మానవ సేవ – ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడంలో అల్లాహ్ ప్రసన్నత ఇమిడి ఉంది – కలామే హిక్మత్ 

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు-

“ప్రళయదినం నాడు అల్లాహ్ అవశ్యంగా అడుగుతాడు: ‘ఓ ఆదం కుమారా! నేను వ్యాధిగ్రస్తుడినయ్యాను. నువ్వు నన్ను పరామర్శించలేదు’ అతనంటాడు: ‘ఓ!” ప్రభూ! నేను నిన్ను పరామర్శించడమేమిటి? నువ్వైతే సమస్త లోకాల పాలకుడవు?’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడైన సంగతి నీకు తెలీదా? కాని నువ్వతన్ని పరామర్శించలేదు. నువ్వతన్ని పరామర్శించి ఉంటే నన్నక్కడ పొందేవాడివి కాదా?’

ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం అడిగాను. కాని నువ్వు నాకు అన్నం పెట్టలేదు.’ అతనంటాడు : ‘నా దేవా! నేన్నీకు ఎలా అన్నం పెట్టగలను? నువ్వైతే నిఖిల జగతికి పరిపోషకుడివి.’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు భోజనం కోసం నిన్ను మొరపెట్టుకున్న సంగతి నీకు తెలీదా? అయితే నువ్వతనికి భోంచేయించలేదు. ఒకవేళ నువ్వతనికి అన్నం పెట్టివుంటే దాని (ఫలాన్ని) నా దగ్గర పొందేవాడివి కాదా?’

‘ఓ ఆదం కుమారుడా! నేన్నిన్ను మంచినీళ్ళడిగాను. నువ్వు నాకు త్రాపలేదు.’ అతనంటాడు : ‘ఓ నా స్వామీ! నేన్నీకు మంచినీళ్ళు ఎలా త్రాపగలను? నువ్వు సకల లోకాల స్వామివి కదా!’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు నిన్ను నీరు కోసం వేడుకున్నాడు. కాని నువ్వతనికి నీరు త్రాపలేదు. ఒకవేళ నువ్వతనికి నీరు త్రాగించి ఉంటే దాన్ని బహుమతిని నా వద్ద పొందేవాడివి.” (ముస్లిం)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల ప్రేమ | కలామే హిక్మత్ (వివేక వచనం)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మనిషికి తన భార్యాబిడ్డల కంటే, తన సొంత సొమ్ముకంటే, తన వారికంటే ఎక్కువగా నేను ప్రియమైనవాడ్ని కానంతవరకూ అతను విశ్వాసి (మోమిన్) కాలేడు.” (ముస్లిం)

ఈ హదీసులో ”విశ్వాసం” యొక్క ఉన్నతమయిన స్థితి వివరించబడింది. పరలోక సాఫల్యం పొందాలంటే అటువంటి ఉన్నతస్థితికి విశ్వాసం చేరుకోవాలి. అంటే మనం మన స్వయంపై దైవప్రవక్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు మన ప్రాణం కన్నా దైవప్రవక్త ప్రాణమే ప్రీతికరం కాగలగాలి. ఒకసారి హజ్రత్ ఉమర్ మహాప్రవక్తను ఉద్దేశించి, “ఓ దైవప్రవక్తా! నా ప్రాణం తప్ప మిగతా అన్ని విషయాలకన్నా మీరే నాకు ప్రియమైన వారు” అని అన్నారు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”లేదు, ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో అతని సాక్షిగా చెబుతున్నాను – నేను మీకు మీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రియతమం కానంత వరకూ మీరు విశ్వాసి కాలేరు” అని పలికారు. ఉమర్ (రజిఅన్ అన్నారు. “ఇప్పుడు నాకు మీరు నిశ్చయంగా నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రీతికరమైన వారు.” దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “అయితే ఉమర్! ఇప్పుడు మీరు విశ్వాసులు” అన్నారు. (బుఖారి)

సహచరులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల అమితమయిన ప్రేమాభిమానం కలిగి ఉండేవారు. చారిత్రక గ్రంథాలు, హదీసు గ్రంథాలే దీనికి నిదర్శనం. హిజ్రత్ సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్తకు చేసిన సేవలను గురించి ప్రఖ్యాత చరిత్రకారులు, హదీసువేత్త అయిన ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఇలా వ్రాశారు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూబకర్ ఇద్దరూ రాత్రిపూట సూర్ గుహలో చేరారు. అయితే అబూబకర్ గుహలోకి మొదట ప్రవేశించారు. దైవప్రవక్తకు కీడు కలిగించే మృగం గాని, పాముగాని గుహలో ఉండవచ్చునేమోనన్న భయంతో అబూబకర్ తొలుత తానే గుహలో ప్రవేశించారు.”

మరో ఉల్లేఖనం ఏమని ఉందంటే; ఆ గుహకు ఎన్నో కన్నాలు ఉన్నాయి. అబూబకర్ ఆ కన్నాలను మూసివేశారు. ఒక కన్నాన్ని మూసివేయటానికి వీలుపడకపోతే తన కాలిని దానికి అడ్డుగా పెట్టారు. కన్నం లోపలినుంచి విషపు పురుగులు కాటేయసాగాయి. బాధతో ఆయన కళ్ళనుంచి అశ్రువులు రాలాయి. అయినా ఆయన కాలు తీయలేదు.

ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాన్ని అనుసరించాలి. ఎవరయినా, తనకు ప్రవక్త యెడల అమితమయిన ప్రేమ ఉందని చాటుకుంటూ ప్రవక్త సంప్రదాయాన్ని (సున్నత్ను) అవలంబించకపోతే, అతను అసత్యవాది, బూటకపు అనుయాయి అనిపించుకుంటాడు. అల్లాహ్ సెలవిచ్చాడు:

“మేము అల్లాహ్ ను మరియు ప్రవక్తను విశ్వసించామని, విధేయతను స్వీకరించామని వారంటారు. ఆ తరువాత వారిలో ఒక వర్గం విధేయత పట్ల విముఖత చూపుతుంది. ఇటువంటి వారు విశ్వాసులు కారు.” (అన్నూర్ : 47)

విధేయతా మార్గం నుండి వైముఖ్యం ప్రదర్శించిన వారిని విశ్వాస పరిధుల నుండి వేరుచేస్తూ పై ఆయత్ అవతరించింది. మనసులో ఎంత అధికంగా విశ్వాసం ఉంటే అంతే అధికంగా విధేయతా భావం ఉంటుంది.

చెప్పుకోవటానికయితే చాలామంది తమకు ప్రవక్తయెడల అపార గౌరవం, ప్రేమ ఉన్నాయని చెప్పుకుంటారు. అయితే వారి మాటలు ‘విధేయత’ అనే గీటురాయిపై పరికించబడతాయి. ఒకవేళ వారి ఆచరణ ప్రవక్త ఆచరణకు భిన్నంగా ఉంటే వారు చెప్పేదంతా బూటకం అవుతుంది. మనసులో ప్రేమ ఉంటే, నిష్కల్మషమైన విధేయతా భావం ఉంటే అది ఆచరణ ద్వారా తప్పకుండా వ్యక్తమవుతుంది.

”(ఓ ప్రవక్తా!) వారితో అనండి, ‘ఒకవేళ మీరు అల్లాహ్ యెడల ప్రేమ కలిగి ఉంటే నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ అపరాధాలను మన్నిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, ఎంతగానో కరుణించేవాడు కూడాను.” (ఆలి ఇమ్రాన్ : 31)

హాపిజ్ ఇబ్నె హజర్ ఇలా అన్నారు :

ప్రవక్తలందరిపట్ల ప్రేమ కలిగి ఉండటం విశ్వాసానికి ప్రతీక. అయితే మనం అందరికన్నా ఎక్కువ ప్రేమ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల కలిగి ఉండాలి :

ఇమామ్ ఖతాబి ఇలా అంటున్నారు:

ఇక్కడ ప్రేమ అంటే భావం లాంఛన ప్రాయమయిన ప్రేమ కాదు హృదయ పూర్వకమయిన ప్రేమ. మహాప్రవక్త ఏమని ఉపదేశించారంటే, మీరు నా అనుసరణలో మీ మనోకాంక్షల్ని జయించనంతవరకు, నా సంతోషానికి మీ సుఖసంతోషాలపై ప్రాధాన్యత ఇవ్వనంతవరకూ – ఒకవేళ మీకు నష్టం కలిగినాసరే, చివరకు మీరు అమరగతి నొందవలసి వచ్చినా సరే – మీరు నా సంతోషం కొరకు పాటుపడనంతవరకూ మీకు నాపై గల ప్రేమ ధృవీకరించబడదు.

ఖాజీ అయాజ్ మరియు ఇబ్నె బతాల్ తదితరులు ఇలా అభిప్రాయపడ్డారు : ప్రేమ మూడు రకాలు :

(1) గౌరవనీయమయిన ప్రేమ. ఇది తండ్రిపట్ల ఉంటుంది.
(2) అవ్యాజానురాగాలతో కూడిన ప్రేమ. ఇది సంతానంపై ఉంటుంది.
(3) స్వాభావికమయిన ప్రేమ. ఇది ఒక మనిషికి మరో మనిషిపై సాధారణంగా ఉంటుంది.

ఈ హదీసులో మహాప్రవక్త అన్ని రకాల ప్రేమలను ప్రస్తుతించారు.

ఈ హదీసు ఆలోచన, యోచనల వైపు దృష్టిని మరలిస్తుంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా ప్రాప్తమయ్యే మహత్పూర్వకమయిన ప్రయోజనాలకు మూలం ఆలోచన మరియు యోచనలే. ప్రవక్త సహచరులు ఏ విషయంపైనయినా ఎంతో సావధానంగా ఆలోచించేవారు. ప్రతి విషయాన్ని తరచి చూసేవారు. అందుచేత వారి విశ్వాసం ఎంతో దృఢమయ్యింది. ఈ హదీసు ద్వారా ముస్లిమైన ప్రతి ఒక్కరికీ లభించే సందేశం ఏమంటే సకల ప్రేమలకన్నా ప్రవక్త యెడల ప్రేమకు అతను ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో తాను ఏ స్థాయిలో నున్నది అతను సతతం ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

యదార్థానికి మీ కొరకు దైవప్రవక్త (విధానం)లో అత్యుత్తమ ఆదర్శం ఉంది | కలామే హిక్మత్

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ కథనం ప్రకారం ముగ్గురు మనుషులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ధర్మపత్నుల ఇళ్ళకు వచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఆరాధనల గురించి వివరాలు అడిగి తెలుసుకోసాగారు. వారికా వివరాలు తెలుపగా, అవి కొద్దిగేనని వారనుకున్నారు. తరువాత వారిలా అనసాగారు : “మహాప్రవక్త ఎక్కడా? మేమెక్కడ? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ముందూ వెనుకటి పొరపొచ్చాలన్నీ క్షమించబడ్డాయి.” తరువాత వారిలో ఒకరు – “నేను ఇకనుండి రాత్రంతా నమాజ్లోనే గడుపుతాను” అని అంటే, మరొకరు, “నేను నిత్యం ఉపవాసం పాటిస్తాను, ఏ ఒక్క రోజు కూడా ఉపవాసం మానను” అన్నారు. ఇంకొకరు, “నేను స్త్రీలకు దూరంగా ఉంటాను, అసలెప్పుడూ వివాహమే చేసుకోను” అని ఖండితంగా చెప్పారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విషయం తెలుసుకుని ఇలా ప్రబోధించారు : “మీరీ విధంగా అంటున్నారు. వినండి – దైవసాక్షిగా! నేను మీకన్నా అధికంగా దైవానికి భయపడేవాడిని. అయితే నేను ఉపవాసం పాటిస్తాను, విరమిస్తాను కూడా. నమాజ్ చేస్తాను, నిద్రపోతాను కూడా. ఇంకా స్త్రీలను కూడా వివాహమాడతాను. ఎవరు నా విధానం పట్ల విసుగెత్తాడో అతనితో నాకెట్టి సంబంధం లేదు.” (బుఖారి)

అల్లాహ్ ప్రేమ | కలామే హిక్మత్

అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు :

“అల్లాహ్ తన దాసుల్లో ఎవరినయినా ఇష్టపడినపుడు జిబ్రయీల్నుపిలిచి, ‘అల్లాహ్ ఫలానా దాసుడ్ని ఇష్టపడుతున్నాడు. కనుక మీరు కూడా అతన్నిప్రేమించండి’ అనంటాడు. జిబ్రయీల్ అతన్ని ప్రేమించటం మొదలెడతారు.తరువాత ఆయన ఆకాశవాసుల్లో ప్రకటన గావిస్తూ ‘అల్లాహ్ ఫలానా దాసుడ్నిఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు కూడా అతన్ని ప్రేమించండి’ అని కోరారు.ఆకాశవాసులు అతన్ని ప్రేమించసాగుతారు. ఇంకా భూవాసులలో అతని పట్లఆదరాభిమానం కలుగజేయబడుతుంది.” (ముస్లిం)

ఈ హదీసులో అల్లాహ్ లోని ప్రేమైక గుణం ప్రధానంగా చెప్పబడింది. దైవ ప్రేమకు అర్హుడయ్యే దాసుడెవరు? దీని సమాధానం సుబాన్ (రదియల్లాహు అన్హు) గారి హదీసు ద్వారాచాలా వరకు లభిస్తుంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:

దాసుడు దైవప్రసన్నతను బడయటంలో ఎంతగా లీనమై పోతాడంటే, అల్లాహ్ తన దూతతో,‘జిబ్రయీల్! నా ఫలానా దాసుడు నన్ను మెప్పించగోరుతున్నాడు. ఓ జిబ్రయీల్!నా ఫలానా దాసుడు నన్ను ప్రసన్నుడ్ని చేయదలుస్తున్నాడు. వినండి! అతని పై నాకారుణ్యం అలుముకుంది’ అని అంటాడు. అప్పుడు జిబ్రయీల్ ‘ఫలానా దాసునిపై దైవ కారుణ్యం అవతరించుగాక!’ అని అంటారు. ఆకాశ వాసులు కూడా ‘అతనిపై దైవ కారుణ్యం వర్షించుగాక!’ అని ఎలుగెత్తి చాటుతారు.” (అహ్మద్)

దైవ ప్రసన్నతాన్వేషణ అనేది ఆయన నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను పాటించటం ద్వారా, అదనపు ఆరాధనల ద్వారా నెరవేరుతుంది. అలాగే అధర్మమయిన వాటికిదూరంగా మసలుకోవటం, నిష్ఠను ధర్మపరాయణతను అలవరచుకోవటం కూడాఅవసరం. ఈ సందర్భంలో మహాప్రవక్త ఈ ఆయత్ను పఠించినట్లు తిబ్రానీలోఉంది :

“ఎవరయితే విశ్వసించారో, సత్కార్యాలు చేశారో వారికోసంకరుణామయుడు నిశ్చయంగా త్వరలోనే ప్రేమను సృజిస్తాడు.”(మర్యమ్ – 96)

అంటే విశ్వాసుల కొరకు అల్లాహ్ హృదయాలను మెత్తబరుస్తాడు. వారి యెడల ప్రజల మనస్సులలో ప్రేమను పుట్టిస్తాడు.

యజమాని తన దాసుడ్ని ప్రేమించటమనేది ఆయన స్థాయికి తగిన విధంగా ఉంటుంది. యదార్థానికి నిజ యజమాని స్థాయికి ఎవరూ చేరుకోలేరు. అలాగే ఆయన గుణగణాలను ఎవరూ విశ్లేషించనూ లేరు. అయినప్పటికీ అంతటి శక్తిమంతుడు సద్వర్తనుడైన దాసుడ్ని ప్రేమిస్తాడనేది యదార్థం. అందులో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు.

ప్రేమ ఒక అనిర్వచనీయమైన భావన. అది కేవలం ఆచరణ లేదా ప్రవర్తన ద్వారానే వ్యక్తమవుతుంది. ఆకాశవాసులు భూవాసులు కూడా పరస్పరం ప్రేమించుకుంటారు.ఎదుటివాని శ్రేయాన్ని అభిలషించటం, విపత్తుల బారినుండి అతన్ని కాపాడటం, ఆపదలో ఆదుకోవటం ఇత్యాది విధాలుగా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఇక ఆకాశ వాసుల ప్రేమ ఎలా ఉంటుందంటే, వారు మంచివారైన దాసుల మన్నింపునకై దైవాన్ని ప్రార్థిస్తారు. వారి మనసులలో సవ్యమైన భావాలను కలిగిస్తారు.

“అతని పట్ల ఆదరాభిమానం కలుగ జేయబడుతుంది” అంటే భావం భూవాసులు కూడా అతనంటే ఇష్టపడతారని. ఈ హదీసు ద్వారా సజ్జనులను ప్రేమించడం అల్లాహ్ ప్రేమకు తార్కాణమని కూడా విదితమవుతోంది. “మీరు ధరణిలో అల్లాహ్ కు సాక్షులు” అని మహాప్రవక్త తన సహచరుల నుద్దేశించి చెప్పారు.

అల్లాహ్ ప్రేమకు ప్రతిరూపం. ప్రేమ ఆయన గుణగణాలలో ప్రముఖమైంది. దాని అన్వేషణకు పూనుకున్న వారికి, దానికోసం పరితపించిన వారికే ఆ భాగ్యం ప్రాప్తిస్తుంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

పరాచికానికైనా సరే మీలో ఎవ్వరూ మీ సోదరుని వైపు ఆయుధం ఎక్కుపెట్టరాదు | కలామే హిక్మత్

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు .

“మీలో ఎవ్వరూ మీ సోదరుని వైపు ఆయుధం ఎక్కుపెట్టరాదు.బహుశా షైతాని అతని చేయిని ఝుళిపించవచ్చు. ఇంకా, అది నరక కూపంలోపడిపోవచ్చు.” (ముస్లిం)

ఈ హదీనులో ముస్లిం హక్కుల గురించి నొక్కి పలకడం జరిగింది. ఏ ముస్లిమునైనా భయపెట్టడం, కలవరానికి గురిచెయ్యడం, లేదా అతను నొచ్చుకునేలా వ్యవహరించడం పట్ల వారించ బడింది.

మీ సోదరుని వైపు ఆయుధాన్ని ఎక్కు పెట్టరాదు.” ఇక్కడ సోదరుడంటే ముస్లిం అన్నమాట. ముస్లిములు పరస్పరం అన్నదమ్ములు. అల్లాహ్ సెలవిచ్చాడు :”ఇన్నమల్ మోమినీన ఇఖ్వ” (విశ్వాసులు పరస్పరం సోదరులు). ఆటపాటల్లో, పరాచి కానికయినా భయపెట్టే సంకల్పంతో కరవాలాన్ని, ఖడ్గాన్ని, లేక మరే ప్రమాదకరమైన ఆయుధాన్నయినా లేపటం హరాం (నిషిద్ధం).

“షైతాన్ అతని చేయిని ఝుళిపించవచ్చు” అంటే చేయి జారినా చేయి విసిరినా చేతిలోని ఆయుధానికి ఎదుటి వ్యక్తి గురికావచ్చు. ఇది ఘోర అన్యాయం అవుతుంది.ఒక ముస్లింను అకారణంగా చంపిన కారణంగా ఇతను నరకాగ్నికి ఆహుతి అవుతాడు.ఎందుకంటే అన్యాయంగా, అధర్మంగా ఏ ముస్లిమునైనా వధించటం మహాపాతకం.

అల్లాహ్ సెలవిచ్చాడు :

“ఉద్దేశ్యపూర్వకంగా ఎవడైతే ఒక విశ్వసించిన వాణ్ణి చంపుతాడో అతనికి బహుమానం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమయిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.(అన్ నిసా: 93)

ఏ ముస్లిం హత్యకయినా, గాయాని కయినా కారణభూతమయ్యే ప్రతి విధానాన్ని, ధోరణిని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధంగా (హరామ్)గా ఖరారు చేసినట్లు అసంఖ్యాకమయిన హదీసుల ద్వారా విదితమవుతోంది.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది :

ఎప్పుడయినా ఏ ముస్లిం అయినా మరో ముస్లిం వైపునకు ఇనుప ముక్కతో సంజ్ఞ చేస్తే దైవదూతలు అతన్ని శపిస్తారు – ఒకవేళ అతను సంజ్ఞ చేసిన వ్యక్తి అతని తోబుట్టువు అయినాసరే.”

ఇబ్నుల్ అరబీ ఏమంటున్నారో చూడండి – ‘కేవలం ఇనుప ముక్కతో సంజ్ఞ చేసినమాత్రానికే అతను శాపగ్రస్తుడయితే, ఇక ఆ ఇనుపముక్కతో ఎదుటి ముస్లింపైదాడి జరిపితే, అప్పుడతని పర్యవసానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో?’

వేళాకోళంగానే అయినా ఆయుధంతో సైగ చేసిన వ్యక్తి ధూత్కారిగా పరిగణించబడటానికి కారణమేమంటే, అతని, ఈ చేష్ట మూలంగా ఎదుటి వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. అదే ఒకవేళ అతను నిజంగానే ఎదుటి వ్యక్తికి కీడు తలపెట్టే ఉద్దేశ్యంతో చేస్తే అది మహాపరాధమే అవుతుంది. అందుకే ఒరలేని (నగ్న) ఖడ్గాలు ఇచ్చిపుచ్చుకోరాదని అనబడింది. అలా ఇచ్చిపుచ్చు కొంటున్నప్పుడు ఏమరుపాటు వల్ల ఖడ్గం చేజారి పోయి హాని కలిగే ప్రమాదముంది.

జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బృందం వైపుగా వెళుతుండగా, వారు ఒరలేని ఖడ్గాలను మార్పిడి చేసుకుంటూ కనిపించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఇలా మందలించారు- “ఇలాంటి చేష్ట చేయరాదని నేను మీకు చెప్పలేదా? మీలో ఎవరయినా ఖడ్గాలుమార్చుకుంటున్నప్పుడు ఒరలో పెట్టి మరీ ఇవ్వాలి.” (అహ్మద్, బజార్)

నేటి ఆధునిక కాలంలో ఎవరయినా వేళాకోళానికయినా సరే – రివాల్వర్ను ఎదుటివారికి గురిపెట్టడం, గుళ్లు నింపిన రివాల్వర్తో అనుభవం లేకుండా ప్రాక్టీసు చేయటం కూడా హదీసులో ప్రస్తావించబడిన ఖడ్గాల మార్పిడిలాంటిదే.ముక్తసరిగా హదీసు సారాంశం ఏమంటే ప్రతి ముస్లిం ప్రాణం అత్యంత విలువైనది, గౌరవప్రదమైనది. కాబట్టి అకారణంగా, అన్యాయంగా ఒక ప్రాణానికి హాని తలపెట్టడం దైవ సమక్షంలో పెద్ద నేరం అవుతుంది. అటువంటి వారి నుండి ప్రళయ దినాన కఠినంగా లెక్క తీసుకోవటం జరుగుతుంది.

[PDF డౌన్ లోడ్ చేసుకోండి]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

డౌన్లోడ్ – కలామే హిక్మత్ (వివేక వచనం) -1
రచయిత : సఫీ అహ్మద్ మదనీ
[88 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

ముందుమాట – [డౌన్లోడ్ PDF]