రమదాన్ స్వాగతం ఎందుకు, ఎలా? – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

రమదాన్ స్వాగతం ఎందుకు, ఎలా ?
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/QDDLcOpp8bc [28 నిముషాలు]

రమజాన్ మాసం రాకముందే దాని కోసం సన్నద్ధం అవ్వడం, రమజాన్‌ను స్వాగతించడం యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రసంగం వివరిస్తుంది. రైతు వర్షాకాలానికి ముందే పొలాన్ని సిద్ధం చేయడం, ముఖ్యమైన అతిథి కోసం ఇంటిని శుభ్రపరచడం వంటి ఉదాహరణలతో ఈ విషయం స్పష్టం చేయబడింది. రమజాన్‌ను స్వాగతించడానికి, దుఆ చేయడం, అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పడం, సంతోషాన్ని వ్యక్తపరచడం, దృఢ సంకల్పం చేసుకోవడం, పశ్చాత్తాపం చెందడం, ఇస్లామీయ జ్ఞానాన్ని నేర్చుకోవడం, సంకల్ప శుద్ధి చేసుకోవడం, మరియు ఇతరుల పట్ల హృదయాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి పద్ధతులను పండితులు సూచించారు. ఖురాన్ పారాయణం, ఇఫ్తార్ చేయించడం, దానధర్మాలు చేయడం, ఉమ్రా చేయడం, మరియు దైవ సందేశాన్ని ప్రచారం చేయడం కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా నొక్కి చెప్పబడింది. ఈ రమజాన్ మన చివరిది కావచ్చుననే భావనతో, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రసంగం ముగుస్తుంది.

అల్ హమ్దులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదహ్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం రమజాన్ స్వాగతం ఎందుకు, ఎలా? అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. మనం షాబాన్ నెల చివరి దశకంలో ఉన్నాం, కొద్ది రోజుల్లోనే ఇన్ షా అల్లాహ్ రమజాన్ మాసము రాబోవుచున్నది కాబట్టి, రమజాన్ రాకముందే మనం రమజాన్ నెల కోసం సన్నద్ధం అవ్వాలి, రమజాన్ నెలను స్వాగతం పలకాలి. ఏ విధంగా మనము స్వాగతం పలకాలి? ఎందుకు మనము రమజాన్ నెల కోసం ఎదురు చూసి దాని కోసము సన్నాహాలు చేసుకోవాలి? అనే కొన్ని విషయాలు ఇప్పుడు మనము ఉదాహరణలతో మరియు ఆధారాలతో తెలుసుకుందాం.

ముందుగా, రమజాన్ మాసానికి మనం ఎందుకు స్వాగతించాలి అనే విషయాన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం.

చూడండి, ఒక రైతు తన పొలాన్ని వర్షాకాలము రాకముందే దున్ని చదును చేసి సిద్ధంగా ఉంచుకుంటాడు. ఎందుకంటే వర్షాలు రాగానే వర్షాల నుండి పూర్తిగా లబ్ది పొంది మంచి పంట పండించుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాడు. సరిగ్గా అదే విధంగా ఒక విశ్వాసి రమజాన్ మాసం రాకముందే రమజాన్ మాసం కోసము పూర్తిగా సన్నాహాలు చేసుకొని సిద్ధంగా ఉంటాడు. రమజాన్ వచ్చిన తర్వాత రమజాన్ నుండి పూర్తిగా లబ్ధి పొందుతాడు.

అలాగే, ఒక అతిథి మన ఇంటికి వస్తూ ఉన్నాడు, అతను పెద్ద పెద్ద బహుమతులు కూడా మన కోసము వెంట తీసుకొని వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసినప్పుడు, మనం ఆ అతిథి రాక కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తాం. అతని రాక కోసము మన ఇంటిని, పరిసరాలను శుభ్రంగా చేసి సిద్ధంగా ఉంచుతాం. ఒక రాజకీయ నాయకుడు వస్తూ ఉన్నాడు అంటే, ఏ ప్రదేశానికి అతను వస్తూ ఉన్నాడో ఆ ప్రదేశంలో ఉన్న వీధులు, ఆ ప్రదేశంలో ఉన్న రోడ్లు అన్నీ మారిపోతాయి. సరిగ్గా ఒక విశ్వాసి కూడా అదే విధంగా రమజాన్ మాసము ఎన్నో విశిష్టతలు, వరాలు మన కోసము తీసుకొని వస్తూ ఉందన్న విషయాన్ని తెలుసుకొని, రమజాన్ రాకముందే తనను, తన ఇంటిని, తన పరిసరాలను పూర్తిగా సిద్ధం చేసుకొని రమజాన్ మాసం కోసం ఎదురు చూస్తాడు.

ఈ ఉదాహరణల ద్వారా మనము ఒక విషయాన్ని మాత్రము తెలుసుకున్నాం, అదేమిటంటే రమజాన్ రాకముందే రమజాన్ నుండి పూర్తిగా లబ్ధి పొందటానికి, రమజాన్ వరాలు మనకు దక్కించుకోవటానికి మనము ముందస్తు చర్యలు చేపట్టాలి మరియు రమజాన్ కోసము సన్నద్ధం అవ్వాలి, రమజాన్ నెలను ఆ విధంగా స్వాగతించాలి.

అయితే, రమజాన్ నెలను స్వాగతించటానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, విధానాలు ఉన్నాయా అంటే ధార్మిక పండితులు కొన్ని సలహాలు మనకు ఇచ్చి ఉన్నారు. ఏ విధంగా రమజాన్ మాసాన్ని స్వాగతించాలి? మరియు ఏ విధంగా రమజాన్ కోసం మనం సన్నద్ధం అవ్వాలి? అంటే కొన్ని సలహాలు ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనము విని తెలుసుకుందాం.

మొదటి సలహా ఏమిటంటే రమజాన్ మాసము దక్కాలి అని అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉండాలి. ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, మన సజ్జన పూర్వీకులు, సలఫ్ సాలిహీన్, రమజాన్ మాసం ఇంకా ఆరు నెలల తర్వాత వస్తుంది అన్నప్పటి నుండే, “ఓ అల్లాహ్, నాకు రమజాన్ మాసము దక్కించు” అని వేడుకుంటూ ఉండేవారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో. అలాగే మనము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో రమజాన్ మాసము దక్కాలి అని, రమజాన్ మాసము మనము పొందాలి అని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్క రమజాన్ దక్కినా మనము ఎన్నో పుణ్యాలు పొందగలము.

దీనికి ఉదాహరణగా ఇబ్నె మాజా గ్రంథంలోని ఒక ఉల్లేఖనము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇద్దరు స్నేహితులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. ఆ ఇద్దరిలో నుండి ఒక మిత్రుడు ఇస్లాం కోసము, ఇస్లాం సేవ కోసము బాగా కష్టపడేవాడు, తపించేవాడు. ఆయన ఇస్లాంకు సేవలు అందిస్తూ అందిస్తూ చివరికి ఇస్లాం కోసము ప్రాణత్యాగం చేసేశారు, షహీద్ అయిపోయారు. ఒక మిత్రుడు షహీద్ అయిపోయి మరణించి వెళ్ళిపోయారు. ఇక రెండవ మిత్రుడు మిగిలి ఉన్నాడు కదా, ఆయన ఒక సంవత్సరము తర్వాత సాధారణ మరణం పొందారు.

తల్హా రజియల్లాహు తాలా అన్హు వారు ఒక సహాబీ. ఈ ఇద్దరు మిత్రులు మరణించిన తర్వాత ఒక కల చూశారు. ఆ కలలో ఆయన స్వర్గపు ద్వారాల వద్ద నిలబడి ఉంటే, దైవదూతలు ఏ మిత్రుడు అయితే సాధారణంగా మరణించాడో ఆయనను ముందు స్వర్గంలోకి తీసుకెళ్లారు. ఏ మిత్రుడు అయితే షహీద్ అయ్యాడో, వీర మరణం పొందాడో ఆయనను తర్వాత స్వర్గంలోకి తీసుకెళ్లారు. ఈయన మార్గం వద్ద నిలబడి ఉన్నారు కదా, ఈయనతో దైవదూతలు ఏమంటున్నారంటే “మీ సమయం ఇంకా కాలేదు, మీరు వెళ్ళండి” అని ఇంటికి పంపించేశారు, తిరిగి పంపించేశారు. ఉదయం అయ్యాక ఆయన చూసిన కల ఇతరులకు తెలియజేశారు. ఆ నోటా ఈ నోటా అది అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ కల గురించి విని ఆశ్చర్యపోతూ ఉన్నారు. షహీద్ అయిపోయిన మిత్రుడు ఆలస్యంగా స్వర్గంలోకి వెళ్లటం ఏమిటి? సాధారణంగా మరణించిన మిత్రుడు ముందుగా స్వర్గానికి చేరుకోవటం ఏమిటి? అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు, విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల ముందరికి వచ్చి ఏమన్నారంటే, “చూడండి, ఏ మిత్రుడు అయితే ఆలస్యంగా, సాధారణంగా మరణించాడో, అతనికి ఒక సంవత్సరము ఎక్కువ ఆయుష్షు దక్కింది. అతను ఒక రమజాన్ నెల ఎక్కువగా పొందాడు. ఆ రమజాన్ నెలలో, అతను పొందిన ఆ పూర్తి సంవత్సరంలో ఎన్ని సత్కార్యాలు అతను చేసుకున్నాడు అంటే, పుణ్యాలలో ఇద్దరి మధ్య భూమి ఆకాశాల మధ్య ఎంత తేడా వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం వచ్చేసింది” అని చెప్పారు. అల్లాహు అక్బర్. చూశారా?

కాబట్టి ఒక్క రమజాన్ మాసము దక్కించుకున్నా, మనము సత్కార్యాలలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోగలము కాబట్టి, రమజాన్ మాసము దక్కాలి అని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండాలి. ఇది మొదటి సలహా.

రెండవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసము దక్కిన తర్వాత అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లించాలి. అల్లాహ్ ఆదేశం ఖురాన్‌లో ఈ విధంగా ఉంది, రెండవ అధ్యాయము, 172 వ వాక్యం:

وَاشْكُرُوا لِلَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
[వష్కురూ లిల్లాహి ఇన్ కున్తుమ్ ఇయ్యాహు త’అబుదూన్]
ఒకవేళ మీరు అల్లాహ్ యే ఆరాధించే వారైతే ఆయనకు కృతజ్ఞులై ఉండండి. (2:172)

అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపాలని ఇక్కడ ఆదేశించబడి ఉంది. రమజాన్ మాసం దక్కటం అల్లాహ్ తరఫున పెద్ద అనుగ్రహము కాబట్టి, ఆ అనుగ్రహం పొందిన వారు అల్లాహ్‌కు ముందుగా కృతజ్ఞతలు చెల్లించాలి.

చూడండి, గుండె మీద ఒక్కసారి చెయ్యి పెట్టుకొని ఆత్మ విమర్శ చేసి చూడండి, ఆలోచించి చూడండి. మనతో పాటు గత సంవత్సరం రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్నవారు, ఇఫ్తారీ ప్రోగ్రాంలలో పాల్గొన్న వారు, తరావీహ్‌లలో పాల్గొన్న వారు ఈ సంవత్సరము రమజాన్ వచ్చేసరికి మన మధ్య లేరు. వారు మరణించారు, అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మనకు మాత్రం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయుష్షు ఇచ్చాడు, మరొక రమజాన్ మన జీవితంలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు అల్లాహ్ ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనము గుర్తించి, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపాలి, ఇది రెండవ సలహా.

మూడవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసం వచ్చింది కాబట్టి మనము సంతోషపడాలి. రమజాన్ మాసం వచ్చిందన్న విషయం మనకు సంతోషం కలిగించాలి.

అయితే సమాజంలో రెండు రకాల ప్రజలను మనము చూస్తూ ఉన్నాం. కొందరికి రమజాన్ మాసం వచ్చిందంటే అస్సలు సంతోషం లేదు, వారు బాధపడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంతమందికి సంతోషం లేదు, వారికి బాధ కలుగుతూ ఉంది. మన విశ్వాసులకే ఎవరైతే ముస్లింలని చెప్పుకుంటున్నారో వారిలోనే కొంతమందికి అలాంటి బాధ కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే, వారు ఇన్ని రోజులు బాగా తాగుతూ, తింటూ, తిరుగుతూ తందనాలు ఆడుతూ ఉండేవారు. రమజాన్ వచ్చేసింది కాబట్టి ఇక ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇన్ని రోజులు తాగినట్టు వాళ్ళు తాగలేరు; సిగరెట్లు తాగటం కానీ, గుట్కాలు నమలటం కానీ, సారాయి మధ్యము సేవించటం కానీ, ఇవన్నీ వాళ్ళు చేస్తూ తందనాలు ఆడుతూ ఉండేవారు కాబట్టి, రమజాన్ వచ్చేసిందంటే ఇదంతా ఇక ఆగిపోతుంది. రమజాన్ మాసంలో కూడా వాళ్ళు తాగినా, తిన్నా, తిరిగినా, చూసిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉపవాసం ఉంటున్నారు, మీకేమైంది మీరు ఉపవాసం ఉండకుండా ఇలా తిరుగుతూ ఉన్నారు అని ప్రతి ఒక్కరూ నిందిస్తారు, వేలెత్తి చూపుతారు. కాబట్టి ఇన్ని రోజులు వారు ఏ జల్సాలైతే చేస్తూ వస్తూ ఉన్నారో అవన్నీ ఆగిపోతాయి అన్న విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఇది విశ్వాసానికి విరుద్ధమైన విషయం. ఇలాంటి వారు తోబా చేసుకోవలసిన అవసరం ఉంది.

అయితే సమాజంలో మరికొంతమంది విశ్వాసులు ఉన్నారు. రమజాన్ మాసం వస్తూ ఉంది అంటే వారికి ఆత్మ లోపల నుంచి సంతోషం కలుగుతుంది. వారు లోపల నుంచి సంతోషపడుతూ ఉంటారు, నోటితో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాంటి విశ్వాసులలో అల్లాహ్ మమ్మల్ని అందరిని చేర్చు గాక.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూచినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలపబడింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్ మాసం వచ్చిందన్న విషయాన్ని సంతోషంగా ప్రజల ముందర ప్రకటించేవారు.

أتاكم رمضان شهر مبارك
[అతాకుమ్ రమదాన్ షహ్రున్ ముబారక్]
మీ వద్దకు రమజాన్ వచ్చేసింది, ఇది పవిత్రమైన మాసము, శుభాలతో కూడిన మాసము అని సహాబాల ముందర సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కాబట్టి రమజాన్ మాసం వచ్చినప్పుడు మనం సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఇది మూడవ సలహా.

నాలుగవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసాన్ని పొందిన తర్వాత రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసము మనం ముందుగానే దృఢమైన సంకల్పం చేసుకోవాలి. ఒక్క రోజు కూడా, ఒక్క ఉపవాసము కూడా చేజారకూడదు. ఒక్క ఆరాధన కూడా చేజారకూడదు. అన్ని ఆరాధనలు చేసుకొని, అన్ని ఉపవాసాలు ఉండి, అన్ని రకాల సత్కార్యాలు చేసుకొని రమజాన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ముందుగానే మనము సంకల్పం చేసుకోవాలి. సంకల్పం నిజమైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఖురాన్ గ్రంథం 47వ అధ్యాయం, 21వ వాక్యాన్ని చూడండి, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు:

فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْرًا لَّهُمْ
[ఫలవ్ సదఖుల్లాహ లకాన ఖైరల్ లహుమ్]
“వారు అల్లాహ్‌ పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది.” (47:21)

అంటే వారి సంకల్పం సరైనదై ఉంటే అది వారికే మంచిది అని అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పేర్కొంటూ ఉన్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక పల్లెటూరి వాసి ఇస్లాం స్వీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వచ్చి జత కలిశాడు. ఆ తర్వాత అతను వలస ప్రయాణము కూడా చేశాడు. వలస ప్రయాణము చేసి మదీనాకు చేరుకున్నప్పుడు యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాలలో ఒక యుద్ధంలో యుద్ధ ప్రాప్తి మాలె గనీమత్ దక్కింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాలె గనీమత్‌ను ప్రజలకు పంచారు. అతనికి కూడా కొద్ది భాగము ఇచ్చారు. ఆ పల్లెటూరి వాసి ఎంత మంచి సంకల్పం కలిగిన వ్యక్తితో చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమంటున్నాడంటే,

“ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరించి, వలస ప్రయాణము చేసుకొని ఇక్కడికి వచ్చింది ఈ ప్రాపంచిక సొమ్ము కోసము కాదు. ఈ ప్రాపంచిక సొమ్ము పొందాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయలేదు. నా సంకల్పం ఏమిటంటే, నేను అల్లాహ్ ధర్మం కోసము శ్రమించాలి, వీలైతే అల్లాహ్ ధర్మం కోసము అన్ని రకాల త్యాగాలు, చివరికి నా ప్రాణము కూడా త్యాగము చేసేయాలి. ఆ ఉద్దేశంతో నేను ఇస్లాం స్వీకరించాను, మీతో జత కలిశాను, వలస ప్రయాణం చేశాను ఓ దైవ ప్రవక్త” అన్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు:

إن تصدق الله يصدقك
[ఇన్ తస్దుఖిల్లాహ యస్దుఖ్-క]
“నీవు నిజంగానే ఆ విధంగా సంకల్పం చేసుకొని ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నీ సంకల్పాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు” అని సమాధానం ఇచ్చారు. (నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం).

ప్రజలు చూశారు, అలాగే జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇస్లాం కోసము శ్రమించాడు, శ్రమించాడు, ఎంతగా శ్రమించాడు అంటే ఒక యుద్ధంలో ఇస్లాం కోసము అతను తన ప్రాణాలను కూడా అర్పించేశాడు, షహీద్ అయిపోయాడు. చూశారా?

కాబట్టి సంకల్పంలో చిత్తశుద్ధి ఉంటే, మన సంకల్పం నిజమైనదై ఉంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని నెరవేరుస్తాడు కాబట్టి, రమజాన్‌ను సద్వినియోగం చేసుకోవాలని మనము చిత్తశుద్ధితో సంకల్పం చేసుకుంటే, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ నుండి లబ్ధి పొందిన వారు లాగా తీర్చిదిద్దేస్తాడు. ఇది నాలుగవ సలహా.

ఇక ఐదవ సలహా ఏమిటంటే, రమజాన్ రాకముందే పశ్చాత్తాపం పొంది పాపాలకు దూరంగా ఉండుటకు గట్టి నిర్ణయం తీసుకోవాలి.

చూడండి, రమజాన్ మాసంలో కూడా పశ్చాత్తాపం పొందాలి, రమజాన్ మాసం రాకముందే మనము పశ్చాత్తాపము ప్రారంభించేయాలి, పశ్చాత్తాపం చెందటం ప్రారంభించేయాలి. పశ్చాత్తాపం గురించి ప్రత్యేకంగా ఒక ప్రసంగం మనం విని ఉన్నాం. ఖురాన్ గ్రంథంలోని 24వ అధ్యాయం, 31వ వాక్యాన్ని ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చదివి విందాం. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పశ్చాత్తాపం గురించి ఆదేశిస్తూ ఇలా అంటూ ఉన్నాడు:

وَتُوبُوا إِلَى اللَّهِ جَمِيعًا أَيُّهَ الْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
[వతూబూ ఇలల్లాహి జమీ’అన్ అయ్యుహల్ ముఅమినూన ల’అల్లకుమ్ తుఫ్లిహూన్]
“ఓ విశ్వాసులారా! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (24:31)

పవిత్రమైన మాసం, అది రాబోవుచున్నది కాబట్టి, మనం కూడా ఆ పవిత్రమైన మాసంలో ప్రవేశించేటటానికి మనము కూడా పాపాల నుండి పశ్చాత్తాపం పొంది పవిత్రులమైపోయి ఆ మాసంలో ప్రవేశించటం ఎంతో అవసరమైన విషయం కాబట్టి రమజాన్‌కు ముందే పశ్చాత్తాపం పొందండి, ఇదే అలవాటు రమజాన్‌లో కూడా కొనసాగించండి అని ధార్మిక పండితులు సలహా ఇచ్చి ఉన్నారు. ఇది ఐదవ సలహా.

ఆరవ సలహా ఏమిటంటే రమజాన్ మాసంలో అన్ని రకాల పుణ్యాలు మనం పొందాలి అంటే, రమజాన్ మరియు రమజాన్‌లో ఉన్న ఆరాధనల నియమాలు ముందుగానే తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి.

చూడండి, రమజాన్‌లో ఉన్న ఆరాధనలు, ముఖ్యంగా ఉపవాసాలు, అలాగే నమాజులు, ఖియాముల్ లైల్, అలాగే ఖురాన్ పారాయణం, దానధర్మాలు, జకాత్ చెల్లించటాలు ఇక అనేక సత్కార్యాలు ఉన్నాయి కదండీ, వాటి గురించి నియమాలు, నిబంధనలు ముందుగానే మనము తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటే తప్పులు లేకుండా మనము ప్రతి ఆరాధన, ప్రతి సత్కార్యము చక్కగా చేయగలము, అన్ని పుణ్యాలు పొందగలము. అవగాహన చేసుకోకుండానే అలాగే ప్రారంభిస్తే తప్పులు దొర్లి పుణ్యాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అడిగి తెలుసుకోవాలి, చదివి తెలుసుకోవాలి. చూడండి అల్లాహ్ ఏమంటున్నాడు, ఖురాన్ గ్రంథం 21వ అధ్యాయం, ఏడవ వాక్యం:

فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ
[ఫస్అలూ అహలద్-ధిక్ రి ఇన్ కున్తుమ్ లా త’అలమూన్]
“మీకు తెలియకపోతే జ్ఞానులను అడిగి తెలుసుకోండి.” (21:7)

కాబట్టి రమజాన్‌లో ఉన్న ఆరాధనలు, సత్కార్యాలు అవి ఎలా చేయాలి, వాటి నియమాలు నిబంధనలు ఏమిటి అని ముందుగానే మనము తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇది మరొక సలహా, ఆరవది.

ఏడవ సలహా ఏమిటంటే, సంకల్ప శుద్ధి చేసుకోవాలి. సంకల్పం చేసుకోండని చెప్పాం, కానీ ఆ సంకల్పంలో కూడా శుద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రదర్శనా బుద్ధికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి. షైతాన్ ప్రతి ఒక్కరితో పాటు ఉన్నాడు, అతను ప్రజల హృదయాలలో ప్రదర్శనా బుద్ధి పుట్టించగలడు. కాబట్టి ప్రదర్శనా బుద్ధి రాకుండా ఉండుటకు సంకల్ప శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ప్రదర్శనా బుద్ధితో ఏ సత్కార్యము చేసినా అది వృధా అయిపోతుంది కాబట్టి, అది అల్లాహ్ వద్ద ఆమోదించబడదు కాబట్టి, మనము రమజాన్‌లో ప్రదర్శనా బుద్ధితో సత్కార్యాలు చేస్తే, ఆరాధనలు చేస్తే రమజాన్ మాసం వృధా అయిపోతుంది. చూడండి ఖురాన్ గ్రంథం 18వ అధ్యాయం, 110వ వాక్యంలో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు:

فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا
[ఫమన్ కాన యర్జూ లిఖ్యా’అ రబ్బిహీ ఫల్-య’అమల్ ‘అమలన్ సాలిహన్ వలా యుష్రిక్ బి’ఇబాదతి రబ్బిహీ అహదా]

“తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవారు సత్కార్యాలు చేయాలి, తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.” (18:110)

అంటే, చిత్తశుద్ధితో సత్కార్యాలు చేయాలి, ప్రదర్శనా బుద్ధికి దూరంగా ఉంటూ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి కాబట్టి మన హృదయాలలో ప్రదర్శనా బుద్ధి రాకుండా సంకల్ప శుద్ధి చేసుకోవాలి.

ఇక ఎనిమిదవ సలహా ఏమిటంటే, ముస్లింల పట్ల మన హృదయాలను సాఫీగా ఉంచుకోవాలి. ఇతరుల పట్ల కల్మషం గానీ, కీడు గానీ హృదయాలలో ఉండనియ్యరాదు. ఎందుకంటే ఇంతకు ముందు షాబాన్ నెలలో ముఖ్యంగా షాబాన్ 15వ తేదీన ఒక హదీసు మనం పదేపదే వింటూ వస్తూ ఉన్నాం. ఏముంది అక్కడ?

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షాబాన్ నెల 15వ తేదీ రాత్రిన ప్రజల వైపు దృష్టి సారించి అందరి పాపాలను మన్నించేస్తాడు, ఇద్దరి పాపాలను మాత్రము మన్నించకుండా వదిలేస్తాడు. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకరు ముష్రిక్, మరొకరు తమ మిత్రుల పట్ల హృదయంలో కీడు ఉంచుకున్నవాడు.” (ఇది సహీ అత్-తర్ఘీబ్ వత్-తర్హీబ్ గ్రంథంలోని ఉల్లేఖనం.)

ఆ ఉల్లేఖనం ప్రకారంగా ఎవరైతే బహుదైవారాధన, షిర్క్ చేస్తూ ఉన్నారో వారికి పాప క్షమాపణ ఉండదు. అలాగే ఎవరైతే ఇతరుల పట్ల హృదయంలో కీడు ఉంచుకున్నారో, వాడికి, వారికి క్షమాపణ దొరకదు. కాబట్టి హృదయాలలో ఇతరుల పట్ల కీడు లేకుండా మన హృదయాన్ని కూడా మనము శుద్ధపరచుకోవాలి. ఎవరి గురించి కూడా మన హృదయంలో కీడు ఉండకూడదు.

ఇక మరొక సలహా ఏమిటంటే, ఖురాన్ పారాయణం కొరకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు లేదంటే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. వారికి తీరిక ఎప్పుడు ఉంటుంది? ఏ సమయం వారికి దక్కుతుంది? ఆ సమయంలో వారు ఖురాన్ పారాయణం కోసము ముందుగానే టైం టేబుల్, జద్వల్ మరియు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నాకు ఫలానా సమయంలో ఇంత సమయం దొరుకుతుంది, ఫలానా నమాజ్ తర్వాత ఇంత సమయం దొరుకుతుంది, లేదంటే ఉదయం ఇంత సమయం దొరుకుతుంది, మధ్యాహ్నం ఇంత సమయం దొరుకుతుంది, సాయంత్రం ఇంత సమయం దొరుకుతుంది, ఆ సమయాన్ని ఖురాన్ పారాయణంతో మనము నింపుకోవాలి. ఆ విధంగా ఖురాన్ పారాయణము కోసము మనము ప్రణాళిక చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా జిబ్రీల్ అలైహిస్సలాం వారికి రమజాన్ మాసంలో ఖురాన్ వినిపించేవారు. సహాబాలు కూడా రమజాన్ మాసంలో ఎక్కువగా ఖురాన్ పారాయణము చేసేవారు. మనము కూడా అధికసార్లు ఖురాన్ పారాయణము పూర్తి చేయుటకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, సమయాన్ని కేటాయించుకోవాలి, ఆ సమయం ప్రకారము తర్వాత ఖురాన్ పారాయణము చేసుకుంటూ రమజాన్ మాసాన్ని గడపాలి.

మరొక ఉదాహరణ ఏమిటంటే, రమజాన్‌లో ముఖ్యంగా ఇఫ్తారీ, ఉపవాస విరమణ చేయించుటకు ముందుగానే మనము ప్రణాళిక చేసుకోవాలి. మనం ఇంతకుముందు అనేక సార్లు విని ఉన్నాం, ఉపవాసానికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది. అలాగే ఒక ఉపవాసికి ఇఫ్తారీ చేయిస్తే, ఉపవాస విరమణ చేయిస్తే, ఉపవాసికి దక్కినంత పుణ్యము ఉపవాస విరమణ చేయించిన వ్యక్తికి కూడా అందజేయబడుతుంది. అలాగే ఎంత మందికి మనము ఇఫ్తారీ చేయిస్తామో అన్ని ఉపవాసాల పుణ్యము పొందగలము కాబట్టి, రమజాన్ మాసం రాకముందే ఎంతమందికి మనము ఇఫ్తారీ చేయించాలి, మన స్తోమత ఏమిటి అనేది ముందుగానే మనము చూసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మిత్రులారా.

అలాగే దానధర్మాలు చెల్లించుటకు కూడా ప్లాన్ చేసుకోవాలి. మన వీధిలో, మన ఇరుగుపొరుగులో, మనం నివసిస్తున్న ఊరులో, పల్లెలో, మన పరిసరాలలో అనేకమంది వితంతువులు ఉంటారు, అనాథలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అలాగే నిరుపేదలు ఉంటారు. అలాంటి వారికి మనము దానధర్మాలు చేయాలి. రమజాన్ మాసంలో చేసిన ప్రతి సత్కార్యానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి, రమజాన్ మాసంలో నిరుపేదలకు, వితంతువులకు, వికలాంగులకు, అభాగ్యులకు సహాయం చేయాలి, దానధర్మాలు చేయాలి. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చూసిన సహాబాలు ఏమంటారంటే:

كان رسول الله أجود بالخير من الريح المرسلة
[కాన రసూలుల్లాహి అజ్వద బిల్-ఖైరి మినర్-రీహిల్ ముర్సల]
“వేగంగా వీస్తున్న గాలి కంటే వేగంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్‌లో దానధర్మాలు చేసేవారు.”

అంటే అంత ఎక్కువగా ఆయన దానధర్మాలు రమజాన్ మాసంలో చేసేవారు కాబట్టి మనము కూడా విశాలమైన హృదయంతో రమజాన్ మాసంలో ఎక్కువగా దానధర్మాలు చేయాలి, దాని కోసం ముందుగానే మనము ప్రణాళిక చేసుకోవాలి మిత్రులారా. అల్లాహ్ మనందరికీ ఆ భాగ్యం ప్రసాదించు గాక.

అలాగే మరొక సలహా ఏమిటంటే, స్తోమత ఉన్నవారు రమజాన్ మాసంలో ఉమ్రా చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం, రమజాన్‌లో ఆచరించిన ఉమ్రాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హజ్జ్ లాంటి పుణ్యం ప్రసాదిస్తాడు.

فإن عمرة في رمضان تقضي حجة أو حجة معي
[ఫఇన్న ఉమరతన్ ఫీ రమదాన తఖ్దీ హజ్జతన్ అవ్ హజ్జతన్ మ’ఈ]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు కలిసి హజ్జ్ చేసినంత పుణ్యము రమజాన్‌లో ఉమ్రా చేసిన వారికి ఇవ్వబడుతుంది.” అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం).

కాబట్టి మిత్రులారా, రమజాన్ మాసంలో సౌకర్యము మరియు స్తోమత ఉన్నవారు రమజాన్‌లో ఉమ్రా చేయటానికి ప్రణాళిక చేసుకోవాలి, ముందస్తు చర్యలు చేపట్టాలి.

అలాగే మరొక సలహా ఏమిటంటే, ఈ రమజాన్ మాసంలో దైవ సందేశం ప్రజల వద్దకు చేర్చటానికి ముందుగానే మనము సిద్ధమవ్వాలి. ఎందుకంటే రమజాన్ మాసంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షైతాన్‌లకు బేడీలు వేసేస్తాడు కాబట్టి అల్లాహ్ మాట ప్రజల హృదయంలో ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి, మనకు వీలైతే మనం స్వయంగా అల్లాహ్ నియమాలు, అల్లాహ్ వాక్యాలు ప్రజల వరకు చేరవేయించాలి. అంత శక్తి మాకు లేదు, ఆ అర్హత మాకు లేదు అంటే కనీసం ఎవరైతే ఆ పని చేస్తూ ఉన్నారో, దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారి వద్దకు ప్రజలను తీసుకొని వెళ్లి అక్కడ వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించేలాగా చూడాలి. స్వయంగా అందజేయండి. ఆ అర్హత లేదు, స్తోమత లేదు, అలాంటి సౌకర్యము లేదు అంటే, కనీసం ఎవరైతే దైవ వాక్యాలు వినిపిస్తున్నారో అలాంటి చోటికి మిత్రులను తీసుకొని వెళ్లి దైవ వాక్యాలు వినిపించండి. ఇన్ షా అల్లాహ్, అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదిస్తే వారి హిదాయత్ కొరకు మీరు కారకులు అవుతారు, మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యం ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రమజాన్ మాసంలో అలాంటి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోండి అని పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక చివర్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మిత్రులారా, రమజాన్ మాసం, ఇది సంవత్సరం మొత్తం ఉండేది కాదు, కేవలం ఒక నెల మాత్రమే. అల్లాహ్ ఏమంటాడంటే:

أَيَّامًا مَّعْدُودَاتٍ
[అయ్యామన్ మ’అదూదాత్]
“ఇవి లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే.” (2:184)

30 రోజులు లేదంటే 29 రోజులు. ఈ లెక్కించదగిన ఈ కొన్ని రోజుల్ని మనము వృధా చేయనియ్యకూడదు. వృధా చేయకుండా పూర్తిగా కష్టపడి, శ్రమించి, ఎక్కువగా సత్కార్యాలు చేసుకొని పాప క్షమాపణ అల్లాహ్‌తో అడుక్కొని పాపాల నుండి విముక్తి పొందాలి, నరకం నుండి విముక్తి పొందాలి, స్వర్గవాసులైపోవాలి, అధిక పుణ్యాలు సంపాదించుకున్న వారైపోవాలి.

అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం అల్లాహ్ మనకు రమజాన్ ప్రసాదించు గాక. ఈ సంవత్సరం మనం బ్రతికి ఉన్నాము, ఇక వచ్చే సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం రమజాన్ వరకు బ్రతికి ఉంటామో ఉండమో తెలియదు, ఎవరికీ గ్యారెంటీ లేదు. కాబట్టి ఇదే మన చివరి రమజాన్ ఏమో అని భావించి ఎక్కువగా శ్రమించుకోవాలి మిత్రులారా.

నేను అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ రమజాన్ నెల ప్రసాదించు గాక. రమజాన్ నెల కంటే ముందే రమజాన్ కోసము ప్రణాళికలు సిద్ధము చేసుకొని సన్నద్ధమయ్యే భాగ్యం ప్రసాదించు గాక. రమజాన్ శుభాలు, వరాలు మనందరి జీవితాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వర్షింపజేయు గాక, ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44142


సందేశహరుడు (రసూల్) మరియు ప్రవక్త (నబీ) మధ్య ఏమైనా తేడా ఉందా? – షేక్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉతైమీన్

ప్రశ్న:

జవాబు:

అవును, పండితులు (ఉలమాలు) దీని గురించి ఇలా చెబుతున్నారు:

“ప్రవక్త (నబీ) అంటే అల్లాహ్ నుండి ఒక ధర్మానికి (చట్టానికి) సంబంధించిన వహీ (దైవవాణి) పొందినవారు, కానీ దానిని ప్రజలకు ప్రచారం చేయమని ఆదేశించబడనివారు. వారు దానిని స్వయంగా ఆచరించాలి, కానీ ఇతరులకు అందించమని కోరబడరు”

సందేశహరుడు (రసూల్) అంటే అల్లాహ్ నుండి ధర్మానికి సంబంధించిన వహీ పొందినవారు మరియు దానిని ఆచరిస్తూ, ప్రజలకు ప్రచారం చేయమని (అందించమని) ఆదేశించబడినవారు.

ప్రతి సందేశహరుడు (రసూల్) ఒక ప్రవక్త (నబీ) అయి ఉంటారు, కానీ ప్రతి ప్రవక్త సందేశహరుడు కారు.

సందేశహరుల కంటే ప్రవక్తల సంఖ్య చాలా ఎక్కువ. అల్లాహ్ ఖురాన్ లో కొందరు సందేశహరుల గాథలను మనకు తెలియజేశాడు, మరికొందరి గురించి తెలియజేయలేదు. అల్లాహ్ (మహోన్నతుడు) ఇలా సెలవిస్తున్నాడు:

وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ ۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ

“నిశ్చయంగా నీకు పూర్వం కూడా మేము ఎంతోమంది ప్రవక్తల్ని పంపి ఉన్నాము. వారిలో కొందరి సంగతులు మేము నీకు తెలియపర్చాము. మరికొందరి వృత్తాంతాలను అసలు నీకు తెలుపనే లేదు. ఏ ప్రవక్త కూడా అల్లాహ్‌ అనుజ్ఞ లేకుండా ఏ మహిమనూ తీసుకురాలేకపోయేవాడు.” [గాఫిర్ 40:78]

ఈ వచనం ఆధారంగా, ఖురాన్ లో ప్రస్తావించబడిన ప్రతి ప్రవక్త ఒక సందేశహరుడు (రసూల్) అని స్పష్టమవుతోంది.

షేక్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉతైమీన్
ఫతావా ఇస్లామియా, సంపుటి 1, పేజీ 226

Translated from:
https://abdurrahman.org/2014/09/20/the-difference-between-a-messenger-rasul-and-a-prophet-nabiyy/

ఓ అబూ అబ్దుల్లాహ్! మీరు మూలుగుతున్నారా?

మానవులు చేసే పనులను (కర్మలను) వ్రాసిపెట్టే కొందరు దేవదూతలు కూడా ఉన్నారు.

وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు.మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా! (అల్-ఇన్ఫితార్ 82:10-12)

مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ

(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు. (ఖాఫ్ 50:18)

ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమామ్ అహ్మద్ గారి శిష్యులలో ఒకరు అతన్నిపరామర్శించడానికి వెళ్ళారు. అనారోగ్యం కారణంగా ఇమామ్ అహ్మద్ బాధతో మూలుగుతుండటాన్ని ఆయన గమనించారు. అప్పుడు ఆ శిష్యుడు ఇలా అన్నారు:

“ఓ అబూ అబ్దుల్లాహ్! మీరు మూలుగుతున్నారా? తావూస్ (Tawus) ఇలా అన్నారు: ‘నిశ్చయంగా దేవదూతలు ప్రతి ఒక్కదానిని వ్రాస్తారు, చివరకు రోగి చేసే మూలుగును కూడా. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు: “(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు. (ఖాఫ్ 50:18)’”

అందువల్ల, అబూ అబ్దుల్లాహ్ (ఇమామ్ అహ్మద్) మరింత ఓపిక వహించడం మొదలుపెట్టారు మరియు ఆయన మూలగడం మానేశారు [1], ఎందుకంటే ప్రతిదీ వ్రాయబడుతోంది. “అతడు ఏ మాట పలికినా” – అంటే మీరు మాట్లాడే ఏ మాట అయినా వ్రాయబడుతుంది. అయితే, దానికి మీకు పుణ్యం లభించవచ్చు లేదా శిక్ష పడవచ్చు. ఇది పైన చెప్పబడిన విషయంపై ఆధారపడి ఉంటుంది.


[1] సాలిహ్ బిన్ అల్-ఇమామ్ అహ్మద్ ద్వారా నివేదించబడినది, ఆయన ఇలా అన్నారు: “మా నాన్నగారు మరణించడానికి ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా అన్నారు: ‘అబ్దుల్లా బిన్ ఇద్రీస్ పుస్తకాన్ని బయటకు తీయి.’ తరువాత ఇలా అన్నారు: ‘అనారోగ్య సమయంలో మూలగడం తావూస్ కు ఇష్టం ఉండేది కాదు అనే లైత్ (Laith) గారి ఉల్లేఖనను నాకు చదివి వినిపించు.’ ఆ తర్వాత ఆయన మరణించే వరకు మా నాన్నగారి నుండి నేను ఎటువంటి మూలుగు వినలేదు.” – సియర్ ఆలామ్ అన్-నుబలా (11:215).

మూలం: అల్-అఖీదా అల్-వాసితియ్య (2 వాల్యూమ్ సెట్) – రచయిత: ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉతైమీన్ – ప్రచురణకర్త: దారుస్సలాం పబ్లిషర్స్ & డిస్ట్రిబ్యూటర్స్.

Source: క్రింది ఇంగ్లీష్ ఆర్టికల్ నుండి తెలుగులోకి అనువదించబడింది 
O Abu ‘Abdullah! Are you groaning?
https://abdurrahman.org/2014/11/23/o-abu-abdullah-are-you-groaning/

దైవ దూతలు (ملائِكة‎) – Main page:
https://teluguislam.net/angels/

సలాత్ అద్-దుహా (చాష్త్, ఇష్రాఖ్ నమాజ్) – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

సలాతుజ్జుహా (చాష్త్ నమాజు)
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/SZeHU5ws1ic [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, సలాతుద్ దుహా (చాష్త్ నమాజ్ లేదా ఇష్రాఖ్ నమాజ్ అని కూడా పిలుస్తారు) యొక్క ప్రాముఖ్యత, దానిని ఆచరించే విధానం మరియు దాని గొప్ప ప్రతిఫలాల గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ఆధారంగా, మానవ శరీరంలోని 360 కీళ్ల తరపున ప్రతిరోజూ ధర్మం (సదఖా) చేయవలసిన బాధ్యత ఉందని, అయితే కేవలం రెండు రకాతుల దుహా నమాజ్ ఆచరించడం ద్వారా ఆ బాధ్యత నెరవేరుతుందని స్పష్టం చేయబడింది. అంతేకాకుండా, ఫజ్ర్ నమాజ్‌ను జమాఅత్‌తో ఆచరించి, సూర్యోదయం వరకు అదే స్థలంలో కూర్చుని అల్లాహ్‌ను స్మరించి, ఆ తర్వాత రెండు రకాతుల దుహా నమాజ్ చేసినవారికి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుందని కూడా వివరించబడింది.

అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం సలాతుద్ దుహా, చాష్త్ నమాజ్ గురించి తెలుసుకుందాం. చాష్త్ నమాజ్, ఇష్రాఖ్ నమాజ్, సలాతుద్ దుహా ఇవన్నీ ఒకే పేర్లు. అరబీలో సలాతుద్ దుహా అని, అలాగే ఇష్రాఖ్ నమాజ్ అని లేదా చాష్త్ నమాజ్ అని అంటారు.

ఈ నమాజ్ ఎప్పుడు చేస్తారు? సూర్యుడు ఉదయించి బాగా ప్రొద్దెక్కిన తర్వాత చేయబడే నమాజ్ ఇది సలాతుద్ దుహా.

ఇవి ఎన్ని రకాతులు చేయాలి? రెండు రకాతులు చేయవచ్చు, నాలుగు రకాతులు చేయవచ్చు, ఎనిమిది రకాతులు కూడా చేయవచ్చు. ప్రతి రెండు రకాతులకి సలాం చెప్పాలి. రెండు రకాతులు చేయవచ్చు, నాలుగు రకాతులు చేయవచ్చు ప్రతి రెండుకి సలాం చెప్పాలి, ఎనిమిది కూడా చేయవచ్చు ప్రతి రెండు రకాతులకి సలాం చెప్పాలి.

ఈ నమాజ్ గురించి, సలాతుద్ దుహా గురించి, ఇష్రాఖ్ లేదా చాష్త్ నమాజ్ గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. అబూజర్ రదియల్లాహు అన్హు కథనం,

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

يُصْبِحُ عَلَى كُلِّ سُلاَمَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ
(యుస్బిహు అలా కుల్లి సులామా మిన్ అహదికుం సదఖహ్)
మీలో ప్రతి కీళ్ళు తరఫు నుంచి ప్రతిరోజూ ఒక సదఖా ఇవ్వాలి.

కీళ్ళు అంటే మనిషి శరీరంలో కీళ్ళు ఉంటాయి కదా. ప్రతి కీళ్ళు తరపున సదఖా ఇవ్వాలి.

فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ
(ఫకుల్లు తస్బీహతిన్ సదఖహ్)
ప్రతి ‘సుబ్ హా నల్లాహ్’ అని చెప్పడం కూడా సదఖా కిందికే వస్తుంది.

وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ
(వకుల్లు తహ్మీదతిన్ సదఖహ్)
‘అల్ హమ్దులిల్లాహ్’ అనటం కూడా సదఖాయే.

وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ
(వకుల్లు తహ్లీలతిన్ సదఖహ్)
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని స్మరించటం కూడా సదఖా అవుతుంది.

وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ
(వకుల్లు తక్బీరతిన్ సదఖహ్)
‘అల్లాహు అక్బర్’ అని చెప్పటం కూడా సదఖా అవుతుంది.

وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ
(వ అమ్రున్ బిల్ మ’రూఫి సదఖహ్)
మంచిని ఆజ్ఞాపించటం, మంచి పని చేయండి అని చెప్పటం, ఇది కూడా సదఖా కిందికే వస్తుంది.

وَنَهْيٌ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ
(వ నహ్యున్ అనిల్ మున్కరి సదఖహ్)
చెడుని ఆపటం కూడా సదఖా కిందికే వస్తుంది.

وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنَ الضُّحَى
(వ యుజ్జిఉ మిన్ జాలిక రక’ఆతాని యర్క’ఉహుమా మినద్ దుహా)
వీటన్నిటికంటే సలాతుద్ దుహా రెండు రకాతులు చేయటం ఉత్తమం అన్నారు, మంచిది అన్నారు.

అంటే సుబ్ హా నల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ ఎన్నిసార్లు చెప్తామో అన్నిసార్లు సదఖా ఇచ్చినట్టు సమానం అవుతుంది. వీటన్నిటికంటే చాష్త్ రెండు రకాతులు సరిపోతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది.

ఇంకో హదీస్ లో కొంచెం వివరంగా ఉంది. దాంట్లో అది ఏముందంటే, అబూ దావూద్ లో ఉంది హదీస్ అది. బురైదా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం,

ఈ హదీస్ లో చాష్త్ నమాజ్, సలాతుద్ దుహా, ఈ నమాజ్ యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం, ఘనత ఏమిటో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది.

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

فِي الإِنْسَانِ ثَلاَثُمِائَةٍ وَسِتُّونَ مَفْصِلاً
(ఫిల్ ఇన్సాని సలాసు మిఅతిన్ వ సిత్తూన మిఫ్సలన్)
మనిషి యొక్క శరీరంలో 360 కీళ్ళు ఉన్నాయి, జాయింట్లు.

ఇలా జాయింట్లు, కీళ్ళు, మనిషి యొక్క శరీరంలో 360 ఉన్నాయి.

فَعَلَيْهِ أَنْ يَتَصَدَّقَ عَنْ كُلِّ مَفْصِلٍ مِنْهُ بِصَدَقَةٍ
(ఫ’అలైహి అన్ యతసద్దఖ అన్ కుల్లి మిఫ్సలిన్ బి సదఖహ్)
కావున, ప్రతి జాయింట్ కి బదులుగా సదఖా చేయటం తప్పనిసరి ప్రతిరోజూ.

అంటే మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. ప్రతి జాయింట్ కి బదులుగా ప్రతిరోజూ ఒక సదఖా ఇవ్వాలి. అంటే ప్రతిరోజూ 360 జాయింట్లకి బదులుగా 360 సదఖాలు చేయాలి, ప్రతిరోజూ చేయాలి. ఇది తప్పనిసరి. ఇది విని సహాబాలు ఆశ్చర్యంతో,

قَالُوا وَمَنْ يَسْتَطِيعُ يَا رَسُولَ اللَّهِ
“ఖాలూ వ మన్ యస్తతీ యా రసూలల్లాహ్” అన్నారు.
“ఓ రసూలల్లాహ్, ఈ స్థోమత ఎవరికి ఉంటుంది? ఎవరు చేయగలరు?”

ధనవంతులు, కోటీశ్వరులు వారైతే చేయగలరేమో, కానీ సాధారణమైన మనుషులు, మాలాంటి వారు, పేదవాళ్ళు ప్రతిరోజూ 360 సదఖాలు… ఆ స్థోమత మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చేయలేము కదా, అని అడిగితే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే,

النُّخَاعَةُ فِي الْمَسْجِدِ تَدْفِنُهَا
(అన్నుఖాఅతు ఫిల్ మస్జిది తద్ఫినుహా)
మస్జిద్ లో ఏమైనా గలీజ్ ఉంటే, ఏమైనా హానికరమైన వస్తువు ఉంటే తొలగించండి.

అది సదఖాతో సమానం అవుతుంది.

وَالشَّىْءُ تُنَحِّيهِ عَنِ الطَّرِيقِ
(వష్ షైఉ తునహ్హీహి అనిత్ తరీఖ్)
దారిలో ఏమైనా హాని కలిపించే వస్తువు, ముళ్ళు ఉంది, గలీజ్ ఉంది, వాటిని తొలగించండి. అది కూడా సదఖా కిందికే వస్తుంది.

فَإِنْ لَمْ تَجِدْ فَرَكْعَتَا الضُّحَى تُجْزِئُكَ
(ఫఇల్లమ్ తజిద్ ఫ రక’అతద్ దుహా తుజ్జిఉక)
అలా కుదరకపోతే, సలాతుద్ దుహా (చాష్త్ నమాజ్) ఈ 360 జాయింట్లకి సదఖాకి సరిపోతుంది అన్నారు.

అంటే ఎవరైతే సలాతుద్ దుహా చదువుతాడో, ఆ వ్యక్తి 360 సార్లు సదఖా ఇస్తున్నాడు అని దానికి సరిపోతుంది. అంటే ఈ హదీస్ ద్వారా మనకు ఏం బోధ పడుతుంది? ప్రతి మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. ప్రతి జాయింట్ కి బదులుగా ఒక సదఖా ప్రతిరోజూ తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ స్థోమత లేదు కాబట్టి అటువంటి వారు వేరే పుణ్యాల ద్వారా, సదఖా, దానధర్మాల ద్వారా, దారిలో నుంచి చెడుని దూరం చేయటం ద్వారా, అలాగే తస్బీహ్‌ల ద్వారా, జిక్ర్ ద్వారా (సుబ్ హా నల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్) ద్వారా, అలాగే సలాతుద్ దుహా ద్వారా సరిపోతుంది అన్నారు.

అభిమాన సోదరులారా, సలాతుద్ దుహా గురించి ఒక్క హదీస్ చెప్పి నేను ముగిస్తాను. దాని ప్రాముఖ్యత ఏమిటి, ఘనత ఏమిటి అనేది. అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం ప్రకారం,

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

مَنْ صَلَّى الْغَدَاةَ فِي جَمَاعَةٍ ثُمَّ قَعَدَ يَذْكُرُ اللَّهَ حَتَّى تَطْلُعَ الشَّمْسُ ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ كَانَتْ لَهُ كَأَجْرِ حَجَّةٍ وَعُمْرَةٍ تَامَّةٍ تَامَّةٍ تَامَّةٍ
(మన్ సల్లల్ ఫజర ఫీ జమాఅతిన్, సుమ్మ ఖ’అద యద్కురుల్లాహ హత్తా తత్లు’అష్ షమ్సు, సుమ్మ సల్లా రక’అతైని, కానత్ లహు క అజ్రి హజ్జతిన్ వ ఉమ్రతిన్ తామ్మతిన్, తామ్మతిన్, తామ్మతిన్)

“ఎవడైతే ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేశాడో, ఆ ఫర్ద్ నమాజ్ తర్వాత ఎక్కడికీ పోకుండా అక్కడే కూర్చుని అల్లాహ్‌ను స్మరిస్తున్నాడో (జిక్ర్ చేసుకుంటున్నాడో), సూర్యుడు ఉదయించే వరకు, ఆ తర్వాత రెండు రకాతులు చేశాడో (అంటే సలాతుద్ దుహా, ఇష్రాఖ్ నమాజ్, చాష్త్ నమాజ్), ఆ వ్యక్తికి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుంది.”

అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు నొక్కి చెప్పారు.

అల్లాహు అక్బర్! సలాతుద్ దుహా, ఇష్రాఖ్ నమాజ్, చాష్త్ నమాజ్ యొక్క ప్రతిఫలం, ఘనత ఏమిటి? ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేసి, నమాజ్ తర్వాత ఆ స్థలంలోనే కూర్చుని, అల్లాహ్‌ను స్మరిస్తూ, జిక్ర్ చేసుకుంటూ, సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు రకాతుల దుహా నమాజ్ చేస్తే, ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా అంత పుణ్యం లభిస్తుందని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది.

అభిమాన సోదరులారా, ఈ సలాతుద్ దుహా గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి. మొదటి విషయము, సలాతుద్ దుహా, ఇష్రాఖ్ లేదా చాష్త్ నమాజ్, ఇది మస్జిద్ లో, ఇంట్లో ఎక్కడైనా చేయవచ్చు. కండిషన్ ఏమీ లేదు. ఫజ్ర్ నమాజ్ చేసుకున్నాము, కాసేపు పడుకున్నాము, ఏదో పని చేసుకున్నాము, తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత చేసుకున్నాము. అలాగే ఫజ్ర్ నమాజ్ తర్వాత ఇంటికి వచ్చేసాము, ఇంట్లో చేసుకున్నాము. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సదఖా అంత పుణ్యం వస్తుంది, ఎక్కువ పుణ్యం అల్లాహ్ ప్రసాదిస్తాడు. కాకపోతే, సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా అంత పుణ్యం రావాలంటే కండిషన్ ఏమిటి? ఫజ్ర్ నమాజ్ తర్వాత ఆ స్థలంలోనే కూర్చుని అల్లాహ్‌ను స్మరిస్తూ, జిక్ర్ చేసుకుంటూ, సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు రకాతుల ఈ దుహా నమాజ్ చేసుకుంటే సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ నఫిల్ నమాజ్‌లు, సున్నత్ నమాజ్‌లు, ఈ దుహా, ఇష్రాఖ్ నమాజ్ పాటించే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకొని మనము జీవితం గడిపే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44390

ఇష్రాఖ్ / చాష్త్ నమాజు (దుహా /అవ్వాబీన్)

ఖుర్ఆన్ ను పఠించడం | ఖుర్ఆన్ హక్కులు | హబీబుర్రహ్మాన్ జామిఈ  [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ను పఠించడం | ఖుర్ఆన్ హక్కులు – 2
వక్త: హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/s95wqnlrv94 [9 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ పట్ల విశ్వాసికి ఉన్న హక్కులలో రెండవదాని గురించి వివరించబడింది. ఖుర్ఆన్‌ను విశ్వసించడం మొదటి హక్కు అయితే, దానిని నిరంతరం పఠించడం రెండవ హక్కు అని స్పష్టం చేయబడింది. ఖుర్ఆన్ పఠించడం వలన ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు పేర్కొనబడింది. ప్రళయదినాన ఖుర్ఆన్ తనను పఠించిన వారి కొరకు సిఫారసు చేస్తుందని కూడా చెప్పబడింది. ఖుర్ఆన్‌ను పఠించవలసిన రీతిలో (హక్క తిలావతిహి) పఠించడం యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది, దీనికి పలు అర్థాలు వివరించబడ్డాయి: ఏకాగ్రతతో చదవడం, అందులోని ధర్మాధర్మాలను అంగీకరించడం, దాని సందేశాన్ని ఇతరులకు వివరించడం, మరియు స్పష్టమైన ఆజ్ఞలను పాటిస్తూ, అస్పష్టమైన విషయాల జ్ఞానం కోసం పండితులను ఆశ్రయించడం. చివరగా, ఖుర్ఆన్‌ను తజ్విద్ (ఉచ్ఛారణ నియమాలు) మరియు తర్తీల్ (ఆగి ఆగి, స్పష్టంగా పఠించడం)‌తో చదవాలని సూచిస్తూ ప్రసంగం ముగించబడింది.

ఇన్నల్హమ్దులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా, కారుణ్య కడలి రమజాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు, ఖుర్ఆన్‌ను పఠించడం అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు, ఖుర్ఆన్‌ను పఠించాలి. మొదటి హక్కు, ఖుర్ఆన్‌ను విశ్వసించడం. దాని గురించి ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఖుర్ఆన్‌ను పఠించడం.

ఖుర్ఆన్ యొక్క రెండవ హక్కు ఏమిటంటే, మనం ఖుర్ఆన్‌ను పఠిస్తూ ఉండాలి. కేవలం విశ్వసిస్తే సరిపోదు, విశ్వసించిన తరువాత ఖుర్ఆన్‌ను మనం పఠించాలి. ఖుర్ఆన్ పఠించడం వలన ఒక అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఒక అక్షరానికి పది పుణ్యాలు. ఇంకా ఇలా ప్రవచించారు:

اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لأَصْحَابِهِ
(ఇఖ్రవుల్ ఖుర్ఆన ఫఇన్నహు య’అతీ యౌమల్ ఖియామతి షఫీఅన్ లిఅస్ హాబిహి)
“ఖుర్ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారునిగా వస్తుంది.”

ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఖుర్ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ఖుర్ఆన్ తిలావత్ చేస్తూ ఉండండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు దారునిగా వస్తుంది అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنْ كِتَابِ رَبِّكَ ۖ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَنْ تَجِدَ مِنْ دُونِهِ مُلْتَحَدًا
(వత్లు మా ఊహియ ఇలైక మిన్ కితాబి రబ్బిక లా ముబద్దిల లికలిమాతిహి వలన్ తజిద మిన్ దూనిహి ముల్తహదా)

“నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు.” (సూర కహఫ్ 18:27)

ఖుర్ఆన్ పారాయణం చేసే విధానం కూడా బోధించబడింది. రెండవ హక్కు ఖుర్ఆన్‌ని పఠించాలి. ఖుర్ఆన్ పారాయణం చేయాలి, తిలావత్ చేయాలి. ఆ విధానం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ఆజ్ఞాపించాడు:

الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَنْ يَكْفُرْ بِهِ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
(అల్లజీన ఆతైనాహుముల్ కితాబ యత్లూనహు హక్క తిలావతిహి ఉలాయిక యు’మినూన బిహి వమన్ యక్ఫుర్ బిహి ఫఉలాయిక హుముల్ ఖాసిరూన్)

“మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు,) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది.” (2:121)

ఈ ఆయతులో ‘హక్క తిలావతిహి’ గురించి ఫత్హుల్ ఖదీర్ ఆధారంగా అహ్సనుల్ బయాన్‌లో ఇలా ఉంది: పఠించవలసిన విధంగా పఠిస్తారు అన్న వాక్యానికి పలు అర్థాలు వివరించబడ్డాయి. ఉదాహరణకు ఒక అర్థం ఏమిటి? బాగా చదువుతారు, శ్రద్ధతో, ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠన సందర్భంగా స్వర్గ ప్రస్తావన వస్తే, స్వర్గంలో ప్రవేశం కల్పించమని అల్లాహ్‌ను వేడుకుంటారు. నరక ప్రస్తావన వస్తే, దాని బారి నుండి రక్షించమని ప్రార్థిస్తారు. ఇది ఒక అర్థం.‘హక్క తిలావతిహి’కి ఇది ఒక అర్థం. పఠించవలసిన విధానంగా పఠించాలి అంటే ఇది ఒక అర్థం.

రెండో అర్థం ఏమిటి? అందులో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన వాటిని ధర్మసమ్మతాలుగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మంగానే భావిస్తారు. అంతేగాని యూదుల మాదిరిగా ప్రక్షిప్తాలకు పాల్పడటం గానీ, తప్పుడు అన్వయింపులు చేయడం గానీ చేయరు. అంటే, ఖుర్ఆన్‌లో దేనిని హలాల్ అని చెప్పబడిందో దానిని హలాల్‌గా నమ్ముతారు, అంగీకరిస్తారు, ఆచరిస్తారు. ఖుర్ఆన్‌లో దేనిని హరాం అని, నిషిద్ధం అని, అధర్మం అని చెప్పబడిందో దానిని అధర్మం అని నమ్ముతారు, విశ్వసిస్తారు, దాని నుండి దూరంగా ఉంటారు. ఇది దీనికి ఒక అర్థం. ఖుర్ఆన్‌ని పఠించవలసిన రీతిలో పఠించాలి. ‘హక్క తిలావతిహి’కి ఇది ఒక అర్థం. ఖుర్ఆన్‌లో ఏదైతే ధర్మం ఉందో, ధర్మం అని భావించాలి. అధర్మానికి అధర్మం అని భావించాలి. దానికి తప్పుడు అర్థాలు చెప్పరాదు, చేసుకోకూడదు.

అలాగే మూడవ అర్థం ఏమిటంటే, అందులో పొందుపరచబడి ఉన్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు, వాటిని దాచి ఉంచరు.

అలాగే ఇంకో అర్థం, అందులో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని—మహ్కమాత్ ఆయతులను—చేస్తారు. అస్పష్టంగా ఉన్న ముతషాబిహాత్ విషయాలను విశ్వసిస్తారు. అర్థం కాని విషయాల గురించి విద్వాంసులను, ధర్మ పండితులను అడిగి తెలుసుకుంటారు. ఇది చాలా ముఖ్య విషయం. తెలియకుండా, ధర్మ అవగాహన లేకుండా, మనమే ఊహించుకుని, కొంచెం వస్తే దానికి ఇంకా కొన్ని విషయాలు అల్లుకుని, మనమే దానికి భావాలు, అర్థాలు చెప్పటం చాలా తప్పు. ఖుర్ఆన్ అల్లాహ్ వాక్యం. ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త గారు ఏ విధంగా దానికి అర్థం చెప్పారు, సహాబాలు ఏ విధంగా అర్థం తీసుకున్నారో, అదే అర్థం మనం తీసుకోవాలి. ఆ ఆయతులు మహ్కమ్ ఆయతులు ఉండినా, ముతషాబిహ్ ఆయతులు ఉండినా. అర్థం కాని విషయాలు, ఆ విషయాల గురించి ధర్మ పండితులను, విద్వాంసులను అడిగి తెలుసుకోవాలి.

అలాగే చివరి మాట, ఖుర్ఆన్‌లో ఒక్కొక్క విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. పఠించవలసిన రీతిలో పఠిస్తారు అన్న వాక్యంలో ఎన్ని పరమార్థాలు ఇమిడి ఉన్నాయి! వీటన్నింటి పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నవారికే అల్లాహ్ మార్గదర్శకత్వం ప్రాప్తిస్తాడు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్‌లో ఇలా సెలవిచ్చాడు:

وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا
(వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా)
ఖుర్ఆన్ ను మాత్రం బాగా – ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు.” (73:4)

అంటే ఖుర్ఆన్‌ను, ఖుర్ఆన్‌ను మాత్రం బాగా ఆగి ఆగి, నింపాదిగా, స్పష్టంగా పఠించు. అంటే తజ్విద్‌తో, తర్తీల్‌తో, సరైన ఉచ్ఛారణతో. ఖుర్ఆన్‌కి ఒక పద్ధతి ఉంది, తిలావత్ చేసే ఒక విధానం ఉంది. కొన్ని నియమాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక సబ్జెక్టే ఉంది, దానికి తజ్విద్ అంటారు. ఏ అక్షరం ఎక్కడ నుండి ఉచ్ఛరింపబడుతుంది, అవి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు అరబీలో ‘ح’ (హా) అని ఒక అక్షరం ఉంది, ‘ه’ (హా) అని ఒక అక్షరం ఉంది. తెలుగులో ‘హ’ మాత్రమే ఉంటుంది. ‘ح’ (హా) అనే ఉచ్ఛారణ తెలుగులో లేదు, ఇంగ్లీషులో కూడా లేదు. అలాగే అరబీలో ‘ز’ (జా) ఒక అక్షరం ఉంది, ‘ج’ (జా) ఒక అక్షరం ఉంది. తెలుగులో రెండింటికీ ‘జ’ మాత్రమే ఉంటుంది. ‘ز’ (జా) అనే అక్షరం తెలుగులో లేదు. అలాగే ‘ف’ (ఫా) అనే అక్షరం తెలుగులో లేదు. తెలుగులో ‘ప’ ఉంటుంది, లేకపోతే ‘ఫ’ ఉంటుంది. ‘ف’ (ఫా) అనే అక్షరం తెలుగులో లేదు. చెప్పడం ఏమిటంటే, ఖుర్ఆన్‌ను తజ్విద్‌తో చదవాలి. ‘వరత్తిలిల్ ఖుర్ఆన తర్తీలా’, ఖుర్ఆన్‌ను బాగా ఆగి ఆగి, నింపాదిగా, తజ్విద్‌తో, ప్రతి అక్షరాన్ని తన మఖ్రజ్‌తో మనము చదివే ప్రయత్నం చేయాలి. రాకపోతే నేర్చుకోవాలి.

రెండవ హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్‌ను పఠించాలి, ఖుర్ఆన్‌ను పారాయణం చేయాలి. ఇవి ఖుర్ఆన్‌కి సంబంధించిన రెండవ హక్కు. ఇన్షా అల్లాహ్, మిగతా హక్కు తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44374


యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఖుర్ఆన్ హక్కులు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2GoH_kZfwdME8eHCJumoPq

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు – 5 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 5]
[మరణానంతర జీవితం – పార్ట్ 59] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=Dh-tkJ9A784
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త నరకాగ్ని (జహన్నం) యొక్క భయంకరమైన స్వభావాన్ని వివరిస్తారు. తీర్పుదినాన నరకం కళ్ళు, చెవులు, నాలుక కలిగిన ఒక సజీవ ప్రాణిగా మారి, అహంకారులు, బహుదైవారాధకులు మరియు చిత్రకారుల వంటి పాపాత్ములను గుర్తిస్తుందని హదీసుల ఆధారంగా తెలియజేస్తారు. నరకవాసుల శరీరాలు శిక్షను తీవ్రతరం చేయడానికి ఎంతగానో పెంచబడతాయని, వారి భుజాల మధ్య దూరం, చర్మం మందం, దవడ పళ్ళ పరిమాణం ఊహించలేనంతగా ఉంటాయని వర్ణిస్తారు. వారి ముఖాలు నల్లబడి, అవమానంతో కప్పబడి ఉంటాయని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేస్తారు. చివరగా, నరకవాసులకు అందించే ఆతిథ్యం, వారి ఆహారం (జక్కూమ్ అనే చేదు వృక్షం) మరియు పానీయాల గురించి వివరిస్తూ, ఈ శిక్షల నుండి రక్షణ పొందడానికి విశ్వాసం మరియు సత్కార్యాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి వహద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, నరకం, నరకవాసులు, నరక శిక్షల గురించి మనం వింటూ ఉన్నాము.

నరకం, దానికి రెండు కళ్ళు ఉంటాయి, వాటి ద్వారా అది చూస్తుంది. నరకానికి రెండు చెవులు ఉంటాయి, వాటి ద్వారా అది వింటుంది. మరియు దానికి నాలుక ఉంటుంది, దానితో అది మాట్లాడుతుంది. అవిశ్వాసులు, పాపాత్ములు వచ్చి అందులో పడినప్పుడల్లా అది అరుస్తుంది, గర్జిస్తుంది, మహా పెద్ద అరుపులతో శబ్దాన్ని వెలికితీస్తుంది.

మహాశయులారా, ఆ నరకాగ్ని ఎంత భయంకరమైన శిక్ష అంటే దానిని ఇహలోకంలో ఉండి మనం ఊహించలేము. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ముస్నద్ అహ్మద్, తిర్మిజీ లోని హదీస్:

يَخْرُجُ عُنُقٌ مِنَ النَّارِ يَوْمَ الْقِيَامَةِ
(యఖ్రుజు ఉనుఖున్ మినన్నారి యౌమల్ ఖియామ)
ప్రళయదినాన నరకంలో నుండి ఒక మెడ బయటికి వస్తుంది.

لَهُ عَيْنَانِ يُبْصِرَانِ
(లహు ఐనాని యుబ్సిరాన్)
దానికి రెండు కళ్ళు ఉంటాయి వాటితో చూస్తుంది.

وَأُذُنَانِ يَسْمَعَانِ
(వ ఉదునాని యస్మఆన్)
రెండు చెవులు ఉంటాయి, వాటితో అది వింటుంది.

وَلِسَانٌ يَنْطِقُ
(వ లిసానున్ యన్తిఖ్)
మరియు నాలుక ఉంటుంది దానితో మాట్లాడుతుంది.

అది ఇలా అరుస్తూ ఉంటుంది:

إِنِّي وُكِّلْتُ بِثَلاَثَةٍ
(ఇన్నీ ఉక్కిల్తు బి సలాస)
“మూడు రకాల మనుషులను నాకు అప్పగించడం జరిగింది.”

వారు నాలో ఉంటారు. ఒకరు,
بِكُلِّ جَبَّارٍ عَنِيدٍ
(బికుల్లి జబ్బారిన్ అనీద్)
అహంకారి మరియు సత్య తిరస్కారి మరియు సత్యం పట్ల విరోధం ప్రకటించే వ్యక్తి.

రెండో రకమైన వారు,
وَبِكُلِّ مَنْ دَعَا مَعَ اللَّهِ إِلَهًا آخَرَ
(వ బికుల్లి మన్ దఆ మఅల్లాహి ఇలాహన్ ఆఖర్)
ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధించేవారో వారిని,

وَالْمُصَوِّرِينَ
(వల్ ముసవ్విరీన్)
మరియు చిత్రాలు చిత్రీకరించే వారిని.

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ మనల్ని ఎంత భయపెట్టిస్తుందో గమనించగలము. నరకం అనేది ఏదో ఒక కేవలం అగ్ని మాత్రమే కాదు. అల్లాహు తాలా దానికి ఎన్నో రకాల శక్తి ప్రసాదిస్తాడు. దాని మూలంగా ప్రజలు ఆ రోజు ప్రళయదినాన దాని దగ్గరికి వచ్చిన తర్వాత, అందులో పడిన తర్వాత దాని యొక్క భయంకరత్వాన్ని గుర్తుపడతారు. కానీ ఆ రోజు దాన్ని గుర్తుపట్టడం వల్ల మనకు ప్రయోజనం ప్రయోజనం ఏమిటి? ఈ రోజు అల్లాహ్ తెలిపే ఈ విషయాల్ని, ఈ వివరాల్ని తెలుసుకొని మనం దానికి భయపడి ఉంటే దాని నుండి మనం రక్షింపబడగలతాము.

ఇంకా మహాశయులారా, నరకం చూస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, గర్జిస్తుంది, ఇంకా అది దాని యొక్క వేడి వల్ల, అందులో వచ్చి పడే అవిశ్వాసులు మరియు పాపాత్ముల వల్ల ఉడికిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరైతే అందులో పడిపోతారో వారికి ఎంత కష్టం కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో అట్లే మనం ఊహించగలము.

సూరహ్ ఫుర్ఖాన్ ఆయత్ నెంబర్ 12లో అల్లాహు తాలా తెలిపాడు:

إِذَا رَأَتْهُمْ مِنْ مَكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا
(ఇదా రఅత్ హుమ్ మిమ్ మకానిమ్ బయీదిన్ సమీఊ లహా తగయ్యుదౌ వ జఫీరా)
దూరం నుంచే అది (నరకాగ్ని) వారిని చూసినప్పుడు, ఆగ్రహంతో అది ఉడికిపోతూ, గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు.(25:12)

ఎప్పుడైతే అవిశ్వాసులను, పాపాత్ములను దూరం నుండే అది చూస్తుందో, ఇదా రఅత్’హుమ్, వారిని దూరం నుండే చూస్తుందో అప్పుడు వారు ఆ నరకం యొక్క ధ్వనులను, గర్జనలను వింటూ ఉంటారు. గమనించారా? దూరం నుండే అవిశ్వాసులను, నరకంలో వచ్చి పడే వారిని చూసినప్పుడు అది గర్జిస్తూ ఉంటుంది. అంత దూరాన ఉండే ఈ నరకవాసులు దాని గర్జన, దాని భర్జన, దాని యొక్క ధ్వనులను వింటూ ఉంటారు.

ఇమామ్ దహాక్ రహిమహుల్లాహ్ తెలిపారు, ప్రళయ దినాన నరకం గర్జిస్తుంది, దాని గర్జన ఏ సమీపంలో ఉన్న దైవదూత గాని, ప్రవక్తగా పంపబడిన సందేశహరులు గాని దానిని విని సజ్దాలో పడిపోతారు. అప్పుడు, “ఓ ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు,” అని వారు అల్లాహ్ తో మొరపెట్టుకుంటూ ఉంటారు.

ఇదే విషయాన్ని మరో రకంగా అల్లాహు తాలా సూరహ్ ముల్క్ లో కూడా తెలిపాడు. ఆ సూరహ్ ముల్క్ ప్రతి రాత్రి పడుకునే ముందు పఠించాలని మనకు ఆదేశం ఇవ్వబడినది.

إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ
(ఇదా ఉల్ఖూ ఫీహా సమీఊ లహా షహీఖవ్ వహియ తఫూర్)
వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది. (67:7)

تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ
(తకాదు తమయ్యజు మినల్ గైద్)
ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది.  (67:8)

ఈ విధంగా నరకం అనేది అంత ఆగ్రహానికి గురి అవుతుంది.

ఇక మహాశయులారా, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తర్వాత వారి యొక్క ఆకారం మారిపోతుంది. ఇహలోకంలో శరీరం ఎంత పొడవుగా, ఎంత లావుగా ఉండెనో అలా ఉండదు, అంతకంటే ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఆ వివరాలు కూడా మనకు ఖురాన్ మరియు హదీస్ లో తెలుపబడినవి.

ప్రళయదినాన నరకంలో నరకవాసుల శరీరం ఇహలోకంలో ఉన్నట్లు ఉండదు. వారి యొక్క శరీరంలో చాలా మార్పు వచ్చేస్తుంది, వారి ఆకారం కూడా మారిపోతుంది. వారి యొక్క శరీరం ఎంత లావుగా చేయబడుతుందో, సహీహ్ ముస్లిం షరీఫ్ లోని ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَا بَيْنَ مَنْكِبَىِ الْكَافِرِ مَسِيرَةُ ثَلاَثَةِ أَيَّامٍ لِلرَّاكِبِ الْمُسْرِعِ
(మా బైన మన్కిబైల్ కాఫిరి మసీరతు సలాసతి అయ్యామిల్ లిర్రాకిబిల్ ముస్రిఅ)

అవిశ్వాసుని ఈ రెండు భుజాల మధ్యలో, ఇటు నుండి ఇటు వరకు ఈ భుజాల మధ్యలో పొడవు ఎంత పెద్దగా ఉంటుందంటే ఎవరైనా గుర్రపు రౌతు గాని, ఇంకా వేరే ప్రయాణికుడైనా గాని అతి వేగంగా పరిగెత్తుతే మూడు రోజుల ప్రయాణం దీని మీద చేయవచ్చు. అంత లావుగా వారి శరీరాన్ని పెంచబడుతుంది.

మరియు జామే తిర్మిదీ లో అబూ హురైరా రది అల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

إِنَّ غِلَظَ جِلْدِ الْكَافِرِ اثْنَانِ وَأَرْبَعُونَ ذِرَاعًا
(ఇన్న గిలద జిల్దిల్ కాఫిరి ఇస్నాని వ అర్బఊన దిరాఆ)

అవిశ్వాసుల తోలు యొక్క మందము అనేది నలభై రెండు గజాలు ఉంటుంది. మరియు అతని యొక్క దవడ పన్ను ఉహద్ పర్వతం మాదిరిగా పెద్దగా ఉంటుంది, మరియు అతడు కూర్చుంటే అతని యొక్క వైశాల్యం అనేది మక్కా, మదీనా మధ్యలో ఎంత పొడవు ఉందో అంత వెడల్పుగా అతను కూర్చుంటాడు.

మహాశయులారా, ఒక్కసారి మీరు గమనించండి, ఇటు భుజం నుండి ఇటు భుజం వరకు అతివేగంగా పరిగెత్తే ప్రయాణికుడు మూడు రోజులు నడవవచ్చు. దవడ పన్ను ఉహద్ కొండంత ఉంటుంది, మరియు అతని యొక్క ఈ నడుము అనేది, నడుము కింది భాగం కూర్చున్నప్పుడు మక్కా, మదీనా అంటే సుమారు 430 కిలోమీటర్ల దూరం. అంత వెడల్పు ఉంటుంది.

ముస్తద్రక్ హాకిమ్ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు, నరకం యొక్క వైశాల్యం చాలా పెద్దది, చాలా విశాలమైనది నరకం. నరకం యొక్క వైశాల్యం ఎంతదో కేవలం ఒక అంచనా వేసుకోవడానికి, అందులో ఏ అవిశ్వాసులను, పాపాత్ములను వేయడం జరుగుతుందో, ఒక పాపాత్ముని ఈ చెవి మరియు ఈ భుజముల మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది, ఎంత స్థలం ఉంటుందో తెలియబరుస్తూ ఇబ్ను అబ్బాస్ రది అల్లాహు తాలా అన్హు చెప్పారు:

سَبْعِينَ خَرِيفًا
(సబ్ఈన ఖరీఫా)
డెబ్బై సంవత్సరాలు నడిచిపోవచ్చు. మరియు అందులో చీము, నెత్తురు ఇలాంటి ఎన్ని ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉంటాయని.

ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ సహీహ్ ముస్లిం యొక్క వ్యాఖ్యానంలో పాపాత్ముల, అవిశ్వాసుల శరీరాన్ని ఇంత వైశాల్యంగా, ఇంత లావుగా ఎందుకు చేయడం జరుగుతుందో దాని యొక్క సబబు తెలుపుతూ ఇలా చెప్పారు: వారు ఇహలోకంలో ఎలాంటి ఘోరమైన పాపాలకు పాల్పడ్డారో, దాని యొక్క శిక్ష వారికి సరియైన విధంగా లభించాలంటే ఇహలోకంలో ఉన్న వారి యొక్క ఆ చిన్నపాటి శరీరం సరిపోదు. వారికి వారి పాపాలకు తగ్గట్టు బాధ కలగాలి, శిక్ష దొరకాలి, వారు ఆ శిక్ష యొక్క రుచి చూడాలి మరియు నరకం యొక్క జ్వాలలు, దాని యొక్క అగ్ని వారికి తగిలి వారు దానిని అర్థం చేసుకోవాలి, అందుకొరకు అల్లాహు తాలా ఇలాంటి లావుపాటి శరీరాలు వారికి ఆ రోజు ఇస్తాడు. ఇది వారి శరీరం యొక్క లావుతనం, వారి యొక్క పన్ను, వారి యొక్క భుజం, వారి యొక్క చెవి మరియు భుజాల మధ్యలోని స్థలం, వారు కూర్చుంటే ఎంత వెడల్పు ఉంటారో ఇవన్నీ వివరాలు ఏదైతే తెలుసుకున్నామో, ఇక రండి మహాశయులారా, వారి ముఖం అనేది ఎలా ఉంటుంది ఆ రోజు.

ఆ రోజు వారి యొక్క ముఖం ఎలా ఉంటుంది? అల్లాహు అక్బర్. ఖురాన్ లోని ఎన్నో ఆయతులలో దాని యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ముఖం అనేది క్రిందికి వాలి ఉంటుంది. ముఖము నల్లగా అయిపోతుంది, చీకటి మాదిరిగా. అవమానం అనేది వారిని క్రమ్ముకుంటుంది. వారు తలెత్తి ఒకరిని చూడడానికి, మాట్లాడడానికి యమ సిగ్గుపడుతూ ఉంటారంటే దానికి అంతు లేదు.

సూరహ్ జుమర్ లో అల్లాహు తాలా తెలిపాడు:

وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّهِ وُجُوهُهُمْ مُسْوَدَّةٌ
(వ యౌమల్ ఖియామతి తరల్లదీన కదబూ అలల్లాహి ఉజూహుహుమ్ ముస్వద్ద)
ప్రళయదినాన నీవు చూస్తావు ఎవరైతే అల్లాహ్ పై అసత్యాన్ని మోపారో వారి యొక్క ముఖాలు నల్లబడి ఉంటాయి. (39:60)

సూరహ్ అబస, 30వ ఖాండంలో అల్లాహు తాలా తెలిపాడు:

وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
(వ ఉజూహున్ యౌమఇదిన్ అలైహా గబర)
ఆ రోజు కొన్ని ముఖాలపై దుమ్ము ధూళి పడి ఉంటుంది. (80:40)

تَرْهَقُهَا قَتَرَةٌ
(తర్హఖుహా ఖతర)
అవమానం అనేది వారిని కమ్ముకుని ఉంటుంది. (80:41)

أُولَئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ
(ఉలాయిక హుముల్ కఫరతుల్ ఫజర)
వారే సత్యాన్ని తిరస్కరించిన వారు, పాపాల్లో కూరుకుపోయిన వారు. (80:42)

ఈ భావంలో ఆయత్ లు ఖురాన్ లో ఇంకా అనేక చోట్ల ఉన్నాయి.

خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ
(ఖాషిఅతన్ అబ్సారుహుమ్ తర్హఖుహుమ్ దిల్లా)
వారి యొక్క కళ్ళు కిందికి వాలి ఉంటాయి, వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది. (సూరతుల్ ఖలమ్: 68:43)

సూరతుష్ షూరా ఆయత్ నెంబర్ 45 లో అల్లాహు తాలా తెలిపాడు:

وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنْظُرُونَ مِنْ طَرْفٍ خَفِيٍّ
(వ తరాహుమ్ యుఅ’రదూన అలైహా ఖాషియీన మినద్’దుల్లి యందురూన మిన్ తర్ఫిన్ ఖఫియ్యిన్)

నీవు ఆ రోజు చూస్తావు వారిని నరకాగ్ని ముందు తీసుకురావడం జరుగుతుంది. అవమానాన్ని భరించలేక తల క్రిందులు చేసుకొని ఉంటారు. మరియు మెలికన్నుతో ఎవరైనా చూస్తున్నారా అన్నట్లుగా మెలికన్నుతో వారు ఒక పక్కన ఈ విధంగా చూస్తూ ఉంటారు.” (42:45)

ఇక మహాశయులారా, ఎవరైనా అతిథులు వచ్చారంటే వారిని ఎలా సత్కరించడం జరుగుతుంది, ఎంత గౌరవంతో వారికి స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానించడం జరుగుతుంది. కానీ నరకవాసులు నరకంలో వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఆహ్వానం లభిస్తుంది మరియు ఎలా వారిని స్వీకరించడం, ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందో ఈ ఆయతులలో కొంచెం మీరు కూడా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا
(ఇన్నా అఅ’తద్నా జహన్నమ లిల్ కాఫిరీన నుజులా)
మేము నరకాన్ని సత్య తిరస్కారుల కొరకు అతిథి మర్యాదల స్థానంగా చేసి ఉంచాము.(18:102)

సూరహ్ తూర్ లో అల్లాహ్ తెలిపాడు:

يَوْمَ يُدَعُّونَ إِلَى نَارِ جَهَنَّمَ دَعًّا
(యౌమ యుదవ్వూన ఇలా నారి జహన్నమ దఅ’అ)
ఎప్పుడైతే వారిని నరకం వైపునకు త్రోక్కుతూ మరియు వారిని త్రోసిపుచ్చడం జరుగుతుందో, (52:13)

هَذِهِ النَّارُ الَّتِي كُنْتُمْ بِهَا تُكَذِّبُونَ
(హాదిహిన్నారుల్లతీ కున్తుమ్ బిహా తుకద్దిబూన్)
“మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే” (52:14)

ఇదే ఆ నరకం, ఇదే ఆ నరకాగ్ని, దేనినైతే మీరు ఇహలోకంలో తిరస్కరించేవారో ఆ నరకం వైపునకే మిమ్మల్ని త్రోసివేయడం జరుగుతుంది, ఇక్కడ మీకు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పబడుతుంది.

అందుగురించి సోదరులారా, నరకాన్ని తిరస్కరించి మనం ఏమీ సంపాదించలేము. నరకాగ్నిని విశ్వసించాలి కూడా, దాని నుండి రక్షణ పొందడానికి ఏ విశ్వాసం, ఏ సత్కార్యాలు అవసరం ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి కూడా.

ఇహలోకంలో కొందరు మరికొందరిని అనుసరించి సత్యాన్ని తిరస్కరిస్తారు. కానీ నరకంలో వారందరూ కూడా ఒకరి వెనుక ఒకరు నరకంలో ప్రవేశింపజేయబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఆహ్వానం వారికి ఇవ్వబడుతుందో ఈ ఆయతులను మీరు శ్రద్ధగా వినండి. సూరహ్ సాద్, ఆయత్ నెంబర్ 55 నుండి 60 వరకు:

هَذَا فَوْجٌ مُقْتَحِمٌ مَعَكُمْ لَا مَرْحَبًا بِهِمْ إِنَّهُمْ صَالُوا النَّارِ
(హాదా ఫౌజుమ్ ముఖ్తహిముమ్ మఅకుమ్ లా మర్హబమ్ బిహిమ్ ఇన్నహుమ్ సాలున్నార్)
ఇదిగో! మీతోపాటే (నరకానికి) ఆహుతి అయ్యే మరో జట్టు వచ్చింది. వారి కొరకు ఎలాంటి స్వాగత సన్నాహాలు లేవు. వారు అగ్నికి ఆహుతి కానున్నారు. (38:59)

ఇదిగో మరొక జట్టు, నరకానికి ఆహుతి అయ్యే మరొక జట్టు వచ్చేసింది. ‘లా మర్హబమ్ బిహిమ్’ వారికి ఎలాంటి స్వాగతం లేదు, వారికి ఎలాంటి మర్యాదలు లేవు. ‘ఇన్నహుమ్ సాలున్నార్’ వారు తప్పకుండా నరకంలో ప్రవేశించవలసినదే.

ఇక రండి మహాశయులారా, నరకంలో ఎవరికి ఎలాంటి తిండి లభిస్తుంది, త్రాగడానికి ఎలాంటి పానీయాలు లభిస్తాయో వాటి వివరణ కూడా అల్లాహ్ ఖురాన్ లో మనకు తెలియబరిచాడు.

ఇహలోకంలో ఎవరైనా అపరాధిని పట్టుకోవడం జరిగి అతన్ని ఒక జైలులో పంపిస్తారు అని తెలిస్తే, ఆ జైలులో తినడానికి తిండి సరిగా లభించదు, అక్కడ పడుకోవడానికి సరియైన పడకలు ఉండవు అని తెలిస్తే, మరియు అక్కడ చాలా ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది అని తెలిస్తే, ఆ అపరాధి ఏ కొంచెమైనా అవకాశం పొందినప్పుడు ఏం చేస్తాడు? దారిలోనే పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా అవకాశం ఉంటే ఎవరి సిఫారసులు అయినా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇహలోకంలో కొన్ని సందర్భాల్లో జరుగుతుంది కావచ్చు.

కానీ నరకంలో అలాంటిది ఏదైనా అవకాశం ఉందా? నరకంలో పడి ఉన్నారు అంటే అక్కడ చాలా ఇరుకైన స్థలంలో, బాధాకరమైన స్థలంలో, అక్కడ ఎలాంటి ఏ సిఫారసు పనిచేయదు, ఏ ప్రాణ స్నేహితుడు కూడా సహాయం చేయడు, ఏ జట్టు కూడా, ఏ గ్రూప్ కూడా, ఏ గ్యాంగ్ లీడర్ కూడా, ఏ పెద్ద నాయకులు కూడా ఎవరికీ ఏ ప్రయోజనం చేకూర్చరు. అందుగురించి అక్కడి ఆ కష్టాల నుండి, ఆపదల నుండి మనం తప్పించుకోవాలంటే తప్పకుండా మనకు మనం సరిదిద్దుకోవాలి, విశ్వాస మార్గాన నడుస్తూ, సత్కార్యాలు చేస్తూ ఉండాలి.

రండి ఒకసారి మనం, నరకవాసులకు ఎలాంటి తిండి ఇవ్వడం జరుగుతుందో ఖురాన్ ఆయతుల ద్వారా తెలుసుకుందాము. అయితే మహాశయులారా, మీరు కనీసం ఒక రెండు మూడు రోజుల నుండి నరకవాసులకు ఇవ్వబడే శిక్షల గురించి వివరాలు ఏవైతే వింటున్నారో ఇక పుణ్యాత్ములకు, మహా భక్తులకు, సత్కార్యాలు చేసే వారికి, విశ్వాసంపై నడిచే వారికి ఎలాంటి ఏ స్వాగతం అనేది, ఎలాంటి ఏ మంచి స్థలం అనేది లేదా అని భావించకండి. క్రమంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది గనుక, ప్రతిరోజు కొన్ని కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది గనుక ఇప్పుడు నరకానికి సంబంధించిన వివరాలు తెలుపుతున్నాము. బహుశా ఇది ఒక వారం వరకు నడవవచ్చు, ఆ తర్వాత స్వర్గ శుభవార్తలను గురించి కూడా మనం తెలుసుకొనన్నాము. స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు, స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలు ఏమిటి. కానీ అతి ముఖ్యమైనది అక్కడ మనకు పనికి వచ్చేది విశ్వాసం మరియు సామాన్యంగా సర్వ సత్కార్యాలు చేస్తూ ఉండడం. అయితే రండి, నరకవాసులకు ఎలాంటి తిండి, ఎలాంటి ఆహారం లభిస్తుందో, ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో తెలుసుకుందాము.

సూరతుద్ దుఖాన్, ఆయత్ నెంబర్ 43 నుండి 46 వరకు:

إِنَّ شَجَرَتَ الزَّقُّومِ
(ఇన్న షజరతజ్ జక్కూమ్)
నిశ్చయంగా జముడు యొక్క వృక్షం, (44:43)

طَعَامُ الْأَثِيمِ
(తఆముల్ అతీమ్)
పాపాత్ములకు అది ఆహారంగా ఉంటుంది. (44:44)

يَغْلِي فِي الْبُطُونِ
(యగ్లీ ఫిల్ బుతూన్)
పొయ్యి మీద కుండ పెడితే కాగి కాగి ఎలా ఉడుకుతుందో, ఆ జముడు వృక్షాన్ని మనిషి తిన్న వెంటనే కడుపులో ఆ విధంగా మంట లేపుతుంది, ఆ విధంగా అది ఉడుకుతుంది. (44:45)

كَغَلْيِ الْحَمِيمِ
(కగల్ యిల్ హమీమ్)
(సలసల కాగే నీరు మరుగుతున్నట్లు). (44:46)

ఈ జముడు వృక్షం అనేది నరకంలోని అతి కింది స్థలంలో నుండి అది పుట్టుకు వస్తుంది, అది చాలా దుర్వాసన గలది మరియు తినే వారి గురించి అతి చెడ్డ ఆహారం.

అల్లాహు తాలా ఒక సందర్భంలో స్వర్గవాసులకు ఇవ్వబడే వరాలను తెలుపుతూ:

أَذَلِكَ خَيْرٌ نُزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
(అదాలిక ఖైరున్ నుజులన్ అమ్ షజరతుజ్ జక్కూమ్)
స్వర్గవాసులకు లభించే ఈ స్వర్గంలో ఆతిథ్యం ఇది చాలా మంచిగా ఉందా లేక జముడు వృక్షం ఎవరికైతే తినడానికి ఇవ్వబడుతుందో అది ఉత్తమంగా ఉందా? (37:62)

జక్కూమ్, ఈ జముడు వృక్షం అనేది దాని యొక్క ఒక చుక్క, ఒక బిందువు కూడా ఎంత చేదు మరియు ఎంత చెడుగా ఉంటుందో దానిని అర్థం చేసుకోవడానికి ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

لَوْ أَنَّ قَطْرَةً مِنَ الزَّقُّومِ قُطِرَتْ فِي دَارِ الدُّنْيَا لأَفْسَدَتْ عَلَى أَهْلِ الدُّنْيَا مَعَايِشَهُمْ فَكَيْفَ بِمَنْ تَكُونُ طَعَامُهُ

జక్కూమ్ యొక్క ఒక బిందు, ఒక చుక్క కూడా ఇహలోకంలో ఉన్న వారిపై వేయడం జరిగితే వారి యొక్క జీవితాలు, వారి యొక్క సంసారాలు అనేటివన్నీ కూడా చెడిపోతాయి. ఇక అవి తినే వారి గురించి ఎలా ఉంటుందో, వారి యొక్క గతి ఎలా అవుతుందో.
(ముస్నద్ అహ్మద్, తిర్మిదీ మరియు నిసాయీ యొక్క ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీహుల్ జామిఅలో ప్రస్తావించారు)

ఈ విధంగా మహాశయులారా, జముడు వృక్షం అలాంటి పాపాత్ములకు తినడానికి ఇవ్వబడుతుంది.

అల్లాహు తాలా నరకంలోని అన్ని రకాల శిక్షల నుండి మనల్ని కాపాడుగాక. నరకంలోకి తీసుకువెళ్లే పాపాల నుండి మనల్ని అల్లాహు తాలా దూరం ఉంచుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44355

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 3 – నసీరుద్దీన్ జామిఈ  [వీడియో | టెక్స్ట్]

షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 3
https://youtu.be/VEyPUZ3PWz0 [39 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు

ఈ ప్రసంగంలో, షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ రచించిన ‘అల్-ఖవాయిద్ అల్-అర్బా’ (నాలుగు సూత్రాలు) అనే పుస్తకంలోని మొదటి సూత్రం గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని అవిశ్వాసులు, అల్లాహ్‌ను ఏకైక సృష్టికర్తగా, పోషకుడిగా మరియు సర్వ వ్యవహారాల నిర్వాహకుడిగా (తౌహీద్ అల్-రుబూబియ్యత్) అంగీకరించారని, కానీ ఈ నమ్మకం మాత్రమే వారిని ఇస్లాంలోకి ప్రవేశింపజేయలేదని ఈ సూత్రం స్పష్టం చేస్తుంది. దీనికి రుజువుగా సూరత్ యూనుస్ మరియు ఇతర సూరాల నుండి ఆయత్‌లు ఉదహరించబడ్డాయి. వారి అవిశ్వాసానికి అసలు కారణం, వారు కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి (తౌహీద్ అల్-ఉలూహియ్యత్) అనే విషయం నిరాకరించి, తమ ఇతర దైవాలను వదులుకోకపోవడమే అని సూరత్ అస్-సాఫ్ఫాత్ ఆధారంగా వివరించబడింది. ఆరాధనలో ఇతరులను భాగస్వాములుగా కల్పించడం (షిర్క్) అనేది తౌహీద్ అల్-రుబూబియ్యత్‌ను అంగీకరించినప్పటికీ ఒక వ్యక్తిని ఇస్లాం నుండి బహిష్కరిస్తుందని ఈ పాఠం నొక్కి చెబుతుంది.

అల్హందులిల్లాహి హందన్ కసీరా, వ సల్లల్లాహు వ సల్లమ అలా నబియ్యినా ముహమ్మదిన్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి తస్లీమన్ మజీదా, అమ్మా బాద్.

ప్రియ వీక్షకుల్లారా, ఈరోజు అల్-ఖవాయిదుల్ అర్బఅ, నాలుగు నియమాలు అనే పుస్తకం ఏదైతే మనం చదువుతున్నామో, షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ వారిది, ఈ పుస్తకం నుండి మూడవ పాఠం చదవబోతున్నాము. మన యొక్క ఈ కంటిన్యూయేషన్ లో మూడో క్లాస్.

ఇంతకుముందు పాఠాలు మీకు తెలిసి ఉన్నాయి అని ఆశిస్తున్నాను నేను. మనం ఏం చదివాము? ముందు దుఆ ఇచ్చారు. ఆ తర్వాత హనీఫియ్యత్ మిల్లతె ఇబ్రాహీం అంటే ఏమిటో తెలియజేశారు. ఆ తర్వాత తౌహీద్ ఉంటేనే ఆరాధనను ఆరాధన అనబడుతుంది. ఎలాగైతే వుదూతో చేయబడిన నమాజును మాత్రమే నమాజు అని అనబడుతుంది. ఎలాగైతే అపానవాయువు జరిగితే వుదూ భంగమైతే, వుదూ మిగిలి ఉండదు, నమాజు కాదు, నెరవేరదు, చేసినా అది లెక్కించబడదు, దాని పుణ్యం మనిషి పొందడు, పైగా అతనికి శిక్ష కలుగుతుంది. అలాగే అంతకంటే మరీ ఘోరంగా, ఎవరైనా నేను అల్లాహ్‌ను ఆరాధిస్తున్నాను అన్నటువంటి సంతోషంలో ఉండి, షిర్క్ నుండి దూరం ఉండకుంటే, ఆ షిర్క్ అతని ఆ ఆరాధనను చెడగొడుతుంది, పాడుచేస్తుంది, దాని పుణ్యం అతనికి లభించదు. ఒకవేళ అది పెద్ద షిర్క్ అయ్యేది ఉంటే, అదే స్థితిలో చనిపోయేది ఉంటే, క్షమాపణ అల్లాహ్ తో కోరకుంటే, అతడు శాశ్వతంగా నరకంలో ఉంటాడు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మనము తెలుసుకున్నాము.

ఇక రండి, ఆ నాలుగు నియమాలు ఏవైతే ఉన్నాయో, వేటి ద్వారానైతే మనం షిర్క్‌ను మంచి రీతిలో అర్థం చేసుకోగలుగుతామో, ఆ నాలుగు నియమాలలో మొదటిది ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాము.

ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ చెబుతున్నారు.

మొదటి నియమం:

الْقَاعِدَةُ الْأُولَى: أَنْ تَعْلَمَ أَنَّ الْكُفَّارَ الَّذِينَ قَاتَلَهُمْ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم مُقِرُّونَ بِأَنَّ اللَّهَ تَعَالَى هُوَ الْخَالِقُ الرَّازِقُ الْمُدَبِّرُ، وَأَنَّ ذَلِكَ لَمْ يُدْخِلْهُمْ فِي الْإِسْلَامِ.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవిశ్వాసులతో యుద్ధం చేశారో, వారు అల్లాహ్ యే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అని నమ్మేవారు. అయినా ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది (అంటే అందువల్ల వారు ముస్లింలు కాలేదు)

అల్లాహు అక్బర్. గమనించండి. అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అన్నటువంటి విశ్వాసం వారిది. అయినా ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. అంటే ఈ విశ్వాసం వల్ల వారు ముస్లింలు కాలేదు. వారిని ముస్లింలుగా పరిగణించడం జరగలేదు. వారిని విశ్వాసులుగా లెక్కించడం జరగలేదు.

దలీల్ (ఆధారం). దలీల్ ఇస్తున్నారు సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. కానీ ఆ దలీల్, ఆ దలీల్ యొక్క వివరణ మనం వినేకి ముందు ఇక్కడ మరొక్కసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తమ కాలంలోని ఏ అవిశ్వాసులతో యుద్ధాలు చేశారో, ఉదాహరణకు అబూ జహల్, అబూ లహబ్ ఇంకా వేరే ఎందరో. వారు అల్లాహ్ గురించి, ఏ అల్లాహ్‌నైతే మనం నమ్ముతున్నామో ఆ అల్లాహ్ యే నిజమైన సృష్టికర్త, పోషకుడు, జీవన్మరణ ప్రధాత, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అన్నటువంటి నమ్మకం వారిది. కానీ ఈ నమ్మకం, ఈ విశ్వాసం ద్వారా వారు ఇస్లాంలో ప్రవేశించలేకపోయారు. ఈ విశ్వాసం వారిని ఇస్లాంలో చేరిపించలేకపోయింది. ఈ విశ్వాసం, ఈ నమ్మకం ద్వారా వారు ముస్లింలుగా, విశ్వాసులుగా పరిగణించబడలేదు. దలీల్ వస్తుంది. విషయం అర్థమైంది కదా?

ఇక ఎందుకు ముస్లింలుగా పరిగణించబడలేదు? ఎందుకు అంటే ఇక్కడ అల్లాహ్ యే ఖాలిఖ్, సృష్టికర్త, రాజిఖ్, పోషకుడు, ఇంకా అల్లాహ్ మాత్రమే అల్ ముదబ్బిర్, ఈ విశ్వ వ్యవస్థను నడిపేవాడు, ఈ విధంగా వారి నమ్మకం ఏదైతే ఉండిందో దీనిని తౌహీదె రుబూబియ్యత్ అని అంటారు. ఇంతకుముందు ఎన్నో సందర్భాలలో మనం చదివి ఉన్నాము కదా? తౌహీద్, అల్లాహ్ ఏకత్వాన్ని మనం నమ్మాలి లేకుంటే విశ్వాసులము సంపూర్ణంగా కాము. అయితే ఆ అల్లాహ్ యొక్క ఏకత్వం ఏ విషయంలో? రుబూబియ్యత్, అస్మా వ సిఫాత్ మరియు ఉలూహియ్యత్. ఈ మూడిటిలో కూడా అల్లాహ్‌ను అద్వితీయునిగా, ఏకైకుడిగా, ఎలాంటి భాగస్వామి లేని వాడిగా నమ్మడం తప్పనిసరి.

ఇక ఈ ముష్రికులు, ఈ కాఫిర్లు, అవిశ్వాసులు, ఎవరైతే ప్రవక్త కాలంలో ఉండినారో అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, మరియు ఆయనే ఈ విశ్వాన్ని నడిపేవాడు అని నమ్మేవారు. అంటే ఏంటి? తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మేవారు. అంతేకాదు, ఎన్నో అస్మా వ సిఫాత్‌లను నమ్మేవారు అని కూడా తెలుస్తుంది, ఇంకా ఆయత్‌లు ఉన్నాయి. ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ సంక్షిప్తంగా ఒక మూల విషయం చెప్పి దాని యొక్క ఒక్క ఆధారం ఇచ్చి సంక్షిప్తంగా చెప్పాలనుకున్నారు. కానీ మన ప్రాంతాలలో ప్రజలు షిర్క్‌లో ఎలా కూరుకుపోయారంటే, కేవలం అనువాదం చదివి ఒక ఆయత్ దాని అనువాదం చదివేస్తే అంత స్పష్టంగా అర్థం కాదు. అందుకొరకే ఎన్నో ఉదాహరణలు తీసుకొచ్చి, ఎన్నో రకాల ఆధారాలు తీసుకొచ్చి వారికి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆధారం తీసుకొస్తారు ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్. దాన్ని ఇప్పుడు మనం చదువుదాము. కానీ అంతకంటే ముందు ఆ నియమం ఏదైతే తెలిపారో దాన్ని అర్థం చేసుకోండి. ఏంటి నియమం? ముష్రికులు అల్లాహ్‌ను మాత్రమే సృష్టికర్త, పోషకుడు, విశ్వ వ్యవస్థను నడిపేవాడు అని అల్లాహ్ మాత్రమే అని నమ్మినప్పటికీ వారు ముస్లింలుగా కాలేదు. వారిని విశ్వాసులుగా పరిగణించబడలేదు. ఎందుకంటే వారు కేవలం తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు. తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మలేదు. కాకపోతే తౌహీదె అస్మా వ సిఫాత్ ను కూడా నమ్మినటువంటి కొన్ని దలీల్‌లు కనబడతాయి మనకు.

రండి ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ చెప్పినటువంటి ఆ దలీల్‌ ముందు చదివి, ఇంకా ఈ అంశాన్ని మరికొన్ని వేరే ఆధారాలతో తెలుసుకొని, ఆ తర్వాత మన సమాజంలోని ఈనాటి మనం ముస్లింలం ఎలాంటి ఈ నియమానికి సంబంధించి మనం కూడా ఎలాంటి తప్పులో ఉన్నామో, మనలోని చాలామంది, ఆ విషయాన్ని అర్థం చేసుకుందాం.

قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ

“ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణములేని దాని నుండీ, ప్రాణములేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌యే” అని వారు తప్పకుండా చెబుతారు. “మరలాంటప్పుడు మీరు (అల్లాహ్ శిక్షకు) ఎందుకు భయపడరు?” (10:31)

ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ గమనించండి మీరు, ఒక్కొక్కటిగా గమనించండి. ఐదు ప్రశ్నలు అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెబుతున్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఈ ముష్రికులను అడుగు, వీరిని ప్రశ్నించు:

  1. మొదటి ప్రశ్న: ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడు ఎవడు?
  2. రెండో ప్రశ్న: చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు?
  3. మూడో ప్రశ్న: ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు?
  4. నాలుగో ప్రశ్న: ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు?
  5. ఐదో ప్రశ్న: సమస్త కార్యాల నిర్వహణ కర్త ఎవరు?

అర్థమైందా? చూస్తున్నారు కదా, అరబీ ఆయత్ మరియు దాని అనువాదంలో ఐదు విషయాలు స్పష్టంగా కనబడ్డాయా మీకు? భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధిని సమకూర్చే వాడు ఎవడు? మీ యొక్క చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు? మరియు ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, నాలుగవది ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు? ఐదవది సమస్త కార్యాల నిర్వహణ కర్త ఎవరు? ఈ ఐదు ప్రశ్నలు మీరు అడగండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పబడినది, ప్రవక్త వారు వారిని అడిగారు, వారికి సమాధానం ఏముండింది? ఖుర్‌ఆన్‌లో వచ్చింది వారి సమాధానం. ఫసయఖూలూనల్లాహ్ (فَسَيَقُولُونَ اللَّهُ) – “అల్లాహ్ యే” అని వారు తప్పకుండా చెబుతారు. అయితే వారికి చెప్పండి: ఫఖుల్ (فَقُلْ) – అఫలా తత్తఖూన్ (أَفَلَا تَتَّقُونَ) – అయితే మీరు ఎందుకు భయపడటం లేదు? షిర్క్ చేయడం ద్వారా ఎంత నష్టం ఉన్నదో, షిర్క్ చేస్తే అల్లాహ్ ఎలాంటి శిక్ష ఇస్తాడో, ఈ శిక్ష నుండి, ఈ షిర్క్ నుండి, శిక్షకు గురిచేసే అటువంటి ఈ షిర్క్ నుండి మీరు ఎందుకు భయపడరు, ఎందుకు దూరం ఉండరు?

సోదర మహాశయులారా, గమనించారా? ఈ విధంగా ఈ మొదటి నియమంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటో అర్థమైంది కదా మీకు? ఏంటి? అల్లాహ్ త’ఆలాను సృష్టికర్తగా, పోషణకర్తగా, ఉపాధి ప్రధాతగా, ఇంకా ఈ విశ్వ వ్యవస్థను నడిపేవాడిగా, జీవన్మరణాల అధికారి, ప్రధాతగా కేవలం నమ్మితే సరిపోదు. ఇది కేవలం తౌహీదె రుబూబియ్యత్ మాత్రమే.

ఇక ముష్రికులు అల్లాహ్ యొక్క కొన్ని నామాలను కూడా నమ్మేవారు అని చెప్పాను కదా? దానికి ఏంటి దలీల్? రండి. కొన్ని రకాల దలీల్ నేను మీకు వినిపిస్తాను, చూపిస్తాను. చాలా శ్రద్ధగా మీరు ఈ విషయాన్ని గ్రహించండి.

అయితే ఇంతకుముందు నేను మీ మొబైల్‌లో చాలా సులభంగా ఖుర్‌ఆన్ అనువాదం చదవగలుగుతారు అని చెప్పి ఉన్నాను కదా? అహ్‌సనుల్ బయాన్ నుండి. అయితే అందులో నుండే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను, ఇదిగోండి.

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ
(వలఇన్ సఅల్తహుం మన్ ఖలఖస్సమావాతి వల్ అర్ద లయఖూలున్న ఖలఖహున్నల్ అజీజుల్ అలీం)

“భూమ్యాకాశాలను సృష్టించినదెవరు?” అని నువ్వు గనక వారిని ప్రశ్నిస్తే, “సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయినవాడే (అల్లాహ్‌యే) సృష్టించాడ”ని వారు తప్పకుండా సమాధానమిస్తారు.” (43:9)

చూశారా? మీకు గనుక నేను ఖుర్‌ఆన్‌లోని మరికొన్ని ఆయతులు ఒకచోట సమకూర్చాను. ఈ అంశం మీకు చాలా స్పష్టంగా అర్థం కావాలని ఒక్కసారి స్పీడ్‌గా ఆ ఆయతులు, వాటి అనువాదం, ఆ ఆయతుల యొక్క రిఫరెన్స్, ఏ సూరాలలో, ఏ ఆయత్ నెంబర్లో ఒక్కసారి చూడండి. ఈ అంశం మీకు చాలా స్పష్టంగా అర్థమైపోవాలి.

ఇక్కడ చూస్తున్నారా? చాలా స్పష్టంగా కనబడుతుందా మీకు? మొదటి దలీల్ ఇప్పుడు మనం చదివినది, ఏదైతే ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహీమహుల్లాహ్ ప్రస్తావించారో సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. ఆ తర్వాత రెండో దలీల్ చూడండి, ఎంత స్పష్టంగా ఉంది:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
(వలఇన్ సఅల్తహుం మన్ ఖలఖహుం లయఖూలున్నల్లాహ్. ఫఅన్నా యు’ఫకూన్)

“మిమ్మల్ని పుట్టించినదెవర”ని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్‌” అని వారు తప్పకుండా అంటారు. మరలాంటప్పుడు వారు ఎటు తిరిగిపోతున్నారు(ట)?!” (సూరత్ జుఖ్రుఫ్ 43:87)

అలాగే చూడండి మరొక ఆయత్. ఇది సూరత్ అన్‌కబూత్‌లో:

وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ مِن بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
(వలఇన్ సఅల్తహుం మన్ నజ్జల మినస్సమాయి మాఅన్ ఫఅహ్యా బిహిల్ అర్ద మింబ’అది మౌతిహా లయఖూలున్నల్లాహ్. ఖులిల్ హందులిల్లాహ్, బల్ అక్సరుహుం లా య’అఖిలూన్)

“ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా భూమిని, అది చచ్చిన తరువాత బ్రతికించినదెవరు? అని నువ్వు వారిని ప్రశ్నించినట్లయితే ‘అల్లాహ్‌యే’ అని వారి నుంచి సమాధానం వస్తుంది. సకల స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి అని నువ్వు చెప్పు. కాని వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు.” (29:63)

ఇదే సూరత్ జుమర్ ఆయత్ నెంబర్ 61 చూస్తే:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
(వలఇన్ సఅల్తహుం మన్ ఖలఖస్సమావాతి వల్ అర్ద వసఖ్ఖరష్షమ్స వల్ ఖమర లయఖూలున్నల్లాహ్. ఫఅన్నా యు’ఫకూన్)

భూమ్యాకాశాలను సృష్టించినవాడెవడు? సూర్యచంద్రులను పనిలో నిమగ్నుల్ని చేసినవాడెవడు? అని నువ్వు వారిని అడిగితే ‘అల్లాహ్‌యే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు వారు (సత్యం నుంచి) ఎలా తిరిగిపోతున్నారు?” (29:61)

ఖలకస్సమావాతి వల్ అర్ద్ (خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ) అన్న పదం, భూమ్యాకాశాలను పుట్టించింది ఎవరు? ఇది సూరత్ లుఖ్మాన్, సూర నెంబర్ 31 ఆయత్ నెంబర్ 25 లో కూడా ఉంది. సూరత్ జుఖ్రుఫ్, సూర నెంబర్ 43 మరియు ఆయత్ నెంబర్ 9 లో కూడా ఉంది. అందుకొరకు ఇక్కడ దాని అనువాదం ప్రస్తావించడం జరగలేదు. అలాగే సూరత్ జుమర్, సూర నెంబర్ 39 ఆయత్ నెంబర్ 38 లో కూడా ఉంది.

ఇక రండి సూరతుల్ ముఅ్‌మినూన్. ఈ సూరాలో ఆయత్ నెంబర్ 84 నుండి 89 వరకు ఆరు ఆయతులలో అల్లాహ్ కొన్ని ప్రశ్నలు ఆ ముష్రికులతో అడుగుతున్నాడు మరియు వారి యొక్క సమాధానం ఏముందో శ్రద్ధగా చూడండి, వినండి.

قُل لِّمَنِ الْأَرْضُ وَمَن فِيهَا إِن كُنتُمْ تَعْلَمُونَ ‎﴿٨٤﴾‏ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ ‎﴿٨٥﴾‏
(ఖుల్ లిమనిల్ అర్దు వమన్ ఫీహా ఇన్ కున్తుం త’అలమూన్. సయఖూలూన లిల్లాహ్. ఖుల్ అఫలా తజక్కరూన్)

“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.“అల్లాహ్‌వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు. (23:84-85)

ఇక ఆ తర్వాత మళ్ళీ రెండో ప్రశ్న చూడండి.
قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ ‎﴿٨٦﴾‏ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ ‎﴿٨٧﴾‏
(ఖుల్ మన్ రబ్బుస్సమావాతిస్సబ్’ఇ వరబ్బుల్ అర్షిల్ అజీమ్. సయఖూలూన లిల్లాహ్. ఖుల్ అఫలా తత్తఖూన్)

“సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్‌) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు.“అల్లాహ్‌యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి) అడుగు. (23:86-87)

ఆ తర్వాత గమనించండి మళ్ళీ ప్రశ్న.

قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ ‎﴿٨٨﴾‏ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ ‎﴿٨٩﴾‏
(ఖుల్ మన్ బియదిహీ మలకూతు కుల్లి షైఇన్ వహువ యుజీరు వలా యుజారు అలైహి ఇన్ కున్తుం త’అలమూన్. సయఖూలూన లిల్లాహ్. ఖుల్ ఫఅన్నా తుస్’హరూన్)

“సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో- ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.“అల్లాహ్‌ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.” (23:88-89)

గమనించారా? ఇప్పుడు మీరు చదివిన ఈ ఆయతులన్నిటి ద్వారా ఏం తెలిసింది? సార్వభౌమత్వం, శరణు ఇచ్చేవాడు, శరణు తీసుకునేవాడు కాదు. ఇంకా అర్ష్ అజీమ్ యొక్క రబ్. సప్తాకాశాల యొక్క రబ్. మరియు ఈ భూమి, ఇందులో ఉన్న సమస్తము, వీటన్నిటికీ అధికారి ఎవరు? అలాగే మిమ్మల్ని పుట్టించిన వాడు ఎవడు? భూమ్యాకాశాలను పుట్టించిన వాడు ఎవడు? సూర్యచంద్రులను మీ ఉపయోగానికి, మీరు ప్రయోజనం పొందడానికి ఒక లెక్క ప్రకారంగా దానిని అదుపులో ఉంచినవాడు ఎవడు? ఆకాశం నుండి వర్షం కురిపించేది ఎవరు? చనిపోయిన భూమి నుండి పంటను పండించేది, ఆ భూమిని బ్రతికించేది ఎవరు? ఈ విధంగా ఆయత్ యూనుస్‌లోనిది కూడా కలుపుకుంటే అందులోని ఐదు ప్రశ్నలు, ఈ విధంగా చూశారా? సుమారు 12 కంటే ఎక్కువ ప్రశ్నలు వారిని ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటికీ అధికారి, వీటన్నిటినీ చేసేవాడు ఎవడు అని ఆ కుఫ్ఫార్, అవిశ్వాసుల సమాధానం ఒక్కటే. ఏమిటి? అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్.

అయినా గానీ వారిని ముస్లింలు అని ఎందుకు చెప్పలేదు? వారు విశ్వాసులు అని ఎందుకు చెప్పడం జరగలేదు? ఎందుకు? ఖుర్‌ఆన్ స్వయంగా సమాధానం ఇస్తుంది. ఖుర్‌ఆన్ స్వయంగా సమాధానం ఇస్తుంది, చూడండి. అది కూడా మీకు చూపిస్తున్నాను.

సూరా నెంబర్ 37, ఆయత్ నెంబర్ 35 చూడండి. సూరత్ సాఫ్ఫాత్.

إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ ‎﴿٣٥﴾‏ وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ ‎﴿٣٦﴾‏

“అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడ”ని వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు.“పిచ్చిపట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము మా పూజ్య దైవాలను వదులుకోవాలా?” అని అనేవారు.” (సూరత్ సాఫ్ఫాత్ 37:35-36)

తెలిసిందా ఆధారం, ఖుర్‌ఆన్ ద్వారా? వారు తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు. ఇన్షాఅల్లాహ్ నాలుగో నియమంలో కూడా వస్తుంది, ఈనాటి ముస్లింల కంటే ఎక్కువ బలమైన నమ్మకం తౌహీదె రుబూబియ్యత్ పట్ల వారికి ఉండినది. కానీ ఉలూహియ్యత్, కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి, ఈ విషయాన్ని వారు తిరస్కరించారు.

చూస్తున్నారు కదా దలీల్? “ఇన్నహుం కానూ ఇజా ఖీల లహుం లా ఇలాహ ఇల్లల్లాహ్” (إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ) – అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు అని వారితో చెప్పబడినప్పుడు, “యస్తక్బిరూన్” (يَسْتَكْبِرُونَ) – తకబ్బుర్, గర్వం, అహంకారం ప్రదర్శించేవారు.

అంతేకాదు నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యవంతుడు, అమీన్, ఎంతో మంచివాడు అన్నటువంటి ప్రశంసలు కురిపించేవారు సైతం, ఈ తౌహీదె ఉలూహియ్యత్ మాట విని ఆ ఈ పిచ్చివాడు, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఈ కవి, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. గమనించండి, ఏ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినైతే ప్రశంసించేవారో, తౌహీదె ఉలూహియ్యత్ వైపునకు పిలిచినందుకు, ఆహ్వానించినందుకు, ఆ ప్రవక్తనే షాఇర్, మజ్నూన్, కవి, పిచ్చివాడు అని అంటున్నారు, నఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాఇర్ కవి కూడా కారు, పిచ్చివారు కూడా కారు. కానీ వారలా అనేవారు. అని ఏమనేవారు? “లతారికూ ఆలిహతినా” (لَتَارِكُو آلِهَتِنَا) – ఈ కవి, పిచ్చివారి మాటలు విని మేము మా యొక్క పూజ్య దైవాలను వదులుకోవాలా? అంటే అర్థమైంది కదా? ఇక్కడ “ఆలిహతినా” (آلِهَتِنَا), మా యొక్క ఆరాధ్య దైవాలు, మేము ఎవరినైతే పూజించే వారిమో వారు ఈ భూమ్యాకాశాలను పుట్టించారని నమ్మేవారు కాదు. వారు మమ్మల్ని పుట్టించారా? లేదు లేదు లేదు, అల్లాహ్ యే పుట్టించాడు. మీరు ఎవరినైతే పూజిస్తారో, ఆరాధన యొక్క కొన్ని రకాలు ఎవరి ముందైతే చేస్తారో, వారు మీకు ఉపాధిని ఇస్తున్నారా? ఆకాశం నుండి ఏదైనా మీకు కురిపిస్తున్నారా? భూమి నుండి పంట పండిస్తున్నారా? మీకు కావలసినటువంటి ఆహారం వసగుతున్నారా? వారేమనేవారు? లేరు లేరు లేరు, అది కేవలం అల్లాహ్ మాత్రమే ఇస్తాడు. మరి అలాంటప్పుడు అల్లాహ్‌నే మీరు ఆరాధించండి. లేదు లేదు, వీరిని కూడా ఆరాధిస్తాం. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్.

సోదర మహాశయులారా, ఈ మాటను ఇన్ని ఆధారాలతో, ఇంత వివరంగా మీకు నచ్చచెప్పడం జరుగుతుంది అంటే ఇక మీరు సమాజంలో చూడండి. ఈరోజు ముస్లింలు అని తమకు తాము చెప్పుకునే వాళ్ళు, నమాజులు కూడా చేసేవాళ్ళు, ఉపవాసాలు కూడా ఉండేవాళ్ళు, కొన్ని సందర్భాలలో అల్లాహ్ శక్తి కలగజేస్తే హజ్ కూడా చేసేవాళ్ళు. కానీ, అయ్యో మా బడే పాహాడ్ సాహెబ్‌ను ఎలా వదులుకోవాలి? ఫలానా మా బాబాగారిని ఎలా వదులుకోవాలి? మీరు వహాబీలు చెప్పిన మాటకు విని మేము మా యొక్క పీర్ సాహెబ్‌ను వదులుకోవాలా? ఇలా అంటారు కదా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆనాటి కాలంలో ముష్రికులు ఇచ్చినటువంటి సమాధానం, ఈ రోజుల్లో మనం, మనకు మనం ముస్లింలు అనుకునే వాళ్ళలో ఎంతోమంది ఇలాంటి సమాధానాలు ఇస్తారు. అయితే గమనించండి, అల్లాహ్ వద్ద కుటుంబం, వంశం, పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఇతనికి ఎంత హోదా అంతస్తు ఉంది, ఇవన్నీ అల్లాహ్ చూడడు. ఒకవేళ అల్లాహ్ అలా చూసేవాడైతే సొంత బాబాయి అబూ లహబ్, తబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్బ్ అని హెచ్చరికను, శాపనను, నరకం లో వేయబడతాడు అన్నటువంటి విషయం ఖుర్‌ఆన్‌లో ఇలా వస్తుందా? అంటే అల్లాహ్ వద్ద ఏం చూడడం జరుగుతుంది? ఎవరు తౌహీదె ఉలూహియ్యత్‌ను విశ్వసిస్తారో, ఎవరు తౌహీదె ఉలూహియ్యత్ ప్రకారంగా తమ జీవితాన్ని గడుపుతారో.

మొదటి నియమం ఈ నాలుగు నియమాల్లో అల్-ఖవాయిదుల్ అర్బాలో తెలిసిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ అవిశ్వాసులతోనైతే యుద్ధం చేశారో వారు అల్లాహ్ నే సృష్టికర్తగా, పోషకునిగా, సర్వ వ్యవస్థను నడిపేవాడిగా నమ్మేవారు. కానీ ఆ నమ్మకం, ఆ విశ్వాసం వారిని ఇస్లాంలో చేర్చలేదు. దలీల్ సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 31. ఎందుకు చేర్చలేదు? ఎందుకంటే వారు తౌహీదె రుబూబియ్యత్‌ను నమ్మారు, తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మలేదు. ఏమిటి దలీల్? ఇది, సూరత్ సాఫ్ఫాత్ సూరా నెంబర్ 37, ఆయత్ నెంబర్ 35.

సోదర మహాశయులారా, మరికొన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ సమయం సరిపోదు అందుకొరకే నేను ముందుకు సాగుతున్నాను. ఇక ఇక్కడ విషయం అర్థమైంది కదా? నేను ఈ అన్ని వివరాలు మీకు ఏదైతే తెలియజేశానో సొంత నా వైపు నుండి ఇది కాదండి. ఇక్కడ చూడండి ఇది పీడీఎఫ్ షేఖ్ సాలెహ్ అల్-ఫౌజాన్ హఫిజహుల్లాహ్ వారు అల్-ఖవాయిదుల్ అర్బా యొక్క వ్యాఖ్యానం చేసినది. ఈ పీడీఎఫ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది షేఖ్ అబ్దుల్ ముహ్సిన్ అల్-ఖాసిమ్, ఇమాం వ ఖతీబ్ మస్జిద్-ఎ-నబవీ వారు. మరియు ఇది షేఖ్ అబ్దుర్రజాఖ్ అల్-బద్ర్ హఫిజహుల్లాహ్. మరియు ఇది షేఖ్ సాలెహ్ ఆలష్ షేఖ్. ఇంకా అలాగే షేఖ్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ వారి యొక్క, ఇవన్నీ చదివి మరియు ఖుర్‌ఆన్‌లో ఈ ముష్రికుల యొక్క తౌహీదె రుబూబియ్యత్ గురించి వచ్చినటువంటి ఆ ఆయతులను చదివి వాటిని గ్రహించి, అర్థం చేసుకొని ఆ తర్వాత వీటి యొక్క సారాంశం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము.

ఇకనైనా మీరు ఈ ఖుర్‌ఆన్ ఆధారంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ఆధారంగా చెప్పబడుతున్న విషయాలను శ్రద్ధ వహించండి, మంచిగా అర్థం చేసుకోండి, ఆ తర్వాతనే మీరు తౌహీదె ఉలూహియ్యత్‌ను నమ్మకుంటే ఎంత ఘోరమైన నష్టం జరుగుతుందో దాన్ని అర్థం చేసుకోగలుగుతారు.

ఇక ఆయత్ ఏదైతే వచ్చినదో ప్రత్యేకంగా సూరత్ యూనుస్‌లోని ఆయత్ నెంబర్ 31, దానిలోని ఒక్కొక్క విషయాన్ని నేను వివరిస్తే ఇంకా చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ సంక్షిప్తంగా మీకు అర్థమైంది కదా? ఆ ఆయత్ నెంబర్ 31 లో ఐదు ప్రశ్నలు ముష్రికులతో చేయబడ్డాయి. భూమ్యాకాశాల నుండి మీకు ఆహారం ఇచ్చేది ఎవరు? ముష్రికులు ఏం జవాబు ఇచ్చారండి? అల్లాహ్ మాత్రమే అని. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలు ఏమంటారు? నేను వారి యొక్క తావీజు వేసుకున్నా, కాబా యొక్క తలుపు ఏదైతే ఉందో అది నేను నా ఇంట్లో దాని ఫోటో పెట్టుకున్నా, నేను ఫలానా బాబా వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకొని వచ్చినా, అప్పుడే నాకు శుభం కలిగిందండి, నా వ్యాపారం పెరిగిందండి, నా పంట మంచిగా పండిందండి, నేను ఫలానా వలీ వద్దకు వారి యొక్క దర్గా వద్దకు, మజార్ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాతనే నాకు సంతానం కలిగిందండి, లేకుంటే అంతకుముందు నేను ఎన్నో నమాజులు చేస్తూ ఉండేవాడిని, కానీ సంవత్సరాల తరబడి ఎంతో దుఆ చేసినా నాకు సంతానం కాలేదు, ఇలా అనేవారు మన సమాజంలో ఉన్నారా? ఎంత బాధాకరమైన విషయం గమనించండి. ప్రవక్త కాలం నాటి ముష్రికులు ఏం నమ్ముతున్నారు? భూమ్యాకాశాల నుండి ఎక్కడి నుండైనా ఆహారం ఇచ్చేది కేవలం అల్లాహ్ మాత్రమే. కేవలం అల్లాహ్ మాత్రమే.

ఇక ఆ తర్వాత? ఎవరు మీ చెవుల మరియు మీ కళ్ళ పై అధికారం కలిగి ఉన్నాడు? ఈ ప్రశ్నకు సమాధానంలో కూడా వారేమంటారు? అల్లాహ్ మాత్రమే. కానీ ఈ రోజుల్లో మన అనేక మంది ముస్లింలు ఈ విషయంలో కూడా వేరే ఎవరెవరితో భయపడుతూ ఉంటారు. ఇక్కడ మీ చెవులపై, మీ కళ్ళపై అధికారం ఎవరికి ఉంది, ఇమాం ఇబ్ను కసీర్ రహీమహుల్లాహ్ చెప్పారు, “మొదటగా ఈ శక్తిని ప్రసాదించినది ఎవరు? ఈ వినే శక్తి, చూసే శక్తి ప్రసాదించినది ఎవరు? అల్లాహ్ తలుచుకుంటే ఎప్పుడైనా మీ నుండి వాటిని తీసుకోగలుగుతాడు.” సూరతుల్ ముల్క్ ఆయత్ నెంబర్ 23, సూరతుల్ అన్’ఆమ్ ఆయత్ నెంబర్ 46 ఆధారంగా ఈ మాట తెలియజేశారు.

ఇక ఆ తర్వాత ఏముంది? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడు ఎవడు? ఇక్కడ ఒక ఉదాహరణ ఏమివ్వడం జరిగింది? వేరే తఫ్సీర్‌లలో, ఉదాహరణకు ఇమాం నవాబ్ సిద్దీఖ్ హసన్ ఖాన్ అల్-ఖన్నూజీ రహీమహుల్లాహ్ తమ తఫ్సీర్‌లో తెలియజేస్తున్నారు. ఈ జీవి నుండి నిర్జీవిని, నిర్జీవి నుండి జీవిని, ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని, ప్రాణము లేని దాని నుండి ప్రాణమున్న దానిని వెలికి తీయడం ఇది ఎంతో శక్తి గల విషయం. ఏమంటారు? బికుద్రతిహిల్ అజీమా వ మిన్నతిహిల్ అమీమా. తీసిన వారు ఎవరు? అంటే కేవలం అల్లాహ్ మాత్రమే. ఫత్హుల్ బయాన్, ఇక్కడ ఉంది చూడండి. ఏమంటున్నారు ఇక్కడ? అల్లాహ్ త’ఆలా ప్రాణమున్న కోడి నుండి గుడ్డు, గుడ్డులో ప్రాణం లేదు. కానీ అల్లాహ్ తలుచుకున్నప్పుడు అదే ప్రాణం లేని గుడ్డు ద్వారా మళ్ళీ కోడిపిల్లను పుట్టిస్తాడు. కదా? ఇది ఒక ఉదాహరణ మనకు అర్థం కావడానికి. అలాగే మరొక ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. “వన్నబాత మినల్ హబ్బా” – ఒక చెట్టు నుండి విత్తనం, విత్తనం నుండి చెట్టు. ఈ విధంగా, ఇక వేరే కొన్ని ఇలాంటి ఉదాహరణలు కూడా ఇవ్వబడినవి.

సోదర మహాశయులారా, ఆ తర్వాత అల్లాహ్ చెబుతున్నాడు, “వమన్ యుదబ్బిరుల్ అమ్ర్” – అంటే ఈ సర్వ విశ్వ వ్యవస్థను నడిపేవాడు. అంటే ఏంటి? పుట్టించడం, చావు ఇవ్వడం, ఇంకా ఈ పూర్తి విశ్వంలో అందరికీ వారికి తగిన అవసరాలన్నీ తీరుస్తూ ఉండడం. ఈ ఖగోళం ఏదైతే చూస్తామో, ఖగోళ శాస్త్రం అని చదువుతారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు కదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవి వాటి వాటి సమయాల్లో, వాటి వాటి కక్ష్యలో తిరుగుతూ ఉండే విధంగా, ఇదంతా నిర్వహించేవాడు, ఈ పూర్తి విశ్వంలో ఎక్కడ ఏమి జరిగినా గానీ దానికి బాధ్యుడు, నడిపించేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే.

ఇంతటి గొప్ప శక్తి గల అలాంటి అల్లాహ్‌ను వదిలి వీర్యపు బిందువుతో పుట్టినటువంటి ఒక మానవుడు, అది కూడా చనిపోయాడు, అతన్ని పూజించడం? మానవుడు అతనిలో స్వయం ఏ శక్తి లేదు, అల్లాహ్ ఏ కొత్త శక్తి ఇచ్చాడో అది ప్రాణం ఉన్నంతవరకు సద్వినియోగించుకొని అతని యొక్క విధేయతలో గడపాలి. అలా కాకుండా ఎవరెవరినో మనం ఎంతో పుణ్యాత్ములుగా భావించి వారిని పూజిస్తే, ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు వారి కొరకు చేస్తే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి.

అందుకొరకే ఈ మొదటి నియమం ద్వారా తెలపబడిన విషయం ఏమిటంటే, ముష్రికులు సైతం తౌహీదె రుబూబియ్యత్, అందులో వచ్చేటటువంటి ఎన్నో విషయాలు, ఒక 12, 13 ప్రశ్నల రూపంలో వారిని అడగడం జరిగింది, వారు కేవలం ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే సృష్టించాడు, వీటికి అధికారి, అల్లాహ్ తప్ప వేరే ఎవరిలో కూడా వీటి శక్తి లేదు అని స్పష్టంగా చెప్పేశారు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలు ఈ తౌహీదె రుబూబియ్యత్‌లో కూడా షిర్క్ చేస్తున్నారు. వారు అల్లాహ్‌ను అంతగా నమ్మినప్పటికీ ముస్లింలు కాలేదు అంటే, ఉలూహియ్యత్‌ను తిరస్కరించారు, అల్లాహ్ ఆరాధనలో వేరేవారిని భాగస్వామిగా చేశారు. మరి ఈరోజు మనం ముస్లింలమని పేరును పెట్టుకొని అలాంటి ఆరాధనలో ఏదైనా భాగస్వామ్యం కలగజేస్తే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడా? మనం అల్లాహ్ యొక్క శిక్ష నుండి తప్పించుకోగలుగుతామా?

అల్లాహ్ త’ఆలా ఈ మొదటి నియమాన్ని ఏదైతే మనం విన్నామో, ఇన్ని ఆధారాలతో మంచిగా అర్థం చేసుకొని, మన ఇంటి వారిలో ఎవరైతే ఇలాంటి షిర్క్‌కు పాల్పడి ఉన్నారో, మన చుట్టుపక్కల ఎవరైతే రుబూబియ్యత్‌ను నమ్మి ఉలూహియ్యత్‌ను నమ్మటం లేదో, ఈ ఆయతులు, ఈ హదీసులు, ఈ దలాయిల్ ఆధారాలన్నీ చూపించి వారికి మంచిగా నచ్చచెప్పే, వారికి తౌహీద్ యొక్క దావత్ మంచి రీతిలో ఇచ్చేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43982

షిర్క్ నాలుగు సూత్రాలు – పుస్తకం & వీడియో పాఠాలు

[1] షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 1 – నసీరుద్దీన్ జామిఈ  [వీడియో | టెక్స్ట్]

[2] షిర్క్ ను స్పష్టంగా తెలుసుకునే “నాలుగు నియమాలు“ : పార్ట్ 2 – నసీరుద్దీన్ జామిఈ  [వీడియో | టెక్స్ట్]

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ﷺ పట్ల ప్రేమ  – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమ
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Tp1VpjyAmIc [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో ఒక విశ్వాసి యొక్క ప్రేమకు సంబంధించిన ప్రాధాన్యతలను గూర్చి వివరించబడింది. అన్నిటికంటే ముఖ్యమైన ప్రేమ అల్లాహ్ పట్ల ఉండాలని, అది ఆరాధనలో అత్యుత్తమ శ్రేణి అని చెప్పబడింది. ఆ తర్వాత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ అత్యంత ప్రగాఢంగా ఉండాలని బోధించబడింది. విశ్వాస మాధుర్యాన్ని రుచి చూడాలంటే ఉండవలసిన మూడు లక్షణాలను ఒక హదీస్ ద్వారా వివరించారు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను అందరికంటే ఎక్కువగా ప్రేమించడం, కేవలం అల్లాహ్ కొరకు ఇతరులను ప్రేమించడం, మరియు అవిశ్వాసం వైపు తిరిగి వెళ్ళడాన్ని అగ్నిలో పడవేయబడటం వలె ద్వేషించడం. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు, పిల్లలు, సమస్త మానవాళి, చివరకు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించనంత వరకు అతని విశ్వాసం పరిపూర్ణం కాదని స్పష్టం చేయబడింది.

ఇన్నల్ హందలిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్ అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ రోజు మనం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అందరి కన్నా ముందు అల్లాహ్ యెడల ప్రేమాతిశయంతో మెలగవలసిన బాధ్యత దాసునిపై ఉంది. అందరికన్నా ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ, ప్రేమలో ప్రథమ స్థానం అనేది అది అల్లాహ్ పట్ల కలిగి ఉండాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సూరహ్ బఖర, ఆయత్ 165 లో ఇలా తెలియజేశాడు,

وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ
(వల్ లజీన ఆమనూ అశద్దు హుబ్బల్ లిల్లాహ్)
విశ్వసించిన వారు అల్లాహ్ ను ప్రగాఢంగా ప్రేమిస్తారు.” (2:165)

అంటే అందరికన్నా ముందు అల్లాహ్ యెడల ప్రేమాతిశయంతో మెలగవలసిన బాధ్యత దాసునిపై ఉంది అంటే ఇది ఆరాధనలో అత్యుత్తమ శ్రేణికి చెందిన అంశం. అల్లాహ్ పట్ల ప్రేమ అనేది ఇది ఆరాధన విషయంలో అత్యుత్తమ శ్రేణికి చెందిన అంశం ఇది. అందుకు ప్రపంచంలో అందరికంటే, అన్నిటికంటే, చివరికి ప్రవక్తల కంటే ఎక్కువగా అల్లాహ్ పట్ల ప్రేమ కలిగి ఉండాలి.

إِنَّ الَّذِينَ آمَنُوا
(ఇన్నల్ లజీన ఆమనూ)
ఎవరైతే విశ్వసించారో (విశ్వాసులు),

أَشَدُّ حُبًّا لِّلَّهِ
(అషద్దు హుబ్బల్ లిల్లాహ్)
అల్లాహ్ ను ప్రగాఢంగా ప్రేమిస్తారు. ఎందుకంటే అసంఖ్యాకమైన అనుగ్రహాల ద్వారా దయ దలిచే ప్రభువు అల్లాహ్ యే గనక.

అభిమాన సోదరులారా! ఇది ప్రేమ విషయంలో ప్రథమ స్థానం అల్లాహ్ కు చెందుతుంది. మనం అందరినీ ప్రేమిస్తాం, ప్రేమించాలి. బంధువులను, అన్నిటికంటే ఎక్కువ అమ్మానాన్నకి, భార్యాపిల్లలు, స్నేహితులు, మిత్రులు, సమీప బంధువులు, ఇరుగుపొరుగు వారు, ఉపాధ్యాయులు, గురువులు, ఇలా అందరినీ ప్రేమించాలి. కానీ మనం సాధారణంగా ఎక్కువ ప్రేమ ఎవరికి కలిగి ఉంటాము? తల్లిదండ్రులకి, ఆ తర్వాత భార్యా సంతానంకి, సంతానానికి, ఇలా సంబంధం ఎంత దగ్గరగా ఉంటే ప్రేమ అంత ఎక్కువగా ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయం. కాకపోతే విశ్వాసపరంగా, ధార్మికంగా ఒక దాసుడు, ఒక ముస్లిం అన్నిటికంటే ఎక్కువగా అల్లాహ్ పట్ల మాత్రమే ప్రేమ కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం.

రెండవ విషయం, అల్లాహ్ యెడల ప్రేమ తర్వాత, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధిక ప్రేమను కలిగి ఉండటం అవశ్యం, తప్పనిసరి. మొదటి స్థానం అల్లాహ్. అల్లాహ్ ప్రేమ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధిక ప్రేమ కలిగి ఉండటం తప్పనిసరి, అవశ్యం.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ లో ఇలా సెలవిచ్చారు,

ثَلَاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلَاوَةَ الْإِيمَانِ
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్)
మూడు విషయాలు ఎవరిలోనైతే ఉన్నాయో అతను విశ్వాస మాధుర్యాన్ని పొందాడు.

విశ్వాసం యొక్క మాధుర్యం ఆస్వాదించాలంటే, విశ్వాసంలోని మాధుర్యాన్ని పొందాలంటే మూడు విషయాలు కలిగి ఉండాలని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఆ మూడు విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

మొట్టమొదటి విషయం,

أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا
(అన్ యకూనల్లాహు వ రసూలుహూ అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా)
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని దృష్టిలో అందరికన్నా ఎక్కువగా ప్రియతములై ఉండాలి.

ఇది మొదటి విషయం. విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే మూడు షరతులు, మూడు విషయాలు కలిగి ఉండాలి. ఆ మూడు విషయాలలో ప్రథమమైన విషయం, మొట్టమొదటి విషయం ఏమిటి? అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతని దృష్టిలో, ఆ వ్యక్తి దృష్టిలో అందరికన్నా ఎక్కువగా ప్రియతములై ఉండాలి. అంటే అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం.

అలాగే రెండవది,

وَأَنْ يُحِبَّ الْمَرْءَ لَا يُحِبُّهُ إِلَّا لِلَّهِ
(వ అన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహూ ఇల్లా లిల్లాహ్)
అతడు ఎవరిని ప్రేమించినా, కేవలం అల్లాహ్ కొరకే ప్రేమించేవాడై ఉండాలి.

ఒక వ్యక్తి ఎవరికి ప్రేమించినా ఆ ప్రేమ అల్లాహ్ కోసం, అల్లాహ్ ప్రసన్నత కోసం అయ్యి ఉండాలి. ఇది రెండో విషయం.

ఇక మూడో విషయం,

وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ بَعْدَ أَنْ أَنْقَذَهُ اللَّهُ مِنْهُ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ
(వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి బ’అద అన్ అన్ ఖ దహుల్లాహు మిన్హు కమా యక్రహు అన్ యుఖ్ దఫ ఫిన్నార్)
అవిశ్వాసం వైపునకు మళ్ళించబడటం అతని దృష్టిలో అగ్నిలో పడవేయబడటం కన్నా ఎక్కువ అయిష్టకరంగా ఉండాలి

ఈ హదీస్ ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉంది. ఈ మూడు విషయాలలో చివరి విషయం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తనకు మోక్షం ప్రసాదించిన మీదట, తాను కుఫ్ర్ అంటే అవిశ్వాసం వైపునకు మళ్ళించబడటం అతని దృష్టిలో అగ్నిలో పడవేయబడటం కన్నా ఎక్కువ అయిష్టకరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసాన్ని ప్రసాదించాడు, మోక్షాన్ని ప్రసాదించాడు, హిదాయత్ ని ప్రసాదించాడు, ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి కుఫ్ర్ వైపునకు, అవిశ్వాసం వైపునకు మళ్ళించబడటం అతని దృష్టిలో అగ్నిలో పడవేయటం ఎంత అయిష్టకరమో అంతకంటే ఎక్కువగా కుఫ్ర్ వైపునకు, అవిశ్వాసం వైపునకు మళ్ళించబడటం అంతకంటే ఎక్కువ, అగ్నిలో పడవేయడం కంటే ఎక్కువగా అయిష్టకరంగా ఉండాలి.

ఈ మూడు విషయాలు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో ఆ వ్యక్తి విశ్వాసపు యొక్క, ఈమాన్ యొక్క మాధుర్యాన్ని పొందుతాడు. ఈ మూడు విషయాల్లో మొట్టమొదటి విషయం ఏమిటి? అందరికంటే, అన్నిటికంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉండాలి? అల్లాహ్ కు, అల్లాహ్ ప్రవక్తకు.

అభిమాన సోదరులారా! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَلَدِهِ وَوَالِدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ
లా యు’మిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మ’ఈన్
మీలో ఏ వ్యక్తి కూడా తన ఆలుబిడ్డల కన్నా, తన తల్లిదండ్రుల కన్నా, సమస్త మానవుల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకు విశ్వాసి కాజాలడు

అంటే అమ్మానాన్న కంటే ఎక్కువ, భార్యా పిల్లల కంటే ఎక్కువ, సమస్త మానవుల కంటే ఎక్కువ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించినంత వరకు ఆ వ్యక్తి విశ్వాసం పరిపూర్ణం కాజాలదు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే మన విశ్వాసం సంపూర్ణం కావాలంటే, మన విశ్వాసం ఉన్నత స్థాయికి చెందాలంటే మనము అందరికంటే, అన్నిటికంటే ఎక్కువ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి. చివరికి ప్రాణం కంటే ఎక్కువ. అవును, ప్రాణం కంటే ఎక్కువ.

అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

وَالَّذِي نَفْسِي بِيَدِهِ، حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ نَفْسِهِ
(వల్లదీ నఫ్సీ బియదిహీ, హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ నఫ్సిక్)

ఒక హదీస్ లోని ఒక భాగం ఇది. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా, అంటే అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ సాక్ష్యంతో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా, అల్లాహ్ సాక్షిగా, నీ దృష్టిలో నేను నీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రియతముణ్ణి కానంత వరకు నీ విశ్వాసం సంపూర్ణం కాజాలదు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అంటే ఒక సందర్భంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హును ఉద్దేశించి చెప్పిన మాట ఇది. అంటే ప్రాణం కంటే ఎక్కువగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించనంత వరకు ఆ వ్యక్తి యొక్క విశ్వాసం సంపూర్ణం కాజాలదు, పరిపూర్ణం కాజాలదు అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

ప్రియ సోదరులారా! నా ఈ మాటలకి సారాంశం ఏమిటంటే మనం అందరికంటే మరియు అన్నిటికంటే, అమ్మానాన్న, భార్యాపిల్లలు, ఆస్తి, హోదా, అందం, ఐశ్వర్యం, ధనం, డబ్బు, పదవి, ఇవన్నీ ఈ ప్రపంచం అన్నిటికంటే, చివరికి ప్రాణం కంటే ఎక్కువగా అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించాలి. వారిద్దరిలో మొదటి స్థానం అల్లాహ్ ది, ఆ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ లలో ఏ విధంగా అల్లాహ్ ప్రేమ గురించి, అల్లాహ్ ప్రవక్త ప్రేమ గురించి చెప్పబడిందో, ఆ విధంగా మనందరూ మనందరికీ ఆ ప్రేమ కలిగి ఉండాలని నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ రీతిలో, ఏ స్థానంలో, ఏ విధంగా అల్లాహ్ ను ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించే శక్తిని, సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. అలాగే ఏ విధంగా, ఏ రీతిలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మనం ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించే శక్తిని ప్రసాదించమని అల్లాహ్ తో వేడుకుంటూ నా ఈ మాటలను ముగిస్తున్నాను.

మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44297

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]

సహాయం కోరుకోవడం (ఇస్తిఆన) – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

సహాయం కోరుకోవడం (ఇస్తియాన) 
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/xGpbNMU2qLQ

ఈ ప్రసంగంలో, “ధర్మ అవగాహనం” అనే సిరీస్ యొక్క పదవ ఎపిసోడ్‌లో సహాయం కోరడం (ఇస్తిఆన) అనే అంశం గురించి వివరించబడింది. ఇస్లాంలో సహాయం కోరడంలో నాలుగు రకాలు ఉన్నాయని బోధకుడు వివరిస్తున్నారు. మొదటిది, అల్ ఇస్తిఆనతు బిల్లాహ్ – అల్లాహ్ నే సహాయం కోరడం, ఇది తౌహీద్ యొక్క పునాది. రెండవది, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్ – పుణ్య కార్యాల కోసం సృష్టి జీవుల నుండి సహాయం తీసుకోవడం, ఇది ధర్మసమ్మతమే. మూడవది, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్ – మరణించిన వారి నుండి సహాయం కోరడం, ఇది షిర్క్ (బహుదైవారాధన) మరియు తీవ్రమైన పాపం. నాల్గవది, అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా – సహనం, నమాజ్ వంటి సత్కర్మల ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్థించడం, ఇది ప్రోత్సహించబడింది. ప్రసంగం ముగింపులో, ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం సరైన మార్గంలో సహాయం కోరే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థిస్తూ ముగించారు.

إِنَّ ٱلْحَمْدَ لِلَّٰهِ وَحْدَهُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَىٰ مَنْ لَا نَبِيَّ بَعْدَهُ أَمَّا بَعْدُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అ దహు, అమ్మా బ’అద్)

اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ‎
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ పదవ ఎపిసోడ్ లో మనం సహాయం కోరుకోవటం అనే విషయం గురించి తెలుసుకుందాం. మనిషి పలు రకాలుగా సహాయాన్ని కోరుకుంటాడు. ఈ ఎపిసోడ్లో మనం నాలుగు రకాలు తెలుసుకుందాం.

మొదటిది అల్ ఇస్తిఆనతు బిల్లాహ్, అల్లాహ్ తో సహాయాన్ని అర్థించటం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ ఫాతిహాలో ఇలా తెలియజేశాడు:

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము..” (1:5)

ఈ ఆయత్ సూరహ్ ఫాతిహాలోని ఆయత్. దీనిని మనం ప్రతిరోజూ, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో పఠిస్తాము. దీని అర్థం: ఓ అల్లాహ్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కోసం నిన్నే అర్థిస్తాము, నీతోనే సహాయం కోరుతాము, ఇతరులతో సహాయము కోరము అని అర్థం.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

إِذَا سَأَلْتَ فَاسْأَلِ اللَّهَ
(ఇదా స’అల్త ఫస్’అలిల్లాహ)
“వేడుకుంటే అల్లాహ్ తోనే వేడుకోండి”

وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللَّهِ
(వ ఇదస్త’అంత ఫస్త’ఇన్ బిల్లాహ్)
“సహాయం కోసం అర్థిస్తే అల్లాహ్ తోనే అర్ధించండి.”

దీని పరంగా, ఇతరులను సహాయం కోసం మొరపెట్టుకోవటం, సహాయం కోసం ఇతరులను పూజించటం ధర్మసమ్మతం కాదు. అది షిర్క్ అవుతుంది, ఇబాదాలో షిర్క్ అవుతుంది, తౌహీద్ ఉలూహియ్యతులో షిర్క్ అవుతుంది. ఇది మొదటి విషయం. ఇటువంటి సహాయం అల్లాహ్ తోనే కోరాలి, ఇతరులతో కోరకూడదు.

ఇక రెండో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్. అంటే, సృష్టితాల సహాయం. కారకాలకు లోబడి, ఒకరికొకరి సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతమే. దీన్ని ఇస్లాంలో ప్రోత్సహించటం కూడా జరిగింది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో ఇలా తెలియజేశాడు:

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ
(వ త’ఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా, వలా త’ఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్)
సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి.” (5:2)

మంచికి, దైవభీతికి సంబంధించిన విషయాలలో ఒకరికొకరికి అందరితోనూ సహకరించండి. మంచి విషయాలలో, పుణ్య విషయాలలో, దైవభీతికి పుట్టిన విషయాలలో అందరితోనూ సహకరించండి. వలా త’ఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, అంటే పాప కార్యాలలో, అధర్మ విషయాలలో, ఖుర్ఆన్ మరియు హదీసులకి విరుద్ధమైన విషయాలలో సహకరించకండి. అంటే, కారకాలకు లోబడి, పరస్పరం మనము చేయగలిగే విషయాలలో సహాయం తీసుకోవటం, ఇది ధర్మసమ్మతమే.

ఇక మూడో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్, చనిపోయిన వారి సహాయం తీసుకోవటం. ఇది షిర్క్, అధర్మం, అసత్యం, ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ కిందికి వచ్చేస్తుంది, పెద్ద షిర్క్ అవుతుంది. ఎందుకంటే, చనిపోయిన వారు, తల్లిదండ్రులైనా, పితామహులైనా, స్నేహితులైనా, సజ్జనులైనా, గురువులైనా, పండితులైనా, ఔలియాలు అయినా, ప్రవక్తలు అయినా సరే, చనిపోయిన వారు చనిపోయిన తర్వాత మన పిలుపుని వారు వినలేరు. మన సమస్యల్ని వారు దూరం చేయలేరు. కావున చనిపోయిన వారి సహాయాన్ని కోరటం ఇది ధర్మసమ్మతం కాదు, షిర్క్ క్రిందికి వస్తుంది. ఈ విషయం గురించి మనము బాగా జాగ్రత్త పడాలి.

ఇక నాలుగో విషయం, అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా, సత్కర్మల ద్వారా సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ బఖరాలో ఇలా తెలియజేశాడు:

وَٱسْتَعِينُوا۟ بِٱلصَّبْرِ وَٱلصَّلَوٰةِ
(వస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్)
మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి.” (2:45)

మీరు సహనం ద్వారా, సలాహ్, నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్పించండి, కోరండి అని. దీన్ని బట్టి, మంచి పుణ్యాల ద్వారా, సత్కర్మల ద్వారా, సహనం నమాజుల ద్వారా సహాయాన్ని కోరవచ్చు.

అభిమాన సోదరులారా! ఈ సహాయం అనే విషయంలో, ఖుర్ఆన్ మరియు హదీస్ కి అనుగుణంగా నడుచుకునే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44277

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]

“వలీ యుల్లాహ్”, “ఔలియా అల్లాహ్ “అంటే ఎవరు? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

“వలీ యుల్లాహ్”, “ఔలియా అల్లాహ్ “అంటే ఎవరు?
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/9G8MWDYNSwo [7 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ‘ఔలియా అల్లాహ్’ (అల్లాహ్ యొక్క మిత్రులు) యొక్క నిజమైన అర్థం మరియు నిర్వచనంపై దృష్టి సారించారు. వక్త ‘వలీ’ (ఏకవచనం) మరియు ‘ఔలియా’ (బహువచనం) అనే పదాల భాషాపరమైన మరియు మతపరమైన అర్థాలను వివరిస్తారు. సూరహ్ యూనుస్ లోని 62 మరియు 63 ఆయతుల ద్వారా ఖురాన్ యొక్క నిర్వచనాన్ని స్పష్టం చేస్తారు, దీని ప్రకారం ఔలియా అల్లాహ్ అంటే విశ్వసించి, దైవభీతి (తఖ్వా)తో జీవించేవారు. మహిమలు లేదా కరామాతులు చూపించడం అనేది ఔలియాగా ఉండటానికి అవసరమైన ప్రమాణం కాదని, అది ఒక తప్పుడు భావన అని వక్త నొక్కి చెబుతారు. అల్లాహ్ సామీప్యం అనేది కల్మషం లేని విశ్వాసం మరియు భయభక్తులతో కూడిన జీవన విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడేనని స్పష్టం చేశారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు? తెలుసుకుందాం. వలీ, ఔలియా. వలియుల్లాహ్, ఔలియావుల్లాహ్ అంటే ఎవరో తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62లో ఇలా సెలవిచ్చాడు.

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్)
వినండి! అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (10:62)

ఔలియా అల్లాహ్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పిన మాట ఇది, సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62.

ఔలియా అనే పదం, వలీ అనే పదానికి బహువచనం. అంటే, వలీ ఏకవచనం, ఔలియా బహువచనం.

నిఘంటువు పరంగా వలీ అంటే సన్నిహితుడని అర్థం వస్తుంది. దీని ప్రకారం, ఔలియా అల్లాహ్ అంటే చిత్తశుద్ధితో, అల్లాహ్ కు విధేయత కనబరచి, చెడు నుండి తమను కాపాడుకుని దైవ సామీప్యం పొందేందుకు నిరంతరం పాటుపడిన వారు ఔలియాలు.

అల్లాహ్ స్వయంగా, ఈ ఆయత్ తర్వాత, “అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్”, వినండి, ఔలియా అల్లాహ్ కు భయము గానీ, దుఃఖము గానీ ఉండదు అని చెప్పిన తర్వాత, ఔలియా అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అల్లాహ్ తెలియజేశాడు. స్వయంగా ఈ తర్వాతి ఆయత్ లో ఔలియా అల్లాహ్ ను నిర్వచించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఎవరు వారు?

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు విశ్వసించిన వారై, (చెడుల విషయంలో అల్లాహ్‌కు) భయపడేవారై ఉంటారు.(10:63)

ఔలియా అల్లాహ్ అంటే, విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వివరించాడు. అంటే విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారు ఔలియాలు.

అభిమాన సోదరులారా, దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరేవారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడపాలి. ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే. వలియుల్లాహ్ యే అవుతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దైవభీతిపరుడూ, వలియుల్లాహ్ యే అవుతాడు, అల్లాహ్ కు ప్రియతముడే అవుతాడు.

కానీ, ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. సమాజంలో ఏం జరుగుతోంది. జనులు మాత్రం, సమాజంలో ఒక వర్గం వారు, కొందరు, వారు మాత్రం దీనిని ఒక ప్రహసనంగా మార్చారు. వలీ, ఔలియా అల్లాహ్ అంటే దీనిని ఒక ప్రహసనంగా మార్చేశారు. మహిమలు చూపే వారే అల్లాహ్ ప్రియతములు కాగలుగుతారని వారు భాష్యం చెప్పారు. తమ భాష్యాన్ని సమర్థించుకోవటానికి, తాము ఇష్టపడే వలీలకు స్వకల్పిత మహిమలను ఆపాదించారు.

అభిమాన సోదరులారా, ఈ విషయం గమనించండి, అల్లాహ్ సామీప్యం పొందటానికి, మహిమలు ప్రదర్శించటానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా ఏదైనా మహిమ ప్రదర్శితమైతే, అది అల్లాహ్ ప్రణాళిక, దైవేచ్ఛ అని అనుకోవాలి. అంతేగానీ, అది ఆ వలీ తరఫు నుంచి జరిగిందని ఏమీ కాదు.

అలాగే, ఒక ధర్మానిష్ఠాపరుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక దైవభీతిపరుని ద్వారా ఏదైనా మహిమ ప్రదర్శితం కాకపోయినంత మాత్రాన వారి భక్తి తత్పరతకు శంకించనవసరం లేదు, శంకించకూడదు. ఎవరి అంతర్యాలలో ఎంత భక్తి ఉందో, అది అల్లాహ్ కే బాగా తెలుసు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరే వారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడిపే వారు ఔలియా అల్లాహ్ అవుతారు. అంటే ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే, అంటే వలియుల్లాహ్ యే అని అర్థమైంది. అలాగే ఈ మహిమలు, కరామాతులు ప్రదర్శితమైతేనే ఔలియా అల్లాహ్, లేకపోతే లేదు అనేది ఎటువంటి రూల్స్ లేదు. అలా వాటికి సంబంధం అసలు లేదు. మహిమలు, కరామాతులు, అది జరిగినా, జరగకపోయినా, ఔలియా అల్లాహ్ అవ్వటానికి సంబంధము లేదు. ఎవరి ఆంతర్యాలలో ఎంత భక్తి ఉందో అది అల్లాహ్ కే బాగా తెలుసు.

అభిమాన సోదరులారా, ఇది క్లుప్తంగా ఔలియా అల్లాహ్ అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. ఇన్ షా అల్లాహ్, ఇంకా ఇతర విషయాలు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44244

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు [వీడియో]

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు? [ఆడియో & టెక్స్ట్]

బాబాలతో మొరపెట్టుకొనుట పాపమా?? [వీడియో & టెక్స్ట్]