ప్రవక్తలు ఎందుకు వచ్చారు? [వీడియో | టెక్స్ట్]

ప్రవక్తల రాక ఉద్దేశ్యం
https://youtu.be/e0k8L0QdnRk [12 నిముషాలు]
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

ఈ ప్రసంగంలో, ప్రవక్తల పంపకం యొక్క ఉద్దేశ్యం, వారి పాత్ర మరియు సందేశం గురించి వివరించబడింది. అల్లాహ్ తన ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చేవారిగా మరియు హెచ్చరించే వారిగా పంపాడని, ఏకదైవారాధన వైపు ప్రజలను పిలవడానికి మరియు బహుదైవారాధన (షిర్క్) నుండి హెచ్చరించడానికి వారు వచ్చారని స్పష్టం చేయబడింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని, వారి మధ్య వచ్చిన ప్రవక్తలందరి ప్రాథమిక సందేశం ఒక్కటేనని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో వివరించబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ చేసిన ఈ ఏర్పాటును అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది.

అల్హందులిల్లాహ్. ఉసూలె సలాస, త్రిసూత్రాలు, 22వ పాఠం.

ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు,

وَأَرْسَلَ اللَّهُ جَمِيعَ الرُّسُلِ مُبَشِّرِينَ وَمُنذِرِينَ
(వ అర్సలల్లాహు జమీఅర్రుసుల్ ముబష్షిరీన వ మున్దిరీన్)
అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ కూడా శుభవార్త ఇచ్చే వారిగా మరియు హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

దలీల్ ఇప్పుడే ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము, కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గమనించండి. అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ చూపాడు! మనం మార్గభ్రష్టత్వంలో పడి ఉండకుండా, చనిపోయిన తర్వాత నరకంలో శిక్ష పొందకుండా, మన మేలు కొరకు అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపరను ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి షిర్క్ మొదలయ్యాక నూహ్ అలైహిస్సలాంని ఆ తర్వాత ఇంకా ఎందరో ప్రవక్తలని పంపుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పరంపరను అంతం చేశాడు.

అయితే ఆ ప్రవక్తలందరూ శుభవార్త ఇచ్చేవారు, హెచ్చరించేవారు. ఇక రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, శుభవార్త ఏంటి అది? ఎవరి కొరకు? మూడో విషయం, హెచ్చరిక ఏమిటి? ఎవరి కొరకు?

శుభవార్త ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్తను అనుసరిస్తారో, ఇక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, అలాంటి వారికి స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ యొక్క గొప్ప వరాలు, అనుగ్రహాల యొక్క శుభవార్త.

ఇక ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించరో, అల్లాహ్ తో పాటు వేరే వారిని భాగస్వామిగా కలుపుతారో, ఎవరైతే ప్రవక్తల్ని వారి వారి కాలాలలో అనుసరించలేదో, ఇప్పుడు ప్రళయం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో అలాంటి వారికి హెచ్చరిక. దేని గురించి? నరకం నుండి. ఇంకా వేరే భయంకరమైన శిక్షల నుండి.

అందుకొరకు ఈ పాఠంలోని ఈ మొదటి అంశం ద్వారా తెలిసేది ఏమిటంటే అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరిక చేసే వారిగా ఏదైతే పంపాడో మనం శుభవార్తను అందుకునే వారిలో చేరాలి.

ఇక ఈ మాటపై దలీల్ ఏమిటి? సూరతున్నిసా లోని ఈ ఆయత్.

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ
(రుసులమ్ ముబష్షిరీన వమున్దిరీన్)
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము (4:165)

అల్లాహు త’ఆలా ప్రవక్తలని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. ఎందుకు?

لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ
(లిఅల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతుమ్ బ’అదర్రుసుల్)
ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము) (4:165)

ప్రవక్తలను పంపిన తర్వాత ప్రజల వద్ద అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క సాకు మిగిలి ఉండకూడదు. వారి వద్ద ఏ ప్రమాణం మిగిలి ఉండకూడదు. అంటే ఏమిటి? రేపటి రోజు ప్రజలు వచ్చి ఎప్పుడైతే అల్లాహు త’ఆలా లెక్క తీసుకుంటాడో వారి మధ్యలో తీర్పు చేస్తాడో మరియు వారు వారి యొక్క షిర్క్, ఇంకా అవిధేయత కారణాల వల్ల ఏదైతే నరకంలో వెళ్తూ ఉంటారో, అప్పుడు వారు “ఓ అల్లాహ్! మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నావు? నీవైతే మా హితోపదేశానికి, మమ్మల్ని మార్గం చూపడానికి, సన్మార్గం వైపునకు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఏ ప్రవక్తను పంపలేదు కదా, ఏ గ్రంథాన్ని అవతరింపజేయలేదు కదా” ఇలాంటి ఏ మాట చెప్పడానికి అవకాశం మిగిలి ఉండకూడదు. అందుకే అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపేసి స్వయం అల్లాహ్ ఒక హుజ్జత్, ఒక నిదర్శనం, వారిపై ఒక ప్రమాణం అల్లాహు త’ఆలా చేశాడు. ఇక ఎవరైతే సన్మార్గంపై ఉండరో, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే పాటించరో, ప్రవక్తల్ని అనుసరించరో దాని కారణంగా నరకంలో వెళితే ఇది అల్లాహ్ ది ఎంత మాత్రం తప్పు కాదు. అల్లాహ్ విషయంలో ఎలాంటి అన్యాయం చేశాడు అన్నటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే అల్లాహ్ వైపు నుండి మనం మార్గదర్శకత్వం పొందే సాధనాలన్నీ కూడా అల్లాహ్ యే ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి. కానీ మనం ఒకవేళ సన్మార్గంపై రాకుంటే అది మన తప్పు అవుతుంది.

ఇక ఈనాటి పాఠంలో ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే షిర్క్ గురించి హెచ్చరిస్తూ వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. త్వరపడకండి. ఏదైనా ఆశ్చర్యం కలుగుతుందా? ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఆయన నబీ కూడా. మేము విన్నాము మరి ఇప్పుడు మొట్టమొదటి ప్రవక్త నూహ్ అని అంటున్నారు అలైహిస్సలాతో వసలామ్. అయితే ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త ఇది మాట కరెక్టే, ఇందులో అనుమానం లేదు. కానీ ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి షిర్క్ లేకుండినది. ప్రజలు బహుదైవారాధనలో పడలేదు, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. కాకపోతే కొన్ని వేరే తప్పులు ఉండినవి. కానీ షిర్క్ లాంటి పాపం నూహ్ అలైహిస్సలాం ఏ జాతిలో పుట్టారో, నూహ్ అలైహిస్సలాం పుట్టుక కంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ షిర్క్ ఎప్పుడైతే మొదలైనదో ఆ షిర్క్ ను ఖండించడానికి మళ్ళీ ప్రజలను ఏక దైవారాధన వైపునకు పిలవడానికి నూహ్ అలైహిస్సలాంను పంపడం జరిగింది. అందుకొరకే అవ్వలుర్రుసుల్, మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం అని ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా రుజువు అవుతుంది. ప్రవక్త హదీసుల్లో హదీసుష్షఫా’అ అని చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది.

ఇక ఖురాన్ ఆయత్, సూరతున్నిసాలో:

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ
(ఓ ముహమ్మద్‌!) మేము నూహ్‌ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).

అల్లాహు త’ఆలా ప్రవక్తల ప్రస్తావన కంటే ముందు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకొచ్చారు.

ఇక సోదర మహాశయులారా, నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అంతిమ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఖాతమున్నబియ్యీన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేమగా, గౌరవంగా మన ప్రవక్త అంటాము, అంటే వేరే ఎవరి ప్రవక్త కాదు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. సర్వ మానవాళి వైపునకు ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు ప్రతి దేశంలో ఉన్న వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి, ప్రవక్తగా చేసి పంపబడ్డారు.

అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ఖురాన్లో ఉంది.

وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ
(వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్)
అయితే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరకు అంతిమ ముద్ర. (33:40)

అలాగే అనేక సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: “లా నబియ్య బ’అదీ”, నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్తగా రాలేరు. మీరేదో ఆశ్చర్యపడుతున్నట్లు ఉన్నది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా! మరి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి కంటే ముందు వస్తారు కదా, ఆయన ప్రవక్త కదా! ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే ప్రళయానికి ముందు వస్తారో ప్రవక్త యొక్క హోదాలో రారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతీ, ప్రవక్త ధర్మాన్ని, షరీయత్ను అనుసరించే వారే కాదు ప్రజలందరినీ కూడా అనుసరించే రీతిలో పాలన చేసే వారు. అందరిపై షరీయతె ఇస్లామియా అమలు చేసే వారిగా వస్తారు.

ఇక ప్రవక్తలందరి ప్రస్తావన వచ్చింది కదా! అయితే వారందరినీ మొదటి ప్రవక్త నుండి మొదలుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఎంతమంది ప్రవక్తలొచ్చారో వారందరి రాక అసలైన ఉద్దేశం ఏమిటి?

يَأْمُرُهُمْ بِعِبَادَةِ اللَّهِ وَحْدَهُ
(య’మురుహుమ్ బి ఇబాదతిల్లాహి వహ్ దహ్)
కేవలం అల్లాహ్ నే ఆరాధించమని ఆయన వారిని ఆదేశిస్తారు

وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ
(వ యన్హాహుమ్ అన్ ఇబాదతిత్తాఘూత్)
మరియు త్రాగూత్ (మిథ్యా దైవాల) ఆరాధన నుండి వారిని వారించేవారు.

ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరెవరిని పూజించడం జరుగుతుందో, తాఘూత్ ల యొక్క ఇబాదత్ నుండి ఖండిస్తారు. ఇది ప్రవక్తల యొక్క రాక ముఖ్య ఉద్దేశం.

ఈ మాట, దీనికి ఆధారం సూరతున్నహ్ల్ ఆయత్ నంబర్ 36.

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలా)
ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను పంపాము (16:36)

ఆ ప్రవక్త తమ జాతి వారికి:

أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్)
అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించండి. త్రాగూత్ కు దూరంగా ఉండండి (16:36)

అని చాలా స్పష్టంగా చెప్పేవారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఏ అల్లాహ్ పుట్టించాడో, పోషిస్తున్నాడో, ఈ సర్వ లోకాన్ని నడిపిస్తున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడు.

ఈనాటి పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపాడు. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్టచివరి ప్రవక్త, ప్రవక్తల పరంపరకు అంతిమ మరియు ప్రవక్తలందరికీ ఒక ముద్ర లాంటి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

మరియు ప్రవక్తలందరూ కూడా తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశించేవారు. మిథ్యా దైవాలను, అల్లాహ్ తప్ప అందరి ఆరాధనలను, తాఘూత్ యొక్క పూజను వదులుకోవాలి అని స్పష్టంగా ఖండించేవారు.

తాఘూత్ అంటే ఏమిటి? దీని గురించి మరింత వివరంగా వచ్చే పాఠంలో తెలుసుకోబోతున్నాము. వచ్చే పాఠం వినడం మర్చిపోకండి, చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ ఆరాధనపై స్థిరత్వం ప్రసాదించుగాక. ఆమీన్.

واخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته
(వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్).

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41240

త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి
https://teluguislam.net/2023/04/19/u3mnj/

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?[ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?
https://youtu.be/OFeb-uCup0Q [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత ప్రవక్తలు రారని స్పష్టం చేయబడింది. అయితే, అల్లాహ్ యొక్క ‘ఔలియాలు’ (స్నేహితులు) వస్తూనే ఉంటారని ఖురాన్ లో ఉందని, కానీ వారిని ఆరాధించడం, వేడుకోవడం లేదా వారి సమాధుల వద్ద మొక్కుబళ్ళు చెల్లించడం ఘోరమైన షిర్క్ అని వివరించబడింది. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఔలియాలుగా చేసుకోవద్దని, కేవలం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ ను మాత్రమే అనుసరించాలని సూరతుల్ ఆరాఫ్, సూరతుర్ రఅద్ వంటి ఆయత్ ల ఆధారంగా నొక్కి చెప్పబడింది.

సమాధానం: వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు అంతిమ, చిట్టచివరి ప్రవక్త అని చాలా స్పష్టంగా ఉంది. మరియు ఇక మీరు అడిగిన ప్రశ్న, అల్లాహ్ యొక్క ఔలియాల గురించి ఖురాన్ లో లేదా?

అల్లాహ్ యొక్క ఔలియాల ప్రస్తావన ఖురాన్ లో అనేక సందర్భాలలో ఉంది. కానీ, అల్లాహ్ ను వదిలి ఆ ఔలియాలను మనం వేడుకోవడం లేదా అల్లాహ్ తో పాటు ఆ ఔలియాలతో దువాలు చేయడం, దీని ప్రస్తావన లేదు. ఏముంది ఖురాన్ లో? ఉదాహరణకు మీరు సూరతు యూనుస్ చూశారంటే,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న అవ్లియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్)
వినండి! నిశ్చయంగా అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయమూ ఉండదు, వారు దుఃఖించరు కూడా.

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు ఎవరంటే, విశ్వసించి, దైవభీతితో ఉండేవారు.

ఇప్పుడు నేను తిలావత్ చేసిన రెండు ఆయతులు సూరత్ యూనుస్ 62, 63.

వినండి. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఔలియా, (అలా వినండి, ఇన్న నిశ్చయంగా, ఔలియా అల్లాహ్, అల్లాహ్ యొక్క ఔలియా, వలీలు), లా ఖవ్ఫున్ అలైహిమ్, వారికి ఎలాంటి భయము లేదు. వలా హుమ్ యహ్జనూన్, వారు ఎలాంటి చింతించనవసరము లేదు.

అల్లజీన ఆమనూ, ఎవరు ఆ ఔలియాలు? విశ్వసించిన వారు.
వ కానూ యత్తఖూన్, వారు పాపాలకు దూరంగా ఉండేవారు, భయభీతితో, అల్లాహ్ యొక్క భయభీతితో తమ జీవితం గడిపేవారు.

ఇక వారికి ఎలాంటి రందీ లేదు, ఎలాంటి చింత లేదు, బాధ లేదు, వారు భయపడవలసిన అవసరం లేదు అని అల్లాహ్ చెప్పాడు కదా, మరి ఏముంది వారికి? అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నెంబర్ 64 లో,

لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
(లహుముల్ బుష్రా ఫిల్ హయాతిద్ దున్యా వ ఫిల్ ఆఖిరహ్)
ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో వారి కొరకు శుభవార్తలు ఉన్నాయి.

అయితే గమనించారా? ఔలియా అల్లాహ్ ల యొక్క ప్రస్తావన ఖురాన్ లో ఉంది. వారి యొక్క ఘనత అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు.

కానీ ఈ రోజుల్లో మన ముస్లిం సోదర సోదరీమణులలో ఎంతో మంది అల్లాహ్ తో పాటు ఇతర ఔలియాలను ఏదైతే వేడుకుంటున్నారో, దువా చేస్తున్నారో, వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి అల్లాహ్ కు చేయవలసిన కొన్ని ఆరాధనలు, ఉదాహరణకు మొక్కుబడులు చెల్లించడం గానీ, మరికొన్ని దర్బారుల, దర్గాల వద్ద జంతువులను బలి ఇవ్వడం గానీ, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించు గాక కొన్ని దర్బారులు ఉదాహరణకు పాకిస్తాన్ లో ఖలందర్ షా దర్గా అని ఉంది, అక్కడ తవాఫ్ కూడా చేస్తారు. నవూజుబిల్లాహ్ సుమ్మ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, మనం ఎలాగైతే తవాఫ్ హజ్రే అస్వద్ నుండి మొదలుపెట్టి అక్కడే పూర్తి చేస్తామో, అలా అక్కడ కూడా వారు ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుండి ప్రారంభం చేస్తారు. ఇలాంటి ఘోరమైన షిర్క్ పనులు ఏవైతే జరుగుతున్నాయో, అల్లాహ్ దివ్య గ్రంథం ఖురాన్ లో వీటిని ఖండించాడు.

ఉదాహరణకు మీరు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ మూడు చూశారంటే,

اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ఇత్తబిఊ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఊ మిన్ దూనిహీ అవ్లియా, ఖలీలమ్ మా తజక్కరూన్)
మీ ప్రభువు వైపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన దానిని మీరు అనుసరించండి. దానిని వదిలి మీరు ఔలియాల వెంట పడకండి. మీరు చాలా తక్కువ గుణపాఠం నేర్చుకుంటున్నారు.

హితోపదేశం ఈ ఖురాన్, హదీసుల ద్వారా ఏదైతే తీసుకోవాలో, దాని నుండి మీరు చాలా తక్కువ హితోపదేశం పొందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించారా?

అయితే స్వయంగా ఆ ఔలియాలు, ఎవరైతే అల్లాహ్ యొక్క నిజమైన ఔలియాలు ఉన్నారో, వారి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. అందులో అనుమానం లేదు. కానీ ఆ ఔలియాలలో ఏ ఒక్క వలీ, ఇక్కడ గుర్తుంచుకోండి నిజమైన వలీ అయితే, ఏ ఒక్క వలీ కూడా మీరు నా సమాధి వద్దకు రండి, నా యొక్క దర్గాల వద్దకు రండి, నన్ను ఆరాధించండి, నాతో దువా చేయండి, నా వద్ద మొక్కుబడులు మీరు చెల్లించండి, ఇలాంటి ఏ ఒక్క మాట చెప్పలేదు.

ఒక్కసారి గనక మీరు సూరతుర్ రఅద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 16 లో గమనిస్తే,

قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا
(ఖుల్ మర్ రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, ఖులిల్లాహ్. ఖుల్ అఫత్తఖజ్తుమ్ మిన్ దూనిహీ అవ్లియాల లా యమ్లికూన లి అన్ఫుసిహిమ్ నఫ్ అన్ వలా దర్ర)
వారితో ప్రశ్నించండి, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? వారితో చెప్పండి, అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు వారికి ఈ ఆదేశం ఇవ్వండి, ఈ హెచ్చరిక చేయండి, వారికి తెలపండి, చెప్పండి వారితో, అల్లాహ్ ను కాదని మీరు వేరే వారిని ఔలియాలుగా చేసుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్లు? వారు స్వయం తమకు ఏ లాభం చేకూర్చలేరు, వారిపై వచ్చి పడిన ఏ నష్టాన్ని వారు దూరం చేసుకోలేరు.

ఔలియా అల్లాహ్, వారిని మనం విశ్వసించాలి. ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యమైన వలీలు ఉన్నారో, వారు అల్లాహ్ యొక్క సత్య వలీలు అని నమ్మాలి. కానీ, ఈ రోజుల్లో వలీల పేరు మీద ఏ దందాలు జరుగుతున్నాయో వాటిని స్వయంగా ఖురాన్ ఖండించినది అన్న విషయం కూడా తెలుసుకోవాలి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=16057