ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు (Prophet’s Miracles)
https://youtu.be/2su-OWOpcGo [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అనే అంశంపై ఈ ప్రసంగం సాగింది. ప్రవక్తలందరూ తమ ప్రవక్తృత్వానికి నిదర్శనంగా అల్లాహ్ యొక్క అనుమతితో కొన్ని మహిమలను చూపారని, వాటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మహిమలు ఎన్నెన్నో ఉన్నాయని వక్త వివరించారు. అన్నింటికన్నా గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథమని, అది ప్రళయం వరకు సజీవంగా ఉండే మహిమ అని తెలిపారు. చంద్రుడిని రెండుగా చీల్చడం, హుదైబియా వద్ద తన వేళ్ళ నుండి నీటిని ప్రవహింపజేసి 1500 మంది సహచరుల దాహాన్ని తీర్చడం, కందకం యుద్ధం సమయంలో కొద్దిపాటి ఆహారాన్ని వెయ్యి మందికి పైగా సరిపోయేలా చేయడం, ఒక చెట్టు మరియు తోడేలు ఆయన ప్రవక్తృత్వాన్ని సాక్ష్యమివ్వడం వంటి సంఘటనలను వివరించారు. ప్రవక్తలు చూపిన మహిమలు వారు దైవ ప్రవక్తలని రుజువు చేయడానికే గానీ, వారు దేవుళ్ళమని ప్రకటించుకోవడానికి కాదని, నేటి కాలంలోని దొంగ బాబాలు చేసే కనుగట్టు విద్యలకు, ప్రవక్తల మహిమలకు తేడాను గ్రహించాలని ఉద్భోదించారు.

స్తోత్రాలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ప్రవక్తలను, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి, ధర్మ ప్రచారము చేయించడానికి వివిధ సందర్భాలలో, వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ప్రజలు ఆ ప్రవక్తలతో కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా కొన్ని మహిమలను, అద్భుతాలను చూపించాడు.

ఆ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేసి చూపించిన కొన్ని మహిమల గురించి, కొన్ని సూచనల గురించి మనము ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.

మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన మహిమలు అనేకమైనవి ఉన్నాయి. ఆ మహిమలన్నింటిలో గొప్ప మహిమ, అన్నిటికంటే పెద్ద మహిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. ఇదేంటండీ? మహిమలంటే ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెబుతారంటే, ఇదేదో పుస్తకం గురించి మీరు చెబుతున్నారేంటి అని మీరు ఆశ్చర్యపోతారేమో.

అయితే అభిమాన సోదరులారా, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథం అని ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మహిమలు అవి అప్పటికప్పుడే కనిపించాయి, ఆ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఈ ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మహిమ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది అలాగే సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి మహిమలన్నింటిలో గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ గ్రంథము కంటే పూర్వము అనేక గ్రంథాలు ప్రపంచంలో వచ్చాయి. కానీ అవి ఏదీ కూడాను తన అసలు రూపంలో నిలబడలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథం అల్ హందులిల్లాహ్ అవతరించబడిన నాటి నుండి నేటి వరకు కూడా అది తన అసలు రూపంలోనే ఉంది, ప్రళయం వరకు కూడా అది అసలు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రంథాలన్నింటిలో సురక్షితమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖుర్ఆన్ గ్రంథము మాత్రమే. ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీసుకుని ఉన్నాడు కాబట్టి అది సురక్షితమైన గ్రంథము. కాబట్టి అది గొప్ప మహిమ అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ ఎంత గొప్ప మహిమ అంటే, ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము మీరు ఏదైనా రచించి తేగలరేమో తెచ్చి చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఖుర్ఆన్ పూర్తి గ్రంథము. అలాంటి పూర్తి గ్రంథము మీరు రచించలేకపోతున్నారా? పోనీ ఖుర్ఆన్ లో ఉన్న అధ్యాయాలలో నుంచి ఒక పది అధ్యాయాలు రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్లీ ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక పది సూరాలు మీరు రాసి చూపించండి అన్నాడు. పది సూరాలు వీలుపడదా? ఒక్క సూరా అయినా సరే మీరు రాసి చూపించగలరా ఖుర్ఆన్ లాంటిది అని అడిగాడు. ఒక్క సూరా కూడా మీరు రాయలేరా? పోనీ ఒక్క ఆయతు, ఒక్క వాక్యము, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాల లాంటి ఒక్క వాక్యము మీరు, జిన్నాతులు అందరూ కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరి ఇలాంటి ఒక్క వాక్యము రాయగలరేమో రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఛాలెంజ్ చేశాడు.

అభిమాన సోదరులారా, ఈ ఛాలెంజ్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రజలు ఖుర్ఆన్ లాంటి ఒక్క వాక్యము రాయలేకపోయారు. వారు ఎంత కష్టపడ్డా, రాత్రింబవళ్ళు ప్రయత్నించినా వారికి సాధ్యపడలేకపోయింది అభిమాన సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన సూచనలలో, మహిమలలో గొప్ప సూచన, గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని ఇందుకే చెప్పబడుచున్నది అభిమాన సోదరులారా.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ చూపించిన మరొక గొప్ప మహిమ, చంద్రుడు రెండు ముక్కలైపోవటం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో నివసిస్తున్న రోజుల్లో, మక్కాలోని పెద్దలు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, “నీవు దైవప్రవక్తవే అయితే ఒక సూచన చూపించు, ఒక మహిమ చూపించు” అని ప్రశ్నించారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేశారు, దుఆ చేశారు, “ఓ అల్లాహ్, మక్కా వాసులు నాతో సూచన అడుగుతున్నారు, మహిమ అడుగుతున్నారు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా చూపించాడు, “ఓ దైవప్రవక్తా, చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోవుచున్నాడు.”

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రజలకు ఆ పెద్ద మహిమ చూపించారు, “చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోతున్నాడు” అని. మక్కా ప్రజలు కళ్ళారా చూశారు, చంద్రుడు రెండు ముక్కలైపోయి హిరా పర్వతం కుడి వైపున ఒక భాగము, హిరా పర్వతము ఎడమ వైపున మరొక భాగము, రెండు భాగాలుగా విడిపోయాడు. అభిమాన సోదరులారా, ఇంత పెద్ద అద్భుతము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. దీని ప్రస్తావన ఖుర్ఆన్ గ్రంథంలో సూరా ఖమర్ ఒకటవ వాక్యం నుండి ఐదవ వాక్యం వరకు మీకు లభిస్తుంది. అలాగే ముస్లిం గ్రంథంలో కూడా దీని ప్రస్తావన మీకు దొరుకుతుంది.

చంద్రుడు రెండు ముక్కలైపోవటం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తీసుకుని ఉమ్రా చేయటానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. హుదైబియా అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వచ్చిన సహాబాల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. త్రాగటానికి కూడా నీళ్ళు లేవు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక చిన్న పాత్ర ఉంటే, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆ పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్ళ నుండి వుజూ చేయటం ప్రారంభించారు. వెంటనే సహాబాలందరూ అక్కడ ప్రోగైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “ఏంటండీ, మీరందరూ ఇక్కడికి వచ్చేశారు? ఏంటి విషయము?” అంటే అప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, మనము ఇంచుమించు 1500 మంది మనం ఉన్నాం ఇక్కడ. ఎవరి వద్ద కూడా నీళ్ళు లేవండి, త్రాగడానికి కూడా నీళ్ళు లేవండి. కేవలం మీ దగ్గర ఉన్న ఆ పాత్రలో నీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా మీరు వుజూ చేసేస్తున్నారు కదా, మనకు వుజూ చేసుకోవడానికి గానీ, త్రాగడానికి గానీ, వంట చేసుకోవడానికి గానీ మా దగ్గర అస్సలు నీళ్ళే లేవండి” అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించగా, అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ ను ప్రార్థించి, తమ చేతులను ఆ పాత్రలో పెట్టగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహం ఉబికింది. ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అక్కడ ఉన్న 1500 మంది సహాబాలు అందరూ ఆ నీళ్ళతో వుజూ చేసుకున్నారు, వారి వద్ద ఉన్న పాత్రలన్నింటినీ నీళ్ళతో నింపుకున్నారు. అల్లాహు అక్బర్. ఇంత పెద్ద మహిమ అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చూపించాడు.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఒక బద్దూ వ్యక్తి కనిపించాడు. ఒక పల్లెటూరు వాసి అని మనం మన భాషలో చెప్పుకుంటాం కదండీ. అలాంటి ఒక పల్లెటూరు వాసి కనిపించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని దగ్గరకు వెళ్లి, “అయ్యా, అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్తను అని నీవు సాక్ష్యం పలకవయ్యా” అని చెప్పారు. అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నువ్వు సాక్ష్యం పలకవయ్యా అని ఆ పల్లెటూరు వాసితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తే, అతను ఏమన్నాడంటే, “నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే సాక్ష్య వచనం, కల్మా పఠించాలంటే, నేను కాకుండా ఎవరైనా ఈ కలిమాను సాక్ష్యం పలికే వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి నుండైనా మీరు నా ముందర సాక్ష్యం పలికించి చూపిస్తారా?” అని అతను మళ్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు.

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు వైపు సైగ చూపి, ఏమన్నారంటే, “చూడయ్యా, ఈ చెట్టు కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలుకుతుంది, చూపించనా?” అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ చెట్టుకి పురమాయించగా, ఆ చెట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
“అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని మూడు సార్లు సాక్ష్యం పలికి, అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ తన స్థానంలో వెళ్లి నిలబడిపోయింది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే అతను కూడా,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)

అని అతను కూడా సాక్ష్యం పలికాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక సూచన, మరొక మహిమ.

అభిమాన సోదరులారా, అలాగే మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ చూపించిన మరొక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కరువు ఏర్పడింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆకలి దప్పులతో గడుపుతున్న రోజుల్లో మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనాకు వెళ్లి హతమార్చాలని, ఆయనను అక్కడి నుంచి కూడా తరిమివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కా వాసుల్ని మదీనా లోపలికి రానియ్యకుండా అడ్డుకోవటానికి కందకం తవ్వాలని నిర్ణయించారు.

ఆ కందకం త్రవ్వేటప్పుడు, కరువు వల్ల సమయానికి అన్నము, నీళ్ళు దొరకని కారణంగా ఆకలి దప్పికలతో ప్రవక్త వారు మరియు సహాబాలు అందరూ కష్టపడుతున్నారు, ఆ గుంత, ఆ కందకము తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బలహీనపడిపోయారు, సహాబాలు కూడా బలహీనపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితిని చూసి ఒక సహాబీ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆవిడతో అన్నాడు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజుల నుండి అన్నం తినని కారణంగా బలహీనులైపోయారు. కాబట్టి, మన ఇంట్లో ఏమైనా ఉంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆహారం ఏర్పాటు చేద్దాము, ఏమైనా ఉందా చూడు” అంటే, ఆవిడ వెళ్లి వెతకగా ఒక ‘సా’ గింజలు కనిపించాయి. ఒక ‘సా’ అంటే ఇంచుమించు, రెండున్నర కేజీలు గింజలు కనిపించాయి.

అవి తీసుకొని వచ్చి ఆవిడ ఏమందంటే, “చూడండి, ఈ ధాన్యము రెండున్నర కేజీలు మాత్రమే ఉంది. దీనిని నేను పిండిగా మార్చేస్తాను. ఆ తర్వాత మన ఇంట్లో ఒక మేక పిల్ల ఉంది, దాన్ని జబా చేయండి, ఇన్షా అల్లాహ్ దానితో నేను కూర వండుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త వారితో ఒక కొద్ది మంది, ఐదు లేదా పది మంది వస్తే గనక ఇన్షా అల్లాహ్ వారందరికీ మనము ఈ పిండి ద్వారా, ఈ మాంసము ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలము, భోజనం ఏర్పాటు చేయగలము. మీరు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక పది మందిని కూడా రమ్మని చెప్పండి, ఆహ్వానించండి” అని ఆ సహాబీ వాళ్ళ ఆవిడ చెప్పింది.

ఆ సహాబీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లి, పక్కకు పిలిచి, “ఓ దైవ ప్రవక్త, ఈరోజు మా ఇంట్లో మీకు ఆహారం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఒక పది మందిని తీసుకుని మా ఇంటికి ఆహారానికి, భోజనానికి రండి” అని ఆహ్వానించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అక్కడ కందకం తవ్వుతున్న సహాబాలు అందరినీ, “ఏవండీ, ఫలానా సహాబీ వారి ఇంటిలో మనకు ఈరోజు భోజన ఏర్పాటు ఉంది, కాబట్టి అందరూ నా వెంట రండి వెళ్దాం” అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చేశారు. అల్లాహు అక్బర్. వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్కడ కందకం తవ్వుతున్న వారి సంఖ్య వెయ్యి కంటే ఎక్కువగా ఉంది. అంత మందిని కూడా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు.

అది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. అదేంటండీ, నేను ఏదో పది మందిని తీసుకుని రమ్మంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకంగా వెయ్యి కంటే ఎక్కువ మందిని తీసుకుని వచ్చేస్తున్నారు. అంత మందికి నేను భోజన ఏర్పాటు ఎలా చేయగలను? నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆయన కంగారు పడుతుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అన్నారు, ఆ సహాబితో అన్నారు, “ఏమయ్యా, మీ ఇంటిలో పొయ్యి మీద ఉన్న ఆ పాత్రను అలాగే ఉంచమని చెప్పండి మీ ఆవిడతో. అలాగే, మీ ఆవిడ ఆ గింజల్ని పిండి లాగా రుబ్బుతోంది కదా, ఇప్పుడనే రొట్టెలు తయారు చేయవద్దు, అలాగే ఉంచమని చెప్పండి నేను వచ్చేవరకు కూడా” అని చెప్పి పంపించారు.

ఆ సహాబీ వెళ్లి వాళ్ళ ఆవిడతో, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మందిని తీసుకుని వస్తున్నారు, కాకపోతే ఆ పొయ్యి మీద ఉన్న పాత్రను దింపవద్దని చెప్పారు, రొట్టెలు ఇప్పుడనే వంట చేయవద్దని చెప్పారు, ఆయన వచ్చేవరకు ఆగాలంట” అని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేవరకు వాళ్ళ ఆవిడ ఆగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఇంట్లోకి ప్రవేశించి అల్లాహ్ పేరు తలచుకుని ‘బిస్మిల్లాహ్’ అని ఆ కూర వండుతున్న పాత్రలో వేలు పెట్టి ఇలా తిప్పారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ పిండి ఉందో అక్కడ కూడా వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ పిండిలో చెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఆ సహాబీ వాళ్ళ భార్యతో ఏమన్నారంటే, “రొట్టెలు తయారు చేయడానికి నీకు ఒక్కరితోనే సరిపోదు కాబట్టి మరొక మహిళను కూడా పిలిపించుకో” అన్నారు. ఆవిడ పక్కింటి ఒక ఆవిడని కూడా పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిండిని ఆ ఇద్దరు మహిళలు తీసుకుని రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహాబీ ఆ పాత్రలో ఉన్న ఆ కూర కొంచెం కొంచెము తీసి ఆ అక్కడ ఉన్న సహాబాలు అందరికీ వడ్డిస్తున్నారు. ఆ సహాబీ చెబుతున్నారు, అక్కడ ఉన్న వెయ్యి మంది కూడా ఆ రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని ఆ మాంసము కూర ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని పూర్తి వెయ్యి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు, కడుపునిండా భుజించారు. అయినాగానీ పిండి అలాగే మిగిలిపోయింది, కూర కూడా ఆ పాత్ర నిండా అలాగే మిగిలి ఉంది. అల్లాహు అక్బర్.

అంటే పది మంది తినే ఆహారాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంతలో ఎంతటి శుభం కల్పించాడంటే, ఎంతటి బర్కత్ ఇచ్చాడంటే వెయ్యి కంటే ఎక్కువ మంది అల్లాహ్ దయవల్ల అక్కడ భోజనం చేశారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే ఒకసారి మదీనా ఇరుపక్కల కొంతమంది యూదులు ఉండేవారు ఆ రోజుల్లో. ఒక యూదుడు గొర్రెలు మేపటానికి గొర్రెలను తోలుకొని వెళితే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెను కాపాడుకోవడానికి ఆ తోడేలును వెంబడించాడు, వెంబడించి వెంబడించి వెంబడించి చివరికి ఆ గొర్రెను ఆ తోడేలు నుండి కాపాడుకుని తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ తోడేలు కూర్చుని ఆ యూదునితో మాట్లాడుతా ఉంది. “ఏంటయ్యా, అల్లాహ్ నాకు ఇచ్చిన ఆహారాన్ని నా నోటి వద్ద నుండి నువ్వు లాక్కుని వెళ్ళిపోతున్నావే” అంది. అతను ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటండీ? జంతువు ఏకంగా మనిషితోనే మాట్లాడటం ప్రారంభించేసింది అని ఆ జంతువుతో అతను అడుగుతుంటే అప్పుడు ఆ తోడేలు ఆ వ్యక్తితో అంటూ ఉంది, “దీనికంటే ఒక మరొక్క గొప్ప విషయం నేను నీకు చెప్పనా? మదీనాలో ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతను జరిగిన విషయాలు కూడా చెబుతుంటాడు, అలాగే జరగబోయే విషయాలు కూడా చెబుతున్నాడు. నువ్వు వెళ్లి అతనితో కలుసు” అంది.

ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ యూదుడు గొర్రెలు ఇంటికి తోలుకొని వచ్చేసి, ఇండ్లల్లో ఆ గొర్రెలు వదిలేసి తిన్నగా మదీనాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం, సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తోడేలు చెప్పింది నిజమే, నేనే ఆ ప్రవక్తను అని చెప్పగా, వెంటనే ఆ యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు అభిమాన సోదరులారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక మహిమ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని ఒక జంతువు కూడా సాక్ష్యమిచ్చింది.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరికొన్ని మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలి నుండి చాలా మందికి స్వస్థత లభించింది. మనమంతా వినే ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసే సందర్భంలో సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవేశించారు. ఆ గుహను శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న రంధ్రాలన్నింటినీ బట్టతో కప్పేయగా ఒక రంధ్రం మిగిలిపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు తమ కాలుని ఆ రంధ్రం పైన పెట్టేసి ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి ప్రవేశించమని చెబితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి ప్రవేశించారు, ఆ తర్వాత అబూబకర్, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి తొడ మీద తల పెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలుకి కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కన్నీరు కారిస్తే, ఒక చుక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్ళు తెరిచి, “ఎందుకు ఏడుస్తున్నావు అబూబకర్?” అంటే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కాలు చూపించి, “ఏదో విషపురుగు నాకు కాటేసింది” అని చెప్పగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని తీసి అక్కడ పూయగానే విషం మొత్తం తగ్గిపోయింది. చూశారా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మి నుండి విషము నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత కల్పించాడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి గారికి.

అలాగే ఖైబర్ ప్రదేశంలో కూడా అలీ రజియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవగా, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి చేరితే, అప్పటికే అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళలో సమస్య ఏర్పడి కళ్ళు బాగా ఎర్రబడిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఉమ్మిని తీసి అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళల్లో పూయగా, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారికి ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయనకు కూడా స్వస్థత లభించింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత పెట్టాడు. ఇది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరొక మహిమ.

ఇలాగే అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి వారికి లభించక పూర్వమే మక్కాలో తిరుగుతూ ఉంటే, రాళ్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, చెట్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, గుట్టలు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మహిమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనేవారు, “నేను బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాను, నాకు ప్రవక్త పదవి లభించక పూర్వమే మక్కాలో ఫలానా రాయి నాకు సలాం చెబుతా ఉండింది, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఉంది” అని దైవ ప్రవక్త చెప్పేవారు.

అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో పినతండ్రి అబూ తాలిబ్ గారితో సిరియా దేశానికి వర్తకం కోసము ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక క్రైస్తవ పండితుడు వచ్చి సాక్ష్యమిచ్చాడు ఏమంటే, “ఈ బాలుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వేలు చూపించి, ఏమన్నాడంటే, ఈ బాలుడు నడుచుకుని వస్తూ ఉంటే దారిలో కనిపించిన రాయి, దారిలో కనిపించిన చెట్టు వంగి ఇతనికి సలాము చెబుతా ఉంది. కాబట్టి ఇతను పెద్దవాడైన తర్వాత కారుణ్య మూర్తి, రహ్మతుల్లిల్ ఆలమీన్ అవుతాడు” అని ఆరోజే ఆయన సాక్ష్యం పలికాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనం దృష్టి పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ప్రవక్తలు వారు దైవ సందేశహరులు అని ప్రపంచానికి రుజువు చూపించటానికి కొన్ని మహిమలు చూపించారు. ఆ మహిమలు చూపించి మేము కేవలం దైవ సందేశహరులము అని చెప్పుకున్నారు గానీ, మహిమలు చూపించి మేమే దేవుళ్ళము లేదా దేవునిలోని భాగము లేదా దేవుని అవతారము అని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకటించుకోలేదు. అయితే ఈ రోజుల్లో ఎవడైతే కొన్ని కిటుకులు, కొన్ని కనుగట్టులు చూపించి ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, నా వద్ద మహిమలు ఉన్నాయి, నేనే దేవుణ్ణి లేదంటే నేనే దేవుని స్వరూపాన్ని, లేదంటే నేనే దేవుని అవతారాన్ని అని ప్రకటిస్తుంటున్నాడంటే అతను అబద్ధం పలుకుతున్నాడు అని మనము గ్రహించాలి.

ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మహిమలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు గానీ, ఇలాంటి దొంగ బాబాలకు ఆయన ఇవ్వలేదు. ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ప్రకటిస్తున్నాడంటే వాడు దొంగ బాబా అని మనం గుర్తించాలి అభిమాన సోదరులారా.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, మనము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలను ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

ఆఖూలు ఖవ్ లీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16753

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah)
https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.

ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.

మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا
ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.

అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.

అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.

అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ
అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.

అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:

الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.

ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.

ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.

అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.

అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.

మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.

ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.

అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:

قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో

అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:

قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.

అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.

అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
(హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్)
మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.

అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:

يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ
(యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్)
ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.

ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.

అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.

ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.

ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.

అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.

ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.

మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

అఖూలు ఖౌలీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16739

ఇతర లింకులు:

సూరయే ఫాతిహా సంక్షిప్త సారాంశం [వీడియో & టెక్స్ట్]

సూరయే ఫాతిహా సంక్షిప్త సారాంశం
https://www.youtube.com/watch?v=UsTrHy6arh8 [12 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్‌లోని మొదటి అధ్యాయం, సూరతుల్ ఫాతిహా యొక్క ప్రాముఖ్యత మరియు అర్థాన్ని వివరిస్తారు. ఏ పనినైనా అల్లాహ్ పేరుతో (బిస్మిల్లాహ్) ప్రారంభించాలని, ఇది ఖురాన్ అపార కరుణామయుడైన అల్లాహ్ నుండి వచ్చిన గ్రంథమని గుర్తుచేస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ఖురాన్ యొక్క నిర్మాణం, 114 సూరాలు మరియు 30 పారాలుగా విభజించబడిందని వివరించారు. సూరతుల్ ఫాతిహా, ఖురాన్ సారాంశంగా పరిగణించబడుతుందని, మూడు ప్రధాన భాగాలుగా విభజించబడిందని తెలిపారు. మొదటి భాగం అల్లాహ్ యొక్క లక్షణాలైన రబ్ (ప్రభువు), అర్-రహ్మాన్ (కరుణామయుడు), అర్-రహీమ్ (కృపాశీలుడు), మరియు మాలిక్ (అధిపతి)ని స్మరిస్తూ ఆయనను స్తుతించడం. రెండవ భాగం, అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం మరియు ఆయన సహాయాన్నే అభ్యర్థించడం గురించి చెబుతుంది. మూడవ భాగం, రుజుమార్గం (సన్మార్గం) కోసం చేసే ప్రార్థన, అంటే ప్రవక్తలు, సత్యవంతులు మరియు పుణ్యాత్ముల మార్గం, అల్లాహ్ ఆగ్రహానికి గురైనవారి (యూదులు) మరియు మార్గభ్రష్టులైనవారి (క్రైస్తవులు) మార్గం కాదని స్పష్టం చేస్తుంది. వక్త, జ్ఞానం ఉండి ఆచరించకపోవడం మరియు జ్ఞానం లేకుండా ఆరాధించడం రెండూ ప్రమాదకరమని హెచ్చరించారు.

ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో మనం ఆరంభం చేస్తున్నాము. ముందు ఇక్కడ మనం సూరతుల్ ఫాతిహా. ఖురాన్ ఆరంభం అనేది బిస్మిల్లాహ్ నుండి ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే బిస్మిల్లాహ్ అన్న పదం ఖురాన్ యొక్క ఆరంభంలో ఏదైతే వచ్చిందో దీని గురించి ధర్మ పండితులు చెప్పిన విషయాలు అందులో సంక్షిప్తంగా రెండు విషయాలు ఏమిటంటే, ఒకటి, మనం ఏ కార్యం మొదలు పెట్టినా గాని అల్లాహ్ యొక్క శుభ నామంతో మొదలు పెట్టాలి.

రెండవది, “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం” అని ఖురాన్ ఆరంభం ఏదైతే జరుగుతుందో, ఇందులో ఒక గొప్ప సూచన ఏముందంటే ఈ దివ్య గ్రంథం అల్లాహ్ వైపు నుండి ఉంది. ఎలాంటి అల్లాహ్? సర్వసామాన్యంగా పూర్తి సృష్టికి, ప్రత్యేకంగా మానవుల పట్ల ఎంతో కరుణతో మెలిగేవాడు. వారిపై దయ దాక్షిణ్యాలు చూపేవాడు. వారి యొక్క మంచి కొరకే ఈ ధర్మ గ్రంథం అవతరింపజేశారు.

సోదర మహాశయులారా, దివ్యగ్రంథం ఖురాన్ లో 114 సూరాలు ఉన్నాయి. మొదటి సూరా ఇది సూరె ఫాతిహా మరియు చివరి సూరా సూరతున్నాస్.

ఇందులో ప్రజలు కంఠస్థం చేసుకోవడానికి, ప్రజలు గుర్తుంచుకోవడానికి 30 కాండాలలో, సామాన్యంగా పారా లేదా జుజ్ అని అనబడడం జరుగుతుంది. పారా అని ఉర్దూలో మరియు జుజ్ అని అరబీలో చెప్పడం జరుగుతుంది. 30 పారాల్లో దీనిని విభజించడం జరిగింది. ఇది పారాయణం, తిలావత్ కొరకు సులభతరంగా ఉండడానికి. మళ్ళీ పారాలో కూడా కొన్ని భాగాలు చేయబడ్డాయి. అయితే ఈనాటి నుండి మనం ప్రతి రోజు ఒక పారా సారాంశాన్ని వినబోతున్నాము.

సూరతుల్ ఫాతిహా యొక్క ఘనత

మొట్టమొదటి సూరా సూరె ఫాతిహా. దీని గురించి స్వయంగా ఖురాన్లో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో వచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఖురాన్ యొక్క మొట్టమొదటి సూరా ఆరంభ పరంగా, ఖురాన్ ఇప్పుడు ఉన్నటువంటి క్రమం పరంగా సూరె ఫాతిహా. మరియు అంతేకాదు, ఖురాన్ లోని 114 సూరాలలో أعظم سورة అతి గొప్ప సూరా, అతి ఘనత గల సూరా సూరతుల్ ఫాతిహా. అంతేకాదు ఈ సూరె ఫాతిహా, దీనిని ఖురాన్ యొక్క సారాంశం అని కూడా అనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉర్దూలో మా ఛానల్ లో ఒక వీడియో కూడా ఉంది. దాన్ని కూడా ఉర్దూ తెలిసిన వారు చూడవచ్చు. అందులో చాల వివరాలు ఉన్నాయి.

అయితే సూరతుల్ ఫాతిహాలో మనం గమనిస్తే, చదువుతే శ్రద్ధగా, ఇందులో మనకు మూడు భాగాలు కనబడతాయి.

ఒకటి, (అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మా నిర్రహీం, మాలికి యౌమిద్దీన్) ఇక్కడి వరకు.
రెండవ భాగం, (ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మూడో భాగం, “ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం” నుండి చివరి వరకు.

సూరతుల్ ఫాతిహా – మొదటి భాగం: అల్లాహ్ స్తుతి

ఈ మొదటి భాగంలో మనకు తెలుపబడిన గొప్ప విషయం ఏంటంటే, ఓ మానవుడా, నీవు నీపై ఎవరైనా ఉపకారం చేశారు గనుక నీవు అతన్ని స్తుతించదలుచుకుంటే, రబ్బిల్ ఆలమీన్ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ ఆయన యొక్క కృపలు, కరుణలు, దయ, అనుగ్రహాల కంటే ఎక్కువగా ఇంకా వేరే ఎవరి అనుగ్రహాలు లేవు. అందుకొరకు నీవు అల్లాహ్ ను స్తుతించు.

ఓ మానవుడా, నీవు ఎవరి పట్లనైనా ఒక ఆశతో చూస్తున్నావు, అతని వైపు నుండి నీకు ఏదైనా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నావు, అర్రహ్మా నిర్రహీం అతి గొప్ప కరుణామయుడు, కృపాశీలుడు అల్లాహ్ మాత్రమే గనుక నీవు అతన్ని స్తుతించు.

ఒకవేళ నీవు ఎవరితోనైనా భయపడి స్తుతించదలుస్తే, మాలికి యౌమిద్దీన్ ప్రళయ దినానికి ఏకైక యజమాని కేవలం అల్లాహ్ మాత్రమే. అతని యొక్క భయం ఎంతగా మనలో ఉండాలంటే, అంతకంటే ఎక్కువ భయం ఇంకా ఎవరిది కూడా ఉండజాలదు. అలాంటి అల్లాహ్ కు నీవు నీ స్తుతులు, పొగడ్తలన్నీ కూడా చెల్లిస్తూ ఉండు.

మరో రకంగా మనం ఆలోచిస్తే మనమందరం దాసులం, అల్లాహ్ మన యజమాని. మనం అల్లాహ్ యొక్క ఆరాధన ఎల్లవేళల్లో మరియు ఆరాధన అన్న పదం విన్నప్పుడు కేవలం నమాజ్ ఒక్క విషయాన్ని మనసులో తీసుకురాకండి. ఆరాధన అని అన్నప్పుడు ప్రత్యేకంగా అల్లాహ్ ను ఆరాధించే విషయంలో అది మనసు సంబంధమైన ఆరాధన అయినా, నాలుక సంబంధమైన ఆరాధన అయినా, అవయవాలకు సంబంధమైన ఆరాధన అయినా ఇవి వస్తాయి. అలాగే హుఖూఖుల్లాహ్ (అల్లాహ్ హక్కులు ) కు సంబంధించినవి వస్తాయి, హుఖూఖుల్ ఇబాద్ కు సంబంధించినవి కూడా వస్తాయి.

ఈ ఆరాధనలన్నీ కూడా మనం ఆరాధించేటప్పుడు, చేసేటప్పుడు మనలో నాలుగు విషయాలు ఉండాలి. మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. అల్లాహ్ ను మనం సంపూర్ణ ప్రేమతో, సంపూర్ణ ఆశతో, సంపూర్ణ భయంతో ఆరాధించాలి మరియు వినయ వినమ్రతతో. అల్లాహ్ యొక్క ఆరాధన సంపూర్ణ భయం మరియు ఆశ, సంపూర్ణ ప్రేమ మరియు ఆశ భయం.

ఈ మూడిటికి ధర్మపండితులు, ధర్మపండితులు ఒక పక్షి మాదిరిగా కూడా ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. ఎలాగైతే ఒక పక్షి ఎలాగైతే ఒక పక్షి రెండు రెక్కలు లేకుండా, తల లేకుండా ఎగరదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా గాని అది బ్రతకదు, ఎగరదు. అలాగే ఈ మూడింటిలో ఏ ఒక్క విషయం తగ్గిపోయినా గాని మన యొక్క ఆరాధన, మనం అల్లాహ్ ను ఆరాధించే విషయంలో చాల లోపం కలుగుతుంది.

సూరతుల్ ఫాతిహా – రెండవ భాగం: అల్లాహ్ తో నిబంధన

ఆ తర్వాత చెప్పడం జరిగింది.

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. (1:5)

ఓ అల్లాహ్ మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ యొక్క సహాయమే కోరుతున్నాము. మనకు మరియు అల్లాహ్ కు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని, అంతేకాదు అల్లాహ్ యొక్క ఆరాధన మనం అల్లాహ్ యొక్క సహాయం లేనిది చేయలేము అన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరుగుతుంది.

సూరతుల్ ఫాతిహా – మూడవ భాగం: సన్మార్గం కోసం ప్రార్థన

మూడవ విషయం. ఇహలోకంలో మన కొరకు అత్యంత గొప్ప అనుగ్రహం ఏదైనా ఉంది అంటే అల్లాహ్ కు ఇష్టమైన మార్గం మన కొరకు ప్రాప్తించబడడం. అదే విషయం ఇందులో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం ఒక్క రోజులో 17 సార్ల కంటే ఎక్కువగా అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాము. అల్లాహ్ మాకు సన్మార్గం చూపించు అని.

అయితే సోదర మహాశయులారా, అల్లాహ్ మనకు సన్మార్గం ఏదైతే చూపుతాడో దాని యొక్క ఇక్కడ చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటి? అల్లాహ్ ను ఆరాధించి అల్లాహ్ యొక్క మార్గంపై నడిచి ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందారో, ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు మరియు పుణ్యాత్ములు అలాంటి వారి మార్గం మాకు ప్రసాదించు అల్లాహ్.

మరి ఎవరైతే, మరి ఎవరైతే నీ ఆగ్రహానికి గురి అయి సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో పడ్డారో అలాంటి వారి మార్గం వద్దు. అంటే ఎవరు? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, హదీసుల ఆధారంగా

الْمَغْضُوبِ
(అల్ మగ్జూబ్)
ఆగ్రహానికి గురైన వారు

ఎవరిపై అయితే ఆగ్రహం కురిసిందో వారెవరు? వారు వాస్తవానికి యూదులు. మరియు

الضَّالِّينَ
(వజ్జాలీన్)
మార్గభ్రష్టులు

క్రైస్తవులు అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇక్కడ కారణం గమనించండి, సంతోషపడే విషయం కాదు. ఒకరిని దూషించే విషయం కాదు అంతకు.

ఎవరికైతే ధర్మ జ్ఞానం లభించినదో మరియు వారు ఆ ధర్మ జ్ఞానాన్ని ఆచరించడం లేదో వారిపై అల్లాహ్ యొక్క ఆగ్రహం కురుస్తుంది. మరియు ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించాలి అన్నటువంటి తపన కలిగి ఉంటారు కానీ ధర్మ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరో, అందువల్ల వారు చేసే వారి కృషి అంతా కూడా సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో పడిపోతుంది, నష్టంలో వారు పడిపోతారు. అందుకొరకు వారిని జ్జాలీన్ అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో కూడా మనం ఒకవేళ ధర్మ అవగాహన కలిగి సరియైన రీతిలో ఆచరించకుంటే యూదులతో సమానమైపోతాము అన్నటువంటి హెచ్చరిక ఉంది.

అల్లాహ్ ను ఆరాధించాలి అన్నటువంటి కాంక్ష ఉంది, తపన ఉంది. కానీ విద్య నేర్చుకోవడం లేదు. ధర్మం నేర్చుకోకుండా దూరమైపోతున్నాము. ధర్మవేత్తలకు దూరం ఉంటున్నాము. నాకు తెలిసిపోయింది అని, నేను ఖురాన్ చదువుకుంటాను, వేరే వారితో నేర్చుకునేది ఏమున్నది? నేను అరబీ గ్రామర్ నేర్చుకున్నాను, ఖురాన్ నాకు డైరెక్ట్ గా అర్థమవుతుంది అన్నటువంటి భ్రమలో పడి ధర్మవేత్తలకు, సన్మార్గంపై ఉన్నటువంటి పుణ్య పురుషులకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిజమైన అనుచరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి దూరంగా ఉండి మనకు మనం ధర్మానికి దూరం ఏదైతే చేసుకుంటున్నామో, వాస్తవానికి ఇది కూడా మనల్ని మార్గభ్రష్టత్వంలో పడవేస్తుంది.

చివరి ఒక మాట దీని గురించి చెప్పేది ఏమిటంటే, సూరతుల్ ఫాతిహా ఇందులో మనం అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ముందు అల్లాహ్ ను స్తుతించాలి, ఆ తర్వాత మన అవసరాన్ని పెట్టాలి. అయితే ఈ మధ్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కూడా దరూద్ చదువుతూ ఉండాలి.

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం – అహ్సనుల్ బయాన్ నుండి
https://teluguislam.net/?p=8142

ఖుర్’ఆన్ – మెయిన్ పేజీ
https://teluguislam.net/quran/

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు [వీడియో & టెక్స్ట్]

ధర్మపరమైన నిషేధాలు – 39
అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు
https://youtu.be/HzdBTTa3fGc [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ఈ భాగంలో, అల్లాహ్ యొక్క ఆయతులను (వచనాలను) ఎగతాళి చేసే వ్యక్తులతో కూర్చోవడం చేయడం నిషేధించబడిన విషయం గురించి చర్చించబడింది. ఎవరైనా అలాంటి వారిని ఆపగల శక్తి, జ్ఞానం, మరియు సదుద్దేశంతో వారి మధ్య కూర్చుంటే తప్ప, కేవలం వారి ఎగతాళిని వింటూ వారితో ఉండటం కూడా పాపంలో భాగస్వామ్యం అవ్వడమేనని వక్త స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సూరతున్నసా (4వ అధ్యాయం)లోని 140వ ఆయతును పఠించి, దాని భావాన్ని వివరించారు. ఆ ఆయతు ప్రకారం, అల్లాహ్ ఆయతులను తిరస్కరించడం లేదా పరిహసించడం విన్నప్పుడు, ఆ సంభాషణను విడిచిపెట్టాలి, లేకపోతే వారు కూడా ఆ పాపులతో సమానం అవుతారు. వక్త ఈనాటి ముస్లింల పరిస్థితిని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా, సినిమాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇలాంటి పాపభూయిష్టమైన విషయాలను చూస్తూ, వాటిలో పాల్గొంటూ, కనీసం ఖండించకుండా మౌనంగా ఉండటం ఎంతటి ప్రమాదకరమో హెచ్చరించారు. చెడును చేతితో, లేదా మాటతో ఆపాలని, కనీసం మనసులోనైనా దానిని ద్వేషించాలని చెప్పే హదీసును ఉటంకిస్తూ, విశ్వాసంలోని బలహీన స్థాయిని కూడా కోల్పోకూడదని ఉద్బోధించారు.

39వ విషయం: అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్న వారితో నీవు కూర్చోకు.

శ్రద్ధ వహించండి, కన్ఫ్యూజ్ కాకండి. 38వ విషయం ఏమి విన్నారు? అల్లాహ్, అతని ఆయతులు, ఆయన ప్రవక్త పట్ల ఎగతాళి చేయకూడదు. కానీ ఇక్కడ 39వ విషయం, ఎవరైతే ఇలా ఎగతాళి చేస్తూ ఉన్నారో, అలాంటి వారికి తోడుగా ఉండకు. ఆ ఎగతాళి చేస్తున్న సందర్భములో వారితో కలిసి కూర్చోకు. ఆ సందర్భములో వారితో కలిసి ఉండకు. ఒకవేళ, నీవు వారిని ఆపగలుగుతున్నావు, అతను మాట పూర్తి చేసే వరకు మధ్యలో ఆపేది ఉంటే మన మాటను శ్రద్ధ వహించడు అందుకొరకే, కొంచెం మాట పూర్తి చేసిన వెంటనే, అతన్ని బోధ చేస్తాను, అతనికి నేను నసీహత్ చేస్తాను, అతను చేసిన ఈ పాపం ఎగతాళి నుండి నేను అతన్ని ఆపుతాను, ఇలాంటి సదుద్దేశం ఉండి, ఆపే అంతటి శక్తి ఉండి, ఆపే అంతటి జ్ఞానం ఉండి, అక్కడ కూర్చుంటే పాపం లేదు. కానీ అలా కాకుండా, ఆపడం అయితే లేదు, కానీ వారితో కలిసి కూర్చోవడం, ఇది కూడా పాపంలో వస్తుంది, ఇది కూడా ఒక నిషేధం, మనం దీనిని వదులుకోవాలి.

ముందు దీనికి సంబంధించి సూరతున్నసా, సూర నెంబర్ నాలుగు, ఆయత్ నెంబర్ 140 వినండి, ఆ తర్వాత దీనికి సంబంధించిన మరి చిన్నపాటి వివరణ కూడా మనం తెలుసుకుందాం.

[وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آَيَاتِ اللهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ إِنَّكُمْ إِذًا مِثْلُهُمْ إِنَّ اللهَ جَامِعُ المُنَافِقِينَ وَالكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا] {النساء:140}

అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి  ఉన్నాడు: అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లైయితే, అలా చేసేవారు (ఆ సంభాషణ వదలి) వేరే మాట ప్రారంభించనంత వరకు మీరు వారితో కలసి కూర్చోకండి. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరూ వారి లాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి[. (నిసా 4: 140).

అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ ఎంతటి హెచ్చరిక ఇందులో ఉంది ఈ రోజుల్లో మనం ఇలాంటి ఆయతులు చదవడం లేదు. అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడు, అల్లాహ్ ఈ దివ్య గ్రంథము ఖురాన్ లో మీకు ఇంతకు ముందే ఆదేశం ఇచ్చి ఉన్నాడు దీనికి సంబంధించి. ఏంటి? అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా, తిరస్కార వచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే, అలా చేసే వారితో మీరు, వారు తమ ఆ సంభాషణ వదిలే వరకు వారితో కూర్చోకండి. ఫలా తఖ్’ఉదూ, గమనించండి, ఫలా తఖ్’ఉదూ, మీరు వారితో కూర్చోకండి. హత్తా యఖూదూ ఫీ హదీసిన్ గైరిహ్. వారు వేరే మాట ఎప్పటివరకైతే మాట్లాడారో మీరు వారితో, ఖురాన్ కు ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ పట్ల ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి జరిగినప్పుడు, వారితో పాటే అక్కడ కూర్చోవడం, ఇది మీకు తగని విషయం. అంతే కాదు, ఇక్కడ గమనించండి, ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. మీరు గనక నా ఈ ఆదేశాన్ని వినలేదంటే, మీరు కూడా వారిలో కలిసిపోయినవారే. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ఎగతాళి చేస్తున్నాడు, నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు. అతన్ని ఆపడం లేదు. నీకు చెప్పే అధికారం లేదు, అయ్యో నేను ఎగతాళి చేస్తలేనండి అని. నీవు కూడా ఇతనితో సమానం అని నేను అనడం లేదు, అల్లాహ్ అంటున్నాడు. ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. నిశ్చయంగా మీరు కూడా వారితో సమానం.

అంతేనా? అల్లాహ్ ఇంకా హెచ్చరించాడు, గమనించండి. ఇన్నల్లాహ జామిఉల్ మునాఫిఖీన వల్ కాఫిరీన ఫీ జహన్నమ జమీఆ. అల్లాహ్ త’ఆలా వంచకులను మరియు అవిశ్వాసులను, కపట విశ్వాసులను, అవిశ్వాసులను కలిపి నరకంలో ఉంచుతాడు అని. వాస్తవానికి మనలో విశ్వాసం ఉంటే, వాస్తవానికి విశ్వాసం పట్ల కపటత్వం, వంచకపుతనం మనలో లేకుంటే, మనం ఆపాలి వారిని, లేదా అక్కడి నుండి వెళ్ళిపోవాలి.

సహీహ్ ముస్లిం యొక్క హదీస్ కూడా ఇక్కడ మీకు గుర్తొస్తుంది కదా? మన్ రఆ మిన్కుమ్ మున్కరన్. మీలో ఎవరైతే ఒక చెడు పనిని చూస్తారో, ఫల్ యుగయ్యిర్హు బియదిహ్. తన శక్తి ఉండేది ఉంటే తన చెయ్యితో అతన్ని ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబిలిసానిహ్. చెయ్యితో ఆపే శక్తి లేకుంటే, నోటితో ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబికల్బిహ్. ఆ శక్తి లేకుంటే హృదయంలో దాన్ని చెడుగా భావించి అక్కడి నుండి దూరం ఉండాలి. వ దాలిక అద్’అఫుల్ ఈమాన్. ఇదే విశ్వాసం యొక్క చివరి మెట్టు. ఇది బలహీన స్థితి విశ్వాసం యొక్క. ఈ పని కూడా కనీసం చేయలేదు అంటే ఇక విశ్వాసం లేనట్టే భావం.

సోదర మహాశయులారా, ఈ విషయంలో మనం అల్లాహ్ తో భయపడుతున్నామా నిజంగా? ఈ విషయంలో మనం నిజంగా అల్లాహ్ తో భయపడుతున్నామా? ఎంత ఘోరానికి మనం పాల్పడుతున్నాము. ఈ రోజుల్లో మన సమాజంలో, మన వాట్సాప్ గ్రూపులలో, మన సోషల్ మీడియాలో, ఎన్ని చెడులైతే చూస్తూ ఉన్నామో, ఆ చెడును ఖండించే అటువంటి శక్తి, ఆ చెడును ఖండించే అంతటి జ్ఞానం లేకపోతే, దానిని చూసుకుంటూ ఉండడం… అల్లాహు అక్బర్… అల్లాహు అక్బర్ అస్తగ్ ఫిరుల్లాహ్.

ముస్లిం యువకులు, ముస్లిం యువతులు, ఏ ఫిలింలు చూస్తూ ఉంటారో, ఏ పాటలు వింటూ ఉంటారో, ఏ సీరియల్ లు చూస్తూ ఉంటారో, ఏ కార్టూన్లు చూస్తూ ఉంటారో, ఏ గేమ్ లు ఆడుతూ ఉంటారో, ఏ వాట్సాప్ గ్రూపులలో ఉన్నారో, ఏ సోషల్ మీడియాలోని అప్లికేషన్లలో ఫాలో అవుతున్నారో, షేర్ చేస్తున్నారో, వీరందరూ కూడా గమనించాలి, అల్లాహ్ కు ఇష్టమైన వాటిలో వారు పాల్గొన్నారంటే, అల్ హందులిల్లాహ్. అల్లాహ్ కు ఇష్టం లేని వాటిలో పాల్గొన్నారంటే, అక్కడ ఖురాన్ పట్ల, హదీసుల పట్ల, ప్రవక్త పట్ల మరియు అల్లాహ్ యొక్క ఆయతుల పట్ల ఎగతాళి, పరిహాసం జరుగుతూ ఉన్నది. వారితో పాటు నవ్వులో నవ్వు మీరు కలిసి ఉన్నారు, లేదా కనీసం వారిని ఖండించకుండా మౌనం వహించి ఉన్నారు, వారి యొక్క సబ్స్క్రైబర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి యొక్క ఫాలోవర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి సంఖ్య పెద్దగా కనబడే విధంగా ఉన్నారు. ఆలోచించండి, ఈ పాపంలో మనం కలిసిపోతలేమా? ఖురాన్, హదీసులను మనం ఈనాటి కాలంలో ఎక్కువ ప్రచారం చేయాలి, మంచిని మనం ఎక్కువగా ప్రజల వరకు చేరవేయాలి. అలా కాకుండా ఏ చెడులోనైతే మనం పాల్గొంటామో, దాని వల్ల మనం ఎంత పాపానికి గురి అవుతామో ఎప్పుడైనా గమనించారా? అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు?
https://youtu.be/XPzalQiVVY4 [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బహుళ వివాహాల గురించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. మొత్తం 11 మంది భార్యలు ఉన్నారని, వారిలో ఇద్దరు ఆయన జీవితకాలంలోనే మరణించారని, ఆయన మరణించే సమయానికి తొమ్మిది మంది ఉన్నారని వక్త స్పష్టం చేశారు. ఈ వివాహాలు అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుమతితో జరిగాయని, దీనికి సూరతుల్ అహ్‌జాబ్‌లో ప్రమాణం ఉందని వివరించారు. ఈ వివాహాల వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన వివరించారు: స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయడం, వైవాహిక జీవితంలోనూ ఆయన ఒక ఉత్తమ ఆదర్శంగా నిలవడం, వివిధ వంశాలు మరియు వర్గాల మధ్య సంబంధాలను బలపరచడం, మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శత్రువుల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరించే తీరును తెలియజేయడం వంటివి ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొత్తం భార్యలు 11. అయితే తమ జీవితంలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో తొమ్మిది భార్యలు వారి వద్ద ఉన్నారు.

అయితే, ప్రవక్తకు నలుగురి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకునే అటువంటి అనుమతి, అర్హత స్వయంగా నిజ సృష్టికర్త అయిన మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రసాదించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లిళ్లు చేసుకున్నారు. దీని యొక్క వివరణ సూరతుల్ అహ్‌జాబ్‌లో చూడవచ్చును. సూరా నెంబర్ 33, మరి ఇందులో ప్రత్యేకంగా ఎక్కడైతే అల్లాహ్ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరి కంటే ఎక్కువగా భార్యలు చేసుకునే అటువంటి అనుమతి ఇచ్చాడో, ఆయతు నెంబర్ 28 నుండి సుమారు సుమారు 35 వరకు మరియు ఆ తర్వాత ఒక రెండు ఆయతులు కూడా మీరు చూశారంటే దీనికి సంబంధించిన ఎన్నో లాభాలు మనకు ఏర్పడతాయి.

సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం పురుషులకే ప్రవక్త కారు, స్త్రీలకు కూడాను. అయితే, ప్రవక్త వారి ఆదర్శ జీవితం పురుషులకు ఎంత అవసరమో, అలాగే స్త్రీలకు కూడా అవసరం. ఒకరి కంటే, నలుగురి కంటే ఎక్కువ భార్యల ద్వారా ఇలా ప్రవక్త వారి ఆదర్శవంతమైన జీవితాన్ని తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మంచి సహకారం ఏర్పడుతుంది.

రెండవ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన అందరి కొరకు ఒక ఉత్తమ ఆదర్శం అని ఇదే సూరతుల్ అహ్‌జాబ్‌లో కూడా అల్లాహ్ మనకు తెలియజేశాడు. అయితే, ఈ ఆదర్శం కేవలం మస్జిద్ వరకు, బయట బజారు వరకు, యుద్ధాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ లైఫ్‌లో కూడా. అంతేకాదు, ఇంకా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మానవుల్లో, సమాజంలో విద్యా రీత్యా గానీ, బుద్ధి జ్ఞానాల పరంగా గానీ, విషయాలు నేర్చుకుని ఆచరించే పరంగా గానీ, సమాజంలో ప్రజలు ఏ తారతమ్యాలు ఏర్పాటు చేసుకుంటారో దాని పరంగా గానీ వేరువేరుగా ఉంటారు గనుక, వేరువేరు వంశాలకు సంబంధించిన భార్యలు ప్రవక్త దగ్గర ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని అందరికీ తెలియజేయడానికి.

అంతే కాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా వచ్చారు. సర్వ మానవాళిలో ప్రత్యేకంగా ఆ కాలంలో బహుదైవారాధకుల రూపంలో, యూదుల రూపంలో, క్రైస్తవుల రూపంలో ఎందరో అక్కడ నాయకులు ఉన్నారు. అయితే, ఆ నాయకుల యొక్క బిడ్డలు సైతం ఎప్పుడైతే యుద్ధంలో బానిసరాళ్లుగా వచ్చారో, వారికి వారి హోదా, అంతస్తు ప్రకారంగా వారి యొక్క తండ్రులకు ఇస్లాం యొక్క గొప్పతనం తెలిసిరావాలి, ‘నా బిడ్డలు బానిసరాళ్లు అయ్యారు’ అన్నటువంటి అవమానంతో ఇస్లాం పట్ల మరింత వారి యొక్క హృదయాలలో ఏ చెడు చేసుకోకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి బిడ్డలను వివాహం చేసుకున్నారంటే, ఇస్లాం యొక్క గొప్ప నాయకుల వద్ద నా బిడ్డలు ఒక మహారాణిగా ఉన్నారు అన్నటువంటి సంతోషంతో వారు కూడా ఇస్లాంకు మరింత దగ్గరగా అయ్యారు.

ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉర్దూ తెలిసిన వారు మౌలానా సయ్యద్ సులేమాన్ మన్సూర్‌పురి రహ్మతుల్లాహి అలైహి వారి ‘రహ్మతున్ లిల్ ఆలమీన్’ పుస్తకంలో దీని యొక్క వివరాలను కూడా ఇన్షా అల్లాహ్ చూడగలుగుతారు. ఈ సమాధానం సరిపోతుందని ఆశిస్తున్నాను.

ఇతరములు: 

మద్రాస్ ప్రసంగాలు – ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు
అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వీ
https://teluguislam.net/2021/12/01/madras-prasangalu/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు : క్లుప్త వివరణ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
తన ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు
https://youtu.be/vuLWSYjuoOg [40: 47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో మూడు ప్రాథమిక సూత్రాల గురించి వివరించబడింది, ఇవి సమాధిలో ప్రతి వ్యక్తిని అడగబడే మూడు ప్రశ్నలు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? మొదటి సూత్రం, ‘నీ ప్రభువు అల్లాహ్’, ఆయన సృష్టికర్త, పోషకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు అని వివరిస్తుంది. రెండవ సూత్రం, ‘నీ ధర్మం ఇస్లాం’, ఇది అల్లాహ్ కు తౌహీద్ తో లొంగిపోవడం, విధేయత చూపడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం అని నిర్వచిస్తుంది. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహ్సాన్ గురించి కూడా క్లుప్తంగా చెప్పబడింది. మూడవ సూత్రం, ‘నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’, ఆయన వంశం, జీవితం, ప్రవక్త పదవి, మక్కా మరియు మదీనాలోని ఆయన దَదావా మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. ఈ సమాధానాలు కేవలం మాటలతో కాకుండా, ఆచరణ రూపంలో మన జీవితంలో ప్రతిబింబించినప్పుడే సమాధిలో చెప్పగలమని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రములు కేవలం మనందరి సృష్టికర్త అయిన, అలాగే మన పోషకుడైన ఈ సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్న, నడుపుతున్న, మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ కు మాత్రమే చెల్లుతాయి, శోభిస్తాయి.

లెక్కలేనన్ని దరూదో సలాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అనేకానేక కరుణ శాంతులు చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురియుగాక.

ఈ రోజు నా యొక్క అంశం ఉసూలు సలాస, త్రి సూత్రాలు. త్రి సూత్రాలు అని ఈ అంశం ఏదైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందో దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి డైరెక్ట్ నా అంశంలో నేను ప్రవేశిస్తాను. నేను కూడా ఇది ఒక ప్రసంగం కాదు, క్లాసులు గనుక, తరగతులు గనుక, నిదానంగా మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా, వివరంగా ఆధారాలతో, మంచి విధంగా బోధించే సద్భాగ్యం నాకు ప్రసాదించుగాక. వింటున్న మంచి విషయాలను గ్రహించి, వింటున్న మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు ఇతరులకు మనం ఆహ్వానించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

త్రీ సూత్రములు, మూడు సూత్రాలు అని అంటే ఏమిటి అవి? నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? ఈ మూడు ప్రశ్నలు అనండి, ఇదే మూడు సూత్రాలు, మూడు ప్రశ్నలుగా మనతో సమాధిలో ప్రశ్నించబడనున్నాయి.

అయితే, ఎప్పుడైతే సమాధిలో ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయో, అప్పుడు అక్కడ మనం వీటి యొక్క సమాధానం తయారు చేసుకోవాలంటే ఏ మాత్రం వీలుపడదు. అందుకే అల్లాహ్ యొక్క గొప్ప దయ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ఆ ప్రశ్నలు ఇక్కడే తయారు చేసుకునే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. మరియు ఆ ప్రశ్నలకు నిజమైన సమాధానం ఏమిటో అది కూడా అల్లాహు త’ఆలా మనకు తెలియజేశాడు.

సునన్ అబీ దావూద్, హదీస్ నెంబర్ 4753. ఇందులో ఈ హదీస్ వచ్చి ఉంది. చాలా పొడవైన హదీస్. కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. ఎప్పుడైతే మనిషిని తీసుకువెళ్లి అతని బంధుమిత్రులందరూ కూడా సమాధిలో పెడతారో మరియు అక్కడ నుండి తిరిగి వస్తారో, ఆ తర్వాత అక్కడికి ఇద్దరు దూతలు వస్తారు, ఫయుజ్లిసానిహి, ఆ దూతలు అతన్ని కూర్చోబెడతారు. ఫయఖూలాని లహు, అతనితో ప్రశ్నిస్తారు.

مَنْ رَبُّكَ؟
(మన్ రబ్బుక?)
“నీ ప్రభువు ఎవరు?”

مَا دِينُكَ؟
(మా దీనుక్?)
“నీ ధర్మం ఏది?”

مَا هَذَا الرَّجُلُ الَّذِي بُعِثَ فِيكُمْ؟
(మా హాజర్ రజులుల్లదీ బుఇస ఫీకుమ్?)
“మీ వద్దకు పంపబడిన ఈ వ్యక్తి ఎవరు?”

విశ్వాసుడయైతే ఉంటే కరెక్ట్ సమాధానం ఇస్తాడు. నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు మా వైపునకు మా మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని.

అయితే సోదర మహాశయులారా, ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వీటినే మూడు సూత్రాలుగా చెప్పడం జరిగింది. మరియు ఇహలోకంలో మనం ఈ మూడు ప్రశ్నల యొక్క, మూడు సూత్రాల యొక్క వివరణ, జవాబులు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆచరించడం, జీవించడం చాలా అవసరం.

అయితే సోదర మహాశయులారా, ఈ అంశంపై త్రీ సూత్రాలు అల్-ఉసూలుల్ సలాస అని ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఒక చాలా చక్కని చిన్నటి పుస్తకం రాశారు. దాని యొక్క వివరణ తెలుగులో అల్ హందులిల్లాహ్ మా యూట్యూబ్ ఛానల్ పై కూడా ఉంది, జీడీకే నసీర్. ఇంకా వేరే కొందరు ఛానెల్ వారు కూడా తమ యొక్క ఛానెల్ లో కూడా వేసి ఉన్నారు. పూర్తి వివరణ అక్కడ వినవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఇక్కడ నాకు కేవలం 35-40 నిమిషాల సమయం మాత్రమే ఉంది గనుక, ఇందులో కొన్ని ముఖ్య విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, త్రీ సూత్రాలు అని ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో మొదటి సూత్రం మన్ రబ్బుక్, నీ ప్రభువు ఎవరు? మనకు ఇప్పుడు జవాబు తెలిసింది గనుక మనం చాలా సులభంగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాము. నా యొక్క ప్రభువు అల్లాహ్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం ఆచరణ రూపంలో ఇహలోకంలో సిద్ధపరచుకొని లేకుంటే, చనిపోయిన తర్వాత మన సమాధిలో ఈ సమాధానం మనం చెప్పలేము. ఏదో మూడు ప్రశ్నల సమాధానాలు తెలిసిపోయాయి కదా, మన్ రబ్బుకా అంటే అల్లాహ్ అనాలి, మా దీనుక్ నీ ధర్మం ఏమిటి అంటే ఇస్లాం అనాలి, నీ ప్రవక్త ఎవరు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి, మూడే పదాలు ఉన్నాయి కదా? అల్లాహ్, ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సులభం? చెప్పుకోవడానికి మూడే మూడు పదాలలో చాలా సులభమైన ఆన్సర్. ఇహలోకంలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వింటే వచ్చేస్తుంది కావచ్చు. కానీ దీని ప్రకారంగా మన జీవితం గడవకపోతే, దీని ప్రకారంగా మన ఆచరణ లేకుంటే సమాధిలో మన నోటితో ఈ ఆన్సర్, జవాబు చెప్పడం కుదరదు. ఇది చాలా బాధాకర విషయం. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా దాని యొక్క జవాబు వివరణగా ఏమిటి, ఎలా దాన్ని మనం సిద్ధపరచాలి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

మన్ రబ్బుక్ అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో, నీ ప్రభువు ఎవరు? మన సమాధానం అల్లాహ్ అనే ఉండాలి. కరెక్టే. కానీ ఎవరు అల్లాహ్? అల్లాహ్ ఎవరు అంటే, ఆయనే నన్ను ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ గమనించండి, రబ్ అన్న పదం ఉంది. సర్వసామాన్యంగా మన తెలుగు పుస్తకాల్లో అనువాదంలో పోషకుడు అని మనం తర్జుమా, అనువాదం చేస్తాము. కానీ ఇందులో చాలా వివరణతో కూడిన విషయాలు ఉన్నాయి. రబ్ అన్న పదానికి ఒక్క పోషకుడు అన్న పదం సరిపోదు. అయితే మన యొక్క రబ్ ఎవరు? ఎవరైతే నన్ను మరియు ఈ విశ్వంలో ఉన్న సర్వ సృష్టిని పుట్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి అందరి యొక్క వ్యవహారాలను నడుపుతున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే.

ఇక్కడ శ్రద్ధ వహించండి నా మాటపై, ప్రతి బుద్ధిమంతునికి వెంటనే మనసులో వచ్చే విషయం ఏంటి? ఎవరైతే నీకు ఉపకారం చేస్తున్నాడో, నీ పట్ల మేలు చేస్తున్నాడో అతనికి నీవు కృతజ్ఞతాభావంతో మెలుగుతావు. ఏ అల్లాహ్ అయితే సృష్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి మన వ్యవహారాలన్నిటినీ నడుపుతున్నాడో అంతకంటే మేలు చేసేవాడు, అంతకంటే గొప్ప మనకు ఉపకారాలు చేసేవాడు ఇంకెవరు ఉంటారు? ఎవరూ ఉండరు. అందుకొరకే వహువ మ’బూదీ లైసలీ మ’బూదున్ సివా. ఆ అల్లాహ్ తప్ప నా ఆరాధ్యుడు ఇంకా వేరే ఎవరూ కాజాలడు. అర్థమైందా విషయం? దీనికి దలీల్, ఖురాన్ మీరు తెరిస్తేనే, ఓపెన్ చేస్తేనే బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ తర్వాత ఏముంది?

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్)
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,1:2)

గమనించండి. అల్ హందు, సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు ఎవరికీ? లిల్లాహి, కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకు? రబ్బిల్ ఆలమీన్. ఆ అల్లాహ్ యే ఈ సర్వ లోకాలకు ప్రభువు.

రబ్ అన్న ఇక్కడ పదానికి ప్రభువు అని మనం ఏదైతే చేశామో తెలుగులో, ఇంతకుముందు నేను చెప్పినట్లు, పుట్టించువాడు, పోషించువాడు మరియు జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు, ఇవన్నీ భావాలు ప్రభువు అన్న యొక్క అర్థంలో వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, అల్లాహ్ తప్ప ప్రతీదీ కూడా ఆలం, ప్రపంచం, లోకం. మరియు ఈ లోకంలో ఒకడిని నేను. అందుకని కేవలం అల్లాహ్ యే నా ప్రభువు, ఆ అల్లాహ్ యే నా యొక్క నిజమైన ఆరాధ్యుడు.

అల్లాహ్ యే నా ప్రభువు అని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలా సులభమైన విషయం. రాత్రి పగళ్లు, సూర్య చంద్రులు మరియు భూమి ఆకాశాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు చెప్పకనే చెబుతుంది, మనందరి ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని. ఉదాహరణకు చదవండి సూరత్ ఫుస్సిలత్, దాని యొక్క మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నెంబర్ 37.

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (41:37)

అల్లాహ్ యొక్క సూచనలలో, అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు అన్నదానికి ఎన్నో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇవి కూడా. ఏంటి? రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు. మీరు సూర్యునికి సాష్టాంగం చేయకండి, సజ్దా చేయకండి. చంద్రునికి సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన నిజ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకే మీరు సజ్దా చేయండి. నిజంగా, వాస్తవంగా మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించే వారైతే.

ఇక ఎవరైతే మేము సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము, మీరు మేము అందరము ఆరాధించేది కేవలం ఒక్క దేవున్నే అన్నటువంటి మాటలు పలుకులు ఎవరైతే పలుకుతారో, వారితోని అడగండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారు సూర్యుణ్ణి పుట్టించారా? చంద్రుణ్ణి పుట్టించారా? ఈ రాత్రి పగలును పుట్టించారా? అలాగే అల్లాహు త’ఆలా సూరతుల్ అ’రాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 54 లో తెలిపాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు.  (7:54)

నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాలను కేవలం ఆరు రోజుల్లో పుట్టించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం చూస్తూ పోతే ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఖురాన్ ఆరంభంలో, సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ బఖర, అందులోని మూడో రుకూ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, సూరే బఖర, ఆయత్ నెంబర్ 21, 22 లో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ ఏదైతే ఇచ్చాడో, ఖురాన్ ప్రారంభంలో మొట్టమొదటి ఆదేశం ఇదే ఆదేశం ఇచ్చాడు. ఏంటి? మీరందరూ మీ నిజ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అంతేకాదు, ప్రతి బుద్ధిమంతునికి అర్థమయ్యే విధంగా ఎంతో సులభంగా ఆ అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయనే ఆరాధనకు ఏకైక అర్హుడు అన్నటువంటి కొన్ని నిదర్శనాలు కూడా అక్కడ చూపాడు. ఒకసారి ఆ ఆయతులు విని ఇంకా ముందుకు వెళ్దాము మనం.

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. (2:21)

ఓ ప్రజలారా! గమనించండి. మీరు ఏదైతే శ్రద్ధగా ఈ పాఠం వింటున్నారో కదా, ఆయత్ నెంబర్లు ఏదైతే చెబుతున్నానో, రాస్తున్నారో కదా, మీరు మీ ముస్లిమేతర సోదరులకు, ఎవరైతే స్త్రీలు వింటున్నారో మీరు ముస్లిమేతర స్త్రీలకు ఈ ఆయతులు తిలావత్ కూడా చేసి వినిపించండి. వాటి యొక్క భావాన్ని కూడా వారికి వివరించి చెప్పండి. ప్రత్యేకంగా ఈ రెండు ఆయతులు మీరు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడానికి.

మొట్టమొదటి విషయం ఇక్కడ గమనించండి, ఈ ఒక్క మొదటి పదంలోనే యా అయ్యుహన్నాస్ మనకు ఖురాన్ యొక్క సత్యం, ఖురాన్ ప్రజలందరికీ అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఓ ప్రజలారా! అంటే ఈ ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అరబ్బులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఎవరు జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు వచ్చింది. ఏమంటున్నాడు అల్లాహ్? ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎవరు ప్రభువు? అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో, వల్ లదీన మిన్ ఖబ్లికుమ్, మీకంటే ముందు గడిచిన వారిని సృష్టించాడో, ల’అల్లకుమ్ తత్తఖూన్, ఈ విధంగా మీరు భయభీతి కలిగిన వారిలో చేరగలుగుతారు. ఈ విధంగా మీరు తమకు తాము నరకం నుండి రక్షించుకోగలుగుతారు. ఇక ఆ నిజ ప్రభువు యొక్క ఒక గుణం చెప్పడం జరిగింది, ఆయన మిమ్మల్ని మీకంటే పూర్వీకులను పుట్టించాడు అని. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరికొన్ని విషయాలు కూడా అల్లాహ్ తెలిపాడు. ఏమని తెలిపాడు?

الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి. (2:22)

ఆ అల్లాహ్ యే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు మరియు ఆకాశం నుండి ధారాపాతంగా మీ కొరకు వర్షాన్ని కురిపించాడు. ఈ వర్షం ద్వారా, ఈ నీటి ద్వారా భూమి నుండి మీ కొరకు మంచి మంచి పంటలు, ఫలాలు పండించాడు. ఇలాంటి అల్లాహ్ ను, అల్లాహ్ యొక్క ఈ గొప్ప సూచనలను మీరు తెలుసుకొన్న తర్వాత ఈ విధంగా అల్లాహ్ కు పాటు వేరే భాగస్వాములను ఏమాత్రం కల్పించకండి.

అల్లాహ్ యొక్క పరిచయం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఏ ఒక పెద్ద వివరణ, దీని గురించో పెద్ద ఫిలాసఫర్ లాంటి వారు లేదా పెద్ద తత్వవేత్తలు డిగ్రీలు సంపాదించడం ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ఇవన్నిటిని సృష్టించిన సృష్టికర్తయే మనందరి ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు.

ఇక ఆరాధనలో సోదరులారా ఎన్నో విషయాలు వస్తాయి. ఇస్లాం, ఈమాన్, ఇహసాన్, దుఆ, భయభీతి, ఆశ, భరోసా, నమ్మకం, అలాగే భయపడడం, ఇంకా మనం కష్టంలో ఉన్నప్పుడు కేవలం అతనితో మాత్రమే సహాయం కోరడం, అర్ధించడం, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడం, ఇంకా మొక్కుబడులు ఇంకా ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకవేళ సంక్షిప్తంగా ఓ రెండు మాటల్లో చెప్పాలంటే హృదయ సంబంధమైన, నాలుక సంబంధమైన, శరీర సంబంధమైన, ధన సంబంధమైన ఎన్నో రకాల ఆరాధనలు ప్రతిదీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి. ఆరాధన యొక్క కొన్ని రకాలు ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలిపాను వాటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు మా యొక్క వివరణతో కూడిన మీరు వీడియోలు, ఆడియోలు తప్పకుండా వినండి. అక్కడ వివరణ తెలుస్తుంది.

ఇక రండి, రెండో మూల సూత్రం, ఇస్లాం. సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, అల్లాహ్ ను మనం తెలుసుకున్నాము. ఇక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అయితే ఆ అల్లాహు త’ఆలా మన జీవన విధానం కొరకు ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రవక్తల ద్వారా పంపుతూ వచ్చాడు. అయితే మొదటి ప్రవక్త, ప్రథమ ప్రవక్త, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ధర్మాన్నే బోధించారు. కానీ ఆ ప్రవక్తలు చనిపోయిన తర్వాత వారిని అనుసరించే వారిలో కాలం గడిచిన కొద్దీ వారు మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల మంచి విషయాలను అందులో నుండి తీసేసి తమ ఇష్టానుసారం అందులో చేర్పులు చేసుకున్నారు. అయితే అల్లాహు త’ఆలా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగావించాడు. దీనిని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. అందుకొరకే ఎన్ని కొత్త వర్గాలు పుట్టుకొచ్చినా గాని, ఇస్లాంలో ఎన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసినా గాని, స్వయంగా ఇస్లాం యొక్క శత్రువులు ఇందులో ఎలాంటి జోక్యం చేసుకొని సరియైన ఇస్లాం నుండి ముస్లింలను, ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాజాలవు. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సంపూర్ణం చేశాడో, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుని ఉన్నాడు.

అయితే ఇక రండి, ఇస్లాం అన్న దానికి భావం ఏంటి? అల్ ఇస్లాం హువల్ ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్, వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. మూడు విషయాలు ఇందులో వచ్చాయి గమనించండి. మనం ఏకత్వం, తౌహీద్ ద్వారా అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ. ఆయనకు మాత్రమే విధేయత పాటించుట. ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, వారించిన విషయాలకు దూరం ఉండాలి. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, ఆయన యొక్క విధేయత పాటించుట, మాట వినుట, ఆజ్ఞ పాలన చేయుట. మూడోది ఏమిటి? తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్. షిర్క్ మరియు షిర్క్ చేసేవారితో తమకు తాము ఏ సంబంధం లేనట్లుగా దూరంగా ఉండుట.

స్లాం యొక్క ఇక్కడ చిన్నపాటి డెఫినిషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి కొంత వివరణ కూడా మీరు తెలుసుకోండి లేదా అంటే మరికొందరు మిస్అండర్స్టాండింగ్, తప్పుడు అర్థాలు తీసుకొని మనపై బురద చల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏంటి అది? ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్. కేవలం అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. ఎందుకు? ఇప్పటివరకే మనం తెలుసుకున్నాము, ఆయనే మన నిజ ఆరాధ్యుడు. ఈ లొంగిపోవుట అనేది ఎలా ఉండాలి? తౌహీద్ తో ఉండాలి, ఏకత్వంతో ఉండాలి. ఇంకా వేరే ఎవరి వైపునకు మనం లొంగిపోవడానికి ఏ అవకాశం ఉండదు. హా, నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నా హృదయంలో అల్లాహ్ తప్ప ఎవడు లేడు, నోటితో ఇలా చెప్పుకుంటే సరిపోదు, ఇన్ఖియాద్. అంటే ఏమిటి? ఇన్ఖియాద్ లహు బిత్తాఅ. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించడం. ఏ విషయాల నుండి వారించాడో వాటికి దూరంగా ఉండడం. ఈ రెండిటితో పాటు మూడవది, అల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్, బహుదైవారాధన, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయడం. ఈ షిర్క్ కు పూర్తిగా దూరం ఉండాలి. షిర్క్ తో ఏ సంబంధం లేకుండా ఉండాలి.

ఇందులోనే మరో అంశం ఉంది. షిర్క్ తో కూడా మన సంబంధం లేకుండా ఉండాలి, వ అహ్లిహి, షిర్క్ చేసేవారితో కూడా. ఈ పదంతో కొందరు తప్పుడు భావాలు తీసుకుంటారు, అందుకొరకే కొంచెం గమనించండి. ఏంటి గమనించే విషయం? షిర్క్ విషయాలలో, షిర్క్ పనులలో మనం ముష్రికులకు, బహుదైవారాధనలో బహుదైవారాధకులకు మనం ఎలాంటి తోడ్పాటు, సహాయం అందించలేము. ఎందుకంటే ఇది తప్పు. తప్పును తప్పు చెప్పకుండా మనం అభినందిస్తున్నాము, శుభకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఆ తప్పును నిజం అని ఒప్పుకున్నట్లు మనం. అది తప్పు అని నోటితో చెప్పినప్పటికీ, తప్పు కాదు అని మనం మన ఆచరణ ద్వారా మనం ప్రదర్శిస్తున్నట్లు అవుతుంది. అందుకొరకు ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. అయితే, మరో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఎవరైతే ముస్లిమేతరులుగా ఉన్నారో, ఎవరైతే బహుదైవారాధన చేస్తున్నారో, ముస్లింలు అయి ఉండి కూడా, ప్రతి ఒక్కరితో షిర్క్ పనులలో మనం ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. కానీ అదే ఇస్లాం బోధిస్తున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, షిర్క్ విషయంలో వారికి ఏ సహాయం చేయకండి, వారికి ఏ శుభాభినందనలు తెలుపకండి, వారికి ఎలాంటి కంగ్రాట్యులేషన్స్ తెలిపి వారిని ప్రోత్సహించకండి. కానీ మానవరీత్యా వారితో మానవత్వంగా మసులుకొని, వారికి షిర్క్ యొక్క నష్టాలను తెలియజేస్తూ ఉండండి, తౌహీద్ యొక్క బర్కత్ లను, శుభాలను స్పష్టపరుస్తూ ఉండండి, షిర్క్ నుండి ఆగిపోవాలి అని, తౌహీద్ వైపునకు రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉండండి. ఇంతటి గొప్ప మంచి శిక్షణ కూడా ఇస్లాం ఇచ్చి ఉంది. 28వ ఖాండంలో మనకు దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆయతులు ఉన్నాయి, సూరే మాయిదాలో కూడా ఉన్నాయి, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి.

సోదర మహాశయులారా, ఇస్లాం యొక్క నిర్వచనం, దాని యొక్క చిన్న వివరణ ఏదైతే మనం విన్నామో, ఇక రండి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మూడో సూత్రం గురించి తెలుసుకుందాము.

ఇస్లాం అని మనం అన్నప్పుడు ఇందులో ఇస్లాం యొక్క ఐదు అర్కాన్లు వచ్చేస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, ఐదు పూటల నమాజు స్థాపించడం, విధిదానం జకాతు చెల్లించడం, రమదాన్ ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే ఈ ఐదిటిలో మూడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం, నమాజు పాటించడం మరియు ఉపవాసం ఉండడం ప్రతి బీదవానిపై విధిగా ఉంది. ఇక ఎవరికి ఎలాంటి కొన్ని ఆరోగ్యపరంగా ఏమైనా ఆటంకాలు వస్తాయో వాటికి తగిన సులభతరాలు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది, ఆ వివరాలు వేరే సందర్భంలో. ఇక విధిదానం జకాత్ అన్నది ఎవరైతే సంపాదన సంపాదిస్తున్నారో, ఎవరైతే తమ యొక్క అవసరాలు తీర్చిన తర్వాత ఇంకా ఎక్కువగా డబ్బు ఉందో, అయితే నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత కొన్ని విషయాలలో, నిర్ణీత ప్రజలకు ఇవ్వవలసిన హక్కు జకాత్. ఇక హజ్ కూడా శక్తి ఉన్నవారిపై మాత్రమే విధిగా ఉంది. వీటన్నిటికీ కూడా దలీల్ ఖురాన్ లో హదీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. హదీసే జిబ్రీల్ మన ముందు ఎంతో స్పష్టంగా ఉంది. కానీ ఆ దలీల్ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేయడానికి, చదివి మీ ముందు వినిపించడానికి అవకాశం కాదు. అవకాశం లేదు, సమయం సరిపోదు.

ఇస్లాంలో మరో ముఖ్యమైన విషయం, ఈమాన్. ఈమాన్ అంటే ఇందులో ఆరు మూల సూత్రాలు వస్తాయి. అల్లాహ్ ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, గ్రంథాలను విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం మరియు మంచి చెడు తక్దీర్, అదృష్టాన్ని, విధిరాతను విశ్వసించడం.

ఇక ఇందులో మరొకటి వస్తుంది, దానినే ఇహ్సాన్ అని అంటారు. ఏమిటి అది? మనం ఏ పని, ఏ సత్కార్యం, ఏ ఆరాధన చేస్తున్నా గానీ, మనం ఏ చెడు నుండి దూరం ఉంటున్నా గానీ, ఎలా చేయాలి, ఎలా మనం ఆ సత్కార్యంలో నిమగ్నులై ఉండాలి? మన ముందు అల్లాహ్ ఉన్నాడు, మనం కళ్లారా అల్లాహ్ ను చూస్తూ ఉన్నాము, అటువంటి విధేయత భావంతో. ఒకవేళ ఇలాంటి భావం రాకుంటే మనసులో, ఇది మాత్రం తప్పకుండా మనం విశ్వసించాలి, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు, ఏ క్షణం కూడా అల్లాహ్ యొక్క వినడం, చూడడం, జ్ఞానం నుండి మనం దూరం లేము. రాత్రిలో అయినా, పట్టపగలు మట్టమధ్యాహ్నం అయినా గాని, అమావాస్య చీకట్లోనైనా వెలుతురులోనైనా, ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, అల్లాహ్ మనల్ని ఎల్లవేళల్లో చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క దృష్టి నుండి మనం ఏ మాత్రం తప్పించుకోలేము.

ఇస్లాం అంటే ఏమిటి అన్న దానికి ఈ సంక్షిప్త వివరణ కూడా మనం మన మిత్రులకు మనం తెలుపవచ్చు. అయితే సోదర మహాశయులారా, ఈమాన్, ఇహసాన్, ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహసాన్ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. వీటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి.

మూడో సూత్రం, నీ ప్రవక్త ఎవరు? ఇదే మూడవ ప్రశ్న కూడా సమాధిలో. అయితే మనం మన ప్రవక్తను తెలుసుకొని ఉండడం కూడా తప్పనిసరి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంక్షిప్తంగా వారి యొక్క వంశం ఏమిటి? ముహమ్మద్ బిన్… ఇక్కడ మనం సర్వసామాన్యంగా అరబీలో బిన్ అని అంటాము కదా, కొడుకు అని భావం. అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇందులో అరబీలో. ముహమ్మద్ బిన్, ఎవరి కొడుకు ముహమ్మద్? అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరి కొడుకు? అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి కొడుకు? హాషిమ్. హాషిమ్ ఎవరి కొడుకు? ఈ విధంగా. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ వంశానికి చెందినవారు. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సంతానంలోని వారు. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ వంశ పరంపర ఇబ్రాహీం వరకు, మళ్ళీ అక్కడ నుండి ఆదం అలైహిస్సలాం వరకు చేరుతుంది.

ఇక్కడ మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశ పరంపరం విన్నాం కదా ఇప్పుడు మనం. అంటే ఆయన ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలోని వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆ కారణంగా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిషారత్, భవిష్య సూచనకు జవాబుగా వచ్చారు.

ఆయన మానవుడు, అంటే తల్లిదండ్రులతో పుట్టారు. మానవ అవసరాలు తినడం, త్రాగడం, పడుకోవడం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడం, మానవ అవసరాలు ఎలా ఉంటాయో అలాంటి అవసరాలు కలిగిన వారు అని భావం ఇక్కడ మానవుడు అంటే. కానీ కేవలం మానవుల్లోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేది ఉందో ప్రతి దానిటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మించిన గొప్పవారు, ఘనత గలవారు వేరే ఎవరూ లేరు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించారు. మక్కాలో జన్మించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు అక్కడే గడిపారు. 40 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి అనేది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ అనే ఈ ఆయతుల ద్వారా, సూరత్ అలఖ్ లోని మొదటి ఐదు ఆయతులు. వీటి ద్వారా ప్రవక్త పదవి లభించింది. మరియు యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఆ తర్వాత సూరా అవతరించింది. దాని ద్వారా రిసాలత్, ఇక మీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు జీవించారు. అంటే పుట్టిన తర్వాత 53 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. తర్వాత 13 సంవత్సరాలు అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుస్తూ ఉన్నారు. దీనికి దలీల్ సూరతుల్ ముద్దస్సిర్ (సూరా నెంబర్ 74) లోని మొదటి ఏడు ఆయతులు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక సోదర మహాశయులారా, మక్కాలో దావత్ ఇస్తూ ఇస్తూ 13 సంవత్సరాలు గడిపారు. చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అక్కడ వ్యతిరేకత అనేది మొదలైంది మరియు ఎన్నో రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఓపిక, సహనాలతో దావత్ లో నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడైతే మదీనా వాసులు కొందరు ఇస్లాం స్వీకరించి అక్కడికి ఆహ్వానించారో, అటు అల్లాహ్ వైపు నుండి కూడా ఆదేశం వచ్చిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజరత్ చేశారు, మదీనా వైపునకు వలస పోయారు. మదీనా వలస పోయిన తర్వాత సోదర మహాశయులారా, అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి.

దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అక్కడ మనం ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులకు గురి అవుతే, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో మనకు ఏదైనా అక్కడ సమస్య ఎదురవుతే, ఎక్కడికి వెళ్లి మనం అల్లాహ్ యొక్క ఆరాధన స్వతంత్రంగా చేయగలుగుతామో, అక్కడికి వలస వెళ్లడంలో చాలా చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల గురించి స్వయంగా అల్లాహు త’ఆలా ఖురాన్ లో ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు. సూరత్ అన్-నిసా, ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివారంటే ఇందులో కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.అయితే ఈ వలస అనేది ప్రళయ దినం వరకు ఉంది.

ఇక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 సంవత్సరాలు అక్కడ ఉండి దావత్ చేస్తూ, అవసరం పడ్డది యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. 10వ సంవత్సరం హజ్ కూడా చేశారు. లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట హజ్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా నిండాక 11వ సంవత్సరం, ఏంటి 11వ సంవత్సరం? ఇటు మదీనా వచ్చాక 11వ సంవత్సరం. అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 63 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. అప్పుడు ప్రవక్త వారు మరణించారు. కానీ ప్రవక్త మరణించేకి ముందే అల్లాహు త’ఆలా ఈ ధర్మాన్ని సంపూర్ణం చేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. (5:3)

అని సూరతుల్ మాయిదాలో ఆయత్ అవతరించింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు.

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
(ఇన్నక మయ్యితువ్ వ ఇన్నహుమ్ మయ్యితూన్)
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.(సూరత్ అజ్-జుమర్ 39:30)

నీవు కూడా చనిపోతావు, వారందరూ కూడా చనిపోతారు అని ప్రవక్త మరణానికి ముందే ఆయత్ అవతరింపజేయబడింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ కూడా అవతరించింది:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
(మిన్హా ఖలఖ్నాకుమ్ వ ఫీహా ను’ఈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా)
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.(సూరత్ తాహా, 20:55)

ఈ మట్టిలో నుండే మిమ్మల్ని పుట్టించాము. తిరిగి ఇందులోకి మీరు వెళ్తారు, సమాధి చేయబడతారు. మరియు ప్రళయ దినాన ఇక్కడి నుండే మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ మూడు సూత్రాల యొక్క సంక్షిప్త వివరణ మనం ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంతటితో నా సమయం కూడా ముగించింది. అందుకొరకు మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోలేము. కానీ ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ పూర్తి అంశం మూల సూత్రాలకు సంబంధించింది, త్రీ సూత్రాలకు సంబంధించి మా యూట్యూబ్ జీడీకే నసీర్ లో ఇంకా వేరే యూట్యూబ్ ఛానెల్ లో కూడా పాఠాలు ఉన్నాయి. శ్రద్ధగా విని మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ మూడు సూత్రాలు చూడడానికి సమాధానం మూడే పదాల్లో ఉన్నాయి. అల్లాహ్, ఇస్లాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ ను ఆరాధించకుంటే, ఇస్లాం ప్రకారంగా జీవించకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విధేయత పాటించకుంటే, సమాధిలో మనకు ఈ మూడు పదాలు పలకడానికి వీలు కాదు.

అల్లాహు త’ఆలా ఈ మూడు సూత్రాల గురించి ఏదైతే తెలుసుకున్నామో, ఇందులోని మంచి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితం సరిదిద్దుకునే అటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته.

ఇతర ముఖ్యమైన పోస్టులు

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2023/04/19/u3mnj/

హదీత్ అంటే ఏమిటి? హదీత్ ఖుద్సీ అని దేన్ని అంటారు? [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

హదీత్ అంటే ఏమిటి? హదీత్ ఖుద్సీ అని దేన్ని అంటారు?
https://youtu.be/pTJRtR-ca8c [11:20 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఉపన్యాసం హదీథ్ మరియు దాని రకాల గురించి వివరిస్తుంది. హదీథ్ అంటే ఏమిటి మరియు హదీథ్-ఎ-ఖుద్సీకి మరియు హదీథ్-ఎ-నబవికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తుంది. హదీథ్-ఎ-నబవి మూడు రకాలుగా విభజించబడింది: ప్రవక్త యొక్క మాటలను సూచించే ‘ఖౌలీ’, ఆయన చర్యలను వివరించే ‘ఫిలీ’, మరియు ఆయన ఆమోదాన్ని సూచించే ‘తఖ్రీరీ’. ఉపన్యాసంలో ప్రతి రకానికి ఖురాన్ మరియు హదీథ్ నుండి ఉదాహరణలతో సహా వివరణ ఇవ్వబడింది. సున్నత్ అనే పదాన్ని హదీథ్ కు పర్యాయపదంగా ఎలా ఉపయోగిస్తారో కూడా చర్చించబడింది, ఇందులో ప్రవక్త యొక్క శారీరక స్వరూపం మరియు సత్ప్రవర్తన కూడా ఉంటాయి. చివరగా, హదీథ్-ఎ-ఖుద్సీ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చెప్పబడిన అల్లాహ్ యొక్క మాటలు అని స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

హదీథ్ అంటే ఏమిటి? హదీథ్-ఎ-ఖుద్సీ దేనిని అంటారు? దీనిని మనం కొన్ని ఉదాహరణలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

హదీథ్ రెండు రకాలు. ఒకటి అల్ హదీథున్ నబవి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్. అల్ హదీథుల్ ఖుద్సీ అంటే, అల్లాహ్ చెబుతున్నాడు, అల్లాహ్ తెలిపాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీథ్.

అల్ హదీథున్ నబవి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్ అని ఎప్పుడైతే మనం అంటామో అది మూడు రకాలుగా ఉంటుంది.

  • అల్ ఖౌలీ (ప్రవచనం),
  • అల్ ఫిలీ (క్రియ, ఆచరణ),
  • తఖ్రీరీ (అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఎవరైనా ఏదైనా మాట్లాడారు లేదా ఏమైనా చేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని అంగీకరించారు లేదా దానిలో ఏదైనా సరిదిద్దుబాటు ఉండేది ఉంటే దానిని సరిచేశారు, సంస్కరించారు).

ఇక అల్ హదీథున్ నబవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్ లో ఈ మూడు రకాలు అని ఏదైతే మనం తెలుసుకున్నామో, ప్రతి ఒక్క దానికి ఒక దలీల్ ఉదాహరణగా మనం తెలుసుకుందాము.

మొదటిది ప్రవచనం, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట, ఆయన ప్రవచనం, ఆయన చెప్పారు అని ఏదైతే వస్తుందో.

ఉదాహరణకు, సహీహ్ బుఖారీలో హదీథ్ నంబర్ 38, సహీహ్ ముస్లింలో హదీథ్ నంబర్ 760, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు.

مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
“ఎవరైతే విశ్వాసం మరియు పుణ్య ఫలాపేక్షతో రమదాన్ మాసమంతా ఉపవాసం ఉంటారో, వారి గత పాపాలన్నీ కూడా మన్నించబడతాయి.”

ఇక అల్ ఫిలీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా ఆచరించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్రియ గురించి సహాబీ చెబుతున్నాడు, ప్రవక్త ఇలా చేశారు అని.

దీని ఉదాహరణ, దీనికి దలీల్ సహీహ్ ముస్లిం, హదీథ్ నంబర్ 226, సహీహ్ ముస్లింలోని పదాలు తీసుకోవడం జరిగింది అందు గురించి దీని ఆధారం ముందు చెప్పడం జరుగుతుంది. ఈ భావం సహీహ్ బుఖారీలో కూడా వచ్చి ఉంది, హదీథ్ నంబర్ 196. ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ కొరకు నీళ్ళు తెప్పించారని ఆయన బానిస హుమ్రాన్ చెప్పారు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు తమ రెండు అరచేతులను మూడుసార్లు కడిగారు మరియు పుక్కిలించారు, ముక్కులో నీళ్ళు ఎక్కించారు మరియు మూడు సార్లు ముఖం కడిగారు. మళ్ళీ మూడుసార్లు మోచేతుల వరకు కుడి చెయ్యి, ఆ తర్వాత మళ్ళీ ఎడమ చెయ్యి కడిగారు. మళ్ళీ తల యొక్క మసహ్ చేశారు. ఆ తర్వాత, రెండు కాళ్ళు ముందు కుడి కాలు, ఆ తర్వాత ఎడమ కాలు మూడుసార్లు కడిగారు చీలమండలాల వరకు. మళ్ళీ ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు:

رَأَيْتُ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا
[ర’అయ్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ తవద్ద్’అ నహ్వ వుదూ’ఈ హాదా]
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఎట్లా వుదూ చేశానో, అదే విధంగా వుదూ చేశారు.”

ప్రవక్త చేసిన ఒక పని గురించి ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ తెలియజేశారు. ఇది హదీథ్-ఎ-ఫిలీ యొక్క ఉదాహరణ అయింది.

ఇక హదీథ్-ఎ-తఖ్రీరీ, దీని ఉదాహరణ అబూ దావూద్ లో వచ్చి ఉంది, హదీథ్ నంబర్ 334. అమ్ర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, విపరీతమైన చలి రాత్రి నాకు స్వప్నస్కలనం జరిగింది. అప్పుడు మేము దాతుస్సలాసిల్ అనే యుద్ధంలో ఉన్నాము. అయితే ఒకవేళ నేను స్నానం చేశానంటే ఈ చలిలో నన్ను నేను చంపుకున్నట్టు అవుతుంది, ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. అందుకొరకు నేను తయమ్ముమ్ చేసి ఫజర్ నమాజ్ సహాబాలందరికీ చేయించాను, ఆ యుద్ధంలో ఎవరైతే ఆయన వెంట ఆ సందర్భంలో ఉన్నారో. అయితే మదీనా తిరిగి వచ్చిన తర్వాత సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అమ్ర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ సంఘటన తెలియజేశారు.

అప్పుడు ప్రవక్త నన్ను మందలిస్తూ, “యా అమ్ర్, సల్లయ్ తబి అస్ హాబిక వ అంత జునుబ్?” (ఓ అమ్ర్, నీవు అశుద్ధ స్థితిలో ఉండి నీ మిత్రులకు, తోటి సహాబాలకు నమాజ్ చేయించావా?). “ఫ అఖ్ బర్ తుహూ బిల్ లదీ మన’అనీ మినల్ ఇగ్ తిసాల్” (స్నానం చేయడం నుండి నన్ను ఆపిన విషయం ఏమిటో, అంటే ఏ కారణం చేత నేను స్నానం చేయలేదో, పైన ఏదైతే మనం తెలుసుకున్నాము కదా, విపరీతమైన చలి ఉంది, ఆ చలిలో నేను స్నానం చేస్తే చనిపోతానన్నటువంటి భయం జరిగింది నాకు).

అయితే ఆ విషయాన్ని మొత్తం నేను ప్రవక్తకు వివరించాను. అంతేకాకుండా ఇంకా నేను చెప్పాను, ప్రవక్తా, నేను అల్లాహ్ యొక్క ఈ మాటను విన్నాను, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం సూరతున్నిసా, ఆయత్ నంబర్ 29 లో:

وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
[వలా తఖ్ తులూ అన్ఫుసకుమ్, ఇన్నల్లాహ కాన బకుమ్ రహీమా]
“మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై చాలా కరుణించేవాడు.” (4:29)

అందుకొరకే, స్నానం చేస్తే చనిపోతానన్నటువంటి భయం కలిగింది గనక నేను స్నానం చేయలేదు మరియు తయమ్ముమ్ చేసి నమాజ్ చేయించాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వారు, ఏమీ అనలేదు. అయితే ఇక్కడ ఏం తెలిసింది? సహాబీ ఒక పని ఏదైతే చేశారో, అది బాగానే ఉంది అన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరించారు. అందుకొరకే దీనిని హదీథ్-ఎ-తఖ్రీరీ అని అనడం జరిగింది.

ఇక హదీథ్ ను సున్నత్ అని కూడా అనడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇందులో మరో నాలుగో రకం కూడా చేరుతుంది. అదేమిటి? ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆకృతి, ఆయన ఎలా ఉన్నారు అన్న విషయం, అంతేకాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సత్ప్రవర్తనలు కూడా ఇందులో ప్రస్తావించబడతాయి.

ఉదాహరణకు సహీహ్ ఇబ్నె హిబ్బాన్, హదీథ్ నంబర్ 5676, ముస్నద్ అహ్మద్ 24903 లో ఉంది, ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారిని ప్రశ్నించడం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేస్తారు అని. అప్పుడు ఆమె చెప్పారు:

كَانَ يَخِيطُ ثَوْبَهُ، وَيَخْصِفُ نَعْلَهُ، وَيَعْمَلُ مَا يَعْمَلُ الرِّجَالُ فِي بُيُوتِهِمْ
“ప్రవక్త తమ దుస్తుల్లో ఎక్కడైనా ఏదైనా చినిగి ఉంటే అతుకు వేసుకునేవారు మరియు అలాగే చెప్పులు ఏదైనా కుట్టుకునే అవసరం వస్తే కుట్టుకునేవారు. ఇంకా సామాన్యంగా పురుషులు ఇంట్లో ఎలాగైతే పనులు చేసుకుంటారో, అలా చేసుకునేవారు.”

ఇక్కడి వరకు ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్, హదీథ్-ఎ-నబవి అని ఏదైతే అంటారో అందులో ఉన్నటువంటి నాలుగు రకాలు ఆధారాలతో సహా మనం తెలుసుకున్నాము. ఇక హదీథ్ రెండు రకాలు అని ముందు చెప్పాము కదా? ఒకటి హదీథ్-ఎ-నబవి, దాంట్లో నాలుగు రకాలు దాని వివరణ అయిపోయింది. రెండవది అల్ హదీథుల్ ఖుద్సీ. అల్ హదీథుల్ ఖుద్సీ అంటే అల్లాహ్ ఏదైనా మాట చెబుతున్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం, ఉల్లేఖించడం. దీని యొక్క ఉదాహరణ సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 7405, సహీహ్ ముస్లిం 2675, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

يَقُولُ اللَّهُ تَعَالَى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي بِي
[యఖూలుల్లాహు త’ఆలా: అన ఇన్ ద దన్ని అబ్ దీ బీ, వ అన మ’అహూ ఇదా కరనీ]
“అల్లాహు త’ఆలా ఇలా చెబుతున్నాడు: నేను నా దాసుని ఆలోచన, అతడు నా గురించి ఎలాంటి మంచి ఆశ ఉంచుకుంటాడో అదే విధంగా నేను అతనితో మసలుకుంటాను. మరియు అతడు ఒకవేళ నన్ను స్మరించాడంటే, నేను అతనికి తోడుగా ఉంటాను.”

ఇంకా హదీథ్ కొంచెం పొడుగ్గా ఉంది చివరి వరకు. అయితే ఇక్కడ ఈ హదీథ్ లో ఏమన్నారు ప్రవక్త గారు? అల్లాహ్ చెబుతున్నాడు అని. అయితే ఈ విధంగా హదీథ్ లో ఎక్కడైతే వస్తుందో, అక్కడ దానిని అల్ హదీథుల్ ఖుద్సీ అనడం జరుగుతుంది.

బహుశా హదీథ్ అంటే ఏమిటో కొంచెం అర్థమైంది అని భావిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఖురాన్ హదీథ్ ప్రకారంగా ధర్మ విద్య నేర్చుకునే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=9349

ఇతరములు:

సహాబాలు – వారి గొప్పతనం, వారి గురించి మనకు ఉండ వలసిన అఖీదా (విశ్వాసము) [ఆడియో & టెక్స్ట్]

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

భాగం 01: సహాబా అంటే ఎవరు? (2:06నిముషాలు)

భాగం 02: సహాబా యొక్క ప్రాముఖ్యత  (1:11నిముషాలు)

భాగం 03: ఇస్లాంలో సహాబాల గొప్పతనం (1:43నిముషాలు)

భాగం 04: తౌరాతు మరియు ఇంజీలు గ్రంధాలలో సహాబాల ప్రస్థావన (3:28నిముషాలు)

భాగం 05: సహాబాల గురించి ప్రవక్త గారు ఏమి చెప్పారు? (1:48 నిముషాలు)

భాగం 06: మన మీద సహాబాల హక్కులు ఏమిటి? (2:05 నిముషాలు)

భాగం 07: సహాబాల గురించి ఖురాన్ ఏమి చెబుతుంది? (0:49నిముషాలు)

భాగం 08: సహాబాల స్వర్ణయుగపు రోజులు (1:31నిముషాలు)

భాగం 09: సలఫ్ సాలిహీన్ దృష్టిలో సహాబాల గొప్పతనం (3:21 నిముషాలు)

భాగం 10: సహాబాలను ప్రేమించడం విశ్వాసంలో ఒక భాగం (2:04నిముషాలు)

భాగం 11: ఇమాం అహ్మద్ సహాబాల గురుంచి ఏమి చెప్పారు? (1:09నిముషాలు)

పూర్తి ఆడియో క్రింద వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

సహాబా : పూర్తి ఆడియో (21:21నిముషాలు)

ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.

అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?

“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు

ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,

أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا
(అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా)
సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.

وَأَعْمَقُهَا عِلْمًا
(వ అ’మఖుహా ‘ఇల్మా)
చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.

وَأَقَلُّهَا تَكَلُّفًا
(వ అఖల్లుహా తకల్లుఫా)
చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.

وَأَقْوَمُهَا هَدْيًا
(వ అఖ్వముహా హద్యా)
సన్మార్గంపై, సన్మాగంపైన అందరికంటే ఎక్కువగా ఉత్తమంగా నడిచేవారు.

وَأَحْسَنُهَا حَالًا
(వ అహ్సనుహా హాలా)
అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.

اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ
(ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి)
అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు

గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.

సూరతుల్ ఫతహ్ లో:

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)

గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.

అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,

تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ

ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?

وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:

لَا تَسُبُّوا أَصْحَابِي
(లా తసుబ్బూ అస్ హాబీ)
నా సహాబాలను మీరు దూషించకండి.

అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?

“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.”
మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.

గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?

మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.

ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.

సూరతుల్ అహ్జాబ్, ఆయత్ నంబర్ 58లో అల్లాహు తాలా తెలిపాడు:

وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا

ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.

అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:

خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ
(ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్)
అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.

అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.

మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.

అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.

అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?

అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.

సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي
(అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ)
నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.

ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”

فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ
(ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్)
ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు

وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ
(వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా)
ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.

గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?

మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:

مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
(మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్)
ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.

ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”

ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.

ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది

ఇతరములు:

సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

ప్రళయ దినం మరియు దాని సూచనలు [ఆడియో, టెక్స్ట్]

ఇక్కడ వినండి లేదా ఆడియో డౌన్లోడ్ చేసుకోండి [37నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ

ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ
(యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్)
ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.

రెండో విషయం చెప్పాడు:

وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا
(వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా)
ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది

మూడో విషయం చెప్పాడు.

وَتَرَى النَّاسَ سُكَارٰى
(వ తరన్ నాస సుకారా)
జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.

وَمَا هُمْ بِسُكَارٰى
(వమా హుమ్ బిసుకారా)
కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)

ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.

وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ
(వలాకిన్న అదాబల్లాహి షదీద్)
ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.

ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.

అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:

فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا
(ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా)
ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)

ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.

اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ
(ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్)
ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)

ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.

అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.

ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ
(బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్)
నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.

అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.

ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.

ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا
(అన్ తలిదల్ అమతు రబ్బతహా)
బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.

మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.

ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.

మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.

ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.

وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ‏ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى
(వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా)
అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.

ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.

అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.

ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.

మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”

అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,

إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ
(ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్)
నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.

ఏంటి ఆ పెద్ద సూచనలు?

  1. అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
  2. అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
  3. దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
  4. సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
  5. ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
  6. య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
  7. మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
  8. యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.

వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:

“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?

వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.

సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.

దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.

కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,

اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَّالِ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్)

అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.

ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.

రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.

మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.

పరలోకం (The Hereafter)
https://teluguislam.net/hereafter/

షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి? [ఆడియో, టెక్స్ట్]

షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి?
https://www.youtube.com/watch?v=1qamx6aMM3U [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

”నిశ్చయంగా షైతాన్‌ మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువు గానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవడానికే పిలుస్తున్నాడు”. (సూరా ఫాతిర్‌: 06)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
”నిశ్చయంగా షైతాన్‌ మనిషి నరాల్లో రక్తం వలె ప్రవహిస్తుంటాడు”. (బుఖారీ)


ఈ ఆడియో లో క్రింది విషయాలు వివరించబడ్డాయి:

  1. అల్లాహ్ యొక్క జిక్ర్ 
  2. షిర్క్  నుండి  & పాపకార్యాల నుండి దూరముండుట 
  3. అల్లాహ్ పై బలమైన విశ్వాసం మరియు నమ్మకం 
  4. వివిధ సందర్భాలలో దుఆలు పఠించడం 
  5. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చదివే దుఆ చదవడం 
  6. 100 సార్లు “లా ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు …” చదవడం 
  7. మితి మీరిన కోపానికి దూరముండుట, కోపం వచ్చినప్పుడు “అవూజు బిల్లాహి మినష్ షైతానిర్రజీమ్” చదువుట  
  8. సూరా అల్ ఫలఖ్ , సూరా అల్ నాస్ చదవడం 
  9. ఇంట్లో ప్రవేశించేటప్పుడు , తినేముందు, తాగేముందు బిస్మిల్లాహ్ తో ప్రారంభించడం 
  10. ఇంట్లో సురా బఖర చదవడం 
  11. నిద్ర పోయే ముందు “అయతుల్ కుర్సీ” చదవడం 
  12. నిద్ర పోయే ముందు సురా బఖర చివరి రెండు అయతులు చదవడం 
  13. మస్జిద్ లోకి ప్రవేశించేటప్పుడు చేసే దుఆ చేసుకోవడం 

ఈ ప్రసంగంలో షైతాన్ నుండి రక్షణ పొందటానికి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివిధ పద్ధతులు వివరించబడ్డాయి. ఈ అంశం రెండు భాగాలుగా విభజించబడింది: మొదటిది, షైతాన్ యొక్క చెడు ప్రేరేపణలు మరియు గుసగుసల (వస్వసా) నుండి మనల్ని మనం కాపాడుకోవడం. రెండవది, షైతాన్ లేదా జిన్నాతుల భౌతిక హాని, అనగా ఆవహించడం లేదా ఇంట్లో నివసించడం వంటి సమస్యల నుండి రక్షణ. ప్రసంగంలో అల్లాహ్ స్మరణ (ధిక్ర్), ఆయతుల్ కుర్సీ, సూరహ్ అల్-బఖరాలోని చివరి రెండు ఆయతులు మరియు ముఅవ్విదతైన్ (సూరహ్ అల్-ఫలఖ్ మరియు సూరహ్ అన్-నాస్) పఠించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పబడింది. అలాగే, ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మరియు మస్జిద్ లోకి ప్రవేశించేటప్పుడు పఠించవలసిన దుఆలు మరియు వాటి ప్రయోజనాలు వివరించబడ్డాయి. షిర్క్ మరియు బిద్అత్ చర్యలైన బాబాల వద్దకు వెళ్లడం, తాయత్తులు కట్టడం వంటి వాటి నుండి దూరంగా ఉండాలని గట్టిగా సూచించబడింది.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బద్.

సోదరులారా! ఈరోజు, షైతాన్ నుండి మనం ఎలా రక్షణ పొందాలి? అన్న శీర్షికపై, టాపిక్ పై మీ ముందు ఖురాన్ మరియు హదీసు ఆధారంగా కొన్ని విషయాలు తెలుపుతాను.

చూడండి, అల్లాహ్ త’ఆలా మనల్ని పుట్టించింది, మనం కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుటకు. కానీ, షైతాన్ వాడు మనల్ని అల్లాహ్ మార్గం నుండి దూరం చేసి నరకం వైపునకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికై షైతాన్ సాఫల్యం పొందుటకు ఎన్నో రకాలుగా మానవులను పెడమార్గం పట్టిస్తూ ఉంటాడు. ఖురాన్లో దీని గురించి ఎన్నో ఆయతులు ఉన్నాయి, కానీ ఆ వివరాల్లో నేను ఇప్పుడు వెళ్లడం లేదు. సంక్షిప్తంగా ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, షైతాన్ నుండి మనం ఎలా రక్షణ పొందగలుగుతాము.

ఉన్న ఈ టాపిక్ లో రెండు భాగాలు అనుకోండి. ఒకటి, షైతాన్ యొక్క వస్వసాల నుండి, అతని ప్రేరేపణల నుండి, అతను చెడు కార్యాలు చేయుటకు మనలో ఏ బీజమైతే నాటే ప్రయత్నం చేస్తాడో, ఎలాంటి కోరికలను పెంపొందించే ప్రయత్నం చేస్తాడో, వాటి నుండి మనం ఎలా దూరం ఉండగలుగుతాము. పుణ్యంపై, సత్కార్యంపై, అల్లాహ్ యొక్క విధేయతపై ఎలా స్థిరంగా ఉండగలుగుతాము. ఇది ఒక భాగం.

రెండో భాగం, సామాన్యంగా మనం వింటూ ఉంటాం కదా, అయ్యో ఆ మనిషికి షైతాన్ పట్టిందట, అతనిలో జిన్ చొరబడ్డదంట, “షైతాన్ పకడ్ లియా ఉసే, ఆసేబ్ హోగయా” ఉర్దూలో అంటారు కదా. లేక, ఓ వాళ్ళ ఇంటి మీద షైతాన్ వాలి ఉంది, ఎప్పుడూ ఏదో ఒక విచిత్ర కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక, ఇలాంటి అనుమానాల్లో పడ్డ తర్వాత, ఒక మనిషికి షైతాన్ వాస్తవంగా పట్టి ఉండేది ఉంటే, లేదా ఎవరి ఇంటిలోనైనా షైతాన్ నివాసం చేసి అక్కడ ఉన్న ఇంటి వారికి ఏదైనా పరేషాన్ చేస్తూ వారి జీవితం సుఖంగా జరగకుండా ఏదైనా ఇబ్బంది పాలు చేస్తే, ఖురాన్, హదీసులు మనకు అలాంటి ఇబ్బందుల నుండి దూరం ఉండటానికి ఏ మార్గం చూపుతుందో ఈ రోజుల్లో ప్రజలు తెలుసుకోకుండా చాలా దూరంగా ఉన్నారు. ఏం చేస్తారు? వెంటనే ఫలానా బాబా దగ్గరికి వెళ్దాము, ఫలానా పీర్ దగ్గరికి వెళ్దాము, ఫలానా సమాధి వద్దకు వెళ్దాము, ఫలానా తాయీజ్ వేద్దాము, లేదా ఇంటి రక్షణ కొరకు షైతాన్ నుండి ఆ ఇంటి నలువైపులా ఏదో దర్గాల కాడి నుండి చదివించుకుని వచ్చి మొళలు నాటడం, లేదా ఇంటి కడపకు ఆ మిరపకాయలు లేదా నిమ్మకాయ, లేకుంటే బూడిద గుమ్మడికాయ ఇలాంటివి తగిలించడం, లేక మరి మా చిన్నప్పుడు మేము చూసాము కొన్ని ప్రాంతాల్లో, చెత్త కుప్ప ఎక్కడైతే వేస్తారో అక్కడ ఒక గుంజ, ఒక నాటు వేసి దానికి ఒక చెప్పు, ఒక చీపురు తగిలేసేవారు. ఈ వాడ మీద ఏ ఆ రేపు రాక్షసులు వస్తున్నాయి, ఆ ఇది రాకుండా జాగ్రత్తగా ఉంటాయి. అంటే ఇలాంటి, లేదా తాయీజులు, తాయత్తులు ఇలాంటి విషయాలకు పాల్పడుతున్నారు.

అయితే సోదరులారా! ఇవన్నీ కూడా తప్పు. ఇవన్నీ కూడా మనల్ని ఇంకింత షిర్క్ లో, ఇంకింత పాపంలో, బహుశా కొన్ని సందర్భాల్లో ఏదైనా కొందరికి కొంత లాభం కనబడుతుంది కావచ్చు. కానీ, అసలైన లాభం అల్లాహ్ తో సంబంధం ఏదైతే ఉంటుందో, విశ్వాసం ఏదైతే ఉండాలో అవన్నీ కోల్పోతారు. అందు గురించి ఇక రండి, ఈ రెండు భాగాలు ఏదైతే నేను చెప్పానో వాటన్నిటికీ నేను ఈ రోజు చెప్పబోయే విషయాల్లో మీకు సమాధానం అనేది ఇన్ షా అల్లాహ్ లభిస్తుంది.

ఒక మనిషి షైతాన్ నుండి దూరం ఉండడానికి ఏం చేయాలి? లక్ష్మణ రేఖ అని ఎప్పుడైనా విన్నారా మీరు? ఏంటిది? సీత బయటికి వెళ్ళకుండా రాముడు గీసిన గీత కాదు, మన ఇళ్లల్లో మనం చీమలు రాకుండా, ఒక చాక్ పీస్ ల వస్తది ఉంటది, దానితో గీస్తాం కదా. సామాన్యంగా ఏం చూడడం జరిగింది? చీమలు రాకుండానే ఉంటాయి. చూసారా లేదా? రాత్రి దోమలు రాకుండా ఏం చేస్తారు? మఛ్ఛర్ దాని గాని, ఆ లేదా అంటే, ఆ ఆరెస్సా, టిఆర్ఎస్ ఏవో మందులు కూడా ఉంటాయి కదా అట్లాంటివి. లేక మీరు అనండి, ఎక్కడైతే అగ్ని మండుతుందో, దాని మీద నీళ్లు పోస్తే ఏమైపోతుంది? అగ్ని ఆరిపోతుందా? ఈ సామెతలు ఎందుకు ఇస్తున్నాను? ఈ సామెతలు, ఇలాంటి ఉదాహరణలు మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకు ఇవ్వడం జరిగింది. అదేమిటి? ఎక్కడైతే అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో అక్కడ షైతాన్ రావడానికి ఆస్కారం ఉండదు. ఇంతకుముందు ఉదాహరణలు, సామెతలు ఏవైతే చెప్పుకున్నామో, పెద్దలు చెప్పిన విషయాలు, కొందరి అనుభవించినవి లేకుంటే అనుభవశాలుల అనుభవాలు. కానీ, షైతాన్ మనకు దగ్గరగా రాకుండా, షైతాన్ వస్వసాలలో మనం పడకుండా, షైతాన్ మనకు ఎలాంటి హాని కలిగించకుండా మనం ఉండాలంటే, దానికి మొట్టమొదటి, అతి ముఖ్యమైనది, అతి గొప్పది, అతి పెద్ద నివారణ, చికిత్స, రేఖ, హద్దు, బందిష్, ఏదేనా పేరు పెట్టుకోండి మీరు. ఏంటది? అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్. ఎక్కడ అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో అక్కడ షైతాన్ కు ఏ మాత్రం అవకాశం దొరకదు. 

ఈ విషయం నేను ఎన్నో హదీసులు, ఎన్నో ఆయతులు ఉన్నాయి కానీ ఒక మంచి ఉదాహరణ ద్వారా ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ త’ఆలా యహ్యా అలైహిస్సలాంకు ఐదు విషయాల గురించి ఆదేశించాడు. అందులో ఒకటి ఏమిటి? “వఆమురుకుం అన్ తద్కురుల్లాహ్” అల్లాహ్ నాకు ఇచ్చిన ఆదేశం, నేను మీకు ఇస్తున్నాను, ఏమిటి? వఆమురుకుం, నేను మీకు ఆదేశిస్తున్నాను, అన్ తద్కురుల్లాహ్, మీరు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి. అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేస్తూ ఉండండి. “ఫఇన్న మసల దాలిక్”, దీని ఉదాహరణ ఎలాంటిది అంటే, “కమసలి రజులిన్ ఖరజల్ అదువ్వు ఫీ అసరిహి సిరాఅన్ హత్తా ఇదా అతా అలా హిస్నిన్ హసీనిన్ ఫ అహ్రజ నఫ్సహు మిన్హు”. ఒక వ్యక్తి పరుగుతున్నాడు, ఉరుకుతున్నాడు, అతని వెనుక అతని శత్రువులు ఉన్నారు. ఆ మనిషి శత్రువుల చేతిలో చిక్కకుండా పరుగులు తీస్తున్నాడు. చాలా వేగంగా. ముందుకు వెళ్ళిన తర్వాత చాలా బలమైన ఒక గట్టి కోటలో “అహ్రజ నఫ్సహు” తనను తాను బంధించుకుంటాడు. అక్కడ వెళ్ళి రక్షణ పొందుతాడు. ఆ కోటలో వెళ్ళిన తర్వాత, వెనుక శత్రువులు ఏదైతే పరుగెత్తుకుంటూ వస్తున్నారు కదా, ఇతన్ని పట్టుకోవడానికి, వాళ్ళు ఓడిపోతారు. అంటే ఇక పరుగు పెట్టకుండా, అల్లా ఇక ముంగట అతను చాలా మంచి బలమైన కోటలో వెళ్ళిపోయిండు. ఇక అక్కడి వరకు వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి మనకు ఎలాంటి తాకత్ లేదు అన్నట్టుగా వాళ్ళు ఓడిపోతారు. అల్లాహ్ ఏం చెప్పారు, యహ్యా అలైహిస్సలాంకి? ఈ ఉదాహరణ ఎలాంటిది?

كَذَلِكَ الْعَبْدُ لاَ يُحْرِزُ نَفْسَهُ مِنَ الشَّيْطَانِ إِلاَّ بِذِكْرِ اللَّهِ
(కధాలికల్ అబ్దు లా యుహ్రిజు నఫ్సహు మినష్-షైతాని ఇల్లా బిధిక్-రిల్లాహ్)
అదేవిధంగా, ఒక దాసుడు అల్లాహ్ స్మరణ ద్వారా తప్ప షైతాన్ నుండి తనను తాను రక్షించుకోలేడు.

మనిషి తనను తాను షైతాన్ చిక్కులో చిక్కకుండా రక్షణగా ఉండాలంటే అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ ధిక్ర్ లో ఎప్పుడైతే వచ్చేస్తాడో అతను ఒక బలమైన కోటలో ప్రవేశించినట్లు, షైతాన్ అతని మీద ఎలాంటి దాడి, షైతాన్ యొక్క యొక్క ఎలాంటి పగ అనేది తీరకుండా ఉంటుంది.

సోదరులారా! అల్లాహ్ యొక్క ధిక్ర్ లో చాలా గొప్ప శక్తి ఉంది. అందు గురించే ఖురాన్లో కూడా మనకు ఇలాంటి ధిక్ర్ లు, ఇలాంటి దుఆలు ఎక్కువగా చదువుతూ ఉండడానికి చెప్పడం జరిగింది. మనిషి దగ్గరికి షైతాన్ రావడానికి ఎన్నో పాప కార్యాలు, ఎన్నో తప్పుడు పనులు చేయడం కూడా ఒక సబబే. అందు గురించి మనిషి సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? గట్టి బలమైన విశ్వాసం మీద ఉండాలి. సూర నహల్ మీరు చదివారంటే, అల్లాహ్ త’ఆలా అందులో తెలిపాడు, ఎవరైతే విశ్వాసులో, అలాంటి వారిపై షైతాన్ తన యొక్క పన్నాగం పన్నలేడు.

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
(ఇన్నహూ లైస లహూ సుల్తానున్ అలల్లదీన ఆమనూ వ అలా రబ్బిహిమ్ యతవక్కలూన్)
విశ్వసించి, తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి (షైతానుకు) ఎలాంటి అధికారం ఉండదు (16:99)

إِنَّمَا سُلْطَانُهُ عَلَى الَّذِينَ يَتَوَلَّوْنَهُ وَالَّذِينَ هُم بِهِ مُشْرِكُونَ
(ఇన్నమా సుల్తానుహూ అలల్లదీన యతవల్లౌనహూ వల్లదీన హుమ్ బిహీ ముష్రికూన్)
అయితే వాడితో స్నేహం చేసి, వాడిని అల్లాహ్‌కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది (16:100)

షైతాన్ ఎవరితో ఉంటాడు? ఎవరితో ఉండడు? అన్న విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు ఏం తెలిసింది? షైతాన్ మనకు తోడుగా ఉండకూడదు అంటే, లేక షైతాన్ వలలో మనం చిక్కకూడదు అంటే, విశ్వాసం మరియు అల్లాహ్ పై భరోసా చాలా గట్టిగా ఉండాలి. మరి ఎవరైతే షిర్క్ పనులు చేస్తారో, స్వయంగా షైతాన్ కు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాడో, అతను షైతాన్ ను స్నేహితునిగా చేసుకున్నట్లు. ఇక మీరు ఆలోచించండి, ఇక్కడ ముఖ్యంగా షిర్క్ పదం వచ్చేసింది. ఇంకా, పాటలు వినడం, నమాజులు వదలడం ఇలాంటి కార్యాలన్నీ షైతాన్ కు ఇష్టం ఉన్నాయా, లేవా? ఇష్టం ఉన్నాయి. అలాంటి కార్యాలు మనం చేస్తే షైతాన్ కు ఇంకా దగ్గరగా అవుతాము. అందు గురించి ఇది అతి ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాలి.

అందు గురించే ఇస్లాం ధర్మంలో ఎన్నో సందర్భాల్లో మనకు కొన్ని దుఆలు నేర్పడం జరిగినాయి. ఆ దుఆలను మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే, ఇన్ షా అల్లాహ్, అల్లాహ్ యొక్క దయవల్ల షైతాన్ వలలో చిక్కకుండా ఉండగలుగుతాము.

ఉదాహరణకు, ఇంటి నుండి మనం బయల్దేరినప్పుడు. ఏదైనా పని మీద మనం బయటికి వెళ్తాం. బయట షైతాన్ మనలో చిక్కకుండా ఉండడానికి ముందు ఏం చేయాలి మనం? ఇంటి నుండి బయల్దేరునప్పుడు ఏ దుఆ అయితే ప్రవక్త గారు మనకు నేర్పారో ఆ దుఆ చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఇంటి నుండి బయల్దేరుతూ, “బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” చదువుతారో, వారికి ఏ కార్యం మీద వారు వెళ్తున్నారో అందులో అతనికి మార్గం చూపబడుతుంది, అతని గురించి అల్లాహ్ సరిపోతాడు, “వ తనహ్హా అన్హుష్-షైతాన్” షైతాన్ అతడి నుండి దూరమైపోతాడు.

చూడండి ఎంత గొప్ప లాభం ఉంది. ఇది అబూ దావూద్ లో హదీస్ ఉంది, సహీ హదీస్.

ఇక బయటికి వెళ్ళాం మనం. ఈ దుఆ పాబందీగా చదువుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ ఏ అవకాశం ఉన్నా గానీ మనం ఏం చేయాలి?

لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهْوَ عَلَى كُلِّ شَىْءٍ قَدِيرٌ
(లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్)

ఈ దుఆ మనం చదువుతూ ఉన్నామంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఒక రోజులో వంద సార్లు ఇది చదువుతారో, “కానత్ లహు అద్ల అష్ర రిఖాబ్”, అతను పది బానిసలను విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది. అతనికి గురించి వంద పుణ్యాలు రాయబడతాయి అతని గురించి. మరియు మూడో లాభం, వంద పాపాలు అతనివి తుడిచివేయబడతాయి. నాలుగవది, “కానత్ లహు హిర్ జమ్ మినష్-షైతాన్”. ఈ వంద సార్లు ఈ దుఆను చదవడం ద్వారా షైతాన్ నుండి అది అతనికి ఒక రక్షణగా ఉంటుంది. ఐదవ లాభం, ఆ రోజు అతని కంటే ఉత్తముడు, మంచివాడు ఇంకా ఎవడూ ఉండడు. ఎవరైనా ఉంటే ఎవరు? వంద సార్లు చదివిన వ్యక్తి లేదా అంతకంటే ఎక్కువ చదివిన వ్యక్తి.

కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే చెప్పారో, షైతాన్ నుండి రక్షణ కలుగుతుంది అని, అక్కడ ఇంకో విషయం చెప్పారు. ఏంటిది? పొద్దున చదివేది ఉంటే సాయంకాలం వరకు. ఈ విధంగా పొద్దున వంద సార్లు, సాయంకాలం వంద సార్లు చదవడానికి. ఇక కొందరు అజ్ఞానులు ఏమంటారో తెలుసా? ఇక ఇదేం, మనం భజన చేసుకుంటూనే ఉండాలి, ఇవే జపించుకుంటూ జపం చేసుకుంటూ ఉండాలి. అస్తగ్ఫిరుల్లాహ్. ఉన్నారా అలాంటి కొందరు మూర్ఖులు కూడా. అల్లాహ్ వారికి, మనకు అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

“లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్” వంద సార్లు చదవడానికి ఐదు నిమిషాలు కూడా పట్టవు. మరి ఎవరైనా చాలా స్లోగా చదివేది ఉంటే, ఆరేడు నిమిషాలు పట్టినా గానీ, 24 గంటల్లోకి వెళ్ళా, ఆరేడు నిమిషాలు, పది నిమిషాలు, దీని ద్వారానే అయితే మనకు పొద్దంతా షైతాన్ నుండి రక్షణ కలుగుతుందో, అలాంటి వాటికి మనం ఐదు, పది నిమిషాలు కేటాయించలేకపోతామా? గమనించండి. మళ్ళీ పోతే ఇవి ఓ మూల కూర్చుని మీరు చదివే అవసరం లేదు. నడుస్తూ నడుస్తూ చదవవచ్చు. ఎక్కడైనా ఏదైనా వెయిటింగ్ లో ఉన్నారు, అక్కడ కూర్చుని చదవండి. కానీ ఏందంటే కొంచెం మనసు పెట్టి చదవండి.

బయటికి వెళ్ళి ఏదైనా పనిలో ఉంటాము, ఏదైనా కార్యంలో ఉంటాము, ఎవరితోనైనా మాట్లాడతాము, అక్కడ ఏం జరుగుతుంది? కోపం వస్తుంది. అల్లాహ్ మనందరినీ కూడా అధర్మ కోపం నుండి కాపాడు గాక. ధర్మపరమైన కోపంలో కూడా హద్దులో ఉండే భాగ్యం కలిగించు గాక. కోపం మితిమీరినప్పుడు కూడా షైతాన్ కు మంచి అవకాశం దొరుకుతుంది. అందు గురించి సామాన్యంగా మనం ఎక్కువగా కోపంలో రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కొందరికి, కోపం దాని హద్దు మీరింది అంటే, బట్టలు చింపుకుంటాడు, ఏ వస్తువు ఉన్నా గానీ మొబైల్ ఉన్నా గానీ, గంజి ఉన్నా గానీ, చెంచా ఉన్నా గానీ తీసి విసిరేస్తాడు. ఎవరి నెత్తి మీద తలుగుతుంది, ముఖం మీద తలుగుతుంది, ఎలాంటిది ఏదీ చూడడు. అల్లాహ్ త’ఆలా మనందరినీ షైతాన్ నుండి రక్షించు గాక.

అందు గురించి ఏం చేయాలి? “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” ఎక్కువ చదువుతూ ఉండాలి. మనిషికి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” చదువుతూ ఉండాలి. ఒకసారి హజ్రత్ సులైమాన్ బిన్ సురద్ రదియల్లాహు అన్హు ప్రవక్తతో ఉన్నారు. అక్కడే కొంచెం దగ్గర్లో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. చివరికి బూతు మాటలకు దిగారు, తిట్టుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి ఎంత కోపానికి వచ్చేసాడు అంటే హదీస్ లో ఉంది, అతని చెంపలు ఉబ్బుతున్నాయి, ముఖం ఎర్రగా అయిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇన్నీ ల అ’లము కలిమతన్”. నాకు ఒక వచనం, ఒక మాట తెలుసు. ఆ మాట ఆ వ్యక్తి పలుకుతే అతని కోపం దిగజారిపోతుంది. మళ్ళీ చెప్పారు, “లౌ కాల అఊదు బిల్లాహి మినష్-షైతాన్”, ఇంకో రివాయత్ లో ఉంది “రజీమ్” అని కూడా. “దహబ అన్హు మా యజిద్”. ఒకవేళ అతను షైతాన్ నుండి అల్లాహ్ రక్షణ కోరుతూ ఉంటే, “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” చదువుతూ ఉంటే, ఏమవుతుంది? అతని కోపం చల్లారుతుంది, దిగజారిపోతుంది. అందు గురించి కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా, షైతాన్ నుండి రక్షణ కొరకు చాలా గట్టి మంచి ఆయుధం. బుల్లెట్ తగలకుండా ఏం చేస్తారు? బుల్లెట్ ప్రూఫ్. ఏదైనా అగ్ని మంటల్లో ఏదైనా పని చేస్తే అట్లాంటి పరిస్థితి వస్తే లేకుంటే అలాంటి భయం ఉండేది ఉంటే, ఏమంటారు దాన్ని? ఫైర్ ప్రూఫ్. అలాంటివి వేసుకొని వెళ్తారు కదా. షైతాన్ ప్రూఫ్ ఏంటి? షైతాన్ నుండి రక్షణ ఉండడానికి ఒకటి “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” విన్నాం కదా. ఇంకొకటి, “ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్” మరియు “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్“. ఈ రెండు సూరాలు, ప్రత్యేకంగా “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్” ఏముంది?

مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
(మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్)
గోచర, అగోచరంగా ఉండి చెడు ప్రేరేపణలు చేసేవాని కీడు నుండి. (114:4)
ఎవరి గురించి ఇది? షైతాన్ గురించి.

అయితే ఈ రెండు సూరాలు మంచిగా గుర్తుంచుకోవాలి. మరి ఈ రెండు సూరాల ఘనత ఇంతకు ముందే మనం ఒక సందర్భంలో విని ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం, ప్రతి నమాజ్ తర్వాత చదవాలి, ఒక్కొక్కసారి. “ఖుల్ హువల్లాహు అహద్” అది కూడా ఒకసారి చదవాలి. మరియు పడుకునే ముందు మూడు మూడు సార్లు చదవాలి. చేతి మీద ఊదుకోవాలి. సాధ్యమైనంత వరకు తుడుచుకోవాలి. ఇంకా పొద్దున మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు చదవాలి. ఈ విధంగా మీరు గమనించండి, కనీసం ఒక ముస్లిం పొద్దంతా “ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్”, “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్” మరియు “ఖుల్ హువల్లాహు అహద్” రోజుకు 14 సార్లు చదవాలి అన్నటువంటి ఆదేశం మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. ఎన్ని సార్లు? 14 అయినాయా? ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, పడుకునేటప్పుడు మూడు సార్లు, తొమ్మిది. ఐదు నమాజుల తర్వాత ఒక్కొక్కసారి. ఐదు + తొమ్మిది, 14. ఈ విధంగా.

షైతాన్ నుండి రక్షణ కొరకు, ఇప్పటి వరకు మనం ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత విషయాలు వినుకుంటూ వచ్చాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత, పిల్లల బాధ్యత కూడా చాలా గొప్పగా ఉంటుంది. షైతాన్ అక్కడ కూడా, ఇంకో హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, షైతాన్ షిర్క్ తర్వాత ఏ పాపంతోని ఎక్కువగా సంతోషిస్తాడో తెలుసా? భార్యాభర్తల్లో దూరం చేయడానికి. ఎవరైతే భార్యాభర్తల్లో లేకుంటే ఇద్దరు స్నేహితుల్లో మంచిగా కలిసి ఉన్న వాళ్లల్లో తెగతెంపులు వేస్తాడో, అలాంటి షైతాన్ తోని షైతాన్ యొక్క నాయకుడు చాలా సంతోషించి అతన్ని దగ్గరకు తీసుకొని అతన్ని షాబాష్ అని అంటాడు.

అందు గురించి ఇంట్లో కూడా షైతాన్ రాకుండా, షైతాన్ నుండి రక్షణ పొంది ఇంటిని, మనల్ని అన్నిటినీ కాపాడుకోవడానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని పద్ధతులు నేర్పారు. అతి ముఖ్యంగా ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చెప్పాలి, ఏం పలకాలి? ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చదువుకొని వెళ్ళాలి? కనీసం ఒక పదం చెప్పండి. ఒక్క మాటలో చెప్పండి. బిస్మిల్లాహ్, షాబాష్. కనీసం “బిస్మిల్లాహ్” అని చదవాలి.

సహీ ముస్లిం షరీఫ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎప్పుడైతే ఒక ముస్లిం ఇంట్లో ప్రవేశిస్తూ బిస్మిల్లాహ్ అంటాడో, అల్లాహ్ యొక్క పేరు తీసుకుంటాడో, అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తాడో, మరియు భోజనం చేస్తున్నప్పుడు కూడా అల్లాహ్ నామస్మరణ చేస్తాడో, షైతాన్ అంటాడు తన యొక్క చిన్న వాళ్లతోని, అసిస్టెంట్లతోని, ఈ ఇంట్లో మనకు ఉండడానికి స్థలము లేదు, తినడానికి తిండి లేదు.

అతి ముఖ్యంగా కనీసం ఈ దుఆ తప్పకుండా చదవాలి, ఈ పదం “బిస్మిల్లాహ్” అని అనాలి. ఇక ఆ తర్వాత రండి, కొన్ని విషయాలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, ఈ రోజు నుండే ఇంట్లో పాటించే ప్రయత్నం చేయండి. అల్లాహ్ ఈ సద్భాగ్యం నాకు, మీకు అందరికీ ప్రసాదించు గాక. ఇంట్లో ఎంతైనా గానీ సాధ్యమైనంత వరకు సూర బఖరా చదువుతూ ఉండే ప్రయత్నం చేయాలి. ఖురాన్లో అతి పొడుగు, దీర్ఘంగా, అతి పెద్ద సూర, సూర బఖరా. ప్రతి రోజు సూర బఖరా చదువుకుంటూ ఉంటే ఇక అన్ని పనులు, పాటలు అన్నీ వదిలేసేయాలి మౌల్వి సాబ్ అని అంటారు. అట్లా కాకుండా, ఎంతైనా గానీ కనీసం ఒక పేజీ, ఒక సగం పేజీ, చదువుతూ ఉండే అలవాటు చేసుకోవాలి. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “లా తజ్అలూ బుయూతకుమ్ మఖాబిర్”. “మీరు మీ ఇళ్లను సమాధులుగా చేసుకోకండి.”

إِنَّ الشَّيْطَانَ يَنْفِرُ مِنَ الْبَيْتِ الَّذِي تُقْرَأُ فِيهِ سُورَةُ الْبَقَرَةِ
(ఇన్నష్-షైతాన యన్ఫిరు మినల్-బైతిల్లదీ తుఖ్రఉ ఫీహి సూరతుల్-బఖరహ్)
నిశ్చయంగా, ఏ ఇంట్లో సూరతుల్ బఖరా పారాయణం చేయబడుతుందో, ఆ ఇంటి నుండి షైతాన్ పారిపోతాడు.

ఎంత గొప్ప లాభం. సూర బఖరాలోనే ఆయత్ నెంబర్ 255. ఆయతుల్ కుర్సీ అని. కనీసం ఈ సూర, ప్రత్యేకంగా పడుకునేటప్పుడు, ప్రత్యేకంగా పడుకునేటప్పుడు తప్పకుండా చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సహీ బుఖారీలో హదీస్, “ఇదా ఆవైత ఇలా ఫిరాషిక్”. నీవు నీ పడకపై పడుకోవడానికి వచ్చినప్పుడు, “ఫఖ్ర ఆయతల్ కుర్సీ”, “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” ఆయత్ కంప్లీట్ గా చదువు. “హత్తా తఖ్తిమల్ ఆయ” చివరి వరకు. “ఫఇన్నక లన్ యజాల అలైక మినల్లాహి హాఫిద్”. నీవు ఈ ఆయత్ చదివిన తర్వాత, నీ తోడుగా అల్లాహ్ వైపు నుండి ఒక రక్షకుడు ఉంటాడు. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం. కేవలం మనం చదివినందుకు అల్లాహ్ సంతోషపడి అల్లాహ్ మన యొక్క, మనల్ని కాపాడడానికి ఒక రక్షకుణ్ణి నియమిస్తాడు. “వలా యఖ్రబన్నక షైతానున్ హత్తా తుస్బిహ్”. తెల్లవారే వరకు షైతాన్ “లా యఖ్రబన్నక్”, నీ దగ్గరికి రాడు.

అల్లాహ్ నాకు, మీకు మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక. ఇంట్లో బిస్మిల్లాహ్ అని ప్రవేశించాము. ఆయతుల్ కుర్సీ చదువుకొని పడక మీద పడుకుంటున్నాము? మరి? ఇష్టమైన మంచి పాటలు వినుకుంటూ, ఫిల్మ్ లు చూసుకుంటూ పడుకుంటున్నాము. ఏమవుతుంది? చోర్ దర్వాజా ఓపెన్ చేసినట్టే కదా. జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా సోదరులారా! సూర బఖరాలోనే చివరి రెండు ఆయతులు ఉన్నాయి. సూర బఖరాలో చివరి రెండు ఆయతులు ఉన్నాయి. వాటి గురించి కూడా హదీస్ లో చాలా గొప్ప శుభవార్త, ఎంతో పెద్ద ఘనత తెలుపబడింది. అదేమిటి? సహీ తర్ గీబ్ లో హదీస్ ఉంది. తిర్మిదిలో కూడా.

إِنَّ اللَّهَ كَتَبَ كِتَابًا قَبْلَ أَنْ يَخْلُقَ السَّمَوَاتِ وَالأَرْضَ بِأَلْفَىْ عَامٍ أَنْزَلَ مِنْهُ آيَتَيْنِ خَتَمَ بِهِمَا سُورَةَ الْبَقَرَةِ وَلاَ يُقْرَآنِ فِي دَارٍ ثَلاَثَ لَيَالٍ فَيَقْرَبُهَا شَيْطَانٌ
(ఇన్నల్లాహ కతబ కితాబన్ ఖబ్ల అన్ యఖ్ లుఖస్-సమావాతి వల్-అర్ద బి అల్ఫై ఆమ్, అన్ జల మిన్హు ఆయతైని ఖతమ బిహిమా సూరతల్-బఖరహ్, వలా యుఖ్రఆని ఫీ దారిన్ సలాస లయాలిన్ ఫయఖ్రబహా షైతానున్.)

అల్లాహ్ త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించక ముందే రెండు వేల సంవత్సరాల ముందే ఒక కితాబ్, ఒక పుస్తకం రాసాడు. అందులో నుండి రెండు ఆయతులు సూర బఖరా చివరిలో అవతరింపజేశాడు. ఏ ఇంట్లో మూడు రోజుల వరకు దీని తిలావత్ జరుగుతూ ఉంటుందో, అక్కడికి షైతాన్ సమీపించడు. 

ఈ ఆయతులు ఏవి? “ఆమనర-రసూలు బిమా ఉన్ జిల ఇలైహి మిర్-రబ్బిహి వల్-ముఅమినూన్…” అంటే సూర బఖరాలోని చివరి రెండు ఆయతులు.

ఎంత గొప్ప శుభవార్తలో గమనించండి. ఈ రోజుల్లో మనం ఖురాన్ తోని డైరెక్ట్ సంబంధం పెట్టుకొని స్వయంగా మనం చదవడానికి బదులుగా ఏం చేస్తున్నాము? స్వయంగా నమాజ్ సాబ్, అన్ని ఇష్టమైన పాపాలన్నీ చేసుకోవచ్చు, వడ్డీ తినవచ్చు, లంచాలు తినవచ్చు, మంచి హాయిగా పెద్ద బిల్డింగ్ కట్టుకొని అన్ని అక్రమ సంపాదనలతో ఇంట్లో షైతాన్ రాకుండా, అరే ఓ మద్రసా కే బచ్చోంకో బులారే, ఖురాన్ పడా, ఖురాన్ ఖానీ కరా. ఆ మద్రసా పిల్లలను పిలుచుకొచ్చి ఖురాన్ ఖానీ చేస్తే, ఖలాస్ ఇక షైతాన్లన్నీ పారిపోతాయి అనుకుంటారు. సోదరులారా! ఇలాంటి దురాచారాలకు, ఇలాంటి బిద్అత్ లకు మనం పాల్పడకూడదు. మనం ఇష్టం వచ్చినట్లు జీవించుకొని, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని, మనం స్వయంగా ఐదు పూటల నమాజ్ చేయకుండా, స్వయంగా మనం ఇంట్లో ఖురాన్ చదవకుండా, మన పిల్లలకు ఖురాన్ శిక్షణ సరియైన విధంగా ఇవ్వకుండా, ఎవరో వచ్చి మద్రసాలో చదివే పిల్లవాళ్ళు వచ్చి చదివిపోతే ఇంట్లో అంతా బరకతే బరకత్ అవుతుంది, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, ఇలాంటి పద్ధతులు సరియైనవి కావు. ఇలాంటి దురాలోచనలకు దూరం ఉండాలి, దురాచారాలకు కూడా మనం దూరం ఉండాలి.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సోదరులారా ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఇంటి నుండి వెళ్లేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంట్లో పాటించేవి, లేక పాటించనివి పద్ధతులు ప్రత్యేకంగా ఇస్లాంలో మనకు ఏవైతే చూపించబడ్డాయో వాటిని మనం అవలంబించాలి. అలాగే మస్జిద్ లో వెళ్ళినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సామాన్యంగా ఒక దుఆ “అల్లాహుమ్మఫ్-తహ్లీ అబ్వాబ రహ్మతిక్” అని నేర్పారు. కానీ అదే కాకుండా ఇంకా ఎన్నో దుఆలు కూడా ఉన్నాయి. “అఊదు బిల్లాహిల్-అజీమ్, వబివజ్-హిహిల్-కరీమ్, వసుల్తానిహిల్-ఖదీమ్, మినష్-షైతానిర్-రజీమ్”.

సునన్ అబూ దావూద్ లో ఈ దుఆ కూడా ఉంది, మస్జిద్ లో వెళ్లేటప్పుడు చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఈ దుఆ చదువుకుంటారో, ఒక షైతాన్ అక్కడ ఉండి అంటాడు, ఈ రోజు పొద్దంతా ఇతన్ని నా నుండి కాపాడడం జరిగింది. షైతాన్ స్వయంగా అంటాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎవరైతే మస్జిద్ లో ప్రవేశించినప్పుడు “అఊదు బిల్లాహిల్-అజీమ్, వబివజ్-హిహిల్-కరీమ్, వసుల్తానిహిల్-ఖదీమ్, మినష్-షైతానిర్-రజీమ్” చదువుతాడో, షైతాన్ ఏమంటాడు? పొద్దంతా ఇతన్ని నా నుండి కాపాడడం జరిగింది. కొన్ని మస్జిద్ ల మీద ఈ దుఆ రాసి కూడా ఉంటుంది. లేనికాడ మీరు ప్రింట్ చేయించుకొని దాన్ని అతికించే ప్రయత్నం చేయండి. కనీసం చూసి అయినా గానీ చదవవచ్చు.

ఈ రోజు మనం హదీస్ ల ఆధారంగా, కొన్ని ఖురాన్ ఆయతుల ఆధారంగా షైతాన్ నుండి రక్షణ పొందుటకు ఏ కొన్ని మార్గాలైతే మనం విన్నామో, కొన్ని పద్ధతులు తెలుసుకున్నామో, వాటిపై ఆచరించే భాగ్యం అల్లాహ్ మనకు, మనందరికీ ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.