ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ముస్లింల గీటురాయి – ఖుర్ఆన్ & హదీసులు
ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.
ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.
అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:
وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహు వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)
“(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.” (5:49)
అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.
وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)
“వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.“
వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.
وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్)
“(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.
ఇదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:
وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ
(వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్)
“ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)
ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.
అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముజ్జాలిమూన్)
“అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.” (5:45)
ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:
وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్)
“ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)
అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.
అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.
అల్లాహ్ చట్టంతో తీర్పు ఇవ్వకపోవటంలోని రకాలు
అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్‌కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.
ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.
మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్‌కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.
ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.
రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.
అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.
అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.
ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.
ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.
వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43352


You must be logged in to post a comment.