ముస్లింలు విధిగా ఒకరినొకరు ప్రేమించాలి (Muslims loving each other)

హదీథ్׃ 14

وجوب محبة المسلم لأخيه

ముస్లింలు విధిగా ఒకరినొకరు ప్రేమించాలి (ప్రేమాభిమానలతో గౌరవించాలి)

عَنْ أَنَسٍ رضى الله عنه عَنِ النَّبِىِّ ^ قَالَ: لَا يُوْمِنُ أَحَدَكُمْ حَتَّى يُحِبَّ لِأَخِيْهِ مَا يُحِبُّ لِنَفْسِهِ (رواه البخاري)

అన్ అనస్ ఇబ్నె మాలికి రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఖాల, ″లా యూమిను అహదకుమ్ హత్తా యుహిబ్బ లిఅఖీహి, మా యుహిబ్బు లి నఫ్ సిహి″

తాత్పర్యం:- అన్ = ఉల్లేఖన, అనస్ ఇబ్నె మాలికి = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క సహచరుడు(సహాబి), రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక, అనిన్నబియ్యి = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రకటించారు,  ఖాల = తెలిపారు, లా = కాదు,  యూమిను = విశ్వాసి , అహదకుమ్ = మీలో ఎవరూ, హత్తా = అప్పటి వరకు,  యుహిబ్బ = కోరుకోవటం, లి = కోసం, అఖీహి = తోటి సోదరుడి, మా = ఏదైతే, యుహిబ్బు = కోరుకోవటం, లి = కోసం, నఫ్సిహి = తనకోసం .

అనువాదం:-అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా అన్నారు “మీలో ఒక్కరు కూడా అప్పటి వరకూ నిజమైన విశ్వాసి కాజాలరు. (ఎప్పటివరకూ అంటే) మీరు మీ కొరకు దేనినైతే ఇష్టపడతారో మీ తోటి ముస్లిం సోదరునికి కూడా (అలాంటిదే ఉండాలని) ఆవిధంగానే ఉండాలని (మనస్పూర్తిగా) కోరుకోనంతవరకు.” సహీబుఖారి హదీథ్ గ్రంథం

వివరణ:- ఈ హదీథ్, ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరులను విధిగా ప్రేమించాలనీ, గౌరవించాలనీ తెలియజేయు చున్నది. ఇస్లాంలో అనుమతించబడిన మేరకు – మన ముస్లిం సోదరుల ఆశలు, ఆశయాలు సాకారం అయ్యేలా మనం వారికి అన్ని విధాలా సహాయం చేయాలి, సహకరించాలి. ఈ హదీథ్ సోదర ముస్లింల పట్ల సమానత్వం వైపునకు, వారి పట్ల మసం చూపవలసిన పరస్పర గౌరవం, వినయం, వినమ్రత వైపుకు మన దృష్టిని మరల్చుచున్నది. మనలో నుండి తోటివారి పట్ల ద్వేషం, అసూయ, ఏహ్యభావం, హీనభావం మరియు మన తోటి ముస్లిం సోదరుల పట్ల మోసపూరిత ఆలోచనలను దూరం చేసుకోనంత వరకు, వారిపట్ల (సహజసిద్ధమైన) ప్రేమ, అభిమానం, గౌరవం మనలో పుట్టుకురావు అని గమనించాలి.

ఈ హదీథ్ ఆచరించడం వలన కలిగే లాభాలు:-

  1. మనతోటి ముస్లిం సోదరులను ప్రేమించడం లేక అసహ్యించుకోవడం (అంటే మన అంతరంగ మరియు బహిర్గత ప్రవర్తన) అనేవి అల్లాహ్ పట్ల మనలోని సంపూర్ణమైన విశ్వాసాన్ని పరీక్షించే గీటురాళ్ళ వంటి విషయాలలో ఇవి కూడా ఉన్నాయని గమనించాలి.
  2. తోటివారిపట్ల అసూయా, ద్వేషభావాలు – అల్లాహ్ పట్ల మనలోని విశ్వాసాన్ని తగ్గిస్తాయి.
  3. మన తోటివారు మంచిగా ఉండాలని కోరుకోవడం, అందుకని వారికి సహాయసహకారాలు అందజేయడం, వారిని చెడు మరియు తప్పుడు మార్గాల నుండి వారించడం అనేవి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే మనలో వారిపట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయనడానికి నిదర్శనం.
  4. ఇతరుల బాగోగుల గురించి ఆలోచించక, అన్ని మంచి విషయాలు మనకే సొంతం అవ్వాలనుకునే  స్వార్ధపరత్వం, నీచమనస్తత్వం గురించి ఈ హదీథ్ మనల్ని హెచ్చరిస్తున్నది.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:- ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పేరు అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహి అన్హు. వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సేవలో తన జీవితాన్ని గడిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క హదీథ్ లు ఎక్కువగా ఉల్లేఖించిన వారిలో వీరి పేరు కూడా ఉంది.

ప్రశ్నలు

  1. మీరు మీ కొరకు దేనినైతే ఇష్టపడతారో మీ తోటి ముస్లిం సోదరునికి కూడా     _____________________________________ (మనస్పూర్తిగా) కోరుకోవాలి.
  2. ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరులను_____ప్రేమించాలి మరియు గౌరవించాలి.
  3. సోదర ముస్లింల పట్ల సమానత్వం, పరస్పర గౌరవం, వినయం, వినమ్రతం చూపటమనేది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పాటించాలా? లేక వారి నుండి తమ అవసరాలు తీర్చుకోవడానికా?
  4. ఈ హదీథ్  అమలు చేయటం ద్వారా సమాజంలో ఎటువంటి మార్పులు వస్తాయి?

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

%d bloggers like this: