తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి

బిస్మిల్లాహ్

22 వ అధ్యాయం
తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి.
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం చూడండి:

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).

అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్‌ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్‌ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).

అలీ బిన్‌ హుసైన్‌ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని  నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్‌ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:

“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్‌ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్‌ ముఖ్ తార్ ).

ముఖ్యాంశాలు:

1. సూరయే  తౌబా ఆయతు యొక్క భావం.

2. షిర్క్‌ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.

3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.

4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.

5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.

6. నఫిల్‌ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.

7. స్మశానంలో నమాజ్‌ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.

8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్‌ జఖ్‌)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్‌, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్  వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్‌ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.

సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్‌ భద్రతకై షిర్క్‌ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.


ఇది ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం
https://youtu.be/dZZa0Z0Oh8Y (3 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.

సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.

మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”

హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.


ఇతరములు:

స్వలింగ సంపర్కం (లవాతత్)! దాని పర్యవసానం! [వీడియో]

బిస్మిల్లాహ్

(HomoSexuality and its Evil effects)

[41 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమో సెక్సువల్స్) అంటారు. అనగాఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో సంభోగించటం.

దైవ ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు ప్రపంచంలోనే అందరికన్న ముందుగా స్వలింగ సంపర్కమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడ్డారు. ఆ ముదనపు జాతి పేరు మీదగానే స్వలింగ సంపర్కాన్ని ‘లవాతత్‘ అని పేర్కొనటం జరుగుతుంది.

[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَتَأْتُونَ ٱلْفَٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍۢ مِّنَ ٱلْعَٰلَمِينَ إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوهُم مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ

మేము లూతు (అలైహిస్సలామ్‌)ను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, ”మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే!”అయ్యో! మీరు స్త్రీలను వదలి [96], పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! [97] అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” [98] అని అన్నారు. దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే: ”వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్లగొట్టండి. మహా పవిత్రులట వీళ్ళు. [99](Quran – 7 : 80-82)

[96] అంటే మీరు స్త్రీలను వదిలి లైంగిక కోర్కేల్ని తీర్చుకోవటానికి ప్రకృతి ధర్మానికి విరుద్దంగా సిగ్గులేకుండా మగవాళ్ళు దగ్గరికి పోతారా?! మీరు ఒడిగడుతున్న ఈ చేష్ట అత్యంత హేయమైనది, విరుద్దమైనది. జంతువుల్లో సయితం లేని ఈ పాడు బుద్ది మీకెలా పుట్టిందీ?

[97] మగవారి లైంగిక వాంఛల పరిపూర్తికై, వారి తృప్తికై, సౌఖ్యానికై దేవుడు ఆడవారిని పట్టించాడు. కాని ఈ దుర్మార్గుల స్వభావమే చెడిపోయింది. మీరు స్త్రీలను వదిలి పురుషుల మల విసర్జనా మార్గాన్ని వాడుకోసాగారు.

[98] ప్రకృతి విరుద్ధమైన ఈ పని బరితెగించిన చేష్టగా, దైవాదేశాల అతిక్రమణగా పేర్కొనబడింది. అయితే నాగరికతా ధ్వజవాహకులమని చెప్పుకునే పాశ్చత్య దేశాల వారు నేడు ఈ సిగ్గుమాలిన పనిని చట్టబద్దంగా చేసుకుంటున్నారు. పైగా ఈ లతుకోరు పనిని ‘ప్రాధమిక హక్కు’ (fundamental right) గా ఖరారు చేసుకుంటున్నారు. అంటే పాశ్చాత్య దేశాల వారి దృష్టిలో ఇప్పుడది నేరమూ కాదు. చెడు పని కూడా కాదు. ఎందుకంటే వారి నాగరికత బాగా ‘ముదిరి’పోయింది.

[99] నీతిబాహ్యత, దుర్మార్గం, సామాజిక రుగ్మతలు వ్రేళ్లూనుకుపోయిన సమాజంలో సజ్జనుల హితబోధలు ఒక్కోసారి వింతగా తోస్తాయి. దైవప్రవక్త హజ్రత్ లూత్ అలైహిస్సలాం మరియు ఆయన వెంటనున్న కొద్దిమంది సౌశీల్యవంతులు ఆ దుర్మార్గుల కంటికి వింత మనుషుల్లా కనిపించారు. తమ సొసైటిలో ఈ పవిత్రులకు చోటు లేదు అని తెగేసి చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వానికి సిగ్గూ ఉండదు, భయమూ ఉండదు అన్న దానికి ఇదొక నిదర్శనం.మంచి వైపుకు, సౌశీల్యం పారిశుద్ద్యాల వైపుకు ఆహ్వానించే వారు వారి దృష్టికి అధములుగా కనిపిస్తారు. మంచివారినే వారు చులకన చేస్తారు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلَمَّا جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَٰذَا يَوْمٌ عَصِيبٌ وَجَاءَهُ قَوْمُهُ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا يَعْمَلُونَ السَّيِّئَاتِ ۚ قَالَ يَا قَوْمِ هَٰؤُلَاءِ بَنَاتِي هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ فِي ضَيْفِي ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ قَالُوا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ

మేము పంపిన దూతలు లూత్‌ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకు పోతూ, ”ఇది చాలా గడ్డురోజు” [125] అని అన్నాడు. (మరో వైపునుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటినుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు.[126] ”నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు [127] ఉన్నారు. మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వులపాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా?’‘ [128] అని లూతు నచ్చజెప్పాడు. ”నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!” [129] అని వారు సమాధానమిచ్చారు.”(అయ్యో!)మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!” [130] అని లూత్‌ అన్నాడు. అప్పుడు దైవదూతలు “ఓ లూత్‌! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీ దాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటివారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీ భార్య; వారందరికీ పట్టే గతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయ సమయం దగ్గరలో లేదా?” [131] అని పలికారు. మరి మా ఉత్తర్వు(ను అమలుపరచే సమయం) రాగానే ఆ బస్తీని తల క్రిందు లుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము. అవి నీ ప్రభువు తరపున గుర్తు వేయ బడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు. [132](సూరా హూద్  11 :77 – 83)

[125] హజ్రత్‌ లూత్‌ (అలైహిస్సలాం) అంతగా మనస్తాపం చెందడానికి కారణం ఏమిటంటే దైవదూతలు మీసాలు కూడా మొలవని నవయువకుల రూపంలో వచ్చారు. తన జాతి పురుషుల సిగ్గుమాలిన చేష్టల గురించి ఆయనకు తెలుసు కాబట్టి  పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆయన వ్యాకులతకు లోనయ్యారు. వచ్చిన ఆ అందమైన నవయువకులు అతిథులు కానేకారనీ, వారు దైవశాసనాన్ని అమలు పరచడానికి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు.

[126] లూత్‌ ఇంటికి అందమైన కొందరు యువకులు వచ్చి ఉన్నారని తెలియగానే ఆ స్వలింగ సంపర్క రోగగ్రస్తులు ఉండబట్టలేక పరుగెత్తుకుని వచ్చారు. ఆ యువకులను తమ తమ ఇళ్లకు తీసుకుపోయి వాళ్ళను ఆ పాడుపని కోసం ఉపయోగించు కోవాలనుకున్నారు.

[127] అంటే – లైంగిక కోర్కెల్ని తీర్చుకోవాలన్నదే మీ ఉద్దేశ్యమైతే అందుకోసం ‘నా కూతుళ్లు ఉన్నారు. వారిని వివాహమాడండి. మీ కోర్కెల్ని ధర్మబద్ధంగానూ, సహజపద్ధతిలోనూ తీర్చుకోండి. ఇదే మీ కొరకు అన్ని విధాలా శ్రేయస్కరం అని లూత్‌ చెప్పదలిచారు. ఇక్కడ ‘కూతుళ్లు’ అంటే ఎవరు? తన జాతికి చెందిన మహిళలను ఆయన కూతుళ్లుగా చెప్పుకున్నారని చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దైవప్రవక్త తన జాతివారి కొరకు పితామహుడు వంటివాడు. అలా చెప్పటంలోని ఆయన ఆంతర్యం ఏమిటంటే సమాజంలో ఇంతమంది ఆడపిల్లలు ఉండగా మీకేం పోయే రోగం వచ్చింది? మీరు ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మీ సహజ కోరికల్ని తీర్చుకోవచ్చుకదా! (ఇబ్నె కసీర్‌).

[128] ఏమిటీ? నా ఇంటికి వచ్చిన అతిథులతో దుర్వవహారం చేసి నన్ను అవమానాలపాలు చేస్తారా? మీలో ఆ మాత్రం అర్ధం చేసుకునే వారు లేరా? అతిథి మర్యాదకు కళంకం తెస్తారా? మీ దుష్ట బుద్ధిని అడ్డుకునే సజ్జనుడు మీలో ఒక్కడూ లేడా? దైవప్రవక్త లూత్‌ ఇంతగా కలత చెందడానికి కారణం అప్పటివరకూ ఆయన ఆ అతిథులను మానవ మాత్రులుగా తలపోయటమే. ఆ వచ్చిన వారు మనుషులు కారనీ, దుర్మార్గుల భరతం పట్టడానికి దివి నుంచి భువికి దిగివచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు. వారు దైవదూతలన్న సంగతి ఆయనకు ముందు నుంచే తెలిసి ఉంటే కలవరం చెందేవారు కారు. దైవప్రవక్తలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రబల తార్మాణమే.

[129] అంటే ఆ దుర్మార్గులు సహజమైన, ధర్మసమ్మతమైన ఒక వద్ధతిని ్రోసివుచ్చి అసహజమైన, అహేతుకమైన, అధర్మమైన చేష్టను అవలంబించారు. పరమ జుగుప్సాకరమైన ఈ పనిలో లూత్‌ జాతివారు ఎంత ముందుకు వెళ్ళిపోయారో, వారి కళ్లు ఎలా మూసుకుపోయాయో దీన్నిబట్టి బోధపడుతోంది.

[130] “బలం” అంటే బాహుబలం, ఒనరులు, సంతానబలం అని భావం. “దృథఢమైన ఆధారం” అంటే తనను సమర్థించే తెగగానీ, వంశంగానీ ఉంటే వారిని ఆశ్రయించే వాడినే! అన్నది ఆయన ఆవేదన. ఎంతటి నిస్సహాయస్థితిలో ఆయన ఈ మాటలన్నారో అర్థమవుతోంది. నన్ను ఆదుకునేవారు, నా తరఫున మాట్లాడేవారు ఈ రోజు ఉండి ఉంటే అతిథుల విషయంలో నేను అవమానం పాలు కాకుండా ఉండేవాడినే! అని ఆందోళన చెందారు. దైవప్రవక్త హజత్‌ లూత్‌ (అలైహిస్సలాం) గారి ఈ ఆకాంక్ష దైవంపై భారం మోపే విషయానికి విరుద్ధం కాజాలదు. ప్రాపంచికంగా మనిషి తన రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ పైన దైవంపై భారం వేయాలి. ఇదే సరైనది. అంతేగాని చేతులు ముడుచుకు కూర్చుని, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అంటే అసలుకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి హజ్రత్‌ లూత్‌ (అలైహిస్సలాం) పలుకుల్లో విపరీతమైన అంశం ఏమీ లేదు. ఈ సంఘటన ద్వారా విదితమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అలాగే వారు సర్వాధికారాలు కలిగి ఉండరు. దైవప్రవక్తలకు సర్వాధికారాలు ఉండి ఉంటే ఈ సందర్భంగా హజ్రత్‌ లూత్‌ అత్యంత దీనంగా ఇలా చెప్పుకుని ఉండేవారు కారు. ఈ రోజుల్లో కొందరు దైవప్రవక్త (స)కు సర్వాధికారాలుండేవని నమ్ముతున్నారు. ఈ నమ్మకం సరైనది కాదు. పై ఆయతు వారి ఈ నమ్మకాన్ని ఖండిస్తున్నది.

[131] ఒకవైపు లూత్‌ గారి దీనావస్థను, మరోవైపు ఆ జాతిజనుల విశ్చంఖలత్వాన్ని గమ నించిన దైవదూతలు జోక్యం చేసుకోవలసిన తరుణం వచ్చేసింది. “ఓ లూత్‌! మీరు ఆందోళన చెందనవసరం లేదు. వాళ్లు మా దాకా కాదుకదా, కనీసం మీ దాకా కూడా రాలేరు. రాత్రి పొద్దుపోయాక మీ మనుషులను వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెల్లవారగానే ఈ పట్టణవాసులు నాశనం చేయబడతారు” అని వారు ధైర్యం చెప్పారు.

[132]“అవి” అంటే ఏవి? ఆయా ఊళ్లను ధ్వంసం చేయటానికి వాటిపై విసరబడిన “రాళ్ళు’ అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడగా, ఈ ఆయతులో “అవి” అనే సర్వనామం నాశనమైన ఆ ‘ఊళ్ళ’నే సూచిస్తున్నదని మరికొంతమంది అభిప్రాయ పడ్డారు. ఆ ఊళ్లు సిరియా-మదీనాల మధ్య ఉండేవి. “దుర్మార్గులు” అంటే మక్కాకు చెందిన సత్యతిరస్కారులు. వెనుకటి జాతులకు పట్టిన దుర్గతే మీకూ పడుతుంది జాగ్రత్త! అని హెచ్చరించటం ఈ వాక్యాల ప్రధాన ఉద్దేశం.

ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు స్వలింగ సంపర్కంమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడటంతో వారిపై దేవుడి శిక్షలు దాపురించాయి!.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلَمَّآ أَن جَآءَتْ رُسُلُنَا لُوطًۭا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًۭا وَقَالُوا۟ لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا ٱمْرَأَتَكَ كَانَتْ مِنَ ٱلْغَٰبِرِينَ

మరి మా దూతలు లూత్‌ (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు [49]. అప్పుడు వారిలా అన్నారు: “నువ్వు భయపడకు. కలత చెందకు. మేము నీ భార్యను తప్ప [50] – నిన్నూ, నీ పరివారాన్నీ కాపాడుతాము. ఎందుకంటే ఆమె (శిక్షను అనుభవించటానికి) వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది.” “మేము ఈ పట్టణవాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము.[51] (ఆ విధంగా) మేము ఆ పట్టణాన్ని బుద్ధి జీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా [53] చేసాము(సూరా అంకబూత్ 29 : 33 – 35)

[50] హజ్రత్ లూత్ అలైహిస్సలాం పరిస్దితిని అర్ధం చేసుకున్న దైవదూతలు భీతి చెందరాదని, దుఃఖించరాదని ఆయన్ని ఓదార్చారు. తాము దుష్టులను శిక్షించటానికి పంపబడిన దైవదూతలం అని తెలిపారు. అయితే దగాకోరుగా వ్యవహరించిన ఆయన భార్యకు సయితం శిక్షపడటం ఖాయమని ఆ సందర్భంగా దైవదూతలు స్పష్టం చేశారు.

[51] ఆకాశం నుంచి అవతరించిన ఆ శిక్ష ఎటువంటిదంటే దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం వారి నివాస స్ధలాలను భూమినుంచి పెళ్ళగించి, ఆకాశం దాకా ఎత్తుకెళ్ళి అమాంతం క్రింద పడేశారు. ఆ తరువాత వారిపై కంకర రాళ్ళ వర్షం కురిపించబడింది. ఆ స్ధలాన్ని దుర్వాసన వచ్చే జలసంధి (మృత సముద్రం)గా మార్చివేయటం జరిగింది. (ఇబ్నె కసీర్)

[53] ఒకవైపు నుంచి రాళ్ళ వర్షం, మరో వైపు నుంచి ఇళ్ళు తలక్రిందులవటం, ఆ తరువాత ఆ ప్రదేశం అంతా దుర్వాసనతో కంపుకొట్టడం ఇదంతా ఒక గుణపాఠ సూచనే. ఆ ప్రదేశం మృత సముద్రంగా వ్యవహరించబడుతోంది. కాని విజ్ఞులు మాత్రమే ఇలాంటి ఘటనల నుండి గుణపాఠం గ్రహిస్తారు.

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُشْرِقِينَ فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ

సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది [46].చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము [47]. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము [48]. నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు [49] ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ పట్టణం (జనులు) వచ్చిపోయే రహదారిపైనే ఉంది  [50] (సూరా అల్ హిజ్ర్ – 15 :73 – 75)

[46] సూర్యుని లేలేత కిరణాలు పడుతున్న సమయంలో ఒకే ఒక్క శబ్దం వచ్చింది. అత్యంత భయంకరమైన ఈ కేక హజ్రత్‌ జిబ్రీల్‌ (అలైహిస్సలాం)దని కొంతమంది అభిప్రాయపడ్డారు.

[47] వారి నివాస స్థలాలు భూమి నుంచి ఆకాశానికి ఎత్తి, వాటిని తలక్రిందులుగా చేసి విసిరివేయటం జరిగిందని అనబడుతోంది. ఆ విధంగా వారు తమ ఇల్లూ వాకిలి సమేతంగా తలక్రిందులుగా చేసివేయబడ్డారు. అయితే కేవలం పై కప్పులతో సహా ఇళ్లు కూలిపోవటం మాత్రమే దీని భావమని మరికొందరంటారు.

[48] ఆ తర్వాత వారిపై ఒక ప్రత్యేక రకమైన కంకర రాళ్లు కూడా కురిపించబడ్డాయి. ఈ విధంగా వారు మూడు రకాల శిక్షలకు గురిచేయబడ్డారు. భావితరాల కొరకు ఇదొక గుణపాఠం అయ్యేలా చేయబడింది.

[49] ఆయతులో ‘ముతవస్సిమీన్‌” అని వుంది. నిశిత దృష్టితో విషయాన్ని పరికించే వారిని, యోచన చేసేవారిని ‘ముతవస్సిమీన్‌’ అంటారు. అలాంటి వారి కోసం ఇందులో గుణపాఠం ఉంది.

[50] అంటే ప్రధాన రహదారి అని భావం. మదీనా నుంచి సిరియాకు వెళ్ళే మార్గంలో శిథిలావస్థలో ఉన్న లూత్‌ (అలైహిస్సలాం) జాతి ప్రజల పట్టణాలు కానవస్తాయి. అటువైపు వచ్చేపోయే వారంతా ఆ దారి గుండా సాగవలసిందే. అవి మొత్తం అయిదు పేటలు. 1. సద్దూమ్‌ (ముఖ్యపట్టణం) 2. సాబ 3. సావహ్‌ 4. అస్‌ర 5. దూమా. వీటిని నాశనం చేసిన తీరు గురించి ఒక కథనం ఈ విధంగా ఉంది : హజత్‌ జిబ్రీల్‌ (అలైహిస్సలాం) తన రెక్కలపై ఈ పేటలను ఎత్తుకుని నింగికేసి సాగిపోయారు. ఆకాశాన ఉన్నవారు కూడా వారి కుక్కలు మొరగటాన్ని, కోళ్లు కూతవేయటాన్ని విన్నారు. ఆ తరువాత వారిని నేలకేసి గిరాటు కొట్టారని అనబడుతోంది (ఇబ్నె కసీర్‌). అయితే ఈ కథనానికి ప్రామాణికమైన అధారాలు లేవు.

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం – అహ్సనుల్ బయాన్

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం  (تفسير سُورةُ الفاتحة)

అహ్సనుల్ బయాన్

సూరహ్ అల్ ఫాతిహా (ప్రారంభం)

మూలం: అహసనుల్ బయాన్, First Edition February 2009, శాంతి మార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్:

పరిచయం:

సంకలనం రీత్యా దివ్యఖుర్ఆన్ లో ఇది మొట్టమొదటి సూరా. ఈ సూరాలో తౌహీద్ (అంటే ఏకదైవారాధన) ప్రధానంగా కనబడుతుంది. దేవుని పట్ల విశ్వాసం, దైవారాధన, దేవుణ్ణి సహాయం కోసం వేడుకోవడం, దేవుని ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలో ఏడు ఆయతులున్నాయి. అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు, స్తోత్రాలకు, అభ్యర్థనలకు  యోగ్యుడనీ, అల్లాహ్ మాత్రమే పరిపూర్ణుడనీ, ఇహలోకానికి, పరలోకానికి అల్లాహ్ మాత్రమే ప్రభువనీ, ఆయనే సృష్టికర్త అనీ ఈ ఏడు ఆయతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది.

ఈ సూరాకు ‘అల్ ఫాతిహా’ (ప్రారంభం) అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే, ఇది దివ్యఖుర్ఆన్ కు ప్రారంభ అధ్యాయం. ఈ సూరా దివ్య ఖుర్ఆన్ కు తల్లివంటిదనీ, దివ్య ఖుర్ఆన్ సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది.

ముస్లిములు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదువవలసిన సూరా ఇది. రోజూ చేసే అయిదు పూటల నమాజు కాని, లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కాని ప్రతి నమాజులో ఈ సూరాను పఠించటం తప్పనిసరి. ప్రారంభ సూరా చదువకపోతే ముస్లిములు చేసే ఏ నమాజూ స్వీకరించ బడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు.

ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రారంభ సూరా (అల్ ఫాతిహా), పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం వంటిది. ఈ సూరా పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇస్లాంకు సంబంధించిన ప్రధానమైన భావనలను, నియమాలను అన్నింటినీ ఈ సూరా క్లుప్తంగా తెలియజేస్తుంది. మౌలికమైన ఇస్లామీయ భావనలు, ప్రధానమైన ఇస్లామీయ విశ్వాసాలు, అంటే దేవుని ఏకత్వం (దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, దేవునికి భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడం, దేవునికి సాటి ఎవరూ లేరని విశ్వసించడం), దేవుని గుణగణాలను గురించి ఈ సూరా సరళంగా, సూటిగా, సంక్షిప్తంగా మనిషికి తెలియజేస్తుంది. ముస్లిములు అల్లాహ్ ను, అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడిని తప్ప మరెవ్వరినీ అర్థించరాదనీ, ఎవరి ముందూ చేతులు చాపరాదనీ, మనిషి సాటి మనిషికి దాస్యం చేయరాదనీ, కేవలం దేవునికి మాత్రమే తన ఆరాధనను అంకితం చేసుకొని, ఆయన ముందు మాత్రమే తలవంచాలని బోధిస్తుంది. దేవునికి మానవ గుణగణాలు ఆపాదించడాన్ని ఖండిస్తుంది. అల్లాహ్ కు ఎవరూ సమానులు కారు. అల్లాహ్ వంటి వారు మరెవ్వరూ లేరు. మనిషి ఆయన్ను విశ్వసించాలి. విశ్వాసంతో ఆయన్నే ఆరాధించాలి.

ఈ సూరా రెండు సమాన భాగాలుగా ఉన్నట్లు కనబడుతుంది. మొదటి భాగంలో అల్లాహ్, ఆయన గుణగణాల గురించి ఉంది. రెండవ భాగంలో మనిషి గురించి, మనిషికి దేవునితో ఉన్న అవసరం గురించి ఉంది.

అల్ ఫాతిహా సూరా వ్యాఖ్యానం:

అల్ ఫాతిహా సూరా దివ్య ఖుర్ఆన్ లోని మొట్ట మొదటి సూరా. హదీసుల ద్వారా కూడా దీని మహత్తు తెలుపబడింది. ఫాతిహ అంటే ఆరంభించటం, మొదలు పెట్టడం అని అర్థం. అందుకే దీనిని ఫాతిహతుల్ కితాబ్ అంటే పుస్తకారంభం అని పిలవటం జరిగింది. ఈ సూరాకు మరిన్ని పేర్లు కూడా ఉన్నట్లు హదీసుల ద్వారా రూఢీ అవుతోంది. ఉదాహరణకు:

  • (1) ఉమ్ముల్ ఖుర్ఆన్, (ఖురాన్ కు తల్లి వంటిది)
  • (2) అస్సబ్ వుల్ మసానీ, (7 చాలా పునరావృత అయతులు)
  • (3) అల్ ఖుర్ఆనుల్ అజీమ్,
  • (4) అష్షిఫా,
  • (5) అర్రుఖ్యతు (ఊదటం),

ఇంకా అనేక పేర్లు ఈ సూరాకు ఉన్నాయి.

ఈ సూరాకు గల ఇంకొక పేరు అస్సలాత్. హదీసె ఖుద్ సీ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు: ఖసమ్ తు స్సలాత బైనీ వ బైన అబ్దీ (సహీహ్ ముస్లిం : కితాబుస్సలాత్) – అంటే “నేను సలాత్ (నమాజు)ను నాకు – నా దాసునికి మధ్య విభజించాను” అని భావం. అంటే ఫాతిహా సూరా నన్నమాట! ఈ సూరాలోని సగభాగంలో దైవ స్తోత్రం చేయబడింది. ఆయన దయాదాక్షిణ్యాలు, పోషణ, న్యాయశీలం, విశ్వ సామ్రాజ్యాధికారం అభివర్ణించబడ్డాయి. మిగిలిన సగభాగంలో దైవసన్నిధిలో దాసుడు చేసుకునే విన్నపాలు, అభ్యర్థనలు వివరించబడ్డాయి.

ఈ హదీసులో ఫాతిహా సూరాను నమాజు గా అభివర్ణించడం జరిగింది. దీన్ని బట్టి నమాజులో ఈ సూరాను పఠించటం చాలా అవసరమని స్పష్టమవుతోంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాల ద్వారా ఈ విషయం పదే పదే స్పష్టపరచటం జరిగింది: ఉదాహరణకు: – లా సలాత లిమన్ ల్లమ్ యఖ్ రఅ బి ఫాతిహతిల్ కితాబ్ (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం). అర్థం: ఫాతిహా సూరా పఠించని వ్యక్తి నమాజు నెరవేరదు. ఈ హదీసులోని అరబీ మూలంలో వచ్చిన ‘మన్’ అనే పదం సర్వసాధారణమైనది. నమాజు చేసే ప్రతి వ్యక్తికీ ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో నమాజు చేసినా, సామూహికంగా నమాజు చేసినా, నమాజు చేయించే ఇమాము అయినా, ఇమామును అనుసరించే వారయినా – అందరూ ఈ సూరాను చదవవలసిందే. నెమ్మదిగా చేసే (సిర్రీ) నమాజులోనయినా, బిగ్గరగా చేసే (జహ్రీ) నమాజులోనయినా, విధిగా చేయవలసిన (ఫర్జ్) నమాజులోనయినా, స్వచ్ఛందంగా చేసుకునే (నఫిల్) నమాజులోనయినా – నమాజు చేసే ప్రతి ఒక్కరూ ఈ సూరాను చదవటం తప్పనిసరి. క్రింద పేర్కొనబడిన హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తోంది:

ఒకసారి ఫజ్ర్ (ఉదయం) నమాజులో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు ఆయన సహచరులు (రదియల్లాహు అన్హుమ్) కూడా ఖుర్ఆన్ పారాయణం చేయసాగారు. తత్కారణంగా నమాజులో ఖుర్ఆన్ పఠించడానికి ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. నమాజును ముగించిన తరువాత ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) తన సహచరుల నుద్దేశ్యించి, “ఏమిటీ? మీరు కూడా (నా వెనకాల) ఖుర్ఆన్ పఠించారా?” అని అడిగారు. దానికి సహచరులు “అవున”ని చెప్పారు. అప్పుడు ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “మీరిలా చేయకండి – నాతో పాటు పఠించకండి – అయితే ఫాతిహా సూరా ను మాత్రం తప్పక పఠించాలి. ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజు నెరవేరదు” (అబూ దాఊద్, తిర్మిథీ, నసాయి).

అలాగే మరో హదీసు – హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మన్ సల్లా సలాతన్ లమ్ యఖ్రఅ ఫీహా బి ఉమ్మిల్ ఖుర్ఆని ఫహియ ఖిదాజున్ సలాతున్ ఘైరు తమామ్: (ఎవరయితే ఫాతిహా సూరా లేకుండానే నమాజు చేశాడో అతని నమాజు లోపభూయిష్టమైనదవుతుంది – అది పరిపూర్ణమైన నమాజు కాబోదు). దైవప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) మూడుసార్లు ఈ మాటన్నారు. “మేము ఇమాము వెనుక కూడా నమాజు చేస్తాము కదా! మరప్పుడేం చేయాలి?” అని కొంతమంది హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ను ప్రశ్నించగా, “ఇమాము వెనుక ఉన్నప్పుడు (అంటే సామూహిక నమాజు చేస్తున్నప్పుడు) మీరు మనసులోనే – లోలోపలే – ఫాతిహా సూరా పఠించండి” అని ఆయన (రదియల్లాహు అన్హు) సమాధానమిచ్చారు. (సహీహ్ ముస్లిం)

పై రెండు హదీసుల ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే, దివ్య ఖుర్ఆన్ లో సెలవీయబడినట్లు, “దివ్య ఖుర్ఆన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి, మౌనంగా ఉండండి” (అల్ అరాఫ్ – 204). అలాగే హదీథులో చెప్పబడినట్లు – “సామూహిక నమాజుకు సారధ్యం వహించే వ్యక్తి (ఇమాము), గ్రంథ పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి.” దీని భావం ఏమిటంటే బిగ్గరగా చేయించే నమాజులలో వెనుక నిలబడివున్న నమాజీలు (ముక్తదీలు) ఫాతిహా సూరా తరువాత మిగిలిన పారాయణమంతటినీ మౌనంగా వినాలి. ఇమాముతో పాటే ఖుర్ఆన్ పారాయణం చేయకూడదు. లేదంటే, ఇమాము, తన వెనుకనున్న అనుయాయులు కూడా సహీహ్ హదీథుల కనుగుణంగా ఫాతిహా సూరాను పఠించడానికి వీలుగా ఫాతిహా సూరా ఆయతులను బాగా ఆగి ఆగి పారాయణం చేయాలి. లేదా ఫాతిహా సూరా ముగించిన తరువాత తన అనుయాయుల (ముక్తదీల) సౌకర్యార్థం ఇమాము చాలినంత వ్యవధిని ఇవ్వాలి. అలా చేస్తే ముఖ్తదీలు ఫాతిహా సూరా వాక్యాలను లోలోపలే చదవుకుంటారు. ఇలా చేయటం ఖుర్ఆన్ హదీథుల దృష్ట్యా ఆక్షేపణీయం కూడా కాదు. పైగా ఖుర్ఆన్, హదీథు – రెండింటి ఆదేశాలను పాటించినట్లవుతుంది. దీనికి భిన్నంగా ఫాతిహా సూరా పఠనాన్ని వారించటం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు తావిచ్చినట్లవుతుంది. ఉదా:- దివ్యఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీథులు పరస్పరం సమన్వయం చెందటం లేదనీ, వాటి మధ్య వైరుద్ధ్యం ఉందనీ, ఆ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే ఆచరణయోగ్యమైనదనీ, ఏక కాలంలో రెండింటినీ అనుసరించటం దుస్సాధ్యమనీ (దైవం మన్నించుగాక) కుంటిసాకులు వెతికే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లవుతుంది. మరిన్ని వివరాలకై అల్ అరాఫ్ 204వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను కూడా చూడండి. (ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మౌలానా అబ్దుర్రహ్మాన్ ముబారక్ పూరి గారి ‘తహ్ కీకుల్ కలామ్’ పుస్తకం, ఇంకా మౌలానా ఇర్షాదుల్ హఖ్ అథ్రీ గారి పుస్తకాలు చదవండి). ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. ముక్తదీ గనక ఇమామ్ చేసే ఖుర్ఆన్ పారాయణం వింటున్నట్లయితే ఫాతిహా సూరా పఠించరాదనీ, ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా ఫాతిహా సూరా పఠించాల్సిందేనని ‘సలఫ్’లో (ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చివరిలో ఇవ్వబడిన పద విశ్లేషణ చదవండి) అత్యధికమంది తెలిపినట్లు ఇమామ్ ఇబ్నె తైమియా అభిప్రాయపడ్డారు. (మజ్మూయె ఫతావా ఇబ్నె తైమియా 23/265).

ఇది మక్కీ సూరా. అంటే ఈ సూరా మక్కాలో అవతరించిందన్నమాట! మక్కా లేక మదీనాలో అవతరించిందంటే భావం: మహాప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) హిజ్రత్ చేయక మునుపు (మదీనాకు వలస పోక పూర్వం) అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలనబడతాయి. మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కా నగరంలోనే అవతరించి ఉండనవసరం లేదు. సమయం సందర్భాలను బట్టి మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాలలో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి. అలాగే హిజ్రత్ (దైవదౌత్య అందిన 13 ఏండ్ల తరువాత జరిగిన మదీనా వలస ప్రయాణం) అనంతరం అవతరించిన సూరాలు – అవి మదీనాలో అవతరించినా లేక మదీనా పొలిమేరల్లో అవతరించినా లేక మదీనా నగరానికి బహుదూరాన అవతరించినా – అవన్నీ మదనీ సూరాలుగానే వ్యవహరించబడతాయి. ఆఖరికి అవి మక్కాలో లేక మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నాసరే!

“బిస్మిల్లాహ్” విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రతి సూరాకు మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా? లేక ప్రతి సూరాలో అంతర్భాగమా? లేక ఫాతిహా సూరాలోని ఒక ఆయతా? లేక ఏ సూరాలోనూ అంతర్భాగం కాని అదనపు వచనమా? అంటే కేవలం ఒక సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ప్రయోగించబడిన వాక్యమా? – అన్న విషయంపై మీమాంస ఉంది. దీన్ని ఫాతిహా సూరా సమేతంగా అన్ని సూరాలలో అంతర్భాగంగా మక్కా మరియు కూఫా ఖుర్ఆన్ పఠితలు (ఖుర్రాలు) ఖరారు చేశారు. కాగా; ఇది ఒక ఆయతుగా ఏ సూరాలోనూ అంతర్భాగం కాదని మదీనా, బస్రా, సిరియా పారాయణకర్తలు అన్నారు. కాకపోతే నమల్ సూరాలోని 30వ వచనంలో వచ్చిన ‘బిస్మిల్లాహ్’ ను మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయతుగా శిరసావహించారు. అలాగే బిగ్గరగా పఠించే నమాజులలో ‘బిస్మిల్లాహ్’ ను బిగ్గరగా చదివే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా, నెమ్మదిగా పఠించాలని మరికొంతమంది తలపోస్తున్నారు (ఫతహుల్ ఖదీర్). అధిక సంఖ్యాక విద్వాంసులు మాత్రం నెమ్మదిగా పఠించాలన్న విషయానికే ప్రాధాన్యతనిచ్చారు. అంతమాత్రం చేత బిగ్గరగా పఠించటం విపరీతం కాదు – బిగ్గరగా పఠించటం కూడా ధర్మసమ్మతమే.

బిస్మిల్లాహ్ అంటే ‘అల్లాహ్ పేరుతో’ అని మాత్రమే అర్థం వస్తుంది. కనుక దానికి ముందు అఖ్రవు (నేను చదువుతున్నాను), అబ్ దవు (నేను ప్రారంభిస్తున్నాను), అత్ లూ (నేను పారాయణం చేస్తున్నాను) – లాంటిది ఏదో ఒక పదం ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. అంటే అల్లాహ్ పేరుతో మొదలెడుతున్నాను, అల్లాహ్ పేరుతో అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాను అని భావం. ప్రతి పనికి ముందు బిస్మిల్లాహ్ పలకమని గట్టిగా తాకీదు చేయబడింది. భోజనం చేసేటప్పుడు, జంతువును జిబహ్ చేసేటప్పుడు, ఉదూ చేయ సంకల్పించినప్పుడు, ఆఖరికి సంభోగానికి ముందు కూడా బిస్మిల్లాహ్ పఠించాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ పారాయణం మొదలెడుతున్నప్పుడు బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ ను పఠించటం అనివార్యమైనప్పటికీ, దానికి ముందు అవూదు బిల్లాహి మినష్షయితానిర్రజీమ్ ను పఠించడం కూడా ఎంతో అవసరమే. ఎందుకంటే ఫయిదా ఖరతుల్ ఖుర్ఆన ఫస్తయిజ్ బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (మీరు ఖుర్ఆన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకోండి – సూరా అన్నహ్ల్:98) అన్న ఆదేశం విస్మరించరానిది.


అల్ ఫాతిహా సూరా
అవతరణ: మక్కా  – ఆయతులు : 7

  1. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
    అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.
  2. అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
    ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి [1]. ఆయన సమస్త లోకాలకు పోషకుడు [2].
  3. అర్రహ్మా నిర్రహీం
    అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు [3].
  4. మాలికి యౌమిద్దీన్
    ప్రతిఫల దినానికి (అంటే ప్రళయదినానికి) యజమాని [4].
  5. ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్
    మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము [5].
  6. ఇహ్దినశ్శిరాతల్ ముస్తఖీం
    మాకు ఋజుమార్గం (సన్మార్గం) చూపించు [6].
  7. శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్, గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్
    నీవు అనుగ్రహించిన వారి మార్గం [7], నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు) [8].

[1]. అల్ హమ్దు: ఇందులో అల్ అనే పదం ప్రత్యేకతను, సమీకృతాన్ని సూచిస్తోంది. సమస్త స్తోత్రములు అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయనీ, అవి ఆయనకే ప్రత్యేకమనీ భావం. ఎందుకంటే ప్రశంసలకు అసలు అర్హుడు అల్లాహ్ యే. ఎవరిలోనయినా ఏదైనా ప్రత్యేకత, సద్గుణం, నేర్పు ఉంటే అది కూడా అల్లాహ్ సృజించినదే. అందుచేత స్తోత్రానికి అర్హుడు కూడా ఆయనే. అల్లాహ్: ఇది అల్లాహ్ నామం. వేరొకరి కోసం ఈ నామాన్ని ఉపయోగించటం సమ్మతం కాదు. అల్ హమ్దులిల్లాహ్ : ఇది కృతజ్ఞతా పూర్వకమయిన పలుకు. హదీథుల ద్వారా ఈ వచనం అత్యంత మహత్ పూర్వకమైనదని వెల్లడవుతోంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ : శ్రేష్ఠమయిన వేడుకోలు అని ఒక హదీథులో ఉంది (సుననె తిర్మిథీ). అల్ హమ్దులిల్లాహ్ తమ్ లవుల్ మీజాన్ –  ‘అల్ హమ్దులిల్లాహ్ త్రాసును నింపేస్తుంది’ అని మరొక హదీథులో అనబడింది. (సహీహ్ ముస్లిం).  అందుకే దాసుడు తినే, త్రాగే ప్రతిసారీ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవటాన్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడని వేరొక హదీథులో చెప్పబడింది (సహీహ్ ముస్లిం).

[2]. రబ్బ్ : అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలలో ఇదొకటి. రబ్బ్ అంటే ప్రతి వస్తువును సృష్టించటంతో పాటు దాని అవసరాలు, అక్కరలను తీర్చి, దానికి పరిపూర్తి నొసగేవాడు అని అర్థం. ఈ పదాన్ని ఈ భావంలో వేరొకరికై ఉపయోగించటం సమ్మతం కాదు. ఒకవేళ ఇతరులను ఈ పేరుతో సంబోధించదలిస్తే దానికి ముందుగాని వెనుకగాని మరో పదం వాడాలి. ఉదా: అబ్దుర్రబ్ (ప్రభువు యొక్క దాసుడు). అంతేగాని కేవలం ‘రబ్’ అని ఇతరులెవరినీ పిలువకూడదు. ఆలమీన్ అనే పదం ఆలమ్ అనే పదానికి బహువచనం. ఆ మాటకొస్తే సమస్త సృష్టిరాసుల సముదాయాన్ని ఆలమ్ గా వ్యవహరిస్తారు. అందుకే సాధారణంగా ఈ పదాన్ని బహువచనంలోకి తీసుకోరు. అయితే దేవుని పరిపూర్ణ పోషకత్వాన్ని, సమగ్ర ప్రభుతను వెల్లడించే ఉద్దేశ్యంతో  ఆలమీన్ అనే బహువచనాన్ని తీసుకురావటం విశేషం. సృష్టిరాసుల్లోని వేర్వేరు రకాలను, కోవలను గురించి ఇక్కడ తెలియజెప్పటం ముఖ్యోద్ధేశ్యం అన్నమాట! ఉదాహరణకు: జిన్నుల జగతి, మానవ జగతి, దైవదూతల లోకం, పశుపక్షాదుల ప్రపంచం ఇత్యాదివి. ఈ సృష్టితాలన్నింటి అవసరాలు వేరు. తీరుతెన్నులు వేరు. అయితే రబ్బిల్ ఆలమీన్ (సమస్త లోకాలను పోషించేవాడు) మాత్రం వాటి స్వరూప స్వభావాలను, అవసరాలను, స్థితిగతులను దృష్టియందుంచుకుని వాటికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు.

[3]. రహ్మాన్: రహ్మాన్, రహీమ్ – ఇవి రెండూ అధిక అర్థాలనిచ్చే పదాలే. ఈ రెండింటిలోనూ అధికమైన, అనంతమైన, అపారమైన అనే భావం తొణకిసలాడుతోంది. అంటే అల్లాహ్ అపారంగా కనికరించేవాడు. ఆయనలోని ఈ గుణం ఇతర గుణగణాల మాదిరిగా శాశ్వతమైనది, స్థిరమైనది. కొంతమంది పండితులు ఈ సందర్భంగా ఏమంటారంటే; రహీమ్ కన్నా రహ్మాన్ అనే పదంలో విస్తృత భావం ఉంది. అందుకే రహ్మానద్దునియా వల్ ఆఖిరతి అని అనబడుతుంది. అంటే ఇహపర లోకాల్లోనూ కరుణించేవాడని అర్థం. ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలు సర్వ సాధారణం. విశ్వాసులు – అవిశ్వాసులన్న విచక్షణ లేకుండా అందరూ ఈ ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలకు నోచుకుంటున్నారు. కాని పరలోకంలో ఆయన కేవలం రహీమ్ గా మాత్రమే ఉంటాడు. అంటే అక్కడ ఆయన దయానుగ్రహాలు కేవలం విశ్వాసులకు మాత్రే పరిమితం అయి ఉంటాయి. “నేను ఆ కారుణ్యాన్ని నాకు భయపడేవారి కొరకూ, జకాత్ ఇచ్చే వారి కొరకూ, మా ఆయతులను విశ్వసించే వారి కొరకు తప్పకుండా వ్రాస్తాను” (అల్ అరాఫ్ – 156). అల్లాహుమ్మజ్ అల్నా మిన్ హుమ్. (అల్లాహ్! మమ్మల్ని కూడా ఆ భాగ్యవంతులలో చేర్చుగాక).

[4]. మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికీ అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో, శిక్ష విధించటమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేకమందికి కొన్ని అధికారాలుంటాయి. కాని పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పుదినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిదో చెప్పండి?” అంటూ ఆనాడాయన ప్రశ్నిస్తాడు. తిరుగులేని వాడు, ఏకైకుడైన అల్లాహ్ దే అంటూ ఆయనే సమాధానం కూడా ఇస్తాడు (అల్ మోమిన్ – 16) “ఆనాడు, ఏ మనిషీ ఎవరికొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం, ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.” (ఇన్ ఫితార్ – 19) – అదీ తీర్పుదినమంటే!

[5]. ఇబాదత్ అంటే ఒకరి ప్రసన్నతను చూరగొనెందుకు అత్యంత అణుకువను, అశక్తతను, వినయ వినమ్రతలను అభివ్యక్తం చేయటం అని భావం. ఇబ్నె కథీర్ మాటల్లోనే చెప్పాలంటే, “షరిఅత్ లో సంపూర్ణమైన ప్రేమ, అభిమానం, భయము, భక్తీ – వీటన్నింటి సమ్మేళనమే ఇబాదత్.” అంటే ఎవరిపట్లనయితే ప్రేమాభిమానాలు కలిగి ఉంటామో, ఆయన శక్తియుక్తుల ముందు తమ నిస్సహాయ స్థితినీ, దైన్యస్థితినీ వ్యక్త పరచాలి. ఆ శక్తిమంతుడు తమను నిలదీసి అడుగుతాడన్న భీతి కూడా ఆ దాస్యంలో తొణకిసలాడుతూ ఉండాలి. విషయాన్ని సాదాసీదా చెప్పవలసి ఉంటే నా బుదుక, నస్తయీనుక (మేము నిన్ను ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్ను అర్థిస్తాము) అని అనబడేది. కాని, అల్లాహ్ ఇక్కడ ఇయ్యాక నాబుదు ఇయ్యాక నస్తయీన్ అని నొక్కి వక్కాణించి ఈ వాక్యానికి ప్రత్యేకతను, వైశిష్ఠ్యాన్ని కల్పించాడు – అంటే దీని అర్థం: “ఓ అల్లాహ్! మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము” అని.

దీని ప్రకారం అల్లాహ్ ను గాక వేరొకరిని పూజించటం గానీ, సహాయం కొరకు వేరేతరులను మొరపెట్టుకోవటం గానీ ధర్మసమ్మతం కాదు. ఈ పదాల ద్వారా షిర్క్ (అల్లాహ్ కు భాగస్వాముల్ని నిర్ణయించటం) నిర్ద్వంద్వంగా ఖండించబడింది. కాని హృదయాలలో షిర్క్ రోగం తిష్ఠవేసి ఉన్నవారు ఈ మూలాంశాన్ని విస్మరించి, అపోహలో పడిపోయి, భ్రమలకు లోనై పిడివాదానికి దిగుతారు. మనం జబ్బుపడినప్పుడు డాక్టరు సహాయం పొందటం లేదా? ఇల్లాలి సేవల్ని పొందటం లేదా? ఇరుగు పొరుగువారి తోడ్పాటును, డ్రైవరు సాయాన్ని పొందటం లేదా? అని దబాయిస్తారు. ఈ విధంగా వాళ్లు, అల్లాహ్ గాక వేరితరుల సహాయాన్ని అర్థించటం కూడా సమ్మతమేనని మీరు ఒప్పుకునేలా చేయటానికి ప్రయత్నిస్తారు. నిజానికి కారకాలకు లోబడి ఒండొకరి సహాయాన్ని కోరటం, సహాయపడటం షిర్క్ కానే కాదు. ఇదైతే దేవుడు సమ్మతించి ఆమోదించిన వ్యవస్థ. ఆ వ్యవస్థలోని పనులన్నీ బాహ్యకారకాలకు అనుగుణంగానే జరుగుతాయి. కడకు దైవప్రవక్తలు సయితం మనుషుల సహాయసహకారాలను పొందుతూ ఉంటారు. దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం తన జాతి జనులనుద్దేశించి, ‘అల్లాహ్ (ధర్మం) కొరకు నాకు సహాయపడేవారు మీలో ఎవరున్నారు?’ అని అడిగారు (అస్సఫ్ – 14). అల్లాహ్ స్వయంగా విశ్వాసుల నుద్దేశించి, “సత్కార్యం, దైవభక్కికి సంబంధించిన విషయాలలో ఒకరికొరకు సహకరించండి” అని సెలవిచ్చాడు. (అల్ మాయిదా: 2)

మరి ఇటువంటి సహాయసహకారాలు నిషేధించబడటంగానీ, షిర్క్ గా అభివర్ణించబడటం గానీ జరగలేదు. పైగా ఇలాంటి పనులు జరగాలని ప్రోత్సహించటమైంది. ఇలాంటి సత్కార్యాలు ప్రశంసనీయంగా పేర్కొనబడ్డాయి. వాస్తవమైన షిర్క్ తో దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. బాహ్యపరమైన కారకాల రీత్యా సహాయం చేయటం ఏమాత్రం చేతకాని వానిని, సహాయం చేయజాలని వానిని “సహాయం చెయ్యి” అని అర్థించటమే అసలు షిర్క్. ఉదాహరణకు: చనిపోయిన ఒకానొక వ్యక్తిని సహాయం కోసం మొరపెట్టుకోవటం, అతడు కష్టాల నుండి గట్టెక్కిస్తాడనీ, అక్కరలు తీరుస్తాడని తలపోయటం, లాభనష్టాలు అతని అధీనంలో ఉన్నాయని ఊహించటం, దగ్గరున్నవారు పిలిచినా, దూరమున్నవారు మొరపెట్టుకున్నా, ప్రతి ఒక్కరి మొరలను ఆలకించే ‘శక్తి’ అతనిలో ఉందని నమ్మటం – ఇదంతా దైవానికి వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టడంగా, భాగస్వామ్యం కల్పించటంగా, దేవుని లక్షణాలను వేరొకరికి  ఆపాదించటంగా పరిగణించబడుతుంది. ఇదే షిర్క్! దురదృష్టవశాత్తూ ముస్లిం దేశాలలో సయితం ఇటువంటి షిర్క్ వర్థిల్లుతోంది. మహనీయుల (ఔలియాల) పట్ల ప్రేమ కలిగి ఉండటం అవసరం మరి! అంటూ ముస్లింలు ఈ ప్రేమాభిమానంలో అతిశయిల్లి రాగానపడి షిర్కుకు ఒడిగడుతున్నారు. ఇటువంటి పోకడలబారి నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక!

తౌహీద్ (ఏకదైవోపాసన) మూడు రకాలు. ఈ సందర్భంగా ఏకదైవోపాసనకు సంబంధించిన ఈ మూడు రకాలను, క్లుప్తంగా నయినా సరే వివరించటం సమంజసం అనిపిస్తోంది. అవేమంటే – 1. తౌహీదె రుబూబియత్ 2. తౌహీదె ఉలూహియత్ 3. తౌహీదె అస్మా వ సిఫ్పాత్.

1.తౌహీదె రుబూబియత్ అంటే భావం: ఈ మొత్తం విశ్వానికి సృష్టికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకుని ఉన్నవాడు, వ్యూహ రచయిత కేవలం అల్లాహ్ మాత్రమే. నాస్తికులు మినహా మిగిలిన వారంతా ఈ తౌహీద్ ను అంగీకరిస్తారు. ఆఖరికి బహుదైవోపాసకులు సయితం ఈ దృక్పథాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటున్నారు. మక్కాకు చెందిన బహుదైవారాధకుల (ముష్రిక్కుల) ఒప్పుకోలును గురించి ఖుర్ఆన్ ఇలా అభివర్ణించింది:

“ఓ ప్రవక్తా! వారిని అడగండి: ఆకాశం నుంచీ, భూమి నుంచీ మీకు ఉపాధినొసగే వాడు ఎవడు? (మీ) వినేశక్తీ, చూసే శక్తీ ఎవరి అధీనంలో ఉన్నాయి? నిర్జీవమైన దాన్నుంచి జీవమున్న దాన్ని, జీవమున్న దాన్నుంచి జీవము లేని దాన్ని తీసే వాడెవడు? అసలీ విశ్వవ్యవస్థను నడుపుతున్న వాడెవడు?  ‘అల్లాహ్’ అని వారు ఠకీమని అంటారు” (యూసుఫ్ – 31)

మరొకచోట ఇలా అనబడింది:

“భూమ్యాకాశాలను సృష్టించిన వాడెవడు? అని వారినడిగితే, ‘అల్లాహ్’ అని వాళ్లు చెబుతారు”(అజ్జుమర్-38)

వేరొకచోట సెలవీయబడింది:

“ఈ భూమి, భూమిలో ఉన్నదంతా ఎవరిదో మీకు తెలిస్తే చెప్పండి?” అని వారిని అడుగు. ‘అల్లాహ్ దే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు మీరు ఎందుకు గ్రహించటం లేదు? అని వారితో అను. ఇంకా సప్తాకాశాలకూ, మహోన్నతమైన సింహాసనానికి అధిపతి ఎవరని కూడా వారిని ప్రశ్నించు. ‘అల్లాహ్’ అని వారు తడబడకుండా సమాధానమిస్తారు. మరి అటువంటప్పుడు మీరు ఆయనకు ఎందుకు భయపడటం లేదు? అని వారిని నిలదియ్యి” (అల్ మోమినూన్ : 84 – 89)

2.తౌహీదె ఉలూహియత్: అంటే భావం అన్ని రకాల ఆరాధన (ఇబాదల్) లకు, దాస్యాలకు, వేడుకోళ్ళకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పుకోసం లేక అతని అప్రసన్నతకు గురవుతామేమెనన్న భయం కొద్దీ చేసే ప్రతి పనీ ఆరాధన (ఇబాదత్) గానే భావించబడుతుంది. అందుచేతనే నమాజ్, ఉపవాసం, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు – ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవటం, అతని పేర మొక్కకోవటం, మొక్కుబడులు తీర్చుకోవటం, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకుని నిలబడటం, అతని చుట్టూ ప్రదక్షిణ చేయటం, అతని సమక్షంలో భయభక్తులను ప్రదర్శించటం, అతను తమకేదైనా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించటం – ఇత్యాదులన్నీ ఆరాధన (ఇబాదత్) గానే పరిగణించబడతాయి. మరి ఇటువంటి పనులన్నీ ఒక్కడైన అల్లాహ్ కోసమే చేయాలి. ఇదే తౌహీదె ఉలూహియత్ (అయితే బాహ్య కారకాల కనుగుణంగా బ్రతికి ఉన్న మనుషుల వద్దకు వెళ్ళి, వారి నుండి ఏదైనా ఆశించటం, వారి యెడల వినయ వినమ్రతలను కలిగి ఉండటం మాత్రం ‘తౌహీద్’ కు విరుద్ధం కాదు). సమాధి పూజ వ్యాధికి లోనయిన సామాన్యులు, ప్రముఖులు ఈ తౌహీదె ఉలూహియత్ లో షిర్క్ కు ఒడిగడు తుంటారు. ఇటువంటి ఆరాధనలను వారు సమాధులలో ఖననం చేయబడినవారి నుద్దేశించి చేస్తుంటారు. ఇది ముమ్మాటికీ షిర్కే!

3.తౌహీదె అస్మా సిఫ్పాత్ : అంటే భావం ఖుర్ఆన్ మరియు హదీథులలో అల్లాహ్ గురించి చెప్పబడిన గుణగణాలను, లక్షణాలను ఏమాత్రం వక్రీకరించకుండా, వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా – యథాతథంగా అంగీకరించటం. అంటే ఆ గుణగణాలు వేరొకరిలో కూడా ఉన్నాయన్న భావనకు సుతరామూ తావీయకూడదు.

ఉదాహరణకు: అగోచర జ్ఞానం అల్లాహ్ గుణం, లేదా దూరాన ఉన్నవారు మొరపెట్టుకున్నా, చేరువలో ఉన్నవారు ఫిర్యాదు చేసినా – అందరి గోడునూ ఆయన వింటాడు అనేది ఇంకొక గుణం. విశ్వమండలంలో ఏదైనా సరే చేయగల అధికారం ఆయనకు ఉంది అనేది ఇంకొకటి. ఇలాంటివే అనేకానేక గుణగణాలు ఆయన సొంతం. మరి అటువంటి గుణగణాలలో ప్రవక్తనో, వలీనో, సజ్జనులనో చేర్చరాదు. ఒకవేళ వారిని కూడా సహవర్తులుగా చేర్చి, ఆ మహనీయులకు కూడా అటువంటి గుణాలే ఉన్నాయని భావిస్తే అది ముమ్మాటికీ ‘షిర్కే’ అవుతుంది.

[6]. హిదాయత్: అంటే మార్గదర్శకత్వం వహించటం, తిన్నని త్రోవలో నడపటం, గమ్యస్థానానికి చేర్చటం అని భావం. ఇదే అరబీలో సద్భుద్ధి, సత్ప్రేరణ, నిదర్శనంగా కూడా అభివర్ణించబడింది. అంటే మాకు ఋజుమార్గం వైపు దర్శకత్వం వహించు! ఆ మార్గంపై నడిచే సద్భుద్ధి నొసగు!! ఆ మార్గంపై కు సహన స్థయిర్యాలను ప్రసాదించు !! తద్వారానే మేము నీ ప్రసన్నతను చూరగొనగలము అన్నది దీని మతలబు. మరి ఈ ఋజుమార్గం కేవలం మనిషి బుద్ధీజ్ఞానాల వల్ల, అతని తెలివితేటల వల్ల ప్రాప్తించదు. దానికి దైవకటాక్షం ఎంతో అవసరం. ఈ ఋజుమార్గమే ఇస్లాం. ఆ మార్గాన్నే అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లోకానికి విడమర్చి చెప్పారు. ఆ మార్గాన్ని పొందటమెలాగో ఖుర్ఆన్ మరియు హదీథులు పూసగుచ్చినట్లుగా మనకు వివరిస్తున్నాయి.

[7]. దైవకటాక్షం పొందినవారు: ఈ కోవకు చెందిన వారెవరో ఖుర్ఆన్ ఖుద్దుగా వివరించింది. అన్నిసా సూరాలో పేర్కొనబడినట్లుగా – “ఎవరయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారు (ప్రళయదినాన) దైవకటాక్షం పొందిన వారితో ఉంటారు. అంటే దైవప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులు. అటువంటి వారి సహచర్యం ఎంతో మంచిది కదా!” (అన్నిసా : 69)

దైవానుగ్రహానికి పాత్రులైన వారి ఈ మార్గం దైవవిధేయత మరియు ప్రవక్త విధేయతల మార్గమే తప్ప వేరొక మార్గం కాదన్న సంగతి కూడా ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది.

[8]. ఆగ్రహానికి గురైన వారు, అపమార్గానికి లోనైనవారు: ఆగ్రహానికి గురైనవారంటే యూదులు, అపమార్గానికి లోనైన వారంటే క్రైస్తవులని భావం. ఈ విషయంలో ఖుర్ఆన్ వ్యాఖ్యాతల మధ్య ఎలాంటి అభిప్రాయభేదం లేదని ఇబ్నె అబీ హాతిమ్ అంటున్నారు. (ఫతహుల్ ఖదీర్). అందుకే ఋజుమార్గాన నడవాలని కోరుకునేవారు యూదులు, క్రైస్తవుల మార్గవిహీనతకు దూరంగా మసలు కోవటం ఎంతో అవసరం. యూదుల మార్గభ్రష్టతకు తార్కాణం ఏమిటంటే, వాళ్ల తెలిసి కూడా – ఉద్దేశ్యపూర్వకంగా – సన్మార్గాన నడిచేవారు కారు. దైవవాక్కులలో ప్రక్షిప్తాలు చేసేవారు. ప్రతి దానికీ వంకలు పెట్టేవారు. ఉజైర్ ను వారు దేవుని కుమారునిగా నిలబెట్టారు.       ఏదేని విషయాన్ని ధర్మం  (హలాల్) గానో, అధర్మం (హరాం) గానో ఖరారు చేసే అధికారాన్ని వారు తమ ఆచార్యులకు, మతాధికార్లకు కట్టబెట్టారు. ఇక క్రైస్తవులు చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటంటే, వాళ్ళు దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం ప్రేమలో అతిశయిల్లారు. ఆయన్ని దేవుని కుమారునిగా ఖరారు చేశారు. ‘త్రిత్వం’ (మూడు దైవాల భావన) ను సృష్టించి గందరగోళ స్థితికి కారకులయ్యారు. అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలో సయితం ఇటువంటి అయోమయావస్థ నెలకొంటున్నది. ప్రవక్త పట్ల ప్రేమాతిశయంతో కొందరు మహానుభావులు తమదైన శైలిలో తొక్కే పుంతలు మార్గభ్రష్టతకు దారి తీసేలా పరిణమిస్తున్నాయి. ఈ కారణంగానే వారు ఇహలోకంలోనే పరాభవానికి గురవుతున్నారు. అల్లాహ్ వారిని ఈ మార్గభ్రష్టతల లోయల్లోనుంటి బయట పడవేయుగాక!

ఫాతిహా సూరా చివర్లో ఆమీన్ పలకటం అత్యంత మహత్పూర్వకమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదే పదే తాకీదు చేయటం గమనార్హం. అందుకే (నమాజులో) ఇమామ్, ముఖ్తదీలు ప్రతి ఒక్కరూ ‘ఆమీన్’ పలకాలి. “బిగ్గరగా చేసే నమాజులలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చు స్వరంతో ‘ఆమీన్’ పలికేవారు. ప్రియ సహచరులు కూడా బిగ్గరగా ఆమీన్ పలికే సరికి మస్జిద్ ఆమీన్ శబ్ధంతో ప్రతిధ్వనించేది”. (ఇబ్నె మాజా, ఇబ్నె కథీర్). ఆమీన్ బిగ్గరగా పలకటం సున్నత్ (దైవప్రవక్త సంప్రదాయం). ఇది ప్రవక్త ప్రియసహచరుల ఆచరణ కూడా. ఆమీన్ కు పలు అర్ధాలు ఇవ్వబడ్డాయి. ‘ఆమీన్’ అంటే తథాస్తు అనీ, ‘ఓ అల్లాహ్! మా ప్రార్థనను స్వీకరించు’ అనీ, ‘మా ఆశను అడియాశ చేయకు’ అనీ భావం.

కొత్తపదాలు – వాటి అర్థాలు

ఔలియా ‘వలీ’ అన్న పదానికి బహువచనం; సన్నిహితులు, ప్రియతములు అని అర్థం; ఔలియాను దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా నిర్వచించాడు: “వారు విశ్వాసులై ఉంటారు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటారు” (యూసుఫ్ : 63); సాధారణంగా జనం వలీలంటే “బాబాలు” అని అనుకుంటారు. కాని నిజానికి వలీలంటే బాబాలనబడేవారు కాదు. మంచివారైన విశ్వాసులందరూ, ప్రవక్తల అనుచరులందరూ అల్లాహ్ వలీలుగానే భావించబడతారు. ఈ పదానికి వేరితర అర్థాలు కూడా ఉన్నాయి. ఉదా: సంరక్షకుడు, సహాయకుడు.
ఖుర్రా ‘ఖారి’ అనే పదానికి బహువచనం; ఖుర్ఆన్ పారాయణ విద్యలో పండితులు అని అర్థం.
జహ్రీ నమాజులు ఖుర్ఆన్ పారాయణం బిగ్గరగా జరిగే నమాజులు(ఫజ్ర్, మగ్రిబ్, ఇషా)
జిన్నులు/జిన్నాతులు అగ్నితో సృష్టించబడిన, మనుషుల కంటికి కనిపించని మరో జాతి ప్రాణులు.
ముక్తదీలు ఇమాము వెనుక, అతనిని అనుసరిస్తూ నమాజు చేసేవారిని “ముక్తదీలు” అంటారు. నమాజుకు సారధ్యం వహించే వ్యక్తి ‘ఇమాము’ అని పిలువబడతాడు;
లాఇలాహ ఇల్లల్లాహ్ “అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు.”
షిర్క్ అల్లాహ్ ఆరాధన (ఉలూహియత్)లో గాని, ఆయన సార్వభౌమత్వం (రుబూబియత్) లో గాని, ఆయన దివ్య నామ, గుణగణాల (అస్మా వసిఫ్ఫాత్)లో గాని వేరొకరికి భాగస్వామ్యం కల్పించటం. ఇది ఘోరమైన పాపం. ఈ పాపానికి పాల్పడేవారిని ‘ముష్రికులు’ అంటారు అంటే అల్లాహ్ తో పాటు వేరొకరికి భాగస్వామ్యం కల్పించే వారన్నమాట.
సలఫ్ పూర్వీకులు; ఇస్లాంలో తొలి మూడు తరాలకు చెందిన నికార్సయిన ముస్లింలు.
సిర్రీ నమాజులు ఖుర్ఆన్ పారాయణం నిశ్శబ్దంగా జరిగే నమాజులు (జుహర్, అస్ర్)
బిద్అతీలు ఖుర్ఆన్ మరియు హదీథులకు, వాటి  స్ఫూర్తికి విరుద్ధమైన కొత్త అర్ధాలు చెప్పేవారు; ధర్మంలో కొత్తపుంతలు తొక్కేవారు; ఈ తరహా పోకడలు ఘోరపాపాలుగా భావింపబడతాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీటిని తీవ్రంగా ఖండించారు.
హదీథె ఖుద్ సీ అల్లాహ్ మాటలను ప్రవక్త తన నోటితో అల్లాహ్ ఇలా ఆదేశించాడని చెప్పటం; మామూలు హదీథుకు – హదీథె ఖుద్సీకు మధ్య భేదాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అల్లాహ్ ప్రేరణతో దైవప్రక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవన్నీ మామూలు హదీథులు అవుతాయి. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదయినా హదీథులో నేరుగా అల్లాహ్ ఇలా అంటున్నాడని గాని, ఇలా ఆదేశించాడని గాని చెప్పినట్లయితే అటువంటి హదీథులు ‘హదీథె ఖుద్స్’ గా భావించబడతాయి.
ప్రక్షిప్తాలు లేనివి కల్పించబడటం.

ఇతరములు:

తిన్న తర్వాత, త్రాగిన తర్వాత అల్‌హందు లిల్లాహ్‌ అనండి

తిన్నత్రాగిన తర్వాత అల్‌ హందులిల్లాహ్‌ అనండి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అనస్‌ బిన్‌ మాలిక్‌ ఈ ఉల్లేఖించారు: “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్‌ హందు లిల్లాహ్‌ అనడం అల్లాహ్‌కు చాలా ఇష్టం. (ముస్లిం 2734). [పుణ్యఫలాలు| ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ].

చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలీహ్ అల్-ఉతైమీన్ [రహిమహుల్లాహ్ ] ఇలా అన్నారు: "చాలా చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు." [రియాద్ అస్-సాలీహీన్ వ్యాఖ్యానం, (1/273) | ఇంగ్లిష్ అనువాదం: అబ్బాస్ అబూ యాహ్యా హఫిజహుల్లాహ్]

హజ్ పద్దతి, విధానం – طريقة الحج [వీడియో]

బిస్మిల్లాహ్

[44 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


ఇతరములు:

జుమా రోజు ఘనత (మూడు హదీసులు) [ఆడియో]

బిస్మిల్లాహ్

(9 నిముషాలు )
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)వారి 3 హదీసులు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
Recorded : 29-4-1441


6వ అధ్యాయం – ముస్లిం అనుచర సమాజానికి శుక్రవారం వైపు మార్గదర్శనం

496. హజత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రపంచంలో మనం యావత్తు అనుచర సమాజాల కంటే వెనుక వచ్చాము. అయితే ప్రళయదినాన మనం అందరికన్నా మించిపోతాము. మనకు పూర్వమే యావత్తు అనుచర సమాజాలకు (దైవ) గ్రంధం లభించింది. మనకు వారి తరువాత లభించింది. (అంటే వారు గతంలోనికి పోయారు. మనం వారి వెనుక ఉన్నాం) కాని ఈ రోజు (అంటే శుక్రవారం) విషయంలో వారు దైవాజ్ఞ పాటింపుతో విభేదించారు. (అంచేత ఈ శుభదినం మనకు లభించింది. ఈ కారణంగానే మనం ప్రళయ దినాన వారిని మించిపోతాము) రేపటి దినం (శనివారం) యూదులకు లభించింది. ఎల్లుండి దినం (ఆదివారం) కైస్తవులకు లభించింది.”

[సహీహ్‌ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్‌ యమాన్‌]

నుండి: జుమా ప్రకరణంఅల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)


1148. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) ఈ విధంగా ప్రవచించారు:

“సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు. ఆ రోజున ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే స్వర్గంలోకి గొనిపోబడ్డారు. తిరిగి అదే రోజున అక్కడి నుండి తొలగించ బడ్డారు.” (ముస్లిం )

(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం)
నుండి: జుమానాటి ఘనత , జుమా నమాజుహదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )


ఇతర లింకులు: 

ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత [ఆడియో క్లిప్]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (30 సెకండ్లు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


ఫజ్ర్‌ నమాజుకు ముందు రెండు రకాతులు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:

عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا

“ఫజ్ర్‌కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి”. (ముస్లిం 725).

నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి: ఫజ్ర్‌ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము,బిల్జింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.

నమాజు నిధులు (Treasures of Salah) అను పుస్తకం నుండి


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది; “ఆ రెండు రకాతులు నాకు ప్రపంచమంతటి కన్నా ప్రియమైనవి.”

عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ قَالَ فِي شَأْنِ الرَّكْعَتَيْنِ عِنْدَ طُلُوعِ الْفَجْرِ: «لَهُمَا أَحَبُّ إِلَيَّ مِنَ الدُّنْيَا جَمِيعًا» مسلم 725

 


సూర్య చంద్ర గ్రహణముల నమాజు

బిస్మిల్లాహ్

عَنْ أَبِي بَكْرَةَ  قَالَ: كُنَّا عِنْدَ رَسُولِ اللَّهِ ﷺ فَانْكَسَفَتِ الشَّمْسُ، فَقَامَ النَّبِيُّ ﷺ يَجُرُّ رِدَاءَهُ حَتَّى دَخَلَ المَسْجِدَ، فَدَخَلْنَا، فَصَلَّى بِنَا رَكْعَتَيْنِ حَتَّى انْجَلَتِ الشَّمْسُ، فَقَالَ ﷺ: إِنَّ الشَّمْسَ وَالقَمَرَ لاَ يَنْكَسِفَانِ لِمَوْتِ أَحَدٍ، فَإِذَا رَأَيْتُمُوهُمَا، فَصَلُّوا، وَادْعُوا حَتَّى يُكْشَفَ مَا بِكُمْ

అబూ బక్రా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఉండగా సూర్యగ్రహణం అయ్యింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ దుప్పటిని ఈడ్చుకుంటూ మస్జిద్ లోకి ప్రవేశించారు. మేము కూడా ప్రవేశించాము. అప్పుడు రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం విడిచాడు. ఆ తరువాత (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తూ ఇలా) చెప్పారు: “ఏ ఒకరి చావు కారణంగా సూర్య చంద్ర గ్రహణాలు సంభవించవు. మీరొక వేళ సూర్యచంద్ర గ్రహణాలు చూస్తే అది విడే వరకు నమాజ్ చదవండి. అల్లాహ్ ను వేడుకోండి”. (బుఖారి 1040).

عَنْ عَائِشَةَ ؅ أَنَّهَا قَالَتْ: خَسَفَتِ الشَّمْسُ فِي عَهْدِ رَسُولِ اللَّهِ ﷺ، فَصَلَّى رَسُولُ اللَّهِ ﷺ بِالنَّاسِ، فَقَامَ، فَأَطَالَ القِيَامَ، ثُمَّ رَكَعَ، فَأَطَالَ الرُّكُوعَ، ثُمَّ قَامَ فَأَطَالَ القِيَامَ وَهُوَ دُونَ القِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ فَأَطَالَ الرُّكُوعَ وَهُوَ دُونَ الرُّكُوعِ الأَوَّلِ، ثُمَّ سَجَدَ فَأَطَالَ السُّجُودَ، ثُمَّ فَعَلَ فِي الرَّكْعَةِ الثَّانِيَةِ مِثْلَ مَا فَعَلَ فِي الأُولَى، ثُمَّ انْصَرَفَ وَقَدْ انْجَلَتِ الشَّمْسُ، فَخَطَبَ النَّاسَ، فَحَمِدَ اللَّهَ وَأَثْنَى عَلَيْهِ، ثُمَّ قَالَ: إِنَّ الشَّمْسَ وَالقَمَرَ آيَتَانِ مِنْ آيَاتِ اللَّهِ، لاَ يَخْسِفَانِ لِمَوْتِ أَحَدٍ وَلاَ لِحَيَاتِهِ، فَإِذَا رَأَيْتُمْ ذَلِكَ، فَادْعُوا اللَّهَ، وَكَبِّرُوا وَصَلُّوا وَتَصَدَّقُوا ثُمَّ قَالَ: يَا أُمَّةَ مُحَمَّدٍ وَاللَّهِ مَا مِنْ أَحَدٍ أَغْيَرُ مِنَ اللَّهِ أَنْ يَزْنِيَ عَبْدُهُ أَوْ تَزْنِيَ أَمَتُهُ، يَا أُمَّةَ مُحَمَّدٍ وَاللَّهِ لَوْ تَعْلَمُونَ مَا أَعْلَمُ لَضَحِكْتُمْ قَلِيلًا وَلبَكَيْتُمْ كَثِيرًا

ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సూర్య గ్రహణం సంభవిస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు నమాజ్ చేయించారు. నమాజులో చాలా దీర్ఘంగా ఖియాం చేసారు (నిలబడ్డారు). రుకూ కూడా సుదీర్ఘంగా చేసారు. మళ్ళీ ఎక్కువ సేపు ఖియాం చేశారు. అయితే మొదటిసారి కన్నా ఈ సారి కొంచెం తక్కువ సేపు ఖియాం చేశారు. అలాగే తిరిగి రుకూ చేశారు. అయితే మొదటి రకూ కన్నా కొంచెం తక్కువ సేపు చేశారు. ఆ తరువాత సుదీర్ఘంగా సజ్దా చేశారు. ఆదే విధంగా ఆయన రెండవ రకాతులో కూడా చేశారు. (ఇలా నమాజ్ పూర్తి చేసి) ప్రజల వైపు తిరిగారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం పూర్తిగా వీడాడు. ఆ తరువాత ఖుత్బా ఇచ్చారు. అందులో ఆయన అల్లాహ్ స్తోత్రం తరువాత ఇలా అన్నారు: “సూర్యచంద్రులు, రెండూ అల్లాహ్ (ఔన్నత్యానికి) నిదర్శనాలు. ఎవరో చనిపోవడం వల్లనో, లేక పుట్టడం వల్లనో సూర్యచంద్ర గ్రహణాలు సంభవించవు. సూర్యగ్రహణం గాని, చంద్ర గ్రహణం గాని సంభవిస్తే మీరు అల్లాహ్ ను ప్రార్థించండి. అల్లాహ్ మహిమ, ఔన్నత్యాలను కీర్తించండి. నమాజు చదవండి. దానధర్మాలు చేయండి”. ముహమ్మద్ అనుచరుల్లారా! అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దాసుడు లేక దాసి ఎవరైనా వ్యభిచారానికి పాల్పడటం జరిగితే, వారి సిగ్గుమాలిన పని పట్ల అందరికన్నా ఎక్కువ పౌరుషం అల్లాహ్ కే వస్తుంది. ముహమ్మద్ అనుచరుల్లారా! అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎరిగిన విషయాలు మీరు గనక ఎరిగి ఉంటే మీరు తప్పకుండా తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా ఏడుస్తారు”. (బుఖారి 1044, ముస్లిం 901).

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو ؆، قَالَ: لَمَّا كَسَفَتِ الشَّمْسُ عَلَى عَهْدِ رَسُولِ اللَّهِ ﷺ نُودِيَ إِنَّ الصَّلاَةَ جَامِعَةٌ

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్యగ్రహణం పట్టితే “అస్సలాతు జామిఅ” అని ప్రజలను పిలవడం జరిగింది. (బుఖారి 1045, ముస్లిం 2942).

విశేషాలు:

  • 1- సూర్యచంద్ర గ్రహణాలు సంభవిస్తే “అస్సలాతు జామిఅ” అని పిలుపు ఇవ్వాలి.
  • 2- అందరూ కలసి, జమాఅతుతో దీర్ఘమైన నమాజ్ చేయాలి.
  • 3- ప్రతి రకాతులో రెండు ఖియాంలు మరియు రెండు రుకూలు చేయాలి.
  • 4- నమాజ్ తరువాత ఇమాం ప్రసంగించాలి, బోధచేయాలి.
  • 5- సత్కార్యాలు చేయమని ప్రజలను ప్రోత్సహించాలి.
  • 6- దుష్కార్యాల నుండి దూరముండడని హెచ్చరించాలి
  • 7- అల్లాహ్ యొక్క జిక్ర్, స్మరణలు అధికంగా చేయమనాలి.
  • 8- దానధర్మాలు అధికంగా చేయండని చెప్పాలి.
  • 9- నవ్వులాట, వినోదంలో కాకుండా పరలోక చింతలో సమయం గడపాలి.
  • 10- అధికంగా పాపాల మన్నింపుకై క్షమాభిక్ష కోరాలి (ఇస్తిగ్ఫార్ చేయాలి).

దిన చర్యల పాఠాలు అనే పుస్తకం లోని వ్యాసం ఇది.
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా.

ఇతరములు: