మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త మేరాజ్ (గగణ ప్రయాణాని)కి రజబ్ లోనే వెళ్ళారా?
ఈ సందర్భంగా తర్వాత రోజుల్లో షబె మేరాజ్ జరుపుకున్నారా? 

మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=Qmq6Oq7tJE0
36:38 నిమిషాలు, తప్పక వినండి

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ఒక కీలకమైన ఘట్టం, ఇస్రా మరియు మేరాజ్ (రాత్రి ప్రయాణం మరియు ఆరోహణ) గురించి వివరించబడింది. ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కాలో పది సంవత్సరాల పాటు ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక, మరియు సామాజిక కష్టాల గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా తాయిఫ్‌లో ఆయనపై జరిగిన దాడి, ఆ తర్వాత ఆయన ప్రియమైన భార్య హజ్రత్ ఖదీజా మరియు పినతండ్రి అబూ తాలిబ్ మరణంతో కలిగిన దుఃఖం గురించి చెప్పబడింది. ఈ కష్టాల సమయంలో అల్లాహ్ తన ప్రవక్తకు ఓదార్పుగా ప్రసాదించిన అద్భుత ప్రయాణమే ఇస్రా మరియు మేరాజ్. ఈ ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఏడు ఆకాశాలలో ప్రవక్తలను కలవడం, స్వర్గ నరకాలను దర్శించడం, మరియు ముఖ్యంగా ముస్లిం సమాజానికి బహుమానంగా లభించిన ఐదు పూటల నమాజు, సూరహ్ బఖరా చివరి రెండు ఆయతులు, మరియు షిర్క్ చేయని వారి పాపాలు క్షమించబడతాయన్న శుభవార్త గురించి వివరించబడింది. ఈ ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, దానిని స్మరించుకునే పేరుతో బిద్అత్ (నూతన ఆచారాలు) చేయకుండా, ప్రవక్త తెచ్చిన అసలైన బోధనలను, ముఖ్యంగా నమాజును మరియు తౌహీద్‌ను ఆచరించాలని నొక్కి చెప్పబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మహాశయులారా! ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రవక్త పదవిని పొందారు. ఆ తర్వాత ఇంచుమించు పది సంవత్సరాల వరకు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే మనం ఆరాధించాలి అని బోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల కష్టాలను కూడా భరించారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం ఊహించలేని, మనం పరస్పరం చెప్పుకోలేనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాల కష్టాలు వచ్చాయి. కానీ అల్లాహ్ కొరకు ఎంతో సహనం వహించారు.

పది సంవత్సరాలు గడిచిన తర్వాత మక్కా నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అయితే మక్కా నగరానికి ఇంచుమించు ఒక 80, 90 కిలోమీటర్ల దూరంలో తాయిఫ్ ఒక పెద్ద నగరము. అక్కడ నివసించే వారికి ఇస్లాం బోధన చేద్దామని వెళ్లారు. కానీ అక్కడి నుండి కూడా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కేవలం అల్లాహ్‌ను ఆరాధించే వారు అయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంతోషం కలిగేకి బదులుగా వారు కేవలం నిరాకరించలేదు, పైగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఎంతగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం నుండి రక్తం వెళ్లి పాదాల్లో ఏ బూట్లయితే వేసుకున్నారో, చెప్పులయితే వేసుకున్నారో అందులో రక్తం ఆగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సొమ్మసిల్లిపోయారు, స్పృహ తప్పిపోయారు.

మక్కా నగరం తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు, 25 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ, ఆమెకు ఒక ఉత్తమమైన భార్యగా నిలిచిన వారు హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా కూడా చనిపోయారు. గమనించండి, కేవలం సామాన్య మనలాంటి మనుషులకే మన భార్య చనిపోయింది అంటే మనకు ఏడుపొస్తుంది. కానీ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా ఒక సామాన్య భార్య కాదు, ఒక సామాన్య స్త్రీ కాదు. ఆ చరిత్రలోకి వెళితే చాలా సమయం మనకు ఇది అయిపోతుంది. హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారు చనిపోయాక కొద్ది రోజులకు వెన్నెముక లాంటి సహాయం అందించిన పినతండ్రి హజ్రత్ అబూ తాలిబ్ కూడా చనిపోతారు. ఆయన కేవలం చనిపోవడమే కాదు, ఇస్లాం ధర్మం స్వీకరించకుండా తాత ముత్తాతల ఆచారం మీద నేను చనిపోతున్నాను అని అనడం ప్రవక్త గారికి చెప్పలేనంత బాధ కలిగింది.

ఇన్ని బాధలను, ఇన్ని కష్టాలను, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఒక శుభ ఘడియ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అదేమిటి? రాత్రిలోని కొన్ని క్షణాల్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు, బురాఖ్ అన్న ఒక జంతువు తీసుకొచ్చారు. ఆ జంతువు గురించి సహీహ్ హదీథ్ లో వచ్చిన ప్రస్తావన ఏమిటి? అది హైట్ లో గాడిద కంటే పెద్దగా మరియు కంచర గాడిద కంటే చిన్నగా మరియు దాని వేగం ఎక్కడివరకైతే దాని దృష్టి పడుతుందో అక్కడి వరకు అది ఒక గంతు వేస్తుంది. అంతటి వేగం గల ఒక జంతువును తీసుకుని వచ్చారు.

కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం ఎన్నో క్యాలెండర్లలో, ఎన్నో ఫోటోలలో బురాఖున్ నబీ, ప్రవక్త వారికి గగన ప్రయాణం, మేరాజ్ ఏ వాహనంపై అయితే జరిగిందో దాని పేరు బురాఖ్ అని దానికి ఒక స్త్రీ ముఖం లాంటిది, ఇంకా వెనక ఒక తోక వేరే రకం లాంటిది, దాని కాళ్లు మరో జంతువు రకం లాంటివి, ఇలాంటి ఫోటోలు చూస్తాము. ఇవన్నీ కూడా అబద్ధము, అసత్యము, బూటకం. ఎందుకంటే ఆ జంతువు యొక్క చిన్నపాటి వర్ణన వచ్చింది కానీ అది, దాని ముఖం, దాని యొక్క ఇమేజ్, దాని యొక్క ఫోటో ఆ కాలంలో ఎవరూ తీయలేదు, దాని గురించి ఎలాంటి ప్రస్తావన హదీథుల్లో రాలేదు. ఇది మన యొక్క ధర్మంపై ఒక మహా అపనింద మనం వేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి ఫోటోలను మనం ప్రచారం చేసి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లినటువంటి బురాఖ్ అని చెప్పడం ఇది చాలా తప్పు విషయం.

అయితే సహీహ్ హదీథుల్లో వచ్చిన విషయం ఏంటి? ఆ జంతువు, దాని యొక్క వేగం మనం చెప్పలేము. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కించుకొని మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, ఫలస్తీన్ కి వెళ్లారు. ఆ ప్రస్తావన సూరహ్ బనీ ఇస్రాయీల్ లోని మొదటి ఆయతులోనే ఉంది.

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا

“ఆయన పరమ పవిత్రుడు. తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిద్-ఎ-హరామ్ నుండి మస్జిద్-ఎ-అఖ్సా వరకు తీసుకువెళ్లాడు. దాని పరిసరాలను మేము శుభప్రదంగా చేశాము. ఇది మేము మా సూచనలను అతనికి చూపించటానికి చేశాము.” (17:1)

ఆ ప్రభువు, అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయనే రాత్రివేళ తన దాసునిని మస్జిద్-ఎ-హరామ్ నుండి బైతుల్ మఖ్దిస్, మస్జిద్-ఎ-అఖ్సా ఫలస్తీన్ వరకు తీసుకువెళ్లాడు. ఆ మస్జిద్-ఎ-అఖ్సా దాని చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా మేము దానిని శుభకరమైనదిగా చేశాము. ఎందుకు తీసుకువెళ్ళాము? మా యొక్క సూచనలు, మా యొక్క మహిమలు ఆయనకు చూపించాలని. అయితే దీనిని ఇస్రా అని అంటారు. ఇస్రా అంటే ఏంటి? మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు రాత్రివేళ ఏదైతే ప్రయాణం జరిగిందో దానిని ఇస్రా అని అంటారు. మరియు బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల వైపునకు ఏ ప్రయాణం అయితే జరిగిందో దానిని మేరాజ్ అని అంటారు. దాని ప్రస్తావన ఖుర్ఆన్ లో సూరహ్ నజ్మ్ లో వచ్చి ఉంది.

అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్రా, మేరాజ్ ఈ ప్రయాణం ఏదైతే చేశారో ఇది వాస్తవం. ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన ఉంది, సహీహ్ హదీథుల్లో దాని వివరాలు వచ్చి ఉన్నాయి. కానీ ఆ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమేమి జరిగినది? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడెక్కడ ఏమేమి దర్శించారు? ఏ ఏ అద్భుత విషయాలు మనకు తెలియజేశారు? మన విశ్వాసానికి, ఆచరణకు సంబంధించిన బోధనలు అందులో ఏమున్నాయి? అవి మనం తెలుసుకోవాలి ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల ద్వారా మరియు వాటి ప్రకారంగా మనం ఆచరించాలి, వాటి ప్రకారంగా మన విశ్వాసం సరిచేసుకోవాలి.

అలా కాకుండా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? జషన్, షబ్-ఎ-మేరాజ్, మేరాజున్ నబీ యొక్క ఉత్సవాలు అని జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి వాట్సాప్ లో ఒక సందర్భంలో ఏం రాశాడు? చేసుకునే వాళ్ళు చేసుకుంటారయ్యా, మీకేం నొస్తుంది? మీకేం బాధ కలుగుతుంది? అని బూతులు కూడా వదిలారు కొందరు. కానీ ఇక్కడ వారి మదిలో, వారి ఆలోచనలో ఏముందంటే, మేము ఏం చేసినా గానీ ప్రవక్త ప్రేమలో చేస్తున్నాము కదా, మేం ఏం చేసినా గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ గగన ప్రయాణం, మేరాజ్ అయితే ఒక గొప్ప బహుమానంగా ఇవ్వబడినదో దానిని గుర్తు చేసుకుంటున్నాము కదా, ఇందులో తప్పేమిటి? ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు వారివి ఉంటాయి కావచ్చు. కానీ ఇక్కడ గమనించాలి. ఏంటి గమనించాలి? ఒకవేళ ఇలా చేయడం ధర్మం అయితే ఈ ధర్మాన్ని అల్లాహ్ మనకు నేర్పలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు చేయలేదు, ఇమాములు చేయలేదు. అలాంటి కార్యం మనం చేస్తున్నాము అంటే మన ఆలోచన, మన ఉద్దేశం ఎంత ఉత్తమంగా, మంచిగా ఉన్నప్పటికీ అందులో మనకు పుణ్యం లభించదు, దాని వల్ల మనం బిద్అత్ లో పడిపోతాము, అది మహా ఘోరమైన పాపం అయిపోతుంది.

అందు గురించి మహాశయులారా! అలాంటి బిద్అత్ లకు, దురాచారాలకు మనం గురి కాకుండా ఈరోజు మీరు కొన్ని విషయాలు వింటారు ఇన్షా అల్లాహ్. ఏమిటి ఆ విషయాలు? ఈ గగన ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ ఏ బహుమానాలు బహూకరించబడ్డాయి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దృశ్యాలను చూశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రయాణం ఎలా జరిగింది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి?

అయితే పూర్తి వివరంగా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ప్రసంగం జరుగుతుంది. కానీ అలా కాకుండా టూ ద పాయింట్ హదీథుల ఆధారంగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దానిని మీరు శ్రద్ధగా ఆలకిస్తారు అని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల జరిగినటువంటి గొప్ప మహిమ, ఒక అద్భుతం ఏమిటంటే ఈ ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెస్ట్ ఆపరేషన్ అని అనండి మీరు, హార్ట్ ఆపరేషన్ అని అనండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అని మీరు చెప్పుకోండి, చెప్పుకోవచ్చు. అది జరిగింది. వాస్తవం. హజ్రత్ అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్తున్నారు, నేను స్వయంగా చూశాను ఆ కుట్లను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఛాతి చీల్చబడి, అందులో నుండి గుండెను బయటికి తీసి, జమ్ జమ్ నీళ్లతో దానిని కడిగి, అందులో ఈమాన్, విశ్వాసం, హిక్మత్, వివేకాలతో నింపబడినది. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో దీని ప్రస్తావన ఉంది.

ఇక ఏ వాహనం పైన అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేశారో నేను ఇంతకు ముందు తెలిపినట్లు గాడిద కంటే పెద్దది మరియు కంచర గాడిద కంటే చిన్నది, దాని పేరు ఏమిటి? బురాఖ్. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలోని ఈ హదీథ్ లోనే వచ్చి ఉంది. ఇంతకు ముందు నేను చెప్పిన నంబర్ 3887.

మరియు ఈ ప్రయాణం మస్జిద్-ఎ-హరామ్ మక్కా నుండి మొదలుకొని ఫలస్తీన్, ఫలస్తీన్ నుండి ఏడు ఆకాశాలు, ఏడు ఆకాశాల పైన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సంభాషించడం మరియు స్వర్గాన్ని చూడడం, నరకాన్ని చూడడం మధ్యలో ఇంకా ఎన్నో విషయాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్నో రోజులు, ఎన్నో గంటలు పట్టలేదు. لَيْلًا (లైలన్) రాత్రిలోని కొంత భాగం మాత్రమే. అది ఎలా? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సర్వశక్తిమంతుడు. అవునా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఈ రోజు ఆ అల్లాహ్ ఇచ్చినటువంటి మేధ, బుద్ధి, జ్ఞానం, సైన్స్, విద్యతో రాకెట్లు తయారు చేస్తున్నారు. సామాన్యంగా ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడి నుండి మక్కా నేను ఒక రోజులో పోయి వస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంచుమించు 1000 కిలోమీటర్లు. కానీ ఈ రోజుల్లో సాధ్యమా లేదా? నాలుగు సార్లు పోయి రావచ్చు కదా మక్కా. అదే రాకెట్ యొక్క వేగం ఎంత ఉన్నది? అయితే నేను ఈ విషయాలు మళ్ళీ విడమరిచి చెప్పడానికి వెళ్తే సమయం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. మన విశ్వాసులం, ఖుర్ఆన్ లో వచ్చిన విషయం, సహీహ్ హదీథ్ లో వచ్చిన విషయాన్ని మనం తూచా తప్పకుండా నమ్మాలి, ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు గురి కాకూడదు.

అయితే మస్జిద్-ఎ-అఖ్సా లో చేరిన తర్వాత అక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదమ్ అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంత మంది ప్రవక్తలు వచ్చారో వారందరినీ జమా చేశాడు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఇమామత్, నమాజ్ చేయించే అటువంటి నాయకత్వం ఈ గొప్పతనం ఎవరికి లభించింది? ఎవరికీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అంటే ఇమాముల్ అంబియా అని అంటాము కదా మనం సామాన్యంగా ఉర్దూలో. ఇది వాస్తవ రూపంలో అక్కడ జరిగింది.

ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణంలో మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, ఏడు ఆకాశాలలో పైకి వెళ్లారైతే, మొదటి ఆకాశంలో హజ్రత్ ఆదమ్ అలైహిస్సలాం తో కలిశారు. రెండవ ఆకాశంలో ఈసా మరియు యహ్యా అలైహిముస్సలాం తో కలిశారు. మూడవ ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం తో కలిశారు. నాలుగవ ఆకాశంలో హజ్రత్ ఇద్రీస్ అలైహిస్సలాం తో కలిశారు. ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం తో కలిశారు. మరియు ఆరవ ఆకాశంలో హజ్రత్ మూసా అలైహిస్సలాం తో కలిశారు. ఏడవ ఆకాశంలో హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తో కలిశారు.

ఈ విధంగా ఏడు ఆకాశాలకు పైన ఒక రేగు చెట్టు ఉంది. దానిని సిద్రతుల్ ముంతహా అని అంటారు. ఆ చెట్టు, రేగు పండు ఒక్కొక్క పండు పెద్ద పెద్ద కడవలు చూసి ఉంటారు. పల్లెటూర్లలో పాతకాలంలో గోధుమాలో లేదా వడ్లు వేయడానికి పెద్ద పెద్ద గుమ్మీలు వాడేవారు. ఒక్కొక్క దాంట్లో 300 కిలో, 500 కిలోలు కూడా అంత స్థలం ఉంటుంది. ఆ విధంగా పెద్ద పెద్ద ఒక్కొక్క పండు అంత పెద్దగా ఉంటుంది. మరియు దాని యొక్క ఆకులు ఏనుగుల చెవుల మాదిరిగా అంత పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. హదీథ్ లో వచ్చిన విషయం ఏంటంటే, హిజ్ర్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంత వాసులు ఎలాంటి మట్టి నీళ్లు వేయడానికి బిందెలు లాంటివి, నీళ్లు పోసుకోవడానికి కడవల లాంటివి ఏదైతే ఉపయోగిస్తారో దానికి సమానమైన పండ్లు ఆ రేగు పండు ఒక్కొక్కటి మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటాయి.

ఇంకా ఆ రేగు చెట్టు యొక్క వ్రేళ్లు ఆరవ ఆకాశంలో ఉన్నాయి మరియు దాని యొక్క కొమ్మలు ఏడు ఆకాశాలకు పైగా ఉన్నాయి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎన్నో విషయాలు చూపించడం జరిగింది, ఎన్నో విషయాలు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగాయి. ఉదాహరణకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే అల్లాహ్ యొక్క చాలా దగ్గరగా ఉండే అల్లాహ్ ఆదేశాలను రాస్తూ ఉండే దైవదూతల కలముల శబ్దం విన్నారు, సిద్రతుల్ ముంతహాలో.

జన్నతుల్ మఅవా అన్నది దానికి సమీపంలోనే ఉన్నది. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మూడు విషయాలు బహుమానంగా ఇవ్వబడ్డాయి. ఎలా? మీకు ఏదైనా బహుమానం దొరికింది, ఏదైనా పెద్ద గిఫ్ట్ దొరికింది, ఒక షీల్డ్, క్రికెట్ లో మీరు కప్ గెలిచారు. దానిని తీసుకొచ్చి పారేస్తారా? ఏం చేస్తారు? కాపాడుతారు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ లభించిన విషయాలు ఏమిటి? ఐదు పూటల నమాజులు, ఇక దాని వివరణలో వెళ్తాలేను, ముందు 50 ఉండే ఆ తర్వాత ఇలా తగ్గింది అనేది. రెండవ బహుమానం, సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు, ఆమన రసూల్ బిమా ఉన్జిలా అక్కడ నుండి మొదలుకొని. మరియు మూడవ బహుమానం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజంలో, వారిని అనుసరించే వారిలో ఎవరైతే షిర్క్ నుండి దూరం ఉంటారో అల్లాహ్ త’ఆలా వారి యొక్క ఘోరమైన పాపాలను కూడా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్. ఈ మూడు పెద్ద బహుమానాలు.

సహీహ్ ముస్లిం షరీఫ్, హదీథ్ నంబర్ 173 లో వీటి ప్రస్తావన వచ్చి ఉంది. సిద్రతుల్ ముంతహా మరియు అక్కడ ఆ తర్వాత నుండి ఏదైతే విషయాలు చెప్పానో వాటి ప్రస్తావన. ఇక్కడ గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు లభించినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? ఏమిటి? చెప్పండి! ఐదు పూటల నమాజు. ఇంకా? సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు. మరియు మూడో విషయం? షిర్క్ చేయని వారి యొక్క ఘోర పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు అని శుభవార్త.

ఈ రోజుల్లో మేరాజున్ నబీ అన్నటువంటి బిద్అత్ చేసి, ఇంకా అందులో ఎన్నో రకాల షిర్క్ పనులు చేసి, రజబ్ మాసంలో రజబ్ కే కూండే అన్న పేరు మీద ఎన్నో షిర్క్ పనులు చేసుకుంటూ మనం ప్రవక్త విధానానికి ఎంత వ్యతిరేకం చేస్తున్నాము. ఎంతో మంది ఎవరైతే జషన్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని ఈ మేరాజ్-ఉన్-నబీ పేరు మీద రాత్రి జాగారం చేస్తారో, సంవత్సరంలో ఎన్ని నమాజులు వారు చేస్తున్నారు? ఆ రోజు వచ్చి ఎన్నో నఫిల్‌లు చేస్తారు కావచ్చు కానీ, మహాశయులారా! గమనించండి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప బహుమానంగా ఏ విషయాలు అయితే ఈ ప్రయాణంలో పొందారో వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం పాటించాలి, వాటిని ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా, అందులో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వాటిని మనం పాటించాలి.

ఇంకా మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని రెండవ సారిగా అతని యొక్క అసలైన రూపంలో చూశారు.

అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మత్తుపానీయం మరియు పాలు మరియు తేనె మూడు విషయాలు ఇవ్వబడ్డాయి. ప్రవక్తా ఇదిగో తీసుకోండి, మీరు సేవించండి అన్నట్లుగా ఏ విషయాలు ఇవ్వబడ్డాయి? అల్లాహు అక్బర్! మత్తుపానీయం, మరియు పాలు, మరియు తేనె. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తీసుకున్నారు? పాలు తీసుకున్నారు. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో ఈ ప్రస్తావన ఉంది.

మరియు ఏడవ ఆకాశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మఅమూర్ అని చూశారు. బైతుల్ మఅమూర్ ఏంటి? ఇహలోకంలో మన కొరకు బైతుల్లాహ్ ఎలానైతే ఉందో, కాబతుల్లాహ్, అలాగే దానికి స్ట్రెయిట్ గా ఏడు ఆకాశాల పైన బైతుల్ మఅమూర్ ఉంది. దైవదూతలు అక్కడ నమాజ్ చేస్తారు, దాని యొక్క తవాఫ్ చేస్తారు. ఒక్కసారి 70,000 మంది దైవదూతలు అక్కడ తవాఫ్ చేస్తారు, నమాజ్ చేస్తారు. మరియు ఒక్కసారి ఎవరికైతే ఈ అవకాశం దొరికిందో ప్రళయం వరకు మళ్ళీ వారికి ఈ అవకాశం దొరకదు. గమనించండి దైవదూతల సంఖ్య ఎంత గొప్పగా ఉందో. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నంబర్ 3207.

ఇంకా మహాశయులారా, ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ మూసా అలైహిస్సలాం వారిని కూడా చూశారు. అలాగే నరకం యొక్క కాపరి, మాలిక్ అతని పేరు, అతనిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఈ ప్రయాణంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని కూడా చూశారు, అలాగే నరకాన్ని కూడా దర్శించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం దర్శించారో అక్కడ చూశారు, వజ్రాలతో తయారు చేయబడినటువంటి అక్కడ గోపురాలు ఉన్నాయి. ఖైమా, ఇక్కడ ఏదైనా వాతావరణం చాలా సునాయాసంగా ఉండి, వేడి కూడా ఎక్కువ లేకుండా, చలి కూడా లేకుండా, మోసమ్-ఎ-రబీ అని ఏదైతే అంటారో మనం చూస్తాము కదా, ఎడారిలో డైరాలు వేసుకొని, ఖైమాలు వేసుకొని అక్కడ కొంత సమయం గానీ లేదా కొద్ది రోజులు గానీ గడుపుతారు. చూశారా కదా? అయితే అలాంటి ఖైమాలో వారికి ఎంత ఆనందం ఏర్పడుతుంది, అన్ని రకాల సౌకర్యాలు బహుశా అందులో ఉంటాయి కావచ్చు కానీ అస్తగ్ ఫిరుల్లాహ్, ఇది పోలిక కాదు స్వర్గంలో లభించే అటువంటి ఖైమాకు. కానీ అక్కడ ఒకే ఒక వజ్రం ఇంత పెద్దగా ఉంటుంది, ఆ ఒకే వజ్రంతో చాలా పెద్ద ఖైమాగా తయారు చేయబడుతుంది. మరియు అక్కడి యొక్క మట్టి కస్తూరి అని చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రస్తావన బుఖారీ 349, అలాగే సహీహ్ ముస్లిం 163 లో వచ్చి ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గంలో కౌథర్ అనేటువంటి ఒక పెద్ద వాగు ఏదైతే ప్రసాదించడం జరుగుతుందో దానిని కూడా చూసి వచ్చారు. అలాగే ఫిరౌన్ కూతురికి జడలు వేసే అటువంటి ఒక సేవకురాలు, ఆమె ఇస్లాం స్వీకరించింది, మూసా అలైహిస్సలాం ను విశ్వసించింది. దానికి బదులుగా ఫిరౌన్ ఆ దౌర్జన్యపరుడు, దుర్మార్గుడు ఏం చేశాడు? ఆమెను, ఆమె యొక్క నలుగురి సంతానాన్ని సలసల మసులుతున్న నూనెలో, వేడి నూనెలో వేసేశాడు. అయితే ఆమెకు స్వర్గంలో ఏ గొప్ప అక్కడ గృహం అయితే ప్రసాదించబడిందో, దానిని అక్కడి నుండి వస్తున్నటువంటి సువాసనను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహీహ్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, జిల్ద్ 5, పేజ్ 30.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మరొక రూపంలో చూశారు. అల్లాహ్ తో భయపడుతూ ఎంత కంపించిపోయారంటే అతని యొక్క పరిస్థితి ఒక చాలా మాసిపోయిన లేదా పాడైపోయిన తట్టు గుంత ఎలా ఉంటుందో అతనిని చూస్తే అలా ఏర్పడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను సహీహాలో ప్రస్తావించారు, 2289.

ఇంకా మహాశయులారా, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తతో కలిసి ఏం చెప్పారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నా వైపు నుండి నీ అనుచర సంఘానికి సలాం తెలుపు. అల్లాహు అక్బర్. సల్లల్లాహు అలైహి వ ఆలా ఆలిహి వసల్లం. అల్లాహ్ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా తన కరుణ, శాంతులు కురియజేయుగాక. గమనించండి. ఒకవేళ నేను, మీరు, మనందరము, ముస్లింలం అని అనుకునే వాళ్ళము, మేరాజ్-ఉన్-నబీ లాంటి బిదత్ పనులు, జషన్-ఎ-మేరాజ్ అని బిదత్ పనులు చేయకుండా నిజమైన ధర్మంపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మంపై ఉండి ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సలాం కూడా మనకు కలుగుతుంది. ఆయన ప్రత్యేకంగా సలాం పంపారు. ఇంకా ఏం చెప్పారు? ఓ ముహమ్మద్, నీ అనుచర సంఘానికి తెలుపు, ఈ స్వర్గం దీని యొక్క మట్టి ఇది చాలా మంచిది. ఇక్కడ విత్తనం వేసిన వెంటనే మంచి చెట్లు మరియు దానికి ఫలాలు వెంటనే అవుతూ ఉంటాయి. అట్లాంటి మట్టి ఇది. మరియు ఇక్కడి యొక్క నీరు కూడా చాలా మంచి నీరు. కానీ ఇప్పటివరకు అది ఎలాంటి చెట్టు లేకుండా ఉంది. అక్కడ చెట్టు మనకు కావాలంటే ఏం చేయాలి? నీ అనుచర సంఘానికి తెలుపు, సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అధికంగా చదువుతూ ఉంటే అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో మంచి చెట్లు నాటుతాడు, పరలోకంలో స్వర్గంలో చేరిన తర్వాత వారికి ఆ చెట్లు ప్రసాదించబడతాయి. అల్లాహు అక్బర్. ఏమైనా కష్టమా ఆలోచించండి? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం.

అలాగే మహాశయులారా, మరొక హదీథ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పారు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అధికంగా చదువుతూ ఉండమని చెప్పండి. ఈ హదీథ్ లు తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉన్నాయి. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని చెప్పారు.

అలాగే నరకంని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్శించారు. నరకంలో ఏం చూశారు? నరకంలో ఒక చాలా భయంకరమైన దృశ్యం చూశారు. కొందరి యొక్క గోర్లు వారి యొక్క ఆ గోర్లు ఎలాంటివి? ఇత్తడివి. చాలా పొడుగ్గా ఉన్నాయి. వాటితో వారు తమ ముఖాలను, తమ శరీరాన్ని గీకుతున్నారు. తోలు బయటికి వచ్చేస్తుంది. వారి గురించి జిబ్రీల్ ను అడిగారు, ఈ పరిస్థితి వీరికి ఎందుకు జరుగుతుంది? అప్పుడు జిబ్రీల్ వీరికి తెలిపారు, వీరు ఎవరు తెలుసా? ప్రజల మానంలో, వారి యొక్క పరువులో చేయి వేసుకొని వారిని అవమానపరిచేవారు. అంటే పరోక్ష నిందలు, చాడీలు, గీబత్, చుగ్లీ, ఇంకా వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని వారిని నిందించడం, వారి యొక్క మానం, పరువులో జోక్యం చేసుకోవడం, ఇలా చేసుకునే వారికి ఈ శిక్ష జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సునన్ అబూ దావూద్ లో హదీథ్ వచ్చి ఉంది, 4878 హదీథ్ నంబర్.

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో రకాల దృశ్యాలు చూశారు కానీ మనకు సమయం అనేది సరిపోదు గనుక ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అదేమిటి? షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు, హదీథ్ నంబర్ 306.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం, ఈ మేరాజ్ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు ప్రజలకు తెలుపుతున్నారు. ఎవరైతే సత్య విశ్వాసులో వారు తూచా తప్పకుండా నమ్మారు. కానీ అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేశారు. ఏమని? మేము మక్కా నుండి ఫలస్తీన్ కు ఒక నెల రోజులు పడుతుంది మాకు పోవాలంటే. నీవు కేవలం ఫలస్తీన్ వరకే కాదు, ఏడు ఆకాశాల పైకి రాత్రిలోని కొన్ని క్షణాల్లో, కొంత సమయంలోనే వెళ్లి వచ్చావు అంటున్నావు అని హేళన చేశారు. అంతే కాదు, కొందరు అవిశ్వాసులు అయితే ఒకవేళ నీవు వాస్తవంగా ఫలస్తీన్ వెళ్లి, మస్జిద్-ఎ-అఖ్సా చూసి వచ్చావంటే దాని యొక్క వివరణ మాకు తెలుపు అని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎప్పుడైతే వారు అడిగారో నాకు దాని వివరణ ఏమీ తెలియదు. కానీ ఆ మస్జిద్-ఎ-అఖ్సా యొక్క దృశ్యం అల్లాహ్ నా ముందుకు తీసుకొచ్చాడు. వారు అడిగిన ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పుకొచ్చాను. అల్లాహు అక్బర్.

అక్కడ ఆ సమయంలో అబూ బకర్ రదియల్లాహు త’ఆలా అన్హు లేరు. ఎక్కడో దూరంగా ఏదో పని మీద ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాలు విన్న ఒక వ్యక్తి, “ఈరోజు అబూ బకర్, “ఎల్లవేళల్లో అబూ బకర్ ను చూశాము, ముహమ్మద్ చెప్పింది నిజమే, ముహమ్మద్ చెప్పింది నిజమే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ కు తోడుగా ఉన్నాడు కదా, ఈరోజు అబూ బకర్ కు వెళ్లి నేను తొందరగా ఈ విషయం తెలియజేస్తాను, అబూ బకర్ ఈ విషయాన్ని తిరస్కరిస్తాడు, అబద్ధం అని అంటాడు అన్నటువంటి నమ్మకంతో వెళ్లి, “అబూ బకర్! ఎవరైనా ఒక రాత్రిలో మక్కా నుండి ఫలస్తీన్ వెళ్లి వచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా?” అంటే, “లేదు.” సంతోషం కలిగింది అతనికి. వెంటనే అన్నాడు, “మరి మీ స్నేహితుడు, మీ యొక్క గురువు ముహమ్మద్ అంటున్నాడు కదా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ బకర్ వెంటనే చెప్పారు, “నిజమా? ముహమ్మద్ ఈ మాట చెప్పారా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అతను అన్నాడు, “అవును, ముహమ్మద్ ఈ మాట చెప్పాడు. అంతే కాదు, రాత్రిలోని కొంత భాగంలో ఫలస్తీన్ వరకే కాదు, మస్జిద్-ఎ-అఖ్సా కాదు, అక్కడి నుండి ఏడు ఆకాశాల పైకి కూడా వెళ్లారట.” వెంటనే అబూ బకర్ చెప్పారు, “ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పి ఉంటే నూటికి నూరు పాళ్లు నిజం, ఇది సత్యం, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.” అతడే, ప్రశ్న అడిగినవాడు, అబూ బకర్ గురించి ఏదో తప్పుగా ఆలోచించి వచ్చినవాడు చాలా ఆశ్చర్యపోతాడు. “ఎలా నీవు ఇది నిజం నమ్ముతున్నావు?” అని అంటే, “నీకు ఇందులో ఏం అనుమానం? ప్రవక్త చెప్తారు నాకు పొద్దున వహీ వస్తుంది, సాయంకాలం వహీ వస్తుంది, అల్లాహ్ నుండి దైవదూత వస్తున్నాడు, నాకు ఈ సందేశం ఇచ్చారు, మేము అన్ని విషయాలను నమ్ముతున్నాము. ఒకవేళ అల్లాహ్ త’ఆలా తలుచుకొని ప్రవక్తని అక్కడి వరకు తీసుకువెళ్లాడంటే ఇందులో మాకు నమ్మని విషయం ఏమిటి?” అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిద్దీఖ్, సత్యవంతుడు అన్నటువంటి బిరుదు లభించినది. సత్యవంతుడు అని బిరుదు లభించినది.

అందుకు మహాశయులారా, గమనించండి. సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు హజ్రత్ అబూ బకర్ కు ప్రవక్తను అనుసరిస్తే లభించిందా? ప్రవక్తను నమ్మితే లభించిందా? లేదా అనుసరణ, ఆచరణ అన్నిటినీ వదులుకొని కేవలం ప్రేమ, ప్రేమ, ప్రేమ అని కేవలం నోటికి చెప్పుకుంటే లభించిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అబూ బకర్ కు ఉన్నంత ప్రేమ ఇంకా ఎవరికీ లేకుండే. కానీ ఆయన అంతే అనుసరించేవారు. ప్రవక్త మాటను ఆచరించేవారు. ఈ గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలి. ఆచరణ అనేది ఉండాలి ప్రవక్త సున్నత్ ప్రకారంగా, దురాచారాన్ని వదులుకోవాలి, బిదత్ లను వదులుకోవాలి, షిర్క్ లను వదులుకోవాలి. మరియు ఏదైతే నమాజులను వదులుతున్నామో అది వదలకూడదు. ఎందుకు? ఇదే సామాన్య విషయమా నమాజ్? ఎక్కడ దొరికింది నమాజ్ ప్రవక్తకు? ఆకాశాల పైకి పిలువబడి ఇవ్వబడినది. ఇంతటి గౌరవమైన విషయాన్ని మనం ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా వదులుతున్నాము. అల్లాహ్ త’ఆలా మనందరికీ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్త గారు ఏ ఏ విషయాలు చూశారో, ఏ ఏ బహుమానాలు పొందారో, దాని గురించి కొన్ని విషయాలు ఏదైతే విన్నామో వాటిని అర్థం చేసుకొని, వాటిని పాటించే భాగ్యం ప్రసాదించుగాక. స్వర్గంలో తీసుకెళ్ళేటువంటి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు నరకంలో తీసుకెళ్ళే విషయాల నుండి దూరం ఉండే అల్లాహ్ త’ఆలా భాగ్యం కూడా మనకు ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5801



హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం
https://youtu.be/dZZa0Z0Oh8Y (3 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.

సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.

మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”

హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.


ఇతరములు:

పురుషులు బంగారం వేసుకొనుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో | టెక్స్ట్]

పురుషులు బంగారం వేసుకొనుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/7NYeGuNGHnk (6 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.

అబూ మూసా అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

أُحِلَّ لِإِنَاثِ أُمَّتِي الْحَرِيرُ وَالذَّهَبُ وَحُرِّمَ عَلَى ذُكُورِهَا
బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురు షులకు నిషిద్ధం”.
(ముస్నద్ అహ్మద్: 4/393. సహీహుల్ జామి 207).

ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

أنَّ رسُولَ الله ﷺ رَأَى خَاتَمًا مِنْ ذَهَبٍ فِي يَدِ رَجُلٍ فَنَزَعَهُ فَطَرَحَهُ وَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ إِلَى جَمْرَةٍ مِنْ نَارٍ فَيَجْعَلُهَا فِي يَدِهِ فَقِيلَ لِلرَّجُلِ بَعْدَ مَا ذَهَبَ رَسُولُ الله ﷺ خُذْ خَاتِمَكَ انْتَفِعْ بِهِ قَالَ لَا وَالله لَا آخُذُهُ أَبَدًا وَقَدْ طَرَحَهُ رَسُولُ الله ﷺ

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).

ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.

ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.

  1. బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
  2. తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
  3. పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
  4. సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.

అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5351

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు (خطورة الدعاء مع غير الله)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

https://www.youtube.com/watch?v=k3vxVbMjq6g [27 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.

సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:

لَهُ دَعْوَةُ الْحَقِّ
(లహు ద’వతుల్ హఖ్)
దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)

ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.

ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:

وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
(వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్)
అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)

అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్)
మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను (40:60)

వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.

ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۖ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)

దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆఉ హువల్ ఇబాదహ్)
దుఆ అసలైన ఇబాదత్.

మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.

అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ
(వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్)
అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)

సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:

وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ
(వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్)
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)

అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.

అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.

సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.

وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ
(వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్)
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”

షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?

قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ
(ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్)
“ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)

గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.

అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:

حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ

ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)

అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.

అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:

لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
(లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా)
మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)

లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా? 

అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:

فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
(ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్)
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)

ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
(వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)

إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)

(వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.

(వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.

అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. (34:22)

(ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.

అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.

ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.

ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)

وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)

(వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.

(వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.

ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.

ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.

అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.

అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.

అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5159