పాలు వచ్చేశాయి. పెద్ద పాత్ర నిండ పాలు పితికారు. ఉమ్మె మఅబద్ మరీ ఆశ్చర్యంగా ఒక వైపు నిలుచుండి బిత్తర పోయింది. ఆ పాలు అందరూ కడుపు నిండా త్రాగారు. మరో సారి పాత్ర నిండా పితికి, ఉమ్మె మఅబద్ వద్ద వదిలి, ప్రయాణమయ్యారు.
మదీనవాసులు ప్రతీ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎదురు చూస్తూ మదీన బైటికి వచ్చేవారు. ప్రవక్త మదీనా చేరుకునే రోజు సంతోషంతో, స్వాగతం పలుకుతూ వచ్చారు. మదీన ప్రవేశంలో ఉన్న ఖుబాలో మజిలి చేశారు. అక్కడ నాలుగు రోజులున్నారు. మస్జిద్ ఖుబా పునాది పెట్టారు. ఇది ఇస్లాంలో మొట్టిమొదటి మస్జిద్. ఐదవ రోజు మదీన వైపు బయలుదేరారు. అన్సారులో అనేక మంది ప్రవక్త ఆతిథ్య భాగ్యం తనకే దక్కాలని చాలా ప్రయత్నం చేసేవారు. అందుకని ప్రవక్త ఒంటె కళ్ళాన్ని పట్టుకునేవారు. అయితే ప్రవక్త వారికి ధన్యావాదాలు తెలుపుతూ, వదలండి! దానికి అల్లాహ్ ఆజ్ఞ అయిన చోటనే కూర్చుంటుంది అని చెప్పే వారు. అది అల్లాహ్ ఆజ్ఞ అయిన చోట కూర్చుంది. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దిగలేదు. మళ్ళీ లేచీ కొంత దూరం నడిచింది. తిరిగి వచ్చి మొదటి ప్రాంతంలోనే కూర్చుంది. అప్పుడు ప్రవక్త దిగారు. అదే ప్రస్తుతం మస్జిదె నబవి ఉన్న చోటు. ప్రవక్త అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) వద్ద ఆతిథ్యం స్వీకరించారు.
అటు అలీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త వెళ్ళాక మూడు రోజులు మక్కాలో ఉండి, ఆ మధ్యలో ప్రవక్త వద్ద ఉన్న అమానతులు హక్కుదారులకు చెల్లించి మదీనకూ బయలు దేరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుబాలో ఉండగా అక్కడికి వచ్చి కలుసుకున్నాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో
ఒంటె కూర్చున్న స్థలాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని యజమానుల నుండి ఖరీదు చేసి అక్కడ మస్జిద్ నిర్మించారు. ముహాజిరీన్ మరియు అన్సారుల [2] మధ్య సోదర బాంధవ్యం ఏర్పరిచారు. ఒక్కో ముహాజిరును ఒక్కో అన్సారుతో కలిపి ఇతడు నీ సోదరుడు తన సొమ్ము లో కూడా నీ భాగమని తెలిపారు. ముహాజిరులు అన్సారులు కలసి పని చేసుకోవడం మొదలెట్టారు. వారి మధ్య సోదర బాంధవ్యం మరీ గట్టిపడింది.
[2]మదీనకు వలస వచ్చిన వారిని ముహాజిరీన్ అంటారు. వారి సహాయం చేసిన మదీన వాసులను అన్సార్ అంటారు.
మదీనాలో ఇస్లాం విస్తృతం కావడం మొదలయింది. కొందరు యూదులు ఇస్లాం స్వీకరించారు. వారిలో ఒకరు అబ్దుల్లాహ్ బిన్ సలాం (రదియల్లాహు అన్హు). ఇతను వారిలో ఒక పెద్ద పండితుడు. మరియు వారి పెద్ద నాయకుల్లో ఒకరు.
ముస్లిములు మక్కా నగరాన్ని వదలి వెళ్ళినప్పటికీ వారికి వ్యతిరేకంగా ముష్రికుల విరోధం, పోరాటం సమాప్తం కాలేదు. ఖురైషులకు మదీన యూదులతో ముందు నుండే సంబంధం ఉండెను. అయితే వారు దాన్ని ఉపయోగించి ముస్లిముల మధ్యగల ఐక్యతను భంగం కలిగించాలని, తృప్తిగా ఉండనివ్వకుండా మనోవ్యధకు గురి చేయాలని యూదులను ప్రేరేపించేవారు. అంతే కాదు, వారు స్వయంగా ముస్లిములను బెదిరిస్తూ, అంతమొందిస్తామని హెచ్చరించేవారు. ఈ విధంగా ముస్లిములకు ముప్పు ఇరువైపులా చుట్టుముట్టింది. అంటే మదీన లోపల ఉన్నవారితో మరియు బైటి నుండి ఖురైషులతో. సమస్య ఎంత గంభీరమైనదంటే సహాబాలు ఆయుధాలు తమ వెంట ఉంచుకొని రాత్రిళ్ళు గడిపేవారు. ఈ భయాందోళన సందర్భంలోనే అల్లాహ్ యుద్ధానికి అనుమతించాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గస్తీ దళాల్ని తయారు చేసి పంప సాగారు. వారు చుట్టు ప్రక్కల్లో శత్రువులపై దృష్టి ఉంచేవారు. ఒక్కోసారి వారి వ్యాపార బృందాలను అడ్డుకునేవారు. వీటి ఉద్దేశం: ముస్లిములు అశక్తులు కారు అని తెలియజేయుటకు, వారిపై ఒత్తిడి చేయుటకు, ఇలా వారు సంధికి దిగి వచ్చి, ముస్లిములు స్వేచ్ఛగా ఇస్లాంపై ఆచరిస్తూ, దాని ప్రచారం చేసుకోవడంలో వారు అడ్డు పడకూడదని. అలాగే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టుప్రక్కలో ఉన్న తెగలవారితో ఒప్పందం, ఒడంబడికలు కుదుర్చుకున్నారు.
బద్ర్ యుద్ధం
ముస్లిములు మక్కాలో ఉన్నప్పుడు ముష్రికులు వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి చివరికి తమ స్వస్థలాన్ని వదలి వలస వెళ్ళే స్థితికి తీసుకొచ్చారు (అన్న విషయం తెలిసినదే). అందువల్ల వారు తమ జన్మస్థలాన్ని, తమ ధనాన్ని మరియు తమవారిని వదలి మదీనా వచ్చారు. అప్పుడు ముష్రికులు వారి ధనాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు ఇటు మదీనా వాసులపై దొంగ దాడులు చేస్తూ తృప్తిగా ఉండకుండా చేయసాగారు.
అందుకే ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సీరియా నుండి వస్తున్న ఖురైషు వాణిజ్య బృందాన్ని అడ్డుకొని, వారిని అదుపులో మరియు భయంలో ఉంచాలని నిశ్చయించి, 313 మంది సహాబాలతో కలసి వెళ్ళారు. అప్పుడు వారి వద్ద రెండు గుర్రాలు, 70 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఖురైషు బృందంలో 1000 ఒంటెలున్నాయి. 40 మంది ఉన్నారు. అబూ సుఫ్యాన్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు. కాని మస్లిములు అడ్డుకునే విషయాన్ని అబూ సుఫ్యాన్ గ్రహించి, ఈ వార్త మక్కా పంపుతూ, వారితో సహాయం కోరాడు. అంతే కాదు, అతడు తన బృందంతో ప్రధాన రహదారిని వదిలేసి వేరే దొడ్డిదారి గుండా వెళ్ళిపోయాడు. ముస్లిములు వారిని పట్టుకోలేక పోయారు. అటు వార్త తెలిసిన మక్కా ఖురైషులు, 1000 యుద్ధవీరులతో పెద్ద సైన్యం తయారు చేసుకొని బయలుదేరారు. వీరు దారిలో ఉండగానే అబూ సుఫ్యాన్ రాయబారి వచ్చి, వాణిజ్య బృందం ముస్లిముల నుండి తప్పించుకొని, క్షేమంగా చేరుకోనుంది. మీరు తిరిగి మక్కా వచ్చేసెయ్యండి అని చెప్పాడు. కాని అబూ జహల్ నిరాకరించాడు. తిరిగి మక్కా పోవడానికి ఒప్పుకోలేదు. ప్రయాణం ముందుకు సాగిస్తూ బద్ర్ వైపు వెళ్ళాడు.
ఖురైషు సైన్యం బయలుదేరిన విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసిన తర్వాత తమ సహచరులతో సమాలోచన చేశారు. అందరూ అవిశ్వాసులతో పోరాడుటకు సిద్ధమేనని ఏకీభవించారు. రెండవ హిజ్ర శకం, రమజాను మాసములోని ఒక రోజు రెండు సైన్యాలు పోరాటానికి దిగాయి. ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ముస్లింలు విజయం పొందారు. వీరిలో 14 మంది సహాబాలు షహీదు (అమరవీరు) లయ్యారు. ముష్రికుల్లో 70 మంది వధించబడగా, మరో 70 మంది ఖైదీలయ్యారు.
ఈ యుద్ధ సందర్భంలోనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూతురు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) సతీమణి రుఖయ్యా (రదియల్లాహు అన్హా) మరణించారు. అందుకే ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఈ యుద్ధం లో పాల్గొన లేకపోయాడు. ప్రవక్త ఆదేశం మేరకు అతను తన అనారోగ్యంగా ఉన్న భార్య సేవలో మదీనలోనే ఉండిపోయాడు. ఈ యుద్ధం తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ రెండవ కూతురు ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) వివాహం ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో చేశారు. అందుకే అతను జిన్నూరైన్ అన్న బిరుదు పొందాడు. అంటే రెండు కాంతులు గలవాడు అని.
బద్ర్ యుద్ధంలో ముస్లిములు అల్లాహ్ సహాయంతో విజయం సాధించి, ముష్రికు ఖైదీలతో మరియు విజయధనంతో సంతోషంగా తిరిగి మదీన వచ్చారు. ఖైదీల్లో కొందరు పరిహారం చెల్లించి విడుదలయ్యారు. మరి కొందరు ఏ పరిహారం లేకుండానే విడుదలయ్యారు. ఇంకొందరి పరిహారం; ముస్లిం పిల్లవాళ్ళకు చదువు నేర్పడం నిర్ణయమయింది. వారు ఇలా విడుదలయ్యారు.
ఈ యుద్ధంలో ముష్రికుల పేరుగాంచిన నాయకులు, ఇస్లాం బద్దశత్రువులు హతమయ్యారు. వారిలో అబూ జహల్, ఉమయ్య బిన్ ఖల్ఫ్, ఉత్బా బిన్ రబీఆ మరియు షైబా బిన్ రబీఆ వైగారాలు.
సీరత్ ముందు పాఠాలు :
- సీరత్ పాఠాలు 1: శుభ జననం, ఏనుగుల సంఘటన [వీడియో]
https://teluguislam.net/2020/04/23/seerah-lessons-01/ - సీరత్ పాఠాలు 2: పోషణ,వ్యాపారం,వివాహం [వీడియో]
https://teluguislam.net/2020/05/10/seerah-lessons-02/ - సీరత్ పాఠాలు 3: ప్రవక్త పదవి, ప్రచారం [వీడియో]
https://teluguislam.net/2020/05/20/seerah-lessons-03/ - సీరత్ పాఠాలు 4: హబషాకు హిజ్రత్ (వలస), దుఃఖ సంవత్సరం [వీడియో]
https://teluguislam.net/2020/05/30/seerah-lessons-04/ - సీరత్ పాఠాలు 5: చంద్రుడు రెండు ముక్కలగుట, మేరాజ్ సంఘటన, తాయిఫ్ ప్రయాణం,మదీనావాసులు ఇస్లాం స్వీకరించుట [వీడియో]
https://teluguislam.net/2020/06/26/seerah-lessons-05/
ఇతరములు:
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్
మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు
“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్
You must be logged in to post a comment.